చాలా రోజుల క్రితం, యధాలాపంగా బ్లాగులు చూస్తుంటే  ఒక బ్లాగ్‌లో చాలా ఎత్తైన ప్రదేశంలో వున్న కోట కనపడింది.  దాని చుట్టు వున్న పచ్చని పచ్చదనం చూసి మురిసిపోయి... ఈ ప్రదేశం ఎక్కడ వున్నదా అంటూ ఆరా తీస్తే... మహారాష్ట్రలోని పూణేకు దగ్గరలో వున్న రాజ్‌గడ్ కోట అని సమాచారం దొరికింది. అక్కడికి ఎలా వెళ్లాలి అనే సమాచారం అంతా అందులొ వున్నది కాని..ఒక్కడినే ఎలా అని ఆలోచిస్తూ వుండగా.. గ్రేట్ హైదరాబాద్ అడ్వేంచర్ క్లబ్ అని ఎటువంటి లాభాపేక్ష లేని ఒక సంస్థ కనపడింది.. http://meetup.ghac.in . ఇందులో రాజ్‌గడ్ వెళ్లే ట్రిప్ కనపడింది కాని..అప్పటీకే ఖాళీలు అన్నీ  భర్తీ అయిపోయాయి ..! 


     ఎలా ..? ఎలాగైనా వెళ్లాలి , ఎలాగైనా ఆ కోటని చూడాలి..!  ఆలోచిస్తూ వుండగా ఆ రోజుల్లోనే  అనుకోకుండా పూణేలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న తెలుగు వాడైన షేక్ ఫజ్లర్ రెహమాన్ నైక్ అనే అతను ఫేస్‌బుక్ ద్వారా  ఆ మద్యన పరిచయం అయ్యారు.  పరిచయం అయితే అయ్యారు కాని అతనికి కూడ ఇటువంటి ట్రెక్స్ మీద ఆసక్తి వుండాలి కదా..? అనే ఆలోచనలు!  ఒకరోజు అనుకోకుండా తని ప్రొఫైల్ చూస్తుంటే  అందులో చాలా వరకు టూర్ మరియు ట్రెక్ ఫోటొస్ కనపడ్డాయ్..ఇది చాలు నాకు అనుకొని..ఫోన్ నంబర్ తీసుకొని.. రాజ్‌గడ్ కోట గురించి కావలసిన వివరాలు తెలుసుకొన్నాను, అతను తన మాటల్లో "మీరు రండి..మనం ఎంచక్కా ట్రెక్ చేద్దాం" అంటూ ఒక తేది కూడ చెప్పాడు.  ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగాయి. అతనికి కూడ ఆసక్తే అని తెలిసాక మంచి కంపెనీ దొరికిందని తేలిక పడ్డాను. ..ఓ ముహర్తాన పూణేకు వెళ్లడానికి నిర్ణయించుకొన్నాను.

   అనుకొన్న తేది నాటీకి నాకు అనుకోకుండ  ఆహారంలో తేడా జరగడం వల్ల చిన్న పాటి అనారోగ్యం వచ్చింది. చిన్నదే అయినా అనారోగ్యం దేనికైనా అడ్డంకే కదా! . అయినా దాన్ని లెక్క చేయక మొండిగా బేగంపేట్ రైల్వే స్టేషన్ నుండి హుస్సేన్ సాగర్ ఎక్స్ ప్రెస్ లో  బయలు దేరాను. ( కాని ఈ అనారోగ్యం  ప్రభావం తర్వాత కనపడింది అనుకోండి....).  ఈ రైలు రాత్రి ఏ ఒంటిగంటకో పూణేకు చేరుతుంది, ఆ సమయానికల్లా రెహమాన్ స్టేషన్‌కు వచ్చి నన్ను రిసీవ్ చేసుకొంటానని చెప్పాడు.

ఆ రైలు ప్రయాణంలో  నాకో కొత్త అనుభవం ఎదురైంది, అది ఈ ట్రెక్‌కు సంబందం లేకపోయినా కాస్త వివరిస్తాను. ఒక స్టేషన్‌లో కొంతమంది వలస కూలీలు నేనుంటున్న కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కారు, అదొక పెద్ద కుటుంబంలా వున్నది దాదాపుగా ఓ పది పదిహేను మంది రెండేళ్ల నుండి పదేళ్ల  వరకు వయసున్న పిల్లలు వున్నారు అందులో.!!   వారి సామాగ్రి చాలా పెద్దగా వున్నది, గబ గబా అన్నిటిని వాళ్లుంటున్న క్యాబిన్‌లో సర్దేసారు ఒక్కటి కూడ బయటకు కనపడకుండా..! ఆ కుటుంబంలో ఒక నడివయసు స్తీ వున్నది ఆమె చంకలో ఒకటిన్నర రెండేళ్లు వుంటాయోమో.. ఒక చంటోడు వున్నాడు..మిగతా అందరు కంపార్ట్‌మెంట్ అంతా ఎవరిష్టమొచ్చిన చోట్ల తిరుగుతూ వున్నారు. రాత్రి భోజన సమయానికి ఆ నడి వయసావిడ ఒక కేక వేయగానే ఎక్కడెక్కడ వున్న పిల్లాజెల్లా అంత ఒకచోటికి చేరి గుంపుగా కూర్చున్నారు ఆమె చంకలో వున్న చంటి పిల్లాడుతో సహా, వాళ్లు కూర్చున్న సీట్ కింద నుండి  గుడ్డతో చుట్టిన పెద్ద మూట ఒకటి బయటకు తీసి.. ..అందులో వాళ్లు  కోసం తెచ్చుకొన్న భోజనం ఒక్కోక్కటిగా బయటకు తీస్తున్నదావిడ. పెద్ద గంగాళమంత గిన్నెలో అన్నం వున్నది. తలా ఒకటి సత్తు గిన్నే ఇచ్చింది ఆవిడ అందరికీ..!  అందులో అన్నం రెండు  కూరలు, పచ్చడి ఇలా అన్ని వడ్డించింది. అందరు ఆవురావురమంటూ తినేస్తున్నారు..ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా..! చంకలో వున్న చంటి పిల్లాడు కూడ తన చిన్న సత్తు పళ్లెంలొ అన్నం, కూరను తన బుల్లి చేతులతో స్వయంగా కలుపుకొని వాడికి వాడే గబ గబా తినేస్తున్నాడు, ఆ చంటోడికి వాళ్లమ్మ కూడా  ఏమి తినిపించట్లేదు.. ! వాడేమి మారాము చేయట్లేదు, ఆవిడ కూడ "అది వేసుకో ..ఇది వేసుకో..ఏంటి ఇంతేనా..బాగా తినూ" అంటు ఎవరినీ బతిమాలట్లేదు. ఎవరికి వారు తమ కావలసింది అడిగి పెట్టించుకొని  తింటున్నారు.

     ఒక్క సారిగా మన కాలనీలలో వుంటున్న పిల్లల  తల్లలు గుర్తుకొచ్చారు నాకు. పాపం పిల్లలకు తిండి తినిపించడం అన్నది పెద్ద ప్రసహనంలా వుంటుంది.ఆడిస్తూ..మురిపిస్తూ..పరిగెత్తుతూ..బతిమాలుతూ ..బుజ్జగిస్తూ..మాట వినకపోతే రెండు అంటిస్తూ.. మళ్లీ బుజ్జగిస్తూ .. మధ్యలో పిల్లల అలకలు..అబ్బో ఒకటి కాదు..అదొక పెద్ద పని..  తల్లులకు..! ఆ‌ఫ్‌కోర్స్...ఇందులో కూడ ఒక ఆనందం వున్నది అనుకోండి...చందమామను చూపుతోనో..లేక రకరకాల కథలు చెబుతోనో..ఇంకా దారిన వెళ్లే చిన్న చిన్న పెంపుడు జంతువులను, ఎగురుతున్న పక్షులను చూపుతూ పిల్లలకు అన్నం తినిపించడం కూడ ఒక మంచి పరిణామమే అనుకొంటాను. దాని వలన మనోవికాసం అన్నది అదనపు లాభం

   ఇక్కడ ఈ కంపార్ట్‌మెంట్‌లో చూస్తే ఎవరికి ఎవరూ  తినిపించట్లేదు..ఎవరినీ బతిమాలట్లేదు..! అందరు సుష్టుగా కడుపు నిండా మరీ పెట్టించుకొని ఎంతో ఇష్టంగా తింటున్నారు..  భోజనం పూర్తి అవ్వగానే ఎవరి  సత్తు గిన్నెలు వారు కడిగేసి..అన్నిటిని మళ్లీ తిరిగి ఆ మూటేలో కప్పేసి..వెంటనే తాము కూర్చున్న సీట్ కిందకు తోసేసారు..ఈ కార్యక్రమం అంతా మహా అంటే ఒక అరగంటలొ అయిపోయింటుంది. భోజనం అయిపోగానే అందరు మళ్లీ ఎవరి ఆటలాడుకొనే ప్రదేశాలకు వాళ్లు వెళ్లిపోయారు. చంటోడు కూడ తిరిగి వాళ్లమ్మ చంకలోకి ఎక్కాడు..యధాతదంగా..!
 

     ఒకటి అర్థమయ్యింది నాకు, ఈ పిల్లలందరూ ఎప్పుడూ నిరంతరం ఆడుకొంటూ వుంటారు, అంటే శరీరానికి ఒక శారీరక శ్రమ వుంటుంది. అదొక వ్యాయామం! .. అందుకే బాగా ఆకలితో వుంటారు , భోజనం సమయం కాగానే అందరూ ఆవురావురమంటూ భోజనం చేసారే కాని ఒక్కరు కూడ మేమ్ తినం అంటు మారాం చేయలేదు. అలాగే ఆ వలస కూలీ కుటుంబం కూడ ఎటువంటి టెన్షన్, ఒత్తిడి లేకుండా వున్నారు. మిగతా మద్య తరగతి జీవులతో పోలిస్తే..ఆర్థికంగా తక్కువ స్థాయిలో వుంటే వుండొచ్చు కాని..మానసిక స్థాయిలో, సంతృప్తిగా..సుఖవంతమైన జీవితం ఈ వలస కూలీలది. ఎప్పటికప్పుడూ పని చేయడం సంపాదించుకోవడం మనసారా కడుపుతీరా భోజనం చేయడం..మళ్లీ పని చేయడం..ఎంత సింపుల్ వీరి జీవితాలనిపించింది.

   ఇక మన కాలనీలలో వుండే పిల్లలకు శారీరక శ్రమ ఎక్కడిదీ..? అంతా ఇప్పుడు వర్చ్యువల్ వరల్డ్ ఆటలే కదా..? అందుకే బుజ్జగింపులు..బతిమాలడాలు..అన్నం గిన్నె పట్టుకొని వెంట పడుతు..పరిగెత్తుతూ తినిపించాలి.  ఎంత వైరుధ్యం... జీవితాలను పోల్చి చూసుకొంటే అనిపించింది.

  రాత్రీ ఒంటిగంటకు పూణే చేరుకోగానే  స్టేషన్‌లో రెహమాన్ రిసీవ్ చేసుకొన్నాడు. . పూణే శివార్లలో  కార్పోరేషన్‌కు దూరంగా ఇల్లు తీసుకొని వుంటున్నారు రెహమాన్ తన స్నేహితులతో కలసి. మరసటి రోజు కాస్త విశ్రాంతి  తీసుకొన్నాను!!  సాయంత్రం  అలా బజారుకు వెళ్లి ట్రెక్‌లో కావలసిన డ్రై ఫ్రూట్స్, మరిన్న బలమైన ఆహార పదార్థాలు తీసుకొన్నాం. మరుసటి  రోజు తెల్లారుజామునే రెండు మోటర్ బైక్స్ మీద  రెహమాన్, అతని రూం మేట్, నేను ముగ్గరం కలసి పూణే, బెంగళూరు హైవే దారిపట్టాం. ఓ 20 కిలోమీటర్లు ప్రయాణించాక హైవే నుండి కుడివైపుకు తిరిగి మరో 20 కిలోమీటర్లు ఖేడ్‌శివపూర్ మీదుగా  గుంజావనే అనే చిన్న గ్రామానికి చేరుకొన్నాం, అక్కడే మా బైక్స్ పార్క్ చేసాం. అక్కడ నుండి ట్రెక్ మొదలవుతుంది. ఆ రోజు శనివారం కావడంతో చాలా మంది ట్రెక్కర్స్ వచ్చారు, అందులో కుటుంబాలు కూడ వున్నాయి, ఆడ,మగ అంటు తేడా లేదు..పది పదిహేనేళ్ల వయసున్న పిల్లలు కూడ వున్నారు.

     ఇక ఈ రాజ్‌గడ్ చరిత్ర గురించి చెప్పడానికి అక్కడ ఎవరు గైడ్స్ లేరు, కాస్త అంతర్జాలంలో వెదికితే కొన్ని విషయాలు దొరికాయి. ఈ కొండలున్న ప్రాంతాన్ని దాదాపు 2 వేల సంవత్సరాల క్రితం కనుగొన్నారు., అక్కడ  విశ్వామిత్ర మహర్షి  నివసించినట్లు  చెబుతున్నారు.  తర్వాతెప్పుడో  అనగా 1490 లో నిజాం షాహి కాలంలో అహమద్ బహిరి ఈ రాజ్‌గడ్‌ని నిర్మించి "మురంబదేవ్" అని పిలిచేవారట! ఈ కోట  దాదాపుగా వీరి పరిపాలనలో 120 ఏళ్ళ పాటు వున్నది.

తర్వాత ఎప్పుడో  చత్రపతి శివాజి తండ్రి అయిన షహాజి రాజే బొన్సాలే పరిపాలనలో మొగల్ రాజుల వలన కొన్నియుద్దాలు జరిగాయి, కోటను వదులుకోవడం, మళ్ళీ స్వాదీనం చేసుకోవడం జరిగాయి కూడా!. చత్రపతి శివాజి పరిపాలన కిందకు వచ్చాక ఆయన పరిపాలనలో మూడు వైపుల వున్న కొండల మీదుగా "కర్టన్ వాల్" లాగ కోటను నిర్మించి విస్తృత  పరిచి ఈ కోటకు "రాజ్‌గడ్" అని పేరు పెట్టారట. 1672లో శివాజి రాజే తన పరిపాలన కేంద్రాన్ని రాయిగడ్ కు  మార్చుకొన్నారు. శివాజి తదనంతరం ఆయన కుమారుడైన శంబజి రాజే పరిపాలన లో  మరాఠా రాజుల పతనం ప్రారంభమైందని చెప్పొచ్చు.  తర్వాత మళ్లీ మొఘల్  రాజులు దాడులు చేసి యుద్దాలు జరిగిన సమయంలో శంబజి రాజే  మరణించారు. దానితో  మొగల్స్ అధీనంలోకి  మొత్తం మరాఠా రాష్ట్రమంతా పూర్తిగా  చేరిపోయింది.

    మా ట్రెక్ ప్రారంభమయిన గంటకు నా అనారోగ్యం ప్రభావం కనిపించింది.! ఒక యాభై  అడుగులు వేయగానే ఆయాసంతో కాసేపు నిలబడాల్సి వొస్తున్నది.  అప్పుడు ఒక్క క్షణం అనిపించింది ..మొండిగా ట్రెక్కింగ్‌కు వచ్చినందుకు బాగానే తగిన శాస్తి జరిగిందన్న విషయం.!

     అక్కడ వాతావరణం గంటకో సారి మారుతూ వున్నది, కాసేపు మంచుతో కూడిన మేఘాలు కమ్ముకొంటున్నాయి . మళ్ళీ కాసేపటికి మాయం అవుతూ ..దోబూచులాడుతున్నాయి..! వర్షాకాలం ముగిసే  సమయంలో అక్కడ ట్రెక్ చేయడం బాగుంటుంది..బాగా ఆకుపచ్చదనంతో..భూమంతా పరుచుకొని వున్నట్లుంటుంది, కాని మా ట్రెక్ అప్పటికే..వర్షాకాలం దాటి చాన్నాళ్లు అవడం మూలాన అప్పుడప్పుడే ఆకు పచ్చదనం నుండి మెల్లగా లేత పసుపు, ఆరంజి రంగులోకి మారుతున్నది! అది కూడా ఒక రకమైన సౌందర్య భరితంగానే  కనిపించింది.

   చాలా మంది ట్రెక్కర్స్ మా లాగానే  ఆ కొండను ఎక్కుతున్నారు. మరికొందరు దిగుతూ మాకు ఎదురవుతున్నారు..వారంతా రాత్రి పైన కోటలోనే బస చేసి ఉదయమే కొండను దిగుతున్నారు. ఒక్కో చోట చాలా ఏటవాలుగా వుంటున్నది..అక్కడ మాత్రం కాస్త కష్ట పడాల్సి వొస్తున్నది. ఎటు చూసినా...ఆకుపచ్చని దుప్పటి కప్పుకొన్నట్లు కనపడుతున్నది, అక్కడక్కడ ఆ ఆకుపచ్చ దుప్పటి మడతలు  పడినట్లుగా కొండ వొంపులు కనపడుతున్నాయి. దాదాపుగా రెండు గంటలు తర్వాత ఒక పెద్ద రాతి కొండ మీదున్న కోట గోడను  అతి కష్టంతో చేరుకొన్నాము. ఆ  ప్రదేశం చాలా ఏటవాలుగా వున్నది, అక్కడున్న కొన్ని ఇనుప కడ్డీల  ఆధారం తో  ఎక్కగలిగాము.అదైనా చాలా ప్రమాదంతో కూడుకున్న పనే!..కాస్త పట్టు జారినా అంతే..ఏకంగా కొన్ని వేల అడుగుల కిందకు పడిపోవడమే....!! . ఆ కోట గోడ దాటి లోపలికి వెళ్లగానే పద్మావతి కొలను కనపడుతుంది. అంత ఎత్తైన కొండ మీద చాలా పెద్ద కొలను నిర్మించారు చత్రపతి శివాజి. అదీను పచ్చదనం మద్యలో వున్నది. దాని చుట్టు పడిపోయిన భవనం మొండి గోడలు కనపడుతున్నయి.

   అక్కడ నుండి కాస్త పైకి వెళ్లాక అక్కడ చాలా విశాలమైన పద్మావతి దేవాలయం వున్నది. కాని అందులొ దేవాతా విగ్రహాలు కాని కనీసపు పూజలు జరుపుతున్న ఆనవాలు  కానీ లేవు !!  ట్రెక్కర్స్ అందరూ అందులో విశ్రాంతి తీసుకొంటున్నారు. రాత్రి అక్కడే బస చేయాలనుకొనే వారు ఆ ఆలయాన్ని వసతి గృహంగా వాడుకొంటున్నారు. ఆ దేవాలయానికి  కుడివైపున ఒక పెద్ద బావి వున్నది. ఆ నీటినే  అక్కడి వారు మంచి నీరుగా వాడుకొంటున్నారు. అక్కడ ఒక చిన్న సైజు హోటలు వున్నది. అక్కడకొచ్చే ట్రెక్కర్స్ అందరు అక్కడే భోజనాలు చేస్తుంటారు.

   అప్పటికి  సమయం పది అయ్యింది. మధ్యాహ్నానికి   మేము కూడ మా ముగ్గరికి భోజనాలు  ఆర్డర్ ఇచ్చి అక్కడ నుండి మళ్లీ మా ట్రెక్ మొదలు పెట్టాం, అక్కడ నుండి మూడు దారులుగా చీలిపోతుంది.  మొదటగా ఎదురుగా వున్న రాతితో నిర్మించిన తాపల మీదుగా పైకి చేరుకొన్నాం అక్కడికి, దాదాపుగా 4514 అడుగులు ఎత్తు వున్నది. అక్కడకు పెద్ద రాతి ద్వారం గుండా  చేరుకోవాలి, అక్కడే శివాజి  సేనాపతి, మంత్రులు అయిన  తానాజీ, యశాజి, షంబర్ బట్ ల నివాస గృహాలు శిధిలమై వున్నాయి. అక్కడ కూడ 15 అడుగుల వ్యాసంతో  వున్న చిన్న కొలను  వున్నది.

    అక్కడ నుండి మధ్యాహ్నం  భోజన సమయానికల్లా  కిందకు వచ్చి  మా భోజనాలు చేసాక..కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ  కుడి వైపున వున్న మరో దారి వెంట వెళ్లాం..!  అక్కడ నల్లని రాతితో నిర్మించిన కోట ముఖ ద్వారం వున్నది. అక్కడ నుండితిరిగి వెనక్కి వచ్చి..మూడో రహదారి వెంట నడిచాం.., ఈ దారిలో ఏ కాస్త ఏమరపాటున నడిచినా అంతే...  ఏకంగా ఎక్కడికో.. వేల అడుగుల కింద వున్న అడవిలోకి  జారి పడి పోవడమే!! .అంత ప్రమాద కరమైన దారే కాని..సాహసికులకు మాత్రం మంచి థ్రిల్ ఇస్తుంది.  విచిత్రమేమిటంటే ఈ కోటకు మూడువైపుల గోడ లాగ కొండలున్నాయి. వాటి మీద కోట గోడలు కట్టారు..వాటివలన కోటకు ఎటువంటి ఉపయోగం లేదు.  ఈ మూడు కొండలు ఒక చోట కలుస్తాయి అక్కడ మాత్రమే కోట వున్నది..మరెందుకు ఈ కొండల మీద కర్టన్ లాగ కోటలు కట్టారో అర్థమే కాదు. అసలు అక్కడికి చేరడానికి ఎన్నో ప్రయాస కోర్చి, ఎన్నో కష్టాలు పడ్డాం..! అటువంటి చోటకు ఎలా అంతంత పెద్ద పెద్ద రాళ్లు మోసుకెళ్లారో ఆలోచిస్తే, ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. .ఎక్కడా కూడ నడవదగ్గ రహదారి లేనేలేదు..!  ఎంతో కష్ట పడి ఎక్కాల్సిందే..పైకి. ఎంత కష్ట పడ్డారోఅనిపిస్తుంది . ఎంతమంది మనుషుల శ్రమతో ఈ కోట తయారైందో!!


    అక్కడ నుండి సాయింత్రం అవుతుండగా కిందకు దిగనారంభించాం, సాయింత్రానికల్లా గుంజావనే చేరుకొని అక్కడి నుండి మరో రోజు ఉదయం మరో వైపు నుండి ఈ కోటను చేరడానికి కొండ ఎక్కాలని మా ఉద్దేశం, అందుకోసం చాలా వేగంగా దిగుతున్నాం.  పై నుండి వర్షపు దారలు వలన ఏర్పడిన చిన్న చిన్న కాలువలు వున్నాయి వాటికి అటు ఇటుగా మట్టి గోడలు వున్నాయి..! అందులో నీళ్లు లేవు ఎండిపోయిన వున్నాయి.నేను వేగంగా దిగుతున్న తరుణంలో కాలుపెట్టిన ఒక చోట మట్టి పెళ్ల విరిగింది..అంతే నేను ఓ వేగంగా దొర్లుకుంటూ కిందకు జారి పోయాను.  అయితే ....చివరకు నా వెనుకున్న నా బ్యాగ్ మట్టి గోడల మధ్యన ఉన్న చిన్న  కాలువలొ ఇరుక్కపోవడంతో నా వేగం తగ్గి ఆగిపోయాను, లేకపోతే ఏకంగా దిగే శ్రమ లేకుండ వేల అడుగుల  కిందకు  చేరుండే వాడిని...బహుశ ప్రాణం వుంటుందనే గ్యారెంటీ లేదనుకోండి. మొత్తానికినా వెనుకున్న బ్యాగ్ నన్ను రక్షించింది. పెద్దగా దెబ్బలు ఏమి తగ్గల్లేదు కాని..లోపల కాస్త మూగ దెబ్బలు తగిలాయి.

      సాయంత్రానికి తిరిగి  గుంజావనే చేరుకొన్నాం. ఇద్దరు ఫ్రెండ్స్  బాగా అలసిపోయి వున్నారు..! అలసట తీర్చుకోవడానికి పెద్ద మరిచెట్టు వద్ద నున్న అరుగుల మీద  కూర్చున్నారు.  వాళ్లల్ మనసుల్లో ఏవో ఆలోచన కొనసాగుతోందని అనిపించింది.  కాసేపటికి తల ఎత్తి ఇద్దరు ఒకే సారి అడిగారు "రేపు మనం మళ్లీ తిరిగి ట్రెక్ చేయగలమా" అని. వాస్తవానికి వారిద్దరు బాగా అలసిపోయారు. నేను వివరించడం తో చాలా సులభంగానే అనిపిస్తున్నది కాని ట్రెక్ చాలా కష్టపడాల్సి వొచ్చింది ముగ్గురికీ..!

   అయినా సరే....నాకు మరుసటి  రోజు కూడ మరో వైపునున్న "తోర్నా" అన బడే ప్రాంతం నుండి ట్రెక్ చేయాలని వున్నది, కారణం  తోర్నా ప్రాంతం నుండి ట్రెక్ చాలా సాహసంతో కూడుకొన్నది, అంతే కాక ప్రకృతి రమణీయ దృశ్యాలు చాలా వున్నాయని విన్నాను ..కొన్ని ఫోటోస్ కూడ చూసాను..అవి చూసినప్పటి నుండి ఒకటే ఉబలాటం నాలోపల..ఎలగైనా అటు వైపు నుండి ట్రెక్ చేయాలని.  మా ఫ్రెండ్స్ ఇద్దరు తటపటాయించడానికి కారణం..నేను దిగుతున్న సమయంలో కొద్ది పాటి ప్రమాదం జరిగి కాస్తలొ ప్రాణాపాయం నుండి తప్పి పోవడాన్ని కళ్ళారా  చూడటం వలనే అని అనిపించింది.



 

        

     


     వారి భయాన్ని కూడ అర్థం చేసుకోవాలి కాబట్టి మనసులో చాలా దృడంగా అక్కడీకి వెళ్లాలని వున్నా... వారి అభిప్రాయానికి తలూపి.....సరే తిరిగి వెళ్దాం పూణేకు అంటు తిరుగు ప్రయాణం సాగించాం.








About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs