అసుర సంధ్యవేల -
    పడమటి ఆకాశం నెత్తుటి మడుగులా ఉంది.
పల్లెల కేసి గుంపులు గుంపులుగా ఎగిరే కాకులు ఆకాశం నేపధ్యంలో .. ఎర్రదనం మీద విదిలించిన నల్లటి సిరాచుక్కల్లా వున్నాయి.
  మితి మీరిన వేగంతో తార్రోడ్డు మీద దూసుకెళ్ళే లారీలు,బస్సులు  పాదచారుల్ని భయపెడుతున్నాయి.
  రోడ్డుకు ఇరువైపుల పచ్చగా కలకలాడే వేరుసెనగ పైరు మద్యన్నించి గడ్డిగంపలు తలమీదుంచుకొని పల్లెకేసి అడుగులేస్తూ వున్నారు ఆడవాళ్ళు.
  రుమాలు విదిల్చి భుజానేసికొని ఓసారి వెనక్కి తిరిగి చూశాడు రామిరెడ్డి.
లోతుగా తెగిన ముగ్గుపిండి గని మూలమూలలకు అతని చూపులు పరుగెత్తాయి.
 దరుల పైకి చేర్చబడి గుట్టలు గుట్టలుగా గోధుమవర్ణపు ముడి మట్టి.  కొంచం దూరంలో పిండిని గుండుతిప్పి జల్లిపట్టి  తెల్లటి ఆకారం వచ్చింతర్వాత గోతాల కెత్తి వుంచిన విశాలమైన కళ్ళపు దృశ్యం.
 దక్షిణపు దెస దరికేసి ఓసారి పరిశీలనగా చూసి నిట్టుర్చాడు ఆయన.  కూలీలంతా పెందలాడే వెళ్ళిపోయారు.  మిగిలి ఉన్న ఐదారుమంది అంతరంగికులు సామాన్లు సర్ది ఆయన వద్దకొచ్చారు.
కాపలా మనిషికి జాగ్రత్తలు చెప్పి అందరూ దారిబట్టారు.
కొంతదూరంలో గారగడ్డలజేడెల కవతల ఏరు బావురు మంటోంది. వందగజాల దూరం నడిచి తార్రోడ్డు ఎక్కారు.
  వారం దినాల కిందట కురిసిన వాన నీళ్ళు రోడ్డు పక్క గుంటల్లో ఇంకా యిగిరిపోలేదు.
 తనతోటి మనుషుల్లో యవ్వారం జేస్తూ రోడ్డుపక్కగా నడుస్తున్నాడు రామిరెడ్డి.
  వాళ్ళ సంభాషణ గని విషయాల పైకి మల్లింది.
 " గని అంతా దక్షినం పక్కకు మల్లుతూ వుంది రెడ్డోరు !  ఆ పక్క మంచి మట్టి తేల్తా వుంది,  జల్లిబోసి తయారు జేసినట్లు తెల్లటి పిండి...మంచి గోతాల కెత్తినా ఇబ్బందిలే..  మనమెప్పుడయనా గని ఆ దెసకు నరుక్కుంటూ పోవాల్సిందే.." చెప్పాడు మద్దిలేటి. " నారమ్మ  సేను కొనకుంటే గాని కుదర్దుబ్బా  ! " ముక్తాయింపుగా  అన్నాడు.
  " కొనాలబ్బీ ! "  సాలోచనగా చెప్పాడు రామిరెడ్డి.
 " యేదీ - ఆ ముండ దారికొస్తే గద ! మనమంటే సయించేట్టు లేదు.  మనపేరు జెప్పితే యిచ్చేట్టు లేదు. మామీద ఎందుకో కసి బెంచుకుంటా వుంది  ఆమెకు మేమెప్పుడూ సెరుపు జేసిందిలే...యిబ్బంది బెట్టిందిలే..? "
  " యియ్యక..  సొంతంగా గని తొవ్వుద్దేం ? " రంగనాయకులు అన్నాడు.
  " ఏమో....? " 
 " ఏదేమన్నా గానీ - పదిరూపాయాలు ఎక్కువైనా బెట్టి కొనాల రెడ్డోరు ! ఆ సేను మనకు దక్కాల్సిందే..."
   " ఇస్తానంటే గదంటరా  ఆప్రయత్నాలన్నీ ! "
  గనికి దక్షిణం వైపు బైటబడుతూ వున్న నాణ్యమైన ముగ్గు పిండి  వరసల్ని  గురించీ,  దానికి సంబందించిన పొలాన్ని కొనాలిస్న అవశ్యకత గురించీ చర్చించుకుంటూ నడుస్తున్నారు వాళ్ళు.
  కొంతదూరం వెళ్ళేసరికి పొలాలకడ్డంగా పరుచుకు వచ్చి తార్రొడ్డులో కలిపిన బండ్లబాట ఎదురయ్యింది.
  బాటవెంట పడమటి దిశగా శివపురి.
  తార్రొడ్డు మీదుగా రెండు ఫర్లాంగుల దూరం నడిస్తే ఒంటికొట్టం.  పూర్వమెప్పుడో  అక్కడ ఒకటే కొట్టం( గుడెస) వుండేది, ఇప్పుడు దాదాపు ముప్పయి ఇళ్ళున్నా అదేపేరు స్థిరపడింది. శివపురి నుంచి అక్కడికి మరోదారి వుంది.
  " పొద్దున్నే రాండిబ్బీ ! " చెబుతూ మట్టిబాట మీద అడుగేశాడు రామిరెడ్డి.
  " గమిల్దాక  రమ్మంటావా రెడ్డోరూ..? "
  " ఎందుకురా ?  నాలుగంగల్లో  పోనూ.."  నవ్వుతూ బాటమీద ముందుకు  సాగాడు.
కూలీలంతా  తార్రొడ్డు వెంటా ఒంటి కొట్టం కేసి కదిలారు.
అప్పటికే దట్టంగా చీకటిబడింది గాని,  దశమి చంద్రుని కాంతి దాన్ని పారదోలేందుకు నడుం బిగిస్తోంది.
 కూతవేటు దూరంలోని  శివపురిలోంచి ఏవేవో శబ్దాలు కలగాపులగంగా విన్పిస్తున్నాయి.
నారమ్మ పొలం గురించిన ఆలోచన రామిరెడ్డిని తొలుస్తూనే వుంది, దాన్ని ఎట్లా సాధించాలో అర్థం కాకుండా వుంది.
నయన చెబితే లొంగడం లేదు.
భయాన చెప్పేందుకు సాధ్యపడటం లేదు.
 అలాగని స్వంతంగా ముగ్గుపిండి గని తవ్వించే స్థితిలో లేదు ఆమె.  పిండిని మార్కేట్ చేసుకొనే సత్తా ఆమెకు లేదు.
అమ్మగారి తరుపు దండోరు పల్లె మాసులు రావాలిసిందే  ప్రస్తుతం సమస్య అంతా దండోరు పల్లెలోనే వుంది. పేరుకు తగ్గ ఊరు అది, ఎప్పుడు దండుగా ఏర్పడి గొడవలు చేసుకోవడమే.
  కొట్టుకొని కేసులు పెట్టుకొన్నప్పుడంతా సుబ్బారెడ్డి వర్గం తమ వూరికోచ్చి  తమ యిళ్ళవద్దా, పొలాల వద్దా, కల్లాల వద్దా ఆశ్రయం పొందుతారు.
 అవతలి  రంగారెడ్డి వర్గం నారమ్మ బంధువులది, వాళ్ళకు తమమీద మంట.  వాళ్ళ శత్రువులకు ఆశ్రయమిస్తున్నామని కోపం. అందుకే నారమ్మ పొలం తమకు అందకుండా చేస్తున్నారు.
     ఊర్లోంచి మనుషుల గొంతుకలు రోజుటికంటే ఎక్కువగా శబ్దిస్తూ విన్పిస్తున్నాయి.
వాతావరణం కొంత భిన్నంగా ఉన్నట్లనిపించింది.
అప్పుడు గుర్తొచ్చింది  రామిరెడ్డికి - ’ ఆరోజు దసరా ’ అని.  సంబరాలు చేసుకొంటున్నారు కాబోలు.
ఏవేవో మారువేషాలు, .... కుంకుమ చల్లుకోవడాలు..
గ్రామం దగ్గరయ్యేకొద్దీ కొలాహలం స్పష్టమవుతోంది.
వెన్నెల వెలుగు లోకాన్ని పూర్తిగా ఆక్రమించుకొంది.
చుట్టూ వేరుసెనగ పైరుతో కూడిన చేలు......
  దారిపక్కగా  కంచెలాగా నాలుగు చాళ్ళు ఏపుగా వెరిగిన  జొన్న...
ఎదురయ్యే వాళ్ళుగానీ,  వెనుకనించి వచ్చేవాళ్ళుగానీ  లేకపోవడం వల్ల దారంతా ఏదో  ఒంటరితనం ఆవహించింది......
  మెల్లిగా తనలో తనే.. నవ్వుకొన్నాడు రామిరెడ్డి.
  తోడు కోసం చూడకుండా తలొంచుకొని  నడిచిపోవడం తనకలవాటు.
తన అన్నగానీ,  తమ్ముడుగానీ అట్లా కాదు.  వెంట మంది లేకుండా అడుగు కూడా కదపరు.
తార్రొడ్డునించి వూరిని కలిపే దక్షిణం వైపు రోడ్డుమీద ఏదో వాహనం పరుగెడుతూ వుంది.
  గ్రామానికంతటికీ ఆ రోడ్డే ప్రధానమైంది,  బస్సుకోసం వెళ్ళిన జనాలకు ఒంటి కొట్టం వద్ద పెద్ద అరుగు కూడావుంది.
  తను నడిచే యీ మట్టిబాట  తమ యిళ్ళ వద్దనించి తమ పొలాల గుండా తామే కష్టపడి  వేయించారు.  గనికి దగ్గరగా వుంటుందనే కారణమే కాకుండా,  తాము వూరంతా తిరిగి అటుకేసి వెళ్ళకుండా తమ యిళ్ళవద్ద నుంచే నేరుగా తార్రొడ్డు ఎక్కేందుకు అనువుగా వుంటుందనే ఆలోచనతో నిర్మించారు.
  ఊల్లో  యింకా సందడిగా వుంది
  పని వత్తిడిలో తను  దసరా సంబరం గురించి మరిచాడు. ఇంటి వద్దే వుండుంటే తనమీద కూడ కుంకాలు చల్లేవారు.
  ఇప్పుడు మాత్రం వదిలేస్తారనే గ్యారంటీ లేదు.
  గమిల్లో కాపలా వున్న ఆశ్చర్యపోనక్కరలేదు.
  ఊరు దగ్గరయ్యేసరికి  అతని అనుమానం  నిజమైనట్లుగా తోచింది.
  వెన్నెల వెలుగులో ఎవరో నలుగురు మనుషులు - తనకేసి వస్తున్నారు.
  వాళ్ళెవరయ్యిందీ పోల్చుకోనేందుకు  ప్రయత్నించే లోపలే  దగ్గరయ్యారు.
  " దండాలు  సోమీ  ! "   రెండు చేతులెత్తి నమస్కరించారు.
  " ఏ వూరబ్బీ మీది  ! "   నొసలు ముడేస్తూ చూశాడు.
  " మమ్మల్నెరగవా  సోమీ ?  పోయినేడు వుగాది పండక్కు.."  తమను  తాము పరిచయం చేసికొంటున్నాడు ముందున్న మనిషి.
  వాళ్ళను తనెక్కడా చూసినట్టు గుర్తులేదు.
  గని వద్దకు ఎక్కడెక్కడి వాల్లో  వస్తుంటారు.  ముగ్గుపిండిని పెట్టించుకొని పోతూంటారు.  తను వాళ్ళకు గుర్తే వుండొచ్చు,  తనే పోల్చుకోలేకున్నాడు.
  కొత్త వ్యక్తి తమను గురించి చెప్పుకొంటూ వుండగానే నలుగురిలో యిద్దరు ఆయన్ని దాటుకెళ్ళారు
  తమ చిరునామా వివరిస్తున్నాడు గాని అందులో ఏదో అస్తవ్యస్తత... పొందికలేని తనం.
  ఉన్నట్టుండి తనకెదురుగా అంతదాక మాట్లాడుతూ వున్న వ్యక్తి  తన పక్క మనిషితో కలిసి వెనక్కి వెనక్కి సర్దుకొంటూ ఒక్కసారిగా వేరుసెనగ చేలోకి గెంతాడు.
  రామిరెడ్డి ఆశ్చర్యపోయాడు.
  అతని మనస్సు ఏదో కీడు శంకించబోయే లోపలే వీపు మీద గుండ్రటి రాయిలాంటిదేదో  బలంగా తాకిన స్పర్శ... అది రాయో, మరేదో విశ్లేషించబోయే లోపలే వీపున పెద్ద శబ్దంతో విస్పోటనం..ఆక్షణమే మెదడు పనిచేయటం మాని శరీరమంతా విరుచుకు పడిపోయిన దృశ్యం.
  చేలో పడున్న వాళ్ళిద్దరూ చివుక్కున లేచి రోడ్డెక్కారు.
 చేతిలోని బాంబుల్ని మరోసారి సంధించిబోతూ వున్న రోడ్డు మీది మనుషుల్ని అడ్డుకుంటూ " సాల్సాలు...  పడిపొయ్యిండు.. పాండి..పాండి " అంటూ చేతులూపుతూ రోడ్డుదాటి దక్షిణం వైపు చేలమీదుగా కదిలారు.
  రెండో ప్రయత్నాన్ని విరమించి,  ఇంకా కొద్ది కొద్దిగా ఎగిరెగిరి పడుతూవున్న రామిరెడ్డి శరీరం కేసి ఓసారి తదేకంగా చూసి, పల్లెకేసి చూపులు సారిస్తూ తమవాళ్ళను అనుసరించారు బాంబులు విసిరిన వ్యక్తులు.
   బాంబుల్ని చేతబట్టుకొనే వేరు సెనగ చేలకు అడ్డంగా పరుగెత్తి వూరుచుట్టి ఏటి జేడెల  కంపచెట్ల మాటున అదృశ్యమయ్యారు వాళ్ళు.
  బాంబు పేలిన శబ్దం వూళ్ళో వాళ్ళకు కూడ విన్పించింది గాని, పండుగ ఉత్సాహంలో ఎవడో పటాసు పేల్చినట్లుగా భ్రమపడ్డారు.
  అక్కడి దృశ్యాన్ని పసిగట్టిన కుక్క వొకటి అదే పనిగా  కవిసి కవిసి మొరుగుతోంది,  ముందుకు వెళ్ళేందుకు ధైర్యం చాలక అక్కడక్కడే  పెనుగులాడుతోంది.

                                                                                            ( సశేషం )..........

     పన్నెండు సంవత్సరాల క్రితం నాకు రాయలసీమ గ్రామకక్షల మీద శాస్త్రీయంగా పరిశోదనలు చేసి వాటి ఆదారంగా వాస్తవానికి దగ్గరగా కథ అల్లుకొని బుల్లితెర మీద సీరియల్‌గా చేయాలనే ఆలోచన వచ్చింది, నేను రచయతను కాను కాబట్టి ఒక రచయత కోసం వెదుకుతున్నప్పుడు ప్రముఖ రచయత శ్రీ సొదం జయరాం గారి ద్వార సాహిత్య వ్యవసాయం చేస్తున్న సన్నపరెడ్డి వెంకటరామిరెడ్డి అనే రచయత పరిచయం అయ్యారు. ఈయన అప్పటికే రచయతగా ప్రసిద్దుడు. 2002 లో ప్రవాసాంద్రుల " ఆట " వారి నవలల పోటీలో " కాడి " అనే నవలకు రెండవ బహుమతిగాను, 2007 లో " తోలుబొమ్మలాట " కు ప్రధమ బహుమతి, అదే సంవత్సరంలో చతుర వారి నవలలపోటీలో " చినుకల సవ్వడి " నవలకు ప్రధమ బహుమతి వచ్చాయి, స్వాతి సపరివార పత్రికలో " పాండవబీడు, పాలగత్తె " సీరియల్స్ ప్రచురితమయ్యాయి, 70 దాక కవితలు  50 కథలు రాసారు. పుట్టింది, పెరిగింది కడపజిల్లా బాలరాజు పల్లెలో కావడం వలన ఈయన కథలలో, కవితలలో గ్రామీన జీవన సౌందర్యం ప్రతిబింబించింది. అలాగే అక్కడి బడుగుజీవులైన రైతులు, రైతుకూలీల బతుకు వెతల్ని తన కళ్ళలో నింపుకొని పాఠకలోకానికి అందించాడు.
      నేను ఈ రచయతతో కలిసి కొన్ని పరశొదనల కోసం కడప, కర్నూల్ జిల్లాలోని చాలా గ్రామాలు సందిర్శించాము, ఎంతో మంది ముఠానాయుకలను, వారి అనుచరలను, పాతకాలపు మనుషులను కలిసాము, ఎంతో సమాచారం తెలుసుకున్నాము. ముద్రితం కాని పాండిత్యం, పద్యాలు దొరికాయి. పల్లెప్రాంతాలలో ఎంతో సాహిత్యం ఉందన్న సంగతి మాకు అప్పుడు అర్థమయ్యింది. ఈ ప్రక్రియలో నాకర్థమైన కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఈ గ్రామకక్షలన్నవి ప్రపంచమంతటా ఉన్నాయి, అయితే ఎక్కడ ఎక్కువగా కరువుకాటకాలు ఉంటాయో, వర్షపాతం తక్కువ ఉంటుందో అక్కడ  గ్రామకక్షలు ఎక్కువగా ఉంటాయి. బీహార్, గుజరాత్‌లోని కొన్ని కరువుప్రాంతాలలో, మెక్సికన్ దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇదే వాతావరణం ఉన్నది, అక్కడ కూడ గొడవలు, ముఠాతగాదాలు, కాస్త అటు ఇటుగా ఇలాంటి గ్రామకక్షలే ఉన్నా ఆయా ప్రాంతం యెక్క స్వబావరిత్యా, కాలమానాల ప్రకారం కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అలా మన రాష్ట్రంలోని ఈరెండు జిల్లాలో పరశీలించినప్పుడు ఇక్కడి గ్రామకక్షలను మూడు విదాలుగా విభజించవచ్చు.1. సామాజిక ఆధిపత్య పోరు ( Social prestige ).  2. రాజకీయ ఆధిపత్య పోరు ( Political prestige). 3. ఆర్థిక ఆధిపత్య పోరు ( Financial prestige ). మొదటి సామాజిక ఆధిపత్యపోరు స్వాతంత్ర్యం రాకమునుపు నుండి ప్రారంభం అయ్యి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దాదాపుగా 1960, 70 వ దశకం దాక కొనసాగింది.  అప్పటివరకు ఒకే రాజకీయపార్టి రాష్ట్రంలో అధికారంలో ఉండడం వలన ఇరువర్గాలలో ఒకరు అధికార పార్టికి కొమ్ము కాస్తే మరోకరికి ఎటువంటి రాజకీయ ఆసరా లేక ఒంటరి పోరాటం చేయవలసిన పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే 1982 లో ఒక ప్రాంతీయ పార్టి అవిర్భావం జరిగిందో అప్పుడు రెండొ వర్గమైన ముఠానాయుకుడికి ఆ ప్రాంతీయపార్టి ఆసరాగా నిలిచింది. అప్పుడే రాజకీయ ఆధిపత్యపోరు మొదలయ్యింది. తర్వాతర్వాత 1990 దశకం మద్యలో ఒకప్పటి వారి పెద్దలు చేసిన  " ఫ్యాక్షన్ " అనే భూతాన్ని ఒక సాకుగా చూపి ఆర్థికంగా అధిపత్యం కోసం ప్రాకులాడడం ప్రారంభించారు. ఇతిమిద్దంగా ఇది మాకు మా పరిశోధనలో అర్థమైన విషయం. ఈ విషయంపై నాకు మునుపే ఒక అవగాహన ఉన్నా.. స్వయంగా తిరిగి ఒకప్పటి పాత తరం మనుషలతో మాట్లాడి నిర్దారణ చేసుకున్నాక ఈ కానెప్ట్ మీద కథను తయారు చేసుకున్నాము. ఇలా గ్రామాలు తిరుగుతూ ఎన్నో కథలు, వెతలు, వ్యధలు, ఎన్నో ఎన్నెన్నో తెలిసాయి. ఇక్కడ మరొక విషయం...ఒకప్పుడు " ఫ్యాక్షన్ " అన్న పదం రాయలసీమ ప్రాంతంలో అసలు వాడుకలో లేనేలేదు. తెలుగు ప్రచారాసాధానాలే 1995 తర్వాత వాడుకలో తెచ్చాయి, అంత వరకు ఒక గ్రామంలో రెండు వర్గాల మద్యన కక్షలు ఏర్పడి గొడవలు మొదలయితే వాటిని " పార్టి " పడింది ఇద్దరి మద్యన అని చెప్పుకునేవారు, మొదట్లో కొత్తగా ఎవరు గ్రామానికి వెళ్ళినా " ఏవయ్యా మీ ఊళ్ళో ’ పార్టి ’ ఉందా..? అనో లేక ఆ ఇద్దరి నాయుకల మద్యన ’పార్టి ’ పడిందా అనో అడుగుతారు తప్ప " ఫ్యాక్షన్ " అన్న పదం కాని లేక " ఫ్యాక్షన్ " లీడర్ అన్న పదం కూడ వాడేవారు కారు.
    కొన్ని అనివార్య కారాణాల వలన మేము అనుకున్నా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయి మూలన చేరింది. కాని మా రచయత సన్నపరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు మాత్రం మేము సేకరించిన విషయాలలోని కొన్ని కథల నుండి ఒక " ఉప కథను " ఆధారంగా " కసి " అన్న పేరుతో నవల రాసి స్వాతి వారపత్రికకు పంపారు. అయితే స్వాతి పత్రిక యజమాన్యం వారు వారికున్న కొన్ని నిబందనల దృష్ట్యా, లేక వారికున్న కొన్ని అభ్యంతరాల వలనో ఆ నవల ముద్రణకు నోచుకోలేదు. ఈ నవలకి ఆధారమైన ముఖ్యమైన కాన్సప్ట్ నాది కావడం మూలాన  ఈ నవలను రచయత సన్నపరెడ్డి అనుమతితో నేను ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఈనవలను చదివే పాఠకులకు ఒక చిన్న మనవి. ఈ నవలలోని పాత్రదారుల మధ్యన జరిగే మాటలు రాయలసీమప్రాంతపు యాసలో అంటే కడపకు దగ్గరలోని పల్లె ప్రజల యాస, మాడలికంలో సాగుతాయి,  అలాగే కొన్ని పాత్రలు కొందరిని కులంపేరుతో సంబోదిస్తాయి, అవి కేవలం ఆయా పాత్రల యెక్క స్వభావం, అంతే కాక ఈ నవల యెక్క కథాకాలం 1960, 70 నాటి కాలానిది. అప్పటికాలం గ్రామాలలో చాలా మంది తమ తోటివారిని కులంపేరుతోనో లేక మరో చిన్న చిన్న మారు పేరులతోనో పిలిచేవారు. వాటినే యధాతదంగా ఆయా పాత్రల చేత మాట్లాడించారు తప్ప అవి ఈ నవల రాసిన రచయత యెక్క ఉద్దేశం కాదని తెలుపుతున్నాను, అవన్ని ఆయా పాత్రల యెక్క స్వభావం అని గుర్తించగలరు. ఎవరిని కించపరచాలని గాని లేక రచయత ఉద్దేశపూర్వకంగా రాసినది కూడ కాదని మనవిచేస్తున్నాను. మరొకరి మనోబావాలను కించపరచాలనే ఉద్దేశం కూడ లేదు. కేవలం వాస్తవాలకు దగ్గరగా ఉండాలనే సదుద్దేశంతో చేసిన ప్రయత్నం.

        రెండు లక్షల జనాభా గల అదొక చిన్న టౌన్,  సమయం రాత్రి  పది కావస్తున్నది, వీధుల్లో జనాలు పలుచగా ఉన్నారు , సెకెండ్‌షో సినిమాకి ఆలశ్యంగా వెళ్తున్నవారు సినిమా థియేటర్స్ గేట్స్ మూసే సమయం కావడంతో పరుగులు తీస్తున్నారు.  మేయిన్ వీధిలో ఉన్న తన ఇంటిముందు నిల్చొని 23 ఏళ్ళ చైతన్య కాలింగ్ బెల్ నొక్కాడు, రెండు నిమిషాలకు చైతన్య తండ్రి రామకృష్ణ బయటకు వచ్చి కటాంజనం ( ఇంటి వసారాకు ఉన్నఇనప గ్రిల్ ) కు ఉన్న తాళం తీస్తూ " తొందరగా ఇంటికి చేరొచ్చు కదా..! బయట తమరు ఇంతవరకు ఏమి రాచకార్యాలు వెలగబెట్టాలో  " కోపం మేళవించిన స్వరంతో నిరసనగా అన్నాడు. ఆ మాటలకు మౌనమే సమాదానంలా తలుపు తీసుకొని ఇంటిలోకి వెళ్ళాడు చైతన్య.  హాల్‌లోకి అడుగుపెట్టగానే చైతన్య అమ్మమ్మ అన్నపూర్ణమ్మ ఎదురయ్యింది " చైతు బాగున్నావా " కుశల ప్రశ్నలు వేసింది.
" అర్రె.. అవ్వ... [ కడప ప్రాంతంలో అమ్మమ్మను అవ్వ అని, నాన్నమ్మను " జేజి " అని పిలుస్తారు ] ఊరునుంచి ఎప్పుడొచ్చావు..? బాగున్నావా ? " ఆనందంగా అడిగాడు
" సాయింత్రం వచ్చాలే "
  వీళ్ళిలా మాట్లాడుకుంటున్న తరుణంలో వంటింటిలో నుండి చైతన్య తల్లి సరస్వతి గొణుగుడులా మాట్లాడుతున్న మాటలు కాస్త పెద్దగానే హాలు దాక వినపడుతున్నాయి. అవి విన్న చైతన్యకి అర్థంకాక ’ ఏంటి సంగతి ’ అన్నట్లు అమ్మమ్మ మొహంలోకి చూసాడు.  ’ ఏమి చెప్తాంలే ’ అన్నభావనతో నుదిటిమీద చేత్తో కొట్టుకొంటూ. " అదేదో మనింట్లోనే కొత్తగా జరుగుతున్నట్లు..లోకంలో ఎక్కడా లేనట్లు బాదపడ్తాందిరా మీ అమ్మ " అన్నది
 " ఏమయ్యింది అవ్వా " విషయం అర్థం కాక అడిగాడు చైతన్య
ఇంతలో వంటింట్లో పనులు అవడంతో తనలో తను మాట్లాడుకుంటున్న మాటలను పెద్దగా బయటకు అనేస్తూ హాలులోకి వచ్చింది. " అదొక్కటే ఆడపిల్లగా పుట్టింది... ఆ పుట్టేదేదో  మగపిల్లాడుగా పుట్టచ్చుగా..? " అంటూ వసారాలో కూర్చుని ఉన్న రామకృష్ణ వద్దకు వెల్లింది సరస్వతి.
" రేపు ఎవరెవరిని పిలవాలో నీవు నిర్ణయించుకో, నన్నేమి అడగొద్దు అట్లాగే రేపు పొద్దున్నే మార్కెట్‌‍కి వెళ్ళి ఫంక్షన్‌కి కావలసిన ఈ సామానులన్నితీసుకురా " అంటూ ఒక పెద్ద కాగితం రామకృష్ణ చేతిలో పెట్టింది. అలాగే అని తలఊపి పేపర్లో ఉన్న సరుకలు చదువుతూ కూర్చున్నాడు. తిరిగి ఇంట్లోకి వెళ్తూ.." చీ చీ రేపందరికీ ఈ విషయం చెప్పాలంటే ఎలాగో ఉంది " పెద్దగానే మాట్లాడుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది సరస్వతి.
 ఇదంతా చూస్తున్న చైతన్యకి ’సునిత గురించేనా అమ్మ మాట్లాడుతున్నది..? ’ అని మనసులో అనుకొన్నాడు. విషయం ఏమిటొ తెలుసుకుందామని వంటింట్లో సరస్వతి దగ్గరకు వెళ్ళాడు.  తనకు భోజనం రెడి చేస్తున్న తల్లిని " విషయం ఏంటి..? ఏమయ్యింది అమ్మా " అడిగాడు.
" ఏమి లేదులే..ముందు నీవు భోజనం చేయి "  అన్నం పెట్టిన ప్లేట్‌ని చైతన్యకి అందించింది.
సరస్వతి అక్కడి నుండి హాలులోకి వస్తూ.." వీధిలో అందరికి ఈ విషయం చెప్పి ఫంక్షన్ పెట్టాలంటేనే నామోషిగా ఉందే అమ్మా " అంటూ అన్నపూర్ణమ్మ పక్కన సోఫాలో కూర్చుంది.
" ఇందులో నామోషి ఏముందే...?  లోకంలో జరిగేదే..నీవు..నేను..అందరం కూడా...! నీవేమికొత్తగా చేయట్లేదు మనింట్లో కొత్తగా జరగట్లేదు " అన్నది అన్నపూర్ణమ్మ.
" లోకంలో జరిగేదే అయినా నా ఇంట్లో ఇలాంటివి ఉండకూడదనుకున్నా, సునిత కూడ చైతన్యలా మగపిల్లాడిగా పుట్టుంటే నాకీ బాదలు ఉండేవి కాదు కదా..? ఏంటొ..ఇలా.."    చేతులు తిప్పుతూ పక్కన అన్నపూర్ణమ్మకు చెబుతున్నట్లు కాక పైకి చూస్తూ అన్నది.
" ఏమిటే నీవు..? లోకంలో ఎవరైనా సరే ఈ విషయం విని అందరు సంతోషపడతారు " అంది అన్నపూర్ణమ్మ.
వీల్లమాటలు వింటూ భోజనం చేస్తున్న చైతన్య.." సునిత పుట్టి 12  ఏళ్ళు అవుతున్నది, ఇప్పుడూ కొత్తగా ఆడపిల్ల మగపిల్లాడు అని అనుకోవడం ఏంటి..? " అని మనసులో అనుకుంటూ..భోజనం ముగించి చేతులు తుడుచుకుంటూ హాలులోకి వచ్చాడు.  అమ్మ పక్కన కూర్చొని " నాకర్థం కావట్లేదు ఏవిషయం మాట్లాడుతున్నారు " అని అడిగాడు.
" మగాళ్ళకు చెప్పే విషయం కాదులే " అంటూ అక్కడ నుండి వంటిట్లోకి వెల్లిపోయింది.
అన్నపూర్ణమ్మ వైపు తిరిగి " ఏమిటన్నట్లు " నొసలు ముడిచాడు చైతన్య.
 రహస్యం చెబుతున్నట్లు చైతన్య దగ్గరగా వచ్చి మెల్లిగా " మన సునీత పెద్ద మనిషి అయ్యిందిరా " గుస గుసలాడింది.
" ఓహో.. అదా సంగతి..! అది ప్రకృతిపరమైనది.. ఎప్పుడైనా జరిగే విషయమే కదా ? అయినా సునీత పుట్టి 12 ఏళ్ళు అయ్యింది ఇప్పుడు ఆడపిల్ల, మగపిల్లాడు అని గుర్తు చేసుకుంటూ బాదపడుతున్నదేంటి అమ్మ..? " అడిగాడు
" అదేరా నాకు అర్థం కావట్లా..? లోకంలో ఏ కుటుంబంలో అయినా ఆడపిల్ల పుష్పవతి అయ్యిందని తెలియగానే సంతోషపడతారు..ఘనంగా వేడుకలు చేస్తారు, దీనికి వ్యతిరేకంగా మీ అమ్మ నామోషి అనుకుంటాంది ఏంటో " అంది అన్నపూర్ణమ్మ.
తలవంచుకుని కాసేపు సుదీర్ఘంగా ఆలోచించి అన్నపూర్ణవైపు తిరిగి " అవునూ సునిత ఎక్కడ...!! కనపడట్లేదు " అడిగాడు
" దాని స్టడీ రూమ్‌లో చాప మీద కూర్చోబెట్టారులే "
" అవునా నేనెల్లి మాట్లాడి వస్తాను  " అంటూ అక్కడ నుంచి లేచి సునిత ఉన్న గదివైపు దారితీసాడు. ఇది గమనించిన సరస్వతి వెళ్తున్న చైతన్య వైపు చూస్తూ " ఒరేయ్ దానిని తాకకూడదు, దూరంగా ఉండాలి. నీ పుస్తకాల పైత్యమంతా దాని తలకు ఎక్కించకు, ఇప్పటికే నీతో వేగలేక చస్తున్నాము, అది కూడ నీలా అవుతే మేము చావాలిక. దాన్ని నీలా తయారు చేయకు " అంటూ గట్టిగా కేకలు వేసింది.  
  తల్లితండ్రులతో  ఏవిషయంలోనైనా వాదనలు చేసే సమయాలలో చాలా బలంగా వాదించేవాడు చైతన్య, అతని వాదనతో తలపడలేక చాలా సార్లు తలపట్టుకునేవారు సరస్వతి, రామకృష్ణలు. అందుకు కారణం రామకృష్ణ సరస్వతిలు అతి సామాన్య మద్యతరగతి మనుషులు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. వారి ఆలోచనా విదానం మద్యతరగతి మనస్తత్వంలానే జీవితం సాఫీగా, బయట సమాజంలో ఒకరి గొడవల్లో తలదూర్చకుండా జీవితం అంటే పిల్లల్ని కనడం, వారికి ఏలోటు రాకుండా పెంచి, విధ్యాబుద్దులు నేర్పించి వారికో ఘనమైన హోదా, పరపతి గల జీవితం ఏర్పాటు చేయడం. అవి చూసి సంఘంలో గర్వంగా తల ఎత్తుకొని జీవించడం. అక్కడివరకే వారి ఆలోచనలు ఉండేవి. వీటికి భిన్నంగా చైతన్య ఆలోచనలు అతని మాటలు సాగేవి. చిన్నప్పటి నుండి పుస్తకాల పురుగు. పుస్తకాలు బాగా చదవడం వలన ఙ్ఞానంలో తల్లితండ్రుల కంటే తాను ఎన్నో మెట్లు ఎత్తులో ఉన్నానని వారికంటే ఆలోచనలలో అధికుడుననే భావన చైతన్య మాట్లాడే మాటల్లో చాలా ప్రస్పటంగా కనపడేది, అతని వాదనలు కూడ అలాగే చాలా బలంగా ఉండేవి. వాదనలలో చైతన్యతో వాదించలేక చాలా సమయాల్లో " నీతో మాట్లాడడం మావల్ల కాదురా..నీవొక వితండవాదివి " అంటూ కొట్టిపడేసి పలాయనవాదం పాటించేవారు  రామకృష్ణ సరస్వతీలు.. ప్రతి తరంలోనూ పెద్దలకు పిల్లలకు మద్యన ఈ మానసిక అగాధం ఉంటుంది, దానికో జనరేషన్ గ్యాప్ అన్న ఒక పేరు పెట్టుకున్నాము. అందులోను చైతన్య వయసు 23 ఏళ్ళే, అ వయసులోనే చాలా పుస్తకాలు చదివి ఉన్నాడు అవే అతన్ని తనో మహామేధావినన్న అభిప్రాయాన్ని కలగజేసాయి. సహజంగా ఆ వయసులో ఉండే ఆవేశం, బయటప్రపంచం మీద అవగాహన రాహిత్యం, కేవలం పుస్తకాలు చదివిన ఙ్ఞాన సంపద అతనిలో అధికుడు అనే భావన బలంగా ముద్రించుకొనేలా చేసింది, అతనింకా తల్లితంద్రుల చాటు కుర్రాడే. మానసికంగా, భౌతికంగా తనకంటూ సొంత జీవితంలోకి అడుపెట్టాక కాని ఆలోచనలకు..ఆచరణకు మద్యన ఎంత వ్యత్యాసం ఉన్నదో అన్నది స్పష్టం అవుతుంది
  గదిలోకి అడుగుపెట్టిన చైతన్యకి ఒక మూలన చాప మీద ఏడ్చి అలసిపోయి కూర్చొని ఉన్న సునీత కనపడంది. తల్లి మాటలతొ తల్లడిల్లిన ఆ చిన్నారి మనసును ఒక గంట క్రితమే అన్నపూర్ణమ్మ తన మాటల్తో ఎంత ఊరడించినా లోపలి గాయం మానలేదు. అసలు తాను చేసిన తప్పేంటి....? అని తనను తాను ప్రశ్నించుకుంటున్నది.   చైతన్య అడుగుల శబ్దానికి తల ఎత్తి చూసిన సునిత " నేను ఆడపిల్లగా పుట్టడం తప్పా..? " ఏడుపుగొంతుతో బేలగా ప్రశ్నించింది. ఆప్రశ్నకు ఏమి సమాదానం చెప్పాలో తెలీక చెల్లెలి బుగ్గలమీద కన్నీళ్ళ మరకలను చూస్తూ నిదానంగా నోరువిప్పాడు  " అయ్యో  నీ తప్పేమిలేదురా , అమ్మ ఊరికే భయపడుతూ అలా మాట్లాడింది అంతే కాని...అమ్మకు నీపైన  కోపమేమిలేదు " తలమీద చేయి వెసి సముదాయించడానికి ప్రయత్నించాడు.
" భయమా.. ఎందుకు ? " అడిగింది
   అలా అమాయకంగా అడుగుతున్న చెల్లెలి మొహంలోకి చూసాడు..  పెద్దమనిషయ్యే వయసొచ్చినా చిన్న పిల్లల పసితనం చెల్లెలి మొహంలో కదలాడుతూ ఉన్నది, ఏమి చెప్పాలో అర్థం కావట్లేదు, తల్లి మనసులో ఉన్న తత్వాన్ని చెప్పి చెల్లెలి పాలమనసు విరగొట్టడం ఇష్టంలేదు, అలా అని ఏ అబద్దం చెబుదామన్నా.. అది చిన్నపిల్ల మనసులో బలంగా ముద్రించుకునిపోతే..? దాని వలన భవిష్యత్తులో మరో తప్పుడు బావానికి దారితీస్తుంది,  సరే ఏదో ఒకవిదంగా  మాటలు చెప్పి సర్దిపుచ్చాలని " అది కాదురా..!! ఇప్పుడు కాదుగాని కొన్నేళ్ళకు నీకు పెళ్ళి చేయాలి కదా  అందుకు ఇప్పటినుండే డబ్బు, బంగారం కూడబెట్టాలి కదా..అవన్ని తలుచుకొని అమ్మ భయపడుతూ అలా మాట్లాడింది " అన్నాడు.
" ఆడపిల్లగా పుట్టడం అంటే డబ్బు, బంగారం ఉండాలా..? అవన్ని నాన్న చూసుకుంటాడు కదా.!! అమ్మకెందుకు బెంగ ? " అడిగింది సునీత .
ఏదో ఒక మాట చెప్పి తనలోపలి బాదను పోగట్టాలని చూసిన చైతన్యకి  అలా సునీత అడిగిన ప్రశ్నకు ఏమి సమాదానం ఇవ్వాలో తెలియట్లేదు " అవునురా నిజమే నాన్నే అన్ని చూసుకుంటాడు కాని అమ్మ సంగతి నీకు తెలుసుగా  అయినదానికి కానదానికి ఊరికే భయపడుతూ ఉంటుంది, అయినా అమ్మకు ఈ విషయం రెపొద్దటికల్లా ఏవి గుర్తు ఉంటాయి చెప్పు...? " అన్నాడు
ఇంతలో  " చాల్లేరా మాట్లాడింది బయటకు రా, సునితను తాకావా..? " గుమ్మం ముందు నించుని అడుగుతున్న సరస్వతి కనపడింది. ఆ మాటతో " వస్తున్నా " అంటూ చెల్లెలి వైపు తిరిగి " బాదపడకురా అమ్మకి నీమీద ఎటువంటి కోపం లేదు, రేపటికల్లా అంత అమ్మే మరిచిపోతుంది. ఏడవకు హాయిగా నిద్రపో " చెప్పి బయటకు నడుస్తూ తన తల్లి మాటలవెనుక భావమేమిటొ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు చైతన్య.
  హాలులోకి వస్తూ " అయినా మనం పెద్దమనిషి అయ్యిందన్న విషయం వీధంతా ఢంకామోగించేలా ఫంక్షన్ చేయాలా..? ఇప్పుడు ఇవన్ని అవసరమా ?  " అడిగాడు సరస్వతిని.
దానికి అన్నపూర్ణమ్మ " వోరి భడవా మీ అమ్మకు నీవు తోడయ్యావా..? అవన్ని మన ఆచారాలు , వీధిలో అందరిని పిలిచి ఘనంగా ఫంక్షన్ చేయాలి, అలా చేయకపోతే వీధిలో అందరు గుసగుసలాడరూ....? ఒక మంచి మర్యాద  లేకుండా పోతుంది. " అంది.
" అదే నా బాధ కూడ..నా కూతురు పెద్దమనిషి అయ్యందని ఊరంతా దండోరా వేయాలా..?  అసలు ఆ ఆలోచనే భరించలేకపోతున్నా " అంది సాలోచనగా.
" ఇంకా అయిపోలేదా మీ చర్చలు..? మాట్లాడింది చాల్లే వెళ్ళి పడుకోండి. పొద్దున్నే లేవాలి " అంటూ వచ్చాడు రామకృష్ణ. ఆ మాటతో పద పదమంటూ అందరూ ఎవరి వారి గదుల్లోకి వెళ్ళిపోయారు.

                                        ********************************

     మంచం మీద పడుకుందేగాని నిద్ర రావాట్లేదు సరస్వతికి.  ’రేపొదయమే ఈ విషయం వీధంతా చెప్పాలా...?  పెద్దమనిషి అయ్యిందన్న విషయం మగపిల్లలకి సైట్ కొట్టడానికి ఒక లైసెన్స్ లాంటిది అని అనుకుంటారు, అయ్యో ఏంటి ఈ తలరాత..? ఇద్దరూ మగపిల్లలే అయుంటే బాగుండేది అప్పుడు నాకీ ఈ అగచాట్లు ఉండేవి కావు.  రెండుమూడేళ్ళలోపల కూతురు ఎదిగిపోతుంది  అప్పుడు బజారులోని మగపిల్లలు కూతురుని చూసి కామెంట్స్ చేయడం, వెకిలి చేష్టలు, ఈవ్ టీజింగ్, ప్రేమంటూ వెంటపడడాలు.. అమ్మో అవన్ని తలుచుకుంటూనే భయంగా ఉంది ’ అలా పరివిదాలుగా సాగుతున్నాయి సరస్వతి ఆలోచనలు.    తాము ఎంత నిష్టగా పెంచినా..! క్రమశిక్షణ నేర్పించినా రేపు భవిష్యుత్తులో కూతురు ఏ మగపిల్లాడి మాయమాటలకు లొంగిపోతుందో..? ఇక్కడ తన కూతురు మీద ఉన్న " నమ్మకం " కన్నా టీనేజ్ వయసు పిల్లల మనస్తత్వం మీదున్న ఒక అవగాహన ఎక్కువగా భయపెడుతున్నది సరస్వతిని. కౌమారదశలో ఉండే ఆకర్షణలు, తల్లితండ్రుల కంటే మిన్నగా తాము ఇష్టపడే మనిషిమీద విపరీతమైన అభిమానం పెంచుకోవడం, అలాంటి సమయాలలోనే పెద్దలంటే లెక్కచేయకపోయే ధోరణలు వస్తాయి. ఎలా వీటి నుండి బయటపడడం...? " అలా ఆలోచనలతో సతమతమవుతూ నిద్రలోకి వొరిగింది సరస్వతి.

           తను స్త్రీ అయుండి కూడ తన ఆలోచనలో తన కూతురు పట్ల అలా ప్రవర్తించడానికి గల కారణం...! అంతర్లీనంగా మదిలో ఎక్కడొ దాగి ఉన్న " భయం ". అసలు సునీత పుట్టినప్పుడు ఆడనా మగనా..! అన్న తారతమ్యం లేనేలేదు, పాప బోసి నవ్వులు, కేరింతలు, బుడిబుడి నడకలు తల్లి మనసును మురిపించేవి. అలానే జీవితం కొనసాగింది కాని ఈ పన్నేండేళ్ళ జీవితానుభవంలో బయట ప్రపంచంలోని స్త్రీపురుషుల మద్యన ఉన్న తేడాలను, సమాజం తయారు చేసిన తారతమ్యాలను  గమనించింది,  ఇప్పుడు సునీత పెద్దమనిషి అయిన సందర్భం వచ్చాక ఆ భేదాలే సరస్వతిని భయపెడుతున్నవి, అవే ఇప్పుడు ఆడ మగ అన్న భావనని కలగజేస్తున్నవి. తను  ఆడదిగా కౌమార దశ, యవ్వన దశలు తర్వాత పెళ్ళి..ఇవన్ని చవిచూసి వచ్చిన మనిషే,  తను కూడ అందరిలాగే అన్ని దశల్లో ఆ కాలాలకు తగ్గట్లు మసలిన మనిషి, కౌమారదశలో టీనేజ్ లవ్ స్టోరీస్ సినిమాల ప్రబావం, వాటిపైన ఎక్కువ మక్కువ ప్రదర్శించడం,  అప్పుడె పైట వేసిన కాలంలో కుర్రాళ్ళు తమ వైపు వేసే కొంటే చూపుల భాణాలు తగులుతుంటే వాటికి పులకించిపోవడం, తర్వాత పెళ్ళి. పిల్లలు. అలా మారే కాలంతో పాటు తాము పోషించే పాత్రలు కూడ మారుతూ వచ్చాయి, ఇప్పుడూ తల్లి పాత్రలోకి వచ్చేసరికి అవన్ని గుర్తుకొస్తున్నాయి, ఇప్పుడున్న కూతురు దశలోఒకప్పుడు తాము ఉన్నప్పుడు  ప్రవర్తించిన దృశ్యాలు గుర్తొచ్చి ఆలోచనలో పడేస్తున్నాయి, తామేమో అవన్ని హాయిగా అనుభవించాము అదే ఇప్పుడు తన కూతురు విషయం వచ్చేసరికి ఆమెలోని " తల్లి " పాత్ర  ఒప్పుకోవట్లేదు, అప్పటి తన కాలంలో వచ్చిన లవ్‌స్టోరీస్ సినిమాలకే ఎక్కువ ఓటేసిన అదే మనిషి ఇప్పుడొస్తున్న లవ్‌స్టోరీస్ సినిమాలను సరస్వతిలోని  " తల్లి " తనం అంగీకరించట్లేదు. అదంతా కాలంతో పాటు మారిన తమ పాత్రల ప్రబావం. అలాగే కాలంతోపాటే  మారిన సినిమా విలువలు.  మార్పులు నిరంతరం జరిగే ఒక ప్రక్రియ అయినా వాటిని అంగీకరించే స్థితిలో లెరు.

                                                        *************

   కొన్ని సంవత్సరాల తర్వాత ఎమ్ సెట్‌లో సునీత మంచి ర్యాంక్ తెచ్చుకుంది,  కేరళలో ఉన్న కాలికట్ రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవాలని సునీత ఆలోచన, అందుకు తగ్గట్లే అక్కడ సీట్ వచ్చింది, కాని సరస్వతి ససేమిరా అంటూ ఒప్పుకోలేదు. ’అక్కడెక్కడో మాకు దూరంగా బాష తెలియని రాష్ట్రంలో ఏమి జరిగినా సమాచారం తెలియని ఊళ్ళొ వద్దనే వద్దు, అసలు కాలికట్ కాదు కదా మాకు దూరంగా ఏ కాలేజీ నేనొప్పుకోను మన ఊరికి దగ్గరలో ఉన్న కాలేజి చాలు ’ అంటూ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడపలోని ఒక ప్రవేట్ ఇంజనీరింగ కాలేజిలో చేర్పించారు. చైతన్య ఎంత నచ్చచెప్పినా వినలేదు సరస్వతి,
" నన్ను ఆ కాలికట్‍లోనే చదివించారు కదా ..! ఇప్పుడూ సునీత విషయంలో ఎందుకు అభ్యంతరం మీకు " అడిగాడు చైతన్య
"నీకు తెలియదులే ఆడవారి కష్టాలు. నీవు నోరుమూసుకో మాకు తెలుసు ఎవరిని ఎట్లా చదివించాలో. నీవంటే మగాడివి ఎట్లా ఉన్నా ఏమికాదు. నీలాగే ఆడపిల్లని అంత దూరంలో ఉంచి చదివిస్తే రేపు జరగరానిది ఏదన్న జరిగితే బయట సమాజంలో మేము తలెత్తుకొని తిరగలేమి, ముందే మీ నాన్న నోట్లో నాలుక లేని మనిషి. " అంటు దులిపేసింది చైతన్యని.
  మద్యతరగతి జీవులకు చాలా సులభంగాను వద్దన్నా వచ్చి చేరే ఆస్థి " పరవు ప్రతిష్టలు ". వాటికోసం పాణాలు వొడ్డి అయినా ప్రాకులాడుతారు, ఆ పరువు ప్రతిష్టలనబడే  " అద్దాల లాంటి మేడలు " నిర్మించుకుంటారు, వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి,  ఏ మూలననుండి ఏ రాయి వచ్చి పడుతుందో...? రేపు జరగరానిది ఏదన్న ప్రేమ వ్యవహారమో లేక అకతాయిల అల్లర్లో జరిగితే..?  అంతే  ఎవరో ఒకరు ఎక్కడ నుంచో ఏ చిన్న రాయి విసిరినా అంతవరకు తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న పరువు ప్రతిష్టలనబడే ఆ " అద్దాల మేడలు " భళ్ళున పగిలి బద్దలయి నేల కూలతాయి, అంతే అప్పటివరకు గుట్టుగా సాగిస్తున్న జీవితం డొల్ల అవుతుంది మొత్తం బట్టపయలు అవుతుంది,  సమాజంలో అందరు తమవైపు వేలెత్తి చూపుతారు. వాటిని భరించగలగే మానసిక స్థైర్యం చాలా కొద్దిమందికే అలవడుతుంది. ఇలాంటి భయాలన్ని అంతర్లీనంగా  సరస్వతి, రామకృష్ణ లాంటి మద్యతరగతి ప్రజల్లో గూడు కట్టుకని ఉన్నాయి.
       రామకృష్ణ కూడ సరస్వతి మాటలకే ఓటు వేయకతప్పలేదు, కూతరంటే ఎంతో గారాభం ఉన్నా భార్యా విదేయుడు కావడం మూలాన గంగిరెద్దులా తలఊపడం తప్ప అతనికి మరే మార్గం లేదు. తల్లి నిర్ణయాన్ని భరించలేకపోతున్నది సునీత, తన చదువు గురించి ఎంతో ఊహించుకుంది, ఎన్నో కలలు కన్నది. చివరకు తల్లి నిర్ణయానికే తలవొగ్గక తప్పలేదు సునీతకు.
   

      సినిమా మొదలయ్యి పదినిమిషాలు అవుతున్నా సినిమాలోకి లీనమవలేక కుర్చీలో అటు ఇటు కదులుతున్నా, థియేటర్లోకి ఒకరిద్దరు పేక్షకులు ఇంకా వస్తూనే ఉన్నారు, కూర్చున్నవారిలో కొంతమంది అప్పటికే గుర్రుమంటూ నిద్రపోతున్నారు. తెరమీద చూస్తే పదినిమిషాలైనా ఒకచోట పాతేసిన కెమెరా కదలట్లేదు..కాని నటులే మూగెద్దెల్లా అటు ఇటు మాటలు లేకుండా కదులుతున్నారు, అదొక ఫ్రెంచి ఆర్ట్ సినిమా, మరో పదినిమిషాలు చూసినా తెరమీద ఉన్న నటుల కదిలికల్లో మార్పేమిలేదు, ఇక భరించడం నా వల్ల కాక బయటకొచ్చేసాను. నాలాగే బయటకొచ్చిన ప్రేక్షకుల్లో కొంతమంది పక్కనున్న మరో స్క్రీన్ 1 లోకి మరి కోంతమంది ఎదురుగా ఉన్న స్క్రీన్ 3,4 లలోకి ఉరుకులు పరుగులతో వెల్తున్నారు. వాటిల్లో ఉన్న సినిమాలు కూడ మొదలయ్యి అరగంట అవుతున్నది ఇప్పుడెల్తే సినిమా అర్థం కాదు అన్న ఉద్దేశంతో నేను ఆగిపోయాను. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారి ఆద్వర్యంలో ప్రపంచ సినిమా పండగ ( International Film Festival ) ప్రసాద్  " ఐ "మాక్స్ థియేటర్సలలో జరుగుతున్న వేడుక అది, తెలిసిన కొందరు ఫ్రెండ్స్ కనపడి విష్ చేసి గబా గబా థియేటర్స్‌లలోకి వెళ్తున్నారు. అందరు సినిమాప్రియులే.. డెలిగేట్ పాస్‌లున్నవారు నచ్చిన సినిమాకి నాలుగు స్క్రీన్‌లలోకి వెళ్ళవచ్చు. తర్వాత ’ ఐ ’ మాక్స్‌లో మాజికల్ రియలిజం మీద 11 గంటలకు ఒక సినిమా ఉన్నది ఆ షో కోసం ఎదురుచూడడం తప్ప చేసేదేమిలేదనకొని అలా నడుచుకుంటూ వెళ్ళి ఫుడ్‌కోర్ట్ ఎడమవైపుకునున్న ఐరన్‌గ్రిల్ ఉన్న సీమెంట్ దిమ్మె మీద కూర్చున్నాను. సమయం ఉదయం 9:30, అప్పుడప్పుడే జనాలు ఐ మాక్స్ లోనికి వస్తున్నారు. నాకు అలా ఒంటిరిగా ఉన్నప్పుడు చుట్టు ఉన్న జనాల్ని, వారి హావభావలని, ప్రవర్తనలని గమనిస్తూ కూర్చవడం ఒక అలవాటు.
        అది 2008  జనవరి, సాఫ్ట్‌వేర్ రంగంలో. వ్యాపారరంగంలో ఇంకా ఆర్థిక మాంద్యం మొదలవ్వని రోజులు.  సెజ్‌లు, రియల్‌‍ఎస్టేట్స్ వ్యాపారాలు ప్రళయతాండవం చేస్తున్న కాలమది,  వై.ఎస్ దేవుడి గారి పుణ్యామా అని ఆ రంగాలలో ఉన్నవాళ్ళు ఒక్కమాటున కోటీశ్వరులయ్యారు దాని ప్రభావం ఐమాక్స్ నిండా జనాల రూపంలో కొట్టొచ్చినట్లు కనపడుతున్నది, రంగు రంగుల టాప్స్, జీన్స్‌లలో ఐ మాక్స్ గ్రౌండ్ ఫ్లోర్, మొదటీ అంతస్తులలో యువత ఉరకలేస్తున్నారు, ఎక్కడ చూసిన గల గలమంటూ మాటలు, ఎగిరొచ్చి రెండవ అంతుస్తులో ఉన్న మాకు వినపడుతున్నాయి. పైనుండి చూస్తున్న నాకు కిందనున్న మొదటి అంతస్తులోని జనాలు, అలాగే ఎస్కిలేటర్ ఎక్కివచ్చే గ్రౌండ్‌ఫ్లోర్‌ ప్రదేశమంతా చాలా స్పష్టంగా కనపడుతున్నది, ఎక్కడ చూసిన 13 నుండి 25  ఏళ్ళవయసున్న యువతే కనపడుతున్నారు, అంతకన్న ఎక్కువ వయసున్నవాళ్ళు అక్కడక్కడ ఉన్నా వారంతా హైదరాబాద్ వాసులు కాదన్న సంగతి ఇట్టే గుర్తించవచ్చు, వారి చేతిలో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ వారి పక్కనున్న ఐదారు సంవత్సరాల పిల్లలను చూడగానే  వారంతా నగరాన్ని సందర్శించడానికి వచ్చిన టూరిస్టలని అర్థమవుతుంది ,  వారిలో కొందరు ప్రసాద్ ఐ మాక్స్‌లో ఏదో కొన్నట్లున్నారు..వాటి దరలకే కరెంట్ షాక్ కొట్టిన నల్ల కాకుల్లా మాడిపోయారు పాపం, అందుకే బిక్కు బిక్కుమంటూ తినుబండారాలను, టాయ్స్‌ని, అక్కడున్నా వింత వింత గేమ్స్‌ని అదేదో అపురూపమైన లోకమన్నట్లు చూస్తూ నించున్నారు. రంగురంగుల డ్రస్సులతో ఉన్న హైదరాబాద్ యువతమద్యన ఆ టూరిస్టులు దిష్టి చుక్కల్లా కనపడుతున్నారు. అక్కడక్కడ నార్త్‌ఇండియిన్స్ జంటలుగా తిరుగుతున్నారు. కొందరు ఎగ్జిబిషన్ తత్వంతో హొయలు వొలికిస్తున్నారు, మరికొందరు తాము తెలిసినవారికి ఎక్కడ కనపడతామో అని గబగబా ఉరుకులతో ఏదో ఒక చాటుకు చేరుకుంటున్నారు.
           వీరందర్ని చూస్తన్న ‍నాదృష్టి మొదటిఫ్లోర్‌లో  ఏడుఎనిమిది మంది 14 నుండి 16 ఏళ్ళ వయసున్న అమ్మాయులు, అబ్బాయిలు నించుని ఉన్న ఒక గుంపు వద్ద ఆగింది, ఆ గుంపులో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు, తమ తమ జెబుల్లో నుండి పర్సులు తీసి డబ్బులు లెక్క పెట్టి ఒకరి చేతికిస్తున్నారు, బహుశ సినిమా టికెట్స్‌కి కలెక్షన్స్‌ చేస్తున్నట్లున్నారు., ఓ నలుగురు చేతుల్లో ఐదువందల రూపాయల నోట్లు తళతళమంటున్నాయి, అందులో ఒకబ్బాయి తన జేబునుండి ఒకటి రెండు వందరూపాయల నోట్లు బయటకు తీసాడు కాని ఇవ్వడానికి తటపటాయిస్తున్నాడు, అది చూసిన ఆ గుంపులోని ఒక అమ్మాయి ఆ అబ్బాయి వైపు అరచేతిని ఎత్తి చూపిస్తూ.." యెహె.." ఏంటి నీవు అన్నట్లు మొహం పెట్టి... వెంటనే తన పర్స్ తెరిచి అందులో నుండి మరో ఐదువందల రూపాయలనోటు తీసి ఆ తటపటాయిస్తున్న అబ్బయి తరుపున కలెక్షన్ చేస్తున్న అబ్బాయి చేతికి ఇచ్చేసి తటపటాయించిన అబ్బాయి వైపు తిరిగి " ఎప్పుడు బీద మొహం నీవునూ " అన్నట్లు చూసింది.. కేవలం మూడుగంటల వినోదంకోసం ఆ అమ్మాయి ఓ వెయ్యిరూపాయిలు తనకో లెక్కకాదన్నట్లు తీసి ఇవ్వడం నాకు చాలా ఆశ్చర్యమేసింది. అంతా సెజ్‌ల మహత్యం, పాపం తటపటాయించిన అబ్బాయి మొహం కాస్త కళతప్పింది, బహుశ ఆ అబ్బాయి తండ్రి ఏ చిరుద్యోగో లేక ప్రభుత్వ ఆఫీసులో చిన్న ఉద్యోగో అయుంటాడు అతని ఆర్థిక పరిస్థినిబట్టి  ఆ పిల్లవాడి ప్యాకెట్ మని ఉంటుంది, ఈరోజు ఇంటికెళ్ళాక జరిగిన ఈ సంఘటన వలన ఆ అబ్బాయి ఇంట్లో పెద్ద తాండవమే ఉండచ్చు అనిపిస్తున్నది, తండ్రి ఆర్థిక స్థితి మీద అవగాహన ఉన్నవాడు అయితే అర్థం చేసుకుంటాడు,  అవగాహన లేని వాడు అయితే  అలా అమ్మాయి ముందు తనో బికారిలా కనపడడం అన్నది అదో పెద్ద అవమానం లా ఫీల్ అయ్యి ఇంట్లో తండ్రి మీద శివతాండవమే చేస్తాడు. లేదా తండ్రి  భయం ఉంటే మాత్రం తల్లి వద్ద గొణుగుడు ఉంటుందనిపించింది నాకు. ఇది కాదుగాని ఓ మూడు గంటల వినోదం, సమయం గడపడానికి ఓ వెయ్యిరూపాయిల ఖర్చు చేసేంత స్థాయికి సగటు మనిషి జీవనప్రమాణాలు పెరిగాయా..? అన్నది నా ఆలోచన.  నేను కూడ ఎప్పుడన్న నాకో కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ బలవంతం మీద ఖచ్చితంగా పార్టి ఇచ్చిన సమయాలలో వేలు వేలు తీసి  ఖర్చుచేసినప్పుడు ఆ సమయంలో  నాగతాన్ని తలుచుకునేవాడిని, కేవలం కొన్ని గంటల ఆనందంకోసం వేలకు వేలు ఖర్చు పెట్టేంత స్థాయికి ఎదిగామా..?  అంతవసరముందా..?  ఒకప్పుడు పది పదిహేను సంవత్సరాల క్రితం అదే వెయ్యిరూపాయలతో ఒక నెలంతా  అంటే ముప్పై రోజులుకు సరిపెట్టుకోవాల్సి వచ్చేది.  పదిపదహేను సంవత్సరాలకే మన స్థాయి పెరిగిందా..? అలా ఆలోచిస్తున్న నాకు అప్పట్లో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తున్నది......

                                       *                                           *                                          *  

        అమీర్‌పేట్‌లో ఫ్యామిలీ ఇల్లే అయినా ఫ్యామిలికి పనికిరాని ఒక పెద్ద ఇంట్లో ఉండే వాళ్ళం, పర్మనెంట్‌‍గా ఆ రూమ్‌లో ఉండేది నలుగురమే అయినా ఎప్పుడు ఓ పదిమంది జనాలతో కళకళాడుతూ ఉండేది.  అమీర్‌పేట్‌లో అప్పటికింకా ఆధిత్య ఎన్‌క్లేవ్ అనే పెద్ద బిల్డింగ్ కట్టలేదు, మొదట్లో రూమ్‌లో తక్కువ జనాలు ఉన్నప్పుడు స్వయం నలభీమపాకమే..కాని రాను రాను మంది పెరగడంతో ఒక వంట మనిషి కూడ వచ్చి చేరంది, అంతే మారూమ్‌కి జనాల తాకిడి ఇంకా ఎక్కువైపోయింది, అందుకు కారణం మా రూమ్‌నుండి ఓ నాలడగులు వేస్తే బస్‌స్టాప్ చేరుకోవచ్చు, పని చూసుకొని రూమ్‌కి రాగానే వంట మనిషి చేసిన భోజనం రెడీగా ఉండేది..ఇంతకన్న ఇంకేమి కావాలి సుఖపురుషులకి. ఆ రూమ్‌లో నేను,  జె.ఎన్.టి.యులో కెమికల్ టెక్నాలజిలో ఎమ్.ఎస్.సి చేసి ఎన్విరాన్‌మెంటల్‌లో పి.హెచ్.డి చేస్తున్న జాషువా, భారత్ డైనమిక్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ చేస్తున్న ఎలక్ట్రానికి ఇంజనీర్ రవీంద్ర,  టెలీకమ్యూనికేషన్స్ సంబందించిన ఒక ఈపి.పి.ఎక్స్ సప్లైంగ్ అండ్ సర్వీస్ ఇచ్చే కంపెనీలో సాలరీ లేకుండా ట్రైనీ సర్వీస్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వేణు, ఈ నలుగురం పర్మనెంట్ రూమ్‌మేట్స్.  వేణు, రవీంద్ర ఇద్దరు ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమో చేసారు, హైదరాబాద్‌లో పగలు ఉద్యోగం చేస్తూ, సాయింత్రం I.E.T.E (A.M.I.E) క్లాస్‌లకు వెళ్తూ చదువుకుంటున్నారు.
  ఓరోజు ఎప్పటిలాగే ఉదయమే రూమ్‌మెట్స్ అందరు ఎవరివారి భోజనం క్యారియర్స్ కట్టుకొని ఆఫీస్‌లకు వెళ్ళిపోయారు, నేను దినపత్రిక చదువుతూ కూర్చున్నాను. కాసేపటికి దబదబమంటూ రూమ్‌తలుపు కొడుతున్న శబ్దాం ఈ టైమ్‌లో ఎవర్రా బాబు అనుకుంటూ వెళ్ళి తలుపు తీసి తీయకమునుపే దడేల్ మంటూ తోసుకుంటూ లోపలకి వచ్చాడు వేణు వగరుస్తూ..!
" ఏమైంది...? " వణుకుతున్న వేణు వైపు చూస్తూ అడిగాను.
" ముందు తలుపేయ్  చెబుతా " వణుకుతున్న మాటలతో అన్నాడు వేణు.
   వెంటనే తలుపులు వేసి వేణు వైపు తిరిగి వణుకు తగ్గేంతవరకు వేయిట్ చేసి మెల్లిగ అప్పుడడిగాను " ఏమయ్యింది "
వణుకుతగ్గినా పరిగెత్తి వచ్చిన ఆయాసం తగ్గలేదు , మెల్లిగా తన చేతిలో ఉన్న ఆర్.టి.సి టికెట్స్ ఫాయిల్ ఉన్న బంచ‌ని ఎత్తి చూపిస్తూ "  బస్ కండెక్టర్‌గాడు ..హ.... చిల్లర ..ఇవ్వట్లేదు..హ..ఆ.. గుంజుకొని ........ వచ్చాను " ఆయాసంతో రొప్పుతూ మద్యలో పదాలను మింగుతూ చెప్పాడు.
అప్పుడు గమనించా తన చేతిలో ఉన్న ఆ టికెట్స్ ఫాయిల్‌ని నేను, ఒక్కసారిగా ఉలిక్క పడ్డా వెంటనే తలుపుతీసి ఆర్.టి.సి బస్ కండక్టర్ ఎవరన్న వస్తున్నారా  అని వీధిపొడవునా చూసా .. ఎవరూ కనపడలేదు, హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటూ " అయినా చిల్లర కోసం ఇలా టికెట్స్ ఫాయిల్‌ని తెస్తావా..! పాపం అతని ఉద్యొగం పోతుంది ఇచ్చేసి రాపో " అన్నాను నేను.
 ఉద్యోగం పోతుందన్న విషయం చెప్పగానే ఇంకాస్త భయపడిపోయాడు వేణు.
" ఊహ నావల్ల కాదు " అన్నాడు.
" సర్లే  ముందు నీ టెన్షన్ తగ్గనీ కాస్త స్థిమితపడు,  తర్వాత ఆలోచించి ఎవరో ఒకరు వెళ్ళి టికెట్స్ ఫాయిల్ ఇచ్చేసి వస్తాము " అన్నాను.

    వేణు ఆర్థిక పరిస్థితి అదో విచిత్రమైనది, నేను అప్పటికీ ఇంటి నుండే వచ్చే డబ్బమీద ఆదారపడి ఉన్నాను, రవీంద్రకి అప్రెంటీస్ వలన స్టైఫండ్ వస్తుంది, జాషువాకి పి.హెచ్.డి వలన కాలేజి నుండి స్టైఫండ్ వస్తుంది అదే కాక  తను టాటా సైన్స్ ఇన్‌స్టిట్యూట్ వారికోసం పి.హెచ్.డి  చేస్తున్నాడు, కాబట్టి ఆ సంస్థ నుండి కూడ  స్టైఫండ్ వస్తుంది, వేణుకి అటువంటి సదుపాయం ఏది లేదు. తన పుట్టిన ఊరు వైజాగ్  అతని ఇంటి నుండి డబ్బు రావడానికి మాలాగ అతనికి తల్లి తండ్రులు లేరు, తను పదవతరగతిలో ఉండగానే చనిపోయారు, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఒక్క అన్నయ్య, పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్న ఒక చెల్లెలు. మొదట్లో అన్నయ్య ఆర్థికంగా ఆదుకున్నాడు కాని అతనికి పిల్లలు పుట్టాక తమ్ముడికి సర్దుబాటు చేయడానికి సాద్యపడట్లేదు. చూట్టానికి సినిమా కష్టాల్లా ఉన్నా.. అవి నిజాలు. చివరకు హైదరాబాద్‌లో ఎక్కడో ఉంటున్న దూరపుబందువుల ద్వార మూడు రూపాయల వడ్డితో అప్పుతెచ్చుకొని చదువుకుంటున్నాడు.
       రోజూ అమీర్‌పేట్ వద్ద 10 వ నంబర్ బస్ ఎక్కి ప్యారడైజ్ వద్ద నున్న ఆఫీస్‌కి వెళ్తాడు, అమీర్‌పేట్ నుండి ప్యారడైజ్‌కి 1-25 పసలు చార్జీ, రోజు అదే బస్, అదే కండక్టర్ రెండు రూపాయల నోట్ ఇస్తాడు వేణు, పావలా లేదంటూ అర్ధరూపాయి మాత్రమే చేతిలో పెట్టేవాడు, రోజూ ఇదే తంతు. నెలలో ఎటులేదన్న 15 రోజులు అలా చిల్లర లేదంటూ పావలా ఇవ్వకుండా వస్తున్నాడు, అలా రెండు నెలలు చూసాడు, అప్పుడప్పుడు తనే బయట పావల చిల్లర మార్చుకొని కండక్టర్‌కి ఇచ్చి రూపాయి తీసుకునేవాడు, అయితే ఈ నెలలో దాదాపుగా 20 రోజులుగా పావలా ఇవ్వకుండా ఎగరగొట్టాడు ఆ విషయం ఆలోచిస్తూ. ఆ ఇరవైరోజుల పావలాలు లెక్క కడితే ఐదురూపాయిలుగా తేలింది అంటే రెండురోజుల రానుపోను బస్ టికెట్ ఖరీదు అది. వాటికి మల్లి వడ్డీ కట్టాలి అలా ఆలోచిస్తున్నాడు వేణు, బయట నుండి చూసే వారికీ అతని ఆలోచన అసమంజసంగా అనిపించవచ్చు, మరీ పావలా మీద అంతాఅలోచనా.. అనిపించవచ్చు, ఆహనాపెళ్ళంట సినిమాలోని కోటలాగ పిసినారి అనిపించవచ్చు,  కాని వడ్డీ తెచ్చుకునేందుకు వేణు పడే కష్టాలు  అంతా ఇంతాకాదు, వడ్డీ ఇచ్చే ఆ ఆ దూరపు బందువులు " ఉద్యోగం లేదు. మరే ఇతర సంపాదన లేదు వడ్డీతో పాటు అసలు ఎలా తిరిగి చెల్లిస్తావు..? " అని అడిగితే, " ఆరు నెలల్లో నా ట్రైనీ పూర్తి అవుతుంది తర్వాత జీతం ఇస్తారు దానితో నెలా నెలా కొద్ది మొత్తం ఇస్తూ చెల్లించగలను " అని ఎలాగో అలాగ సమాదానంపరిచేవాడు, అదీ రాత్రి 9 గంటల తర్వాత వారింటికి వెళ్తనే బందువులు ఉంటారు. ఆ సమయంలో దొంగల భయం ఎక్కువ ఆ ప్రాంతంలో, తోడుగా మేము ముగ్గరం వెళ్ళేవాళ్ళం.
     ఈరోజు అదే బస్సు..అదే కండక్టర్ మల్లి అదే వరస పొద్దున్నే బయట చిల్లర కోసం చూసాడు కాని మరీ అంత ఉదయమే ఎవరి వద్ద దొరకలేదు చేసేది ఏమిలేక బస్సెక్కాడు. రెండు రూపాయలు ఇచ్చాడు, కండక్టర్ ఎప్పటిలాగే  పావలా ఎగ్గొట్టి అర్ధరూపాయే చేతిలో పెట్టాడు, అంతే వేణుకి ఎక్కడ లేని కోపం వచ్చింది, " పావలా ఇస్తావా లేదా " సీరియస్‌గా అడిగాడు
" ఉంటే ఇస్తాగా "  కండక్టర్ తిరుగు సమాదానం
" రోజూ ఇలాగే పావలాలు ఎగరగొడుతున్నావ్ " ఉక్రోషంగా అన్నాడు.
" నీవే చిల్లర తెచ్చుకోవాలి, రోజూ ఎంతమందికని ఇవ్వనూ "
" అదంతా నాకు తెలియదు, ఈరోజు పావలా ఎలాగైనా సరే ఇవ్వాల్సిందే " పట్టుపట్టాడు వేణు.
 ఎవరితను కేవలం పావలా కోసం అంతలా పట్టుపడుతున్నాడు అనుకుంటూ బస్సులోని ప్రయాణికలంతా వింతగా చూసారు వేణువైపు.
నిండు గర్భినీలా ఉన్నది బస్సు..కండక్టర్ టికెట్..టికెట్ అని అరుచుకుంటూ ముందుకెళ్ళి కొద్ది క్షణాల్లోనే వెనక్కి వచ్చాడు, అప్పుడు బస్సు గ్రీన్‌పార్క్ హోటల్ రోడ్ నుండి ఎడమవైపు నున్న బేగంపేట్ ఫ్లైఓవర్ కు తిరిగింది,    వేణు మళ్ళి అడిగాడు కండక్టర్‌ని " పావాలా ఇస్తావా లేదా " అని.
" లేదని చెప్పాగా ఏంటి నీ నస " కసురుకున్నాడు.
బస్సు చాలా మెల్లిగా బేగంపేట ఫ్లై‌ఓవర్ ఎక్కుతూ ఉన్నది, వెనుక ద్వారం వద్దనే కండక్టర్ టికెట్స్ నెంబర్స్ చెక్ చేసుకుంటున్నాడు. వేణుకి కోపం ఆగట్లేదు..’ఏమి చేయాలి వీడిని ’ ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే ఏదో ఆలోచన  తట్టింది తన బుర్రలో..బయట ఫ్లైఓవర్ను గమనిస్తూఉన్నాడు.. బస్సు బ్రిడ్జి పూర్తిగా ఎక్కేంతవరకు ఎదురుచూసాడు, చివరి సారిగా మల్లి అడిగాడు,  ఈ సారి బదులివ్వకుండా చిరగ్గా చూసాడు వేణు వైపు బస్సు కండక్టర్, అంతే కళ్ళు మూసి తెరిచేంతలోపల కండక్టర్ చేతిలో ఉన్న టికెట్స్ తో ఫాయిల్‌ని లాక్కోన్నాడు, వెంటనే రన్నింగ్‌లో బస్సు దిగి వెనక్కి తిరిగి పరిగెత్తాడు, బస్సు అప్పుడే బేగంపేట వైపునకు బ్రిడ్జి దిగుతూ వేగం పుంజుకుంది. కండక్టర్‌కి ఒక్కసారిగా ఏమి జరిగిందో అని తెలిసేలోపల వేణు అప్పటికే అమీర్‌పేట వైపు బేగంపేట బ్రిడ్జి దిగేస్తున్నాడు, ఒక్క ఉదుటున కండక్టర్ బస్సులోనుండి దూకేసి వెనక్కు పరిగెత్తుతూ " అర్రే బాబు  నీ పావలా ఇస్తానురా... తీసుకో..ఆ టికెట్స్ ఉన్న ఫాయిల్ ఇవ్వరా..నా ఉద్యోగం ఊడిపోతుంది " నెత్తినోరు కొట్టుకుంటూ పరిగెత్తుతున్నాడు, ఒక పక్క బస్సు బ్రిడ్జి అటువైపుకి దిగుతూ వెల్తున్నది, ఇటు చూస్తే టికెట్స్ ఉన్న ఫాయిల్ పోయింది.. ఎటు వెళ్ళాలో కండక్టర్‌కి అర్థం కావట్లేదు..., కాని అప్పటికే మాయం అయ్యాడు వేణు.

                                    *                                          *                                        *

    ఫ్రెండ్స్ వచ్చాక నేను వారితో కలిసి రాణిగంజ్ బస్‌డిపోకి వెళ్ళి " బేగంపెట వద్ద ఎవరో ఇది పడేసి వెళ్ళారు " అని చెప్పి డిపోమేనజర్‌కి ఇచ్చేసి వచ్చాము. ఒక్క పావలా తక్కువయితే జీవితం గందరగోళం అవుతుందా..? కేవలం 25 పైసలు కోసం ఎంత పెనుగులాట....?? ఏంటో దిగువ మద్యతరగతి జీవితాలు......!.  అదే వేణు తర్వాత  IBM మేయిన్‌ఫ్రేమ్స్ నేర్చుకొని విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొన్నాళ్ళు పని చేసి తర్వాత అమెరికావెళ్ళి వచ్చాక ప్రస్తుతం బెంగళూర్ ఎసుంచురాలో మేనేజమెంట్ స్థాయిలో ఉన్నాడు. గోల గోలగా అనిపించడంతో ఆలోచననుండి బయటకొచ్చి చూస్తే  సినిమాలన్ని వదిలినట్లున్నారు. నాచుట్టూ  జనంసంద్రం.. ప్రేక్షకులంతా చూసిన సినిమాల గురించి చర్చిస్తూ సందడి సందడిగా ఉన్నారు. కింద చూస్తే ఆ గుంపు లేరు బహూశ థియేటర్లోకి వెళ్ళుంటారనుకున్నాను.

          నేనొక్కడిని కూర్చొని ఉన్నది చూసి కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరకొచ్చి  " పద పద ’ఐ ’ మాక్స్‌లో సినిమాకి  టైమ్ అయ్యింది " పిలవడంతో  అక్కడ నుండి కదిలాను..

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers