ఆగష్ట నెల మూడో తేది సోమవారం ఉదయం 5:30కు మొదలయింది మా రోడ్ ట్రిప్....  జడ్చర్ల లో కర్నూల్ నుండి వచ్చిన మధు అనే నా కాలేజి క్లాస్‌మేట్‌ని పికప్ చేసుకొని అక్కడ నుండి బాదామికి మద్యాహ్నానికి చేరాము. 



       మరసటి రోజు ఉదయం పదుకొండు గంటల వరకు అక్కడ చూడాలసిన ప్రదేశాలు చూసి. అక్కడ నుండి గోవాకు ప్రయాణం.. ఒక పక్కన వర్షం, మంచు.. కొండల మీదుగా...మేఘాల మద్యన పచ్చని ప్రకృతిలొ ఒక పక్కన  పాత పాటలు వింటూ ప్రయాణం. మాటల్లో వర్ణించలేని అనుభూతి..! 





 రాత్రికి గోవా చేరుకొని అక్కడే గెస్ట్ హౌస్‌లో బస.. మరసటి రోజు సమయాలనుకూలతను బట్టి కొన్ని ప్రదేశాలు చూసేసి ఆ మరసటి రోజు ఉదయం మద్యాహ్నంగా ప్రయాణం.... బీచ్ వెంబడీ రోడ్ ప్రయాణం...మరో వైపు పచ్చదనం.  కార్వార్ మీదుగా  గోకర్ణ చేరి..అక్కడ నైట్ హాల్ట్. మరసటి ఉదయం అక్కడ నుండి మురుడేశ్వర్. అక్కడ నుండి జోగ్ ఫాల్స్ అవి చూసుకొని సాగర్ మీదుగా షిమొగా చేరి అక్కడ నైట్ హాల్ట్.




        మరసటి రోజు ఉదయం అక్కడ నుండి ఇక్కేరి అనే కేలడి రాజుల చారిత్రక ప్రాంతం సంధర్శన..తర్వాత తీర్థ హల్లి మీదుగా ఆగుంబే. మద్యలో కుంభవృష్టితో వర్షం. ఆ వర్షంలోనే మేఘాల మద్యన ఘాట్ రోడ్ లో ఎత్తైన కొండ మీద కుండాద్రి బెట్టను చేరుకొన్నాం అదొక అడ్వేంచర్ మాకు. కింద ఏమున్నదో కూడ కనపడనంతగా మేఘాలలో వుండిపోయాము. అక్కడ నుండి సాయింత్రం ఆగుంబే చేరాము. కాని చుట్టు పక్కల చూట్టానికి వాతావరణం అనుకూలించలేదు. చాలా జలపాతాలు, ల్యాండ్ స్కేప్స్ మరియూ కుద్రేముఖ్ లాంటి సీనరీ కలిగిన ప్రదేశాన్ని చూడలేకపోయాము..  కుంభవృష్టితో ఒక్కటే వాన.  అక్కడ నుండి  బయలు దేరి రాత్రి తొమ్మిదికి ఉడిపికి చేరుకొని అక్కడే నైట్ హాల్ట్.. దర్శనాలు..అన్నీను.

పొద్దున్నే సేయింట్ మేరీ ఐల్యాండ్ చూడాలనుకొని వెళ్లాం.. ఊహు.  సముద్రంలో తుఫాన్ కదిలకలతో ఐల్యాండ్ కూడ క్యాన్సిల్.. అక్కడ నుండి మడికెరకు ప్రయాణం.... మద్యలో...!!





  కార్కాల అనే వూరికి చేరాం. ఇదే వూరికి నేను ఓ 15 ఏళ్ల క్రితం నేషనల్ గేమ్స్ నిర్వహించినప్పుడు ఒక ముఖ్యమంత్రి సొంత వారు కావడం చేత ఇక్కడకు వెళ్లాను. తిరిగి ఇప్పుడు గుర్తు పెట్టుకొని వెళ్లాను. ఇక్కడొక విశేషమున్నది..! అక్కడ నుండి మూడబిదిరి లోని జైన్ దేవాలయాన్ని చూసుకొని సాయింత్రం మడికెరి ( కూర్గ్) చేరుకొన్నాం. కాని కూర్గ్‌కు వెళ్లే మార్గ మద్యలో వున్న ఘాట్ రోడ్ మాత్రం భలే వున్నది, ఎన్నెన్ని వొంపులు..ఎన్నెన్ని మెలికలో.. స్టీరింగ్‌ను తిప్పుతూ కూర్చోవాల్సిందే.. అదీను ఆకు పచ్చని కొండల నడుమ..  ప్చ్ ఆ డ్రైవింగ్ ఎంజాయ్ చేస్తూ చేయడమన్నది ఒక అడ్వేంచరే..!  ఫుల్ ఆఫ్ జాయ్ అంటే ఏమిటో అర్థమవుతుంది.




      మరసటి రోజు ఉదయం వర్షంలోనే "అబ్బి ఫాల్స్" చూసుకొన్నాం.. అక్కడకు దగ్గరలోనే "మండద పట్టి" అనే కొన్ని ల్యాండ్ స్కేప్స్ వున్న ప్రాంతాలు వున్నాయి. కాని నా ఫ్రెండ్స్ అనాసక్తితో చూడకుండానే వెనుతిరగాల్సి వొచ్చింది. అక్కడ నుండి కోస్‌కోడె అనే కేరళ ప్రాంతానికి ప్రయాణం అయ్యాం. ఇక ఆ ట్రాఫిక్ గురించి చెప్పనవసరం లేదు గానీ.. చాలా రద్దీగల రహదారి అది. మద్యలో  "తలసరి" అనే వూరులో భోజనం. అక్కడే వున్న ఒక చిన్న పాటి కోటను సందర్శించి తిరిగి అక్కడ నుండి "కోజ్‌కోడె" కు సాయింత్రానికి చేరుకొన్నాం. వర్షాకాలం వలన అక్కడ బ్యాక్ వాటర్ బోట్ హోమ్‌లో బస చేయడానికి అవకాశం లేకపోవడం వలన అక్కడ నుండి గురువాయర్‌కు వెల్దామని ఫ్రెండ్స్ ప్రప్ఫొజల్‌తో..  ఇంత వరకు చూడలేదాయన్ని..  సరే నేను చూసినట్లుంటుంది.. అలాగే ఒక పలకరింపు పలకరిస్తే ఓ పనైపోతుంది కదా రాత్రికి గురువాయర్ చేరుకొన్నాం.




 తెల్లారు జామున్నే గురువాయిర్‌ని పలకరించేసాను, పాపం అక్కడికొచ్చే ప్రతి భక్తుడు ఏదో కోరిక కోరడం.. అందుకోసమే ఆయన్ని దర్శించుకోవడం చేస్తున్నారు, ఒక్కరు కూడ ఆయన క్షేమ సమాచారాలు విచారించ లేదు..!!  బహుశ నేనొక్కడీనే అనుకొంటాను.. "ఎలా వున్నావయ్యా, అంతా క్షేమమే కదా.. కుశలమేనా" అని కుశలోపరి ప్రశ్నలతో పలకరించి... అక్కడ నుండి మున్నార్‌కు బయలు దేరాం.




  మున్నారు పచ్చని ప్రకృతి అందాలలొ ఓ రెండు మూడు రోజులు గడిపేసి మూడో రోజున తెల్లారు జామునే హైదరాబాద్‌కు బయలు దేరాం. మద్యలో మధురై మీదుగా ప్రయాణం చేసి మరసటి తెల్లారు జామున రెండు గంటలకు ఒక ఫ్రెండ్‌ని కర్నూల్‌లో అతని ఇంటి వద్ద దింపేసాము. బాగా డ్రైవ్ చేసే మూడ్‌లో వుండటం మూలాన అక్కడే నిద్రకు ఉపక్రమించకుండా.. అలానే హైదారాబాద్‌కు బయలు దేరి తెల్లారు జామున ఆరుగంటలకు నా గమ్య స్థానం చేరుకొన్నాం.  దాదాపు 24 గంటలు నిర్విరామంగా డ్రైవ్ చేయడం..అందునా  వర్షంలో.... అదొక అడ్వేంచర్.. అనుభూతినిచ్చింది.  నా స్టామినా మీద నేనే ఒక ప్రయోగం చేసుకొన్నాను.



 మొత్తం పదిహేను రోజుల పాటు 3,600 కిలోమీటర్ల  పచ్చని ప్రకృతిలో ప్రయాణం  చేసి..చేసి పచ్చగా మారిపోయాను.... నేనొక్కడినే డ్రైవ్ చేయడం.... ఒక ఆనందం. ఫ్యూచర్‌లో దేనికి పనికిరాకుండా పోయినా "డ్రైవర్" ఉద్యోగం చేసుకోనైనా బతకొచ్చనే ధైర్యం వచ్చిందబ్బా..!

  ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మొత్తం ఈ ట్రిప్ అంతా నాకు కొత్తే.. ఏ దారులు తెలీవు, కాని "గూగుల్" మ్యాప్ ద్వారా మొత్తం తిరిగాను. గోవాలొ గల్లీ గల్లీ తిరిగాను. అస్సల్ ఎటుపోతే ఏది వొస్తుందో..! ఎక్కడికి చేరుతామో కూడ తెలియని నేను. పుర్తిగా గూగుల్ మ్యాప్ మీద ఆదార పడ్డాను.  
ఎక్కడ.. ఎన్ని కిలోమీటర్ల్ వద్ద.. ఎన్ని మీటర్ల వద్ద ఎటువైపు మలుపు తిరగాలో కూడ ప్రతీది చెబుతూ వచ్చింది ఆ గూగులమ్మాయ్..గొంతు మాత్రం యమ స్వీట్. ఒకో సారి దగ్గరి దారిలో తీసుకెళ్లి గమ్యం చేరుస్తుండేది..! ఒక వేళ దారి తప్పోయినా ..? తప్పోయిన దారి నుండి మళ్లీ డైరెక్షన్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది పాపం ఆ గూగుల్ అమ్మాయి... ఎంత మంచిదో. ?   జై గూగులమ్మాయ్..!!




 తర్వాత ప్రాముఖ్యత కలిగిన ఒక్కో ప్రాంతం యెక్క వివరాలు, ఫోటోస్‌తో మరో పోస్ట్ పెడతాను.













  నా రోడ్ ట్రిప్‌లో భాగంగా ఆరవ రోజు..    హోటల్ రూమ్‌లో పొద్దున్నే ల్యాప్ టాప్ ముందర కూర్చోని చుట్టు పక్కల ఏమేమ్ వున్నాయో చూడదగ్గ ప్రదేశాలంటూ వెదుకుతూ కుర్చున్నాను. మా టూర్ ఫ్రోగ్రామర్ మాత్రం ఇక్కడ దగ్గరలో ఏవి లేవు అన్ని వంద కిలోమీటర్ల్ దాటి వెళ్లాలి దానికన్నా "ఆగుంబే" వెళ్లిపోవడం మంచిదంటూ కూర్చున్నాడు. నాకేమో చుట్టూ వున్న చూడదగ్గ ప్రదేశాలను చూడకుండా వెళ్లడం ఇష్టం లేదు. గూగుల్ సెర్చ్‌లో మంచి ఆర్కిటెక్చర్ వున్న దేవాలయం ఫోటొ కనపడ్డది. ఆ ఫోటో పట్టుకొని అదెక్కడ... అని వెదికితే..  మేముంటున్న షిమొగా వూరుకు 90 కిలోమీటర్ల దూరంలో వున్నదని చూపిస్తున్నది.  మా టూర్ ఫోగ్రామర్ మాత్రం మళ్లీ వెనక్కు 90 కిలోమీటర్ల్ వెళ్లడం ఎందుకు "ఆగుంబే" దారిలొ ఏవైనా వుంటే చూసుకొంటూ వెళ్లిపోదాం అని చెబుతున్నాడు.  నేను ససేమిరా అంటు పట్టు బట్టి బయలు దేరాం.

 వాస్తవంగా జోగ్ ఫాల్స్ నుండి షిమొగాకు వచ్చే దారిలొ "సాగర్" అనే వూరు వున్నది. మేము ఆ వూరు మీద నుండే వచ్చి షిమోగాలో నైట్ హాల్ట్ చేసాం. ఇప్పుడు మేము వెళ్తున్న ఆ దేవాలయం సాగర్ వద్ద నుండి ఓ మూడు కిలోమీటర్ల్ లోనకు ప్రయాణించాలి.  తిరిగి వెనక్కు వెళ్లి చూడటం అంత అవసరమా అని మిత్రుల ఆలోచన.. ! ఫోటోలో ఆ ఆర్కిటెక్చర్ చూడగానే ఆకట్టుకొంది...!


  సాగర్ నుండి మూడు కిలోమీటర్లు దూరంలో ఎడమ వైపుకు వెళ్లాక ఈ "ఇక్కేరి" దేవాలయం కనపడ్డది. అప్పటి వరకు అయిష్టంగా వచ్చిన ఇద్దరు మిత్రులు..ఆ దేవాలయం ముఖ ద్వారం చూడగానే మొహాలు విప్పారాయి.ఆ ఆర్కిటెక్చర్....ఆ పచ్చని ప్రదేశం మద్యలో ఆ కొత్త రకమైన రూపురేఖలతో కనపడుతున్న దేవాలయం చూడగానే వీరి మొహాల్లో ఆశ్చర్యంతో కూడిన మైమరుపు...  హమ్మయ్య అనుకొన్నాను నాలోపల...! అది గాని అతి సాదారణంగా వుండుంటేనా...?? అంతే  " చెబితే విన్నావా.. చూడు ఏవైనా బాగున్నదా.. ఇలాంటివి మనూళ్లో లేవా ఏంటి.. వీటి కోసం అన్నేసి గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి రావాలా" అంటు నామీద దాడి చేసేవాళ్లు.


  లోపలి వెళ్లగానే ఆ శిల్పాలను.. వాటిని మలిచిన తీరును చూస్తూ అబ్బరపడిపోతున్నాం.  ఫోటోస్ తీసుకోవడానికే సత్తాను చేతుల్లోకి తెచ్చుకొంటూ ఉత్సాహ పడిపోతున్నాం అందరం. అదో రకమైన శైలి అవి. దేవాలయం పైన మాత్రం ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కనపడుతున్నది. మండపాలు మరో శైలి.. ఇలా చాలా రకాలు కనపడుతున్నాయి.  గుర్తించడం నాబోటి అఙ్ఞానికి చాలా కష్టం.


 మరో వైపున శిల్పం మొత్తం ఆనవాలే లేకుండా కేవలం పాదాలు మాత్రమే మిగిలి వున్న శిల్పం గుడికి దూరంగా అదే ప్రహరి మద్యలో ఒక మండపం మీద వున్నది దాని చుట్టు మరి కొన్ని ద్వంసమైన కళారూపాలు వున్నాయి.

 లోపల గర్భ గుడికు ముందు శిల్పాలతో చెక్కిన పదుల సంఖ్యలో స్థంభాలతో కూడిన పెద్ద హాల్ వున్నది. అక్కడ ఫోటోస్ తీయడానికి తగినంత వెలుగు లేకపోవడంటొ ఫోటోస్ సరిగ్గా తీయలేకపోయాను. లోపలికి కెమెరా ట్రైపాడ్ అనుమతి లేదట.


   దాదాపుగా ఓ గంటన్నర సమయం ఫోటోస్ తీయడానికే గడిచిపోయింది. అక్కడ నుండి తిరిగు ప్రయాణానికి కారులొ సిద్దమవుతూ.. అక్కడే వున్న ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ చిరుద్యోగిని కలిసి చుట్టూ వున్న మరిన్ని చూడతగ్గ ప్రదేశాల వివరాలు తెలుసుకొందామని కారులో నుండి అతని వద్దకు వెళ్లాను. అలా వెళ్లడం వలన నాకు మరింత చరిత్ర తెలుసుకొవడానికి దోహద పడింది. ఒక రకంగా నా బుర్రకు మేత దొరికింది. నిజంగా ఆ క్షణం అలా సమాచారం సేకరించాలనే తలంపు రావడమన్నది లక్కీనే అనుకోవాలి.


 ఆ చిరుద్యోగిని కాస్త కదపగానే మెల్లి మెల్లగా చరిత్ర చెప్పడం మొదలు పెట్టాడు. బయలు దేరాలనుకొన్న ఇద్దరు మిత్రులు కూడ వచ్చి చేరి మళ్లీ తిరిగి ఆయనతో పాటు ఆ చరిత్ర వింటూ ఆశ్చర్యపోతూ మళ్లీ మరికొన్ని మేము చూడ కుండా మిస్ అయినా శిల్పాల ఫోటోస్ తీసుకోవడం మొదలు పెట్టాం.


 ఆ టెంపుల్ గురించి ముద్రిత సమాచారం అక్కడ హింధీలో వుండటం వలన కేవలం ఆ ఆర్కియాలజీ డిపార్ట్‌మెట్ం చిరుద్యోగి చెప్పిన చరిత్ర విశేషాలనే నేనిక్కడ ఇస్తున్నాను.  ఇవి ఎంత వరకు అథింటికేట్ అన్నది నేను కూడ చెప్పలేను గానీ.. .. ఆయన మాటల్లోనే....

 కేలడీ నాయకులు అని పిలువ బడుతున్న  చౌడప్ప నాయక, సదాశివ నాయక, చిక్కశంకర నాయక ( చిన్న శంకర ), దొడ్డ శంకర నాయక ( పెద్ద శంకర ),శివప్ప నాయక, అక్కవ, కెలడి చెన్నమ్మ అనే ఏడుగురు రాజులు ( విక్కీలో మాత్రం మొత్తం 17 మంది రాజుల పేర్లు చెబుతున్నది ). కెలడీ రాజ్యంలొ బంగారు విరివిగా దొరుకుతుంది. వీరి బంగారను అక్కడుకు, విజయనగరం సామ్రాజ్యపు వజ్రాలు వైఢూర్యాలు వీరికి ఇచ్చిపుచ్చుకొనే ప్రాతిపదికన వీళ్లు విజయనగర రాజులకు సామంతులుగా కెలడీని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించే వారట. అలా 24 క్యారెట్స్ బంగారం అనే కొలతను వీరి నుండే ప్రారంభమైందట. వీరి పాలన దాదాపుగా 250 సవంత్సారల పైనా సాగింది. (1540 - 1760 )

 వీరి పాలనలో బంగారు నాణేలు అర్థ చంద్రుడు, పూర్తి చంద్రుడు ఆకారంతో చలా మనిలో వుండేవట. వీరి హయాంలోనే 15 వ శతాబ్దంలో ఈ ఇక్కేరిని రాజధానిగా చేసుకొన్నాక ఈ అఘోరేశ్వర దేవాలయం నిర్మించారు. ఇది పూర్తిగా నాలుగు రకాల శైలితో నిర్మించారు. ద్రవిడ శైలి, హోయసల శైలి, చాళుక్య శైలితో పాటు గుడి పైన వుండే గోడలు "ఇస్లామిక్" శైలితో వుంటాయి. అదే ఇక్కడి ప్రాముఖ్యత. మరొక విషయం భారతదేశంలొ దేవాలయాలన్నీనూ తూర్పు దిక్కుకు ముఖ ద్వారం వుండేలా నిర్మిస్తారు. కాని ఈ ఇక్కేరి దేవాలయం మాత్రం ఉత్తర దిక్కకు ముఖ ద్వారం వుంటుంది.


 అంతే కాకుండా దేవాలయానికి ముఖ ద్వారం వద్దనే "నంధీశ్వరుడి" మండపం వుంటుంది ఇదొక కొత్త శైలి. అందునా గర్భ గుడిలోని ప్రధాన విగ్రహానికి చాలా దూరంలో (58 అడుగులు) వున్నది. మళ్లీ గర్భ గుడిలొ మరొక అమృత శిలగా పిలవబడుతున్న ట్రాన్స్‌పరెంట్ నంధీ విగ్రహం వున్నది. చీకటిలో టార్చి లైట్ వెలిగించినా ఆ వెలుగు ఆ విగ్రహం గుండా మరో వైపుకు ప్రవహిస్తుందట.




 ఇక ఈ అఘోరేశ్వరుడి విగ్రహం 32 చేతులలొ 32 ఆయుధాలు ధరించి వుంటుదట...! ఇక్కడ ఈశ్వర పార్వతీల విగ్రహాలతో వుండే పీఠం పాద, జగతి,పట్టి, పద్మ,కళా, పట్టి,వేదకి అనే ఏడు పీఠాలతో నిర్మించారట. ఏడవ పీఠం మీద 32 మందిని స్త్రీ దేవతా మూర్తుల శిల్పాలను మొలిచారట. వాటిని "శక్తి పీఠం" గా పిలువ బడుతున్నారు.




ఇక అన్ని గుళ్లల్లోను వుండే "రతి భంగిమల" విగ్రహాలు ఇక్కడా చెక్కబడి వున్నాయి. నేనిప్పటి వరకు చూసిన ప్రతి హిందూ దేవాలయాలలో ఈ వాత్సాయనుడి రతిభంగమలు చూస్తూనే వున్నాను. బహుశ ప్రపంచానికి ఈ దేశం నుండే సెక్స్ ఎడ్యుకేషన్ ప్రారంభమైందేమో అని అనిపిస్తూ వుంటుంది నాకు. మద్యలో ఏర్పడిన నాగరికత పౌర సమాజం నుండి వచ్చిన మత పెద్దలు వీటిని సమాజ హితం కోసమంటూ కొన్ని అంక్షలు పెట్టడం వలన అయితేనేమి..? సెక్స్ అన్నది కేవలం "మగవాడి" సామర్థ్యానికి, గొప్పదనానికి ప్రతీక అనే ఒక భావజాలంలో వుండడం వలన అది నలుగురిలో ఒక సబ్జెక్ట్ లాగ మాట్లాడుకొనే దశను కోల్పోయి అదొక అశ్లీలత, బూతు వ్యవహారంగా భౌతిక ప్రపంచంలో చలామని కావడం మొదలయ్యింది.

 మేము అక్కడున్నప్పుడే కొందరు కాలేజీ యువతీయువకులు అక్కడికొచ్చారు. అందులొ ఉత్తర, దక్షణ భారతదేశీయులు వున్నారు. అందరిలాగ ఒకరిద్దరు యువకులు ఈ భంగిమలు చూడగానే మొహం విప్పారి తోటి వారికి చెప్పాలనే ఉత్సాహంతో వెర్రికేక పెట్టి చూపుతుండగా మరి కొందరు తమతో వున్న అమ్మాయిలకు కూడ చూపి వాళ్లెలా ఫీల్ అవుతారో అని గమనించసాగారు.  దానికా ఒకరిద్దరు అమ్మాయిలు "హ్మ్..దానిదేమున్నది అవన్ని సహజం అప్పట్లో.. దేవాలయాల్లో అదొక అంశం" అంటూ అదొక సైన్స్, సోషల్ సబ్జెక్ట్ లా మరొక సబ్జెక్ట్ అనే భావంతో ఎటువంటి వికారాలు, అసభ్యమైన కోణాలు లేకుండా చర్చించుకోవడం మొదలు పెట్టారు.

 ఇక్కడ ప్రభుత్వాలు వెబ్‌సైట్స్ మీద బ్యాన్ విదిస్తే విదించొచ్చు కాని ఇలాంటి దేవాలయాలలొ బహిరంగంగా వున్న ఈ భంగిమలను చూడకుండా ఎవరు ఆప లేరు కదా..?




 ఇక దేవాలయం విషయానికొస్తే..

  ఇంకాస్త లోతుగా పరిశీలిస్తే చాలా చాలా సాంకేతికమైన విషయాలు బాగా తెలుస్తాయి. అంత టెక్నికల్‌గా నిర్మించారు ఈ దేవాలయాన్ని.

 ఇక్కడికి చేరాలనుకొనే దారి. కర్నాటకలోని జోగ్ ఫాల్స్ నుండి షిమోగా వెళ్లే దారి మద్యలో "సాగర్" అనే తాలుకా ఎదురవుతుంది. ఆ వూరి నుండి లోపలికి ఓ మూడు కిలోమీటర్ల్ ప్రయాణిస్తే ఈ "ఇక్కేరి" టెంపుల్‌కు వెళ్లొచ్చు.  షిమోగా నుండి 90 కిలోమీటర్ల్ సాగర్ వైపు ప్రయాణించినా ఇక్కడికి చేరుకోవచ్చు.

 వీటి చుట్టు పక్కల ఇంకా చూడాలసిన ప్రదేశాలు చాలా వున్నాయి. మాకున్న సమయభావం వలన అవన్నీ చూల్లేకపోయాం. కేలడి వూరు అందులోని టెంపుల్, అక్కడే వున్న కేలడీ రాజుల కోటలు నాలుగు వున్నాయి.  ఇవే కాక చాలా చాలా పచ్చని లాండ్ స్కేప్స్ చాలా వున్నాయి.  ఇక్కడ నుండి ఆగుంబే వెళ్లే దారిలొ "తీర్థ హల్లి" అనే మరొక వూరు వొస్తుంది. అబ్బో ఆ వూరు చుట్టు కొన్ని కిలోమీటర్ల్ ప్రయాణిస్తే చాలు ఎన్నో జలపాతాలు, పచ్చని ల్యాండ్ స్కేప్స్, సరస్సులు బోలెడు చూడొచ్చు. మొత్తం పచ్చదనమే..ఎక్కడ చూసినా కనుచూపు మేర పచ్చదనమే కనపడుతుంది. ప్రకృతి ఆరాధకులకు పండగే పండగ.........!!

 ఈ ఇక్కేరి రాజధాని గురించి మరింత క్షుణ్నంగా సమాచారం కోసం గూగుల్‌, విక్కీలో చాలా దొరుకుతుంది. అక్కడ మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

మరి కొన్ని ఫోటోస్.......!!


      అప్పట్లో  ఎన్నేసి రకాల స్త్రీలకు జడ కుచ్చులు వేసారో ఈ శిల్పంలో చూడొచ్చు.....


     అప్పటి అంతపుర స్త్రీలు ధరించిన "వ్యానిటీ బ్యాగ్" ఈ చిత్రంలో..!!


      ఇస్లామిక్ పరిపాలనలో సింహాలకు ముస్లీమ్ రాజుల్లా వుండే వారి గడ్డాలనే ఇక్కడున్న సింహాలకు ముస్లీమ్ సింహాల్లాగా శిల్పాలను అక్కడక్కడ చెక్కించారు.
































About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs