గత కొన్ని రోజులుగా మా ఊరి నుండి  మాపక్కింటి  మధుసూదన్ ఫోన్ చేస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ నారాయణ జూనియర్ కాలేజీలో ఉన్న వారి అబ్బాయి అనిల్‌ని ఒక సారి కలిసి క్షేమ సమాచారాలు తెలుసుకొని తమకు చెప్పమని అడుగుతున్నారు. ఆ కాలేజీ నగరానికి ఒక వైపు చివర్లో ఉంటే నేను మరో చివర్లో వుంటున్నాను. అక్కడికి వెళ్ళాలంటే గంటన్నర సమయం పడుతుంది, అంత ఓపిక లేక ఏదో పని ఉందని చెప్పి తప్పించుకుంటున్నా..! . కొన్ని రోజులు తర్వాత ఏదో పని మీద అనిల్ తల్లితండ్రులు హైద్రాబాద్‌కి వచ్చారు. ‍అప్పుడు తప్పలేదు వారితో ఆ రెసిడెన్షియల్ కాలేజి వెళ్ళడం.

        ఒకే కాంపోండ్ లోనే కాలేజీ, హాస్టల్స్ ఉన్నాయి. మేము మధ్యాహ్నం వెళ్ళాం. ఆ సమయంలోనే విజిటర్స్‌ని లోపలకి అనుమతిస్తారు. ఇంటర్ మీడియట్ పిల్లలంతా క్లాస్ రూమ్ లో నుండీ బయటకు వచ్చారు. సందడి సందడిగా ఉంది. మేము నేరుగా హాస్టల్ మూడవ అంతస్తుకు చేరుకున్నాము, మద్యనున్న కారిడార్‌కు అటు ఇటు రెండువైపుల వరసుగా చాలా గదులున్నాయి. కారిడార్ ఒక వైపు చివర ఐరన్ గ్రిల్ ఉంది, అవతల అటుపక్కన నగరంలోమరో పేరుమోసిన ఆంగ్లమాధ్యమం పాఠశాల ఉన్నది రెండిటికిమద్యన చిన్న కాంపౌండ్. కారిడార్‌కి మరో వైపు చివర స్టేయిర్‌కేస్ ఉన్నది. ఐరన్‌గ్రిల్ పక్కనేఉన్న అనిల్ రూమ్‌‍కి వెళ్ళాము. అది ఒక పెద్ద డార్మెటరీ లాగా ఉంది. ఎడమవైపుకు ఓ మూడు రూములున్నాయి. అందులో ఇద్దరు లేక ముగ్గరు ఉంటున్నారు. మద్యన ఉన్న పెద్ద హాలలాంటి డార్మెటరీలో ఓ ఐదుమందికి ఐదు మంచాలున్నాయి. ఆ హాల్‌కి ఎదురుగా ఉన్న మరో రెండుగదులున్నాయి అందులోని ఒక గది లోపలికి వెళ్ళాగానే మధుసూదన్ ఆయన భార్య వారబ్బాయి మీద వాత్సల్యం ఒక్క సారిగా పెళ్ళుభికుంది. నేను ఏమీ మాట్లాడకుండా వారినే గమనిస్తూ ఉన్నాను ..! క్షేమసమాచారాలు అన్ని అయిపోయాయి.. కాస్త నెమ్మదించింది వాత్సల్యం, తర్వాత వాతావరణం చల్లబడింది. మెల్లగా మిగతా సమాచారాలు అడగుతున్నారు అబ్బాయిని, అబ్బాయి ఫ్రెండ్స్ ని. ఇంతలో..

        " అంకుల్ ఒక్క మిస్సెడ్ కాలు ఇస్తారా... ప్లీజ్ "  అంటూ ఒక అబ్బాయి అడిగాడు నన్ను.

        నాకు అర్థం కాక అనిల్ వైపు చూసాను. ఇంతలో మధుసూదన్  " ఇదిగో మా సెల్ ఫోన్ తీసుకో "  అంటూ తన జేబులో నుండి తీసి ఇచ్చారు. నన్నడిగిన ఆ కుర్రాడు ఫోన్ తీసుకొని అందులో నుండి ఒక మిస్సెడ్ కాల్ ఇచ్చాడు. ఒక నిమిషానికే తిరిగి కాల్ వచ్చింది ఆ సెల్ కి.  అది మాట్లాడుతూ అలా పక్కకి వెళ్ళాడు.

        " ఇక్కడ్ సెల్ ఫోన్స్ అలవ్ చేయరు కదా..! మనలా వచ్చిన వారిని అడిగి తీసుకొని వారి పేరెంట్స్ కి ఒక మిస్సెడ్ కాల్ ఇస్తారు , వెంటనే వాళ్ళే తిరిగి చేస్తారు ఆ నంబర్‌కి, ఇది ఇక్కడి కోడ్‌  "  విషయం చెప్పాడు మధుసూదన్.

        నాకు కొత్తగా ఉంది ఆ విషయం. " అంకుల్ " అన్న పిలుపుతో తలెత్తి చూసాను. ఇంకో కుర్రాడు " ఒక్క మిస్సెడ్ కాల్ చేసుకుంటాను ప్లీజ్ " అడిగాడు.
  నాకు వారి పరిస్థితి అర్థం అయ్యి నా సెల్ ఫోన్ ఇచ్చాను. ఆ కుర్రాడు మిస్సెడ్ కాల్ చేసాక తిరిగి కాల్ రాగానే అలా పక్కకి వెళ్ళాడు. ఆ కుర్రాడు మాట్లాడుతుంటే అతని ముఖంలో మారుతున్న కవలికలన్నీ కనపడుతున్నాయి. కాసేపు గారాభం, కాసేపు అలక, కాసేపు అభ్యర్థన అన్ని కలగలిపి ఏదో తెలీయని కొత్త ఎక్స్ ప్రెషన్స్ వొస్తున్నాయి. బహుశా అమ్మతో మాట్లాడుతున్నాడేమో... అన్ని భావాలు ఒకే సారి ఒక్క అమ్మ వద్ద పలుకుతాయేమో... మరి  !

        ఎప్పుడు కాల్ అవుతుందా... అని ఇంకో కుర్రాడు పక్కనే ఎదురుచూస్తున్నాడు. కాల్ అవ్వగానే పక్కనే ఎదురుచూస్తున్న మరో కుర్రాడు తీసుకొని మల్లీ అదే వరస.  కాకపోతే ఒక్క నిమిషానికే కాల్ ముగిసింది..! ఏమిటా అన్నట్లు చూసాను. మళ్ళీ ఇంకో మిస్సెడ్ కాల్ ఇచ్చాడు. నాకు అర్థం కాలేదు. మల్లీ కాల్ రాగానే మాట్లాడుతున్నాడు. అప్పుడర్థమైంది మొదటి కాల్ నాన్న గారిది. ఒక్క నిమిషం లోనే అయిపోయింది... రెండో మిస్సడ్‌ కాల్ అమ్మకు.  ఒక్కో కుర్రాడి ముఖంలో రకారకాల హావభావాలు కనపడుతున్నాయి. కొందరు ఏడుస్తున్నారు, కొందరు వొస్తున్న ఏడుపుని బిగపడుతున్నారు. కొందరు అలిగి కాల్ కట్ చేస్తే, మళ్ళీ రింగ్ అవుతున్నది. వెంటనే కాల్ ఆక్సెప్ట్ చేయట్లేదు. కాసేపు రింగు అవనిచ్చి ఆలశ్యంగా ఆక్సెప్ట్ చేయటం లో తమ నిరశనను తెలుపుతున్నారు, కొందరు నవ్వుతున్నారు. నవరసాలు పలుకుతున్నాయి అక్కడ.

        భోజనం సమయం కావడంతో అందరం కిందకు దిగి డైనింగ్ హాల్లో క్యూలో నించొని భోజనం తెచ్చుకున్నాము. భోజనాలు ముగిసాక హాస్టల్ పక్కన ఉన్న ఖాళీస్థలంలో చెట్ల కింద ఉన్న సీమెంట్ బెంచీల మీద కూర్చున్నాము. మళ్ళీ అదే పిలుపు అదే అభ్యర్థన  " మిస్సెడ్ కాల్ ప్లీజ్ " అంటూ. నా సెల్ ఇచ్చాను. దూరంగా రూపాయి కాయిన్ ఫోన్ బాక్సులు నాలుగు ఉన్నాయి, వాటికి పెద్ద క్యూ ఉంది. అందుకే ఇలా ఎవరన్నా వొస్తె వారిని అడుగుతున్నారు ముక్కు మొహం తెలియకపోయినా ఈ కుర్రాళ్ళు.

        వారి పరిస్థితి అర్థమయ్యింది. ఈ కాలేజి చదువులు వారికో " జైలు అయిపోయింది ".  బయట ప్రపంచం ఎలా ఉందో ఏమి జరుగుతుందో కూడా తెలీదు. ఎప్పుడూ స్టడీ అవర్స్,  క్లాస్ రూమ్స్. ఉదయమే 5:30
కి మొదలై రాత్రి 11 కి ముగుస్తుందట వారి చదువుల దినచర్య. ఒక ఆట లేదు, పాట లేదు, కనీసపు టి.వి కూడా లేదు. నేను ఒక్కసారిగా నా కళ్ళ ముంది రింగులు తిప్పుకుంటూ..నా గతంలో వెళ్ళీపోయాను  !
                                                       *******

        నా కాలేజీ రోజుల్లో ఉదయమే 9:00 కి కాలేజికి వెళ్ళేవాడిని, మళ్ళీ భోజనానికి ఇంటికొచ్చి ఒక అరగంట ఇంట్లో ఉండి మళ్ళీ వెళ్ళడం. సాయింత్రం కాలేజీ అవ్వగానే ప్లే గ్రౌండ్ లో క్రికెట్ లేదా షటిల్ బాడమెంటన్ ఆడటం. ఇవి కాకపోతే అలా కాలేజీ చెట్ల కింద కూర్చొని జనరల్ గా ప్రాపంచిక విషయాల మీద చర్చలు. ఇవన్నీ మాకు శారీరిక దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వత, దృఢత్వం అబ్బేవి అనుకుంటా. కాకపోతే జనరేషన్ మారే కొద్ది జనాల్లో మార్పు ఉన్నట్లే, మనిషి సంపాదించే ఙ్జానసంపదనలోనూ మార్పులొస్తున్నాయి. మేము చదువుకునే సమయంలో కేరీర్ గురించి పెద్దగా ఆలోచన ఉండేది కాదు. అదే కాక, వాటి మీద అవగాహన కూడా తక్కువే. ఇక మార్క్స్ కూడ అప్పట్లో 70 శాతం వొస్తే చాలు, నేను మా వీధిలో రొమ్ము విరుచుకుని తిరిగే వాడిని. ఇప్పుడు అందరికీ 90 శాతం పైనే వొస్తున్నాయి మార్కులు. మనుషుల నడవడికలో అప్పటికి ఇప్పటికి మార్పు ఉంది. ఇప్పుడంతా యమ షార్పు గా ఉంటున్నారు. కాకపోతే, కొన్ని అనారోగ్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బహుశా ఇది ఒక నిరంతర ప్రక్రీయ ఏమో..!  రేపు రాబోయే కాలంలో ఈ కుర్రాళ్ళు కూడ పెళ్ళై, పిల్లలు పుట్టాక....తమ పిల్లలను ఇలానే కాలేజీలలో చేర్చినప్పుడు ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నట్లే అనుకుంటారేమో మా " కాలేజీరోజుల్లో ఎంతగా గొప్పగా చాలా స్ట్రిక్ట్ గా చదువుకున్నామో .." అని  గొప్పగా...అనుకొని అప్పటికాలపు విద్యవిదానాన్ని నేను ఇప్పుడు అనుకున్నట్లే అప్పుడు వీళ్ళు కూడా విమర్శనాధోరణిలో మాట్లాడతారు అనుకుంటా..!

                                                                                                      ***

        కాలేజీ గేట్ వద్ద కలకలం వినపడడంతో ఆలోచననుండి బయటకు వచ్చి చూస్తే  అక్కడ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్‌తోఉన్న ఒక నడి వయుసు వ్యక్తి కాస్త పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కోపంతో హాస్టల్ ఆఫీస్ రూం వైపు వెళ్ళాడు..! ఏమిటా అని అనిల్  వైపు చూసాను..!

        నా భావాన్ని అట్టే పట్టేసిన ఆ అబ్బాయి, " ఆఁ... అది మామూలే అంకుల్ "  అన్నాడు.

        " ఏమిటి " అన్నట్లు తలేగిరేసాను..!

        " అతను మా కాలేజీ పక్కనే ఉన్న స్కూల్ కర్పాండెంట్. మా మీద రిపోర్ట్ ఇవ్వడానికొచ్చాడు "  అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ తనే  "  మధ్యాహ్నం భోజన టైమ్ లో మా కారిడార్ చివర్లో ఉన్న ఐరన్ గ్రిల్ పట్టుకొని వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు మా హాస్టల్ వాళ్ళంతా. అక్కడ టెంత్ క్లాస్ అమ్మాయిలు కూడా ఉన్నారులే " విషయం చెప్పాడు.
   సరే పదా పైకెళ్ళి చూద్దాం అంటూ నేను ఆ అబ్బాయితో పాటు పైకి వెళ్ళాను. వీళ్ళు ఉంటున్న బిల్డింగ్ లో మొత్తం నాలుగు అంతస్తులున్నాయి. ప్రతి అంతస్తుకున్న కారిడార్‌కి ఒక వైపు గోడతో మూసి ఉంటే, మరో వైపు గాలి, వెలుతురు కోసం ఐరన్ గ్రిల్ పెట్టారు. గ్రిల్ ఉన్న వైపున హస్టల్ బిల్దింగ్ చివరిది అటుపక్కన నగరంలో పేరు మోసిన ఒక స్కూల్‌లోని పదవతరగతి అమ్మాయిలు అబ్బాయిలు కొందరు చెట్ల కింద కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు, భోజనం ముగించినవారు ఆడుకుంటూ వుంటారు ఆ సమయంలో ఈ హాస్టల్ కుర్రాళ్ళు వారితో మాటలే వీరికి సరదాలు. కబుర్లు.  అదే వీళ్ళకి రిలీఫ్ రొటిన్ లైఫ్ నుండి. నేను వెళ్ళేటప్పటికి, గ్రిల్ పట్టుకొని నుంచొని ఉన్న హాస్టల్ స్టూడెంట్స్ తో కింద నుండి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుకుంటున్నారు. హాస్టల్‌కుర్రాళ్ళ పరిస్థితి చూస్తే..జైలుగదుల గ్రిల్లు పట్టుకొన్న నిలబడి ఉన్న ఖైదీల్లా ఉన్నారు. వీళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు ఇస్తున్నారు. అందులో కాస్త కొంటెతనం, చిలిపితనం అన్నీ కలగలిపి ఉన్నాయి.

        " రేపు శనివారం మాకు ఆఫ్ డే నే స్కూల్ "  ఒకమ్మాయి కింద నుండి చెబుతున్నది పెద్ద బడాయిగా.

        " అవునా రేపు శనివారమా..? అయ్యో ఎల్లుండీ ఆదివారామా..? "  అంటూ ఆశ్చర్యపోయారు.

        కనీసం ఏమి వారమో కూడా తెలీని పరిస్థితుల్లో ఉన్నారు. కింద ఉన్న అమ్మాయిలు కావాలనే " సెలవు " అన్న పదాన్ని వత్తి చెబుతున్నారు. మీకు స్వేచ్చలేదు, మేము చూడు సెలవలు, పండగలు అంటూ ఎలా ఎంజాయి చేస్తున్నామో అన్న ఉద్దేశం ఆ మాటల్లో ఇండైరెక్ట్ గా కనపడుతున్నది. అదో ఆట ఆ స్కూల్ పిల్లలకి, అలా చెప్పి ఆనందించడం వారికో సరదా. అలా ఆ స్కూల్ పిల్లలు చెబుతేనే రేపు ఏమిటి అన్నది తెలుస్తున్నది.

        " పదరా భోజనానికి టైమ్ అయ్యింది, మళ్ళీ ఐ.ఐ.టి ఎగ్జాం కి ప్రిపేర్ అవ్వాలి "  అంటూ అందరు బిలబిలమంటూ పరిగెత్తారు. చివర్లో ఒకరిద్దరు రూం లో నుండి తమ లంచ్ ప్లేట్స్ తో కారిడార్ లోకి వచ్చి గ్రిల్ వద్ద ప్లేట్స్ తో మెల్లిగ కొడుతూ శబ్ధం చేసారు, ఆ శబ్ధానికి కింద ఉన్న ఒకమ్మాయి రెస్పాండయ్యి చిన్న చిరునవ్వు, అది చూసి ఆ ఇద్దరు కుర్రాల్ల మొహం లో మందహాసం.. అదో చిలిపి తనం, గమ్మత్తుగా ఉంది. వారికదే ఆటవిడుపు. నా పక్కనుండి వెళుతూ నేను చూసానేమో అన్న కాస్త అపరాధబావన తో తల దించుకుంటూ వెళ్తున్నారు. అది ముందే గమినించి నేను చూడనట్లు ఉండిపోయాను.

        అలా రెసిడెన్షియల్ కుర్రాళ్ళకి, స్కూల్ పిల్లలకి అవినాభావసంబంధం ఏర్పడింది. ఇది సహించలేక ఆ స్కూల్ కరెస్పాండెంట్ కోపంతో కాలేజీ కర్రెస్పాండ్ కి రిపోర్ట్ చేయడానికెళ్ళాడు.
" వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం మా కాలేజి వాళ్ళు విని..సరే కంట్రోల్ చేస్తాము. ఇక అలా జరక్కుండా చేస్తాము అని చెప్పడం రోజు అలవాటే,  ఇక్కడ ఎవరూ వారు చెప్పిన మాట వినరు. చెప్పినప్పుడు ఊ అంటూ భయంతో తల ఊపి..వారటు వెళ్ళగానే, మళ్ళీ ఇదే తంతు "  చెప్పాడు ఆ అబ్బాయి.

        విద్యార్థులను ఇలా ఒక నాలుగు గోడలమధ్యన జైలులో పక్షుల్లాగ ఉంచితే వీరి మానసిక పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏది చేయద్దు అంటారో అదే చేస్తారు. అందుకే యజమాన్యం కూడా ఇలాంటి విషయాల్లో చూసీ చూడనట్లు ప్రవర్తిస్తున్నారు. రోజూ నాలుగు గోడల మద్యన, పుస్తకాల మధ్య గడిపి గడిపి కూసింత కూడా వినోదం లేదు జీవితంలో. రోజువారి ధినపత్రికలు చదవడానికి కూడ అనుమతించరట..! అందుకే వారికి తోచినట్లు ప్రవర్తిస్తున్నారు. పర్సనల్ సెల్ ఫోన్స్ అనుమతించరు హాస్టల్లో. తల్లితండ్రులతో రోజూ మాట్లాడాలి అనిపిస్తుంది... అందుకు దొడ్డిదారి వెతుకున్నారు, ఒక నాలుగించిల మందంతో ఉన్న పుస్తకం లోపల మధ్యలో సెల్ ఫోన్ పట్టేంత స్థలాన్ని బ్లేడ్ తో కోసి ఒక అరలాగ చేసారు. అందులో సెల్ ఫోన్ పెట్టుకున్నారు. హాస్టల్ కేర్ టేకర్ అర్ధరాత్రి కూడా చెకింగ్ కి వస్తారట సెల్ ఫోన్ వాడుతున్నారేమో అని. వారి కంటికి కనపడకుండా అలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి నిర్బంధం వల్ల విద్యార్థులు డొంక దారులు వెతుక్కుంటున్నారు. ఇవే రేపు జీవితంలో అలవాటు అవుతాయి.

        ఆలొచిస్తూ కిందికి వచ్చేసాను. ఎవరో కుర్రాడు నా సెల్ ఫోన్ నాకిచ్చేసి వెళ్ళీపోయాడు. ఏమిటా అని చూస్తే చార్జింగ్ అయిపోయింది నా సెల్ లో. అందుకే ఇచ్చేసి వెళ్ళీపోయారు కుర్రాళ్ళు.

                                                         ******

        మధుసూదన్, ఆయన శ్రీమతి ఇంకా మాట్లడుకుంటూ ఉన్నారు తమ అబ్బాయితో, ఫ్రెండ్స్ తో. నేను దగ్గరికెళ్ళి కూర్చున్నా. నారాకతో ఆ అబ్బాయిలు మెల్లిగా  ఒక గుంపుగా మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళారు. వారటెల్లగానే... మధుసూదన్ నా వైపు తిరిగి, " నిన్ను చాలా శ్రమ పెట్టినట్లున్నాను "  అన్నాడు.

        " పర్వాలేదులేండి, రోజూ రాను కదా, ఏదో మీరోచ్చినప్పుడే కదా..? " అన్నాను. నాలో నేను " కొన్ని కొత్త విషయాలు తెలిసాయి ఇలా రావడం వలన "  అని అనుకున్నా.

        " మా అబ్బాయికి స్టేట్ వైడ్ ఐ.ఐ.టి పరీక్షలో 600 ర్యాంక్ వచ్చింది "  అన్నాడు మధుసూదన్ చాలా సంతోషంగా!

        " ఇంకా ఇంటర్ మొదటి సంవత్సరమే కదా చదువుతున్నది, ర్యాంక్ రావడమేంటి..? "  ప్రశ్నించాను.
 " అదే నారాయణ్ జూనియర్ కాలేజి వారి స్టేట్ వైడ్ ఉన్న అన్ని కాలేజిల్లోను ఒకే సారి ప్రతి నెల ఐ.ఐ.టి మాడల్ టెస్ట్ పెడతారు, అందులో 600 ర్యాంక్ వచ్చింది " వివరించాడు విషయం.

        " ఓహ్..! అలాగా.."  అన్నాను. ఏంటో ఎవరి కాలేజిలో వారు పరీక్ష నిర్వహించి ర్యాంక్ వచ్చిందని ఆనందపడిపోతున్నారేంటి నాలోని ఆలోచన ఇది..!

        మళ్ళీ ఆయనే  " అబ్బాయి సెలవల్లో ఇంటికి వస్తే ఒకటే టి.వి చూడటం, అదీ ఒకటి లేక రెండు చానల్స్ చూస్తాడా అంటే అదీ లేదు, సెకండ్లో మూడు నాలుగు చానల్స్ మారుస్తాడు. ఎందులోనూ పట్టుమని పది సెకండ్లు కూడా ఉండడు. మాకు ఏమి చెప్పాలో తోచట్లేదు. ఒక సారి వాళ్ళమ్మ ఉండపట్టలేక ' ఒరేయ్ ఏదో ఒక చానల్ చూడరా, మమ్మల్ని కూడా ఏదో ఒకటి చూడనివ్వు ' అనంటే  ' నేనుండేది కేవలం వారమో లేక మూడు నాలుగురోజులే కదా ..? ఈ నాలుగు రోజులు నా ఇష్టమొచ్చిన చానల్స్ చూడనివ్వు, తర్వాత మీ ఇష్టం ' అంటూ కోపం. సరే వాడున్న రోజులు మేము ఆ టి.వి వైపే వెళ్ళడంలేదు "  అంటూ పిర్యాదు చేసాడు.

        నేను ఏమీ మాట్లాడాలో తెలీక నవ్వి ఊరుకున్నా. ఇక్కడేమో నాలుగు గోడల మధ్య  " నిర్భంద విద్య" అమలు చేస్తున్నారు. ఏ వారమో తెలీదు, బయట ఏమి జరుగుతుందో తెలీదు, అది పండుగ రోజా లేక సెలవు దినమా అన్న విషయం ఉండదు, ఒక ఆట లేదు వినోదమూ లేదు..! మరి ఒక్క సారిగా అలా కట్టలు తెంచుకున్న వరదలాగ సెలవులు వొస్తే అలాగే ఉంటారు పిల్లలు.

        ఇంత నిర్భంద విధ్య అవసరమా..? ఏమి సాదించాలి..? జీవితమంతా కేరీరేనా..ఇంకేమి లేవా..? విద్యతో పాటు బయట సమాజంలోని విషయాలు ఎలా తెలుస్తాయి..! ఎప్పుడు తెలుసుకుంటారు..? ఇది సరైనా కౌమార దశ. ఈ దశలోనే సమాజంపైనా, రకరకాల వ్యక్తుల పైనా ఒక అవగాహనకు ఆస్కారం ఉంటుంది. ఇలా అవేవి అందుబాటులో లేకుండా, దౌడుతీసే గుఱ్ఱానికి పరుగే ద్యేయంగా వాటి కళ్ళకు చుట్టపక్కలకు చూడకుండా కేవలం ప్రయాణించే రహదారి మాత్రమే కనపడేలా కటర్స్ కడతారు, మరి కొన్ని మాటవినని గుఱ్ఱాలకు ఎదురుగా ఒక కర్రకు గడ్డికట్టి రహదారివైపు వుండేట్టుగా ఉంచుతారు, ఆ గుఱ్ఱం ఆ గడ్డికోసం పరిగెత్తుతూ వుంటుంది అలానే....! అలా ఈ పిల్లలను కూడ పెంచుతున్నారు. ఇలా నాలుగుగోడల మధ్యన బందిస్తే..! ఏమి తెలుసుకుంటారు చుట్టూ వున్న సమాజాన్ని, మనుషులని..!

        ఇవన్నీఈ పెద్దలని అడిగినా..!  వారి నుండి వచ్చే సమాదానం ఒకటే,  " మిగతా జీవితం ఉంది కదా అప్పుడు తెలుసుకుంటారు. అయినా ఇదంతా వాళ్ళు భవిష్యత్తులో సుఖంగా ఉండాలనే మేము చేస్తున్నది "  అంటూ ఒక రెడీమేడ్ సమాధానం.

  నిజంగా ఇదొక్కటేనా..? సమాజంలో తమ పిల్లవాడి గురించి గొప్పగా చెప్పుకోవాలని తపన ఉంది ఇందులో. కానీ, ఆ ముసుగులో ఏమి కోల్పోతున్నారో అర్థమే కావడం లేదు. చివరకు ఒక కర్మాగారం లో యంత్రాలను, రోబోట్స్ ని తయారు చేసినట్లు, వారి పిల్లలను తయారు చేస్తున్నారు. బయట సమాజంలోకి ఒక మంచి పరిపూర్ణమైన యంత్రాన్ని ప్రవేశపెడుతున్నారు. అందులో మహా మేధావితనం, పెద్ద పెద్ద హోదాను, ప్రతిభ ఉంటున్నాయి కాని.... అందులో జీవం లేదు, జీవితం లేదు, సున్నితత్వం ఉండడం లేదు. ఒక రకంగా చూస్తే ఇది అనివార్యం అయ్యింది... తప్పట్లేదు జనాలకి ఎవరో ఒకరు ఇలా ఒక విధానాన్ని మొదలెడతారు, మిగతా వారు వాటిని అనుసరించడమే తరువాయి పని. ఎందుకిలా... అంటూ ఎవరు తమని తమరు ప్రశ్నించుకోరు. ఒక్కసారి కూడా ఆత్మ పరిశీలన చేసుకోరు. తప్పదు..! లోకంతో పాటు మనం అంటూ నడవడమే.

        నేను గతంలో చాలా సార్లు అనుకునేవాడిని, ఇప్పటి జనరేషన్ చూసి ఇప్పటి టెక్నాలజీని చూసి " అర్రె..! అనవసరంగా ఓ పదిహేను సంవత్సరాలు వెనక పుట్టామే.. కాస్త 20 ఏళ్ళు ఆగి పుట్టుంటే బాగుండేది కదా " అని.  ఇప్పుడు ఈ నిర్భంద విద్య చూసాక... అమ్మో ! నేను అప్పటి పూర్వకాలంలోనే పుట్టడం మంచిదైయింది అనిపించింది. ఎందుకంటే  " స్వేచ్చ " కారణం. ఇది లేకుండా బతకలేను. "స్వేచ్చ" లేని అమెరికా అధ్యక్ష పదవి ఇస్తాము అన్నా ఒప్పుకోను. స్వేచ్చలేని  ఏ కేరీర్ నాకొద్దు. ఏ హోదాలు, పదవలు నాకొద్దు..! అన్నీ వదులుకుంటాను నేను నా స్వేచ్చ కోసం....!

        " అంకుల్ " పిలుపుతో నా ఆలోచనల నుండి తల ఎత్తి చూసాను ఆ పిలుపు వచ్చిన వైపు.

        " ఒక మిస్సెడ్ కాల్ ప్లీజ్ "  అడుగుతున్నాడు ఓ కుర్రాడు

        " సెల్ లో చార్జ్ అయిపోయింది "  అన్నాను

        నా మాటతో తల అటూ ఇటూ తిప్పి, దూరంగా రూపాయి కాయిన్ బాక్సులు ఉన్న వైపు చూసాడు. అక్కడున్న నాలుగు కాయిన్ బాక్సులకూ వందడుగుల క్యూ ఉంది. అది చూసి ఆ క్యూ ఇప్పట్లో అవదు అని అనుకొని కాళ్ళీడ్చుకుంటూ క్లాస్ రూం వైపు వెళ్ళాడు ఆ కుర్రాడు


        కొన్ని నెలలుగా నల్లమల అడవులవైపునున్న అహోబిళం దేవాలయంతోబాటు వాటి చుట్టూ వున్న మరికొన్ని ప్రదేశాలను సందర్శించాలన్న ఆలోచనలో వున్న నేను, తోడుగా వచ్చే ఔత్సాహికులైన యువకులకోసం ఎదురుచూస్తున్న సమయంలో అనుకోకుండా నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక యువమిత్రుడుని కలిసిన సమయంలో " అన్నా రేపు శనివారం స్వాతి నక్షత్రం.ఆ రోజు పర్వదినంగా బావించి అహోబిళంలో ఉన్న నవ నరసింహస్వాములను  దర్శించడానికి మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ కలిసి వెళ్తున్నాము, ఈ సమయంలో అక్కడికి చాలా మంది వస్తారు, మీరు కూడ వస్తారా..? " అని అడిగాడు... నేను దేనికోసం ఎదురుచూస్తున్నానో...!! అదే సమయం నాకు ఎదురుకావడంతో నా సంసిద్దత వ్యక్తం చేసాను. వారిది దైవభక్తి..మరి నాది ప్రకృతి భక్తి.. ఏది ఏమి అయితేనేమి నాకు కావల్సింది అక్కడ తిరగడానికి తోడుగా మనుషులు కావాలి, మామూలు సమయాలలో అక్కడ వంటరిగా తిరగలేము, ఎలుగుబంట్లు, చిరుతపులులు ఎక్కువగా సంచరిస్తూవుంటాయి.

    ఎవరి వారి ఆలోచనలతో మరునాటి తెల్లవారు జామునే 5 గంటలకే నలుగురం రెండు మోటర్‌బైకులలో బయలుదేరాము. మా ఊరినుండి షార్ట్‌కట్‌లో వెళ్తే  80 కిలోమీటర్లు ఉండవచ్చు. దారిపొడవునా తెల్లని పొగమంచులా కమ్ముకొని ఉన్నది, చూడటానికి చలికాలపు తెల్లగా మంచులా ఉన్నా అది మంచు కాదు " మొగలి " అని అంటారు. ఊటిలో ఉన్నట్టుగా ఉన్నది వాతావరణం, తెల్లటిమేఘంలా రహదారిమీద దూదిపింజలా మెల్లిగా ఎగురుతూ పోతున్నది " మొగలి "...!  ఆరోగ్యానికి అంతమంచిది కాకపోయినా మంచులా ఫీల్ అవుతూ దారిపొడవునా " మేఘాలలో తేలిపోతున్నది తుఫానులా సాగిపోతున్నది " అని వెనుక అమ్మాయిలేకున్నా... పాట పాడుకుంటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చాగలమర్రి వూరు మీదుగా 7:30 నిమిషాలకు అహోబిళం చేరుకున్నాము.
    దిగువ అహోబిళం దర్శించకుండానే కొండమీదున్న ఎగువ అహోబిళం చేరుకొన్నాము. గంభీరమైన రెండు పర్వతశ్రేణుల మద్యన నెలకొనివున్నది ప్రధాన ఎగువ అహోబిళం. అక్కడ కూడ ప్రధాన దేవాలయం దర్శించకుండా.. దేవాలయానికి ఎడుమపక్క నున్న చిన్న చెక్క బ్రిడ్జీమీదుగా వెనుకకు చేరుకున్నాము. అక్కడ నుండి మహావృక్షాలతో నిండి ఉన్న నల్లమల్ల అడవులతో విస్తరించివున్న పర్వతాలను ఎక్కడానికి ముందుకు అడుగేసాము.

     ఓబులం, అహోబిళం, అహాబిలం, అహబిలగిరి, వేదాద్రి, దిగువ తిరుపతి, గరుడాద్రి, వీరక్షేత్రం, అచల చాయమేరు, సింగనేల్ కున్నం, నిధి, నగరి, శేషాద్రి, నరసంహ్మతీర్థం, గరుడాచలం అనే పేర్లతో ఈ క్షేత్రం ప్రసిద్ది చెందింది. ఎగువ అహోబిళానకి 8కి.మీ. దూరంలో వున్న ఉక్కు స్థంభం నుంచి విష్ణుమూర్తి నరసింహుని రూపంలో వచ్చి హిరణ్యకశ్యపుని వధించే సమయంలో ఉగ్ర నరసింహస్వామిని అహోబిలుడిగా దేవతలందరూ స్తుతించటం వలన ఈ క్షేత్రానికి అహోబిళం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో 9 ఆలయాలు, 6 కోనేర్లు, 122 మంటపాలు, అనేక చత్రాలు వున్నాయి.
        మా నడక మార్గమద్యన ఒక ప్రదేశంలో కొందరు భక్తులు కాలినడకన నడిచే భక్తులకోసం ఉచితంగా " నాస్టా " ఏర్పాటు చేసారు, ఆగకుండా వెళ్తున్న నన్ను మా ఫ్రెండ్ ఆపాడు.  " ఇక్కడ  టిఫిన్ తినకపోతే మరెక్కడ పైన దొరకదు. మర్యాదగా ఇక్కడ టిఫిన్ చేసి వెల్దాము " అన్నాడు..ఇష్టం లేకపోయినా ఆగక తప్పలేదు నాకు. ఆహోబిళం దగ్గరలో నున్న గ్రామాల నుండి, ఆళ్ళగడ్డ నుండి కొందరు భక్తులు ఉచితంగా భోజనాలు, టిఫిన్స్ ప్రతి ఏడాదీ అక్కడకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తారు, వారికి  మొక్కుబడిలో అదొక భాగం. ఎత్తైన చెట్ల కింద గ్యాస్ పొయ్యి. మరో రెండు కట్టెల పొయ్యిలతో అక్కడ వంటలు వండుతున్నారు. మహావృక్షాలమద్యన కాలినడకన అక్కడకు చేరిన భక్తులంతా అరటాకులలో పొంగలి, వేరుశనక్కాయి చెట్నీ కలుపుకొని ఆరగిస్తున్నారు. నేనంతగా పొంగలి ఇష్టపడను.  కాస్త సంకోచిస్తూ ఆరటాకు తీసుకొని టిఫెన్ తెచ్చుకున్నాను. మొదటి ముద్ద నోట్లో పెట్టుకొన్న రెండు క్షణాలకు  పొంగలి రుచి నా జిహ్వకు మహాద్భుతంగా తోచింది.. ఏముందా పొంగలిలో అని చూస్తే..! ఏముంది చాలా సింపుల్..ముంతమామిడి పప్పు ( జీడిపప్పు) తో పొంగలి, అందులోకి చెట్నీ..కాకపోతే చట్నీలో నిమ్మరసం పిండినట్లున్నారు కారకారంగా పుల్లపుల్లగా..! అందులోకి మల్లి టమోటా ఊరగాయి కలుపుకొని తింటుంటే..నాసామిరంగా..!. మావూళ్ళొ చెప్పుకొనే ఉపమానం గుర్తొచ్చింది.. మరదలుపిల్ల మాంచి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నప్పుడు అదోరకమైన పిలుపుతో ఆ పిల్ల " మావా " అంటుందట..అట్లా ఉన్నదారుచి..ఒక్క రుచే కాదు శుచి కూడ చాలా శుబ్రతగా ఉన్నది. అసలు పొంగలి ఇష్టపడనీ నేను మరోమారు పెట్టించుకొని లాగించేసా, నా తిండిపోతుతనం చూసిన మా ఫ్రెండ్స్ " ఇక చాల్లే ఎక్కువగా తింటే ట్రెక్కింగ్ చేయడం చాలాకష్టం " అని చెప్పగానే..ఆపేసా..కాని నా కడుపులోని ఆత్మారాముడు ఊరుకోవట్లేదు.లొట్టలేసుకుంటూ..గోలపెడుతున్నాడు." నాకింకా కావాలి " అంటూ...! వాడిని ’ మద్యాహ్నం భోజనం ఉండదు ఇలా మారాం చేసావంటే ’ అని బెదిరింపుతో బుజ్జిగించి అక్కడనుండి కదిలాను. మామూలుగా ఒక సామెత ఉంది, " కళ్ళు కావాలంటాయి..కడుపు వద్దంటుందీ " అని..కాని దీనికి రివర్స్ " కడుపు కావాలంటున్నది..కళ్ళు వద్దని వారిస్తున్నట్లుంది నా పరిస్థితి.
        అసలు అక్కడ అలాంటి ప్రకృతిరమణీయ వాతావరణంలో వనభోజనంలా టిఫెన్ ఆరగిస్తుంటే చెప్పలేని అనుభూతే అది...! అంతేనా.. కాలినడకన వస్తున్న భక్తులను ఈ దాతలు ఒకటికి రెండు మూడు సార్లు అడిగి పిలుస్తున్నారు. మొహమాటస్తులను సైతం బతిమాలి టిఫిన్ పెడుతున్నారు. మరి కొన్న చోట్ల ఇడ్లీలు, పూరీలు పెడుతున్నారు. మేము తెచ్చుకున్న కిన్లీ బాటిల్స్‌ని నేను తీస్తుంటే వద్దని మా ఫ్రెండ్స్ వారించారు, " అర్రె కిన్లీ నీళ్ళకన్న మాంచి రుచికరమైన, మినరల్స్ ఉన్న నీళ్ళు ఇక్కడున్నాయి. అవి తాగి మన వద్దనున్న ఖాలీ బాటిల్స్‌లలో ఆ నీళ్ళను పట్టుకొని వెళ్దాం "  అన్నారు. కొండలపైన నుండి చెట్ల వేర్లను తాకుతూ ప్రవహిస్తున్న మంచినీటి ధారలు అక్కడక్కడ చాలా ఉన్నాయి. వాటిని పెద్ద పెద్ద డ్రమ్ములలో పడుతున్నారు. అందులో ఏమాత్రపు నులకలు గాని లేక రంగు గాని లేదు..చాలా స్వచ్చంగా తేటతెల్లంగా వున్నాయి, ఒక్క సారి మన రాష్ట్ర రాజధాని భాగ్యనగర కార్పోరేషన్ రంగుతేలిన నీళ్ళు గుర్తుకొచ్చాయి..! నగరానికి... ప్రకృతివరమైన ఇక్కడ నీళ్ళకు.. ఎంతతేడా..?  అనుకున్నాను.!
      ఎగువ అహోబిల ప్రధాన ఆలయానికి 1కి.మీ దూరంలో నున్న వరాహ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాము. ఎత్తైన మహావృక్షాల కింద ఆలయమంటపము ఉండగా దాని గర్భగుడిమాత్రం కొండకు చివరి అంచునున్న బిళంలో దేవతావిగ్రహాలు ఉన్నవి. వేదాద్రి పర్వతానికి పడమటి భాగాన వరాహ రూపమున భార్య అయిన వసుంధరాదేవితో స్వామి వేంచేసి యున్నారు. అందుకే ఈ స్వామిని వరాహ నరసింహస్వామి అని అంటారట..! మామిత్రుల దర్శనం అయ్యాక అక్కడ నుండి పెద్ద పెద్ద బండరాళ్ళతో ఉన్న సెలయేళ్ళ మద్యన మా నడక ప్రారంభం అయ్యింది
   ఈ తోవలో నడక కాస్త కష్టంగానే ఉంటుంది, ఒకపక్కన పాచిపట్టిన బండరాల్లు, మరోపక్కన నీటి ప్రవాహం చాలా జాగ్రత్తగా నడవాలి. వేలల్లో జనం ఒక ప్రవాహంలా నడుస్తున్నారు, పిల్లలు యువకులు, నడివయస్కులు, వృద్దులు, స్త్రీలు. తమిళనాడునుండి తమిళ కారన్స్, కర్నాటకనుండి కన్నడ కంఠీరవలు ఎక్కువగా కనపడుతున్నారు. నడవలేని వృద్దలను ఒక పెద్దకర్రకు దుప్పటితో జోలకట్టి అందులో తీసుకెల్తున్నారు. మద్యలో ఏటవాలుగా ఉండవలసిన తాపలు కొద్దిగా నిటారుగా ఉండడం మూలాన జాగ్రత్తగా ఎక్కవలసివచ్చింది.
       జ్వాలా నరసింహస్వామి : వేదాచలం అనే పర్వతాల మధ్యన అచల భూమామేరు అనే పర్వతం ప్రాంతమది. ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి 4 కి.మీ దూరంలో ఉన్నది.  చాలా ఇరుకైన కాలిబాట..ఒక పక్కన చాలా లోతైనా లోయ ఉన్నది, వీటిని దాటుకుంటూ ఆలయానికి చేరవగా కొద్దిదూరంలో ఉన్న జలపాతం  కిందనుండి ఆలయానికి చేరుకోవాలి కాని జలపాతానికి మరో పక్కన పెద్ద లోయ ఉన్నది. చాలా జాగ్రత్తగా జలపాతం కిందనుండి తడుస్తూ దాటి ఆలయానికి చేరుకున్నాము. హిరణ్య కశ్యపుని సంహారానంతరం క్రోధాగ్ని జ్వాలతో ఊగిపోవడం వంటి రూపంలో వుండటంతో స్వామిని జ్వాలా నరసింహస్వామి అంటారు. స్వామిని శాంతింపజేసేందుకు ఇంద్రాది దేవతలు చేసిన అభిషేక జలమే భవనాశిని పుణ్యతీర్థంగా అయింది. ఈ ఆలయం ముందు ఒక కొండ గృహ, దాని క్రింద చిన్న గుండం ఎర్రని నీటితో నిండి ఉన్నది. హిరణ్యకశ్యపుని రక్తంలో తడిసిన హస్తాలను స్వామి కడగడం వల్ల నీరు ఎర్రగా మారిందని అక్కడి వారి ఒక విశ్వాసం. ఈ ఆలయంలో అష్టభుజ, చతుర్భుజ నరసింహులు. హిరణ్యకశ్యపుని వెంటాడుతున్న నరసింహుడు మూడువిగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడనుండి తిరిగి వస్తున్న సమయంలో కొందరు జలపాతనీటిని బాటిల్స్‌లలో నింపుకుంటున్నారు...! ఎందుకూ అన్నట్లు మా మిత్రులవైపు చూసాను నేను. " అవి కొన్ని వనమూలికల గుండా ప్రవహిస్తూ వస్తున్న ఔషద నీరు, తాగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారి నమ్మకం "  అన్నారు.

    మాలోల నరసింహస్వామి : అక్కడ నుండి తిరిగి వచ్చినతోవలోనే  వెనకకు ఒక అర కి.మీటర్ వచ్చాక ఒక కొండనుండి మరో కొండకు నిర్మించిన ఇనుప వంతన ద్వార వేదాద్రి శిఖరం మీదకు ఎక్కనారంభించాము, ఇది ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి 2 కి.మీ దూరంలో వున్నది..ఒక కిలో మీటరు శిఖరం ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే పచ్చదనంతో పరిచిన వేదాద్రి శిఖరం, గరుడాచలం, వేదాచలం కొండలు కనపడ్డాయి,  అద్భుతమైన దృశ్యం అది.. ఒక్కసారిగా " పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా "  అన్న సిరివెన్నెల చరణాలు గుర్తొచ్చాయి. వేదాద్రి శిఖరాన ఒక చదునైన ప్రదేశంలో మాలోల నరసింహస్వామి గుడి వున్నది, లక్ష్మీదేవితో కలిసి దర్శనిమిస్తున్నందున మాలోల నరసింహస్వామి అని పిలుస్తున్నారు. మా మిత్రబృందం గుడిలోపలే చాలా సేపు ఉన్నారు..పొర్లుదండాలు పెడుతున్నారు ఇద్దరు. ఎంతకూ బయటకు రావట్లేదు,  సరే వారు వచ్చేసమయంలోపల మరో చోటకు వెళ్ళవచ్చని మరొక మిత్రునితో కలసి గుడివెనుక నుండి కాలిబాట వెంటా అడవిలోనకు నడుచుకుంటూ వెళ్ళాను. ఇరుకుగా ఉన్న ప్రమాదకరమైన దారి అది..కాస్త కాలు జారినా లోతైన లోయలో జారడం ఖాయం. ఒక కిలోమీటర్ దూరం నడిచాక పక్కనే వున్న మరో కొండకు చేరాము అక్కడ దాదాపుగా 100 అడుగుల దీర్ఘచతురస్రాకారంలో ఉన్న పెద్ద బండరాయి ఉన్నది, దానిమీద ఏదో " లిపి " కనపడుతున్నది, అది తెలుగా లేక సంస్కృతమా..లేక మరో ఏదన్న బాషనా..? అర్థమే కావట్లేదు, ఎవరన్న ఆ " లిపి " మీద పరిశోదనలు చేస్తున్నారో లేదో..మరి..!?  చదునైన ఆ పెద్ద రాయి మీద నడుచుకుంటూ ఓ 100 అడుగులు వెళ్ళాక రెండు కొండలమద్యన ఇరుకైన స్థలం లో ప్రహ్లాదుడి " బడి " ఉన్నది. అక్కడే ప్రహ్లాదుడు విద్యనభ్యసించాడని అక్కడివారి నమ్మకం, ఆ చిన్న గుడిలో నరసింహస్వామి, ప్రహ్లాద విగ్రహాలున్నవి. పక్కనే ఏటువాలుగా ఉన్న కొండమీద చిన్న చిన్న జలపాతాలు ఉన్నవి,  చూడచక్కని ప్రకృతి రమణీయ ప్రదేశమది. అక్కడ నుండి తిరిగి వెనకకు బయలదేరాము. 

   ఉదయం టిఫిన్ చేసిన చోటకు చేరుకున్నాము, అక్కడ మరో రకమైన పలహారం పెడుతున్నారు, మరో రౌండ్ వేసారు మా మిత్రబృందం, ఈ సారి టమోటో, జీడిపప్పుతో చేసిన ఉప్మా. మరో రకం " ఉగ్గాని అలియాస్ బొరుగుల ఉప్మా ". !   బొరుగులతో ( మరమరాలు) చేసే ఉపపలహారం అది. చిత్రాన్నం (పులిహోర, యెల్లో రైస్) చేసే విదానంలానే చేస్తారు, కాకపోతే బొరుగులను ముందుగా నీటిలో తడిపి తర్వాత తిరగమాత (పోపు) పెడతారు పులిహోరలాగే బాగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,పసుపు వేసి మనం ఇంట్లో పోపుకు వాడే అన్నిదినసులతోనే తిరగమాత పెట్టాక చివరన అందులో నిమ్మరసం పిండుతారు. " ఉగ్గాని " తోబాటు దానికి కాంబినేషన్‌గా  " నన్ను కొంచం కొంచం కొరక్కుతినవయ్యా..య్యా..యా " అంటున్న మిరపబజ్జీతో తింటుంటే....." ఆ..టేస్టే..వేరు...ఆ టేస్టే వేరు " అని పాటపాడుకొన్నాము.. ఆ ప్రకృతివడిలో..!

    పావన నరసింహస్వామి : పలహారం ఆరగించిన తర్వాత అక్కడ నుండి మరో దిశకు కొద్దిదూరం నడిచాక ఎడమవైపున ఉన్న మరో కొండను దాదాపుగ 1 కి.మీ ట్రెక్కింగ్ చేసాము. తర్వాత దట్టమైన అడవి గుండా, దారిపొడవునా 100 అడుగల ఎత్తు ఉన్న మహావృక్షాలు ..అడవిని కప్పిన పెద్ద గొడుగులా ఉన్నాయి  వాటి క్రిందన మనిషెత్తు ఉన్న ఆకుపచ్చని గడ్డి మద్యలో కాలిబాట వెంట నడక ప్రారంచించాము.  ఎత్తైన చెట్ల ఆకుల మద్యనుండి దూరి వస్తున్న సన్న సన్నని సూర్యకిరణాలు పచ్చని గడ్డిని తాకి పరావర్తన చెందుతున్న దృశ్యం కన్నుల పండగలాఉంది నాకు.  అప్పటికే దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న కొందరు భక్తులు ఎదురవుతున్నారు. 5 కి.మీ నడిచాక మద్యాహ్నం 12:30 నిమిషాలకు గరుడాచలంకొండ చివర్లో పావనమనే నదీతీరాన ఉన్న పావన నరసింహక్షేత్రం చేరుకున్నాము. ఇక్కడికి కాలనడకన 6 కి.మీ నడవాలి..వాహనాల ద్వారా రావడానికి కూడ సౌకర్యం ఉన్నది ఘాట్‌రోడ్ ద్వారా 14 కి.మీటర్లు ప్రయాణిస్తే అక్కడికి చేరుకోవచ్చు. అక్కడ దర్శనం అయ్యాక మధ్యాహ్నన భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొన్నాక తిరిగి ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి బయలుదేరాము.


   అహోబిళ నరసింహస్వామి :  ఎగువ అహోబిళంగా పిలిచే ఈ దేవాలయంలో అహోబిళ నరసింహస్వామి వున్నారు. రాజగోపురంద్వార లోనికి వెళ్తే అక్కడ ఒక గుహలో అరుగు మీద దశభుజాలతో హిరణ్యకశిపుని సంహరించే నరసింహావతారంలో స్వామి దర్శనమిస్తాడు. ఆలయానికి ప్రక్కగా అభయ వరదముద్రలతో పై చేతులలో తామర మొగ్గలతో చెంచులక్ష్మి విగ్రహం ఉన్నది. అక్కడ దర్శనం ముగించుకొని బయలదేరాము.
       కారంజ నరసింహస్వామి : తిరుగుప్రయాణంలో ఎగువ అహోబిళానికి 1  కి.మీటర్ల దూరంలో భవనాశి నది ప్రవహిస్తున్న చోట వటవృక్షం నీడలో శంఖుఛక్రధారుడుగా కొలువైయున్నందున కారంజ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. అక్కడ నుండి దిగువ అహోబిళానికి 2 కి.మీటర్ల దూరంలో కొండపైన భార్గవ( పరుశు) రాముడు తపస్సు చేసిన స్థానంలో వెలసినందున భార్గవ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. అక్షయ కోనేటి నీరు, చుట్టూపొదలు. పెద్ద వృక్షాలతో అక్కడి ప్రకృతి రమణీయంగా వుంటుంది.
     చత్ర వట నరసింహస్వామి :  భార్గవ క్షేత్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పద్మాసీనడై, దక్షణ హస్తం అభయ ముద్రను సూచిస్తూ, గొడుగులాంటి మర్రిచెట్టు నీడలో చత్రవట నరసింహస్వామి వున్నారు.

     యోగానంద నరసింహస్వామి : 2 కి.మీ దూరంలో ప్రహ్లాదునికి యోగాభ్యాసం నేర్పి మూర్తి అయినందున ఇక్కడి స్వామికి యోగానంద స్వామి అని పేరు వచ్చిందట.
     దిగువ అహోబిళ వరద నరసింహస్వామి : ఇక్కడ ప్రహ్లాద వరద నరసింహుడు దర్శనమిస్తారు. ఈ శిలా విగ్రహం ఊర్ధ్వహస్తాలతో, శంఖు చక్రాలను కలిగి వామభాగంలో తొడపై లక్ష్మీదేవిని కూర్చండజేసి అభయ, వరద, ముద్రాన్వింతంగా అందంగా తీర్చి దిద్దబడింది. ఒక పక్కగా పట్టపుదేవేరి అమృతవల్లి తాయారు విగ్రహం ఉన్నది.

      ఈ విగ్రహాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఆలయంలోని ప్రధాన ఆలయమంటపంలో శిల్పులు చెక్కిన శిల్పాలు మాత్రం అద్భుతంగా వున్నాయి. రకరకాల నరసింహస్వాముల ప్రతిరూపాలు. కవయిత్రి, రచయత్రి అయిన కథనాయక "మొల్ల "శిల్పం,  శ్రీకృష్ణదేవరాయుల శిల్పాలు ..చాలానే ఉన్నాయి. అక్కడనుండి తిరుగు ప్రయాణం.
     అహోబిళం నుండి ఒక రెండు కి.మీటరు ప్రయాణించిన తర్వాత  బైక్ నడుపుతున్న మిత్రుడికి ఎడమపక్కన పచ్చని పొలంలో ఒక నీళ్ళ బావి కనపడడంతో బండిని ఆపేసాడు. మొహం కడుక్కొని ఫ్రెష్ అవుదాము పదా అని పొలంలోకి దారితీసాడు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అది బావి కాదు..ఒక పురాతన కోనేరు.. కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి మరమత్తులకు నోచుకోలేదు అనుకుంటా పాడుబడిపోయింది. లోపలంతా పాచి కట్టి ఉన్నది. అది కాదు గాని విశేషమూ..కోనేరు చూట్టూ ఉన్న రాతిగోడలమీద బాగవత, మహాభారత, రామాయణ శిల్పాలు చెక్కి వున్నారు..!  సురులు, దేవతలు అమృతం చిలుకుతున్న శిల్పాలు .. చాలా బాగున్నాయి. అందులో భాగంగా రతీభంగిమలు కూడ ఉన్నాయి. పురావస్తుశాఖ వారు బహుశ ఆ కోనేరు గుర్తించారో లేక గుర్తించి కూడా నిర్లక్షం వహిస్తున్నారో అర్థం కాలేదు మరి. ఎవరో రైతులు బోర్లు వేసి అందులోనుంచే తమ పంటపొలాలకు నీటిని వాడుకుంటున్నారు. ప్చ్ అనుకుంటూ తిరుగు ప్రయాణం కట్టాము.

    
    మరి కొన్ని నరసింహస్వామి అవతారాల ఫోటోస్ క్రింద ఫ్లాష్‌ప్లేయర్‌లో చూడవచ్చు.


       ఉపసంహారం :  ఇక్కడి దేవుల్లను చూసాక నగరాలలో ఉన్న దేవుళ్ళకు కన్ను కుడుతుందేమో..!! ఇంతటి ప్రశాంత వాతావరణం, ప్రకృతివడిలో వోలలాడుతున్న ఈ దేవుళ్ళను చూస్తే ఈర్షపడతారేమో..మన హైదరాబాద్ నగర దేవుళ్ళు...!! పాపం ప్రతిరోజు నగర వాహనాల రణగొణద్వనులమద్యన, కాలుష్యవాతావరణంలో ఉక్కిబిక్కిరి అవుతూ వుంటారు, అందులోని మన వారి " పోటీ భక్తి " ని తట్టుకోలేక సతమతమవుతూ ఉంటారు..ఇక పండగలు పబ్బాలు వచ్చినప్పుడు " మైకులతో " హోరెత్తిస్తూ ప్రజల చెవుల్లతోబాటు దేవుళ్ళ చెవుల్లకు తూట్లు పొడుస్తూ ఉంటే  అక్కడి నుండి ఎప్పుడొ పారిపోయి ఎక్కడో దాక్కొని ఉంటారు. అలాంటి వారికి ఇక్కడి స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ, నిశ్శబ్ధవాతావరణంలో పచ్చని ప్రకృతి మద్యనున్న దేవుళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈర్షపుడుతుందేమో...???. కాని ఒక విషయం మాత్రం నిజం, ఏ ఆరునెలలకో లేక సంవత్సరానికో ఒక మారు ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే భక్తి, పుణ్యం సంగతేమో గాని..స్వచ్చమైన గాలితోపాటు పచ్చని ప్రకృతితో మైమేకం అవితే చాలు... మిగతా రోజులంతా మన వృత్తిలో పనిచేయడానికి ఉత్తేజం కలుగుతుందనుకుంటా..!!!

      చిన్న సూచన : ఇక్కడ పోస్ట్ చేసిన ఫోటోస్ గురించి తమ సిస్టంలలో సరిగ్గా రావట్లేదు.. అంటే వర్టికల్‌గా క్రష్ అవుతున్నాయి అనగా హారిజాంటల్‌గా సాగదీసినట్లుగా కనపడుతున్నాయి  అని కొంతమంది తమ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.  వాస్తవంగా అవి 4:3 ఆస్పెక్ట్ రేషియిలో ( టి.వి ఫార్మాట్ అనగా 35mm సైజ్) ఉన్న మానిటర్‌లలో కరెక్ట్‌గా కనపడతాయి. వైడ్ స్క్రీన్ మానిటర్‌లలో మరియు వైడ్‌స్క్రీన్ ఉన్న లా‌ప్‌టాప్‌లలో హారిజాంటల్‌ సాగదీసినట్లుగా కనపడతాయి. ఆ సమస్య మీద నాకెటువంటి అవగాహన లేదు, కేవలం ఒక చిన్న విషయం చెప్పగలను మీరు ఏదన్న ఫోటోని ప్రత్యేకంగా చూడాలనుకున్నప్పుడు ఫోటో మీద రైట్ క్లిక్ చేసి సపరేట్ గా మరో విండో ఓపన్ చేసుకుంటే మీకు సరైన పరఫెక్ట్ ఫోటోగ్రాఫ్ వస్తుంది.


        వారంరోజుల క్రితం ఒక విషయసేకరణ కోసం కడప సి.పి.బ్రౌన్ లైబ్రరీకి వెళ్ళాను, అక్కడ రీసెర్చ్ అసిస్టెంట్ శ్రీ కట్టా నరశింహులు గారిని కలిసిన సందర్భంలో ఆయన కొన్ని తాళపత్రాల గ్రంధాలను తిరిగి రాస్తున్నారు. వాటిగురించి అడిగినప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి, వారి వద్ద దాదాపుగా 120 తాళపత్రాల గ్రంథాలు సేకరించినవి వున్నాయి.  అంతకమునుపు 50 గ్రంధాలను శుద్దిచేసి తిరిగి దాతలకు అడిగినప్పుడు అప్పజెప్పినారు. ఉన్న 120 తాళపత్రాల గ్రంధాలలో " అముద్రిత " గ్రంథాలు రెండు ఉన్నాయట. వాటిలో కర్నూల్‌జిల్లా నందికొట్కూరు మండలము, పాతకోట గ్రామ వాస్తవ్యుడు  శ్రీ పోతురాజు పుల్లన రచించిన శివమహత్యం తెలిపే తొమ్మది అశ్వాశాల బ్రహ్మోత్తర ఖండమును కట్టా నరశింహులు గారు ఎత్తి రాస్తున్నారు.

       ఈ  పోతురాజు పుల్లన ఏ కాలంనాటి వారో తెలిపే చరిత్ర ఎక్కడా లేదు గాని ఆయన రచనా శైలిననుసరించి గమనిస్తే 16 వ శతాబ్దం తర్వాతవారై ఉండవచ్చునని  చెబుతున్నారు. ఆయన ఖండం నుండి ఒక పద్యం....

                           శ్రీరుద్రాంబుజ సంభవాచ్యుత ధరిత్రీపుత్రి మధ్యస్థతీ
                           స్ఫారోదార గభీర నిర్మల మహాపాతాళగంగాపయః
                           పూర ప్రాభవ కేళికాప్రియదయాంభోధీ శివా శ్రీనగా                       

                       గారా ! భర్మలి నిర్మిత స్ఫురిత సద్మా పద్మగర్భస్తుతా !


                                                                                                 .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి

    నారమ్మ ఇంకా వూర్లోకి రాలేదు.
  దండోరు పల్లె వద్ద కూచనే బీరాలు ( ప్రగల్పాలు, బింకంగా మాట్లాడడం) తీస్తోందట.
  ఆమెతోటి వెళ్ళిన అనుచరవర్గం పదిరోజులు గడవకుండానే వూర్లోకి వచ్చారట. మొదట ఒకటి రెండు రోజులు రాత్రిళ్ళు వచ్చి ఇళ్ళవద్ద వుండి పొద్దున్నే వెళ్ళిపోయారట.
  తర్వాత మెల్ల మెల్లగా పగలు కూడ వూర్లోనే వుండటం ప్రారంభించారు గాని బహిరంగంగా వీధుల్లొకి రావటం లేదట.  చివరగా ఆ వర్గంలోని ప్రముఖుడు ఓబులకొండారెడ్డి కూడా గ్రామంలో ప్రవేశించాడుట.
  అతను స్వంత యింటికి వచ్చిన రాత్రి మిగిలినవాళ్ళు వచ్చారు.  రాత్రిళ్ళు ప్రశాంతంగా లేదని పెద్దిరెడ్డికి అందిన సమాచారం. దండోరుపల్లె వాళ్ళు ముప్పైమంది దాక జనం వచ్చి ఆ రాత్రంతా వుండిపోయారట.
 వరసుగా రెండు మూడు రాత్రిళ్ళు అలాగే జరిగిందని వినికిడి. నాలుగోరోజు పగటి పూటనే వూర్లో కొచ్చాడు కొండారెడ్డి.  ఆ రోజు దండోరిపల్లె గుంపంతా శివపురిలోనే తిరిగింది.
  రాత్రికి పెద్దిరెడ్డి వర్గం సమావేశమైంది.
  జరుగుతున్న విషయాలు కూలకషంగా విశ్లేషించుకొన్నారు.
  త్వరలో నారమ్మ కూడా వూర్లోకి వస్తుందనే విషయం స్పష్టమైంది కాబట్టి తమ ప్రతి స్పందన గూర్చి చర్చించుకున్నారు.  నారమ్మ వూర్లోకి వచ్చిన మరుక్షణమే దాడి చేయాలని, అవకాశం చూసుకొని ఈ మద్య కాలంలోనే ఆమె వర్గం మీద దాడిచేయాలి.
  తమ ప్రధాన శత్రువు నారమ్మ
  అందుకే ఆమె వర్గం మనుషులు తిరిగి గ్రామంలోకి వచ్చినా తాము చర్యతీసికోలేదు..  అదే వాళ్ళ దృష్టిలో  తమను చులకన చేసినట్టుంది.
  దండోరు పల్లె వాళ్ళు బాహాటంగా వూర్లో తిరగటం భరించరానిదిగా వుంది.  నేరం చేసిన మనుషులు రొమ్ము విరుచుకొని వీధుల్లోకి రావటం సహించరానిదిగా వుంది.
  దండోరు పల్లె వాళ్ళతో డీకొనాలంటే తమకు ఆయుధాలు కూడ అవసరమే.  ముఖ్యంగా బాంబూలు కావాలి.
  వాటి విషయంలో సమితి ప్రెసిడెంటుకు మంచి అనుభవం వుంది. మరునాడు చెన్నారెడ్డిని కలిశారు.  ఆయన ద్వారా ముద్దనూరు వద్దనున్న నల్లబల్లెలోని బాంబ్ మేకర్‌ని కలిశారు. అతనికే డబ్బిచ్చి ముడిసరకు తెప్పించి ముగ్గుపిండి గని వద్ద ఇసుక జేడల్లో బాంబులు చుట్టించటం మెదలెట్టారు.
  వారంరోజులు పాటు అక్కడే కూచుని బాంబులు చుట్టాడు అతను.
  గనిపని వదలి బాంబ్‌మేకర్‌ను అంటిపెట్టుకొని వుండిపోయాడు బాలుడు.   ప్రేలుడు మిశ్రమాన్ని కలపటం, అందులో ఇనుప ముక్కలు, గాజుపెంకులు వేయటం, దారంతో చుట్టటం,  వాటిని ఆరబెట్టి భద్రపరచటం వగైరా విషయాలన్నీ నేర్చుకున్నాడు.  చివరగా బాంబుల్నెలా ప్రయోగించటం కూడా ప్రాక్టీసు చేశాడు.
  రెండు బక్కెట్లు బాంబులు శివపురిలోకి చేర్చబడ్డాయి.
  మిగిలిన బాంబులన్నీ బాలుని ఆధ్వర్యంలో గనివద్దనే సురిక్షిత ప్రదేశంలో భద్రపరచబడ్డాయి.
  అవసరమైనప్పుడు బాంబులు విసిరేందుకు ’ పెద్దపసుపుల ’ పల్లే నుంచి ఇద్దరు మనుషుల్ని తెచ్చుకున్నారు.  ( రాయలసీమలో మొట్టమొదటి దేశీ బాంబు పెద్దపసుపుల పల్లెలోనె  తయారు చేసి ఒకరిమీద 1970  ప్రాంతంలో ప్రయోగించారు)
  నారమ్మ రాకకోసం ఎదురుచూస్తున్నారు.
  ఎప్పుడైనా చిన్న అవకాశం దొరికినా ఆమె వర్గం మీద దాడిజేసి వూరిడిపించాలని కూడా వ్యూహాలు పన్నుతున్నారు.
  నారమ్మ  వచ్చింతర్వాతే ఆ దాడులు చేయాలనేది కొందరి సలహా,  ఎందుకంటే ముందే ఆమె వర్గం మీద దాడిజేస్తే ..ఆమె వూర్లోకి రాదేమో..!!
  వేరుసెనగ పీకుళ్ళు మొదలయ్యాయి
 ఆడమగ అంతా చేలల్లోనే వున్నారు.
  వేరుసెనగ పీకటం, కాయలు కోయటం, బస్తాలకెత్తి ఇళ్ళకు తెచ్చి కళ్ళాల్లోనో, మిద్దెల మీదనో ఆరబోసుకోవటం లాంటి పనులతో కసాలుగా ( ఆంగ్లంలో పిలిచే బిజీని కడప మాండలికంలొ కసాలు అంటారు, కొన్ని వూర్లల్లో సమయానులూలతకు తగ్గట్టుగా ఒక్కో భావం స్పరిస్తుంది, కష్టంగా ఉన్నది, డిమాండ్‌గా ఉంది అని ఇలా ) వుంది వూరంతా.
   నారమ్మ వర్గం మనుషులు రాత్రిళ్ళు చేలవద్ద కాయలకుప్పలకు కాపలగా కూడా వెళ్ళటం లేదు.  కూలి మనుషుల్ని పంపిస్తున్నారు.  ఆరుబైట పడుకొనే దానికి కూడ లేదు. వాకిళ్ళు బిగించుకొని తెల్లారేదాక ఇంట్లో వుండాల్సిందే.  దెబ్బ తిన్న వాళ్ళు తిరిగి తమమీద దెబ్బతీస్తారేమోనని భయం, ఆలాగని భయపడినట్లు కన్పిస్తే నిద్రరాదు. వీధికి యీ చివరనుంచి ఆ చివర దాకా చూపులకు పహారా కాసేపనే ! లేచి యింట్లోకి పోదామూ అంటే... ఎవరైనా చూస్తే భయపడి యింట్లో పడుకొన్నాడని భావిస్తారనే భావన.  అందుకే వీధులు సద్దుమణిగేదాక మంచం మీద నిద్రస్తున్నట్లు నటించి,  తర్వాత లేచి ఇంట్లోకి వెళ్తారు. ఎవరైనా చూస్తే తామింకా మంచం మీదే వున్నట్టుగా దుప్పటిని మడతలు పెట్టి పరిచి భ్రమింపచేస్తారు.

                                               *******

   నారమ్మ వర్గంలోని ప్రముఖ వ్యక్తి ఓబుళకొండారెడ్డి పరిస్థితి ఇబ్బందిగా తయారైంది.  నారమ్మ తర్వాత తనమీదనే వుంటుంది ప్రత్యుర్థుల గురి. ఆమె వస్తే అటోఇటో తేలిపోతుంది. పెద్దిరెడ్డివర్గం ఆమెమీద దాడిజేయక మానరు. దండోరుపల్లెవాళ్ళు విధ్వంసం సృష్టించక వదలరు..
  ఆమె రాక కోసం ఎదురుచూస్తున్నాడు కొండారెడ్డి.
  వేరుసెనగ పీకుళ్ళు పూర్తయి కాయలన్నీ ఇళ్ళకు చేరుకొంటోన్న సమయంలో ఒకనాటి ఉదయం పదిగంటల వేల ఏటికి అడ్డంగా ఒక్కతే నడిచివచ్చింది నారమ్మ. తలెత్తి అటుఇటు గూడ చూడకుండా వీధంటా గబా గబా నడుచుకుంటూ నేరుగా తన ఇంటి వద్దకెళ్ళింది,  తాళం తీసి లోపలికెళ్ళి పొరక ( చీపురు) చేతబట్టి కసువు ( చెత్త ) చిమ్మింది.  వీధిలోని జనాలు తనకేసి గుడ్లు పెద్దవి చేసి భయంగా చూస్తున్నట్లుగా చూడటం కంటి కొసల్లోంచి గమనించిందిగాని పట్టించుకోలేదు.
  అప్పుడే వీధి మొగసాల కలకలమైంది.
  జనాల గొంతుకలు కలగాపులగంగా కల్సిపోయి వీధిని నింపుతూ దూసుకొస్తున్నాయి.
  గుంపుముందు  పెద్ద పెద్ద అంగలేసుకొంటూ వస్తున్నాడు బాలుడు నారమ్మను బండబూతులు తిడుతూ, అతని వెనుకే ఇరవై మందికి పైగా జనం - కర్రలు చేతబట్టి కేకలేసుకొంటూ ప్రత్యుర్థుల్ని అమ్మనక్కల తిడుతూ వస్తున్నారు.
  నిటారుగా నిల్చొని వాళ్ళకేసి చూస్తుండిపోయింది నారమ్మ. రెప్పవాల్చటం కూడా మరిచిపోయి అటే చూడసాగింది.
  " మనిషిని చంపించి మల్లా వూర్లేకొస్తావంటనే లం...... ! " అంటూ మొదటి దెబ్బ వేశాడు బాలుడు.  ఒడుపుగా జుట్టుపట్టి కిందపడేసి జరజర వీధిలోకి యీడ్చుకొచ్చాడు ఆమెను.
  కసిదీర కాలితో తన్ని తన్ని వదిలాడు ఓబుళరెడ్డి.
  గుమిగూడిన వాళ్ళంతా విచక్షణా రహితంగా ఆమెను కాళ్ళతో తన్ని చేతుల్తో బాది వదిలారు.
 కిందపడేసి రెండు కాళ్ళు ఫళుక్ మని శబ్దం వచ్చేలా విరగ్గొట్టారు.  దెబ్బల బాధ భరించలేక స్పృహదప్పి పడిపోయింది ఆమె. చచ్చిందేమోనని అనుమానమొచ్చింది పెద్దరెడ్డికి.
   తమ్ముని చెవిలో మెల్లిగ గొణిగాడు.
   " సావనీ  ! వూరిబైట పారేస్తే కుక్కలు, నక్కలు పీక్కుతింటాయి  "  గట్టిగా చెప్పాడు ఓబుళరెడ్డి.
  ఆమె పురాణం ముగియగానే వీధిన పడ్డారు జనమంతా. ప్రత్యుర్థులని గొడవకు పిలుస్తూ సవాల్ చేస్తున్నారు.  దిక్కులు పిక్కుటిల్లేట్లు  సింహనాదాలు చేస్తున్నారు  " రాండ్రా నాకొడకల్లారా  ! యీ రోజే తేల్చుకోందాము రాండి.  మొగోల్లయితే రాండీ. మూతికి మీసమున్నోడెవుడయినా వుంటే యీధిలోకి రాండి .."  అంటూ గాండ్రిస్తున్నారు.
  నారమ్మ వర్గీయులెవ్వరూ ఇళ్ళల్లోంచి బైటకు రాలేదు.
  దండోరుపల్లె వాళ్ళను తోడు తెచ్చుకొంటాదనుకొంటే..ఒక్కటే వొచ్చి చావు దెబ్బలు తినటం వాళ్ళకు అర్థం కాని విషయంగా వుంది.
  వీధులన్నీ కవ్వాయదొక్కి ప్రత్యుర్థుల ఇంటి వాకిళ్ళను కాళ్లతో తన్ని, కేకలేసి పిలుస్తూ  చెలరేగిపోయారు పెద్దిరెడ్డి జనం.
  " దీన్ని ఏం జెయ్యాల..? "   నారమ్మను కాలితో నెడుతూ అన్నాడు వెంకటరెడ్డి.
  " బండికెత్తి మేయిన్‌రోడ్లో బేసి రాపోండి "  ఓబుళరెడ్డి చెప్పాడు.
  వెంటనే ఎద్దుల బండి సిద్దమైంది.
  ఇంకా వూపిరాడుతూవున్న నారమ్మను బండ్లోకెత్తి మేయిన్‌రోడ్ దాకా తీసికెళ్ళి అక్కడ మట్టనిడిసి వచ్చారు.
  రోడ్డు పక్క తడ్సిన బస్తాలా పడివుంది నారమ్మ.
  మొహాన నీళ్ళు చిలుకరించే దిక్కుకూడ లేక అనాధ ప్రేతంలా వుంది.

                                          *******

    మళ్ళీ రోజు సాయింత్రానికి పోలీసు జీపొకటి శివపురిలోకి ప్రవేశించింది.  బిలబిలమంటూ జీవు దిగిన పోలీసులు పెద్దిరెడ్డి యింటిని చుట్టుముట్టారు.
  ఓబుళరెడ్డి. బాలునితో సహా ఇరువైరెండు మందిని అరెస్టు చేశారు,  అందర్నీ పోలీసు స్టేషన్‌కు తీసికెళ్ళారు.
  అక్కడ నారమ్మ వుంది.
  వాళ్ళకేసి పిశాచిలా చూస్తోంది.
 శవాన్ని జేసి రోడ్డుమీద విసరేస్తే - ఎట్టా మేలుకొందో..? ఎట్టా లేచిందో.. ఎట్లా బసెక్కిందో...-  నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్ళి రిపోర్ట్ చేసిందట. విరిగిన కాళ్ళకు కట్లుకూడా కట్టించుకోకుండా ఎట్లా అక్కడకు చేరిందో ఆ భగవంతునికే తెలియాలి.
  విషయం తెలిసి ఆగమేఘాల మీదొచ్చాడు చింతకుంట చెన్నారెడ్డి.  రాత్రి వాళ్ళను స్టేషన్‌లో వుంచనీకుండా తాను పూచీకత్తు యిచ్చి వెంటబెట్టుకెళ్ళాడు.  పార్టీ నాయుకుని యింట్లో దిగబెట్టాడు.
  అటెంప్ట్ మర్డర్ కింద కేసు నమోదు అయ్యింది.
  బెయిలు తెచ్చుకొనేసరికి మరో రెండ్రోజులు పట్టింది.
ఆమె వైపు సాక్ష్యం చెప్పేందుకు ఆమె వర్గీయులు సిద్దమయ్యారు.  నారమ్మను బలబరిచి పెద్దిరెడ్డి వర్గాన్ని అణగదొక్కాలనే దృడసంకల్పంతో ఉన్నారు వాళ్ళు.  అప్పుడు అర్థమైంది దండోరుపల్లె రంగారెడ్డి పన్నిన వ్యూహమేమిటో.
   వాయదాలకు తిరుగుతున్నారు.
  తాము కేసుల్లో ఇరుక్కోవటం ముందే వూహించిన సంగతే అయినా తమను కోలుకోకుండా తొక్కేయాలని నారమ్మ వర్గీయులైన ఓబుళకొండారెడ్డి వగైరాలు  అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ వుండటాన్ని సహించలేకపోయారు పెద్దరెడ్డి జనం.
  వాళ్ళను భయపెట్టుకోకుంటే తమ మనుగడ కష్టంగా భావించారు.
  సెనక్కాయ పీకిన చేలల్లో అందరూ ఏగిలి సేద్యాలు చేసికొంటున్నారు. కసాలుగా పనిమీదున్నారు.
  ఆరోజు తనే స్వయంగా  కాడి కట్టుకెళ్ళాడు ఓబుళకొండారెడ్డి.
  పది చాళ్ళు దున్నాడో లేదో - మట్టిబాట  వైపునుంచి పదిమంది మనుషులు కట్టెలు, గొడ్డళ్ళతో తనకేసి పరుగెత్తికొంటూ రావటం చూసి గుండెలు దిగజారిపోయాయి.  వాళ్ళు పెద్దరెడ్డి మనుష్యులుగా అర్థమయ్యేసరికి  పైప్రాణాలు పైనే పోయాయి.  కాడెను అక్కడే వదిలేసి చెప్పులు చేతబట్టుకొని దుక్కపెళ్ళలకు అడ్డంగా పరుగు ప్రారంభించాడు
  " నిలబడరా నీయ్యెక్క  ! నిన్నీరోజు నరకంది వదుల్తామా  ? "  అంటూ వెనుకనించి కేకలు
  పరుగెత్తుతూనే ఆశ్రయం కోసం ఆలోచించాడు. ఊర్లోకి వెళ్ళటమే ఉత్తమంగా తోచింది..  చావుబతుకుల మీద ఇంట్లో దూరి గడియ పెట్టుకొన్నాడు.
  అతని వెంట వూర్లో కెళ్ళారు పెద్దరెడ్డి జనం.  ఇంటి ముందు నిల్చుని కేకలేశారు.  " సాక్ష్యం చెప్పడానికొస్తారా  నా కొడకల్లారా  ! " అంటూ పట్టెడు లావు రాళ్ళతో వాకిలికేసి బాదారు.
  ఆ రోజంతా ఇంట్లోంచి బైటకు రాలేదు కొండారెడ్డి.
  అతని సేద్యం మద్యలోనే ఆగిపోయింది.
  మరసటిరోజు మరొకర్ని... నారమ్మ వర్గీయులు  సేద్యాలు చాలించారు. పొలాల్లోకి వెళ్తే దాడులు చేసేట్టున్నారు.  భూములు బీళ్ళు పెట్టించాలనే వాళ్ళ వ్యూహంలా తోచింది నారమ్మ వర్గీయులకు.  ప్రస్తుతానికి వాళ్ళ భూములు బీళ్ళు పెట్టించటమనేది తమ వ్యూహంలో భాగమే అయినా - ప్రధాన ధ్యేయం మాత్రం వూరినుంచి తరిమిగొట్టాలనే..
  తమ ప్రత్యుర్థుల్ని వూరు విడిపించాలి.
  అదను కోసం కాచుకొని వున్నారు పెద్దరెడ్డి మనుషులు.
   ఈ నేపధ్యంలోనే కోర్ట్ వాయదాలు.
 డబ్బు మంచి నీళ్ళలా ఖర్చువుతోంది.
 ఇరువర్గాలూ వాయదాలకు వెళ్ళివస్తున్నాయి.

                                *********
 
   ఎండాకాలం దాటింది.
 తొలకరింపులు మొదలయ్యాయి
  పెద్దరెడ్డి వైపు రైతుల భూములన్నీ సేధ్యాలు పడ్డాయి.
  ప్రత్యర్థుల భూమలన్నీ మొలకగడ్డితో పచ్చదనాన్ని నింపుకుంటూ బీళ్ళుగా పడివున్నాయి.
  తమ భూముల దుస్థితి చూసి ఓబుళకొండారెడ్డి వగైరాలకు కడుపు తరుక్కుపోయింది.
  దండోరుపల్లెకు వెళ్ళారు.  రహస్య మంతనాలు చేశారు. మరుసటి రోజు రాత్రి శివపురి వీధుల్లో కొంత అలజడి రేగింది.  దండోరు పల్లెలో పెళ్ళిజేసికొన్న వీరన్న వీధెక్కి తిట్టటం మొదలెట్టాడు, పెద్ద అరుగు వద్ద నిల్చుని  గొంతెత్తి బండబూతులు తిడుతున్నాడు.
  మొదట - ఎవర్ని తిడుతున్నాడొ అర్థం కాలేదు.
  తర్వాత అర్థమై ఆశ్చర్యపోయారు జనమంతా..
  " తగుల్దాం రాండ్రా  ! ముసిల్దాన్ని కాల్లిరిగ్గొట్టడం కాదురా కొజ్జానాకొడకల్లారా  ! నా బలగమేందో సూపిస్తారాండి.  మీసమున్నోదెవుడొ రాండ్రా  !  " అంటూ తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు.
   పెద్దరెడ్డి ఇంటివద్ద జనం గుమిగూడారు.
   " అదును కోసం సూస్తావున్నెం.  మంచి టయమొచ్చింది అందరినీ వూర్లోనుంచి తరమాలంటే యిదే సమయం  "  చెప్పాడు వెంకటరెడ్డి.
  ఈటెలు. గొరకలు, వేటకొడవళ్ళ్తో సిద్దమవుతున్నారు జనం.
  పెద్దిరెడ్డి ఆలోచించాడు.
  " వాడంతగా  విర్రవీగుతండాడంటే - వెనుకేదో మనకు తెలియని వ్యూహముంది.  దండోరుపల్లె వాల్లొచ్చింటే బాంబులు తెచ్చుకొనుంటారు ..తొందరపడకండి..? "  చెప్పాడు
  " మనకాడ వుండాయి కదా  బాంబులు...? "
" వుండాయి..బేసే మాసులు మొన్ననే వూరికి పోయినారు  "
  " బాలుడు బేస్తాడు కదయ్యా  ! "
  " ఒక్కనితో ఏమయిద్ది..? వాల్లెంతమంది వచ్చినారో..?"
  "  ఇప్పుడు ఎనకడగుబేస్తే  సేతగానోల్లమవుతాం.  మన యిండ్లగాడికి వస్తారు వాల్లు . "   బాలుడు చెప్పాడు.
  " రానీ ! "   పెద్దిరెడ్డి అన్నాడు.  " అయినా..వాడొక్కడేగద వీధెక్కి కేకలేసేది. తోడెవరూ రాలేదుగదా  !  తాగుబోతు వెధవకింద లెక్కెసుకుందాం. ఈరొజుకు  వూరుకుండండి  ఏం జరుగుతుందో సూస్తావుండండి  "   కొద్దిసేపు కేకలేసింతర్వాత వీరన్నను అతని భార్య, తల్లి ఇంట్లోకి లాక్కపోవటంతో గొడవ సద్దుమణిగింది.
  అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోవటం ఓబుళరెడ్డికి బాధగానే వుంది.  మరోసారి ఇలాంటి అవకాశమొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదనీ -  అవకాశం తనకై తాను రాకున్నా ప్రయత్నించి కల్పించుకునైనావాళ్ళను వూరు వదలగొట్టాలనే దృఢంగా నిర్ణయించుకున్నారు.
  తమవర్గం మనిషి వీధెక్కి తొడగొట్టి సవాల్ జేసినా పెద్దిరెడ్డివర్గం గొడవకు దిగకపోవడం ఓబుళకొండారెడ్డికి ఏదో అనుమానంగా వుంది.  మరేదో భయం వెంటాడటం మొదలైంది.  తన భయాన్ని కాస్త తన వర్గపు మనుషులందరికీ అంటించాడు.
  తమ మీద ఏదో దాడి జరగబోతూవుంది.  బలమైనా దాడికే ప్రయత్నిస్తున్నారేమో..!!  మామూలుగా ఆలోచించేవాళ్ళయితే వీధెక్కి తిట్టినపుడే వచ్చి గొడవ పడేవాళ్ళు.  లోతుగా వ్యూహాలు పన్నుతోన్నట్లుంది.
మూకమ్మిడిగా ప్రాణాలు తీయాలనుకొంటున్నాట్లుంది.
  తమ భూములు బీళ్ళు పెట్టించారు.
  తమను భూమ్మీద లేకుండా చేయాలనుకొంటున్నారేమో..!!
  తమ్ము తాము రక్షించుకోవాలంటే  ఏదొకటి చేయక తప్పదు..అదేదో ఆఖరి ప్రయత్నమై వుండాలి. అదెంత ఖర్చుతో గూడుకొన్నదయినా, కష్టసాద్యమైనదయినా సరే సాధించాలి.   తనవాళ్ళను తీసికొని దండోరుపల్లెకు వెళ్ళాడు కొండారెడ్డి.  అక్కడ రంగారెడ్డితో సమావేశమయ్యారు
  తాము బతకాలన్నా, బతికి పిడికెడు మెతుకులు తినాలన్నా గాని ఓబుళరెడ్డి, పెద్దిరెడ్డి ప్రాణాలతో వుండకూడదు.
  వాళ్ళను చంపి తాము బతకటమా  ?
  అస్తుల్ని, గ్రామాన్ని వదిలి ఎటో వెళ్ళిపోయి కూలినాలి చేసికుంటూ పానాలు నిలుపుకోవటమా..?
 రెండిటిలో ఏదొక దారి నిర్ణయించుకొనేందుకు రాత్రంతా చర్చలు జరుపుతూనే వుండిపోయారు.
  తెల్లారేసరికి ఓ నిర్ణయం తీసికొన్నారు.
  ఎల్లుండి వాయిదా.
 ఆ రోజే పథకాన్ని అమలుచేయాలనుకొన్నారు.
  అతి జాగ్రత్తగా, రహస్యంగా తమ కార్యకలాపాల్ని ప్రారంభించారు..  ఎవ్వరికీ అనుమానం రాకుండా వనరుల్ని సమీకరిస్తున్నారు.

                                                                                                    ...........సశేషం.

                                                                                                 .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

        
      క్షణం కూడ ఆలశ్యం చేయకుండా తనవాళ్ళందర్నీ పిలిపించాడు.
 జరిగిన విషయమంతా చేప్పేసరికి ఉగ్రులైపోయారు వాళ్ళు. కట్టెలు, కైపులు తీసుకొని  ’కోబలీ ’ అంటూ వీధెంట అరుచుకుంటూ వూర్లో జొరబడ్డారు.
  గ్రామమంతా ఆశ్చర్య, భయాందోళనలతో అట్టుడికి పోయింది. ఆడవాళ్ళు వాకిళ్ళలోంచి నిలువు గుడ్లేసుకుని చూస్తున్నారు.
  గుంపు నేరుగా నారమ్మ యింటి వద్దకెళ్ళి ఆగింది.  ’కోబలీ ’ అంటూ కేకలు పెట్టింది.
  నారమ్మ యింటికి తాళం కప్ప వేళాడుతూ వుంది. " యాడికి పోయిందీ లం.....? " అంటూ ఇరుగు పొరుగుల్ని విచారించారిస్తే. మద్యాహ్నమే ఆమె వూరు విడిచి వెళ్ళినట్లుగా తెలిసింది.
  " ఎర్రటెండకు ఏట్లో కిందామీందా పడ్తా అడ్డంగా నడ్సిపోయిందెన్నా !  దండోరు పల్లెకు పోయినట్టుంది  "  చెప్పింది  ఓ ఆడమనిషి.
   " తప్పించుకొన్నెది ముండ .."  కసిగా అన్నాడు ఓబుళరెడ్డి.
  " కొండిగాడు వుండాడేమో సూడండి  "  ఎవరో అనటంతో ’కోబలీ ’ అంటూ మరో ఇంటికేసి కదిలింది గుంపు.
  నారమ్మ దాయాది ఓబుళకొండారెడ్డి ఇంటికి కూడా తాళం వేసివుంది..  మరో నాలుగిళ్ళు మీద దాడిజేశారు గాని అన్నిటి పరిస్థితి అంతే.
  తాము మిట్టపల్లె మాదిగల్ని విచారించటం తెలిసిన వెంటనే వూరు దాటినట్టుంది నారమ్మ తన అనుచరగణంతో కలిసి.
  కొంతసేపు వూరంతా కదం తొక్కారు జనం.
  నారమ్మ ఇంతలావు వన్జేసిందంటే నమ్మలేక పోతున్నారు అందరూ. ఆమె తెంపరితనం విని వూరు వూరే నిశ్చేష్టిత అయ్యింది,  ఆమె తప్పించకు పారిపోవటం చూసి నేరం కూడా నిరూపణ అయ్యింది.
  సాయింత్రానికంతా చుట్టుపట్ల పల్లెలకు కూడ తెలిసి ఆశ్చర్యంతో తలమునకలయ్యారు జనమంతా.
 శత్రువు ఆడమనిషి, అందులోనూ యాభైయేళ్ళు దాటిన విధవ, ఒంటరిస్త్రీ.  ఆమె మీద రెడ్డిగారి కుటుంబం ఎట్లా కసిదీర్చుకుంటందా అని చర్చ మొదలైంది రచ్చబండల వద్ద.
   వాస్తవానికి ఆ సమస్య రెడ్డిగారిని కూడా వేధిస్తోంది.

                                            ********

  అప్పటికి నడిరేయి దాటింది.
రెడ్డిగారి యింట్లో సమావేశం పూర్తిగా ఓ కొలిక్కి రాలేదు.
  ఊర్లోని దాయాదుల్ని, శ్రేయేభిలాషుల్ని పిల్చుకొని మంతనాలు చేస్తున్నాడు పెద్దిరెడ్డి.
  పెద్ద కారణం లేకుండానే గ్రామమంతటికీ ఆలయనగా వున్న మనిషిని చంపించిన  నారమ్మ క్షమార్హురాలు కాదు.
  ఆమెను పట్టుకొనిరావాలి
 దారుణంగా శిక్షించాలి.
  ఆమె దాయాదుల్ని వూరు వెళ్ళగొట్టాలి.
  ఇప్పుడామె దండోరుపల్లె లోని పుట్టింట తలదాచుకుంటోంది,  రంగారెడ్డి వర్గపు అండ దండల్లో క్షేమంగా వుంది.  ఆమెను పట్టుకు రావటమంటే రంగారెడ్డి వర్గాన్నింతటినీ కట్టేసుకు రావటమే.
  అతనో మూర్ఖుడు అతన్ని లొంగదీసేసరికి కొన్ని ప్రాణాలు పోకతప్పదు.  దండోరుపల్లె మీద దాడిజేయటం మాదిగిళ్ళపైకి వెళ్ళినంత సులభం కాదు,  ప్రారంభిస్తే అదో యుద్దమే.
  ఆమెను తీసుకు రావటం సంగతి పక్కనుంచితే - యింకో వారానికో, పదిరోజులకో ఆమె దాయాదులు వూర్లోకి రాక తప్పదు.
  వాళ్ళను వూరు విడిపించాలంటే పెద్ద గొడవలకే దిగాలి.  పోలీసుల కేసులవుతాయి,  కోర్టులవుతాయి, జైళ్ళవుతాయి,  జేబుల్లో డబ్బు చాలదు, బ్యాంకుల్లో తెచ్చుకోవలిసిందే.
  ఇప్పుడు మళ్ళీ ఎదుట ప్రధాన సమస్య డబ్బే అయ్యింది.  మామూలు కేసులయితే రెడ్డిగారి కుటుంబం భరించగలదు.
  ’పార్టీల్ని’ మొయ్యాలంటే సాద్యం కానిపని.
  అట్టాగని వూరుకునే దానికిలేదు.
  " ఇప్పుడుగీన మనం సేతగానోల్ల మాదిరి సేతులు ముడుసుకొని కూకుంటే వాల్లకు పట్టపగ్గాలుండవు. ’రెడ్డిని సంపితేనే దిక్కులేనెప్పుడు వూర్లో ఎంతమందిని నరికితే మాత్రం అడ్డమొచ్చే దెవురు  ? ’ అనే కొవ్వు పేరుకొంటది, ఒంటికాలిమీద మనపైకొస్తారు, పొలాలు దున్నుతారు  ఇండ్లల్లో దూరుతారు. మన పెండ్లాల గుడకా పట్టకపోతారు..."  ఆవేశంగా చెప్పాడు రెడ్డిగారి దాయాది వెంకటరెడ్డి అనే యువకుడు.
  చాలా మందికి అదే భావన వుంది.
  అయితే ఏం చేయాలో తోచకుండా వుంది.
  " ఈరోజు రెడ్డిగారు గావొచ్చు.  రేపు మనంగావొచ్చు,  మనమంతా వొకటిగా వుండకుంటే అందరికీ అదేగతి పడ్తది. "  బలరామిరెడ్డి అనే పెద్దాయన అన్నాడు.
  " అయితే మనమిప్పుడు ఏం జెయ్యాల  ?  "  అడిగాడు ఓ మనిషి.
  " పార్టీలు నడపాలంటే ఒక్కరితో అయ్యేపనిగాదు.  అంతలావు బలిసినోల్లు యీ పల్లెల్లో ఎవురూ లేరు.  ఇది వర్గం సమస్య..అందరం తలదూర్చాల్సిందే. ఎకరానికింత చందా రాసుకుందాం, లెక్కంతా ఒకరికాడ నిలవుంచుదాం. ఎవురికేం జరిగినా ఆ లెక్క ఖర్చుపెట్టుదాం. "  చెప్పాడు బలరామిరెడ్డి.
  ఇదేదో సబబుగా వున్నట్లు తోచింది అందరికీ.
  రెతుల్ని పేరుపేరున పిల్చారు.
  ఎకరాల్ని లెక్క గట్టారు.
  పకడ్బందీగా పట్టీ రాశారు.
  ఉదయానికంతా షుమారుగా డబ్బు సమకూరింది.
  పెద్దరెడ్డికి సంతోషంగా వుంది.  దాయాదుల, బంధువుల అభిమానానికి వొళ్ళంతా పులకరించించి.  చందాలివ్వటమంటే ఇచ్చిన వాళ్ళంతా గొడవల్లో తలదూర్చటమే.  తమ బలం పెరిగిపోయినట్టుగా అన్పించింది.  తమ బాధను అందరూ తలకెత్తుకొన్నారు..  తమకు బరువు లేకుండా చేశారు.
  వెంకటరెడ్డిని దగ్గరకు పిల్చాడు పెద్దిరెడ్డి. " ఒరే  ! నువ్వు లెఖ్క జమా చూస్తావుండు  "  చెప్పాడు.
  " అట్లనే పెద్దయ్యా  ! " సమ్మతించాడు వెంకటరెడ్డి.
  వర్గమంతా గట్టిబడింది.
  అవతలి  వర్గంలో ప్రధానమైన వాళ్ళంతా వూరు వొదిలారు గాబట్టి మిగతా వాళ్ళంతా కుక్కిన పేనుల్లా పడివున్నారు.
  రెడ్డోరి అన్నదమ్ములిద్దరూ పార్టీ గొడవల్లో తలమునకలయ్యారు.
ముగ్గు పిండి గని నిర్వహణ అంతా బాలునిపై పడింది.
  అతని మనస్సంతా గ్రామం పైనే వుంది.  అందరితో కలిసి తనూ గొడవల్లో పాలుపంచుకోలేక పోతున్నందుకు చింతగా వుంది.
  ఊరు వదిలిపోయిన నారమ్మ వర్గీయులు తిరిగి వూర్లోకి వచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నారు రెడ్డి గుంపంతా.
   దండోరిపల్లె వైపునించి ఏటికడ్డంగా మనిషి రావటం కన్పిస్తే చాలు ఇవతలి దరిమీద గుమిగుడుతున్నారు.
  తమ యిళ్ళ కోసం, పొలాలకోసం, పైర్లకోసం ఏదొకరోజు దండోరిపల్లె వదిలిరాక తప్పదు.
  అంతదాక తాము ఎదురు చూడాల్సిందే.
  నారమ్మ చిక్కితే ఏం చేయాలనేది ప్రశ్న.
  ఆడది కాబట్టి చంపకూడదని కొందరి పెద్దల సలహ.
  నడుములు విరగ్గొట్టి మంచంలో పడేయాలని మరికొందరి సూచన.
  యాభై ఏళ్ళ వయస్సులో ఆమెకి పాడుబుద్ది ఎందుకు పుట్టిందో ఎవరికీ అర్థం కాలేదు.  కొడుకులు కూడ లేరు ఉన్న ఒక్క కూతుర్ని దండోరుపల్లెలోని చిన్నతమ్మునికిచ్చి పెళ్ళిజేసింది. అప్పుడప్పుడూ కూతురో, మనవళ్ళొ వస్తే తప్ప ఇళ్ళెప్పుడూ వంటరితనంతో మగ్గుతూ వుంటుంది.
   " ఆముండ మొదట్నించీ అంతే.."  చెప్పాడు అరుగుమీద తీరిగ్గా కూచుని బీడిముక్క పీల్చుతూ రామయ్యతాత.  " పుట్టింటి కాడ రొవ్వొంత గోడవయితే సాలు మొగున్ని ఒక్క సిటికంత సేపుగుడకా యింట్లో వుండనీదు. ఏట్లో అడ్డం యీదుకుంటూ అయినా పోవాల్సిందే !  యీ ముండ పోడుబడలేకనే గాదూ - ఎండాకాలం ఏటికికడ్డంగా వొక్కడే దండోరుపల్లెకు పోతాంటే  అవతలి పక్కోల్లు నరికి ఇసుకలో బూడ్సింది.  ఈ దరిద్రపు ముండ మొగునితో పదేండ్లు గుడకా సంసారం జేసిందిలేదు.. మంచి పాయాన్నే ( మంచి ప్రాయంలో,వయసులో)  పోగొట్టుకొన్నెది వాన్ని..  అప్పట్నుంచే పెద్దిరెడ్డోరి కుటుంబమంటే దీనికి సరిపోదు.  "
   " నడమద్య వాల్లేమన్నెరూ  ?  "
  " కేసుల్లో అవతలోల్లకు  సాయం జేస్చాండరనే... దీనిమొగున్ని సంపినోల్లు పోలీసోల్లకు సిక్కగుండా మనూర్లోనే దాపెట్టుకొన్నెరా ! దీని కండ్ల ముందరే తిరుగుతాన్నెరా  ! వాల్లకా  సోటిచ్చింది  పెద్దిరెడ్డోరేగద !  కోపమెందుకు కాదు  ? అయినా అది యీనాటి మాటా ! ఎప్పుడో పాతికేండ్లనాడు జరిగిపోయిన సంగతి . "
  " ఇప్పుడెందుకు మనసల్ను బెట్టి సంపించినట్టూ..? "
  " దేవునికెరుక...."  పైకి చూపిస్తూ అన్నాడు.
  ఎక్కడ నలుగురు మనుషులు కూచున్నా నారమ్మ గురించే చర్చ జరుగుతోంది. ఆమెమీద రెడ్డోరి గుంపు తీసికొనే చర్యగురించే ఊహలు సాగుతున్నాయి.
  ఉదయం ఎనిమిది గంటలు ప్రాంతంలో గొల్లోల్ల  పాములేటి  గొర్లదొడ్డికేసి పోతూ పెద్దరెడ్డి కన్పించేసరికి " రెడ్డి నాయినా  ! " అంటూ దండం పెట్టాడు.
  నాలుగు మాటలు..మాట్లాడిన తర్వాత  " గోడ తకరారు జరిగిన కాన్నించి నారమ్మ అంటా వున్నెదంటనే నాయనా ! ’ రాంరెడ్డి నెత్తుట్లో తనక లాడ్తాంటే సూడాలని వుందెని...మీదాక రాలేదా ఆ మాట ? "  అడిగాడు.
  నొసలు ముడేశాడు పెద్దిరెడ్డి.
  " సెవుల్దెగిన ముండ ఏందేందో కూస్చాంటదని పట్టించుకొన్నెట్టు లేదుకదూ ! "  తనే వివరణ ఇస్తున్నట్లుగా అడిగాడు పాములేటి.
  " గోడ తకరారుకూ మాకూ ఏం సంబంధం రా ? "  పెద్దిరెడ్డి ప్రశ్నించాడు.
  " ఏమో రెడ్డి నాయనా ! ఏందేందో అంటావుంటది ఆతల్లి.  ఆమె దాయాదికి ఎగదోసింది మీరేననీ, మాలోల్లను పంపిచ్చి గోడకట్టిచ్చింది మీరేననీ, ఆమె గోడతావు ( గోడ ఉన్నస్థలం) అవతలొనికి పొయ్యేందుకు సాయం జేసింది మీరేననీ.... ఆ మాటలకేమిలే నాయనా ! బంగారంటి తండ్రిని ఆ ముండ పొట్టన బెట్టుకొనె...."  బాధతో కూడిన గొంతుకతో మెల్లిగా సాగిపోయాడు.
  పెద్దిరెడ్డి ఆలోచనల్లో పడ్డాడు.
  వాస్తవానికి నారమ్మకు సంబంధించిన గోడతకరారులో అవగింజంతయినా ఆసక్తి కనబరచలేదు తాము.
  నారమ్మ యింటికీ ఆమె దాయాది చెంచన్న యింటికీ మద్య నాలుగు బారల ఉమ్మడి ఖాళీస్థలం వుంది.
  లోగడనుంచి ఆ బిడువులో ఇరు కుటుంబాల వాళ్ళు ఎద్దుల్ని, బర్రెల్ని కట్టేసుకొంటూ వుండేవాళ్ళు, నాది నీది అనుకోకుండా అరమరికల్లేని తనంతో ఆ తావును ( స్థలాన్ని) ఉపయేగించుకొనేవారు.
  మగడు పోయింతర్వాత ఎద్దుల్ని అమ్మేసి, సేద్యం ఎగబెట్టి. పొలాన్ని కోరుకో, గుత్తకో ఇచ్చుకొంటోన్నా బర్రెల్ని మాత్రం వుంచుకొంది నారమ్మ.
  నాలుగేళ్ళ క్రితం బర్రెల్ని కాసేందుకు ఏళ్ళ ఏటి జేడెల్లో జారిపడి సడుగు ( కటి ప్రదేశం = నడుము ) నొప్పిపుట్టి నడవలేని పరిస్థితుల్లో బర్రెలతో సహా కూతురు యింటికి చేరింది.  కాలునొప్పి బాగయింతర్వాత ఒక్కటే ఏటికడ్డంగా నడుచుకొంటూ వచ్చిండేగాని తర్వాతెప్పుడూ బర్రెల్ని తోలుకొచ్చేపని చేయలేదు.
  బర్రెలున్నపుడు వాటి పేడ, రొచ్చు ఆమెకేమి అసహ్యాన్ని కలిగించలేదుగానీ, ఇప్పుడు తన దాయాదులు తన స్థలాన్ని కూడ పూర్తిగా ఆక్రమించి రొచ్చు, పేడమయం చేస్తోంటే సహించలేకపోయింది.
  ఒక ఉదయం పూట  బిడువు స్థలానికి మద్యగా గిరిగీసి, గీతకు అవతల కట్టేసుకొమ్మని హుకుం జారీచేసింది.
  ఆమెతో గొడవ పెట్టుకోవటం కంటే ఆమె హుకుం శిరసావహించటమే ఉత్తమమనుకొన్నాడు చెంచన్న.  తనస్థలంలోనే  గూటాలు పాతి పశువుల్ని కట్టేయటం  అలవాటు చేసుకొన్నాడు.
  తమ స్థలంలోనే కట్టేసినప్పటికీ ఇద్దరి మద్యా గొడ లేకపోవటం వలన తలుగు పొడవునా వెనక్కి సర్దుకొన్నపుడు నారమ్మ స్థలంలో రొచ్చు, పేడ వేస్తుండేవి పశువులు.
  తనకు  పశువుల్లేకున్నా యీ అసహ్యం తప్పనందకు మనస్సు నొప్పెట్టుకొంది ఆమె.  అయినప్పటికి  రైతు దనం తెలిసింది కాబట్టి ఓపికబట్టింది.
  అప్పుడప్పుడూ తన స్థలంలో పెట్టిన పేడను చెంచన్న బాధ్యతగా ఎత్తి బాగుచేయటం, మరిచినప్పుడు సాయింత్రం దాక అవి అక్కడే వుండటం. తను అటు ఇటు నడుస్తున్నప్పుడు పొరబాటున తొక్కటం, అసహ్యంగా తిట్టుకొంటూ పేడను ఎత్తి తన దిబ్బలో ( పేడను ఒక చోట పెద్ద గుట్టుగా పేర్చే స్థలాన్ని దిబ్బ అంటారు దానినే ఎరువుగా వాడతారు పొలాల్లో ) వేసికోవటం....... క్రమక్రమంగా తన స్థలంలో పెట్టిన పేడ తనదిగానే భావించే స్థితికి వచ్చి, దిబ్బపెంచుకోవటం అలవాటయ్యింది ఆమెకు.
    బర్రె తన స్థలంలో పేడేస్తే చాలు టక్కున తీసికెళ్ళి దిబ్బలో వేసుకుంటుంది నారమ్మ.  అంతా గమనిస్తూనే వున్నా కొంతకాలం మౌనంగానే వుండిపోయింది చెంచన్న కుటుంబం.
   ఒకరోజు కళ్ళాపి చల్లకొనేందుక్కూడా పేడ లేకపోవటంతో చెంచన్న పెళ్ళాం తిట్లకు తీసుకొంది.
  నారమ్మ ఎదురు తిరిగింది.
  పేడనించి బిడువు స్థలం దాకా తారాస్థాయిలో తిట్లయుద్దం జరిగింది.  చెంచన్న కూడా నోరు చేసుకొన్నాడు.
   మళ్ళీ రోజు సాయింత్రమే దండోరుపల్లెనించి మనుషులొచ్చారు.  చెంచన్నను బెదిరించారు.
  ఇద్దరి మద్య గోడ పెట్టుకొమ్మన్నారు.
  అదిగో...అప్పుడొచ్చింది గోడ తకరారు.
 మూరెడు స్థలం మీద వివాదం రేగింది.
  తన మగడు పెద్దవాడు కాబట్టి ఉన్న స్థలంలో జ్యేష్ట భాగం కింద మూరెడు తావు ( స్థలం ) తమకు ఎక్కువగా పంచారని నారమ్మ అంటుంది.
   సమానమేనంటాడు చెంచన్న.   ఆ లెఖ్క ప్రకారం విభజించి గోడసాలు కూడ తీశాడు, రాళ్ళు మట్టి తోలొపెట్టుకున్నాడు.
  గోడ కట్టటాన్ని అడ్డుకొంది ఆమె
 ఊర్లో వాళ్ళెవరూ జోక్యం చేసుకోవటం లేదు. అది దాయాదుల సమస్య కాబట్టి.  ఇద్దరూ  దండోరుపల్లె వాళ్ళకు సంబంధించినవాళ్ళు కాబట్టి.  పెద్దిరెడ్డి వాళ్ళు కూడ అందులో వేలు పెట్టటం లేదు..ఇద్దరూ తమకు సరిపోనీవాళ్ళే కాబట్టి.
  ఒకసారి పెద్దిరెడ్డి దాయాది వెంకటరెడ్డి గనివద్దనున్న రామిరెడ్డిదగ్గరకొచ్చాడు  "  అన్నా ! వాల్లకు వాల్లకు గొడవబడింది, ఇన్నిరోజులకు మనసేతికి సిక్కినారు మనమిప్పుడు చెంచయ్య కుటుంబానికి ఎగదోస్తే ఎట్లుంటది..? ఇద్దరు కొట్టుకొని సస్తారు కదా !  "  అన్నాడు.
  తల అడ్డంగా వూపాడు రామిరెడ్డి  "  వాల్ల గొడవలు మకెందుకులేరా  ! వాల్లనే తంటాలు పడనీ ! "  అన్నాడు
  " అట్లాగాదన్నా  ! ఇద్దరూ మనము శత్రువులేగదాని "
  " అయినా నేను వాల్ల పంచాయితీలో వేలుబెట్టనురా ! వాల్ల సంగతులు నాకాడ సెప్పగాకు, నా సలహ తీసుకోవాకు. "
ఒక్క నిమిషంసేపు ఆలోచించాడు వెంకటరెడ్డి.  " సరేనా ! మీకెవురికి యిష్టం లేకున్నా నేను మాత్రం యీ అవకాశాన్ని వొదల్ను. చెంచన్నను ఎగదోస్తా ! మీకు నష్టం లేదుగదా ? " అన్నాడు.
  " నీ ఇష్టం ఇందులో మేం వేలు దూర్చం. మాపేరు ఎక్కడా వాడుకొకు. "  చెప్పాడు
  వెంకటరెడ్డి నేరుగా చెంచన్న వద్దకెళ్ళాడు
  తమ వర్గమంతా అతనికి సపోర్ట్ చేస్తుందనీ, గోడపెట్టిస్తామనీ చెప్పాడు.
 చెంచన్నకు ధైర్యమొచ్చింది.
 గోడ పెట్టెందుకు మనుషుల్ని పిల్చుకొన్నాడు.
 వెంకటరెడ్డి ఆలోచించాడు.
  గ్రామంలోని రెడ్లను సపోర్ట్‌గా  పిల్చుకోవటమంటే - పెద్దిరెడ్డిగారే స్వయంగా యీ పని చేయించినట్టు లెఖ్క.
  నేరుగా మాలిండ్లకు వెళ్ళాడు
 ఓ ఇరువైమంది జనాన్ని రమ్మన్నాడు.
  మాల పెద్ద వొప్పుకోలేదు  " మీరు మీరు రెడ్డిగారు, మద్యన మాకు దొబ్బులెస్తాయిలేబ్బా ! ఎందుకొచ్చిన తంటా ? "  అన్నాడు.
  " అన్నావాల్లుండారు కదబ్బీ  ! ఏం ఇబ్బందులొచ్చినా మేమే సూసుకుంటాం గదా ! "   పెద్దిరెడ్డిగారి పేరు వాడుకున్నాడు.
  మాలలంతా కట్టెల కైపుల్తో వచ్చి చెంచన్న యింటి పక్క నిలబడ్డారు
  గోడ కట్టటం మొదలైంది.
 రెడ్డిగారి దాయాదిని, మాలల్ని చూడగానే నారమ్మకు విషయం అర్థమైంది, వెనక పెద్దరెడ్డిగారి వర్గమంతా వుందని తీర్మానించుకొంది.
  రామిరెడ్డి గుంపును ఎదుర్కోవాలంటే సాధ్యమయ్యేపనిగాదు.
 నేరుగా పోలీస్టేషన్‌కు ..వెళ్ళింది.
  వెనకే వెంకటరెడ్డి కూడ వెళ్ళాడు.  రామిరెడ్డి పేరును వాడుకొని సమితి ప్రెసిడెంటు చెన్నారెడ్డి ద్వారా సి.ఐ కి బలంగా చెప్పించాడు.
 ఏవేవో కుంటిసాకులు చెబుతూ బాగా ఆలస్యం చేశాడు సి.ఐ.
  తీరిగా మద్యాహ్నం  రెండుగంటలకు శివపురి చేరుకున్నాడు.
ఆ లోపలే గోడనిర్మాణం పూర్తయి వేట ( పొట్టేలు ని బలి ఇవ్వడం ) కూడా తెగింది.
  పోలీసులు మాంసభోజనం చేసి వెళ్ళారు.
  నారమ్మ ఆక్రోశంతో ఉడికిపోయింది.
  తమపేరు వాడుకొన్న విషయం తర్వాత రామిరెడ్డికి తెలిసి వెంకటరెడ్డిని బాగా మందలించారు.
 ఆ గొడవ అట్లా ముగిసిపోయిందని భావించారుగాని పాములేటి మాటల్ని బట్టి చూస్తే రామిరెడ్డి చావుకు అదే కారణంలా తోస్తోంది.
  దీర్ఘంగా నిట్టూర్చాడు పెద్దిరెడ్డి.
  పావలా విలువ కూడా చేయని పశువుల పేడకోసం, జానెడు కూడా లేని ఖాళీ జాగాకోసం మనుషుల ప్రాణాలు తీసికొనే పరిస్థితి వచ్చింది.
  తమ దాయాది అత్యుత్సాహం వల్లే యీ అరిష్టం.
  ఈ విషయంలో దండోరుపల్లె వాళ్ళ ప్రోత్సాహం ఎక్కువగానే వుండి వుంటుంది.  బహుశ - ముగ్గుపిండి గని వద్దనున్న నారమ్మ పొలాన్ని తాము బేరమాడటం కూడా ఓ కారణమై ఉండొచ్చు.
  గోడ తకరారు వరకు తాము వాళ్ళతో ప్రత్యక్షపోరాటాలేవీ చేయలేదు.  ఆ గొడవలో తాము చెంచన్నకు సపోర్ట్ చేశామనీ, గంటల మీద గోడ పెట్టించామనీ భావించుకొన్న నారమ్మకు గనులవద్దనున్న పోలానికి సంబంధించిన భవిష్యుత్తు కళ్ళముందు కదలాడి వుంటుంది.  ఆ పొలాన్ని తాము చేజిక్కుంచుకొన్నా అడ్డుకొనే శక్తి ఆమెకు లేకపోవటం స్పష్టమయి వుంటుంది.
  ఆ భావనే ఈ కుట్రకు మూలమయి వుంటుంది..
  ఆలోచిస్తూ  వుండిపోయాడు పెద్దిరెడ్డి.
’ ఈ గొడవ మరెక్కడకు దారి తీస్తుందో ? ’

                                                                                            .........సశేషం

                                                                                                        .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

    
        తర్వాత రెండు రోజులకే ఓ చిన్న సమాచారం అందింది.
    రామిరెడ్డి మృతిపట్ల దండోరుపల్లెలోని రంగారెడ్డి వర్గం మహా సంతోష పడుతున్నారట. " పీడ విరగడైంది " అంటూ బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారట.
 అట్లాంటి స్పందనలు సహజమేననుకొన్నాడు ఓబుళరెడ్డి.
  తమగుండా వాళ్ళకు పరోక్షంగా కొంత నష్టమే జరిగివుంటుంది..  గొడవ జరిగినప్పుడంతా సుబ్బారెడ్డి వర్గం తమ ఆశ్రయం పొందుతుంది. కేసులు. కోర్టు వ్యవహారాలకు సంబందించిన సహాయాన్ని అందిస్తుంటారు.  పోలీసు వొత్తిళ్ళు లేకుండా  చూడటం ఆర్థిక సహాయం,  పైకం అందజేయటం... ఇట్లా ఓ వర్గానికి సమస్త సహాయమూ చేయటంతో సహజంగానే మరో వర్గానికి తమ మీద కసి వుండొచ్చు, వ్యతిరేకంగా స్పందించవచ్చు, అదేమి పెద్ద విశేషం కాదనుకొన్నాడు.
  సాయింత్రం పోరుమామిళ్ళ నించి జీపొచ్చింది.
 ఎస్సైతోటి మరో ఇద్దరు పోలీసులు దిగారు.
 " ఏం రెడ్డి  ! కొత్త సంగతులేమైనా వుండాయా..? " ఎస్సై అడిగాడు.
  " మా దగ్గరేముండాయి సారూ  ? మీరు సెప్పుతే మేం వినాల "  పెద్దిరెడ్డి చెప్పాడు.
  " మా పరిదిలో మేం గట్టిగానే ప్రయత్నిస్తుండాము.  పాతనేరస్తులను చాలా మందిని విచారించినాము.  హంతకుల ఆచూకీ చిక్కలేదు " అని చెప్పాడు.  తర్వాత కొంత ముందుకు వంగి లోగొంతుతో " అది సరే !
.. మీ పని ఎంతవరకు వొచ్చుండాది ? " అన్నాడు పెద్దిరెడ్డి కళ్ళల్లోకి చూస్తూ.
  " ఏం పని సారూ ? "
 " అదేనయ్యా మగడా ! మీరు తంటాలు బడేదే.."  కళ్ళెగరేశాడు.  సూచాయగా అర్థమైంది పెద్దిరెడ్డికి.
  " నాకన్నీ  తెలుసు రెడ్డీ !.. వేటకు మల్లుకొన్నెరు..మాటేసి వుండారు...అయితే మీకింకా ఏజీవి దొరకలే..కదూ  ? "
 రెండు చేతులెత్తి సమస్కరించాడు పెద్దిరెడ్డి  " మేమంత మాత్రపు మనుసులం కాదులే సారూ  ! "  అన్నాడు.  "  మావోడే వుండుండేనా  ?.. మేమొకరం పోయి వాడుండివుండేనా  ? నువ్వన్నట్టు వేటాడి వుండే వాడే  " చెప్పాడు.
  పెద్దిరెడ్డి కేసి తదేకంగా చూశాడు ఎస్సై " కనీసం అనుమానితుల పేర్లయినా చెప్పు రెడ్డీ ! మీ సేతులకు మట్టిగాకుండా మేం సూసుకుంటాము " అన్నాడు
 " చెబుతే నమ్మరుగాని ..మేమే తేల్చుకోలేకుండాము సారూ - అంత లావు శత్రువులు మాకెవురుండారా ? అని  "  చెప్పాడు.
  మరో సారి నొక్కి ప్రశ్నించి జీపు వద్దకు నడిచాడు ఎస్సై.  జీపులో కూచుంటూ అప్పుడే అక్కడకొస్తున్న ఓబుళరెడ్డితో చెప్పాడు " మీకు సరిపోనోల్ల పేర్లు జెప్పండి..వాల్లను పట్టుకోంటే అసలు ముద్దాయిలు బైటకొస్తారు.." అంటూ
  ఓబుళరెడ్డి నించి కూడా రాదే సమాధానం
ఎస్సై వెళ్ళిపోయాడు.
 " ఏదొక పేరు చెప్పించుకపోవటం,  వాల్లను తీసప్పోయి లోపలేసి బెదిరించి లెక్క ( డబ్బు ) రాబట్టడం... ఆ గడ్డి దినేందుకే ఈ అగసాట్లన్నీ "  ఓబుళరెడ్డి అన్నాడు.
     రాత్రికి  దండోరిపల్లెనుంచి యిద్దరు వ్యక్తులొచ్చారు.
    వాళ్ళు మోహాల్నిండా ఏదో చెప్పాలని ఆతృత.
   గొంతుల్లో సన్నని తడబాటు.
   " సంపింది  మావూర్నాకొడుకులే  ! నువ్వు నమ్ము, నమ్మకపో ఖాయంగా వాల్లే "  చెప్పాడు ఓ వ్యక్తి.
   ప్రశ్నార్థాకంగా చూశాడు ఓబుళరెడ్డి.
   " ఆ నాకొడుకు..వాడు...రంగారెడ్డి తమ్ముడు నాతోనే అన్నేడు. మీకు శివపురి రాంరెడ్డికి పట్టిన గతే పడ్తాదని.  "
  నొసలు ముడేశాడు ఓబుళరెడ్డి.  " నిజంగా నీతోనేనా  ?  "
  " అవునన్నా  !  నాతోనే .  "  నమ్మకంగా చెప్పాడు.
  " ఏ గొడవల్లేకుండా అంతలావు మాట ఎందుకొచ్చిందీ  ?  "
   చిన్నగా నిట్టూర్చాడు ఆవ్యక్తి.
  "  ఆ మద్య చిన్న తకరారు జరిగిందిలేన్నా  !  కొట్లాడుకొనేంతయ్యింది.  వాల్ల మాసుల్నంతా గుంపు జేసుకొన్నెరు. మాదిగోల్లను గుడకా పిల్చుకొన్నేరు. ఎందుకోమరి వున్నెట్టుండి ఎనకడుగు బేసినారు,  యీ లోపల మన రాంరెడ్డన్న పాయే... వున్నట్టుండి యిప్పుడు మల్లా కాలుదువ్వుతా వుండారు. "
   ఆలోచనల్లో పడ్డాడు ఓబుళరెడ్డి.
  దండోరిపల్లె వాల్ల చేష్టలు విశ్లేషించదగినవిగా  అన్పించింది పెద్దరెడ్డికి కూడా.
   గొడవ పెట్టుకోబోయి  చాలించటం, రామిరెడ్డి పోగానే తమ కుటుంబం విషాదంలో మునిగివున్నా యీ సమయంలో తిరిగి గొడవలు లేవదీయాలనుకోవటం,   రామిరెడ్డి చావును చూపి ప్రత్యర్థుల్ని బెదిరించిటం....అంటే.... ఇప్పుడు శివపురి వాల్ల సహాయం మీకందదని సుబ్బారెడ్డి వర్గాన్ని    హెచ్చరించట... అంటే...?
   " మనవాల్లందర్నీ పిలిపించరా  ! "  తమ్మునికి చెప్పాడు.
  తమకు సంబందించిన ముఖ్యులంతా భోజనాల తర్వాత రెడ్డిగారి ఇంటికి చేరారు. దండోరు పల్లె సుబ్బారెడ్డి కూడ వచ్చాడు.
   వాకిళ్ళేసుకొని  లోపల కూచున్నారు.
  యింటిబైట  అరుగుమీద కూచున్న ఆడవాళ్ళు పరిసరాల్ని గమనిస్తూ కబుర్లు  చెప్పుకొంటున్నారు.
   " మనోన్ని దండోరు పల్లె వాల్లే సంపినట్టుంది. "  చెప్పాడు పెద్దిరెడ్డి
  " రాంరెడ్డిని సంపితే వాల్లకేం లాభం  ? "   ప్రశ్న.
 " మనం సుబ్బారెడ్డి గుంపుకు సాయంజేస్తాండమా  ! సాయమంటే - కేసులున్నెప్పుడు వాల్లకు కూడుబెట్టి మన కల్లాలకాడనో, పొలాలకాడనో దాపెడ్తా వుండాము గదా  ! లాయర్లను మాట్లాడ్తా వుండాము,  పోలీసోల్లకు సెప్పిస్తా వుండాము గదా  ! అది రంగారెడ్డిగానికి నచ్చినట్లు లేదు...అయితే యీ నాయాండ్లు గూడ మర్యాదగా లేరు. "  సుబ్బారెడ్డి కేసి  వేలు చూపుతూ అన్నాడు  " యీ కులబట్టు  నాయాండ్లు గూడా కొన్ని తప్పుల్జేసినారు,  వస్తా వస్తా రంగారెడ్డి గాని గుంపువాల్ల ఇండ్లకాడ మేపుకొన్నె పొట్టేళ్ళను ఒకటినో రెండుంటినో దొంగతనంగా తెచ్చి కోసుకొన్నెరంట.  మామిడి కాయలు రాల్చుకొచ్చినారంట.  మాంచి కోడి పుంజుల్న సంకన బెట్టుకొచ్చినారంట...., మనకు తెల్సుంటే  సెప్పున గొట్టేవాల్లం.. యాడనో  సేలకాడ, సెడ్లకాడ కోసకతినిరి.  ఆ సంగతులన్నీ మాకు తెలిసే చేసినారని వాల్ల నమ్మకం. ఇంకోమాటలో చెప్పాలంటే మేమే సేయించినామని... అందుకే వాల్లంతలావు పనికి తెగించినారు...."  పెద్దిరెడ్డి చెప్పాడు.
   సుబ్బారెడ్డి సిగ్గుతో తలొంచుకొన్నాడు.
"  పొలాల్లో మనుసుల మీద సరిగ్గా గురిజూసి బాంబులేసే నాయాండ్లు ఎవరుండా రబ్బా  ! "  రెడ్డిగారి దాయాది కృష్ణారెడ్డి ప్రశ్న.
  " కాపోల్లెవరూ ( రెడ్ల ను రాయలసీమలో ’కాపులు ’ అని అంటారు ) లేరు మరి "  సుబ్బారెడ్డి చెప్పాడు.  "  అయితే మాదిగోల్లల్లో మాంచి దిట్టలుండారు.  వాల్లంతా రంగారెడ్డి గాడు ఎట్టజెపుతే అట్ల...., వాల్ల సేతనే బాంబులేయించి వుంటారు. "
  నిజమేననిపించింది అందరికీ.
  బాంబులేసిన వాళ్ళెవరో తెలిసిపోయినట్టుగా అన్పిస్తోంది, రామిరెడ్డిని చంపించిన మనుషులెవరో అర్థమవుతూ వుంది.
 అందరి గుండెల్లో సన్నని ఆందోళన, కనిపించని భయం. మునివేళ్ళు కంపించే ఆతృత.
  ఏం చేయాలో నిర్ణయించుకొన్నారు.
  ఎలా చేయాలో కూడా వ్యూహం రచించుకొన్నారు.
  తమ మాలిండ్లకు చెప్పి పంపారు.
  గ్రామస్తులంతా ముప్పైమంది దాకా గుంపయ్యారు - ఈటెలు్,గొరకలు, వేటకొడవళ్ళు సిద్దం చేసికొని.
  ఊరు దాటింతర్వాత ఇరువై మంది మాలలు వచ్చి కలిశారు.
  అప్పటికే రాత్రి మూడు జాములు దాటింది.
  నెలగుంకి నేలంతా చుక్కలు వెలుతురు పరుచుకొని వుంది పల్చగా. ఆకాశం నిర్మలంగా వుంది.
  వాతావరణం చల్లగా వుంది.
  అందరి గుండెల్లో ఏదో ఉత్సాహం, మరేదో అలజడి..
  అడుగులు వడివడిగా పడుతున్నాయి.
  ఏటి జేడల్లో నక్కల ఊళలు.
  అదే పనిగా తీతువు పిట్ట  హెచ్చరికలు.
  ఏట్లో అక్కడక్కడా సన్నని నీటి జాలులు
  ఇసుకలో కాళ్ళు కూరుకుపోతున్న  సరసరమనే శబ్దం తప్ప దండులోంచి మరో సవ్వడి బైటకు రావటం లేదు.
  ఏటి గడ్డల్నించి మొదలైన దట్టమైనా చీకుతుమ్మ కంపచెట్లు.
  వాటి మద్య కాలిబాట వెంట జాగ్రత్తగా నడుస్తున్నారు.
  నేరుగా దండోరుపల్లె పక్కన వున్న మాదిగిళ్ళ మీద కెళ్ళారు.
  నిద్రమత్తు వదిలించుకొని లేచి కుక్కలు గొంతు చించుకొనే లోపలే ఎంచుకొన్న నాలుగిళ్ళను చుట్టుముట్టారు.
  మగవాళ్ళను జుట్టుపట్టుకొని బైటకీడ్చి వీధుల్లో నిల్చోబెట్టారు.
  ఆడవాళ్ళు గోడుగోడుమంటున్నారు.
  ఓబుళరెడ్డి గొంతెత్తి చెప్పాడు  " వీల్ల మీంద మాకు అనుమానమొచ్చింది - బాంబులేసింది వీల్లేనని. నిజంగా తప్పుజేయకుంటే మేమేమీ అనం. మల్లా తీసుకొచ్చి యీడనే యిడ్చిపెట్టిపోతాం "
  అప్పటికే ఒకరిద్దరు మాదిగలు దండోరు పల్లెకేసి పరుగెత్తారు కేకలేసికొంటూ...
  ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టారు కాబట్టి నలుగురు మాదిగల్ని బర బర యీడ్చుకొంటూ ఏరు దాటించి తమవైపు దరికి తీసికెళ్ళారు.
  అక్కడ విచారణ ప్రారంభించారు.
  పెద్ద కష్టపడకుండానే సహకరించారు వాళ్ళు.
  వాళ్ళకు తెలుసు ఇలాంటి విషయాల్లో శిక్ష అంటూ వుంటే అది చిత్రవధేనని.
  రామిరెడ్డి మీద జరిపిన బాంబు దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని వాపోయారు, గతంలో చేసిన కొన్ని అకృత్యాలను ఏకరవు పెట్టటంలో తమ నిజాయితీని నిరూపించుకొంటూ, యీ విషయంలో మాత్రం తాము నిర్దోషలమని నమ్మబలికారు. ప్రమాణాలు కూడా చేశారు.
  " మీరు కాదు సరే  ! వొప్పుకొంటాం... మరి ఎవరు జేసినారీపని  ? "
  " ఏమో రెడ్డోరు ! మేమయితే కాదు. "
  " దొంగకు దొంగ జాడ, ముచ్చుకు ముచ్చు పోకడా తెలియకుంటదా  ? అదేపనిగా తిరుగుతూ వుండేటోల్లు మీకు తెలియకుండా ఎట్లుంటది  ? ఇక్కడ బాంబు పేలినప్పుడే అది ఎవురేసిందీ మీకు అర్థమై వుంటది. "
  " నిజంగా తెల్దు రెడ్డోరు ! " దీనంగా చెప్పారు.
 ఎంత సేపు గుచ్చి గుచ్చి అడిగినా అదే సమాధానం.
  ఓపిక నశించింది ఓబుళరెడ్డికి
 సమాచారం వాళ్ళవద్దనించే రావాలి.
  " సరే ఇప్పుడు మీరు తప్పు జేయలెదు. మరి లోగడ జేసింది మీరే గదా ! వొప్పుకుంటా వుండారుగదా !  వాటికైనా శిక్ష పడాల్సిందే..చెయ్యో కాలో యిరిస్తేగాని మీకు సిగ్గురాదు " అన్నాడు కఠినంగా.
  " రెడ్డోరు  "  లబోదిబోమన్నారు వాళ్ళు.
  " మీరిప్పుడు క్షేమంగా యెట్లా వచ్చిన వాళ్ళు అట్లా యిండ్లకు పోవాలంటే మాయన్న మీద బాంబులేసిన వాల్లెవురో చెప్పాల్సిందే "
  కొంత సేపు మౌనంగా వున్నారు వాళ్ళు.
  తర్వాత  వొకర్నొకరు సైగ చేసికొన్నారు.
  అప్పుడు గొంతు విప్పాడో వ్యక్తి.
  " బాంబులేసిందెవురో మాకు ఖాయంగా తెల్దుగాని రెడ్డోరూ ! ఆరోజు పొద్దుగూకే జామున మైదుకూరు పక్క మిట్టపల్లే మాదిగలు యేటి దరుల్లో తారట్లాడుతూ వుంటే సూసినాం. "
  " వాళ్ళు అట్లాంటోల్లేనా  ? "
   " అదే పనిమీద బతుకుతా వుండారు "
  ఆశ్చర్యంగా వుంది అందరికీ
 ఎక్కడ మిట్టపల్లె  ?  ఎక్కడ శివపురి ?
  వాళ్ళ మాటల్ని విశ్వసించలేకపోయారు.
 విశ్వసించకుండా చేసేదేమి లేదు.
  మరోసారి  తీవ్రంగా హెచ్చరించి మాదిగల్ని వదిలారు.
సమస్య కొత్త మలుపు తిరిగింది.
  మిట్ట పల్లెలో ఎంక్వయిరీ చేయాలంటే ప్రతాపరెడ్డి వద్దకేళ్ళాల్సిందే.  ఆ ఫిర్కాకంతటికీ మకుటం లేని మహారాజు అతను.
 మళ్ళీ రోజు ఉదయమే బద్వేలు వెళ్ళాడు ఓబుళరెడ్డి. సమితి ప్రెసిడెంటు చెన్నారెడ్డిని కలిశాడు.
  అతన్ని వెంటేసుకొని సాయింత్రానికి ప్రతాపరెడ్డి వూరు చేరాడు.
 చెన్నారెడ్డిని చూడగానే ఘనంగా స్వాగతించాడు ప్రతాపరెడ్డి. అప్పటికప్పుడు కోళ్ళకోసి విందు ఏర్పాటు చేశాడు.
ప్రతాపరెడ్డి సామ్రాజ్యం ఆశ్చర్యాన్ని కలిగించింది ఓబుళరెడ్డికి, వచ్చిన జనాలంతా అతనికి వొంగి వొంగి దండాలు పెట్టేవాళ్ళే. కనుసన్నలనే సుగ్రీవాఙ్ఞలుగా శిరసావహించే వాళ్ళే.
 విషయం వింటూనే మాదిగిళ్ళకు కబురంపాడు రెడ్డి.
 తాంబూలం నమిలే లోపలే వొంగి వొంగి దండాలు పెడుతూ మిట్టపల్లె మాదిగ వ్యక్తి వచ్చాడు.
  " ఏంరా నారిగా ! అందరూ యిండ్లల్లోనే వుండారా  ? "  అడిగాడు ప్రతాపరెడ్డి.
  " వుండారు సోమీ  ! "
  " దసరా పండగ రోజు ఎవురన్నా పోరమామిళ్ళ యిలాకాకు పోయెచ్చినారా ? "
  " పొద్దుటూరు పోయినట్టుండారు సోమీ ! "
  " ప్రొద్దుటూరు గాదు,  పోరుమామిళ్ళ యిలాకాలో శివపురమనే వూరింది.  దసరా పండగ రోజు ఆ వూరికి పోయినోల్లెవురో నాకిప్పుడు తెలియాల, పండగ సూసేందుగ్గాడు వాల్లుబోయింది.  పని.. ..పనిమీద పోయినారంట.."  కొంత కటువుగా చెప్పాడు.  ’పని ’ అనే పదాన్ని వొత్తి పలుకుతూ.
  వెంటనే వెనుదిరిగాడు మాదిగ నారప్ప.
  పరుగులాంటి నడకతో వూరు దాటాడు.
 అర్థగంట సమయం కూడ గడవక ముందే తిరిగి వచ్చాడు.  " పోయినారంట సోమీ ! నలుగురు మాసులు పోయినారు పన్నెండువేల వొప్పందమంట. పనయిపించుకొని వొచ్చినారు. "  నలుగురి పేర్లు చెప్పాడు.
  వింటూవున్న ఓబుళరెడ్డికి ఆవేశం తన్నుకొస్తూ వుంది, ముక్కుపుటాల్లోంచి శ్వాస తీవ్రతరమైంది.  నొసలు ముడేసి నారప్ప కేసి తదేకంగా చూశాడు ప్రతాపరెడ్డి  "  పోకముందు నాకు చెప్పలేదు. వచ్చినాక కూడా మాట్లాడలేదు, అంటే..మొగోల్లయినారనే మాట..సరే సరే..మన సంగతి తర్వాత మాట్లాడుకుందాము గాని... "  అంటూ చెన్నారెడ్డి వైపు తిరిగి " అదీ సంగతి ..." అన్నట్లుగా తల ఎగరేశాడు.
  " ఆ మాసులెవురో మాకప్పగించు వాల్లతో వొప్పందం సేసుకున్నేదెవురో కనుక్కోవాల. " చెప్పాడు చెన్నారెడ్డి.
  " రవ్వంత ఓపికబట్టు. "  అంటూ ప్రతాపరెడ్డి లేచి మిట్టపల్లె మాదిగ నారప్ప వెంట కదిలాడు.
  మంచాల మీద పడుకున్నారు చెన్నారెడ్డి, ఓబుళరెడ్డిలు.
  ఓబుళరెడ్డికి టెన్షన్‌గా వుంది.
  చెన్నారెడ్డి మాటలకు వూకొడుతున్నాడేగాని మనస్సంతా ప్రతాపరెడ్డి తెచ్చే సమాచారం మీదనే వుంది.
శత్రువెవరో తెలిసిపోయే క్షణాలు దగ్గరపడుతున్నాయి. కిరాయి తీసుకొని హత్యలు చేయటం మిట్టపల్లె మాదిగలకు వృత్తివిద్యతో సమానమట. పల్లెనించి పట్నం దాకా ఎన్నో వొప్పందాలు చేసికొని నిర్వర్తించారట.
  ప్రతాపరెడ్డి మాటల్ని చూస్తే వాళ్ళ పాపంలో ఇతనికి కూడా భాగమున్నట్లుంది. వాళ్ళను పోలీసుల్నించీ, నాయకుల నుంచీ ఇతనే రక్షించి పోషిస్తోన్నట్లుంది.
  ప్రతాపరెడ్డి వచ్చేసరికి గంటయింది.
  దండోరిపల్లె మాదిగలు మిట్టపల్లే వాళ్ళకు చుట్టాలట, వాళ్ళద్వార యీ వొప్పందం కుదిరిందట.
  ఒప్పందం చేసికొన్న మనిషి పేరు విని అదిరిపడ్డాడు ఓబుళరెడ్డి. ఐదునిమిషాల దాకా అతని నోటినుంచి మాటే రాలేదు. కొయ్యబారినట్లు నిల్చుండిపోయాడు.
  రాత్రే ప్రయాణమై వద్దామనుకున్నాడు గాని, చెన్నారెడ్డి ససేమిరా అనటంతో అక్కడే నిద్ర చేయవలసి వచ్చింది.
  తన అన్నమీద బాంబింగ జరిపిన వ్యక్తుల్ని అప్పగించమని ఓబుళరెడ్డి అడిగాడుగాని,  ప్రతాపరెడ్డి నవ్వి తిరస్కరించాడు.
  " వాల్లు కూలినాకొడుకులు పోన్నా  ! మంచి సెడ్డా ఏం లేదు, మనోడు తనోడు అనేది లేదు. లెక్కిస్తే సాలు - నామీందయనా బాంబులేస్తారు ఈ నాకొడుకులు,  వాల్లదేముంది పోండి.."  అంటూ సాగనంపాడు.
 వాళ్ళను అన్ని విధాలుగా రక్షిస్తున్నట్లుంది అతను..
అంటే వాళ్ళ సంపాదనలో కూడ  అతనికి వాటా వున్నట్లే..!!
తెల్లార్లూ ఆలోచనలలోనే గడిచిఫొయింది ఓబుళరెడ్డికి.
  ఉదయమే లేచి ప్రయాణమై చెన్నారెడ్డిని బద్వేలులో వదిలేసి పదిగంటలకంతా శివపురి చేరుకున్నాడు. 

                                                                                ............సశేషం.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers