.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

  బక్కెట్లను మోసే భాద్యత తీసికొన్న ఎనుబోతుల సుబ్బారెడ్డి - రెండు బక్కెట్లను  రెండు చేతల్లో పట్టుకొని వాళ్ళకు అందకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడు.
  అతనెందుకు పారిపోతున్నాడో ఎవరికీ అర్థం కాలేదు.
 కేకలేసి పిల్చినా నిలబడలేదు.
 ప్రయోగించేందుకు చేతుల్లో బాంబులు లేవు.
 మొదటి గ్రూపు అప్పటికే దూరంగా వెళ్ళింది.
 ఏం చేయటానికి తోచలేదు.
 మూడవ గ్రూపు కేసి చూస్తూ కేకలేశారు  " బాంబులు...  బాంబులు తీసకరాండి...  "  అంటూ.
  వాళ్లు కూడా జరుగుతోన్న దృశ్యాన్ని గమనించారు.
 పొరబాటును సవరించేందుకు ముందుకు రాబోయారు.
 అప్పటికే రెండు నిమిషాల విలువైన సమయం దొరికింది చెన్నారెడ్డి గన్‌మెన్‌కు - తను షాక్ నించి తేరుకొనేందుకు.
 వెంటనే జీపులోంచి కిందకు దిగదూకారు.
ఎల్.ఎమ్.జి ఎయిమ్ చేసి గాల్లోకి రెండు రౌండ్లు పేల్చిన తర్వాత నేరుగా మూడవ గ్రూపు కేసి గురి పెట్టాడు.
 పరిస్థితి అర్థమై రెండు గ్రూపులూ దూరంగా పారిపోక తప్పలేదు.
 చెన్నారెడ్డిని జాగ్రత్తగా జీపు దింపి మరో జీపులో కూచోబెట్టి రివర్స్ చేసి టౌన్లోకి తీసుకెళ్లాడు గన్‌మెన్.
 శివపురి వర్గం కూడా తమ జీపులెక్కి పారిపోయారు.
 కొన్ని రోజుల పాటు వాళ్లంతా అఙ్ఞాత వాసంలోకి వెళ్ళక తప్పదు.
 మర్డర్ జరిగింది గాబట్టి కేసులుంటాయి, అరెస్టులుంటాయి, బెయిళ్ల కోసం ప్రయత్నించాలి.
 ఆ పది రోజులూ మినిష్టర్ గెస్ట్ హౌస్‌లో గడిపారు శివపురి వర్గమంతా.
 రెండవ దాడితో రమణారెడ్డి పేరు రాష్ట్రమంతటా పాకింది.  చెన్నారెడ్డి మీద హత్యాయత్నాన్ని గురించి రేడియోలు గీపెట్టాయి.  " మృత్యుంజయుడు చెన్నారెడ్డి "  అంటూ పత్రికలు వార్తలు రాశాయి.
  ఎనుబోతుల సుబ్బారెడ్డి ఎందుకట్లా బాంబులు బక్కెట్లను దూరంగా తీసికెళ్లి చెన్నారెడ్డి ప్రాణాలు కాపాడాడో అర్థం కాకుండా వుంది.
  అందరికీ బెయిలు తెచ్చుకొన్న తర్వాత ఒకనాడు జీపులో వెళ్లి సుబ్బారెడ్డిని లాక్కొచ్చాడు బాలుడు.
 నోటికి ఎట్లా వస్తే అట్లా తిడుతూ తలొక దెబ్బ వేశారు.
 లబలబ మొత్తుకొన్నాడు సుబ్బారెడ్డి.
 తనకు తెలిసి ఆపని చేయలేదన్నాడు.
 ఏదో మైకం కమ్మి అట్లా వెళ్లానన్నాడు.
ఎంత కొట్టినా అతన్నించి అదే సమాధానం.
  మెడబట్టి బైటకు నెట్టి వదిలేశారు అతన్ని.
  విషయమంతా విని వక్కాకు ఎంగిలి తుపుక్కున వూస్తూ  " మీకు తెలివిలేక వానిసేతికి బక్కెట్లిచ్చినారు... "  అన్నాడు పెద్దిరెడ్డి.
  పెదనాన్న కేసి ప్రశ్నార్థకంగా చూశాడు రమణారెడ్డి.
  " నీ చెయ్యి నరికినోన్ని,  వాని చెయ్యీ నరకాలని నీకు కసిగా వుంటాదిగాని, నీజేబులో లెక్క తీసుకొన్నోని సెయ్యి నరకాలని నీకెప్పుడూ వుండదబ్బీ ! వాడూ అంతే.... వాని కొడుకునో, తమ్మున్నో చెన్నారెడ్డి సంపింటే వానిగ్గూడా అతన్ని సంపాలని కసి వుండేది. తీసుకున్నె భూములు ఎప్పుడోకసారి యియ్యడా అని ఆశ..... ముందంతా బీరాలు తీసినోడు సంపేకాడికొచ్చేసరికి వానికి.. తెలియకుండానే కడుపులోంచి పాపభీతి తన్నుకొని వచ్చుంటాది... "  చెప్పాడు.
 పెద్దిరెడ్డి విశ్లేషణ అందరికీ నచ్చింది.
 తాము మరోసారి పొరబాటు చేశారు.
 మనుషుల్ని ఎన్నుకోవటంలో తప్పటడుగు వేసి లక్ష్యం సాధించలేక పోయారు.  తామెన్ని ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుందో - విజయం సాధించే సరికి... !
 రోజు రోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి.
 మందూ మాంసమూ లేకుంటే జనాలు అడుగు ముందుకేసేట్టు లేరు.
 డబ్బు గురించి యిబ్బంది లేదుగాని ఎన్నాళ్లిలా అపజయాల మీద అపజయాల్ని మోయటం..!
   రాత్రి మిద్దె మీద పడుకున్నపుడు అందరూ తమ సహజశైలిలోనే తమాషాలాడుకొంటూ, తిట్టుకొంటూ ఏవేవో సంఘటనల్ని చెప్పుకొని నవ్వుకొంటూ గడుపుతున్నారు గాని రమణారెడ్డి వాళ్లల్లో కలవలేకపోయాడు. మనస్సులో అపజయానికి సంబంధించిన బాధ అతన్ని పీడిస్తూ వుంది. మళ్లీ ఇంతమంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుందని..!
  తను వేసిన జోకులకు నవ్వక పోయేసరికి మజ్జిగ గోపాల్ నొసలు ముడేసి చూశాడు. తన పిట్ట కథల్ని ఆసక్తిగా వినకపోయేసరికి చంద్ర ఆశ్చర్యపోయాడు. తమ మాటల్లో పాలుపంచుకోకుండా వున్న రమణారెడ్డి పరధ్యానాన్ని అందరూ పసిగట్టారు.
  " ఏమన్న !  వొల్లు బాగలేదా ? "  మజ్జిగ అడిగాడు.
 రెండు సార్లు తర్వాత అతన్నించి జవాబొచ్చింది.  " వొల్లు గాదు మనస్సే... "  
  " అదేందో అందరికీ సెబుతేగాదూ మంచీ చెడ్డా తెలిసేది. ? "
  " మీ అందరికీ తెలిసిందే ! "
  " అందరికీ తెలిసీ నిన్నొక్కన్నీ బాధపెట్టేది ఏందబ్బా ? "
  " అదేరా !  వాన్ని సంపలేకపోతనామనే బాధేరా ! వాడు మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటే మనతో అవుతుందా అని ఆలోచన.. "
 " ఓ... అదా ! "  అన్నట్లు తేలిగ్గా చూశాడు మజ్జిగ.  " పైరు బెట్టినాం బ్రదరూ ! నాట్లేసినాం - కలుపుతీసినాం... అది పండక మానదు. మనం కొయ్యకా మానం ..."
  సమధాన పడలేదు రమణారెడ్డి.
  కొంత సేపయింతర్వాత రాఘవ అతని దగ్గరగా వెళ్లాడు.  " అన్నా !  సేతనయినకాడికి ( చేతనయనంత వరకు )  పోరాడుదాం.  సేతగాని రోజు నా వొక్కని మీద వొదిలేయ్యండి...  వాన్ని నేనే సంపుతా ! "  అన్నాడు.
 అతనికేసి వింతగా చూశాడు రమణారెడ్డి.
  " అవున్నా ! ఇక్కడికి రాకుంటే నేనెప్పుడో చచ్చేవాన్ని, నా చావు ఖాయం జేసుకొనే మాయబ్బ( నాన్నకి నాన్న).... నన్నీడ విడిచిపెట్టింది.  వాన్ని మామూలుగా సంపలేమనుకో.....  వొడిగట్టుకొని వొడినిండా బాంబులు పోసుకొని వాని మీద దూకుతా.  వాన్ని సంపి నేనూ సస్తా...!  ఎమ్మెల్లే గాడు సావడనే భయం వొదిలిపెట్టన్నా ! "
  ఒక్క క్షణం ధిగ్భ్రాంతికి గురయ్యాడు రమణారెడ్డి.
 వింటూ వున్న వాళ్లంతా కూడా ఆశ్చర్యపోయారు.
  అతనికేసి అపురూపంగా చూడసాగారు.
  ఉన్నట్టుండి మజ్జిగ గోపాల్ అతని దగ్గరగా వెళ్లి  " తమ్మునివంటే నువ్వేరా ! "  అంటూ నడుము కరుచుకొని పైకెత్తి వదిలాడు.
 అక్కడంతా ఉత్తేజకరమైన వాతావరణం ఆవరించింది.
 కొత్త వుత్సాహంతో వాళ్లకు పొద్దు పొడిచింది.
  యధా ప్రకారపు కార్యకలాపాలకు మల్ళీ అంకితమయ్యారు.

                 *********

  చెన్నారెడ్డి తన చుట్టూ ఇప్పుడు అభేధ్యమైన రక్షణ వలయాన్ని నిర్మించుకొన్నాడు. ఇదివరకటిలా అతని మీద దాడి చేసేందుకు అవకాశంలేని గోడ సృష్టించుకొన్నాడు.
  అదను కోసం ఎదురు చూస్తూ వున్నారు వాళ్లు.
  కోర్టు వద్దనో, పోలీసు స్టేషన్ వద్దనో ఎదురు పడినపుడు వాళ్లకేసి మిర్రి మిర్రి చూస్తున్నాడు చెన్నారెడ్డి.  పొట్టిగా, నల్లగా, తనలో సగం కూడా లేని శివపురి సోదరుల్నించి తనకు ప్రాణభయం ! ఆలోచిస్తే సిగ్గు చేటుగా అన్పిస్తుంది.  కానీ వాస్తవాల్ని దాచలేం గదా !
  తనలాగా డబ్బుగానీ, రాజకీయంగానీ, అంగబలం గానీ వాళ్లకు లేవు -  తనను మర్డర్ చేయాలనే ఒక్క కమిట్‌మెంట్ తప్ప....  ఆ ధ్యేయమే వాళ్లకు డబ్బును, రాజకీయాన్ని సమకూర్చి పెడుతోంది.
వాళ్లిప్పుడు తనకు మొగుళ్లయి..  కాదు కాదు... యముళ్లయి కూచున్నారు.
  జీవితంలో మొట్టమొదటి సారిగా అతనికి అన్పించింది - తనేమైనా పొరబాటు చేశాడేమోనని.
 శివపురి ఓబుళరెడ్డిని చంపటం పొరబాటు కాదు గదా !
 తల అడ్డంగా తిప్పాడు.
 అతను తన రాజకీయ జీవితాన్ని చంపేందుకు ప్రయత్నించాడు.
  రాజకీయం లేకుంటే తన వునికి కష్టమే గదా !
 అందుకే తనతన్ని చంపించాడు.
 బైట శత్రువులకు తోడు తనకు ఇంట్లో కూడా ఓ శత్రువు.
 బైట జీవన్మరణ సమస్యలతో సతమతమవుతోంటే,  ఇంట్లో ఓదార్పు లభించటం మాట దేవుడెరుగు పెళ్లాం సాధింపులు ఎక్కువయ్యాయి.
  జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద అటాక్ జరిగిన రోజు ఇంట్లో ఆడదాని సాధింపులే తనకు బరువయ్యాయి.
 అందుకే యీ మద్యకాలంలో ఎక్కువగా హైద్రాబాదులోనే వుంటున్నాడు. ప్రియురాలి కౌగిలిలో సమస్తం మరిచిపోయి బతుకుతున్నాడు.  తన సమస్యలతో కొట్టుమిట్టాడే కొద్దీ జనం సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. అన్నిటికంటే పెద్ద సమస్య కరువు... వర్ష బావం వల్ల పైర్లన్నీ ఎండిపోయాయి.  వాళ్ల కోసం వడ్డీ మాఫీ, పంటల భీమా పథకంలాంటి వాటి మీద అసెంబ్లీలో నిలదీయాల్సిన సమయం.. వాటి పైకి మనస్సు పోవటం లేదు.  గ్రామ నాయకులు కూడా వాటిని గురించి పట్టించుకోవటం లేదు - ఎప్పుడూ తమ వ్యక్తిగత లాభాల కోసం ప్రయత్నించటం తప్ప వాళ్ల కోసం తను అప్పుడప్పుడూ కలెక్టర్ వద్దకో, ఆర్.డివో వద్దకో వెళ్లటం తప్ప ఎక్కడికీ తిరగటం లేదు.  ఎక్కిడికి వెళ్లినా విసృతమైన బందోబస్తు అవసరమవుతోంది. తన రక్షణ వలయంలో తనకే వూపిరాడనంత పరిస్థితి.
  జి.పి.ఆర్ వద్ద దాడిని గురించి ఆలోచిస్తే యీ రక్షణ అంతా మాయగా తోస్తుంది.
 అయినా తప్పనిసరి గదా  !
  ఎంతగా రాటు దేలారు శివపురి కుర్రాళ్లు. !
 అమాయకంగా కన్పించే రమణారెడ్డి ఎంత క్రూరంగా తయారయ్యాడనీ !
  ఈ గొడవలన్నిటికీ కారణం అతడేనేమో  !
  విజయవాడలో వాడు  ’లా ’ చదివేటపుడు తనకు ఓబుళరెడ్డికి మద్య పెట్టిన చిచ్చే యీ గొడవలన్నిటికీ మూలం.
 తనకు బాగా గుర్తుంది.
  రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న ఓబుళరెడ్డిని చూసి వద్దాం రమ్మని పిల్చాడు వాడు.
 తను జీపు తెచ్చుకోలేదని చెప్పాడు.
  వాస్తవానికి జీపు తెచ్చుకొనే వున్నాడు.  వ్యక్తిగత కారణాల వల్ల వెళ్లటం కుదరక అట్లా చెప్పవలసి వచ్చింది.
  వ్యక్తిగతమంటే - అందమైన కోస్తా అమ్మాయితో గడిపే అవకాశం వచ్చింది ఆ రాత్రికి.
 తన జీపుని చూసినట్టుంది వాడు.
 చిన్నాయనకు వున్నవి లేనివి కల్పించి చెప్పాడు.
  ఆ రోజునించి ఓబుళరెడ్డి తనమీద కక్ష గట్టాడు.  తన పరువు తీయటం మొదలెట్టాడు.
  అన్నిటికీ ఓర్చుకొన్నాడు తను.
 చివరకు తన రాజకీయ జీవితాన్ని కూడా తుడిచివేయాలని చూశాడు.  తన జీవితాన్ని కాపాడుకొనేందుకు అతన్ని అడ్డు తొలిగించుకోక తప్పింది గాదు.
 ఇప్పుడది తనకు ఉరిగా మారింది.
 ’ దీనికంతటికీ కారణం ఆ పొట్టి వెధవే... ’
 కసిగా పళ్లు కొరికాడు చెన్నారెడ్డి.
 కిరాయి గూండాల చేత వాన్ని చంపిద్దామనుకొంటే సాధ్యపడేట్టు లేదు.  వాడు ఒక్కడు కాదు. గుంపు... ఎప్పుడూ మందితో కలిసి వుంటాడు. ముఖాముఖి యుద్దానికి దిగుదామంటే వీలయ్యేట్టు లేదు.
 పోలీస్టేషన్ ముందే గొడవలకు పూనుకొన్న తెగువ వుంది వాళ్లకు.
  తను ఆత్మరక్షణ స్థితిలోకి నెట్టబడుతున్నాడు తప్ప - వాళ్లకు ఆ అవస్థను కల్పించలేక పోతున్నాడు.
  దీనికి కారణం బహుశా - తన శత్రువు రమణారెడ్డి ఒక్కడే కాదు గాబట్టి.
 వాడు పోయినా ఇంకొకడు.
  ఏడుమంది సోదరులు పోయినా మజ్జిగ గోపాల లాంటి వాళ్లయినా తన మీద కసిదీర్చుకొనేందుకు వెనుదీయరు.
  తన్ను చంపాలనే ధ్యేయం తప్ప వాళ్లకు మరొకటి లేదు.
 తన పక్క ఎంతమంది జనముంటే మాత్రం ఉపయోగమేముంది...? ప్రాణాలు అడ్డపెట్టేవాడు ఒక్కడన్న లేకుండా...!!
ఒక్కడు....  ఒక్కడైనా తనకు అండగా నిలబడొచ్చుగదా - జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద అటాక్ జరిగినపుడు.
  కావలసినన్ని ఆయుధాలు చేతబెట్టుకొని కూడా పారిపోయారు.
అంటే -  తన ప్రాణం కన్నా ఎవరి ప్రాణం వాళ్లకు గొప్పదైంది.
 అవతలి వాళ్లల్లో యీ భావన కన్పించటం లేదు.  తమ ధ్యేయం మూడు ప్రాణాల్ని చిత్తుకాగితాలతో సమానంగా చూస్తున్నారు.
  తన గన్‌మెన్‌కు ప్రాణం కంటే ఉద్యోగ ధర్మమే గొప్పదిగా అన్పించింది కాబట్టి తను బతికి పోయాడు.
  ఎప్పుడైనా కోర్టు వద్దో, పోలీస్టేషన్‌లోనో ఎదురు పడినపుడు శివపురి సోదరుల్ని చూస్తూనే చెన్నారెడ్డికి అన్పిస్తుంది  ’యీ అర్భకుల్ని తను చంపలేక పోవటమేమిటీ ? ’ అని.  ఇప్పటి కిప్పుడు తుపాకితో కాల్చిపారేస్తే మాత్రం ఏమౌతుందేమిటి..?  మహా అయితే కేసే గదా ’  అన్పిస్తుంది.
 అయితే - చెన్నారెడ్డిని చూసినపుడు బాలునికి కూడా అలాగే అన్పిస్తుంది. ’పరుగెత్తుకొంటూ వెళ్లి వాన్ని పొడిచి చంపితే ఏమవుతుందేమిటి ? ’ అని.  ’గన్‌మెన్ ఫైర్ జేస్తాడేమో ! ఇద్దరం చస్తాం అంతే గదా...  తనుపోయినా ఆరుగురు సోదరులు మిగులుతారు గదా ! ’
  అట్లాంటి ఆలోచనలు దగ్గరకే రానివ్వొద్దంటాడు రమణారెడ్డి.  తమ వైపునించి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదుట..!

                           *********

   చెన్నారెడ్డి గతంలోలాగా స్థానికంగా వుండేందుకు ఎక్కువ సమయం కేటాయించక పోవటం వలన అతను ఎక్కడో కాంట్రాక్ట్ పని తీసుకొని తన కొడుకుల్ని, అన్నకొడుకుని అక్కడే వుంచాడనే పుకార్లు వ్యాపించాయి తాలుకాలో.
  వాటిని పట్టించుకోలేదు రమణారెడ్డి.
  అతనిమీద దాడి జేసేందుకు కొత్త పథకాల్ని రచించే ప్రయత్నంలో తలమునకలుగా వున్నాడు.
  ఒకరోజు ఉదయమే ఇంట్లో ఫోను మోగింది.
 దగ్గరే వున్న రమణారెడ్డి రిసీవర్ ఎత్తాడు.
 " హలో !  ఎవురు ?  ప్రభాకరేనా ? "  అవతల్నించి ప్రశ్న.
 ’ ఏ ప్రభాకర్ ?  బాలుని ఫ్రెండేమో !!’
 " రేయి ! "  అంటూ బాలున్ని పిల్చి " ఫోన్ " అని చెప్పాడు.
 " ఆ... నేనే - చెప్పండి "  తనకే ఫోననుకొని పలికాడు బాలుడు.
 "  సాయింత్రం ట్రైన్‌కు పెద్దాయన వస్చాండాడు. జీపు దీస్కొని స్టేషన్‌కు రా !  నడింపల్లె మాసుల్ని రెండు జీపుల్నిండా తీస్కొని రా ! కడపలో దిగుతాడు.. "
  ఒక్క సారిగా ఉలిక్కిపడ్డాడు బాలుడు.
 " ఆ...  సరే - " చెప్పి ఫోను పెట్టేశాడు.
  అతని మొహం నిండా చిరు చెమటలు జిబజిబమంటూ పొటమరించాయి.
 " అన్నా ! "  అన్నాడు ఉద్విగ్నంగా.
  అతని ముఖ కవళికలు చూసి ఆశ్చర్యపోతూ దగ్గరగా వచ్చాడు రమణారెడ్డి.  " ఏంబీ ?  ఏందీ ? "  అన్నాడు.
  జరిగిన విషయం చెప్పాడు..
  అతని ముఖ కవళికలు కూడా మారిపోయాయి.
  బద్వేలు పార్టీ ఆఫీసుకు వెళ్ల వలసిన ఫోను పొరబాటున తమ ఇంటికి వచ్చింది.
 చివరి రెండు డిజిట్స్ స్వల్ప తేడా వుండటం వలన అప్పుడప్పుడూ యీ పొరబాట్లు జరుగుతూ వుంటాయి.
  తాము కూడా బైట్నించి ఫోన్ చేసేటపుడు చాలా సార్లు వాళ్ల ఆఫీసు నెంబర్ డయల్ చేసే వాళ్లు.
 తమ ఫోన్ నంబర్ చివరి రెండంకెలు 72 అయితే వాళ్ల నంబర్ చివరి అంకెలు 27... చిన్న తేడా... కొద్ది పాటి పొరబాటు.
  ఆ పొరబాటే తమకిప్పుడు లాభిస్తూవుంది.
 మద్యాహ్నం నించి ప్రయాణమయ్యారు ఆయుధాలతో సహా.

                                                                                                ........... సశేషం

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs