.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

   జీపు చాటున్నించి ఒక్క సారిగా బైటకొచ్చాడు బాలుడు.
  చేతిలోని బాంబును లాఘవంగా ముందుకు విసిరాడు.
 అది తెల్లగా పావురంలా ఎగురుకోంటూ దూసుకెళ్ళి జీపులోని చెన్నారెడ్డి చేతికి తగిలి జారిపడింది.
  బలంగా తాకటంతో  ’అబ్బా ’ అంటూ చేత్తో తడువుకొన్నాడు అతను..
 బాంబు పేలక పోవటంతో నిశ్చేష్టుడయ్యాడు బాలుడు.
 అప్పటికే జీపు డ్రైవర్ అలర్టయినట్టుంది.
 జీపు వేగం ఒక్కసారిగా పెరిగింది.
 అరుగుమీది జనాల మద్యనున్న రాఘవ హుషారుగా లేచి నిల్చున్నాడు. చేతిలోని బాంబును విసరికొట్టాడు డ్రైవర్‌కు గురిచూసి.
 అది వెళ్లి డ్రైవర్ భుజానికి తగిలింది.
 బాలుడు విసరిన మరో బాంబు జీపుకు తగిలింది.
 మూడు బాంబులూ పేలలేదు.
తనకు తగిలింది బాంబుగా అర్థమయ్యేసరికి చెన్నారెడ్డికి పై ప్రాణాలు పైన్నే పోయాయి.
 మొదట ఏదో రాయనుకొన్నాడు.
జారి కాళ్ళ మీద పండింతర్వాత తెలిసింది అది బాంబని.
 ఆగమేఘాల మీద అక్కణ్నించి దూరమైంది జీపు.
 అప్పటికే రివర్సయి రోడ్డు మీదకు వచ్చి వుంది శివపురి వాళ్ళ జీపుకూడ.
  చేతిలో బాంబుల్ని కసిగా నేలకేసి కొట్టాడు బాలుడు.
 నాలుగు బాదినాగాని ఒక్కటి పగల్లేదు.
 అంతులేని కోపంగా వుంది అతనికి.
 భరించరాని అసహనంగా వుంది.
 అద్భుతమైన అవకాశం చేజారిపోయింది.
 నేరుగా గనివద్ద కెళ్ళి బాంబ్ మేకర్ని కలిశాడు.
 " నన్నడగొచ్చు గదా రెడ్డీ ?  ఎందుకు తీస్కపోతనారో చెప్పక పోతిరి. నేనట్లా బైటకు పోయెచ్చేలోపల బక్కెట్లకు ఎత్తినారు, ఎనకనించి పిలుస్చా వున్న్యా వినపడ్లా.... మీరు తీస్కపోయిన బాంబులు ఇప్పుడే పిసికి ఆరబెట్టి వున్నే.....  గంటసేపన్నా ఆరివుంటే పేలేవి.  అయినా టెస్ట్ జెయ్యకుండా ఆయుధాలు వాడకూడదు రెడ్డీ ! "  చెప్పాడు బాంబ్ మేకర్.
  "  సరె సరే అర్జంటుగా మంచి బాంబులు బక్కెట్లకెత్తు... "
 బాలుడు చెప్పటంతో వెంటనే సిద్దపరచ బడ్డాయి.
  జీపు మళ్ళీ రోడ్డెక్కింది.
 అవగాహన రాహిత్యంతో అపూర్వావకాశాన్ని మిస్ చేసుకొన్నారు.
 ఇప్పుడయినా మించిపోయింది లేదు.
 ఒంటరి జీపుతో వెళుతున్నాడు ఎమ్మెల్లే
 పోరుమామిళ్ళలోనయనా  అటాక్ చేయాలి.
 శరవేగంతో దూసుక పోసాగింది జీపు.
  కనుచూపు మేరలో చెన్నారెడ్డి వాహనం కన్పించలేదు.
 అది అందదని తెలుసు ఏదైనా ఆటంకం జరిగితే తప్ప.
  అయినా తమ ప్రయత్నం మానకూడదు.
 పోరుమామిళ్ళ పొలిమేరలు సమీపించేసరికి వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఎమ్మెల్లే జీపు కన్పించేసరికి హుషారు పెరిగింది.
 డ్రైవర్‌ను తొందరించారు.
  జీపు వేగం మరింత పెరిగింది.
 బకెట్లలోని బాంబుల్ని తలా ఒకటి అందుకొన్నారు.
  జీపు ఏ మాత్రం అదుపు తప్పినా వాళ్ళ చేతిలోని బాంబుల్తో వాళ్ళే బలి కావలసి వస్తుంది.  ఆ విషయం అందరికీ తెలుసు. కర్తవ్యం కలిగించే హుషారు ముందు చావు భయం దగ్గరకు రావటం లేదు.
  వీళ్ళను గమనించునట్టుంది - చెన్నారెడ్డి జీపు కూడా వేగం పుంజుకొంది.
 అప్పుడే రోడ్డు దాటుతూ వున్న చివరి బర్రెనూ, చేలల్లోని మందను చూడగానే అర్థమైంది - ముందు జీపు ఎందుకింత ఆలస్యమైంది.
’బర్రె మహాతల్లులు మరికొంత కనికరం చూపించివుంటే బావుండేది. ’
 రెండు జీపులు టౌన్లోకి ప్రవేశించాయి.
 వాటి వేగానికి జనాలంతా ఆశ్చర్యపోతున్నారు.
 వందగజాల మధ్య దూరంతో విపరీత శబ్దాలు చేసుకొంటూ వెల్తున్నాయి.
 ఊళ్ళో ఎక్కడా నిలబడలేదు చెన్నారెడ్డి జీపు.
 ఊరికి ఉత్తర శివార్లలో వున్న పోలీసు స్టేషన్ వద్ద స్లో అయింది. నేరుగా స్టేషన్ ప్రహరీ ముందు ఆగింది. క్షణం కూడా ఆలశ్యం చేయకుండా అందులోంచి దిగదూకి గబగబ సి.ఐ. ఆఫీసులోకి వెళ్ళాడు చెన్నారెడ్డి.
  అతని చేతిలో పగలని బాంబుంది.
 ముందు జీపు వెనకే స్టేషన్ దాటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ముందు ఆగింది శివపురి వాళ్ళ జీపు కూడా.
  లోపల్నించి దిగకుండ స్టేషన్ కేసి చూస్తుండి పోయారు వాళ్ళు.
 పది నిమిషాలు గడిచినా చెన్నారెడ్డి బైటకు రాలేదు.
 రోడ్లోంచి వాళ్లు కదల్లేదు.
 పోలీసులు మాత్రం కాంపౌండ్ వాల్ లోపల్నించి నిక్కి నిక్కి చూస్తున్నారు. శివపురి జీపు కేసి వేలెత్తి చూపుతున్నారు.
 అంతలో రమణారెడ్డి జీపు వచ్చి తమ జీపు పక్కగా ఆగింది.
 వాళ్ళకు విషయం తెలిసి హుటాహుటిన వచ్చారుట.
 బాలునికి మరింత బలం పెరిగినట్లయింది.
 లోపల నించి ఓ పోలీసు నేరుగా వాళ్ళ వద్దకొచ్చాడు.
 రమణారెడ్డికి సెల్యూట్ చేశాడు.
 " ఎమ్మెల్లే లోపల కూచోనుండాడు.  మీరు ఎంట బన్న్యారంట... బాంబులు ఏసినారంట...  బాంబులు కూడా చేతబట్టకోనొచ్చినాడు..  - సి.ఐ. సార్ లేరు.  ఆయనొచ్చే లోపల మీరు వెళ్ళిపోండి... "  చెప్పాడు.
  " ఎందుకు పోవాల  ?  "  జయసింహ అన్నాడు.  " ఆయప్పే మామీద బాంబులేసి వొచ్చినాడు.  మేం కూడా కేసు బెట్టడానికే యిక్కడి కొచ్చింది. ఆయప్ప లోపలుండాడు. అతను బైటికి పోతే రావాలని మేమిక్కడ కాచుకొనుండాం "  చెప్పాడు.
  " స్టేషన్ వాల్లబ్బ సొమ్మంటనా.... ఎంత సేపైనా కూచోడానికి.. ?  బెరీన బైటకు పంపండి  లేదా మేమే వస్చాం... మీకెందుకు ట్రబులివ్వాలా అని మేమీడుండేది.  ఆయప్పకేం భయపడి కాదు..."  బాలుడన్నాడు.
 " పోవయ్యా !  ఎమ్మెల్లేను బైటకు పంపీపో... మేం రావాల.  బద్వేలులో హోం మినిస్టర్ ప్రోగ్రాముంది. సర్‌ఫ్రైజింగ్‌గా వస్తున్నాడు. మీ సి.ఐ కూడా అక్కడికే వెళ్ళుంటాడు. మేమూ పోవాలి.  సి.ఐ ని అక్కడే కలుస్చాం గాని ముందు ఎమ్మెల్లేను బైటికి పంపీండి..."  రమణారెడ్డి చెప్పటంతో కానిస్టేబుల్ రెండు చేతులెత్తి దండం పెట్టాడు.  " సార్  ! గొడవలయితాయి సార్ ! మాకు చెడ్డ పేరొస్చాది..  మీరు పోండి సార్ ! ".
" ముందు వాన్ని బైటికి రమ్మను  వాని కతేందో తేల్చుకొని ఈ రోజు హోం మినిస్టర్‌ను కలవాలి "  తీక్షణంగా చెప్పాడు రమణారెడ్డి.
 మరేం మాట్లాడకుండా పోలీసు వెనుదిరిగాడు.
 అదే సమయంలో రోడ్డుకు దక్షిణంగా రంపాడు క్రాస్ వద్ద కొచ్చి ఆగాయి ఆరు జీపులు.
  వాటిల్లోంచి దిగుతోన్న జనాన్ని చూడగానే రమణారెడ్డి వర్గానికి అర్థమైంది అవి ఎమ్మెల్లేకు సంబందించినవని.
 విషయం తెలిసి వచ్చినట్లుంది వాళ్ళంతా.
 కొంతమంది జీపుల్లోంచి బక్కెట్లు దించి పట్టుకొస్తున్నారు.
 యుద్దానికి సిద్దమయ్యే వచ్చినట్లుంది.
 క్షణం కూడా ఆలస్యం చేయలేదు శివపురి వాళ్ళు.
 జీపుల్లోంచి అందరూ కిందకు దిగారు.
 బక్కెట్లు కూడ దించబడ్డాయి.
 వెనక వచ్చిన రమణారెడ్డి కూడా కావలసినంత ’సరుకు ’ పట్టుకు రావటం వల్ల మేలయింది.
 బాంబులు చేతుల్లోకి తీసుకొన్నారు.
 మొదట చెన్నారెడ్డి గుంపు వైపున్నించే బాంబు దూసుకొచ్చింది. అది నడిరోడ్డు మీద పెద్ద శబ్దంతో పేలగానే జనం కకావికలయ్యారు. స్టేషన్‌ లోపలున్న పోలీసులు ఉలిక్కిపడి చూశారు. ఎదురుగా వున్న ఆంజనేయస్వామి గుడిలోని భక్తులు  " రామ రామా ! "  అంటూ చెవులు మూసుకొని వణకి పోసాగారు.
  ఇరువైపుల్నించి బాంబుల పోరాటం మొదలైంది.
  పోలీసు స్టేషన్‌కు ఉత్తరం వైపునించి ఓ ముఠా, దక్షిణం వైపునించి మరో ముఠా విసిరే బాంబులు స్టేషన్ గేటు ముందు ప్రాంతాన్నే వేదికగా చేసుకొని పేలుతున్నాయి.  వాటి శబ్దాలకు టౌనంతా అదిరిపడింది.
 తుపాకులు ఎక్కుపెట్టి గేటుదాక వచ్చి ఆగిపోయారు పోలీసులు.  " కాల్చండి -  కాల్చిపారేయండి నాకొడకల్ను. "  శివపురి వర్గం కేసి చేయి చాపుతూ వెనకనించి అరుస్తున్నాడు చెన్నారెడ్డి.
  " వాల్లను కాల్చినారనుకో... తగిలిన బుల్లెట్ కంతా లక్షరూపాయులు లెక్కిస్తా..  కానీండి మరి... "
 అతనికేసి వెర్రివాన్ని చూసినట్లుగా చూశాడు యస్,ఐ,  " ఇక్కడ కూడా వాగ్దానాలు సెయ్యల్నేమో ! "  అన్నాడు ఎటోతిరిగి గొణుక్కుంటోన్నట్లుగా.
  ఆ మాటలు చెన్నారెడ్డి చెవుల బడ్డాయి.
 " వాగ్దానాలు కాదయ్య.... నిజమే చెబుతావుండా "  అన్నాడు.
 " సార్ ! పిల్లలుగల్లోల్లం - మమ్మల్నిట్లా బతకనీండి... "  రెండు చేతులెత్తి నమస్కరించాడు ఎస్సై,  " మీ వాళ్ళకు చెప్పండి వెనక్కిపొమ్మని... గొడవే వుండదు గదా ? "  అన్నాడు.
  " అంటే..  మా వాల్లు వెనక్కిపోతే వాల్లచేత నామీద బాంబులేయిస్తామనా..?  "  గట్టిగా అరిచాడు చెన్నారెడ్డి.
  అతన్ని  వదిలేసి గేటు వద్దకెళ్ళాడు ఎస్సై.
 అప్పటికే ట్రాఫిక్ బందయింది.
  జనమంతా సుదూరంగా కోట కట్టినట్లు నిల్చుని చోద్యం చూస్తున్నారు.
 మేధావి వర్గానికి, చాలామందికి అనుమానమొచ్చింది - అస్సలు పోలీసు వ్యవస్థ వుందా ’ లేదా ’ అని.
హ్యాండ్ మైక్‌తో పోలీసులు కేకలేసి చెబుతున్నారు - ’ మర్యాదగా అక్కణ్నించి వెనుదిరగ కుంటే కాల్చి పారేస్తామని ’
  వాళ్ళ హెచ్చరికల్ని ఎవరూ లెఖ్క జేయలేదు.
 యధేచ్చగా బాంబింగ్ జరుగుతూనే వుంది.
 చెన్నారెడ్డి స్టేషన్ లోపల్నించి బూతులు తిడుతున్నాడు. శివపురి వాళ్ళ మీద సవాల్ విసురుతున్నాడు. ’ రేయ్ ’ మీ ఏరియాలో నా మీంద రెండుసార్లు అటాక్ జేసినారు, నేనట్లాగాదు నా ఏరియాలో మీ జోలికి రాను. అది మగతనం గాదు. మీ ఏరియాలోనే మీమీద దాడి జేస్తా. నా దెబ్బ ఏందో మీకు రుచి జూపిస్తా ’ అంటూ కేకలేశాడు.
వెంటనే అతని సవాలుకు ప్రతిస్పందించాడు బాలుడు  " ఫో పోరా ! - నువ్వొక మొగోనివీ..  నీకొక ఏరియా.... రేయ్ నువ్వు నిజంగా మొగపుట్టకే పుట్టింటే బైటకు రారా  తేల్చుకుందాం.. "  చేతులూపి, యీలేసి సవాల్ విసిరాడు.
 లోపల్నించి రొప్పుతున్నాడు చెన్నారెడ్డి.  " ఎస్సై పక్కకు తప్పుకో... నేను పోవాల..."  బైట కెళ్ళేందుకు ప్రయత్నించాడు చెన్నారెడ్డి.
 " పోతే మిగలవు సార్ !  ఇద్దరూ వూరి బైటికి పోయి కొట్లాడి చావుపోండి..  మా స్టేషన్ ముందు చస్తే మాకు పీకల మీదకొస్చాది.."  అడ్డుకొన్నాడు ఎస్సై.
 బైట్నించి రెచ్చగొడుతున్నాడు బాలుడు బగైరాలు.
 బాంబింగ్ జరపటంలో చాలా హుషారుదనాన్ని ప్రదర్శిస్తున్నాడు రాఘవ. అవతలి వాళ్ళు విసిరిన బాంబులు పేలుతోన్నా లెఖ్క జేయకుండా ముందుకు దూసుకెళ్లి ప్రయోగిస్తున్నాడు. అతని బాంబు దెబ్బకు బారెడు  వంతున వెనక్కి సర్దుకోవలసి వస్తోంది ఎమ్మెల్లే వర్గానికి.
 ఎర్రగా అందంగా వున్న ఆ యువకుడి విన్యాసాలు చెన్నారెడ్డిని కూడ ఆకట్టుకొన్నాయి. పరిశీలించి చూసేసరికి అతనెవరో అర్థమైంది. అరెకపాడు కేసు కళ్ళ ముందు మెదిలింది.
  అక్కడి పరిస్థితిని తన పై అధికారులకు సెట్లో చెబుతున్నాడు ఎస్సై...  పైన్నించి అదనపు సహాయం అందేదాక తనెట్లా యీ సమస్యను నిర్వహించాలో అర్థం కాలేదు.
 ’తనకు శనిలా దాపురించాడు ఎమ్మెల్లే.. గొడవలు పడేవాళ్ళు వూరిబైట కొట్టుకు చావొచ్చు గదా !  వాల్ల పీనిగెలకు కావలుండి పోస్టుమార్టం జరిపించే వాల్లం...  వాల్లకు పిండాకూడు పెట్టించే వాల్లం..’
  గొణుగళ్ల రూపంలో తిట్టుకొంటున్నాడు ఎస్సై.
  క్రమేణా బాంబింగ్ వేగం కొంత చల్లబడింది.
  పోలీసులకు అర్థమైంది ఇరువర్గాల వద్ద సరుకు అయిపోవచ్చిందని.
 అప్పుడు రంగంలోకి దిగారు ధైర్యం చేసి.
 స్టేషన్లో వున్న పోలీసులంతా మూకుమ్మడిగా రోడ్డు మీదకొచ్చారు. ఇరువర్గాల మధ్య నిల్చుని అందర్నీ చెల్ల చెదరు చేస్తోన్నట్లుగా లాఠీల్ని ఝళిపిస్తూ అటుఇటు పరిగెత్తారు.
  పోలీసులంతా బైటకెళ్ళేసరికి చెన్నారెడ్డి అటు ఇటు తేరపార జూశాడు. అతని కళ్లల్లో ఏదో బెదురు. వెంటనే తన గన్‌మెన్ తోటి తనూ స్టేషన్ బైటకు నడిచాడు.
  ఇరువైపుల రెండు గుంపులూ నెమ్మదిగా వెనక్కి సర్దుకొన్నాయి. ఇంకా సవాళ్ళు తీసుకొంటూనే జీపులెక్కి ఆ ప్రాంతం నించి నిష్క్రమించారు.
 తర్వాత రెండు గుంపుల మీదా కేసులు నమోదయ్యాయి.

                      **********

 అనుకోకుండా వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని సమర్థవంతంగా వినియోగించుకున్నారు గాని... కొద్దిపాటి అవగాహనా రాహిత్యం వల్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయారు శివపురి వర్గీయులు.
 అయితే యీ ఒక్క దాడితోనే వాళ్ల పేర్లు తాలుకా అంతటా మారుమ్రోగింది. చెన్నారెడ్డిని ఎదిరించే మొనగాళ్ళుగా గుర్తించబడ్డారు.
 ప్రయత్నం విఫలమైంతర్వాత శివపురి సోదరుల్లో మరింత కసి పెరిగింది.  ఈ వేడి మీదనే మరో సారి దాడి జేయాలని తీర్మానించుకొన్నారు.
 చెన్నారెడ్డి కూడా తన జాగ్రత్తలు తను తీసుకొంటున్నాడు.
వెంట జనం లేకుండా ఎక్కడికీ కదలటం లేదు.
 జీపుల కాన్వాయిలో తన జీపు స్థానాన్ని తేప తేపకు మార్చుకొంటున్నాడు. ఒకే జీపులో కాకుండా వేరు వేరు జీపుల్లో ప్రయాణిస్తున్నాడు.
 శివపురి ఏరియాలో ఎన్నికల ప్రచారం కూడా మానుకున్నాడు.
 పోలీస్టేషన్ ఎదుటే వాళ్ళ తెంపు చూసింతర్వాత తన పద్దతుల్ని చాలా వరకు మార్చుకోవలిసి వచ్చింది అతనికి.
  గత రెండ్రోజులుగా అట్లూరు మండలం మీద దృష్టి సారించాడు. ఇంకో మూడు రోజుల కార్యక్రమం వుంది అక్కడ.  బద్వేలు ఏరియాలోని మూడు మండలాల్ని గట్టి చేసుకొంటే చాలు మిగతా పోరుమామిళ్ల ఏరియా మూడు మండలాల్లో కొంచం అటు ఇటు అయినా ఇబ్బంది లేదు. తనకు భారీ మెజారిటీ దక్కుతుంది.
 అతని ప్రోగ్రాం గురించిన వివరాలు పూర్తిగా అందాయి రమణారెడ్డికి.
 దొరికిన అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలనుకుంటున్నాడు.
 మిత్రులందర్నీ సమావేశ పరచి సుదీర్ఘీగంగా చర్చించాడు.
 అంతా కలసి పకడ్బందీ ప్లాన్ ఒకటి సిద్దం చేశారు.
 రేపు కూడా అట్లూరు మండలానికే వెల్తున్నాడుట చెన్నారెడ్డి. పల్లెల్లో కన్నా టౌన్లోనే అటాక్ చేయటం బావుంటందనుకొన్నారు.
 బద్వేలులోనే దాడి చేయాలని నిర్ణయం జరిగిపోయింది.
 దాడి చేసే ప్రాంతం కూడ సెలక్ట్ చేసుకొన్నారు.
  సిద్దవటం రోడ్డులో జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద తమ వ్యూహాన్ని అమలు చేయాలనుకొన్నారు.  ఒకటికి రెండు సార్లు ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా చూసి పరిస్థితుల్ని బాగా ఆకళింపు చేసుకొన్నారు.
 జి.పి.ఆర్ బిల్డింగ్ పై భాగానికి ఎక్కి విహంగ వీక్షణం చేశారు.
 అక్కణ్నించి ప్రాంతీయపార్టి కార్యాలయం స్పష్టంగా కన్పిస్తోంది.
 పరిసరాల ఎన్నిక పూర్తయింతర్వాత వ్యూహం అమలు గురించిన పథక రచన ప్రారంభమైంది.
 అటాక్‌లో పాల్గొనే  వారంతా మూడు గ్రూపులుగా విభజించబడ్డారు.
 గ్రూపుల వారీగా పని విభజన కూడా జరిగిపోయింది.
 ఎవరి పని వాళ్ళు చేసుకుపోవాలి తప్ప ఒకరి పనిలో మరొకరు వేలు పెట్టగూడదు. పొరబాటున కూడా మరొకరి భాద్యతల్ని తాము మోయాలని ప్రయత్నించకూడదు.  ఏ గ్రూపు భాద్యతలు ఆ గ్రూపే నిర్వర్తించాలి.  అట్లా చేయటం వలన తమ మీద తామే బాంబింగ్ జరుపుకొనే పొరబాట్లు దొర్లవు.
  మూడు గ్రూపుల్లోనూ చెన్నారెడ్డి ద్వారా తండ్రుల్ని, అన్నల్ని, తమ్ముళ్ళను పోగొట్టుకొని, అతన్ని చంపాలనే అంతులేని కసితో బతుకుతోన్న వాళ్లను మాత్రమే ఎంపిక చేసుకొన్నారు.
  అందరూ అత్మీయుల్ని పోగొట్టుకొని కసి పెంచుకొన్న వాళ్లే గ్రూపులుగా తయ్యారయ్యారు గాని రెండవ గ్రూపులో మాత్రం ఓ వ్యక్తి ఆస్తుల్ని పోగొట్టుకొని పగబట్టి వున్నవాడు.  తన ఆస్థినంతా లాక్కుని వూర్నించి తరిమేశాడుట చెన్నారెడ్డి.  అతన్ని ఎట్లైనా చంపాలనే ధ్యేయంతో వచ్చి శివపురి వర్గంలో కలిశాడు.
 అతని పేరు ఎనుబోతుల సుబ్బారెడ్డి... కలసపాడు ఏరియా.
 అందరికంటే ఎక్కువ కసితో చెలరేగి పోతున్నాడు అతను.

                                        **********


  రాత్రి బద్వేలులోనే తిష్టవేశారు అందరు.
 రేపు ఉదయం జరపబోయే కార్యక్రమాన్ని ఒకటికి రెండు సార్లు రిహాల్సల్స్ వేసుకొన్నారు.... తృప్తిపడ్డారు.
 ఉదయమే యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది.
 అప్పటికింకా పొద్దుకూడా పొడవలేదు.
 చీకట్లో లేచి ప్రయాణం కావటం చెన్నారెడ్డికి అలవాటు.
రోడ్డు మీద సన్నగా జనసంచారం మొదలైంది. పల్లెల్నించి కూరగాయలు, పాలక్యాన్లు టౌన్‌కు వస్తున్నాయి. అడపా దడపా బస్‌లు నడుస్తున్నాయి.
 జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద మూడు గ్రూపులూ మొహరించాయి.
  చెన్నారెడ్డి ఏ జీపులో వస్తున్నారో తెలిసికొని మొదటి గ్రూపుకు సంకేతాలిచ్చేందుకు ఓ వ్యక్తిని రెండంతస్థుల జి.పి.ఆర్ బిల్డింగ్ పైకి ఎక్కించారు.
  అక్కణ్నించి ప్రాంతీయ పార్టి కార్యాలయం వద్ద వున్న మనుషల్ని కూడా స్పష్టంగా పొల్చవచ్చు. చెన్నారెడ్డి ఏ జీపులో ఎక్కి వచ్చేది బిల్డింగ్ పైనున్న మనిషికి తెలుస్తుంది. వేళ్ల సంఙ్ఞల ద్వారా కాన్వాయ్‌లోని జీపు వరుస సంఖ్యను తెలియజేయాలి. మొదటి గ్రూపు వాళ్లు అతన్ని గమనిస్తూ, అతను అందించిన సమాచారాం ప్రకారం అటాక్ చేయాలి.
 ప్రస్తుతం యీ ఆపరేషన్ సక్సెస్ కావటానికి అతను అందించే సమాచారమే కీలకం. అందుకే అతనికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఒకటికి పదిసార్లు హెచ్చరించి మరీ టవర్ ఎక్కించారు.
  ఆరు గంటలకే చెన్నారెడ్డి జీపుల వరస పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైంది.
 ఆ సమాచారం శివపురి వర్గానికి తెలిసింది.
 బిల్డింగ్ పైనున్న మనిషికేసి ఆతృతగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మొదటి గ్రూపువాళ్ళు.
  అతను పార్టీ కార్యాలయం కేసి తదేకంగా చూస్తున్నాడు.
 ఒక్క నిమిషం తర్వాత పై మనిషి కుడి చేతిని పైకెత్తి హస్తాన్ని వాళ్లకేసి చూపించాడు.  తర్వాత నెమ్మదిగా రెండు వేళ్లను ముడిచాడు.
 అంటే -  ముందునించి మూడో జీపులో వస్తున్నాడన్నమాట చెన్నారెడ్డి. మొదటి గ్రూపు సిద్దపడింది.
  రోడ్డుమీద వచ్చే వాహనాల కోసం ఉత్కంఠగా ఎదురుచూడసాగింది.
 దాని ప్రధాన కర్తవ్యం చెన్నారెడ్డి జీపుమీద దాడిజేయటం. విచక్షణా రహితంగా బాంబింగ్ చేసి కాన్వాయ్‌ని చెదరగొట్టటం. అతన్ని ఒంటరిగాని చేయటం.
  అంతటితో మొదటి గ్రూపు పనయిపోతుంది.
 మరుక్షణం రెండవ గ్రూపు రంగంలోకి దిగవల్సి వస్తుంది.
 మొదటి గ్రూపు వాళ్ళు తమ పనిని మననం చేసుకొంటూనే రెండుచేతుల్లో రెండు బాంబుల్ని పట్టుకొని జీపుల రాక కోసం ఎదురుచూస్తూ అబ్బిళ్లు కొరుకుతూ పూని వున్నారు.
 జీపుల వరస వాళ్లకు దగ్గరగా వచ్చింది.
 ఒకటవ జీపు దాటుకెళ్లింది.
 రెండవ జీపు కూడా
 అప్పటికే పొజిషన్ తీసుకొని వున్నారు.
 పుట్ట చెండుల్లే లేచి వెళ్ళి మూడవ జీపుమీద పడ్డాయి తెల్లటి నాటు బాంబులు.
  వాటి పగుళ్లతో ఆ ప్రాంతమంతా ఒక్క సారిగా దద్దరిల్లింది.
 ఒక బాంబు సూటిగా వెళ్లి డ్రైవర్ తలకు తగిలి పేలింది.
 తల పగిలి వెనకసీటులోని చెన్నారెడ్డి ఎదల నిండా మెదడు, నెత్తురు చిందింది.
  చెన్నారెడ్డికే బాంబు దెబ్బ తగిలిందనుకొన్నారు ఆ దృశ్యాన్ని చూసి.
 ఒక్క క్షణంలో పరిస్థితి ఏమిటో అర్థమైంది వెనక ముందు జీపుల్లోని వాళ్లకు.
 కనురెప్పపాటులో ముందున్న రెండు జీపులూ శరవేగంతో దూసుకెళ్లి అదృశ్యమయ్యాయి. అవి బహుశా సిద్దవటం వద్దనున్న పెన్నానది ఒడ్డుకు వెళ్లిగాని వెనుదిరిగి చూడవు.
  వెనక జీపుల్ని రివర్స్ చేసుకొనేందుక్కూడా తోచక జీపుల్లోంచి దిగనురికి చావుబతుకుల మీద టౌన్లోకి పరారయ్యారు జనమంతా.
 తన జీపులో చెన్నారెడ్డి ఒక్కడే మిగిలాడు.
 జరిగిన సంఘటన అర్థమై అతను తేరుకొనే సరికి బాంబుల పొగ మద్య తన జీపు ఒక్కటే వుంది.  తను నమ్ముకొన్న జనమంతా తనను మృత్యు వొడిలోకి నెట్టి ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయారు.
 తన చచ్చాడే అనుకొన్నాడు.
 జీపు దిగేందుక్కూడా శరీరం సహకరించక అలాగే కూచుండి పోయాడు.
 బాంబు శబ్దాలు. హాహా కారాలు, తెల్లని పొగల మద్య తమ పనిని తాము దిగ్విజయంగా పూర్తి చేశారు మొదటి గ్రూపు వాళ్ళు.
  వెంటనే రెండవ గ్రూపు యాక్షన్ ప్రారంభం కావాలి.
  వాళ్ళు చెన్నారెడ్డిని లక్ష్యంగా బాంబు దాడులు జరపాలి. ఎంతమంది చచ్చినా ఫర్వాలేదు - అతన్ని మాత్రం చంపకుండా వదిలేందుకు లేదు.
 మూడవ గ్రూపు వాళ్లకు సమీపంలో మరో తావులో వుంటుంది. వాళ్ల పని - పై మాసులు రాకుండా అడ్డుకోవటం.
 మొదటి గ్రూపు యాక్షన్ పూర్తవగానే రెండవ గ్రూపు సిద్దమయ్యారు. తమ చేతుల్లోని బాంబుల్ని విసిరికొడుతూ పొగమేఘాలూ, భీకర శబ్దాలు సృష్టించుకొంటూ ముందుకు వస్తున్నారు.
 చేతిలోని బాంబులు అయిపోగానే తమ వెంట వస్తోన్న బాంబుల బక్కెట్లలోంచి అందుకొని తిరిగి ప్రయోగించాలి.
  మొదటి  నాలగయిదు బాంబులతో భీతావహ వాతావరణాన్ని సృష్టించిన రెండవ వర్గం వాళ్లు తమ చేతుల్లోని బాంబులు అయిపోగానే మరికొన్ని బాంబుల కోసం వెనక్కు తిరిగి బక్కెట్ల కేసి చూసి ఉలిక్కిపడ్డారు.

                                                                                                           .......... సశేషం

                                                                                     .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.
   
   రమణారెడ్డి వర్గానికి ఓ విషయం బాగా అర్థమైంది - చెన్నారెడ్డిలో భయం పుట్టుకొందని.
 అంతమంది జనాన్నీ, తుపాకుల్నీ, తోడుగా వుంచుకొని కూడా తమను చూడగానే పెళ్ళి మంటపం వద్దనుంచి పారిపోయాడంటే విచిత్రంగా వుంది.
  ప్రాణభయం పుట్టుకొంది అతనికి. సందేహం లేదు.
  ఈ ఒక్క మార్పుతో తాము సగం విజయం సాధించినట్టే లెఖ్క.  ఆనందంతో గెంతులేశారు,  పొట్టేల్ని కోసుకొని విందు చేసుకొన్నారు. ఏటి ఇసుకలో రాత్రిపూట పాటలు పాడుకొన్నారు, కబడి లాంటి ఆటలు కూడా ఆడారు.
  మర్నాటిరోజు బద్వేలు వెళ్ళినపుడు జీపియ్యార్‌లాంటి నాయకులకు చెప్పి ఉత్సాహపడ్డారు. కలసి ఆనందించారు.
 విషయం వినగానే సోమనాథరెడ్డి నొసలు ముడేశాడు  " ఇప్పట్నించే మీరు జాగ్రత్తగా వుండాల "  అన్నాడు.
అతనికేసి ప్రశ్నార్థకంగా చూశాడు రమణారెడ్డి.
 " ఏ వ్యక్తి అయినా తన ప్రత్యర్థిని చూసి భయపడ్డాడంటే -...  నాలాంటి వాడైతే ఇంట్లోంచి బైటకు రాకుండా గడిపేస్తాడు. ప్రభాకర్‌లాంటి భయస్తుడయితే బేషరతుగా లొంగిపోయి దాసోహమంటాడు. చెన్నారెడ్డి లాంటి వాడయితే ఎంత వీలయితే అంత తొందరగా ప్రత్యర్థిని అడ్డు తొలగించుకోవటం గుండా తన భయాన్ని పోగొట్టుకోవాలని చూస్తాడు.....  ఇప్పుడు చెన్నారెడ్డి ఆ ప్రయత్నం మీదే వుంటాడు... అందుకే జాగ్రత్తగా వుండాలని చెప్పేది "  వివరించాడు సోమనాథరెడ్డి.
 ఆ విశ్లేషణ రమణారెడ్డికి కూడా నచ్చింది.
 తన పినతండ్రినీ, గురివిరెడ్డి వగైరాల్ని చంపింది కూడా భయపడటం వల్లే. అది రాజకీయ భయం కావొచ్చు... మరొకటి కావొచ్చు.. అతని పిరికితనమే అతని చేత ప్రత్యర్థుల్ని చంపించింది.
 తమ మీద కూడా దాడులు జరగొచ్చు.
  జాగ్రత్తగా వుండాలి.
 ఇప్పటి వరకు దాడిజేసేది తామేననుకొన్నారు. ఆ అవసరం తమకు మాత్రమే ఉందనుకొన్నారు.
 ఇప్పుడు చెన్నారెడ్డికి కూడా ఆ అవసరమే కలిగింది.
 ఆ అవకాశం అతనికివ్వకూడదు.
 తామే అందిపుచ్చుకోవాలి.
 తన వాళ్ళందర్నీ జాగ్రత్త పరిచాడు.
  ఈ హాడావిడిలోనే సారాయి అంగళ్ళ వేలం పాటలకు తేది ప్రకటించారు.
 సోమనాథరెడ్డి, రామనాథరెడ్డి, జీపియ్యార్ వగైరా ధనవంతులైన పార్టీ మనుషుల్ని సంప్రదించాడు రమణారెడ్డి.
  వేలం పాటల్లో పాల్గోనేందుకు వాళ్ళెవరూ సుముఖత వ్యక్తపరచలేదు. తాము వెనకనుంచి ఆర్థిక సాయం అందించే వాళ్ళే గాని ప్రత్యక్షంగా పాల్గొనేది లేదని చెప్పారు.  అంగళ్ళ మీద వచ్చే ఆదాయం కూడా తమకవసరం లేదనీ.. చెన్నారెడ్డికి పోటీబడితే చాలనీ అన్నారు.
 తమ్ముళ్ళతో, శ్రేయోభిలాషులతో చర్చించిన పిదప బద్వేలు తాలుకాలోని అన్ని మండలాలకు పోటీ పడాలని నిర్ణయించుకొన్నాడు రమణారెడ్డి. ఆ కార్యక్రమంలో భాగంగానే డిపాజిట్ కట్టేందుకు డి.డి లు తీశాడు.

                                    **********


  వాళ్ళ ప్రయత్నం చెన్నారెడ్డికి తెలిసింది.
 తీవ్రంగా ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది.
 తన ఆర్థిక వనరులకు గండి కొట్టబోతున్నారు వాళ్ళు.
  ఆర్థికం సంగతి దెవుడెరుగు - తన ఆధిపత్యానికి కూడా గండి పడినట్లు అవుతుంది.
 తెగించి వున్నారు వాళ్ళు. తన వ్యతిరేకులు తన మీద అక్కసతో వాళ్ళకు దండిగా ఫండ్స్ యిచ్చినట్లున్నారు. ఎంత టార్గెట్ అయినా ఛేదించేందుకు సిద్దపడతారు. పోటీ పడితే అంగళ్ళన్నీ వాళ్ళకే పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం వుండదు.
 ఇప్పుడు రాజకీయమంతా సారా అంగళ్ళ చుట్టేవుంది. రాజకీయంలోకి దిగాలంటే ముందుగా సారాయి అంగళ్ళు నిర్వహించిన అనుభవం వుంటే మంచిది. ఎలక్షన్లు రాబోయే సరికి జనాన్ని బాగా బెదరగొట్టి అదుపులోకి తెచ్చుకోవచ్చు.  తాలుకా మూల మూలలు తిరగొచ్చు. అవసరమైతే పోలీసుల సహాయంతో టెర్రర్ సృష్టించొచ్చు.
 అందుకే సారా అంగళ్ళను అంత సులభంగా వదలదల్చుకోలేదు చెన్నారెడ్డి.  ఇప్పుడు గొడవపడటం కంటే కాంప్రమైజ్ కావటం మేలనుకొన్నాడు.  ప్రత్యర్థితో ఓ అవగాహనకు రావటం ఉత్తమం.  ఈలోపు అవకాశం దొరికితే వాళ్ళను చంపటం చాలించేది లేదు... అది అదే... ఇది ఇదే............!
  బంగారు అంగడి గుప్తను రాజీకి పంపాడు రమణారెడ్డి వద్దకు.
 వారం రోజుల కృషి తర్వాత రాజీమంత్రం ఫలించింది.
  శివపురి సోదరలకు ఇరువై లక్షల డబ్బు ఇచ్చేట్లుగా, వాళ్ళు తాలుకాలో ఎక్కడా పోటీకి రాకుండా వుండేట్లుగా వొప్పందం కుదిరింది.  ముందే డబ్బులిచ్చి అట్లా అగ్రిమెంటు కూడా రాయించికున్నాడు చెన్నారెడ్డి.
  సారాయి అంగళ్ళే రాజకీయ పునాదులని రమణారెడ్డికి బాగా తెలుసు, కానీ తమకు సారాయి అంగళ్ళకంటే యింకో ప్రక్రియ రాజకీయంగా పునాదులే కాదు అంతస్థుల్ని కూడా నిర్మించి యిస్తుంది.  చెన్నారెడ్డిని చంపగలిగినపుడు ఏ సారాయి అంగళ్ళు లేకుండానే తాలుకా రాజకీయమంతా పాదాక్రాంతమవుతుంది గదా !  చెన్నారెడ్డిని చంపలేనపుడు తమకు రాజకీయం మాత్రం ఎందుకు..?
  డబ్బంతా సూట్‌కేసు నిండా పేర్చుకొని సాయింత్రంగా శివపురికి వెళ్ళారు రమణారెడ్డి వర్గమంతా.
  సూట్ కేసులోని డబ్బును ఇనుప బీరువాలో సర్దారు.
 స్నానాలు చేసి వచ్చిన తర్వాత ఏడుమంది అన్నదమ్ములూ బీరువాముందు కూచుని కొంతసేపు నిష్టగా ధ్యానించారు.
  తర్వాత రమణారెడ్డి పెద్దగొంతుతో శపథం చేస్తున్నట్లుగా మాట్లాడసాగాడు.
  "  చెన్నారెడ్డితో పార్టీ జెయ్యడమంటే మాటలు కాదు.  అంగబలం, ఆర్థికబలం పుష్టిగా వుండాలి. మనకు అంగబలం వుంది. దేవుని దయవల్ల యీనాటికి ఆర్థిక బలం కూడా సమకూడింది. మనకు యీ ఇరువైలక్షలే ప్రధాన వనరు, ఏడుమంది అన్నదమ్ములం యీ లెక్క సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాం - చెన్నారెడ్డి యిచ్చిన యీ ఇరువైలక్షలు డబ్బు ఖర్చయిపోయేలోపల అతన్ని చంపి తీరుతాం....   "
  చివరిమాట ఏడుమందీ ముక్త కంఠంతో పలికారు.
 అందరికీ హుషారొచ్చింది.
  రాత్రిపూట ఏట్లోకెళ్ళి మళ్ళీ విందు చేసుకొన్నారు.
  అంత మొత్తంలో డబ్బు సమకూరటం వాళ్ళకున్న అతిపెద్ద సమస్య తీరినట్లుగా అన్పించింది. సానుభూతి పరుల వద్దకు మరోసారి చందాలకు వెళ్ళాలనుకోంటోన్న తరుణంలో అనుకోకుండా వచ్చి పడిన అద్భుత అవకాశం యిది.
  ప్రస్తుతం యీడబ్బే ప్రధాన వనరు తమకు.
  చెన్నారెడ్డి యిచ్చిన యీ డబ్బుతోనే చెన్నారెడ్డిని చంపాలి.
  తాము మరికొన్ని ఆయుధాలు సమకూర్చుకోవాలి.
 జీపుల అవసరం లేదుగాని మోటార్ బైకులు వుండాలి.
  త్వరలో ఏంపి ఎలక్షన్స్ వస్తున్నాయి.
  బాంబుల ఉత్పత్తి పెంచాలి.
  ఎలక్షన్ల సందడిలో ఎక్కడోకచోట చెన్నారెడ్డిని దొరకపుచ్చుకొని లేపేయాలి.
  వాళ్ళు సిద్దపడుతూ వుండగానే మరో పదిరోజుల్లో ఎం. పి ఎలక్షన్స్‌కు నోటిఫికేషన్ వచ్చింది.
  ఏడు మోటార్ బైకుల్ని కొన్నాడు రమణారెడ్డి.
 మనుషుల్ని పిలిపించి ముగ్గుపిండి గని పరిసరాల్లోనే బాంబుల తయారీ చేపట్టాడు.
 మరోవైపు చెన్నారెడ్డి కదలికల్ని స్ఫష్టంగా గమనిస్తున్నాడు. అతని ఎన్నికల ప్రచార కార్యక్రమాల వివరాల్ని ముందుస్తుగానే సేకరిస్తున్నాడు.
 తాము కూడా ప్రచారానికి ప్రణాళిక రూపొందించుకొన్నారు.
 పల్లె పల్లెకూ వెళుతున్నారు.
 జాతీయపార్టీకి అభిమానులు దండిగానే వున్నారు.
  పార్టీ అభిమానుల కంటే చెన్నారెడ్డి దౌర్జన్యాల్ని నిరసించే వాళ్ళ సంఖ్య మెజారిటీ స్థాయిలో వుంది.. కానీ వాళ్లెవరూ బూతు వద్దకు వచ్చే స్థితిలో లేరు.  చెన్నారెడ్డి బలగానికి భయపడుతున్నారు. పార్టీ తరపున ఏజంట్లుగా కూచునేందుకు చాలా పల్లెల్లో మనుషుల కరువయ్యారు.
  వాళ్ళ భయాన్ని పోగొట్టాలి.
 చెన్నారెడ్డిని ఎదుర్కొనే మరో శక్తి పుట్టిందనీ. అది తమకు అండగా వుంటుందనీ అందరిలో భావన కలగాలి.
 ఇంతవరకు తాము సాధించిన విజయమల్లా సారాయి టెండర్లలో చెనారెడ్డి వద్ద భాగం పట్టటం.
 అది ప్రజల్లో అంత నమ్మకం కలిగించేది కాదు.
  తాము త్వర పడాలి, ఏదొక ఇరుకు ప్రాంతంలో చిక్కించుకొని అతన్ని లేపేసేందుకు ప్రయత్నించాలి. రాక్షస సంహారం జరగాలి.
 పల్లె పల్లెలో తాము నియమించిన వ్యక్తులు హుషారుగానే సమాచారం అందజేస్తున్నారు. వాళ్ళ పరిధిలోకి వచ్చిన చెన్నారెడ్డి వార్తల్ని నిమిషాల మీద చేరవేస్తున్నారు.
  వేగుల వ్యవస్థనంతా జయసింహ, రాఘవ పర్యవేక్షిస్తున్నారు. మోటారు బైకుమీద తిరుగుతూ సమాచారాన్ని సేకరించటంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు రాఘవ. అప్పుడప్పుడు బాలుని వెంట వెళ్ళి బాంబుల ప్రయోగాన్ని కూడా అధ్యయనం చేస్తున్నాడు.
  ఆరోజు రమణారెడ్డి జీపు ఒక్కటే బద్వేలు వెళ్ళింది. ఎప్పుడూ చెన్నారెడ్డికి రిగ్గింగ్ బూతుగా వున్న టౌను పక్క పల్లెలో జాతీయ పార్టీ తరపున రేపు ఎలక్షన్స్‌లో ఏజంట్లను నిలబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండ్రోజులుగా ఆ వూరి మీదే దృష్టి నిలిపాడు.... పని జరిగేట్టుంది.
చెన్నారెడ్డి ప్రచార కార్యక్రమాలు అట్లూరి మండలంలో సాగుతున్నాయి. అక్కడ తమకు స్థానం లేదు. పల్లెలకు వెళ్ళినా ఆశ్రయం కల్పించే వారు లేరు. అందుకే రెండు రోజులుగా ఎమ్మెల్లేను పట్టించుకోకుండా వదిలేశారు.
  బాలుడు తన జనాన్నేసుకొని పిండిగని వద్దకెళ్ళాడు.
 మద్యాహ్నందాకా అక్కడుండి తర్వాత బద్వేలు వెళ్ళాలనేది వాళ్ళ ఆలోచన. మద్యాహ్నం అన్నతో కలిసి తిరగాలి.
 గతానికి ఇప్పటికీ ముగ్గుపిండిగని వద్ద చాలా మార్పొచ్చింది.
  నారమ్మ చేలోకి గని తవ్వకం చొచ్చుకు పోవటం వలన నాణ్యమైన పిండి వరస బైట బడింది.  దాంతో మార్కెట్ కూడా పెరిగింది. వచ్చిన ఆదాయాన్ని రాజకీయాలకు ఉపయోగించాల్సిన పనిలేదనీ, గని అభివృద్దికే ఖర్చు చేయమనీ పెదనాన్నకు చెప్పారు.
  గని దాటి యాభై గజాలు దూరంలో కంపచెట్ల మద్యనున్న గుడిసె వద్దకు నడిచాడు బాలుడు.
  లోపల ధీక్షగా పనిచేసుకొంటూ వున్న వ్యక్తులు కాస్తా వాళ్ళను చూడగానే పని ఆపి నమస్కరించారు. చుట్టూ వున్న వస్తువుల్ని ఏమాత్రం సోకకుండా మెల్లిగా బైటకొచ్చారు.
  దారపు వుండలు, గాజుముక్కలు. ఇనుప చీలలు. పేలుడు పదార్థాల మిశ్రమమూ, అప్పుడే చుట్టి తయారైన బాంబులూ, కొంత దూరంలో ఆరబెట్టిన బాంబులూ...   అక్కడక్కడా తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలూ..
  తయారైన సరకును గురించి వివరాలు అడిగాడు బాలుడు.
  తర్వాత అక్కణ్నించి గనివద్దకెళ్ళి పెదనాన్నతో మాట్లాడుతోంటే - వేగంగా వచ్చి ఆగింది మోటార్ బైకు ఒకటి.
  నొసలు ముడేసి అటుకేసి చూశాడు.
  శివపురిలో జయసింహ వద్ద వుంటోన్న రాఘవ
 బండి దిగి ఆతృతగా బాలుని వద్దకొచ్చాడు అతను.
  "  అన్నా  ! వాల్లు యీదోవకే వొస్చినారంట....  "  చెప్పాడు.  "  టౌనులో ప్రచారానికి పోయినారంట..  ఇప్పుడే చెన్నారెడ్డి జీపువొక్కటే పోరమామిళ్ళకు  వస్చాందంట.... మిగిలిన జీపులన్నీ బద్వేలులోనే వుండాయంట..  "
  ఉలిక్కి పడ్డట్టుగా చూశాడు బాలుడు.
  తమ ఏరియాకు ఒంటిరిగా వస్తున్నాడంటే తమ ప్రోగ్రాం కూడ అతను సేకరించినట్టుంది.  తామెవ్వరూ ఇళ్ళవద్ద లేరని ధైర్యం చేస్తున్నాడేమో..!
 " ఎంతసేపయింది బైల్దేరి ?  "  ఉద్వేగంగా అడిగాడు.
 " పది నిమిషాలు అయ్యుంటుంది...  ఫోనొచ్చింది.. నేనొస్చినా.. అంతే  "
 ’ మరో పదినిమిషాల్లో యీ ప్రాంతానికి రావొచ్చు ’ మనస్సులోనే లెఖ్క గట్టాడు.
 " ఏదోవిధంగా నువ్వు అన్నోల్లకు సమాచారం పంపు... "  అతనికి చెప్పాడు బాలుడు.
  మోటారు బైకు వెనక్కి తిరిగింది.
  ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు వాళ్ళు.
  దాడి చేయాలని నిర్ణయం జరిగింది.
  అందరిలో ఆతృత... ఏదో ఉద్వేగం..
 బాంబ్ మేకర్ ఎక్కడికో వెళ్ళి నట్టుంది.
  తామే బాంబుల్ని బక్కెట్లకెత్తి జీపులో పెట్టారు.
  పెద్దాయన పిలుస్తోన్నా పలుకలేదు.
  మరొకరు మాట్లాడబోతోన్నా అనుమతించలేదు.
  జనమంతా ఎక్కగానే జీపు కదిలింది.
  అందరిలో టెన్షన్.
  ఎవరూ ఏమీ మాట్లాడుకోవటం లేదు.
 ఎవరి గుండె టక టకలు వాళ్ళకు స్పష్టంగా విన్పిస్తున్నాయి
  మందు అలవాటున్న వాళ్ళకు మూడవున్సులన్నా గొంతు దిగితే బావుండుననిపించింది.
  దానిక్కూడా సమయం లేదు.
 స్పాట్ ఎక్కడైంది నిర్ణయం జరగలేదింకా..
 జీపు సమీపిస్తూ  వుంటుంది.
  మనస్సంతా భరించరాని ఉద్వేగం...
  ఉన్నట్టుండి చెన్నకేశవ చెప్పాడు  " ఒంటికొట్టం కాడికి పోనీ !  అరుగు కాడ స్పాట్ బావుంటుంది. మనకు కలిసొచ్చిన తావు .."
  ఒక్క క్షణం ఆలోచించాడు బాలుడు.
 " పోనీ  " అన్నాడు
 ఒంటి కొట్టం వద్ద ఆగింది జీపు.
 బాలుడొక్కడే దిగి చూశాడు.
 రోడ్డు పక్కనే పెద్ద అరుగు.
 ఎదురుగా రోడ్డుకు అడ్డంగా స్పీడ్ బ్రేకర్.
  ఇంతకంటే మంచి తావు దొరకదు.
  దూరాన్నించి ఏదో జీపోస్తున్నట్లుంది.
 తమ జీపును అరుగు పక్కనే ఆపారు.
    జీపులోంచి బాలునికి తోడు నేలటూరి జయరామిరెడ్డి దిగాడు. జీపు చాటున్నే నిల్చుని ఏదో మాట్లాడుతోన్నట్లుగా నటించసాగారు.
 అంతలో వూర్లోనుంచి మోటారు బైకు వచ్చింది.  దాన్ని స్టాండేసి  ఆదరా బాదరాగా జీపువద్ద కొచ్చి ఎవ్వరూ చూడకుండా బక్కెట్లో నుండి రెండు బాంబుల్ని తీసి ఫ్యాంట్ జేబుల్లో వేసుకొని హుషారుగా అరుగెక్కి అక్కడి గ్రామస్థుల మద్య కూచున్నాడు -  రాఘవ.
  ఐదారు మంది కంటే ఎక్కువ లేరు అరుగుమీద. ఉన్నవాళ్ళు కూడా హుషారుగా పులిజూదం ఆడుతున్నారు.
  జీపుచాటున బాలుడు మొహరించి వుంటే, జీపులోని వ్యక్తులు ఏ క్షణాన్నయినా కిందకు దూకేందుకు సిద్దంగా వున్నారు. వాళ్ళ చేతుల్లోని బాంబులు ఏ క్షణాన్నయినా పిట్టల్లా ఎగిరిపోయేందుకు సిద్దంగా వున్నాయి.
  బద్వేలు వైపునించి వస్తోన్న జీపు శబ్దం రాను రాను దగ్గరవుతోంది.
  అది చెన్నారెడ్డిదేనని నిర్దారణ కావాలి.
  అందులో ఎమ్మెల్లే వున్న విషయం ఖచ్చితంగా తెలియాలి.
 ’ పార్టీ జెండా రెప రెపలాడుతోంది.  సందేహం లేదు.  అది చెన్నారెడ్డిదే ’ అనుకొన్నాడు జయసింహ.
  దగ్గరకు రాగానే స్పష్టమైంది - డ్రైవర్ వెనుక సీటులో తెల్లటి ఖద్దరు దుస్తుల్లో లావుపాటి వ్యక్తి చెన్నారెడ్డేనని.
  వెంటనే సన్నగా యీలేశాడు జీపు డ్రైవర్.
  జీపుచాటు వ్యక్తులు  కార్యోన్ముఖులయారు.
    చేతుల్లోని బాంబుల్ని అలవోకగా పట్టుకొని లేచి నిల్చున్నారు.
 అప్పుడే స్పీడ్‌బ్రేకర్ వద్దకొచ్చి స్లో అయ్యింది జీపు.
  రోడ్డు కేసే చూస్తున్నాడు చెన్నారెడ్డి.

                                                                                                          ........ సశేషం.

                                                                                                              .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.    ఆ రోజు పోరుమామిళ్ళలో పెళ్ళి.
  శివపురి ఏరియాకు సంబింధించిన వివాహం.
  తను తప్పక వెళ్ళి తీరాలి.
  జీపుల్నిండా జనాల్ని ఎక్కించుకొని కదిలాడు చెన్నారెడ్డి.
 జీపుల వరసలో నాలుగవ జీపులో వున్నాడు అతను
 అన్నీ వరసగా వేగంగా వెల్తున్నాయి.
  కొన్ని జీపుల్లోంచి తుపాకి బ్యారెల్స్ బైటకు కన్పిస్తున్నాయి.
  శివపురి ఏరియాకు వెళ్ళేసరికి కొంత ఇరుకుగా అనుభూతి చెందాడు. రోడ్డుకు కొంతదూరంలో శివపురి కన్పిస్తోంది.
 ఒకప్పుడు ఆవూరికీ తనకూ ఎంత అవినాభావ సంబంధమనీ !
 ఆ వూరిని చూసినా, అందులోకి ప్రవేశించినా ఎంతో భద్రత భావాన్ని ఫీలయ్యాడు.
కానీ....  ఇప్పుడు అదే వూరు తనలో అభద్రతా భావాన్ని రగుల్సుతోంది, ప్రధాన శత్రువుగా మారిన మిత్రున్నొకన్ని వేటాడి తన రాజకెయ జీవితానికి అవరోధాలు లేకుండా చేసుకొన్నాడు, అది తన మనుగడకు అనివార్యమైంది..తప్పలేదు. ఇప్పుడు అదే శత్రువుకు సంబంధించిన వ్యక్తులు తన వ్యక్తిగత జీవితానికి భద్రత లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళను భయపెట్టేందుకు కాకపోయినా తన రక్షణకోసమైనా ఇంతమంది జనాన్ని వెంటేసుకొని తిరగాల్సివస్తోంది.
  ఈ జనంతో కొంత ఇబ్బందీకరంగానే వుంది.
 తను పాదం మోపటమే గొప్పగా భావించే తన అనుయాయులు విందులు, వినోదాల్లో తనను ఆహ్వానించినప్పుడు ఇంతమందికీ భోజనసౌకర్యాలూ, మర్యాదలూ చేసి పంపుతున్నారు.
  పెళ్లిళ్లకు, ఫంక్షన్లకూ మందిని వేసుకుపోకూడదనుకొంటాడు గాని సాధ్యపడటం లేదు.
  జీపులు వరస పోరుమామిళ్ళలో ప్రవేశించింది.
 అమ్మవారిశాలలో ఓ పెళ్ళివుంది.
 ప్రధానంగా తను వెళ్ళవలసింది వేణుగోపాల స్వామి దేవస్థానం వద్ద జరిగే పెళ్ళికి. ముందుగా అమ్మవారి శాలకు వెళ్ళద్దామనుకొన్నాడు.
 గాంధిబొమ్మవద్ద సందులోకి మలుపు తిరిగాయి జీపులు.
  మొదటి జీపుతోటి రెండవ జీపుకూడా సందులోకి ప్రవేశించగానే మూడవ జీపు టక్కున ఆగిపోయింది.
 జీపుల ముందునించి ఏవో అరుపులు.
 ఉలిక్కి పడ్డాడు చెన్నారెడ్డి.
 ఏం జరిగింది అర్థం కాలేదు.
" అందర్నీ సంపుతా........ మిమ్మల్నందరినీ సంపుతా కొడకల్లారా ! ...."  ఎవరిదో అరుపు.
 గుండె దడ పెరిగింది చెన్నారెడ్డికి.
 గన్‌మెన్‌లు జీపుదిగి పోబోతోంటే వాళ్ళను ఆపాడు  " మీరిక్కడే వుండండి. ముందున్న జీపు వాల్లేమి..? - సచ్చినారా ! ఏందో సూడమనండి .."  కేకేశాడు
 ఆయనకేసి కొత్తగా చూశారు గన్‌మెన్‌లు.
 అప్పటికే ముందు జీపు వాల్లు దిగి వున్నారు.
 వెనక జీపుల వాళ్ళు కూడా దిగి అడ్డపంచెలు పైకెగజెక్కి ముందుకు దూసుకెళ్తున్నారు.
  "  రేయ్ !  పోరా .. పక్కకు ఫో..." ముందునించి కేకలు - "  తన్నండ్రా !... యింతసేపు పెట్టినారు యింకా ఈనాకొడుకునూ..."
 ఎవరో ఎవర్నో లాగటం..కొట్టటం.. యీడ్చటం... అవతలి వాడి కేకలు... గాండ్రింపులూ....
  " మజ్జిగ గోపాల్ లాగా ఎవడన్నా మరొకడు తయారయ్యాడా..? హఠాత్తుగా అనుమానం వచ్చింది చెన్నారెడ్డికి.
  అంతలో ముందుకు వెళ్ళిన వ్యక్తులు వెనుదిరిగి వస్తూ  " ఎవడో గుబులోడులే ...."  చెప్పారు.
  తేలిగ్గా వూపిరి పీల్చుకొన్నాడు చెన్నారెడ్డి.
  తర్వాత జీపులు కదిలాయి.
  ఎదలోపల ఎక్కడో అస్తిమిగంగానే వుంది.
  తనకు తెలీకుండానే సన్నని జలదరింపు.
 అమ్మవారిశాల వద్ద పెళ్ళి చూసుకొని వెనుదిరిగి మేయిన రోడ్‌లో కలిసి పోలీస్టేషన్ దాటి వేణుగోపాల స్వామి గుడివద్ద ఆగాయి జీపులు. అప్పటికే చాలా వాహనాలు రోడ్డుకు గుడి ప్రహరీకి మద్య పార్క్ చేయబడి వున్నాయి.
  జీపులు దిగగానే పెళ్ళివారు ప్రహరిగేటు వద్దకు ఎదురొచ్చి సాదరంగా ఆహ్వానించారు.
  తన జనంతో గేటు దాటి గుడి ఆవరణ అంతటా కలియచూశాడు చెన్నారెడ్డి.
 గుడికి తూర్పు వైపు ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపంలో పెళ్ళి జరుగుతున్నట్లుంది. చాలా మంది జనాలు ఆవరణ అంతటా నిల్చుని ముచ్చట్లాడుకుంటున్నారు. చెన్నారెడ్డిని చూడగానే ఒక్కక్కరే దగ్గరకు వస్తున్నారు, చేతులు కలుపుతున్నారు, నమస్కరిస్తున్నారు, చిరునవ్వులతో పలకరిస్తున్నారు.
  అతను గేటు లోపలికి అడుగుపెడుతూనే అంతవరకు గుడి అవరణలో తచ్చాడుతూవున్న ఓ వ్యక్తి గబగబ మంటపంకేసి వెళ్ళాడు.
  పెళ్ళిజనంతోటి ఓ మూలగా కూచుని వున్న రమణారెడ్డి వద్దకెళ్ళి చెవిలో వూదాడు.
 తనవాళ్ళకేసి అట్లా తేరపారిజూశాడు రమణారెడ్డి.
  కూడబలుక్కున్నట్లుగా పదిమంది వ్యక్తులు లేచి నిల్చున్నారు.
 ఒకరికొకరు సైగలు చేసుకొంటూ మెల్లిగా బైటకు కదిలారు.
  వాళ్ళల్లో బాలుడు, మజ్జిగ గోపాల్, చంద్ర, మధు, రాఘవ తదితరులున్నారు. నలుగురి చేతుల్లో క్యాష్ బ్యాగుల్లాంటివి వున్నాయి. అవి కొంచం ఉబ్బెత్తుగా వున్నాయి. మరికొందరి చేతులు ప్యాంట్ జేబుల్లోకి వెళ్ళాయి.
  ఒకరికొకరు మంటపంలోంచి బైటకు నడిచారు.
  గుడి చాటున్నించి బైటకొచ్చేసరికి మజ్జిగను గమనించాడు చెన్నారెడ్డి మనిషివొకడు. తనపక్కనున్నవాన్ని తట్టి అటుకేసి చూపుతూ  " మన సేతులకు మల్లా పనిబెన్నీట్టుంది "  అన్నాడు నవ్వుతూ.
  ఎన్నోసార్లు మజ్జిగ గోపాల్‌ను చితగ్గొటి వున్నారు వాళ్ళు.
  మరికొందరు అతన్ని గురించి వ్యాఖ్యానించుకొంటూ నవ్వుకొంటూన్నారు.
  వాళ్ళ వ్యాఖ్యలు చెన్నారెడ్డిని ఆకర్షించాయి.
  మంటపం కేసి తలెత్తి చూసిన అతనికి ఆప్రయత్నంగానే నొసలు ముడివడింది. అప్పటికే బాంబుస్క్వాడ్ మంటప ఆవరణ దాటివుంది.
 మెల్లిగా చెన్నారెడ్డి కేసి కదులుతోంది.
 ఎడమ చేతిలోని బ్యాగ్‍ల జిప్ తీస్తోన్న కుడి చేతులూ, ప్యాంటు జేబుల్లోంచి ఏదో వస్తువును పట్టుకొని బైటకు తీసేందుకు సిద్దమవుతోన్న పిడికిళ్ళూ....
  అక్కడి పరిస్థితిని క్షణంలో పసిగట్టాడు చెన్నారెడ్డి.
  తర్వాత ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
 గన్‌మెన్‌లకు సైగ చేశాడు - తన వెంట రమ్మంటూ.....
దగ్గరగా వున్న తన అనుచరులకు కూడా సైగ చేశాడు.
 గిరుక్కున వెనక్కి తిరిగి పెద్ద పెద్ద అంగలతో గుడి అవరణ దాటి రోడ్డు మీదకొచ్చి జీపెక్కాడు.
  విషయమేమితో అర్థం కాక మిగతా అనుచరులు కూడా అతన్ను అనుసరించారు. రెండు నిమిషాలో అందరు జీపుల్లో దూరిపోయారు.
  జీపులు స్టార్టయి కదిలింతర్వాతగాని రమణారెడ్డి గుంపుకు అర్థం కాలేదు చెన్నారెడ్డి తప్పించుకొన్నాడని. పరుగెత్తిపోతూ వున్న రాఘవను భుజమ్మీద చెయ్యేసి ఆపాడు బాలుడు.
వెంబడించటం తెలివితక్కువతనం.
 తమ ప్రయత్నం బైట పడటం తప్ప ప్రయోజనం వుండదు.
 ఎమ్మెల్లే అర్థాంతరంగా ఎందుకు వెళ్ళిపోయాడొ పెళ్ళి వాళ్ళకు ఏమాత్రం అర్థం కాలేదు. తమ వాళ్ళ గుండా ఏమైనా పొరబాటు జరిగాయేమోనని భయపడ్డారు.
 బద్వేలు వెళ్ళేదాకా ఆగలేదు చెన్నారెడ్డి జీపులు.
  అక్కణ్నించి వెంట వచ్చిన జనాన్ని పార్టీ కార్యాలయం వద్ద వదలి నలుగురు అంతరింగికులు వెంటరాగా ఇంటికెళ్ళాడు.
 గన్‌మెన్స్ తోటి మరో పదిమంది ప్రవైట్ అంగరక్షకులు బైట నిల్చుని వున్నారు. లోపలికెళ్ళి మొహం కడుక్కొని హాల్‌లోకొచ్చాడు చెన్నారెడ్డి.. పనిమనిషి తెచ్చి యిచ్చిన మంచినీళ్ళు తాగుతున్నారు అప్పటికే సోఫాలో కూచుని వున్న అతని మనుషులు.
  " సెప్పాపెట్టకుండా వొస్చాము. వాల్లు మనస్సునొచ్చుకొని వుండరా దొరా! ... పెండ్లి కూతురికి రెండు అక్షింతలన్నా యేసొచ్చింటే బాగుండు గదా ! "  కొండయ్య అన్నాడు మీసాలకు అంటిన తేమను తుడుచుకొంటూ..
  " బాగానే వుండేది గాని..... "  కుర్చీలో కూచుంటూ  "  నా పరిస్థితి బాగ లేక రావాల్సొచ్చింది "  నవ్వాడు చెన్నారెడ్డి.  " అప్పటికే కడుపులో గుడాబెడా అంటూండె. పొద్దున్నే రెండుసార్లు బేదులయినాయి..! ఏమయితాదిలే అనుకున్యా.. మంటపం కాడ. కాసేపటికి తట్టుకోలేక పోయినా... "
 " అట్టనా  !.... ఎందుకయిందీ తెలవక కాసేపు గుబులు గుబులు అయ్యిందినుకో...  "  కొండయ్య చెప్పాడు.
  " నువ్వు సూసినావో లేదోన్నా ! పెండ్లికి మజ్జిగాడు వొచ్చినాడు, వాన్ని సూసి పెండ్లికాన్నే తన్నాల్సిండే అని మనోల్లు వొగస్తా వుండిరి, దాటొచ్చి సరిపోయిందనుకో..."  చిన్నపరెడ్డి అన్నాడు.
 " చూసినా  " చెప్పాడు చెన్నారెడ్డి.  " నాక్కూడా అదే అన్పించింది, కాని శుభమా అని వాళ్ళు పెండ్లి జేసుకొంటావుంటే మనం తన్నులాడకోవడం బాగోలేదనే...  అక్కన్నించి దాటుకోవడం మంచిదయందనుకొన్నె.
  " మజ్జిగాడు వొక్కడేగాదు.. ఎవురో కొత్తోల్లు గుడకా వున్నారు.... వాళ్ళను యాన్నో సూసినట్టుందన్నా ! గుర్తుకు రాలే... "  చిన్నపరెడ్డి మాట ముగించేలోపలే  " ఎవుడుంటే ఏమి ! అందర్నీ తన్నేదేగదబ్బీ ! "  చెన్నారెడ్డి అన్నాడు.  " సరే దాన్నింక వదిలేయండి...."   అంటూ కొంతసేపు మౌనంగా వుండి  " తొందర్లో సారాయి అంగళ్ళకు పాట జరగబోతాంది.  దాన్ని గురించి ఆలోచించండి..."  చెప్పాడు చెన్నారెడ్డి.
  చాలా సేపు సారాయి అమ్మకం షాపుల వేలం పాటల గురించి చర్చ జరిగింది.
 ఇన్నేళ్ళు సారా పాటలన్నీ ఏక పక్షంగానే జరిగిపోయాయి, అన్ని మండలాల్లోనూ తన అనుయాయులకే సారా అంగళ్ళు వచ్చేలా చేసేవాడు. అవతలి వర్గం నించి పోటీ కూడా వుండేది కాదు. తమ వర్గంలోనే చాలా మంది పోటీలు పడుతుండటంతో కాంప్రమైజ్ చేసి కొంత సొమ్మును గ్రామాభివృద్దికి యిచ్చేట్లుగా పాటా దారున్ని ఎన్నుకోవటం జరిగేది. మొదట కాంప్రమైజ్ డబ్బులు పోటీ దారులందరికీ సమానంగా పంచేవారు గాని. గత సంవత్సరం నుంచి బద్వేలు, పోరుమామిళ్ళ పట్టణాభివృద్దికి ఖర్చు పెట్టాలని నిర్ణయించారు.
 నిరుటి సంవత్సరం చెన్నారెడ్డి పాడాడు. నలభై ఐదు లక్షల రూపాయిల కాంప్రమైజ్ అవగాహనతో సారాయి షాపుల్ని దక్కించుకొన్నాడు. అయితే ఆ డబ్బు మొత్తాన్ని పెద్దమనుషుల చేతికివ్వలేదనీ, టౌను అభివృద్ది పనులకు వినియోగించలేదనీ చాటుమాటుగా వాపోతూ వుంటారు జనం.
 తనకంటే పెద్దమనుషులు ఎవరున్నారని డబ్బు తీసుకెళ్ళి ఇచ్చేందుకు..? అందుకే తనవద్దే వుంచుకొన్నానంటాడు చెన్నారెడ్డి. తనవద్ద వున్న మొత్తానికి రెట్టింపు ఖర్చు చేశానని చెబుతాడు.
 "  ఆయన ఎమ్మెల్లేగా వుండబట్టేగద తాలుకాలో యింత అభివృద్ది జరిగింది - యిన్నె కోట్ల పనులు చేసింది. ఆయప్పను ఖర్చు అడిగేందుకు బుద్దుండాల "  అంటారు ఎమ్మెల్లేని సమర్థించే కొంతమంది.
 ఏది ఏమైతేనేం !! గత సంవత్సరపు సారాయి వేలం పాటలకు సంబందించిన నలభై ఐదు లక్షల్ని దిగ్విజయంగా స్వంతం చేసుకొన్నాడు చెన్నారెడ్డి.
 ఈ సంవత్సరం కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నాడు.. సారాయి అంగళ్ళ చర్చ తర్వాత ఆయన అనుచర గణం వెళ్ళిపోయింది.
 తనను కలిసేందుకు ఎవర్నీ అనుమతించవద్దని బైటి మనుషులకు చెప్పి గదిలోకి వెళ్ళి పడకమీద వాలాడు చెన్నారెడ్డి.

                    **************

  మనసులో ఏదో అలజడి.
 అంతుబట్టని ఆందోళన..
  మాట్లాడుతోన్నా, భోంచేస్తోన్నా, సాయింత్రం పార్టీ కార్యాలయం వద్దకు వెళ్ళివస్తోన్న అదే అలజడి... అదే ఆందోళన...  కారణం కోసం వెదకి  దొరకించుకొంటే.....  అది....  శివపురి వాళ్ళు సృష్టించిందేనని స్పష్టమవుతుతుంది.
  ఎవ్వరూ చేయలేని పని వాళ్ళు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
  ఎవ్వరూ సాధించలేనిది వాళ్ళు సాధించాలనుకొంటున్నారు.
  ఉదయం నించి వాళ్ళ చర్యల్నీ, అతని మానసికాందోళననీ గమనిస్తూనే వుంది అతని భార్య రమాదేవి.
  రాత్రి అడిగింది  " బేదులు తగ్గినాయా ? "  అని
 అతను సమాధానమివ్వలేదు.
 " నిన్నేనబ్బా ! "
 "  అప్పుడే తగ్గినాయిలే.... "  చెప్పాడు
  " తగ్గితే...  పెండ్లికి పోయి రావొచ్చుగదా !  వాల్లేమైనా అనుకోరా..? "  అతనికేసి చూస్తూ అంది.
  కొంత విసుగేసింది అతనికి  " పోతే తగవులాడాల ..."
  " ఎవురితో..? "
 " మజ్జిగోడుండాడు గదా ! ...  వాన్ని తన్నాల... శుభాకర్యంలో గొడవలెందుకనీ...! "
  " ఏ పెండ్లి కాడ కొట్లాడనట్లూ...  ఎవురి పెండ్లీ సెడగొట్టనట్లూ...  "  గొణిగింది.
 " వినపడేట్లు మాట్లాడు... "  విసుగ్గా అన్నాడు.
 " మజ్జిగోన్ని చూసి బేదులు పెట్టినాయోమోననీ.... "  మరోవైపు తిరిగి అంది.
  " ఎన్ని సార్లే వాన్ని తన్ని వదిలిందీ !  వానికే గాదు  లోకంలో ఎవురికీ బయపడే నాకొడుకును కాదు..."  కోపంగా అరిచాడు.
  "  అవునవును ఎవురికీ బయపడవు.. మజ్జగోని ఎనకాల వున్న శివపురి వాల్లకు బయపడి పారుకొంటా వచ్చినావుగానీ ...."
  రవ రవ మండింది చెన్నారెడ్డికి.
  " లోకమంతటికీ నేను మొగున్నెయితే, యింట్లోకొచ్చేసరికి నువ్వు నాకు మొగునివయితండావు గదనే.. నియ్యమ్మ ! ... ఇంట్లోన్నా మనశ్శాంతిగా బతకనీయే..! "  స్వరం పెంచాడు.  " ఏ పెండ్లామయినా కొట్లాడొద్దని సెబుతాదిగాని మొగున్ని రెచ్చగొట్టే నీయట్లాంటిది ఎక్కడా వుండదే_.... "
" కొట్లాడక వూరుకుండి ఎవురి పానాల్దీస్తామనీ ?  "  గయ్‌మంది రమాదేవి.  " యుద్దానికి పోయి చేతులు ముడుచుకొని కూచుంటే పగోడు వూరుకుంటాడా ? తల తీసేస్తాడు....  ఊరుకుండాలనుకున్నోనివి కొట్లాటలకే పోకుండా తెలివిగా బతకాల. గొడవలకు దూరంగా మసలాల. ఎంతమంది ఆస్తుల్ని నాశనం జేసినావు ! ఎన్ని తలకాయలు తీసినావు..?  అప్పుడేమైంది యీ తెలివి ? ఇప్పుడు భయపడి పారుకుంటా వస్తే  వాల్లూరుకుంటారా ?  నిన్ను చంపుతారు.. నీ కొడుకులనూ చంపుతారు... నా మొగున్నీ, పిల్లోల్లనూ పోగొట్టుకొని నేను బతకలేను. అట్లాంటి ఆలోచన కూడా నేను సహించలేను... మీసాల్లేని మోగోడా ! - నీకు సేతగాకుంటే చెప్పు... నువ్వు ఇంట్లో కూచో... నీ తుపాకి నా చేతికీ... నా మొగున్నీ, నాపిల్లోల్లనూ నేను కాపాడుకొంటా...ఆ   "  కళ్ళు ఎర్రబారుతోండగా ఆవేశంగా అరిచింది.
  చెన్నారెడ్డికి నోట మాట రాలేదు.
 "  అన్ని తుపాకులు, అంతమంది మనుషుల్నూ పెట్టుకొని సిగ్గులేకుండా పారుకుంటా యింటికొచ్చినావు. సంపడమో  సావడమో తప్ప వేరే దారేడుంది నీకు ..?  వీల్లనూ సంపాల్సిందే.. తలెత్తితే ఎంతమందినైనా సంపి మనం కాపాడబడాల్సిందే...  తప్పదు  చెన్నారెడ్డి !... నిన్ను చీరలు తెమ్మనీ, బంగారు చేయించమనీ నేనడగను...  నీ శత్రువులను చంపు.. వాల్లు బతుకుతే నా మొగుడు, నా పిల్లలు నాకు దక్కరు....   "  ఆవేశంతో రొప్పుతూ ఇంట్లో కెళ్ళింది.
  కోపం ఓ వైపూ, ఆవేశం మరో వైపూ, ఆందోళన యింకోవైపూ అన్నీ కలగలసి నీరసంగా మారి మంచమ్మీద అడ్డంగా వాలిపోయాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
  ఇంట్లోనే తనకు శత్రువు తయారైంది.
 మొదటినించే యింతే - ఆవేశాన్ని తట్టుకోలేదు.
  ఆందోళనని భరించలేదు.
  మొదట్లో యీ గొడవలు వద్దని పోరు జేసేది. గొడవలతో కూడిన ఎలక్షన్ల జోలికి పోవద్దని మొత్తుకొనేది.  ఆమె మాటల్ని ఖాతరు జేయకుండా తను గొడవల్లో పీకల దాకా కూరుకుపోయి గిలగిల్లాడ్తున్నప్పుడు స్వయంగా ఆమే రంగంలోకి దిగేది. ఎటూ తల దూర్చాము  కాబట్టి -  ఆ తల వున్నంత వరకు పోరాట పటిమ చూపించాలనే భావం కలిగించేది.
  మనుషుల్ని చంపటాన్ని ఆమె ఎప్పుడూ తీవ్రంగా వ్యతిరేకించేది.  రాజకీయావసరాల దృష్ట్యా జరిగిన మర్డర్లన్నీ స్థానికి ముఠా కక్షల వల్ల సంభవించినవేనని ఆమెను వొప్పించినా నిదానంగా నిజం తెలిసేది,  ఆ రోజు మాత్రం బాగా తిట్టేది. ఓబుళరెడ్డి, గురివిరెడ్డిలు మర్డరైనపుడు లబలబ ఏడ్చింది ఆమె. తనే స్వయంగా వాళ్ళను చంపించాడని తెలిసి విలవిల్లాడింది. తన మొగుడు, పిల్లలు దక్కకుండా పోయేకాలం దాపురించిందని వాపోయింది. అందుకే ఇప్పుడు శత్రువుల్ని చంపమని స్వయంగా చెబుతోంది.
 ఆమె ఆవేశాన్నీ,  ఆందోళననూ ఎదుటి మనిషిలోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తుంది.
అదే తను భరించలేకున్నాడు.
  తన మానా తను ఆలోచించుకొని పని జరుపుకోనివ్వదు. ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఒకటే గొడవ. మానసిక ప్రశాంతతకు మారుపేరుగా వుండాల్సిన ఇల్లాలు అశాంతిని కలిగించే కారకమైంది. ఇంట్లో నిలవాలంటే కంపమీద పడుకున్నట్లుంటుంది. ఆ ఆందోళనల్తో బైటకు రావటం... ఎవరోకరిమీద నిప్పులా మండటం....
 ఏది ఏమైనప్పటికీ శివపురి వాళ్ళు తన కదలికల్ని నిశితంగా గమనిస్తున్నారనే సత్యం ఋజవైంది. తను పెళ్ళికి ఖచ్చితంగా వస్తాడని తెలిసే అన్నిరకాలుగా సిద్దపడి వున్నారు.
 తనకు తెలీకుండా వెంటాడుతోన్నట్లుంది వాళ్ళు.
  తన మనుషుల్ని కూడా ఒకరిద్దర్ని లోబరుచుకొని సి.ఐ.డిలుగా ఉపయోగించుకొంటునారేమో..!!
 బైట వాళ్ళ పోరు..
 ఇంట్లో పెళ్ళాం పోరు...
  కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు అతను.
  అప్పుడే అడుగుల సవ్వడి.
 మళ్ళీ వచ్చినట్లుంది ఆమె.
  అతను కళ్ళు తెరవతల్చుకోలేదు.
  " నిద్రొస్తా వుందా నీకు..?  ఎద్దాల దిని మొద్దాల నిద్రబొయ్యే వానికి యీ గొడవలన్నీ ఎందుకూ  ? "  గొణుగుతోంది.
  అతను మాత్రం  కళ్ళు తెరవలేదు.
 మళ్ళీ రోజు రాత్రికి అసలు ఇంటికే రాలేదు.
  అర్థరాత్రికంతా హైదరాబాద్ చేరుకున్నాడు.
  గన్‌మెన్‌లను  ఎమ్మెల్లే క్వార్టర్స్ వద్ద వదిలేసి నేరుగా దిల్‌షుక్‌నగర్‌లోని ఓ యింటి ముందు కారు దిగాడు.
  కాలైంగ్ బెల్ నొక్కగానే ఇంట్లోంచి ముప్పై ఐదేళ్ళ స్త్రీ బయటకొచ్చింది - నిద్రమత్తు కళ్ళతో.
  చెన్నారెడ్డిని చూడాగానే  కళ్ళు విప్ఫారితాలయ్యాయి.
  ఆప్యాయంగా ఆహ్వానించి లోనికి తీసుకెళ్ళింది అతన్ని.
 " సార్ లేడా  ? "  అడిగాడు ఆమె వెంట బెడ్‌రూంలోకి వెళుతూ.
 " లేడనే గదా వొచ్చిందీ !  "
  " అంతదూరం ఆలోచించలేదు..."
  " మరి ...?  "
 " నాలో ఏమీ లేకనే... ఖాళీని భరించలేకనే వచ్చినా  "
" నిండుతూనే వెళ్ళిపోతావు కదూ !  స్వార్థపరునివి.. "
  ’ నిజమేనేమో  ! "
  కిల కిల నవ్వింది ఆమె.
 "  సార్  లేడు గదా ! "
  " క్యాంపు కెళ్ళాడు  "
  " రెండ్రోజులు రావొద్దని చెప్పు  "
  అదోలా చూసింది ఆమె.
  అన్ని  ఆవేశాల్నీ, ఆందోళనల్నీ, సమస్యల్నీ మరచిపోయి ఆమె కౌగిళ్ళతో అద్భుతమైన ప్రశాంతతను అనుభవించాడు చెన్నారెడ్డి.
  ’ ఇలాంటి జీవితాన్ని కొనసాగించి వుంటే ఎంత బావుండేది...! ’   మనస్సు లోలోపలి పొరల్లో ఎక్కడో మూలిగింది.

                                                                                                             .......... సశేషం


                                                                                                              .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

     రాత్రి పదిగంటలు దాటి వుంటుంది
  అప్పుడప్పుడూ చందమామను తమ కొంగుచాటున దాచుకొని కొంత సేపు దాగుడు మూతలు ఆడుకొని వదిలేస్తున్నాయి మేఘాలు.
  శివపురి వీధుల్లోని రచ్చబండల మీద ఇంకా నిద్రరాని ఒకరిద్దరు వ్యక్తులు బీడిముక్కలు పీల్చుతూ సన్నగా కబుర్లాడుకొంటున్నారు.
 పెద్దిరెడ్డిగారి పాతకాలంనాటి సువిశాలమైన మట్టి మిద్దెమీద చాపలు పరుచుకొని అప్పుడే నడుం వాల్చేందుకు సిద్దమవుతున్నారు జనం.
 మిద్దెమీద నైఋతి మూలన బండెడు రాళ్ళు కుప్పబోసి వున్నాయి., ఏరుకొని తెచ్చినట్లుగా అన్నీ కనికెడు లావున ఒకే సైజులో వున్నాయి.
  సాంప్రదాయక ఆయుధాలు కొన్ని అక్కడక్కడా పక్కల్లో భద్రపరచబడి వున్నాయి.
  రమణారెడ్డి ఇంకా కిందకు దిగిపోలేదు.
  అతని పక్కన కూచుని ఏదో చర్చిస్తున్నారు మజ్జిగ గోపాల్, నేలటూరి జయరాం, పాయలకుంట్ల మధు, అట్లూరు చంద్ర వగైరాలు. తమ పనుల్లోని ప్రోగ్రెస్‌ను సమీక్షిస్తున్నారు. పడుకొన్న వాళ్ళు కూడా తమ చెవుల్లో ఒకదాని అటుకేసి మళ్ళించారు.
  ఉన్నట్టుండి గూళ్ళుగా గూళ్ళుగా వచ్చిన సిగరెట్ పొగ రమణారెడ్డి బృందాన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసింది.
  " ఒరే  ఒరే.. లేచి దూరంగా పోయి తాగరా ! "  చంద్ర అన్నాడు పొగవస్తోన్న జయరాం కేసి చూస్తూ..
  " ఆ ..మీరంతా పెద్ద ససవర్లయినట్టూ (బుద్దిమంతులైనట్టూ)..... "  జయరాం సమాధానం
 " మేమయితే మాకోసమే తాగుతాము అందరికోసం కాదు "  మధు చెప్పాడు జయరాం కేసి తిరిగి.
  " పరోపకారం తెలవన్నాకొడుకులు మీరు..."
 " పూర్వజన్మలో వాడు రైలింజనైవుంటాడు.. ఎప్పుడూ నోట్లోంచి పొగరావాల్సిందే..."
  " ఉత్త పొగే అయితే ఏదొక రకంగా ఏగొచ్చు..మందు తాగినప్పుడు సూడాల...సేతల్తో బువ్వదినేదే., పళ్లెంలో బోర్లబడిగదూ తినేది.."  గోపాల్ మాటతో నవ్వారు.
  " అంతగా సిగరెట్లు తాగి అందర్నీ యిబ్బంది పెట్టకుంటే అవి తగ్గించేందుకు ఏదన్నా ఉపాయం కనిపెట్టకూడదా ? "  రమణారెడ్డి అన్నాడు.
  " అదేదో నువ్వేచెప్పు బాసూ .."  జయరాం స్పందనా
  " నువ్వు మందు తాగేది ఎప్పుడోకసారి గదబ్బీ !.. మందు తాగినప్పుడే సిగరెట్టు తాగాలని ఒట్టుపెట్టుకో.. "  చెప్పాడు.
  వెంటనే అందుకొన్నాడు చల్లగరుగుల శ్రీను  " అన్నా... నువ్వు జెప్పే ఉపాయం చాలా డేంజర్కొస్చాది.. "  అన్నాడు.
  ఏమన్నట్లుగా చూశాడు రమణారెడ్డి.
  " వానికి సిగరెట్టు తాగాలనిపించినపుడంతా మందు తాగుతాడు.."  శ్రీను మాటలకు  పక పక నవ్వారు అందరూ.
  మళ్ళీ మామూలు విషయాల్లోకి వచ్చారు.
  " మనం పొరబాటేమైనా సేస్తుండామేమో  బ్రదరూ ! "  మజ్జిగ గోపాల్ అన్నాడు సాలోచనగా చూస్తూ.
  అతనికేసి ప్రశ్నార్థకంగా చూశాడు రమణారెడ్డి.
  " మనపని మనం సైగ్గా ( చాటుగా, బయటకు తెలీకుండా)  సేసుకోకుండా ఆయప్ప జాగర్తబడేటట్టు సేస్తాండమేమో ! మనం రెండు జీపుల్నిండా మందినేసుకొని తిరుగుతాంటే ఆయన ఎనిమిది జీపులు కొనె. వందమందికి పైగా జనాన్నేసుకొని తిరగబట్టె. మనల్ని ఎంటికె మాత్రం కూడా లెఖ్కజేసినట్టులేదు..  "  చెప్పాడు.
  " నీ మొగంలేరా ! మనల్ను లెఖ్కజెయ్యనోడయితే ఎనిమిది జీపులు ఎందుక్కొన్నెట్టు..?  అంతమంది జనాన్ని ఎందుకు వెంటేసుకొన్నెట్టు ?.. మనకు భయపడి కాకుంటే..."  బాలుడు అన్నాడు.
  " అది భయమెందుకయితాది ?  జాగ్రత్త... ఆయప్ప మెలుకువలో ఆయప్ప వుండాడు. ఇరుకునబడి దొరుకుతే మనమల్ని అదమాలనే వుండాడు. యీ అగచాట్లన్నీ నేను పడినాగద బ్రదరూ ! అందుకే నా యిబ్బందులే మనందరికీ రాకుండా రోంత హుషారుగా వుండాల "
  " ఒరే తమ్ముడూ.. "  బాలుడన్నాడు గంభీరంగా  " పానాలకు వొగదెగిన వాల్లం మనం, ఆదాయంకోసం తిరిగే వాల్లు ఆయప్పకాడుండే మాసులు, మనం ఒక్కరమైనా సరే వాల్లు పదిమందైనా సరే.. భయమెందుకూ ? "
  తర్వాత సంభాషణ పెద్ద సాగదీయబడలేదు.
 మెల్లిగా ఎవరి స్థలాలకు వాళ్ళు చేరుకొన్నారు.
  ఉదయం లేచి మిద్దెదిగి బైటకు వెళ్ళొచ్చేసరికి ఓ మోటర్ బైకు వచ్చి యింటిముందు ఆగింది.
  ఎవరో కొత్తమనిషి.
  అందరి కళ్ళు ప్రశ్నార్థకంగా అతనికేసి చూస్తోంటే  " అన్నా " అంటూ రమణారెడ్డి కేసి రాబోయాడు.
  దారిలోనే అడ్డుకొన్నాడు గోపాల్ " ఎవర్నువ్వు " అంటూ
 " సోమనాధరెడ్డి కాడ పన్జేసే మాసినన్నా ! మారెడ్డి చీటి రాసిచ్చినాడు. అన్నకిమ్మన్నేడు... "  జేబులోంచి కాగితం తీసి యిచ్చాడు.
 దాన్ని అందుకొని రమణారెడ్డికి యిచ్చాడు మజ్జిగ గోపాల్
  చీటి చదవగానే రమణారెడ్డి మొహంలో ఒక్కసారిగా రంగులు మారాయి.
  " నువ్వు పామ్మా ! మేమొస్తాండామని చెప్పు "  అన్నాడు కొత్తవ్యక్తికేసి చూస్తూ.
  తర్వాత వెనిదిరిగి ఇంట్లోకి నడిచాడు.
  తన వెనక వచ్చిన వాళ్ళతో చెప్పాడు  " రాత్రి పొద్దుబోయినాంక సోమనాధరెడ్డి యింటి మీద దాడి జరిగిందంట.."  అని.
  ఎవరు చేశారని అడగలేదు వాళ్ళు.
  " నష్టమా ? ... దెబ్బలేమన్నా..."
  " వివరాలు తెలీదు "  చీటి వాళ్ళ చేతికిస్తూ  " బెరీన రడీ కాండి..."  చెప్పాడు అందరికేసి చూస్తూ.
  పదినిమిషాల్లో అందరూ సిద్దమయ్యారు.
  వాళ్ళు వెల్లేసరికి సోమనాధరెడ్డి ఇంటినిండా విషాదం అలుముకొని వుంది.
  జీపుల శబ్దం విని కిటికీల్ గుండా చూసి మరీ తలుపులు తీశారు.
  చాలా హర్టయినట్టున్నాడు సోమనాధరెడ్డి.
  రాత్రి చెన్నారెడ్డి సృష్టించిన బీభత్సం ఇంటి ఆడాళ్ళ మొహాల్లో ఇంకా దోబూచులాడుతోంది.
  మందినేసుకొని ఇంటిమీదకొచ్చాడట..
 గేటుముందు నిల్చుని బండబూతులు తిట్టాడట.
  వీధిలో ఒకటిరెండు బాంబుల్ని కూడా వేశాడట.
  గేటుతీసుకొని లోపలికొచ్చిన అతని మనుషులు తలుపులు బాదారట.
 బయటకు రమ్మని సవాల్ చేశాడట చెన్నారెడ్డి.
  పోలీసులకు ఫోన్ చేస్తే ఎస్సైగానీ.. సి.ఐ గాని వూర్లో లేరని తెలిసింది. అరాచకశక్తులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించేట్టున్నాయి. ఏం చేసేందుకు దిక్కుతోచని పరిస్థితి. తలుపులు బిగించుకొని ఇంటిల్లిపాది ఒక చోట కూచుని భరించరాని ఉద్విగ్నత అనుభవించారట. తన దయనీయ స్థితి పట్ల తనకే జాలేసిందని వాపోయాడు సోమనాధరెడ్డి.
  గంటకు పైగా వాళ్ళు వీధిలో వీరంగం తొక్కారట.
 నిద్రలేమి వల్ల ఎర్రబారిన కళ్ళతో అంతలేని విషాదం నిండిన వదనంతో దయనీయమైన గొంతుకతో చెప్పుకుపోతున్నాడు అతను. మద్య మద్యలో గొంతు సవరించుకొంటున్నాడు.
  తాము చందాలిచ్చి గూండాల్ని తయారు చేసి చెన్నారెడ్డి పైకి పంపుతున్నారట. అతని ఆధిపత్యాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తున్నారట.
  తను మూడో కన్ను తెరిస్తే ఎవరూ ఆపలేరనీ, యిది కేవలం శాంపిల్ మాత్రమేననీ దమ్మున్నవాళ్ళెవరైనా వుంటే అడ్డుకొనేందుకు రమ్మని సవాల్ జేసి మరీ వెళ్ళాడట చెన్నారెడ్డి.
  తమను ఎదిరించిన వాళ్ళందరికీ అదెగతి పడుతుందని కూడా హెచ్చరించాడట.
  జరిగిన సంఘటన వెనక ఉద్దేశ్యమేమిటో అర్థమైంది రమణారెడ్డికి.
 తమకు చందాలిచ్చి ప్రోత్సహిస్తున్నాడని సోమనాధరెడ్డి మీద దాడిజేశారు.
  ఈ చర్య తమకు హెచ్చరికలాంటిదే. సందేహం లేదు. తమ మద్దతుదారుల మరికొందరి మీద త్వరలో దాడులు జరగవచ్చు. తమ వాళ్ళను తాము రక్షించుకొనే పెనుభారం వొకటి ఎదుటబడింది.
  కొంతసేపు ఆలోచించేసరికి కొత్త విషయమేదో స్పురించినట్లయి ఉలిక్కిపడ్డాడు రమణారెడ్డి.
  తమను ఆత్మరక్షణ స్థితిలోకి నెట్టాడు చెన్నారెడ్డి.
 ఈ స్థితి అతనికి కల్పించాలని తాము ఇన్నిరోజులూ ప్రయత్నించారు.
  కానీ అతను దాన్ని సులభంగా సాధించి గలిగాడు.
 రెడ్డి ఇంట్లో కూచుని జరిగిన సంఘటన గురించి చాలా సేపు చర్చించుకొన్నారు. కారణాల్ని విశ్లేషించారు.
  చెన్నారెడ్డి యీ విధమైన ఆలోచనకు రావటానికి కారణం బహుశా తామింకా అతన్ని టార్గెట్ చేసుకోవటంలో సపలం కాలేదేమో ! లక్ష్యమైతే వుందిగాని దాన్ని సాధించుకొనేందుకు క్రమశిక్షణతో కూడిన వ్యూహాన్ని పన్ని అమలు పరచటం లేదేమో ! నేరుగా అతన్ని టార్గెట్ చేసుకొన్న చర్య ఒక్కదాన్ని కూడా తాము ప్రారంభించలేదుగదా !
  చెన్నారెడ్డికిలా తమకు చాలినన్ని పాతదారులు లేవు. అన్నీ కొత్తగా తాము సృష్టించుకొనేవే.
  ఇప్పుడేం చేయటానికి పాలుపోలేదు.
  కుర్రాళ్ళంతా ఆవేశపడుతున్నారు. వాళ్ళ ఆలోచన ప్రకారం నేరుగా అతని మీద దూకేందుకు లేదు. ఖచ్చితంగా గురితప్పుతుంది. అతను గట్టి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసికొన్నాడు. ఎప్పుడయినా అతన్ని చాటుమాటుగా దెబ్బదీయాల్సిందే. తగిలిన దెబ్బ తిరిగి కోలుకొనే విధంగా వుండకూడదు. చాలా బలమైనదిగా వుండాలి.
  అతనిలాగే తాము కూడా అతని మద్దతుదారుల మీద దాడిజేస్తే..?
 తిరిగి తమ సానుభూతి పరుల మీద దాడులు మొదలవుతాయి.
 దానికి అంతం వుండదు.
 అట్లా చేయటం వలన తమగురి బహుముఖాలవుతుంది.
  "  మీరట్లా కరచి చాలించుకుంటే ఆయప్ప చెలరేగుతాడు. వాని అరాచకత్వాన్ని అడ్డుకొనే ఓపికా మాకు లేదు. మమ్మల్నందర్నీ ఒక్కొక్కర్నే యేరి నలుపుతాడు. ఏదోకటి గట్టి నిర్ణయం తీసుకోండి రమణారెడ్డి ! "  సోమనాధరెడ్డి చెప్పాడు.
  ఆయన చెప్పింది కూడా నిజమే.
  ఈరోజు సోమనాధరెడ్డి.. రేపు రామసుబ్బారెడ్డి, ఎల్లుండి జీపియ్యార్ వరసబెట్టొచ్చు అతను.
  తాము త్వరపడాలి.
  వ్యూహాన్ని మార్చుకోవాలి.
  కార్యాచరణ వేగవంతం చేయాలి.
 వీధిరౌడీల్ని కొట్టటం, అధికారుల్ని బెదిరించటం లాంటివి చేయటం వల్లే చెన్నారెడ్డి జాగ్రత్త పడినట్లుంది. బలమైన అడుగు వేసేందుకు నిర్ణయించుకొన్నట్లుంది.
  " మజ్జిగ !  రాత్రి నువ్వు చెప్పింది నిజమేరా ! "  అన్నాడు మజ్జిగగోపాల్‌తో.

                              *************

  రాత్రి చాలా సేపు చర్చించుకొంటూ వుండిపోయరు.
  తమను చెన్నారెడ్డి వుత్త ఆవేశపరులుగా చూస్తోన్నట్లుంది.
 అందుకే వీధి యుద్దాలకు పిలుస్తున్నాడు.
  చాటుమాటుగా  చంపి వచ్చేందుకు అతని వద్ద కిరాయి మనుషులున్నారు.
  మందిబలంతో  ముందుకొచ్చేందుకు గుంపులు కూడా వున్నాయి.
  తమ వద్ద ఆరెండు బలాలు తక్కువేగాని, వ్యూహాత్మకంగా ముందుకు దూసుకెళ్ళేందుకు ప్రాణాలైనా యిచ్చేవ్యక్తులున్నారు.
 తమ ప్రధాన బలం యిదే.
 దీన్నే బహుముఖాలుగా విస్తరింపజేయాలి.
  తమ సానుభూతి పరుల సేవల్ని కూడా వినియోగించుకోవాలి.
 ఆలోచిస్తూ నిద్రలోకి జారాడు.
 రాత్రి నెమ్మైదిగా కరిగిపోతూ వుంది.
  దూరంగా తార్రోడ్డుమీద అడపాదడపా వాహనాలు పరుగెడుతొన్న శబ్ధం విన్పిస్తోంది.
  ఉన్నట్టుండి మట్టిబాట వచ్చి వీధిలో కలిసేచోట ఆరమోడ్పు కళ్ళతో పడుకొనివున్న కుక్కలు ఒక్కసారిగా మొరగటం ప్రారంభించాయి.
  ఎవరో వాటిని అదిలించబోతున్నారు.
 అప్పటికే చుట్టుపక్కల వాళ్ళకు మెలకువ వచ్చింది.  " ఎవరు ? ఎవరదీ..! మిమ్మల్నే...  "  గద్దించనట్లుగా ప్రశ్నలు.
 కుక్కల మొరుగుళ్ళలో కలిసిపోయిన ఎదుటివాళ్ళ సమాధానాలు.
  " ఓ నాయనా !  రమణారెడ్డి .. ఎవురో కొత్తోల్లోచ్చిన్నారు.. "  ముసలాయన కేక.
 మిద్దె మీద కదిలికలు.
  నిద్రమత్తు ఎటో ఎగిరిపోయిన దృశ్యాలు.
  ఆయుధాల్ని అందుకొని దబ దబ కిందకు దిగదూకారు.
  తుపాకులు బాంబులతో అటుకేసి దూసుకెళ్ళారు.
  వాళ్ళను చూస్తూనే నిశ్చేష్టులై నిల్చుండి పోయారు కొత్తవ్యక్తులు.
  " అయ్యా ! మేం మీకు పగోల్లం కాదు తండ్రీ ! "  రెండు చేతులెత్తి దండం పెడుతూ గట్టిగా అరచి చెప్పాడు అక్కడ నిల్చున్న ఇద్దరిలోని  ముసలి వ్యక్తి..
  " మరెందుకొచ్చినారు  యీ జామున....?  "
 " ఓబుల్రెడ్డి కొడుకును కలసి పోదామనీ  !  "
 నలుగురు మనుషులు వెళ్ళి వాళ్ళవద్ద ఆయుధాలు లేవని నిర్దారణ చేసికొన్న తర్వాత రెడ్డిగారి యిళ్ళవద్దకు తీసుకెళ్ళారు.
  " రవంతన్న బుద్దుండాల ఏ జామున్నంటే ఆ జామునొస్తే ఎట్లనుకొన్యావ్ ? కాలమెట్లాండాది తెల్దా ముసిలోడా ?  మామూలు కొంపలైతే సరే - ఖూనీల్జేసుకొనే కొంపగదా... బుద్దిలేనోడ .."  తిడుతున్నారు ఇరుగుపొరుగులు.
  ముసలాయన మౌనంగా వున్నాడు.
  అతని వెనుక ఇరువైయేళ్ళ లోపు యువకుడు కూడా పెదవి విప్పలేదు.
  " అన్నా ! నీకోసమొచ్చినాడంట..."  బాలుడు చెప్పాడు రమణారెడ్డితో.
 " నాయనా !  నువ్వేనా రవణారెడ్డివి ..? "  అంటూ రమణారెడ్డి దగ్గరగా వచ్చి ఎగాదిగా చూశాడు ముసలాయన  " పగులొస్తే పానాలుండవని మొబ్బునబడి ( చీకటిపడి ) వొచ్చినాం నాయనా !  నిన్న దోవబట్టినం పల్లెలంబడి అడ్డం నడ్చుకుంటావస్చాండం...."  చెప్పాడు.
  " బువ్వ తిన్నెరా ? "  అడిగాడు రమణారెడ్డి.
" బువ్వదేముందిలే నాయనా ! ఒక్క పూట లేకుంటే పానాలు పోతాయా..? నిన్ను కలుస్తామో లేదోనని బయపడ్తావున్యాము..  "
  " సరే తర్వాత మాట్లాడుకోవచ్చుగాని బువ్వతినుపోండి.. సద్ది బువ్వే..."  చెబుతూ తన వాళ్ళను పురమాయించాడు.
 అప్పటికే మూడు జాములు గడిచిపోయింది.
 నాలుగు గంటలు కావస్తోంది.
 తర్వాత నిద్రరావటం కూడా గగనమే.
 కొత్తవాళ్ళిద్దరూ భోంచేసింతర్వాత అందరూ మిద్దె పైకెక్కారు.
  " ఇంక చెప్పు - ఏవూరు మీది ? "  అడిగాడు మజ్జిగ గోపాల్.
  " మాది బద్వేలుకాపక్క పాయకట్టులో వుండే అరికెపాడు. "  చెప్పాడు ముసలాయిన.
 తమలాగే వాళ్ళుకూడ చెన్నారెడ్డి భాధితులేనట.
  గత ఎమ్మెల్లే ఎలక్షన్లలో ఏజంట్‌గా కూచున్న నేరానికి ఆ కుర్రాడి తండ్రిని అంటే ముసలాయన కొడుకును అడ్డంగా నరికించాడుట చెన్నారెడ్డి. ఏమి చేయలేని పరిస్థితిల్లో ఆ యువకుడు చదువు కూడా చాలించి అబ్బతో ( తండ్రి తండ్రిని ’అబ్బ’ అంటారు) కలిసి వ్యవసాయ పనులు చేసికొంటూ వుండేవాడట. లోపల మాత్రం తండ్రి చావుకు కారకుడయిన చెన్నారెడ్డి మీద రగులుతూనే వుండిందట.
  మొన్న మండల ఎలక్షన్లలో ఆ వూరినుంచి మరో నాయుకుడు తయారై చెన్నారెడ్డికి వ్యతిరేకంగా రాజకీయం నడపటంతో ఎన్నికల తర్వాత అతన్ని బద్వేలు నాలుగురోడ్ల కూడిలిలో దారుణంగా నరికించాడుట.  ఆ సమయంలో యీ కుర్రాడు అక్కడే వుండటం, సాక్షిగా స్టేషన్లో వాగ్మూలమివ్వటం, రేపు కోర్టుకు కూడ వెళ్ళి చెన్నారెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వాలని నిర్ణయించుకోవటంతో వేట మొదలయిందట.
  " యీని నాయన్ను సంపిన కసి కడుపులో వుందెయ్యా ! అదనుకోసం కనిపెట్టుకోనుండె...యీనికి తగిన దోవదొరికె.. యీడెట్టా కోర్టులో సాక్ష్యం సెప్పక మానడని ఎంటవడ్తాండరు నాయనా !  మా మండలమంతా వానికి ఎదురుజెప్పేటోల్ల లేరు..  దాపెట్టుకొందామనుకొన్నే.. వాకిలి తెర్సేటోడు లేడు.  నా మనమన్ని ఎట్టయినా వాడు బతకనియ్యడు తండ్రి !  వాని సేతులో అన్యాయంగా సచ్చేకంటే యీన్ని మీ సేతల్లో బెట్టి పోదామని వొచ్చినా. వాన్ని సంపడానికి మీరు తిరుగుతావుండారంట...  యీన్నిగూడా మీతో తిప్పుకోండి. యీని నాయన్ను సంపిన కసిదీర్చుకోనియ్యండి...  వాడు ఎంటబడి పానాల్దీసేకన్నా, వాన్ని ఎంటబడి  సంపాలనుకునే తీరులో పానాలు పోగొట్టుకొన్నే తృప్తిగా వుంటది నాయనా !  నా మనమన్ని తీసుకోండి.  ఎమ్మెల్లేగాడు సచ్చేమాత్రమయితే యీన్ని బలిచ్చినా నాకు సమ్మతమే తండ్రీ ! ... "  ఉద్వేగంగా చెప్పాడు.
  ఎమ్మెల్లేను చంపే యఙ్ఞంలో తన మనవన్ని సమిధగా వాడుకొమ్మని అప్పగిస్తున్నాడు.
  హృదయం చలించింది వింటోన్న వాళ్ళకు.
  ఇలాంటి అఙ్ఞాత బాధితులు...  తాలుకాలో మరెంతమంది వున్నారో..!
  కుర్రాడి దగ్గరగా వచ్చి వీపు తట్టాడు మజ్జిగ గోపాల్. " నీ పేరేంది ..? "  అడిగాడు.
  "  రాఘవ .."  చెప్పాడు.
  "  తమ్ముడూ రాఘవా !  అరికె కూటికి చిక్కటి మజ్జిగకు భలే లంకె. మీవూరు అరికె.. నాయింటి పేరు మజ్జిగ.. ఇప్పట్నించి మనిద్దరం మజ్జిగన్నంలాగా కలిసి వుందాం.. సరేనా !  "  అన్నాడు నవ్వుతూ.
 గంభీర వాతావరణం నుంచి అందరూ కొంత తేలిక పడ్డట్టయింది గోపాల్ మాటలతో.
  అందరికీ తమ్ముడిలా కలిసిపోయాడు రాఘవ. వాళ్ళ కార్యకలాపాల్లో తనూ పాలుపంచుకొంటూ అక్కడే వుండిపోయాడు. బాలుని వెంట చొరవగా గనివద్ద కెళ్ళి అక్కడ బాంబులు తయారు చేయటంలో విసరటంలో ఆసక్తి చూపించసాగాడు.
  తన కార్యకలాపాల్ని వేగవంతం చేశడు రమణారెడ్డి.
  నమ్మకస్తులైన సానుభూతి పరుల్ని గుర్తించి వాళ్ళను రహస్యంగా కలిశాడు. పోరుమామిళ్ళ, బద్వేలు టౌనుల్లోని సానుభూతి పరుల్ని ప్రధాన గూడచారులుగా తయారు చేశాడు.  దారివెంట పల్లెల్లో కూడా వేగుల్ని నియమించుకొన్నాడు.
  చెన్నారెడ్డి కదలికలు ఎప్పటికప్పుడు తమకు తెలుస్తూ వుండాలి. అతను పాల్గొనే మీటింగ్‌లూ, అటెండ్ అయ్యే పెళ్ళిళ్ళూ.. ఒకటేమిటి అతను వేసే ప్రతి అడుగూ తమకు తెలిసిపోతుండాలి.
  తమ పలుకుబడినంతా ఉపయోగించి యుద్ద ప్రాదిపదికన గ్రామంలోకి ఫోను సౌకర్యం కల్పించుకోవటంతో పని మరింత వేగవంతమైంది.
  పెద్దిరెడ్డి గనులపని చూసుకొంటున్నాడు.
  కొడుకులకు ఆయన అడ్డు చెప్పటం లేదు.
  కొంత వేదాంత ధోరణి అలవడినా... ఇద్దరు తమ్ముళ్ళను పోగొట్టుకొన్న పేగుబంధపు దుఃఖ ఛాయ వొకటి ఆయనను అంగీకరించేలా చేస్తోంది.
  ఆయనకు మరో భయం కూడా వుంది - తను చెప్పినా వినుకోరేమోనని.
  చెన్నారెడ్డి వల్ల తాలుకాలో ఎన్ని కుటుంబాలు నిద్రలేకుండా జీవిస్తున్నాయనీ ! ఎంతమంది కసితో రగిలిపోతున్నారనీ..!
  "  జరగనీ ! - ఏం జరుగుతుందో అది జరగనీ ! "  అనుకొన్నాడు.
  రమణారెడ్డిలో ఇప్పుడు కొంత ఉడుకు తగ్గింది.  ఆలోచన పెరిగింది. తమ్ముళ్ళతో కలిసి ఎమ్మెల్లే వేటకోసం అహరహం ప్రయత్నించసాగాడు.
  చెన్నారెడ్డిని దెబ్బతీయటం కాదు -  ఒకేసారి చంపాలి.
  బాంబులు  సిద్దం చేసుకొన్నారు.
  పోరుమామిళ్ళ, బద్వేలు ఏరియాల్లో అనువైన చోటల్లా బాంబుల బక్కెట్లు దాచారు.  ప్రధాన రహదారిలో వున్న పల్లెల్లో సైతం రోడ్డు పక్కనే గుర్తుగా పూడ్చపెట్టారు.
  బాంబుల కోసం ఎంతో దూరం పరిగెత్తాల్సిన పని వుండకూడదు. ఎక్కడ చేయిపెట్టి కెలికితే అక్కడ దొరకాలి.
  శివపురి వర్గం కదలికల్లో కొంత వేగం తగ్గటాన్ని మరో విధంగానో, ఇంకో తీరుగానో అర్థం చేసుకోలేదు చెన్నారెడ్డి.  ఏదో ఎత్తుగడకు సిద్దమవుతోన్నట్లుగానే అనుమానిస్తున్నాడు.  తన అనుచరులు మాత్రం నవ్వుకొంటున్నారు - శివపురి వాళ్ళకు బేదులు పెట్టాయని.
  తన ముఖ్య అనుచరులు ఒకరిద్దరికి మాత్రం మనసులోని అనుమానాన్ని బైట బెట్టాడు  చెన్నారెడ్డి.

                                                                                                              ......... సశేషం

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers