సినిమా మొదలయ్యి పదినిమిషాలు అవుతున్నా సినిమాలోకి లీనమవలేక కుర్చీలో అటు ఇటు కదులుతున్నా, థియేటర్లోకి ఒకరిద్దరు పేక్షకులు ఇంకా వస్తూనే ఉన్నారు, కూర్చున్నవారిలో కొంతమంది అప్పటికే గుర్రుమంటూ నిద్రపోతున్నారు. తెరమీద చూస్తే పదినిమిషాలైనా ఒకచోట పాతేసిన కెమెరా కదలట్లేదు..కాని నటులే మూగెద్దెల్లా అటు ఇటు మాటలు లేకుండా కదులుతున్నారు, అదొక ఫ్రెంచి ఆర్ట్ సినిమా, మరో పదినిమిషాలు చూసినా తెరమీద ఉన్న నటుల కదిలికల్లో మార్పేమిలేదు, ఇక భరించడం నా వల్ల కాక బయటకొచ్చేసాను. నాలాగే బయటకొచ్చిన ప్రేక్షకుల్లో కొంతమంది పక్కనున్న మరో స్క్రీన్ 1 లోకి మరి కోంతమంది ఎదురుగా ఉన్న స్క్రీన్ 3,4 లలోకి ఉరుకులు పరుగులతో వెల్తున్నారు. వాటిల్లో ఉన్న సినిమాలు కూడ మొదలయ్యి అరగంట అవుతున్నది ఇప్పుడెల్తే సినిమా అర్థం కాదు అన్న ఉద్దేశంతో నేను ఆగిపోయాను. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారి ఆద్వర్యంలో ప్రపంచ సినిమా పండగ ( International Film Festival ) ప్రసాద్  " ఐ "మాక్స్ థియేటర్సలలో జరుగుతున్న వేడుక అది, తెలిసిన కొందరు ఫ్రెండ్స్ కనపడి విష్ చేసి గబా గబా థియేటర్స్‌లలోకి వెళ్తున్నారు. అందరు సినిమాప్రియులే.. డెలిగేట్ పాస్‌లున్నవారు నచ్చిన సినిమాకి నాలుగు స్క్రీన్‌లలోకి వెళ్ళవచ్చు. తర్వాత ’ ఐ ’ మాక్స్‌లో మాజికల్ రియలిజం మీద 11 గంటలకు ఒక సినిమా ఉన్నది ఆ షో కోసం ఎదురుచూడడం తప్ప చేసేదేమిలేదనకొని అలా నడుచుకుంటూ వెళ్ళి ఫుడ్‌కోర్ట్ ఎడమవైపుకునున్న ఐరన్‌గ్రిల్ ఉన్న సీమెంట్ దిమ్మె మీద కూర్చున్నాను. సమయం ఉదయం 9:30, అప్పుడప్పుడే జనాలు ఐ మాక్స్ లోనికి వస్తున్నారు. నాకు అలా ఒంటిరిగా ఉన్నప్పుడు చుట్టు ఉన్న జనాల్ని, వారి హావభావలని, ప్రవర్తనలని గమనిస్తూ కూర్చవడం ఒక అలవాటు.
        అది 2008  జనవరి, సాఫ్ట్‌వేర్ రంగంలో. వ్యాపారరంగంలో ఇంకా ఆర్థిక మాంద్యం మొదలవ్వని రోజులు.  సెజ్‌లు, రియల్‌‍ఎస్టేట్స్ వ్యాపారాలు ప్రళయతాండవం చేస్తున్న కాలమది,  వై.ఎస్ దేవుడి గారి పుణ్యామా అని ఆ రంగాలలో ఉన్నవాళ్ళు ఒక్కమాటున కోటీశ్వరులయ్యారు దాని ప్రభావం ఐమాక్స్ నిండా జనాల రూపంలో కొట్టొచ్చినట్లు కనపడుతున్నది, రంగు రంగుల టాప్స్, జీన్స్‌లలో ఐ మాక్స్ గ్రౌండ్ ఫ్లోర్, మొదటీ అంతస్తులలో యువత ఉరకలేస్తున్నారు, ఎక్కడ చూసిన గల గలమంటూ మాటలు, ఎగిరొచ్చి రెండవ అంతుస్తులో ఉన్న మాకు వినపడుతున్నాయి. పైనుండి చూస్తున్న నాకు కిందనున్న మొదటి అంతస్తులోని జనాలు, అలాగే ఎస్కిలేటర్ ఎక్కివచ్చే గ్రౌండ్‌ఫ్లోర్‌ ప్రదేశమంతా చాలా స్పష్టంగా కనపడుతున్నది, ఎక్కడ చూసిన 13 నుండి 25  ఏళ్ళవయసున్న యువతే కనపడుతున్నారు, అంతకన్న ఎక్కువ వయసున్నవాళ్ళు అక్కడక్కడ ఉన్నా వారంతా హైదరాబాద్ వాసులు కాదన్న సంగతి ఇట్టే గుర్తించవచ్చు, వారి చేతిలో ఉన్న ప్లాస్టిక్ బ్యాగ్స్ వారి పక్కనున్న ఐదారు సంవత్సరాల పిల్లలను చూడగానే  వారంతా నగరాన్ని సందర్శించడానికి వచ్చిన టూరిస్టలని అర్థమవుతుంది ,  వారిలో కొందరు ప్రసాద్ ఐ మాక్స్‌లో ఏదో కొన్నట్లున్నారు..వాటి దరలకే కరెంట్ షాక్ కొట్టిన నల్ల కాకుల్లా మాడిపోయారు పాపం, అందుకే బిక్కు బిక్కుమంటూ తినుబండారాలను, టాయ్స్‌ని, అక్కడున్నా వింత వింత గేమ్స్‌ని అదేదో అపురూపమైన లోకమన్నట్లు చూస్తూ నించున్నారు. రంగురంగుల డ్రస్సులతో ఉన్న హైదరాబాద్ యువతమద్యన ఆ టూరిస్టులు దిష్టి చుక్కల్లా కనపడుతున్నారు. అక్కడక్కడ నార్త్‌ఇండియిన్స్ జంటలుగా తిరుగుతున్నారు. కొందరు ఎగ్జిబిషన్ తత్వంతో హొయలు వొలికిస్తున్నారు, మరికొందరు తాము తెలిసినవారికి ఎక్కడ కనపడతామో అని గబగబా ఉరుకులతో ఏదో ఒక చాటుకు చేరుకుంటున్నారు.
           వీరందర్ని చూస్తన్న ‍నాదృష్టి మొదటిఫ్లోర్‌లో  ఏడుఎనిమిది మంది 14 నుండి 16 ఏళ్ళ వయసున్న అమ్మాయులు, అబ్బాయిలు నించుని ఉన్న ఒక గుంపు వద్ద ఆగింది, ఆ గుంపులో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు, తమ తమ జెబుల్లో నుండి పర్సులు తీసి డబ్బులు లెక్క పెట్టి ఒకరి చేతికిస్తున్నారు, బహుశ సినిమా టికెట్స్‌కి కలెక్షన్స్‌ చేస్తున్నట్లున్నారు., ఓ నలుగురు చేతుల్లో ఐదువందల రూపాయల నోట్లు తళతళమంటున్నాయి, అందులో ఒకబ్బాయి తన జేబునుండి ఒకటి రెండు వందరూపాయల నోట్లు బయటకు తీసాడు కాని ఇవ్వడానికి తటపటాయిస్తున్నాడు, అది చూసిన ఆ గుంపులోని ఒక అమ్మాయి ఆ అబ్బాయి వైపు అరచేతిని ఎత్తి చూపిస్తూ.." యెహె.." ఏంటి నీవు అన్నట్లు మొహం పెట్టి... వెంటనే తన పర్స్ తెరిచి అందులో నుండి మరో ఐదువందల రూపాయలనోటు తీసి ఆ తటపటాయిస్తున్న అబ్బయి తరుపున కలెక్షన్ చేస్తున్న అబ్బాయి చేతికి ఇచ్చేసి తటపటాయించిన అబ్బాయి వైపు తిరిగి " ఎప్పుడు బీద మొహం నీవునూ " అన్నట్లు చూసింది.. కేవలం మూడుగంటల వినోదంకోసం ఆ అమ్మాయి ఓ వెయ్యిరూపాయిలు తనకో లెక్కకాదన్నట్లు తీసి ఇవ్వడం నాకు చాలా ఆశ్చర్యమేసింది. అంతా సెజ్‌ల మహత్యం, పాపం తటపటాయించిన అబ్బాయి మొహం కాస్త కళతప్పింది, బహుశ ఆ అబ్బాయి తండ్రి ఏ చిరుద్యోగో లేక ప్రభుత్వ ఆఫీసులో చిన్న ఉద్యోగో అయుంటాడు అతని ఆర్థిక పరిస్థినిబట్టి  ఆ పిల్లవాడి ప్యాకెట్ మని ఉంటుంది, ఈరోజు ఇంటికెళ్ళాక జరిగిన ఈ సంఘటన వలన ఆ అబ్బాయి ఇంట్లో పెద్ద తాండవమే ఉండచ్చు అనిపిస్తున్నది, తండ్రి ఆర్థిక స్థితి మీద అవగాహన ఉన్నవాడు అయితే అర్థం చేసుకుంటాడు,  అవగాహన లేని వాడు అయితే  అలా అమ్మాయి ముందు తనో బికారిలా కనపడడం అన్నది అదో పెద్ద అవమానం లా ఫీల్ అయ్యి ఇంట్లో తండ్రి మీద శివతాండవమే చేస్తాడు. లేదా తండ్రి  భయం ఉంటే మాత్రం తల్లి వద్ద గొణుగుడు ఉంటుందనిపించింది నాకు. ఇది కాదుగాని ఓ మూడు గంటల వినోదం, సమయం గడపడానికి ఓ వెయ్యిరూపాయిల ఖర్చు చేసేంత స్థాయికి సగటు మనిషి జీవనప్రమాణాలు పెరిగాయా..? అన్నది నా ఆలోచన.  నేను కూడ ఎప్పుడన్న నాకో కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ బలవంతం మీద ఖచ్చితంగా పార్టి ఇచ్చిన సమయాలలో వేలు వేలు తీసి  ఖర్చుచేసినప్పుడు ఆ సమయంలో  నాగతాన్ని తలుచుకునేవాడిని, కేవలం కొన్ని గంటల ఆనందంకోసం వేలకు వేలు ఖర్చు పెట్టేంత స్థాయికి ఎదిగామా..?  అంతవసరముందా..?  ఒకప్పుడు పది పదిహేను సంవత్సరాల క్రితం అదే వెయ్యిరూపాయలతో ఒక నెలంతా  అంటే ముప్పై రోజులుకు సరిపెట్టుకోవాల్సి వచ్చేది.  పదిపదహేను సంవత్సరాలకే మన స్థాయి పెరిగిందా..? అలా ఆలోచిస్తున్న నాకు అప్పట్లో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తున్నది......

                                       *                                           *                                          *  

        అమీర్‌పేట్‌లో ఫ్యామిలీ ఇల్లే అయినా ఫ్యామిలికి పనికిరాని ఒక పెద్ద ఇంట్లో ఉండే వాళ్ళం, పర్మనెంట్‌‍గా ఆ రూమ్‌లో ఉండేది నలుగురమే అయినా ఎప్పుడు ఓ పదిమంది జనాలతో కళకళాడుతూ ఉండేది.  అమీర్‌పేట్‌లో అప్పటికింకా ఆధిత్య ఎన్‌క్లేవ్ అనే పెద్ద బిల్డింగ్ కట్టలేదు, మొదట్లో రూమ్‌లో తక్కువ జనాలు ఉన్నప్పుడు స్వయం నలభీమపాకమే..కాని రాను రాను మంది పెరగడంతో ఒక వంట మనిషి కూడ వచ్చి చేరంది, అంతే మారూమ్‌కి జనాల తాకిడి ఇంకా ఎక్కువైపోయింది, అందుకు కారణం మా రూమ్‌నుండి ఓ నాలడగులు వేస్తే బస్‌స్టాప్ చేరుకోవచ్చు, పని చూసుకొని రూమ్‌కి రాగానే వంట మనిషి చేసిన భోజనం రెడీగా ఉండేది..ఇంతకన్న ఇంకేమి కావాలి సుఖపురుషులకి. ఆ రూమ్‌లో నేను,  జె.ఎన్.టి.యులో కెమికల్ టెక్నాలజిలో ఎమ్.ఎస్.సి చేసి ఎన్విరాన్‌మెంటల్‌లో పి.హెచ్.డి చేస్తున్న జాషువా, భారత్ డైనమిక్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ చేస్తున్న ఎలక్ట్రానికి ఇంజనీర్ రవీంద్ర,  టెలీకమ్యూనికేషన్స్ సంబందించిన ఒక ఈపి.పి.ఎక్స్ సప్లైంగ్ అండ్ సర్వీస్ ఇచ్చే కంపెనీలో సాలరీ లేకుండా ట్రైనీ సర్వీస్ ఇంజనీర్‌గా పని చేస్తున్న వేణు, ఈ నలుగురం పర్మనెంట్ రూమ్‌మేట్స్.  వేణు, రవీంద్ర ఇద్దరు ఎలక్ట్రానిక్స్‌లో డిప్లమో చేసారు, హైదరాబాద్‌లో పగలు ఉద్యోగం చేస్తూ, సాయింత్రం I.E.T.E (A.M.I.E) క్లాస్‌లకు వెళ్తూ చదువుకుంటున్నారు.
  ఓరోజు ఎప్పటిలాగే ఉదయమే రూమ్‌మెట్స్ అందరు ఎవరివారి భోజనం క్యారియర్స్ కట్టుకొని ఆఫీస్‌లకు వెళ్ళిపోయారు, నేను దినపత్రిక చదువుతూ కూర్చున్నాను. కాసేపటికి దబదబమంటూ రూమ్‌తలుపు కొడుతున్న శబ్దాం ఈ టైమ్‌లో ఎవర్రా బాబు అనుకుంటూ వెళ్ళి తలుపు తీసి తీయకమునుపే దడేల్ మంటూ తోసుకుంటూ లోపలకి వచ్చాడు వేణు వగరుస్తూ..!
" ఏమైంది...? " వణుకుతున్న వేణు వైపు చూస్తూ అడిగాను.
" ముందు తలుపేయ్  చెబుతా " వణుకుతున్న మాటలతో అన్నాడు వేణు.
   వెంటనే తలుపులు వేసి వేణు వైపు తిరిగి వణుకు తగ్గేంతవరకు వేయిట్ చేసి మెల్లిగ అప్పుడడిగాను " ఏమయ్యింది "
వణుకుతగ్గినా పరిగెత్తి వచ్చిన ఆయాసం తగ్గలేదు , మెల్లిగా తన చేతిలో ఉన్న ఆర్.టి.సి టికెట్స్ ఫాయిల్ ఉన్న బంచ‌ని ఎత్తి చూపిస్తూ "  బస్ కండెక్టర్‌గాడు ..హ.... చిల్లర ..ఇవ్వట్లేదు..హ..ఆ.. గుంజుకొని ........ వచ్చాను " ఆయాసంతో రొప్పుతూ మద్యలో పదాలను మింగుతూ చెప్పాడు.
అప్పుడు గమనించా తన చేతిలో ఉన్న ఆ టికెట్స్ ఫాయిల్‌ని నేను, ఒక్కసారిగా ఉలిక్క పడ్డా వెంటనే తలుపుతీసి ఆర్.టి.సి బస్ కండక్టర్ ఎవరన్న వస్తున్నారా  అని వీధిపొడవునా చూసా .. ఎవరూ కనపడలేదు, హమ్మయ్య అని ఊపిరిపీల్చుకుంటూ " అయినా చిల్లర కోసం ఇలా టికెట్స్ ఫాయిల్‌ని తెస్తావా..! పాపం అతని ఉద్యొగం పోతుంది ఇచ్చేసి రాపో " అన్నాను నేను.
 ఉద్యోగం పోతుందన్న విషయం చెప్పగానే ఇంకాస్త భయపడిపోయాడు వేణు.
" ఊహ నావల్ల కాదు " అన్నాడు.
" సర్లే  ముందు నీ టెన్షన్ తగ్గనీ కాస్త స్థిమితపడు,  తర్వాత ఆలోచించి ఎవరో ఒకరు వెళ్ళి టికెట్స్ ఫాయిల్ ఇచ్చేసి వస్తాము " అన్నాను.

    వేణు ఆర్థిక పరిస్థితి అదో విచిత్రమైనది, నేను అప్పటికీ ఇంటి నుండే వచ్చే డబ్బమీద ఆదారపడి ఉన్నాను, రవీంద్రకి అప్రెంటీస్ వలన స్టైఫండ్ వస్తుంది, జాషువాకి పి.హెచ్.డి వలన కాలేజి నుండి స్టైఫండ్ వస్తుంది అదే కాక  తను టాటా సైన్స్ ఇన్‌స్టిట్యూట్ వారికోసం పి.హెచ్.డి  చేస్తున్నాడు, కాబట్టి ఆ సంస్థ నుండి కూడ  స్టైఫండ్ వస్తుంది, వేణుకి అటువంటి సదుపాయం ఏది లేదు. తన పుట్టిన ఊరు వైజాగ్  అతని ఇంటి నుండి డబ్బు రావడానికి మాలాగ అతనికి తల్లి తండ్రులు లేరు, తను పదవతరగతిలో ఉండగానే చనిపోయారు, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఒక్క అన్నయ్య, పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్న ఒక చెల్లెలు. మొదట్లో అన్నయ్య ఆర్థికంగా ఆదుకున్నాడు కాని అతనికి పిల్లలు పుట్టాక తమ్ముడికి సర్దుబాటు చేయడానికి సాద్యపడట్లేదు. చూట్టానికి సినిమా కష్టాల్లా ఉన్నా.. అవి నిజాలు. చివరకు హైదరాబాద్‌లో ఎక్కడో ఉంటున్న దూరపుబందువుల ద్వార మూడు రూపాయల వడ్డితో అప్పుతెచ్చుకొని చదువుకుంటున్నాడు.
       రోజూ అమీర్‌పేట్ వద్ద 10 వ నంబర్ బస్ ఎక్కి ప్యారడైజ్ వద్ద నున్న ఆఫీస్‌కి వెళ్తాడు, అమీర్‌పేట్ నుండి ప్యారడైజ్‌కి 1-25 పసలు చార్జీ, రోజు అదే బస్, అదే కండక్టర్ రెండు రూపాయల నోట్ ఇస్తాడు వేణు, పావలా లేదంటూ అర్ధరూపాయి మాత్రమే చేతిలో పెట్టేవాడు, రోజూ ఇదే తంతు. నెలలో ఎటులేదన్న 15 రోజులు అలా చిల్లర లేదంటూ పావలా ఇవ్వకుండా వస్తున్నాడు, అలా రెండు నెలలు చూసాడు, అప్పుడప్పుడు తనే బయట పావల చిల్లర మార్చుకొని కండక్టర్‌కి ఇచ్చి రూపాయి తీసుకునేవాడు, అయితే ఈ నెలలో దాదాపుగా 20 రోజులుగా పావలా ఇవ్వకుండా ఎగరగొట్టాడు ఆ విషయం ఆలోచిస్తూ. ఆ ఇరవైరోజుల పావలాలు లెక్క కడితే ఐదురూపాయిలుగా తేలింది అంటే రెండురోజుల రానుపోను బస్ టికెట్ ఖరీదు అది. వాటికి మల్లి వడ్డీ కట్టాలి అలా ఆలోచిస్తున్నాడు వేణు, బయట నుండి చూసే వారికీ అతని ఆలోచన అసమంజసంగా అనిపించవచ్చు, మరీ పావలా మీద అంతాఅలోచనా.. అనిపించవచ్చు, ఆహనాపెళ్ళంట సినిమాలోని కోటలాగ పిసినారి అనిపించవచ్చు,  కాని వడ్డీ తెచ్చుకునేందుకు వేణు పడే కష్టాలు  అంతా ఇంతాకాదు, వడ్డీ ఇచ్చే ఆ ఆ దూరపు బందువులు " ఉద్యోగం లేదు. మరే ఇతర సంపాదన లేదు వడ్డీతో పాటు అసలు ఎలా తిరిగి చెల్లిస్తావు..? " అని అడిగితే, " ఆరు నెలల్లో నా ట్రైనీ పూర్తి అవుతుంది తర్వాత జీతం ఇస్తారు దానితో నెలా నెలా కొద్ది మొత్తం ఇస్తూ చెల్లించగలను " అని ఎలాగో అలాగ సమాదానంపరిచేవాడు, అదీ రాత్రి 9 గంటల తర్వాత వారింటికి వెళ్తనే బందువులు ఉంటారు. ఆ సమయంలో దొంగల భయం ఎక్కువ ఆ ప్రాంతంలో, తోడుగా మేము ముగ్గరం వెళ్ళేవాళ్ళం.
     ఈరోజు అదే బస్సు..అదే కండక్టర్ మల్లి అదే వరస పొద్దున్నే బయట చిల్లర కోసం చూసాడు కాని మరీ అంత ఉదయమే ఎవరి వద్ద దొరకలేదు చేసేది ఏమిలేక బస్సెక్కాడు. రెండు రూపాయలు ఇచ్చాడు, కండక్టర్ ఎప్పటిలాగే  పావలా ఎగ్గొట్టి అర్ధరూపాయే చేతిలో పెట్టాడు, అంతే వేణుకి ఎక్కడ లేని కోపం వచ్చింది, " పావలా ఇస్తావా లేదా " సీరియస్‌గా అడిగాడు
" ఉంటే ఇస్తాగా "  కండక్టర్ తిరుగు సమాదానం
" రోజూ ఇలాగే పావలాలు ఎగరగొడుతున్నావ్ " ఉక్రోషంగా అన్నాడు.
" నీవే చిల్లర తెచ్చుకోవాలి, రోజూ ఎంతమందికని ఇవ్వనూ "
" అదంతా నాకు తెలియదు, ఈరోజు పావలా ఎలాగైనా సరే ఇవ్వాల్సిందే " పట్టుపట్టాడు వేణు.
 ఎవరితను కేవలం పావలా కోసం అంతలా పట్టుపడుతున్నాడు అనుకుంటూ బస్సులోని ప్రయాణికలంతా వింతగా చూసారు వేణువైపు.
నిండు గర్భినీలా ఉన్నది బస్సు..కండక్టర్ టికెట్..టికెట్ అని అరుచుకుంటూ ముందుకెళ్ళి కొద్ది క్షణాల్లోనే వెనక్కి వచ్చాడు, అప్పుడు బస్సు గ్రీన్‌పార్క్ హోటల్ రోడ్ నుండి ఎడమవైపు నున్న బేగంపేట్ ఫ్లైఓవర్ కు తిరిగింది,    వేణు మళ్ళి అడిగాడు కండక్టర్‌ని " పావాలా ఇస్తావా లేదా " అని.
" లేదని చెప్పాగా ఏంటి నీ నస " కసురుకున్నాడు.
బస్సు చాలా మెల్లిగా బేగంపేట ఫ్లై‌ఓవర్ ఎక్కుతూ ఉన్నది, వెనుక ద్వారం వద్దనే కండక్టర్ టికెట్స్ నెంబర్స్ చెక్ చేసుకుంటున్నాడు. వేణుకి కోపం ఆగట్లేదు..’ఏమి చేయాలి వీడిని ’ ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే ఏదో ఆలోచన  తట్టింది తన బుర్రలో..బయట ఫ్లైఓవర్ను గమనిస్తూఉన్నాడు.. బస్సు బ్రిడ్జి పూర్తిగా ఎక్కేంతవరకు ఎదురుచూసాడు, చివరి సారిగా మల్లి అడిగాడు,  ఈ సారి బదులివ్వకుండా చిరగ్గా చూసాడు వేణు వైపు బస్సు కండక్టర్, అంతే కళ్ళు మూసి తెరిచేంతలోపల కండక్టర్ చేతిలో ఉన్న టికెట్స్ తో ఫాయిల్‌ని లాక్కోన్నాడు, వెంటనే రన్నింగ్‌లో బస్సు దిగి వెనక్కి తిరిగి పరిగెత్తాడు, బస్సు అప్పుడే బేగంపేట వైపునకు బ్రిడ్జి దిగుతూ వేగం పుంజుకుంది. కండక్టర్‌కి ఒక్కసారిగా ఏమి జరిగిందో అని తెలిసేలోపల వేణు అప్పటికే అమీర్‌పేట వైపు బేగంపేట బ్రిడ్జి దిగేస్తున్నాడు, ఒక్క ఉదుటున కండక్టర్ బస్సులోనుండి దూకేసి వెనక్కు పరిగెత్తుతూ " అర్రే బాబు  నీ పావలా ఇస్తానురా... తీసుకో..ఆ టికెట్స్ ఉన్న ఫాయిల్ ఇవ్వరా..నా ఉద్యోగం ఊడిపోతుంది " నెత్తినోరు కొట్టుకుంటూ పరిగెత్తుతున్నాడు, ఒక పక్క బస్సు బ్రిడ్జి అటువైపుకి దిగుతూ వెల్తున్నది, ఇటు చూస్తే టికెట్స్ ఉన్న ఫాయిల్ పోయింది.. ఎటు వెళ్ళాలో కండక్టర్‌కి అర్థం కావట్లేదు..., కాని అప్పటికే మాయం అయ్యాడు వేణు.

                                    *                                          *                                        *

    ఫ్రెండ్స్ వచ్చాక నేను వారితో కలిసి రాణిగంజ్ బస్‌డిపోకి వెళ్ళి " బేగంపెట వద్ద ఎవరో ఇది పడేసి వెళ్ళారు " అని చెప్పి డిపోమేనజర్‌కి ఇచ్చేసి వచ్చాము. ఒక్క పావలా తక్కువయితే జీవితం గందరగోళం అవుతుందా..? కేవలం 25 పైసలు కోసం ఎంత పెనుగులాట....?? ఏంటో దిగువ మద్యతరగతి జీవితాలు......!.  అదే వేణు తర్వాత  IBM మేయిన్‌ఫ్రేమ్స్ నేర్చుకొని విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కొన్నాళ్ళు పని చేసి తర్వాత అమెరికావెళ్ళి వచ్చాక ప్రస్తుతం బెంగళూర్ ఎసుంచురాలో మేనేజమెంట్ స్థాయిలో ఉన్నాడు. గోల గోలగా అనిపించడంతో ఆలోచననుండి బయటకొచ్చి చూస్తే  సినిమాలన్ని వదిలినట్లున్నారు. నాచుట్టూ  జనంసంద్రం.. ప్రేక్షకులంతా చూసిన సినిమాల గురించి చర్చిస్తూ సందడి సందడిగా ఉన్నారు. కింద చూస్తే ఆ గుంపు లేరు బహూశ థియేటర్లోకి వెళ్ళుంటారనుకున్నాను.

          నేనొక్కడిని కూర్చొని ఉన్నది చూసి కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరకొచ్చి  " పద పద ’ఐ ’ మాక్స్‌లో సినిమాకి  టైమ్ అయ్యింది " పిలవడంతో  అక్కడ నుండి కదిలాను..

4 comments:

great story.
The great human tragi-comedy or comi-tragedy.

thanks for ur comment కొత్తపాళీ గారు.
హమ్మయ్య ఎట్టికేలకు ఒక కామెంట్ వచ్చింది.

చాలా బాగుందండీ.. పదిపైసలు, పావలా పాకెట్ మనీని భధ్రంగా కాపాడుకున్న రోజులు గుర్తొచ్చాయి.

కమల్ గారూ...,శ్రీకరమైన వినాయక చతుర్థి సందర్భముగా తెలుగు బ్లాగరులందరికి శుభాకాంక్షలు

హారం

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followersమాలిక: Telugu Blogs