నేను పెరిగిన ప్రాంతంలోనే " గ్రామ కక్షల " అనే ఒక రకపు జాడ్యం ఉందనుకనేవాడిని...! ఎప్పుడైతే ఈ కప్ప తనుండే బావి నుండి పక్కనున్న మరో బావిలోకి ఎగిరి వచ్చిపడిందో అక్కడున్న మరో రకపు జాడ్యాన్ని కొద్దికొద్దిగా గుర్తించసాగింది. అవును మరి..రాయలసీమ ప్రాంతంలో ఉన్న గ్రామకక్షలు  ( ఫ్యాక్షన్ ) ఆధిపత్యం కోసం మూర్ఖత్వంతో కూడిన కారణాలతో అవర్భించాయి.. దానిక్కారణాలు నాకు తెలిసినంత వరకు కొన్ని చెప్పగలను.. నిత్య కరువు వలన గ్రామాలలో చేయడానికి పనుల్లేక నాలుగాళ్ల మండపం వద్ద కూర్చోని పొద్దుపోని మాటల్లోంచి జనించిన పౌరుషాల నుండి కొన్ని రకాల కక్షలు పుట్టుకొస్తే..మరి కొన్ని అడుగు నేల కోసం, ఏ మాత్రం విలువ చేయని పశువులు వేసిన " పేడ " కోసం, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో పుట్టుకొస్తాయి. అవే తరతరాలను నాశనం చేస్తున్నాయి. ఇవి రాయలసీమ ప్రాంతపు జాడ్యం ఒకటైతే.. మరికొన్ని....

      ఓ 20 ఏళ్ళ క్రితం నేనుండే బావినుండి మా పొరుగున వున్న  హైదరాబాద్ అనే మరో బావిలోకి దూకాను. మొదట్లో అందరిలాగే నాకు కాస్త తికమకగా ఉన్నా..తర్వాతర్వాత మెల్లిగా అవగతం అవడం మొదలెట్టింది.  బస్‌స్టాప్‌లో నిలబడి అమాయకంగా నగరాన్ని గమనిస్తున్న యువకల్ని అకస్మాత్‌గా కొందరు జీపుల్లో వచ్చి కిడ్నాప్ చేస్తుండడం నేను నిత్యం కాకపోయినా తరచుగా చూస్తూ వుండే వాడిని.. వాటికి కారణాలు అప్పటికే నాకు పరిచయం అయిన కొంతమంది తెలంగాణ ప్రాంతపు మిత్రుల ద్వారా ( ఈ " ప్రాంతాల " పదం నాకు మొదట్లో వాడుకలో అలవాటు లేదు గాని ప్రస్తుత పరిస్థితుల్లో నాలో వచ్చి చేరిన భావ దారిద్ర్యం ) తెలుసుకున్నప్పుడు విధ్యుత్ఘాతం తగిలినంతగా ఉలిక్కిపడేవాడిని. వారిమాటల్లో వారి వెతలు తెలిసేవి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ " ఎన్‌కౌంటర్స్" జరిగినా, ఉపాధికోసం వచ్చి నగరంలో ఉన్న తెలంగాణ యువకులకు వారి ఇంటినుండి ఉత్తరాల ద్వారానో లేక చుట్టుపక్కల ఉన్న వారికి ఫోన్ ద్వారా " ఇక్కడ ఎన్‌కౌంటర్స్ జరిగాయి..ఇప్పట్లో మన వూర్లకు రాకండి..అక్కడే ఉండండి పండుగలొచ్చినా సెలవలొచ్చినా అక్కడే ఉండండి " అంటూ సమాచారం అందజేసేవారు. వూర్లకొస్తే ఎత్తుకపోయి " ఎన్‌కౌంటర్ " చేయడానికి చాలావరకు ఆస్కారముంటుంది... అలానే చాలా వరకు జరుగుతూనే వుంటాయి. అదే ఉద్దేశం వారి తల్లితండ్రులది. మా వూరిలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాల మీద అవగాహన లేకపోయినా.. తెలంగాణ ప్రాంతపు నక్సలిజం మీద అవగాహన దినపత్రికల ద్వార తెలియడం వేరు ప్రత్యక్ష్యంగా చూడడం వేరు. నిజాం నుండి సాయుధపోరాటం ద్వారా విముక్తి పొందిన తర్వాత " నల్ల దొరల " విశృంఖల దాస్యంలో, వికృత చేష్టలలో నలుగుతూన్న పరిస్థితుల నుండి ఉద్భవించిన తిరుగుబాటు తనం మీద " నక్సలైట్స్ " అనె ముద్ర పడిందన్న విషయం నేను కొత్తగాచెప్పనవసరంలేదు..తెలుగువారికందరికీ తెలిసిన విషయమే.. ఈ దొరలు తమ నియంతృత్వపు దోరణిలతో అక్కడున్న ప్రజలను హీనాతి హీనంగా హింసిస్తూ చూడటం అదొక జాడ్యం ఆ ప్రాంతానికి. బహుశ ఈ జాడ్యం ఉత్తర భారతదేశం నుండి ప్రాకిన విదానమేమో..? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ఇలా.. మిగతా ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో పట్వారి, పఠాన్‌ల వర్ణ వ్యవస్థ అనాధిగా అధికారం చెలాయిస్తూ ఉన్నది.
       నేను మీడియాలో పనిచేస్తున్నప్పుడు నాకు చాలా సన్నిహిత మిత్రుడు అయిన తెలంగాణ మీడియాసహచరుడి వూరికి వెళ్లాను, వరంగల్ దగ్గర గూడూరు తాలుకా అనుకుంటాను.. వారింటికి పోయినాక ఒక పదినిమిషాలకు ఆ వూరి దొరనుండి పిలుపొచ్చింది " మీ ఇంటికి ఎవరో కొత్తమనిషి వచ్చిండంట కదా..! తోల్కోని రమ్మని చెప్పిండు దొర " సెలవిచ్చాడు వచ్చిన మనిషి, నన్ను దొర ఇంటికి తీసుకుపోవడం నా మిత్రుడికి ఇష్టం లేదు.. వాళ్ల ఇంట్లో వారు నాకు ఎలా చెప్పాలో అని తర్జన భర్జన పడుతున్నారు..నాకూ వెళ్లడానికి ఇష్టం లేదు..దానికి కారణం నా చెప్పులు నా చేతుల్లో పట్టుకొని దొరముందు నించోవాలట..దొరగడిలో..! చివరకు దొర ఇంటికి వెళ్లకుండానే ఆ వూరినుండి బయలదేరి వచ్చేశాను.  దొరతనం.. ఫ్యూడలిజం..నియంత్రుత్వం అవన్ని ఈ ప్రాంతపు జాడ్యాలు.

  ఇక మూడవ ప్రాంతం..! ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బయటి ప్రపంచంలో ఒక అన్నపూర్ణగా, నాగరికతకు ఆనవాలుగా కీర్తి తెచ్చిన ప్రాంతం కోస్తా, సర్కారు తీరప్రాంతాలు. మేథావులు, పండితులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. నీరు సంవృద్దిగా ఉన్న ప్రాంతాలలో..ఆర్థికాబివృద్ది హెచ్చుస్థాయిలో ఉంటుంది. ధనం ఎక్కడ పుష్కలంగా ఉంటుందో అక్కడ కళలు, కళాకారులు పుట్టుకొస్తారు. ఇదంతా వాస్తవం.నిజం. బయట ప్రపంచంనుండి..ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్లి కోస్తా ప్రాంతాలలో తిరిగే వారికి అక్కడి నీరు, ఎటు చూసినా కనుచూపుమేరా కనపడే పచ్చని పంటలు..." పచ్చని చేలా పావడ గట్టి.. కొండమల్లెలే కొప్పునబెట్టి వచ్చే దొరసాని " అన్న వేటూరి వారి పల్లవి గుర్తుకు వస్తుంది...చూసే వారికి ఈర్షపడేంతగా...!! జీవితానికి ఇంతకన్నా ఇంకేమి కావలి.. అనిపిస్తుంది అక్కడి వాతావరణం.. నిజమే బయట నుండి చూస్తే అలానే అనిపిస్తుంది..నేను కూడ అలాగే అనుకున్నాను...కాని..!!  మనుషులకు ఎటువంటి ఘర్షణ లేకుండా జీవితాన్ని సుఖంగా జీవించడం అన్నది  సప్పగా ఉంటుందేమో మరి..! అంతెందుకు.. ముస్లీములు, క్రిస్టెయన్స్ భారతదేశంలో లేనప్పుడు, కేవలం భారతీయులే ఉన్న కాలంలో వైష్ణవులు..శైవులు అంటూ వర్గాలుగా విడిపోయి తన్నుకొన్నారు.. మరీ అంత సుఖంగా జీవించడం మనకు అంత రుచించదు కదా..?  బయట నుండి చూసే వారికి ఇక్కడేమి లేదు..అంతా బాగు..బాగు అనిపిస్తుంది..కాని....!!
   మరి ఈ కప్ప ఎప్పుడైతే కడప బావి నుండి హైదరాబాద్ అనే బావిలోకి వెళ్లిందో..అక్కడే కోస్తా, సర్కారు ప్రాంత బావి జీవితం కనపడసాగింది...! అక్కడి ప్రజలు కులాలవారిగా.. వర్గాలుగా విడిపోయి జీవనం సాగిస్తున్నారులా అనిపిస్తుంది... కాస్త లోతుగా చూస్తేనే ఆ విషయం స్పష్టమవుతుంది. హైదరాబాద్‌లో మీడియాలో చేరిన సమయంలో కొంత మంది కోస్తా ప్రాంతపు మనుషుల పరిచయం సమయంలో కరచాలనం చేస్తూ ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటాము కదా...! ఆ సమయం నా పేరు చెప్పగానే..ఎదుటి మనిషి.." ఆహ  మీ పూర్తి పేరు ఏంటి..? " అని అడిగాడు.. నేను " పూర్తి పేరు ..? " అంటూ ప్రశ్నార్థకంగా మొహం పెట్టాను. ." అదే మీ ఇంటి పేరుతో సహా మీ పేరు చివరన కూడ తోక ఉంటుంది కదా అది చెప్పండి " అని అడిగారు..! నాకది కొత్త అనుభవం నా ఊహ తెలిసినప్పటి నుండి మా బావిలోనే ఉండటం మూలాన మాకు ఇంటి పేరు లేకుండా మాకున్న నామదేయం చెప్పడమే అలవాటున్న బావిలోనే పెరిగాము.. సో.. నాకది కొత్తగానే అనిపించింది..కాని వారు అలా అడగడానికి వెనుకున్న కారణం కూడ వెంటనే స్పరించింది...! అది అర్థమై.." నాకు ఇంటి పేరు..వెనకా ముందు తోకలు ఏమి లేవండి "  అని చెప్పాను. నాకు ఇంటి పేరు చెప్పడం ఇష్టం లేదన్న సంగతి అర్థమై ...మౌనం వహించారు.  అలా ఇంటి పేరును బట్టి ఎదుటి వారి కులం ఏమటనేది వెంటనే గుర్తు పట్టి..సదరు వ్యక్తితో స్నేహం చేయవచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటారట..??. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే...రాయలసీమ ప్రాంతంలో ఇంటి పేరును బట్టి కులాన్ని గుర్తించలేరు.. ఒకే రకపు ఇంటి పేర్లు చాలా కులాలకు వుంటాయి.. అదీ కాక రక రకాల ఇంటి పేర్లు వుంటాయి.. అదీను కాక రాయలసీమ ప్రాంతంలో కులాల వారిగా వర్గాలుగా విడిపోయి జీవనం వుండదు. ఇక నాకున్న కోస్తా ప్రాంతపు ఎన్.ఆర్.ఐ మిత్రుల మాటల్లో బోలెడు విషయాలను విన్నాను. అసలు కాలేజి విధ్య అంతా కులాల వారిగానే సాగుతూ వుంటుందట..??! ఒక కులం వారు మరో కులం వారి కాలేజిల్లో చదవరట..చదివినా కులాల వారిగా హాస్టల్స్ ఉంటాయట..! ఒక కులం విధ్యార్థులు మరో కులం విధ్యార్థుల హాస్టల్ ముందు వెళ్తున్న సమయంలో ఎదురెదురు పడినా లేక ఎదురు పడకపోయినా వెళ్లె దారి మద్యలో మరో కులం వారి హాస్టల్ కనపడినా ఊరికూరికనే ఎటువంటి కారణాలు లేకుండా కొట్టుకొంటారట..??! వాళ్లు చెబుతుంటే నాకు వింతగా తోచేది...! మరి  బావి లోని ఈ " కప్ప" జీవితం వేరు కదా..!!
       ఒక సారి మీడియా కోసం ఒక డాక్యుమెంటరీ నిమిత్తిం అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలు తిరిగాను. ఆ సమయంలో అమలాపురం సమీపంలో ఉన్న కొన్ని లంకల్లో డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్నాము. నేనెక్కడ పనిచేసినా ఆ చుట్టుపక్కల వున్న అక్కడి వారితో మాటలు కలపడం, అక్కడి ఆచారాలు, సంస్కృతి, అక్కడి రైతుల విశేషాలు, ఏమేమి పండిస్తారో..ఎక్కువగా ఏమి పండుతుందో.., అక్కడి మనుషుల ఆలోచనలు తెలుసుకోవడం నాకున్న అలవాటుల్లో ఒకటి. అలానే ఆ లంకల్లో ఒకరిద్దరు బాగా సన్నిహితం అయ్యారు నాకు.. రెండు మూడు రోజులు అయ్యాక వారిలో ఒకతను.." సార్ మీ ఇంటి పేరు ఏటండి " అడిగాడు నన్ను..
 చిన్నగా నవ్వి " ఎందుకు " అని అడిగాను.
" మీ ఇంటి పేరు తెలిస్తే మీరు నాకేమి అవుతారే తెలుత్తాది కదాండి "  అన్నాడు. నేను పెద్దగా నవ్వాను. నా నవ్వు ఆర్థం కాక చూశాడతను.
" అయ్య బాబోయ్ అలా నవేత్తన్నారేటండీ " అడిగాడు
 " నా యింటి పేరు తెలుసుకొని ఏమి చేస్తావు "  అడిగాను
 " ఏముందండీ.. మీ ఇంటి పేరును చూసి మీరు నాకు బామ్మర్ధి వరస అవుతారా..? లేక వరసకు అన్నదమ్ములవతారా ..? అని తెలుత్తాది కదండీ "  అన్నాడు.
ఇంటి పేరును చూసి వీరెలా కులాన్ని, వరసల్ని గుర్తు పడతారో నాకెంత బుర్ర చించుకున్నా అర్థం కాలేదు..!  " తెలుసుకొని ఏమి చేస్తావయ్యా " అని అడిగాను
" మరే బామ్మర్ధి వరసయతే.. తాహతులో మీ అంత వున్నామా లేదా..? పౌరషం విషయంలో ఇక్కడ బావ బామ్మర్ధులకు ఎప్పుడు తగువులాటే.. ఏ విషయంలోనూ ఎవరికి ఎవరు తగ్గరు "  అంటూ ఏవేవో చెప్పుకుంటూ పోతున్నాడు.. చాలా వరకు నాకవేవి అర్థం కాలేదు గాని ఒక విషయం మాత్రం అర్థం అయ్యింది.. అనవసరపు పంతాలు..పట్టింపులు ఎక్కువుగా వున్నాయనే సంగతి అతని మాటల ద్వార అర్థమైంది.. బావా బామ్మర్ధులు ఒకరికొకరు తగువులాటల్లో తలలు పగలు గొట్టుకుంటారట.. అలా ఎన్నో చెబుతున్నాడు అతను. మద్యలో నేను అడ్డుకొని.." అలా తలలు ఊరికే పగలగొట్టుకునే బదులు ఒకే సారి చంపేసుకుంటే ఓ పనిపోతుంది కదా ..? " అని అడిగాను.
" అయ్య బాబోయి..అట్టా ఉత్తి పుణ్యానికే చంపేసుకుంటారాండీ.."  అడిగాడు.
" మరలా రోజూ కొట్టుకొంటూ చచ్చే కన్నా..ఒకే రొజు చంపేసుకుంటే పీడ పోతుంది కదా " అన్నాను. అంతే అతను మౌనం వహించాడు. ఇదొక అనుభవం నాకు.

   ఇలాంటివి చాలానే వున్నాయి అనుభవాలు..! ఇక అంతర్జాలంలో చెప్పనవసరం లేదు..కులాల వారిగా చీలిపోయి ఎంత బూతులు తిట్టుకుంటూ వుంటారో..! ఏదన్న ఒక విషయం మీద వ్యాసం లేక కామెంట్ రాస్తే అంతే అది నచ్చని వారు వ్యాసాన్ని అందులోని విషయాన్ని గ్రహించకుండా ఆ వ్యాసం రాసిన వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం.. నీవు పలాన కులంవాడివి కావున కులగజ్జి అంటూ తిట్టడం..! మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు..ఎందుకిలా జనాలు ఉన్నారనీ..? తర్వాతర్వాత అర్థమైంది ఏమిటంటే.. కోస్తా,  సర్కారు ప్రాంతంలో చాలా వరకు జనజీవనం కులాల వారిగా విడిపోయి వున్నదనీ..! అలాగే జీవనం సాగిస్తున్నారనీ..పెద్దలను చూసి వారిల్లల్లో వున్న పిల్లలు కూడ వాటికి బాగా అలవాటు పడిపోయి.. ఊహ తెలిసినప్పటి నుండి కులాల విభజన వారి మనస్సులో బాగా నాటుకపోయి అలా పెరిగి పెద్ద అవుతున్నారనే విషయం అవగతమవుతున్నది.  చివరకు కళారంగంలో కూడ ఈ కులబావన పాతుకపోయిందనిపిస్తుంది.. కులాల వారిగా అభిమానులు.. అభిమానాలు తయారయ్యాయి. నిరుడు సంవత్సరం పాటల రచయత వేటూరి గారి మరణం సమయంలో కూడ ఒక మగానుభావుడు ( మహానుభావుడు ) వేటూరి పాటలను కులం కోణం నుండి విశ్లేషించాడు నవతరంగంలో. ఇంతకన్న భావధారిద్ర్యం ఉంటుందా..? ప్రతి విషయాన్ని కులం కోణం నుండే చూస్తున్నారు.. చివరికి తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని కూడ.

   మరొక సంఘటన..! అక్కడెక్కడో ఉత్తర భారదేశంలో పుట్టి పెరిగిన ఒక తెలుగమ్మాయి. తన విద్యనంతా ఉత్తర భారదేశంలో అభ్యసించి. తర్వాత పి.జి మాత్రం తన మాతృభాష ప్రాంతంలోనే చేయాలనే తలంపుతో  తన మూలాలను వెదుక్కుంటూ వైజాగ్‌కు వచ్చి ఆంధ్రా యూనవర్శిటీలో చేరితే...! అక్కడి కులాల కుమ్ములాటలు చూసి  షాక్ అయ్యింది. " ఏంటండి.. ఎంతో ఆశతోనూ..తెలుగు బాష మీద మమకారంతోనూ.. నా మూలాలు ఇక్కడే ఉన్నాయనే వస్తే..! ఇక్కడేంటీ...!! నా ఫ్రెండ్స్ నాకో వార్నింగ్ ఇచ్చారు ’కలిస్తే ఏదో ఒక కులం వారితో కలువు అంతే గాని మూడు కులాలవారితో సమానంగా మెలగాలంటే మాత్రం కుదరదు  ’అని అన్నారు.. అదేమి గొడవో నాకు అర్థం కాలేదు.. నాకు అందరితోనూ కలవాలనే ఉంటుంది ఏమి చేయనూ..? ప్చ్..ఇక్కడి కంటే నాకు నార్త్ ఇండియానే బావుంది " అని చెప్పింది. ఆ అమ్మాయి కూడ అగ్రవర్ణ కుల వర్గమే కాని అక్కడున్న మూడు కులాల గ్రూపులో ఈ అమ్మాయి కులం లేదు. అదీ సంగతి.  ఇది ఇక్కడి కుల జాడ్యం.

      నిజానికి కులంగజ్జి, కులాభిమానం... ఇవన్ని నిజాలనుకుంటున్నారా.? అలా అనుకుంటే అంతె.. చారులో లెగ్ ఏసినట్లే..! ఎవరికీ వరి వారి కులం మీద అభిమానం ఉందనుకుంటె అంతె...! అంతకన్న మూర్ఖత్వం ఏది వుండదు...! మనిషికి " తను " అన్నది ముఖ్యం... అంతే కాని కులం, ప్రాంతం, మతం ఇవేమి కావు. " నా, నేను " వీటి తర్వాతే ఏవైనా.. కాకపోతే ఈ " నా, నేను " లు బయటి సమాజంలో చాలానే కోకొల్లలుగా ఉంటాయి..మరి వాటి మద్యలో " నేను " లు తమ మనుగడలు.. ఆస్థిత్వాన్ని కాపాడుకోవడం ఎలా..? అలా వెతుకులాటలో దొరికనవే.. కులాలు, మతాలు, ప్రాంతాలు అనబడే ఆలంబనలు. ఈ " నేను " లు బయట సమాజంలో ఒంటరిగా మనుగడ సాదించడంలో " భయాలు " ఎక్కువ..సో...వాటికో ఆధారం కావాలి..ఆలంబన కావాలి..అంటే ఒక సమూహం..ఉండాలి..! ఈ కులం అనే సమూహం వలన " నేను " అనే ఈ ఆస్థిత్వం తన భయం నుండి బయట పడుతుంది...! అంతే కాని నిజ్జంగా కులతత్వం అన్నది ఒక మిధ్య..నాణ్యానికి మరో కోణం ఉన్నది.. దానికో ప్రత్యేక వ్యాసంలో...

            విచిత్రమేమిటి అంటే ఈ మూడు రకాల జాడ్యాలు కేవలం ఈ మూడు ప్రాంతాలకే పరిమితం కాదు..మిగతా అన్ని ప్రాంతాలలోనూ ఉన్నవే.. గ్రామ కక్షలు ఒక్క రాయలసీమలోనే కాదు భారతదేశమంతా గ్రామాలలో ఉన్నవే.. కాకపోతే  వాటి రూపాలు వేరుగా ఉంటాయి, వాటి తీవ్రతలు మారుతూ వుంటాయి..ఆయా ప్రాంతాలను అనుసరించి.. అలాగే కుల తత్వం ఒక్క సర్కారు, కోస్తా ప్రాంతంలోనే కాదు మిగతా రెండు ప్రాంతాలలోనూ ఉన్నవే కాకపోతే అక్కడున్న ప్రాముఖ్యతలను బట్టి వాటి రూపాలు మరో విదంగా వుంటాయి, వాటి తీవ్రత వేరుగా ఉంటుంది.. అలాగే తెలంగాణ దొరల నియంత తత్వం విషయంలో కూడ అంతే. అన్ని చోట్ల ఫ్యూడలిజం ఉన్నదే..!
  అవన్ని మరచిపోయి.. ఒకరినొకరం మరొకరి గురించి రంద్రాణ్వేషణ చేసుకుంటూ.. ఎవరి వారికున్న రంద్రాలున్న విషయం మరచిపోయి ఒకరినొకర్ని తిట్టుకుంటూ బతుకుతున్నాము. మూడు ప్రాంతాలలో మూడు రకాల రంద్రాలున్నాయి...!  ఎవరివి వారికి అన్నీ బాగా తెలుసు..... తెలిసినా కూడ తెలియనట్లే నటిస్తూ.... తమకున్న రంద్రాలకు " లప్పం " పట్టించుకుంటూ ఎదుటి వారి మీద ద్వేషం కక్కుతున్నారు. హేళన చేస్తున్నారు..! మీకు సభ్యత, సంస్కారం, చదువు, విఙ్ఞానం మేము నేర్పాము అంటూ గొప్పలు చెప్పుకొంటూ ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటున్నారు.

     ఎక్కడైనా మనిషి మనిషే..    మనిషికుండే లక్షణాలు ఎక్కడైనా ఒక్కటే..! అది అమెరికా అయినా..ఐరాపా అయినా.. ఆసియా అయినా.. అవే ఉద్వేగాలు, మానవ సంబందాలు, ఆత్మీయత, అనురాగం, వాత్సల్యం, హింస, అసూయ, అనురాగం, ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ మనిషికి సంబందించినవే..! ప్రాంతాలనసరించి, కులాలననుసరించి మనుషులుండరని మనందరికీ తెలుసు అయినా కూడా వాటినిని పరిగణలోకి తీసుకోకుండా తెలియనట్లే నటిస్తూ..ఎదుటివారిమీద ద్వేషం కక్కుతూ వుంటాము.

        మన పాత సామెత ఒకటి ఉండనే ఉన్నది కదా..!! అదే.. ఒక వ్రేలు ఎదుటి వారి వైపు చూపిస్తే... మిగతా మూడు వ్రేల్లు మన వైపు చూపిస్తాయి అని..! కాబట్టి మన వైపు చూపిస్తున్నా ఆ మూడు వ్రేల్లు గురించి ఆలోచించండి తెలంగాణారాయలసీమకోస్తసర్కారు జనులారా..!!

35 comments:

కమల్ గారూ,

చాలా మంచి విశ్లేషణ. ప్రాంతాల భావదారిద్యం ప్రచార సాధనాలు విస్తృతపర్చినంత మరెవరు చేయగలిగారు? మంచి ఉదాహరణ 'సీమాంధ్ర' పదమే. కొన్ని చానెళ్ళ పేర్లు ప్రస్తావించనుగాని వాటి లక్ష్యాలేమిటో బహిరంగ రహస్యం. నేను కోస్తా ప్రాంతంవాడినికనుక అక్కడ మీరు ప్రస్తావించిన 'కులపిచ్చి' గురించి వ్యాఖ్యానిస్తాను. అది మాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కోసారి. గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో మరీ ఎక్కువ. ఎంత చెడ్డా మా మా పుట్టుకలని మేము మార్చలేముగనుక, సంఘ బహిష్కరణ దుర్భరం కనుకా మేమింకా భరిస్తున్నాం. నాకు కుపపిచ్చిలేదని తెలిస్తే బతుకెంత దుర్బరంగా ఉంటుదో మాకు ప్రత్యక్ష అనుభవం. మంచి చెడ్డలకు పిలుపులు కూడా ఉండవు.

నేను విజయవాడలో పుట్టి పెరిగిన వాడిని. మీరు భూతద్దంలో పెట్టి చూపిస్తున్నంతగా నాకు ఈ కుల పిచ్చి కనపడలేదు మరి.

వంగవీటి రంగా హత్య అనంతరం మాత్రం ఒక కులం వాళ్ళు మరొక కులం వాళ్ళ మీద దాడులు చెయ్యటం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చెయ్యటం జరిగింది.

ఈ మధ్య అంటే గత రెండు మూడు దశాబ్దాలలో విజయవాడలో ఒక కాలేజీ పెట్టిన తరువాత అది ఒక కులం వారికే అన్న మాటలు వినబడుతున్నాయి.

అంతకు మించి మిగిలిన ప్రాంతాల్లో కనపడని కుల పిచ్చి కోస్తా ప్రాంతంలో అక్కడే పుట్టి పెరిగిన నాకైతే కనపడలేదు.

మీరు మొదటి రెండు ప్రాంతాల గురించి ఒక రెండు ముక్కలు వ్రాసి కోస్తా ప్రాతం గురించి తెగ వ్రాసారు. మనసులో ఏదో పెట్టుకుని వీళ్ళ గురించి వ్రాసి తీరాలి అన్నట్టుగా ఉన్నది. మీరు వ్రాసింది.

మీడియా వారికి ఉండే సహజమైన అభూత కల్పనా శక్తికి ఒక ఉదాహరణ మీ అభిప్రాయాలు.

శిరా గారు,

ఉన్నమాట చెపితే మీకు ఉలుకెందుకు వస్తుందో అర్థం కావటం లేదు. రచయిత కోస్తాలో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరించారు. కోస్తా వారికుండే కులపిచ్చి లోకమంతా తెలుసు. ఎన్నికల్లో కూడా కులాల వారీగా ఓట్లు పడే దౌర్భాగ్యం కోస్తాలోనే ఉంది.

వేరే కులాలతో కలవకుండా కట్టడి చేయడం లాంటిదే వాస్తవాలు వ్రాయడాన్ని అభూతకల్పనగా చిత్రించే మీ ధోరణి కూడా.

@వినయ్

ఉలికిపాటు కాదు నాయనా! నాకు తెలియని విషయం చూసి ఆశ్చర్యం.

మీరు అనుకున్నట్టుగా కుల ప్రాతిపదికన ఓట్లు వేసినట్టైతే, ఎన్ టి ఆర్ తెలుగు దేశం పెట్టినప్పుడు, ఆయనకు ఒక్క కృష్ణా జిల్లాలో తప్ప కోస్తాలో మరెక్కడా కూడా ఓట్లు పడకూడదు. కాని జరిగినది ఏమిటో ఒకసారి చరిత్ర చూడండి. మీ వాదనలో తప్పేమిటో తెలుస్తుంది.

పది మంచి గుణాలున్నప్పుడు ఒకటి అర చెడువుంటాయి. అసలు కులరిజర్వేషన్లు ఇచ్చి, కులాదుర్భిమానాలు పెంచి పోషించిందే ప్రభుత్వం/రాజ్యాంగం. సో అది 'రాజ్యాంగబద్ధమే' అయినపుడు తప్పుపట్టడం రాజ్యాంగాన్ని ధిక్కారం కిందికి వస్తుంది. రాజ్యాంగ నిర్మాతల ఆత్మలు క్షోభిస్తాయేమో కూడా. రిజర్వేషన్ల పేరిట ప్రతిభవున్నా అణగతొక్కబడుతున్న కులాలు, నిలదొక్కుకునే చేసే ప్రయత్నాలే కులాభిమానాలు. కులాభిమానాలు కులదురభిమానాలుగా మారి, సామాన్య న్యాయసూత్రాలను అణగదొక్కబడినప్పుడు అది తీవ్రంగా విచారించవలసిన అంశం అవుతుంది.

భాష, కుల, నార్త్, సౌత్ దిక్కులు, ప్రాంత, జిల్లా, తాలూకా, పల్లె, ఇంటి అభిమానం లేకుంటే దేశాభిమానం ఎలావస్తుంది?

కమల్ మీరు తెలబాన్ ద్వేష సాహిత్యానికి ప్రభావితులైనట్టు అనిపిస్తోంది. హైద్రాబాద్లో యువకుల బస్టాప్ కిడ్నాపులా! :)) నయం నన్నెవరూ ఎత్తూకెళ్ళలేదు! మీరు ఆ తెలంగాణ దొర దగ్గరికి చెప్పులు చేతబట్టుకుని ఓ కడప నాటు బాంబు జేబులో పెట్టుకుని వెళ్ళివుంటే, దొర పారిపోయేటోడు :)

శివరామప్రసాదుగారు విజయవాడలో అలాంటివేవీ 30ఏళ్ళుగా కనిపించలేదంటారా! ఎ.యు.లో ఎన్నికల్లో, హాస్టళ్ళలో కులసంఘాల ప్రాముఖ్యత అస్సలు లేదంటారా! నిజమే అయ్యుండచ్చు ;)

@అచంగ.
మీ కామెంట్‌కి ధన్యవాదాలు.. ఇవన్ని అందరికీ తెలిసిన విషయాలే..కాకపోతే కళ్లు మూసుకొని పిల్లి పాలు తాగే చందంలాగ ఉన్నది మన పరిస్థితి.

@శివరామప్రసాదు గారు. మీకు కులపిచ్చి కనపడలేదనుకుంటే..అది మీ అనుభవం..! అందరి అనుభవాలు ఒకేలా ఉండాలని రూల్ ఏమి లేదు కదా..? నేను 20 ఏళ్ళ క్రితం రాజమండ్రి వద్ద ఉన్న ప్రాంతాలు బాగా తిరిగాను.నిడదవోలు..చుట్టపక్కల గ్రామాలన్ని తిరిగాను మాస్టారు.. అప్పటినుండే నేను అవన్ని గమనించాను..ఇప్పటికీ అటువైపు తిరుగుతూనే వున్నాను..కులం విషయంలో మార్పేమి లేదు..అది అతి సహజం అని అర్థం చేసుకున్నాను.
వంగవీటి హత్య సమయంలో కులదాడులు ఒక్కసారిగా జరిగినవి కాదు కద..ఎన్నో ఏళ్ళుగా అవి సమాజంలో ఉంటేనే కొన్ని విపత్కర సమయంలో బయటపడతాయి అంతే గాని అకస్మాత్‌గా పుట్టుకరావు.
బహుశ గత రెండు మూడు దశాద్బాలలోనే అది పెరిగి మహా వృక్షంలా అయ్యిందేమో..మరి..?
ఇక మీ అభియోగం..మొదటి రెండు ప్రాంతాల గురించి రెండు ముక్కలు వ్రాసి కోస్తా ప్రాంతం గురించి ఎక్కువగా రాసాను అన్నదే కదా..? మీరన్న విషయం నిజమే..అలా ఎందుకు రాసానంటే..మీడియా.. పత్రికల్లో విరివిగా ఈ రెండు ప్రాంతాల గురించి ఎక్కువగా వ్రాసారు..ఇప్పటికే జనాలు విసిగి వున్నారు..ఇక నేను కొత్తగా చెప్పేదేమి లేదు ఆ రెండు ప్రాంతాల విషయాల్లో..! ఒక వేళ రాసినా అది ఊకదంపుడు ఉపన్యాసంలాగ ఉంటందన్న ఆలోచనతో ఎక్కువగా వ్రాయలేదు..కేవలం అందరికి తెలిసిన విషయాలే ప్రస్తావించాను.
అంతే గాని నా వ్యాసం వెనుక ఎటువంటి ఉద్దేశాలు లేవు..! ఈ విషయం మీద నా వ్యాసంలో వివరించాను .. వ్యాసం గురించి కాకుండా వ్యాసం వ్రాసిన సదరు వ్యక్తి యెక్క ఉద్దేశాలు.. వాటి వెనుకున్న కులం..ప్రాంతం గురించి ఆలోచించి ఆరోపణలు చేస్తారని, అది ముమ్మాటికి నిజమన్నది అర్థమయింది..!

అసలు ఈ కులతత్వం విషయం మీద బయటకు ఎవరూ మాట్లాడుకోరు..చాప కింద నీరులా ఉందన్న సంగతే మరచి..బయటకు అన్ని బాగు...బాగు అని చర్చించుకుంటారు..నేను ఆ విషయాన్ని చెప్పదలచాను అంతే కాని..నాకే ద్వేషం లేదు..ఏ వివక్షత లేదు. బహుశ ఈ విషయం గురించి బహిరంగంగా ఇంతవరకు ఎవరూ మాట్లాడుకోలేదు కాబట్టి మీకు నేను కావాలనే మనసులో ఏదో పెట్టుకొని వ్రాసినట్లు అనిపిస్తున్నది. చుట్టు వున్న ప్రపంచాన్ని అందరూ ఒకేలా ఎలా చూస్తారు..ఒక్కోకరు ఒకోలా..అదీను ఆయా మనుషులు పెరిగిన వాతావరణం నుండి మరో కొత్తరకపు వాతావరణంలోకి అడుగుపెట్టినప్పుడు.. చాలా వ్యత్యాసాలు గమనిస్తారు. అది సహజం కూడ.
మాస్టారు..నన్ను చాలా మంది చాలా చోట్ల " మీరు ఏంటి " అని అడిగిన సందర్భాలు కోకొల్లలు. ప్రతిచోటా నాది " సంకర జాతి " అని చెప్పుకునే వాడిని ఆ బాదలు పడలేక. ఇప్పటికీ నాచుట్టు వున్న నా మిత్రులకు ఎవరికీ నా కులం ఏమిటో ఎవరికీ తెలియదు..ఎవరికి వారు పలాన కులం అని అనుకుంటున్నారు. యన్.టి.ఆర్ గురిమ్చి మాట్లాడిన సందర్భంలో " కమ్మ " అనుకుంటారు. ఇక కడప ప్రాంతం నుంచి వచ్చాను కాబట్టి " రెడ్డి " అనుకుంటారు కొందరు, నా ఆహర్యం నల్లని మేలిమి బంగారం కాబట్టి.. " వైశ్యాస్.. లేక మాలో మాదిగో " అనుకుంటారు..ఇలా ఎవరికి తోచింది వారనుకుంటున్నారు..! వారికే పూర్తి స్వేచ్చ ఇచ్చానులేండి.

@శంకర్.
" భాష, కుల, నార్త్, సౌత్ దిక్కులు, ప్రాంత, జిల్లా, తాలూకా, పల్లె, ఇంటి అభిమానం లేకుంటే దేశాభిమానం ఎలావస్తుంది? "

అమ్మో ఈ విషయం మరో చర్చకు దారి తీస్తుంది..ఈ విషయం మీద కూడ నా వ్యాసంలో వ్రాద్దామనే అనుకున్నాను..కాని అప్పటికే అది చాలా పెద్ద బోరింగ్ ఆర్టికల్ అయ్యింది..అందుకే ఆ ప్రస్తావన ళేదు.
" కమల్ మీరు తెలబాన్ ద్వేష సాహిత్యానికి ప్రభావితులైనట్టు అనిపిస్తోంది. హైద్రాబాద్లో యువకుల బస్టాప్ కిడ్నాపులా! :)) "

నేను ఏ ద్వేష సాహిత్యానికి ప్రభావితం కాలేదులే గానీ..:))నేను శంకర్‌మఠ్ బస్టాప్‌లో వున్నప్పుడు ఒక కిడ్నాప్ జరిగింది ..ఇప్పుడూ కాదులేండి..ఓ 20 ఏళ్ళ క్రితం.

శివరామ ప్రసాద్ గారు,
మీరు పాత తరానికి చెందిన వ్యక్తిగనుక మీకు అంతగా ప్రస్తుత పరిస్థితుల గురించి తెలిసి ఉండక పోవచ్చు. చాలా మంది ఆ నాలుగు జిల్లాల వారి గురించి కుల పిచ్చి తెలుగు దేశం పార్టి పెట్టిన మొదట్లొ తెలియక పోవటం వలన ఆ పార్టికి బాగా కలిసివచ్చింది. ముఖ్యం గా రాయలసీమ, నెల్లురు, తెలంగాణా వారికి తెలుగు దేశం పార్ట్ అధికారం లో కి వచ్చి, 30సం|| ఐన తరువాత వారి గురించి బాగా అర్థమైంది. రామారావు గారి ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారాల లో వారు ఆర్ధికంగా అతి తక్కువ కాలంలో సాధించిన ప్రగతి అందరికి తెలిసిందే. అది ఎంత గా అర్థమైంది అంటే వారి ఆధిపత్యానికి అడ్డు వేసినపుడు ఎవరిని ఎక్కువ ప్రభావితం చేసిందో వారికి పోటిగా సాక్షి పేపర్ పెట్టెంతవరకు పరిస్థితులను తీసుకువచ్చారు.
-----------------------------------
ఆ జిల్లాలోని ఒక వర్గం పేరు చెపితే చాలా మందికి ఒక విధమైన అసహనం, స్మార్ట్ పీపుల్ అని, స్నేహంలో వారిని నమ్మలేమని, వారికి గల డబ్బు పిచ్చి మొదలైనవి నా మిత్రులు చాలా సార్లు చెప్పంగా విని నేను ఆశ్చర్య పోయాను.నేను రాయలసిమకి చెందిన వాడిని ఐనా చిన్నపటి నుంచి ఎక్కువగా ఇతర రాష్ట్రాలలో ఉండటం వలన , మీరు చెప్పిన డిల్లీ అమ్మాయి లాంటి పరిస్థి నాకు ఏర్పడింది. నేను బయట రాష్ట్రం లో ఉంటాం గనుక తెలుగు వారని అందరితో సరదాగా కలిపోబోతె వారి లో ఉండే విభేదాలు చూసి అవాక్కయాను. నాకైతే విజవాడ లోని ఇంజనిరింగ్ కాలేజ్ విషయాల గురించి చెపుతూంటే చాలా, చాలా ఆశ్చర్యం గా ఉండేది. విద్యార్దులు ఇలా ఉన్నారంటే మీ ప్రిన్సిపల్ ఎమీ అనరా? అని నేను అడిగిన అమాయకపు ప్రశ్నకి, మా ప్రిన్సిపల్, మేనేజ్మేంట్ వారంతా ఆ వర్గం వారే కనుక వారు ఎమీ అనరు సార్ అని చెపితే అప్పుడు నాకు జ్ణానోదయమైంది.
ఆవర్గం వారు తామేదో గొప్ప అచివర్స్ అనుకొని భావిస్తూ ఉంటారు. అందులో తప్పు పట్టాల్సింది లేదు. కాని ఈ వర్గ పిచ్చి వలన వారు సాధించిన విజయాలను ప్రజలు నెగటివ్ భావం తో చూడటం మొదలైంది. రానున్న రోజులలో వారు ఎన్ని విజయాలు సాధించినా వారిలో వారు పొగడుకోవలసిందే కాని తెలుగు ప్రజలు గుర్తించక పోవచ్చు.

Ram

కమల్ గారూ,

మీవ్యాసం బాగుంది. అయితే తెలంగాణ విషయంలో మాత్రం కాస్త ఎక్జాగరేషన్ కనిపిస్తుంది. నేను హైదారాబదులో ముప్పై ఏల్లు ఉన్నా మీరన్న కిడ్నాపులు చూల్లేదు.

విషయానికొస్తే, తెలంగాణలో నక్సలైట్లను ఒక "జాఢ్యం" గా ఎవరూ భావించరు. మిగతా ప్రాంతాల్లో గ్రామ కషలు, కులతత్వాల్లా తెలంగాణలో నక్సలైట్లను చూసి సిగ్గుపడరు, బహుషా గర్వపడతారు. దోపిడీ, అణచివేత ఉన్నంతకాలం నక్సలైట్లు ఉంటారు. అదేదో శాంతిభద్రతల సమస్య అని ప్రభుత్వం ఎంకౌంటర్లు చేస్తే నక్సలైట్ల సమస్య పోదు.

@ విశ్వరూప్‌గారు.
1991,92,93 ప్రాంతాలలో చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి అధికారంలో ఉన్న సమయం అది..అప్పుడు మావోయిస్ట్‌ పార్టీల మీద " బ్యాన్ " ఉన్నది..ఆ సమయంలో మరీ వందల్లో కిడ్నాప్స్ జరగలేదు కాని నాకు తెలిసీ పదుల సంఖ్యలో జరిగాయి..! ఒక విలేఖరి మిత్రుడిని బస్టాప్‌లో ఉన్నప్పుడూ జరిగింది..!
ఇక నేను నక్సలైట్స్ విషయంలో జాడ్యం అని చెప్పలేదు..కేవలం దొరల పాలన గురించి మాత్రమే ఒక " జాడ్యం " గా పేర్కొన్నాను..గమనించండి

@విశ్వరూప‌గారు..కిడ్నాప్స్‌‌ను మీరేవిదంగా తీసుకున్నారో అర్థం కాలేదు..! స్పెషల్ టాస్క్‌ఫోర్స్, పోలీస్ స్పెషల్ పార్టీస్ వారు కేవలం మావోయిస్ట్ సానుభూతీ పరులను, వారికి పరోక్షంగా మద్దతు తెలిపేవారిని, మానవహక్కుల సంఘాలలో పనిచేసేవారిని నగరంలో అనుమానస్పదంగా కిడ్నాప్ చేసేవారు..మీకు గుర్తూ ఉండే వుంటాయనుకుంటాను.

కమల్ గారూ,

ఓ అఙ్ఙాత మిత్రుని వాఖ్య ప్రచురించేటప్పుడు మీరు జాగ్రత్తవహించాల్సింది. కోస్తాలో కులాభిమానానికి ఓ కులమే కారణం అని వారి ఆరోపణ. దీనిని ఖండించటానికి ఈ వ్యాఖ్య వ్రాయవలసి వస్తోన్నది.

కమ్మ కులానికి సంబంధించి వారి ప్రధాన ఆరోపణ రామారావు అధికారములోనికి వచ్చిన తరువాతే కమ్మవారు ఎదిగిపోయారు అని....తొలిసారి అమెరికాలో స్థిరపడిన తెలుగువాడు కమ్మవాడు, కృష్ణ, రామారావు, నాగేశ్వరరావు, త్రిపురనేని రామస్వామి చౌదరి, రంగా.... చెబితే జాబితా పెద్దదవుతుందిగాని, వీరంతా రామారావు అధికారములోని వచ్చాకే ఎదిగారా?....గుంటూరు జిల్లాలో కమ్మవారి ప్రభావం జగమెరిగినది. మరి కేవలం ఒకేఒక్క సీటుమాత్రమే ఎందుకు సాధించింది తెలుగుదేశం? కమ్మవారి వృద్ధి కాకతీయులకాలము నుంచి ప్రారంభం అయింది తెలుగునాట. ఇప్పటికీ వారి కులసంఘాల పేర్లలో 'కాకతీయ' అని ఉంటుంది. అమీరుపేట కమ్మసంఘం భవనం చూడండి కాకతీయ శిలాతోరణం ఆకారం కనిపిస్తుంది. విజయనగర రాజ్య సమయములో అది నలుదిశలా వ్యాపించింది. విజయనగర ప్రభువుల అనేకానేక జమిందారీలకు జమీందార్లుగా నియమించింది కమ్మవారినే (మదురై, కోయంబత్తూరు, ఆర్కాటు, చల్లపల్లి, ముక్త్యాల.....ఎన్నో).

వారిలో చెడులక్షణాలు లేవని నేను చెప్పనుగాని వారేకారణం అనటం మాత్రం మీ అవగాహనా రాహిత్యానికి అద్దంపడుతోన్న్దది.

@అరుణ్ చంద్ర గారు.

నేను కామెంట్స్‌కి అప్రూవల్ విధానన్ని పెట్ట లేదు..అందువలన ఎవరు కామెంట్ పోస్ట్ చేసినా ఇక్కడ ప్రచరుణ అవుతుంది.
ఇక మీరు చెప్పిన విషయాన్ని నేను ఏకీభవిస్తున్నాను, కులాభిమానానికి ఏ ఒక్క కులం వారో కారణం కాదు అలానే ఏ ఒక్క వ్యక్తి కారణం కాదు.

పాఠకులకు ఒక విన్నపం..! దయచేసి ఒక వ్యక్తిని పాయింటవుట్ చేస్తూ గాని లేక ఏ ఒక్క కులాన్నో ఉదహరిస్తూ మాత్రం కామెంట్స్ పెట్టకండి.

కోస్తా లో కులాభిమానం, కుల దురభిమానం గురించి మీ టపా లో చేసిన వ్యాఖ్యలు కొంత నిజమైన మరికొంత వాస్తవ దూరంగా వున్నాయి. ఉదా!! మీరు చెప్పిన బావా బామ్మర్ది స్టోరి. మాది కోస్తా ప్రాంతమే.. కాని ఇప్పటివరకు నాకు కాని, నాకు తెలిసిన ఎవరికి కాని అలాంటి అనుభవం ఎదురు కాలెదు. ఇక వేరే ప్రాంతం వాళ్ళని అలా అడుగుతారు అంటే, అది ఏదో ప్రాజెక్ట్ పనికి వెళ్ళిన వాళ్ళని అడిగారంటే నమ్మశక్యం గా లేదు.

ఇక కొంతమంది మిడిమిడి ఙ్ఞానం తో కోస్తా లో అంత ఇలానే ఉంటుందనో, లేక ఒక వర్గం వాళ్ళు దుర్మార్గులు అనో దురభిప్రాయానికి వస్తారు. చాలా మంది భావిస్తున్నట్లు అక్కడ రాజకీయాలకు, కులాలకు అంత దగ్గరి సంభందం ఏమీ లేదు.

నిజానికి మొదటినించి తెలుగుదేశం పార్టీ కి కోస్తా లో కన్నా తెలంగాణ లోనే ఆదరణ ఎక్కువ. మీరు 2009 ఎన్నికలు తీసుకున్న ఈ విషయం స్పష్టం. మీరు ఇంకో విషయం కూడా గమనించాలి. 2009 ఎన్నికల్లో TDP అధిక స్థానాలు రెడ్ల కే కేటాయించింది.

So, my appeal is when u r writing some serious topic, it is better to do a bit of research than just swayed away by so called 'general opinion'.

and lastly,

1. I doesnt belong to 'that' caste
2. I am 27 yrs young and belong to this generation only.
3. I studied in so called colleges in guntur.

My appeal in the above comment applies to all regions. Because for me it is hard to believe even kidnap stories that u mentioned in your post.

@ సత్యగారు.

ఒకరి చేసిన కామెంట్‌కు నేను సమాదానం చెప్పలేను అది నా పరిధిలో లేనిది.
ఇక బావ బామ్మర్ది విషయంలో నేను ప్రత్యక్ష సాక్షిని..కాకపోతే మీకు వాటి ప్రూఫ్ ఇవ్వలేను.. ఆ మాటల సంబాషణలను నేను రికార్డ్ చేయలేదు. ఇక నుండి ఆ పని రికార్డ్ చేసి ప్రూఫ్ కోసం ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నాతో మాట్లాడిన వ్యక్తి రెండు మూడు రోజులుగా మాతోనే తిరిగాడు..అలా దగ్గరయ్యారు వాళ్లు అదీను కాక నేను కాస్త ఎక్కువగానే అక్కడి పొలాల గురించి..పంటలు గురించి వాటి రాబడి గురించి చర్చించేవాడిని ఆ చనువు కొద్ది అడిగుండొచ్చు..అంతే.
ఇక నేనెక్కడా..ఒక రాజకీయ పార్టీ గురించి కాని..లేక ఒక ప్రత్యేక కులం గురించి గాని చర్చించలేదు..! నా భావన కూడ అది కానే కాదు, కేవలం అక్కడి సమాజపు తీరును మాత్రమే చెప్పాను. ప్రజలు ఎలా మానసికంగా విడిపోయి జీవనం సాగిస్తున్నారో అన్నది మాత్రమే నేను చెప్పదలచాను నా వ్యాసంలో. కులం అన్న భావన మిగతా ప్రపంచమంతా వున్నా.. విజయవాడ, గుంటూరు, కోస్తా తీరప్రాంతాలలో చాలా వరకు వాటి తీవ్రత ఎక్కువే.నేనెక్కడా జనరలైజ్ చేయలేదు అవన్ని నేను చూసిన వాస్తవాలు.

ఇక కిడ్నాప్ గురించి...! అవన్ని పోలీస్ స్పెషల్ పార్టీస్ బయట సమాజానికి తెలీకుండా చేస్తుంటారు. మీరు ఒక సారి వీలుంటే రాత్రిల్లు హైదరాబాద్ నగర్ వీధుల్లో తిరగండి.. అంటే ప్రధాన వీధుల్లొ కాదు..కొన్ని హిల్స్ ఏరాయాల్లొ.. అక్కడ మీకు టి-షర్ట్స్, జీన్ ప్యాంట్స్ వేసుకొని 25-30 వయసున్న వ్యక్తులు సుమోల్లోనో లేక క్వాలీస్ లోనో లేక స్వరాజ్ మజ్డాలోనూ తిరుగుతూ కనపడతారు..వారే స్పెషల్ టాస్క్ ఫోర్స్..వారి చేతుల్లో రకరకాల రివాల్వర్స్ కూడ వుంటాయి..ఒకానొక ప్రాజెక్ట్ పనిలో ఉండగా కాస్త ప్రకృతి గాలి కోసం బయటకొచ్చినప్పుడు కనపడ్డారు..వారితో చిట్ చాట్ చ్కూడ చేసాను అలా ప్రత్యక్ష అనుభవం ఉందిలేండి. వారి పనే నగరాన్ని రక్షిస్తూ వుండటం..ఆ భాగంలో చాలానే జరుగుతూ వుంటాయి.

ఇక మీరు ఉదహరిమ్చిన రాజకీయ కామెంట్ నాకు సంబందం లేనిది..నా వ్యాసంలోని విషయం అది కానే కాదు.

Kamal garu

mee visleshana chala bagundi. ee kula jadyam,faction godavalu,pranthala antharalu.......ivanni saryina vyapakam lekapovatam valana , kevalam oka group of peple create chestunna nonsense ani anipistundi.comparatively in other states like Karnataka & Maharashtra , particularly in Maharashtra, where you can see industrialization and work generation even in remote villages,intakula pichhi& factionism kanipinchadu.Recently i heard that in Nagarjuna university students are divided into groups on the basis of caste.....it is riduculous.May be lot of survival problems leading to this castefeeling.

కోస్తాలో కులాభిమానానికి ఓ కులమే కారణం అని అనటం నా ఉద్దేశం కాదు.కాని ఆ వర్గం లోని అధిక సంఖ్యాకులకు వారికి హిందూ మతంలోని చాంధస భావాల పై ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది.అన్ని సామాజిక ఉద్యమాలు జరిగిన చోట కాలం గడిచేకొద్ది ఆ ఉద్యమ ప్రభావం వలన కులపిచ్చి ఎంతో తగ్గు ముఖం పట్టవలసి ఉండాలి కదా! మరి అటువంటి చరిత్ర కల ఆ జిల్లాలలో ఇంతగా కుల ప్రభావం విధ్యార్ది దశనుండి పెరిగి పోయిందనేది ఒక కాదనలేని నిజం. ఇప్పుడు అమ్మాయిలు కూడా తమ పేరులో కులం పేరు పెట్టుకోవటం నియో క్షత్రియ వర్గాలలో ఒక కొత్త ఫాషన్.

Ram

Kamal garu, I have no intention to doubt what you experienced. But I what I suggested is, it can no way be a basis to form an opinion on that region, the reason is it is one isolated and that too very rare albeit it happend. Besides, I agreed in my comment there is some caste preferences in coastal andhra.

These exaggerated stories that you heard by fellow bloggers came mostly thru college life where these students develop such feelings to worship the heroes of their caste. Beyond this, it is not that significant and they realizes that slowly.

and my other comment reg. politics is not intended to you.

రామ్ (అఙ్ఞాత) గారు,

తొలితరం కమ్యూనిస్టు రాజకీయాల్లో తలపండిన నాయకులెందరో గుంటూరు-కృష్ణా జిల్లాల నుంచి కమ్మవారే ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ పార్టి విధానాలలో భాగంగా కమ్యునిస్టుల ఏరివేత చర్యలు ఏ విధంగా సాగాయో 60, 70 లలో.కృష్ణా జిల్లా యడ్లంక గ్రామాన్ని సందర్శించండి మీకర్థం అవుతుంది. అక్కడ ఉన్న ఏ పండు ముదుసలిని అడిగినా ఆనాటి ఙ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. ఆనాడు బెజవాడలో జరిగిన ఓ ప్రముఖ సమావేశం కమ్మవారి ఐక్యతకు పిలుపునిచ్చి కమ్మసంఘం, కమ్మ వసతి గృహాల ఏర్పాటు వంటి చర్యలను తీసుకుంది. ఇది చారిత్రక వాస్తవమే. ఆనాడా సమావేశానికి ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. తమ సమస్యలకు పరిష్కారంగా మాత్రమే కమ్మవారంతా కలిసికట్టుగా నడవాలని నిర్ణయించుకున్నారు.

తర్వాత్తర్వాత ఆనాటి స్ఫూర్తి వికృత పోకడలు పోవటములో కమ్మవారికి ఎంత భాగం ఉందో ఆయా ప్రాంతాలలోని మిగిలిన సామాజికవర్గాల వారికి కూడా అంతే భాగం ఉంది.

@ Dr.విశాల గారు.
మీకున్న బిజీ సమయంలో ఇక్కడికొచ్చి వ్యాసం చదివి కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు మీకు.
ఫ్యాక్షన్ గొడవలుకు కారణం మీరన్నట్లు సరైన వ్యాపకం లేకపోవడమే..దానికి సహేతుకమైన కారణం కూడ నా వ్యాసంలో వివరించాను.
ఇక కోస్తా ప్రాంతపు కులతత్వం విషయంలో నాకు లోతైన అవగాహనలేదు..కేవలం నేను చూసిన సంఘటనల ఆధారంగా మాత్రమే వ్యాసం రాసాను..! మరి ఎవరైనా కోస్త ప్రాంతపు వ్యక్తులొచ్చి విషయాన్ని ఖండించడం కాకుండా సహేతుకమైన లోతైనా విశ్లేషణ చేయగలిగితే బావుంటుంది.

@ సత్య గారు.

పైన వివరించినట్లు కేవలం నేను చూసిన సంఘటనల ఆదారంగానే వ్యాసం వ్రాసాను. మీరన్నట్లు " caste preferences " కోస్తా ప్రాంతంలోనే కాదు..దేశమంతటా ఉన్నదే..! కాకపోతే కోస్తా ప్రాంతంలో వీటి ప్రత్యేకత వేరు..! సమాజంలో కులాల వారిగా విడిపోయి..జీవనం అన్నదే కాస్త భిన్నంగా కనపడింది. అంతర్జాలంలో కాని మరే ఇతర వ్యవస్థల దగ్గర కాని " ఒక విషయాన్ని " ప్రస్తావిస్తే..! విషయాన్ని విషయంలా కాకుండా కులం కోణం నుండి చూస్తూ చర్చిస్తున్నారు..! ఎక్కడ ఈ పొరబాటు జరుగుతున్నదో మొదట అర్థం కాలేదు గాని..తర్వాత మెల్లిమెల్లిగా లోతుగా ఆలోచిస్తే నాకు స్పరించింది.. ఇదే, కులాల వారిగా చిన్నప్పటి నుండి మానసికంగా విడిపోయీ జీవనం సాగిస్తున్నారేమో అని..ఈ విషయం మీద నాకు పూర్తిగా విశ్లేషణ చేయలేను.. దానికి సరైన వ్యక్తులు కోస్తా ప్రాంతం వారే అయితేనే సరిగ్గా విశ్లేషణ చేయగలరు.అలా ఎవరన్న వచ్చి చేస్తారా అని చూస్తున్న.

$అచంగ గారు

ఇక్కడ జరుగుతున్న చర్చ మొదటినుంచి అనుసరిస్తూనే ఉన్నాను. అసలు విషయాన్ని దాట వేసి పైపైన మాట్లాడుతూ౦టే సమస్య అలానే ఉంటుంది. మరి మన తర్వాతి తరాలు కూడా గంటల తరబడి చర్చి౦చుకోవడానికి ఈ సమస్యలు అలానే ఉండాలనేమో! అందుకే నేనూ చర్చలో పాల్గొనలేదు.

ఆయితే ఇప్పుడు మీరు నాకు లేదు లేదు అంటూనే కొన్ని చారిత్రకవాస్తవాలకు సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఏదో నాకు తెలిసిన సామాజిక జ్ఞానంతో నా బదులు ఇక్కడ. చర్చలోకి దిగేముందు మిగిలినవారు తలబాడుకోకుండా ముందుగానే .. అయ్యా.. నేను బ్రాహ్మణుడిని అని చెప్తున్నా.

#నాకు కులపపిచ్చిలేదని తెలిస్తే బతుకెంత దుర్బరంగా ఉంటుదో మాకు ప్రత్యక్ష అనుభవం.

#తొలితరం కమ్యూనిస్టు..గుంటూరు-కృష్ణా జిల్లాల నుంచి కమ్మవారే ఉంటూ వచ్చారు.

మీరు మొదటివ్యాఖ్యలో ఏదైతే లేదు అన్నారో అది ఇప్పుడు చిన్నగా బయటికి వచ్చింది.. చూసారా ;)! పర్లేదు.

తనజీవితాన్ని ప్రజలకే అంకితం అని బిడ్డలని కూడా కనకుండా కడదాకా జీవితాంతం ప్రజాసేవ చేసిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారు తొలితర౦ కమ్యూనిస్ట్ నాయకుడు. కానీ ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందరరామి రెడ్డి అని బహుశా ఈ తరానికి తెలీదు. తన పేరులో కులం ఉండకూడదని అది కమ్మ్యూనిజం భావాలకు విరుద్దమని అదే తుదిదాకా పాటిస్తూ బతికి పుచ్చలపల్లి సుందరయ్యగా గానే మిగిలిపోయిన అసలుసిసలు కమ్మ్యూనిస్ట్ నాయకుడు.

మీరు చెప్పిన "కమ్మ్యూనిస్ట్ల్లో" కులాన్ని వదిలేసి పుచ్చలపల్లి సుందరయ్యగారిలాగా జీవితాన్ని గడిపిన వారిని చూపిస్తారా? లేక వారికి కూడా మీరు పైనచెప్పినట్లు "పిలుపులు" ఉండవని కులాన్ని పట్టుకు కూర్చున్నారా?

ఇంకా ఎందుకండీ మసి పూస్తారు వాస్తవాలకి? నాడు కమ్మకులం తాము రాజకీయంగా పైకి రావడానికి కాంగ్రెస్ అంతా రెడ్లు అని భ్రమిసి వారికి వ్యతిరేకంగా కమ్మ్యూనిస్ట్ పార్టీని పావుగా వాడుకున్నారు. అప్పుడు కమ్మ్యూనిస్ట్ పార్టీని ఏమని పిలిచేవారో కూడా అందరికీ విదితమే. ఆనక రామారావు పార్టీ పెట్టిన తర్వాత కమ్మ్యూనిస్ట్ పార్టీలో నుంచి వలసలు ఏ విధంగా వెళ్ళాయో కూడా విదితమే. కళ్ళముందు అన్ని జరిగినా ఇంకా ఏదో ప్రజాపోరాటాలకి కమ్మ్యూనిస్ట్ పార్టీలో చేరినట్లు చెబుతారే?

#కాంగ్రెస్ పార్టి విధానాలలో భాగంగా కమ్యునిస్టుల ఏరివేత చర్యలు
ఇక్కడే అర్థమయింది మీరు నాకు లేదు లేదు అంటూనే ఏమి చెప్పదలుచుకున్నారో.. చెప్పండి ధైర్యంగా "కాంగ్రెస్ పార్టి కమ్మలని ఏరిపారేసింది" అని.. పాపం తర్వాత రామారావు, చంద్రబాబులు కమ్యునిస్టులని తమ బిడ్డల్లాగా చూసుకున్నారు అంతే కదూ?

#కమ్మవారి ఐక్యతకు పిలుపునిచ్చి కమ్మసంఘం, కమ్మ వసతి గృహాల..
ఏమా ఐక్యత? అవసరమేమిటి? కొద్దిగా చెప్తారా? ఒక కులసంఘ౦ ఏర్పాటు చేసుకుని ఆంధ్రలో నాటినుంచి నేటివరకు కులకార్పణ్యాలకి మూలమైన హీనతను మీరు ఐక్యతకు చిహ్న౦గా చూపిస్తుంటే ఇది కదా కులగజ్జి అంటే అని అనిపిస్తుంది. కాదంటారా?

#ఆనాడా సమావేశానికి ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు.

"లేవు" అని మీరు ఎలా చెబుతున్నారో నాకు అర్థం కాలేదు. ఉన్నదల్లా దురుద్దేశాలే, తాము ఎలాగైనా పక్కకులాలని తొక్కి పైకిరావడమే. పోనీ నాకు ఒకటి చెప్పండి. పేరులో కులాన్ని పెట్టుకున్న త్రిపురనేని రామస్వామి చౌదరిగారి తనకులానికి కాకుండా సమాజానికి చేసినమంచి ఏమిటి? ఆయన ఏ మూఢ నమ్మకాల మీద పోరాడితే హేతువాది అయ్యారు?

#తర్వాత్తర్వాత ఆనాటి స్ఫూర్తి వికృత పోకడలు పోవటములో కమ్మవారికి ఎంత భాగం ఉందో ఆయా ప్రాంతాలలోని మిగిలిన సామాజికవర్గాల వారికి కూడా అంతే భాగం ఉంది.

ఆ మిగిలిన సామాజికవర్గాల వారు ఎవరో, వారు వికృత౦గా ఏమి చేసారో కూడా మీరే చెబితే బావుంటుంది.

ఒక కులాన్ని నింది౦చడం మాత్రమే తప్పు కాదు. పనిగా తాము చేసిన తప్పులను ఒప్పులుగా చూపించుకోవడం కూడా తప్పే!

chala manchi analysis and a very realistic post .
facts are always bitter and hard to digest.And to all those who find some facts exaggerated regarding the caste feeling in AP particularly in some parts may be hard to digest but its a reality .
Though i'm born n brought up in hyd whenever i used go to my native or to my relatives houses the first question u get from a stranger anywher would be " mee inti peru enti "?? initially i cudnt understand the intention of that question slowly i realised that it is to analyse ur caste.

రాజేష్ గారూ,

ముందుగా మీ విమర్శ/వ్యాఖ్యలో చాలా భాగాలను ఆహ్వానిస్తున్నాను.

1. పుచ్చలపల్లి సుందరయ్యగారి జన్మస్థానం నెల్లూరు జిల్లా. సామాజికంగా గుంటూరు-కృష్ణా జిల్లాలతో చాలా వైరుధ్యంగల ప్రాంతం. పైగా నేను ప్రస్తావించినది గుంటూరు-కృష్ణా జిల్లాల కమ్యూనిస్టు నాయకులను గురించి. గమనించారా? (http://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9A%E0%B1%8D%E0%B0%9A%E0%B0%B2%E0%B0%AA%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%B8%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%B0%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF)

2. నేనెక్కడయినా కమ్మవారు ప్రజాపోరాటాలకు పోరాడారని ప్రస్తావించానా? వారిలో ఉన్న సమస్యలకు పరిష్కారంగానే జతకట్టారు అని చెప్పానే! మీ వాదన ప్రకారం అసలు రెడ్లకి కులాభిమానమే లేదనుకుంటా! మీరు అలాగే చెప్పబూనితే గుంటూరు జిల్లా కొల్లిపరమండలం రండి. మీకు దాగ్గరుండి చూపిస్తా రెడ్ల కులాభిమానాలు.

3. కమ్యూనిస్టుల ఏరివేతకి- కమ్మవారి ఏరివేతకి చాలా తేడా ఉందండీ. గుంటూరు-కృష్ణా జిల్లాలలో ఆనాటి కమ్యూనిస్టు నాయకులు అధికులు కమ్మవారనే అన్నాను. సరి చూసుకోండి.

4. ఈ రాష్ట్రములో కులసంఘంలేని కులాన్ని నాకు చూపండి (సామాజికంగా గుంటూరు-కృష్ణా జిల్లాలకి సంబంధించి)

5. త్రిపురనేని రామస్వామిగారి గురించి మీకెందుకో అంత దుగ్ద నాకర్థం కాలేదు. ఇక్కడ చూడండి వారి గురించి (http://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BF) పెళ్ళిళ్ళలో బ్రాహ్మణత్వాన్ని, అంటరానితనాన్ని వ్యతిరేకించినందుకూ, తన ఇంటి పేరునే 'సూతాశ్రమంగా' పెట్టుకున్నందుకా?

6. తమ కులంవారిది ఐక్యతా, మిగిలిన కులాలవారిది గుంపులు కట్టటమూను ఎలా అవుతుందో! కమ్మవారైనా సరే.

7. మీరు కోస్తా ప్రాంతానికి కేవలం చుట్టపుచూపేనని చెప్పారు. నేను అక్కడే పుట్టి, పెరిగి బతకటం నేర్చుకున్నవాడిని, నేర్చుకుంటున్నవాడిని. నాకక్కడి సామాజిక పరిస్థితులు తెలియవనే అనుకుంటున్నారా?

You have echoed my feelings about the issues in the three regions exactly. I wrote a story about the caste issue some time back here:
http://wp.me/pGX4s-hr

@ప్రసాద్ గారు,

ఇందాకే మీరు వ్రాసిన కథ చదివాను..చాలా బాగుంది..! మనుషుల క్యారెక్టర్స‌ని బాగా విశ్లేషణాపూర్వకంగా విశదీకరించారు చాలా బాగుంది..నిజం చెప్పాలంటే నేను వ్రాసిన ఆర్టికల్ కంటే మీ కథనం చాలా బాగుంది.

ధన్యవాదాలు కమల్ గారు!

ఇక్కడ దాదాపుగా ఓ 23 కామెంట్స్ ఉండేవి రెండురోజుల క్రితం వరకు..అవి అక్‌స్మాత్‌గా వాటంతట అవే డిలిట్ అయ్యాయి..వాటికి కారణం బ్లాగర్ వాళ్లు చెప్పిన సమాదానాలు ఇవి
Update (5/13 7:46PM PST): Nearly all posts since Wednesday are restored, now bringing back comments from last couple days. We expect the comments to be back this weekend or sooner.

What a frustrating day. We’re very sorry that you’ve been unable to publish to Blogger for the past 20.5 hours. We’re nearly back to normal — you can publish again, and in the coming hours posts and comments that were temporarily removed should be restored. Thank you for your patience while we fix this situation. We use Blogger for our own blogs, so we’ve also felt your pain.

Here’s what happened: during scheduled maintenance work Wednesday night, we experienced some data corruption that impacted Blogger’s behavior. Since then, bloggers and readers may have experienced a variety of anomalies including intermittent outages, disappearing posts, and arriving at unintended blogs or error pages. A small subset of Blogger users (we estimate 0.16%) may have encountered additional problems specific to their accounts. Yesterday we returned Blogger to a pre-maintenance state and placed the service in read-only mode while we worked on restoring all content: that’s why you haven’t been able to publish. We rolled back to a version of Blogger as of Wednesday May 11th, so your posts since then were temporarily removed. Those are the posts that we’re in the progress of restoring.

Again, we are very sorry for the impact to our authors and readers. We try hard to ensure Blogger is always available for you to share your thoughts and opinions with the world, and we’ll do our best to prevent this from happening again.

Posted by Eddie Kessler, Tech Lead/Manager, Blogger

కాబట్టి ఇక్కడ కామెంట్స్ పెట్టిన బ్లాగ్ మిత్రులందరూ నేను మీ కామెంట్స్ తొలిగించానని అని భావించకుండా పైన ఇచ్చిన బ్లాగర్ వారి ఎక్స్‌ప్లనేషన్ గమనించ వలసినదిగా కోరుతున్నాను.

కమల్ గారు,
చాలా బాగా వ్రాసారు. నేను మీ రచనలు అన్నీ చదువుతాను.మీరు మీ రచనలన్ని ఒక పుస్తక సంకలనం రాస్తే చాలా బాగుంటుందని నా మనవి.

@ రావుస్ గారు,
మీ అభిమానానికి,మీ సూచనలకు ధన్యవాదాలు, నా రాతలకు సంకలనాలు వేసుకునేంత స్థాయి కాని, ప్రమాణికం కాని లేదండి. ఏదో తోచింది ఇక్కడ రాసుకుంటున్నాను. మరొక్కసారి మీకు ధన్యవాదాలు.

narra venu gopal said... January 17, 2012 at 7:45 PM  

మీరు వ్రాసిన వ్యాసం చాలా పరిణితితో విశ్లేషణ తో వాస్తవాలకు దగ్గరగా ఉంది .కమలాకర్ గారు .

@ నర్రా వేణుగోపాల్ గారికి..చాలా థ్యాంక్సండి. నా అనుభవంలో జరిగినవి చూసినవి రాసాను.

కమల్ గారు మీ వ్యాసం చదివాను నిజమే బావులే వేరు, కప్పలన్నీ ఒకటే నండి. నేను ఇక్కడ మీకు నా అనుభవాలు కూడా చెప్పాలను కుంటున్న .మా ఆడవాళ్ళ విషయం లో కూడా నాకు ఎదురైన సంఘటనలు నేను కూడా బావులు కప్పలు తో ముడిపెట్టుకున్నాను నేను ఈ మద్య ఒక చిన్న పల్లెటూరు వెళ్ళాను. అక్కడ ఎవరూ కూడా ఒకరిని ఒకరు బావున్నారా అని పలకరించు కోవటం కంటే వాళ్ళ పిల్లల ఉద్యోగాలు జీతాలు వాళ్ళు కూడ బెట్టుకున్న ఆస్తుల గురించి ఎక్కువ మాట్లాడు కోవటం కనిపించింది సరేలే ఈ పల్లెల్లో ఆప్యయతలని అమెరికా ఐ .టి .రంగాలు మింగేసినై అను కున్నా. .తరువాత చాలా రోజుల తరువాత కలిసిన ఒక స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాను సోషల్ స్టేటుస్ తను అను కుంటున్న హై క్లాసు సోసేటి ఫ్రెండ్స్ గురించి తప్ప తన దగ్గర నుంచి ఒక చిన్న ఆత్మీయ పలకరింపు ని కూడా అందుకోలేక పోయాను ..కొత్తగా వచ్చిన స్టేటుస్ తో వీల్లలోని మనుషులకి సంబంధించిన ఫీలింగ్స్ మాయమై పోనిలే అనుకుంటూ నీరసంగా విజయవాడ క్లబ్ అనబడే మీరు చెప్పిన కోస్తా కల్చేర్ ఎక్కువ గా కని పించే చోటికి వెళ్లి మనుషులు కోసం వెతకటం మొదలపెట్టా ఇంతలో ఒక పరిచయస్తురాలు దగ్గరగా వచ్చి చీరల గురించి మాట్లాడం మొదలెట్టింది ఎంతా ఇరవై వేలే నలభై వేలే అని చెప్పటం మొదలెట్టింది చాలా కస్టపడి ఆవిడని తప్పించుకుని పక్కకి వెళ్ళనా ఆ పక్క నుంచి ప్రియా గారు అన్న పిలుపు వినిపిస్తే అటు చూస్తే మా అమ్మాయి కి మొన్న కొన్న గాజుల సెట్ అండి డైమండ్స్ కదా పాతిక లక్షలు బావుందా అంటూ ఇంకో ఆవిడ ............బావులే వేరండి .....కప్పల బెక బెక లన్నీఒకటే కదా అనిపించింది........

కమల్ గారు మీ వ్యాసం చదివాను నిజమే బావులే వేరు, కప్పలన్నీ ఒకటే నండి. నేను ఇక్కడ మీకు నా అనుభవాలు కూడా చెప్పాలను కుంటున్న .మా ఆడవాళ్ళ విషయం లో కూడా నాకు ఎదురైన సంఘటనలు నేను కూడా బావులు కప్పలు తో ముడిపెట్టుకున్నాను నేను ఈ మద్య ఒక చిన్న పల్లెటూరు వెళ్ళాను. అక్కడ ఎవరూ కూడా ఒకరిని ఒకరు బావున్నారా అని పలకరించు కోవటం కంటే వాళ్ళ పిల్లల ఉద్యోగాలు జీతాలు వాళ్ళు కూడ బెట్టుకున్న ఆస్తుల గురించి ఎక్కువ మాట్లాడు కోవటం కనిపించింది సరేలే ఈ పల్లెల్లో ఆప్యయతలని అమెరికా ఐ .టి .రంగాలు మింగేసినై అను కున్నా. .తరువాత చాలా రోజుల తరువాత కలిసిన ఒక స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాను సోషల్ స్టేటుస్ తను అను కుంటున్న హై క్లాసు సోసేటి ఫ్రెండ్స్ గురించి తప్ప తన దగ్గర నుంచి ఒక చిన్న ఆత్మీయ పలకరింపు ని కూడా అందుకోలేక పోయాను ..కొత్తగా వచ్చిన స్టేటుస్ తో వీల్లలోని మనుషులకి సంబంధించిన ఫీలింగ్స్ మాయమై పోనిలే అనుకుంటూ నీరసంగా విజయవాడ క్లబ్ అనబడే మీరు చెప్పిన కోస్తా కల్చేర్ ఎక్కువ గా కని పించే చోటికి వెళ్లి మనుషులు కోసం వెతకటం మొదలపెట్టా ఇంతలో ఒక పరిచయస్తురాలు దగ్గరగా వచ్చి చీరల గురించి మాట్లాడం మొదలెట్టింది ఎంతా ఇరవై వేలే నలభై వేలే అని చెప్పటం మొదలెట్టింది చాలా కస్టపడి ఆవిడని తప్పించుకుని పక్కకి వెళ్ళనా ఆ పక్క నుంచి ప్రియా గారు అన్న పిలుపు వినిపిస్తే అటు చూస్తే మా అమ్మాయి కి మొన్న కొన్న గాజుల సెట్ అండి డైమండ్స్ కదా పాతిక లక్షలు బావుందా అంటూ ఇంకో ఆవిడ ............బావులే వేరండి .....కప్పల బెక బెక లన్నీఒకటే కదా అనిపించింది........

కమల్ గారు మీ వ్యాసం చదివాను నిజమే బావులే వేరు, కప్పలన్నీ ఒకటే నండి. నేను ఇక్కడ మీకు నా అనుభవాలు కూడా చెప్పాలను కుంటున్న .మా ఆడవాళ్ళ విషయం లో కూడా నాకు ఎదురైన సంఘటనలు నేను కూడా బావులు కప్పలు తో ముడిపెట్టుకున్నాను నేను ఈ మద్య ఒక చిన్న పల్లెటూరు వెళ్ళాను. అక్కడ ఎవరూ కూడా ఒకరిని ఒకరు బావున్నారా అని పలకరించు కోవటం కంటే వాళ్ళ పిల్లల ఉద్యోగాలు జీతాలు వాళ్ళు కూడ బెట్టుకున్న ఆస్తుల గురించి ఎక్కువ మాట్లాడు కోవటం కనిపించింది సరేలే ఈ పల్లెల్లో ఆప్యయతలని అమెరికా ఐ .టి .రంగాలు మింగేసినై అను కున్నా. .తరువాత చాలా రోజుల తరువాత కలిసిన ఒక స్నేహితురాలి దగ్గరికి వెళ్ళాను సోషల్ స్టేటుస్ తను అను కుంటున్న హై క్లాసు సోసేటి ఫ్రెండ్స్ గురించి తప్ప తన దగ్గర నుంచి ఒక చిన్న ఆత్మీయ పలకరింపు ని కూడా అందుకోలేక పోయాను ..కొత్తగా వచ్చిన స్టేటుస్ తో వీల్లలోని మనుషులకి సంబంధించిన ఫీలింగ్స్ మాయమై పోనిలే అనుకుంటూ నీరసంగా విజయవాడ క్లబ్ అనబడే మీరు చెప్పిన కోస్తా కల్చేర్ ఎక్కువ గా కని పించే చోటికి వెళ్లి మనుషులు కోసం వెతకటం మొదలపెట్టా ఇంతలో ఒక పరిచయస్తురాలు దగ్గరగా వచ్చి చీరల గురించి మాట్లాడం మొదలెట్టింది ఎంతా ఇరవై వేలే నలభై వేలే అని చెప్పటం మొదలెట్టింది చాలా కస్టపడి ఆవిడని తప్పించుకుని పక్కకి వెళ్ళనా ఆ పక్క నుంచి ప్రియా గారు అన్న పిలుపు వినిపిస్తే అటు చూస్తే మా అమ్మాయి కి మొన్న కొన్న గాజుల సెట్ అండి డైమండ్స్ కదా పాతిక లక్షలు బావుందా అంటూ ఇంకో ఆవిడ ............బావులే వేరండి .....కప్పల బెక బెక లన్నీఒకటే కదా అనిపించింది........

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followersమాలిక: Telugu Blogs