.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

     బద్వేలు నించి తన అంతరంగిక అనుయాయి కొండన్న
 " అన్నా!  పదిరోజుల్నించి శివపురి రమణారెడ్డి జీపు ఒక్కటే తిరుగుతావుంది. దాంట్లో కూడా ఐదుమందికి మించిలేరు.. "
  విషయమేమిటో అర్థం కాలేదు చెన్నారెడ్డికి.  " అసలు సంగతేందో చెప్పారా ? "
  " నువ్వీడ సరిగ్గా వుండడం లేదుగదా !  వాల్లు గూడా ఎవురూరికి వాల్లు పోయినట్టుంది. "
 " అన్నదమ్మలయినా వుంటారు గదబ్బీ ! "
 " సగం మంది కనపల్లే.. నాకండ్లతో జూసినా.. ఇయ్యాలయితే వాడూ, బాలుడూ, ఎవురో యిద్దరు.. జీపంతా నలుగురే. రేత్రి గూడ కొందరు వూర్లకు పోయినారంట.. వాడిప్పుడు వొంటరి గాడయిండన్నా !  ఇదే సమయం.. వాన్ని బేస్తే పోలేదా ! "
 ఒక్క నిమిషం మౌనంగా వుండిపోయాడు చెన్నారెడ్డి.
 అతనికి ఏమి పాలుపోలేదు.
 " కుంట మాసులకు ఫోన్ జేసి చెప్పన్నా !  నువ్వు చెబుతేగాని వాల్లు కదలరు. మిగతాదంతా నేన్జూసుకుంటా. రేపు పొద్దుగుంకే యాలకు వాన్ని బద్దేలి చెరువు కట్టకు బలిస్తా.. నువ్వు మాకు అందుబాటులో వుండన్నా ! "  చెప్పాడు అవతల్నించి.
  " సరే.. సరే.. జాగ్రత్త.."
  అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడు.
 గుండెల్లో సన్నని కంపన మొదలయింది చెన్నారెడ్డికి.
 కోఠి...  వస్తువులు.. ప్రియురాలు.. భోజనమూ - అన్నిటినీ మరచిపోయాడు కొంతసేపు.
 కుంటకు ఫోన్ చేశాడు.
 తనకు కావలసిన వ్యక్తి దొరికాడు.
 అతనికి అన్ని విషయాలు చెప్పాడు.
  కొంత టెన్షన్‌గా వుంది చెన్నారెడ్డికి.
 శత్రువును లేపేందుకు మంచి  ఛాన్స్ దొరికింది. తనవాడు పటిష్టమైన వ్యూహంతో పని సాధిస్తాడో లేదోనని అనుమానం.
 కొండన్న మంచి వ్యూహాలు పన్నగలడు. నమ్మకంగా పని చేయగలడు, ఉత్సాహం వుంది. స్వామి భక్తి వుంది... కానీ వ్యూహాలు పన్నినంత పకడ్బందీగా ప్రణాళికను తుదకంటూ నిర్వహించలేడు.
  ఆ విషయాన్ని ఒకటి రెండు సార్లు తను గమనించాడు.
  గోపవరం నించి బద్వేలుకు వచ్చే దారిలో అప్పోజిషన్ వాన్ని ఒకన్ని నరికినపుడు, గొడవలకు సంబంధించిన వాడు కాదనే వుద్దేశ్యంతో పక్కనే వున్న వ్యక్తిని వదిలేశాడు.  తర్వాత వాడు సాక్షిగా మారేసరికి ఆ కేసునించి తప్పించుకోవటానికి ఎన్నో అగచాట్లు పడవలసి వచ్చింది.
  ఇట్లాంటి విషయాల్లో కేవలం మేధావితనమే గాదు - కొంత మూర్ఖత్వం కూడా అవసరమే. గుండె ధైర్యం ఒక్కటే గాదు - కొంత కరకుదనం కూడా వుండాలి. అడవికి అగ్గి బెడితే ఎండు కర్రతోటి పచ్చ కర్ర కూడా కాలుతుంది.. సమదృష్టితో చూసే కసాయితనం కూడా వుండాలి.
 ఈ గుణాలేవి కొండన్నకు లేవు.
 వానికి మరొకర్ని తోడుంచాలి.
 ఎవరైతే సరిపోగలరు..?
  చాలా సేపు ఆలోచించాడు.
 గతంలో అయితే తనే సూచనలిచ్చి నడిపించేవాడు.
 ఇప్పుడెట్లా ?
 అతని దృష్టి తాలుకా సాంతం గిరగిర తిరుగుతూ వెదకింది.
 చివరకు అతని దృష్టిలో ఒకే ఒక వ్యక్తి నిలిచాడు.
భీమునిపల్లె పెంచలయ్య...  ఇట్టాంటి విషయాల్లో ఘటికుడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చేసే రకం. కాని పెంచలయ్యకు ఫోన్ సౌకర్యంలేదు సమాచారం ఎలా అందజేయాలి..?  తన చిన్నకొడుకు హర్ష ద్వార సమాచారం  అందించాలి.... తప్పదు వాన్ని పంపాల్సిందే.
 భార్యకు తెలీకుండా వాడికి విషయం చెప్పి సమాచారం అప్పజెప్పే భాద్యత అప్పగించాలి.
  వీలైతే రాత్రికే తను ప్రయాణమై పోవాలి.
 ఇంటికి ఫోన్ పెట్టాడు.
 సులభంగానే లైన్ దొరికింది.
 అవతల ఫోన్ ఎత్తిన చప్పుడు.
 గొంతు వినగానే మరేమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు.
 పది నిమిషాల తర్వాత మళ్లీ ప్రయత్నించాడు.
 తిరిగి ఆమె గొంతే.
 అసహనంగా కుర్చీలో కూలబడ్డాడు.
 అంత టెన్షన్ లోనూ తన ప్రేయసి గుర్తొచ్చింది.
 ఎదురు చూస్తుంటుందేమో !
 తనక్కడికి వెళ్లే  ఛాన్స్ లేదు.
 ఫోన్ చేసి చెప్పాడు ఆమెకు.
 అవతల్నించి అంతులేని నిరాశతో తడిసిన స్వరం.
 ఆమెను బుజ్జగించేందుకు ప్రయత్నించాడు.
  ఆ సమయానికి రాఘవ తన బైకు మీద వెళ్లి ఆమె ఇళ్లున్న సందు మొగదల మాటేసి వున్నాడు.
 వేట కొడవలి నొకదాన్ని సీటుపక్క లాఘవంగా అమర్చుకొని వున్నాడు.
 చెన్నారెడ్డి కోసం ఓపిగ్గా ఎదురు చూస్తున్నాడు.
 శివపురి నుంచి ఉదయమే దిగిన చెన్నకేశవ వగైరాలు ఎమ్మెల్లేను చంపేందుకు అద్భుతమైన వ్యూహాన్నొకదాన్ని పట్టుకొచ్చామంటూ హంగామా చేస్తున్నారు.
 తను వాటిని విన్పించుకోదల్చలేదు.
  ఇట్లా హంగామా చేసిన ప్రతిసారీ అపజయం తప్ప మరొకటి మిగలటం లేదు. ఇప్పుడు కూడా ఫలితం అదే..  సందేహం లేదు.
  పథకాన్ని వాళ్లు రేపు అమలు చేయబోతున్నారు.
 తను యీ రాత్రికే చెన్నారెడ్డి తల నరికి వాళ్లకు కానుకగా ఇవ్వబోతున్నాడు.  వాళ్లెవరూ చేయలేని పనిని తను చేయబోతున్నాడు.
 ఆలోచిస్తూ వున్నాడు అతను.
 అప్పటికి సమయం తొమ్మిది గంటలు దాటుతూ వుంది.
 ఆ టయానికి చెన్నారెడ్డి తన కుర్చీలో అసహనంగా కదలుతున్నాడు. మరొక్క సారి హర్ష కోసం ప్రయత్నిద్దామని రిసీవర్ మీద చేయిబోతోండగా ఫోన్ మోగింది.
 రిసీవర్ ఎత్తాడు.
 బద్వేలు నించి కొండన్న.
 " అన్నా !  అన్నా ! మన అదృష్టం పండింది.."
  " ఏమబ్బీ ! "
 " వాని తమ్ముండ్లు హైదరాబాద్ వస్చాండారని సమాచారం. నంద్యాల కొచ్చి ట్రైనెక్కినారంట. ఎవురో చుట్టాలింటికంట. గంపెడు మామిడి పండ్లు గూడా ఎత్తకపోయినారని వినికిడి.. ఇంటికాడ వాడొక్కడే వుండాడంట.."
  " హైదరాబాదా ? "
 " అవ్వన్నా ! హైదరాబాదే...... న్నోవ్ ! వాల్లు తిరిగి ఇంటికి రాగూడదు.. తెల్సిందా ! "
  " సరే సరే !  ఇక్కడి సంగతి నాకొదిలేయండి. ఇప్పుడే బాబు ద్వారా పెంచలయ్యకి సెబుతా ఇద్దరూ కలిసి శివపురోన్ని ముగించండి. "  చెప్పాడు.
  ఫోన్ పెట్టింతర్వాత శరీరం నిండా అంతులేని ఉత్సాహాన్ని తెచ్చుకొన్నాడు చెన్నారెడ్డి.
 సిటిలో రాటుదేలిన కసాయి గుండాల ముఠాల్ని కొన్నింటిని గుర్తు జేసికొని డైరిలోని వాళ్ల నంబర్ తీసి నోట్ చేసికొని ఫోన్ చేశాడు.
 " హలో నేను... కడప చెన్నారెడ్డిని.. "
 వెంటనే అవతలి గొంతులో వినమ్రత  " నమస్తే అన్నా ! "
  " నీతో పనిబడింది వీరూ ! "
 " సెప్పన్నా ! "
 " ఇక్కడకురా - చెబుతా.. "
  పదినిమిషాల్లో వచ్చాడు వీరూ.  " నమస్తే అన్నా !  ఎంతకాలంనుంచో అనుకుంటున్నా నీ పని ఒక్కటన్న సేసి పెట్టాలని చెప్పన్నా ! "
  విషయమంతా అతనికి చెప్పాడు.
 శివపురి మనుషుల్ని చూపించేందుకు సిటిలోనే వున్న తన వాళ్లను ఇద్దర్ని పిలిపించాడు.
 వాళ్లను వీరూకి అప్పగించాడు.
 ట్రైన్ టైం చెప్పాడు.
 వాళ్లు వెళ్లింతర్వాత గుర్తొచ్చింది కొడుక్కు ఫోన్ చేయలేదని.
 వెంటనే ఆ పనిమీద కెళ్లాడు.
 కొంత ఆలస్యంగానే అయినా యీ సారి భార్య గొంతు విన్పించలేదు.
 అన్ని విషయాలూ వివరంగా చెప్పాడు హర్షకు.
  తమను పట్టి పీడిస్తూ వున్న సమస్యను పరిష్కరించకొనేందుకు చక్కటి అవకాశం దొరికిందనీ, దీన్నిప్పుడు సద్వినియోగం చేసికొంటే తాలుకాలో తిరుగు వుండదనీ చెప్పాడు.  దీన్ని జీవన్మరణ సమస్యగా భావించి అన్ని శక్తి యుక్తుల్ని పూర్తిగా వినియోగించి పని పూర్తి చేయమనీ, ఏ మాత్రం నిర్లక్ష్య పెట్ట వద్దనీ హెచ్చరించాడు.

                                                     ********

   జీపు నేరుగా ముగ్గిపిండి గనివద్దకు వెళ్లి ఆగింది.
 అందులోంచి బాలుడు, రమణారెడ్డి వగైరాలు దిగారు.
 పరిసరాల్ని నిశితంగా పరిశీలిస్తూ నేల మీద ఏదో వెదుకుతున్నాడు. బాలుడు.  భూమిలోంచి బైటకొచ్చిన గుడ్డపీలిక, కంపచెట్టు, బోటి రాయి వగైరాలు వద్ద అతను సూచిస్తోంటే మిగిలిన వాళ్లు జాగ్రత్తగా తవ్వి ప్లాస్టిక్ బక్కెట్లను బైటకు తీస్తున్నారు.
 అన్ని బక్కెట్లను ఒక చోటుంచి పై పొట్టును తొలగించి వరసగా పేర్చి వున్న బాంబుల్లోంచి ఏదో ఒకటి ఎన్నుకొని పరీక్షించాడు బాలుడు.
 ఒకటి రెండు బక్కెట్లు మినహా అన్ని బక్కెట్లోని బాంబులూ నాణ్యంగా పేలాయి. గని ప్రాంతాన్నంతా దద్దరిల్ల జేశాయి.
 బక్కెట్లోంచి పాతిక బాంబుల్ని ఏరి మిగిలిన వాటిని యధా ప్రకారం భూమిలో పూడ్చి పెట్టారు.
 జీపులోంచి గంపను కిందకు దించి అందులోని పొట్టును నేలమీద పోశాడు బాలుడు. తర్వాత పొట్టును గంపలో పోయటం, ఓ వరస బాంబుల్ని పేర్చటం, మళ్లీ పొట్టు పోయటం, తిరిగి బాంబుల్ని పేర్చటం, వరసకు వరసకూ బాంబుకు బాంబుకు మద్య దండిగా వరిపొట్టు వుండేలా జాగ్రత్త పడ్డాడు.  గంపలో ఇంకా ఖాళీ వుంది. దానికి గుడ్డ కట్టి జీపుకెత్తారు.
  బాంబుల గంప తెల్లారే సరికి హైదరాబాదులో వుండాలి.
  దాన్ని ఇలాగే జీపులో తీసికెళ్లటం కష్టం. ఎక్కడంటే అక్కడ పోలీసు చెకింగ్‌లుంటాయి. నంద్యాల వరకు జీపులో పట్టుకెళ్లి అక్కడ ట్రైన్ ఎక్కిస్తే పని సులభంగా జరిగిపోతుంది.
  బాంబుల గంప వెంట బాలుడు, చంద్ర, వాసులు వెళ్లాలని నిర్ణయం జరిగిపోయింది.
  సాయింత్రంగా పోరుమామిళ్ల వెళ్లి ఓ వంద మామిడి పళ్లను తెచ్చారు. వాటిల్లో కొన్నింటిని రెండువరసలుగా గంపలో పేర్చి పైన గుడ్డ కట్టారు.
  రాత్రి బాలుడు, చంద్ర, వాసులతో జీపు నంద్యాలకు బైల్దేరింది.
 మామూలు వేగంతో వెళ్లినా రైలు వచ్చే సమయానికంటే అర్థగంట ముందే స్టేషన్ చేరుకోగలరు.
 చేయబోయే పనిని గురించి వూహించుకొంటున్నారు.
 కొంత ఉద్విగ్నతకు గురవుతున్నారు.
 జీపు వేగంగా వెళుతూ వుంది.
 మరో ఇరువై కిలోమీటర్ల ప్రయాణం చేస్తే నంద్యాల వస్తుంది.
 అక్కడ ట్రాఫిక్ బందయివుంది.
 ఏదో యాక్సిడెంటు జరిగిందట.  జనం గుంపయ్యారు. వాహనాన్ని నిలేశారు.  వెనక ముందు వాహనాలతో రోడ్డంతా నిండిపోయింది.
 వాహనాల వరస దండిగానే వుంది.
వెనక్కి వెళ్లేందుకు మరో దారిలేదు.
 ట్రాఫిక్ సమస్య ఎప్పుడు క్లియరవుతుందో తెలీదు.
 ’ అర్ధ గంట లోపల క్లియర్ కాదా ! ’  అనే ధీమా
  మరో వైపు ట్రైన్ మిస్సవుతుందనే భయం.
  పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసేసరికి ఖచ్చితంగా అర్ధగంట సమయం పట్టింది.
  ఆగమేఘాల మీద నంద్యాల రైల్వేస్టేషన్ చేరుకొంది బాలుని జీపు.
 ఆదరాబాదరా స్టేషన్‌ లోకి నడిచారు.
 ఐదునిమిషాల క్రితమే ట్రైన్ వెళ్లిపోయిందట.
  దిక్కు తోచలేదు వాళ్లకు.
 తల పట్టుకొన్నారు కొంత సేపు.
 వెంటనే బస్ రూట్ పైకి తీసికెళ్లారు జీపుని.
  ఏదైనా లారీలో వెళ్లాలని వాళ్ల ఆలోచన.
 అర్థగంట సేపు ప్రయత్నిస్తేగాని లారీ ఆపలేదు.
 సవాలక్ష ప్రశ్నలడిగి కాని డ్రైవర్ వాళ్లను ఎక్కించుకోలేదు.
 ’అమ్మయ్య ’ అంటూ గుండెనిండా గాలి పీల్చుకొని వదిలారు ముగ్గురూ.
 జీపు వెనక్కి వెళ్లింది.
 లారీ టౌన్ లిమిట్స్ దాటింతర్వాత ఓ డాబా వద్ద ఆగింది.
 " ఏం సర్ !  భోంచేయరా ? "  లారి దిగి డాబాలోకి వెళుతూ అడిగాడు డ్రైవర్  " మందు కూడా దొరుకుద్ది "  చెప్పాడు.
  రెండు నిమిషాల తర్వాత వాసు కిందకు దిగాడు.
 డ్రైవర్ వెంట డాబాలోకి వెళ్లి మందు, నంజుళ్లు, వాటర్ బాటిల్స్ తీసుకొని లారీ క్యాబిన్ పైకి ఎక్కాడు.
  అక్కడ కూచుని ముగ్గురూ మందు కార్యక్రమాన్ని పూర్తి జేశారు.
 వాతావరణం ఆహ్లాదకరంగా వుంది.
 కడుపులోకి నిషా ఎక్కేసరికి మంచి హుషారొచ్చింది.
 లారీ కదలి వెళుతోంటే దాని రొదకంటే వాళ్లు పాడే పాటల సంగీతపు మోత ఎక్కువైంది.
 ఎవ్వరూ నిద్ర పోదల్చుకోలెదు.
 ఒకరు మార్చి మరొకరు పాటలు పాడుతూనే వున్నారు.
 మద్య మద్యన డ్రైవర్‌ను హెచ్చరిస్తున్నారు.
 కర్నూలు వచ్చింది.
 అక్కడో చాయ్ తాగి మళ్లీ కదిలింది లారీ.
 ఓ అర్ధ గంట ప్రయాణించి వుంటుంది.
 ఉన్నట్టుండి ’తుస్ ’ మనే శబ్దమూ, దానితోటి సైడులాగుతూ రోడ్డునించి పొలాల్లోకి వెళ్లాలనే లారీ ప్రయత్నమూ.
 బలంగా బ్రేకు తొక్కి లారీని ఆపాడు డ్రైవర్
 ఎడమ వైపు ఫ్రంట్ వీల్ పంచరయ్యింది.
 ’ఎంతసేపు ?  పదినిమిషాలేగదా టైర్ మార్చేందుకు ! ’ అనుకొన్నారు క్యాబిన్ పైన్నించి.
 " గోవిందా గోవింద ! "  అంటూ రెండు చేతుల్ని గాల్లో కెత్తి లారీ ఎక్కాడు డ్రైవర్.  " పండుకోండి సార్ ! పొద్దున్నే పోదాం "  అన్నాడు వాళ్లకేసి తిరిగి.
 " ఏం ? స్టెఫ్నీ లేదా.."
  " ఉంది.. ఉంటే ?  యీ జామున ఎవురు మారుస్తారు సారూ ! "
 " అర్జంటు పని.. మేం సాయం జేస్తాం..  రొవ్వంతా సేపే గదా ! టైరు మార్చుకొని పోదాం పాన్నా ! "  వాసు అన్నాడు.
 " ఇదిగో ఇట్లా మాట్లాడ్తారనే నాలారీలో ఎవుర్నీ ఎక్కించుకోను ఏదో.. మీరు బంగపడ్తాంటే కాదననందుకు యిదొక గూటమా నాకు... పండుకోండి.. పండుకోండహే.. "  చెబుతూ క్యాబిన్‌లో దూరాడు.  " నేను ముందే ఖర్మ నాకొడుకును.. నాకన్న తలమాసిన్నాయాండ్లు మీరు.. "  లోపల్నించి గొణుక్కొంటున్నాడు.
  వాళ్లెంత బతిమాలినా డ్రైవర్ వినుకోలేదు.
 అతను కూడా కైపు మీదున్నాడు.
  వాళ్లు డిమాండ్ చేసే కొద్దీ అతను మండి పడుతున్నాడు.
 " ఏం నాకొడుకువురా నువ్వు ! తాగుడుబోతు నాకొడకా ! పచ్చి సరుకొరే యిది. ఓనర్ నాశనమైతాడురా.. "  వాసు అన్నాడు.
 ఆ మాటలు డ్రైవర్ తలకెక్కలేదు.
 " ఇట్లా కాదుగానీ.. "  అంటూ బాంబుల గంపకు కట్టిన గుడ్డను కొద్దిగా తొలగించి లోపల్లికి చెయ్యి జొనిపి ఓ బాంబును బైటకు లాగాడు చంద్ర.  " అన్నా !  దీంతో బేస్తా నాకొడుకును.. కైపు దిగి పోతాది "  అన్నాడు అబ్బిళ్లు కొరుకుతూ.
 వెంటనే అతని చేయి పట్టుకొన్నాడు బాలుడు.  " తప్పు నీది గాదురా !.. కైపు అట్లాంటిది.."  అంటూ అతని చేతిలోని బాంబును సున్నితంగా లాక్కొని గంపలో యధాప్రకారంగా వుంచి గుడ్డ కట్టాడు.
  డ్రైవర్ క్యాబిన్‌లోంచి దిగేట్టు లేడు.
 మరొక వెహికల్‌ను పట్టుకొని వెళ్లాలి.
 తెల్లారే సరికి ఖచ్చితంగా హైదరాబాద్ చేరాలి.
 గంపను దిందకు దించారు.
 ఏదో వెహికల్ వస్తోంది.
 ’ఏదన్నా కానీ.....’  చెయెత్తారు.
 దగ్గరగా వచ్చి ఆగింది.. బస్సు
  గంపను బస్సుకెత్తారు.
 " మామిడి పండ్లన్నా ! హైదరాబాదులో చుట్టాలకు.. "  అంటూ గంపను జాగ్రత్తగా ఓ చోటుంచి దాన్ని గమనిస్తూ కూచున్నారు.
 కంటి మీద కునుకు రాలేదు వాళ్లకు.
  పొరబాటున నిద్రమబ్బుతో ఎవడైనా గంపలో కాలుబెడతాడేమోనని భయం. నిద్ర లేకుంటే లేకపోయింది బస్సయినా ట్రబులివ్వకుండా పోతే అదే పదివేలనుకొన్నారు.
  వాళ్ల ఆశల్ని వమ్ముచేస్తూ సిటీకి ఇరువై కిలోమీటర్ల ఇవతల ఆగిపోయింది బస్సు.
  ఇంజన్లో ఏదో ట్రబులట.
 గంప కిందకు దించి అటుగా వెల్తోన్న ఆటోను ఆపారు.
 " మామిడి పండ్ల గంప, ముగ్గురం మనుషులం "  చెప్పాడు బాలుడు.
 బేరమాడి ఆటో ఎక్కారు.

                                                          ******************

  రాత్రంతా సరిగ్గా నిద్రబట్టలేదు చెన్నారెడ్డికి.
 ఇంట్లాంటి ఎన్ని కేసుల్ని తను అలవోకగా నిర్వహించాడనీ ! ఏమాత్రం టెన్షన్ లేకుండా రాత్రంతా హాయిగా నిద్రబోయి ఉదయం లేచి ఉపహారం తీసుకొన్నంత సులభంగా చేయించాడు.
  ఇప్పుడెందుకో - ఎంత అనచుకొందామనుకొన్నా ఆగని గుండె దడ... మరచిపోదామన్నా వీలు కాని టెన్షన్.
  మొట్ట మొదటి మర్డర్ చేయబోతోన్న వాడికి వున్నంత టెన్షన్.
  తను పడుకొంటే వీరూ నించి గానీ, హర్షనించిగానీ ఫోనొస్తుందేమో ! తన సహాయం ఏదైనా అవసరమవుతుందేమో !
  కుర్చీ మీద కూచుంటే ఎప్పుడో తనకు తెలీకుండానే వచ్చి కమ్ముకునే నిద్ర.... పదినిమిషాలు కూడా గడవక ముందే ఉలిక్కిపడి లేచి పచార్లు చేయటం..  తెల్లార్లూ అదే అవస్థ...
  తెల్లారింది... ట్రైన్ టైమైంది..
  వీరునించి వచ్చే పోన్ కాల్ కోసం క్షణమొక యుగమైంది.
 మనస్సంతా ఉద్విగ్నంగా వుంది.
 పదిహేను నిమిషాల టెన్షన్ తర్వాత ఫోన్ మోగింది.
 వీరూ నించి ఫోన్
  శివపురి వాళ్లెవరూ ట్రైన్‌లో రాలేదుట.
 ఆశ్చర్యంగా వుంది చెన్నారెడ్డికి..   నమ్మలేకున్నాడు.
 వీరూ వద్ద వున్న తన మనషులతో మాట్లాడాడు.
 ట్రైనంతా గాలించి చూసినా కన్పించలేదుట.
  షడన్‌గా అతనికో అనుమానం వచ్చింది.
 ట్రైన్ మిస్సవటం వలన ఏదైనా బస్ పట్టుకొచ్చారేమో !
 తక్షణం తన అనుమానాన్ని వీరూ ముందుంచాడు.
 మరుక్షణమే ఫోన్ పెట్టేశాడు వీరూ.
  అతని సామర్థ్యం చెన్నారెడ్డికి బాగా వినికిడే.
  నిమిషం సమయాన్ని కూడా వృధా చేయడు.
 బస్టాండ్ వెళ్లి వుంటాడు.
 ’ శివపురి నాయాళ్లు కనబడితే సాలు..  అర్థగంటలో వాల్ల తలకాయలు తన కాళ్లకాడుంటాయి..! ’
  వీరూ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నాడు.
  పదిహేను..ఇరువై.. ఇరువై ఐదు నిమిషాలు.. క్షణం క్షణం ఎదురు చూపులు.. వీరూ ఫోన్ కోసం... నిరీక్షణాలు...
  ఫోన్ మోగింది.  హర్ష నించి..
 కుంట మనుషులు, భీమునిపల్లె పెంచలయ్య వచ్చారుట. శివపురి మీదకే వెల్దామంటున్నారుట.
  వద్దని చెప్పాడు చెన్నారెడ్డి.
 శివపురినుంచి పోరుమామిళ్ల దాకా రెండు మూడు చోట్ల దారులు కాయమని చెప్పాడు.  అన్నిచోట్ల తప్పించుకొన్నా బద్వేలులో మాత్రం గురి తప్పకూడదు.
  కుంట మనుషుల వద్ద నాటు తుపాకులున్నాయనీ, అవసరమైతే ఉపయోగించమని చెప్పాడు పెంచలయ్యతో.
 మాట్లాడి ఫోన్ పెట్టేయగానే వెంటనే మళ్లీ రింగయింది.
 వీరూ మనుషులనించి ఫోన్
 బస్సుల్లోంచి కూడా దిగలేదుట శివపురి వాళ్లు.
 తను చాలా డిసప్పాయింట్ అవుతున్నానని చెప్పాడు వీరూ. రెడ్డిగారి పనిని అత్యంత సమర్థవంతంగా జరిపి ఆయన మెప్పుపొందాలని కోరికగా వుండేదట.
 చెన్నారెడ్డి కూడా నీరసపడ్డాడు.
  శివపురి సోదరులు నగరానికి రావటమంటే తన బోనులోకి అడుగు పెట్టటమేననీ, వాళ్ల మెడ సులభంగా కొరికేద్దామనీ అనుకొన్నాడు.
 ట్రైన్ కాకుండా, బస్సు కాకుండా ఏ దారిన వచ్చినట్లు !
  లారీ ఎక్కి వుంటారా ?
 ఛ ఛ..  ఆ పని చచ్చినా చేయరు.
 ఎక్కడో పొరబాటు జరిగింది.
 వాళ్లు హైదరాబాదు కాకుండా మరేదో ప్రాంతానికయినా వెళ్లుండాలి. లేదా బస్సు యాక్సిడెంటో, మరో ఆటంకమో జరిగి బాగా ఆలస్యమైనా అయ్యుండాలి.
  ఏది ఏమైనా మరో రెండు దినాలు వాళ్ల కోసం బస్టాండ్లలో రైల్వే స్టేషన్లలో వెదకటం మేలు.
  అదే విషయం చెప్పాడు తన వాళ్లకు.
 వాచ్ చూసుకొన్నాడు.
 హఠాత్తుగా అతనికి పెళ్లి గుర్తుకొచ్చింది.

                                                                                                 ........ సశేషం

                                                                                    .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

    చెన్నారెడ్డిని ఎట్లా దొరికించుకోవాలో అర్థం కాలేదు శివపురి సోదరులకు.  ఈ మద్య కాలంలో మరీ జాగ్రత్త పడుతున్నాడు అతను. తన కదలికల్ని అంతుబట్టకుండా చూసుకొంటున్నాడు. ఎక్కువగా రాజధానిలోనే గడుపుతున్నాడు.
  తాలుకాలో తమకు దొరికేట్టు లేడు.
 అతన్ని చంపాలంటే అతనితో బాటు తామూ మకాం మార్చక తప్పదు. తమ వ్యూహాన్ని విసృతం చేసుకోక తప్పదు.
  తమ వాళ్లల్లో అసహనం పెరిగిపోతూ వుంది. చేతులకు పని దొరక్క విలవిల్లాడ్తున్నారు. గతంలో అయితే రోజూ అదేపనిగా తిరుగుతూ వుండేవాళ్లు. వేటాడటాన్ని గురించే ఆలోచిస్తుండే వాళ్లు. అహరహం వ్యూహాల్ని పన్నటం, వాటి అమలుకు కృషి చేయటం చేతినిండా పనుండేది.
  ఇప్పుడు కేవలం తిని తిరగటం వల్ల సోమరితనం పెరుగుతోంది. ఎప్పుడోకసారి చెన్నారెడ్డి రావటం, తామతన్ని గుర్తించి సిద్దమయ్యేలోపలే తిరిగి వెళ్లిపోవటం,  నిరాశా నిస్పృహలతో తమ వాళ్లు మగ్గిపోవటం....
 అతన్ని చంపలేక పోయామనే మనోవేదన కాల్చుతోంది.
  తాము కూడా హైదరాబాద్ వెళితేగాని యీ సమస్యలు తీరవు.
  రాజధాని కేంద్రంగా తమ ప్రయత్నాల్ని విస్తరించాలి.
  వీలైనంత త్వరలో అతని చరిత్రను ముగించాలి.
 ఎంత కాలమైనా పార్టీ జేస్తూ ( ఫ్యాక్షన్ నడుపుతూ ) టెన్షన్ అనుభవించటం తమకు భరించరానిదిగా వుంది.  అతని ఉనికి తమను అనుక్షణం కాల్చుతూ వుంది. చేతగాని వాళ్లను చేస్తోంది.
  రాత్రి చర్చకు పెట్టాడు తన మనసులో భావాన్ని రమణారెడ్డి.
 రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించటానికి ముక్త కంఠంతో సమ్మతి తెలిపారు అందరూ.
  రమణారెడ్డి తాలుకాలోనే వుండి అన్ని వ్యవహారాలూ నడుపుతూ వుండాలనీ, చెన్నారెడ్డి యిక్కడకు వచ్చినపుడు అవకాశం చూసుకొని పని జరిపేందుకు ప్రయత్నించాలనీ, హైదరాబాదులో జయసింహ ఆధ్వర్యంలో టీం నిర్వహించబడాలనీ తీర్మానం జరిగింది.
 ఇక్కన్నించి వెళ్లే వాళ్లే కాకుండా అక్కడ కూడ కొంత మందిని టీం లోకి తీసుకోవాలని సూచించారు.
  చెన్నారెడ్డి బాధితులు హైదరాబాదులో కూడా వున్నారు. వాళ్ల అడ్రస్‌లు సేకరించి వారి పరిధిలో వీలయ్యే సహాయం వాళ్ల నుంచి అందుకోవాలి.
  పదిమందిని వెంటేసుకొని హైదరాబాదు వెళ్లాడు జయసింహ.
 లాడ్జీలో వుంటూ తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు.
వ్యాపార రిత్యా, ఉద్యోగరిత్యా హైదరాబాదులో వున్న చెన్నారెడ్డి వ్యతిరేకుల్ని కలిశారు.  వాళ్లతో సంప్రదించారు. వాళ్ల సలహాల్ని తీసికొన్నారు. వాళ్ల సహాయాన్ని అర్థించారు.
  అందరూ సానుకూలంగానే స్పందించారు.
 చెన్నారెడ్డిని చంపటమనేది తమ ఆశయంగా కూడా పేర్కొన్నారు.
  వాళ్లు తిరిగేందుకు వాహనాలు కావాలి. జీపుల్లాంటివి కాకుండా టూ-వీలర్స్ అయితేనే బావుంటాయి.
 ఊర్నించి తెచ్చినవే కాకుండా మరికొన్ని కొన్నారు.
 చిన్నవి పెద్దవి అన్నీ కలిపి పద్దెనిమిది అయ్యాయి.
  ఒకరు ఇద్దరు వంతున వాటిల్లో తిరుగుతూ ప్రత్యర్థిని వెంటాడటం మొదలుపెట్టారు. అతని ప్రతి కదలికనూ గమనించ సాగారు. అసెంబ్లీ వద్దా, సెక్రటేరియట్‌లో, అతను పాల్గొనే సభలూ, సమవేశాలూ, విందులూ వినోదాలూ, పెళ్లిళ్లూ.. చావులూ.. ఒకటేమిటి..? - అతని ప్రతి కదలికనూ గమనిస్తున్నారు.
  కొన్ని రోజులకు చెన్నారెడ్డికి కూడా అనుమానమొచ్చింది - సిటీలో కూడా తనను వెంటాడుతున్నారేమోనని.  దానికి సరైన ధృవీకరణ లేదు గాబట్టి అనుమానన్ని పెద్దగా సాగదీయలేదుగాని గతంలో లాగా తనపట్ల తాను సోమరిగా వుండటం లేదు. వీలైనంతగా  జాగ్రత్త పడుతున్నాడు.  దిల్‌షుక్ నగర్ లోని తన ప్రియురాలి వద్దకు గన్‌మెన్‌లు లేకుండా వెళ్లుతున్నాడుగాని... ఇదివరకటిలాగా తన కారులోనే వెళ్లటం లేదు. ఒకేదారిన పోవటం లేదు. అక్కడికి తను చేసే ప్రయాణం తనకే అంతుబట్టని విధంగా వుండేలా రోజూ కొత్తమార్గాన్ని వెదుక్కొని వెళ్లేలా కొత్త కొత్తగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఎన్నెన్నో అవస్థలు పడి ఆమెను చేరుకోవటం ధ్రిల్లింగ్‌గా వుంది. వాటిని గురించి ఇద్దరూ ముచ్చటించుకోవటం ఆహ్లాదంగా వుంది.
  అసెంబ్లీ సమావేశాల్లో కూడా తన భయాన్ని స్పీకర్ ముందుంచాడు. తన మీద జరుగుతోన్న హత్యాయత్నాన్ని గురించి చెప్పాడు. ఇవన్నీ జాతీయ పార్టీ నాయకుల మద్దతుతోనే జరుగుతున్నాయని ఆరోపించాడు.
  బాంబుల సంస్కృతి అతనిదేనని తమ వాళ్లు అట్లాంటి పనులు ఎప్పడూ చేయరని, చెన్నారెడ్డి కోరుకొంటే అదనపు బందోబస్తు కూడా ఇస్తామని హోంమంత్రి ప్రకటించాడు.  సాదారణ స్థాయిలో కాకుండా అతనికి ప్రత్యేక రక్షణ కల్పించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.  పరిశీలిస్తామంటూ హోంమంత్రి సమాధానమిచ్చాడు.
  హైదరాబాదు నగర వీధుల్ని, సందుల్ని, గొందుల్ని అనుభవంలోకి తెచ్చుకొనేసరికి నెలరోజులు చాల్లేదు జయసింహ ముఠాకు. ఎప్పుడూ బైకుల్లో తిరగటమే వాళ్లపని. చెన్నారెడ్డి తరుచుగా సందర్శించే తావులన్నిట్నీ ( స్థలాలన్నిటినీ ) క్షణ్నంగా పరిశీలిస్తున్నారు. అతని మిత్రులెవరో గుర్తిస్తున్నారు.
 కొంత కాలం తర్వాత రామంతపూర్‌లోని ఓ సందులో రూం తీశాడు జయసింహ.  ఫోన్ కూడా బిగించాడు. అక్కణ్నించే తన ముఠానంతా నడిపించ సాగాడు.
  ఎవరెక్కడ వున్నది, ఏం చేస్తున్నది, చేసే పనిలో ప్రోగ్రెస్ గురించి రామంతపూర్‌కు గంటకోసారి ఫోన్ చేసి చెబుతుండాలి. వాటన్నిటినీ విశ్లేషించి ఓ నిర్ణయానికి రావటం జయసింహ భాద్యత.
  కాలం గడిచే కొద్దీ పనిలో బాగా స్థిరపడ్డారు వాళ్లు.
  అలవోకగా తిరుగుతున్నారు.
 అయినప్పటికీ చెన్నారెడ్డి మీద దాడి జరిపే అవకాశం వాళ్లకు ఎదురు కాలేదు.
 ఈ నేపథ్యంలో ఒకనాటి రాత్రి దిల్‌షుక్ నగర్ కేసి వెళుతూ వున్న చెన్నారెడ్డి జీపు రాఘవ కంట బడింది.
  క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాన్ని వెంబడించాడు అతను.
  దిల్‌షుక్ నగర్‌లోని ఓ సందులో దూరింతర్వాత అదృశ్యమైంది అది.
 పట్టుదలగా సందులో ముందుకు దూసుకెళ్లాడు.
  అటు ఇటు ఇళ్ల కాంపౌండుల్లోకి పరిశీలనగా చూస్తున్నాడు.
  సందు దాటి మేయిన్ రోడ్ ఎక్కి ఇరువైపుల చూస్తే దగ్గరలోనే చిన్న హోటల్ ముందు ఆగివుంది అదే కారు.
  దగ్గరగా వెళ్లి లోపలికి చూస్తూ ముందుకు సాగాడు.
  కారులో చెన్నారెడ్డి లేడు.
 వెనక్కి తిర్గొచ్చి హోటల్ లోకి తొంగిచూస్తే - డ్రైవర్ ఒక్కడే టీ తాగుతూ కూచుని వున్నాడు.
 కొంత దూరంలోని మరో హోటల్ వద్దకెళ్లి అక్కణ్నించి కారుమీదే చూపులు నిలిపి నిరీక్షించ సాగాడు.
  అతన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ పదినిమిషాల తర్వాత కారు వెళ్లిపోయింది.
 చెన్నారెడ్డిని ఇక్కడే ఎక్కడో వదలి వెళ్లినట్లుంది.
  జరిగిన విషయమంతా ఎవ్వరితోనూ చెప్పలేదు రాఘవ.
  మళ్లీ రోజు కొంచెం పెందలాడే వచ్చి సందు మొగదల కాపు కాశాడు.  చెన్నారెడ్డి వాహనం కోసం ఎదురుచూడసాగాడు.
 ఏవో ఒకటి రెండు వాహనాలు సందులోకి జొరబడ్డాయి గాని రాత్రంతా నిరీక్షించినా చెన్నారెడ్డి కారు రాలేదు.
  మరో రెండ్రోజులకు అతనికి అర్థమైంది. చెన్నారెడ్డి తన స్వంత కారులోనే కాకుండా రకరకాల వాహనాల్లో వస్తున్నాడనీ. హోటల్ వద్ద కారాపి సిగరెట్ల తాగే డ్రైవర్ని చూస్తే తెలిసింది కార్ల భాగోతం. కార్లను మారుస్తున్నాడేగాని డ్రైవర్లను మార్చటం లేదు అతను.
  మరో వారం రోజులకు గాని చెన్నారెడ్డి దూరే కొంపను కనుక్కో లేక పోయాడు రాఘవ. గన్‌మెన్‌లు లేకుండా ఒంటరిగా ఓ ఆడదాని కోసం వస్తోన్న చెన్నారెడ్డిని చూసి ఆనందంతో పులకరించి పోయాడు అతను. తిమింగలం వొడ్డుకు వచ్చే రహస్య ప్రదేశం తెలిసింది. ఈ విషయం అందరికీ తెలిపి వెంటనే పనయిపించాలి.
  ఫోన్ చేద్దామనుకొని విరమించుకొన్నాడు.
  నేరుగా రామంతపూర్ కేసి దూసుకు పోసాగాడు.
  తమ రూమున్న సందులోకి మలపు తిరగబోతుండగా హఠాత్తుగా అతనికో ఆలోచన వచ్చింది.
  ఇప్పుడు చెన్నారెడ్డిని చంపటం కోణ్ని గొంతుకోసేంత తేలిక.
  అ పనేదో తనొక్కడే చేస్తే..?
   మలపు వద్దే టక్కున ఆగిఫొయాడు.
 కొంతసేపు డోలాయమాన స్థితిలో వూగిపోయాడు.
 తర్వాత స్థిర నిర్ణయానికి వచ్చాడు. తనొక్కడే వాన్ని నరికి చంపాలని, చేతులారా తన కసి దీర్చుకోవాలని.
  అందుకే చెన్నారెడ్డి విషయాన్ని రహస్యంగా వుంచాడు.
 అలాంటి సమయంలోనే ఒకనాటి సాయింత్రం పోరుమామిళ్ల నించి శివపురి వచ్చి ఇంట్లో అడుగుపెడుతూనే టెబుల్ మీద ఓ పెళ్లి పత్రిక కన్పించింది రమణారెడ్డికి.
  కాళ్లు మొగం కడుక్కొని వచ్చి టేబుల్ ముందు కూచుని పత్రికను చేతికి తీసుకొన్నాడు.
 ఆలూరి వాళ్ల పెళ్లి.
తమకు దూరపు చుట్టాలు.
  పిల్లవాడు ఎం.బి.ఏ చేసినట్టుంది హైదరబాదులోనే ఏదో కంపెనీలో మంచి ఉద్యోగమని వినికిడి.
 పెళ్లి కూడా హైదరాబాదులోనే... ఎల్లుండే పెళ్లి.
 " నీ పెండ్లిగ్గూడా వొచ్చినారురా వాల్లు.  దూరపు బంధువులైనా అన్ని సుభకార్యాలకూ వస్తావుండారు. మనమూ పోతావుండాము తప్పకుండా పోవాల.."  పెద్దిరెడ్డి చెప్పాడు.
  అడ్డపంచె పకెగ జెక్కి బైట పచార్లు చేస్తూవున్న బాలుని వద్దకెళ్లాడు రమణారెడ్డి.
 " పత్రిక చూసినావా ? "  అడిగాడు.
 " ఏది ? ఆలూరోల్లదా ! చూసినాలే.. "  చెప్పాడు.
 " పెండ్లికి ఎవురు బోతనారు..? "
 " యీన్నించి ఎందుకూ పోవడం ?  జయసింహ అక్కన్నే వుండాడుగదా ! వాన్నే పొమ్మంటే సరి.. "
 " వానికి తెలిసుండదు. ఫొన్‌జేసి చెప్పు "
 " సరే " నంటూ తలూపాడు బాలుడు.
 లోపలికెళ్లి పత్రికను టేబుల్ మీద విసరేస్తూ ఎందుకో దానికేసి అదేపనిగా చూశాడు రమణారెడ్డి.  తర్వాత తమ్మున్ని కేకేశాడు  " బాలుడూ "  అంటూ
 " ఈయప్ప చెన్నారెడ్డి వర్గం గదరా ? "  అన్నాడు పత్రిక చూపిస్తూ.
 " పక్కాగా .."  చెప్పాడు బాలుడు.
 " మరి.. యీ పెండ్లికి చెన్నారెడ్డి కూడా వస్తాడు గదా ! "  ఉధ్విగ్నంగా అన్నాడు.
 ఒక్కసారిగా మూగవొయాడు బాలుడు.
 అక్కడ కొంతసేపు పిన్‌డ్రాప్ సైలెంట్ అలుముకొంది.
  మరుక్షణమే ఓ పథకానికి రూపకల్పన చేయటం ప్రారంభించారు అన్నదమ్ములిద్దరూ.
  కొంత సమయం గడిచిన తర్వాత హైదరాబాదుకు ఫోన్ పెట్టాడు రమణారెడ్డి.  జయసింహ లైన్లోకి వస్తూనే  " హలో జయ ! నేను రమణారెడ్డిని... ఎల్లుండి ఆలూరి వాళ్ల పెళ్లి... నువ్వు అటెండ్ అవుతావు గదూ ! "  అడిగాడు.
  " ఆ  సరేన్నా ! "
  " చెన్నారెడ్డి ప్రోగ్రామ్ షెడ్యూలేమైనా సేకరించినారా ? "
  " పి.ఏ లొంగటం లేదన్నా ! "
  " ఆలూరి వాళ్లు చెన్నారెడ్డి వర్గీయులే.. అతను తప్పకుండా ఆ పెళ్లికి రాగలడేమో !  ఎంక్వయిరీ చేస్తావా ! .. ఓ అర్ధ గంటలో నాకు ఫోన్ చేసి చెప్పాలి "
  అర్ధగంటకు ఖచ్చితంగా ఫోనొచ్చింది.
 జయసింహ నించే అనుకొన్నారు.
  ఆలూరు వాళ్లనించి - పెళ్లికి తప్పక రమ్మని.
 మరో పదినిమిషాల తర్వాత జయసింహ నించి ఫోన్.  " చెన్నారెడ్డి ఖచ్చితంగా వెల్తున్నాడుట పెళ్లికి "
  " సరే..  రాత్రికి మనవాళ్లు బసెక్కుతారు. తెల్లారే టయానికి అక్కడుంటారు.... అన్ని విషయాలు మీకు చెబుతారు..  నేను తర్వాత ఫోన్ చేస్తాను.. "  చెప్పాడు.
  రాత్రికంతా పకడ్బందీ వ్యూహాన్ని సిద్దం చేసి చెన్నకేశవకు అప్పగించి పదిగంటల బసెక్కించారు మరికొందర్ని తోడిచ్చి.
  మనుషులు సిద్దంగా వున్నారు.
 వాళ్లల్లో కసి దండిగానే వుంది.
 పథకాన్ని అమలు పరిచే శక్తి మెండుగానే వుంది.
 అపజయాలు ఎదుర్కొన్నారు కాబట్టి జయించాలనే తపన అధికంగానే వుంది.
 ప్రస్తుతం అక్కడ లేనిది ఒక్కటే..
  ఆయుధ సంపద.
 వేటకొడవళ్లు, బాకులు తల్వార్ లాంటివి దండిగానే వున్నాయి.
  ఈ పనికి బాంబులు తప్ప మరో ఆయుధాలు అంత అనుకూలంకావు.
 వాటినయితేనే తమ వాళ్లు సమర్థవంతంగా వినియోగించగలరు.
 రేపు రాత్రికి బాంబులు పంపించాలి.

                            ***********

  తన రాజకీయ జీవితంలో దండయాత్రల గుండానే ఎక్కువ విజయాల్ని చవిచూశాడు చెన్నారెడ్డి.  ఎదురు తిరిగిన వాళ్లను క్రూరంగా అణచివేయటం వల్లనే సామ్రాజ్యాన్ని విస్తరింప జేసుకొన్నాడు. ఓవైపు నెత్తురూ, కన్నీరూ పారుతోంటే మరోవైపు గెలుపు సంబరాలు చేసుకొన్నారు. పల్లెలన్నీ పాదాక్రాంతమయ్యేదాకా హింసను కొనసాగించాడు.
  ఇప్పుడు తను సాధించే విజయాలు గత విజయాలకు పూర్తిగా భిన్నమైనవి. జనాల మొహాల్లో తృప్తినీ, సంతోషాన్నీ కలగిస్తూ తను గెల్చుకొంటున్నాడు. పల్లెల్లో సంబరాలు చేయిస్తూ గెలిచి సాధిస్తున్నాడు. నాయుకునిగా తనకిది గొప్ప అనుభూతి. సందేహం లేదు.
  ఈ ప్రక్రియకు బీజాలు ఎప్పుడో పడవలసింది. తన దురదృష్టం కొద్దీ ఇలాంటి విజయాలు కూడా వుంటాయనే స్పృహ తనకు కలిగేసరికి చాలా ఆలస్యమైంది.
  తను చేసిన పాపాలు శివపురి సోదరుల రూపంలో వెంటాడుతున్నాయి.
  నిజంగా తను పాపం చేశాడా..?
  తనెప్పుడూ అట్లా భావించలేదు.
 చరిత్రంతా తిరగేసినా రక్తపాతం లేకుండా ఏరాజు రాజ్యాధికారాన్ని సాధించిన దాఖలాలు లేవు.
 ప్రజాస్వామ్యం కాబట్టి యుద్దాల తీరు మారింది... అంతే.
 దాదాపు మెజారిటీ పక్షం నాయుకలందరిదీ యిదేబాట... కాదంటే తనది వాళ్లకంటే కొంచెం గాఢమైంది...  సందేహం లేదు.
  ఆ గాఢతే తనను రాక్షసునిగా చిత్రించేంత పనిచేసింది.
 ఇప్పటికయినా మించిపోయింది లేదు.
  సాధించిన అధికారాన్ని నిలుపుకొనేందుకూ, దాన్ని అనువంశిక ఆస్తిగా మార్చేందుకూ మంచిదారి మార్చాలి.
  అంతదాకా బతకనిచ్చేట్టుగా లేరు ప్రత్యర్థులు.
  అంటే రాజకీయాల్లో మంచి మార్పును ప్రవేశబెట్టబోతున్న తనకు వాళ్లు అడ్డొస్తున్నట్లే గద !  మార్పు రాకుండా అడ్డుకోంటోన్నట్లేగద !
  ఈ ఒక్కసారి వాళ్ల అడ్డు తొలగించుకోంటే  ఎంతబావుంటుంది !
  మంచి మార్పుకోసం వాళ్లను లేపేసే శక్తిని భగవంతుడు  తనకిస్తే ఎంత గొప్పగా వుంటుందనీ !
గత  కొంతకాలంగా అతని ఆలోచనా తీరు అట్లా కొనసాగుతూ వుంది. శివపురి వాళ్ళ చరిత్ర ముగించి ఆపైన తాలూకాలో హింసా రాజకీయాల్ని పూర్తిగా మాన్పించాలని అతని ఆశ.
  తను ప్రయత్నించినా వాళ్లను చంపలేడేమో..!
  అవకాశం రావాలి.
  తనగుండా తాలుకా రాజకీయాల్ని ప్రక్షాళన చేయించి బాగుపరచాలని భగవంతునికి కోరిక పుడితే వాళ్ల అంతం చూసేది ఎంతసేపు..!!
  ఈ మద్య కొంత ఎక్కువ మోతాదులోనే తన ప్రియురాలి వద్ద గడుపుతున్నాడు అతను.
  ఆమె భర్త రాష్ట స్థాయిలో గుర్తింపు పొందినా ఐ.ఏ.ఎస్ ఆఫీసర్, అతనా స్థితికి చేరుకోవటానికి కారణం చెన్నారెడ్డే.
  అతనెప్పుడూ క్యాంపుల మీదుంటాడు.
 తన భార్య వల్ల చెన్నారెడ్డికి లభించే ఏకాంత సుఖానికి అతని అడ్డంకి వుండే అవకాశం లేదు.
  ఆమె వద్ద వున్నంత సేపూ  అన్ని సమస్యల్ని మరచిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు చెన్నారెడ్డి.
 అద్భుతమైన విషయమేమిటంటే - గేటు వరకు తనను వెంటాడుతోన్న మృత్యుభయాన్ని కూడా మరచిపోగలుగుతున్నాడు.
 ఊరికి వెళ్లబుద్ది కావటం లేదు.
 అలాగని ఎక్కువ రోజులు ఇక్కడే వున్నా యింట్లో సంజాయిషీ యివ్వవలసి వుంటుంది.  మరికొంత ఆలస్యమైతే తనతో పనున్న తన అనుయాయులు నేరుగా యిక్కడికే వచ్చే ప్రమాదముంది.
 రేపు ఆలూరి వాళ్ల పెళ్లి చూసికొని ఎల్లుండయినా ప్రయాణం కావాలి.
 రాత్రి ఇష్టసఖి ఇంటికి వెళ్లాలనుకొన్నాడు.
 ఏడుగంటల ప్రాంతంలో సిద్దమవుతున్నాడు.
  ఈ రోజు భోజనం కూడా అక్కడే చేయాలి.
 రిసీవర్ ఎత్తి నెంబర్ డయల్ చేశాడు.
 అవతల తనే ఎత్తింది. అతని గొంతును పోల్చుకొంది.
 " ఇప్పుడు ఏదారిలో వస్తానో వూహించు చూద్దాం ! "  అన్నాడు.
 చిన్నగా నవ్వింది ఆమె  " ఏ దారిలో వచ్చినా యీ సందులోకి మలుపు తిరగాల్సిందే గదా ! యీ యింట్లోకి రావాల్సుందే గదా ! "  అంది.
  " భోజనం కూడ అక్కడే "  చెప్పాడు  " ఏ హోటల్నించి తెప్పించమంటావో చెప్పు "
 " మగాళ్ల చేతి వంట నీకు రుచించదేమో ! "
 " ఆడవాళ్ల చేతులు అలసిపోతాయేమోననీ ! "
" అలసట నువ్వు తీరుస్తావుగదా ! "
 ఆనందంతో పరవశుడయ్యాడు.
 మరో ఐదు నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేశాడు.
 కోఠి వెళ్లి తనకు కావలసిన వస్తువుల్ని తీసికొని అట్నించి దిల్‌షుక్ నగర్ వెళ్లాలని అతని ఆలోచన.
 మధురమైన ప్రయాణానికి హృదయాన్ని సవరించుకొని బైట పడబోతూ వున్నాడు.
 అంతలో ఫోన్ మోత
 వెనక్కి తిరిగి రిసీవర్ ఎత్తాడు.

                                                                                                           ........ సశేషం

                                                                                 .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

     ఇంటికి వెళ్లేసరికి రమాదేవి గోడుగోడుమంటోంది.
 ఎదురుగా సోఫాలో కూచుని వున్నాడు చిన్నకొడుకు హర్ష.
 అతని మీద ఎగిరి పడుతోంది.
 బైట రెండు జీపుల్నిండా ఆయుధాలు పట్టుకొని ఎక్కడికో దండయాత్రకు సిద్దమైన జనం.
 " ఇడుగో మీ నాయనొచ్చినాడు సూడు. యీయప్ప పనికి యీ యప్పే బోతాడు. మద్యన నువ్వెందెకు ?... మేముండగా నీ కెందుకురా యీ గొడవలన్నీ ? ... ఏమయ్యా ! ఈ జీపుల్లో మాసుల్ని తీసుకొని రంగుపల్లెకు పో.. ఆ శివపురి నాకొడుకులు అక్కడ ఏందో గొడవజేస్చాండారంట... మన పల్లెల కొచ్చి వాల్లు నీల్గుతావుంటే మనమెందుకయ్యా బతకడం ? ... నీ కొడుకు పోతానంటే నేనే నిలేసినా ! .... మనముండగా వాడెందుకు గొడవల్లో దిగాల ? ..."
 కొంతసేపు మౌనంగా వుండిపోయాడు చెన్నారెడ్డి. ..
  ’ ఆ శివపురి వాళ్లను ఎట్లా ఎదుర్కోవాలా ? ’ అని ఆలోచిస్తున్నాడు. తన ఏరియాకు కూడా వచ్చారంటే వాళ్లంత సులభంగా వుండరు.
 అతని మౌనాన్ని మరో విధంగా అర్థం చేసుకొంది ఆమె.  " ఏమయ్యా ! నువ్వు పోతావా ?  నన్ను పొమ్మంటావా ? నీకు సేతగాదంటే నేనే పోతా. నా కొడుకును మాత్రం పోనియ్యను..ఆ... తెల్సిందా ? "  అంది.
 మందిని తయారు చేసికొని శివపురి వాళ్లమ్మీద దాడికి సిద్దమై వున్నాడు హర్ష. తమ ఏరియాలో, తమ పల్లెల్లో వాళ్లు పెత్తనం చెలాయించబోవటం సహించలేక పోయాడు.
 మెల్లిగా ద్వారం వద్దకెళ్లి జీపులోని రంగాపురం మనిషిని పిల్చాడు చెన్నారెడ్డి.
 అతను రాగానే  " సంగతేందిరా ? "  అడిగాడు.
 " ఏముందయ్యా ! వాడు మల్లా వూర్లోకొచ్చినాడు "
 " ఎవుడు ? "
 " బుడ్డా రెడ్డోల్ల పెద్దోడు.. "
  " ఆ ... వస్తే..."
  " వాల్ల దాయాదుల కాల్లో కడుపో పట్టుకొని మెత్త బరుచుకొన్నేడు. వాని భూములు వానిగ్గావాలంట.. పంచాయితీ పెట్టినాడు. "
 " మీరేమన్నేరు ? "
 " ఏమంటాం ? .. నీకు తెలవకుండా పంచాయితీ యట్లా జేసుకుంటాం ? కొట్లాటలూ, గొడవలు లేకుండా వుంటే ఆ సంగతి వేరే ! అన్ని ఖర్చులూ పెట్టించినాడు గదా !  ఇప్పుడు భూము లెట్లా ఇడుస్చామూ ? "
 " వాల్ల దాయదులు ఏమంటా వుండారు ? "
  " వాల్లేందో వెనక తొక్కిళ్లు తొక్కుతావుండారు మరి !  వాని ఏడుపుల్జూసి కరిగిపోయినట్టుండారు. రొండుసార్లు వాల్లే పంచాయితీ జేసినారు. మేం వొప్పుకోకున్నెం.  ఇప్పుడు వాడు శివపురి వాల్లను పెద్ద మనుషులుగా తెచ్చినాడు. మేమాడుంటే గొడవలవుతాయని ఎల్లబారొచ్చినాం.. "
  ఒక్క నిమిషం ఆలోచించాడు చెన్నారెడ్డి.
 " సర్లే పోదాం పా !  ఆ నాకొడకల సంగతేందో సూసుకుందాం ... "  అంటూ బైటకు నడిచి జీపెక్కాడు.
  ఆయన వెంట నలుగురు గన్‌మెన్‌లు ఎక్కారు.
  రెండు జీపుల్నిండా ప్రవైటు సైన్యం, ఒక జీపులో తన సిబ్బందితో రంగపల్లె దిశగా పయనించాడు.
  దాదాపు ఏడేళ్లు దాటిపోతూవుంది - బుడ్డారెడ్డి కుటుంబాన్ని వూరినుంచి తరిమేసి.
వాళ్ల దాయాదులంతా కలిసి తనకు వ్యతిరేకంగా రాజకీయం చేశారు. బుడ్డారెడ్డి పెద్దకొడుకును ఏజంటుగా కూచోబెట్టారు.
 ఊరిపైన వాళ్లదే పైచేయి అయ్యింది.
 తను మాత్రం ఎమ్మెల్లేగా అఖండ మెజారిటీతో గెల్చాడు.
 అప్పుడు కూడా వాళ్లు తనతో కలవలేదు.
 సంవత్సరం తర్వాత వచ్చిన పంచాయితీ ఎలక్షన్లలో బుడ్డారెడ్డి వాళ్లే సర్పంచ్ స్థానానికి పోటే చేశారు.
 వాళ్లకు మద్దతివ్వమంటూ తన వర్గం వాళ్లను బలవంతపెట్టారు... అదిగో.. అప్పుడు తను రంగంలోకి దిగవలసి వచ్చింది.
 పంచాయితీ ఎలక్షన్స్‌లో బుడ్డారెడ్డి వర్గీయుల్ని తరిమి కొట్టి తన వాళ్లను గెలిపించుకొన్నాడు.
 తర్వాత కూడా వాళ్లమీద దాడులు కొనసాగాయి. అన్నిరకాలుగా వాళ్లమీద దాడులుచేసి క్రూరంగా హింసించటంతో -
  వాళ్లంతా తనకిందికొచ్చారు - ఒక్క బుడ్డారెడ్డి కుటుంబం తప్ప.
 వాళ్లల్లోనూ బుడ్డారెడ్డి పెద్దకొడుకే.
 అందుకే వాన్ని నిర్దాక్షణ్యంగా వూరినించి తరిమేశారు.
 వాని భూముల్ని లాక్కొన్నారు.
 అప్పుడు తనమాట వేద వాక్యంగా వుండేది.
 చివరకు ఇప్పుడు తన ప్రత్యర్థులు తన ఏరియాలో పంచాయితీలు చేసే పరిస్థితి వచ్చింది.  దాన్ని సహించేందుకు లేదు.
  వాళ్లతో అటో ఇటో తేల్చుకోవాలి.
 గొడవ జరిగితే గన్‌మెన్‌లను కూడా ఉపయేగించుకోవాలి. ఏడెనిమిది జీపుల తన సొంత మనుషుల కన్నా వీల్లే నయమని తేలింది మొన్న జి.పి.ఆర్ వద్ద దాడి జరిగినప్పుడే.  వీళ్లంతా కాళ్లకు, చేతులకు అడ్డం తప్పితే ఉపయోగం లేకుంది.
 మెరికల్లాంటి వారు నలుగురు చాలు.
 అతను ఆలోచనల్లో వుండగానే రంగంపల్లె దగ్గరబడింది.
 ఊర్లో ’వాళ్లు ’ న్నారనే విషయం కొంత టెన్షన్ కలిగిస్తోంది.
 ఊరి బైట జీపు ఆపి ఎదురైన మనిషిని అడిగారు శివపురి వాళ్ల ఆచూకి గురించి.
 అతన్నుంచి సరైనా సమాధానం లేదు.
 గ్రామంలోకి ప్రవేశించాయి జీపులు.
 ఓ యింటి వద్ద ఆగింతర్వాత జీపులోని రంగంపల్లె మనిషి దిగాడు.
 ఆదారాబాదరా కొంత దూరం వెళ్లి వీధి మలుపు వద్ద ఆగి, పక్కవీధిలోకి సుదీర్ఘంగా చూశాడు.
 ఆశ్చర్యబోతూ వెనుదిరిగి వచ్చాడు.
 " వాల్లు లేరు... ఎల్లబారినట్టుండాది - మేమెవురం పంచాయితీకి పోలేదు గదా ! అందుకేనేమో... "  చెప్పాడు.
 చెన్నారెడ్డి జీపు దిగాడు.
 తనకెప్పుడూ ఆతిథ్యమిచ్చే నారపురెడ్డి యింటిలోకి జొరబడ్డాడు.
 కొంత సేపయింతర్వాత బుడ్డారెడ్డి మనుషుల్ని పిలిపించుకొన్నాడు.
 కుశల ప్రశ్నలు వేశాడు.  గ్రామ బాగోగుల్ని పరామర్శించాడు.
 ఏయిడెడ్ పాఠశాలలో టీచర్ పోస్ట్ వేయించిన బుడ్డారెడ్డి తమ్ముని కొడుకును గురించి ఎంక్వయిరీ చేశాడు.
 తను కట్టించిన చెరువుకు మరమ్మతులు అవసరమైతే చెప్పమన్నాడు. ఏటి నుంచి తీసిన తాగునీటి పంపింగ్ స్కీమ్ గురించి అడిగాడు. బుడ్డారెడ్డి చేని వద్ద వంకకు అడ్డంగా కట్టిన చెక్‌డ్యాంలో నీరు దండిగా నిల్వవుండి పొలాలకు ఉపయోగ పడుతున్నాయో లేదో అడిగాడు.
  గ్రామానికి ఇంకా ఏవైనా అవసారలుంటే చెప్పమన్నాడు తన ఎమ్మెల్లే గ్రాంట్ లోంచి నిధులు విడుదల చేయిస్తానన్నాడు.
 ఆ వూరి అభివృద్ది కోసం తను చేసిన పనులన్నీ ఒకసారి గుర్తొచ్చేలా చేశాడు.  ఆ వూరు బాగుపడేందుకు తానింకా కృషి చేస్తున్నట్లుగా ప్రకటించాడు.
  బుడ్డారెడ్డి ఊ కొడుతున్నాడు. పొడి పొడిగా సమాధానం చెబుతున్నాడు.
 అతనిలో ఏదో తడబాటు.. మరేదో న్యూనతా భావం.
 ఏ విషయమో చెప్పాలనే భావం...  తీరా పెదవుల వద్దకొచ్చి ఆగిపోవటం...
  " సరే మరి  సమస్యలేమి లేవుగదా ! నేనొస్తా..  ఇంకా పల్లెలు తిరగాల "  అంటూ లేవబోయాడు.
 " అన్నా ! ఒక చిన్న సంగతుంది.. "  తల గీరుకొన్నాడు బుడ్డారెడ్డి.
 ’ఏమి ’ టన్నట్లుగా చూశాడు.
 " మా పెద్దోడొచ్చినాడు అన్నా !  వాని పొగురంతా అణుచుకొని వొచ్చిండు.  నేనేమో నీకాడికే పొమ్మని సెప్పినా..  ఆ నాకొడుక్కు మొగమెక్కలే.... సరే.. వూల్లో వాల్లను అడిగి సూస్జామనుకొన్నే... అందర్నీ అడిగినా... ఎవురేం అడ్డం జెప్పలేదు.. అడుగో అసలోడే వొప్పుకోలేదు.. ఏదన్న ఖర్చులుంటే కట్టిస్తాడు..  వాని పొలం వానికిప్పీ అన్నా !  నీకాడికి రాకపోవడం నా తప్పే..."  వేడికోలుగా చెప్పాడు.
  " ఎమ్మెల్లేగాడికి పంచాయితీకి వొచ్చేమాత్రమైతే శివపురి వాల్లను ఎందుకు తెచ్చుకొన్నట్లో ? "  వెంటనే అందుకొన్నాడు ఎదుటి మనిషి.
  " బుద్దిలేక.. " గట్టిగా అన్నాడు బుడ్డారెడ్డి.  " ఆ బుద్ది లేనా కొడుకు తీసుకొచ్చె... అందుకే మూతిమీంద కొట్టి ఎనక్కి పంపినా గదా ! "
  " నేను బద్వేలు పోతాండానని తెల్సి నువ్వా పన్జేసుంటావు.. "  అన్నాడు ఎక్కసగా.
   " ఒరేయ్ !  యీ తంటాల మాటలొద్దురా ! "  గట్టి గొంతుకతో అన్నాడు బుడ్డారెడ్డి.  ఎమ్మెల్లే వైపు తిరిగి  " అన్నా ! యీని కూతలు నువ్వు నమ్మగాకు.... పెద్దోన్నయినా నీ కాల్లుబట్టుకొని అడుగుతా వుండా.. నీ మనస్సుకు ఎట్టా దోస్తే అట్టా జెయ్యి.. "  అన్నాడు.
  కొంతసేపు ఆలోచించిన తర్వాత చెన్నారెడ్డి చెప్పాడు.  " సరేనీ పెద్దమాసీ !  మీరందరూ కావలన్నె పనిని నేనొద్దంటానా ?  అట్లనే కానీ !.... నీ కొడుకును నీ కాలికింద పెట్టుకొనే మాత్రమైతేనే యీ పంచాయితీ...  లేదంటే పెద్ద యిబ్బందులొస్తాయి.. శివపురి వాల్లు యీ వూరి పొలిమేర తొక్కగూడదు.  దానికి నీదే భాద్యత... రేపొక్కసారి నీ కొడుకును వెంటబెట్టుకొని బద్వేలుకు రా......"  అంటూ అవతలి వ్యక్తికేసి తిరిగి  " అబ్బీ ! నువ్వు కూడా రా ... "  చెప్పాడు.
  పదినిమిషాల తర్వాత జీపులు కదిలాయి.
  దారంతా ఆలోచిస్తూనే వున్నాడు చెన్నారెడ్డి.
  తన ప్రవర్తన తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ వుంది.
 ఇద్దరు ముగ్గుర్ని చంపి అయినా భయపెట్టుకోవాలని వచ్చాడు.
  బుడ్డారెడ్డి పెద్దకొడుకును కాలో చెయ్యో తీసెయ్యాలనుకొన్నాడు. తనను వ్యతిరేకించి శివపురి వాళ్లను పంచాయితీ తెచ్చినందుకు పెద్దశిక్షే వేయాలనుకొన్నాడు.
  కానీ...  యిట్లా జరిగిందేమిటీ.. ?
  తను సర్ధు బాటవుతున్నాడా ?  పరిస్థితుల్ని జయించి గుప్పెట్లో పెట్టుకొనే స్థితినుంచి పరిస్థితులకు అనుకుణంగా మార్పు  చెందే స్థితికి వస్తున్నాడు.
  తనకిది విజయమా ?  అపజయమా..?
  శివపురి వాళ్లకు భయపడే తనీవిధంగా మారాడా..?
  తను తీసుకొన్న యీ నిర్ణయం కాకుండా మరో నిర్ణయమయి వుంటే శివపురి వాల్లను ఆవూరికి వెళ్లకుండా చేసేందుకు పెద్ద యుద్దాలే చేయవలసి వచ్చేది.
  ఇప్పుడు అతిసులభంగా,  అందరి సమ్మతితోనే వాళ్లను గ్రామ ప్రవేశం లేకుండా చేశాడు గదా..!
 ఇది తనకు తప్పకుండా విజయమే.
  విజయాల్ని ఇలా కూడా పొందవచ్చునని తనకు తెలిసిపోయింది.
 చెన్నారెడ్డికి కొంత ఆనందంగా అన్పించింది.
 కొత్త సూత్రాన్ని అవిష్కరించిన శాస్త్రఙ్ఞునిలా అనుభూతించ సాగాడు.
 ఇట్లాంటి కేసులొస్తే తను.. ఇలాగే పరిష్కరించాలి.  తన వాళ్లను నెప్పించి మెప్పించయినా పంచాయితీల్ని యిలాగే చేయాలి.
  తన ఏరియాలో శివపురి వాళ్ల నీడ కూడా పడేందుకు లేదు.  వాళ్లు ప్రవేశించలేని పల్లెల్ని తను తయారు చేసుకోవాలి.
అట్లాగని  వాళ్లను ఉపేక్షించే దానికి లేదు.
  వాళ్లకు రాజకీయం ముఖ్యం కాదు -  తన చావే.  వాళ్లు ఏపని చేసినా అది తన్ను చంపేందుకు మార్గంగా ఎంచుకోవటానికే ప్రయత్నిస్తారు. తన జాగ్రత్తలో తనుండాలి.
  మర్నాడే రంగం పల్లె పంచాయితీ వొగదెగింది.
 బుడ్డారెడ్డి పెద్దకొడుకు కళ్లల్లోని ఆనందం,  దాని వెనకే పొర్లకొచ్చిన విధేయత చెన్నారెడ్డిని ఆకట్టుకొన్నాయి.
  మరో పదిరోజుల తర్వాత అట్లాంటిదే సురవరం పంచాయితీ.
 అక్కడయితే ఇల్లుకూడా ఆక్రమించుకొన్నారు.
  అది కూడా సులభంగానే పరిష్కారమైంది.
  శిథిలమవబోతున్న తన యింటిని బాగు పరుచుకోంటోన్నట్లుగా అన్పించింది చెన్నారెడ్డికి.
 కొత్త ఉత్సాహం వచ్చింది.
  తన ప్రాణాని కెటూ ముప్పు వాటిల్లింది.  తనతోబాటు రాజకీయాన్ని కూడా నాశనం చేస్తే ఎట్లా..?
  తను పోయినా రాజకీయం బతకాలి.
 తన సంతానం దాన్ని అందిపుచ్చుకోవాలి.
  తన హయామంతా భయపెట్టుకొని  ముఠా రాజకీయం చేశాడు.
  ఇప్పుడు తనే భయపడే పరిస్థితికి వచ్చాడు.
  కాలం ఎప్పుడూ ఒకేలా వుండదు గదా !
  తనున్నా లేకున్నా తన వాళ్లకు ఏకమొత్తంగా ఓట్లు గుద్దిపోసే అభిమానాన్ని రెండు మండలాల్లోనయినా సంపాదించుకోవాలి.  అవతలి పార్టీ వాల్లను తమ పొలిమేరల్లోకి కూడా అడుగుపెట్టని విధంగా పల్లెల్ని తీర్చి దిద్దికోవాలి.  మిగిలిన మండలాల్లో చెరిసగమో, లేదా తనకు కొంతశాతం తక్కువ ఓట్లు వచ్చినా ఇబ్బంది లేదు.  గెలుపు ఎప్పుడూ తమ వైపే వుంటుంది.
   సుదీర్ఘమైన మానసిక అంతర్జ్వలనం తర్వాత, ప్రక్షాళనం తర్వాత అతనో నిర్ణయానికి వచ్చాడు - తమ గుండా వూరు వదలి వెళ్లిపోయిన వాళ్లను తిరిగి వూర్లలోకి రప్పించే కార్యక్రమాన్ని మొదలెట్టాలని.
  చకచక ఆదిశగా అడుగులేశాడు.
  తన అనుయాయులకు సూచనలిచ్చాడు.
 కొద్ది సమయంలోనే ఆయన ఆలోచనకు మంచి స్పందన వచ్చింది.
  చాలామంది తమ తమ గ్రామాలకు వెళుతున్నారు.
  ఆస్థిని గురించి ఆలోచించే వాళ్లు సర్ధుబాటవుతున్నారు.
  అభిమానాలు,  ప్రాణాలు ముఖ్యమనుకొన్న వాళ్లు స్పందించటం లేదు.
  అయిన వాళ్లను పోగొట్టుకొని, అవమానాలు అనుభవించిన వాళ్లకు చెన్నారెడ్డి ప్రతిపాదన తమను మరింత అపహాస్యం చేసినట్లుగా అన్పించింది. అతనింకా మనుషుల్ని మనుషులుగా చూడలేదనీ, ఆస్తులుగానో, కులం మతం లాంటి మూఢ బావుకలుగానో చూస్తున్నాడని స్పందించారు.
 ఎనుబోతుల సుబ్బారెడ్డికి కూడా పిలుపు వచ్చింది.
  ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్లిపోయాడు అతను.
  పెదనాన్న మాటల్లోని నిజం అప్పుడు తెలిసి వచ్చింది శివపురి రమణారెడ్డికి,  ఆయన ఆరోజే చెప్పాడు - ప్రాణాలు పోగొట్టుకొన్న వాళ్లకున్నంత పగ ప్రతీకారాలు ఆస్తిని పోగొట్టుకొన్న వాళ్లకు వుండవని.  అందువల్లనే జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద జరిగిన దాడిలో బాంబుల బక్కెట్లను దూరంగా తీసికెళ్లి ఎమ్మెల్లేను రక్షించాడు అతను.
  తన పాతభావాల్ని కొంత వరకు సంస్కరించుకొంటున్నప్పటికీ తను మాత్రం చాలా జాగ్రత్తగా తిరుగుతున్నాడు చెన్నారెడ్డి.
  అనుక్షణం అతన్ని చావు భయం వెంటాడుతోంది.
  ఆత్మీయుల వద్ద కన్నీళ్లు పెట్టుకోవటం మానలేదు.
   తనెట్లయినా చచ్చేనాకొడుకునేననీ, తనతో పెట్టుకోవద్దని కాంట్రాక్టర్లను బెదిరించి టెండర్ వర్క్‌లను ఇనానిమస్‌గా పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు...  అదే మంత్రంతో ఇంజనీర్లను బెదిరిస్తున్నాడు. మీటింగ్‌లలోనూ, చర్చల్లోనూ తన చావు గురించి మాట్లాడుతున్నాడు.  తన మీద జనాల్లో సానుభూతి పెరిగేందుకు దారులు నిర్మించుకొంటున్నాడు.  తనంటే భయపడే దశనుంచి - తన మీద సానుభూతి చూపే దశకు పయనిస్తున్నాడు.
  అతను ఎక్కువగా రాజధానిలోనే గడుపుతున్నాడు.
  అతని విరోధులకు మాత్రం అతని మాటల్లోని చావు భయం సంతోషాన్ని కలిగిస్తూ వుంది. ఇంత కాలానికి అతని కళ్లల్లో భయపు నీడలు దోబూచులాడటం చూసి వింతగా అనుభూతిస్తున్నారు...  కథలు.. కథలుగా చెప్పుకొంటున్నారు.

                                                                                                                  .......సశేషం


      ట్యాంక‌బండ మీద మార్చి 10 న జరిగిన సంఘటనలకు కారణం ముమ్మాటికీ మీరే..మీరే..మీరే..! తప్పదు ఆ అపనింద, మీరు మోయాల్సిందే..!! మీరు చేసిన పనివలన  ఇప్పుడు తెలంగాణ పోరాటయోధుల మీద ఎన్ని అభాండాలో.. ఎన్ని అపనిందలో..బయటి ప్రపంచంలో ఎన్ని చీత్కారాలో.. చూశారా..??  మీరు ఎంతో మక్కువతో, ప్రీతితో ప్రతిష్టింప చేసిన విగ్రహాల వలన ఎంత మందికి ఎన్నిరకాల అవమానాలో గమనిస్తున్నారా..? ముఖ్యంగా 600 మంది తెలంగాణ అమరవీరులు ప్రాణత్యాగం చేసిన పోరాట స్పూర్తి  మీద నిన్న జరిగిన ఈ విగ్రహాల దాడి ఎంతటి మాయన మచ్చలా మిగిలిందో..చూడండి..!!

     
        అవును మహానుభావ..!  తమరు ఎంతో మక్కువతో ప్రతిష్టింప చేసిన ఆ విగ్రహాల మూర్తులు " మేము మరణించాక మా శిలావిగ్రహాలను రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టించండి "  అని మిమ్మల్ని గాని లేక మరెవరితోనైనా విన్న వించుకున్నారా..?  లేదే..!!  పాపం వారేదో వారి జీవితంలో వారికి తోచినది.. తాము అనుకున్నది పట్టుదలతోనూ..  అకుంఠిత దీక్షతోనూ.. సమాజంలో జరగుతున్న అవతవకల మీద పోరాడి సమాజ శ్రేయస్సుకోసం తమ జీవితాన్ని అంకితం చేశారు.. అది తమ విది అనుకున్నారు.  అంతే గాని.. తమ తదనంతరం తమ రూపాలతో విగ్రహాలు చేయించి..పూజించ బడాలని కోరుకోలేదే..? కనీసం అలాంటి తలంపు కూడ వారి మదిలో మెదిలిండదు..! మరెందుకయ్యా వారి ప్రతిరూపాలని చెక్కించి ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టించి.. చివరికి ఇప్పుడు ఇలా కొంతమంది " పోరాట యోధుల " చేత పెకలింపబడి నడిరోడ్ మీద మెడకు తాళ్లేసి ఈడ్చి హుస్సేన్‌సాగర్‌లో పడేలా చేశారు..??  

    పాపం అన్నమయ్య ! తనకే ప్రాంతీయ, కుల భేదాలు లేని మనిషి. తనేదో భక్తి పారవశ్యంలో కొన్ని వేల పాటలు రాసి వాటికి బాణీలు కట్టి  తెనుగుకే శోభ తెచ్చి తన సాటి తెలుగువారందరికీ ఎన్ని తరాలైన తరగని మరువలేని సంగీత అమృతాన్ని అందించారు. అంతమాత్రాన 600 మంది ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కంటే అన్నమయ్య గొప్పవాడా..?

     ఎర్రాప్రగడ.. పాపం పిచ్చోడు..!  ఆయనెప్పుడు అనుకొని వుండరు.. తను మహాభారతంలో కొన్నిపర్వాలను తెనుగులోకి అనువాదం చేసిన పాపానికి తన ప్రతిమతో ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టింపబడి  కొంత మంది త్యాగధనుల చేత ముక్కలు ముక్కలుగా గావించబడతానని...!!.  ఇక  " తెలుగదేలయన్న దేశంబు తెలుగేను... దేశభాషలందు తెలుగు లెస్స " అని పలికిన పాపానికి పక్క రాష్ట్రం వాడు.. పరాయి భాషకు చెందిన శ్రీకృష్ణదేవరాయలును సైతం వదలలేదు..మన త్యాగమూర్తులు.!  మనల్ని ఎంతోగాను గౌరవించిన మనిషిని మనం గౌరవించిన తీరు..బేష్..చాలా బాగుంది.  ఇలా ఒకరేమిటి.. గుఱ్ఱం జాషువా..బళ్లారి రాఘవ. విప్లవాలకు ఆనవాలైన శ్రీశ్రీ. ఆదికవి నన్నయ భట్టు. త్రిపురనేను రామస్వామి చౌదరి. సమాజంలోని సాంఘీక దురాచాలాను రూపుమాపేందుకు కృషి చేసిన సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం.మువ్వగోపాల పదాలను మురిపెంగా ఆలపించిన క్షేత్రయ్య. ఇలా ఎందరో వైతాళికులకు అవమానం జరగడానికి కారణం మీరు కాదా యన్.టి.ఆర్ గారు..??

     అంతే కాదు  మీరు గాని ఆ విగ్రహాలను ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టింప చేయకుండ వుండుంటే వాటి మీద దాడి చేసే అవసరమే  తెలంగాణ పోరాటయోధులకు వచ్చుండేది కాదు. వారి మీద అన్ని అపనిందలు వచ్చుండేవి కావు..!   ఆ తప్పంతా మీదే..మీదే...యన్.టి.ఆర్ సారూ....!! మీది కాదంటారా..?  కాదంటారా..? కాదేమోనా..!! అదెలా..? లోతుగా ఆలోచించాలా..!!  కూసింత లోతుగా ఆలోచిస్తే ....నిజమే తప్పంతా మీది కాకపోవచ్చు..!  తప్పంతా మీలో ఉన్న సంస్కారానిది, మన తెలుగువాళ్లు అని తలించిన మీ కృతఙ్ఞతది,  అవును మాస్టారూ.. తెలుగుజాతికి స్పూర్తి ప్రధాతలై, పధనిర్దేశుకులై, దృవతారలగ నిలిచి మానవ చరిత్రకు రూపకల్పన చేసిన మహనీయులను స్మరించుకోవడం, గౌరవించుకోవడం మన కర్తవ్యం అనుకొన్న మీ ఔనత్యానిది సర్ తప్పంతా....!  ఒక విషయం గమనించారా..! ఈ సంఘటన జరగకమునుపు వరకు ట్యాంక్‌బండ్ మీద ఉన్న మహనీయ విగ్రహాలు చూసినప్పుడల్లా  " ఆహా యన్.టి.ఆర్ ఎంత మంచి పని చేశారు. తన రాజకీయచరిత్ర ఎలా ఉన్నా "  అని అనుకునేవాడిని, కాని ఇప్పుడూ ఈ సంఘటన జరిగాక మీ మీద నింద మోపాల్సి వస్తున్నది. చూశార..!!  నిన్నటివరకు మంచి అనుకున్నది కాలంతో పాటూ మారుతూ ఈ రోజు చెడు అవుతున్నది..నిన్నటి దినం చెడు అనుకున్నది  ఈ రోజున మంచి అవుతున్నది.  తెలుగు భాష మీద, వైతాళికుల మీద మీకున్నంత  అభిమానం. కృతఙ్ఞత,  అభిలాష సాటి తెలుగువారమైన మాకు లేవు సర్.. మాకు ఏ చరిత్రా అవసరం లేదు..ఏ మహనీయులు అవసరం లేదు...! మా సంకుచిత భావాల ముందు మీ మహనీయుల విలువ ఎంత..? మాకు కావలసింది కేవలం మా వ్యక్తిగత క్షేమమే.. వ్యక్తిగత అభివృద్దే..! మా వ్యక్తిగత ఆకాంక్ష కన్నా ఏ మహనీయులు గొప్పవారు కారు. కావాలనుకొంటే మీరు చెబుతున్న ఆ మహనీయుల్లోని వ్యక్తులను మేము కులాలవారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా విడదీసి పంచుకొని గౌరవిస్తాము. కనీసం మీరు ఆ విదంగా సంతృప్తి పడండి మాస్టారు. అంతెందుకు సార్ ఎవరన్న ఒక విశిష్ట వ్యక్తిని తీసుకుందాము, మేము అతనిలో వున్న ప్రతిభనో లేక  వ్యక్తిత్వాన్నో చూసో గౌరవించం, ఆ వ్యక్తి యెక్క కులాన్ని చూసో లేక ప్రాంతాన్ని చూసో ఆ మనిషి యెక్క ప్రతిభను గుర్తించి గౌరవిస్తాము. అది మా తత్వం. ఆ ప్రాతపదికగనే మహనీయులను పంచుకుంటున్నాము కూడా. అంతెందుకు ఇప్పటికీ మిమ్మల్ని కూడ ప్రాంతీయ, కులాల ప్రాతిపదికంగా చూస్తూన్నాము అంతే కాని.... ఒక తెలుగువాడిగా దానికన్నా ముందు కళారంగంలో ప్రతిభావంతుడైన ఒక విశిష్ట వ్యక్తిగా గుర్తించటం లేదు... ఇది ముమ్మాటికి నిజం.
 
     అయినా మీ పిచ్చిగాని మాస్టారు, ప్రస్తుత ప్రపంచీకరణ ఆర్థిక సరళీకృత విధానాలలో కొట్టుకుపోతూ మమ్మల్ని మేమెప్పుడో కోల్పోయి చాలా కాలం అయ్యింది, మాకు మా మూలాలు ఏవీ అవసరము లేదు. దేశంలోనికి, రాష్ట్రంలోకి ఏ కొత్త ప్రక్రియ వచ్చినా పోలోమంటూ ఒక " గొర్రె " దాటులా వెళ్తున్నాము. మెమెప్పుడో పరాయికరణ చెంది వున్నాము మా ప్రస్తానమంతా ఒక వ్యాపారం దిశగా ఒక వ్యక్తిగత లాభాపేక్ష దిశగా సాగుతున్నది.  వీటి మద్యలో మీరింకా మహనీయులు.. మహాత్మలంటూ ప్రాకులాడితే ఎలా మాస్టారూ...?

   ఇంతజరిగినా.. ఇప్పటికి మీరు మహనీయులుగా భావిస్తున్న ఆ విగ్రహాలను  " వట్టి విగ్రహాలు "  గానే చూస్తున్నాము. మరి వట్టి విగ్రహాలు అని తెలిసీ ఎందుకు వాటిని ద్వంసం చేసామో అని మమ్మల్ని మేము ప్రశ్నించుకునే సంస్కారం మాలో కనపడట్లేదు...!  అవి వట్టి విగ్రహాలు కాదని మాకూ తెలుసు ఆ విగ్రహాలు వెనుక కొన్ని భావాలు, ఆరాధనలు వున్నాయని తెలుసు.. ఆ విగ్రహాలు మాటున మీ భావాలను ఆరాధనలు విద్వేషంతో ద్వంసం చేయాలన్న ఉద్దేశంతోనే చేశాము... అయినా మేము వాటిని " వట్టి విగ్రహాలు " అనే బుకాయిస్తాము. విగ్రహాలు కావాలనుకుంటే మళ్లీ పునర్‌నిర్మించుకోవచ్చు అదే 600 మంది ప్రాణాలు తిరిగి తేగలమా ? నిజమే పోయిన ప్రాణాలు తిరిగి తేలేమూ..!! అదే విదంగా విద్వేషంతో విగ్రహాలను ద్వంసం చేసి తిరిగి మళ్లీ పునర్‌నిర్మించుకోగలమూ కాని ఆ ద్వంసరచన చూసి గాయపడి ముక్కలైన కొందరి మనుషుల భావాలను మళ్లీ అతికించుకోగలమా..?  అయినా పోయిన ప్రాణాలకూ ఈ విగ్రహాల విద్వంసానికి లంకె ఏమిటి..?  అది సరే మాస్టారు 600 మంది ఆత్మార్పణం చేసుకొన్న అమరవీరులెక్కడ..! కేవలం పుట్టారు కాబట్టి ఏదో కొన్ని పనులు చేసినందుకే  మహనీయులని ఒక ట్యాగ్ తగిలించిన ఆ పాతకాలపు మనుషుల విలువ ఎక్కడ..? వారికి వీరికి పోలికేంటి..!! వారేమన్న ఆత్మార్పణం చేశారా..? లేక సాధించుకోవడం చేతకానప్పుడు ఎమోషన‌ల్‌గా బెదిరించడానికి ప్రాణత్యాగం చేశారా...చెప్పండి..? మా 600  మంది అమరవీరుల ప్రాణాలు పోయాయి కాబట్టి మేము దానికి బదులుగా ఎన్నో విద్వంసాలు చేస్తాము.. అది మా హక్కు..దాన్ని కాదనడానికి ఎవరికీ ఏ హక్కు లేదు... అర్హతా లేదు.

   అయ్యా యన్.టి.ఆరూ అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వివాదలతో ముగిసింది మీ మరణం..!  దానిగురించి పెద్ద పేచీ లేదు కాని, మీరింకా ఇప్పటి వరకు బ్రతికే ఉండుంటే ఈ సంఘటన చూసి మీ గుండె పగిలి మరిణించేవారు.. దీని కన్నా అప్పటి మరణమే మేలనపిస్తుంది.. ఇలాంటివి చూడకూడదనే మీరు ముందుగానే స్వర్గస్థులైనారు, అంతకన్న అదృష్టం ఎవరికుంటుంది..! శుభం......

     రాష్ట ప్రభుత్వం వారికి నాదో విన్నపం :  అయ్యా ఘనత వహించిన ముఖ్యమంత్రిగారు, ప్రభుత్వ అధికారుల్లారా..! ఇప్పటికైనా మించిపోయినది ఏమి లేదు.. విద్వంసం తర్వాత ఇంకా మిగిలిన కొన్ని విగ్రహాలు ట్యాంక్‌బండ్ మీదనే వున్నాయి.. ఆ మిగిలిన విగ్రహాలను కూడ దయచేసి అక్కడనుండి పెకలించి ఏ గోదాములలోనో లేక మీ ప్రభుత్వ కార్యాలయ స్టోర్ రూములలొనో పడేయండి.. అక్కడన్న మనస్సాంతిగా వుంటాయి. ఆ మహనీయులు తమ తదనంతరం ఏ కీర్తిని కోరుకోలేదు, ఏ విగ్రహాలు తయారు చేయాలని కోరుకోలేదు.. ఏదో తమ వంతు చేయవలసిన కార్యక్రమాలు, సంస్కరణలు, మానవాళికి ఉపయోగేపడే విధానాలు, పనులు నిర్వర్తించి వెళ్లిపోయారు. వారు ఏ పూజలు కోరుకోలేదు, ఏ కీర్తిని ఆశించలేదు. పాపం యన్.టి.ఆర్ గారు తనలోని కళారాధనను సంతృప్తి పరుచుకోవడానికి ఆ మహనీయులు ప్రతిరూపాలను నిర్మించి ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టించారు. ఇప్పుడేమో మనం వర్గాల వారిగా విడిపోయి ఆ మహనీయులను ద్వంసం చేయడానికి పూనుకొన్నాము. వారి ఆత్మ ఘోషిస్తుంది. ఎందుకు వారిని బాదపెట్టడం.. ఎక్కడో ఒక గదిలో ఏదొక మూలన వున్నా పర్లేదు.. ఏగొడవలు, విద్వంసాలు లేకుండా జీవితం ప్రశాంతంగా గడుస్తుంది వారికి. ఇంకా ఆ ట్యాంక్‌బండ్ మీద అలానే వుంచితే మళ్లీ ఏ మార్చో..లేక ఏ గర్జనో..లేక ఏ బాగో కార్యక్రమం లాంటివి తలపెట్టి మిగిలిన ఆ విగ్రహాలను కూడ ద్వంసం చేస్తారు.. అలా జరగకమునుపే మీరు త్వరపడి..వాటిని అక్కడ నుండి తరలించండి. ఆ విగ్రహాలకు మనస్సాంతిని కలిగించండి. త్వరపడండి.. ఈరోజు సంఘటన రేపటికి మరుపుని తెస్తుంది అది అనివార్యం కూడ.. మళ్లీ ఎప్పుడో ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు మళ్లీ మనస్తాపం..! అలాంటివి మళ్లీ జరగకుండా త్వరపడండి
 

                                                                                    .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

   ఈ దఫా ఎనుబోతుల సుబ్బారెడ్డి లాంటి వాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు.  టీంను పటిష్టంగా తయారు చేశారు. వీలైతే రైల్వేస్టేషన్‌లోనే అతన్ని లేపేయాలని వుంది వాళ్లకు.. లేదా గేటు బైటనయినా...!                
 ట్రైన్ వచ్చే సమయానికి పదినిమిషాల ముందుగా స్టేషన్‌కు చేరారు.  జనాల్లో కలిసిపోయి ఎదురు చూడసాగారు..
   ఐదునిమిషాలు గడిచాయో లేదో బూట్లు టకటక లాడించుకొంటూ ఇరువై మందిదాక పోలీసులు స్టేషన్‌లోకి ప్రవేశించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫ్లాట్ ఫాం అంతటా కలియ దిరుగుతూ ఎవరికోసమో వెదక సాగారు.
 శివపురి వాళ్లకు కొంత బెదురు పుట్టింది.
 తమ జేబుల్లో, బ్యాగిల్లో బాంబులున్నాయి.
 దొరికితే ప్రయత్నమంతా వృధా అవుతుంది.
 టెన్షన్ ఫీలవుతూ నిల్చుండి పోయారు.
  అంతలో ఫ్లాట్ ఫాం చివరినించి ఓ వ్యక్తిని లాక్కొచ్చారు పోలీసులు. అతని చేతిలో బ్రీఫ్ కేసుంది.
 అతని కోసమే వున్నట్టుంది వాళ్ల హంగామా అంతా.
 అతని చుట్టూ నిల్చున్నారు పోలీసులంతా.
 ’ మనిషి దొరికాడు గదా ! వెళ్లిపోతారనే అనుకొన్నాడు ’ రమణారెడ్డి
 అట్లా జరగలేదు.
 బ్రెఫ్ కేస్ ఓపెన్ చేశారు.
 దాన్నిండా బంగారు బిస్కట్లు.
 చూసే వాళ్లందరికీ కళ్లు బైర్లు కమ్మాయి.
 ఎవరో ప్రొద్దుటూరు వ్యాపారస్తుడట...!
 బంగారం స్మగ్లింగ్ చేస్తున్నాడని స్పష్టమైన ఫిర్యాదు అందటంతో సకాలంలో వచ్చి పట్టుకొన్నారు. మామూలుగా రాయలసీమలోని నాలుగు జిల్లాల వారు పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారు కొనుగోలు చేయడానికి రాయలసీమ నడిబొడ్డునున్న కడపజిల్లాలోని ప్రొద్దుటూరు తాలుకాకి వస్తారు. అక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలం నాటినుండి బంగారు, రతనాలు, వైడూర్యాలు రాశులుగా పోసి వీధుల్లో అమ్మే ఆనవాయితీ ఉండేది..! అలా వీధుల్లోరాశులుగా కాకున్నా అంగల్లలో అదే ఆనవాయితీ ఇప్పటికి కొనసాగుతూ వున్నది ఆ ప్రాంతంలో.  ముంబాయి నుండి భారతదేశంలోనే కొనుగోలు చేసేవారి శాతంలో70% పైగా ఈ ప్రొద్దుటూరు తాలుకా వారే కొనుగోలు చేస్తారట..!! అలా ముంబాయి నుండి బంగారు బిస్కెట్లు తెస్తూ అప్పుడప్పుడూ ఇలా పోలీసులకు పట్టుబడుతూ వుంటారు.
 అతనికి తోడుగా మరో వ్యక్తి వున్నాడని పోలీసుల అనుమానం
 దొరికిన వ్యక్తిని అక్కడే ఇంటరాగేట్ చేస్తున్నారు.
 పెద్ద హడావిడి సృష్టిస్తున్నారు.
 ట్రైన్ వచ్చే సమయమైంది.
చెన్నారెడ్డి స్టేషన్‌లో కాలుమోపే టైం దగ్గరబడింది.
 అతని మీద అటాక్ చేసేందుకు సిద్దమై వున్నారు రమణారెడ్డి వర్గంలోని ప్రతిమనిషి.
 అంతమంది పోలీసుల సమక్షంలో అది సాధ్యమయ్యే పనిగాదు.
అలాగని వాళ్లు ఇప్పుడిప్పుడే స్టేషన్ వదిలేట్టు లేరు.
 టెన్షన్‌గా వుంది.
 అంది వచ్చిన అవకాశం మరోసారి చేయిజారి పోయేట్టుంది.
 బాలుడయితే జుట్టు పీక్కున్నాడు.
 పోలీసుల ఇంటరాగేషన్ పూర్తి కాలేదు.
 బంగారు బిస్కట్లు బ్రీఫ్‌కేస్ మీంచి జనాల చూపులు ససేమిరా వెనక్కి రావటం లేదు.
శివపురి వాళ్ల ఆందోళనను రెట్టింపు చేస్తూ ట్రైన్ రానే వచ్చింది. అప్పుడే గేట్లోంచి స్టేషన్ లోపలికొచ్చారు ఓ ఇరువైమంది వ్యక్తులు,  వాళ్లంతా చెన్నారెడ్డికి సంబంధించిన వాళ్లు.
  సమాచారం అందుకొన్నట్లుంది. పగడ్బందీగా వచ్చారు.
ఫ్లాట్‌ఫాం మీద నిలబడుకొని చుట్టూ వున్న జనాల్ని గమనించసాగారు.
  వాళ్ల కళ్ల బడకుండా ముఖం చాటేసుకొన్నారు రమణారెడ్డి మనుషులు.
 మద్యలో పోలీసుల గుంపు వుంది.
 వాళ్ల ఇంటరాగేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
 అదే సమయంలో ట్రైన్ దిగాడు చెన్నారెడ్డి - తన నలుగురు అనుచరులతో.
 హడావిడిగా బైట్నించి వచ్చిన వాళ్లు అతన్ని చుట్టుకొని స్టేషన్ బైటకు తీసుకెళ్లారు.
 వాళ్లను ఫాలో చేయటంలో ఉపయోగం లేదని అర్థమైంది రమణారెడ్డికి.
 పోలీసుల విచారణ జరుగుతూనే వుంది.
 వాళ్ల మీద పీకల్దాక కోపమొచ్చింది బాలునికి.
 మంచి అవకాశాన్ని చెడగొట్టారు. ప్లానంతా నాశనం చేశారు.
 కొంత సేపు తల పట్టుకుండి పోయాడు.
 ఇంకా హడావిడి చేస్తోన్న పోలీసుల్ని చూస్తోంటే చురచుర మండుతోంది.  బంగారం దొరికింది. స్మగ్లర్ దొరికాడు. వెళ్లిపోవచ్చుగదా...!
 అంగట్లో లాగా బంగారాన్ని అందరిముందు ప్రదర్శిస్తూ తమ గొప్పదనాన్ని చాటుకోనేందుకు వేషాలు వేస్తున్నారు.
  ఆ బంగారపు బ్రీఫ్‌కేసు ముందునించే చెన్నారెడ్డి ధీమాగా నడుచుకొంటూ వెళ్లాడు.
 తమ చేతిలో తగినన్ని బాంబులు వుండి కూడా ఏం చేయలేక పోయారు.
 ఇప్పుడీ బాంబుల్ని పోలీసుల మీద విసరి బంగారాన్ని పట్టుకుపోతే ఎట్లా వుంటుంది..?
  జీవితాంతమయినా పార్టీ నడిపే సత్తా వస్తుంది గదా..!
 మంచి ఆర్థిక పుష్టి లభిస్తుంది గదా..!
 మనసులోని మాట జయసింహకు చెప్పాడు బాలుడు.
 అతను ’సై ’ అన్నాడు.
 మరి కొందరు వత్తాసిచ్చారు.
 బాంబులు విసరి పోలీసుల్ని తరమటం పెద్ద పనిగాదు.
 బంగారాన్ని తీసికెళ్లటం కష్టమేమీ కాదు.
 వాళ్ల రహస్య మంతనాల సారాంశం తెలీగానే ఉలిక్కిపడ్డాడు రమణారెడ్డి.
 జర జర దూరంగా లాక్కుపోయాడు బాలున్ని.
 " నీకేం బుద్దిందా ? లేదంటరా ? "  అన్నాడు. " డిపార్ట్‌మెంట్ మీంద బాంబులేస్చానంటావు. ఆలోచించే మాట్లాడుతున్నావా..? "  అంటూ మందలించాడు.  " ఉన్న కేసులు చాలవనా ?- పోలీసులతో కూడా గొడవపడటం !  డిపార్ట్‌మెంట్‌తో చెడ్డయి మనం తట్టుకోగలమా ? "
  " అదీ..  మరి  ఆనాకొడుకులు కదలకుంటేనూ.. "  తలగోక్కున్నాడు బాలుడు.
  జయసింహను కూడా పిల్చి మందలించాడు.
 తన వాళ్లందర్నీ తీసుకొని స్టేషన్ బైటక్కదిలాడు.
 అంతులేని నీరసం ఆవహించింది అందరికి.
 ప్రతి ప్రయత్నమూ చిన్న ఆటంకంతో విఫలం కావడం బాధాకరంగా వుంది. లక్ష్యాన్ని సాధించగలమా ?  లేదా ?  అనే సందేహం కూడా కలుగసాగింది.

        ***********

  దాడులు విఫలమయ్యేకొద్దీ రాజకీయంగా ఎదుగుదల కనిపిస్తూ వుంది. పలుకు బడి పెరుగుతూ వుంది. చిన్న చిన్న పంచాయితీలకు కూడా పిలుస్తున్నారు. ఏవైనా మండల స్థాయి సివిల్ వర్క్‌లకు టెండర్లలో పోటీ పడటం కూడా చాలిస్తున్నారు అవతలి వాళ్లు.. తమకు సంబంధించిన మూడు మండలాల్లో చాలా పనులు ఇనానిమస్‌గా తమకే దక్కుతున్నాయి.
 చెన్నారెడ్డి హవా కొంత వరకు తగ్గింది.
ఆఫీసుల్లో కూడా తమ పనులకు ఆటంకాలు కలుగటం లేదు.
 ఒక ధ్యేయంతో తాము ప్రయాణించాలనుకొంటే మరో లక్ష్యాన్ని తాము తాకేట్లున్నారు.
తాము ఆశించింది ఒకటి.
 అందుకోబోయేది మరొకటి.
 రాజకీయంగా తమ ఎదుగుదల తమకే స్పష్టంగా కన్పిస్తోంది.
  తాము ప్రయాణించాలనుకొన్న దారి ఇప్పుడు రెండుగా చీలి మరో వైపు ఆకర్షిస్తూ వుంది.
 ఈ పరిణామమంతా పసిగట్టినట్లున్నారు జి.పి.ఆర్ వగైరా పాత నాయుకులు.  ఈ మద్య కాలంలో మళ్లీ జనాల్లోకి రావటానికి ప్రయత్నిస్తున్నారు. తమను ఆసరా చేసుకొని పూర్వపు రాజకీయాల్ని పునరుద్దరించుకొనేందుకు నడుం బిగించబోతున్నారు.
  రమణారెడ్డికి ఓ విషయం స్పష్టంగ అర్థమవుతోంది.
 ఆవేశ పరుల ద్వారా చెన్నారెడ్డిని చంపించి తాము రాజకీయంగా పూర్వవైభవాన్ని పొందాలని వాళ్ల ఆలోచన.
 పని మూర్ఖులైన ఆవేశపరులు చేయాలి,.
 ఫలితం తాము అనుభవించాలి.
 తను ఆవేశపరుడేగాని మూర్ఖుడు కాదనే విషయం ఏదొకరోజు తెలిసి వస్తుంది లెమ్మనుకొన్నాడు రమణారెడ్డి,
 తనే తెలిసి వచ్చేలా చేయగలడు.
 అతని లక్ష్యం ఒక్కటే -
 ’పని తామే చేయాలి - ఫలితం కూడా తామే అనుభవించాలి ’  

                  *****************

  తన మీద రైల్వేస్టేషన్ వద్ద అటాక్ జరగబోయి పోలీసుల కారణంగా తృటిలో తప్పిపోయిందనే విషయం కొంత కాలం తర్వాత చెన్నారెడ్డికి తెలిసింది..
 అప్పట్నించి అతనికి ప్రాణ భయం పట్టుకొంది.
 తను ఎంతమంది ప్రివేటు వ్యక్తుల్ని రక్షణగా ఉంచుకొన్నా వాళ్లు లెఖ్కజేసేట్టు లేరు.
 పోలీసులే నయం లాగుంది.
 జి.పి.ఆర్ వద్ద అటాక్ జరిగినపటి నుండి పోలీసుల మీదే ఎక్కువ నమ్మకం వుంచుకొన్నాడు అతను. తన మీద జరిగిన దాడుల్ని ప్రాతి పదికగా ఎక్కువ సెక్యూరిటీ అరేంజ్ చేయించుకొన్నాడు.
  పోలీసులు లేకుండా బైటకు అడుగేయటం లేదు.
 ఏవైపునించి దాడి జరుగుతుంతో వూహించలేని పరిస్థితి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థాయిలోనైనా జరగొచ్చు.
 తన మనుషులకు గతంలోలాగ ఆఫీసర్లు పలుకటం లేదని తెలుస్తోంది. దానికి కారణం తను ఆఫీసుల్ని దర్శించక పోవటమే.
 చావు ఎలాగూ వాళ్ల చేతుల్లో రాసిపెట్టున్నపుడు ఇంట్లో దాక్కుంటే తప్పిపోదు గదా !
  రాం పల్లె నించి తన ఫాలోయర్ నాగన్న వచ్చాడు.
 అతను నిత్యావసర వస్తువుల చౌకడిపో డీలర్.
 డి.డి కట్టినప్పటికీ ఎమ్మార్వో బియ్యం ఎత్తించలేదుట.
 అప్పటికే రెండుసార్లు వచ్చివున్నాడు తన వద్దకు అతను.
 ఇంట్లొంచి కదలక తప్పలేదు.
 ఏమయితే అదవుతుందని నలుగురు గన్‌మెన్‌లను వెంటేసుకొని జీపెక్కాడు.
 నేరుగా ఎమ్మార్వో ఆఫీసు వద్ద దిగాడు.
 టక టక చెప్పుల శబ్దం చేసుకొంటూ లోపలికెళ్లాడు.
ఉద్యోగులంతా లేచి నమస్కరిస్తోన్నా పట్టించుకోలేదు.
 ఎమ్మెల్లేను చూడగానే కుర్చీలోంచి నిటారుగా లేచి నిల్చున్నారు ఎమ్మార్వో.
లోపలికి వెళ్లి కుర్చీ లాక్కుని కూచున్నాడు చెన్నారెడ్డి.
 ఎమ్మార్వో కేసి చూస్తూ  " నేను ఎమ్మెల్లే చెన్నారెడ్డిని. చింతకుంట చెన్నారెడ్డిని...  గుర్తు పట్నెవా  ? .. "  అన్నాడు.
 " సార్ !...  సార్ !... "  అంటూ చేతులు కట్టుకొన్నాడు ఎమ్మార్వో.  అతనికి వెంటనే అర్థమైంది వెనకున్న నాగన్నను చూడగానే.
 " ఈ మద్య ఆఫీసులకు రావడం లేదులే...  మర్చిపోయానారేమోననీ "  ఎమ్మార్వో కళ్లల్లోకి సూటిగా చూశాడు.
 " సార్ !  మిమ్మల్ని మర్చిపోవడమేంది సార్ !.. సార్ - " చేతులు నలుపుకొంటూ అలాగే నిల్చున్నాడు.
  కూచోమన్నా కూచోలేదు.
 " సార్..  యీ నాగన్నకూ... "  అంటూ నసిగాడు సమస్య ఎమ్మెల్లే నోటినుంచి రాకముందే.
 " ఆ...  నాగన్నకు...? "
  " ఆయనకు బియ్యం ఎత్తియ్యొద్దని శివపురీ వాల్లు వార్నించ్చినారు సార్ ! డీలర్‌ను మార్చాలంట.. "  అతని గొంతులో సన్నని వణకు.
 " మార్చినారా...? "
 " లే.. లే..లేదుసార్ ! "
 " మరెందుకు సరుకెత్తీయలా ? "  గద్దించాడు.
 చేతులు పిసుక్కుంటూనే వున్నాడు ఎమ్మార్వో.
 " చూడు !... .. నా సంగతి నీకు తెల్దేమో ! పద్దతిగా నడిచ్చే నేను చాలా పద్దతయిన వాన్ని.  కారణం లేకుండా నా వాల్లకు అన్యాయం సేచ్చే నేను సహించను. ఏదైనా అవినీతి పన్జేస్తే సస్పెండ్ చేయండి. ఎవడో బెదిరించినారని వీల్లకు అన్యాయం సేచ్చే ఎట్లా ? నన్నూ బెదిరిచ్చనారు చంపుతామని..సంపుతారో... ఏమో !  నాకు పానాల మీద ఆశ లేదు...  ఏదొకరోజు చచ్చేవాన్నే ! నేను సచ్చేలోపల మీలాంటి వాల్ల అంతు జూస్చా...  జాగ్రత్త.. "  అంటూ హుంకరించాడు.
  అప్పటికే వొళ్లంతా పదురుతూ వుంది ఎమ్మార్వోకు.
 " ఎత్తిస్తా సార్... "  భయభ్రాంతుడవుతూ తలూపాడు.
 మరో సారి హెచ్చరించి వెళ్లి జీపెక్కాడు చెన్నారెడ్డి.
 అధికారుల్ని బెదిరించటంలో కొత్త సైలి వచ్చింది.
 తన వొళ్లంతా పట్టి పీడిస్తొన్న చావు భయం తెలివిగా వాడుకొంటున్నాడు.
 చుట్టూ నలుగురు పోలీసులూ, వాళ్లవద్ద అధునాతన ఆయుధాలు వున్నా అతనిలోని భయం తొలిగిపోవటం లేదు.  జీపు వెళుతోంటే పరిసరాలన్నిటినీ అనుమానంగానే చూస్తున్నాడు.  ఏ వైపునించి దాడి జరుగుతుందోనని భయపడుతున్నాడు.
 పార్టీ మీటింగ్‌లలో పాల్గొనటానికి జంకుతున్నాడు.
 పెళ్లిళ్లకు హాజరయ్యేందుకు భయపడుతున్నాడు.
 తన్ను చూసి పరామర్శించడానికి వచ్చిన వాళ్లవద్దా, తనతో అరమరికలు లేకుండా మాట్లాడే వారివద్దా గుండెలు విప్పుతున్నాడు.  పల్లెల్నించి ఏదైనా పనిమీద టౌనుకొచ్చి ఎమ్మెల్లేను కలిసిపోదామని ఇంటి కొచ్చిన పెద్దమనషుల్తో  " మిమ్మల్ను మల్లా సూచ్చానో ! లేదో ! "  అంటూ బాధ పడుతున్నాడు.  మరీ సన్నిహితుల వద్ద కళ్ల నీళ్లు పెట్టుకుంటున్నాడు.
 ఏ ఆఫీసరయితే తన వాళ్లకు పలుకలేదో, - అతని మీద దాడి జేస్తున్నాడు.  తనకెటూ చావు ఖాయమైందనీ, తనతో బాటు వాళ్లు కూడ రావాలని కోరుకోవద్దంటూ హితబోధ చేస్తున్నాడు.
 ఏది ఏమైనప్పటికీ చెన్నారెడ్డికి ఏర్పడిన చావు భయం చాలా మందికి తెలిసిపోయింది.  అదో చర్చగా కూడా మారింది.

                  *********

  ఆ రోజు డి.డి.ఆర్.సి సమావేశంలో పాల్గొనేందుకు కడప వెళ్లాడు.
మద్యాహ్నం తనకు ఆకలి కాకపోవటంతో పళ్లు తెప్పించుకు తింటూ గన్‌మెన్‌లను భోంచేసి రమ్మని చెప్పాడు.
 వాళ్లు వెళ్లగానే మంచం మీద నడుం వాల్చడు.
 కన్ను కూరకబోతోండగా ఫోన్ మోగింది.
 వాచ్‌మెన్ పరుగెత్తుకొంటూ వచ్చి రిసీవర్ ఎత్తి  " సార్ ! మీకే ఫోన్.. "  అంటూ అందించాడు.
 రిసీవర్ చెవికి ఆనించుకోగానే రమాదేవి గొంతు.
 అర్జంటుగా ఇంటికి వెళ్లాలిట.
 కారణం చెప్పేసరికి క్షణం కూడా నిలువబుద్ది కాలేదు.
 లేచి బట్టలు సవరించుకొని చెప్పుల్లో కాళ్లు దూర్చుతూ ప్రయాణమయ్యేసరికి గన్‌మెన్‌లు ఇంకా రాలేదనే విషయం అర్థమైంది.
 మరో పదినిమిషాలు నిరీక్షించాడు.
  సమస్య తీవ్రత ఎదలోపల రగులుతూవుంది.
 వెంటనే వెళ్లాల్సిన పరిస్థితి.
 గన్‌మెన్‌ల మీద కోపం తన్నుకొస్తూవుంది.
 ఒక్కడే వెళదామనుకొంటే గుండెలు చాలటం లేదు.
 తోడు లేకుండా వెళ్ల లేని పరిస్థితి.
 తన మీద తనకే జాలేసింది.
 వెంట జనం లేకుండా వెళ్లలేని తన పరిస్థితిని తల్చుకొని తనకే సిగ్గేస్తోంది.
 గన్‌మెన్‌ల ఆలస్యం పట్ల కోపం ఎక్కువైంది.
 ఆవేశంలో ముక్కుపుటాలు అదురుతున్నాయి.
 " ఎట్టబోయినారు ఈనా కొడుకులంతా ? ..  ఒక్కడూ లేడు.. యాడికి సచ్చినారు..? ఈనాకొడకల తోడు లేకుండా బైటికి పొయ్యేదానికి లేదు... థూ..ఏం బతుకో..?.. ఆ శివపురి నా కొడుకుల్ను ఏసేస్తే గాని నాకీ బాధ తప్పేట్టు లేదు, థూ.. థూ.. ఏం బతుకులో.. "  కసిగా తిట్టుకొంటూ అటు ఇటు పచార్లు చేస్తూ మండిపడుతున్నాడు.
 కొంతసేపటికి గన్‌మఎన్‌లు వచ్చారు.
 గొణుక్కొంటూనే వాళ్లతో కలిసి జీపెక్కాడు.
 అతనికి నిలువెల్లా అంతులేని అసహనంగా వుంది.
 తన స్వేచ్చలేని తనం పట్ల అసహనం....
తనను అనుక్షణం బెదిరిస్తూ వుండే చావు పట్ల అసహనం....
 తను ఎంత మేపినా సమయానికి అక్కరకు రాని జనం పట్ల అసహనం..
తన భార్య పట్ల అసహనం....
 తనకు తానుగా ఎక్కడికీ వెళ్లేందుకు లేదు. అది ఎంత ముఖ్యమైన పనయినా గన్‌మెన్‌లు లేకుండా కదలేడానికి లేదు.
  పెళ్లయిన కొత్తలో పొద్దుకూకే దాకా సేధ్యం జేసి ఆదరాబాదరా ఇంటికెళ్లి స్నానం జేసి అప్పుడు దారిబట్టి డ్రామ పద్యాలు పాడుకొంటూ పదిమైళ్లు నడిచి అత్తగారి వూరు చేరుకొనేవాడు.  రాత్రి పెళ్లాంతో గడిపి తెల్లారకముందే లేచి మళ్లీ ఒక్కడే నడుచుకొంటూ తన వూరికి వచ్చి పనుల్లో కలుసుకుండే వాడు.  తన రాకడ పోకడ ఎవ్వరికీ తెలిసేది కాదు....  ఎంత స్వేచ్చ..!  కళ్లాల్లో మంచ మేసుకొని తెల్లార్లూ హాయిగా నిద్రబోయే స్వేశ్చ మళ్లీ వస్తుందా..?  జీవితాన్ని ఎంత ఇరుకుగా చేసుకొన్నాడు తను!  రోజు రోజుకు తను నడిచే రహదారిని సానబట్టి సానబట్టి పదునైనా కత్తి వాదరగా మల్చుకొంటున్నాడు.  దానిమీద నడిచేంత కాలం ఏ స్వేచ్చా వుండదు.. ఏ మనశ్శాంతీ వుండదు.

                                                                                                          .........సశేషం

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers