కొన్ని నెలలు క్రితం మహా టి.విలో అనుకుంటాను..బేతంచర్ల దగ్గరలోని ఒక గ్రామానికి సమీపాన వున్న గుహల గురించి ఒక కథనం చూశాను..! అవి చూసినప్పటినుండి ఒకసారి వెళ్ళి చూసి రావాలని అనుకుంటూ వున్నాను. నంధ్యాలలో డి.ఇ గా పని చేస్తున్న మా మిత్రుడిని ఐదునెలలనుండి సతాయిస్తూ వున్నాను..వెళ్దాము అంటూ..! చివరికి ఈ నెల రెండోవారంలో సమయం దొరికి వెళ్ళాము.

    ఆ గుహల వద్దకు ఎలా వెళ్ళాలి..? తదితర విషయాలు మీడియా మిత్రుడి ద్వార తెలుసుకొన్నాను. అలానే మా మిత్రుడు కూడ కర్నూల్ జిల్లా వాసి కావడం..అందునా తను రోడ్డు మరియు భవనాల కార్యాలయంలో పని చేస్తుండడం వలన తనకు ఆ చుట్టుపక్కల వున్నప్రాంతాల విషయంలో సమాచారం తెలిసిన అతని సహచర ఉద్యోగుల ద్వార కొంత సమాచారాన్ని సేకరించడంతో మా మిత్రుడితో పాటు అతని మరో ఇద్దరి సహచర మిత్రులతో కలిసి ఒక రోజు ఉదయాన్నే ప్రయాణం సాగించాము.

     మీడియా మిత్రుడి ఇచ్చిన సమాచారాన్ని కాదని అక్కడి లోకల్ ఇంజనీర్లు ఇచ్చిన సమాచార ఆదారంగా వెళ్ళడం మూలాన ఒక కిలోమీటర్ నడవాల్సిన మేము అదనంగా మరో మూడుకిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. బేతంచర్ల వూరిలో నుండి గుహలకు వెళ్ళే దారి ఒకటి ఉండగా..అది కాదని బేతం చర్ల దాటి ఐదుకిలోమీటర్ల తర్వాత ఎడమవైపునున్న ఒక రహదారిలోకి తిరిగి తర్వాత రెండు కిలోమీటర్లు ప్రయాణించి రామకృష్ణాపురం అనే గ్రామం గుండా కొద్ది దూరం వెళ్ళాక కారు వెళ్ళడానికి అవకాశం లేక.. " నడకే హంసద్వని రాగమే " అంటూ నటరాజు సర్వీస్ మొదలెట్టాము.


        కాలిబాట.. దారి పొడవునా అటు ఇటు వున్న పొలాలలో పొద్దుతిరుగుడు పూలు పంటగా వేసున్నారు. కనుచూపు మేర పసుపు పచ్చ..ఆకుపచ్చ రెండు కలిసి మిలితమైన రంగుతో అవే కనపడుతున్నాయి... దూరంగా చుట్టూ పచ్చని కొండలు.  వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండడంతో మా నడక అంత శ్రమ అనిపించలేదు. పొలాల్లో పని చేస్తున్న రైతులను పలకరిస్తూ వెళ్ళాము...అయితే వారి నుండి గుహల గురించి సరైన సమాచారం రాలేదు మాకు..! అకడున్న చాలా మందికే  వారికి చుట్టుపక్కలే వున్న అక్కడి గుహల గురించి సరైనా సమాచారం లేకపోవడం ఆశ్చర్యమేసింది. రెండు కిలోమీటర్లు నడిచాక ఒకరిద్దరు రైతులు ఆ గుహల సమాచారం చెప్పనారంబించారు.  "కుడివైపు తిరగాలా..? లేక ఎడమవైపా..? " అని అడిగితే.. తల అడ్డంగా ఊపుతూ  " ఇంగో కిలోమీటర్ నడిసినాక పెద్ద యాపమాను వస్చాది దానిపక్కనే పెద్ద గుంత ఉంటాది అక్కడ పురిచేయి (ఎడమ చేయి) వైపు తిరిగి కిలోమీటర్ నడిస్చే ఆడ్నే గుహలు కన్పిచ్చాయి " అన్నాడు.. ఆహ ఏమి బాష..!! అసలు సిసలు పల్లె జీవనం, అక్కడి ప్రాంతపు యాస గుబాలిస్తుంది వారి మాటల్లో..! వారితో మాట్లాడుతుంటే వారి యాస వినసొంపుగా ఉంది..ఎవ్వరు కూడ ఎడమచేయి అని సంబోదించట్లేదు.." పురిచేయి " అనే మాట్లాడుతున్నారు.

     మొత్తానికి గుహల వద్దకు చేరుకున్నాము. చూడటానికి బయటకు అవి కనపడవు ఒక చిన్న గుట్టలాంటి కొండకు చివరి అంచులో ఉన్నాయి..దగ్గరగా వెల్తే కాని సరిగ్గా కనపడట్లేదు. రెండు కొండలు చీలిపోయినట్లుగా ఉన్న చీలిక మద్యనుండి లోపలకి ప్రయాణిస్తే  అక్కడ సహజంగా ఏర్పడిన కమలాపండు రంగుతో వున్న పెద్ద ఆర్చి కనపడతుంది. ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆర్చ్ అది..చాలా బాగుంది. దాని దాటి వెళ్తే " U " ఆకారంలో కత్తిరించినట్లుగా ఉన్న ఎత్తైన కొండకు రకరకాల ఆకారాలలో శిలాజాలు కనపడతాయి వాటి మద్యలో కుడివైపున పది అడుగుల వెడల్పు ఐదు అడుగుల ఎత్తుతో వున్న ఒక గుహ కనపడుతుంది.

      
     ఆ గుహల గురించి చారిత్రక విషయాలు ఏవి తెలియవు కాని గుహలకు దగ్గరలో ఉన్న " కనుమ కింది కొట్టాల "   అనే గ్రామంలో ఉండే కొంతమంది యువకలకు గుహల చరిత్ర తెలియకపోయినా ఎప్పుడు గుహల్లో తిరుగుతూ వుండేవారు. వారిలో బాష అనే కుర్రాడికి ఫోన్ చేసి పిలిపించాను. ఆ కుర్రాడు వచ్చాక అతనితో కలిసి నేను ఒక వంద అడుగులు గుహలోకి నడిచాము కాని లోపల అంత చిమ్మ చీకటి ఒకటే గబ్బిలాల వాసన కొడుతున్నది..అవి భరించలేక వెనుతిరిగాను. లోపల దాదాపుగ రెండు కిలోమీటర్ల పోడవునా దారి ఉన్నదని బాష చెప్పాడు. వాళ్ళు దాదాపుగా ఒక గంట సేపు లోపల ప్రయాణించారట..!  లోన అక్కడక్కడ పెద్ద పెద్ద ఎత్తైన మహల్స్ ఉన్నాయట..! కాని చిమ్మ చీకటి సామాన్యమైన టార్చ్‌లైట్స్ వెలుగు సరిపోదు 2000W లేదా 4000W  గల లైట్స్‌తో మాత్రమే అక్కడి శిలాజాలు చూడగలమన్న సంగతి అర్థమైంది.

      ఆ గుహనుండి బయటకొచ్చి " U " ఆకారంలో ఉన్న కొండకు ఎదురుగా ఒక 50 అడుగులు నడిస్తే మరో రెండు గుహలు కనపడతాయి. మొత్తం మూడు గుహలున్నాయి. ఒకదానికి ఒకటి సంబందం లేకుండా వున్న గుహలవి. లోన ప్రయాణిస్తే ఎక్కడికి వెళ్తామో కూడ తెలియదు. మొత్తానికి అవొక రహస్య గుహలే..!!

     ఆ బాష మాటల్లో కొన్ని విషయాలు తెలిసాయి. ఒక విదేశీ మహిళ గత రెండేళ్ళుగా సంవత్సరానికి ఒకసారి వస్తున్నారట..! గుహల ముందు ఒకటి మరో రెండు చోట్ల కత్తితో కోసినట్లుగా దీర్ఘ చతురశ్రాకారంలో ఓ పది పదిహేను అడుగుల లోతున్న గుంతలు చాలా జాగ్రత్తగా తవ్వి వున్నారు. ఆ తవ్విన తీరు చూడగానే అర్థమవుతుంది. శాస్త్రీయ పరిశోదనలు చేసేవారు మాత్రమే అలా తవ్వగలరని. అలా తవ్విన గుంతల్లో మానవ అవశేషాల ఎముకలు కొన్నిటిని సేకరించి పరిశోదనల నిమిత్తం తీసుకెళ్ళేవారట..! ఆమే ఏ దేశస్తురాలో కూడ అక్కడి ప్రజలకు తెలియదు. మనకు.. మన ప్రభుత్వాలకు ఇలాంటివి అస్సలు పట్టవు..ఇప్పటికే చాలా కుంభకోణాలలో మునిగి తేలుతూ చాలా బిజి బిజీగా వున్నారు ఇక ఇలాంటి సామాన్య విషయాలకు మెదుడులో తావెక్కడిది..? అందులోను ఇలాంటి గుహల వలన ఆర్థికంగా ఎటువంటి లాభాలుండవు.
    చాలా ఏళ్ళుగా అక్కడికొస్తున్నాని తన మాటల్లో వివరించాడు బాష. ఇలాంటి గుహలని సంరక్షించే ఒక అంతర్జాతీయ సంస్థ జర్మనీలో ఉందని నేనెప్పుడొ చాలా ఏళ్ళ క్రితం విన్నాను. బనగానపల్లె దగ్గరలో ఉన్న " బెలుం " గుహలు కూడ మొదట్లో ఆ జర్మనీ సంస్థవారే తమ ఆదీనంలోనికి తీసుకొని  వాటి సంరిక్షించారు. అలానే ఇవి కూడ వారికి తెలిస్తె బాగుంటుంది. పత్రికలు వాళ్ళు వీటికి " ఎర్రజాల గుహలు " అని పేరు పెట్టారు గాని..చుట్టుపక్కల ప్రాంతాల రైతులు..గొర్రెల కాపర్లు మాత్రం " పావురాల గద్దె " అని పిలుస్తున్నారు.


   ఎవరైనా ఉత్సాహవంతులు వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుండి కర్నూల్‌కి వెళ్ళి అక్కడ నుండి బనగాన పల్లెకు వెళ్ళె రహదారిలో " బేతం చర్ల " వూరు వస్తుంది. ఆ వూరిలో నుండి ఎడమవైపుకు తిరిగి ప్రయాణించి " కనుమ కింది కొట్టాల " అనే గ్రామం చేరుకోవాలి. అక్కడి వరకు వాహనాలలో వెళ్ళవచ్చు అక్కడి నుండి కాలబాట వెంబడి ఒకటిన్నర కిలోమీటర్ నటరాజు సర్వీస్ చేస్తే ఈ గుహలకు చేరవచ్చు. సహాయంగా కనుమ కింది కొట్టాల గ్రామ కుర్రాళ్ళు తోడస్తారు..ఈ గుహలను కూడ చూపెడతారు.


About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers