.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

   ఉదయం ఎనిమిది గంటల్లోపలే సద్దినీల్లు తాగి ప్రయాణమై పెద్దిరెడ్డి యింటిముందు పోగయ్యారు కోర్టు వాయిదాకు వెళ్ళాల్సిన ఇరువైమంది జనం.
  బాలుడు మాత్రం పొద్దున్నే గనివద్దకెళ్ళాడు - తాను అక్కణ్నించే బసెక్కి రాగలననీ - కోర్టు సమయాన్ని అందుకోగలననీ.
    తొమ్మిది గంటలకు బస్సు వూర్లోకొస్తుంది.
  తిరిగి సాయింత్రం మరో ట్రిప్పు. - అంతే -
  ఊర్లోకి, ఒంటికొట్టానికి టికెట్టులో తేడా అర్ధరూపాయి,  ఈ కొద్దిదూరం నడిస్తే పదిరూపాయిలు మిగులుతుందిగదా అని ఓబుళరెడ్డి ఆలోచన.
  " గంట టైముంది రోడ్డుమీదికి పోతే యింగోక బస్సు ఏదైనా దొరుకుద్ది,  బెన్నేపోయి (తొందరగా = బెరీన, బెన్నే)  లాయర్ను కలవొచ్చు "  అంటూ అందర్నీ లేవదీసి దారిబట్టాడు.
  ఒంటికొట్టం స్టేజికి చేరుకోవాలి కాబట్టి వూరుచుట్టి బస్సుదారి వెంట మెల్లిగా నడుస్తున్నారు.
  గ్రామంలోని కొన్ని ఇళ్ళల్లోంచి వాళ్ళ కదలికల్ని  నిశితంగా గమనిస్తున్నాయి చాలా కళ్ళు.
  వాళ్ళు వూరుదాటి  సగం దూరం నడిచేసరికే నారమ్మ వర్గీయుల ఇళ్ళల్లోంచి పుట్టలు పగులగొట్టుకొన్నట్లుగా జనం బైటబడి వీధుల్లోకీ రాసాగారు.
  దాదాపు  అందరూ  కొత్తవాళ్ళే.
  దండోరుపల్లెకు చెందిన వాళ్ళూ, తమ తమ బంధువుల సంబంధీకుల పధకం ప్రకారం రాత్రే వచ్చి ఒక్కో యింటికి ఐదునించి  పది మంది దాక దాక్కుని వున్నారు.
  దాదాపు వందమంది జనం.
  అందరి చేతుల్లో ఈటెలు. గొరకలు, కత్తులులాంటి ఆయుధాలు, మరికొందరి కొందరు ప్రత్యేకమైన వ్యక్తుల వెంట బాంబులు బక్కెటలు.
  పెద్దిరెడ్డి వర్గం బస్సెక్కుతారని వాళ్ళు భావించారు.
  బస్సును ఆపటం సులభం కదా  !.
  పథకం కొంత దారి తప్పింది.
  ఊరుదాటి ఒంటికొట్టం కేసి కదలుతూ వున్నారు వందమంది జనం.
  ఒంటికొట్టం వద్దకెళ్ళిన తర్వాత ఎందుకో వెనక్కి తిరిగి చూసిన పెద్దిరెడ్డి గుంపుకు వెనకనించి వస్తోన్న జనసంఖ్య కన్పించి అదిరిపడ్డారు.
  "  అయ్యా !  ఆనాకొడుకులు మందినేసుకొని మనమీదికి వస్తాన్నెట్టుంది "  ఆదుర్దాగా అన్నాడు వెంకటరెడ్డి.
   "  అంతా కొత్తమాసులే,  రేత్రి వూరునిండా దించినట్టుండాది. అందరిసేతల్లో కొరముట్లుండాయి.  ఇప్పుడెట్టా జెయ్యాల మామా  ? "  మరో వ్యక్తి గొంతునిండా భయం.
  "  జనం జాస్తిగుండారు (ఎక్కువగా)  సేతల్లో ఆయుధాలుండాయి...అవిగో ఆపక్క బక్కెట్లు గూడా పట్టుకొస్తావుండారు.  అంటే బాంబులు గూడా తెస్చాండారు, మనకాడ సేతికట్టెలు కూడా లేవు రెడ్డోరు !.. తప్పించుకొనొపోతే బతుకుతాం..రాండి..పరుగెత్తుదాం రాండి..ఇట్లా గనులకాడికన్నా పోదాం..రాండి.."
   " నోర్ముయ్యిరా  ! "  వెంటనే అడ్డుకొన్నాడు ఓబుళరెడ్డి. అతను కూడా వచ్చే జనాల్ని చూస్తున్నాడు. వాళ్ళ చేతల్లోని ఆయుధాల్ని గమనిస్తున్నాడు. పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయిత్నిస్తున్నాడు.
   " వాల్లు  మనకోసమే వొచ్చేవాళ్ళే అయినా - యీ బస్సులు తిరిగే దోవలో, యీ వూరినడుమ, జనాల రద్దిముందు మనమీద అటాక్ చేయర్లే ! మీకా భయం పన్లేదు, ఎవ్వరూ పరిగెత్తేపని పెట్టుకోగాకండి " చెప్పాడు.
  పక్కనే వున్న బలరామిరెడ్డి అతని మాటలకు వత్తాసు పలికాడు.
  వాళ్ళ మాటలకు అడ్డుచెప్పలేకపోయారు జనం.  భయం భయంగా గుండెలు బితుకు బితుకు మంటోండగా రోడ్డుమీదే నిల్చుండిపోయారు.
  వెనకవచ్చే గుంపు - వాళ్ళకు వందగజాల దూరానికొచ్చి ఆగింది.
  వాళ్ళక్కూడా అనుమానంగా వుంది - ఇంతమంది జనాన్ని చూసి కూడా పెద్దిరెడ్డి గుంపు పారిపోకుండా నిల్చుందంటే వాళ్ళవద్ద బలమైన ఆయుధాలేమైనా వున్నాయేమోనని.
  ఇక్కడే అటాక్ చేద్దామా ? లేక బద్వేలులో అటాక్ చేద్దామా ?  అని చర్చించుకొంటున్నారు.
  ఇక్కడ దాడిజేస్తే పల్లెజనాల రద్దీలో తప్పించుకు పారిపోతారేమోనని అనుమానం. బద్వేలులో కోర్టు ముందరో, బస్టాండు వద్దో అయితే అందరు దొరికిపోతారు గదా !!
  వాళ్ళు ఎటూ తేల్చుకోలేక, ముందుకు వెళ్ళలేక తర్జనభర్జన పడుతోండే - అక్కడున్న జనం ఆ దృశ్యాన్ని వూపిరి పీల్చడం కూడా మరిచి చూడసాగారు.
  అక్కడ ఏదో జరబోతోందని అందరికీ అర్థమైంది.
  కొందరు దగ్గర్లోని పోలీస్ ఓట్‌పోస్ట్ కేసి చూశారు.
  ఇంకొందరు తార్రోడ్డు మీద సుదూరంగా చూపుల్ని సారిస్తున్నారు - బస్సేదయినా వస్తే సమస్య తీరిపోతుందని.
’ఇక్కడ అటాక్ చేయాలా ?  బద్వేలులోనా ? ’ అనే విషయం తేల్చులేకున్నారు నారమ్మ మనుషులు. కొండారెడ్డి ఏదేదో చెబుతున్నాడు.
  ముందుకు రాకుండా, వెనక్కి పోకుండా..ఏ నిర్ణయమూ తీసికోకుండా అక్కడే నిల్చున్న గుంపులోంచి ఉన్నట్టుండి ఓ కుర్రాడు " కోబలీ ! " అంటూ అరిచాడు - గుండెలు జలదరించేలా.
  వెంటనే మరొకడి గొంతు ఆప్రయత్నంగానే వానికి వంతపాడింది.
  ఇంకొకడు..వేరోకడు.మరొకడు..ఒకరివెంట ఒకరు హిస్టీరియావచ్చిన వాళ్ళలా అరుస్తూ యీటెలు పైకెత్తి, బాంబులు చేతబట్టి  " కోబలీ..కోబలీ..! "  అంటూ  అరుచుకుంటూ పెద్దిరెడ్డి గుంపు పైకి పరుగెత్తారు,  రోడ్డు పట్టక చేలల్లోంచి అడ్డంగా ఉరుకుతున్నారు.
  ఆప్రయత్నంగానే జరిగిపోయింది అంతా.
  వెంటనే ప్రతిస్పందించింది పెద్దిరెడ్డి గుంపు కూడా.
  ఓబుళరెడ్డిని, బలరామిరెడ్డిని బలవంతంగా ఓ యింట్లోకి నెట్టి తలుపేసి తాము మిద్దెలెక్కారు.
  ఒక్కసారిగా ఆగిపోయింది నారమ్మ గుంపు.
  దగ్గరకు వెళితే మెద్దెల మీంచి బాంబులేస్తారేమో ! ఆయుధాల్లేకుండా రారుగదా !
 మరెట్లా వాళ్ళను పడగొట్టాలి  ?
  తమవాళ్ళను కూడా మిద్దెలెక్కేలా పురమాయించాడు కొండారెడ్డి.
  ఓబుళరెడ్డి దాక్కున్న ఇంటికి దగ్గర్లోని మిద్దెలెక్కారు కొత్తజనం.
 అక్కణ్నించి ప్రత్యుర్థుల పైకి బాంబులు విసరసాగారు.
  పెద్దిరెడ్డి మనుషులు మిద్దెమీద పొగగూటి చాటున, గవ్వాజుల ( గవాక్షం) మాటున దాక్కుని ఎదుటి గుంపుమీద రాళ్ళు విసరసాగారు.
  గొడవ తారాస్థాయికి చేరుకొంది.
  బంకుల( టీ కొట్లు.) వద్ద జనమంతా కకావికలయ్యారు.
  యధేచ్చగా  బాంబింగ్ జరుగుతూ వుంది.
  మిద్దె చుంచులు వూడబెరికో, పగిలిన ఇటుకల్ని సేకరించో. కిందనుంచి తమ వాల్లు విసిరిన రాళ్ళు అందుకొనో శత్రువుల మీద ప్రయోగిస్తూ వాళ్ళను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు పెద్దిరెడ్డివర్గం మనుషులు.
  వాళ్ళ వద్ద ఆయుధాలు లేని విషయం అవతలి వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది. వాళ్ళల్లో హుషారు పెరిగింది. ధైర్యంగా ప్రత్యర్థుల్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించసాగారు.
  అప్పటికే యీ గొడవంతా శరవేగంతో ముగ్గుపిండి గనివద్దకు పాకింది.
  ఉలిక్కిపడి లేచి కూచున్నాడు బాలుడు.
  అక్కడ పన్జేసే జనాలందరికీ రెండుముక్కల్లో విషయమంతా చెప్పాడు, అందర్నీ తనవెంట రమ్మంటూ దాచిన బాంబుల బక్కెట్లను బైటకు లాగాడు.
 పక్కన్నే వున్న హరిజన వాడకు గూడ పాకింది వార్త.
  వాళ్ళంతా పరుగుల మీద గనివద్దకు వస్తున్నారు.
   బాలుడు బాంబుల బక్కెట పట్టుకొని మందుభాగాన పరుగెడుతోంటే జనమంతా అతని వెంట కదిలారు.
  యాభైమందో, మహా అయితే వందమందో వెంట వస్తారనుకొన్న జనం, నాలుగొందలకు మించేసరికి బాలుని కళ్ళవెంట నీళ్ళు ఉబికాయి.  తమమీద జనాలకు యింతటి అభిమానముందని అతనూహించలేదు.
  ఒక ప్రవాహంలాగా కదిలి ఒంటికొట్టం సమీపించారు వాళ్ళు. దగ్గరగా వెళ్ళకముందే మీంద మీంద (వెనువెంటనే) పది బాంబుల్ని నేలకేసి పగలగొట్టాడు బాలుడు.
  పకడ్భందీగా చుట్టబడిన పవర్‌ఫుల్ బాంబులు అవి. దిక్కులు పిక్కుటిల్లేలా శబ్దం చేశాయి.
  అప్పటికే ఓబుళరెడ్డి దాక్కున్న యింటిని చుట్టుముట్టి వున్నారు నారమ్మ గుంపు,  వాళ్ళను హుషారు జేస్తున్నాడు కొండారెడ్డి.
  తమకేసి వస్తోన్న జనప్రవాహాన్ని చూడగానే గుండెలు జారాయి వాళ్ళకు.  బాంబుల శబ్దం వినగానే వాటి శైలి అర్థమై బెదిరిపోయారు.  మిద్దెల మీదున్న కొత్తమనుషులు చావు భయంతో కొందకు దూకి పరుగెత్తటం మొదలెట్టారు.
  ఆ సరికే శివపురి ఔట్ పోస్ట్‌లోని పోలీసు కానిస్టేబుల్ అక్కడికి చేరుకొని వున్నాడు. తుపాకి చేతబట్టుకొని ఓ చెట్టు వద్ద నిల్చుని జరిగే తతంగాన్నంతా తిలకించసాగాడు.
  ’ బాంబులేసుకొంటూ  దూసుకెల్తున్నాడు బాలుడు ’
  అతనితోటి జనం దొరికిన వాళ్ళను దొరికినట్లు చితకబాదుతున్నారు.
  నారమ్మ జనమంతా చెల్లాచెదరవుతున్నారు.,  ప్రాణాలు అరచేతబట్టుకొని చేలకడ్డంగా పారిపోతున్నారు.
   ఆ ప్రాంతమంతా బాంబుల పొగతో నిండిపోయింది. చాలా మందిని చావుదెబ్బలు కొట్టి వదిలారు. చేతికి చిక్కిన ఇద్దరు కొత్త మనుషుల్ని పట్టుకొని చేతులు విరిచి పట్టి ఒకనికి చేతివేలు నరికారు, మరొకని ఎడమచెవి కోసి వదిలారు.
  బాంబుల పొగతో, హాహాకారాలతో, అట్టహాసాలతో, దరిద్రమైన తిట్లతో నిండిన అక్కడి వాతావరణాన్ని చాటుజేసికొని ఓ యింట్లో దాక్కున్నాడు ఓబులకొండారెడ్డి. తను పొరబాటున పెద్దిరెడ్డి మనుషుల కళ్ళ బడితే కొత్తవాళ్ళకులా చెవి, వేలు నరికి వదలరు... తలతీసేస్తారు.  అవకాశాన్నిబట్టి తను ఎవరికళ్ళబడకుండా అక్కణ్నించి జారుకోవాలి.
    తను దాక్కోన్న యింట్లోంచి బైటకొచ్చాడు పెద్దిరెడ్డి తమ్ముడు ఓబుళరెడ్డి.
   బాలుని కేసి మెచ్చుకోలుగా చూశాడు.
  కొత్తవాళ్ళు ఇళ్ళల్లో దాక్కున్నారేమోనని ఇల్లిల్లు తొంగిచూస్తున్నారు బాలుని మనుషులు.
  కిటికీలోంచి బైట్ విషయాలన్ని గమనిస్తోన్న కొండారెడ్డి కంటబడింది ఆ దృశ్యం. అతనికి ముచ్చమటలు పోశాయి, తనున్న యిల్లు కూడా సోదా చేస్తే జరిగే పరిణామమేమిటొ కళ్ళ ముందు దృశ్యమానమైంది.
  ఎంత త్వరగా అక్కణ్నించి తప్పించుకు పారిపోతే అంత క్షేమంగా భావించాడు.
  అదే సమయంలో తుపాకి చేతబట్టుకొని అవుట్ పోస్ట్‌కేసి పోబోతోన్న పోలీసు కానిస్టేబుల్ అతని కళ్ళబడ్డాడు.
  నడి సముద్రంలో తెప్ప దొరికినట్టుగా అన్పించింది అతనికి, ఇంతకంటే మంచి అవకాశం దొరకదనుకొన్నాడు.
  " ఓ సంజీవరాయుడూ  ! "  అంటూ కేకేశడు.
  పోలీసు తనకేసి చూసే లోపలే తలుపు తెరుచుకొని బైటబడుతూ " ఓ సంజీవరాయుడూ ! నిలబడన్నా ! - నేనొస్తాండ.. నిలబడు.."  అంటూ పోలీసుకేసి పోబోయాడు.
  అతన్ని పోల్చుకొన్నాడు కానిస్టేబుల్ సంజీవరాయుడు.
  తన ఆశ్రయం కోసం వస్తోన్న అతని ప్రమాదకర స్థితిని అంచనా వేశాడు. ఎదుట జనాన్నీ, వాళ్ళ చేతుల్లోని బాంబుల్నీ చూడగానే కొండారెడ్డి తనవద్దకు వస్తే ఏం జరుగుతుందో వెంటనే పసిగట్టాడు.
  అతని కాళ్ళు గజగజ వణికాయి.
   " నాకాడికి రావొద్దు....నాకాడికి రావొద్దు..... "  అంటూ చేయి అడ్డంగా వూపుతూ తుపాకి భుజానేసుకొని కాలికొద్దీ పరుగెత్తాడు.
  నిష్టుడయ్యాడు కొండారెడ్డి
  గవుక్కున వెనుదిరిగి ఇంట్లోకెళ్ళి తలుపేసుకొన్నాడు. జరిగిన విషయమంతా ఎవ్వరూ చూడలేదనే అనుకొన్నాడు..కానీ -  ఆదృశ్యం బాలుని కళ్ళబడనే పడింది.
  జనాన్ని వెంటేసుకొని నేరుగా అక్కడికొచ్చాడు.
   నారమ్మ వర్గనాయుకుడే దొరికాడు,  వీన్ని వేసేస్తే సగం పీడ విరగడైపోయినట్లే.
  కాలెత్తి తలుపును తన్నాడు.  వెంటనే ఆ యింటి యజమాని వచ్చి అడ్డు పడ్డాడు " ఇంట్లో దాక్కున్నె మనిసిని సంపొద్దన్నా !  అది మాకు సెడ్డపేరు. మేము సంపిచ్చినట్టయిద్ది,  ఆయప్పను యిడ్సిపెట్టిపోండి. మీ నాయనోల్ల దాచిపెట్టుకొంటే అవతలోల్లకు చెప్పి పట్టించినామా..? అడ్డగించుకున్నెంగదా ! ఇప్పుడూ అంతే... పోండెన్నా  ! "  అంటూ ప్రాధేయపడ్డాడు.
   ససేమిరా వీల్లేదన్నాడు బాలుడు.
  చంపకుంటే కుదరదన్నాడు.
  యింటి యజమాని ఎంతకూ పక్కకు తప్పకోలేదు. అప్పుడు కోపంగా చూశాడు బాలుడు.
   " ఆ నాకొడుకును సంపకుండా మేమిక్కన్నించి కదిలేదిలేదు. యీరోజు వాని బతుకు సమాప్తం కావల్సిందే, నువ్వడ్డమొస్తే ముందు నిన్నేసి తర్వాత వాన్నీ వేసేస్తాం, వాన్ని మాత్రం వదిలేదిలేదు, ఖచ్చితంగా సంపాల్సిందే..."  అన్నాడు.
   రెండు క్షణాలు బాలుని కళ్ళలోకి తదేకంగా చూశాడు అతను  " సరే ! మీ యిష్టమన్నా  ! "  అంటూ పక్కకు తప్పుకొన్నాడు.
   తలుపులోపల గడియ వేసివుంది.
  తలుపుల్ని పగలదన్నారు.
  కొండారెడ్డిని జుట్టుబట్టి బైటకీడ్చి పిచ్చి కుక్కను కొట్టినట్లు రోడ్డంతా తరిమి తరిమి కొట్టారు.
  ఎటు చూసినా జనం
  తన చుట్టూ కోట కట్టినట్లుగా జనసందోహం.
  మనిషికో దెబ్బ విలువకూడా చేయలేదు కొండారెడ్డి ప్రాణం.
  అతన్ని చంపి రోడ్లో పడేసి వెళ్ళిపోయారు.
  ఈ గొడవంతా దాదాపు మూడు గంటల సేపు జరిగింది.
  మద్యాహ్నం తర్వాత పోలీసులొచ్చి శవాన్ని హ్యాండోవర్ చేసికొని, నేరస్తుల కోసం శివపురిలోకి వెళ్ళేసరికి అక్కడ మరో శవం ఎదురయ్యింది.
  ఒంటికొట్టం వద్ద జరిగిన కొట్లాటలో తలకు బలంగా దెబ్బ తగిలిన పిచ్చన్న - గాయం బిర్రున యింటికెళ్ళి వాయివొచ్చి  చచ్చాడట.... "
  ఖూనీ మీద ఖూనీ.
  డబుల్ మర్డర్ కేసు.
  మళ్ళీ పోలీసులు... అరెస్టులు..కేసులు...బెయిలు.... వాయిదాలూ..... డబ్బు మంచినీళ్ళలా..ఖర్చయి పోవటం...

                                                                                                           ........సశేషం

5 comments:

చివరి భాగం కోసం ఎదురు చూపు..

ఇది చాలా పెద్ద నవలండి కైక్యూబ్‌గారు.. ఇక రెండు మూడు భాగాలు రాసి ఆపేస్తాను..ఎవరికీ అంత ఆసక్తి గొల్పలేదు ఈ నవల.

maaku nachchindi.continue cheyyandi sir.

కమల్ గారు

దయచేసి ఆపకండి. మొత్తం నవలని PDF లొ చూడగలిగితే ఇంకా బాగుంటుంది. మీకు PDF కన్వర్షన్ విషయం లో అవసరమైతే నేను మీకు సహాయపడగలను.

--కిరణ్

@ అప్పి - బొప్పి..

@ కిరణ్ గార్లకు

నాకు ఆపడం ఇష్టం లేదుగాని..మీలాగే నాకు PDF లో మార్చాలని ఆలోచన. కాని ఈ నవల జరిగిన వాస్తవ కథ.. జరిగిన కథ కాబట్టి ఎవరికన్న అభ్యంతరాలుంటాయేమో అని అనుమానం.. అది కాక కొన్ని చోట్ల బోర్‌గాను..మరి కొన్న చోట్ల హింస ఎక్కువగాను ఉన్నది.. చదివే పాఠకులకు ఇబ్బంది అన్న ఉద్దేశంతో అలా అన్నాను.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followersమాలిక: Telugu Blogs