కొన్ని నెలలు క్రితం మహా టి.విలో అనుకుంటాను..బేతంచర్ల దగ్గరలోని ఒక గ్రామానికి సమీపాన వున్న గుహల గురించి ఒక కథనం చూశాను..! అవి చూసినప్పటినుండి ఒకసారి వెళ్ళి చూసి రావాలని అనుకుంటూ వున్నాను. నంధ్యాలలో డి.ఇ గా పని చేస్తున్న మా మిత్రుడిని ఐదునెలలనుండి సతాయిస్తూ వున్నాను..వెళ్దాము అంటూ..! చివరికి ఈ నెల రెండోవారంలో సమయం దొరికి వెళ్ళాము.

    ఆ గుహల వద్దకు ఎలా వెళ్ళాలి..? తదితర విషయాలు మీడియా మిత్రుడి ద్వార తెలుసుకొన్నాను. అలానే మా మిత్రుడు కూడ కర్నూల్ జిల్లా వాసి కావడం..అందునా తను రోడ్డు మరియు భవనాల కార్యాలయంలో పని చేస్తుండడం వలన తనకు ఆ చుట్టుపక్కల వున్నప్రాంతాల విషయంలో సమాచారం తెలిసిన అతని సహచర ఉద్యోగుల ద్వార కొంత సమాచారాన్ని సేకరించడంతో మా మిత్రుడితో పాటు అతని మరో ఇద్దరి సహచర మిత్రులతో కలిసి ఒక రోజు ఉదయాన్నే ప్రయాణం సాగించాము.

     మీడియా మిత్రుడి ఇచ్చిన సమాచారాన్ని కాదని అక్కడి లోకల్ ఇంజనీర్లు ఇచ్చిన సమాచార ఆదారంగా వెళ్ళడం మూలాన ఒక కిలోమీటర్ నడవాల్సిన మేము అదనంగా మరో మూడుకిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. బేతంచర్ల వూరిలో నుండి గుహలకు వెళ్ళే దారి ఒకటి ఉండగా..అది కాదని బేతం చర్ల దాటి ఐదుకిలోమీటర్ల తర్వాత ఎడమవైపునున్న ఒక రహదారిలోకి తిరిగి తర్వాత రెండు కిలోమీటర్లు ప్రయాణించి రామకృష్ణాపురం అనే గ్రామం గుండా కొద్ది దూరం వెళ్ళాక కారు వెళ్ళడానికి అవకాశం లేక.. " నడకే హంసద్వని రాగమే " అంటూ నటరాజు సర్వీస్ మొదలెట్టాము.


        కాలిబాట.. దారి పొడవునా అటు ఇటు వున్న పొలాలలో పొద్దుతిరుగుడు పూలు పంటగా వేసున్నారు. కనుచూపు మేర పసుపు పచ్చ..ఆకుపచ్చ రెండు కలిసి మిలితమైన రంగుతో అవే కనపడుతున్నాయి... దూరంగా చుట్టూ పచ్చని కొండలు.  వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండడంతో మా నడక అంత శ్రమ అనిపించలేదు. పొలాల్లో పని చేస్తున్న రైతులను పలకరిస్తూ వెళ్ళాము...అయితే వారి నుండి గుహల గురించి సరైన సమాచారం రాలేదు మాకు..! అకడున్న చాలా మందికే  వారికి చుట్టుపక్కలే వున్న అక్కడి గుహల గురించి సరైనా సమాచారం లేకపోవడం ఆశ్చర్యమేసింది. రెండు కిలోమీటర్లు నడిచాక ఒకరిద్దరు రైతులు ఆ గుహల సమాచారం చెప్పనారంబించారు.  "కుడివైపు తిరగాలా..? లేక ఎడమవైపా..? " అని అడిగితే.. తల అడ్డంగా ఊపుతూ  " ఇంగో కిలోమీటర్ నడిసినాక పెద్ద యాపమాను వస్చాది దానిపక్కనే పెద్ద గుంత ఉంటాది అక్కడ పురిచేయి (ఎడమ చేయి) వైపు తిరిగి కిలోమీటర్ నడిస్చే ఆడ్నే గుహలు కన్పిచ్చాయి " అన్నాడు.. ఆహ ఏమి బాష..!! అసలు సిసలు పల్లె జీవనం, అక్కడి ప్రాంతపు యాస గుబాలిస్తుంది వారి మాటల్లో..! వారితో మాట్లాడుతుంటే వారి యాస వినసొంపుగా ఉంది..ఎవ్వరు కూడ ఎడమచేయి అని సంబోదించట్లేదు.." పురిచేయి " అనే మాట్లాడుతున్నారు.

     మొత్తానికి గుహల వద్దకు చేరుకున్నాము. చూడటానికి బయటకు అవి కనపడవు ఒక చిన్న గుట్టలాంటి కొండకు చివరి అంచులో ఉన్నాయి..దగ్గరగా వెల్తే కాని సరిగ్గా కనపడట్లేదు. రెండు కొండలు చీలిపోయినట్లుగా ఉన్న చీలిక మద్యనుండి లోపలకి ప్రయాణిస్తే  అక్కడ సహజంగా ఏర్పడిన కమలాపండు రంగుతో వున్న పెద్ద ఆర్చి కనపడతుంది. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆర్చ్ అది..చాలా బాగుంది. దాని దాటి వెళ్తే " U " ఆకారంలో కత్తిరించినట్లుగా ఉన్న ఎత్తైన కొండకు రకరకాల ఆకారాలలో శిలాజాలు కనపడతాయి వాటి మద్యలో కుడివైపున పది అడుగుల వెడల్పు ఐదు అడుగుల ఎత్తుతో వున్న ఒక గుహ కనపడుతుంది.

      
     ఆ గుహల గురించి చారిత్రక విషయాలు ఏవి తెలియవు కాని గుహలకు దగ్గరలో ఉన్న " కనుమ కింది కొట్టాల "   అనే గ్రామంలో ఉండే కొంతమంది యువకలకు గుహల చరిత్ర తెలియకపోయినా ఎప్పుడు గుహల్లో తిరుగుతూ వుండేవారు. వారిలో బాష అనే కుర్రాడికి ఫోన్ చేసి పిలిపించాను. ఆ కుర్రాడు వచ్చాక అతనితో కలిసి నేను ఒక వంద అడుగులు గుహలోకి నడిచాము కాని లోపల అంత చిమ్మ చీకటి ఒకటే గబ్బిలాల వాసన కొడుతున్నది..అవి భరించలేక వెనుతిరిగాను. లోపల దాదాపుగ రెండు కిలోమీటర్ల పోడవునా దారి ఉన్నదని బాష చెప్పాడు. వాళ్ళు దాదాపుగా ఒక గంట సేపు లోపల ప్రయాణించారట..!  లోన అక్కడక్కడ పెద్ద పెద్ద ఎత్తైన మహల్స్ ఉన్నాయట..! కాని చిమ్మ చీకటి సామాన్యమైన టార్చ్‌లైట్స్ వెలుగు సరిపోదు 2000W లేదా 4000W  గల లైట్స్‌తో మాత్రమే అక్కడి శిలాజాలు చూడగలమన్న సంగతి అర్థమైంది.

      ఆ గుహనుండి బయటకొచ్చి " U " ఆకారంలో ఉన్న కొండకు ఎదురుగా ఒక 50 అడుగులు నడిస్తే మరో రెండు గుహలు కనపడతాయి. మొత్తం మూడు గుహలున్నాయి. ఒకదానికి ఒకటి సంబందం లేకుండా వున్న గుహలవి. లోన ప్రయాణిస్తే ఎక్కడికి వెళ్తామో కూడ తెలియదు. మొత్తానికి అవొక రహస్య గుహలే..!!

     ఆ బాష మాటల్లో కొన్ని విషయాలు తెలిసాయి. ఒక విదేశీ మహిళ గత రెండేళ్ళుగా సంవత్సరానికి ఒకసారి వస్తున్నారట..! గుహల ముందు ఒకటి మరో రెండు చోట్ల కత్తితో కోసినట్లుగా దీర్ఘ చతురశ్రాకారంలో ఓ పది పదిహేను అడుగుల లోతున్న గుంతలు చాలా జాగ్రత్తగా తవ్వి వున్నారు. ఆ తవ్విన తీరు చూడగానే అర్థమవుతుంది. శాస్త్రీయ పరిశోదనలు చేసేవారు మాత్రమే అలా తవ్వగలరని. అలా తవ్విన గుంతల్లో మానవ అవశేషాల ఎముకలు కొన్నిటిని సేకరించి పరిశోదనల నిమిత్తం తీసుకెళ్ళేవారట..! ఆమే ఏ దేశస్తురాలో కూడ అక్కడి ప్రజలకు తెలియదు. మనకు.. మన ప్రభుత్వాలకు ఇలాంటివి అస్సలు పట్టవు..ఇప్పటికే చాలా కుంభకోణాలలో మునిగి తేలుతూ చాలా బిజి బిజీగా వున్నారు ఇక ఇలాంటి సామాన్య విషయాలకు మెదుడులో తావెక్కడిది..? అందులోను ఇలాంటి గుహల వలన ఆర్థికంగా ఎటువంటి లాభాలుండవు.
    చాలా ఏళ్ళుగా అక్కడికొస్తున్నాని తన మాటల్లో వివరించాడు బాష. ఇలాంటి గుహలని సంరక్షించే ఒక అంతర్జాతీయ సంస్థ జర్మనీలో ఉందని నేనెప్పుడొ చాలా ఏళ్ళ క్రితం విన్నాను. బనగానపల్లె దగ్గరలో ఉన్న " బెలుం " గుహలు కూడ మొదట్లో ఆ జర్మనీ సంస్థవారే తమ ఆదీనంలోనికి తీసుకొని  వాటి సంరిక్షించారు. అలానే ఇవి కూడ వారికి తెలిస్తె బాగుంటుంది. పత్రికలు వాళ్ళు వీటికి " ఎర్రజాల గుహలు " అని పేరు పెట్టారు గాని..చుట్టుపక్కల ప్రాంతాల రైతులు..గొర్రెల కాపర్లు మాత్రం " పావురాల గద్దె " అని పిలుస్తున్నారు.


   ఎవరైనా ఉత్సాహవంతులు వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుండి కర్నూల్‌కి వెళ్ళి అక్కడ నుండి బనగాన పల్లెకు వెళ్ళె రహదారిలో " బేతం చర్ల " వూరు వస్తుంది. ఆ వూరిలో నుండి ఎడమవైపుకు తిరిగి ప్రయాణించి " కనుమ కింది కొట్టాల " అనే గ్రామం చేరుకోవాలి. అక్కడి వరకు వాహనాలలో వెళ్ళవచ్చు అక్కడి నుండి కాలబాట వెంబడి ఒకటిన్నర కిలోమీటర్ నటరాజు సర్వీస్ చేస్తే ఈ గుహలకు చేరవచ్చు. సహాయంగా కనుమ కింది కొట్టాల గ్రామ కుర్రాళ్ళు తోడస్తారు..ఈ గుహలను కూడ చూపెడతారు.










    ఆ రోజు ఆదివారం కావడంతో  7 నంబర్ జాతీయరహదారి మీద వాహనాలరద్ది పలచగా ఉంది..! సమయం మద్యాహ్నం 1:10 నిమిషాలు. ఊరి బయట ఒక ఇంటర్‌వ్యూ షూట్ చేయడం పూర్తి చేసి భోజనం చేయడం కోసం బెంగళూర్ నగరంలోకి ప్రవేశిస్తున్నది మేముంటున్న వాహనం. వాహనంలో నేను, మా డైరెక్టర్, ఆయన అసిస్టెంట్, కెమరా అసిస్టెంట్, వాహనం నడుపుతున్న డ్రైవర్ నలుగురమే వున్నాము. యలహంక ప్రాంతం దాటాక వచ్చిన ఒక బైపాస్ రోడ్ వంతెన కిందనుండి దాటుతుండగా....ఎదురుగా టాటా సఫారి లాంటి వాహనం ఓ 20 లేక 30 అడుగుల ఎత్తున  గాళ్ళొ ఎగురుతూ కనపడింది.., మొదట మాకర్థం కాలేదు..ఏదన్న సినిమా షూటింగ జరుగుతున్నదేమో అనుకొని చుట్టు పరిసర ప్రాంతాలను మా అందరి కళ్ళు వెదకసాగాయి..ఎక్కడ కూడ సినిమా షూటింగ్ జరుగుతున్న ఆనవాలు కనపడలేదు..ఇంతలో మా వాహనం కూడ ఎదురుగా గాలిలో ఎగిరివస్తున్న వాహానాన్ని క్రాస్ చేసి ముందుకెళ్తున్న సమయంలోనే గాల్లో ఎగిరిన ఆ వాహనం కింద పడుతూ దబ్బున శబ్దంతో నేలను తాకింది..ఆ తాకిడికి అదుపుతప్పి ఎడమవైపుకు పూర్తిగా వొరిగిపోయి..దాదాపుగా 50..70..అడుగుల దాక రాపిడి చేసుకుంటూ వెళ్ళి ఆగింది. అప్పుటికికాని మాకు తెలియలేదు అదొక రోడ్డ్ ప్రమాదమని..!

     అది గమనించిన మా డ్రైవర్ వెంటనే సైడ్‌కి వాహనం ఆపాడు..మాలాగే వెనుకొస్తున్న ఒకటిరెండు వాహనాలు కూడ ఆగాయి..అందరం దిగి రోడ్డ్ డివైడర్ దాటుకొని కుడివైపు రోడ్‌లోకి వెళ్ళాము అక్కడ కూడ వెళ్తున్న ఒకటి రెండు వాహనాల్లోని మనుషులు దిగారు..అందరం ప్రమాదం జరిగిన టాట సఫారి లాంటి వాహనం వద్దకు వెళ్ళాము..! కొన్ని అడుగుల మేరకు వాహనం పూర్తిగా రాపిడి చేసుకుంటూ రావడం వలన రోడ్ మీదున్న ఆ రాపిడి గుర్తుల వెంబడీ రక్తం కారి వున్నది.. ! రోడ్‌ మీద పూర్తిగా ఎడమవైపుకు వొరిగి పడివున్న వాహనంలోకి అందరం తొంగి చూడగా ఒకే ఒక మనిషి డ్రైవర్ సీట్‌లో నుండి వాహనం ఎడమ వైపుకు వొరిగి వున్నాడు..తలంతా రక్తం కట్టిన గడ్డలాగ కనపడుతున్నది. అందరం కలిసి ముందుగా వొరిగి వున్న వాహానాన్ని ఎత్తి సక్రమంగా రోడ్ మీదుంచాము. ముందరున్న అద్దాలు డ్రైవర్ సీటుకు అటు ఇటు ఉన్న డోర్ అద్దాలు కూడ పూర్తిగా ద్వంసం అయ్యి ఖాలీగా ఉన్నాయి కిటికీలు. డ్రైవర్ సీట్‌లో కూర్చోని వున్న మనిషి కాళ్ళు క్లచ్..గేర్ మీదున్నాయి మనిషి శరీరం మాత్రం పూర్తిగా ఎడమ వైపు వొరిగి డోర్‌కి తల ఆనిచ్చి వున్నది. దాదాపుగా 50 అడుగుల మేర రోడ్డ్‌ను రాసుకొంటూ రావడం మూలాన ఆ మనిషి తల ఎడమవైపుకు పడటంతో అతని ఎడమవైపు తల రాపిడికి గురయ్యి ఎడమ వైపు ముఖమంతా రక్తపు గడ్డలాగ తయారయ్యింది..అసలు అక్కడ ఏమేమి వున్నాయో కూడ అర్థం కాలేనంతగా వుంది. కుడివైపు ముఖం మాత్రం ఎటువంటి దెబ్బలు లేకుండా వున్నది. ఊపిరి వుందా లేదా అన్న అనుమానంతో దగ్గరగా వెళ్ళిచూసాము.. ఊపిరి తీస్తున్నాడు..ముక్కుపుటాలు అదురుతున్నాయి ఆ వ్యక్తికి.. వయసు 30..32  మద్యన వుండవచ్చు. అక్కడున్న మేమందరం వెంటనే సెల్‌ఫోన్స్ తీసి 108 ఫోన్ చేయడం మొదలు పెట్టాము.

  ఆ కొద్ది నిమిషాలకే ఆ రోడ్డ్ మీద వస్తున్న వాహనాల ఆగడం వలన రద్ది ఎక్కువై రోడ్డంతా బ్లాక్ కావడనారంభించింది. ఈ లోగ చాలా మంది వాహానాలను ఆపి దిగి వచ్చారు ..అందరూ తమ తమ సెల్‌ఫోన్స్‌కి పని పెట్టారు..దాదాపుగా ఓ50..60 మంది సెల్‌ఫోన్స్ మోగిస్తున్నారు అంబులెన్స్‌ల కోసం. మరి కొందరు ట్రాఫిక్ జామ్ కాకుండా వెంటనే అక్కడున్న పరిస్థితిని తమ చేతిల్లోకి తీసుకొని చక్కదిద్దుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో ..ముఖ్యంగ బెంగళూర్ చుట్టుపక్కల ప్రాంతాలలొ ప్రజలు ఇలాంటి ప్రమాదాలు లేక ఏదన్న ఉపద్రవాలు జరిగిన సమయంలో పరిస్థితిని తమ చేతుల్లోకి తీసుకొని చక్కదిద్దడం మొదలెడతారు..పోలీసుల కోసం ఎదురుచూడటం కాని.. లేక ప్రభుత్వ అధికారుల మీదగాని ఆధార పడరు..! వాటి సంబందిత అధికారులు వచ్చేంతవరకు అక్కడుండే ప్రజలే సుశిక్షిత  సైనికుల్లా పనిచేస్తారు. చాలా మంచి సాంప్రదాయముంది అక్కడ.

    అప్పటికే ఐదునిమిషాలు గడిచిపోయింది.. సమయం గడిచేకొద్ది జాతీయ రహదారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువైపోతున్నది..రోడ్డ్ ప్రమాదాన్ని చూసి కొందరు తాము వెళ్తున్న వాహనాలాపి దిగివొస్తున్నారు ఏమి జరిగిందనో..ఉద్దేశంతో ! అలా నిలిపిన వాహనాలు వలన మరి కొంత ట్రాఫిక్‌కి ఇబ్బందిగా కలుగుతున్నది. మరి కొందరు కేవలం సమాచారం తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. వచ్చి చేరిన   జనంతో ఆ ప్రదేశమంతా గందరగోళగంగా వున్నది..అందరి అరుపులు కలగలిపి  గోల గోలగా ఉంది. ఇంకా రాని అంబులెన్సుల కోసం అక్కుడున్న ప్రతిఒక్కరు తమ సెల్‌ఫోన్స్‌లతో ప్రయత్నిస్తూనే వున్నారు. అవేమో ఎంతకూ రావట్లేదు.! ఈ లోపల నేను మరి కొందరం అసలు రోడ్డ్ ప్రమాదం ఎలా జరిగిందో అని చూస్తున్నాము..మరో వాహనాన్ని గుద్ది నట్లు ఎక్కడా లేదు..పోనీ ఎవరన్న వేగంగా వస్తున్న వాహనానికి అడ్డు వచ్చారా..అంటే అదీ లేదు..! మరెలా అంతెత్తు ఎగిరింది వాహనం అని చూసుకుంటూ అలా వెనక్కి ఓ 100 అడుగులు వెళ్ళాక అక్కడ కనపడింది. రోడ్‌కి వారగా వున్న ఫెన్సింగ్ వాల్ పొడుగూనా వెళ్ళి బైపాస్‌రోడ్ వంతెన ఎత్తు వరకు అడ్డుగా కట్టిన ఒక గోడ వున్నది..! ఆ గోడను గుద్దుకొన్నట్ల గుర్తుగా కనపడ్డాయి రాపిడి చారలు. అప్పుడర్థమయ్యింది..దాదాపుగా 100 కిలోమీటర్ల కంటే వేగంగా వస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డ్‌ వారగా వున్న గోడను తగిలి విపరీతమైన వేగం వలన వాహనం 30..40  అడుగుల ఎత్తు ఎగిరింటుంది అనుకున్నాము..తిరిగి ప్రమాదానికి గురయిన వాహనం వద్దకు వెళ్ళి..డ్రైవర్ సీట్‌లో గమనిస్తే డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన పైకెగిరిన ఆ ఊపుకి అతను డ్రైవర్ సీట్‌లో నుండి ఎడమవైపు ఒరిగినట్లు తెలిసిపోతున్నది..కేవలం ఒకే ఒక చిన్న నిర్లక్ష్యం.. సీట్‌బెల్ట్ ..ఉపయోగించక పోవడం వలన ఒక మనిషి ప్రాణం పోయంతగా ప్రమాదంలో చిక్కుకొని వున్నాడు.

    నాతో కూడ వచ్చిన మా డైరక్టర్ మాకు కాస్త దూరంగా నిలబడుండం చూసి.. ’ఏంటి సార్ దూరంగా వున్నారని ’ అడిగాను.. దానికాయన .." రక్తం చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి..అయినా అక్కడ మనం చేయగలిగింది ఏమీ లేదు..నిస్సహాయులమే కదా "  అన్నాడు. అవును నిజమే..  అంతమందిమి ఎన్ని ఫోన్స్ చేశామో కానొ ఒక్క అంబులెన్స్ కూడ రావట్లేదు..నేను కూడ అటు ఇటు ఆరాటంగా తిరుగుతున్నా ఏమి చేయాలో పాలుపోక. నేనే కాదు చాలా మంది పరిస్థితి కూడ అలానే వుంది..ఈ అంబులెన్స్‌స్ వచ్చేలోపల అతని ప్రాణం పోతుందేమో అని అందరి మనుసులో ఒకటే గుబులు..ఆ ఆరాటంలో అందరూ అటు ఇటు తిరుగుతున్నారు.. మరి కొందరు రోడ్డ్‌కి ఇరువైపుల దృష్టి సారిస్తున్నారు కను చూపు మేరలో ఏదన్న అంబులెన్స్ కనపడున్నదా....అని..!

   ఇంత ఆరాటంలో కూడ నేనొకటి గమనించాను.. ’ప్రమాదంలో చిక్కుకొని వున్న మనిషి ఎవరొ? ..ఎవరి తాలుకా మనిషో ఎవరికీ తెలియదు.. అంతలా ఆరాటపడుతున్నఅక్కడున్న మనుషులకు ఎవరికీ ఏమి కాడు..కనీసపు మిత్రుడు కూడ కాడు..కేవలం దారినపోయే దానయ్య ..కాని అందరూ ప్రమాదం జరిగిన ఆ మనిషి ప్రాణం నిలపాలని.. ప్రాణం పోకుండా కాపాడలని ఎంతలా తాపత్రయం పడుతున్నారో..ఎంత ఆరాటం పడుతున్నారో..వాళ్ళు అటుఇటు తిరిగే ఆ పరుగులో అర్థమవుతున్నది. మరి కొందరు ప్రమాదం జరిగిన వాహనంలో అతనికి సంబందించిన వస్తువులు కాని సమాచారం కాని దొరుకుతుందేమో అని వెతికి..చూసి..కొన్ని పేపర్ల్ కనపడగానే ఆత్రుతగా వివరాలు వెతికి కొన్ని ఫోన్ నంబర్స్ పట్టుకొని వారికి ఫోన్స్ చేయడం ఆరంభించారు. అక్కడున్న పేపర్స్ వలన అతనొక ప్రైవేట్ కంపెనీ మార్కటింగ్ మేనజరని అర్థమయ్యింది. పోనీ మనిషిని బయటకు తీసి తామే ఆసుపత్రికి తీసుకెల్లాలని ప్రయత్నించారు గాని..ఎడమ వైపునున్న డోర్ పూర్తిగ ద్వంసం అయ్యి ఇరుక్కపోయింది..ఇక స్టీరింగ్ వైపునుండి మనిషి బయటకు తేవాలంటే చాలా కష్టపడవలసి ఉంటుంది..ఆ ప్రయత్నంలో ప్రాణం పోయినా పోవచ్చు..!! అంత సాహసానికి పూనుకోలేక ఏమి చేయాలో తోచక జనాలందరు అటు ఇటు తిరుగుతున్నారు..ఎలా ఆ మనిషి ప్రాణాలు కాపాడాలో తెలీక తికమకపడుతున్నారు.

   నిజానికి అలా ఆరాట పడుతున్న మనుషులు..మామూలు పరిస్థితుల్లో మామూలు వారి వారి దినచర్యల్లో..వారి ప్రవర్తన వేరుగా వుండచ్చు..కొందరు ఆడిన మాట తప్ప వచ్చు..మరి కొందరు..తీసుకొన్న డబ్బులు లేవని చెప్పో లేక..అస్సలు ఇవ్వనే లేదనో చెప్పి ఎగ్గొట్టొచ్చు..! మరి కొందరు..బ్రతక నేర్చిన వారుండొచ్చు..! కొందరు మోసాలకు పాల్పడవచ్చు..అబద్దాలాడవచ్చు..నీవెవరో తెలీదని చెప్పొచ్చు..! ఒక్కో సమయంలో కసి..కోపం పెరిగి తగదాలలో హత్య కూడ చేసేంత తెగింపు..ఆలోచన రావచ్చు..! ఆ గుంపులో రకరకాలయిన మనుషులున్నారు..కాని...విపత్కర సమయంలో.. ఇలాంటి ప్రమాద సమయాలలో.. వారిలో ఉన్న రకరకాల ప్రవర్తనంతా మాయం అయ్యి  అతి సహజమైన మనిషిలో ఉండే " మానవత్వం " బయట పడుతున్నదే..అని అనిపించింది..నాకు. ఇక్కడ మంచిమనిషా..లేక చెడ్డవాడా అన్న భావం కాదు...కేవలం ఒక మనిషిలా స్పందించే..మనిషి..!  నిజమే కదా..మామూల పరిస్థితుల్లో వారు ఎలాంటి వారయినా కావచ్చు..ఎలా అయినా ప్రవర్తించవచ్చు...!! ఇలాంటి విపత్కర సమయంలోనే మనిషిలోని నిజమైన..సహజమైన అసలు సిసలు " మనిషి " బయటకొస్తున్నాడు.

   ఇంతలో ఇన్‌సర్ట్ చేసిన ఒక మద్యతరగతి మద్యవయస్కుడొకడు ప్రమాదం జరిగిన మనిషి తలను పట్టుకొని అటు ఇటు తిప్పుతూ చూస్తున్నాడు..నేను ఎవరా అంటూ దగ్గరకువ వెళ్ళాను..వెంటనే " గుప్పున " ఆల్కాహాల్ వాసన కొట్టింది అతని వద్ద నుండి..మనిషి సన్నగా రివటలా వున్నాడు.." ఏనప్ప ఇన్న అంబులెన్స్ బరిలిల్లా..ఏను మాడతారో..సమయక్కి యారు సిగల్లా " అంటూ వాపోతున్నాడు అతను. సెల్‌ఫోన్ తీసి నంబర్స్ నొక్కుతున్నాడు..లైన్ అందగానే అరుస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. ." బేగ బన్రీ జీవ ఇన్న ఇదియే " చెబుతున్నాడు..ఫోన్ పెట్టయగానే వాచి చూసుకుంటున్నాడు..అటు ఇటు ఆరాటంగా తిరుగుతున్నాడు..మనిషేమొ బాగా తాగున్నాడు.. కాని కంట్రోల్‌లోనే వున్నాడు. " అయ్యో పాప..జీవ ఇన్న ఇదియప్పా..ఇవనేను యారు బర్తానే ఇల్లా..! సాయితానే ఏనో.." భయపడుతున్నాడు.. వాహనం చుట్టూ అటు ఇటు తిరుగుతున్నాడు..నుదిటికేసి చేత్తో కొట్టుకొంటున్నాడు..చివరకు రోడ్డ్ పక్కనున్న పిట్టగోడ మీద కూర్చున్నాడు..కొందరు దగ్గరికెళ్ళి.." మీ బందువా " అని అడిగారు..
 " ఊహా " తలూపాడు..
" మీ స్నేహితుడా "
" ఊహా..ఏమి కాడండి..మీలాగే నేను వచ్చాను " అన్నాడు..
మనిషేమో ఫుల్‌గా తాగున్నాడు.. అంత మైకంలో కూడ మరో సాటి మనిషి ప్రమాదంలో చిక్కుకొని ప్రాణం కోసం కొట్టిమిట్టులాడుతుంటే ఎలాగైనా సరే కాపాడాలని ఆరాట పడుతున్నాడు..తపన పడుతున్నాడు. ఆ మనిషిని చూస్తే నాకాశ్చర్యం వేసింది..! ఈ మనిషి తన ఇంటి వద్ద తాగిన మైకంలో తన పెళ్ళాన్ని కొట్టొచ్చు లేదా తిట్టొచ్చు..అది ఏదయినా... కాని..ఇక్కడ మాత్రం..ఇలాంటి విపత్కర స్థితిలో అసలు సిసలయినా " మానవత్వమున్న మనిషి "  లాగ ప్రవర్తిస్తున్నాడు.

   ప్రమాదం జరిగిన 20  నిమిషాలకు ఒక ప్రైవేట్ ఆస్పత్రి అంబులెన్స్ వచ్చింది..రాగానే స్టీరింగ్ వైపునున్న డోర్‌ తెరచి ఎడమ వైపు పూర్తిగా ద్వంసం కావడం మూలాన..తెరవడానికి వీలు కుదరకపోవడంతో.. డోర్‌కి ఆనుకొని మనిషిని స్టీరింగ్ వైపుకు తిప్పి దించడానికి ప్రయత్నిస్తున్నారు..! ఆ మనిషి అటు ఇటు తిప్పేలోపల ఎక్కడ ప్రాణం పోతుందో అని నేను..నాలాగే మరికొందమంది ఊపిరిబిగపట్టి చూస్తున్నాము.  మనిషి శరీరం కుడి వైపునున్న డొర్‌నుండి బయటకొచ్చింది కాని అతని కాళ్ళు మాత్రం క్లచ్ వద్ద ఇరుక్కపోయి మనిషి బయటకు రావట్లేదు..! అతని కాళ్ళు పూర్తిగా మెలితిరిగి ఉన్నాయి. పరిస్థితి అర్థమయిన నేను వాహనం వెనుకనుండి తిరిగి కుడివైపుకు వెళ్తున్న సమయంలో అంబులెన్స్ కాంపోండర్...ఎదురొచ్చి.." సరి యారొ ఒబ్బరు అత్తిరి సర్ " అంటూ నన్ను వెనుక డోర్ తీసి ఎక్కించాడు.  ఆ గందరగోళ వాతావరణంలో నాకు తెలీకుండానే లోపలి వెళ్ళి..ముందు సీట్ వైపుకు వొరిగి క్లచ్‌ల వద్ద ఇరుక్కున్న కాళ్ళను తప్పించడానికి ప్రయత్నిస్తున్నాను.. "ఊహ" ఒక్క అంగుళం కూడ కదలట్లేదు..రెండు మెలికలు తిరిగున్నాయి..అదీను కాక వాటిని తాకినప్పుడు అవి " ఇనుప మొద్దుల్లా " వున్నాయి..ప్రాణం ఉందా పోయిందా..నాకర్థం కాక ఆ మనిషి వైపు చూశాను..’ఊపిరి ’ తీస్తూనే వున్నాడు. మరెంటీ కాళ్ళు అలా బిగుసుకుపోయాయి.." ఓహ్..మనిషి స్పృహలో లేడు కదా..? అందుకే ఇనుప మొద్దుల్లా ఉన్నాయి కాళ్ళు "  అంతటి గోలలో కూడ ఆ విషయం స్పష్టమయింది నాకు.  అలా అని గట్టిగా లాగ కూడదు..లాగితే ఎక్కడ అతని ప్రాణాలు పోతాయో అన్న భయం ఒక్కటి లోపల..కాసేపటి ప్రయత్నం అయ్యాక ఇరుక్కున్న కాళ్ళు వచ్చేశాయి. క్షణాల్లో అంబులెన్స్ అతన్ని తీసుకొని మాయం అయ్యాయి.

   భోజనానికి హోటల్‌కి వెళ్ళాము కాని..ఎవరికీ భోజనం సహించట్లేదు..! మా డైరెక్టర్ గారి అసిస్టెంట్ మాత్రం కేవలం జ్యూస్ తీసుకొన్నాడు..అతనికి పదే పదే ఆ రక్తపు మడుగులు..గుర్తుకొస్తున్నాయి. తర్వాత మా పనిలో పడి రోడ్డ్ ప్రమాదం సంగతి తాత్కాలికంగా మరిచిపోయినా..సాయింత్రం 6 గంటలు దాటాక.." ప్రమాదంలో గాయపడిన మనిషి చనిపోయారంటు " మా ఫోన్స్‌కి మెస్సేజస్ వచ్చాయి. 108 కి..అతని తాలుకా మనుషుల కోసం మేము చేసిన ఫోన్‌కాల్స్ వలన మా ఫోన్ నంబర్స్ అన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి మెస్సేజస్ పంపినట్లున్నారు.  కేవలం సీట్ సేఫ్టీ బెల్ట్ వాడకపోవడం వలన ఒక జీవితమే..కోల్పోవలసి వచ్చింది.. ’మనిషి బ్రతికుంటే బాగుండు ’ నాలో నేను అనుకొంటూ ఒక నిట్టూర్పుడిచాను.

     నిరుడు సంవత్సరం చివర్లో ఓ రెండు నెలలు పాటు ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్‌ తీయడం కోసం నా మిత్రుడైన ఒక దర్శకుడితో పని చేయడానికి బెంగళూర్ వెళ్ళాను. అతనికి సహాయంగా ఒక అసిస్టెంట్ డైరక్టర్ వున్నాడు. అతను నాకు కొత్త..మునుపుటి పరిచయంలేదు.  అట్టడగు స్థాయి నుండి ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఒక విశిష్ట వ్యక్తి మీద ఆటొబయోగ్రఫీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ చేస్తూ..ఒక పుస్తకంగా తేవడం మీద ముగ్గురం ఒక టీమ్‌గా పని చేస్తున్నాము. అయితే ఆ ప్రాజెక్ట్ మొదలయిన ఒక పదిహేను రోజుల తర్వాత మద్యలో నేను కొత్తగా చేరాను.

    నేను ఆ ప్రాజెక్ట్‌లో చేరక మునుపు నుండి చేస్తున్న ఇంటర్‌వ్యూస్ నేను వెళ్ళాక కూడ కొనసాగిస్తున్నారు..నాలగయిదు రోజులు గడిచాక. అక్కడ పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్‌తో చనువు పెరిగింది. కొన్ని రోజులు గడిచాక దర్శకుడు చేస్తున్న పని సరిగ్గా లేదంటూ వంకలు చూపుతూ నాతో చెప్పడం మొదలు పెట్టాడు అసిస్టెంట్ డైరెక్టర్.  " ఏంటో సార్..ఆయన చెప్పిందే వినాలంటాడు..మనం చెప్పింది వినడు. పోనీ ఆయన చేసేది ఏమన్న బావుందా అంటే..?  అదీ సరిగ్గా లేదు..! ఇంటర్‌వ్యూ చేస్తున్న వారితో ఏవేవో ప్రశ్నలు వేస్తాడు..  ’అవి ఇంటర్‌వ్యూ చేస్తున్న వారికి ఇబ్బంది కలిగిస్తాయి సర్ ’ అని చెప్పినా వినడు, ఆయన దారి ఆయనదే "  అని ఇలా రకరకాలుగా చెప్పే వాడు. ఇలా మాట్లాడుకోవడం ఎక్కడైనా సర్వసాధారణమే అనుకున్నా.. ఎందుకంటే ఒక గుంపుగా పనిచేస్తున్న చోట ఉండే మనుషులు రకరకాల సామాజిక స్థితిగతుల నుండి.. రకరకాల వాతావరణం నుండి ప్రాంతాల నుండి వచ్చి పని చేస్తుంటారు.. వారి వారి సామాజిక, వాతావరణాల ప్రాంతాలలో పెరిగిన దృక్కోణాలు, అభిప్రాయాలు వారిలో చిన్నప్పటినుండి నాటుకొని వుంటాయి..అవి ఎక్కడకు వెళ్ళిన ఆ మనుషులతో కూడ వుంటాయి కాబట్టి..ఒకరి ప్రవర్తన, ఆలోచనల విధానం మరొకరికి నచ్చదు. అవి తెలిసినవే కాబట్టి అతని మాటలను పెద్దగ పరిగణలోకి తీసుకోలేదు.

       అసిస్టెంట్ డైరెక్టర్ రాజమండ్రి దగ్గర ఒక పల్లెటూరు వాసి అయినా పుట్టి పెరిగినది మాత్రం హైదరాబాద్ నగరంలోని ఓ మద్యతరగతి కుటుంబంలో.. అయితే చిన్నప్పటినుండి..ఎలక్ట్రానిక్స్ పరికరాల మద్యన జంకు ఫుడ్ లాంటి వాతావరణం మద్యన పెరిగినట్లు ఉన్నాడు అతని ఆలోచనలను చూస్తే అలాని అనిపిస్తాయి..అంతా ఒక ఫ్యాభ్రికేటడ్ జీవితానికి అలవాటు పడ్డ మనిషిలా కనపడతాడు. ఇక దర్శకుడు చిత్తూరు దగ్గర ఒక గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టి పెరిగిన మనిషి.. సహజంగానే పల్లె వాతావరణం మద్యన పెరిగాడు కాబట్టి అక్కడి జీవనశైలి గురించి అవగాహన వున్న వ్యక్తి.. అందులోనూ ఒక హిస్టారియన్..కవి.. ఇంగ్లీష లిటరేచర్ చేసి..కొన్ని ఆంగ్ల పుస్తకాలను తెలుగులోకి అనువాదం చేస్తున్నాడు..అదీను కాక మాజి నక్సలైట్..15 ఏళ్ళ క్రితం ఎన్‌కౌంటర్‌లో చంపబడవలసిన వ్యక్తి... బతికి... జనజీవన స్రవంతిలోకి వచ్చి చేరాడు.. సమాజం మీద..మనుషుల మీద విషయ పరిఙ్ఞానం వున్న వ్యక్తి.  ఒకే గుంపులోని ఇద్దరి మనుషుల మద్యన ఇన్ని రకాల అంతరాలున్నప్పుడూ సహజంగానే  ఒకరి ఆలోచనలు మరొకరితో కలవవు. అలా కలవాలని ఆశించడం కూడ అంత సబబు కాదేమో..!!

    నేను బయట వాగుడు కాయలా ఎన్ని వాగినా.. అన్ని విషయాల మీద ఙ్ఞానం వున్న మనుషుల మద్యన నోరుమూసుకొని మౌనంగా వారు చెప్పింది వింటూ వుంటాను..లేక పోతే నా అఙ్ఞానం బయటపడుదూ..?? ఈ ఆటోబయోగ్రఫీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఒక బెంగళూర్ ఎలక్ట్రానిక్ సంస్థ నిర్మిస్తున్నది..కాబట్టి వారు మాకో గెస్ట్‌హౌస్ ఇచ్చారు..అది కనపుర రోడ్‌కి మైసూర్ రోడ్‌కి మద్యనున్న ఒక బైపాస్ రోడ్ మార్గ మద్యలో వుంది..నగర సరిహద్దుల్లో ఉండడం మూలాన అక్కడ ఇళ్ళు చాలా తక్కువ మేము వుంటున్న గెస్ట్‌హొస్ ప్రాంతంలో మహా అయితే ఓ పది ..పదిహేను ఇళ్ళు ఉండవచ్చు...అవీను దూరదూరంగా విసిరేసినట్లుగా వుంటాయి. మనుషుల సంచారమే తక్కువ కాకపోతే పక్కనే కొద్ది దూరంలో ఒక ఇంజనీరింగ కాలేజి ఉన్నది..అందులో నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చదువుకుంటున్నారు.. వారి కోసమని మేయిన్ రోడ్ పక్కనే ఒక చిన్న నార్త్ ఇండియన్  స్టైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టారు. రాత్రి తిండికి మాకదే దిక్కు.. మా గెస్ట్‌హౌస్ నుండి అక్కడికి ఓ పదిహేను నిమిషాల నడకంత దూరం వుంటుంది..ముగ్గరం నడుచుకుంటూ వెళ్ళి ఏ వెజ్‌ రోలో..లేక ఎగ్‌ రోలో, చికన్‌ రోలో పలచటి బట్టర్ పేపర్‌తో చుట్టి చేత్తోపట్టుకొని తింటు తిరిగి ముఖం పడతాము..ఆ నడకలో ఎన్నో విషయాలు చర్చలుగా సాగేవి..! నవంబర్ మాసం కావడంతొ అప్పుడే మొదలయిన శీతకాలపు లేత చలిగాలిలో వేడి వేడిగా తింటూ చర్చించడం..నిజంగ అది మరచిపోని మధురానిభూతే..

      ఆ చర్చల్లో ఎన్నో విషయాలు తెలుసుకొనే వాడిని మా దర్శకుడినుండి..! ఎక్కడో ఒక చోట నేను మొదలుపెడతా చర్చను... అంతే వినడమే నా తరువాయి పని ఆయన అలా చెప్పుకొంటూపోతునే వుంటాడు.. అలా ఫ్రెంచ్ ఫిలాసఫర్ స్లవోయ్ జెజక్ నుండి..నిరుడు సంవత్సరానికి గాను నోబుల్ బహుమతి పొందిన " లోసా " గురించి ఆయన రచనలు గురించి..ఆయన రచనల ఆధారంగా నిర్మించిన సినిమాల గురించి..యుద్దం నేపథ్యంలో స్వయంగా ఆయన దర్శకత్వం వహించిన సినిమా గురించి.. ఇలా ఒకటి కాదు ప్రపంచ సినిమా,సాహిత్యం, ఫిలాసఫీ  ఏవి వదలకుండా చెబుతూనే వుండే వారు. నాకా సమయంలో " వాయిస్ రికార్డర్ " లేకపోవడం నన్ను నేను నిందించుకునేవాడిని..! కాని మా అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం ఇవేవి తనకేమి పట్టనట్లు వుండేవాడు..ఆ‌ఫ్‌కోర్స్ నాకు నచ్చినంత మాత్రాన అతనికి నచ్చాలని రూల్ లేదనుకోండి..కాని ఇలాంటి విషయాలు ఒక దర్శకుడుగా మారాలనుకునే వారికి ఆసక్తి గొలిపేవే కదా..?  అదే విషయాన్ని అతన్ని అడిగాను ..దానికతను " ఆ " అంటు తేలిగ్గా తీసిపారేశాడు..బహుశ మా దర్శకుడు ఈ సహాయ దర్శకుడికి నచ్చకపోవడం మూలాన అతను చెప్పే ఏ విషయం కూడ అతనికి ఎక్కట్లేదు..! " అదేమ్ " అని అడిగాను..నేను..!  " ఆ ఏముంది అదంతా బుక్కీష్ నాలెడ్జ్ .. ప్రాక్టికాల్టీ లేదు అదంతా వేస్ట్ " అని కొట్టి పడేశాడు..! మనిషి నచ్చకపోవచ్చు కాని అతను చెప్పే విషయాలు అతని సొంతానివి కాదు కదా..? బయట ప్రపంచానికి సంబందించనవి..!

    అందులోను మా దర్శకుని ప్రవర్తని మా అసిస్టెంట్ డైరెక్టర్‌కి నచ్చట్లేదు..కాని ఇక్కడో ప్రాధమిక విషయం మరిచిపోతున్నారు..  " విఙ్ఞానం వేరు..ప్రవర్తన వేరు..కాని ఈ రెండిటిని కలిపి చూస్తుండడం వలన వస్తున్న సమస్యలివి " అలా అని చేస్తున్న పని నుండి పారిపోయేంత తీవ్రమైన ప్రవర్తన ఏమి కలిగి ఉండలేదు దర్శకుడు. ఒకే ఒకసారి ఏదో పని చేయమని చెప్పినప్పుడు దానికేదో సమాధానం చెబుతున్న సమయంలో " ఆర్గ్యుమెంట్స్ వద్దు.. చెప్పిన పని చేయండి " అని అన్నాడు..దానికి కారణం ఆయకున్న కొన్ని వత్తిడిలు వలన అని నాకర్థమయ్యింది.. అందులోను పూర్వాశ్రమంలో తుపాకి పట్టి అడువుల్లో తిరిగిన మనిషి..అక్కడ ఆఙ్ఞనలు జారి చేస్తే దాన్ని అందరు తూ..చా తప్పకుండా శిరసా వహించే వాతావరణంలో నుండి వచ్చిన వ్యక్తి.. అవన్ని అంత తేలిగ్గా మరవడం సాధ్యమయ్యే పనేనా..? ఆ మూలాలు ఎక్కడో మూలన దాక్కొని వుంటాయి..! నాకు తెలిసిన కమ్యూనిస్టుల్లో చాలా వరకు వారిలో ఎక్కడో మూలన ఒక " ఫ్యూడలిస్ట్ " దాగి ఉంటాడేమో అని అనిపిస్తూవుంటుంది వారి మాటలను బట్టి.

    వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తనకు తాను ఒక "ఫ్రాంక్‌ " గా మాట్లాడే మనిషినని..ఉన్నది ఉన్నట్లు మొహం మీద చెప్పే మనిషినని చెప్పుకుంటాడు మా అసిస్టెంట్ డైరెక్టర్..! ఇలాంటి మాటలు ప్రతిఒక్కరి నుండి వింటూనే వున్నాను నేను! ..మరి ఎవరు.. మనిషి వెనుక మాట్లాడే వారో అర్థం కాదు ఇలా ప్రతి వొక్కరు తమను తాము ఓపన్‌గా మాట్లాడేవారుగా చెప్పుకుంటే..?! బహుశ ఓపన్‌గా మాట్లాడతానన్న నెపంతో..ఎదుటి వారిని తిట్టడమే ఒక ఫ్రాంకనెస్ అని చెప్పుకొంటున్నారా..?  లేక రంధ్రాన్వేషణకు ఫ్రాంక్‌నెస్ అని చెప్పుకోవడం ఒక అందమైన ముసుగా..?

    రోజు రోజుకీ అసిస్టెంట్ డైరెక్టర్‌కి అసహనం పెరిగి తను చేయాల్సిన పనిలో ధ్యాస పెట్ట లేకపోతున్నాడు..తనకంటూ ఒక స్థిర సిద్దాంతాలున్నాయి..ఆ వృత్తంలోనే అతనున్నాడు..! దర్శకుడి ప్రవర్తన అంతా తన స్థిర సిద్దాంతాల కోణం నుండే చూస్తుండడం వలన అతనిలోని వ్యక్తివాదం తను చేస్తున్న వృత్తి మీద ప్రభావం చూపిస్తున్నది. ఇలాంటి స్థితిని ఎక్కువగా మనం ప్రభుత్వ కార్యాలయాల్లో చూడవచ్చు. చేసే ప్రతి ఉద్యోగానికి కొన్ని నియమాలు.. వృత్తిధర్మం.. నిర్దేశాలుంటాయి ( protocol ). కాని ఆ స్థానంలో వున్న ఉద్యోగి వాటినేవి పాటించడు...తనకంటు సొంత ఎజండాలు..అతని మానసిక పరిణితిని బట్టి సొంత ఆలోచనలతోనే ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తాడు. అంటే వృత్తి ధర్మాన్ని తన సొంత జాగరిదారుగా..తనదిగా మలుచుకుంటాడు. ఇలా చాలా మందిని గమనించవచ్చు బయట. . " నేను అందరిలా కాదు..నా కథే వేరు..నాతో ఆటలా..? ఆ " అంటూ హూంకరిస్తుంటారు. అంటే తను చేయాల్సిన వృత్తి ధర్మానికి తిలోదకాలిచ్చి..తనకు నచ్చినట్లు నడుస్తాడు..! అంటే ఆ ఉద్యోగి యెక్క ఆలోచనా విధానం  అతను నిర్వర్తించాల్సిన వృత్తి మీద మీద పడుతుంది.. అలా జరిగినా ..అది పురోగమన దిశలో సాగితే పర్లేదు..తిరోగమనంలోకి సాగినప్పుడే మిగతా వ్యవస్థంత చిన్నాభిన్నం అవుతుంది.

  కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటాను.. ఒక అంతర్జాతీయ బ్యాంక్‌కు వెళ్ళాను.. లోనకు ప్రవేశించగానే  ఒక ఉద్యోగి నా వద్దకు వచ్చి " What can i do for u sir " అడిగి..నాకావలసిన పనిని ఐదే ఐదు నిమిషాల్లో పూర్తి చేశారు..అది చూసిన వారు తబ్బిఉబ్బి పోయారు..మళ్ళి మరో అనుమానం కూడానూ..అంతలా మన కోసం పని చేస్తున్నారంటే  ఏదన్న మనకు " బ్యాండ్ " వేస్తారేమో..అని..! మనం ముందునుండి  పని చేయని ఉద్యోగస్థులకు అలవాటిపడిన మనస్థత్వంతో వుండడం మూలాన..ఇలా వచ్చి రాగానే వారికై వారు మనల్ని రిసీవ్ చేసుకొని మరీ నిమిషాలలో పని చేసేలోపల తబ్బుబ్బిపోయి..ఒక వంక అనుమానం పడే స్థాయి చేరుకున్నాము..! నిజం చెప్పాలంటే వాళ్ళు వారి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిసున్నట్టె కదా..!!

  చివరకు ఏవన్న పనుల మీద గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళిన సమయంలో అధికారి గదిలోకి ప్రవేశించే ముందు బయటనున్న అటెండర్‌ని  " సారి ఎటువంటి వాడు..? పర్లేదా..? అన్ని సావదానంగా వినే మనిషేనా..పనులు సజావుగా చేస్తాడా ..? "  అడిగి తెలుసుకొని లోనకు ప్రవేశిస్తాము..! ఆ అధికారి తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా నిర్విస్తాడన్న నమ్మకం లేకపోవడం వలన ఇలా ముందుగానే అడిగే స్థాయికి మానసికంగా తయారు కాబడ్డాం మనం.

   అలా మా అసిస్టెంట్ దర్శకుడు కూడ తన సొంత ఎజండాతో ప్రవర్తిస్తున్నాడు.. ఇలానే ఒక రోజు మళ్ళీ తనదైన శైలిలో దర్శకుడి గురించి చెబుతుంటే నేను మద్యలో అడ్డుకొని..  " చూడు బ్రదర్..! ప్రపంచం ఒక నాటక రంగం, అందులోని మనమంతా పాత్రదారులమే..ఒక్కొక్కరిది ఒకో రకపు మనస్థత్వం..వాటిని నీవు నీ కళ్ళకు ఎటువంటి రంగుటద్దాలు తగిలించుకోకుండా "నేకడ్ ఐ"  తో చూడాలి.. అంటే ఏ సంఘటనైనా సరే యధాతదంగా తీసుకోవాలి అంతే కాని ఆల్ రెడి నీలో వున్న ఒక ఫిక్సడ్ అభిప్రాయం మనే కోణంతో చూడటం మొదలు పెడితే ప్రతి సంఘటనా ఒకే రంగులో..ఒకేలాగ కనపడతాయి..! అందునా నీవు రేపు కాబోయే దర్శకుడివి..అంటే నీ నిజ జీవితంలో ఎదురయ్యే సంఘటనలను..మనుషులను నీదయిన శైలిలో రకరకాల కోణాలలో గమనిస్తూ వెండి తెరమీద అవిష్కరించాలి..అంటే దానికి ఎప్పుడు ఒకే రకం అభిప్రాయంతో నిన్ను నీవు కట్టడి చేసుకోకు..జరుగుతున్నవన్నీ గమనించు. దర్శకులెప్పుడు తమని తాము ఒక చట్రంలో బిగంచుకోకూడదు..ప్రతీది రకరకాల కోణాలలో చూస్తుండాలి..! సామాన్యులకు ఎలాను ఒకే రకపు ఫిక్సడ్ అభిప్రాయంతొ వున్న పర్లేదు..వారికి వారి ధినచర్యల్లో ఎన్నో సమస్యలుంటాయి ఎన్నో ఆలోచనలుంటాయి..వాటి ధ్యాసలోనే వారికి జీవితం గడుస్తుంది...! రకరకాల కోణాలలో ఆలోచించడం వారికి అనవసరం కూడాను..కాని నీవు అలా కాదు.." అని చెబుతూ..మద్య మద్యలో అతన్ని గమనిస్తున్నప్పుడు ..అతను నా మాటలు వింటున్నట్లుగా తల ఊపుతున్నాడుగాని..నా మాటలను నిజంగా తలలోకి ఎక్కించట్లేదన్న సంగతి అర్థమవుతున్నది నాకు..! చెబుతున్న మాటలు అతనికి నచ్చేవి కావు..తనకు అనుకూలంగా లేవు కాబట్టి..నా మాటలకు మద్యలోనే ఒక అడ్డతెరవేసి.. నా మాటల తర్వాత తను ఏమి చెప్పాలో వాటిని ఆలోచిస్తూ..ఒక ధారంలా వాటిని గుదిగుచ్చుకుంటున్నాడు అతని మదిలో..! ఇలా అతనొక్కడే కాదు మనలో చాలా మంది ఇలానే చేస్తూ వుంటాము.. వింటున్నట్లుగా తల ఊపుతుంటాము కాని బుర్రలోకి అవి ఎక్కించం...తర్వాత ఏమి మాట్లాడాలో అని తమలో తాము మాటలను పొందుపొర్చుకుంటూ వుంటాము...! ఆ విషయం నాకర్థమయ్యి.. చెప్పవలసిన విషయం ఆపేశాను. కొన్ని రోజుల తర్వాత  సమయం సందర్భం వచ్చినప్పుడు ఒకటి.. రెండు సార్లు ఇలానే చెప్పాలని ప్రయత్నించినా... మళ్ళీ అదే విదంగ వింటున్నట్టుగా తల ఊపుతున్నాడే గాని...బుర్రకు ఎక్కట్లేదు..  ఇక నేను పూర్తిగా చెప్పడం మానుకున్నాను.

  ఒక రోజున మా దర్శకుడితో  " ఏంటి సార్! వస్తూ వస్తూ ఒక శల్యుడిని వెంట తెచ్చుకున్నారు "  అని అడిగాను నేను..దానికి ఆయన చిరునవ్వే సమదానం.

  నేను ఖాలీగా కనపడినప్పుడల్లా తన బాస్ గురించి మాట్లాడడం మొదలెట్టాడు..చివరకు ఒక రోజున.." చూడు బాబు..! ఒక రోజు..రెండు రోజులు అంటే పర్లేదు..రోజూ అవే మాటలేనా..? ఆ మనిషి గురించి తెలిసిందె..ఇక రోజు పదే పదే కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముంటాయి..?  పోనీ.. నీకు ఇష్టం లేని పని ఎందుకు చేయడం... మానేయచ్చుగా..? ఎందుకంత కష్టంగా పని చేయడం..? ఒక విషయం చెబుతున్నా గుర్తు పెట్టుకో..ఒక రోజు రెండు రోజులు మాట్లాడావంటే పర్లేదు గాని ప్రతిరోజు ఒకే మనిషి గురించి పదే పదే మాట్లాడుతున్నావంటే బహుశ నీలోనే ఏదో లోపం ఉన్నట్లే " అన్నాను..ఆ తర్వాత ప్రాజెక్ట్ ఒక పదిహేను రోజుల్లో పూర్తవతుందనగా ... లోలోపల రగులుతున్న వ్యతిరేకత భావం ఒక రోజు ఏవో చిన్న విషయానికి బయట పడి మాట మాట పెరిగి గొడవ పడి ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్ళాడు.

                                                         గీతంజలి - 2

     విశ్రాంతి సమయం వరకు కథానాయకి గీతాంజలి సంఘటనలతో కథాగమనమంతా నడిపి. తర్వాత కథానాయకకి కాన్సర్ ఉందన్నవిషయం ఒక షాక్‌లా తెలియపరచి అక్కడ నుండి కథానాయకి.. కథానాయుకల చిలిపి సంఘటనలతో మల్లి కథనం మొదలెడతాడు.
   గీతను కలవడానికి వాళ్ళ ఇంటికే వస్తాడు ప్రకాష్.. " నీకు కంజేనటల్ హార్ట్  అంటే ఏమిటొ తెలుసా " అడుగుతాడు
" ఊహ " తెలియదంటు తల ఊపుతుంది..గీత
వెంటనే గీత చెల్లెల్లు అందుకొని ఆ గుండెజబ్బు సమస్య గురించి,వాటి సాదకభాదలన్ని వివరిస్తారు చాలా సులువుగా..! చెప్పే విదానం చూడగానే హీరోకి,మనకు అర్థమవుతుంది వారికి ఆ సమస్య మీద ఎప్పటినుండొ అవగాహన వుంది..ఆ సమస్య బాదలకు వారు బాగ అలవాటుపడి పడ్డారని.
 " ఇవన్ని తెలిసి ఇలా వుండగలిగావా..? "  ప్రకాష ప్రశ్న.
" చూడు నీవు చచ్చిపోతావు..ఈ చిత్ర చచ్చిపోతుంది.. ఆ శారదుందే అది చచ్చిపోతుంది..పళ్ళు ఇకిలిస్తుందే చంటిదీ ఇదీ చచ్చిపోతుంది..ఈ చెట్లు..ఆ తీగా .. నేను చచ్చిపోతాను..కాకపోతె నాలుగురోజులు ముందు చచ్చిపోతాను .. అంతె నాకు రేపు గురించి బెంగ లేదు..ఈ రోజే నాకు ముఖ్యం..నేను ఇలాగే వుంటాను "  అంటూ బొలెడు చెప్పుకొస్తుంది గీతాంజలి..
  ఒక జీవిత సత్యాన్ని గీతాంజలి పాత్ర ద్వార చెప్పించాడు దర్శకుడు..నిజమే కదా..!! వాళ్ళిద్దరికి మరణం పలాన సమయంలో తధ్యం అని తెలుసు..కాబట్టి ప్రతిరోజు..ప్రతి నిమిషం.. ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ గడపవచ్చు. మనకు మరణం ఎప్పుడో తెలియదు కాని ఆశాదృక్పదంతో జీవనం సాగిస్తూ వుంటాము..  ఇప్పుడు జీవిగా వున్న మనిషి బయటకెళ్ళగానే ఏ ప్రమాదమో జరవచ్చు..లేద మరేదయనా ప్రాణం పోయే సంఘటన జరిగి విగతజీవిగా మారొచ్చు..అంటే జీవితం మీద కేవలం " ఆశ " మాత్రమే వుంటుంది..కాని ప్రాణం మీద భరోసా వుండదు. మరి వారికి భవిష్యత్త్ మీద ఆశ లేదు కాని ప్రస్తుత జీవనం మీద భరోసా వుంటుంది.
  గీతాంజలి మాటలతో ప్రకాష్‌లో కూడ అంతర్మధనం జరుగుతుంది. .’తను ఇన్నాళ్ళు ప్రపంచమంత తలక్రిందులైనట్లు, అసలు ప్రస్తుత జీవితమే లేనట్లు,ఏదో కోల్పోయిన వాడిలాగ ఒక శాలువ కప్పుకొని పుట్టలెమ్మడి, చెట్టులెమ్మడి తిరుగుతూ నాకు నేను నామీదే " జాలి " చూపించుకుంటూ బ్రతికాను.. అదెంత అవివేకమో.. ? జరుగుతున్న క్షణాన్ని అనుభవించకుండా ఎప్పుడో రాబోయే మరణం గురించి చింతిస్తూ ప్రస్తుత జీవితాన్ని నరకం చేసుకోవడం ఎంత వరకు సబబు..? "  తనలో తానే ఆత్మపరిశీలన చేసుకొని...ఒక జీవిత సత్యాన్ని కనుగొన్న మనిషిలా..మార్పు చెందే సన్నివేశంలో మార్పుకు గుర్తుగా ప్రకాష్ తాగుతున్న సిగిరెట్‌ని విసిరిగొట్టి గట్టిగ శ్వాస తీసుకొని ముందుకు పరిగెడతాడు.. ఆ పరుగులో అంతవరకున్న నైరాశ్యం..దిగులు..వీటి నుండి బయటకొస్తూ జీవితం జీవించడానికన్నట్లుగా ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది...  ఎటువంటి డైలాగ్స్ కూడ వుండవు కాని కేవలం దృశ్యపరంగా మనకు తెలిసిపోతుంది ఆ భావన.
   ఇక్కడ నుండి చిలిపి సంఘటనల సన్నివేశాలతో సినిమాని నడుపుతాడు దర్శకుడు.. ప్రకాష్ ప్రేమంటూ చేసే చిన్న చిన్న చిలిపి తగాదాలు..గీత ఒప్పుకొనే సన్నివేశం.. తర్వాతొచ్చే సన్నివేశంలో గీత ప్రకాష్‌ని అడుగుతుంది " నీవు చెప్పింది నిజమేనా..?
  " ఐ లవ్ యు "
" ఏ ..? "
" ఎందుకో తెలీదు..కాని నిజమని మాత్రం తెలుసు.."
 " ఎలా..? " గీత ప్రశ్న.. దానికి సమాదానంగా ప్రకాష్ గీత కుడి చేతిని తీసుకొని తన గుండె మీదుంచుకొని
" గుండె బద్దలయ్యేలా కొట్టుకొంటుంది "
" నాక్కూడ " గీతంటుంది
" నిజంగా..? "  అందుకు గీత ప్రకాష్ తలను తన గుండెల మీదుంచుకొని  " ఓం నమహః నయన శృతులకు "  అంటూ పాట ద్వార హృదయ స్పందనలు తెలియచేసె సన్నివేశం..!
 ఇక్కడ ఒక విషయం గమనిస్తే..అప్పటి వరకొచ్చిన తెలుగు సినిమాలలో కాని..లేక తమిళ డబ్బింగ్ సినిమాలలో కాని " ప్రేమ " భావానికి రకరకాల నిర్వచనాలు చెప్పేవారు..వాటిల్లో చాలా వరకు మేలో డ్రమటిక్ భావాలు, మరి కొన్నయితే బరించలేనంతగా సెంటిమెంట్‌ పండిస్తూ ఉండేవి..! అసలు ప్రేమకు " పలాన " అంటూ ఎవరైనా నిర్వచనం చెప్పగలరా..?  ప్రేమకు ఇదే సార్వజనీయమైన భావమని ఇంతవరకు ఎవరూ చెప్పలేదు..చెప్పలేరు కూడ..! అందుకే దర్శకుడు ఇక్కడ ప్రకాష్ నోట " ఎందుకో తెలీదు..కాని నిజమని తెలుస "ని చెప్పించాడు..నిజమే కదా ..!!  అది ’పలాన ’ అని ఒక భావాన్ని ఎలా చెప్పగలం..? కాని మదిలో వున్న భావం మాత్రం నిజమని మాత్రమే చెప్పగలం..!

   ఇక గీత తనకు గుండెలో నొప్పంటూ ప్రకాష్‌ని తనింటికి పిలిపించుకున్న సమయంలో వారిద్దరి మద్యన జరిగే సంభాషణలు మనసున్న మనుషులని కదిలించక మానవు..!! " ఏంటి ఏమయింది..? గుండెలో నొప్పిగా ఉందా..? నాన్నగారితో చెప్పనా..? " ప్రకాష్ ప్రశ్నలకు  " అదెప్పుడు వుండేదే..కానీ ఈ రొజు ఎందుకో నీతోనే ఉండాలనుంది "  అంటుంది గీత.
 " నా కోసం ఒక పనిచేస్తావా..? "
 "............ "
" నన్ను నీ ఒడిలో పడుకోనిస్తావా..? "  ఇద్దరు అప్పుడప్పుడే మానసికంగా దగ్గరవుతున్న క్షణాల్లో వచ్చే అభ్యర్థనలవి.
  ఈ మాటలన్ని దేనిని సూచిస్తాయి..? రేపో మాపో చనిపోయే ఇద్దరు మనుషులు బ్రతికున్న రోజులని మరిచిపోని మధుర క్షణాలుగా మలుచుకోవడానికి పడే తాపత్రయంలా అనిపిస్తుంది..!! జరుగుతున్న ప్రతి నిమిషాన్ని..క్షణాన్నిఇద్దరు తమ కౌగిలింత స్పర్శలతో సంపూర్ణంగా త్యాధాత్మికత చెందుతున్నట్లుగా కనపడుతుంది.
" నేను నీకు నచ్చానా..? " గీత ప్రశ్న
" చాలా "
" రేపు నేను చచ్చిపోతే..? "
" రేపు గురించి నాకు బెంగ లేదు..! ఈ రోజే నాకు ముఖ్యం ఓ అమ్మాయి నాతో చెప్పిందీ "
ఇక్కడ కొన్ని డైలాగ్స్ కట్ చేసినట్లు అప్పట్లో కొందరి ద్వారా విన్నాను..మరెంతవరకు అవి నిజమో కాని..ఆ కట్ చేసిన మాటలు......
 " రేపు నేను చచ్చిపోతే నా కోసం దిగులుతో బాద పడుతూ బతుకుతావా..? "
 "....."
" మరో పెళ్ళి చేసుకోవా..? "
"........ "
" కాని నేను చచ్చిపోయాక నా కోసం నీవు కుళ్ళి కుళ్ళి ఏడవాలి, ప్రతి క్షణం నన్ను తలుచుకొని తలుచుకొని బాదపడాలి "  కోరుతుందట..గీత. ఇలా ఇంకా రెండు మూడు డైలాగ్స్ ఉన్నాయి..నాకు గుర్తు లేదు గాని...
 ఎవరన్న సరే మామూలుగా మనుషులు చనిపోయిన తర్వాత ఓ రెండు రోజులు తమకు కావాలసిన వాళ్ళు ఏడుస్తారు..తర్వాత రోజులు గడిచే కొద్ది మెల్లి మెల్లిగా మరిచిపోయి రోజువారి ధినచర్యల్లో మునిగిపోతారు..అది సర్వసాదారణం..కాని చనిపోయిన వారి గురించి జీవితాంతం ఏడవరు..పదే పదే గుర్తు చేసుకుంటూ మదనపడరు..! మిగతా ప్రపంచం కూడ ఆలోచించదు. అసలు అంతవరుకు బ్రతికున్న మనిషి యెక్క ఉనికి కూడ లేనంతాగా ప్రవర్తిస్తుంది ప్రపంచం..ఆ చనిపోయిన వారి ఉనికి లేనంత మాత్రాన ఈ ప్రపంచం ఏమి ఆగిపోదు..ఎవరూ ఏమి నష్టపోరు..మరి..ప్రతి క్షణం తమ ఉనికి గురించి.. ఆస్థిత్వం గురించి పదే పదే తలుచుకునేలా చేయడం ఎలా..? ఆ భావన మరణానికి సిద్దంగా వున్న మనుషుల మనసులో మెదులుతుంది..ఆ భావనను భరించడం కష్టం..దాని పర్యవసానమే ఇక్కడి గీత మాటల్లోని ఆంతర్యం అనుకుంటాను.
  మరీ ఇంత లోతైన మాటలను ప్రేక్షకులు జీర్ణించుకోవడం చాలా కష్టం అన్న ఉద్దేశంతో ఈ డైలాగ్స్‌ని నిర్మాత..మిగతా యూనిట్ సబ్యులు పట్టు బట్టి బలవంతంగా కట్ చేయించారట దర్శకుడు చేత..! ఇదెంత వరకు నిజమో మరి..?
  ఈ భావన నుండి వచ్చే పరావర్తన తరంగాలే తర్వాతొచ్చే సన్నివేశంలో కనపడుతుంది.. అర్థరాత్రి సమయం తండ్రి నిద్రపోతున్న గది తలుపుల వద్ద నించొని " నాన్నా " పిలుస్తుంది గీత
" ఎవర్రా అది అర్థరాత్రప్పుడు "
" గీత " సమాదానం...! ఇలా సాగే సంభాషణల్లొ గీత తండ్రిని అడుగుతుంది.." నాన్నా..!  నేనెందుకు చావాలీ..? నేనేమి తప్పు చేశాను నాన్న..? నాన్న నేను చావ కూడదు నాన్న..! ప్లీజ్..నేను సంతోషంగా వుండాలి. ఇంకా కొంత కాలం బతకాలి నాన్న "  తండ్రిని వేడుకొంటుంది. అంతవరకు ప్రస్తుతం జరుగుతున్న ప్రతి క్షణం..ఈ రోజే మాత్రమే నాకు ముఖ్యం అనుకున్న మనిషి  ఇప్పుడు అకస్మాత్‌గా " నేను చావ కూడదు..బ్రతకాలి " అని కోరుకుంటుంది..అందుకు కారణం తనకంటూ ఒక మనిషి దొరకడం..ఆ మనిషి పరిష్వంగనలో సాంత్వన పొందడం..! ప్రేమను అనుభవించడం..!  అవన్ని తాత్కాలికమేనా..? కొన్ని రోజులేనా..? తనకు మిగతా వారిలా జీవితాంతం వాటిని పొందే అవకాశమే లేదా..? ఈ ఆలోచనల మద్యన కొట్టుమిట్టులాడతుండే పర్వంలో తండ్రిని ప్రశ్నిస్తుంది..! తనింకా కొద్ది కాలం బతకాలని అప్పటివరకు అనిపించలేదు..కాని తనకంటూ ఒక మనిషి తోడు దొరకడం మూలాన ఆ ప్రేమను..సాంత్వనను ఇంకా కావాలనే తపన..! తన చుట్టూ వున్న తన వాళ్ళ కోసం బతకాలని అనుకోదు..చూశారా..? అందరు రక్త సంబంధీకులే కాని.. ఒక పరాయి మనిషి తనవాడు అనుకోగానే బతకాలనే తపన.. అదే ప్రకృతి లక్షణం..!

      గీత  " ఏదయినా చేయండి " అని తండ్రినే అడిగినా..ఒక బ్రహ్మ దేవుడిని అడిగినట్లుంటుంది..! పురాణాల ప్రకారం జీవి పుట్టుకకు..జన్మలకు కారణం బ్రహ్మే కదా..?? తండ్రి ఆ స్థానంలో ఉన్నట్లే లెక్క..!  పుట్టుకకు కారణమ్యుండచ్చు కాని..చావునాపే శక్తి లేని అశక్తుడే( డాక్టర్ )తండ్రి.
     చివర్లో ప్రకాష్ జీవితం కూడ తనలాంటిదే అని తెలిసినప్పుడు గీతా తట్టుకోలేదు..ప్రకాష్ పదే పదే " ఏ " అని అడిగినప్పుడు  " నా ప్రాణం కంటే నీవు నాకు ముఖ్యం..! ఎందుకంటే నీవు నా ప్రాణంకంటే ముఖ్యమ " ని బయటపడుతుంది.

   చివరకు సినిమాని " ఇంకెన్నాళ్ళు బ్రతుకుతారో తెలియదు..కాని బతికినన్నాళ్ళు సంతోషంగా బతుకుతారు " సుఖాంతాన్ని ఇస్తాడు దర్శకుడు..! నిజంగా ఇక్కడ జీవిత సత్యాన్ని తెలిపినట్లుండదు..? ఎవరు ఎన్నాళ్ళు బతికినా కోరుకొనేది సుఖంగా బతకడమే కదా..? అది కొన్నాళ్ళయినా.. కొన్ని సంవత్సరాలయినా..!!

   ఈ సినిమా కథను రెండు వ్యాక్యాలలో చెప్పాలంటే.. "  విభిన్న మనస్థత్వ గల ఇద్దరు రోగిష్టుల మధ్యన సాగే ప్రేమ కథ " కాని సినిమాసాంతం ఎంత గొప్పగా చిత్రీకరించారు..! కొన్ని రోజుల పాటు మనల్ను వెంటాడేలా లేదూ..? కథలోని పాత్రలు..సన్నివేశాలు అన్నిటిని మనం ఆశ్వాదిస్తాం.. అనుభూతి చెందుతాం కారణం..మన జీవితానికి దగ్గరగా ఉండడం మూలాన అనుకుంటా..!!
   ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం ముగ్గురే ముగ్గురు..వాళ్ళు.." మణిరత్నం, పి.సి.శ్రీరామ్, ఇళయరాజ " తమ ప్రతిభతో ప్రాణం పోసారు ఈ చిత్రానికి..
   దర్శకుడు గొప్పదనం గురించి నేనిప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ..వాటి జోలికి కూడ పోను గాని.. సన్నివేశాలను అల్లుకోవడంలో దర్శకుడు చూపిన నేర్పును గమనిస్తే.. సినిమా ప్రారంభంలో హీరో ఇంట్రడక్షన్‌తో హీరో తత్వం చెప్పేసి..తర్వాత హీరోయిన్‌తో చిన్న చిన్న చిలిపి సంఘటనలతో సినిమా మొదటిభాగం నడిపి విశ్రాంతి సమయంలో హీరోయిన్‌కున్న కాన్సర్ విషయం చెబుతారు.. కాని హీరో తనకు ఆ కాన్సర్ వుందన్న విషయం హీరోయిన్‌తో చెప్పడు చెబితే ఇక సినిమా అయిపోయినట్లే..! డాక్టరయిన హీరోయిన్ తండ్రితో ఒక పేషంట్ విషయాలు మరొకరికి చెప్పము అన్న మాట చెప్పించి రెండవ భాగమంతా సినిమా నడిపేశారు. ఒక పక్క విషయాన్నిచెబుతూ..చిలిపితనాన్ని జోడించి..సహజంగా ఇళ్ళల్లో జరిగే సంఘటనలాగే సాగిపోతూ వుంటుంది ఉదా: డైనింగ్ హాలులో హీరోయిన్ తండ్రితో సహా అందరూ భోజనాలు చేస్తున్న సన్నివేశంలొ టెలీఫోన్ మ్రోగుతుంది. గీత చివరి చెల్లెలు " నేను తీసుకుంటా..నేను తీసుకుంటా " అని పరిగెత్తడం..! వాస్తవంగా అలాంటివి చిన్న పిల్లలు వున్న ఇళ్ళల్లో జరుగుతూ వుంటాయి ఫోన్ మోగంగానే నేనంటు నేను అని ఫోన్ తీయడానికి పోటీ పడి పరిగెత్తుతారు..!  అవతలి వైపు ప్రకాష్ అని తెలియగానే  " గీతక్కా... నీకే ఫోన్ " చెప్పడం.. గీతా తన సహజధోరణిలో " ఎవరో ఏమిటో అడుగు " మనడం. అటువైపునుండి  " ఏమి లేదు పెళ్ళి చేసుకుందామని చెప్పింది..ఎప్పుడు ఎలా అని అడగాలి..! కొంచం అడిగి చెబుతావా..? " మాటలతో ఇంట్లో వారకందరికీ తెలిసేలా.. హీరో చెప్పే భావన..అలానే చూస్తున్న ప్రేక్షకులకు వారికి  " అయ్యో.. దొరికిపోయిందే " అనే ఒక తమాషయినా ఫీలింగ్. ఇలా అన్నీ ఒకే సన్నివేశంలో కుదిరేలా అల్లుకోవడం మణిరత్నం దర్శకత్వ ప్రతిభలో వుంది. ఇక చిన్న పిల్లల హావా భావాలు, వారి ప్రవర్తనను.. చాలా సహజంగా కరెక్ట్‌గా పోట్రేట్ చేయగల సామర్థ్యం ఒక్క మణిరత్నంకే వున్నదేమొ అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వున్నాయి..

   సినిమాటోగ్రఫి..పి.సి.శ్రీరామ్...! ఘర్షణ (తమిళ్ : అగ్ని నక్షత్రం), మౌనరాగం, నాయకుడు సినిమాల చూసిన వారికి పి.సి గురించి చెప్పనవసరంలేదు..!   అప్పటి వరకు అటు తమిళ్‌లో కాని..తెలుగులోకాని ఎక్కువగా ఫ్లాట్ లైటింగ్‌తో చేసిన సినిమాలు వస్తూవుండేవి..ఈయన రాకతో వాటి తీరే మారింది. ఎక్కువగా వెలుగునీడలను సృష్టించి చాలా ప్రతిభావంతంగా చిత్రీకరించే తత్వం వున్న సినిమాటోగ్రాఫర్ పి.సి. ఇప్పటి కాలానికి మారిన సాంకేతికతో పోలిస్తే గీతాంజలి సినిమాటోగ్రఫి పెద్దగా అనిపించకపోవచ్చు గాని..! ఆ సినిమా కాలానికి అదొక గొప్ప కాంట్రాస్ట్ లైటింగ్...! కథానుగుణంగా ఆ సన్నివేశానికి కావలసిన గాఢత కనపడేలా వెలుగు నీడలను సృష్టించడంలో దిట్ట పి.సి.శ్రీరామ్. బహుశ మణిరత్నం తన సినిమాలలో ఒకటికన్న ఎక్కువ సినిమాలకు ఒకే సినిమాటోగ్రఫర్‌తో పనిచేసింది పి.సి.శ్రీరామ్‌తో అనుకుంటాను.  సంతోష్ శివన్, పి.సి.శ్రీరామ్, మధు అంబట్, రాజీవ్ మీనన్, సరోజ్ చంద్ర పాడె, రవి యాదవ్.. వీళ్ళంత సమకాలికులు అప్పట్లో..

  సంగీతం: లయరాజ ..ఇళయరాజ గురించి ఎంత చెప్పినా తక్కువే..సినిమా పాటలు..నేపథ్య సంగీతం వేటికవే గొప్పగా చేసారు రాజ గారు.. అప్పట్లో పియానో సంగీతం మన తెలుగు సినిమాలలో వుండేది కాదు..! నేను ఆంగ్ల సినిమాలలో నేపథ్య సంగీతంగా పియానోని వాడినప్పుడల్లా చాలాసార్లు అనుకునే వాడిని.. పియానో సంగీతాన్ని మన వాళ్ళు ఎందుకు నేపథ్య సంగీతంలో వాడుకోరు..అని..! కాని గీతాంజలి సినిమాలో చాలా చోట్ల పియానో వాడారు ముఖ్యంగా హీరో ఊటిలో దిగి కారులో గెస్ట్‌హౌస్‌కి వచ్చే సంధర్భంలో తెల్లటి నురగల్లాంటి మబ్బుల మద్యన కొండాకోనల రోడ్‌లో కారు ప్రయాణం..అక్కడ వాడిన పియానో సంగీతం.. చూస్తున్న ప్రేక్షకులకు కూడ ఆ కారుతో  తెలుపు..బూడద రంగు కలయకలతో కూడిన మబ్బుల మద్యన ప్రయాణిస్తున్నట్లే అనిభూతినిస్తుంది.

  సంగీతం గురించి మాట్లాడుతూ..ఇక ఈయన గురించి చెప్పకుండా మానేస్తే మాత్రం ఈ సినిమాకు పరిపూర్ణత చేకూరనట్లే అవుతుంది...ఆయన ఎవరో కాదు..! తెనుగు పదాలను ఆలవోకగా తన కలంలో జాలువారేలా రాసే.." వేటూరి ", ఈ సినిమా కథని పాటలలో కూడ ప్రతిఫలించేలా వ్రాశారు.
 " మా ఊపిరి నిప్పుల వుప్పెన..మా ఊహలు కత్తుల వంతెన మా దెబ్బకు దిక్కులు పిక్కుటెల్లి పోయే.." యువతలో వున్న ఆవేశాన్ని..ఆలోచనలను తెలియచేస్తారు.
" నడిరేయే సూర్య దర్శనం..రగిలింది వయసు ఇంధనం.."  ఈ పదబందాలు..ఎవరు రాయగలరు..!!
 కథానాయుకుడుకున్న అనారోగ్యం తెలిసాక
   " ఆమని పాడవే హాయిగా..అంటూ.. తరాల నా కథ క్షణాలదే కదా..అని హీరో ఆస్థిత్వాన్ని తాత్వికంగా చెబుతాడు..!
    మరో ప్రపంచమే మరింత చేరువయి నివాళి కోరినా ఉగాది వేళలో గతించి పోనీ గాథ నేననీ.." కథానాయుకుని ఆవేదన ప్రతిపలిస్తాడు..
ఇక కథానాయకి .." జల్లంత కవ్వింత కావాలిలే..ఒళ్ళింత తుళ్ళింత కావాలిలే.." పాటలో.. ఏకంగా వానదేవునికి కళ్ళాపి చల్లే పని..వాయుదేవునికి ముగ్గేసే పని అప్పగిస్తాడు మన వేటూరి..! అలా దేవుళ్ళకే పనులప్పగించే సాహసం ఎవరు చేస్తారు..!!
  " సూరీడే ఒదిగి..ఒదిగి జాబిల్లిని ఒడిని అడిగే వేళ... ముద్దుల సద్దుకే నిదుర లేచే ప్రణయ గీతికి ఓం.."  ఎంత అద్భుతమైన తాత్విక శృంగార భావ ప్రకటన ..ఇది..!!  శిల్పం..వస్తువు వేరయినా..ఇదే శైలిని కొంత మంది గీత రచయతలు అనుసరించారని విన్నాను.
 ఇక కథానాయకి మరణానికి చేరువయిందన్న సంగతి తెలిసాక..కథానాయుకుడు పాడే పాటలో.." ఓ పాప లాలీ..జన్మకే లాలీ.. ప్రేమకే లాలి " తన ప్రియ సఖికి వీడ్కోలు పలుకుతూ.. చుట్టూ వున్న ప్రకృతిని సైతం తన నెచ్చెలికి అనుకూలంగా మసలమని లాలిపాట ద్వార కోరుతాడు.
 " నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా "
  ఈ సినిమాకు గీత రచయతగా వేటూరిని ఎన్నుకొని..సన్నివేశం వివరించి " కాస్త సున్నితమైన భావాలతో కూడిన పాటలు కావాలని " మణిరత్నం అడిగారట..! వెనువెంటనే ఒక అరగంటలో పాట రాసి ఇచ్చాడట..!..ఆ పాటను ఆంగ్లంలో తర్జమా చేయించుకొని విని.. మిగతా పాటలు విననవసరం లేదని చెప్పి..మొత్తం వేటూరితోనే రాయించారు. వేటూరి ఏమి వ్రాసిన వినకుండానే స్వీకరించేవారట..మణిరత్నం.. మరో విషయం కూడ వున్నదిక్కడ..ఆ తర్వాత మణిరత్నం ఏ తమిళ్ సినిమా చేసినా ఆ సినిమా తెలుగులో డబ్ చేయాలనె ఉద్దేశం ఉన్నట్లయితే ముందుగా వేటూరి గారితోనే తెలుగులో పాటలు రాయించి తర్వత తమిళ్‌ పాటలో ఆ భావం స్పరించేలా చేసుకునేవారట.. అంతలా ఆయన ఆస్థాన గీత రచయతయిపోయారు వేటూరి. నా మటుకు గీతరచయతల్లో వేటూరికే అగ్రతాంబూలం ఇస్తాను..శాస్త్రి అయినా..ఆత్రేయ అయినా..ఆరుద్రయినా..సినారే అయినా..సరే... వేటూరి తర్వాతే.. వారి స్థానాలు.

 చివర్లో..నటీనటుల నటన గురించి మాట్లాడుకుంటే...! నాగార్జున... దర్శకుడు ఎలా ఉండమంటే అలా ఉన్నాడు ఈ సినిమాలో..ఈ కథకు పూర్తిగా నప్పాడు ఆహర్య పరంగా..! నటన పరంగాను కూడ.! ఇక గీతాంజలి పాత్రధారిని.." గిరిజ " అసలు ఆమెకు మొదటి సినిమా అంటే ఎవరూ నమ్మలేనంతగా నటించింది..ఇంకా చెప్పాలంటే ఆ పాత్రలాగ ఆ అమ్మాయే వుందేమొ ఆనిపించేలా నటించింది.  నటనలో ఎక్కడా కృత్రిమం కనపడదు. ఓవర్ యాక్షన్ లేదు..! మిగతా వారంతా ఎవరి పరిధిలో వారు చేశారు.

                                                        గీతాంజలి
 ఇరువై రెండేళ్ళ క్రితం సంఘటన....
      రెండో ఆట సినిమా వదలినట్లున్నారు బయట రోడ్ మీద జనాల సందడి వినపడుతున్నది. ఇంతలో మా ఇంటి డోర్ బెల్ మ్రోగడంతో నేను మేడ మీద నుండి కిందకు వెళ్లి తలుపు తీయంగానే బయటనుంచి వస్తున్న మా అమ్మ  " ఏమి సినిమారా అది ఒక మాట సరిగ్గాలేదు,పాటలన్నీ ఏడుపుగొట్టు పాటలే, కథ లేదు చూస్తే ఇద్దరు రోగిష్టులే.... చనిపోతారట !! ఏమన్న సినిమానా..? ఊరికే అరుపులు..కేకలు తప్ప "  అంటూ సణుగుడు మొదలెట్టింది. మా నాన్న కూడ ఏదో చెప్పాలనుకుంటున్నాడు గాని చెప్పలేకపోతున్నాడు. నేను మొదటి రోజే చూసి సినిమా సూపర్ , చాలా బాగుందని  అందరికీ ఊదరగొట్టేశాను. నా మాటలు విని మా అమ్మనాన్న ఇద్దరు సెకెండ్‌షో సినిమాకి వెళ్ళి వస్తున్నారు. పాపం మా నాన్నకు కూడ నచ్చలేనట్లుంది కాని అక్కినేని నాగేశ్వరరావు అభిమాని. ఆ అభిమానం నోరు మెదపనీయట్లేదు ఆయన్ని. నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు...అంత మంచి సినిమా వీళ్ళకు నచ్చకపోవడమేంటి అని తల బద్దలుకొట్టుకొన్నా..!!

   ప్చ్..! వీళ్ళకు బ్లాక్ & వైట్ కాలం నాటి అర్థం పర్థం లేని త్యాగాల సినిమాలు, సంసారం ఒక చదరంగం, ఆడదే ఆదారం లాంటి సినిమాలు చూసి చూసి సినిమా కథ ముప్పైమలుపులు తిరిగి, పెద్ద ట్యాంకంత నీళ్ళు కంటిలో కారిస్తే గాని సినిమా చూసినట్లునపించదు. అదేమి ఆనందమో గాని మరీ డబ్బులిచ్చి సినిమాకు వెళ్ళి ఏడుస్తారు. బహుశ అక్కడే ఆగిపోయినట్లున్నాయి వీళ్ళ మెదళ్ళు అని అనుకున్నా..!! అంతకంటే ఎక్కువ ఆలోచించలేరేమో...?? కొంపదీయకుండా వీళ్ళ వయసులో వున్నవారికి  అలానే వుంటాయేమో ఆలోచనలు, నేను యవ్వనదశలో ఉన్నాను కాబట్టి నాకు నచ్చింది బహుశ నేను కూడ వాళ్ళ వయసులొ ఉండుంటే వారిలాగనే ఆలొచించేవాడినా..? అలాగే వుంటాయా నా మాటలు...నా ఆలోచనలు !? కాసేపు గింజుకున్నా నాలో నేను. ఏమో నాకు కూడ వారి వయసుకు చేరాక తెలుస్తుందిలే అప్పడెలా వుంటాయో ఆ ఆలోచనలు అని సరిపెట్టుకున్నాను.

      గీతాంజలి సినిమా చూసొచ్చిన రోజున రాత్రంత నిద్ర లేదు, మా ఇంటిపైన మంచమేసి వెల్లికల పండుకొని తలను ఆకాశంకేసి చూస్తూ ఆ సినిమా గురించే ఆలోచిస్తూ వుండిపోయాను. సినిమాలో ఒక విలన్ లేడు పెద్ద పెద్ద ఫైట్స్ లేవు, పది ఇరవై మలుపులు లేవు ఏడుపు పెడబొబ్బలు లేవు, చాంతాడంతా డైలాగ్స్ లేవు... కాని సినిమాసాంతం ఒక అద్భుత దృశ్యకావ్యంలా వుంది. సినిమాను ఇలా కూడ తీయొచ్చు అని చూపించాడు మణిరత్నం గారు. అప్పటికి తెలుగు సినిమా పరిస్థితి అంతా బ్రేక్‌డాన్స్‌లతో, చిత్రవిచిత్రమైన మెషిన్ గన్స్ ఫైటింగ్స్‌తో గందరగోళంగా తెరనిండా రక్తంతో నిండిపోయి వుండేది. ఇక హీరోల అగచాట్లయితె చెప్పనవసరం లేదు ముంబాయి, బెంగళూర్, హైదరాబాద్ నగరాల రోడ్స్‌మీద కింద మీద పడి చేసే బ్రేక్‌ డ్యాన్స్‌లతో హీరోల వీపులు పగిలి రక్తసిక్తమైతే అదొక గొప్ప సినిమా అనేంత స్థాయికి వచ్చారు. అలాంటి సమయంలో వచ్చిన సినిమా గీతాంజలి.
     సినిమా ప్రారంభమే ఇంగ్లీష్ పేర్లతో మొదలవుతుంది  వెనువెంటనే మృదువైన ఆలాపన.. తర్వాత " ఐ లవ్ యూ " పదం కొనసాగింపుతో మనకు అర్థమవుతుంది ఒక మంచి దృశ్యకావ్యమే చూడబోతున్నామని. ఇంగ్లీష్ టైటిల్స్ ముగయగానే యూనవర్శిటీ డిగ్రీ ప్రదానం చేసే సభతో సీన్ మొదలవుతుంది.. " ఒక యువభారతం ఉదయించింది. పురోగిస్తున్న భారతం ఉదయించింది, వైఙ్ఞానిక భారతం ఉదయించింది..అన్నిటికన్న కాలవం విలువ తెలిసిన యువభారతం ఉదయించింది " ప్రవచనాలతో జానకిగారి ప్రసంగం సీన్ వెనువెంటనే డిగ్రీ తీసుకోవాల్సిన హీరో " పదరా తొందరగా ఇప్పటికే స్టార్ట్ అయ్యుంటుంది " ఆలశ్యంగా వస్తున్న హీరో ఇంట్రడక్షన్.. సీన్, అంటే మనం బహిరంగంగా బయట ప్రపంచంలో చెప్పుకునే ప్రవచనాలు కేవలం మాటలకే.. వాస్తవానికి మనుషుల ప్రవర్తన అలా వుండదు అది వేరుగా వుంటుందని చూపించారు మణిరత్నం, మరోలా కూడ చెప్పుకోవచ్చు ’హీరో క్యారెక్టరైజేషన్ ’ఆ విదంగా వుందన్న సంగతిని ఆ సీన్ ద్వారా చెప్పారనికూడ అనుకోవచ్చు. ఇక్కడే అర్థమవుతుంది ఈ సినిమా మిగతా రెగ్యులర్‌గా వస్తున్న సినిమాలా కాదు అని. కమర్షియల్ సినిమానే అయినా కూసింత వాస్తవానికి దగ్గరగా మన చుట్టు జరిగే సంఘటనలనే చూస్తున్నట్టుగా వుంటుంది. అప్పటి వరకు వచ్చిన సినిమాలలో హీరోలు పేజీలకు పేజీలు వల్లించే ప్రవచనాలు కేవలం తెర వరకు, పుస్తకాల్లో చదువుకునే వరకే పరిమితం..వాస్తవానికి ఆ ప్రవచనాలు పాటించే మనుషులు మన చుట్టూ టార్చ్ లైట్ పెట్టి వెతికినా కనపడరు. దానికి భిన్నంగా మొదటి సీన్‌లో ఇలా వాస్తవానికి దగ్గరగా చిత్రీకరణ చూడగానే మరింత బలపడింది " ఖచ్చితంగా ఒక మంచి సినిమానే చూస్తున్నానని "

       ఇక " జగడ జగడ చేసేస్తాం.......ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం.........మరణం మింగేస్తాం.. మా పిలుపే ఢమరుకం...మా ఊపిరి నిప్పుల ఉప్పెన..మా ఊహలు కత్తుల వత్తెన.." పాటతో అప్పటి యువత ఆవేశాన్ని కథానాయుకుడి కోణం నుండి చూపించారు దర్శకులు..నిజమే ఆ వయసు అటువంటిది ఆ వయసులో దేన్నయినా సరే సాదిస్తాం..అంతా మాదే..మాకేది అసాద్యం కాదు..ఈ ప్రపంచమంతా మాదే..మేమే కింగులం..అన్నంతగా వుంటుంది యువత మనసు.. కాని నిజంగా ఒడిదుడుకులను తట్టుకోవాలసిన తరుణమే వస్తే..!! వారి మానసిక స్థితి ఎలా వుంటుందో..? ఆ తర్వాతి సీన్‌లోనే మనకు స్పష్టపరుస్తారు దర్శకులు....ఆక్సిడెంట్..తర్వాత ఆసుపత్రి.. అక్కడే ప్రకాష్ (హీరో పేరు) స్థితి ఏమిటి అన్నది. అసలు జీవితమంటేనే నా యిష్టం..నా సొంతం.. ముల్లోకాలు ఏకమైనా సరే నేను అనుకొన్నది సాదిస్తాను, నాకు ఎదురే లేదు అనుకొన్న మనిషికి ఒక్క సారిగా ఇంకొన్ని రోజులలో చనిపోతారు అని చెప్పగానే ఎలా వుంటుంది...? ఆ వయసులో అసలు తట్టుకోగలరా..? అప్పటి వరకు మరణం మింగేస్తాం..!! మేమేరా పిడుగులం..!! మా ఊపిరి నిప్పుల ఉప్పెన అనుకున్న మనిషికి ఒక్క సారిగా శరఘ్ఘాతంలా మరణం ఇంకొన్ని రోజులలోనే సంబవం అనగానే మునుపటి ధైర్యం, దేన్నయినా ఎదుర్కొంటాం తత్వం నుండి డీలా పడతాడు. పూర్తిగా నిరాశకు లోనవుతాడు.. దాని పర్యవసానమే ఊటి పయనం.. ఇక్కడ ఒక సీన్ ఉంటుంది లగేజ్ తీసుకొని బయదేరుతున్న దృశ్యంలో ప్రకాష్ తల్లి సుమిత్రతో ఉన్న సంబాషణలు అంతా  " సిల్‌హౌటి " లో వుంటుంది. ముఖాల్లో ఎవరి బావప్రకటనలు కనపడవు నీడల్లో వుంటారు అందరు. ఆ భావానికి తగ్గట్టుగా చిత్రీకరించారు అప్పటి కాలంలో అదో కొత్త ప్రయోగం.


    హీరోయిన్ ప్రవేశం..." ఒళ్ళింత తుళ్ళింత కావాలిలే..ఉరుకులు..పరుగులు " తో తుంటరి కథానాయికి పరిచయం. పాట ముగిసే లోపల ఇంటికి చేరాల్సిన సమయం మించిపోవడం, ఇంట్లోకి వంటిల్లు నుండి ప్రవేశంతో బామ్మను, తర్వాత ఇంటిలోపలి డైనింగ్‌హాలులో అప్పటికే నాస్టాతో సిద్దమైన కథానాయికి నాన్న, చెల్లెల్ల పాత్రలు పరిచయం అవుతాయి. ఇక్కడినుండే కథాగమనం వేగం పుంజుకుంటుంది ఒక్కో సన్నివేశం ద్వార కథానాయకి తత్వాన్ని తెలియచేస్తూ వస్తారు. తర్వాత సన్నివేశంలో ప్రేమలంటూ అమ్మాయిల వెనుక తిరిగే వారిని ఉద్దేశిస్తూ సటైర్‌లాంటి చిత్రీకరణ. అప్పటి కాలంలో కుర్రాళ్ళ పరిస్థితి అలానే ఉండేది..సైకిల్‌మీదో..లేక మోటర్‌బైక్ మీదో ‍అమ్మాయిలను వందడుగుల దూరం నుండి అనుసరిస్తూ " ఫాలో ప్రేమ " కొనసాగించే పద్దతుండేది. ఇప్పుడున్న కాలంలోని కంప్యూటర్ చదువులతో పాటు వచ్చిన ఆడ మగ స్నేహాలు అప్పటి కాలంలో అభివృద్ది చెందలేదు. ఆడ మగల మద్యన ఆమడ దూరముండేది. మగాళ్ళకు " ఫాలో ప్రేమలు " తప్ప మరే దిక్కులేదు.

      ఇక్కడ నుండే గీతాంజలి ప్రవర్తన ఒక ప్రత్యేకంగ కనపడుతుంటుంది, కౌమారదశలో అబ్బాయిల పట్ల అమ్మాయిల్లో వుండాల్సిన సహజమైన కుతూహలం గీతాంజలిలో కనపడదు. ఓర చూపులు, వాలు చూపులు, సిగ్గుపడటాలు ఏవి వుండవు..! వాస్తవంగ ఆ దశలో వున్న ఆడ,మగ ఇద్దరూ తమ ఆపోజిట్ సెక్స్ వ్యక్తుల పట్ల ఆసక్తి, వారి నుండి గుర్తింపును కోరుకుంటారు అది ఆకర్షణ కావచ్చు మరేదయినా కావచ్చు అది సహజం.. అయితే ఇవేవి గీతాంజలి ప్రవర్తనలో ఎక్కడా కనపడవు... పైగా ప్రస్తుత సమాజంలో జరుగుత్న వ్యవహారలకు తాను అతీతమన్నట్లుగా ప్రవర్తిస్తూవుంటుంది.ఎప్పటికప్పటి జీవితాన్నిఅప్పటికి మాత్రమే అన్నట్లు ఆస్వాదిస్తూ వుంటుంది. ఏ విషయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టదు, అన్నిటిని చాలా తేలిగ్గా తీసుకుంటూ వుంటుంది. సహజంగా వుండాల్సిన దశ నుండి దూరంగా, ఎవరికి అర్థం కానంత ఎత్తుకు, దశకు చేరారంటే దానికి ఏదో ఒక బలమైన కారణమైనా ఉండాలి లేదా చిన్నప్పటినుండి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించే మనిషిలా అయినా పెరిగుండాలి..అయితె అలా పెరిగినట్లు దర్శకుడు ఎక్కడా చెప్పడు కాబట్టి ఏదో బలమైన సంఘటనే వుండవచ్చనే ఆలోచన నాకు కలిగింది..నాకే కాదు సాహిత్య పరిచయం, విరివిగా నవలలు చదివే వారికి చాలా సులభంగానే విషయం అర్థమవుతుంది. ఆ బలమైన సంఘటన విశ్రాంతి సమయంలో స్పష్టపరుస్తాడు దర్శకుడు.

     గీతాంజలి పాత్రను మలచడంలో దర్శకుడి ప్రతిభంతా కనపడుతుంది.. ఒక బలమైన కారణం వలన గీతాంజలి ప్రవర్తన, ఆ ప్రవర్తనను తనకు కావాల్సిన విదంగా చాలా తెలివిగా
మలుచాడు..ముఖ్యంగా అప్పటి యువతలో వున్న ప్రేమంటూ అమ్మాయిల వెనుక తిరిగే అర్థంపర్థంలేని ఒక వ్యవహారం మీద గీతాంజలి పాత్ర ద్వార ఒక "సటైర్" వేస్తాడు దర్శకుడు. బామ్మతో కూరగాయల మార్కెట్ వెళ్ళినప్పుడు తన వెనుక పడి తిరిగే ఒక నల్లటి కుర్రాడిని  " నీకు నేను నచ్చానా..? లేచిపోదామా ? "  అడుగుతుంది..ఈ డైలాగులు వినగానే థియేటర్‌లో వున్న పెళ్ళైన స్త్రీలు నుండి  " హా...ఆ " శబ్దాలు,. " కిస్సుక్కున "  పెళ్ళికాని అమ్మాయిల నవ్వులు. నా వెనుక ఎక్కడో ఒక ముసలావిడ " పోయే కాలం దాపురించి " బుగ్గలు నొక్కోవడాలు.. నాకు బలే నవ్వొచ్చింది..నిజమే అప్పటికాలంలో సాయింకాలం చీకటిపడే సమయంలో తమ తమ ఇళ్ళల్లోనుండి " బాతాఖానీ " కి వీధుల్లోకి చేరి మాట్లాడుకునే అమ్మలక్కల మాటల్లో ఈ పదం మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు స్వరం తగ్గించి లొగొంతుతో " లేచిపోయినారంట " అని మాట్లాడి మిగతా విషయమంతా పెద్దగానే మాట్లాడుకునే వారు. " లేచిపోదామా " పదం ఉచ్చరించతగ్గ పదం కాదనే బలమైన భావన అప్పట్లో వుండేది, మరి అలాంటి కాలంలో ఒక సినిమాలో హీరోయిన్ అలా బహిరంగా అడిగే సరికి థియేటర్లలో ఒక్కటే గుసగుసలు.." హవ్వ " అంటూ బుగ్గలు నొక్కుకోవడాలు జరిగేవి.

    పాపం ఆ నల్ల కుర్రాడు శుబ్రంగా ఓ పెద్ద సూట్ కేసు నిండా బట్టలు సర్దుకొని గీతాంజలి చెప్పిన శ్మశానానికి వస్తాడు..ఆ సన్నివేశం చూడగానే థియేటర్లలోని ప్రేక్షకులు " అయ్యో నిజంగా వచ్చేసాడే " నవ్వుకోవడం..నిజంగా అదే పరిస్థితిలో ఈ అయ్యో అనుకునే వారుంటే వీరు కూడ ఆ నల్లటి కుర్రాడిలానే శుబ్రంగా సూట్‌కేస్ సర్దుకొని వచ్చుండే వారు.

   ఆ కుర్రాడిని గీతాంజలి అండ్ గ్యాంగ్ దెయ్యం వేషాలతో బెదరగొట్టడం...అదే సన్నివేశంలో ప్రకాష్‌కు ఎదురుపడటం.ఏదో కోల్పోయిన వాడిలా " ఆమని పాడవే హాయిగా " పాట పాడుకుంటున్న ప్రకాష్‌కి తనను తన పాటను అనుకరిస్తున్న గీతాంజలి ముఖపరిచయం.  మరసటిరోజు బామ్మతో కలిసి ఆసుపత్రికి వెళ్ళిన సన్నివేశంలో " నాన్నమ్మ నీవు వయసులో ఎవరినయినా ప్రేమించావా..? " గీతాంజలి ప్రశకు నాన్నమ్మ " ఏయ్ నీకేమన్న పిచ్చా..? " గదమాయింపు
"ప్రేమించావా..? "
"గట్టిగా అరవకే పరువు పోతుంది "
" కాదు ప్రేమించి ఏదన్న అయ్యిందనుకో..! దేవదాసులు అయిపోతారా..?"
" నోర్మూసుకో.."
" నిన్నొకతన్ని చూశాను.. ప్రేమలో పట్ అనుకుంటాను.. పాపం గడ్డం పెంచుకొని నీలాగ శాలువ కప్పుకొని చుక్కలెక్కపెట్టుకొంటూ పాడుకుంటున్నాడు.. నీవెప్పుడయినా అలా పాడావా..? "

  ఈ మాటలతో అప్పటివరకు సినిమాలలో వస్తున్న... వాస్తవిక జీవితంలో జరుగుతున్న మెలో డ్రమటిక్ ప్రేమల మీద సటైర్ వేసినట్లు అనిపించింది నాకు. అప్పటికీ తెలుగునాడంతా దేవదాసు, ప్రేమాభిషేకం సినిమాల ప్రభావం చాలా వుండేది..చాలా మంది యువత వాళ్ళనుకునే ప్రేమలో విపలమైతే దేవదాసులా.. గడ్డం పెంచుకొని, శాలువ కప్పుకొని ఆల్కాహాల్ తాగుతూ.. ప్రేమసాగరమనే డబ్బింగ్ సినిమా, అభినందన సినిమాలలోని " ప్రేమ ఎంత మధురురం ప్రియురాలు అంత కఠినం ",  " హృదయమనే కోవలలో నిను కొలిచానే దేవతగా " పాటలను టేప్‌రికార్డరర్‌లో పెట్టుకొని బాదాతప్త హృదయంతో ఒంటరిగా గదుల్లోగడిపేవారు..అంటే సెల్ఫ్ పిటీ అన్నమాట..! వారి మీద వారికే ఒక జాలి.  తామేదో కోల్పోయామనీ తమ చుట్టు వున్న ప్రపంచం నుండి కూడ ఒక " జాలి "ని ఆశించే వారు. ఈ ధోరణి విపరీతంగా వుండేది అప్పట్లో..అలాంటి వారికందరికీ ఈ సన్నివేశం ఒక సటైర్ లాంటిది అనుకునే వాడిని..బహుశ దర్శకుడి భావం కూడ అదే అనుకుంటాను.

   ఈ విదంగా గీతాంజలి పాత్ర తీరును సాధారణ సహజ సంఘటనలకు అతీతంగా ప్రవర్తించేలా తీర్చి ..ఆ ప్రవర్తనను కూడ తనకు కావలసి విషయాలకు అంటే సమాజంలో జరిగే కొన్ని భావాలకు,సంఘటనలకు ఒక " సటైరికల్ " గా ప్రవర్తించేలా మలిచాడు దర్శకుడు. అది కూడా ఎక్కడా మనకు ఎబ్బెట్టుగా అనిపించదు..వాటిని చూస్తున్న ప్రేక్షకులు కూడ " ఎంజాయి " చేస్తారు.

  ప్రకాష్‌ పాటను అనుకరిస్తూ గీతాంజలి పాడటం చూసిన ప్రకాష్ దగ్గరకు వచ్చి క్షణాల్లో ముద్దు పెట్టుకోవడం వెళ్ళిపోవడం లిప్తపాటు కాలంలో జరిగిపోతాయి. ఇది జరుగుతున్న సమయంలో అక్కడ చుట్టూ వున్న మనుషుల ముఖాల్లో " అయ్యో..", " అవ్వా " అంటూ నోరుమూసుకోవడం లాంటి భావాల ద్వార ముద్దు సన్నివేశాన్ని పాగా పండించాడు దర్శకుడు... అంటే చుట్టు వున్న మనుషుల ముఖాల్లోని భావాల ద్వార ఆ ముద్దు యెక్క గాఢతను "cut aways " అనే ఎడిటింగ పద్దతి ద్వార మూడు నాలుగు రకాల " shots" చూపించడం ఒక కొత్త విధానం.

   కాని నిజంగా అలా బయట ఎవరన్న చేస్తే ఇంకేమన్న వుందా..? వీపు విమానమోతే..కదా..? దర్శకుడు ఇక్కడ " సినిమా " అనే భావనను ఒక మినహాయింపుగా తీసుకున్నట్లున్నాడు..బహుశ ఆయన దృష్టిలో ప్రపంచమంతా ఒక వసుధైక కుటుంబం, అందులోని వారంతా ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లా ప్రవర్తిస్తారేమో మరి..అంతక మునుపు పెద్దగా పరిచయం లేని పాత్రలు ఒకరినొకరు ఎదురుపడినప్పుడిలా  ముద్దు పెట్టుకుంటేసుకుంటాయి..అయినా ఎవరు ఏమనరు..!! అంత తెలిసిన వారిలాగే  ప్రవర్తిస్తారు..??

   తర్వాత ప్రకాష్‌తో కూడ మళ్ళీ అదే ఆట " లేచిపోదామా " అని..కాని ఇక్కడ ప్రకాష్ " తీతుపు పిట్టా..ఆయువు చిట్టా.....భోపాల మసజస తతగా..శార్దూలా " తెలుగు చంధస్సుతో గీతాంజలినే భయపెట్టేస్తాడు..తర్వత్తార్వాత సంఘటనలతో గీతాంజలిని ఎత్తుకెళ్ళడానికి ఏకంగా గీతాంజలి ఇంటికే వచ్చి" లేచిపోదామన్నావుగా రా " అంటూ ఎత్తుకెల్తాడు ప్రకాష్.. ఆ సమయంలో గీతాంజలి చిట్టచివరి చెల్లలు " గీతక్కా టా..టా.. బై..బై " అని చెబుతుంటుంది.. చూట్టానికి నవ్వు వచ్చేస్తుంది. ఊటికి దూరంగా పచ్చని కొండల్లో వదిలి వస్తాడు..అప్పుడు కూడ " నన్నొదలిపోవద్దు, నీ జీపు తగలడా..! నీవు నాశనమయిపోవాలి..! " లాంటి నిత్యం జనసందోహంలో మాట్లాడుకునే మాటలతో గీతాంజలి శాపనార్థాలు పెడుతుంటే నవ్వు వస్తుంది. ఒక విదంగా చూస్తే ప్రకాష్ పరిస్థితి వాటికి దగ్గరగానే వుంటుంది అదంతా కాకతాళాయింగానే జరిగినట్లనిపించేలా సన్నివేశం చిత్రీకరించారు.
   ఇక విశ్రాంతి సమయం...! రాత్రియినా ఇంటికి రాని గీతాంజలిని వెతుకి ఇంటికి తెచ్చిన సన్నివేశంలో గీతాంజలి పరిస్థితిని గీతాంజలి నాన్నమ్మ ద్వార " నీవసలు మనిషివేనా..? చిన్న పిల్లను రాత్రంతా అలా మంచులో వదిలిపెట్టేసి వచ్చావే..నీకు మనసు అనేది వుందా..? ఏదో తెలిసీ తెలియక నీ మీద నిందలేసింది..నేను తెలిసి తెలియకొ రెండు అరిచాను........ఏదైనా జరగరానిది జరిగితే..నీవు ప్రాణం పోస్తావా..? పాపం అదసలే అల్పాయిషిది......" అంటూ విషయమంతా ప్రకాష్‌తో పాటు ప్రేక్షకులకు ఇక్కడే తెలియచేస్తారు దర్శకుడు. అది విన్న మనం కూడ అంతకమునుపటి గీతాంజలి ప్రవర్తనకు " సబబే " అనుకుంటూ అంగీకరిస్తాము.
    విషయం విన్న ప్రకాష్ " అవునా నిజమేనా " అని గీతాంజలి దగ్గరకు వెళ్ళి అడిగితే.. ఎప్పటిలాగే తన సహజమైన  " వ్వే" అంటూ సమాధానం. విశ్రాంతి.....

  ఇప్పటికే చా............లా  ఎక్కువయింది..మొత్తం ప్రచురిస్తే అంతే " ఢమేల్ " మంటారు..మిగతా సగం రెండు రోజుల్లో......

      ఓ వంది మంది జూనియర్ ఆర్టిస్టుల  అరుపులతో అక్కడున్న పెద్ద గది నిండి వుంది, నా అసిస్టెంట్స్‌కి సూచనలిస్తూ లైట్స్‌మెన్‌ని తొందరపెడుతూ పని చేయిస్తున్నాను. ఓ ఇరువై నిమిషాలకల్లా నేను అనుకున్న పనులన్ని పూర్తి అయ్యాయి.  అనుకొన్న ప్రదేశాలలో లైట్స్, కటర్స్, గ్రిడ్‌క్లాత్స్ అన్ని సక్రమంగానే ఏర్పాటు చేశారు అసిస్టెంట్స్. మళ్ళీ ఒక సారి అన్ని చెక్ చేసి " షాట్ " రెడీ అని అరిచాను.
    నా అరుపులకు  కెమెరా వెనుక కూర్చొని వున్న మా కెమెరామెన్  నావైపు చూస్తూ " ఊ..ఊ.. పవన్‌మల్హోత్రా రావాలి " అన్నాడు.  పక్కనున్న మరో గదిలో పవన్‌కి తెలుగు డైలాగ్స్ చదివి వినిపిస్తున్నాడు అసోసియేట్ డైరెక్టర్. అవి వింటూ ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆయన. ఎలాగు ఓ పదినిమిషాలు సమయం పడుతుంది అనుకొని మా కెమెరామెన్ పక్కన నిల్చున్నాను. ఇంతలో నా వెనుక నుండి...
 " మాస్  అని మగాళ్ళను అంటారు కదా.. మరి ఆడాళ్ళను ఏమని అంటారు "  ప్రశ్న వచ్చింది
 ఎవరా అనుకుంటూ తల తిప్పి చూస్తే మా వెనుకే హీరోయిన్ చార్మీ నిల్చొని అడుగుతున్నది, నా పక్కన నిల్చోని వున్న ఒకరిద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇక మా కెమెరా అసిస్టెంట్స్‌కి ఏమి చెప్పాలో అర్థం కాక ఒకరి మొకాలు ఒకరు చూసుకుంటున్నారు. వారి నుండి ఏ సమాదానం రాకపోవడంతో నా వైపు చూసింది చార్మి.

  మొదట నాకు తను ఏం అడుగుతున్నదో అర్థం కాలేదు.. మళ్ళీ తనే  " మగాళ్ళు కథానయుకుడుగా చేసే సినిమాలకు  ’మాస్ ’అని టైటిల్ పెడితే..! మరి హీరోయిన్ ప్రధాన పాత్ర వహించే సినిమాకు అంటే నేనే మేయిన్ రోల్ చేసే సినిమాకు ఆడవాళ్ళ పేరు లాగ వుండేలా ’మాసి ’ అని టైటిల్ పెట్టోచ్చా.. ఆ పదం కరెక్టనా "  అని అడిగింది. ఆమె తెలివికి వామ్మో అనుకొంటూ ఢమాల్‌న కిందపడుబోతున్న నన్ను మా కెమెరామెన్ తన చేతులు అడ్డుపెట్టి కాపాడాడు. మా వెనుకే కాస్త దూరంలో కుర్చీలో కూర్చోని వున్న డైరెక్టర్ ఏలేటి చంద్రశేఖర్‌గారు " ఏమి చెబుతారా " అని చిరునవ్వులు చిందిస్తూ మా వైపు చూస్తున్నారు. అ కాలంలో చార్మి మా సినిమాతో పాటు సమాంతరంగా  " మాస్ " సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్నది. అక్కడనుండి పుట్టిన ప్రశ్నలే ఈ తిప్పలు.

  ఆ అమ్మాయి మాట్లాడుతున్న తెలుగుకి, తెలుగులో స్త్రీలింగం, పురుషలింగం వుంటాయని తెలుసుకొన్న ఙ్ఞానానికి అబ్బుర పడాలో లేక  " మాస్ " అనే పదం తెలుగు కాదమ్మ అదొక ఆంగ్ల పదం, అదీను ఆ పదం నామవాచకం లేక సర్వనామం అసలే కాదు అని తెలియని తనానికి చింతించాలో అర్థం కాలేదు, అందునా " మాస్ " పదాన్ని బావదారిద్ర్యంగా మార్చిన మన తెలుగు వారి సృజనాత్మకతకు చేతులు జోడించి జోహార్లు అర్పించాలనిపిస్తున్నది.

  నిజమే మన భారతీయులకు సృజనాత్మకత పాలు ఎక్కువే అనిపిస్తుంది ఉదాహరణకు  may i know ur name please అనే అతి సామాన్య ప్రశ్నకు may i know your good name please  అని ఒక సృజనాత్మకత జోడించారు అంత గొప్పవారు మనవాళ్ళు. లండన్, అమెరికా "నెస్ కాఫీ " వారి అంతర్జాతీయ వ్యాపార వాణిజ్య ఫిల్మ్ టి.వి లలో చూసినప్పుడు మనకు స్పష్టంగా కనపడుతుంది..may i know your name please అని. కాని మనవాళ్ళు మాత్రం good name  అన్నది మాత్రం మరీ నొక్కి వక్కాణించి అడుగుతారు.. నన్నెవరన్న అలా అడిగినప్పుడుల్లా  " వున్న పేరుకి మళ్ళీ మంచి పేరు, చెడ్డ పేరు ఎంట్రా బాబుల్లారా "  మనసులో అనుకునేవాడిని . ఏదో చెబుతూ ఎక్కడికో వెళ్ళిపోయాను కదా.. వుండండి..వుండండి అక్కడికే వస్తున్నా...  అలా ఇక్కడ మన ఫిజిక్స్‌లో వున్న ఈ మాస్ పదాన్ని పట్టుకొచ్చి సినిమా రంగంలో కుదేశారు. అదీనూ చారలు చారలు పొడవు డ్రాయరు బయటకు కనపడేలా అడ్డపంచె కట్టి పసుపు లేక ఎరుపురంగు కట్ బనియన్ ఒకటి వేసి దాని పైన దానికి వ్యతిరేకమైన రంగున్న చొక్క తొడిగి, కళ్ళకు బంగారు రంగు  ఫ్రేమ్‌తొ వున్న నల్లద్దాలు పెట్టుకొని హీరోగారు చిందులేయడాన్ని మాస్ గా పిల్చుకొంటున్నారు. ఆ విషయమే వివరిస్తూ
  " మీరు టెన్తుక్లాస్ చదివారో లేదో తెలియదు గాని..... అంటే మీ 13, 14 ఏళ్ళకే హీరోయిన్ అయ్యారు కదా..! ఇక ఫిజిక్స్‌లో వున్న పదమెలా తెలుస్తుంది చెప్పు...? అసలు "మాస్"  తెలుగుపదం కాదు.. అదొక ఆంగ్ల పదం అందునా వ్యక్తులకు పేరుపెట్టే పదం కాదు. మనం ఫిజిక్స్‌లో చదువుకుంటాము ఆ పదాన్ని. మాస్ అనగా ఒక పెద్ద సమూహము లేక ఎటువంటి స్వరూపం లేని పెద్ద గుంపు, రాశి ఇలా చెప్పుకోవచ్చు. ఇక నీవంటున్న " మాసి " పదానికి అర్థం మాసిపోయినా లేక మా ఇళ్ళ వంటిళ్ళో వేడి వేడి పాత్రలు పట్టుకోవడానికి వాడుకొనే క్లాత్‌ని  " మసివాత "  అంటారు అని చెబుతూ తిరిగి అదే అర్థాన్ని ఆంగ్లంలో చెప్పాను.
  వినగానే అవునా " యాక్ " అంటూ ఎక్స్‌ప్రెషన్ పెట్టింది. 
 అయినా అది ఆ అమ్మాయి తప్పుకాదులే గాని.. మన సినిమా పెద్దల భావ దారిద్ర్యము అది.  పోనీ మీకెవరికన్న  'మాస్ ’ కి  స్త్రీలింగ పదము తెలిస్తే చెప్పండి బాబులు.


    మా కాలనీ నిండా ఎక్కువగా బ్యాచలర్స్ వుండటం మూలాన టిఫెన్ సెంటర్స్, కర్రీపాయింట్స్ పుట్టగొడుగుల్లా వెలిసాయి. అన్ని కర్రీ పాయింట్స్ దగ్గర విపరీతమైన జనాలుంటారు అయితే ఇదే విదంగా అన్ని టిఫెన్ సెంటర్స్‌కు ఉండదు వాటి వాటి రుచులను బట్టి ఒకటి రెండు టిఫెన్ సెంటర్స్‌లలో గుంపు ఎక్కువగా వుంటుంది. చాలా వరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, సినిమా పరిశ్రమలో పనిచేసే చిన్న చిన్న సాంకేతిక నిపుణులు వుండే ప్రాంతమది. కుల,మత,ప్రాంతీయాలకు అతీతంగా జనాలుంటారు.

    అలాంటిచోట రెండేళ్ళ క్రితం ఒక కుటుంబలోని వయసు మల్లిన భార్య భర్త, వారి కొడుకు కలసి తమ ఇంటి ముందున్న కాలనీ రోడ్ మీదే చిన్న తోపుడు బండితో చిన్న సైజు టిఫెన్ సెంటర్ ప్రారంభించారు. నేను మొదట్లో అంతగా వారి గురించి గమనించలేదుగాని రోజుకు రోజుకు అక్కడ గుంపు పెద్దదవడంతో నాచూపు అటువైపు మళ్లింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒకప్పుడు బాగానే బతికనే కుటుంబమే అయినా కాలగమనంలో చితికిన జీవితాలులాగ కనపడుతున్నారు. ఆ బండి చుట్టూ విపరీతమైన జనాలు, మంది ఎక్కువయితే టిఫిన్ అందడానికి చాలా సమయం పడుతున్నది, ఎంతా ఆలశ్యమైనా ఎదురుచూస్తున్నారేగాని పక్క టిఫెన్ సెంటర్స్ వైపు వెళ్ళట్లేదు దానికి కారణం మనింటిలో చేసినట్లుగా రుచి,శుచి వుండడంతో జనాల తాకడి ఎక్కువగా ఉంది. సహజంగానే నా కాళ్ళు కూడ అటువైపు వెళ్ళడం ప్రారంభించాయి.

    అయితే మనుషుల్లో ఉండే ఈర్ష, పోటీ తత్వంలో ఎక్కడ వెనకపడిపోతామోనన్న భయం మూలాన వారి పక్కనున్న తోటి టిఫెన్‌సెంటర్స్ వారే వీరుండే ఇంటిఓనర్‌తో కుమ్మక్కై అక్కడనుండి ఇల్లు ఖాలీ చేయించారు. విచిత్రమేమిటంటే పక్క టిఫెన్‌సెంటర్ వాళ్ళు కూడ తెలంగాణ ప్రాంతం వాళ్ళే, ఇక్కడ బతుకు భయానికి,ఈర్షకు.. కుల,మత,ప్రాంతీయభేదాలు, తమపర అంటూ తారతమ్యాలుండవు అందరిదీ బతుకు పోరాటమే. బతుకు బండిని నడపక తప్పదు కాబట్టి మరో ఐదారు ఇల్ల పక్కనే మరో ఇంటికి మారి అక్కడ టిఫెన్‌సెంటర్ తిరిగి ప్రారంభించారు. రుచి,శుచి ఎక్కడ వుంటే అక్కడికే జనాలు మూగుతారు అలా వారి కస్టమర్స్ మళ్లీ వారి వద్దకే వచ్చారు.

     నేరు తరచుగా వెళ్తుండడం వలన వారితో చనువు పెరిగింది, నాకే కాదు అక్కడికొచ్చే వారంతా వారితో ఒక కుటుంబ సభ్యుల్లా  మెలిగేవారు్. చతురోక్తులు విసురుతూ వుంటారు, తమాషా మాటలు, నవ్వులు, మరి కొందరి తమ తమ ఇంటి విషయాలుకూడ మాటల సందర్భంలో ప్రస్తావిస్తావుంటారు. అక్కడికొచ్చే బ్యాచలర్స్ అంతా రాష్ట్ర నలమూలలనుండి ఉపాధికోసం నగరానికొచ్చిన వారే, అందులో అన్ని ప్రాంతాల వారు వున్నారు, వారికే బేదాలు లేవు... ప్రాంతీయతత్వం మీద జోకులు కూడ వేస్తూ వుంటారు, " ఆంటీ తెలంగాణ దోశ వేయండి " అని ఒకరు, మరొకరు " ఆంటీ సర్కార్ పూరి వేయండి " ఇలా ఎవరికి తోచినట్లు వారు హాస్యాలాడుతూ వుంటారు. అక్కడ వంట చేసే కార్యక్రమంతా పెద్దావిడది, ఆమె వయసు 55 వుండొచ్చేమో. వచ్చిన కస్టమర్స్‌కి టిపేన్ సప్లై చేయడం, పార్శిల్స్ కట్టడం, మిగతా చురకైన పనులన్ని ఆమె కొడుకిది, ఆ కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు.  తిన్నవారి వద్ద నుండి డబ్బు వసూలు చేసే పని పెద్దావిడ భర్తకు అప్పగించారు. అంతే కాక రోడ్ నిండా టిఫెన్ తింటు నిల్చున్న జనాలని అటు ఇటు తిరిగే వాహనాలకు అడ్డు తొలిగించి పక్కకు జరపే పని కూడ ఆయనదే.

    నేను అక్కడికి వెళ్ళిన సమయంలో ఆ పెద్దావిడతో మాటలు కలిపేవాడిని. ఆవిడ మాటలు బలే చమత్కారంగా వుంటాయి. ఒకరకంగా ఆ చమత్కార మాటల కోసమే వెళ్తున్నానేమో అనిపిస్తింది నాకు. నేను నిక్కర్లు వేసుకొనే వయసులో చూసిన " మంగమ్మ గారి మనవడు " సినిమాలోని భానుమతి గారు గుర్తుకొస్తారు ఈవిడ మాటలు వింటే. ఆమె నోట సామెతలు, ఉపమానాలు చాలా సులభంగా ఆశువుగా వస్తూవుంటాయి. అవి చాలా గమ్మత్తుగా, కొత్తగా ఎప్పుడు విననవి వుంటాయి. ఒకరోజు ఉదయం జనాలు తాకిడి ఎక్కువయింది. అందరికీ టిఫిన్ సప్లై చేయడానికి కావలసిన టిఫిన పధార్థాలు లేవు, వంట తొందరగా కావడంలేదు అలాంటి సమయంలో ఆవిడ కొడుకు వెంటనే వంట చేస్తున్న వాళ్ళమ్మ వద్దకు వెళ్ళి ’నీవు తప్పుకో ’ అంటూ పూరీలు చేసే పని అందుకొన్నాడు. ’రేయ్ నడవరా నీవు, నేను చేస్తాను పదా ’ అని అరిచినా వినట్లేదు ఆమె కొడుకు. ఒకటి రెండు నిమిషాలకు తర్వాత అతను చేస్తున్న పూరీలు చూసి
 " మీ అమ్మగారే బాగా చేస్తున్నారు వంట, నీవు చేసిన పూరీలు చూడు ఎలా మాడిపోయాయి "  అన్నాను నేను
" మరదే... గాజులు లేని చేయి వంట చేస్తే గట్లనే వుంటది "  అందావిడ
చుట్టు వున్న వారు నవ్వేశారు,  బలే వున్నాయే ఆ మాటలు, ఆ భావం అనిపించింది నాకు. ఇంతలో నాపక్కునున్నవాడు అందుకొని
" గాజులే కదా ..? వంట చేస్తున్న మీ అబ్బాయి చేతులకు గాజులు వేస్తే సరిపోతుందిలేండి "  అన్నాడు.
మేమలా నవ్వుకుంటున్న సమయంలోనే.....
 కాలం చెల్లిన, రంగు వెలసిన ఒక చిన్న సైజు ’ఆకురౌడి ’ చిన్న మోటర్ బైకు వేసుకొని టిఫిన్ బండి వద్దకు వచ్చాడు. బహుశ పూర్వాకాలంలో ఒక వెలుగు వెలిగుంటాడేమో మరి..?? బండిని రోడ్డుకు అడ్డంగా పార్క్ చేసి వచ్చాడు. అది చూసిన పెద్దావిడ  
" అన్నా జర లోనకు బండి పెట్టరాదే వీధికడ్డంగా వుంది ఎవరోకరు ఏదో ఒకటి అంటారు "  అన్నది
" అరే.... మన వీధే...మనల్నెవరు అంటారు "  తిరుగు సమాధానం.
వెంటనే ఆవిడ చాలా స్పాంటినియస్‌గా...... " మనింటి దీపమే కదా అని...ముద్దాడితే మూతి కాలిపోదూ ... జరా లోపలకి జరపన్నా.."   అన్నది.
ఆ మాటతో నాలోని మనిషి ఉలిక్కిపడి..భావం అర్థమై..వస్తున్న నవ్వును ఆపుకోలేక పుసుక్కున పకపకా అని బయటకు నవ్వేశాడు. సామెత భలే వుంది నాకయితే " కేక " అనిపించింది.
వెంటనే తల తిప్పి నావైపు ఉరిమి ఉరిమి చూపులుతో చూశాడా ఆకురౌడి.
" ప్చ్..య్యా " అనుకొన్నా. ఆవిడ అంత చెప్పినా వినడే..! బాగా చదువుకున్న వాళ్ళే  ’సివిక్ సెన్స్ ’ అవగాహన వున్నాకూడ నిర్లక్ష్యదోరణి అవలింబిస్తారు..మరి ఒకప్పటి ఆకురౌడి వింటారా చెప్పండి.

                                                        దెయ్యం

   " రేయ్ కిశోర్.. లేయిరా ! పనిమనిషి రాలేదుగాని నీళ్లు తెచ్చేపని పడింది నీకివాళ "
కిశోర్ తల్లి వకుళ వంట గదినుండి హాలులోకి వెళ్తూ మంచం మీద నిద్రిస్తున్న కిశోర్‌ని చేత్తో తట్టి వెళ్లింది అక్కడ నుండి. తల్లి పిలుపుతో నిద్ర మత్తులో ఉన్న కిశోర్ మసిలాడే గాని లేవలేదు, ఇంకాస్త గట్టిగా ముసుగు తన్ని పడుకున్నాడు.
  వకుళ చీపురు తీసుకొని చెత్త ఊడుస్తూ కిశోర్ నిద్రిస్తున్న మంచం వద్దకు వచ్చింది, ఇంకా నిద్రపోతున్న కిశోర్ వీపు మీద ఒక దెబ్బ వేసింది కాస్త బలంగానే. " అబ్బా ఏంటమ్మా " అరుస్తూ లేచాడు
 " మీ నాన్నేమో ఆఫీసు పనిమీద పొద్దున్నే క్యాంప్‌కి పోయినాడు, ఈ పనిమనిషి కూడ ఈరోజే రాలేదు. మరి ఇంటి పనులన్ని ఎవరు చేస్తర్రా..? "
" ఏమయ్యింది ఈ లక్ష్మమమ్మకు..? ఈ మద్యన బాగానే పని ఎగ్గొడ్తాంది..? "  అడిగాడు కిశోర్.
" దెయ్యం పట్టిందంటా  "
" దెయ్యమా...  ఈ కాలంలో కూడ దెయ్యాలేంటమ్మా..? "  అడిగాడు
" ఏమోరా..! ఆర్నెల్ల క్రితం చనిపోయిన వాళ్ల అమ్మమ్మ పట్టిందంట లక్ష్మమమ్మకు "
" వాళ్ల అవ్వకు ఏం పనిపాట లేదంటనా.."
" నీకు సమధానాలు చెప్పే ఓపిక లేదుగాని పోయి నీళ్ళు తాపో... ఇప్పటికే సానా టైం అయిపోయింది ఈ మున్సిపాల్టోల్లు నీళ్ళు ఆపేస్తారు "
" అయినా కిరణ్మయి వుంది కదా..! దాన్ని పంపొచ్చుకదా..? "  మంచం మీద నుంచి లేవకుండానే అడిగాడు.
" ఇంప్రూవ్‌మెంట్ కట్టింది కదా ! ఆ పరీక్షలకు పొద్దున్నే లేచి చదువుకుంటూ వుంది.."
" హు..ఎంత ఇంప్రూ‌మెంట్ కట్టి మళ్లీ పరీక్షలు రాసినా అవే మార్కులు..పెరగవ్ "
" ఒరేయ్.. నన్ను విసిగించకుండా వెళ్ళి నీళ్ళు తాపో..! అయినా నీకేమి పనివుంది..? ఇంజనీరింగ్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేదాక పనేమి లేదుకదా..? పొద్దున లేచినప్పటి నుండి వూరి మీద పడి తిరగడమే కదా నీ పని !  ఈరోజు పనిమనిషి రాలేదు.. ఈ కాస్త పనులు కూడ చేయవా..? మీ నాన్నేమో అట్లా..! మీరేమో ఇట్లా ఒకరిమీద ఒకరు వంతులు... చస్తున్నా మీతో..! లేయి..లేచి నీళ్ళు తాపో.. లేకపోతే చస్తావ్ నాచేతిలో "  అంటూ చేతిలో వున్న చీపురు ఎత్తింది కొట్టడానికి.
 తల్లి అంతపని చేస్తుందన్న భయంతో మంచం మీద నుండి లేచి  " ఎప్పుడు నేనే తేవాలి నీళ్ళు, చెల్లెలు ఎప్పుడు పని చేయదు..! దాన్ని బాగా ’గోము ’చేస్తున్నావు, రేపు పెళ్ళాయ్యాక దాని మొగుడు చస్తాడు దీనికి చాకరి చేయలేక "  గొణుగుతూ పరిగెత్తాడు వంటింట్లోకి.
  ఒకే కాంపౌండ్‌లో కిందా పైనా గ్రౌండ్‌ఫోర్‌తో కలిపి ఐదు ఇల్లు ఇళ్ళు వున్న ప్రాంగణమది, త్రాగునీరుకోసం అందరూ అదే కాంపౌండ్‌లో ఉన్న కుళాయి వద్ద నీళ్ళు పట్టుకుంటారు ప్రతిరోజు ఉదయమే. కిశోర్ ఇత్తడి బిందెతో అక్కడి చేరి నీళ్ళు పట్టుకుంటున్నా  అతని ఆలోచనలు పనిమనిషి లక్ష్ముమమ్మ మీదకు మళ్లాయి. ’ఈ కాలంలో కూడ దెయ్యాలున్నాయని నమ్ముతున్నారా..?  అయినా చనిపోయిన వాళ్ళ అవ్వనే మనవరాలి ఒళ్ళొకి వస్తుందా..? ఎందుకు..? ’ఇలా పరివిదాలుగా ఆలోచిస్తున్నాడు. ఆ రోజు సాయింత్రం వూరి చివర్లో మనిషికి పట్టిన దెయ్యాలను విడిపించే మంత్రగాళ్ళ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళతో కట్టిన కాంపౌండ్‌లో చాలా వరకు దిగువ మధ్యతరగతి, క్రింద తరగతి మహిళలే ఒళ్ళులో దెయ్యం దూరినట్లుగా జుట్టంతా విరబోసుకొని ఊగుతూ ఏవేవో గొణుగుతున్నారు. అక్కడున్న మంత్రగాడు ఒక మహిళవద్ద నించోని వేప మండలతో కొడుతూ ఏవేవో నోటికొచ్చిన మంత్రాలను చదువుతున్నాడు, బహుశ ఆ దెబ్బలు తాలలేకో లేక హిస్టీరియా ఎక్కువై ఏమోగాని మంత్రగాడు వేపమండలతో కొట్టేకొద్దీ ఇంకా గట్టిగా ఘీంకరిస్తున్నారు.
  కిశోర్‌లో అకస్మాత్‌గా ఒక అనుమానం తట్టింది. ’అవునూ ఈ దెయ్యాలు కేవలం ఆడవారికే ఎందుకు పడ్తాయీ..? అదీనూ కోరి..కోరి దిగువ మద్యతరగతి మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి.. ఎందుకలా..? మగవాళ్ళకు పట్టినా చాలా తక్కువ మంది వున్నారక్కడ ! ఇక  పైవర్గాల వారికి అంటే ధనిక వర్గాల ఆడవారికి ఎందుకు పట్టవ్...? దెయ్యాలకు కూడ పేదలంటేనే లోకువ..? వాటికి కూడ ధనిక, పేద అంటూ తార తమ్యాలున్నాయా..? ’ ఇలా సాగుతున్నాయి ఆలోచనలు అతనిలో.
   అతనిలోని ఆ ఆలోచనలు నిలువనీయలేదు.. వెంటనే  లైబ్రరీకి వెళ్లి ’దెయ్యాలు మనుషులకు ఎందుకు పడ్తాయి..’ విషయాల మీద అప్పటి వరకు వారపత్రికలలో వచ్చిన కొన్ని వ్యాసాలు, మరికొంతమంది సైక్రియాటిస్ట్స్ మానసిక స్థితిగతులమీద ( హిస్టీరియ ) వ్రాసిన పుస్తకాలు చదివాడు. ఆ పఠనం వలన అతనిలో మెల్లిమెల్లిగా మరి కొన్ని ఆలోచనలు సంతరించాయి. రెండు రోజుల తర్వాత ఉదయమే పనిమనిషి లక్ష్ముమమ్మ వచ్చింది పనిలోకి.
 " ఏమ్ లక్ష్ముమమ్మ ఇప్పుడెలా ఉంది ఆరోగ్యం "  అడిగాడు కిశోర్.
పెదవిప్పకుండానే  ’ ఊ..ఊ ’అంటూ తలూపుతూ పైకి శూన్యంలోకి చూసుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన వైపు చూస్తూ ఆలోచనలోకి వెళ్ళాడు కిశోర్..
    లక్ష్ముమమ్మ వయసు దాదాపుగా 45 దాక వుండొచ్చేమో..! వకుళ ఇంట్లో పనిమనిషి చేరే సమయానికి లక్ష్ముమమ్మకు పెళ్ళి అయి నాలుగు సంవత్సరాలై ఉంటుంది..! అప్పటికి ఇంకా కిశోర్ పుట్టలేదు ఆ యింట్లో. ఆమె వచ్చిన సంవత్సరానికి కిశోర్ పుట్టాడు.  పిల్లలేని లక్ష్ముమమ్మ కిశోర్‌ని చంకనేసుకొని తిరిగేది.. తన పిల్లాడిలాగే భావించేది.  మంచి రంగు వున్న మనిషి లక్ష్ముమమ్మ, కలవారింట్లో పుట్టి వుంటే మహరాణిలా ఉండిండేదేమో ఆమె దర్పం, ఆమె మేని ఛాయ చూస్తే అలానే అనిపిస్తుంది, మనిషి చాలా నెమ్మది ఎక్కవుగా మాట్లాడదు, ఎవరేమి కబుర్లు చెప్పినా చిరునవ్వుతో వింటూ వుంటుందేగాని వాటికి అవునని కాని కాదని అని కాని బదులు పలకదు, అందరి విషయాలు చిరునవ్వుతో వింటుందే కాని..ఒకరింట్లో మాటలు మరొకరి ఇంట్లో చెప్పదు, అందుకే ఆ వీధిలో లక్ష్ముమమ్మ అంటే చాలా మందికి ఇష్టం. అలాంటి లక్ష్ముమమ్మకు తర్వాతర్వాత మెల్లిగా కష్టాలు మొదలయ్యాయి.
    లక్ష్ముమమ్మ అవ్వ ( అమ్మమ్మ ) నుండి ఆమె అమ్మ, ఆమె కలసి ముగ్గురూ పనిమనుషులుగా పని చేస్తున్నారు ఆ వీధిలో. మూడు తరాల వారంతా పనిమనుషులుగానే వారి వృత్తి,  మేనమామ అయిన అమ్మ తమ్ముడినే అంటే లక్ష్ముమమ్మ అవ్వకు కూతురు తర్వాత చానా ఏళ్ళకు పుట్టిన  ఇద్దరి కొడుకుల్లో పెద్దవాడైనా రంగడుకు తన పెద్ద కూతురు కూతురైన లక్ష్ముమమ్మని ఇచ్చి పెళ్లి చేసింది, అంటె తన కుమారుడికి తన మనవరాలిని ఇచ్చి పెళ్లి చేసింది, రంగడు రిక్షా తొక్కుతూ జీవనం సాగిస్తున్నాడు మనిషి చాలా మెతక ( రౌడి రకం కాదు.లేదా కూసింత సున్నితత్వం అని కూడ అనొచ్చేమో ), అతను కూడ లక్ష్ముమమ్మ లాగే మాటలకన్నిటికి చిరునవ్వే సమాదానం ఇస్తూ వుంటాడు.
   లక్ష్ముమమ్మ వకుళ ఇంట్లో పని చేస్తుండగానే కిశొర్‌ తర్వాత రెండేళ్ళకు ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది, రంగడు కిశోర్, కిరణ్మయిలు పాఠశాలలకు వెళ్ళే వయసొచ్చేకాలానికి వారిని తన రిక్షాలో కాన్వెంట్‌కు తీసుకెళ్ళేవాడు. పెళ్ళి అయ్యి ఏడేనిమిదేళ్ళు గడిచినా పిల్లలు పుట్టలేదనే దిగులు తప్ప మరేమి కష్టాలు, బాదలు లేని సంసారం లక్ష్మమమ్మ, రంగడులది.  అయితే అప్పటి వరకు సాఫీగా సాగిన జీవన బతుకుబండి..! తర్వాత మెల్లిమెల్లిగా గతకుల బాట ఎక్కనారంబించింది, అది రంగడు రూపంలో. అకస్మాత్‌గా రంగడు ఎవరికీ కనపడకుండా మాయం అయ్యేవాడు.. ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు, ఎక్కడున్నాడో కూడ సమాచారం ఇవ్వడు, ఓ మూడు నాలుగు నెలలకు తిరిగి ప్రత్యక్షమయ్యేవాడు, రంగడి అమ్మ, అక్క , లక్ష్ముమమ్మ ముగ్గురు ఏకమై గోల చేసినా ఉలకడు పలకడు..ఎంత బతిమాలినా ఎక్కడికెల్లింది చెప్పడు, చివరకు వకుళ, ఆమె భర్త కాస్త గట్టిగా అడిగితే  " ప్రకాశం, గుంటూర్‌ల వైపు వెళ్ళి వచ్చానని "  నొరువిప్పుతాడు.
  " అక్కడేం పని నీకు " అని అడిగితే
 " భవన నిర్మాణ కూలి పనులకు వెళ్ళా " నని చెబుతాడు.
 " మేస్త్రీ పనులకు వెళ్లినావా..? ఇక్కడ రిక్షా బాడుగలు బాగానే వున్నాయి కదా..! ఈ పని కంటే మేస్త్రీ పని కష్టతరమైంది కదా దానికెందుకు వెళ్లినావ్..? "  అడిగితే పలకడు,  బెల్లం కొట్టిన రాయిలా నించోని వుంటాడు. ఎంత అడిగినా ఉలకని పలకని మనిషితో  ’వీడింతే ’ అని అడగడం మానేసారు అందరు. తిరిగి తన మునపటి రిక్షా పని కొనసాగించేవాడు. రంగడు అదృశ్యమయిన కాలంలో ఇంటికి మగదిక్కులా రంగడి తమ్ముడు కిష్టప్ప వుండేవాడు, అతను తన అన్నలాగే రిక్షా తొక్కుతూ కుటుంబానికి అండగా వుంటూ అన్న ఒప్పుకున్న రోజువారి స్కూల్ పిల్లలని తీసుకెళ్ళే బాడుగలకు కిష్టప్పే దిక్కు అయ్యేవాడు.
   అలా ఒక నాలుగు నెలలు అన్ని పనులు సక్రమంగా చేస్తూవుండగానే రంగడు ఎవరికీ ఏమి చెప్పాపెట్టాకుండా మళ్లీ మటు మాయం..మొదట్లో కంగారుపడినా  తర్వాత్తర్వాత అతని ’మటు మాయాలు ’ సర్వసాదారణం కావడంతో అందరు అలవాటు పడిపోయారు. కాని ఒక్క లక్ష్ముమమ్మకే అతని ప్రవర్తన చాలా కష్టంగా వుంది, ’కడుపున ఒక కాయ కూడ కాయకపోయే.. ఈ మనిషికేమో ఆ ఊసే లేదు, మనిషి మాయం అయినప్పుడు మానసికంగా తోడు లేక మదన పడుతూ వుండేది, తను పని చేసే ఇళ్ళల్లోని అందరి సంసారాలలో కనపడే వారి ఆనందాలు, భార్యాభర్తల అనుభందాలు, పిల్లలతో జరిగే ఆటలు, ముచ్చట్లు, ఇవేవి తన జీవితంలో లేవనే విషయం తనకి స్పష్టంగా కనపడసాగింది. లక్ష్ముమమ్మకు తన తల్లి వద్ద కంటే అవ్వ వద్దే చాలా చనువు, అలా రంగడు చెప్పాపెట్టాకుండా పోయినప్పుడల్లా తన బాదనంత  అవ్వ వద్ద వెలిబుచ్చేది. అక్కడే ఒక శ్వాంతన పొందేది. ఇలా సాగుతున్న జీవితంలో ఒక మంచి తరుణాన లక్ష్ముమమ్మ గర్భందాల్చింది. అది ఇంటిల్లిపాదికంతా ఆనందాన్ని ఇచ్చింది, పిల్లలు పుట్టిన తర్వాతయిన రంగడిలో మార్పు రావచ్చని  అందరి ఆశ. కొన్నాళ్లకు ఒక ఆడపిల్లను కన్నది లక్ష్ముమమ్మ. రంగడి ఆనందానికి హద్దులేవు..ఇన్నాళ్లకు తనొక  ’మగాడి ’ని నిరూపించబడ్డాను అన్న ఆనందం అతనిది. గతంలోలా ఇప్పుడు  ఇంటినుండి చెప్పకుండా పోవడం జరగలేదు పాప పుట్టిన తర్వాత రంగడి విషయంలో. లక్ష్ముమమ్మకే కాక స్కూల్ పిల్లల రిక్షా బాడుగలు ఒప్పుకున్న వారికి కూడ రంగడిలోని మార్పు స్థిమిత పరిచింది
    ఒక సంవత్సరం గడిచాక రంగడు మళ్లీ మొదలెట్టాడు వెళ్లిపోవడం.., ఈ సారి మునపటిలాగ మూడు లేక నాలుగు నెలలకు తిరిగిరావడంలా కాకుండా ఏకంగా సంవత్సరం తర్వాత కనపడుతున్నాడు. ఇంట్లో అందరూ గొడవపడటమే అతనితో, అప్పుడు మాత్రం ఇక వెళ్లను అంటాడు, మళ్లీ ఒక నెలకే మటుమాయం, తర్వాతెప్పుడో సంవత్సరానికో లేక రెండేళ్ళకో కనపడతాడు.. అతనితో గొడవపడి..పడి అందరికీ విసుగెత్తి చివరకు వదిలేశారు ఎలాగైనా తగలడనీ అని. అలాంటి సమయంలో లక్ష్ముమమ్మ మరది కిష్టప్పనే కుటుంబానికి తోడు, ఆ తోడు చివరకు మానసికంగా లక్ష్ముమమ్మకు కూడ ఆసరా అయ్యింది, కిష్టప్ప కూడ ’వదినా..వదినా ’ అంటూ లక్ష్ముమమ్మ చెప్పే పనులన్నిటికీ తలూపుతూ తిరిగేవాడు. రంగడు లేని లోటుని అలా పూడ్చుకునేది లక్ష్ముమమ్మ.
   ఆ ఆనందం కూడ ఎన్నాల్లూ..? ఒక శుభముహుర్తాన కిష్టప్పకు ఒక సంబందం చూసి పెళ్ళి చేశారు కుటుంబ పెద్దలు. అంతే ఆ సంఘటనను అంత త్వరగా జీర్ణించుకోలేకపోయింది లక్ష్ముమమ్మ, తమ జీవితాంతం అతను తోడు వుంటాడని గాని..ఏదో ఒకరోజున తన మరది పెళ్ళి చేసుకొని ఒక ఇంటివాడవుతాడని స్పృహ వున్నా...! పెళ్ళి చేసుకొని తన పరది నుండి వెళ్ళిపోవడమన్నది అంత సులభంగా అంగీకరించలేక పోయింది ఆమె. మళ్లీ ఇప్పుడు తిరిగి తన శూన్యమే తనకు దిక్కు అయ్యింది. పెనిమిటి ఎప్పుడొస్తాడో తెలియదు, అస్సలు... వస్తాడో రాడో కూడ తెలియదు, తన చుట్టూ వున్న అందరి జీవితాల్లో నూరు శాతం ఆనందం లేకపోయినా తనలాంటి జీవితమైతే కాదు. ’భర్త, పిల్లలు..గొడవలు..అనందాలు..సుఖాలు, ఎక్కడికైనా సరే భర్తతో కలిసి వెళ్ళడాలు వున్నాయి అందరికీ ’ఈ భావన ఆమెలో అలజడి రేపసాగాయి. మునపటిలా ఆమె మొహంలో వున్న ’చిరునవ్వు ’ రోజు రోజుకు సన్నబడింది.. కొన్నాళ్ళకు పూర్తిగా ముభావాన్ని ఆశ్రయించింది.
  ఇలాంటి తరుణంలోనే లక్ష్ముమమ్మకు మరో విధ్యుత్‌త్ఘాతం... ’అవ్వ ’ మరణ రూపంలో తగిలింది.  చిన్నప్పటినుండి తనకున్న ఏకైక ఆత్మీయురాలు  అమ్మమ్మ దూరం మరింత కృంగదీసింది. జీవితాంతం తోడు అనుకున్న భర్త ఉనికి ఏమిటొ కూడ అర్థం కాని పరిస్థితి, శారీరక, మానసిక సుఖాలు ఏవి లేవు, ఉన్న ఒకరిద్దరు ఆత్మీయులు కూడ తనను ఒంటరి చేసి వెళ్ళిపోయారనే భావన. వున్న ఒక్క కూతురిని చూసుకుంటూ బతుకుతున్నా... మగతోడు లేని జీవితాన్ని భరించలేకపోతున్నది. ఆ విషయంలో లోలోపలే మధనపడుతున్నది. ఒక్కో సమయంలో ’హిస్టీరియా ’ లా అరిచేది. ఇళ్ళల్లో పనులకెళ్ళినప్పుడు మౌనంగా ఉంటూ అక్కడి పనులన్నీ చేస్తున్నది, ఇంటికి రాగానే మళ్లీ అవే ఆలోచనలు.. అంతే ఒళ్ళులోకి ఏదో ఆవహించినట్లు అరుపులతో గోల చేసేది..మొదట్లో అది అర్థం కాకపోయినా మెల్లిగా చుట్టుపక్కల వున్న వాళ్ళు అది గమనించి  ’దెయ్యం ’ పట్టింది లక్ష్ముమమ్మకు అని ప్రచారం చేశారు.. ఆ దెయ్యం ఎవరో కాదు లక్ష్ముమమ్మ ’అవ్వ ’ నే అని ఒక నిర్ణయానికొచ్చి అవే మాటలు లక్ష్ముమమ్మ ’హిస్టీరియా ’ గా కేకలు పెడ్తున్న సమయంలో ఆమె నోటి నుండే పలికించారు. అది మొదలు... వారంలో రెండు మూడు సార్లు వాళ్ళనుకొనే దెయ్యం వచ్చేది లక్ష్ముమమ్మ ఒళ్ళోకి.
  దెయ్యమనే హిస్టీరియా మహమ్మరి వలన చాలా మంది తమ ఇళ్ళల్లోకి పనులకు రానిచ్చేవారు కాదు..చివరకు వకుళ ఇంటితో పాటు మరో ఇంటికి మాత్రమే ఆమె పనులోకి వెల్తున్నది. లక్ష్ముమమ్మ మొగుడు తర్వాత కనపడలేదు, అసలు బతికే వున్నాడా.. లేడా..? విషయం కూడ తెలియదు.  కొన్నేళ్ళ తర్వాత వకుళ ఇంట్లో కూడ పని  మానేసింది.
   కిశోర్ ఉద్యోగ రిత్యా బెంగళూర్‌లో స్థిరపడ్డాడు. అప్పుడప్పుడు వూరికి వచ్చినప్పుడు...తనకు గుర్తుకొచ్చినప్పుడల్లా వకుళని అడుతూవుండేవాడు ’అమ్మా లక్ష్ముమమ్మ కనపడట్లేదు అసలు వున్నదా లేదా..ఎప్పుడన్న మనింటి వైపు వస్తున్నాదా..? "
  " ఏమోరా అస్సల్ కనపడలేదు..ఏమయ్యిందో ఏమో మరి "  వకుళ సమాదానం.
వున్న ఒక్క కూతురు కూడ ఇంటర్‌మీడియట్ చదువుతూండగానే ఒక తోడుని వెతుక్కొని చెప్పాపెట్టకుండా లక్ష్ముమమ్మను ఒంటిరి చేసి వెళ్లిపోయింది.
 ఒక సారి బెంగళూర్ నుండి తనూరికి వచ్చిన సందర్బంలో కిశోర్ బజార్లో వెల్తున్నసమయంలో లక్ష్ముమమ్మ ఎదురుపడింది, దూరంగా వస్తున్నప్పుడే చూశాడు కాని సరిగ్గా పోల్చుకోలేదు ఆమె అవునా కాదా అని చూస్తున్నాడు.. ! జుట్టు అంతా తైలం లేకుండా ఎండిపోయి రేగిపోయి వున్నది ముఖంలో మునపటి కళ లేదు, చర్మమంతా పీక్కుపోయి ఎముకలకు అతుక్కుపోయింది ఇప్పుడు నిజంగా ఆమే ఒక ’దెయ్యం ’ లా కనపడుతున్నది. కట్టుకొన్న చీర కూడ మాసిపోయి వున్నది..ఎప్పటిదో అది.  దగ్గరకొచ్చాక  పలకరించాడు కిశోర్.
 " లక్ష్ముమమ్మ బాగున్నావా..? "
" ఎవరూ "  అంటూ కిశోర్ మొహంలోకి చూసింది.. కాని మనిషిని గుర్తుపడుతున్నట్లుగా చూడట్లేదు ఏదో శూన్యంలోకి చూస్తున్నట్టుగా వుంది.
 " నేను వకుళ కొడుకుని.. కిశోర్‌ని "
 " ఆ బాగున్నావా నాయనా..? పిల్లలెంతమంది.. ? "  అలా అడగడంలోనే కిశోర్‌కి అర్థమయ్యింది ఆమె తనని గుర్తుపట్టలేదని
ఇంటికి పిలిచి ఆమెకు ఒక మంచి చీర ఇద్దామనుకొని చెప్పేలోపలే కిశోర్‌ని దాటుకొని ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయింది లక్ష్ముమమ్మ. కిశోర్ పిలిచినా వినపడనట్లే వెళ్ళిపోయింది. అసలు బయట ప్రపంచంతో సంబందం లేని మనిషిలా వున్నది ఆమె ప్రవర్తన.  ఒక నిట్టూర్పు విడిచి కదిలాడు అక్కడ నుండి కిశోర్.
 

                                                                 దేవుడు ( దేవత )

                " టైమ్ అయిపోతున్నది ఇంకా టెంకాయి కొట్టలేదా..?  ..ఇప్పటికే చాలా లేట్ అయ్యింది..ఇప్పుడు బయలుదేరితే మైసూర్‌కి ఎప్పటికి చేరుకుంటామో..ఊ..తొందరగా కానివ్వండి " అంటూ పెళ్ళి బస్సు వద్ద నుంచి వాసు ఇంట్లోకి వెళ్ళాను.
 వాసు తండ్రి నారాయణస్వామి ఎదురుపడ్డాడు నాకు.  " ఎంటి అంకుల్ ఇంకా తెమలలేదా.. ఇప్పటికే సమయం 12 గంటలు కావస్తున్నది " అన్నాను
" లేటైనా పర్లేదులేరా..! ఎలాగు ఘాట్‌రూట్‌లో వెళ్ళాలి మనమెళ్ళే సమయానికి  దొంగలు కూడ బాగా నిద్రపోతూవుంటారు "  అన్నాడు నారాయణస్వామి
’అబ్బా ఈయన చాదస్తంతో చస్తున్నాం కదరా బాబూ ’ మనసులో గొణుగుకుంటూ లోపలికెళ్ళి పెళ్ళివారినందరిని తొందరపెట్టాను.
     వాసు నా చిన్ననాటి స్నేహితుడు, వాసు కుటుంబసబ్యులతో కూడ చిన్నప్పటినుండి సాన్నిహిత్యం వుంది, మొత్తానికి వాసు ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు..అదీను ఎవరినో తెలుసా..? వాడు చదివిన కాలేజి లెక్చరర్‌ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నాడు. వీడి ప్రేమ విషయం మొదట మాకు తెలిసినప్పుడు " అరె ఏమయ్యిందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎగిరిందీ.." సినిమా గుర్తుకొచ్చింది. తర్వాత  తన ప్రేమ విషయం విన్న వాసు నాన్న నారాయణస్వామి  " హట్.. నేనీ పెళ్ళికి ఒప్పుకోను.." ఎస్వీయార్ టైప్‌లో అరిచాడు, అందుకు వాసు " మా బందం ఇప్పటిది కాదు.. ఎప్పటినుండో వస్తున్న జన్మజన్మల బందం.., ఈ జన్మలోకూడ ఈ బందం అలాగే కొనసాగిస్తాను మీరు కాదన్నా సరే నేను ఇంట్లోనుండి బయటకు వెళ్తాను మీ ఆస్తి కూడ వద్దు నాకు "  అంటూ చివర్లో పలికిన " ఇంట్లోంచి వెళ్తాను " అన్న పదం మరీ నొక్కి వక్కానించాడు వాసు అమ్మకు బాగా వినిపడేట్లుగా. అలా ఒక సినిమాటిక్ మేలో డ్రామ పండించాడు. ఆ దెబ్బతో నారాయణస్వామి ’పులి వేషం ’వేశాడు. కాని వాసు అమ్మగారికి నారాయణస్వామి మీద కన్నా కొన్ని వేల టన్నుల ప్రేమ తన సుపుత్రుడు మీద వుంది. అందులోను " ఇంట్లోంచి వెళ్లిపోతాను " అన్న సుపుత్రుని మాటలు ఆమెని కలచివేశాయి. ఆ డైలాగ్స్ కావాలనే వాడాడు వాసు. కొడుకు ప్రేమ వ్యవహారం ఇష్టం లేకపోయినా సుపుత్రుని మీద ఉన్న మమకారం కష్టంగానైనా ఒప్పుకునేలా చేసింది. ఇంకేముంది హోండిపార్ట్‌మెంట్ ’పులితోక ’ను మెలితిప్పింది..అంతే నారాయణస్వామి ’మ్యావ్ ’ అనక తప్పలేదు. వాసు ప్రేమించిన అమ్మాయి తెలుగువారైనా..తరాల వారు ఉద్యోగరిత్యా  అప్పుడెప్పుడో మైసూర్ వెళ్ళి స్థిరపడ్డారట. అక్కడే పెళ్ళి చేస్తున్నారు.
     ఈ పెళ్ళి నారాయణస్వామికి ఇష్టం లేదు కాని తల్లి,కొడుకు కలిసి ముహర్తాలు పెట్టేశారు, ఏం చేస్తాడు... తప్పదన్నట్లు ఒప్పుకున్నాడు కాని అయిష్టత బాగా కనపడేది ఆయన ప్రవర్తనలో.. అందులోనూ కాస్త తొందరగా బయలుదేరుదాం అంటే ఆయనకున్న చాదస్తంతో ఒప్పుకోలేదు..లేట్‌గా బయలుదేరితే ఘాట్‌‍రోడ్ దగ్గరకు వెళ్ళే సమయానికి తెలవారుతూ వుంటుంది ఆ సమయంలో దారి దోపిడీ దొంగల భయం ఉండకపోవచ్చని ఆయన ఆలోచన. కడప టౌన్ దాటాక రాయచోటి వద్ద పెద్ద ఘాట్ రోడ్ వుంది, రాత్రి సమయాలలో అప్పుడప్పుడు అక్కడ దొంగతనాలు జరుగుతూ వుంటాయి, అందునా పెళ్ళి బస్సులనగానే కాచుకొని వుంటారు. అదీ ఆయన భయం.. దానికి విరుగుడుగా పెళ్ళికి బయలుదేరే బస్సులో సీట్స్ కింద ఇనుప రాడ్స్, ఈట కట్టెలు అప్పటికే పెట్టేసుకున్నాము మా యువతరమంతా..! ఘాట్‌రోడ్స్‌లలో పెళ్ళి బస్సుల ప్రయాణమనగానే అలా ’అన్నిటిని ’ సిద్దం చేసుకోవడం మాకలవాటే ఎప్పుడూనూ.
      మొత్తానికి అన్ని పూజా కార్యక్రమాలు ముగించుకొని బయలు దేరింది పెళ్ళి బస్సు. మద్యవయస్కులు, స్త్రీలు, ముసలి ముతకా మద్యన ఓ 15 మంది యువతరం అయిన మేము గోల గోల చేస్తూ.. మద్యలో అంతంక్ష్యరి పాడుకుంటూ తెలవారే దాక మా ప్రయాణం కొనసాగించాము. తర్వాత అలసిపోయి ఓ మూడుగంటల్లు నిద్రపోయాక నాకు మెలుకవ వచ్చి చూస్తే ఇంకా బెంగళూర్‌ చేరలేదు బస్సు..’ఏంటయ్యా. ఇది ’ అంటూ బస్సు డ్రైవర్‌ని అడిగితే  " సార్ ఈ బస్సు చూట్టానికి బయటకు కొత్తది కనిపిస్తుంది కాని లోపల పాత ఇంజన్ బిగించాడు ఈ బస్సు ఓనర్ " బదులిచ్చాడు డ్రైవర్. మా బస్సు వేగానికి ఎద్దుల బల్లు కూడ మమ్మల్ని క్రాస్ చేసి పోతున్నాయి..అంతటి గొప్ప వేగంగా పోతున్నది బస్సు. చివరకు సాయింత్రానికి 5 గంటల లోపలే మైసూర్ చేరుకున్నాము.
    అందరు కాలకృత్యాలు తీర్చుకొని ఒక గంట కునుకేసాక, పెళ్ళికొడుకైన వాసుని పెళ్ళి మంటపంలో వదిలి మిగతా జనమంతా కలిసి ’చాముండీ హిల్స్ ’కి బయలుదేరాము డొక్కు బస్సులో. సిటిలో నుండి చాముండీ హిల్స్‌ని ఎక్కనారంబించింది బస్సు.. నేను డ్రైవర్ వద్ద కూర్చొని బాతాకాని కొడ్తున్నా... ఇంతలో  " ..ఓ...ఓ...  ఆపండిరా..ఓ.ఆ..ఓ..ఆ.."  ఆడవారి గుంపు నుండి పెద్ద ప్రళయంలా  అరుపులు వినిపించాయి. ఒక్క సారిగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఏమిటా అని చూస్తే వాసు తరుపు బందువైన 50 ఏళ్ళ ఆవిడ సీట్‌లోనుండి లేచి హిస్టీరియాలా అరుస్తున్నది..." రేయ్ నేను చాముండినీ..బస్సు ఆపండ్రా...ఓ..ఓ.." అంటూ ఊగిపోతున్నది.
ఆమెని చూసి బెదిరిన వాసు తల్లి  " ఒరేయ్..ఒరేయ్.. బాసు ఆపించు..రా.." నాకు చెప్పి..పక్కకు తిరిగి  "నిమ్మకాయలుంటే చూడండి ఎవరి దగ్గరన్నా.. కుంకుమ, పసుపు కావాలి "  అడుగుతున్నది. 
 ఒకటి రెండు క్షణాల్లో నాకు విషయం అర్థమై.. రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి.. బస్సు డ్రైవర్‌ వైపు తిరిగి  " అర్రె బాబు ఎవరేమి చెప్పినా బస్సు ఆపకు.." ఆర్డేసి ఒక్క అంగలో హిస్టీరియాలా ఊగుతున్న ఆవిడ దగ్గరకు వెళ్లాను అప్పటికే అందరూ నిమ్మకాయలు, కుంకుమ,పసుపుల కోసం వెతుకుతున్నారు..అవెక్కడ దొరుకుతాయి ఈ బస్సులో.. ఇది కేవలం చిన్నపాటి ప్రయాణం..అందరూ గాబరా పడ్తున్నారు. హిస్టీరియా వచ్చిన మనిషేమో ఆగట్లేదు.. పెద్ద కేకలు వేస్తున్నది వెంటనే నేను అందుకున్నాను..
 " యెహే  ఆపండి..మీ గోల దుర్గా మాత లేదు గిర్గామాత లేదు "  అంటూ ఆమె కంటే గట్టిగా కేకలేశాను.
కాని వాసు తల్లి గారు నా వైపు తిరిగి  " ఒరే నాయనా దుర్గామాత ఒళ్ళులోకి వచ్చిందిరా.. ఆమెను శాంత పరచాలి లేదంటే ఆగ్రహిస్తుందిరా.. నీకు పుణ్యముంటుంది బస్సుని ఆపరా "  బ్రతిమాలుతున్నది.
నాకు దుర్గామాత ఆగ్రహం కంటే ముందుగా బస్సు పరిస్థితి మీద నాకు అనుమానం వున్నది.. నా అనుమానాన్ని బలపరుస్తున్నట్టుగానే " బస్సు ఆపకుండ ఎలాగైనా కాపాడు " అన్నట్టుగా వున్నాయి నావైపు చూస్తున్న డ్రైవర్ చూపులు
ఆమెకు వత్తాసు పలుకుతున్న ఆడవారి వైపు తిరిగి " ఇప్పుడు బస్సు ఆపితే అంతే..ఈ బస్సుకు సరిగ్గా బ్రేకులు కూడ లేవు..కొండ మీద నుండి కింద పడి ప్రమాదం జరగొచ్చు లేదా.. ఒక్క సారి బస్సు ఆగితే మళ్లీ స్టార్ట్ అవ్వదు, అందరం కలసి బస్సును తోసుకుంటూ పైకి చేరాలి "  అరిచాను గట్టిగా.
 అంతే అంతవరకు హిస్టీరియా మనిషికి వత్తాసు పలుకున్న వారంతా ఒక్క సారిగా సైలంట్ అయిపోయారు ఎవరూ నోరు మెదపలేదు.. దుర్గామాతను శాంతపరచే కార్యక్రమం కన్నా ముందు తమను తాము ప్రమాదంలొ పడకుండ చూసుకోవాలి అన్న స్పృహ వారిలోకి వచ్చింది. విచిత్రమేమిటంటే అంతవరకు హిస్టీరియాలా అరుస్తున్నా ఆ ఆడ మనిషి కూడ సైలంట్ అయిపోయి ’బిక్క మొహం ’వేసుకొని కూర్చోని వున్నది.
  నా మాటలతో వాసు తల్లిగారికి ఏమి చేయాలొ పాలు పోక నావైపు తిరిగి  " రేయి నీవు చానా అసాద్యుడివిరా తండ్రీ....చెప్పిన మాట విననే వినవు " నింద మోపింది.
 " బస్సు పరిస్థితి ఆలోచించండి ముందు..ఇలాంటి సమయంలో బస్సు ఆపి నిమ్మకాయలు, కుంకుమ, పసుపు కోసం ఎక్కడ వెతుకుతారు..?  అవన్ని దొరికే ప్రాంతామా ఇది..? ఒక్క సారి బయటకు చూడండి  ఎలా వుందో నిర్మాణుషంగా...అందులోను చిమ్మచీకటి..ఏటవాలుగా వున్న కొండ ప్రాంతం..! బస్సు ఆగితే ఇంకేమన్న వుందా...? ఈ లోపల బస్సు స్టార్ట్ కాక వెనక్కి పోతే పరిస్థితి ఏంటి..? దుర్గామాత ఇప్పుడు ఒక్కరి ఒళ్ళులోకి మాత్రమే వచ్చింది.. అదే బస్సు ప్రమాదం జరిగితే అందరం కట్ట కలసి ఏకంగా దుర్గామాత వద్దకు చేరవచ్చు..! మరేమంటారు ఆపుదామంటారా బస్సు.... చెప్పండి ..? "  అని అడిగాను.
 ఆ మాటతో అందరూ మౌనాన్ని ఆశ్రయించారు.  జరగాల్సిన సంఘటన ఆగిపోయినందుకు ’హమ్మయ్యా ’ అనుకున్నాడు బస్సు డ్రైవర్. బస్సు అవసోపాలు పడుతూ మెల్లిగా కొండ ఎక్కుతున్నది..! బస్సులోని వాతావరణం గంబీరంగా వున్నది,  ఖాలీగా ఉన్న కుర్చీ చూసుకొని అందులో కూర్చున్నాక తలెత్తి అంతవరకు హిస్టీరియాలా అరిచిన ముసలావిడ వైపు చూశాను. ఆవిడ నావైపే చూస్తున్నది. ఆమె కళ్ళ కింద ముడతలు పడ్డ చర్మం ఆమె అనుభవాల్ని చెబుతున్నది.. ఆ కళ్ళలో చూస్తుంటే  " కనీసం ఈ చిన్నపాటి ఆనందాన్ని లేకుండా చేస్తావా నాకు "  అని ప్రశ్నిస్తున్నట్లున్నాయి ఆమె చూపులు. నాలో చిన్నగా అంతర్మధనం..నేనేమన్న తప్పు చేశానా..? లేదే..!! ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చేసిందే కరెక్ట్. మిగతా సమయాల్లో నేను అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోను..! నిజమే ఆమెకున్న ఈ చిన్న పాటి ఆనందానికి ప్రస్థుత పరిస్థితిలో అడ్డం పడ్డాను. తప్పదు మరి..! నాకు ఆవిడ గురించి.. ఆమె వెనుక వున్న బాదలు గురించి కూడ అవగాహన వున్నది.
    వాసు తల్లిగారి తరుపన దూరపు బందవైన ఆ ముసలావిడ పేరు వసంత, కడపకు 50 కిలోమీటర్ల దూరంలో వున్న రాజంపేట వూరు తనది. 16 ఏళ్ళకే పెళ్ళి అయి రెండేళ్ళు కాపరం చేశాక ఆమె భర్త సుబ్బరాయుడు గల్ఫ్ దేశాలైన కువైట్‌కి వెళ్లాడు బతుకు తెరువుకోసం. సహజంగా కరువు ప్రాంతమైన రాజంపేట ప్రాంతంలోని యువత, పెళ్ళి అయిన మగవాళ్లు, స్త్రీలు ఉపాధికోసం అరబ్ దేశాలకు వలస వెళ్లడం ఒక ఆనవాయితి. ఆ వూరిలో కువైట్‌నగర్, దుబాయ్ కాలనీలంటూ కొన్ని ఏరియాలు కూడ వున్నాయి.
   అలా ప్రవాసంలో వున్న సుబ్బరాయుడు పని చేస్తుంటే ఇక్కడ వున్న ఊరిలో తనొక్కతే సంసార సాగారాన్ని ఈదుతుండేది. రెండేళ్ళకో లేక మూడేళ్ళకో ఒక సారి వచ్చి రెండు మూడు నెలలు ఇండియాలో ఉండి వెళ్ళేవాడు వసంత భర్త. భర్త లేని కాలమంతా జీవితం దుర్లబంగానే వుండేది.. ఎన్ని దినారాలు అక్కడ నుండి పంపినా ఆర్థికమైన బలమొక్కటే సరిపోదుకదా..? జీవిత భాగస్వామి లేని లోటు తీర్చలేనిది. పిల్లలు కూడ లేని జీవితం తనది, అందునా భర్త దూరంగా ఉన్నాడనగానే ఆడ మనిషిమీద డేగ కళ్ళు పడటం సర్వసాదారణం వాటినన్నిటిని ధైర్యంగా ఎదుర్కొంటూ దాదాపుగా 12 ఏళ్ళు నెట్టుకొచ్చింది జీవితాన్ని ఒంటరిగా.
   12 ఏళ్ళ తర్వాత ఒక రోజు అకస్మాత్‌గా ఒక మళయాల అమ్మాయిని తోడూగా వెంటబెట్టుకొని కువైట్ నుండి వూర్లోకి దిగాడు. నేరుగా తనంటికి రాలేదు బయట లాడ్జీలో దిగి ఒక రోజంతా తిరిగి ఇల్లు చూసుకొని అందులో సంసారం పెట్టాడు ఆమె భర్త. ఈ సంఘటన శరఘ్ఘాతంలా తగిలింది వసంతకు. 12 ఏళ్ళు ఒంటరిగా భర్త కోసం ఎదురుచూస్తూ, ఎన్నో రాత్రులు నిదురపట్టక.. ఎన్ని అవస్థలు పడ్డదో...! ఏన్నెన్నో ఊహలను ఊహించుకుంటూ తన పెనిమిటీ గురించి ఆలోచిస్తూ బతికన జీవితానికి విలువే లేకుండా పోయందనిపించింది ఆమెకు. ఆ మనిషితో తన స్థితి గురించి అసలు ఏమని మాట్లాడాలో..ఎలా మొదలెట్టాలో.. అర్థం కాని అయోమయ పరిస్థితి. ఆకలి చూపుల నుండి తనను తాను కాపాడుకోవడానికి ఎంత శ్రమ పడిందో..!! నిద్రపట్టని రాత్రిల్లు తనను తాను సంబాలించుకోవడానికి ఎన్నెన్ని అవస్థలో..! తన ఆశలు, కన్న కలలు, వేదనా భరితమైనా విరహ వేదనా చెప్పినా అర్థమవుతుందా అతనికి..! అతని సమక్షం లేకుండా 12 ఏళ్ళు పాటు గడిపానే..కాని... అతను ఏ కాస్త తోడు లేని బ్రతుకును కూడ భరించలేక వెంటనే ఒక తోడును వెతుక్కున్నాడు..! ఆ విషయమే భరించలేకపోతున్నది. ఇంత జరిగినా తన చూట్టూ వున్న బందువులు కూడ అతనినే సమర్థిస్తున్నారు..అందుక్కారణం  డబ్బు..!  " జరిగిందేదో జరిగిపోయింది గొడవ పడకుండా సర్దుకుపోవాలి.. జీవితం అంటే ఇదే ..ఇలాగే వుంటుంది. తప్పదు రాజీ పడాలి "  వసంతకే హితబోదనలు చేశారు.
  చివరకు రాజి పడక తప్పలేదు.. కారణం.. వసంతకి ఆర్థిక స్వేచ్చ లేదు, కనీసం సంతోషంగా గడపడానికి పిల్లలు కూడ లేరు.. పిల్లలు పుట్టే వయసు దాటిపోయింది ఆమెకు. ఏదో బతుకుతున్నా అంటే బతుకుతున్నా అన్న రీతిలో వుంది వసంత జీవితం. ఎక్కువ కాలం మళయాల అమ్మాయితోనే గడిపేవాడు...  అక్కడి ఇంట్లోనే పిల్లలు కూడ పుట్టుకొచ్చారు.. మెల్లి మెల్లిగా మళయాల అమ్మాయి సంసారమే గుర్తింపు పొందిన కుటుంబంగా మారింది.  వాళ్ల పిల్లలు కూడ పెద్దవారైయ్యారు.. ఆ సమయంలోనే ఒక రాత్రి గుండెపోటుతో భర్త మరణించాడు.. వున్న ఒక బందం కూడ పోయింది. ఇప్పుడు పూర్తిగా మళయాల కుటుంబమే  అఫిషయల్‌గా అన్ని కార్యక్రమాలు జరిపించారు.. ఏమి చేయాలన్నా వారినే సంప్రదించేవారు.. చివరకు ఎవరికి ఏమి కాని తనొక అనాధ అయ్యింది.. ఒక్క సారి గడచిన తన జీవితాన్ని తిరిగి వెనక్కి చూసుకుంటే తన జీవితంలో అంత శూన్యమే కనపడుతున్నది, ఏ ఆనందాలు కాని గుర్తించికోతగ్గ సంఘటనలు కాని లేవు. కనీసపు ఒకరి భార్యను అనో లేక మనిషిని అనో గుర్తింపు కూడ లేదు..వయసు పెరిగే కొద్ది చుట్టూ వున్న ప్రపంచం కూడ వీరిని పరిగణలోకి తీసుకోవడం మానేస్తుంది.. అదింకా వసంతను బాద పెట్టేది..మెల్లి మెల్లిగా తనో ట్రాన్స్‌లో ఉన్నట్లుగా ప్రవర్తించడం మొదలెట్టింది.. అది ఎంత వరకు వచ్చిందంటే... తనలోకి ఒక దేవత ఆవహిస్తున్నది..అని...అది ముదిరి..ముదిరి తనో దేవత అనే విదంగా హిస్టీరియాలా ప్రవర్తించసాగింది.. అదే చుట్టుపక్కల అమ్మలక్కలకు అలవాటయ్యింది. ఎప్పుడంటే అప్పుడు  పూనకం వచ్చినట్లూ ఊగిపోయేది.. అందరు తనను మొక్కుతూ..నిమ్మకాయలు.. నోట్లో కుక్కుతూ  " అమ్మా తల్లి.. శాంతించు..శాంతించు..ఏమి కావాలి తల్లీ " అంటూ తనను బతిమాలుతూ ఊగిపోతుంటే.. అందులో తన ఆనందాన్ని..సంతృప్తిని, గుర్తింపుని వెతుక్కోసాగింది వసంత.
       అసలు వసంత జీవితం ఆమె ప్రమేయం లేకుండానే కొనసాగింది.. ఒక్క వసంతే కాదు మన ప్రపంచంలో చాలా మంది జీవితాలు కూడ అదే విదంగా వుంటాయి, మనుషుల జీవితాలను చుట్టు వున్న ప్రపంచం, సంఘమే నిర్దేశిస్తుంది. వాళ్ళు ఎలా బతకాలి..ఏవిదంగా జీవించాలి, వాటికి ఆచారాల పేరుతో నియమాలు, చట్రాలను బిగించి ఒక నమూనాని తయారు చేసి పెడుతుంది అంతే అది నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్లు అందరూ పాటించాల్సిందే. అలా పాటించిన వారిని  " దూషిస్తుంది, బహిష్కరిస్తుంది, సంఘ వ్యతిరేకి అంటుంది.. సంస్కృతిని కించపరుస్తున్నారు అని ఆరోపిస్తుంది, లోకమంతా ఒక దారి అయితే నీది ఉలిపిదారినా అని వెక్కరిస్తుంది..అవహేళన చేస్తుంది.
  కొద్దిగా వసంత జీవితాన్నే లోతుగా చూస్తే.." ఆమెకు తెలీకుండానే ఎవరో నిర్దేశించిన చట్రంలో బిగింపబడింది..’ పలానా నమూనా లాగ బతుకు సాగిస్తేనే  అదొక అద్భుతమైన జీవితమని,సమాజానికి అంగీకారమైన బతుకు అని దానికే అంతులేని గౌరవాలు, గుర్తింపులున్నాయనే భావనలో వుండిపోయింది.. అలాంటి జీవనం లేకుండా జీవించడం అన్నది ఆమోదయోగ్యమైనది కాదనే అపోహలో వుండిపోయింది. అసల్లాంటి జీవితం లేనిదే జీవితం కాదు అన్న భావజాలంలో కొట్టుకపోయింది. తనకో భర్త వున్నాడన్న భావన, గుర్తింపు తనకో ఆభరణం అనుకున్నది. పిల్లలు, సంసారం ఇవన్ని లోకంలో జరిగే సహజ సిద్దమైన పరిణామాలు అన్న భావనలో వుండి పోయింది.. ! అవి లేని జీవితం ఒక జీవితమేనా.. అని సందేహం ఆమెలో..! అవి జీవితంలో ఒక భాగమే కాని అవే జీవితం కాదు అన్న సత్యం తెలుసుకోలేకపోయింది. ఒక్క సారి ఆమె భర్త విషయమే గమనించండి..! అతను తనకిష్టమొచ్చినట్లు జీవించాడు.. సంఘం నిర్దేశించిన కట్టుబాట్లు, నియమ నిబందనలను తుంగలో తొక్కాడు..తనకు నచ్చిన విదంగా నడుచుకున్నాడు..! తనకున్న బాద్యతలని విస్మరించాడు, మరెవరు అతన్ని ఆక్షేపించలేదు..!
   మరి అలాగే వసంత కూడ భర్త అనే ఉనికి ఉంటేనే జీవితమా..? లేకుంటే లేదా...? భర్త లేకుండా తన జీవితం తాను జీవించలేదా...? అని తనను తాను ప్రశ్నీంచుకోలేదు... !  అదే ఉత్పన్నమై వుండుంటే తనో హిస్టీరియా పేషంట్‌లా మారుండే అవకాశాలుండేవి కావు..! తన జీవితం తనిష్టం తనకు నచ్చినట్లుగా జీవించొచ్చు..! తనకిష్టమొచ్చినట్లు వుండొచ్చు..! తనకో జీవితం వున్నది..అది తనకు మాత్రమే సొంతం. తన ఆనందాలు తనవి తప్ప మరొకరివి ఏమి కావు...అని అనుకునేంత పరిస్థితి కూడ వసంతకు లేదు..కారణం ఆమె అరకొర చదువు చదివిన ఒక సగటు మహిళ. అదే కాదు అలా ఆలోచించుకోవడానికి కూడ అవకాశమే లేని వాతావరణం ఆమె చుట్టూ వున్నది.
   నా ఆలోచనలోనే చాముండేశ్వరీ దేవాలయానికి చేరుకొన్నాము. ఆడవారంతా జరిగిన సంఘటన గుర్తుపెట్టుకొని చాముండేశ్వరినీ ప్రార్థించారు.. " తల్లీ ఇందాక  పెద్ద అపరాధం జరిగిపోయింది, మమ్మల్ని క్షమించి మాపై ఆగ్రహం చూపకుండా శాంతించు తల్లీ "  అని వేడుకున్నారు. తిరుగు ప్రయాణంలో అందరూ ఒక ఆలోచనకు వచ్చారు.." ఇప్పుడు బస్సుకు ఎటువంటి ప్రమాదం జరక్కుండా కిందకు చేరుకోగలిగితే దానిక్కారణం వారు చేసిన పూజలు.. వేడుకోలు.. అట..! ఏదన్న ప్రమాదం  జరిగితే నేను చేసిన అపచారం కారణంగానే జరుగువచ్చు " ఒక ఆర్డర్ పాస్ చేశారు.. నేను నవ్వి సరే అంటూ తలూపాను...
   మొత్తానికి ఏమి జరక్కుండానే క్షేమంగా మైసూర్‌కి చేరుకున్నాము.. అందరూ ’హమ్మాయ్య ’ అంటూ ఊపిరి పీల్చుకొన్నారు.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs