హిమాచల్ ప్రదేశ్‌లోని "కసోల్" అనే గ్రామానికి కొద్దిదూరంలో ఈ సర్పాస్ పర్వతం వున్నది.  చాన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న ఈ ట్రెక్ కోసం ప్రతి సారి ఏదో ఒక ఆటంకం..ఈ సంవత్సరం అలా కాకూడదని ప్రయత్నించాను, అప్పటికే అన్ని స్లాట్స్ ఖాళీ లేకుండా ఫిలప్ అయిపోయినా... మద్యలోఒకరు ఒక స్లాట్‌ని క్యాన్సిల్ చేసుకొవడం వలన..ఆ స్లాట్‌ని నేను బుక్ చేసుకొని ట్రెక్‌కి సిద్దమయ్యాను ....!  www.yhaindia.org వారు ఈ ట్రెక్స్ అతి తక్కువ ధరకు నిర్వహిస్తున్నారు.  అనుకొన్న సమయానికి మే నెల 19 వ తేది మద్యాహనంకల్లా డిల్లీ చేసుకొన్నాను. హైదరాబాద్ కంటే  ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి డిల్లీలో..ఒకటే చెమటలు...!  పక్క రాష్ట్రాలకు ప్రయాణించడాని కోసం ఒక ప్రత్యేకమైన బస్‌స్టాండ్ "కాశ్మీరీ గేట్" చేరుకొని..రిజేర్వేషన్ కౌంటర్ క్యూలో నించున్నాను..ఇంతలో నా పక్క నుండి పిలుపు "ఎక్స్‌క్యూజ్ మీ" అంటూ..! తల తిప్పి చూస్తే ఓ 27 ఏళ్ళ యువకుడు "మీరు yha వారి ట్రెక్కింగ్‌కి వెళ్తున్నారా "  ఆంగ్లంలో ప్రశ్నించాడు. అవునంటు తలూపాను.."నేను కూడ అక్కడికే" అంటు పరిచయాలు అయ్యాక....తీరా చూస్తే అతను హైదరాబాద్ నుండి నాలాగే వస్తున్న తెలుగువాడే.... తర్వాత  మా సంబాషణ తెలుగులొకి మారింది. ఆ రోజు సాయింత్రం 8 గంటలకు మొదలయిన మా ప్రయాణం మరసటిరోజు 8:30  వరకు సాగింది. బుంతర్ నే ఒక పట్టణనంలో దిగి..అక్కడ నుండి  మరో బస్సును అందుకొని కసోల్ గ్రామానికి ప్రయాణం మొదలు పెట్టాము. డిల్లీ వాతావరణాకి..ఇక్కడి హిమాచల శీతల వాతావరణానికి..చాలా తేడా కనపడుతున్నది..కేవలం ఎనిమిదిగంటల్లోనే ఈ అనుభవం శరీరానికి..ఉత్సాహాన్ని కలిగిస్తున్నది....! హైదారాబాద్‌కి ఫోన్ చేసి వాతావరణ విషయం విచారిస్తే..అక్కడ 45 డిగ్రీస్ ఉన్నట్లు చెప్పారు..వావ్..ఎంతలొ ఎంత మార్పు..అనుకొన్నాను.


   మా ప్రయాణమంతా పర్వతాల మీదుగా ఘాట్ రోడ్‌లో సాగుతున్నది..అక్కడ రెండు పెద్ద పర్వతాల మద్యన పార్వతీ నది ప్రవహిస్తున్నది..!  పేరు కూడ పార్వతీ వ్యాలీనే అని పిలుస్తున్నారు..! చాలా ఇరుకైన రహదారి అది..ఒక బస్సు మాత్రమే పట్టేంత రహదారి అది..ఎదురుగ మరో బస్సు ఎదురైతే మాత్రం అతి కష్టం మీద క్రాస్ అయి వెళ్తున్నాయి ఆ సమయంలో రోడ్ వారగా చూస్తే గుండె దడ ఖాయం..! లోయలో వున్న నదిలోకి పడిపోతామా అన్నట్లుగా రోడ్‌కి చాలా వారగా బస్సు టైర్స్ ఉంటాయి..! పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వాళ్లు కాబట్టి వారికేమి భయం అనిపించట్లేదు..వారి జీవనమే అలా ఉన్నది..ప్రమాదపు అంచుల్లో జీవిస్తున్నారు.. వారు. ఎంత ప్రశాంతంగా వున్నారురా బాబు అనుకొన్నాను ! ఆ నదికి ఇరువైపుల ఉన్న పర్వతాల మీద ఏటవాలుగా జన నివాసాలు ఏర్పర్చుకొన్నారు అక్కడి ప్రజలు..వాటికి ఎక్కడా తిన్నగా రహదారులు లేవు...అన్నిటికి ఏటవాలుగా ఎక్కి ఇల్లకు చేరుకోవాల్సిందే..! మైదాన ప్రాంతాల నుండి వచ్చిన నాలాంటి వారికి అవన్ని కొత్తగానె కనపడుతున్నాయి..అలానే ఈ బస్సు ప్రయాణం కూడ దడ పుట్టిస్తున్నది.. ! ఒక గంటకు "కసోల్" బేస్ క్యాంప్‌కి చేరుకొన్నాం.

     రిపోర్టింగ్ అయ్యాక 8 మంది మనుషులకో టెంట్‌ని కేటాయించారు, నాతో ఉన్న హైదరాబాద్ మిత్రుడు హరి తప్ప మిగతా వారందరు రకరకాలైన రాష్ట్రాలనుండి వచ్చిన వారే..! ఎక్కువగా మా టెంటులో యూత్ వున్నారు..బిట్స్ ఫిలాని నుండి ఓ నలుగురు, బెంగళూర్, చెన్నై నుండి మరో ఇద్దరు..సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్.  బేస్ క్యాంప్ మొత్తం రెండు మూడు ఎకరాల్లో పార్వతి నది వొడ్డున ఉన్నది..మగాళ్ళకు, స్త్రీలకు ప్రత్యేకమైన గూడారాలు ఏర్పాటు చేసారు, మద్యలో చిన్న పాటి ప్లే గ్రౌండ్ లాగ తయారు చేసారు. మొదటి రోజు కేవలం ట్రెక్‌కి సంబందించిన విషయాలు చెప్పడానికి పెద్ద కాన్ఫ్‌రెన్స్ లాంటిది ఏర్పాటు చేసారు..! ప్రతి బ్యాచ్‌కో కోడ్ వున్నది... పేరు సర్పాస్ ట్రెక్ కాబట్టి SP అని పేరు పెట్టి ..ఇక బ్యాచ్ నంబర్ 20  కావడంతో SP20 అని పేరు పెట్టారు..అయితే ప్రతి బ్యాచ్‌లోను..30 నుండి 35 వరకు మాత్రమే సభ్యులుంటారు..కాని మా బ్యాచ్ లో చాలా మంది సబ్యులయ్యారు దాదాపుగా 59 మంది వున్నారు..! మాబ్యాచే ఆ ట్రెక్ కంత కలసి పెద్ద బ్యాచ్. అందరం భారదేశ నలమూలలనుండి వచ్చిన వారమే..! వారిలో తల్లీ కూతుల్లు..తండ్రి కొడుకు, తండ్రి కూతురు, కూతురు ఫ్రెండ్స్. భార్య భర్త..! పదహారు సంవత్సరాల వయసు నుండి 60 ఏళ్ళున్న రిటైర్డ్ వ్యక్తులు కూడ ఈ ట్రెక్కింగ్‌కి వచ్చారు..వయసుతో నిమిత్తం లేకుండా..! ట్రెక్కింగ్ చేయడానికి  వయసుతో సంబందం లేదు దానికి కావలసింది..మానసికంగా దృడంగా ఉండటం మాత్రమే ముఖ్యం.  రెండవ రోజు YHA వారి బ్యాక్‌ప్యాక్స్ ఇచ్చి ట్రైనింగ్ అంటూ మూడు కిలో మీటర్ల్ ట్రెక్కింగ్ చేయించారు. అక్కడన్నీ మిలటరీ రూల్స్..పొద్దున్నే 5 గంటలకు లేవాలి ఒక కిలోమీటర్ మేర నడక తర్వాత ఒక చోట వ్యాయామం చేయిస్తారు..! ఉపపలహారం తర్వాత ట్రెక్కింగ్ ట్రైనింగ్.. మూడవ రోజు రోప్‌తో రాక్ దిగడం..తర్వాత రాక్ క్లైంబింగ్..వీటికన్నిటికి శిక్షణ ఇస్తారు. భోజనం...ఉప పలహారం విషయాలలొ ఎక్కడా రాజీ ఉండదు..చాలా చాలా మంచి పుష్టికరమైన ఆహారమే అందిస్తున్నారు. ఇది మెచ్చుకోతగ్గ విషయం.

 మూడవ రోజునుండి మా ట్రెక్ మొదలవుతుంది..అందరు తమ తమ లగేజీని ఎంత వరకు తెచ్చుకోవాలొ ట్రెక్ నిర్వాహకులు వివరిస్తున్నారు. పది..పదిహేను కిలోల మించని బరువును తెచ్చుకోవడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ మనం కమలయ్యలం ( సీతయ్య టైపులొ ) కదా..ఏకంగా 25 నుండి 30 కిలోల మద్యన నా లగేజి బరువు వున్నది. ట్రెక్ నిర్వాహుకులు అబ్యంతరం చెప్పారు..మనం వింటేగా..! కాని తర్వాత ట్రెక్కింగ్‌లో తీరింది..దూల..హ..హ..హ..హ..! శరీరంలొ ఉన్న లవణాలన్నీ కారి... కరిగిపోయాయి..!! మొదటి రోజు ట్రెక్ కసోల్ బేస్ క్యాంప్ నుండి బస్సులో ఒక గంట ప్రయాణించాక..అతి సాదారణమైన రహదారి వెంబడి ఐదు గంటల నడక,  దారి మద్యలోనే..మద్యాహ్న భోజన విరామ సమయం..తర్వాత భూమికి 7800 అడుగుల ఎత్తున వున్న KANGHANI  THATCH అనే ప్రాంతానికి చేరుకొన్నాము. ఆ రాత్రికి మ బస అక్కడే... అప్పటికే ఉన్న గూడారాలలో ఏర్పాటు చేయబడివున్నాయి..! ఓ అరగంట విశ్రాంతి తీసుకొన్నాక మా గూడారంలొ ఉన్న బిట్స్ గోవా ఇంజనీరింగ్ విధ్యార్థులతో కలసి కెమెరా చేతపట్టుకొని చుట్టు వున్న కొండలను ఎక్కడాని బయలదేరాను. మా బ్యాచ్‌లో వాళ్లు మళ్ళీ ట్రెక్కింగా..అంటు మా వైపు వింతగా చూసారు

   ఎక్కడో చాలా పైనున్న మంచు పర్వంతం నుండి వొస్తున్న ఒక చిన్నపాటి పాయలాంటి కాలువ వద్దకు చేరుకొన్నాం.  అంతక మునుపు మాటల సందర్భంలో పెద్ద పుడింగిలా పందెం కాసాను..! పారుతున్న ఆ నదిలో ఐదునిమిషాల సేపు కాళ్ళుంచుతాను అని.. ! కాలువ వద్దకు చేరుకొన్నాక మొదట షలబ్ అన్న ఇంజనీరింగ్ విద్యార్థి ఆ చల్లటి నీళ్ళల్లోకి దిగాడు..నా వద్దున్న స్టాప్ వాచ్‌తో సమయాన్ని కొలుస్తున్నాను..ఒక 30 సెకన్స్‌కి అతని మొహంలో భావాలు మారుతున్నాయి..పంటిని బిగపట్టి అలానే నించున్నాడు..అతని అవస్థ చూశాక నాకు..కాస్త జంకు కలిగిందనుకోండి..కాని పందేం కాసాను కదా తప్పదు..! అతను ని||1:30 సెకన్స్‌కి బయటకొచ్చాడు..! ఇక నా వంతు..  నదిమద్యలో ఉన్న ఒక పెద్ద బండరాయి మీద కూర్చొని నా రెండు పాదాలు నీటీలోకి వదిలి మోకాళ్ళ వరకు ఉంచాను.. ఒక పది సెకన్స్‌కే కాళ్ళు చల్లబడ్డాయి..తర్వాత మెల్లమెల్లిగా ఎముకలకు పాకింది ఆ చలి.. నావల్ల కావట్లేదు..అయినా బలవంతంగా... మొండిగా అలానే ఉన్నాను.. ఆ చలి.. కాస్త ఎముకల నుండి శరీరమంతా పాకుతున్నది..గుండెకు చేరింది..సమయం చూస్తే ఇంకా ఒక నిమిషం కూడా కాలేదు..నాకేమో ఐదు నిమిషాలు ఇంకా గడవలేదా అనిపిస్తున్నది..అంతలా ఆ చలి చంపేస్తున్నది. తలకు చేరేట్టుగా ఉన్నది ఆ చలితాకిడి..ఒక నిమిషం అవ్వగానే నా వల్ల కాక వెంటనే నా పాదాలు లాగేసుకొన్నాను..నీటిలో నుండి..! బయటకొచ్చాక పాదాలమీద నిలబడలేకపోయా....వెంటనే పక్కన గడ్డిమీద కూలబడ్డాను..! ఒక పది నిమిషాలకు గాని ఆ చలి తాకిడి తగ్గలేదు నా శరీరం నుండి..అమ్మో అనుకొన్నా..! చాలా మంది ప్రయత్నించారు చూద్దం ఎంత వరకు ఉండచ్చో అని..కాని ఒకే.. ఒకతను..దాదాపుగ పది నిమిషాల పాటు అలానే నీటిలో ఉండగలిగాడు..నిజంగా ఆశ్చర్యం వేసింది.. ఇంకాసేపు ఉంటానన్నాడు కాని..అదంత మంచిది కాదు..చాలా ప్రమాదకరం అని తెలిసి..మేమే అతన్ని వారించి..బయటకు రప్పించాం.! నాకు తెలిసి..ఆ నీటి టెంపరేచర్..దగ్గరగ్గర 5 నుండి 3 డిగ్రీల వరకు ఉండవచ్చు..!

    రెండవ రోజు ఉదయమే అన్ని కార్యక్రమాలు ముగించుకొని.. టిఫెన్ చేశాక..మద్యాహ్నానికి కావాలసిన లంచ్ ప్యాక్(సద్ది మూటే) అక్కడే కట్టుకొని ఉదయం 8:30 కు మా ట్రెక్ మొదలు పెట్టాము.. ఒక కిలోమీటర్ మామూలు రహదారి వెంబడి నడిచాక..ఒక చోట నుండి..పైకి ఎక్కాలి..! అక్కడికి చేరుకొన్నాక చూస్తే అందరు ఒక్కసారిగా భారీ నిట్టూర్పు విడిచారు.! 100 అడుగుల భారి ఎత్తైన దేవదారు చెట్లు మద్యన దాదాపుగా  ’70-80”  డిగ్రీస్ ఏటవాలుగా ఉన్న కొండ మీద ట్రెక్ చేయాలి..నాతొ ఉన్న హైదరాబాద్ ఫ్రెండ్ హరి ప్రసాద్ నా వైపు చూసి. ." మీ పరిస్థితి ఒక సారి ఆలోచించండి..మాకంటే బరువైన లగేజి ఉన్న బ్యాక్‌ప్యాక్ మీది.. ఎలాగండి..ఎక్కగలరా " సందేహం వెలిబుచ్చాడు. నాకు లోపల నిజమే అనిపించినా..ధైర్యంగా "ఊ" అంటు తల ఊపి ఎక్కడం మెదలుపెట్టాను..! విచిత్రమేమిటంటే..ఎక్కకముందు ఆ ఏటువాలు తనం చూడగానే అనిపించినంత కష్టం.. ట్రెక్క్ చేస్తున్న సమయంలో అనిపించలేదు.  అందరి కంటే ముందు వెళ్ళనారంభించాను..! ఆయాసం వొస్తున్నది..ఒక పక్క చెమట..ఎత్తైన చెట్ల మద్యన ట్రెక్ కావడంతో గాలి లేదు....అయినా మొడిగా ట్రెక్ చేస్తున్నాను ! ముఖ్యంగా అమ్మాయిలు..పెళ్లయిన స్త్రీల పరిస్థితి కాస్త కష్టంగానే ఉన్నది.. ఏటవాలుగా ట్రెక్ చేయడం..! అందులొ వున్న ఓ ముగ్గురు పెళ్ళయిన స్త్రీలకు ట్రెక్ అలవాటున్నట్లున్నది..వారు మాత్రమే కాస్త సునాసయంగా ఎక్కగలగుతున్నారు. మా ట్రెక్‌లో కర్నాటకకు చెందిన రెండు కొత్తగా పెళ్ళైన జంటలు..ఒకటె ఉరుకులు పరుగులు ..! కొత్తగా పెళ్ళైన వారు కదా అంతా కొత్తే ..అందులోను కొత్త ప్రదేశాలు..మరిక వయసు మరింత కొత్తదనం కోసం ఉరకలు వేయదా..?? మద్యాహ్నానికి లంచ్‌కు ఒక అనువైన ప్రాంతం వద్ద చేరుకొని..అక్కడ మేము తెచ్చుకొన్న లంచ్ ప్యాక్ ఖాలీ చేసాము. అయితే ప్రతి లంచ్ స్థలాల వద్ద కేవలం ట్రెక్కర్స్ కోసం మోబైల్ క్యాంటిన్స్ ఉంటున్నాయి, అక్కడి ప్రాంతపు మనుషులు అవి ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మ్యాగి, ఆమ్లేట్, టీ, కాఫీ, కాస్త ఎక్కువ ధరకు అందిస్తున్నారు. రెండవ రోజు సాయింత్రం 4 గంటలకు 9100 అడుగుల ఎత్తు వద్ద వున్న "KHORDU  THATCH" వద్ద మా ట్రెక్ ముగిసింది. సాయింత్రం..అందరు ఎవరికిచ్చిన వారి గూడారాలలో దూరేసి..మాటలు...మంతనాలు..! ఒక్కొక్కరిది ఒక్కోరకపు ప్రాంతం..జీవనం..ఆటలు..కేరింతలు..అంతాక్షిరులు..అమ్మాయిలయితే చెప్పనవసరం లేదు.ఒకటే గోల..! ఇక నేను..మరోక వ్యక్తి.. జె.పి.రెడ్డి అనే అతను కలసి కెమెరాస్ మెడలొ వేసుకొని చుట్టు వున్న కొండల్లోకి వెళ్ళిపోయేవారం..ఫోటోస్ కొరకు. జయప్రకాష్ రెడ్డి అని ఇతను చిత్తూరు నివాసి..హైదరాబాద్ JNTU ఫోటొగ్రఫీ డిప్లమా చేసాక "నాసిక్‌"లోని కేంద్ర ప్రభుత్వ కరెన్సీ ప్రింటింగ్ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఈ ట్రెక్కింగ్‌లొ కలసాక తెలిసింది ఇతను తెలుగు వ్యక్తి అని. రాత్రి అయ్యే కొద్ది చలి పెరుగుతుంది..కాబట్టి రాత్రి 7 గంటలకే డిన్నర్ ముగిస్తారు. మామూలుగా మన ధైనందిన కార్యక్రమంలో అంత తొందరగా భోజనం చేయం కాని..ఇక్కడ చలి పెరుగుతుంది..దాని దాటికి నిలబడటం కష్టం.  రొజులానే YHA వారిచ్చే రగ్గు, స్లీపింగ్ బ్యాగ్ తెచ్చుకొని.. అందులొకి దూరి..వెచ్చగా నిద్రలోకి జారుకొన్నాం..!!

 
   మూడవ రోజు ఉదయం మళ్ళీ 8:30 నిమిషాలకు మొదలు మా ట్రెక్..! ఒక కిలోమీటర్ వరకు ఏటవాలుగా  ఉన్నా పెద్దగా కష్టం అనిపించలేదు గాని.. తర్వతర్వాత రాను రాను.. 90 డిగ్రీస్ కు దగ్గరగ ఉన్న ఏటూవాలు ఉన్న పర్వతం ఎక్కడం చాలా చాలా..ప్రమాదకరం అనిపించింది..! ఎక్కుతున్న వారికి కిందకు చూస్తే మాత్రం.."గుండె జల్లుమన్నదే"...!  పాపం సిటీ అమ్మాయిల పరిస్థితి చాలా కష్టంగా ఉన్నది..బర్గర్స్..పిజ్జాలాంటి జంక్ ఫుడ్ తిన్న శరీరాలు.. వారి వల్ల కావట్లేదు..కామత్ హోటల్స్‌కి చెందిన సౌమ్య కామత్ అనే అమ్మాయి ఏకంగా "ట్రెక్ అంటే ఏదో లే జాలీగా ఉంటుంది అనుకొన్నాను..అమ్మో ఇంత కష్టమా..ఇక జీవితంలొ ట్రెక్ చేయను"  ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. మొత్తానికి..ఎలాగోలాగ..సాయింత్రానికి 10,500 అడుగుల ఎత్తున ఉన్న  "ZIRM"  ప్రాంతానికి చేరుకొన్నాం. అక్కడ మా గూడారాలు ఒక ఏట వాలుగా ఉన్న కొండ మీద ఏర్పాటు చేయబడి వున్నాయి..అక్కడ నుండి చూస్తే దూరంగా చుట్టు ఎత్తైన మంచు పర్వతాలు కనపడుతున్నాయి. మా గూడారం లోపల నుండి తల ఎత్తి బయటకు చూస్తే ఎదురుగా తెల్లగా వెండి కొండలే.. వాటి పైనా ముదురు రంగులో నీలాకాశం.. అందులో తెల్లగా చిన్న చిన్న.. వెన్న ముద్దల్లా తేలియాడుతున్న మేఘాలు..! మాగూడారంలొని ఫ్రెండ్స్‌తో కలసి..వేడి వేడిగా సూప్ తెచ్చుకొని..గూడారం వాకిలు వైపున అరగులాంటి అంచున కూర్చొని మెల్లిగా సిప్ చేస్తూ ఆ చల్లటి వాతావరణాన్ని..అనుభవిస్తుంటే.....హ్మ్.... మాటల్లొ వర్ణించ లేను.............!! తర్వాత కెమెరా మెడలొ వేసుకొని  చుట్టు వున్న కొండల వైపు మెల్లగా నడక మొదలు పెట్టాను.....!

   నాలుగవ రోజు ట్రెక్... మద్యాహ్నం వరకు చిన్న పాటి..ఏటవాలుగా అక్కడక్కడ మంచు వున్న చోట ట్రెక్ చేసాం..! కాని ఉన్నట్లుండి..వాతావరణంలో మార్పు చోటు చేసుకొంది..ఈ విషయాలు మాకు మొదటి రోజే నిర్వాహుకులు చెప్పారు..కాబట్టి రేయిన్ కోట్స్  దరించాం..కాసేపటికే.. వడగల్ల వాన మొదలయ్యింది. నిజం చెప్పాలంటే..మా మామీదుగా తెలుపు బూడిరమ్గు కలగలిపిన మేఘాలు వెళ్తున్నాయి..ఇక నీటి చుక్కల వర్షం ఎలా కురుస్తుంది..అంతా వడగల్లే...పెద్ద పెద్ద వడగల్లు తెల్లగా..తల పగిలిపోయేంతగా కురుస్తున్నాయ్..! మద్యాహ్నన భోజన సమయానకి కూడ ఆగలేదు..అలానే   "వడగల్ల భోజనం " కానిచ్చాను నేను..మరికొంత మంది ట్రెక్కర్స్..మిగతా అందరూ లంచ్ కోసం ఏర్పాటు చేసిన గూడారాల్లోకి వెళ్ళారు. రేయిన్ కోట్ ధరించాక ఇక తడవడం అంటూ ఏమున్నది..తింటున్న ప్లేట్లో వడగల్లు పడుతున్నా... వాటితో సహా వడగళ్ళ భోజనం లాగించాను నేను....! ఇక అక్కడ నుండి ట్రెక్కింగ్ చాలా వరకు ప్రమాదంతో కూడుకొన్నదే..ఒక పక్కన వడగళ్ల వాన..మరో పక్కన మంచుతోకూడిన నేల..జారితే అంతే..మన ప్రేతాత్మ హాయిగా మంచుకొండల్లోనే పర్మనెంట్‌గా తిరగాడుతూ వుంటుంది..!! కొన్ని చోట్ల చాలా కష్టమైన రహదారి..అంతా ఏటువాలుగా ఉండి..మొత్తం మంచుతొ కప్పబడి ఉన్నది..మాతొ ఉన్న గైడ్స్ మాత్రం ఆ మంచు నేల మీద స్కేటింగ్ చేస్తున్నారు..ఎక్కడ కావలంటే అక్కడ ఆగ గలుగుతున్నారు అంతగా వారిలొ నియంత్రణా శక్తి ఉన్నది..మరి మాకు అలవాటులేని పని. స్కేటింగ్..అంటే....అంతే...ఎవరికీ కనపడకుండా..పోతాం..!! ఒక పక్కన వడగళ్ళ వాన వలన మంచు లేని చోట  నేలంతా చిత్తడి చిత్తడిగా ఉన్నది..అక్కడ మరీ ప్రమాదంగా ఉన్నది..జారుడు..! ఏమ్ చేస్తాం..వచ్చాక తప్పుతుందా..మొండి ధైర్యంతో ముందుకు సాగడమే..భయపడితే అంతే అక్కడే ఆగిపోతాం..మన కోసం ఎవరు ఆగరు..ఎవరి దారి వారిదే..!! ఇది జీవితానికి కూడ అన్వయించుకోవచ్చు..!! ఆ మంచుకొండలు...ప్రమాదపు మలుపులైనా బలే అందంగా వొంపులు తిరిగి ఉన్నాయి..! తల ఎత్తి ఆ పర్వతంచు కనుచూపు మేరా చూస్తుంటే... " ప్రకృతి వొడిలొ ఒక వైపు తిరిగి వొత్తిగిలి పవలించిన కావ్యనాయక వొంపు సొంపుల్లా ఉన్నాయి ఆ పర్వత సానువులు"  వామ్మో శ్రీనాధుడు తన్నుకొస్తున్నాడేంటి నాలో.. అసలు ఆయన పేరు తప్ప పద్యం ఎరుగని నాకు... ?? హ్మ్..ఏంటో గానీ...వెంటనే "ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు... నాకున్నవేమో రెండే కన్నులు.. ఎలా చూసేదీ..ఏది చూసేదీ"  ఈ పాట నా నోట పలికింది..నా ప్రమేయం లేకుండానే...! హు.....ప్రియురాలుతో పాడాల్సిన పాట కదా అనుకోవచ్చు....ప్చ్..ప్రస్తుతానికి..ప్రకృతే స్త్రీ ఇక్కడ....మరి..!!
   దాదాపుగా 12,500 అడుగుల ఎత్తుకు చేరుకోగలిగాము సాయింత్రానికి..! అక్కడి ప్రాంతం పేరు "TILA LOTNI" (తిలా లోట్ని) చుట్టు మంచుకొండలే.. అక్కడ మేము విడది చేయలసిన స్థావరం కూడ ఒక కోండ అంచున ఉంది..! బాగా ఎత్తైన మంచుకొండలున్న ప్రదేశానికి చేరుకొన్నాం కాబట్టి. చలి చాలా ఎక్కువగా వున్నది..అదీను కాక ఆకాశం మేఘావృతమై వుంది. అక్కడికి చేరుకొన్న పదినిమిషాలకే మళ్ళీ వడగల్ల వాన మొదలయ్యింది..అంతే అందరం గూడారల్లోకి పరుగో పరుగు;.... గూడారంలోనుండి  వడగల్లు చూస్తూ.. మేమున్న కొండ ఎత్తే  సమానంగా చుట్టు వున్న మంచుకొండలను చూస్తూ....వుండిపోయాం కాసేపు..! వర్షం తగ్గాక..ఫోటోలకంటూ ఎవరికి వాళ్లు పోలో మంటూ..పరుగు.. మా చుట్టూ ఎటువైపు చూసినా పర్వతపు చివరి అంచులే కనపడుతున్నాయి..కాని ఏమాత్రం ఏమారినా.. అంతే సంగతులు చిత్తగించవలెను...!! మిగతా ప్రాంతాలకంటే ఇక్కడ చలి..మైనస్‌కి చేరుకొన్నది..నా వద్ద ఎలానూ డౌన్‌జాకిట్ ఉంది కాబట్టి..దానితో స్లీపింగ్ బ్యాగ్‌లో ఆ రాత్రి నిద్ర..గడిచింది.

    ఐదవరోజు..తెల్లవారుజామున 2:30 నిమిషాలకే నిద్రలేపారు..కారణం.. మిగతా దారి అంతా పూర్తిగా మంచుతోనే కప్పబడి ఉంటుంది..మేము చేరవలసిన "సర్పాస్ పర్వతం" చివరి గమ్యం. తెల్లవారుజామున నడక మొదులు పెడితే కాని మద్యాహ్నానికి సర్పాస్ చేసుకోగలం..ఏ కాస్త ఆలశ్యం అయినా సూరీడు దెబ్బకు మంచు కరగనారంభిస్తుంది. కరుగుతున్న మంచులో ట్రెక్కింగ్ చాలా ప్రమాదకరం..అసలు ట్రెక్ చేయలేం కూడా..! అందుకే..తెల్లవారుజామున 4:40 నిమిషాలకే మా ట్రెక్ మొదలయ్యింది..విచిత్రమేమిటంటే అంతటి తెల్లవారుజాము చీకటిలో కూడ మాకు ఆ ప్రదేశమంతా చాలా స్పష్టంగా కనపడుతున్నది..! ఇది పూర్తిగా మంచు మీద ఏటవాలుగా ట్రెక్ చేయాలి..! బాగా స్లిప్ అయ్యే ట్రెక్ అది..!  చాలా వరకు గైడ్స్ చాలా మందిని చేయి పట్టుకొని పైకి తీసుళ్ళారు..! నా పరిస్థితి ..వెనుక 25 కేజీల బ్యాక్ బ్యాక్..ముందర నా కెమెరా బ్యాగ్..చెతిలొ ట్రెక్కింగ్ స్టిక్....భలే రంజుగా ఉన్నిందిలేండి..! చాలా చోట్ల జారుతున్నాను..నా స్టిక్‌తో ఆపుకొంటూ ట్రెక్ చేస్తున్నాను..ఒక పక్కన అంత అందమైన దృశ్యాలను ఫోటోస్ తీయాలి..! అసలు కెమెరా బయటకు తీసి పట్టుకొని నడవడమే చాల కష్టంగా వున్నది..నా బ్యాలెన్స్‌ అంతా కెమెరా పట్టుకోవడంలో కోల్పోతున్నాను..! అంతటి ప్రమాదకరమైన చోట్ల కూడ ఫోటోస్ తీయటం ఆపడం లేడు.. తీస్తూనే వున్నాను..! దాని వలన అందరికంటే నడకలో వెనుకపడతున్నాను..అయినా తప్పదు..! 

    5:30  నిమిషాలకు.. మన పెద్దాయన సూరీడు తెల్లని మంచు కొండల నడుమ ఎర్రగా బయటకు రావడం మొదలు పెట్టాడు..! మద్యాహ్నం భోజనం చేయాల్సిన బల్లపరుపుగా వున్న ప్రాంతానికి చేరుకొన్నాం..!  అక్కడ స్కేటింగ్..ఆటలు..పరుగులతో అందరు అల్లరే అల్లరి.. ! ఆ ప్రాంతంలో మనుషులందరు చిన్న చిన్న చీమల్లా కనపడుతున్నారు..అంతటి విశాలమైన మంచు మైదానం అది..! భోజనం ముగించగానే..మళ్ళి నడక...అక్కడే మా గ్రూప్‌లొ ఉన్న సౌమ్య కామత్‌కి  కళ్ళు తిరగడం ప్రారంభం అయ్యాయి..కాసేపటికి వాంతులు చేసుకొన్నది..అది సహజంగా చాలా ఎత్తైన ప్రాంతాలలో జరిగే ప్రక్రియే..కాబట్టి సిద్దంగా ఉంచుకొన్న డైమాక్స్ మాత్రలు వాడడమే పని..! అలా తను బాగా వెనుకపడిపోయింది..!  మామూలుగా ఇలాంటి ట్రెక్కింగ్స్‌ బృందానికి ఒక లీడర్‌ని తయారు చేస్తారు ట్రెక్కింగ్‌లో ఉన్న మరో సాటి ట్రెక్కర్‌ని..అలా మా ట్రెక్కింగ్ బృందానికి కూడ బృంద నాయుకుడు ఉన్నారు ఆయనే చివర్లొ వుంటూ అందరిని..తొందరపెడుతూ..మొత్తం  బృందాన్నంతా నడపాలి. ఆయనకు తప్ప లేదు ఆమె బాద్యత..అలానే గైడ్‌ కూడ తోడుగా ఉంటారు..!సో నాకు ఎలాను ఫోటోస్ తీస్తు నడవాలి కాబట్టి..వారితోనే నా నడక..కొనసాగింది..! 

    మరో రెండు గంటలకు సర్పాస్ పర్వతాన్ని చేరుకొన్నాం..దాని ఎత్తు 13,800 అడుగులు..! అక్కడికి  తాడు సహాయంతో ఎక్కుతూ చేరాం..!! అక్కడ ఓ అర గంట విశ్రాంతి..అందరూ హిప్..హిప్..హుర్రే అంటు కేకలు.. కేరింతలు...!! తర్వాత అక్కడ నుండి ఇక వెనకకు మరలడమే దానికి మరో దారి..అక్కడి నుండి..ఆ పర్వతం అంచుల నుండి ఒక అర కిలోమీటర్ నడిచాక అక్కడ నుండి దాదాపుగా ఓ 300 అడుగులు కిందకు జారాలి వెల్లికిలా పడుకొని మంచు ఇసుక మీదగా  ..ఎటువంటి తాడు..లేక స్కేటింగ్ లాంటి పరికరాల సహాయం లేకుండా..! అదొక అద్భుతమైన సాహసం..నేను ఊహించలేదు అలాంటిది ఉంటుందని..!! ఒక్కొక్కరే మొదులు పెట్టారు..! అక్కడ వీటికి సంబందించిన గైడ్..మరియు స్కేటింగ్ నిపుణుడు ఉంటారు..ఆయనే ఒక్కొక్కరికి సూచనలిచ్చి కిందకు నెట్టుతున్నాడు..! కొంతమంది బ్యాలెన్స్ చేసుకొంటూ జారుతున్నారు..కొందరు మద్యలో బ్యాలెన్స్ తప్పోయి పొర్లుతున్నారు..అసలు ఆ వేగాన్ని తట్టుకోవడం చాలా కష్టం..! అందరిని గమనిస్తున్నాను ఎవరు ఎలా జారుతున్నారు..ఎక్కడ పొర్లుతున్నారు బ్యాలెన్స్ తప్పోయి..ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు..అది చూసాక ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది నాకు అర్థమవుతున్నది..!  40 మంది తర్వాత నా వంతు..! అప్పటికే అర్థమయ్యింది..కాబట్టి నో భయమ్స్..! వెల్లికిలా పడుకొని నా మోచేతులను పూర్తిగా కిందున్న మంచు ఇసుకకు గట్టిగా గుచ్చి నా వద్ద వున్న స్టిక్‌ని రెండు చేతులతో హారిజాంటల్‍గా పట్టుకొని.. బ్యాలెన్స్  చేస్తూ జారాను...!!   జుయ్యీ.....మంటు చాలా వేగంగా...జారుతున్నాను..మద్యలో ఒకటి రెండు చోట్ల శరీరం కుడి..ఎడమ వైపు తిరగడానికి ప్రయత్నించింది.. కాని నా మోచేతులతో్ కిందున్న మంచు ఇసుకను..గట్టిగా అదిమి అణిచున్నాను..కాబట్టి  అటు ఇటు తిరగడానికి ప్రయత్నించినా కుదరలేదు..నా శరీరానికి..! మొత్తానికి విజయవంతంగా ఆ మూడొందుల అడుగులు క్షణాల్లో కిందకు చేరుకొన్నాను..!

     హా...... అదొక అనిర్వచినీయమైన అనుభవం..! అక్కడ నుండి కిందకు నడుస్తూ మద్య మద్యలొ వెల్లికిలా పడుకొని జుయ్యీమంటూ జారుతూ..నడుస్తూ..సాయింత్రం నాలుగు గంటలకు  "బిస్కరి (BISKERI)" చేరుకొన్నాం. అక్కడ రాత్రి బస అయ్యాక..మరుసటి రోజు.."మినీ స్విడ్జర్ ల్యాండ్..లేక హిమాచల స్విడ్జర్ ల్యాండ్" అని చెప్పబడుతున్న  "BHANDAK  THATCH" చేరుకొన్నాం..!  మిని స్విడ్జర్ ల్యాండి అని అంటారు గాని...మరీ అంత లేదు..! కాకపోతే ఆకుపచ్చని మైదానాలు..దూరంగా మంచుకొండలు..చూట్టానికి చాలా బాగుంటుంది..! ఆ రోజు సాయింత్రం అందరు క్రికెట్ ఆడుకొన్నారు. మరసటి రోజు తిరుగు ప్రయాణం కిందకు..కాని ఇక్కడో విషయం వున్నది..పర్వతాలను ఎక్కడంలో కష్టమున్నా  మన శరీరం ఎక్కే సమయంలో ఏటవాలుగా ఉన్న పర్వతం వైపు వంగి బ్యాలెన్స్ చేసుకొంటూ ఎక్కగలం..అది చాలా వరకు సులభం కాని దిగే సమయంలొ అలా మన శరీరాన్ని వెనక్కి బ్యాలెన్స్ చేయలేము..అలా అని ముందుకు వంచలేము..చాలా కష్టం పడాల్సి వొస్తుంది... కాస్త శరీరం బ్యాలెన్స్ తప్పినా అంతే బొక్క బోర్ల పడటమే కాదు..దొర్లు..దొర్లు పుచ్చకాయిలా ఏకంగా వెళ్ళిపోవడమే..కిందకు..!!

    దిగుతున్న దారిలో అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న గ్రామాలు ఎదురయ్యాయి..!  గొర్రెలు..పశువులు కాపు కాసేవాళ్లు.. చాలా మందే ఎదురయ్యారు.. ! అక్కడ ప్రకృతిలాగ అక్కడి మనుషులు కూడ అందంగా ఉన్నారనే చెప్పాలి.. సాయింత్రానికి.. కసోల్ బేస్ క్యాంప్ చేరుకొన్నాము..!!

  ఈ ట్రెక్‌లో వివిద ప్రాంతాల నుండి వచ్చిన మనుషులతో కొన్ని రోజుల పాటు ప్రయాణం సాగించడం..అరుదైన అనుభవమే నాకు..! ఎవరికి ఎవరు..ఎక్కడి వారో..ఏ..ఏ..సంస్కృతల నుండి వచ్చిన వారో కాని ఎక్కడా మనుషుల మద్యన పొరపొచ్చాలు..ఘర్షణలు లేవు..ఇంకా ఒకరికొకరు సహకారం ఇచ్చుకొంటూ....ట్రెక్ కొనసాగించాం. దక్షిణ, ఉత్తర భారతదేశం నుండి వచ్చిన మనుషుల్లోని ఆ సంస్కృతి తేడా స్పష్టంగా కనపడింది నాకు. ముంబాయి, డిల్లీ, లక్నో, మద్యప్రదేశ్..బెంగాల్, అస్సాం, ఒరిస్సా, గుజరాత్‍ల నుండి వచ్చిన వారిలో ఆ కల్చర్ తేడా కనపడుతున్నది..తల్లీ కూతుల్లు ఎప్పుడూ కల్సి ఉండరు.కూరుతు తన తోటి వయసువారితో అమ్మాయిలతోనే కాక మగవారితో కలసి ట్రెక్ చేస్తుంటే తల్లీ తన వయసు వారితో కలసి తిరుగుతున్నారు..! అంటే ఎటువంటి మగ ఆడ తేడా లేకుండ కలసిమెలసి..ఉండటం..నిజంగ చాలా అరుదు. ..! వారి వయసువారితో ఆటలు..జోక్స్..కేరింతలు..అమ్మాయుల అబ్బాయిల..వారి తల్లితండ్రులెవరికీ అభ్యంతరం లేదు చివరిరోజున అందరు ఒకరినొకరు కౌగిలించుకొంటూ ఫోటోస్ తీసుకొన్నారు. మరుసటి రోజున ఎవరికి వారు విడిపోతున్నారు..కొందరు వాటర్ రాఫ్టింగ్‌కి వెళ్ళారు..మరి కొందరు మనాలికి ప్రయాణం అయ్యారు..! నేను ఆ రోజు మద్యాహ్నం బుంతర్‌కి  బయలు దేరాను..బస్సులో..!  ఆ ప్రయాణంలో మరొక అనుభవం.. ఏడుగురు ఉన్న గుంపులో ముగ్గరమ్మాయిలు నలుగురు అబ్బాయిలు గలగల మాట్లాడుతూ నా పక్క సీట్..ఎదురు సీట్‌లలో ఉన్నారు..వారి పక్కన ఓ నలుగురు విదేశీయులు..!! నా వీపుకున్న బ్యాక్‌పాక్ చూసిన వారు "YHA"కి వచ్చిన ట్రెక్కరా అంటూ అడిగాను..అవునని తలూపాను..! వాళ్ళు ట్రెక్కర్సే..కాకపోతే వాళ్ళు ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు..నాతో వాళ్ళు విషయాలు ఇచ్చిపుచ్చుకొంటున్నారు..అంతా 20 నుండి 26 లోపల వయసున్న వారే..ఎటువంటి భేషజాలు లేవు..మగ ఆడ అంటు తేడా లేదు..కలవిడిగా..కలిసిపోతూ..జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు..!! సాయింత్రానికి బుంతర్ చేరుకొన్నాను.
    బుంతర్‌లో మళ్ళి కలిసాము మా బృందం ట్రెక్కర్స్..అందరూ..! వారిలో డిల్లీకి చెందిన హేమంత్ కులకర్ణి, అనితా కులకర్ణి దంపతులిద్దరు..వారింటికి రమ్మని అందరినీ ఆహ్వానించారట...అందరు వెళ్తున్నారని చెప్పారు..! విషయం తెలిసిన నేను..అంతమంది వారింటికి వెళ్తున్నారు నేను కూడ వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశంతో దూరంగా నిల్చున్న నా వద్దకు భార్యభర్తలు వచ్చి.."కమల్..డిల్లీలో మీకు పనుందా" అని అడిగి ..లేదని తెలుసుకొన్నాక "తప్పకుండా రావల్సిందే మా ఇంటికి" అంటు ఆహ్వానించారు. ఆయన...  కేంద్ర ప్రభుత్వ సైన్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లో (CSIR)లో సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు.మరుసటి రోజు ఉదయమే ఆయనింటికి చేరుకొన్నాం..దాదాపు 20 మందిమి..!  ఆ దంపతులిద్దరు అంతమందికి..టిఫెన్ అప్పటికప్పుడు చేశారు..! ఇక మద్యాహ్నం భోజనంచేసే ఓపిక లేదండి అని చెప్పినా వినకుండా..అందరికంటే ముందుగా నా ఫ్లైట్ ఉన్నది తెలుసుకొన్నాక త్వరత్వరగా  మద్యాహ్నానికి వంట చేసి..భోజనం కూడ వడ్డించారు..! చాలా మందికి ఆకలి వేయకున్నా కూడ నేను మరి కొంతమంది కర్నాటకక చెందిన రెండు జంటలు వెళ్తున్నారని..మాతో పాటే అందరు భోజనాలు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఎవరికీ ఎవరు ఏమి కాము..మునపటి పరిచయం లేదు.., కాని అందరూ..ఒకే కుటుంబంలా భలే కలిసిపోయారు..! మాలానే ట్రెక్ చేసి అలసిపోయిన ఆ దంపతులిద్దరూ మాకోసం అంతటి అలసటలొ కూడ..అందరికీ వంట  చేయడం..అంతా సులభమైన వ్యవహారం కాదు..! ఎన్ని మాటలు చెప్పినా తీరని కృతఙ్ఞత అది..! హ్మ్..ఒకే ఒక పదం "థ్యాంక్స్" అని చెప్పి అక్కడ నుండి..ఏయర్‌పోర్ట్‌కి బయలుదేరాం...!!


                                                                                  -కసోల్-

          
                                                                                                                                                                          మా బేస్ క్యాంప్ వున్న ఈ గ్రామం..నాకు నిజంగా ఒక విచిత్రంగాకనపడింది..! కారణం.. రోడ్డ్‌కి ఇరువైపుల అన్ని కలిపికొడితే కేవలం ఓ యాబై ఇల్లు ఉంటాయేమో..కాని విదేశీయులకు అదొక ప్రత్యేకమైనా యాత్రా స్థలం..! ఎక్కడ చూసినా విదేశీయులే కనపడతున్నారు గుంపులు గుంపులుగా..పోనీ ఆ ఊరున్నా పద్దతిగా ఉండి శుభ్రంగా ఉన్నదా అంటే అదీను లేదు..రోడ్స్ సరిగ్గా లేవు..ఒక వాహనం వెళ్ళితే చాలు అదేదో భూకంపం వచ్చినంతా దుమ్ము రేగుతుంది..ఏముంది అక్కడ ..? కేవలం శీతల ప్రాంతం అంతే అలాంటి ప్రాంతాలు వారి దేశాలలో లేవా..??  అంతగా విదేశీయులను ఆకర్షిస్తున్నది ఆ చిన్నపాటి గ్రామం....అదీను ఇంగ్లీష్ వాళ్ళు కాదు..అందరు యూరప్ దేశాల వారే..ఎక్కువగా ఇటలీ, ఇజ్రాయిల్, పాలస్తీనా, తదితర దేశాల వారు ఉన్నారక్కడ..!

    అక్కడి లోకల్ మనుషులను కొందరిని..! నాకు తెల్సిన ఒక హైదరాబాద్ ఫ్రెండ్‌తో మాట్లాడగా కొన్ని విషయాలు తెలిసాయి. ఇక్కడ నల్ల మందు, హెరాయిన్, గంజాయ్ విరివిగా లభిస్తాయట..! ఎలానూ సంవత్సరానికి ఒక సారి యాత్రలకు వెళ్ళే సాంప్రదాయం ఉన్న ఈ యూరప్ దేశాల వారు ఇక్కడికి వొస్తున్నారు..వచ్చాక ఇక్కడి..ఈ నల్ల మందు..హెరాయిన్ వాటికి బాగా వ్యసన పరులవుతున్నారు..దానితో ఒకరికొకరు తోడై..ఇక్కడే కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోతున్నారు..! మరి కొందరు మన భారతీయ స్వామీజీలాగ మారుతున్నారు..తల వెంట్రుకలు చుట్టలు చుట్టలుగా తిరిగి వున్నాయి..విదేశీ సన్యాసుల్లా కనపడుతున్నారు. ఇక అమ్మాయిల గురించి మరి కొన్ని విషయాలు తెలిసాయి కాని..అవి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు కారణం..వారు చెబుతున్న విషయాలు నేనేవి ప్రత్యక్ష్యంగా చూడలేదు. కాబట్టి అనవసరపు ప్రస్తావన అనుకొన్నాను.

   ఒకమారుమూల ప్రాంతం.. అదీను కనీస సౌకర్యాలు కూడ సరిగ్గా లేని ప్రాంతంలో విదేశియులు...ఎక్కువగా యాత్రలు చేయడం ఆశ్చర్యం కలగిస్తున్నది..! ఇక్కడ ఒక్కటే విశేషం..చల్లగా ఉండి..ట్రెక్కింగ్‌కి అనుకూలమైన ప్రదేశం..! వీలుంటే ఇక్కడి విషయాల మీద ఎవరైన ఒక మంచి డాక్యుమెంటరీ ఫిల్మ్ చేస్తే బాగుంటుందనిపించింది.







మరి కొన్ని ఫోటోస్......................


































           
         






 



About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs