.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

   జీపు చాటున్నించి ఒక్క సారిగా బైటకొచ్చాడు బాలుడు.
  చేతిలోని బాంబును లాఘవంగా ముందుకు విసిరాడు.
 అది తెల్లగా పావురంలా ఎగురుకోంటూ దూసుకెళ్ళి జీపులోని చెన్నారెడ్డి చేతికి తగిలి జారిపడింది.
  బలంగా తాకటంతో  ’అబ్బా ’ అంటూ చేత్తో తడువుకొన్నాడు అతను..
 బాంబు పేలక పోవటంతో నిశ్చేష్టుడయ్యాడు బాలుడు.
 అప్పటికే జీపు డ్రైవర్ అలర్టయినట్టుంది.
 జీపు వేగం ఒక్కసారిగా పెరిగింది.
 అరుగుమీది జనాల మద్యనున్న రాఘవ హుషారుగా లేచి నిల్చున్నాడు. చేతిలోని బాంబును విసరికొట్టాడు డ్రైవర్‌కు గురిచూసి.
 అది వెళ్లి డ్రైవర్ భుజానికి తగిలింది.
 బాలుడు విసరిన మరో బాంబు జీపుకు తగిలింది.
 మూడు బాంబులూ పేలలేదు.
తనకు తగిలింది బాంబుగా అర్థమయ్యేసరికి చెన్నారెడ్డికి పై ప్రాణాలు పైన్నే పోయాయి.
 మొదట ఏదో రాయనుకొన్నాడు.
జారి కాళ్ళ మీద పండింతర్వాత తెలిసింది అది బాంబని.
 ఆగమేఘాల మీద అక్కణ్నించి దూరమైంది జీపు.
 అప్పటికే రివర్సయి రోడ్డు మీదకు వచ్చి వుంది శివపురి వాళ్ళ జీపుకూడ.
  చేతిలో బాంబుల్ని కసిగా నేలకేసి కొట్టాడు బాలుడు.
 నాలుగు బాదినాగాని ఒక్కటి పగల్లేదు.
 అంతులేని కోపంగా వుంది అతనికి.
 భరించరాని అసహనంగా వుంది.
 అద్భుతమైన అవకాశం చేజారిపోయింది.
 నేరుగా గనివద్ద కెళ్ళి బాంబ్ మేకర్ని కలిశాడు.
 " నన్నడగొచ్చు గదా రెడ్డీ ?  ఎందుకు తీస్కపోతనారో చెప్పక పోతిరి. నేనట్లా బైటకు పోయెచ్చేలోపల బక్కెట్లకు ఎత్తినారు, ఎనకనించి పిలుస్చా వున్న్యా వినపడ్లా.... మీరు తీస్కపోయిన బాంబులు ఇప్పుడే పిసికి ఆరబెట్టి వున్నే.....  గంటసేపన్నా ఆరివుంటే పేలేవి.  అయినా టెస్ట్ జెయ్యకుండా ఆయుధాలు వాడకూడదు రెడ్డీ ! "  చెప్పాడు బాంబ్ మేకర్.
  "  సరె సరే అర్జంటుగా మంచి బాంబులు బక్కెట్లకెత్తు... "
 బాలుడు చెప్పటంతో వెంటనే సిద్దపరచ బడ్డాయి.
  జీపు మళ్ళీ రోడ్డెక్కింది.
 అవగాహన రాహిత్యంతో అపూర్వావకాశాన్ని మిస్ చేసుకొన్నారు.
 ఇప్పుడయినా మించిపోయింది లేదు.
 ఒంటరి జీపుతో వెళుతున్నాడు ఎమ్మెల్లే
 పోరుమామిళ్ళలోనయనా  అటాక్ చేయాలి.
 శరవేగంతో దూసుక పోసాగింది జీపు.
  కనుచూపు మేరలో చెన్నారెడ్డి వాహనం కన్పించలేదు.
 అది అందదని తెలుసు ఏదైనా ఆటంకం జరిగితే తప్ప.
  అయినా తమ ప్రయత్నం మానకూడదు.
 పోరుమామిళ్ళ పొలిమేరలు సమీపించేసరికి వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఎమ్మెల్లే జీపు కన్పించేసరికి హుషారు పెరిగింది.
 డ్రైవర్‌ను తొందరించారు.
  జీపు వేగం మరింత పెరిగింది.
 బకెట్లలోని బాంబుల్ని తలా ఒకటి అందుకొన్నారు.
  జీపు ఏ మాత్రం అదుపు తప్పినా వాళ్ళ చేతిలోని బాంబుల్తో వాళ్ళే బలి కావలసి వస్తుంది.  ఆ విషయం అందరికీ తెలుసు. కర్తవ్యం కలిగించే హుషారు ముందు చావు భయం దగ్గరకు రావటం లేదు.
  వీళ్ళను గమనించునట్టుంది - చెన్నారెడ్డి జీపు కూడా వేగం పుంజుకొంది.
 అప్పుడే రోడ్డు దాటుతూ వున్న చివరి బర్రెనూ, చేలల్లోని మందను చూడగానే అర్థమైంది - ముందు జీపు ఎందుకింత ఆలస్యమైంది.
’బర్రె మహాతల్లులు మరికొంత కనికరం చూపించివుంటే బావుండేది. ’
 రెండు జీపులు టౌన్లోకి ప్రవేశించాయి.
 వాటి వేగానికి జనాలంతా ఆశ్చర్యపోతున్నారు.
 వందగజాల మధ్య దూరంతో విపరీత శబ్దాలు చేసుకొంటూ వెల్తున్నాయి.
 ఊళ్ళో ఎక్కడా నిలబడలేదు చెన్నారెడ్డి జీపు.
 ఊరికి ఉత్తర శివార్లలో వున్న పోలీసు స్టేషన్ వద్ద స్లో అయింది. నేరుగా స్టేషన్ ప్రహరీ ముందు ఆగింది. క్షణం కూడా ఆలశ్యం చేయకుండా అందులోంచి దిగదూకి గబగబ సి.ఐ. ఆఫీసులోకి వెళ్ళాడు చెన్నారెడ్డి.
  అతని చేతిలో పగలని బాంబుంది.
 ముందు జీపు వెనకే స్టేషన్ దాటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు ముందు ఆగింది శివపురి వాళ్ళ జీపు కూడా.
  లోపల్నించి దిగకుండ స్టేషన్ కేసి చూస్తుండి పోయారు వాళ్ళు.
 పది నిమిషాలు గడిచినా చెన్నారెడ్డి బైటకు రాలేదు.
 రోడ్లోంచి వాళ్లు కదల్లేదు.
 పోలీసులు మాత్రం కాంపౌండ్ వాల్ లోపల్నించి నిక్కి నిక్కి చూస్తున్నారు. శివపురి జీపు కేసి వేలెత్తి చూపుతున్నారు.
 అంతలో రమణారెడ్డి జీపు వచ్చి తమ జీపు పక్కగా ఆగింది.
 వాళ్ళకు విషయం తెలిసి హుటాహుటిన వచ్చారుట.
 బాలునికి మరింత బలం పెరిగినట్లయింది.
 లోపల నించి ఓ పోలీసు నేరుగా వాళ్ళ వద్దకొచ్చాడు.
 రమణారెడ్డికి సెల్యూట్ చేశాడు.
 " ఎమ్మెల్లే లోపల కూచోనుండాడు.  మీరు ఎంట బన్న్యారంట... బాంబులు ఏసినారంట...  బాంబులు కూడా చేతబట్టకోనొచ్చినాడు..  - సి.ఐ. సార్ లేరు.  ఆయనొచ్చే లోపల మీరు వెళ్ళిపోండి... "  చెప్పాడు.
  " ఎందుకు పోవాల  ?  "  జయసింహ అన్నాడు.  " ఆయప్పే మామీద బాంబులేసి వొచ్చినాడు.  మేం కూడా కేసు బెట్టడానికే యిక్కడి కొచ్చింది. ఆయప్ప లోపలుండాడు. అతను బైటికి పోతే రావాలని మేమిక్కడ కాచుకొనుండాం "  చెప్పాడు.
  " స్టేషన్ వాల్లబ్బ సొమ్మంటనా.... ఎంత సేపైనా కూచోడానికి.. ?  బెరీన బైటకు పంపండి  లేదా మేమే వస్చాం... మీకెందుకు ట్రబులివ్వాలా అని మేమీడుండేది.  ఆయప్పకేం భయపడి కాదు..."  బాలుడన్నాడు.
 " పోవయ్యా !  ఎమ్మెల్లేను బైటకు పంపీపో... మేం రావాల.  బద్వేలులో హోం మినిస్టర్ ప్రోగ్రాముంది. సర్‌ఫ్రైజింగ్‌గా వస్తున్నాడు. మీ సి.ఐ కూడా అక్కడికే వెళ్ళుంటాడు. మేమూ పోవాలి.  సి.ఐ ని అక్కడే కలుస్చాం గాని ముందు ఎమ్మెల్లేను బైటికి పంపీండి..."  రమణారెడ్డి చెప్పటంతో కానిస్టేబుల్ రెండు చేతులెత్తి దండం పెట్టాడు.  " సార్  ! గొడవలయితాయి సార్ ! మాకు చెడ్డ పేరొస్చాది..  మీరు పోండి సార్ ! ".
" ముందు వాన్ని బైటికి రమ్మను  వాని కతేందో తేల్చుకొని ఈ రోజు హోం మినిస్టర్‌ను కలవాలి "  తీక్షణంగా చెప్పాడు రమణారెడ్డి.
 మరేం మాట్లాడకుండా పోలీసు వెనుదిరిగాడు.
 అదే సమయంలో రోడ్డుకు దక్షిణంగా రంపాడు క్రాస్ వద్ద కొచ్చి ఆగాయి ఆరు జీపులు.
  వాటిల్లోంచి దిగుతోన్న జనాన్ని చూడగానే రమణారెడ్డి వర్గానికి అర్థమైంది అవి ఎమ్మెల్లేకు సంబందించినవని.
 విషయం తెలిసి వచ్చినట్లుంది వాళ్ళంతా.
 కొంతమంది జీపుల్లోంచి బక్కెట్లు దించి పట్టుకొస్తున్నారు.
 యుద్దానికి సిద్దమయ్యే వచ్చినట్లుంది.
 క్షణం కూడా ఆలస్యం చేయలేదు శివపురి వాళ్ళు.
 జీపుల్లోంచి అందరూ కిందకు దిగారు.
 బక్కెట్లు కూడ దించబడ్డాయి.
 వెనక వచ్చిన రమణారెడ్డి కూడా కావలసినంత ’సరుకు ’ పట్టుకు రావటం వల్ల మేలయింది.
 బాంబులు చేతుల్లోకి తీసుకొన్నారు.
 మొదట చెన్నారెడ్డి గుంపు వైపున్నించే బాంబు దూసుకొచ్చింది. అది నడిరోడ్డు మీద పెద్ద శబ్దంతో పేలగానే జనం కకావికలయ్యారు. స్టేషన్‌ లోపలున్న పోలీసులు ఉలిక్కిపడి చూశారు. ఎదురుగా వున్న ఆంజనేయస్వామి గుడిలోని భక్తులు  " రామ రామా ! "  అంటూ చెవులు మూసుకొని వణకి పోసాగారు.
  ఇరువైపుల్నించి బాంబుల పోరాటం మొదలైంది.
  పోలీసు స్టేషన్‌కు ఉత్తరం వైపునించి ఓ ముఠా, దక్షిణం వైపునించి మరో ముఠా విసిరే బాంబులు స్టేషన్ గేటు ముందు ప్రాంతాన్నే వేదికగా చేసుకొని పేలుతున్నాయి.  వాటి శబ్దాలకు టౌనంతా అదిరిపడింది.
 తుపాకులు ఎక్కుపెట్టి గేటుదాక వచ్చి ఆగిపోయారు పోలీసులు.  " కాల్చండి -  కాల్చిపారేయండి నాకొడకల్ను. "  శివపురి వర్గం కేసి చేయి చాపుతూ వెనకనించి అరుస్తున్నాడు చెన్నారెడ్డి.
  " వాల్లను కాల్చినారనుకో... తగిలిన బుల్లెట్ కంతా లక్షరూపాయులు లెక్కిస్తా..  కానీండి మరి... "
 అతనికేసి వెర్రివాన్ని చూసినట్లుగా చూశాడు యస్,ఐ,  " ఇక్కడ కూడా వాగ్దానాలు సెయ్యల్నేమో ! "  అన్నాడు ఎటోతిరిగి గొణుక్కుంటోన్నట్లుగా.
  ఆ మాటలు చెన్నారెడ్డి చెవుల బడ్డాయి.
 " వాగ్దానాలు కాదయ్య.... నిజమే చెబుతావుండా "  అన్నాడు.
 " సార్ ! పిల్లలుగల్లోల్లం - మమ్మల్నిట్లా బతకనీండి... "  రెండు చేతులెత్తి నమస్కరించాడు ఎస్సై,  " మీ వాళ్ళకు చెప్పండి వెనక్కిపొమ్మని... గొడవే వుండదు గదా ? "  అన్నాడు.
  " అంటే..  మా వాల్లు వెనక్కిపోతే వాల్లచేత నామీద బాంబులేయిస్తామనా..?  "  గట్టిగా అరిచాడు చెన్నారెడ్డి.
  అతన్ని  వదిలేసి గేటు వద్దకెళ్ళాడు ఎస్సై.
 అప్పటికే ట్రాఫిక్ బందయింది.
  జనమంతా సుదూరంగా కోట కట్టినట్లు నిల్చుని చోద్యం చూస్తున్నారు.
 మేధావి వర్గానికి, చాలామందికి అనుమానమొచ్చింది - అస్సలు పోలీసు వ్యవస్థ వుందా ’ లేదా ’ అని.
హ్యాండ్ మైక్‌తో పోలీసులు కేకలేసి చెబుతున్నారు - ’ మర్యాదగా అక్కణ్నించి వెనుదిరగ కుంటే కాల్చి పారేస్తామని ’
  వాళ్ళ హెచ్చరికల్ని ఎవరూ లెఖ్క జేయలేదు.
 యధేచ్చగా బాంబింగ్ జరుగుతూనే వుంది.
 చెన్నారెడ్డి స్టేషన్ లోపల్నించి బూతులు తిడుతున్నాడు. శివపురి వాళ్ళ మీద సవాల్ విసురుతున్నాడు. ’ రేయ్ ’ మీ ఏరియాలో నా మీంద రెండుసార్లు అటాక్ జేసినారు, నేనట్లాగాదు నా ఏరియాలో మీ జోలికి రాను. అది మగతనం గాదు. మీ ఏరియాలోనే మీమీద దాడి జేస్తా. నా దెబ్బ ఏందో మీకు రుచి జూపిస్తా ’ అంటూ కేకలేశాడు.
వెంటనే అతని సవాలుకు ప్రతిస్పందించాడు బాలుడు  " ఫో పోరా ! - నువ్వొక మొగోనివీ..  నీకొక ఏరియా.... రేయ్ నువ్వు నిజంగా మొగపుట్టకే పుట్టింటే బైటకు రారా  తేల్చుకుందాం.. "  చేతులూపి, యీలేసి సవాల్ విసిరాడు.
 లోపల్నించి రొప్పుతున్నాడు చెన్నారెడ్డి.  " ఎస్సై పక్కకు తప్పుకో... నేను పోవాల..."  బైట కెళ్ళేందుకు ప్రయత్నించాడు చెన్నారెడ్డి.
 " పోతే మిగలవు సార్ !  ఇద్దరూ వూరి బైటికి పోయి కొట్లాడి చావుపోండి..  మా స్టేషన్ ముందు చస్తే మాకు పీకల మీదకొస్చాది.."  అడ్డుకొన్నాడు ఎస్సై.
 బైట్నించి రెచ్చగొడుతున్నాడు బాలుడు బగైరాలు.
 బాంబింగ్ జరపటంలో చాలా హుషారుదనాన్ని ప్రదర్శిస్తున్నాడు రాఘవ. అవతలి వాళ్ళు విసిరిన బాంబులు పేలుతోన్నా లెఖ్క జేయకుండా ముందుకు దూసుకెళ్లి ప్రయోగిస్తున్నాడు. అతని బాంబు దెబ్బకు బారెడు  వంతున వెనక్కి సర్దుకోవలసి వస్తోంది ఎమ్మెల్లే వర్గానికి.
 ఎర్రగా అందంగా వున్న ఆ యువకుడి విన్యాసాలు చెన్నారెడ్డిని కూడ ఆకట్టుకొన్నాయి. పరిశీలించి చూసేసరికి అతనెవరో అర్థమైంది. అరెకపాడు కేసు కళ్ళ ముందు మెదిలింది.
  అక్కడి పరిస్థితిని తన పై అధికారులకు సెట్లో చెబుతున్నాడు ఎస్సై...  పైన్నించి అదనపు సహాయం అందేదాక తనెట్లా యీ సమస్యను నిర్వహించాలో అర్థం కాలేదు.
 ’తనకు శనిలా దాపురించాడు ఎమ్మెల్లే.. గొడవలు పడేవాళ్ళు వూరిబైట కొట్టుకు చావొచ్చు గదా !  వాల్ల పీనిగెలకు కావలుండి పోస్టుమార్టం జరిపించే వాల్లం...  వాల్లకు పిండాకూడు పెట్టించే వాల్లం..’
  గొణుగళ్ల రూపంలో తిట్టుకొంటున్నాడు ఎస్సై.
  క్రమేణా బాంబింగ్ వేగం కొంత చల్లబడింది.
  పోలీసులకు అర్థమైంది ఇరువర్గాల వద్ద సరుకు అయిపోవచ్చిందని.
 అప్పుడు రంగంలోకి దిగారు ధైర్యం చేసి.
 స్టేషన్లో వున్న పోలీసులంతా మూకుమ్మడిగా రోడ్డు మీదకొచ్చారు. ఇరువర్గాల మధ్య నిల్చుని అందర్నీ చెల్ల చెదరు చేస్తోన్నట్లుగా లాఠీల్ని ఝళిపిస్తూ అటుఇటు పరిగెత్తారు.
  పోలీసులంతా బైటకెళ్ళేసరికి చెన్నారెడ్డి అటు ఇటు తేరపార జూశాడు. అతని కళ్లల్లో ఏదో బెదురు. వెంటనే తన గన్‌మెన్ తోటి తనూ స్టేషన్ బైటకు నడిచాడు.
  ఇరువైపుల రెండు గుంపులూ నెమ్మదిగా వెనక్కి సర్దుకొన్నాయి. ఇంకా సవాళ్ళు తీసుకొంటూనే జీపులెక్కి ఆ ప్రాంతం నించి నిష్క్రమించారు.
 తర్వాత రెండు గుంపుల మీదా కేసులు నమోదయ్యాయి.

                      **********

 అనుకోకుండా వచ్చిన చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకొని సమర్థవంతంగా వినియోగించుకున్నారు గాని... కొద్దిపాటి అవగాహనా రాహిత్యం వల్ల లక్ష్యాన్ని అందుకోలేకపోయారు శివపురి వర్గీయులు.
 అయితే యీ ఒక్క దాడితోనే వాళ్ల పేర్లు తాలుకా అంతటా మారుమ్రోగింది. చెన్నారెడ్డిని ఎదిరించే మొనగాళ్ళుగా గుర్తించబడ్డారు.
 ప్రయత్నం విఫలమైంతర్వాత శివపురి సోదరుల్లో మరింత కసి పెరిగింది.  ఈ వేడి మీదనే మరో సారి దాడి జేయాలని తీర్మానించుకొన్నారు.
 చెన్నారెడ్డి కూడా తన జాగ్రత్తలు తను తీసుకొంటున్నాడు.
వెంట జనం లేకుండా ఎక్కడికీ కదలటం లేదు.
 జీపుల కాన్వాయిలో తన జీపు స్థానాన్ని తేప తేపకు మార్చుకొంటున్నాడు. ఒకే జీపులో కాకుండా వేరు వేరు జీపుల్లో ప్రయాణిస్తున్నాడు.
 శివపురి ఏరియాలో ఎన్నికల ప్రచారం కూడా మానుకున్నాడు.
 పోలీస్టేషన్ ఎదుటే వాళ్ళ తెంపు చూసింతర్వాత తన పద్దతుల్ని చాలా వరకు మార్చుకోవలిసి వచ్చింది అతనికి.
  గత రెండ్రోజులుగా అట్లూరు మండలం మీద దృష్టి సారించాడు. ఇంకో మూడు రోజుల కార్యక్రమం వుంది అక్కడ.  బద్వేలు ఏరియాలోని మూడు మండలాల్ని గట్టి చేసుకొంటే చాలు మిగతా పోరుమామిళ్ల ఏరియా మూడు మండలాల్లో కొంచం అటు ఇటు అయినా ఇబ్బంది లేదు. తనకు భారీ మెజారిటీ దక్కుతుంది.
 అతని ప్రోగ్రాం గురించిన వివరాలు పూర్తిగా అందాయి రమణారెడ్డికి.
 దొరికిన అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలనుకుంటున్నాడు.
 మిత్రులందర్నీ సమావేశ పరచి సుదీర్ఘీగంగా చర్చించాడు.
 అంతా కలసి పకడ్బందీ ప్లాన్ ఒకటి సిద్దం చేశారు.
 రేపు కూడా అట్లూరు మండలానికే వెల్తున్నాడుట చెన్నారెడ్డి. పల్లెల్లో కన్నా టౌన్లోనే అటాక్ చేయటం బావుంటందనుకొన్నారు.
 బద్వేలులోనే దాడి చేయాలని నిర్ణయం జరిగిపోయింది.
 దాడి చేసే ప్రాంతం కూడ సెలక్ట్ చేసుకొన్నారు.
  సిద్దవటం రోడ్డులో జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద తమ వ్యూహాన్ని అమలు చేయాలనుకొన్నారు.  ఒకటికి రెండు సార్లు ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా చూసి పరిస్థితుల్ని బాగా ఆకళింపు చేసుకొన్నారు.
 జి.పి.ఆర్ బిల్డింగ్ పై భాగానికి ఎక్కి విహంగ వీక్షణం చేశారు.
 అక్కణ్నించి ప్రాంతీయపార్టి కార్యాలయం స్పష్టంగా కన్పిస్తోంది.
 పరిసరాల ఎన్నిక పూర్తయింతర్వాత వ్యూహం అమలు గురించిన పథక రచన ప్రారంభమైంది.
 అటాక్‌లో పాల్గొనే  వారంతా మూడు గ్రూపులుగా విభజించబడ్డారు.
 గ్రూపుల వారీగా పని విభజన కూడా జరిగిపోయింది.
 ఎవరి పని వాళ్ళు చేసుకుపోవాలి తప్ప ఒకరి పనిలో మరొకరు వేలు పెట్టగూడదు. పొరబాటున కూడా మరొకరి భాద్యతల్ని తాము మోయాలని ప్రయత్నించకూడదు.  ఏ గ్రూపు భాద్యతలు ఆ గ్రూపే నిర్వర్తించాలి.  అట్లా చేయటం వలన తమ మీద తామే బాంబింగ్ జరుపుకొనే పొరబాట్లు దొర్లవు.
  మూడు గ్రూపుల్లోనూ చెన్నారెడ్డి ద్వారా తండ్రుల్ని, అన్నల్ని, తమ్ముళ్ళను పోగొట్టుకొని, అతన్ని చంపాలనే అంతులేని కసితో బతుకుతోన్న వాళ్లను మాత్రమే ఎంపిక చేసుకొన్నారు.
  అందరూ అత్మీయుల్ని పోగొట్టుకొని కసి పెంచుకొన్న వాళ్లే గ్రూపులుగా తయ్యారయ్యారు గాని రెండవ గ్రూపులో మాత్రం ఓ వ్యక్తి ఆస్తుల్ని పోగొట్టుకొని పగబట్టి వున్నవాడు.  తన ఆస్థినంతా లాక్కుని వూర్నించి తరిమేశాడుట చెన్నారెడ్డి.  అతన్ని ఎట్లైనా చంపాలనే ధ్యేయంతో వచ్చి శివపురి వర్గంలో కలిశాడు.
 అతని పేరు ఎనుబోతుల సుబ్బారెడ్డి... కలసపాడు ఏరియా.
 అందరికంటే ఎక్కువ కసితో చెలరేగి పోతున్నాడు అతను.

                                        **********


  రాత్రి బద్వేలులోనే తిష్టవేశారు అందరు.
 రేపు ఉదయం జరపబోయే కార్యక్రమాన్ని ఒకటికి రెండు సార్లు రిహాల్సల్స్ వేసుకొన్నారు.... తృప్తిపడ్డారు.
 ఉదయమే యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది.
 అప్పటికింకా పొద్దుకూడా పొడవలేదు.
 చీకట్లో లేచి ప్రయాణం కావటం చెన్నారెడ్డికి అలవాటు.
రోడ్డు మీద సన్నగా జనసంచారం మొదలైంది. పల్లెల్నించి కూరగాయలు, పాలక్యాన్లు టౌన్‌కు వస్తున్నాయి. అడపా దడపా బస్‌లు నడుస్తున్నాయి.
 జి.పి.ఆర్ బిల్డింగ్ వద్ద మూడు గ్రూపులూ మొహరించాయి.
  చెన్నారెడ్డి ఏ జీపులో వస్తున్నారో తెలిసికొని మొదటి గ్రూపుకు సంకేతాలిచ్చేందుకు ఓ వ్యక్తిని రెండంతస్థుల జి.పి.ఆర్ బిల్డింగ్ పైకి ఎక్కించారు.
  అక్కణ్నించి ప్రాంతీయ పార్టి కార్యాలయం వద్ద వున్న మనుషల్ని కూడా స్పష్టంగా పొల్చవచ్చు. చెన్నారెడ్డి ఏ జీపులో ఎక్కి వచ్చేది బిల్డింగ్ పైనున్న మనిషికి తెలుస్తుంది. వేళ్ల సంఙ్ఞల ద్వారా కాన్వాయ్‌లోని జీపు వరుస సంఖ్యను తెలియజేయాలి. మొదటి గ్రూపు వాళ్లు అతన్ని గమనిస్తూ, అతను అందించిన సమాచారాం ప్రకారం అటాక్ చేయాలి.
 ప్రస్తుతం యీ ఆపరేషన్ సక్సెస్ కావటానికి అతను అందించే సమాచారమే కీలకం. అందుకే అతనికి ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఒకటికి పదిసార్లు హెచ్చరించి మరీ టవర్ ఎక్కించారు.
  ఆరు గంటలకే చెన్నారెడ్డి జీపుల వరస పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైంది.
 ఆ సమాచారం శివపురి వర్గానికి తెలిసింది.
 బిల్డింగ్ పైనున్న మనిషికేసి ఆతృతగా, ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మొదటి గ్రూపువాళ్ళు.
  అతను పార్టీ కార్యాలయం కేసి తదేకంగా చూస్తున్నాడు.
 ఒక్క నిమిషం తర్వాత పై మనిషి కుడి చేతిని పైకెత్తి హస్తాన్ని వాళ్లకేసి చూపించాడు.  తర్వాత నెమ్మదిగా రెండు వేళ్లను ముడిచాడు.
 అంటే -  ముందునించి మూడో జీపులో వస్తున్నాడన్నమాట చెన్నారెడ్డి. మొదటి గ్రూపు సిద్దపడింది.
  రోడ్డుమీద వచ్చే వాహనాల కోసం ఉత్కంఠగా ఎదురుచూడసాగింది.
 దాని ప్రధాన కర్తవ్యం చెన్నారెడ్డి జీపుమీద దాడిజేయటం. విచక్షణా రహితంగా బాంబింగ్ చేసి కాన్వాయ్‌ని చెదరగొట్టటం. అతన్ని ఒంటరిగాని చేయటం.
  అంతటితో మొదటి గ్రూపు పనయిపోతుంది.
 మరుక్షణం రెండవ గ్రూపు రంగంలోకి దిగవల్సి వస్తుంది.
 మొదటి గ్రూపు వాళ్ళు తమ పనిని మననం చేసుకొంటూనే రెండుచేతుల్లో రెండు బాంబుల్ని పట్టుకొని జీపుల రాక కోసం ఎదురుచూస్తూ అబ్బిళ్లు కొరుకుతూ పూని వున్నారు.
 జీపుల వరస వాళ్లకు దగ్గరగా వచ్చింది.
 ఒకటవ జీపు దాటుకెళ్లింది.
 రెండవ జీపు కూడా
 అప్పటికే పొజిషన్ తీసుకొని వున్నారు.
 పుట్ట చెండుల్లే లేచి వెళ్ళి మూడవ జీపుమీద పడ్డాయి తెల్లటి నాటు బాంబులు.
  వాటి పగుళ్లతో ఆ ప్రాంతమంతా ఒక్క సారిగా దద్దరిల్లింది.
 ఒక బాంబు సూటిగా వెళ్లి డ్రైవర్ తలకు తగిలి పేలింది.
 తల పగిలి వెనకసీటులోని చెన్నారెడ్డి ఎదల నిండా మెదడు, నెత్తురు చిందింది.
  చెన్నారెడ్డికే బాంబు దెబ్బ తగిలిందనుకొన్నారు ఆ దృశ్యాన్ని చూసి.
 ఒక్క క్షణంలో పరిస్థితి ఏమిటో అర్థమైంది వెనక ముందు జీపుల్లోని వాళ్లకు.
 కనురెప్పపాటులో ముందున్న రెండు జీపులూ శరవేగంతో దూసుకెళ్లి అదృశ్యమయ్యాయి. అవి బహుశా సిద్దవటం వద్దనున్న పెన్నానది ఒడ్డుకు వెళ్లిగాని వెనుదిరిగి చూడవు.
  వెనక జీపుల్ని రివర్స్ చేసుకొనేందుక్కూడా తోచక జీపుల్లోంచి దిగనురికి చావుబతుకుల మీద టౌన్లోకి పరారయ్యారు జనమంతా.
 తన జీపులో చెన్నారెడ్డి ఒక్కడే మిగిలాడు.
 జరిగిన సంఘటన అర్థమై అతను తేరుకొనే సరికి బాంబుల పొగ మద్య తన జీపు ఒక్కటే వుంది.  తను నమ్ముకొన్న జనమంతా తనను మృత్యు వొడిలోకి నెట్టి ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయారు.
 తన చచ్చాడే అనుకొన్నాడు.
 జీపు దిగేందుక్కూడా శరీరం సహకరించక అలాగే కూచుండి పోయాడు.
 బాంబు శబ్దాలు. హాహా కారాలు, తెల్లని పొగల మద్య తమ పనిని తాము దిగ్విజయంగా పూర్తి చేశారు మొదటి గ్రూపు వాళ్ళు.
  వెంటనే రెండవ గ్రూపు యాక్షన్ ప్రారంభం కావాలి.
  వాళ్ళు చెన్నారెడ్డిని లక్ష్యంగా బాంబు దాడులు జరపాలి. ఎంతమంది చచ్చినా ఫర్వాలేదు - అతన్ని మాత్రం చంపకుండా వదిలేందుకు లేదు.
 మూడవ గ్రూపు వాళ్లకు సమీపంలో మరో తావులో వుంటుంది. వాళ్ల పని - పై మాసులు రాకుండా అడ్డుకోవటం.
 మొదటి గ్రూపు యాక్షన్ పూర్తవగానే రెండవ గ్రూపు సిద్దమయ్యారు. తమ చేతుల్లోని బాంబుల్ని విసిరికొడుతూ పొగమేఘాలూ, భీకర శబ్దాలు సృష్టించుకొంటూ ముందుకు వస్తున్నారు.
 చేతిలోని బాంబులు అయిపోగానే తమ వెంట వస్తోన్న బాంబుల బక్కెట్లలోంచి అందుకొని తిరిగి ప్రయోగించాలి.
  మొదటి  నాలగయిదు బాంబులతో భీతావహ వాతావరణాన్ని సృష్టించిన రెండవ వర్గం వాళ్లు తమ చేతుల్లోని బాంబులు అయిపోగానే మరికొన్ని బాంబుల కోసం వెనక్కు తిరిగి బక్కెట్ల కేసి చూసి ఉలిక్కిపడ్డారు.

                                                                                                           .......... సశేషం

3 comments:

Kamal garu,

desperately waiting for next episode
-Bharat.

భరత్‌గారు, నేను కూడ ఈ నవలలోని విధంగా కొన్ని సమస్యలలో ఉండడం మూలాన టైపు చేయడానికి సమయం దొరకలేదు..త్వరలో మిగతా అన్ని భాగాలు ప్రచురిస్తాను.

Boss, its been a while. I know you must be busy. But notice that your regular readership is eager.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followersమాలిక: Telugu Blogs