.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

   తన భుజం రాసుకొంటూ నిల్చుని వున్న చెన్నారెడ్డి.
  కర్చీఫ్‌తో చేతులు తుడుచుకుంటున్నాడు.
 బాత్రాంకు వెళ్లి వచ్చినట్లుంది.
  ఒక్క క్షణం విభ్రాంతి నుంచి కోలుకొని ప్యాంటు జేబుల్లోని చేతుల్ని బాంబులతో సహా బైటకు తీస్తూ వెనక్కి వెనక్కి సర్దుకొంటున్నాడు మజ్జిగ గోపాల్.
  అప్పటికే చెన్నారెడ్డి మెదడులో ఏదో సన్నని కదలిక
 ’మజ్జిగా ! ’ అంటూ బాలుడు పిల్చిన పిలుపు ఆయన చెవుల కూడ పడింది.
 వెంటనే గుర్తొచ్చింది అది తమ ప్రాంతానికి సంబందించిన యింటి పేరనీ,  ఆ ఇంటి పేరున్న యువకుడొకడు తనను చాలా పర్యాయాలు వెంటాడాడనీ.....
 ఆయన కళ్లు భయంతో అటు ఇటు చూశాయి.
 మజ్జిగ గోపాల్‌ను చూడగానే గుర్తుబట్టాడు.
 చేతిలో వస్తువుతో పొజిషన్ తీసికోబోతోన్న అతని కదలికల్ని కూడా పసిగట్టాడు.
 ఆప్రయత్నంగానే అతని శరీరమంతా జాగృదావస్థకు గురయి క్షణం కూడా ఆలస్యం చేయకుండా జనాల మద్యన బడి పరుగుదీశాడు.
  అందరూ ఆశ్చర్యపోతూ వుండగా అతన్ని వెంబడించాడు మజ్జిగ.
  చెన్నారెడ్డి గేటును సమీపించబోతోండగా కుడిచేతిలోని బాంబును గురిజూసి బలంగా విసిరాడు.
 అది గురితప్పకుండా వెళ్లి చెన్నారెడ్డి భుజానికి తగిలి పెద్ద విస్ఫోటనంతో పేలింది.
 చేయి తెగి దూరంగా విసరేయబడింది.
 ప్రాణభయం చెన్నారెడ్డిని అప్పటికీ అక్కడ నిలబడనీయలేదు.
 దెబ్బ బిర్రున రెండంగల్లో కారు చేరుకొని డోర్ మీద చేయి వేయబోయాడు.
 అప్పటికే సమీపానికి చేరుకొన్న బాలుడు తన చేతిలోని బాంబుతో బలంగా కొట్టాడు అతన్ని.
 బాంబు సూటిగా వెళ్లి చెన్నారెడ్డి కడుపులో తగిలి ’డబ్ ’ మని నీళ్లలో పేలినట్లుగా శబ్దమైంది.
 కడుపు ఛిద్రమైంది.
 పేగులు, అందులోని కసరు చుట్టు పక్కల చిమ్మంది.
 శబ్దం కూడ చేయకుండా నేలకొరిగాడు చెన్నారెడ్డి.
 అప్పటికే పెళ్లి జనమంతా కకావికలై నలువైపులకూ పరుగులు తీస్తున్నారు.
 తృటిలో ప్రాణం పోయింది చింతకుంట చెన్నారెడ్డికి.
 ఆ విషయం అందరికీ అర్థమైంది.
 తమ కళ్ల ముందు  జరిగిన ఆ సంఘటనను నమ్మలేకపోతున్నారు శివపురి వర్గీయులు.
 అంతదాకా ఆటోలో కూచుని మొహానికి పేపర్ అడ్డుంచుకొని అందరికీ సూచనలు, సలహాలు యిస్తూ ఆపరేషన్ దిగ్విజయంగా నెరవేరేలా చేసిన జయసింహ ఆటో దిగాడు. చెన్నారెడ్డి శవం వద్దకెళ్లి అర్దనిమిషం పాటు తదేకంగా చూశాడు.
  ఈలోగా మిగిలిన వాళ్లంతా అక్కడకు చేరుకొన్నారు. శవం చుట్టూ వలయంగా నించుని కసిదీర చూశారు.
ఉన్నట్టుండి నోట్లో వెలుంచి యీలేసి చిందులేస్తూ శవాన్ని కాళ్లతో తన్న సాగాడు రాఘవ.
చుట్టూ ఓ సారి చూశాడు జయసింహ.
 భయాన్నించి తేరుకొన్న జనాలు మెల్లిగా దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పెళ్లి పెద్దలు కేకలేస్తున్నారు.  " మీకు బుద్దిలేదు..పోండి.. ఇక్కన్నించి వెళ్లిపోండి.."  అంటూ.
 చేతిలో బాంబును నేలకేసి పీకాడు జయరామిరెడ్డి.
 వాసుచేతి బాంబు కూడ నేలమీద బద్దలయ్యేసరికి జనం దూరంగా జరిగారు.
 చెన్నారెడ్డిని తిట్టటం, వూయటం, తన్నటం చాలించలేదు రాఘువ తదితురులు.  శవం మీద కూడా తమ కసిదీర్చుకుంటున్నారు.
 " రేయి !  ఇక చాలు.. ఆటోలెక్కండి.. "  తమ వాళ్లకు ఆర్డర్స్ పాస్ చేస్తూ తను ఆటో వద్దకు నడిచాడు జయసింహ. అతనికి అనుమానంగా వుంది ఎవరైనా పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి చెప్పివుంటారేమోనని.
 అందరూ అలర్ట్ అయి ఆటోలకేసి కదిలారు.
 అప్పటికే వాచ్‌మెన్ జనాన్ని వెంటేసుకొని వస్తున్నాడు అక్కడికి.
 శివపురి మనుషులంతా ఆటోలు ఎక్కారు. మజ్జిగ గోపాల్ తప్ప. అతనికి కడుపులో కైపూ, ఎదలో కసీ రెండూ కలిసిపోయి ప్రపంచం కన్పించలేదు.
 " రేయి ! నాకొడకా ! నిన్ను నమ్మకూడదురోయ్ ! నువ్వు మల్లా బతికొస్తావు. నువ్వు బతికితే మాలాంటోల్లందరం సావాల్సిందే.. నువ్వు బతగ్గూడదురోయ్ ! "  అంటూ పక్కనే వున్న పెద్ద బండరాతిని ఎత్తుకొన్నాడు.
 " రేయి మజ్జిగా !  పోలీసులొస్చనారురా.. రారా నాకొడకా ! "  కోపంగా కేకలేశాడు బాలుడు.
 " ఉండన్నా.. యీన్ని సంపనీ ! "  అంటూ బండరాతితో చెన్నారెడ్డి తలమీద మోదాడు.
 తన తల పట్టుకున్నాడు బాలుడు.
 జయసింహ కేకలేస్తున్నాడు.
 అప్పటికే వాచ్‌మెన్ తోటి వచ్చిన జనాలు మజ్జిగను చుట్టుకొన్నారు.
 వెనకెక్కడో పోలీసు జీపు శబ్దం.
 " పట్టుకోండి వాల్లను పట్టుకోండి.."  జనాల్ని రెచ్చగొడుతున్నాడు వాచ్‌మెన్.
  బాంబులేస్తే అమాయక జనం హతమవుతారు.
 వెంటనే ఆటోలు కదిలిపోయాయి అక్కణ్నించి.
 నే్రుగా రామంతపూర్‌లోని ఆఫీసుకెళ్లి ఇంటికి ఫోన్ చేశాడు జయసింహ.
ఆ వార్త కోసమే కాచుకొని వున్నాడు రమణారెడ్డి.
  ఉదయం నించి శివపురిలోనే వున్నాడు. గడపదాటి బైటకు అడుగేయలేదు.
 చెన్నారెడ్డి చావు వార్త వినగానే ఆనందం పట్టలేకపోయాడు.
 ఇంట్లోంచి బైటకు పరుగెత్తి అందరికీ కేకలేసి చెప్పాడు.
  వీధుల్లో వాళ్లందర్నీ చేయెత్తి పిల్చి మరీ పెద్ద స్వరంతో చెప్పాడు  " చంపినాం... మా చిన్నాయన్ను చంపిన చెన్నారెడ్డిగాన్ని చంపినాం.. మా కసిదీర్చుకొన్నాం.. "  అంటూ రొమ్ముమీద చరుచుకొని చెప్పాడు.
  ఆనందంతో గంతులేశారు ఇంటిల్లి పాది.
  ఊరి జనమంతా వచ్చి గుమిగూడారు.  వాళ్ల ఆనందంలో పాలుపంచుకొన్నారు.
 " ఒరే పాములేటి ! "  పెద్దిరెడ్డి పిలుపుతో బిర బిర దగ్గరగా వచ్చాడు గొల్లోల్ల పాములేటి  " ఏం రెడ్డి నాయనా ! "  అంటూ.
  " మాంచి మేసిన పొట్టేలు పదిగావాల.. గంటలోపల కావాల.. నువ్వేసావు సస్తావో నాకు తెల్దు.. మాపటికి పొట్టేల్ల తెగనరికి వూరవిందు పెట్టాల్రా...."   చెప్పాడు.
 " జయ్ రెడ్డి నాయనా ! "  అంటూ వేలు నోటబెట్టి యీలేశాడు. పాములేటి క్షణంలో అదృశ్యమైపోయాడు.
  ఇంట్లో కెళ్లి ఫోను ముందు కూచున్నాడు రమణారెడ్డి.
 తాలూకాలోని తన వర్గీయులందరికీ ఫోన్లు చేయటం మొదలు పెట్టాడు.
  చెన్నారెడ్డి చావు వార్త వినగానే చాలా వూర్లల్లో పటాసులు పేల్చారు. వీధులంతా దీపావళి పండుగ వాతావరణాన్ని సృష్టించారు. శివపురిలో లాగే పొట్టేళ్లను కోసుకొని విందు చేసికొన్నారు.
  మరో గంటకే రేడియోలో, టీ.విల్లో మార్మోగి పోయింది చెన్నారెడ్డి మరణవార్త..
  బాంబుల చెన్నారెడ్డి బాంబులతోనే హతమయ్యాడనే వార్త రాష్ట్రమంతా తెలిసే సరికి హైదరాబాదులోని హంతకముఠా సాంతం పోలీసులకు దొరికిపోయింది.
 మజ్జిగ గోపాల్ ద్వారా సమాచారం తెలుసుకొన్న పోలీసులు వాళ్ల బస చేసిన లాడ్జి మీద, ఆఫీసు మీద ఏక కాలంలో దాడి జేశారు. పారిపోవటానికి సిద్దంగా వున్న శివపురి వర్గీయలందర్నీ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
 వాళ్ల అరెస్ట్ గురించి ఎవరూ బాధపడటం లేదు.
 అది అనివార్యమైన చర్యగా అందరికీ తెలుసు.
 ప్రస్తుతానికి తప్పించుకు పారిపోయివచ్చినా ఇక్కడైనా అరెస్ట్ కావలసిందే.. తప్పదు.
  చెన్నారెడ్డి వ్యతిరేక వర్గం చాలామంది శివపురి చేరుకొన్నారు.
  రాత్రి అక్కడ బ్రహ్మాండమైనా విందు జరిగింది.
 అదే సమయంలో చెన్నారెడ్డి వర్గీయులంతా అంతులేని ఆక్రోశంతో బద్వేలు టౌనులోని జాతీయ పార్టీ మద్దతుదారుల ఆస్తుల్ని ధ్వంసం చేయటానికి ఉపక్రమించారు. వాస్తవానికి ఈ సాంప్రదాయం కడప ప్రాంతంలో ఎప్పుడూ లేదు..! అప్పటికి నాలుగేళ్ల క్రితం విజయవాడలో వంగవీటి రంగా హత్యానంతరం జరిగిన ఆస్తుల విద్వంసం.. గృహదహనాల సాంప్రదాయం చెన్నారెడ్డి హత్యతో మెల్లిగా రాయలసీమ వైపు ప్రాకింది..ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా.!  లూటీలు. గృహదహనాలు యధేచ్చగా సాగాయి. కడపనించి ఎస్పీగారు అక్కడికొచ్చి తిష్ట వేసేదాక ఆస్తుల విధ్వంసం జరుగుతూనే వుంది.
  అవేవీ పట్టించుకోలేదు శివపురి వాళ్లు.
 తన వాళ్లంతా జైయిల్లో వున్నారు.
 బెయిలు తెచ్చుకొని బైటకు రావటం ఏమంత కష్టం కాదు.
 ఇలాంటి కేసులకు సాక్షులుండరు. ఉన్నా కోర్టువరకు రారు.
 కేసు కొట్టివేయబడుతుంది.
 లూటీలు, గృహదహనాల గురించి కూడా చింతలేదు. చెన్నారెడ్డి బతికి వుండటం వల్ల జరిగే నష్టం కన్న ఇది చాలా తక్కువ గదా!
 అందుకే ఎవరూ వాటిని తీవ్రమైన విషయాలుగా గుర్తించటం లేదు.
 శివపురికి ఏమాత్రం తీసిపోకుండా ఆ రాత్రి టేకూరులో కూడా సంబరాలు మిన్నుముట్టాయి. చెన్నారెడ్డి మరణవార్త తెలియగానే ఓ ముసలాయన ఆనందం తట్టుకోలేక గుండెపోటు వచ్చి విలవిల్లాడాడు.
 టేకూరు గురివిరెడ్డి భార్య ఇంకా ముండమోయలేదు. తన భర్తను శివపురి ఓబుళరెడ్డితో కలిపి షాద్‌నగర్ వద్ద నరికి చంపినప్పటినుంచి ఆమె సంప్రదాయ బద్దమైన కర్మకాండ జరుపుకోలేదు. తన మొగున్ని చంపిన వాడు చచ్చేంత దాకా తాళిబొట్టు తెంచనని భీష్మించుకొంది.
 ఆమెకు తోడు తాలూకాలో మరికొంతమంది వున్నారు.
 వాళ్లందరికీ అంతులేని ఆనందంగా వుంది.
 టేకూరి గురివిరెడ్డి భార్యనించి అందరికీ వర్తమానం వెళ్లింది  ’తామంతా ఒకే ముహర్తంలో గాజులు పగులగొట్టుకొందా ’ మని.

                                 **********౮

  చెన్నారెడ్డి భార్య రమాదేవి శోకంతో తడిసి ముద్దయింది ఆవేదనతో గొంతు పూడుకు పోయింది.
 హైదరాబాదు వెళ్లేందుకు జీపెక్కింది.
 ఆమె వెంట మరికొంతమంది ఆడాళ్లు ప్రయాణమయ్యారు.
  నీరసంతో వేలాడిపోతోంది ఆమె.
  భర్త చివరి సారిగా  ఫోన్ చేసినపుడు ఆమెకెందుకో అనుమానమొచ్చింది. ఎప్పుడూ ఏడ్చి ఎరుగని తను బాగా ఏడ్చింది అయన్ను ఇంటికి రమ్మని బతిమాలింది.
 తన మనస్సెందుకో కీడు శంకించింది. తన ప్రమేయం లేకుండానే ఆపదను పసిగట్టింది. తను దాని సూచనలు సరిగ్గా అమలుపరచలేకపోయింది. భర్తను బలవంత పరచి అయినా ఇంటికి రప్పించుకోలేకపోయింది.
 మిన్ను విరిగి మీద పడినట్లుగా వుంది ఆమెకు.
 కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
 శోకించి శోకించి శోష వచ్చింది.
  హైదరాబాదు చేరుతూనె ఆమెను హాస్పిటల్‌లో అడ్మిట్ చేయవలసి వచ్చింది.
 బి.పి. కంట్రోలయి ఆమె మామూలు స్థితికి వచ్చేసరికి ఉదయం పదిగంటలైంది.
  తన వెంట వచ్చిన ఆడవాళ్లు, ఇద్దరు పోలీసులు అక్కడున్నారు.
 తనెక్కడుందో అర్థం చేసికొనేసరికి భర్త గుర్తొచ్చాడు.
 ఆయన్ను చూడాలంటూ గోలజేసింది.
 డాక్టర్ల సలహామేరకు ఆమెను హాస్పిటల్ నించి బైటకు తెచ్చారు.. అందరూ జీపెక్కారు.
  జీపు కదిలింది.
 పదిహేను నిమిషాల పాటు రోడ్లన్నీ చుట్టి రాజ్‌భవన్ వద్ద ఆగింది.
  ఆమె దిగే సరికి అక్కడ ఓ పెద్ద గందరగోళం జరుగుతూ వుంది. చెన్నారెడ్డి శవాన్ని వడిరోడ్డు మీదుంచి ప్రభుత్వ వైఖరికి నిరసన తెలుపుతున్నారు. శవాన్ని పోస్త్ మార్టమ్ కూడా చేయనీకుండా అడ్డుపడి తానే స్వయంగా ఓ వైపు పట్టి మోసుకొచ్చి గవర్నర్ బంగళాముందు దించాడు ప్రాంతీయపార్టీ అధ్యక్షులు.
 జనాలంతా తండోపతండాలుగా అక్కడికొచ్చారు..
 పోలీసులు వాళ్లను చెదరగొడుతున్నారు.
 ప్రజానీకాన్ని ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసింగిస్తున్నారు పార్టి అద్యక్షులు. జాతీయపార్టి ఏలుబడిలో అరాచకం తాండవిస్తోందనీ, ప్రతిపక్షపార్టీకి సంబందించిన ప్రజా ప్రతినిధులకు రక్షణ కరువైందనీ ఎలుగెత్తి అరుస్తున్నారు.
 అంతలో రమాదేవి అక్కడకు రావటంతో ఆయన మరింత గట్టిగా మాట్లాడసాగాడు. గవర్నర్ గారు తక్షణమే స్పందించి యీ అభాగ్యురాలికి న్యాయం చేకూర్చాలని విన్నవించాడు.
 చెన్నారెడ్డి భార్య హృదయ విదారకంగా ఏడుస్తోంది. ఏడ్పు కంటే ఎక్కువగా గొంతెత్తి అధికార పార్టీని శపిస్తోంది. హోం మంత్రిని తిడుతోంది. ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తోంది.
 ప్రభుత్వం నోరు విప్పలేకపోతోంది.
ప్రాంతీయపార్టి అద్యుక్షుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతోంది.
 అదే సమయంలో బద్వేలు నించి ఓ ఇరువై జీపులు ప్రయాణమయ్యాయి హైదరాబాదుకు. చెన్నారెడ్డి ద్వారా భర్తల్ని కోల్పోయిన టేకూరి గుర్విరెడ్డి భార్య, శివపురి ఓబుళ రెడ్డి భార్య లాంటి వాళ్లు ఒక్కో జీపులో ఒక్కరు వంతున తమకు తోడుగా జీపుల నిండుగా ఆడవాళ్లను ఎక్కించుకొన్నారు.
 తెల్లావారేసరికి హైదరాబాదులో దిగారు. వాళ్లంతా.
 నేరుగా ట్యాంక్‌బండ్ పైన తిష్టవేశారు.
 తామంతా చెన్నారెడ్డి చంపించిన వాళ్ల పెళ్లాలమంటూ తెలిపేసరికి మీడియా అంతా అక్కడకు చేరుకొంది.
   మీడియా ప్రతినిధులంతా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
 " మా మొగుండ్లను సంపించి మమ్మల్నందర్నీ దిక్కులేనోల్లను చేసిన చెన్నారెడ్డి చచ్చినందుకు మాకు సంతోషంగా వుంది. ఆయన రాక్షసుడు. ఆయప్ప సస్తానే మేమంతా పండగ చేసుకున్యాం "  గురివిరెడ్డి భార్య చెప్పింది.
  " ఇప్పుడెందుకొచ్చినారమ్మా మీరంతా ? "  మీడియా ప్రశ్న.
 " మొగుడు సచ్చినాడనే అందర్నీ శాపాలు పెడ్తాంది గదా రమాదేవమ్మా !  ఆమె మొగుడు మా మొగండ్లను సంపినప్పుడు మా ఏడుపులు ఆమెకు యినపల్లేదా ?  మా మొగుండ్లనెవుర్నీ యిట్లా ఎత్తికొచ్చి గవర్నరు కాడ పెట్టి న్యాయం జెయ్యమని వాళ్ల పార్టి అద్యక్షుడు అడగలేదే..! ఇప్పుడు వాల్లు అడుగుతా వుండారు కాబట్టి ఆమెకేదయినా ప్రభుత్వం న్యాయం జేస్తే.. మాగ్గూడా అదే న్యాయం జేయాలని అడగడానికి వచ్చినాం. గవర్నరు పూనుకొని ఆమె మొగున్ని ఆమెకు తెచ్చిచ్చేట్లయితే మా మొగుండ్లనూ మాకు తెచ్చిస్తాడేమోనని వొచ్చినం.."   అవాక్కయ్యారు విలేకరులు
 తమ మొగుళ్లు చచ్చినా తాము ముండ మోయలేదనీ, చెన్నారెడ్డి చచ్చేంతదాకా ముండ మోయకూడదని తీర్మానించుకున్నామనీ, ఇప్పుడు ఆయప్ప చచ్చాడు గాబట్టి అందరం మూకుమ్మడిగా మాంగళ్యం తొలిగించుకోంటున్నామనీ మీడియా ముందు ప్రకటించారు.
 ట్యాంక్ బండ్ మీదే కడప ఆడవాళ్లంతా మూకుమ్మడిగా గాజులు పగులగొట్టి, మట్టెలు తొలిగించి, తాళి బొట్టు తెంపుకొని సంప్రదాయ బద్దంగా విధవలయ్యారు.

                                              *********

  రాఘవకు అప్పుడప్పుడూ తను చేసిన పొరబాటు గుర్తుకొస్తూ వుంటుంది. తనకు తెలిసిన విషయాన్ని అందరికీ చెప్పి వుంటే సాక్ష్యాల్లేకుండా లేపేసేవారు చెన్నారెడ్డిని. ఈ కేసులూ, లక్షల్లక్షలు ఖర్చు కావాటాలూ, హైకోర్టులూ, అంతులేని టెన్షన్లూ వుండేవి కావు. టీం స్పిరిట్ మరచి పోయి వ్యక్తిగత ప్రతిష్ట కోసం తను ప్రాకులాడటం వల్లే చెన్నారెడ్డి రహస్య జీవితాన్ని గురించి జయసింహకు చెప్పలేదు.

                                  ******

  బద్వేలు తాలూకాలో ఇప్పుడు శివపురి సోదరుల గాలి బలంగా వీస్తోంది. ఎంత బలంగా అంటే - తుఫాను గాలులంత బలంగా, ఆ వడి గాలులంత తీక్షణంగా.
  శివపురి రమణారెడ్డి పేరు చెబితే జనం భయపడుతున్నారు. అతనికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు జంకుతున్నారు.
 రేపు ఎలక్షన్లలో అసెంబ్లీకి తనే పోటీ చేయాలని నిర్ణయించుకొన్నాడు రమణారెడ్డి.
  జి.పి.ఆర్ గాని, సోమనాథరెడ్డి గాని, రామసుబ్బారెడ్డి గాని నోరు మెదపలేదు. అతని అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు అన్ని కంఠాల్ని ఏకం చేసుకొంటున్నారు.
 చెన్నారెడ్డి పోయాడు  కాబట్టి తమకు ఎదురుండదని, తాలూకా అంతా తన గుప్పెట్లో వుంటుందనీ రమణారెడ్డి వూహ.
  కానీ...  చెన్నారెడ్డి చివరిదశలో సాగించిన కొత్తరకపు రాజకీయాన్ని గురించి వాళ్లకు తెలీదు. అది అవగాహనకు రావాలంటే ఎలక్షన్లు జరిగి ఫలితాలు వెలువడక తప్పదు.

                                 *********

     కండబలాన్ని, గుండె బలాన్ని నమ్ముకున్న శివపురి రమణారెడ్డి. చెన్నారెడ్డి తన వారసులకు అందించిన కొత్తరకపు రాజకీయాన్ని అర్థం చేసుకొనేసరికి పదేళ్లు పట్టింది. చింతకుంట రాజకీయ వారసునిగా వచ్చిన చెన్నారెడ్డి అన్నకొడుకు రెండు దపాలుగా రమణారెడ్డిని ఓడించాడు. చివరిరోజుల్లో తన పినతండ్రికి కలిగిన ఙ్ఞానోదయం అతనికి రాజకీయ పునాదిని బలంగా నిర్మించింది.
  మూడవ దఫా అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం రమణారెడ్డి తమ్ముని చేతిలో అతను పరాజితుడయ్యాడు.

                                                                                                              ..... సమాప్తం.
 చివరిగా నా మాట.....

  ఈ నవలలో మా రచయత సమయభావం వలనో లేక గుర్తుకు రాకపోవటం వలనో కాని మరి కొన్ని సంఘటనలు స్పృశించకుండా వదిలివేశారు. ముఖ్యంగా ముఠాకక్షల నేపధ్యంలో  స్త్రీల పాత్రలు.. వారి ప్రభావం గురించి తగినంతగా పొందుపరచలేదు ఈ నవలలో.
   ఈ నవలలో అక్కడక్కడ మాత్రమే చెప్పుకున్న చెన్నారెడ్డి భార్య రమాదేవి గురించి వాస్తవంగా చెప్పాలంటే ఆవిడ చాలా ధైర్యవంతురాలు..ఒకవిదంగా చెన్నారెడ్డికంటే ఎక్కువ అని కూడ చెప్పవచ్చు, ఎన్నికల సమయంలో తన వడిలో బాంబులు చుట్టుకొని పోలింగ్ బూతుల్లోకి వెళ్లేది. ఇక చెన్నారెడ్డి ముఠానాయకుడైనా తన ఇద్దరి కొడుకుల విషయంలో చాలా జాగ్రత్తలు వహించే వాడు..తన ముఠారాజకీయాలకు వాళ్లను దూరంగా వుంచాలని చూశాడు..అందుకనుగునంగానే వారిద్దరిని ఊరికి దూరంగా వుంచి చదివించాడు కూడ. తన రెండో కుమారుడు పెద్దవాడికన్న కాస్త దుడుకు స్వభావం కలిగిన వాడు. వాటిని నియంత్రించడానికి కాలేజి ప్రిన్స్‌పాల్‌కి ఎక్కువ అధికారలిచ్చాడు అది ఎంత వరకంటే... ఏ కాస్త తుంటరి పని చేసినా వీపు వాచేలా బడితపూజ చేసేవాడు. కొడుకు కూడ ఒక్క ప్రిన్స్‌పాల్‌కే భయపడేవాడు. ఎప్పుడు తమ పిల్లల చదువుల గురించే ఆలోచించేవాడు, తన ముఠాకక్షలు వాళ్లకు సోకకూడదని, వాటికి దూరంగా ఉండాలనే తపించాడు.
     చెన్నారెడ్డి హత్య తర్వాత ఏర్పడ్డ శూన్యాన్ని చెన్నారెడ్డి అన్న కుమారుడు ద్వారా తీర్చాలనుకొని అన్న కొడుకునే తర్వాత ఎన్నికలకు అభ్యర్థిగా నిర్ణయిస్తే.. అందుకు ససేమిరా వద్దంటూ అన్నకొడుకు భార్య చాలా గొడవ చేసింది,  " మనకు ఈ కుళ్లు,ముఠారాజకీయాలు వద్దు, ప్రశాంతమైన జీవితం చాలు.. నీవు ఎన్నికలలో నిలబడితే నేను ఖచ్చితంగా ’ఉరి ’ వేసుకొని చస్తా "   అంటూ బెదిరించింది, అయినా లెఖ్క చేయలేదు అతను. వెంటనే తన గదిలోకి వెళ్లి తలుపులేసుకొని ఉరికి సిద్దమవుతుండగా రమాదేవి,మిగతా అనుచరులంతా తలుపులు బద్దలుకొట్టి ఉరి నుండి తప్పించారు, ఆమెను కాస్త నెమ్మదిపరచిన తర్వాత తాము ఎన్నికలలో నిలబడకపోతే  రాబోవు రోజులలో తమ జీవితాలు ఎలా చిద్రమవుతాయో వివరించింది, ప్రత్యర్థులు తమ ఉనికిని ఎలా సవాల్ చేస్తారో.. అధికారలేమి తమ జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో వివరిస్తూ బతిమాలి, బతిమాలి ఒప్పించి చెన్నారెడ్డి అన్న కుమారుడిని అభ్యర్థిగా నిలబెట్టారు. అతను ఇంజనీరింగ్‌లో పట్టబద్రుడు, అతనిభార్య పోస్ట్‌గ్రాడ్యేషన్ చేసింది. ఇలా చాలానే వున్నాయి ఈ నవలలో లేని విషయాలు...
                                             **********
  నేను అనుకున్న విషయానికి ఈ నవలకు చాలా వ్యత్యాసం ఉంది. మేము సేకరించిన విషయంలో ఒక చిన్న ఉప కథననుసరించి ఈ నవల రాయడం జరిగింది. ఈ నవల చదివిన వారికి ఒక విషయం స్పష్టం అయుంటుందనే అనుకుంటున్నా..! బయట ప్రపంచంలో మీడియాద్వారా గాని లేక తెలుగు సినిమాల ద్వారా రాయలసీమ  "ఫ్యాక్షన్ నాయకుల " యెక్క స్వభావం తెలుసుకొన్న వారికి, ఈ నవలలో ఉన్న ముఠానాయకుల యెక్క స్వభావానికి చాలా వ్యత్యాసం ఉన్నదనే సంగతి అర్థమై ఉంటుందనుకుంటున్నాను. మన సినిమాలలో రాయలసీమ ముఠానయకులని విలన్‌గా చూపినప్పుడూ వారొక చదువులేని దద్దమ్మగానో లేక మూర్ఖుడుగానో లేక అతనొక మొరటుమనిషి గానో చూపుతారు అంతే కాకుండా అతని పగ ప్రతికార భాగంలో గొప్ప ధైర్యవంతుడుగా చూపుతారు. వాస్తవంగా చెప్పాలంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న ముఠానాయకులంతా " భయస్తులే "  ఇది ముమ్మాటికి నిజం. ఈ భయం అనే భావన కేవలం ఏ ఒక్క ప్రాంతానికే పరిమితం కాదనుకోండి..ఆ " భయం " అన్న భావన ప్రాంత, మత, కులరహితంగా మనుషుల్లో అంతర్లీనంగా దాగి ఉన్నదే..... దేశం మొత్తం ఉన్నదే.  ఆ భయం నుండి పారిపోవడానికి మనిషి అనేకరకాల భావాలకు లోనవుతాడు అందులో భాగమే రాయలసీమ ప్రాంతపు ముఠానాయకుల తీరు కూడ. ఆధిపత్యపోరులో ఇద్దరు వ్యక్తులు పోటి పడుతున్నప్పుడు తన మనుగడకు ఎక్కడ ప్రమాదం ఏర్పడుతుందోనన్న భయంతో తన ప్రత్యర్థిని భౌతిక నిర్మూలనకు నడుం బిగిస్తాడు,  మానసికంగా పోరాడే తత్వం లేక పిరికితనంతోనే వ్యక్తి నిర్మూలనుకు పూనుకుంటాడు. ఆ భాగంలోనే ఈ హత్యలు. అయితే మిగతా ప్రాంతంలో కూడ ఆధిపత్యపోరు ఉన్నదే..కాకపోతే అక్కడ వ్యక్తి నిర్మూలన ఉండదు... కేవలం చాణక్యడి రీతిలో ఎత్తుకు పైఎత్తులు వేస్తారు, తమ తమ  తెలివితేటలు ఉపయోగించి ప్రత్యర్థి ఉనికిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. అంతే తేడా..!.

      ఇక చదువులు, నిరక్షరాసత. ఈ విషయంలో మీడియా, సినిమాలు రాయలసీమ ప్రాంతంలో ముఠాకక్షలు ప్రజ్విల్లడానికి కారణం నిరక్షరాసతనీ, విద్య ఉంటే ముఠాకక్షలు మటుమాయం అవుతాయని  తెగ ఊదరగొట్టేశాయి, అంతేనా మన బ్లాగ్ లోకంలో ఒక మహిళా బ్లాగర్ కూడ ఇదే విషయాన్ని నొక్కి వక్కానించారు. ఇవన్ని చూసి నవ్వుకోవడం తప్ప ఏమి చేయలేం.
     మిగతా ప్రాంతంలోలాగే ఇక్కడ కూడ అక్షరాసత..నిరక్షరాసత సమపాళ్లలోనే ఉంది..అంతే కాని పూర్తిగా నిరక్షరాసత లేదు..ఇంకా ఒక విదంగా చెప్పాలంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ముఖ్యంగా కోస్తా, సర్కారు జిల్లాల తీరప్రాంతాలతో పోలిస్తే రాయలసీమలో విధ్యనభ్యసించే వారి సంఖ్య ఎక్కవే అనిపిస్తుంది. దానికి కారణం.. రాయలసీమలో ఉన్న ’కరువు ’. ఇల్లరికం వచ్చిన అల్లుడిలా ఎప్పుడూ అంటిపెట్టుకొని వుండే కరువు వలన ఇక్కడి రైతులు సంవత్సరానికి ఒక్క పంట పండించడమే గగనం. అందుకే ఇక్కడి రైతులు పుడమితల్లి కంటే చదువుల తల్లి మీద మమకారం ఎక్కువ, 40 ఎకరాల ఆసామి కూడ ఉన్న పొలం అమ్మి అయినా తన కొడుకులకు చదువులు చెప్పిస్తాడు ..! అందుకే ఇక్కడ I.S.I  మార్కుల్లా ఇంజనీరింగ్ పట్టభద్రులు, డాక్టర్లు ఎక్కవగా ఉంటారు. అదే కోస్తా తీరప్రాంతాలలో 4 ఎకరాల ఆసామికి ఒక కారు, ఒక చిన్న సైజు బంగ్లా ఉంటుంది అందుకు కారణం సంవత్సరానికి మూడు లేక రెండు పంటలు పండించే అవకాశం దండిగా వుంటుంది, నీరు సంవృద్దిగా ఉన్న చోట ధనం నిండుగా ఉంటుంది. అదున్న వారికి ఒకరి కింద పని చేయాల్సిన అవసరం అన్నది మానసికంగా అంగీకరించలేరు. అందుకే అక్కడ అక్షరాస్యత కొద్దిగ తక్కువే ఒకప్పుడు. ఇప్పుడా పరిస్థితి లేదనకుంటాను. అందరూ చదువలవైపే మొగ్గు చూపుతున్నారు.
      చాలా మంది ముఠానాయకుల్లో అక్షరాస్యత కలిగిన వాళ్లే ఎక్కువ. ఒకప్పటి మా వూరి మాజి ఎమ్మెల్యే డా.యమ్.వి.రమణారెడ్డి ముఠానాయకుడే..కాని ఆ పదాన్ని ఆయన ఒప్పుకోరు, ఆయన మొదట ఒక కమ్యూనిస్టు. ఆ సమయంలో చాలా మంది పేదలకు ఉచిత వైద్యం అందించాడు, దానివలన అతనికి పేదల్లో మంచి గుర్తింపు ఆదరణ ఉండేది. తర్వాత రాను రాను అతనిలోని స్వార్థమో లేక మరేదో కాని మార్పులు వచ్చాయి అంతే ఒక్క సారిగా ముఠానాయకుడి అవతారం ఎత్తాడు, దాని పర్యవసానమే రకరకాల హత్యలు జరిగాయి, కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం జైలుకు వెళ్లడం ఇలా నేపధ్యంలో తన కేసులు తనే వాదించుకోవడానికి బెంగళూరు వెళ్లి ఎల్.ఎల్.బి చేశాడు ప్రైవేటుగా. యావజ్జీవ కారాగార శిక్ష వేస్తే అది అనభవిస్తూ  తన కేసులో బేంచ్‌మీద ముగ్గురు సుప్రీం జడ్జీలు ఉన్నా న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాల సాయంతో యావజ్జీవ ఖైదు నుంచి బైట పడ్డాడు. అంత తెలివైన వ్యక్తి ఒక ముఠానాయకుడి అవతారమెత్తాడు. మరో విచిత్రం ఆయనకు సాహిత్యంలో కూడ ప్రవేశం ఉన్నది. చాలా కథలు రాశాడు.. వివిద పత్రికల్లో కూడ ప్రచురితమయ్యాయి. 2000 సంవత్సరంలో విశాలాంద్రవారు శతాబ్ద కథాసంకలన  పుస్తకం ప్రచురించారు, అందులో 100 కథకుల్లో ఈయన కూడ ఒక కథకుడే " రెక్క మాను " అనే ఈయన రాసిన కథకు చోటు కల్పించారు. అంతేనా ఆయన జైలులో ఖైదిగా ఉన్నప్పుడు చాలానే ప్రపంచ సాహిత్యం చదివారు.. అందులో తనెక్కువగా ఇష్టపడిన ఫ్రెంచి నవలాకారుడు హెన్రీ షారియర్ రాసిన " పాపియాన్ " నవలను తెలుగులోకి  " రెక్కలు చాచిన పంజరం "  పేరుతో రెండు భాగాలుగా అనవదించాడు.  ముఠానాయకుడిగా మారకమునుపు ఈయన కొన్ని పత్రికలు నడిపాడు. ఒకప్పుడు విరసంలో సభ్యుడు కూడ. ఇతని గురించి చెప్పాలంటే చాలానే ఉంది.." కసి " నవలకు మూడింతల నవల అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది చదువుకున్న ఇంజనీర్లు, డాక్టర్లు, వకీలు ముఠానాయకులుగా వున్నారు. అయితే ఇప్పుడు ఒకప్పటి ముఠానాయకులు లేరు.. వాటి శకలాలే మిగిలి వున్నాయి..వాటి బూచిని చూపీ ఆర్థికంగా బలబడుతున్నారు కొందరు.

  ఇక అక్కడి సామాన్య ప్రజలకు ఈ ముఠాకక్షలతో ఎటువంటి సంబందాలు ఉండవు ఎవరి జీవితాలు వారివి.. అంతే గాని ముఠానాయకులు సామాన్యల జీవితంలో జోక్యం చేసుకోరు. ఇక్కడి చదువులు, వ్యాపారాలు, మిగతా ప్రాంతాలలాగే షరామామూలుగానే ఉంటుంది. ఎవరి వారి ధినచర్యల్లో బిజీగానే ఉంటారు, అంతే గాని సినిమాలలో చూపినట్లుగా చీటికి మాటికి గొడవలు, హత్యలు చేసుకోరు. కడప, రాయలసీమ అనగానే అమ్మో బాంబులు అంటు హాస్యం ఆడతారు, అంతేగాని సరస్వతీ పుత్రులైన శతావధాని శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు వారు గుర్తుకు రారు, తాళ్లపాక అన్నమార్యులు తలంపులోకి రారు, పోనీ తెలుగు చలనచిత్ర సీమలో ఏదో కనీసం కొన్ని చెప్పుకోదగ్గ ఆణిముత్యాలు తీసిన బి.ఎన్.రెడ్డి, బి.నాగిరెడ్డి, కె.వి రెడ్డి గార్లు గుర్తుకు రారు అదేమి దురదృష్టమో గాని.
      కనీసం ఇప్పటికైనా మీడియా, సినీవర్గాల వారు, చదువు సంద్యలు లేకపోవడం వలనే రాయలసీమ అలా తగలడింది అన్న నానుడి నుండి బయటకు వస్తే బాగుంటుందేమో...!!.

 ఇలా చెప్పడానికి చాలానే ఉన్నది..అంత ఒకేసారి చెప్పి బోర్ కొట్టించడం బాగోదు అన్న వుద్దేశంతో ఇప్పటికి ఇంతటితో ముగిస్తున్నాను..మిగతా వ్యాసం మరి కొన్ని రోజుల్లో మీ ముందుకు.......

4 comments:

Excellent! fantastic! Especially I like the last part explaining about the truths of RAYALASEEMA..I am really proud of being SEEMA BIDDA.

I am keenly awaiting for next post by Mr sannapureddy.

బాగనే వుంది. మీరు అక్కడక్కాడా కావాలని వాడిన రాయలసీమ యాస, మధ్యలో ప్రామాణిక భాష రావాల్సిన ఎఫెక్ట్‌ను తేలేదుఏదో కోస్తా ప్రాంతపు రచయిత రాయలసీమలో వుంటూ విన్నవి చూసినవి చెప్పినట్టు వుంది. ఐ మీన్, రాగి ముద, ఎరగారం రుచి రాలేదు, రాగి సంగటి గోంగూర పచ్చడితో తిన్నట్టు, ఓలాగ వుంది.
ఐతే ఆసక్తి కరంగా వుంది, ఇంకా, ఇంకా ఆ రతనాలసీమ కొండరాళ్ళ మధ్యనుంచి వచ్చే వేడి గాలుల్ని ఆస్వాదించాలని ఆసిస్తున్నా

ఫ్యాక్షనిజం-నిరక్షరాస్యత గురించి ఓ స్త్రీ బ్లాగర్ చెప్పినట్లు చెప్పిన అభిప్రాయాలతో చాలావరకూ ఏకీభవిస్తాను. మీరు ముఠానాయకుల గురించి చెబుతుంటే, ఆమె ముఠా పావుల గురించి చెప్పివుంటారు

మొదటి అపరిచితులకు థ్యాంక్స్.

@రెండవ అపరిచితులు..

మాందలిక విషం లో మీరు అన్నది నిజమే సన్నపరెడ్డిగారు బద్వేలు తాలుకా పోరుమామిళ్ల తాలుకా బాలరాజు పల్లె వాస్తవ్యులు,ఆ వూరు కడపజిల్లాకు నెల్లూరి జిల్లాకి సరిహద్దుల్లో ఉంటుంది..అందుకే నవలలో అక్కడక్కడ కడప యాస వున్నా చాలా వరకు నెల్లూరి యాస కనపడుతుంది, అంతె కాక కడప నడిబొడ్డు ప్రాంతపు ఆచార వ్యవహారాలు, నడవడిక ఆయన రచనలో కనపడాలనే ప్రయత్నించాము గాని మరీ పూర్తిగా అక్కడి యాస రాస్తే మిగతా ప్రాంతపు పాఠకులకు అసౌకర్యంగా ఉంటుందని.. పాక్షికంగా మాత్రమే యాసను వాడాము.

@మూడవ అపరిచితులకు.
ఫ్యాక్షన్ - నిరక్షరాసత విషయంలో మీరు ఏకీభవించడం అన్నది మీ ఇష్టం, బహుశ మీ అనుభవాలు మిమ్మల్ని అలా ఏకీభవించేలా చేసిండోచ్చు.కాని కేవలం మనకు కనపడే అనుభవాలే యధార్థం కాదు కదా..? దానికో " సత్యం " వుంటుంది, దానిని వెదకడానికే మా ప్రయత్నం. నేను రేనాడు ప్రాంతంలో పుట్టి పెరిగినా కూడ అక్కడ ప్రాంతపు ప్రత్యేక గ్రామ కక్షలు గురించి పరిశోదించి తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో, తపనతో చేసిన ప్రయత్నం ఇది.. కేవలం మా అనుభవాలతోనే ఒక నిర్ణయానికి రాలేదు. ఇంకా రాయాలసినది చాలా ఉన్నది అందులో మీ అనుమానాలు తీరవచ్చు.
ఇక ముఠానాయకులు, ముఠా పాపులు అంటూ రెండురకాల పదబందాలు వాడారు ..హ హ హ బాగుంది మీ పదప్రయోగం. నవలలో ఆ విషయం మీద రచయత చాలా స్పష్టంగా చెప్పాడు..ఎండు కర్రతోటే..పచ్చి కర్ర కూడ కాలుతుంది అందుకు కారణం దాని పక్కన్నే ఉండడం మూలాన అని. కొన్ని అనివార్యం అవుతాయి మరి కొన్ని తెలీకుండా జరిగిపోతాయి.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followersమాలిక: Telugu Blogs