అసుర సంధ్యవేల -
    పడమటి ఆకాశం నెత్తుటి మడుగులా ఉంది.
పల్లెల కేసి గుంపులు గుంపులుగా ఎగిరే కాకులు ఆకాశం నేపధ్యంలో .. ఎర్రదనం మీద విదిలించిన నల్లటి సిరాచుక్కల్లా వున్నాయి.
  మితి మీరిన వేగంతో తార్రోడ్డు మీద దూసుకెళ్ళే లారీలు,బస్సులు  పాదచారుల్ని భయపెడుతున్నాయి.
  రోడ్డుకు ఇరువైపుల పచ్చగా కలకలాడే వేరుసెనగ పైరు మద్యన్నించి గడ్డిగంపలు తలమీదుంచుకొని పల్లెకేసి అడుగులేస్తూ వున్నారు ఆడవాళ్ళు.
  రుమాలు విదిల్చి భుజానేసికొని ఓసారి వెనక్కి తిరిగి చూశాడు రామిరెడ్డి.
లోతుగా తెగిన ముగ్గుపిండి గని మూలమూలలకు అతని చూపులు పరుగెత్తాయి.
 దరుల పైకి చేర్చబడి గుట్టలు గుట్టలుగా గోధుమవర్ణపు ముడి మట్టి.  కొంచం దూరంలో పిండిని గుండుతిప్పి జల్లిపట్టి  తెల్లటి ఆకారం వచ్చింతర్వాత గోతాల కెత్తి వుంచిన విశాలమైన కళ్ళపు దృశ్యం.
 దక్షిణపు దెస దరికేసి ఓసారి పరిశీలనగా చూసి నిట్టుర్చాడు ఆయన.  కూలీలంతా పెందలాడే వెళ్ళిపోయారు.  మిగిలి ఉన్న ఐదారుమంది అంతరంగికులు సామాన్లు సర్ది ఆయన వద్దకొచ్చారు.
కాపలా మనిషికి జాగ్రత్తలు చెప్పి అందరూ దారిబట్టారు.
కొంతదూరంలో గారగడ్డలజేడెల కవతల ఏరు బావురు మంటోంది. వందగజాల దూరం నడిచి తార్రోడ్డు ఎక్కారు.
  వారం దినాల కిందట కురిసిన వాన నీళ్ళు రోడ్డు పక్క గుంటల్లో ఇంకా యిగిరిపోలేదు.
 తనతోటి మనుషుల్లో యవ్వారం జేస్తూ రోడ్డుపక్కగా నడుస్తున్నాడు రామిరెడ్డి.
  వాళ్ళ సంభాషణ గని విషయాల పైకి మల్లింది.
 " గని అంతా దక్షినం పక్కకు మల్లుతూ వుంది రెడ్డోరు !  ఆ పక్క మంచి మట్టి తేల్తా వుంది,  జల్లిబోసి తయారు జేసినట్లు తెల్లటి పిండి...మంచి గోతాల కెత్తినా ఇబ్బందిలే..  మనమెప్పుడయనా గని ఆ దెసకు నరుక్కుంటూ పోవాల్సిందే.." చెప్పాడు మద్దిలేటి. " నారమ్మ  సేను కొనకుంటే గాని కుదర్దుబ్బా  ! " ముక్తాయింపుగా  అన్నాడు.
  " కొనాలబ్బీ ! "  సాలోచనగా చెప్పాడు రామిరెడ్డి.
 " యేదీ - ఆ ముండ దారికొస్తే గద ! మనమంటే సయించేట్టు లేదు.  మనపేరు జెప్పితే యిచ్చేట్టు లేదు. మామీద ఎందుకో కసి బెంచుకుంటా వుంది  ఆమెకు మేమెప్పుడూ సెరుపు జేసిందిలే...యిబ్బంది బెట్టిందిలే..? "
  " యియ్యక..  సొంతంగా గని తొవ్వుద్దేం ? " రంగనాయకులు అన్నాడు.
  " ఏమో....? " 
 " ఏదేమన్నా గానీ - పదిరూపాయాలు ఎక్కువైనా బెట్టి కొనాల రెడ్డోరు ! ఆ సేను మనకు దక్కాల్సిందే..."
   " ఇస్తానంటే గదంటరా  ఆప్రయత్నాలన్నీ ! "
  గనికి దక్షిణం వైపు బైటబడుతూ వున్న నాణ్యమైన ముగ్గు పిండి  వరసల్ని  గురించీ,  దానికి సంబందించిన పొలాన్ని కొనాలిస్న అవశ్యకత గురించీ చర్చించుకుంటూ నడుస్తున్నారు వాళ్ళు.
  కొంతదూరం వెళ్ళేసరికి పొలాలకడ్డంగా పరుచుకు వచ్చి తార్రొడ్డులో కలిపిన బండ్లబాట ఎదురయ్యింది.
  బాటవెంట పడమటి దిశగా శివపురి.
  తార్రొడ్డు మీదుగా రెండు ఫర్లాంగుల దూరం నడిస్తే ఒంటికొట్టం.  పూర్వమెప్పుడో  అక్కడ ఒకటే కొట్టం( గుడెస) వుండేది, ఇప్పుడు దాదాపు ముప్పయి ఇళ్ళున్నా అదేపేరు స్థిరపడింది. శివపురి నుంచి అక్కడికి మరోదారి వుంది.
  " పొద్దున్నే రాండిబ్బీ ! " చెబుతూ మట్టిబాట మీద అడుగేశాడు రామిరెడ్డి.
  " గమిల్దాక  రమ్మంటావా రెడ్డోరూ..? "
  " ఎందుకురా ?  నాలుగంగల్లో  పోనూ.."  నవ్వుతూ బాటమీద ముందుకు  సాగాడు.
కూలీలంతా  తార్రొడ్డు వెంటా ఒంటి కొట్టం కేసి కదిలారు.
అప్పటికే దట్టంగా చీకటిబడింది గాని,  దశమి చంద్రుని కాంతి దాన్ని పారదోలేందుకు నడుం బిగిస్తోంది.
 కూతవేటు దూరంలోని  శివపురిలోంచి ఏవేవో శబ్దాలు కలగాపులగంగా విన్పిస్తున్నాయి.
నారమ్మ పొలం గురించిన ఆలోచన రామిరెడ్డిని తొలుస్తూనే వుంది, దాన్ని ఎట్లా సాధించాలో అర్థం కాకుండా వుంది.
నయన చెబితే లొంగడం లేదు.
భయాన చెప్పేందుకు సాధ్యపడటం లేదు.
 అలాగని స్వంతంగా ముగ్గుపిండి గని తవ్వించే స్థితిలో లేదు ఆమె.  పిండిని మార్కేట్ చేసుకొనే సత్తా ఆమెకు లేదు.
అమ్మగారి తరుపు దండోరు పల్లె మాసులు రావాలిసిందే  ప్రస్తుతం సమస్య అంతా దండోరు పల్లెలోనే వుంది. పేరుకు తగ్గ ఊరు అది, ఎప్పుడు దండుగా ఏర్పడి గొడవలు చేసుకోవడమే.
  కొట్టుకొని కేసులు పెట్టుకొన్నప్పుడంతా సుబ్బారెడ్డి వర్గం తమ వూరికోచ్చి  తమ యిళ్ళవద్దా, పొలాల వద్దా, కల్లాల వద్దా ఆశ్రయం పొందుతారు.
 అవతలి  రంగారెడ్డి వర్గం నారమ్మ బంధువులది, వాళ్ళకు తమమీద మంట.  వాళ్ళ శత్రువులకు ఆశ్రయమిస్తున్నామని కోపం. అందుకే నారమ్మ పొలం తమకు అందకుండా చేస్తున్నారు.
     ఊర్లోంచి మనుషుల గొంతుకలు రోజుటికంటే ఎక్కువగా శబ్దిస్తూ విన్పిస్తున్నాయి.
వాతావరణం కొంత భిన్నంగా ఉన్నట్లనిపించింది.
అప్పుడు గుర్తొచ్చింది  రామిరెడ్డికి - ’ ఆరోజు దసరా ’ అని.  సంబరాలు చేసుకొంటున్నారు కాబోలు.
ఏవేవో మారువేషాలు, .... కుంకుమ చల్లుకోవడాలు..
గ్రామం దగ్గరయ్యేకొద్దీ కొలాహలం స్పష్టమవుతోంది.
వెన్నెల వెలుగు లోకాన్ని పూర్తిగా ఆక్రమించుకొంది.
చుట్టూ వేరుసెనగ పైరుతో కూడిన చేలు......
  దారిపక్కగా  కంచెలాగా నాలుగు చాళ్ళు ఏపుగా వెరిగిన  జొన్న...
ఎదురయ్యే వాళ్ళుగానీ,  వెనుకనించి వచ్చేవాళ్ళుగానీ  లేకపోవడం వల్ల దారంతా ఏదో  ఒంటరితనం ఆవహించింది......
  మెల్లిగా తనలో తనే.. నవ్వుకొన్నాడు రామిరెడ్డి.
  తోడు కోసం చూడకుండా తలొంచుకొని  నడిచిపోవడం తనకలవాటు.
తన అన్నగానీ,  తమ్ముడుగానీ అట్లా కాదు.  వెంట మంది లేకుండా అడుగు కూడా కదపరు.
తార్రొడ్డునించి వూరిని కలిపే దక్షిణం వైపు రోడ్డుమీద ఏదో వాహనం పరుగెడుతూ వుంది.
  గ్రామానికంతటికీ ఆ రోడ్డే ప్రధానమైంది,  బస్సుకోసం వెళ్ళిన జనాలకు ఒంటి కొట్టం వద్ద పెద్ద అరుగు కూడావుంది.
  తను నడిచే యీ మట్టిబాట  తమ యిళ్ళ వద్దనించి తమ పొలాల గుండా తామే కష్టపడి  వేయించారు.  గనికి దగ్గరగా వుంటుందనే కారణమే కాకుండా,  తాము వూరంతా తిరిగి అటుకేసి వెళ్ళకుండా తమ యిళ్ళవద్ద నుంచే నేరుగా తార్రొడ్డు ఎక్కేందుకు అనువుగా వుంటుందనే ఆలోచనతో నిర్మించారు.
  ఊల్లో  యింకా సందడిగా వుంది
  పని వత్తిడిలో తను  దసరా సంబరం గురించి మరిచాడు. ఇంటి వద్దే వుండుంటే తనమీద కూడ కుంకాలు చల్లేవారు.
  ఇప్పుడు మాత్రం వదిలేస్తారనే గ్యారంటీ లేదు.
  గమిల్లో కాపలా వున్న ఆశ్చర్యపోనక్కరలేదు.
  ఊరు దగ్గరయ్యేసరికి  అతని అనుమానం  నిజమైనట్లుగా తోచింది.
  వెన్నెల వెలుగులో ఎవరో నలుగురు మనుషులు - తనకేసి వస్తున్నారు.
  వాళ్ళెవరయ్యిందీ పోల్చుకోనేందుకు  ప్రయత్నించే లోపలే  దగ్గరయ్యారు.
  " దండాలు  సోమీ  ! "   రెండు చేతులెత్తి నమస్కరించారు.
  " ఏ వూరబ్బీ మీది  ! "   నొసలు ముడేస్తూ చూశాడు.
  " మమ్మల్నెరగవా  సోమీ ?  పోయినేడు వుగాది పండక్కు.."  తమను  తాము పరిచయం చేసికొంటున్నాడు ముందున్న మనిషి.
  వాళ్ళను తనెక్కడా చూసినట్టు గుర్తులేదు.
  గని వద్దకు ఎక్కడెక్కడి వాల్లో  వస్తుంటారు.  ముగ్గుపిండిని పెట్టించుకొని పోతూంటారు.  తను వాళ్ళకు గుర్తే వుండొచ్చు,  తనే పోల్చుకోలేకున్నాడు.
  కొత్త వ్యక్తి తమను గురించి చెప్పుకొంటూ వుండగానే నలుగురిలో యిద్దరు ఆయన్ని దాటుకెళ్ళారు
  తమ చిరునామా వివరిస్తున్నాడు గాని అందులో ఏదో అస్తవ్యస్తత... పొందికలేని తనం.
  ఉన్నట్టుండి తనకెదురుగా అంతదాక మాట్లాడుతూ వున్న వ్యక్తి  తన పక్క మనిషితో కలిసి వెనక్కి వెనక్కి సర్దుకొంటూ ఒక్కసారిగా వేరుసెనగ చేలోకి గెంతాడు.
  రామిరెడ్డి ఆశ్చర్యపోయాడు.
  అతని మనస్సు ఏదో కీడు శంకించబోయే లోపలే వీపు మీద గుండ్రటి రాయిలాంటిదేదో  బలంగా తాకిన స్పర్శ... అది రాయో, మరేదో విశ్లేషించబోయే లోపలే వీపున పెద్ద శబ్దంతో విస్పోటనం..ఆక్షణమే మెదడు పనిచేయటం మాని శరీరమంతా విరుచుకు పడిపోయిన దృశ్యం.
  చేలో పడున్న వాళ్ళిద్దరూ చివుక్కున లేచి రోడ్డెక్కారు.
 చేతిలోని బాంబుల్ని మరోసారి సంధించిబోతూ వున్న రోడ్డు మీది మనుషుల్ని అడ్డుకుంటూ " సాల్సాలు...  పడిపొయ్యిండు.. పాండి..పాండి " అంటూ చేతులూపుతూ రోడ్డుదాటి దక్షిణం వైపు చేలమీదుగా కదిలారు.
  రెండో ప్రయత్నాన్ని విరమించి,  ఇంకా కొద్ది కొద్దిగా ఎగిరెగిరి పడుతూవున్న రామిరెడ్డి శరీరం కేసి ఓసారి తదేకంగా చూసి, పల్లెకేసి చూపులు సారిస్తూ తమవాళ్ళను అనుసరించారు బాంబులు విసిరిన వ్యక్తులు.
   బాంబుల్ని చేతబట్టుకొనే వేరు సెనగ చేలకు అడ్డంగా పరుగెత్తి వూరుచుట్టి ఏటి జేడెల  కంపచెట్ల మాటున అదృశ్యమయ్యారు వాళ్ళు.
  బాంబు పేలిన శబ్దం వూళ్ళో వాళ్ళకు కూడ విన్పించింది గాని, పండుగ ఉత్సాహంలో ఎవడో పటాసు పేల్చినట్లుగా భ్రమపడ్డారు.
  అక్కడి దృశ్యాన్ని పసిగట్టిన కుక్క వొకటి అదే పనిగా  కవిసి కవిసి మొరుగుతోంది,  ముందుకు వెళ్ళేందుకు ధైర్యం చాలక అక్కడక్కడే  పెనుగులాడుతోంది.

                                                                                            ( సశేషం )..........

7 comments:

మిగతా భాగాల కోసం ఎదురు చూస్తుంటాం. త్వరగా పోస్టండి.

baavundi tondara gaa migilinadi kudaa post cheyandi eduru chustu vunnamu.....

శైలి చాలా బావుందండి.

@Srinivas, చెప్పాలంటే, Tiru గారులకు..మీకు నచ్చినందుకు చాలా సంతోషం..అది ఒక 1960,70 మద్యలాల జరిగిన వాస్తవ సంఘటనే..! మొత్తం కథని అతి తొందరగానఎ పోస్ట్ చేస్తాను, మీరు చదివాక మీకనిపించిన విషయాన్ని తప్పకుండా ఇక్కడ కామెంట్ రూపంలో రాయండి.

చాల రోజుల తరువాత మన సైడ్ యాస లో సాహిత్యం చదివాను ... బావుంది .. మిగతా భాగాలు కూడా post చెయ్యండి

@ Fazlur Rahaman Naik

ఎప్పుడో పోస్ట్ చేసిన నవల ఇది, మొత్తం అన్ని భాగాలు వున్నాయి ఒకే వరుసలో...!!

తరువాత చూసాను అన్ని భాగాలు ...

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followersమాలిక: Telugu Blogs