నేను ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న రోజులవి,  అనుకోకుండా  మా వూరిలో కొన్ని వ్యక్తిగతమైన సమస్యలు ఎదురవడంతో  వాటి పరిష్కారం కోసం మా వూరికి వెళ్లిపోయాను, ఒక పదిరోజుల్లో  పరిష్కారం అవుతుందనుకుంటే అది కాస్తా, ప్రతి పదిహేను రోజులకొకసారి పొడిగిస్తూ అలా  మూడు నెలలు కొనసాగింది నా సమస్య పరిష్కారం కావడానికి. ప్రతి పదిహేను రోజులకొకసారి నేను పని చేస్తున్న మీడియా యజమాన్యానికి నా పరిస్థితి వివరిస్తూ సెలవలను పొడిగించమని సెలవు చీటి పంపుతూ వుండే వాడిని.

   మూడు నెలల తర్వాత పరిస్థితి ఒక కొలిక్కి రావడంతో హైదరాబాద్ తిరిగి  వచ్చాను మీడియాలో నా ఉద్యోగం కొనసాగిద్దామని!! అయితే ఏ ప్రైవేట్ సంస్థ కూడ అలా మూడు నెలలు పాటు సెలవలు ఇవ్వరు. ఆ  అవగాహన వున్నవాడినే కాబట్టి దానిని యధాతదంగా అంగీకరించడానికి మానసికంగా సిద్దంగా వున్నాను. నాలుగంతస్థుల మా మీడియా ఆఫీస్ సముదాయం గ్రౌండ్ ఫ్లోర్లో వున్న నా డిపార్ట్మెంట్ హెడ్ ని  కలిసి నారాజీనామా విషయం గురించి ప్రస్తావించగానే, ఆయన  " ఆ అవసరం లేదయ్యా..... నీవు రాగానే పైన జనరల్ మేనజర్ని కలవమన్నారు, వెళ్లి ఒక సారి కలువు, నీకు నీవుగా తొందర పడి రాజీనామా చేయకు" అన్నారు.

   జనరల్ మేనజర్ని కలసి  "మిమ్మల్ని కలమన్నారు మా ఇన్ ఛార్జ్"  అని చెప్పి నా సంగతంతా వివరించాను. సావదానంగా అన్ని విని "సరే ఓ రెండు రోజు లాగి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని కల్సి మాట్లాడండి" అని చెప్పారు.  ప్రైవేటు, ప్రభుత్వం రంగ సంస్థలంటూ తేడా లేకుండా ప్రపంచంలో ప్రతి చోట వుండే గ్రూపులు మా కంపెనీలో కూడ వున్నాయి,  కుల, ప్రాంత, తేడాలంటూ వుండవు వీటికి, కేవలం ఏదో ఒక మానసిక వ్యాపకం ఉండాలి మనిషికి.. చేసే పని మీద శ్రద్ద, చిత్త శుద్ధి కన్న వీటి మీదనే ఎక్కువ ఆసక్తి ఈ జనాలకు, అదొక జాడ్యం...! ఇలాంటి గ్రూపులకు దూరంగా వుండే మనుషులు కూడ అక్కడక్కడ వుంటారుగా...  అలాంటి వారిలో నేను ఒకడినే. అలా మా కంపెనీలో కూడ వున్న రెండు గ్రూపులకు చెందని వాడిని నేను కాబట్టి, రెండు గ్రూపులు వారు మాకు సంబంధం  లేదు అంటే..మాకు సంబంధం లేదు ఈ మనిషి అంటూ నన్ను వెలేశారు ఇలాంటి సమయంలో. నాకెలాగు వాటి గురించి పట్టింపు లేదు కాబట్టి ఎటువంటి ఆలోచనలు లేవు.... భ్రమలు లేవు ఈ విషయంలో.

  రెండు రోజుల  తర్వాత అసిస్టెంట్ జనరల్ అండ్ టెక్నికల్ మేనేజర్ని కలవడానికి వెళ్తే..  "మరో రెండు రోజులాగి రండి కలసి మాట్లాడదాం" అన్నారు, అలా రెండు మూడు సార్లు అయ్యాక..చివర్లొ కలిసి చర్చలు జరిగాయి, అవి ఎలాంటివి అంటే..  " మీరు ఏ సమస్య మీద ఇన్ని రోజులు ఇంటి వద్ద వున్నారు..? ఎందుకు..అన్ని రోజులు వుండాల్సి వొచ్చింది" లాంటి ప్రశ్నలు !! అన్నిటికి సమాధానం ఇచ్చాను కాని నా వ్యక్తిగత సమస్య యెక్క కాంటెంట్ ఏమిటన్నది చెప్ప లేదు..నాకిష్టం లేకపోవడంతొ..!  ఆ విషయాన్ని ఆయన పదే పదే గుచ్చి గుచ్చి అడిగే వారు. ఊహూ.....ఎన్ని సార్లు అడిగినా నేను తప్పించేవాడిని తప్ప చెప్పే వాడిని కాదు..అది పుర్తిగా నా వ్యక్తిగతం, అందరికీ తెలియనవసరం లేదనే భావనతో. అలా రెండు మూడు సార్లుగా మా మద్యన చర్చలు జరిగాయి..కాని నేను ఉద్యోగంలో కొనసాగాలా వద్దా అనే విషయం ఒక కొలిక్కి రావట్లేదు....!  ఆ చర్చల్లో  ’ఈ ఉద్యోగం నీకెంత వరకు అవసరం..? ఈ ఉద్యోగం లేకపోతే ఏమి చేయాలనుకొంటున్నావు’ లాంటి విషయాలు కూడ అడగారాయన.....కొద్ది కొద్దిగా నాకు అర్థమయ్యింది..ఇక చాలు ఈ నాన్పుడు ధోరణి అని అనుకొని..ముందునుండే రాజీనామా  ఉత్తరం జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను, ఎప్పుడు అవసరం వచ్చినా  ఇవ్వొచ్చనే ఉద్దేశంతో.

 వెంటనే నేరుగా  జనరల్ మేనేజర్ వున్న చాంబర్లోకి వెళ్లాను, ఆయన నన్ను చూడగానే.. " ఏంటి మీ విషయం ఇంకా అయిపోలేదా,  జాయిన్ కాలేదా ?" అడిగారు.  మా మద్యన జరిగిన చర్చల సారాంశం మొత్తం చెప్పాను, దానికాయన  "మీరు సరిగ్గా  అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని  కన్విన్స్ చేయలేకపోతున్నట్లున్నారు"  అన్నారు,  "లేదండి వున్నవిషయాలన్నీ  చెప్పాను,  అంతకన్న నా వద్ద మరేమిలేవు"  నా సమాధానం.  "లేదు..లేదు మీరు సరిగ్గా అయన్ని కన్విన్స్ చేయనట్లున్నారు ..ఒక సారి ఆలొచించడి"  అన్నారు.  నాకు పూర్తిగా విషయం బోధపడింది...  "అంటే ఏ విధంగా   కన్విన్స్ చేయాలీ..?? ఏడ్చి... కన్నీళ్లు పెట్టుకొని... ఆయన కాళ్లు పట్టుకొంటే కానీ..కన్విన్స్ కారా..? అప్పుడూ కాని మీలో ఉన్న ఇగో సంతృప్తి చెందదా..?? సారీ సర్ నేనా పని చేయను" అన్నాను, నా మాటలకు ఆయన మొదట తెల్లబోయినా ఎన్నో ఢక్కా మొక్కీలు తిని ఈ స్థాయికి ఎదిగిన క్రమంలో నాలాంటి వారిని ఎందరినో.. ఎన్నో రకాల మనుషులు చూసి ఉన్న ... ఆ అనుభవంతొ  ఒక్క క్షణంలో వెంటనే సర్దుకొని "ఏం మాట్లాడుతున్నారు మీరు..? ఏమైనా అర్థమున్నదా?"  ప్రశ్నించారు. నేను మౌనంగా నా జేబులొ నుండి రాజీనామ ఉత్తరం తీసి ఆయన అందించాను.  ఆయనది చదవగానే.. "ఓహో..మీకు ఈ ఉద్యొగం అవసరం లేదన్న మాట" అంటు ఏమి మాట్లాడాలొ తెలీక అలా పలాయన వాదపు మాట వాడేసారు. "నా వృత్తే  అది...ఎక్కడైనా నేను చేయాల్సి ఉద్యోగమే అదైనపుడు  అవసరం లేకుండా ఎలా వుంటుంది..? నాకు అవసరం వున్నది కదా అని మీ అహాల్ని సంతృప్తి పరిచేంతగా నేను ఆత్మను చంపుకోలేను .... సారీ సర్"  అంటు మరో మాట మాట్లాడకుండా బయటకొచ్చాను.

  ఈ మేనేజర్స్ తత్వాలు నాకు చర్చల సమయంలో అర్థమయ్యింది, నాకు ఉద్యోగం చాలా అవసరమయి వుండాలి, కాని వారు ఉద్యోగంలో కొనసాగడం కష్టం అని చెప్పగానే నేను కళ్ల నీళ్లు పెట్టుకొని కాళ్లా వేళ్లా పడి బతిమాలాలి, అప్పుడు వారి అహం సంతృప్తి పడుతుంది.....దానితో వారు నా మీద సానుభూతి చూపిస్తూ.... జాలితో ఆ ఉద్యోగంలో కొనసాగించడానికి  అవకాశమిచ్చినట్లు ఇస్తారు.. మరో పక్కన రెండు గ్రూపులున్నాయి  కాబట్టి నేను మేనేజ్మెంట్ వారికి  నమ్మిన బంటుగా డిపార్ట్‌మెం‍ట్‌లో వుంటూ అక్కడ జరిగే విషయాలు చేరేవేయాలి.. ఒకే దెబ్బకు రెండు  పిట్టలు!! ఒకటి....మన పట్ల సానుభూతి చూపి వారి అహాన్ని తృప్తి పరుచుకోవడం, రెండవది నమ్మినబంటుగా పడుంటారుగా కదా..ఇది వారి ఆలొచన.

  ఇలా ఇక్కడే కాదు మనం చాలా చోట్ల ఇలాంటి సంఘటనలే చూడవచ్చు... మనకు ఏదైనా ఒక కావలసిన పని వుండి అది చేయవలసిన చోటకు వెళ్లి ఎన్ని సార్లు విన్నవించినా ’అంత సులభంగా ఆ పని కాదయ్య”  ససేమిరా అంటూ తలుపే మనుషుల వద్ద కాస్త ఏడుపు మొహంతో మాట్లాడివారికి కావలసింది వారికిస్తే గాని..పని అవదు.! తర్వాత తమ తోటి ఉద్యోగస్తులతో మాట్లాడే సంధర్భాలలో మన విషయం ప్రస్తావన రాగానే..  "ఆ...వాడి ఏడుపు చూడ లేక....పాపం పోనీలే అని చేసాను ఆ పని" అంటూ సెలవిస్తారు. అక్కడ ఏడవాలిసిన పని వుండదు..వారు చేయాల్సిన వారి విధి నిర్వహణను పక్కన బెట్టి..ప్రవర్తిస్తారు.కాని వీళ్లేదో జాలి పడి సానుభూతి తో  పని చేసినట్లు బయటకు చెప్పుకోవాలి. అదో తృప్తి కొంత మందికి.   తమ అహాన్ని సంతృప్తి పరుచుకొనే ఇదో రకపు సానుభూతి...!

                                                                 ***********

  మరో రకపు సానుభూతి..కథ....కమర్షియల్ గా ఇదెలా ఉపయోగపడుతుందో చూడండి.... ! కేరీర్ ఎదుగుదలలో సానుభూతి కూడ ఒక ప్రధాన భూమిక  వహిస్తుందేమో..!!?.

దారిద్ర్య రేఖ దిగువన ఉండే  మనుషుల కోసం, అలానే ప్రకృతి పరంగా అధార పడి జీవనం సాగిస్తున్న కొన్ని జాతుల, తెగల మనుగడ కోసం ఐక్యరాజ్య సమితి కొన్ని అంతర్జాతీయ చట్టాలను రూపొందించింది.  ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఆ చట్టాలను గౌరవిస్తూ పాలన సాగించాల్సిందే..ఈ విషయంలో.!  అయితే ఈ తెగలు, జాతుల జీవనపాది మీద సెజ్ ల  పేరుతోనో లేక అభివృద్ది పేరుతోనో .. దెబ్బ తీస్తుంటాయి చాలా దేశాలు..కారణం ఎక్కడో మారుమూలన ఉండే ఈ తెగల, జాతుల గురించి బయట ప్రపంచానికి చాలా వరకు తెలియదు..అలాంటిది ఎక్కడో వున్న ఐక్యరాజ్య సమితికి కూడ వీటి గురించి పెద్దగా  సమాచారం వుండదు. ఇలాంటి విషయాల మీద కొన్ని అంతర్జాతీయ సంస్థలు పని చేస్తూ వుంటాయి, ఎక్కడ ఈ తెగల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందో గుర్తించి వాటిమీద ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చిత్రీకరించి, జాతీయ, అంతర్జాతీయ టి.వి చానల్లో ప్రసారం చేస్తూ ఐక్యరాజ్య సమితీ దృష్టికి తీసుకెళ్లతారు. ఇవన్ని చాలా స్వచ్చందంగా నిర్వహిస్తూ వుంటాయి కొన్ని సంస్థలు.

  అలాంటి ఒక అంతర్జాతీయ సంస్థ కొరకు డాక్యుమెంటరీ ఫిల్మ్ చిత్రీకరణ కోసం ఐదేళ్ల క్రితం ఆ ప్రాజెక్ట్  డైరెక్టర్ తో  కలసి థాయిలాండ్ వెళ్లాను, బ్యాంకాక్ నుండి అ సంస్థ యెక్క అక్కడి మరో ఇద్దరి కో ఆర్డినేటర్ లతో  కలసి మరో పది గంటల పాటు బస్సులొ ప్రయాణం చేసి మరసటి రోజు ఉదయం "పాంగా" అనే జిల్లా చేరుకొన్నాం. అక్కడి ప్రాంతీయ భాష మాకు తెలీదు కాబట్టి ఆ కో-ఆర్డినేటర్స్ మాకు, అక్కడి మనుషులకు మద్యన వారధులు, అనువాదకులు  కూడాను.

  థాయిలాండ్‌లో 2004 లో వచ్చిన సునామీ  వలన ఒక తెగ చాలా వరకు అంతరించిపోయింది, ఆ తెగ కొన్ని నెలలు పాటు సముద్రంలో చేపల పట్టడంలొ వుండిపోతారు, తర్వాత మరికొన్ని నెలలు మాత్రమే భూమి మీద జీవినం సాగిస్తారట, అలాంటి తెగలొ ఒకే ఒక 20 ఏళ్ల కుర్రాడు సునామీ  వచ్చిన సమయంలో మరో నగరానికి ఏదో  పని మీద వెళ్లడంతో..ఆ సునామి ప్రమాదం నుండి అతనొక్కడే మిగిలిపోయాడు. అంతే గాక అతనికి ఉన్న  కొద్దిపాటి భూములను కూడ అక్కడి ప్రభుత్వం "సెజ్" ల పేరుతొ లాక్కొంటున్నారు,  అతని తెగ పూర్తిగా తుడిచి పెట్టుకపోయింది, మరో పక్క  అతనికి ఉన్న  ఒకే ఒక జీవనాధారాన్ని కూడ అక్కడి ప్రభుత్వం లాక్కుంటోంది . అతనితో పాటు  మరి కొన్ని విషయాల మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసి..అంతర్జాతీయ వేదికల మీద పెట్టాలనే ఉద్దేశం ఈ సంస్థది. ఈ సెజ్ ల  గొడవ ఒక్క మన దేశానికే వున్నదని అనుకొన్నాను అప్పటి వరకు!! చుట్టుపక్కల దేశాల మీద కూడ చాలా ప్రభావమే వున్నదని ఈ సంఘటనతో నాకు అర్థమయ్యింది.

 ఇక ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గురించి కాస్త వివరించాలి, ఈయన ఒక సత్ససాంప్రదాయ  కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి అయినా.. ఆయనలో చాలా వరకు కమ్యూనిస్ట్ భావాలు కనపడేవి, ఎన్నో పుస్తకాలు చదవారని, ఎంతో మేథస్సు వున్న మనిషని ఆయన మాటల్లొ అర్థమయ్యింది నాకు, అతనితో మాట్లాడుతుంటే..చాలా విషయాలు తెలియనవి తెలుసుకొంటూ వున్నాను..చాలా వరకు నేను వినడంలోనే వుండిపోయేవాడిని, నాతో మాట్లాడుతున్న కాలమంతా ఆయన చేతిలో సుదీప్ చక్రవర్తి రాసిన  "రెడ్ సన్" పుస్తకం ఉండేది..మద్య మద్యలో చదువుతూ వుండేవారాయన.అయితే అతను ఏ విషయాన్నైనా వివరిస్తున్న సమయంలో మధ్య మధ్యలో ఒక తమాషైనా మాట మాట్లాడే వారు , అతను చెబుతున్నప్పుడు నేను వింటున్న సమయంలో నా మొహంలో ఏ భావాలు కనపడట్లేదో లేక....వెర్రి మొహం వేసుకొని నించున్నట్లు కనపడే వాడినో  ఏమో కాని  "ఆహా..ఏమి లేదు నిన్ను ఎడ్యుకేట్ చేయాలని ఇవన్ని చెబుతున్నాను అంతే, ఏమనుకోవద్దు" అని పదే పదే ఇలా అంటూండే వారు.

  ఓ రెండు రోజుల పాటు అక్కడ వారి జీవన విదానం గురించి, నివాసాల సముదాయాల గురించి, సముద్రంలొ చేపల వేట ఎలా సాగిస్తారో వాటి విషయాల మీద కొన్ని దృశ్యాలను అక్కడక్కడ వున్న కొన్ని దీవుల్లో  చిత్రీకరించాం.  తర్వాత ఆ కుర్రాడి భూముల మద్యన వున్న ఇంటి వద్ద ఇంటర్‌వ్యూ చేయడం మొదలు పెట్టాం, అతని భాష మాకు..మా భాష అతనికి తెలియవు, ఇంగ్లీష్ కూడ రాదు మద్యలోదుబాసీలు గా  వున్న కోఆర్డినేటర్స్ ద్వారా ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతున్నాము.

   అతను తన కుటుంబాన్ని సునామీలో  పోగొట్టుకొన్న వైనాన్ని, తనొక్కడే మిగిలిపోయినా తన భూముల్ని తనే పండించుకొంటు జీవనం సాగిస్తున్న విధానాన్ని వివరంగా చెప్పుకొస్తున్నాడు..భాష తెలియక పోయినా అతని మాటల్లోని భావం మాకు అర్థమవుతున్నది, నిజంగా తన వాళ్లందరినీ పోగొట్టుకొని ప్రపంచంలో ఒంటరిగా వుండటమన్నది, మనకు పెద్దగా అనిపించక పోవచ్చు కానీ  అనుభవిస్తున్న ఆ కుర్రాడికి  తన ఒంటరి తనపు భాద తాలుకా తెలుస్తుంటుంది, అయినా కూడ ఎక్కడా తన బాధను  వ్యక్త పరచట్లేదు, అలానే సెజ్ లో  భాగంగా కోల్పోతున్న తన భూములను తనకే మినహాయించమని కోరుకొంటున్నాడే కాని ఎక్కడా కూడ ఏడుపు రావట్లేదు! కనీసం  ఏడుపు మోహంతో  దైన్యంగా కూడ మాట్లాడటం లేదు.  చూస్తున్న మాకు కాస్త లోపల ఎక్కడో కదిలిస్తున్నది కాని ఆ కుర్రాడిలొ మాత్రం ఎటువంటి దుఃఖం, బాధ  వ్యక్తం కావట్లేదు. అలానే తన మాటల్లో ఎక్కడ కూడాను తమను పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం చేయట్లేదు. ప్రభుత్వం గురించి చాలా గౌరవంగా మాట్లాడుతూ తన పరిస్థితిని అర్థం చేసుకొని తన భూములను తనకే వదిలేయమని కోరుకొంటున్నాడు. నాకు చాలా గొప్పగా అనిపించింది అతని తత్వం, అదే విషయాన్ని నా వెనుకే కూర్చోని వున్న మా డైరెక్టర్తో  "చాలా బాగా మాట్లాడుతున్నాడు కదా "  అన్నాను

  దానికి ఆయన...."హయ్యో...అంతా బాగానే చెప్పాడు కాని... కొద్దిగా కూడ కన్నీళ్లు రావట్లేదు, కనీసపు ఏడుపు  మొహం కూడ పెట్టట్లేదు ..హ్మ్...ప్చ్..అలా కాదు కాస్త ఏడిస్తేనే చూసే వాళ్లకు బాగా ఎఫెక్టివ్ గా  వుంటుంది, మనకు కూడ గొప్పగా చేసినట్లు పేరు వొస్తుంది, ప్చ్ ఏడ్చి, కన్నీళ్ళు పెట్టుంటే చాలా బాగుండేది....అయ్యో....ఎఫెక్ట్ పోయిందే.."  అంటూ తల అడ్డంగా ఆడిస్తూ బాధ  పడుతున్నాడు. నాకు ఒక్కసారిగా అర్థం కాలేదు..ఏమి కోరుకొంటున్నాడు ఇతను...? తను చేస్తున్న ఫిల్మ్ కి మంచి ప్రశంసలు రావాలంటే మనుషులు ఏడవాలా..? దాని నుండి వచ్చే సానుభూతే ఇతని ప్రతిభకు తార్కాణమా ? మంచి కంటెంట్ వుండి ఒక అసలు సిసలైన  "మనిషి" ని ఇంటర్‌వ్యూ చేస్తున్నాము అని అనిపించింది నాకు, మరి ఇతనేంటి..దీని నుండి ఏమి కోరుకొంటున్నాడూ....? తను చేసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ పది మంది చూసి కంట తడిపెట్టి  "వావ్ చాలా బాగా చేసావయ్యా" అని  సానుభూతి తో  కూడిన ప్రశంసలు, అభినందనలు  వస్తే... అప్పుడు కానీ తనొక గొప్ప ప్రాజెక్ట్ చేసినట్లుగా భావించడా? సానుభూతే ఇతని ప్రతిభకు రుజువా?

 నాకు ఒకే సమయంలో పరస్పర విరుద్ధ  భావాలున్న మనుషుల తత్వం అనుభవం ఎదురైంది అనిపించింది. ఒకరిది ఖేదం..మరొకరిది వ్యాపారం..! వాస్తవంగా తన వాళ్లందరినీ పొగొట్టుకొన్న ఒక కుర్రాడు కంట తడిపెట్ట కుండా మాట్లాడడం అన్నది మనకు అదొక గొప్ప నిబ్బరం కలిగిన మనిషిగానూ..మనోధైర్యం వున్న మనిషిగానో అనిపిస్తుంది. అది మన భారతీయ జీవన విధానంలో పెరిగిన ఒక కోణం నుండి చూస్తే అలానే అనిపిస్తుంది, ఇలాంటివి ఏ కోణమనే రంగుటద్దం లేకుండా  యధాతదంగా ఈ థాయ్ కుర్రాడిని చూస్తే, అది అతి సర్వ సాధారణం  వారికి. వారి జీవన విదానమే అలా వుంటుంది..ఎక్కడ జాలి కోసం ఏడవరు, ప్రతీది ఎదుర్కోవడానికి అలవాటు బడ్డ మనుషులని అర్థమవుతుంది, అక్కడ ఈ మనో నిబ్బరం, మనోధైర్యం లాంటి భావాల గల పద బంధాల  అవసరమే వుండదు. .  కాని మనం మన భారతీయ జీవన విధానం లో పెరిగిన కోణంలో నుండి చూస్తే  "అబ్బా ఎంత నిబ్బరం గల మనిషి ఆహా.." అంటూ గొప్పగానో..  అబ్బుర పడుతూనో  చూస్తాం... అలా అనిపిస్తుంది మనకు.

  మరి ఎంతో మేధస్సు వుండి, ప్రపంచ చరిత్రల మీద, వ్యక్తుల మీద ఎంతో అవగాహన వున్న ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన ఈ మనిషి యెక్క తత్వం చూడండి ఎలా వున్నదో..?? సానుభూతితో తన ఎదుగుదలకు మెరుగు దిద్దుకోవాలనుకొంటున్నాడు. మేధస్సు వేరు  మనిషి తత్వం వేరు..అన్నది ఇలాంటి అనుభవాల ద్వారా మనకు అవగతమవుతుంది, ఇవెప్పుడు కలవని రెండు రైలు  పట్టాలు లాంటివి, దేని దారి దానిదే అని నిరూపిస్తుంది !  అక్కడేమో ఏమి చదువుకోని, అసలు బయట ప్రాపంచిక ఙ్ఞానమే లేని ఒక కుర్రాడి తత్వం దీనికి పూర్తి భిన్నంగా వున్నది.  పెరిగిన జీవన విధానం  కూడ మనుషుల మీద చాలా ప్రభావం చూపుతుందన్నది సుస్పష్టం.

 అంటే ఈ సానుభూతి వ్యాపార వస్తువుగా ఎంతగా  ఉపయోగ పడుతున్నదో......మనం నిత్యం టి.వి లలో ప్రతిభా పరమైన పోటీలు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ ప్రోగ్రాములన్నీ  మల్టీ కెమరాస్ సెటప్ తో షూట్ చేస్తుంటారు. ఆ పోటీలలో ఎవరొ ఒకరు ఓడిపొక తప్పదు...అప్పుడు ఓడిపోయిన ఆ సదరు వ్యక్తి/పిల్లలో  ఖచ్చితంగా ఏడుస్తారు, వెంటనే ఈ ఫొగ్రాంని రికార్డ్ చేస్తూ నిర్వహిస్తున్న దర్శకుడు వెంటనే తన పి.సి.ఆర్ అనే రికార్డింగ్ గది నుండి  టాక్ బాక్ తో కెమరా మన్  కిసూచనలు ఇస్తాడు..." హే మ్యాన్  వెంటనే వెళ్లు... ఆ ఏడుస్తున్న మొహాన్ని క్లోజ్ అప్ చూపించు..జూమ్ చేయ్..పాస్ట్ మ్యాన్ ఫాస్ట్....ఏడుపు ఆగిపొతుంది..ఆగిపోయేలోపల జూమ్ వెళ్లూ... పట్టుకొ ఆ ఏడుపుని "  అంటు తొందర పెడుతూ వుంటారు.  ఆ ఏడుపు సీన్ ఎక్కడ మిస్ అవుతామో అనే భయం..! ఆ ఉద్వేగాలను టి.విలలొ చూపి..తమ తమ రేటింగ్స్ పెంచుకొవాలి..అది అలా జరిగితే ఆ ఫోగ్రాం చేస్తున్న డైరెక్టర్ కి ఆ ఫోగ్రాంకు కూడ మంచి ఫేరొస్తుంది.. "చాలా బాగా చేసావయ్యా...గుండెలు పిండేసావు..అందరివీ..! మంచి పేరొచ్చింది"  అనే ప్రశంస కోసం, అభినందన కోసం పడే పాట్లు  అవి ! అక్కడి మనుషుల ఉద్వేగాలతో ఎటువంటి అనుసందానం వుండదు వీరికి..కేవలం  మనుషుల ఉద్వేగాలతో వ్యాపారం చేయడానికి బాగా అలవాటు పడ్డారు. ఎంత ఉద్విగ్నిత వుంటే అంత లాభాసాటి, గొప్పగా చేసావనే మెచ్చుకోలు...మనుషులకు..!  ఒకరి ఏడుపుల సానుభూతితో మరొకరికి ధనలాభం..వ్యాపారం.

  మరొ సానుభూతి కథతో ఈ కథను ముగిస్తాను తొందరలో............

    చాలా సంవత్సరాల క్రితం...బెంగళూర్‌లో ఒక ప్రొఫిషనల్ కోర్స్‌లో సీట్ సంపాదించడం కోసం బాగా తిరుగుతున్న రోజులవి. ఆ సీట్ కోసం రెండేళ్లుగా తిరుగుతున్నాకాని దొరకట్లేదు.కారణం..వారు నిర్ణయించుకొన్న నిబంధనలను అనుసరించి  ఖాళీగా  ఉంచుతున్నారే కాని వాటిని  భర్తీ చేయట్లేదు. నాకు ఆ కోర్స్ మీద విపరీతమైన ఆసక్తి..!  ఆ క్రమంలో ప్రతి రోజు సాంకేతిక కార్యాలయం,  అలానే కాలేజి చుట్టూ ప్రదక్షిణలు  చేస్తున్నాను. అలా తిరుగుతున్న రోజులలో నాలాగే్ అదే సీట్ కోసం ప్రయత్నిస్తున్న మరొకతను జతిన్ పరిచయం అయ్యారు. అతనితో అతని తల్లిగారు కూడ రోజు వస్తున్నారు. అలా ప్రతిరోజు కలుస్తుండడంతో బాగా పరిచయం అయ్యారు. అందరం కలసే ఖాళీ గా  మిగిలి ఉన్న సీట్స్‌ని భర్తీ చేయమని విఙ్ఞప్తి చేయడానికి అక్కడి సెక్రటరియేట్, అలానే తదిత మంత్రుల శాఖల చుట్టు ప్రతి రోజు ఉదయం నుండి సాయింత్రం వరకు తిరుగుతూ వున్నాం.

     తమిళ వారైన జతిన్ కుటుంబం,  ఉత్తరాదిలొ డిఫెన్స్‌లో పని చేసి పదవీ విరమణ సమయంలొ బెంగళూర్‌ వచ్చి స్థిరపడ్డారు. ఆ కారణం చేత అతనికి కర్నాటక కాలేజీలొ సీట్ రావట్లేదు..అందునా కన్నడిగులకు తమిళలకు జాతి వైరం ఎప్పటి నుండో  ఉన్నదాయే .... అదొక కారణం.!! 

 జతిన్‌కు ఈ ప్రొఫిషినల్ కోర్స్ మీద అమితమైన ఆసక్తి, కాని సీట్ దొరకట్లేదు.అతన్ని  ఏయిర్ ఫోర్స్‌లో చేర్చాలని అతని తండ్రి అభిలాష, అది జతిన్‌కి ఇష్టం లేదు, తండ్రికి ఇష్టం లేకపోయినా కొడుకు ఇష్టాన్ని గౌరవిస్తూ అతని తల్లి అతనికే మద్దుతు పలుతున్నది. అందుకే ఆమె కూడ కొడుకుతో  కలిసి సీట్ కోసం తిరిగే వేటలో కాలేజికి వస్తున్నారు. ఒకే విషయం గురించి అందరం కలసే తిరగతున్నాం కాబట్టి నేను వారి కుటుంబానికి దగ్గర అయ్యాను. జతిన్‌ కుటుంబానికి ఒక్క తెలుగు తప్ప మిగతా హిందీ, కన్నడ, తమిళం, ఆంగ్లం భాషలన్నీ అనర్గళంగా మాట్లాడుతున్నారు, నాకు కన్నడ అంతంత మాత్రమే, ఆ సమయంలొ్ బేడ,బేకు, ఊట ఆయత్తా ఇలాంటి బతకడానికి అవసరమైన పొడి పొడి పదాలు తప్ప మరో వాక్యం  ఎంత తన్నుకొన్నా కూడ మాట్లాడ లేను..కాబట్టి..నాకొచ్చిన బట్లర్ ఇంగ్లీష్‌తోనే వారి బుర్ర తింటూవుండేవాడిని..పాపం ఏమ్ చేస్తారు భరించక. నేను వారి జాతివాడినే కదా..సీట్ కోసం తిరగడంలొ..!!

    ఒక రోజు జతిన్ రాలేదు కాని జతిన్ తల్లి గారు మాత్రమే వచ్చారు కాలేజీకి. జతిన్ నాన్న ఏదో పని వుండటంతో బయటతీసుకెళ్లారు అందుకే రాలేదన్న విషయం తెలిపారావిడ. కాలేజీలో ఒకరిద్దరిని కలిసాక. ఇక అదే కాంపౌండ్‌లో వున్న సాంకేతిక కార్యాలయం వైపుగా వెళ్లాం. అక్కడ కాలేజీలలో సీట్స్ భర్తీ చేయడానికి సంబందించిన ప్రిన్సిపల్   సెక్రటరీ ఉన్న కార్యాలయంలోకి అడుగు పెట్టాం కాని సెక్రటరీ లేరు ఆ సమయంలో. 

ఇక అక్కడున్న ఆయన పి.ఏ. ను మిగతా స్టా‌ఫ్‌తో కలసి మేమొచ్చిన విషయం గురించి చెబుతూ..కూర్చున్నాం.  నాకంటే జతిన్ తల్లిగారే ఎక్కువ మాట్లాడుతున్నారు కారణం నాకు వచ్చిన  బేడ..బేకు లాంటికొద్ది పాటి  కన్నడ పదాలు తప్ప మరేది తెలియకపోవడంతో.

  కాసేపటికి ఆవిడ మెల్లి మెల్లిగా ఏడవడం మొదలు పెట్టారు నోటికి కొంగు అడ్డం పెట్టుకొంటూ....అక్కడున్న స్టా‌ఫ్‌తో పాటు నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను.  బహుశ కొడుకు ఇష్టపడుతున్న ఒక ప్రొఫిషినల్ కోర్స్‌లో సీట్ సంపాదించలేకపోతున్నానే అనే వ్యధలో అలా కన్నీళ్లు వొస్తున్నాయేమో అనిపించింది. ఆమె ఏడుపులకు ఆఫీస్ స్టాప్ కూడ ఆవిడ వైపు "అయ్యో పాపం" అన్నట్లు సానుభూతిగా చూస్తున్నారు, తన కొడుకు రెండేళ్లుగా ఈ కోర్స్ గురించి తిరుగుతున్నారని..ఈ కోర్స్ చదవాలనే తీవ్రమైన కోరికతో ఉన్నాడని, అతని తండ్రికి ఇది ఏ  మాత్రం   ఇష్టం లేకపోవడంతో ఆయన దేనికీ సహకరించడం లేదని...అందువల్లే తానూ అందుకే  కొడుకుతో కలిసి ఇలా తిరగవలసి వస్తోందని.... ఇలా అన్ని విషయాలు వివరిస్తున్నారు ఆమె. ..,!

 తిండి నిద్ర కూడ ఆలోచించకుండా ప్రతి రోజుఎవరెవరిని కలుస్తున్నది, పొద్దు పొద్దున్నే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లిన విషయాలు... ఇలా అన్ని వివరాలు ఏవి వదలకుండా ఆ ఏడుపులోనే ఏకరవు పెడుతూ కోన సాగిస్తున్నారు .  స్టాఫ్ మాత్రం ఎటువంటి మార్పు లేకుండా అదే సానుభూతి మొహాలతో  ఫ్రీజ్ అయి వున్నారు.  

ఒకరిద్దరు మాత్రం  "అయ్యో..ప్చ్..పాపం" అంటు శబ్దాలు చేస్తున్నారు.  కాసేపటికి ఆమె ఉదృతి తగ్గి వాతావరణం చల్ల బడింది. ఇక మాట్లాడవలసిన విషయాలు ఏమి లేకపోవడంతో ఖాళీల భర్తీ గురించి, మేము తిరుగుతున విషయం గురిమ్చి పదే పదే చెప్పి బయటకు వచ్చాం ఇద్దరం.

   బయట కాంపౌండ్‌లోకి నడుస్తుండగా ఆమె  మాట్లాడటం మొదలు పెట్టారు  " అక్కడ స్టాఫ్ వద్ద అలా ఎందుకు ఏడ్చానో తెలుసా...? ఎందుకంటే మగాళ్ల కన్న ఒక స్త్రీ అలా తిరుగుతూ కన్నీళ్లు పెడితే ’అయ్యో పాపం ఎంత కష్ట పడుతున్నారో్ ’ అనే సానుభూతితో అయినా సీట్ రావచ్చేమో అనే ఉద్దేశంలో అలా కనీళ్లు పెట్టాను. జతిన్ నాతో ఈ రోజు వస్తానని చెప్పినా నేనే వద్దని చెప్పి ఒక్కదానినే వచ్చాను ఇందుకే "  నవ్వుతూ... ఒక గొప్ప సత్యం నాకు చెబుతున్నట్లుగా చెప్పారు. 

 అక్కడ ఆఫీస్ గదిలో ఎంతలా దుఃఖ వదనంతో వున్నారో... అసలు ఆ దుఃఖచాయలే కనపడకుండా ఇప్పుడూ కేవలం ఐదు నిమిషాలలో ఆవిడ నవ్వుతున్నారు తను చెప్పిన విషయానికి. ఇంతలో ఎంతలా వాతావరణం మార్పు అనిపించింది నాకు.

  అలా అని ఈ విషయాన్ని ఆవిడ ఏమి దాచుకోవట్లేదు, దాచుకొని మోసపుచ్చాలని ప్రయత్నించట్లేదు నా ముందు, హాయిగా బహిరంగంగా  చెప్పుకొంటున్నారు.  అందులో ఒకరిని ఏమార్చాలని  కాని మరొకటికాని లేదు.  కేవలం తన కొడుకుకు సీట్ సంపాదించాలి దానికి కావలసిన మార్గాలన్నీ వెతుక్కుంటున్నారు, అందులొ ఇది ఒక భాగం అని మాత్రమే అని భావనలో ఆమె వున్నారనిపించింది. 

ఇక్కడ నాకు మరో విషయం అర్థమయ్యీ కాక అర్థమవుతున్నట్లుంది...  చాలా ఏడుపుల వెనుక కారణాలు సానుభూతి ఆశించడం ఉంటుందా  అని..? 

..... అలా మాటల్లోనే.. నడుచుకొంటూ వస్తూ ఆ కాంపౌండ్‌లో వున్న ఒక పెద్ద చెట్టు కింద వున్న సీమెంట్ బెంచి మీద కూర్చున్నాం.

  అప్పుడు  చెప్పడం మొదలు పెట్టారు జతిన్ పరిస్థితి గురించి. ఇంట్లో తండ్రి కొడుకుల మద్యన జరుగుతున్న కోల్డ్ వార్.. గురించి !  ఈ సంవత్సరంలొ సీట్ సంపాదించుకోలేకపొతే తను  చెప్పినట్లు ఏయిర్ ఫోర్స్‌లో చేరాల్సిందే అని జతిన్‌కు తండ్రి ఆల్టిమేట్ ఇవ్వడం....తండ్రి వార్నింగ్‌తో కొడుకు కుమిలిపోవడం .ఇదంతా చూస్తూ తానూ తట్టుకోలేక పోవడం... మొత్తం వివరించారు..!

ఈ రోజు ఇద్దరం కలిసే వద్దామని అనుకొన్నా...  జతిన్‌ని వొద్దంటూ ఆపి తనొక్కరే రావడం, ఇక్కడ తను స్త్రీ కదా... మగాళ్ల కన్న ఒక స్త్రీ ఏడిస్తే మరింత సానుభూతి వస్తుందనే ఉద్దేశంతో వచ్చానని విషయాలు చెప్పుకొచ్చారు.

  ఆఫీసులో జతిన్ తల్లి ఏడుస్తున్నప్పుడు అక్కడున్న స్టాఫ్ అంతా తమ తమ పరిధులలో   ఒక సానుభూతి ని మొహాల్లో  ప్రకటించారు  ఈమెకు. అంటే వాళ్ళు కూడ తమ జీవితంలొ రోజూ  కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటి ఏడుపులు  చూస్తూనే వుంటారు, వారు కూడ వీటికి అలవాటు పడిపోయి ఒక సానుభూతి మొహాన్ని వీళ్లకు పడేసి ఎవరికి వారు బాగా నటించేస్తున్నారు. 

 ఒకరిద్దరు నిజంగా స్పందించొచ్చు.  చాల వరకు ఏడ్చే ఏడుపులన్నీ  కేవలం సానుభూతి కోసమే అనే భావం అర్థమయ్యింది నాకప్పుడు. అదొక తెలియని విషయం నాకు మొదటి సారిగా తెలిసింది.

                                                        **********

  ఇది జరిగిన ఓ రెండు మూడేళ్లకు అనుకొంటాను....!  మా వూళ్లో ఒక సంఘటన ఎదురైంది. నా మేనమామ ఒకతను  ’ఎమ్.ఎల్.ఏ వద్ద ఒక పంచాయితి వున్నది వెళ్తున్నాను, వస్తావా...  అని   పిలవడంతో నేను వెళ్లాను.   రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు కాని పాక్షికంగా వున్నారు. అప్పుడప్పుడు ఎమ్.ఎల్.ఏ తో కలుస్తూ వుంటారు నా మేన మామ, అలా పంచాయితీలు జరుగుతున్న సమయంలొ ఈయన పాల్గొంటూ వుంటారు.

  ఎమ్.ఎల్.ఏ ఆఫీస్‌లోకి ప్రవేశించాం, చిన్న కాంపౌండ్ ఉండి తర్వాత ఒక పెద్ద వసారా వున్నది, అక్కడే ఓ ఇరువై కుర్చీలు వున్నాయి ఓ పదిహేను మంది దాక రెండు వర్గాలుగా చెరో వైపు కూర్చోని వున్నారు.  ఎమ్.ఎల్.ఏ ఇంకా రానట్లున్నారు... ఆయన  కుర్చీ ఖాళీగా  కనపడుతున్నది.  

మన దేశంలొ ముఖ్యంగా మన తెలుగునాడులొ జరిగే పంచాయితీలన్నీ ఎక్కువగా ఆస్థి పంపకాలో లేక భార్యభర్తల మద్యన జరిగే గొడవలు, విడాకుల గురించే వుంటాయి. మహాభారతంలొ మంచికి గుర్తుగా పాండవులను చెడుకు గుర్తుగా కౌరవులను పెట్టి పెద్ద కౌరవ సభే జరుగుతూ ఉంటుంది...అప్పటి రచయతలు అలా మంచి చెడులకు ప్రతినిధులుగా రెండు వర్గాలను సృష్టించాడు..కాని నిజ జీవితంలో ఎప్పుడూ కూడ మంచి, చెడులు చెరో వైపు ఎప్పుడూ ఉండవు. రెండు వర్గాల వాదనలు వారి వైపు నుండి వింటే అన్ని కరెక్టేగానే కనపడతాయి మరి.  ఎటువైపు..న్యాయ అన్యాయాలున్నాయో కూడ అర్థంకాదు. ప్రస్తుతం జరుగుతున్నది ముగ్గురు అన్నదమ్ముల ఆస్థి తగాదాల పంచాయితి.


    కాసేపటికి  ఎమ్.ఎల్.ఏ వచ్చి కూర్చున్నారు. అక్కడున్న ఒక వర్గంలొ ఒకటి పెద్దన్నయ్య వర్గం, ఆయన తన భార్యతో సహా వచ్చారు పంచాయితీకి. మరొక వర్గంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆమె రాకతో ఇద్దరు తమ్ములున్న వర్గంలొ గుసగుసలు మొదలయ్యాయి.

 ఇన్నాళ్లుగా  కేవలం ముగ్గురు అన్నదమ్ములే పంచాయితిలొ కూర్చుంటున్నా...పెద్ద అతని భార్య .తన  భర్తకు వెనుకుండి పంచాయితీలో ఎలా మాట్లాడాలి, ఏవేవి విషయాలు చెప్పాలి, ఎదుటి వర్గం ఏ ఎత్తు వేస్తే తామేమి సమాధానాలు ఇవ్వాలి లాంటి విషయాలు సూచనలిస్తూన్నారే గాని, ఆమె మాత్రం ఎప్పుడు పంచాయితీ వైపు తొంగి చూడనేలేదు. 

అలాంటిది ఇప్పుడు ఆమే స్వయంగా పంచాయితికి రావడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడున్న ఇద్దరి తమ్ముళ్ల వర్గపు పంచాయితీ పెద్ద మనుషుల్లో. వారి గుసగుసలు నా చెవిన పడుతున్నా... నాకు అర్థమయ్యి అర్థం కాక అయోమయంలో వున్నా...నాలో వున్న మరో మనిషికి మాత్రం ఏదో అర్థమయ్యి నన్ను గెలుకుతున్నాడు. వాడికేదో అర్థమయ్యింది.  ఆ విషయమే నాకు చెప్పబోతుంటే  "యెహే ఆపు నీ గోల  కాసేపు వేయిట్ చేయి..అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దు"  అని కసురు కొన్నాను.

  పెద్దన్నయ్య వర్గం వైపు చూస్తూ మొదట ఎమ్.ఎల్.ఏ నోరు విప్పారు, "ఇన్నాళ్లుగా పంచాయితీ జరుగుతున్నా ఇంకా ఒక కొలిక్కి రాలేదు మీ విషయం..ఏంటి.... ఏమ్ చేద్దామనుకొంటున్నారు"  అన్నాడు. ఆయన అలా అనగానే..పెద్దన్నయ్య భార్య  చెప్పనారంభించారు. " సర్  నేను మొదటి నుండి ఏమి జరిగిందో చెబుతాను మీరే ఒక నిర్ణయానికి రండి, నా పెళ్లి అయ్యే సమయానికి ఈయన తమ్ముళ్లిద్దరు స్కూల్ చదివే పిల్లలు, తల్లి తండ్రులు లేకపోయినా నేను తల్లిగా బాధ్యతలు  తీసుకొని పెంచాను ఇద్దరినీ..మాకంటూ ఏమి ఆలొచించకుండా డబ్బులన్నీ వీళ్ల చదువులకే ఖర్చు పెట్టాం, ఆ సమయంలో నేను సరిగ్గా చూడట్లేదనీ.. నన్ను వీళ్ల బంధువులు అందరు  ఎంతో ఆడిపోసుకొన్నారు, ఎన్నో పుకార్లు పుట్టించారు, నానా రకాలుగా బయట చెప్పుకొన్నారు. ....ఆ అవమానాలన్నీ భరించి వీళ్ల భాగోగుల కోసం ఆస్థింతా ఖర్చు చేసాం " ఈ మాటలుంటున్న సమయంలొ ఆమె గొంతు గద్గదమైపోయి వొస్తున్న ఏడుపును కొంగు అడ్డం పెట్టుకొని ఆపుకొంటున్నట్లు మాట్లాడుతున్నారు, ఆ సమయంలో అక్కడి వాతావరణం చాలా గంభీరంగా మారిపోయింది..అక్కడ కూర్చున్న మగాళ్లందరూ.. తమ్ముళ్లిద్దరి వైపు చూస్తున్నారు ఏంటయ్యా ఇది..... అనే చందాన.

  ఆమె తన ఏడుపులోనే.. "నేను అవి చేసాను, ఇలా చూసుకొన్నాను ఇంతంత ఖర్చు పెట్టాం"  అంటూ కొన్నిలెఖ్కలు చూపించారు. తర్వాత నెమ్మదిగా ఇక వున్న ఆస్థిలో ఆవిడే పంపకాలు చేయనారంభించారు,  "నాకు ఇద్దరాడ పిల్లలు అందులో ఒకమ్మాయి రెండు మూడేళ్లలో పెళ్లీడుకొస్తున్నది..వాళ్ల చదువులకు డబ్బులు కావాలి, కాబట్టి  నేను మాఇంటాయన తమ్ములిద్దరిని అన్నో అవమానాలు భరిస్తూ కూడ పెంచినందుకు మిగిలి వున్న బంగారంలో నా కూతిళ్లిద్దరికి సమానంగా ఇవ్వాలి,"  ఇలా ఆవిడ ఆ సానుభూతి భావంలొ అన్నీను ఎలా తనకు మాత్రమే చెందాలో  చెప్పుకొస్తున్నారు, పంచేస్తున్నారు. చివర్లో చేతికి అంటుకొని మిగిలున్న అన్నం మెతుకులు విదిలిచినట్లు ఆమె మరదులకు కొంత భాగం ఇచ్చారు. 

 అది ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒప్పుకోవట్లేదు.."ఇంకా చాలా వున్నది ఆస్థి..అన్నిటిని మా చదువుల కింద ఖర్చు చేసినట్లు చెబుతున్నారు కాని అదంతా అబద్దం" అంటు కొన్ని సాక్ష్యాలు కూడ చూపించారు.  అయినా పెద్దన్నయ్య భార్య  "అవన్ని వాళ్ల బందువులు చెప్పిన చెప్పుడూ మాటలు"  అంటూ ఏడుపు గొంతుతో కొట్టి పడేస్తున్నారు. ఆమె తన ఏడుపులొనే సానుభూతిని సంపాదిస్తూ  తనకు కావలసిన విదంగా ఆస్థిలొ సింహ భాగం చాలా తెలివిగా తనకు పంచేసుకొని మిగిలిన కొద్ది పాటి ఆస్థిని మరదులకు ఇస్తున్నారు, విపరీతమైన ఆశ ఆమెలో కనపడుతున్నది..ఆస్థిలో ఎక్కువ భాగం చాలా తెలివిగా కేటాయించుకొన్నప్పుడే  కనపడుతున్నది, అది బయటకు కనపడ కుండా  ఏడుపును ఆశ్రయించి..సానుభూతి ద్వార తాను పొందాలనుకొన్నది పొందడానికి ప్రయత్నిస్తున్నది.

  ఇంతలో నాలో ఉన్న మరో మనిషి బయటకొచ్చి డకనక డకనకా అంటూ చిందులేస్తున్నాడు.. "ఏంట్రా నీ గొడవ"  అని అడిగితే.. "నేను చెప్పలా  అప్పుడే....?  చూసావా నేను చెప్పిందే నిజం అయ్యింది, నాకు తెలుసు ఆమె ఎందుకొచ్చిందో ...!? హ..హ..హ..హ ఈ ప్రపంచం నిండా నిండుకొని వున్న స్త్రీ ఏడుపుకు చాలా విలువ వున్నది,  బాగా సానుభూతిని నింపారు, దానిని ఆసరాగా  తీసుకొని ఇలా పది మంది మగాళ్ల మద్యన జరిగే పంచాయితిలో ఒక స్త్రీ వచ్చి కూర్చోని మాట్లాడితే..ఇంకా ఆ సానుభూతికి మైలేజి వొస్తుందని తెలుసుకొని దానిని ఉపయోగించుకోడానికి వచ్చిందనే సంగతి నాకు ముందే తెలుసు గురువా "  అంటూ చిందులేస్తున్నాడు.

  ఇంతలో నాలోని మనిషి చెప్పిన భావాలకు అనుగుణంగానే మా ఎమ్.ఎల్.ఏ  " ఎందుకయ్యా మీ వొదిన్ని ఇట్లా ఆస్థుల పేరుతో బజారు కీడుస్తారు,  కాస్త చూసుకొని సర్దుకపోండి "  అన్నాడు. ఒక్కసారిగా ఆ తమ్ముళ్లిద్దరికీ ఏమి చెప్పాలో అర్థం కాలేదు..పరిస్థితి ఇలా మారిపోవడం వారికి మింగుడపడట్లేదు..చూస్తుంటే ఇద్దరు వాళ్లన్నయ్య లాగే మూగెద్దుల్లా వున్నారు.  విచిత్రమేమిటంటే పెద్దన్నయ్య భార్య అలా పంచాయితీకి ఎందుకొచ్చారో....అక్కడున్న మగాళ్లందరికీ ఆ విషయం బాగా స్పష్టంగా అర్థమయ్యింది, సానుభూతి కోసమే అని తెలుసు అందరికీను. కాని బయటకు మాత్రం ఆమె మాట్లాడిన మాటలకు సానుకూలంగానే ప్రవర్తిస్తున్నారు. అంటే లోకంలో అధికంగా ఏ భావానికి అమోదముద్ర వున్నదో దానికే వత్తాసు పలుకుతున్నారు.  తప్పదు అదొక అనివార్యమైన పని..వ్యతిరేకంగా మాట్లాడారో అంతే సమాజం చీల్చి చెండాడుతుంది.

   ఆ సమయంలో నేను కల్పించుకొంటూ  "బాగుందన్నా పంచాయితి చాలా బాగుంది, ఏడిస్తే చాలన్న మాట న్యాయ అన్యాయాలతో పనేమి లేదు. ఒక్క ఏడుపుతో అన్యాయం న్యాయం అయిపోతుందా..?"  అన్నాను.  నా మాటతో ఎమ్.ఎల్.ఏ తో సహా పెద్దన్నయ్య భార్య కూడ నా వైపు విస్తుపోతూ చూసారు. వెంటనే  " ఏమయ్యా .......ఇప్పుడేమి చేద్దామంటావు అయితే..?" అడిగారు తన సహజదోరణిలో చాలా నిదానంగా ఎమ్.ఎల్.ఏ.  ఈయన మాటలు చాలా నిదానంగా గూడ్స్ బండిలా ఒక్కో పదం గంభీరంగా మాట్లాడతారు .

  వెంటనే నేను ఆ ఇద్దరి తమ్ముళ్ల వైపు తిరిగి  "ఏమన్నా మీకు పెళ్ళిళ్ళు  కాలేదా"  అడిగాను. "నాకు  ఒక్కడికే అయ్యింది" అంటూ నడిపతను చెప్పాడు, "మరింకేం మీ భార్యను కూడ రేపు ఈ పంచాయితీకి పిలుచుకొని రా, ఆమె చేత కూడ నాలుగు ఏడుపులు ఏడిపించేయ్.. సరిపోతుంది, చూసారుగా ఇక్కడ ఏడుపులకు ఎంత విలువ వున్నదో, అప్పుడూ మీకు నాలుగు సానుభూతి మాటలు వొస్తాయి, దానితో పాటే మీక్కావలసిన ఆస్థిని పొందొచ్చు కదా.. ?"  అన్నాను.  

నా మాటలకు నిరసనగా పెద్దన్నయ్య భార్య నా వైపు చూస్తున్నది, ఆమె వేసిన పాచికను ఇలా బహిరంగ పరచడంతో .!  పాపం ఆమె ఉపాయం నావలన దెబ్బ తినడం భరించలేకపోతున్నట్లు  అసహనంగా అటు ఇటు ఆమె కదిలే కదిలికల్లో అర్థమవుతున్నది. ’వీడెవడ్రా ఇంతవరకు ఒక్కో ఇటుక పేర్చుకొంటూ వచ్చిన నా వాదనను ఇలా ఒక్క మాటతో కుప్ప కూల్చాడు ’ అన్నట్లుగా వున్నాయి ఆమె చూపులు.  ఆమె అనుకొన్నట్లే.. అయ్యింది.  ఎమ్.ఎల్.ఏ  నోరు విప్పారు

  నా మాటలతో పునరాలచనలో పడ్డ ఎమ్.ఎల్.ఏ  "ఇద్దరి వైపునుండి మీ మీ ఆస్థి వివరాలు ఇవ్వండి, దానిని బట్టి ముగ్గురికి సమానంగా ఎవరికీ అన్యాయం కాకుండా పంచడానికి ప్రయత్నిస్తాను. సరే రెండు రోజులాగి రండి ఆలోచించుకొని చెబుతాను "  అంటూ ఆ పంచాయితీని అర్థాంతరంగా ముగించారు ఆయన.

 ఈ కథకు పూర్తిగా వ్యతిరేకమైన, భిన్నమైన మరో రకపు సానుభూతి కథ కొద్ది రోజుల్లో .....!!



     హిమాచల్ ప్రదేశ్‌లోని "కసోల్" అనే గ్రామానికి కొద్దిదూరంలో ఈ సర్పాస్ పర్వతం వున్నది.  చాన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న ఈ ట్రెక్ కోసం ప్రతి సారి ఏదో ఒక ఆటంకం..ఈ సంవత్సరం అలా కాకూడదని ప్రయత్నించాను, అప్పటికే అన్ని స్లాట్స్ ఖాళీ లేకుండా ఫిలప్ అయిపోయినా... మద్యలోఒకరు ఒక స్లాట్‌ని క్యాన్సిల్ చేసుకొవడం వలన..ఆ స్లాట్‌ని నేను బుక్ చేసుకొని ట్రెక్‌కి సిద్దమయ్యాను ....!  www.yhaindia.org వారు ఈ ట్రెక్స్ అతి తక్కువ ధరకు నిర్వహిస్తున్నారు.  అనుకొన్న సమయానికి మే నెల 19 వ తేది మద్యాహనంకల్లా డిల్లీ చేసుకొన్నాను. హైదరాబాద్ కంటే  ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి డిల్లీలో..ఒకటే చెమటలు...!  పక్క రాష్ట్రాలకు ప్రయాణించడాని కోసం ఒక ప్రత్యేకమైన బస్‌స్టాండ్ "కాశ్మీరీ గేట్" చేరుకొని..రిజేర్వేషన్ కౌంటర్ క్యూలో నించున్నాను..ఇంతలో నా పక్క నుండి పిలుపు "ఎక్స్‌క్యూజ్ మీ" అంటూ..! తల తిప్పి చూస్తే ఓ 27 ఏళ్ళ యువకుడు "మీరు yha వారి ట్రెక్కింగ్‌కి వెళ్తున్నారా "  ఆంగ్లంలో ప్రశ్నించాడు. అవునంటు తలూపాను.."నేను కూడ అక్కడికే" అంటు పరిచయాలు అయ్యాక....తీరా చూస్తే అతను హైదరాబాద్ నుండి నాలాగే వస్తున్న తెలుగువాడే.... తర్వాత  మా సంబాషణ తెలుగులొకి మారింది. ఆ రోజు సాయింత్రం 8 గంటలకు మొదలయిన మా ప్రయాణం మరసటిరోజు 8:30  వరకు సాగింది. బుంతర్ నే ఒక పట్టణనంలో దిగి..అక్కడ నుండి  మరో బస్సును అందుకొని కసోల్ గ్రామానికి ప్రయాణం మొదలు పెట్టాము. డిల్లీ వాతావరణాకి..ఇక్కడి హిమాచల శీతల వాతావరణానికి..చాలా తేడా కనపడుతున్నది..కేవలం ఎనిమిదిగంటల్లోనే ఈ అనుభవం శరీరానికి..ఉత్సాహాన్ని కలిగిస్తున్నది....! హైదారాబాద్‌కి ఫోన్ చేసి వాతావరణ విషయం విచారిస్తే..అక్కడ 45 డిగ్రీస్ ఉన్నట్లు చెప్పారు..వావ్..ఎంతలొ ఎంత మార్పు..అనుకొన్నాను.


   మా ప్రయాణమంతా పర్వతాల మీదుగా ఘాట్ రోడ్‌లో సాగుతున్నది..అక్కడ రెండు పెద్ద పర్వతాల మద్యన పార్వతీ నది ప్రవహిస్తున్నది..!  పేరు కూడ పార్వతీ వ్యాలీనే అని పిలుస్తున్నారు..! చాలా ఇరుకైన రహదారి అది..ఒక బస్సు మాత్రమే పట్టేంత రహదారి అది..ఎదురుగ మరో బస్సు ఎదురైతే మాత్రం అతి కష్టం మీద క్రాస్ అయి వెళ్తున్నాయి ఆ సమయంలో రోడ్ వారగా చూస్తే గుండె దడ ఖాయం..! లోయలో వున్న నదిలోకి పడిపోతామా అన్నట్లుగా రోడ్‌కి చాలా వారగా బస్సు టైర్స్ ఉంటాయి..! పర్వత ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు వాళ్లు కాబట్టి వారికేమి భయం అనిపించట్లేదు..వారి జీవనమే అలా ఉన్నది..ప్రమాదపు అంచుల్లో జీవిస్తున్నారు.. వారు. ఎంత ప్రశాంతంగా వున్నారురా బాబు అనుకొన్నాను ! ఆ నదికి ఇరువైపుల ఉన్న పర్వతాల మీద ఏటవాలుగా జన నివాసాలు ఏర్పర్చుకొన్నారు అక్కడి ప్రజలు..వాటికి ఎక్కడా తిన్నగా రహదారులు లేవు...అన్నిటికి ఏటవాలుగా ఎక్కి ఇల్లకు చేరుకోవాల్సిందే..! మైదాన ప్రాంతాల నుండి వచ్చిన నాలాంటి వారికి అవన్ని కొత్తగానె కనపడుతున్నాయి..అలానే ఈ బస్సు ప్రయాణం కూడ దడ పుట్టిస్తున్నది.. ! ఒక గంటకు "కసోల్" బేస్ క్యాంప్‌కి చేరుకొన్నాం.

     రిపోర్టింగ్ అయ్యాక 8 మంది మనుషులకో టెంట్‌ని కేటాయించారు, నాతో ఉన్న హైదరాబాద్ మిత్రుడు హరి తప్ప మిగతా వారందరు రకరకాలైన రాష్ట్రాలనుండి వచ్చిన వారే..! ఎక్కువగా మా టెంటులో యూత్ వున్నారు..బిట్స్ ఫిలాని నుండి ఓ నలుగురు, బెంగళూర్, చెన్నై నుండి మరో ఇద్దరు..సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్.  బేస్ క్యాంప్ మొత్తం రెండు మూడు ఎకరాల్లో పార్వతి నది వొడ్డున ఉన్నది..మగాళ్ళకు, స్త్రీలకు ప్రత్యేకమైన గూడారాలు ఏర్పాటు చేసారు, మద్యలో చిన్న పాటి ప్లే గ్రౌండ్ లాగ తయారు చేసారు. మొదటి రోజు కేవలం ట్రెక్‌కి సంబందించిన విషయాలు చెప్పడానికి పెద్ద కాన్ఫ్‌రెన్స్ లాంటిది ఏర్పాటు చేసారు..! ప్రతి బ్యాచ్‌కో కోడ్ వున్నది... పేరు సర్పాస్ ట్రెక్ కాబట్టి SP అని పేరు పెట్టి ..ఇక బ్యాచ్ నంబర్ 20  కావడంతో SP20 అని పేరు పెట్టారు..అయితే ప్రతి బ్యాచ్‌లోను..30 నుండి 35 వరకు మాత్రమే సభ్యులుంటారు..కాని మా బ్యాచ్ లో చాలా మంది సబ్యులయ్యారు దాదాపుగా 59 మంది వున్నారు..! మాబ్యాచే ఆ ట్రెక్ కంత కలసి పెద్ద బ్యాచ్. అందరం భారదేశ నలమూలలనుండి వచ్చిన వారమే..! వారిలో తల్లీ కూతుల్లు..తండ్రి కొడుకు, తండ్రి కూతురు, కూతురు ఫ్రెండ్స్. భార్య భర్త..! పదహారు సంవత్సరాల వయసు నుండి 60 ఏళ్ళున్న రిటైర్డ్ వ్యక్తులు కూడ ఈ ట్రెక్కింగ్‌కి వచ్చారు..వయసుతో నిమిత్తం లేకుండా..! ట్రెక్కింగ్ చేయడానికి  వయసుతో సంబందం లేదు దానికి కావలసింది..మానసికంగా దృడంగా ఉండటం మాత్రమే ముఖ్యం.  రెండవ రోజు YHA వారి బ్యాక్‌ప్యాక్స్ ఇచ్చి ట్రైనింగ్ అంటూ మూడు కిలో మీటర్ల్ ట్రెక్కింగ్ చేయించారు. అక్కడన్నీ మిలటరీ రూల్స్..పొద్దున్నే 5 గంటలకు లేవాలి ఒక కిలోమీటర్ మేర నడక తర్వాత ఒక చోట వ్యాయామం చేయిస్తారు..! ఉపపలహారం తర్వాత ట్రెక్కింగ్ ట్రైనింగ్.. మూడవ రోజు రోప్‌తో రాక్ దిగడం..తర్వాత రాక్ క్లైంబింగ్..వీటికన్నిటికి శిక్షణ ఇస్తారు. భోజనం...ఉప పలహారం విషయాలలొ ఎక్కడా రాజీ ఉండదు..చాలా చాలా మంచి పుష్టికరమైన ఆహారమే అందిస్తున్నారు. ఇది మెచ్చుకోతగ్గ విషయం.

 మూడవ రోజునుండి మా ట్రెక్ మొదలవుతుంది..అందరు తమ తమ లగేజీని ఎంత వరకు తెచ్చుకోవాలొ ట్రెక్ నిర్వాహకులు వివరిస్తున్నారు. పది..పదిహేను కిలోల మించని బరువును తెచ్చుకోవడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక్కడ మనం కమలయ్యలం ( సీతయ్య టైపులొ ) కదా..ఏకంగా 25 నుండి 30 కిలోల మద్యన నా లగేజి బరువు వున్నది. ట్రెక్ నిర్వాహుకులు అబ్యంతరం చెప్పారు..మనం వింటేగా..! కాని తర్వాత ట్రెక్కింగ్‌లో తీరింది..దూల..హ..హ..హ..హ..! శరీరంలొ ఉన్న లవణాలన్నీ కారి... కరిగిపోయాయి..!! మొదటి రోజు ట్రెక్ కసోల్ బేస్ క్యాంప్ నుండి బస్సులో ఒక గంట ప్రయాణించాక..అతి సాదారణమైన రహదారి వెంబడి ఐదు గంటల నడక,  దారి మద్యలోనే..మద్యాహ్న భోజన విరామ సమయం..తర్వాత భూమికి 7800 అడుగుల ఎత్తున వున్న KANGHANI  THATCH అనే ప్రాంతానికి చేరుకొన్నాము. ఆ రాత్రికి మ బస అక్కడే... అప్పటికే ఉన్న గూడారాలలో ఏర్పాటు చేయబడివున్నాయి..! ఓ అరగంట విశ్రాంతి తీసుకొన్నాక మా గూడారంలొ ఉన్న బిట్స్ గోవా ఇంజనీరింగ్ విధ్యార్థులతో కలసి కెమెరా చేతపట్టుకొని చుట్టు వున్న కొండలను ఎక్కడాని బయలదేరాను. మా బ్యాచ్‌లో వాళ్లు మళ్ళీ ట్రెక్కింగా..అంటు మా వైపు వింతగా చూసారు

   ఎక్కడో చాలా పైనున్న మంచు పర్వంతం నుండి వొస్తున్న ఒక చిన్నపాటి పాయలాంటి కాలువ వద్దకు చేరుకొన్నాం.  అంతక మునుపు మాటల సందర్భంలో పెద్ద పుడింగిలా పందెం కాసాను..! పారుతున్న ఆ నదిలో ఐదునిమిషాల సేపు కాళ్ళుంచుతాను అని.. ! కాలువ వద్దకు చేరుకొన్నాక మొదట షలబ్ అన్న ఇంజనీరింగ్ విద్యార్థి ఆ చల్లటి నీళ్ళల్లోకి దిగాడు..నా వద్దున్న స్టాప్ వాచ్‌తో సమయాన్ని కొలుస్తున్నాను..ఒక 30 సెకన్స్‌కి అతని మొహంలో భావాలు మారుతున్నాయి..పంటిని బిగపట్టి అలానే నించున్నాడు..అతని అవస్థ చూశాక నాకు..కాస్త జంకు కలిగిందనుకోండి..కాని పందేం కాసాను కదా తప్పదు..! అతను ని||1:30 సెకన్స్‌కి బయటకొచ్చాడు..! ఇక నా వంతు..  నదిమద్యలో ఉన్న ఒక పెద్ద బండరాయి మీద కూర్చొని నా రెండు పాదాలు నీటీలోకి వదిలి మోకాళ్ళ వరకు ఉంచాను.. ఒక పది సెకన్స్‌కే కాళ్ళు చల్లబడ్డాయి..తర్వాత మెల్లమెల్లిగా ఎముకలకు పాకింది ఆ చలి.. నావల్ల కావట్లేదు..అయినా బలవంతంగా... మొండిగా అలానే ఉన్నాను.. ఆ చలి.. కాస్త ఎముకల నుండి శరీరమంతా పాకుతున్నది..గుండెకు చేరింది..సమయం చూస్తే ఇంకా ఒక నిమిషం కూడా కాలేదు..నాకేమో ఐదు నిమిషాలు ఇంకా గడవలేదా అనిపిస్తున్నది..అంతలా ఆ చలి చంపేస్తున్నది. తలకు చేరేట్టుగా ఉన్నది ఆ చలితాకిడి..ఒక నిమిషం అవ్వగానే నా వల్ల కాక వెంటనే నా పాదాలు లాగేసుకొన్నాను..నీటిలో నుండి..! బయటకొచ్చాక పాదాలమీద నిలబడలేకపోయా....వెంటనే పక్కన గడ్డిమీద కూలబడ్డాను..! ఒక పది నిమిషాలకు గాని ఆ చలి తాకిడి తగ్గలేదు నా శరీరం నుండి..అమ్మో అనుకొన్నా..! చాలా మంది ప్రయత్నించారు చూద్దం ఎంత వరకు ఉండచ్చో అని..కాని ఒకే.. ఒకతను..దాదాపుగ పది నిమిషాల పాటు అలానే నీటిలో ఉండగలిగాడు..నిజంగా ఆశ్చర్యం వేసింది.. ఇంకాసేపు ఉంటానన్నాడు కాని..అదంత మంచిది కాదు..చాలా ప్రమాదకరం అని తెలిసి..మేమే అతన్ని వారించి..బయటకు రప్పించాం.! నాకు తెలిసి..ఆ నీటి టెంపరేచర్..దగ్గరగ్గర 5 నుండి 3 డిగ్రీల వరకు ఉండవచ్చు..!

    రెండవ రోజు ఉదయమే అన్ని కార్యక్రమాలు ముగించుకొని.. టిఫెన్ చేశాక..మద్యాహ్నానికి కావాలసిన లంచ్ ప్యాక్(సద్ది మూటే) అక్కడే కట్టుకొని ఉదయం 8:30 కు మా ట్రెక్ మొదలు పెట్టాము.. ఒక కిలోమీటర్ మామూలు రహదారి వెంబడి నడిచాక..ఒక చోట నుండి..పైకి ఎక్కాలి..! అక్కడికి చేరుకొన్నాక చూస్తే అందరు ఒక్కసారిగా భారీ నిట్టూర్పు విడిచారు.! 100 అడుగుల భారి ఎత్తైన దేవదారు చెట్లు మద్యన దాదాపుగా  ’70-80”  డిగ్రీస్ ఏటవాలుగా ఉన్న కొండ మీద ట్రెక్ చేయాలి..నాతొ ఉన్న హైదరాబాద్ ఫ్రెండ్ హరి ప్రసాద్ నా వైపు చూసి. ." మీ పరిస్థితి ఒక సారి ఆలోచించండి..మాకంటే బరువైన లగేజి ఉన్న బ్యాక్‌ప్యాక్ మీది.. ఎలాగండి..ఎక్కగలరా " సందేహం వెలిబుచ్చాడు. నాకు లోపల నిజమే అనిపించినా..ధైర్యంగా "ఊ" అంటు తల ఊపి ఎక్కడం మెదలుపెట్టాను..! విచిత్రమేమిటంటే..ఎక్కకముందు ఆ ఏటువాలు తనం చూడగానే అనిపించినంత కష్టం.. ట్రెక్క్ చేస్తున్న సమయంలో అనిపించలేదు.  అందరి కంటే ముందు వెళ్ళనారంభించాను..! ఆయాసం వొస్తున్నది..ఒక పక్క చెమట..ఎత్తైన చెట్ల మద్యన ట్రెక్ కావడంతో గాలి లేదు....అయినా మొడిగా ట్రెక్ చేస్తున్నాను ! ముఖ్యంగా అమ్మాయిలు..పెళ్లయిన స్త్రీల పరిస్థితి కాస్త కష్టంగానే ఉన్నది.. ఏటవాలుగా ట్రెక్ చేయడం..! అందులొ వున్న ఓ ముగ్గురు పెళ్ళయిన స్త్రీలకు ట్రెక్ అలవాటున్నట్లున్నది..వారు మాత్రమే కాస్త సునాసయంగా ఎక్కగలగుతున్నారు. మా ట్రెక్‌లో కర్నాటకకు చెందిన రెండు కొత్తగా పెళ్ళైన జంటలు..ఒకటె ఉరుకులు పరుగులు ..! కొత్తగా పెళ్ళైన వారు కదా అంతా కొత్తే ..అందులోను కొత్త ప్రదేశాలు..మరిక వయసు మరింత కొత్తదనం కోసం ఉరకలు వేయదా..?? మద్యాహ్నానికి లంచ్‌కు ఒక అనువైన ప్రాంతం వద్ద చేరుకొని..అక్కడ మేము తెచ్చుకొన్న లంచ్ ప్యాక్ ఖాలీ చేసాము. అయితే ప్రతి లంచ్ స్థలాల వద్ద కేవలం ట్రెక్కర్స్ కోసం మోబైల్ క్యాంటిన్స్ ఉంటున్నాయి, అక్కడి ప్రాంతపు మనుషులు అవి ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మ్యాగి, ఆమ్లేట్, టీ, కాఫీ, కాస్త ఎక్కువ ధరకు అందిస్తున్నారు. రెండవ రోజు సాయింత్రం 4 గంటలకు 9100 అడుగుల ఎత్తు వద్ద వున్న "KHORDU  THATCH" వద్ద మా ట్రెక్ ముగిసింది. సాయింత్రం..అందరు ఎవరికిచ్చిన వారి గూడారాలలో దూరేసి..మాటలు...మంతనాలు..! ఒక్కొక్కరిది ఒక్కోరకపు ప్రాంతం..జీవనం..ఆటలు..కేరింతలు..అంతాక్షిరులు..అమ్మాయిలయితే చెప్పనవసరం లేదు.ఒకటే గోల..! ఇక నేను..మరోక వ్యక్తి.. జె.పి.రెడ్డి అనే అతను కలసి కెమెరాస్ మెడలొ వేసుకొని చుట్టు వున్న కొండల్లోకి వెళ్ళిపోయేవారం..ఫోటోస్ కొరకు. జయప్రకాష్ రెడ్డి అని ఇతను చిత్తూరు నివాసి..హైదరాబాద్ JNTU ఫోటొగ్రఫీ డిప్లమా చేసాక "నాసిక్‌"లోని కేంద్ర ప్రభుత్వ కరెన్సీ ప్రింటింగ్ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఈ ట్రెక్కింగ్‌లొ కలసాక తెలిసింది ఇతను తెలుగు వ్యక్తి అని. రాత్రి అయ్యే కొద్ది చలి పెరుగుతుంది..కాబట్టి రాత్రి 7 గంటలకే డిన్నర్ ముగిస్తారు. మామూలుగా మన ధైనందిన కార్యక్రమంలో అంత తొందరగా భోజనం చేయం కాని..ఇక్కడ చలి పెరుగుతుంది..దాని దాటికి నిలబడటం కష్టం.  రొజులానే YHA వారిచ్చే రగ్గు, స్లీపింగ్ బ్యాగ్ తెచ్చుకొని.. అందులొకి దూరి..వెచ్చగా నిద్రలోకి జారుకొన్నాం..!!

 
   మూడవ రోజు ఉదయం మళ్ళీ 8:30 నిమిషాలకు మొదలు మా ట్రెక్..! ఒక కిలోమీటర్ వరకు ఏటవాలుగా  ఉన్నా పెద్దగా కష్టం అనిపించలేదు గాని.. తర్వతర్వాత రాను రాను.. 90 డిగ్రీస్ కు దగ్గరగ ఉన్న ఏటూవాలు ఉన్న పర్వతం ఎక్కడం చాలా చాలా..ప్రమాదకరం అనిపించింది..! ఎక్కుతున్న వారికి కిందకు చూస్తే మాత్రం.."గుండె జల్లుమన్నదే"...!  పాపం సిటీ అమ్మాయిల పరిస్థితి చాలా కష్టంగా ఉన్నది..బర్గర్స్..పిజ్జాలాంటి జంక్ ఫుడ్ తిన్న శరీరాలు.. వారి వల్ల కావట్లేదు..కామత్ హోటల్స్‌కి చెందిన సౌమ్య కామత్ అనే అమ్మాయి ఏకంగా "ట్రెక్ అంటే ఏదో లే జాలీగా ఉంటుంది అనుకొన్నాను..అమ్మో ఇంత కష్టమా..ఇక జీవితంలొ ట్రెక్ చేయను"  ఒక స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. మొత్తానికి..ఎలాగోలాగ..సాయింత్రానికి 10,500 అడుగుల ఎత్తున ఉన్న  "ZIRM"  ప్రాంతానికి చేరుకొన్నాం. అక్కడ మా గూడారాలు ఒక ఏట వాలుగా ఉన్న కొండ మీద ఏర్పాటు చేయబడి వున్నాయి..అక్కడ నుండి చూస్తే దూరంగా చుట్టు ఎత్తైన మంచు పర్వతాలు కనపడుతున్నాయి. మా గూడారం లోపల నుండి తల ఎత్తి బయటకు చూస్తే ఎదురుగా తెల్లగా వెండి కొండలే.. వాటి పైనా ముదురు రంగులో నీలాకాశం.. అందులో తెల్లగా చిన్న చిన్న.. వెన్న ముద్దల్లా తేలియాడుతున్న మేఘాలు..! మాగూడారంలొని ఫ్రెండ్స్‌తో కలసి..వేడి వేడిగా సూప్ తెచ్చుకొని..గూడారం వాకిలు వైపున అరగులాంటి అంచున కూర్చొని మెల్లిగా సిప్ చేస్తూ ఆ చల్లటి వాతావరణాన్ని..అనుభవిస్తుంటే.....హ్మ్.... మాటల్లొ వర్ణించ లేను.............!! తర్వాత కెమెరా మెడలొ వేసుకొని  చుట్టు వున్న కొండల వైపు మెల్లగా నడక మొదలు పెట్టాను.....!

   నాలుగవ రోజు ట్రెక్... మద్యాహ్నం వరకు చిన్న పాటి..ఏటవాలుగా అక్కడక్కడ మంచు వున్న చోట ట్రెక్ చేసాం..! కాని ఉన్నట్లుండి..వాతావరణంలో మార్పు చోటు చేసుకొంది..ఈ విషయాలు మాకు మొదటి రోజే నిర్వాహుకులు చెప్పారు..కాబట్టి రేయిన్ కోట్స్  దరించాం..కాసేపటికే.. వడగల్ల వాన మొదలయ్యింది. నిజం చెప్పాలంటే..మా మామీదుగా తెలుపు బూడిరమ్గు కలగలిపిన మేఘాలు వెళ్తున్నాయి..ఇక నీటి చుక్కల వర్షం ఎలా కురుస్తుంది..అంతా వడగల్లే...పెద్ద పెద్ద వడగల్లు తెల్లగా..తల పగిలిపోయేంతగా కురుస్తున్నాయ్..! మద్యాహ్నన భోజన సమయానకి కూడ ఆగలేదు..అలానే   "వడగల్ల భోజనం " కానిచ్చాను నేను..మరికొంత మంది ట్రెక్కర్స్..మిగతా అందరూ లంచ్ కోసం ఏర్పాటు చేసిన గూడారాల్లోకి వెళ్ళారు. రేయిన్ కోట్ ధరించాక ఇక తడవడం అంటూ ఏమున్నది..తింటున్న ప్లేట్లో వడగల్లు పడుతున్నా... వాటితో సహా వడగళ్ళ భోజనం లాగించాను నేను....! ఇక అక్కడ నుండి ట్రెక్కింగ్ చాలా వరకు ప్రమాదంతో కూడుకొన్నదే..ఒక పక్కన వడగళ్ల వాన..మరో పక్కన మంచుతోకూడిన నేల..జారితే అంతే..మన ప్రేతాత్మ హాయిగా మంచుకొండల్లోనే పర్మనెంట్‌గా తిరగాడుతూ వుంటుంది..!! కొన్ని చోట్ల చాలా కష్టమైన రహదారి..అంతా ఏటువాలుగా ఉండి..మొత్తం మంచుతొ కప్పబడి ఉన్నది..మాతొ ఉన్న గైడ్స్ మాత్రం ఆ మంచు నేల మీద స్కేటింగ్ చేస్తున్నారు..ఎక్కడ కావలంటే అక్కడ ఆగ గలుగుతున్నారు అంతగా వారిలొ నియంత్రణా శక్తి ఉన్నది..మరి మాకు అలవాటులేని పని. స్కేటింగ్..అంటే....అంతే...ఎవరికీ కనపడకుండా..పోతాం..!! ఒక పక్కన వడగళ్ళ వాన వలన మంచు లేని చోట  నేలంతా చిత్తడి చిత్తడిగా ఉన్నది..అక్కడ మరీ ప్రమాదంగా ఉన్నది..జారుడు..! ఏమ్ చేస్తాం..వచ్చాక తప్పుతుందా..మొండి ధైర్యంతో ముందుకు సాగడమే..భయపడితే అంతే అక్కడే ఆగిపోతాం..మన కోసం ఎవరు ఆగరు..ఎవరి దారి వారిదే..!! ఇది జీవితానికి కూడ అన్వయించుకోవచ్చు..!! ఆ మంచుకొండలు...ప్రమాదపు మలుపులైనా బలే అందంగా వొంపులు తిరిగి ఉన్నాయి..! తల ఎత్తి ఆ పర్వతంచు కనుచూపు మేరా చూస్తుంటే... " ప్రకృతి వొడిలొ ఒక వైపు తిరిగి వొత్తిగిలి పవలించిన కావ్యనాయక వొంపు సొంపుల్లా ఉన్నాయి ఆ పర్వత సానువులు"  వామ్మో శ్రీనాధుడు తన్నుకొస్తున్నాడేంటి నాలో.. అసలు ఆయన పేరు తప్ప పద్యం ఎరుగని నాకు... ?? హ్మ్..ఏంటో గానీ...వెంటనే "ఎన్నెన్ని వంపులు ఎన్నెన్ని సొంపులు... నాకున్నవేమో రెండే కన్నులు.. ఎలా చూసేదీ..ఏది చూసేదీ"  ఈ పాట నా నోట పలికింది..నా ప్రమేయం లేకుండానే...! హు.....ప్రియురాలుతో పాడాల్సిన పాట కదా అనుకోవచ్చు....ప్చ్..ప్రస్తుతానికి..ప్రకృతే స్త్రీ ఇక్కడ....మరి..!!
   దాదాపుగా 12,500 అడుగుల ఎత్తుకు చేరుకోగలిగాము సాయింత్రానికి..! అక్కడి ప్రాంతం పేరు "TILA LOTNI" (తిలా లోట్ని) చుట్టు మంచుకొండలే.. అక్కడ మేము విడది చేయలసిన స్థావరం కూడ ఒక కోండ అంచున ఉంది..! బాగా ఎత్తైన మంచుకొండలున్న ప్రదేశానికి చేరుకొన్నాం కాబట్టి. చలి చాలా ఎక్కువగా వున్నది..అదీను కాక ఆకాశం మేఘావృతమై వుంది. అక్కడికి చేరుకొన్న పదినిమిషాలకే మళ్ళీ వడగల్ల వాన మొదలయ్యింది..అంతే అందరం గూడారల్లోకి పరుగో పరుగు;.... గూడారంలోనుండి  వడగల్లు చూస్తూ.. మేమున్న కొండ ఎత్తే  సమానంగా చుట్టు వున్న మంచుకొండలను చూస్తూ....వుండిపోయాం కాసేపు..! వర్షం తగ్గాక..ఫోటోలకంటూ ఎవరికి వాళ్లు పోలో మంటూ..పరుగు.. మా చుట్టూ ఎటువైపు చూసినా పర్వతపు చివరి అంచులే కనపడుతున్నాయి..కాని ఏమాత్రం ఏమారినా.. అంతే సంగతులు చిత్తగించవలెను...!! మిగతా ప్రాంతాలకంటే ఇక్కడ చలి..మైనస్‌కి చేరుకొన్నది..నా వద్ద ఎలానూ డౌన్‌జాకిట్ ఉంది కాబట్టి..దానితో స్లీపింగ్ బ్యాగ్‌లో ఆ రాత్రి నిద్ర..గడిచింది.

    ఐదవరోజు..తెల్లవారుజామున 2:30 నిమిషాలకే నిద్రలేపారు..కారణం.. మిగతా దారి అంతా పూర్తిగా మంచుతోనే కప్పబడి ఉంటుంది..మేము చేరవలసిన "సర్పాస్ పర్వతం" చివరి గమ్యం. తెల్లవారుజామున నడక మొదులు పెడితే కాని మద్యాహ్నానికి సర్పాస్ చేసుకోగలం..ఏ కాస్త ఆలశ్యం అయినా సూరీడు దెబ్బకు మంచు కరగనారంభిస్తుంది. కరుగుతున్న మంచులో ట్రెక్కింగ్ చాలా ప్రమాదకరం..అసలు ట్రెక్ చేయలేం కూడా..! అందుకే..తెల్లవారుజామున 4:40 నిమిషాలకే మా ట్రెక్ మొదలయ్యింది..విచిత్రమేమిటంటే అంతటి తెల్లవారుజాము చీకటిలో కూడ మాకు ఆ ప్రదేశమంతా చాలా స్పష్టంగా కనపడుతున్నది..! ఇది పూర్తిగా మంచు మీద ఏటవాలుగా ట్రెక్ చేయాలి..! బాగా స్లిప్ అయ్యే ట్రెక్ అది..!  చాలా వరకు గైడ్స్ చాలా మందిని చేయి పట్టుకొని పైకి తీసుళ్ళారు..! నా పరిస్థితి ..వెనుక 25 కేజీల బ్యాక్ బ్యాక్..ముందర నా కెమెరా బ్యాగ్..చెతిలొ ట్రెక్కింగ్ స్టిక్....భలే రంజుగా ఉన్నిందిలేండి..! చాలా చోట్ల జారుతున్నాను..నా స్టిక్‌తో ఆపుకొంటూ ట్రెక్ చేస్తున్నాను..ఒక పక్కన అంత అందమైన దృశ్యాలను ఫోటోస్ తీయాలి..! అసలు కెమెరా బయటకు తీసి పట్టుకొని నడవడమే చాల కష్టంగా వున్నది..నా బ్యాలెన్స్‌ అంతా కెమెరా పట్టుకోవడంలో కోల్పోతున్నాను..! అంతటి ప్రమాదకరమైన చోట్ల కూడ ఫోటోస్ తీయటం ఆపడం లేడు.. తీస్తూనే వున్నాను..! దాని వలన అందరికంటే నడకలో వెనుకపడతున్నాను..అయినా తప్పదు..! 

    5:30  నిమిషాలకు.. మన పెద్దాయన సూరీడు తెల్లని మంచు కొండల నడుమ ఎర్రగా బయటకు రావడం మొదలు పెట్టాడు..! మద్యాహ్నం భోజనం చేయాల్సిన బల్లపరుపుగా వున్న ప్రాంతానికి చేరుకొన్నాం..!  అక్కడ స్కేటింగ్..ఆటలు..పరుగులతో అందరు అల్లరే అల్లరి.. ! ఆ ప్రాంతంలో మనుషులందరు చిన్న చిన్న చీమల్లా కనపడుతున్నారు..అంతటి విశాలమైన మంచు మైదానం అది..! భోజనం ముగించగానే..మళ్ళి నడక...అక్కడే మా గ్రూప్‌లొ ఉన్న సౌమ్య కామత్‌కి  కళ్ళు తిరగడం ప్రారంభం అయ్యాయి..కాసేపటికి వాంతులు చేసుకొన్నది..అది సహజంగా చాలా ఎత్తైన ప్రాంతాలలో జరిగే ప్రక్రియే..కాబట్టి సిద్దంగా ఉంచుకొన్న డైమాక్స్ మాత్రలు వాడడమే పని..! అలా తను బాగా వెనుకపడిపోయింది..!  మామూలుగా ఇలాంటి ట్రెక్కింగ్స్‌ బృందానికి ఒక లీడర్‌ని తయారు చేస్తారు ట్రెక్కింగ్‌లో ఉన్న మరో సాటి ట్రెక్కర్‌ని..అలా మా ట్రెక్కింగ్ బృందానికి కూడ బృంద నాయుకుడు ఉన్నారు ఆయనే చివర్లొ వుంటూ అందరిని..తొందరపెడుతూ..మొత్తం  బృందాన్నంతా నడపాలి. ఆయనకు తప్ప లేదు ఆమె బాద్యత..అలానే గైడ్‌ కూడ తోడుగా ఉంటారు..!సో నాకు ఎలాను ఫోటోస్ తీస్తు నడవాలి కాబట్టి..వారితోనే నా నడక..కొనసాగింది..! 

    మరో రెండు గంటలకు సర్పాస్ పర్వతాన్ని చేరుకొన్నాం..దాని ఎత్తు 13,800 అడుగులు..! అక్కడికి  తాడు సహాయంతో ఎక్కుతూ చేరాం..!! అక్కడ ఓ అర గంట విశ్రాంతి..అందరూ హిప్..హిప్..హుర్రే అంటు కేకలు.. కేరింతలు...!! తర్వాత అక్కడ నుండి ఇక వెనకకు మరలడమే దానికి మరో దారి..అక్కడి నుండి..ఆ పర్వతం అంచుల నుండి ఒక అర కిలోమీటర్ నడిచాక అక్కడ నుండి దాదాపుగా ఓ 300 అడుగులు కిందకు జారాలి వెల్లికిలా పడుకొని మంచు ఇసుక మీదగా  ..ఎటువంటి తాడు..లేక స్కేటింగ్ లాంటి పరికరాల సహాయం లేకుండా..! అదొక అద్భుతమైన సాహసం..నేను ఊహించలేదు అలాంటిది ఉంటుందని..!! ఒక్కొక్కరే మొదులు పెట్టారు..! అక్కడ వీటికి సంబందించిన గైడ్..మరియు స్కేటింగ్ నిపుణుడు ఉంటారు..ఆయనే ఒక్కొక్కరికి సూచనలిచ్చి కిందకు నెట్టుతున్నాడు..! కొంతమంది బ్యాలెన్స్ చేసుకొంటూ జారుతున్నారు..కొందరు మద్యలో బ్యాలెన్స్ తప్పోయి పొర్లుతున్నారు..అసలు ఆ వేగాన్ని తట్టుకోవడం చాలా కష్టం..! అందరిని గమనిస్తున్నాను ఎవరు ఎలా జారుతున్నారు..ఎక్కడ పొర్లుతున్నారు బ్యాలెన్స్ తప్పోయి..ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు..అది చూసాక ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది నాకు అర్థమవుతున్నది..!  40 మంది తర్వాత నా వంతు..! అప్పటికే అర్థమయ్యింది..కాబట్టి నో భయమ్స్..! వెల్లికిలా పడుకొని నా మోచేతులను పూర్తిగా కిందున్న మంచు ఇసుకకు గట్టిగా గుచ్చి నా వద్ద వున్న స్టిక్‌ని రెండు చేతులతో హారిజాంటల్‍గా పట్టుకొని.. బ్యాలెన్స్  చేస్తూ జారాను...!!   జుయ్యీ.....మంటు చాలా వేగంగా...జారుతున్నాను..మద్యలో ఒకటి రెండు చోట్ల శరీరం కుడి..ఎడమ వైపు తిరగడానికి ప్రయత్నించింది.. కాని నా మోచేతులతో్ కిందున్న మంచు ఇసుకను..గట్టిగా అదిమి అణిచున్నాను..కాబట్టి  అటు ఇటు తిరగడానికి ప్రయత్నించినా కుదరలేదు..నా శరీరానికి..! మొత్తానికి విజయవంతంగా ఆ మూడొందుల అడుగులు క్షణాల్లో కిందకు చేరుకొన్నాను..!

     హా...... అదొక అనిర్వచినీయమైన అనుభవం..! అక్కడ నుండి కిందకు నడుస్తూ మద్య మద్యలొ వెల్లికిలా పడుకొని జుయ్యీమంటూ జారుతూ..నడుస్తూ..సాయింత్రం నాలుగు గంటలకు  "బిస్కరి (BISKERI)" చేరుకొన్నాం. అక్కడ రాత్రి బస అయ్యాక..మరుసటి రోజు.."మినీ స్విడ్జర్ ల్యాండ్..లేక హిమాచల స్విడ్జర్ ల్యాండ్" అని చెప్పబడుతున్న  "BHANDAK  THATCH" చేరుకొన్నాం..!  మిని స్విడ్జర్ ల్యాండి అని అంటారు గాని...మరీ అంత లేదు..! కాకపోతే ఆకుపచ్చని మైదానాలు..దూరంగా మంచుకొండలు..చూట్టానికి చాలా బాగుంటుంది..! ఆ రోజు సాయింత్రం అందరు క్రికెట్ ఆడుకొన్నారు. మరసటి రోజు తిరుగు ప్రయాణం కిందకు..కాని ఇక్కడో విషయం వున్నది..పర్వతాలను ఎక్కడంలో కష్టమున్నా  మన శరీరం ఎక్కే సమయంలో ఏటవాలుగా ఉన్న పర్వతం వైపు వంగి బ్యాలెన్స్ చేసుకొంటూ ఎక్కగలం..అది చాలా వరకు సులభం కాని దిగే సమయంలొ అలా మన శరీరాన్ని వెనక్కి బ్యాలెన్స్ చేయలేము..అలా అని ముందుకు వంచలేము..చాలా కష్టం పడాల్సి వొస్తుంది... కాస్త శరీరం బ్యాలెన్స్ తప్పినా అంతే బొక్క బోర్ల పడటమే కాదు..దొర్లు..దొర్లు పుచ్చకాయిలా ఏకంగా వెళ్ళిపోవడమే..కిందకు..!!

    దిగుతున్న దారిలో అక్కడక్కడా కొన్ని చిన్న చిన్న గ్రామాలు ఎదురయ్యాయి..!  గొర్రెలు..పశువులు కాపు కాసేవాళ్లు.. చాలా మందే ఎదురయ్యారు.. ! అక్కడ ప్రకృతిలాగ అక్కడి మనుషులు కూడ అందంగా ఉన్నారనే చెప్పాలి.. సాయింత్రానికి.. కసోల్ బేస్ క్యాంప్ చేరుకొన్నాము..!!

  ఈ ట్రెక్‌లో వివిద ప్రాంతాల నుండి వచ్చిన మనుషులతో కొన్ని రోజుల పాటు ప్రయాణం సాగించడం..అరుదైన అనుభవమే నాకు..! ఎవరికి ఎవరు..ఎక్కడి వారో..ఏ..ఏ..సంస్కృతల నుండి వచ్చిన వారో కాని ఎక్కడా మనుషుల మద్యన పొరపొచ్చాలు..ఘర్షణలు లేవు..ఇంకా ఒకరికొకరు సహకారం ఇచ్చుకొంటూ....ట్రెక్ కొనసాగించాం. దక్షిణ, ఉత్తర భారతదేశం నుండి వచ్చిన మనుషుల్లోని ఆ సంస్కృతి తేడా స్పష్టంగా కనపడింది నాకు. ముంబాయి, డిల్లీ, లక్నో, మద్యప్రదేశ్..బెంగాల్, అస్సాం, ఒరిస్సా, గుజరాత్‍ల నుండి వచ్చిన వారిలో ఆ కల్చర్ తేడా కనపడుతున్నది..తల్లీ కూతుల్లు ఎప్పుడూ కల్సి ఉండరు.కూరుతు తన తోటి వయసువారితో అమ్మాయిలతోనే కాక మగవారితో కలసి ట్రెక్ చేస్తుంటే తల్లీ తన వయసు వారితో కలసి తిరుగుతున్నారు..! అంటే ఎటువంటి మగ ఆడ తేడా లేకుండ కలసిమెలసి..ఉండటం..నిజంగ చాలా అరుదు. ..! వారి వయసువారితో ఆటలు..జోక్స్..కేరింతలు..అమ్మాయుల అబ్బాయిల..వారి తల్లితండ్రులెవరికీ అభ్యంతరం లేదు చివరిరోజున అందరు ఒకరినొకరు కౌగిలించుకొంటూ ఫోటోస్ తీసుకొన్నారు. మరుసటి రోజున ఎవరికి వారు విడిపోతున్నారు..కొందరు వాటర్ రాఫ్టింగ్‌కి వెళ్ళారు..మరి కొందరు మనాలికి ప్రయాణం అయ్యారు..! నేను ఆ రోజు మద్యాహ్నం బుంతర్‌కి  బయలు దేరాను..బస్సులో..!  ఆ ప్రయాణంలో మరొక అనుభవం.. ఏడుగురు ఉన్న గుంపులో ముగ్గరమ్మాయిలు నలుగురు అబ్బాయిలు గలగల మాట్లాడుతూ నా పక్క సీట్..ఎదురు సీట్‌లలో ఉన్నారు..వారి పక్కన ఓ నలుగురు విదేశీయులు..!! నా వీపుకున్న బ్యాక్‌పాక్ చూసిన వారు "YHA"కి వచ్చిన ట్రెక్కరా అంటూ అడిగాను..అవునని తలూపాను..! వాళ్ళు ట్రెక్కర్సే..కాకపోతే వాళ్ళు ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు..నాతో వాళ్ళు విషయాలు ఇచ్చిపుచ్చుకొంటున్నారు..అంతా 20 నుండి 26 లోపల వయసున్న వారే..ఎటువంటి భేషజాలు లేవు..మగ ఆడ అంటు తేడా లేదు..కలవిడిగా..కలిసిపోతూ..జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు..!! సాయింత్రానికి బుంతర్ చేరుకొన్నాను.
    బుంతర్‌లో మళ్ళి కలిసాము మా బృందం ట్రెక్కర్స్..అందరూ..! వారిలో డిల్లీకి చెందిన హేమంత్ కులకర్ణి, అనితా కులకర్ణి దంపతులిద్దరు..వారింటికి రమ్మని అందరినీ ఆహ్వానించారట...అందరు వెళ్తున్నారని చెప్పారు..! విషయం తెలిసిన నేను..అంతమంది వారింటికి వెళ్తున్నారు నేను కూడ వెళ్ళి ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్న ఉద్దేశంతో దూరంగా నిల్చున్న నా వద్దకు భార్యభర్తలు వచ్చి.."కమల్..డిల్లీలో మీకు పనుందా" అని అడిగి ..లేదని తెలుసుకొన్నాక "తప్పకుండా రావల్సిందే మా ఇంటికి" అంటు ఆహ్వానించారు. ఆయన...  కేంద్ర ప్రభుత్వ సైన్స్, ఇంజనీరింగ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్‌లో (CSIR)లో సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు.మరుసటి రోజు ఉదయమే ఆయనింటికి చేరుకొన్నాం..దాదాపు 20 మందిమి..!  ఆ దంపతులిద్దరు అంతమందికి..టిఫెన్ అప్పటికప్పుడు చేశారు..! ఇక మద్యాహ్నం భోజనంచేసే ఓపిక లేదండి అని చెప్పినా వినకుండా..అందరికంటే ముందుగా నా ఫ్లైట్ ఉన్నది తెలుసుకొన్నాక త్వరత్వరగా  మద్యాహ్నానికి వంట చేసి..భోజనం కూడ వడ్డించారు..! చాలా మందికి ఆకలి వేయకున్నా కూడ నేను మరి కొంతమంది కర్నాటకక చెందిన రెండు జంటలు వెళ్తున్నారని..మాతో పాటే అందరు భోజనాలు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ ఎవరికీ ఎవరు ఏమి కాము..మునపటి పరిచయం లేదు.., కాని అందరూ..ఒకే కుటుంబంలా భలే కలిసిపోయారు..! మాలానే ట్రెక్ చేసి అలసిపోయిన ఆ దంపతులిద్దరూ మాకోసం అంతటి అలసటలొ కూడ..అందరికీ వంట  చేయడం..అంతా సులభమైన వ్యవహారం కాదు..! ఎన్ని మాటలు చెప్పినా తీరని కృతఙ్ఞత అది..! హ్మ్..ఒకే ఒక పదం "థ్యాంక్స్" అని చెప్పి అక్కడ నుండి..ఏయర్‌పోర్ట్‌కి బయలుదేరాం...!!


                                                                                  -కసోల్-

          
                                                                                                                                                                          మా బేస్ క్యాంప్ వున్న ఈ గ్రామం..నాకు నిజంగా ఒక విచిత్రంగాకనపడింది..! కారణం.. రోడ్డ్‌కి ఇరువైపుల అన్ని కలిపికొడితే కేవలం ఓ యాబై ఇల్లు ఉంటాయేమో..కాని విదేశీయులకు అదొక ప్రత్యేకమైనా యాత్రా స్థలం..! ఎక్కడ చూసినా విదేశీయులే కనపడతున్నారు గుంపులు గుంపులుగా..పోనీ ఆ ఊరున్నా పద్దతిగా ఉండి శుభ్రంగా ఉన్నదా అంటే అదీను లేదు..రోడ్స్ సరిగ్గా లేవు..ఒక వాహనం వెళ్ళితే చాలు అదేదో భూకంపం వచ్చినంతా దుమ్ము రేగుతుంది..ఏముంది అక్కడ ..? కేవలం శీతల ప్రాంతం అంతే అలాంటి ప్రాంతాలు వారి దేశాలలో లేవా..??  అంతగా విదేశీయులను ఆకర్షిస్తున్నది ఆ చిన్నపాటి గ్రామం....అదీను ఇంగ్లీష్ వాళ్ళు కాదు..అందరు యూరప్ దేశాల వారే..ఎక్కువగా ఇటలీ, ఇజ్రాయిల్, పాలస్తీనా, తదితర దేశాల వారు ఉన్నారక్కడ..!

    అక్కడి లోకల్ మనుషులను కొందరిని..! నాకు తెల్సిన ఒక హైదరాబాద్ ఫ్రెండ్‌తో మాట్లాడగా కొన్ని విషయాలు తెలిసాయి. ఇక్కడ నల్ల మందు, హెరాయిన్, గంజాయ్ విరివిగా లభిస్తాయట..! ఎలానూ సంవత్సరానికి ఒక సారి యాత్రలకు వెళ్ళే సాంప్రదాయం ఉన్న ఈ యూరప్ దేశాల వారు ఇక్కడికి వొస్తున్నారు..వచ్చాక ఇక్కడి..ఈ నల్ల మందు..హెరాయిన్ వాటికి బాగా వ్యసన పరులవుతున్నారు..దానితో ఒకరికొకరు తోడై..ఇక్కడే కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోతున్నారు..! మరి కొందరు మన భారతీయ స్వామీజీలాగ మారుతున్నారు..తల వెంట్రుకలు చుట్టలు చుట్టలుగా తిరిగి వున్నాయి..విదేశీ సన్యాసుల్లా కనపడుతున్నారు. ఇక అమ్మాయిల గురించి మరి కొన్ని విషయాలు తెలిసాయి కాని..అవి ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు కారణం..వారు చెబుతున్న విషయాలు నేనేవి ప్రత్యక్ష్యంగా చూడలేదు. కాబట్టి అనవసరపు ప్రస్తావన అనుకొన్నాను.

   ఒకమారుమూల ప్రాంతం.. అదీను కనీస సౌకర్యాలు కూడ సరిగ్గా లేని ప్రాంతంలో విదేశియులు...ఎక్కువగా యాత్రలు చేయడం ఆశ్చర్యం కలగిస్తున్నది..! ఇక్కడ ఒక్కటే విశేషం..చల్లగా ఉండి..ట్రెక్కింగ్‌కి అనుకూలమైన ప్రదేశం..! వీలుంటే ఇక్కడి విషయాల మీద ఎవరైన ఒక మంచి డాక్యుమెంటరీ ఫిల్మ్ చేస్తే బాగుంటుందనిపించింది.







మరి కొన్ని ఫోటోస్......................


































           
         






 



About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs