గత కొన్నేళ్ళుగా హిమాగిరుల మీద ట్రెక్కింగ్ చేయాలని తెగ ప్రయతిస్తూవున్నాను కాని సరైన మిత్రులు..అవకాశాలు రాక అలా వాయదా పడుతూ వున్నది. ఇలాంటి సమయంలో నాకు ఈ అంతర్జాలం చాలా ఉపయోగపడిందనే చెప్పాలి.  ఫేస్‌బుక్ ద్వార హిమాలయాల మీద ట్రెక్కింగ్ నిర్వహించే కొన్ని సంస్థలు పరిచయం అయ్యాయి. అందులో కేవలం రెండు మూడు సంవత్సరాల క్రితం తమ ఇంజనీరింగ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఉద్యోగం చేస్తూ ట్రెక్కింగ్‌ని ఒక హాబీలానే కాకుండ ఒక ప్రొఫెషిన‌లా కొనసాగిస్తున్న ఓ ముగ్గురు ఔత్సాహిక యువకులు నిర్వహిస్తున్న చిన్న పాటి ట్రెక్కింగ్ క్లబ్ పరిచయం అయ్యింది. వారు నిర్వహిస్తున్న చాదర్ ట్రెక్ సంబందించిన వివరాలు చూసాను. కాని ఎందుకో నాకంతగా ఆసక్తి కలిగించలేదు, అందుకు కారణం శీతల కాలంలో ఐస్‌గడ్డగా మారే నది మీద నడవడం...అంటే ఆ దారిలో పెద్దగా ప్రకృతిపరమైన పచ్చదనపు మైదానాలు, లోయలు కనపడవు అందుకే నాకంత ఆసక్తి కలిగించలేదు. అలా కొన్ని నెలలు గడిచాక ఒక రోజు ఒక స్లాట్ ఖాలీగా ఉన్నది ఆసక్తి ఉంటే రావచ్చు అని  హిమాలయ ఎక్స్‌ప్లోరర్ క్లబ్ వారి నుండి నాకో మేయిల్ వచ్చింది. తీరా చూస్తే అదే చాదర్ ట్రెక్.. కాసేపు ఆలోచించి సరే హిమాలయల వైపు మునుముందు చేయబోయే ట్రెక్కింగ్ ఈ అనుభవం బాగా ఉపయోగపడుతుంది అని అనుకొని చాదర్ ట్రెక్కింగ్‌ చేయడానికి నిర్ణయించుకొన్నాను. ఇక ఆ ట్రెక్కింగ్‌కి కావలసిన మిలటరీ పర్మిషన్స్, మిగతా అనుమతుల కొరకు కావలసిన అన్ని పేపర్లు, ఫైల్స్ మేయిల్ ద్వార వారికి పంపాను. డిల్లీ నుండి లేహ్‌కి వెళ్ళి అక్కడ నుండి ట్రెక్‌కి వెళ్ళాలి. తర్వాత -30 డిగ్రీస్ వాతావరణం అక్కడ ఉంటుంది కాబట్టి వాటికి కావలసిన ప్రికాషన్స్, మెడిసన్స్ అన్నిటిని ఆ క్లబ్ వారి నుండి తెలుసుకొని సిద్దం చేసుకొన్నాను.

   ఈ ట్రెక్‌కి వెళ్ళె ముందు డిస్కవరీ చానల్లో ఈ ట్రెక్ గురించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ చూశాను..బాబోయి అది చూడగానే అనిపించింది ఇది చాలా ప్రమాదకరమైన ట్రెక్ అని. లోపల ఎక్కడో ఊగిసలాడింది...అనవసరమైన రిస్క్ తీసుకొంటున్నానా  అని..?   చూద్దాం ఎంత ప్రమాదకరమైనదో..అనుకొని వెళ్ళడానికే నిర్ణయించుకొన్నాను, అనుకొన్న సమయానికి డిల్లీ బయలుదేరాను. అక్కడ చేరగానే విపరీతమైన చలి చుట్టేసింది నన్ను...జనవరి నెల చివరి రోజది. ఈ క్లబ్‌ని నడుపుతున్న ముగ్గురిలో ఒకరైన అవినాష్ సిద్దు డిల్లీలో కలుసుకొన్నాను. నాలానే మరో ట్రెక్కర్ గణేష్ ప్రసాద్ అక్కడే పరిచయం అయ్యారు, ముగ్గురం కలిసి ట్రెక్కింగ్‌కి కావలసిన వస్తువుల కొనడానికి బాగా తిరిగాము కాని కేవలం కొన్ని మాత్రమే దొరికాయి మిగతా వాటి కోసం లేహ్‌లో కొనవచ్చని అవినాష్ చెప్పడంతో మరసటి రోజు తెల్లవారుజామునే 7:10 కి డిల్లీ నుండి లేహ్‌కి విమానంలో బయలులేరాము.  మా ట్రెక్కర్స్  గ్రూప్ మొత్తం ఏడుగురం అయితే ఆరు మందిమి కలిసాము, మరొతను అప్పటికే లేహ్‌లో ఉన్నారు. స్వప్నిల్ షా - ఇతను గుజ్జు(గుజరాతి) ముంబయి L&T ఆయిల్ సంస్థ విభాగంలో టెక్నికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు, సౌమింద్రి పాల్ - ఇతను బెంగాలీ కాని పుట్టి పెరిగింది డిల్లీలో.. వయసులో పెద్దవారు, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నారు,  ఆల్‌బెర్టో - ఇతను ఇటాలియన్, అతని దేశంలోని ఏయర్‌పోర్ట్ కస్టమ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నాడు, కేవలం ట్రెక్కింగ్ కోసమే ఇండియాకు వచ్చాడు, ఇతను తరచుగా ఇండియాకు ట్రెక్కింగ్ కోసం వస్తూ ఉంటారట..!!  అభిషేక్ - ఇతను కూడ డిల్లీ నివాసే..మార్కెటింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. గణేష్ ప్రసాద్ - ఇతను బెంగళూరు నివాసి కాని ముంబాయిలో ఒక పేరుమోసిన అడ్వకేట్‌. ఈ ఏడుగురం ఒకరికి ఒకరు ముందుగా ఎటువంటి పరిచయం లేదు కనీసపు అంతర్జాలంలో కూడ పరిచయం లేదు. మొట్టమొదటిసారిగా అలా విమానాశ్రయంలో కలుసుకొని పరిచయం చేసుకొన్నాము. నిజం చెప్పాలంటే అందరు ఒకరికికొకరు "స్ట్రేంజర్సే"...!!


        లేహ్ విమాన ప్రయాణంలొ నేను మొదట సరిగ్గా గమనించలేదు గాని తర్వాతర్వాత ఒక విషయం అర్థమయ్యింది..కొంతమంది నావైపు వింతగా చూస్తున్నారు...నన్ను నేను  పరిశీలించుకోగా..కొద్ది సేపటికి అర్థమయ్యింది. అసలు నా కాళ్ళకు బూట్స్ లేవు..రెండు సాక్స్‌స్ మీద శాండిల్స్ తొడుక్కొని వున్నాను. అదీను వెదర్ ప్రూఫ్ జాకెట్ కూడ లేదు నాకు, కేవలం రెండు స్వెట్టర్‌ లాంటి టి-షర్ట్ వేసుకొని ఉన్నాను.  లేహ్‌లో ట్రెక్కింగ్ షూస్‌తో సహా మిగతా కావలసిన వస్తువులు కొనవచ్చని ఉద్దేశంతో లేహ్‌కి బయలుదేరాను. మైనస్ టెంపరేచర్ ఉన్న ప్రాంతానికి వెళ్తున్న వారందరూ అదేదో స్పేస్‌లోకి వెళ్తున్నట్లుగా తల నుండి పాదాల వరకు మొత్తం రెండు మూడు రకాల దుస్తులు వేసుకొని వున్నారు. మరి వారి కంటికి నేనొక వింత జీవిలా కనపడటంలో తప్పేముంది..!

    విమాన ప్రయాణంలో దారి మద్యలోనే కిటికీగుండా మంచుకొండలు కనపడుతున్నాయి..అంతే అందరం ఎవరి వారి కెమరాలకు పని పెట్టాము. మొత్తం కొండలన్నీ మంచుతో కప్పబడివున్నాయి.


         లేహ్‌లో ల్యాండ్ అయ్యే ముందుగా విమాన సిబ్బంది  " కాసేపట్లో  లేహ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవబోతున్నాము బయటి టెంపరేచర్ -18 వున్నద" ని అనౌన్స్ చేసారు. -18 టెంపరేచర్ ఉన్నదని వినగానే    ఆలోచనల సుడిగుండం తిరగసాగింది, ఎలా ఉన్నా తప్పదని బయటకు అడుగు పెట్టాను, అంతే ఒక మలయ సమీరం గుండెను బలంగా తాకి చల్లగా అనిపించింది..ఒక్కసారిగా గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలాను.. సిగిరెట్ తాగే అలవాటు లేకున్నా ముక్కుపుటాల నుండి పెద్ద ఎత్తున పొగ వచ్చింది...నేనే కాదు అందరి పరిస్థితి అదే..చూడటానికి బలే వుంది ఆ దృశ్యం..ఫోటో తీయడానికి అక్కడ అనుమతి లేదు కారణం ఏయర్‌పోర్ట్ చుట్టూ మిలటరీ, వైమానిక దళాల స్థావరాలున్నాయి. చేతులు ముడుచుకోక తప్పలేదు..మరి..!! మా కోసం అక్కడి ప్రతినిది డొర్జే ఎదురుచూస్తున్నాడు. అందరం వాహనాల పార్కింగ్ ప్రదేశానికి చేరుకోగానే మొదలయ్యింది నా పాదాలకు ఎముకలు కొరికే చలి తాకిడి. బయట ప్రాంతమంతా నేల మీద చాలా వరకు ఐస్ గడ్డ కట్టి వున్నది అడుగు పెట్టగానే జారుతున్నది. కాస్త ఏమారినా నడ్డి విరగడం ఖాయం అని అనుకొంటున్న తరుణంలోనే  సౌమింద్ర పాల్ జారి వెల్లికిలా కిందపడ్డాడు. మనిషి ఆరడగుల ఆజానుబావుడు అదీను శరీరం కూడ కాస్త భారీగానే ఉంటుంది..పాపం లేవడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. అది చూడగానే నేనింకా జాగ్రత్తగా నడవడం మొదలెట్టాను.  లేహ్ పట్టణం చుట్టూ మంచుకొండలే వున్నాయి వాటి మీద సూర్య రశ్మి పడి మరింతగా మెరిసిపోతున్నాయి. అసలు వాటిని ఎక్కువ సేపు చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మేలా వున్నది పరిస్థితి.. అంతలా దగ దగ మెరిసిపోతున్నాయి.


      లేహ పట్టణానికి కాస్త ఎత్తైన ప్రదేశంలో శాంతి అనబడే ఒక గెస్ట్‌హౌస్‌లో మా బస ఏర్పాటు చేసారు. గదిలోకి చేరుకోగానే కిటికీ గుండా కనపడుతున్న ప్రకృతి సౌందార్యాన్ని చూస్తున్న నాకు మనసాగట్లేదు...వెంటనే కెమరాను బయటకు తీసి ఫోటోస్ తీయడం మొదలుపెట్టాను. ఎటు చూసిన మంచు పర్వతాలు, నీలాకాశం. రోడ్డుకు ఇరువైపుల తెల్లటి మంచు ఉన్నది, అంతే కాదు చెట్ల మీద ఇల్ల కప్పుల మీద..వాహనాల మీద ఎక్కడ చూసినా దూదిపింజలా ఉన్న తెల్లటి మంచు. ఎక్కడ కూడ వాతావరణ కాలుష్యం లేకపోవడంతో చాలా స్వచ్చంగా ప్రతి రంగు స్పష్టంగా కనపడుతున్నది. మొదటి రెండు రోజులు Acclimatization కోసం లేహ్‌లోనే ఉన్నాము. రాత్రిల్లు -25 నుండి -30 వరకు వాతావరణం ఉంటున్నది అందువలన వెచ్చదనం కోసం గదిలో గ్యాస్ సిలండర్‌ ఉన్న హీటర్ వెలిగించుకొని నిద్రపోవాల్సి వొస్తున్నది, అక్కడా పవర్ కట్..కాకపోతే మనలాంటి సమస్య కాదు..  శీతాకాలంలో అక్కడ నదులన్ని గడ్డ కట్టి వుంటాయి కావున జలవిద్యుత్త్ అసాద్యం, లేహ్ పట్టణ మొత్తానికి కేవలం సాయింత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు మాత్రమే జనరేటర్ ద్వార విద్యుత్‌ని అందిస్తున్నారు. కేవలం వేసవిలో మాత్రమే జలశాయాలు పుష్కలంగ ప్రవహిస్తుంటాయి  అప్పుడు మాత్రమే 24 గంటలు విద్యుత్త్ సరఫరా చేస్తున్నారట. ఎంత హీటర్ రాత్రిల్లు వున్నా రెండు రకాల ఉలన్ దుప్పట్లు వాడినా కూడ ఆ ఎముకలు కొరికే చలిని తట్టుకోవడం చాలా కష్టపడాల్సి వొచ్చింది. ఉదయం లేచి కిటికీల వైపు చూస్తే అర్థమవుతుంది ఎంత చలి వున్నదో..మొత్తం కిటికీలన్నీ పొరలు పొరలుగా మంచుతో నిండిపోయివున్నాయి.
    ఇక్కడ మా గుంపులోని ఏడో వ్యక్తి సెంథిల్ కుమార్ కలిసారు, ఇతను చెన్నై నివాసి, బెంగళూర్‌లొని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు.


       రెండవ రోజు లేహ్ చుట్టుపక్కల వున్న కొన్ని మానస్ట్రీస్ ( దేవాలయాలు ) చూడటానికి వెళ్ళాము..చాలా వరకు కొండల మీదనే వారి దేవాలయాలున్నాయి. సాయింత్రం కొనవలసిన వస్తువులు తీసుకొన్నాము. లేహ్ పట్టణంలో కేవలం మద్యాహ్నం 2 నుండి సాయింత్రం 5:30  వరకే కొన్ని అంగళ్ళు మాత్రమే తెరుస్తున్నారు. 5:30 తర్వాత మెల్ల మెల్లగా ఉష్ణోగ్రతలు పడిపోతాయి అంటే అప్పటికే  -10 నుండి -16 డిగ్రీస్ వరకు ఉంటున్నది ఇక 5:30 దాటగానే -20 చేరుకొంటుంది..తర్వాత రాత్రి -30 ఉంటున్నది. దీనికి ముందు రోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మా గ్రూప్‌లోని సౌమింద్రి పాల్‌కి..! ఎత్తైన ప్రదేశానికి అదీను మైనస్ డిగ్రీస్ ఉన్న ప్రాంతానికి వెళ్తున్నాము కాబట్టి ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలు...మెడిసిన్స్ ఏవేవి తెచ్చుకోవాలో ఈ ట్రెక్క్‌కి వచ్చేముందే మాకు ఆ వివరాలు మేయిల్ ద్వారా ఇచ్చారు. ఎత్తైన మంచు ప్రదేశంలో ఉన్నప్పుడు వాంతులు, బేదులు, అజీర్తి ఈ మూడు అనారోగ్యపు ప్రక్రియ జరిగే అవకాశముంటుందన్న ఉద్దేశంతో.. మా శరీరం ఆ ప్రాంతానికి అలవాటు పడడానికి వీటినుండి ప్రమాదం జరగకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా  డైమాక్స్ మాత్రలు వేసుకోమని సూచనలిచ్చారు, మా గుంపులో కొందరు వేసుకొన్నారు, కాని నేను వాడలేదు, గతంలో కొన్ని ప్రాజెక్ట్స్‌కి పని చేయడానికి కులు-మనాలిలో జీరో డిగ్రీస్‌లో పని చేసిన అనుభవం ఉన్నది నాకు..అందువలన ఈ మాత్రలు అవసరమనిపించలేదు..!  ఒక్క సౌమింద్ర పాల్  డైమాక్స్‌ మాత్రలు వేసుకోవాల్సింది పోయి.. పొరబాటున స్టెరాయిడ్‌ మాత్ర వేసుకొన్నాడు...అంతే గంట తర్వాత దాని ప్రభావం చూపనారంభించింది.. మనిషిలో మనిషి లేడు..లోపల నుండి ఏదో తంతున్నట్లుగా ఉన్నదట..!! కళ్ళు తిరుగుతున్నాయి..తల అంతా పట్టేసినట్లుగా ఉన్నదతనికి.. రాత్రి మేమందరం హీటర్ వేసుకొని మొత్తం గదంతా బిగించేసి మూడు రకాల ఉలన్ దుప్పట్లతో పడుకొంటే..అతను మాత్రం బట్టలన్ని విప్పేసి కేవలం నైట్ డ్రస్‌తో గది బయట ఉన్న డాబా వద్ద అర్థ రాత్రి వరకు గడిపాడు..అతని రూమ్‌మెట్ అయిన గణేష్ ప్రసాద్ తన సామాగ్రితో పక్క రూమ్‌కి ఉడాయించాడు, -25 డిగ్రీలతో ఉన్న వాతావరణంలో అతనలా గది కిటికీలు తలుపు తెరిచి బయటి గాలిని ఆస్వాదిస్తుంటే ఎవరైనా ఎలా తట్టుకోగలరు..??

      మూడవ రోజు ట్రెక్ మొదలు పెట్టడానికి మా లగేజి అంతా బ్యాక్‌ప్యాక్‌లో సర్దుకొని సిద్దంగా ఉన్నాము. టెంపరేచర్ -10 ఉన్నది ఆరోజున. మా గ్రూప్‌లోకి కొత్తగా అక్కడి 13 మంది పోర్టర్స్, ఒక గైడ్, ఒక వంటవాడు వచ్చి చేరారు. మా గైడ్ పేరు "డాలా".  వారంతా మాకు రాత్రిల్లు బస చేయడానికి కావలసిన గూడారాలు, వంట సామాగ్రి, దినుసులు, కిరోసిన్ వగైరా వస్తువులతో సిద్దమై వచ్చారు. అందరం కలసి స్వరాజ్ మెజ్దా వాహనంలో మొదటి ముప్పై కిలోమీటర్లు లేహ్ నుండి శ్రీనగర్ హైవేలో ( NH 1 )  నిమ్ము అనబడే ప్రాంతం వరకు ప్రయాణించాము. రోడ్డ్‌కి ఇరువైపులా మంచుతో కప్పబడిన చదునైన నేల... దూరంగా పెద్ద పెద్ద మంచు పర్వతాలు..బైక్‌లలో ప్రయాణం ఇష్టపడేవారుంటే మాత్రం ఇక్కడి రైడ్‌ని బాగా ఇష్టపడతారు. ఇక్కడే జన్‌స్కార్ ( Zanskar ) అనే ప్రాంతం నుండి మొదలెయ్యి ప్రవహించే జన్‌స్కార్ నది, ఇందు అనబడే మరో నది..  ఈ రెండు నదులు కలుస్తాయి. కలిసిన రెండు నదులు ప్రవహిస్తూ పాకిస్థాన్ వైపు సాగుతాయట. ఇక్కడ నుండి్ ట్రెక్ మొదలు పెట్ట వలసిన ప్రాంతమైన చిల్లాంగ్ కు బయలు దేరాము. భయంకరమైన మలుపులతో కూడిన రోడ్..పెద్ద పెద్ద పర్వతాల అంచున మేము ప్రయాణిస్తుంటే మాకు మేము చిన్న చిన్న చీమల్లగా కనపడుతున్నాము. అంత ఎత్తైన పర్వతాలు అవి..మద్యలో జన్‌స్కార్ నది ప్రవహిస్తున్నది కాని చాలా వరకు ఐస్‌లా గడ్డి కట్టి ఉన్నది. మరో ముప్పై కిలోమీటర్లు ప్రయాణించాక చిల్లాంగ్ ప్రాంతానికి చేరుకొన్నాము. మా ట్రెక్ అక్కడి నుండే ప్రారంభం అవుతుంది.


        జన్‌స్కార్ నది సంవత్సరంలో మూడునెలలు పాటు అనగా శీతాకాలంలో పూర్తిగా ఐస్ గడ్డ కట్టి ఉంటుంది, ఆ సమయంలోనే  జన్‌స్కార్ ప్రాంతం వైపు ఉన్న చాలా గ్రామాల ప్రజలు ఈ నదిమీద ప్రయాణించి లేహ్‌కి కాని లేక మనాలి‌కి చేరుకొంటారు, ఈ మూడు నెలలు ఈ పట్టణాలలో గడిపి మిగతా కాలానికి కావలసిన సరుకులు, దినుసులు అన్ని తీసుకొని ఫిబ్రవరి చివరి వారంలోపలే  అంటే అప్పటి నుండే మళ్ళి గడ్డ కట్టిన నది నీరై ప్రవహించడం ప్రారంభిస్తుంది ఆ లోపలే వారి వారి గ్రామాలకు చేరుకొంటారు. మిగతా ఎనిమిది నెలలు వారికి వారి గ్రామాల ప్రపంచం తప్ప మిగతా నాగరికత ప్రపంచంతో ఎటువంటి సంబందాలు ఉండవు..పూర్తిగా తెగిపోతాయి. ఈ జన్‌స్కార్ నది కొన్ని వేల అడుగులు ఎత్తు ఉన్న పర్వతాలు మద్యన ఉన్నది. ఆ పర్వతాలను అధిరోహించి పట్టణాలకు చేరుకోవడం మానవులకు అసాద్యం. అందుకే సంవత్సరంలో ఈ మూడు నెలల కోసం ఎదురు చూస్తారు అక్కడి గ్రామాల ప్రజలు.  ఇలా గడ్డ కట్టిన సమయంలోనే ఎక్కువగా విదేశీయులు ఇక్కడ ట్రెక్ చేస్తారు.


      మొదటి రోజు మా ట్రెక్ ప్రారంభమయ్యింది, చిల్లింగ్ ప్రాంతం వద్ద ఘాట్ రోడ్ నుండి నది మీదకు మా కెమరా బ్యాగ్స్‌తో దిగాము, ఐస్‌లా గడ్డ కట్టిన ఒక నది మీద అడుగిడడం నాకు మొట్టమొదటి అనుభవమది.. వింతగా ఉన్నది ఒక నది మీద నిలబడడం. ఒక కొండరాయిలా చాలా గట్టిగా వున్నదా ఐస్..కాళ్ళతోనూ ..మా వద్ద ఉన్న స్టిక్‌తోనూ గట్టిగా  కోట్టి చూస్తున్నాము అందరం, నేనయితే మరీ అతి చేస్తూ ఎగురుతూ గట్టిగా ఐస్‌ని తంతున్నాను..ప్చ్...అదేదో పెద్ద ఇనుప ముక్కలా గట్టిగా ఉన్నది. కాకపోతే అంత గట్టిగా ఉన్నా తల తల మెరుస్తూ అద్దంలా ఉన్నదా ఐస్ నేల. ఆ ఐస్‌గడ్డ దాదాపుగా 6 అడుగుల నుండి పది అడుగుల మందం వరకు వుండవచ్చు, దాని కింద నది ప్రవహిస్తూ వున్నది.  పోర్టర్స్ అందరు సామాన్లను "స్లెడ్జ్" ల మీద సర్దుకొన్నారు. వాటికి తాడు కట్టి తమ భుజాలకు తగిలించుకొని ఐస్ నేల మీద లాగుతూ చాలా వేగంగా నడవడం మొదలు పెట్టారు. చాలా సునాయసంగా నడుస్తున్నారు వాళ్ళు. కాని ఐస్ గడ్డ సర్ఫేస్ చాలా స్మూత్‌గా ఉన్నది.. మామూలుగా నడవడం కూడ చాలా కష్టంలా అనిపిస్తున్నది. మా గైడ్ డాలా మాకు ఎలా నడవాలో సూచనలిస్తూ నడక మొదలు పెట్టాడు..ఒక్కొక్కరు కొన్ని అడుగులు వేయగానే జారి దబ్బున వెల్లకిలా పడుతున్నారు కాకపోతే వారి వీపులకు "బ్యాక్‌ప్యాక్" బ్యాగ్స్ ఉండడం మూలాన పెద్దగా దెబ్బలు తగలట్లేదు..నేను ఓ వందడుగులు వేసానో లేదో.. అంతే సర్రునా జారాను, వెల్లికిలా పడుతున్న వాడిని నా ముందటి భాగాన్ని వెనక్కి తిప్పి పడుతూ నా చేతులు ముందుకు చాచి ఐస్ గడ్డ నేల మీద ఉంచి తర్వాత నా శరీరాన్ని కిందకు వదిలాను.. ఇది నాకు తెలీకుండానే జరిగే నాలోని ఒక ప్రక్రియ. దెబ్బలేవి తగల్లేదు...హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొన్నాను. రోజుకు ఒక మనిషి సగటున 10 నుండి 20 సార్లు కింద పడొచ్చని గైడ్ చెప్పాడు..కాని నాకదే మొదటిది చివరిది. మా ట్రెక్కులో మొత్తం అన్ని రోజులు కలిపి మా గుంపులోని మిగతా వాళ్ళు కనీసం 5 నుండి ఓ పది పదిహేను సార్లు పడుంటారు అందులో గణేష్ ప్రసాద్ ఎక్కువగా జారి పడ్డారు.


        తర్వాతర్వాత అర్థమయ్యింది స్మూత్ సర్ఫేస్ వచ్చినప్పుడు కాళ్ళను ఈడ్చుకొంటూ నడవాలన్న సంగతి. మరి కొన్ని ప్రాంతాలలో మంచు పడి మంచు ఇసుకులా ఉంటుంది అలాంటి చోట్ల ప్రమాదం ఏమి ఉండదు..వేగంగా నడవచ్చు. ఒక గంట నడవగానే తిలాథ్ ( Tilath ) అనే ప్రాంతం గల ఒక పెద్ద కొండ వద్దకు చేరుకొన్నాము. మొదటి రోజు కేవలం ఒక గంట ట్రెక్ చాలంటూ మా గైడ్ డాలా చెప్పడంతో కాస్త నిరుత్సాహం వహించింది నాలో..ఇంకొన్ని గంటలు నడుద్దామని నా ఆలోచన. ఆ రాత్రికి అక్కడే బస చేశాము. గూడారాలు అన్నిటిని పోర్టర్స్ ఏర్పాటు చేశారు. ఇద్దరి మనుషులకు ఒక్కో గూడారం ఇచ్చారు. భోజనాలకు ఒక పెద్ద గూడారం, వంట కోసం మరో పెద్ద గూడారం ఏర్పాటు చేసుకొన్నారు పోర్టర్స్. రాత్రి భోజనానానికి అందరం గూడారంలో చేరగానే ఒకరినొకరి గురించి తెలుసుకొంటూ కబుర్లు చెప్పుకొన్నాము. భోజనాలు ముగించాక ఎవరి గూడారలలో వారు చేరుకొన్నా ఒకరిద్దరం మాత్రం కెమరాస్ పట్టుకొని వెన్నెల్లో వుండిపోయాము.. కాసేపటికి అందరు గూడారాలలోకి మెల్లిగ జారుకొన్నారు, నేనొక్కడినే రాత్రి పిండారిబోసినట్లుండే ఆ వెన్నెలని ఆస్వాదిస్తూ  ఫోటోస్ తీస్తూకూర్చున్నాను.


       రెండవ రోజు వాతావరణం మరీ మబ్బు పట్టేసింది...! "రోజు రోజుకు వాతవరణం మారుతూ ఉంటుంది ఈ రోజు మంచు వర్షం పడవచ్చు" విషయం చెప్పాడ గైడ్ డాలా. తిరిగి వొస్తున్న కొందరు ట్రెక్కర్స్ ఎదురయ్యారు మాకు..వాళ్ళు చెప్పిన ప్రకారం దారి అంత సులభంగా లేదు చాలా చోట్ల నీటి ప్రవాహం ఎక్కువగా వున్నది, జాగ్రత్తగా వెల్లాలి అని అర్థమయ్యింది. వెంటనే మా ట్రెక్కింగ్ షూస్ పక్కన పెట్టి వాటర్ ప్రూఫ్ గల "గమ్ బూట్స్" తొడుక్కొన్నాము. అవి థర్మోకోల్‌తో తయారుచేసిన బూట్స్..ఎంతటి మైనస్ డిగ్రీలలో నడిచినా పాదాలకు ఎటువంటి చలి తాకిడి ఉండదు. మేము బయలుదేరే సమయానికి మంచు వర్షం ప్రారంభమైంది. అయినా అలానే నడక సాగించాం..! నాకావాతావరణం చాలా కొత్త..ఒక విచిత్రమైన అనుభవం. అందుకే ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆ వర్షాన్ని ఎంజాయి చేస్తూ నడిచాను.


        ఇక్కడ నడకలో ఒక విషయం భోదపడింది నాకు.. నడుస్తున్న నడక మీద పూర్తిగా నా దృష్టినంత కేంద్రీకరించాల్సి వొస్తున్నది..అంటే నడుస్తున్న నడక మీద ఏమాత్రం దృష్టి పెట్టకుండ ఎక్కడో ఆలోచనల్లోకి వెళ్తే మాత్రం జారి కింద పడటం ఖాయం. నాకు తెలీకుండానే నా పంచేయింద్రియాలు పూర్తిగా నా నడక మీద దృష్టి పెడుతున్నాయి....పెట్టాలి కూడ.. లేకపోతే ఏమాత్రం ఏమారినా వీపు విమానమోతే..!!  ఒకరకంగా నాకిది పనికొచ్చే ఒక ప్రక్రియ. మనకు ఎప్పుడో కాని మన పంచేంద్రియాలు మనం చేస్తున్న పని మీద దృష్టి పెట్టడం జరగదు..ఎప్పుడో ఎందుకు..ఎప్పుడు కూడ ఉండకపోవచ్చు అనుకొంటా..?? నిజంగా నాకిది పనికొచ్చే ఒక సాధన..మనం చేస్తున్న పని మీద పూర్తిగా ఇలా ఎప్పుడు దృష్టి కేంద్రీకరించలేము..అదిలా తీరుతున్నందుకు సంతోషకరమైన విషయమే కదా..!! దారి పొడవునా నీటితో కూడిన ఐస్ ముక్కలున్నవి..అవి చూట్టానికి పలకలు పలకలుగా పగిలి వున్నాయి. అయితే ఆ నీరు మాత్రం చాలా స్వచ్చంగా ఉన్నది మా షూస్ మునిగినా అవి చాలా స్పష్టంగా కనపడుతున్నవి బయటకు. కొన్ని చోట్ల మద్యలో జన్‌స్కార్ నది కనపడుతున్నది అంటే ఐస్ నేల మద్యలో నది తెరుచుకొని ఉంటున్నది. అక్కడ మాత్రం నీరు స్వచ్చంగా నీలం రంగులో గల గల చాలా వేగంగా ప్రవహిస్తున్నది. ఒక్కో సమయంలో చూట్టానిక్కూడ చాలా భయం వేసేంతగా కూడ కనపడుతుంది. అక్కడక్కడ పగిలిన మంచు గుట్టలు..! చీలిన మంచు రహదారులు కనపడుతున్నాయి. అలాంటి చోట్ల చాలా జాగ్రత్తగా నడవాల్సి వొస్తుంది.

 
       మూడవ రోజు కూడ మంచు వర్షంలోనే నడక కొనసాగించవలసి వొచ్చింది. చాలా చోట్ల నది తెరుచుకొని చాలా వెడల్పుతో ప్రవహిస్తున్నది అలాంటి చోట్ల నడక చాలా కష్టం అంటే నదికి అటు ఇటు కొండ వాలు వద్ద మాత్రమే ఐస్ కడ్డ కట్టి ఉంటుంది. అటువంటి చోట్ల నడక చాలా ప్రమాదంతో కూడుకొన్నది. ఏమాత్రం కాలు జారినా అంతే నది ప్రవాహంలో కొట్టుకొని పోవడమే అదీను నది పూర్తిగా నదిపొడవునా తెరుచుకొని ఉండదు అక్కడక్కడ మంచుతో పూర్తిగా కప్పబడిఉంటుంది. అంతే గాక పగటి పూట  -14 డిగ్రీ‌తో ఉంటే నీటిలో మాత్రం..-30 డిగ్రీస్‌తో ఉండవచ్చు..పడితే ప్రాణాలతో బయటకు రావడమన్నది జరగదు. సాయింత్రానికి డిబ్ అనే గుహలు వద్దకు చేరుకొన్నాము కాని అప్పటికే గుహలలో మాలాంటి మరి కొంతమంది విదేశీ ట్రెక్కర్స్ ఉండడంతో మళ్ళీ మా గూడారాలే తప్ప లేదు మాకు. రాత్రిల్లు -30 డిగ్రీస్ ఉండగా..మా గూడారాల లోపల -14 డిగ్రీస్ ఉండేది.. -10 డిగ్రీస్ నుండి కాపాడగల రెండు స్లీపింగ్ బ్యాగ్స్‌లలో దూరి పడుకొనేవాళ్ళం. కాని అప్పటికే  చాలా మందికి జలుబు..జ్వరాలు వొచ్చాయి వాటికి ఎలాగు మాత్రలు తెచ్చుకొన్నాము కాబట్టి వాటిని వాడుతూ నాలుగవరోజు కూడ ట్రెక్ చేసాము.. అక్కడ చివర్లో ఐస్ గడ్డ కట్టిన పెద్ద జలపాతం కనపడింది..చాలా వెడల్పైన జలపాతం అది. అందరం ’వావ్” అంటూ ఫోటోస్  తీసుకోవడంలో తలమునకలయ్యారు.


    నాలగవ రోజు సాయింత్రానికి నైరక్ ప్రాంతానికి చేరుకొన్నాము. కాని మా మేము ముందు అనుకొన్న షెడ్యూల్ ప్రకారం నాలుగవ రోజుకు చెరక్‌దో అనే గ్రామానికి చేరుకోవాలి..తర్వాత అక్కడ నుండి జాంగ్లా అనే గ్రామానికి..మరసటి రోజు జాంగ్లాలోని చూడవలసిన ప్రకృతి పరమైన ప్రదేశాలను సందర్శించి తర్వాత "పదుం" గ్రామం చేరడం..అక్కడ ఆ ప్రాంతపు ప్రకృతి రమణీయ దృశ్యాలను చూడటం...తర్వాత తిరిగి వెనకకు నడక..! కాని వాతావరణం అనుకూలించకపోవటం ఒకటి.. అలానే శాటిలైట్ ఫోన్ పని చేయకపోవడం మూలాన నైరక్ ప్రాంతంలోనే ఉండి అక్కడి నుండి వెనకకు మళ్ళడమే అనుకొన్నాము. అప్పటికే నాకు మరో ఇద్దరికీ జ్వరాలు వచ్చాయి..చలి వలన బయటకు తెలియట్లేదు కాని లోపల శరీరంలో ఉన్నట్లు మాకు అర్థమవుతున్నది. మాలోని ఒక నలుగురు మాత్రం పది కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగ్‌షెడ్ గ్రామానికన్నా వెల్దాం..అన్నారు. అక్కడ ఒక ఇంటర్ నేషనల్ స్కూల్ ఉన్నది.  ముగ్గురం మాత్రం నైరక్ వద్దే ఆగిపోయాము. ఆ నలుగురు లింగ్‌షేడ్‌కి బయలుదేరి వెళ్ళిపోయారు.


    జన్‌స్కార్ నదికి ఎడమవైపు వున్న చిన్న కొండ మీద మేము బస చేసాము. ఆ చిన్న కొండమీద చాలా వరకు చదునుగాను అక్కడక్కడ ఎగుడు దిగుళ్ళతో ఉండి మంచుతో కప్పబడి ఉన్న పంటపొలాలవి. వాటి యజమాని పన్సోక్ డోర్జే, వయసు 80 ఏళ్ళు. అతనొక్కడే అక్కడ ఉంటున్నాడు..అదీను 10'X10' అడుగుల వెడల్పుతో నేలమాలిగలో తయారు చేసిన చిన్న పాటి గది. అందులోనే అతని వంట, నిద్ర అన్ని కార్యక్రమాలు చేసుకొంటాడు. గది పైన ఒక సోలార్ పానెల్, గదిలో సోలార్ సిస్టం ఉన్నది, రాత్రిల్లు అదే అతనికి విద్యుత్త్. లోపల చలిని కాచుకోవడానికి అక్కడి ప్రాంతపు చిమ్నిని "బుకారి" అని పిలుస్తారు, అది ఏర్పాటు చేసుకొని వున్నాడు. అతని గది పక్కనే మరొక పెద్ద గది ఉన్నది మాలా వచ్చే పోయే ట్రెక్కర్స్, పోర్టర్స్ విడిది చేయడానికి నిర్మించింది. అతన్ని అక్కడికొచ్చే యాత్రికులు..మిగతా ఆ ప్రాంతపు వారు  "మేమే పుల్లు" అని పిలుస్తున్నారు, అక్కడి భాషలో "తాతయ్య" అని అర్థం. మేము కూడ అతన్ని మేమే అని పిలువడం మొదలెట్టాము. వేసవి కాలంలో అక్కడి కొండల మీద పంటలు పండిస్తాడట. కేవలం అతనొక్కడే అలాంటి నిర్మాణుష ప్రాంతంలో నివసించడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది...అదీను 80 ఏళ్ళ ముసలితనంలో వంటా వార్పుతోబాటు తన పనులు తనే చేసుకొంటూ..!!  అప్పుడప్పుడు మాలాగా వచ్చేపోయే మనుషులు తప్ప అక్కడ మరో జీవి కనపడదు. చలి ప్రదేశంలో జీవనం వలన అతని చేతి వ్రేళ్ళు దాదాపుగా వంకరులు తిరిగి స్పర్శ కోల్పోయి చాలా గట్టిపడి వున్నాయి.


      రెండు రోజుల విశ్రాంతి తర్వాత ఏడవరోజు ఉదయమే అందరం తిరుగు ప్రయాణం ప్రారంభించాము,  నా శరీరానికి ఎటువంటి సమస్య రాలేదుగాని నా చేతి వ్రేళ్ళకే భరించలేనంతగా చలి తాకిడి ఎక్కువైయ్యింది. పూర్తిగా స్పర్శ కోల్పేయి ఐస్ గడ్డలా మారాయి. బాబోయి ఆ అనుభవం తలుచుకుంటే ఇప్పటికీ..విచిత్రంగానే ఉంది నాకు. అప్పటికీ మాతో ఉన్న వంట మనిషి రాథోడ్  " చేతి వ్రేళ్ళను ముడుచుకోంటూ..తెరుస్తూ కాస్తా ఎక్సర్‌సైజ్ చేయండి " అని చెబుతూనే వున్నాడు..అలా చేసినా కూడ  ప్రయోజనం లేకుండా వున్నది..! ట్రెక్‌కి వచ్చే ముందు నేను మొండితనంతో చేసిన ఒక చిన్న తిక్క పని వలన నాకీ బాదలు తప్ప లేదు.  చేతికి వులన్ గ్లౌజస్, లీస్ గ్లౌజస్ వున్నాయి కాని "వెదర్ ప్రూఫ్ గ్లౌజస్" ఖచ్చితంగా ఉండాలట. షాపింగ్ సమయంలో ఒకరిద్దరికి దొరికాయి కాని నాకొక్కడికే అవి దొరకలేదు.."ఆ... ఏమయితే అదయ్యిందిలే చూద్దాం" అని మొండిగా బయలుదేరాను..! దాని పలితం అనుభవించాను కూడ...ప్చ్ తప్పలేదు.  ఇక మా తిరుగు ప్రయాణంలో లేహ్‌ నుండి వొస్తున్న స్త్రీలు, పిల్లలు, వృద్దులు, గ్రామాల ప్రజలు ఎదురౌతున్నారు. మూడు నెలలు గడిచిపోయాయి..ఇక చదార్ మెల్లి మెల్లిగా కరుగ వచ్చు ఆలోపలే తమ గ్రామాలకు చేరాలి. అక్కడక్కడ గుంపులు గుంపులుగా ప్రయాణం సాగిస్తున్నారు.
      తిరుగు ప్రయాణంలో చాలా తొందరగా తిలాత్‌కి చేరుకొన్నాము. వచ్చిన దారి కావడంతో వేగంగా నాలుగు రోజులు నడవాల్సిన దూరాన్ని కేవలం రెండు రోజుల్లోనే గమ్యానికి చేరుకొన్నాము. అయితే చివరి రోజు ప్రయాణంలో నేను, స్వప్నిల్ వెనుక పడిపోయాము అందు కారణం అప్పటికే గణేష్ ప్రసాద్‌ ఐస్ నేల మీద చాలా సార్లు జారి కింద పడడం మూలాన అతని వెన్నుముక నడవనీయకుండా చేసింది..దానితో అతన్ని స్లెడ్జ్‌ మీద కూర్చోనిచ్చి చాలా వేగంగా లాక్కెళ్ళుతూ తీసుకెళ్ళడంతో అందరు వెళ్ళిపోయారు. ఒక గంటలో చివరి మజలీ చేరుకొంటాము అని అనుకొంటుండగా  ఒక ప్రాంతం వద్ద మంచుతో కప్పబడి ఉండాల్సిన చాదర్  చాలా స్మూత్ సర్ఫేస్‌తో ఉన్నది..అది కూడ చదునుగా లేదు చాలా చోట్ల ఏటవాలుగా అటు ఇటు వంగి వున్నాయి. అలా ఏటువాలుగా ఉన్న ప్రాంతంలో నడక చాలా కష్టం.. ఖచ్చితంగా జారి పడతారు..! చాలా జాగ్రత్తగా నడుస్తున్నాను నేను, ఒక యాబై అడుగులు వేసాక "టక..టక.." మంటు శబ్దాలు వొస్తున్నాయి ఐస్ చాదర్ నుండి..అవి వినగానే నా కాళ్ళు ముందుకు అడుగులు వేయడం ఆపేసాయి..నిదానంగా మరో అడుగు వేసాను...మళ్ళీ ఐస్ సర్ఫేస్ పగులుతున్నట్లుగా అవే శబ్దాలు ..నా వల్ల కాలేదు..వెంటనే వెనక్కు తిరిగి వచ్చాను..వెనుక వొస్తున్న స్వప్నిల్ విషయం ఏమిటి అంటు చూసాడు నా వైపు..చెప్పాను శబ్దాల గురించి. అతను ప్రయత్నించాడు... అలానే శబ్దాలు వొస్తున్నవి. మా గుంపు వాళ్ళు కనపడతారా అని కనుచూపు మేర ముందుకు చూసాము..ప్చ్ ఎవరు కనపడట్లేదు..పోనీ వెనుక ఎవరన్న ట్రెక్కర్స్ వొస్తున్నారా అని చూసాము ఊహ ఎవరు లేరు!  దారి చూపడానికి ఎవరు లేరు..ఏ దారిలో నడిస్తే సురిక్షితమో అర్థమే కావట్లేదు..! కాసేపు ఆలోచించాక కోండ అంచుల వైపుకు నడచి..అక్కడనుండి అంచుల వెంబడి నడుస్తూ ముందుకు సాగాము. అలా కష్టపడుతూ ఒక గంటకు..గమ్యం చేరుకొన్నాము.

      ఈ ట్రెక్‌ సందర్బంగా రాత్రిల్లు డైనింగ్ టెంట్‌‌లో భోజనాలు కోసం రెండు గంటలు అక్కడే గడపడం ఒక మంచి అనుభూతినిచ్చింది. ఆ సమయంలోనే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం..ప్రతి రోజు ఏదో ఒక "విషయం" మీద చర్చించడం జరిగేది. ఆ చర్చల వలన నాలాంటి వారికి చాలా ఉపయోగం. అందరూ భిన్న ప్రాంతాల నుండి, విభిన్న సంస్కృతుల నుండి వచ్చిన వారు..! ఒక్కొక్కరి జీవినవిధానం ఒక్కోరకంగా ఉండేది అవన్ని మా చర్చల్లో ఒక భాగం..! అలా ఇటలీ ట్రెక్కర్ అయిన "ఆల్‌బెర్టో" తమ ఇటలీ గురించి చాలా విషయాలు చెప్పాడు. అసలు ఇటలీ అనగానే నాకు గుర్తొచ్చే విషయం అక్కడి  " మాఫియా ". ఆ విషయాన్నే అడగగా..! అక్కడి "మాఫియా" సామ్రాజ్యం గురించి చాలా విషయాలు తెలియజేసాడు. ఆ విషయాలు విన్నాక అర్థమయ్యింది.. అక్కడి నుండి " THE GOD FATHER "  అనే ఒక అద్భుతమైన సినిమా ఎందుకు వచ్చిందన్న సంగతి. అతని ఆంగ్ల ఉచ్చారణ మాత్రం బలే తమాషాగా ఉండేది. ప్రతి పదం చివర్లో "తో" అక్షరంతో..  అంటే తొకారం అన్నమాట.. అలా ముగిసేది..! అతనితో మాట్లాడే సందర్బంలో నేను కూడ అలా పదం చివర్లో "త" అక్షరంతో ముగిస్తూ మాట్లాడేవాడిని.

  మరసటి రోజు మద్యాహ్నానికి లేహ్‌కి చేరుకొన్నాము. అంటే రెండు రోజుల ముందే మా ట్రెక్ ముగిసింది. ఆ మిగిలిన రెండు రోజులు ప్యాంగాక్ లేక్..మిగతా ప్రాంతాలు తిరిగి వొద్దామని ఆశపడిన మాకు మంచు వర్షం.. మా ఆశల మీద మంచు (నీళ్ళు) చల్లింది..ఏమి చేస్తాం ఆ రెండు రోజులు హోటల్ దాటి బయటకు అడుగు పెట్టలేకపోయాము. రెండు రోజుల తర్వాత డిల్లీ..అక్కడి నుండి తిరిగి రైలులో హైదరాబాద్‌కి చేరుకొన్నాను... అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే..తిరిగొచ్చిన నాకు మన వాతావరణానికి అలవాటు పడడానికి దాదాపుగ రెండు వారాలు సమయం పట్టింది.. అయినా కూడ నా చేతి మునివ్రేళ్ళుకు స్పర్శ రావడానికి నెల రోజులు సమయం తీసుకొంది.

  ఈ ట్రెక్ నాకో మంచి అనుభూతిని..మరిన్ని కొత్త విషయాలను, కొత్త మిత్రులను..మానసిక దృడత్వాన్ని ఇచ్చింది. అంతే కాదు రక రకాల అక్కడి మనుషుల జీవన విధానం, సంస్కృతి, వారి తత్వం తెలుసుకోవడం మరొక అదనపు ఆభరణం.

ఆల్‌బెర్టొ తన హాట్‌షాట్ కెమెరాతో ఒక చిన్న వీడియో షూట్ చేసారు..ఆ లింక్ కూడ ఇస్తున్నాను
http://www.youtube.com/watch?v=YI7aAXcOCTM&feature=related

ఇక్కడి  నా బ్లాగ‌లోని ఫోటోస్‌ని కొందరు ఉత్తర భారతీయ మిత్రులు చూసాక నాకు మరి కొన్ని వీడియో లింక్స్ పంపారు వాటిని నేను ఇక్కడ మళ్ళి అప్‌డేట్ చేస్తున్నాను. మాలాగే నిరుడు సంవత్సరం వెళ్ళిన ఒక బృందం వారు తీసిన వీడియో ఇది..!!
http://www.youtube.com/watch?v=GoB6LbN-UCY

అలానే  ఈ జన్‌స్కార్ నది వేసవిలో పూర్తిగా నీరుతో ఉన్నప్పుడు అక్కడ సాహస యాత్రికులు వాటర్ రాఫ్టింగ్ చేస్తారు ఆ వీడియోని కూడ గమనించండి..మేము నడిచిన నది అది..కాని వేసవిలో దాని రూపాంతరం మారాక అందులో మరో రకపు సాహస యాత్ర అన్నమాట
http://www.youtube.com/watch?NR=1&feature=endscreen&v=yLswRCsmCqw

మరి కొన్ని ఫోటోస్ ............
About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers