రెండురోజులుగా సినిమాటోగ్రాఫర్స్ సదస్సులో చాలానే టెక్నికల్ విషయాలు తెలుసుకున్నాము, రెండోరోజు సాయింత్రం సినిమాటోగ్రఫీ రంగంలో నిష్ణాతులైన వారికి లైఫ్‌ ఎచీవ్‌మెంట్ అవార్డ్స్ ప్రధానోత్సవం చేస్తున్నారు. అనిల్‌మెహత  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజెన్ కొఠారి గారిని అవార్డ్స్ ప్రకటించిమని కొరారు, రాజెన్ కొఠారి గారు శ్యామ్‌బెనగల్ చిత్రాలకు ఎక్కువగా సినిమాటోగ్రాఫర్ గా పని  చేసారు, ఆయన ప్రసంగం మొదలెడుతూ...."  నేను ఎప్పుడు మన ఫిల్మ్ ప్రోససింగ్ ల్యాబ్స్ వెళ్ళినా అక్కడ  కొన్ని నెగటివ్ ఫిల్మ్స్ ప్రోససింగ్ అయిన తర్వాత డ్రై కోసం ఒక చోట వ్రేలాడతీసే వారు..! అందులో ఒక నెగటివ్ చాలా డెన్సిటివ్‌తో ఉండేది..దానినినుండి ఎన్ని డూప్ నెగటివ్స్ తీసినా వరిజనల్ నెగటివ్‌లో ఎంత డెన్సిటి ఉన్నదో అంతే్ డెన్సిటి డూప్ నెగటివ్స్‌లలోఉండేది. ఎన్ని డూప్ నెగటివ్స్ తీసిన డెన్సిటీ మాత్రం మారదు...! అంత గొప్పగా   చిత్రీకరణ చేసే సినిమాటోగ్రాఫర్ నాకు తెలిసి దేశంలొ ఒకరే ఉన్నారు ఆయనెవరో కాదు  మన  R.M.Rao ..ఆంద్రప్రదేశ్ నుండి వచ్చి ఇక్కడ... అంటూ వివరిస్తూ  ఆయనని స్టేజ్ మీదకు పిలిచారు. తెల్ల చొక్క  ముదురురంగు ఫ్యాంట్‌లో ఇన్‌షర్ట్ చేసి  65 ఏళ్ళ వయసు సన్నగా జూట్టు నెరిసి ఉన్న వ్యక్తి  స్టేజి వద్దకు నడుచుకుంటూ వస్తున్నాడు....  ." అర్రె  ఈయనా....!!!  నేను రెండు రోజులుగా  సదస్సులోనూ..బయట టీ..స్నాక్స్ సమయాలలో..ఐమాక్స్ ఫాస్ట్ ఫుడ్ కోర్ట్ వద్ద చూస్తున్నా.., రాజీవ్ మీనన్, అశోక్ మెహతా, అనిల్ మెహతా చాలా మంది టెక్నీషియన్స్ ఈయనతో చాలా గౌరవంగా మాట్లాడుతుండేవారు, నేను కూడ ఒకటి రెండు సార్లు మాట్లాడడానికి ప్రయత్నించాను కాని సహజంగా నాలో ఉండే బిడియం ముందుకు సాగనివ్వలేదు, నేనలా మాట్లాడాలి అని అనుకోవడానికి గల కారణం రావు గారి ఆహర్యం ఒక రిటైర్డ్ హెడ్‌మాస్టారైన సగటు దక్షణభారతీయుడిలాగ ఉండేది. అప్పటికి నాకు ఆయన పేరు కూడ తెలియదు..బహుశ కలరిస్ట్ అయుండచ్చు అని అనుకున్నా....! ఇప్పుడు రాజెన్ మాటల్లొ తెలుసుకున్నా  అడ్వర్టైజ్‌రంగంలొఆయనొక డిమాండ్ ఉన్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అని,  తర్వాత  రావు గారి మీద తీసిన ఒక డాక్యుమెంటరీ ప్రదర్శించారు..అందులో దేశంలోని  అడ్వర్టైజ్ రంగంలో ఉన్న ప్రముఖ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్ అందరూ రావుగారి గురించి, ఆయన ప్రతిభ గురించి ఎన్నెన్నో చెప్పారు..తర్వాత  రావుగారు చేసిన కొన్ని యాడ్ ఫిల్మ్స్ అందులో ప్రదర్శించారు, అవి చూస్తే అర్థమవుతుంది రావుగారు ప్రతిభ ...!  " వోన్లీ విమల్, అప్పట్లో ఫేమస్ అయిన " లిరిల్ " యాడ్  , ఇక ఐ లవ్ యూ రస్నా, అన్నిటికన్న "FEVICOL " యాడ్,   నాకు తెలిసి ఈ యాడ్  ప్రతిభారతీయుడికీ గుర్తుండే ఉంటుందనుకుంటా..!!!? అలా ఎన్నో..ఎన్నెన్నో.....! ,  దాదాపుగా 4000 వేల పైచిలుకు యాడ్ ఫిల్మ్స్ చెసారు...అసలు నాలాంటి వారు ఊహించడానికి సాద్యపడలేదు..ఒకటా.. రెండా.....వందలా..వేలా..?   4000   యాడ్ ఫిల్మ్స్ అంటే మాటలా..!!! 46  ఏళ్ళుగా నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నారు..ఇప్పటికి అదే హుషారు..పని మీద అంతే నిబద్దత. కాలంతోపాటు మారుతున్న సాంకేతికవిషయాల మీద ఎప్పటికప్పడు అవగాహన పెంచుకుంటూ యాడ్ ఫిల్మ్ రంగంలో మొదటిస్థానంలో ఉన్నారు. సినిమాటోగ్రఫీ లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డ్‌ని అమెరికన్ సోసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫీ అధ్యక్షుడు మైఖల్ గోయి, అనిల్‌మెహతా, అశోక్‌మెహతా  ముగ్గురు కలిసి సంయుక్తంగా R.M.Rao  గారికి అందచేసారు.

       కార్యక్రమాలన్ని ముగిసాక..రాత్రి జరిగిన కాక్‌టేయిల్ పార్టీలో  రావుగారిని కలవాలని చూస్తుండగా ఒక చోట  మిత్రుడు " D " సినిమా సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్‌తో మాట్లాడుతూ కనపడ్డారు, వెల్లి కలిసి నన్ను నేను పరిచయం చేసుకొని వారి ఇంటర్‌వ్యూ కావాలని అడిగీ అనుమతి తీసుకొని మరసటి రోజు మద్యాహ్నం మహలక్ష్మి ప్రాంతంలో ఉన్న " ఫేమస్ స్టూడియో " బిల్డింగ్‌లో ఉన్న ఆయన ఆఫీస్‌కి వెళ్ళి కలిసాను. అక్కడ ఆయన సొంత కెమెరాలు ఉండే ఆఫీస్ అది. ఆ భవనంలో కేవలం యాడ్ ఫిల్మ్స్ ఏజన్స్‌సీస్ కార్యాలయాలు మాత్రమే ఊంటాయి. అక్కడ నుండి పక్క నున్న మరో భవంతిలో ఆయన ఇంకో ఆఫీస్‌కి వెళ్ళాము, నిజం చెప్పాలంటే నాకు ఆయన సరసన నించోని మాట్లాడే అర్హత ఉందో లేదో కూడ నాకు తెలియదు ..కాని ఆరోజున ఆయనతో కూర్చోని ఇంటర్‌వ్యూ తీసుకున్నా..ఆయన గురించి ఆయన మాటల్లోనే......


        రావుగారు : మా స్వస్థలం విజయనగరం, నేను అక్కడే పుట్టాను, తర్వాత ఉద్యోగరిత్యా మా నాన్నగారు మాకుటుంబాన్ని జంషేడ్‌పూర్‌కి మార్చారు,  బీహార్ యూనివర్సటీ ఆఫ్ జంషేడ్‌పూర్‌లో మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నాను ఆ సమయంలోనే   ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో స్టిల్ ఫోటోస్ తీస్తూఉండేవాడిని వాటిని ఫోటోగ్రఫీ ఫెస్టివల్స్‌కి, ఎగ్జిబిషన్స్‌కి  పంపుతుండేవాడిని తర్వాత " ఆగ్‌ఫా ఫోటోగ్యాలరీ " అని ఒక కార్యక్రమం నిర్వహిస్తూఉండేవారు, దానికి " ఆగ్‌ఫా " కంపెనీ వారు నా ఫోటోస్ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ప్రదర్శించేవారు, ఒక్కో ఫోటోకి 15, 25 , 50 రూపాయలు ఫ్రైజ్ మనీ కింద ఇచ్చేవారు, దానిని మళ్ళి ఫిల్మ్స్ కొనడానికి ఉపయోగించేవాడిని. ఇక  కాలేజి విద్య ముంబాయిలో చేసాను అక్కడ కూడ నా ఫోటోగ్రఫీని కొనసాగించాను, అక్కడుండగానే బాంబే ఫోటోగ్రపీ సొసైటీలో మెంబర్ గా చేరాను అదే ఆసక్తి నన్ను సినిమాటోగ్రఫీకి దారితీసింది. తర్వాత ఫూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌‌లో 1961-1964  సినిమాటోగ్రఫీ చేసాను, అదే మొట్టమొదటి సినిమాటోగ్రఫీ బ్యాచ్.

   యాడ్‌ఫిల్మ్ రంగంలోకి ప్రవేశం..!! ఫ్యూచర్ ఫిల్మ్స్ వైపు  మొగ్గుచూపకపోవడానికి గల కారణం..!
    రావు: 1964 లో ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండగానే ప్రొడ్యూసర్స్ గిల్డ్ బాంబే నుండి నాకో ఉత్తరమొచ్చింద, అందులో.. ఇటలీ..వాటికన్‌సిటి పోప్‌పాల్ కొన్ని వందల సంవత్సరాలనుండి వాటికన్ సిటి వదలి మరే ఇతర దేశాలకు వెళ్ళలేదు, 1964 లో ఆయన అలా బయటకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు... అదీ ఇండీయాని ఎన్నుకున్నాడు..అందులోనూ కాథలిక్ చరిత్రలో మొదటిసారిగా  1964  నవంబర్‌లో బాంబే కి వస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని చిత్రీకరించేందుకు నన్ను పిలిపించారు అదే నా మొట్టమొదటి ప్రాజెక్ట్, ఐమో 35mm అనే కెమెరాలో నలుపు - తెలుపులో షూట్ చేసాను అంతే తర్వాత నేను వెనకకు చూడనవరసరంలేకుండా పోయింది, ఆ ప్రాజెక్ట్ చేసిన వారు భారతదేశంలో " ఇమేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ " అని చాలా పెద్ద యాడ్ ఫిల్మ్ కంపెనీ ..వారికి దేశమంతా బ్రాంచెస్ ఉన్నాయి..నేను కూడ ప్రాజెక్ట్స్ కోసం వారితో పాటు దేశమంతా తిరిగాను. ఇక 1974 లో మొదటి లిరిల్ యాడ్ Karen Lunel తో చేసాము, అదే అమ్మాయితో దాదాపుగా 10 ఏళ్ళుగా ఆ అమ్మాయికి 26 ఏళ్ళు వచ్చేంతవరకు చేసాము తర్వాత ఆ ఆమ్మాయి ఏయిర్ ఇండియాలో ఉద్యోగం రావడంతో..మరొకరితో చేసాము. తర్వాత నెస్కాఫే.. బాంబే డైయింగ్..ఇలా చాలానే...! ఇక ఫ్యూచర్ ఫిల్మ్స్ వైపు వెళ్ళకపోవడానికి పెద్దగా కారణమేది లేదుగాని..నాకు మొదటినుండి యాడ్ ఫిల్మ్ మేకింగ్ మీదే ఎక్కువ ఆసక్తి ఉండేది... యాడ్ ఫిలంలో కొత్త కొత్త టెక్నాలజిని పరిచయం చేయొచ్చు..కొత్తదనం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూఉంటాము...అదే ఫ్యూచర్ ఫిలంలో దర్శకుడి మీద, నిర్మాత మీద లేక  కథమీద ఆదారపడి ఉంటుంది..ఫ్యూచర్ ఫిలంలో కన్న అడ్వర్టైజ్ ఫిలం మేకింగ్‌లో కొత్తదనానికి ఎక్కువ అవకాశముంటుంది. అయినా కూడ నేను కొన్ని ఫ్యూచర్‌ఫిల్మ్స్ చేసాను
  ఫ్యూచర్ ఫిల్మ్స్..!!
   రావు : 8 ఫ్యూచర్ ఫిల్మ్స్ చేసాను.. మొదటిసినిమా బెంగాలిలో చేసాను. తర్వాత ఒక హాలీవుడ్ సినిమా " మంకీస్ ఆఫ్ బందర్‌పూల్ " జైపూర్ చుట్టుపక్కల షూట్ చేసాము..ఇది పూర్తిగా హాలీవుడ్ వారి నిర్మాణం. ఇక జేమ్స్ ఐవరి దర్శకత్వంలో ఇస్మాయిల్ మర్చంట్ నిర్మించిన  ఇండియన్ వర్షన్ " ఆటో బయోగ్రఫీ ఆఫ్ ప్రిన్సెస్ "సినిమాకు  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేసాను. ఇక అప్పట్లోనే ఒక కాంటెంపరరీ సినిమా " బద్నాం బస్తి " 1981 లో చేసాను. చివరగా..అక్భర్‌ఖాన్ దర్శకత్వంలో " తాజ్‌మహల్ - An Eternal Love Story " చేసాను.


         చాలా విషయాలే చెప్పారు..అవన్ని టెక్నికల్ సమాచారం..! రావుగారు యాడ్ ఫిల్మ్సే కాకుండా 200  లఘుచిత్రాలు కొన్ని జాతీయ సమైఖ్యతా చిత్రాలకి  పని చేసారు..వాటిలో మనం1987 లో దూరదర్శన్‌లో చూసిన " పిర్ మిల్లే సర్ మేర తుమ్హారా " బాగా ప్రాచుర్యం పొందినది, అదే చిత్రాన్ని మల్లి 22 ఏళ్ళకు రావుగారు చిత్రీకరించారు..ఆస్కార్ అవార్డ గ్రహీత ఏ.ఆర్.రెహమాన్‌తో మొదలవుతుంది. ఇక్కడ మన తెలుగులో.. మహేశ్‌బాబు నటించారు.
 అప్పట్లో రావుగారే చాలా టెక్నిక్స్ ని ప్రవేశపెట్టారని చెప్పొచ్చు..ఉదా: కొత్త టెక్నాలజిని ఆయనే మొట్టమొదటసారిగా భారతదేశంలో పరిచయం చేసేవారట, స్ప్లిట్ ఫీల్డ్ లెన్సెస్,  మాక్రోలెన్సెస్, ఎక్స్‌ట్రీమ్ క్లోజప్ లెన్సెస్, ప్రీ-ఫ్లాషింగ్  ఇలా ఎన్నో..!
  చివరగా ఆయనో ప్రశ్న వేసాను...! సర్ మీరెప్పుడు మీ మూలాల గురించి ఆలోచించలేదా..? అంటే తెలుగునాడులో పనిచేయాలని కాని..! లేక మీ ఉనికిని తెలపడానికి ఎప్పుడు ప్రయత్నించలేదా..? అని అడిగాను. దానికాయన.." ఆంద్రప్రదేశ్‌లో నాకెవ్వరు తెలీదు..అక్కడికెల్లి మల్లీ అన్నీ మొదటి నుండి ప్రారంభించాలి, ఇక్కడ ముంబాయిలో బానే ఉందిగా...? ముంబాయి నగరానికి అడ్వర్టైజ్ రంగంలో మొదటిస్థానం ఉన్నది .! ఇక మూలాల గురించి అంటారా..తెలుగువాడినేకాని..మొదట మనిషిని తర్వాతే ఏదైనా.. నా తమ్ముళ్ళు..రిటైర్డ్ అయ్యాక వైజాగ్ కి వెళ్ళి స్థిరపడ్డారు  అటువైపు పరిచయాలు  నాకు తక్కువ " అని చెప్పారు.  ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన ఈ వయసులో కూడ ఇంకా సినిమాటోగ్రాఫర్‍గా పని చేస్తూనే ఉన్నారు.బహుశ ఆయన వయసు 70 కి దగ్గరగా ఉండచ్చు..!! .నూతనంగా ఈ మద్య చేసిన యాడ్ హన్సికా మోత్వానితో నిర్మా బ్యూటి సబ్బుకోసం స్పేయిన్‌లో షూట్ చేసారు. ఎంతో అనుభవం వుండి ..కొత్త కొత్త టెక్నాలజి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. దానిని అమలుపరుస్తూ.. వాణిజ్యప్రకటనల తయారీరంగంలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం ఏర్పర్చుకుని అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి ..కాని ఆయన ఆహర్యం, ప్రవర్తన ఎంతో నిరాడంబరంగాను..ఎటువంటి భేషజాలు లేకుండా అతి సామాన్యంగాను మన పక్కింటి  ఒక మద్యతరగతి మనిషిలా ఉన్నారు. నిజంగా ఆయనను చూసి చాలానే నేర్చుకోవాలి నాలాంటి వాళ్ళు.





About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs