.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.


   డబుల్ మర్డర్ కేసుకు సంబంధించిన కోర్టు తీర్పు వెలువడింది.
  బాలుడు, ఓబుళరెడ్డితోటి మరో ఐదుమంది మీద నేరం నిరూపించబడింది. ముగ్గురికి లైఫ్ జెప్పారు. మిగతా నలుగురికి మూడేళ్ళు జైలు శిక్ష చెప్పారు.
  అందర్నీ రిమాండ్‌కు  తీసుకొన్నారు.
 చెన్నారెడ్డి వచ్చి పలకరించాడు.
  కేసును హైకోర్టుకు అప్పీలు చేద్దామన్నాడు.
  కోర్టు పనుల్ని చూసికొనేందుకు లా చదువుతోన్న రమణారెడ్డి వచ్చాడు విజయవాడనుంచి.
  దుఃఖంతో కుమిలిపోతూవున్న కుటుంబాన్ని ఓదార్చాడు.
  హైకోర్టుకు అప్పీలు చేయించాడు.
 హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
  రమణారెడ్డి మళ్ళీ కాలేజికి వెళ్ళాడు.
  ఈలోపు ముద్దాయిలందర్నీ రాజమండ్రి సెంట్రల్‌జైలుకు తరలించారు.
  శివపురి ఓబుళరెడ్డి కథ తాలుకా అంతటా చర్చనీయాంశమైంది.
  అతని శకం ముగిసినట్లేనని భావించారు చాలామంది.
 ఎమ్మెల్లేకు కుడి భుజం లాంటివాడనీ, అతడులేని లోటును చెన్నారెడ్డి ఎట్లా పూడ్చుకోగలడోననీ లెక్కలు వేయసాగారు కొందరు.
  నెలరోజులు గడిచాయి.
 ఈలోపు ఓబుళరెడ్డికి ఆత్మీయులైన కొందరు రాజమండ్రి వెళ్ళి పరామర్శించి వస్తున్నారు.
  విజయవాడలో వున్న రమణారెడ్డి వారానికొకసారి హైదరాబాద్ వెళ్ళి లాయర్ని  కలిసి కేసు విషయం తెలిసికొని, అట్నించి రాజమండ్రికి కూడా వెళ్ళి చిన్నాన్నకు విషయం చెప్పి వస్తున్నాడు. కోర్ట్ వ్యవహారాల్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాడు.
  తర్వాత కొన్ని రోజులకు -
  విజయవాడలో కాలేజికి వెల్తూవున్న రమణారెడ్డికి హఠాత్తుగా కన్పించాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
  " మామా ! బాగుండావా  ?  "  పలకరించాడు
 "  ఓ.. నువ్వంటోయి  !.. ఏంది యిక్కడుండావు..?  "  దగ్గరకు తీసికొని వీపుతడుతూ అడిగాడు చెన్నారెడ్డి.
  " నేనిక్కడ లాజేస్తాండ  మామా ! " 
   "  ఔను గదూ  ! మరిచేపోయా...ఆ ఏంది సంగతి  ? బాగానే సదూతాండావా  ?  మంచి లాయరువుగావాల .. మన కేసులన్నీ నువ్వే వాదించాల  "  నవ్వుతూ చెప్పాడు.
  " యీ మద్య చిన్నాయనోల్లను సూసొస్తివా మామా  ? "
  " ఎందుకు లేదోయ్  ! మొన్ననే గద కడపకు పోయింది.."
  " ఇప్పుడు  కడపలో లేరు..రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చి చాలా రోజులైంది.."
  గతుక్కుమన్నాడు చెన్నారెడ్డి..అంతలోనే తేరుకొని  " అదేనోయ్  !  మారకముందే సూసొచ్చినా.  మల్లా పోదామంటే  తీరికేదీ.. మొన్న గూడా పోరుమామిల్ల సుబ్బరాయునితో అంటిని - రాజమండ్రి పోదామని...  ఆయప్పా సరేననె.. యాడబోతి ! నన్ను ఎమ్మెల్లేను జేసి జనాలమద్య యిడిసిపాయె మీ చిన్నాయన.  నాకదే జైలయింది. నన్ను నిద్రబోనిస్తా వుండారా ? ఉచ్చకు గూడా ఒక్కన్నీ పోనీయరనుకో. చెవుకాడ గీ పెడతానే వుంటారు... ఇంక యాడిపోతినోయ్  రాజమండ్రికి ? "
     " పోయిరాపో  మామా  ! నువ్వు పోతానంటే నేను తోడొస్తా. చిన్నాయన కూడా నిన్ను చూడాలంటా వుండాడు. నువ్వు కూడా చూసినట్టుంటుంది.. మాట్లడినట్టుంటాది  "  చెప్పాడు రమణారెడ్డి.
  " పోతే బాగానే వుంటదోయ్  ! పోవాల..  వాల్లను సూడకుండా నేనెవుర్ని సూడాల  ?  నా ఖర్మగాలి ఈరోజే జీపు తెచ్చుకోలేదు దొరా !  యింకోకనాడు వస్తా ! ఇద్దరం కలిసే పోదాంలే.. "  చెప్పాడు
  " సరే మామా !  "  అంటూ వెళ్ళిపోయాడు రమణారెడ్డి.
   సాయింత్రంగా ఫ్రెండ్స్‌తో కలిసి ప్రకాశం బ్యారేజి వద్దకెళ్ళి తిరిగి వస్తుంటే ఓ జీపులో ఎమ్మెల్లే చెన్నారెడ్డి కూచుని వున్నట్లుగా అన్పించి ఆశ్చర్యపోతూ అటుకేసి పరిశీలనగా చూశాడు.
  చెన్నారెడ్డే... సందేహం లేదు.
 నంబర్ ప్లేట్ చూశాడు
  జీపు కూడా అతనిదే
  తనతో అబద్దం చెప్పినట్టుంది  ’ జీపు తెచ్చుకోలేదని ’.
 అంటే ..అంటే .. రాజమండ్రి వెళ్ళి చిన్నాన్నను చూసేందుకు యిష్టం లేకనే అబద్దలాడాడేమో !  చిన్నాన్న ఏ జైలులో వుండేది కూడా అతనికి గుర్తులేదంటే తమను ఆయన ఎంతగా మర్చిపోయిందీ అర్థమవుతోంది.
  ఆ భావన భరించలేకపోయాడు రమణారెడ్డి.
  మళ్ళీ రోజే ప్రయాణమై హైదరాబాదు వెళ్ళి కోర్ట్ విషయాలు సేకరించుకొని రాజమండ్రి చేరాడు.
  చిన్నాయనకు విషయమంతా వివరించాడు.
   ఆయన మండి పడ్డాడు.
  చెన్నారెడ్డి ప్రవర్తన పట్ల ఆగ్రహోదగ్రుడయ్యాడు.
  శిక్షపడ్డ నేరస్తుల్ని చూసేందుకు సిగ్గు పడుతున్నాడేమో..!!
  శిక్ష అనుభవించే వాళ్ళ గుండా తనకు లాభంలేదని వదిలేశాడేమో ! ఇంతలోనే చేసిన మేలు మరిచాడంటే - వాడెంతటి నీచుడు !
  బహుశా వాని చర్యల్ని తను విమర్శించడం వల్లనే తమకు దూరంగా జరుగుతున్నాడేమో !
  తాను ఖండించింది  మానవత్వం లేని పనుల్నేగదా !
  తనగుండా ఏలాభం పొందని వాళ్ళు సైతం తన్ను చూడ్డానికొచ్చారు.
  తను ఓట్లు గుద్దిపోస్తే ఎమ్మెల్లే అయిన వ్యక్తి తన్ను తృణీకరించి కనీసం చూసేందుక్కూడ  రాలేదంటే..?
  కష్టాల్లో వున్నప్పుడు పలకరించి హృదయాన్ని తగిలేలా ఆత్మీయ వ్యాకాన్ని పలికేవాడేగదా  మిత్రుడంటే -
  శత్రువుకంటే హీనం.
  తనకిప్పుడు అనుమానమొస్తోంది - పోలీసు సాక్ష్యాన్ని లోబరుచుకొనేందుకు సరైనా ప్రయత్నం చేయలేదేమోననని.
   నమ్మి అతనికి భాద్యత అప్పగించాడు తను.
  కడుపులో పెట్టుకొని చేసినట్టుంది.  అతన్ని బహిరంగంగా వ్యతిరేకించినందుకు లోలోపల ప్రతిచర్య చూపినట్టుంది.
  చెన్నారెడ్డి ప్రవర్తనను భరించలేకపోతున్నాడు ఓబుళరెడ్డి.

                                    ******

    కోర్టు తీర్పు అనుకొన్నంత తొందరగా వెలువడలేదు
  ఎమ్మెల్లే రాజమండ్రికి వెళ్ళి చూసిరాలేదు.
   రోజు రోజుకు అతని మీద వ్యతిరేకత పెరుగుతోంది ఓబుళరెడ్డికి.
  తమను చూడ్డానికొచ్చిన శేయోభిలాషుల ముందు అక్కసంతా వెల్లగక్కుతున్నాడు. చెన్నారెడ్డి కృతఘ్నత గురించి చెబుతున్నాడు.
  అది పామని తెలీక దాని దలమీద కిరీటం పెట్టించి తాలుకా ప్రజలందర్నీ దాని పడగ కిందికి తెచ్చాననీ,  ఆ పాపమే తననీవిదంగా కాల్చుకు తింటోందనీ వాపోయాడు.
  విచారణ అనంతరం ఎట్టకేలకు కోర్టు తీర్పు వచ్చింది.
  బాలునికి ఒక్కనికే లైఫ్ జెప్పారు.
  మిగతా వాళ్ళంతా  ఇళ్ళకొచ్చారు.
  బాలునికి కూడా శిక్ష పడకూడదనీ సుప్రీం కోర్టుకు అప్పీలు చేయాలని అనుకొన్నారు  గాని  సన్నిహితులైన లాయర్లు వద్దని చెప్పటంతో విరమించారు.
  బాలుని గురించి కుటుంబమంతా తల్లడిల్లుతూ వుంది.
  అందరి  బదలూ అతనొక్కడే శిక్ష అనుభవించటం బాధాకరంగా వుంది.
  మరోవైపు చెన్నారెడ్డి ప్రవర్తన రంపం పెట్టి కోస్తూ వుంది.
   తాము ఇంటికొచ్చిన తర్వాత కూడా కలవలేదు అతను. మర్యాదకైనా వచ్చి పలకరించిపోలేదు.
  చెన్నారెడ్డి నిర్లక్షాన్ని ఎట్లా జీర్ణించుకోవాలో అర్థం కావటం లేదు ఓబుళరెడ్డికి. ఒక్కోసారి అన్పిస్తూ వుంటుంది - అతను పూర్తి స్థాయి ఎమ్మెల్లే అయ్యాడని.  తాని ఎమ్మెల్లే తప్ప మామూలు మనిషిని కాదనుకొంటున్నాడేమో  !  చెన్నారెడ్డిగానే వుండుంటే తాము గుర్తుండేవాళ్ళం. తమ స్నేహం గుర్తుండేది.  పాతరోజులు గుర్తొచ్చేవి.... మానసికంగా కూడా అతను పూర్తిగా ఎమ్మెల్లేగా మారిపోయాడు.  తాలుకాలోని అందరి ఓటర్లలో తమనూ ఒకరిని చేశాడు.
  చెన్నారెడ్డి  దూరమవుతున్నాడనే భావన మొలకెత్తి పెరిగి పెద్దదవుతున్నకొద్దీ  అతనిమీద ద్వేషం కూడా సమానస్థాయిలో పెరుగసాగింది. కనిపించిన ప్రతివాడివద్దనల్లా  తన కోపాన్ని వెళ్ళగక్క సాగాడు.  " నేను చేస్తేనే ఎమ్మెల్లే అయినాడు.. వానికింతా పొగురా  ? "  అంటూ వ్యాక్యానించసాగాడు.
  ఓబుళరెడ్డి మాటలు తూ.చ తప్పకుండా చెన్నారెడ్డికి చేరుతున్నాయి. పరిస్థితి ముదరకముందే  సర్ధుబాటు చేసికోవటం విఙ్ఞుల లక్షణమనుకొన్నాడు అతను  ’ ఓబుళరెడ్డిని బద్వేలు రమ్మని మనిషిని పెట్టి మరీ చెప్పి పంపాడు.
  " నేను వానికాడికి రావాలంటనా ? "  మండిపడ్డాడు కబురుతెచ్చిన మనిషివద్దే ఓబుళరెడ్డి.  " ఎమ్మెల్లే కాగానే అంతలావు బలుస్తే మంచిదిగాదు.  ఆ ఎమ్మెల్లే ఎట్లయిండో రోంత (కొద్దిగ) గుర్తుకు తెచ్చుకోమను. మేము జేస్తే ఎమ్మెల్లే అయినాడు - మామీందనే అధికారం చూపిస్తాడా ? "  అంటూ విదిలించి పారేశాడు.
  చెన్నారెడ్డి రోషానికి పోలేదు.
  తనే వస్తున్నాననీ, ఇంటివద్దే వుండమనీ చెప్పి పంపాడు.
  చెన్నారెడ్డి వెళ్ళేసరికి ఓబుళరెడ్డి వూరు వదిలాడు,  అతనికి అందకుండా పోరుమామిళ్ళలో మిత్రుని యింట కూచున్నాడు.
  " ఏంది మామా యిదెంతా  ? నేనేం జేసినానీ  నా మీంద కచ్చెగట్టినారు ? మీకంత ఇష్టం లేకుంటే చెప్పండి యిప్పుడే రాజీనామా గీకేస్తా !  యీ ఎమ్మెల్లే పదవి సరే - ఏంటికె సరే .."  అంటూ పెద్దిరెడ్డి ముందు వాపోయాడు.
  చెన్నారెడ్డి తప్పుల్ని నిర్మోహమాటంగా  ఎత్తిచూపాడు పెద్దిరెడ్డి. చివరగా చెప్పాడు ’ యిద్దరూ ఎదురెదురు కుచుని మనసి విప్పి మాటాడుకొని మనస్పర్థలు తుడిచేసుకోమని.
  " నేనందుకే గద మామా వొచ్చింది .."  తలపట్టుకొన్నాడు.
  " మావోడు రోంత పెంకె. మాటొస్తే పడడు. ఒక్క సిటికె నువ్వే ఓర్పు బట్టాల దొరా ! మీరిద్దరూ కొట్లాడుకోంటే చూసేవాల్లు నవ్వుతారు  "  చెప్పాడు.
  " దానికే గద మామా నేనుబయటపడేది.  అతగాన్ని రమ్మను. తప్పుంటే చొక్కాపట్టుకొని మాట్లాడమను. అంతేగాని దూరదూరంగా వుండొద్దని చెప్పు  "  అంటూ జీపెక్కాడు.
  తర్వాత పదిరోజులకు మరోసారి ప్రయత్నించాడు చెన్నారెడ్డి.
 తనతో కలిసే అవకాశం అతనికి ఏమాత్రమూ యివ్వటంలేదు ఓబుళరెడ్డి.  తన పనిమీద తాను తిరుగుతున్నాడు. బ్రాంది షాపు లైసెన్స్ కోసం అప్లై చేసుకొని వున్నాడు. దాని విషయంగా అధికారుల చుట్టూ తెగ తిరుగుతున్నాడు.
  తనెన్ని ప్రయత్నాల్లో వున్నా చెన్నారెడ్డిని తిట్టటం మాత్రం చాలించలేదు ఓబుళరెడ్డి.  తన ముందు ఎమ్మెల్లే గురించి ఎవరైనా మాట్లాడితే మండిపడతాడు.  " వాని సంగతి నాకాడ ఎత్తగాకండి.. నేను జేస్తే ఎమ్మెల్లే అయినాడు. నాకాడనా వానిగొప్పజెప్పేది ? "  అంటూ విదిలించి పారేస్తున్నాడు.
  ఎమ్మెల్లే మెప్పుకోసం ఆ మాటలన్నీ పొల్లుబోకుండా తీసికెళ్ళి ఆయన చెవినేస్తున్నారు కొందరు.
  ఓబుళరెడ్డి ప్రవర్తన ఎమ్మెల్లేకు కొంత యిబ్బందికరంగా అన్పించింది.  అవమానకరంగా కూడా తోచింది.
  డిగ్రీ అయిపోయి ఇంటివద్దే వున్నాడు ఓబుళరెడ్డి కొడుకు నర్సిరెడ్డి. బ్రాందిషాపు లైసెన్స్ గురించి తను ఇన్‌చార్జి తీసుకొని తిరగటం మొదలెట్టాడు.
  రెండ్రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగే సరికీ అర్థమైంది  దానికి మినిస్టర్ రెకమండేషన్ వుంటేగాని పన్జరగదని.
  ఆఫీసుర్‌తో మాట్లాడుతూ వుంటే ఎమ్మెల్లే చెన్నారెడ్డి వచ్చాడు.
 తన్నితను గుర్తుబట్టి నట్టు లేదు.
  అదే మంచిదని లేచి బైటకొచ్చాడు.
  పదినిమిషాల తర్వాత వాచ్‌మన్ వచ్చి తన పేరుబెట్టి పిల్చేసరికి ఆశ్చర్యపోయాడు నర్శిరెడ్డి.
  " నిన్నే సార్  ! పెద్ద సారు పిలుస్తావుండాడు  "  చెప్పాడు.
  లోపలికి నడిచాడు.
  " ఏం  వోయ్ ! నేనంటే కనుక్కోలేదు నువ్వయినా పలుకరించేది లేదా ?.. రా.. కూచో.."  అన్నాడు చెన్నారెడ్డి.  " షాపు లైసెన్స్ కావాలంటే ఒక్క మాట నాకు చెప్పిపంపుతే నేను తెచ్చివ్వనా ! నేనుండేది ఎందుకోయ్ - మీ పనులగ్గూడా మీరు రావాల్నా ? "  అన్నాడు
 " రేపొద్దున్నే నాతోరా  ! "  చెప్పాడు
  మళ్ళీరోజు  నర్శిరెడ్డిని వెంటబెట్టుకొని హైదరాబాదు వెళ్ళాడు.
 నేరుగా ఎక్సైజ్ మినిస్టర్ చాంబర్‌లోకి తీసికెళ్ళాడు.
  " ఇతను నా అల్లుడు. నాకు ఆత్మీయుడు... నా నియోజకవర్గంలో ఒక మండలమంతా వీళ్ళ చేతికింద వుంది. నేను ఎమ్మెల్లే కావడానికి ప్రధాన కారుకులు వీళ్ళే. నెత్తురు పుసుకొని ఎలక్షన్ చేశారు.  పదివేల ఓట్లు గుద్దిపోసి నన్ను గెలిపించారు.  వీళ్ళకు పన్జేస్తే మీరు నాకు పన్జేసినట్లే .."  అంటూ మినిస్టర్ వద్ద గొప్పగా చెప్పాడు. లైసెన్స్ వచ్చేందుకు లైన్ క్లియర్ చేశాడు.
  బైటకొచ్చిన తర్వాత నర్శిరెడ్డిని పక్కనే కూచోబెట్టుకొని  " చూడోయ్  మినిస్టర్ కాడ కూడా చెప్పినా నేను ఎమ్మెల్లే అయ్యేందుకు కారణం మీరేనని. నేను మీరు చేసిన ఎమ్మెల్లేనని....మీరు చేస్తేనేనోయ్ నేను ఎమ్మెల్లే అయ్యిందీ !  ఆ విషయం  అందరిలో నేను చెప్పుకుంటే మీకు గౌరవం వుంటదిగాని, మీరు చెప్పుకొంటే కాదు దొరా ! రొవ్వంత మీ నాయనకు చెప్పు.. ఎగతాలిగా మాట్లాడొద్దని చెప్పు. నాకు అవమానమైతే మీకు అవమానం గాదా ! "  అంటూ బతిమాలాడు.
  ఆయన మాటల్లో నిజముందనిపించింది నర్శిరెడ్డికి కూడ.
  ఇంటికెళ్ళి పెదనాన్న వద్ద తన మనసు విప్పాడుగాని తండ్రి వద్ద నోరెత్తలేకపోయాడు.  ఎమ్మెల్లే తన్ను ఆదరించిన విషయం, పనిచేయించిన సంగతీ మాత్రం అందరిముందూ ప్రకటించాడు. విననట్టుగా ఎటో చూస్తూ వెళ్ళిపోయాడు ఓబుళరెడ్డి.
  తన ధోరణి మాత్రం మార్చుకోలేదు.
  మరోసారి  నర్శిరెడ్డి వద్ద తన బాధను వెళ్ళబోసుకొన్నాడు ఎమ్మెల్లే.
  అతని మాటలు నమ్మే స్థితిలో లేడు ఒబుళరెడ్డి.  బ్రతిమాలాటాలు, బాధను వ్యక్తపరచటాలూ, ఇవన్నీ పచ్చి నటనలని అతని అభిప్రాయం.  తనవాళ్ళవద్దా, లోకుల వద్దా ’ అయ్యో పాపం ! ’ అనిపించుకోవాటానికి చేస్తున్న చేష్టలు అవి.  ఎమ్మెల్లే అంతటి వాడు బంగపడుతోన్నా ( బతిమాలుతున్నా ) లెఖ్కజేయని తలబిరుసు మనిషి శివపురి ఓబుళరెడ్డి ’ అని నలుగురూ భావించాలని అతని ఆలోచన అని.
  అతను పూర్వపు చెన్నారెడ్డే అయ్యుంటే తనకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చేవాడు కాదు. కూలి తీసికొని మనుషుల్ని చంపించే వాడు కాదు.  సారా వేలం పాటల్ని దౌర్జన్యంగా చేజిక్కించుకొనేవాడు కాదు.  ఇప్పటికే చాలా పల్లెల్లో మద్యం షాపులన్నీ అతని అనుచరులవే. అన్నిట్లో అతనికి భాగముందని వినికిడి. డబ్బు సంపాదన కోసం ఎన్నెన్నో అడ్డదారులు తొక్కుతున్నాడు.
  చెన్నారెడ్డిని తల్చుకొంటే చాలు తను జైల్లో వున్న రోజులే గుర్తొస్తాయి. తన్ను చూసేందుక్కూడ యిష్టపడని అతని చర్య గుర్తుకొస్తుంది. అతనిమీద అంతులేని ఏహ్యభావం కలుగుతుంది. ఎదురుగా ఎవరైనా వుంటే వాళ్ళ ముందే అతన్ని తిడతాడు. ఎవరూ లేకుంటే గోడకేసి తిరిగి అయినా తిట్టుకొంటాడు.
  ఓబుళరెడ్డి తిట్టటం మానుకోకపోయేసరికి క్రమేణా అతనిమీద నమ్మకం నశించింది ఎమ్మెల్లేకు కూడా. రాయబారాలు పంపటం చాలించాడు. రమణారెడ్డి, నర్శిరెడ్డెలు కన్పించినా  ఇదివరకటిలా ఆప్యాయంగా పలుకరించటం మానాడు.
  ఓబుళరెడ్డి, చెన్నారెడ్డి లిద్దరూ ఎక్కడైనా పరస్పరం ఎదురుపడినా పలుకరించుకోవటం లేదు. ఒకరి మొగాలొకరు చూసికోవటం లేదు.
  ఇద్దరి మద్యా అగాథం ఏర్పడింది.
  ఆ విషయంలో తాలుకా అంతటా తెలిసిపోయింది.
  జాతీయపార్టి వాళ్ళకు కొంత ఆశ చిగురించింది.
  చెన్నారెడ్డి వ్యతిరేక వర్గీయులంతా రహస్యంగా సమావేశమయ్యారు. ఓబుళరెడ్డిని  జాతీయపార్టిలోకి లాక్కొంటే ఎలా వుంటుందా..? అని చర్చలు జరిపారు.
  చెన్నారెడ్డిని వ్యతిరేకంచి, ఎదురించే బలమైనా మొరటైన వర్గం ఒకటి వచ్చి కలవటం వలన జాతీయ పార్టి బలపడుతుందని భావించారు.
  శివపురి వాళ్ళను జాతీయపార్టిలోకి లాగాలని తీర్మానించారు.
  కొందరు అనుభవఙ్ఞులు ఆ భారాన్ని తమ భుజానేసుకొన్నారు.

                                                                                                        ........ సశేషం

0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followersమాలిక: Telugu Blogs