.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

 మండల ఎలక్షన్లు దగ్గరపడ్డాయి.
  అక్కడక్కడా అడదడపా కొట్లాటలు జరుగుతున్నాయి.
  పోలీసు కేసులవుతున్నాయి.
  రిపోర్టులకు ప్రతిరిపోర్టులు, కేసులకు ప్రతికేసులు.
   ఓబుళరేడ్డికి మినిస్టరు అండ దండిగా వుండటం వలన పోలీసుస్టేషన్‌లో ఎమ్మెల్లేతోటి సమాన గౌరవం లభిస్తోంది.
  మండల ఎలక్షన్లలో చెన్నారెడ్డి భార్యమీద టేకూరి గుర్విరెడ్డి భార్యను పోటీకి నిలిపారు.
  తనకు ఎదురు చెప్పేవాడెవడనే అహంకారంతో చెన్నారెడ్డి ప్రవర్తిస్తోంటే, యీ ఎన్నికలు తమకు జీవన్మరణ సమస్యలాగ ఎక్కడలేని పట్టుదలతో కృషి చేస్తున్నారు ఓబుళరెడ్డి ప్రభృతులు.
  తన స్వంతమండలం కాకుండా పోరుమామిళ్ళ మండలానికి తన భార్యను పోటీగా నిలపటం కొంత పొరబాటేమోననిపించింది చెన్నారెడ్డికి, అక్కడ సరైన వ్యక్తి లేకపోవటం, తనకు అడ్డులేదనే గర్వం అతన్ని అలా పురికొల్పింది.
  జాతీయపార్టివాళ్ళు మొండిపట్టుదలతో ఎన్నికల్లో పన్జేయటం - పలితాలు కూడా బాగా తారుమారయ్యాయి.
  చెన్నారెడ్డి నిశ్చేష్టుడయిపోయేంత పరిస్థితి వచ్చింది.
  ఒక్క తన బద్వేలు మండలం తప్ప మిగిలిన ఐదుమండలాల్లో తను ఓడిపోయాడు.
  టేకూరు గుర్విరెడ్డి భార్య చేతిలో తన భార్య ఓడిపోయింది.
  ఆ షాక్‌ను భరించలేకపోయాడు అతను.
  తమ ఓటిమిని సమీక్షించుకొంటే - దీనికంతటికీ కారణం శివపురి ఓబుళరెడ్డిగా తేలింది.
  మండలాల వారీగా వచ్చిన ఓట్లన్నీ లెక్కేసుకొంటే - అతనికి వాలేమిటొ వారి సత్తా ఏమిటో అర్థమయ్యాయి.
  పల్లె పల్లెలుగా నాయకులు నాయకులుగా విడదీసి లెక్కలు మొదలు పెట్టాడు.
  ఒక్క తన మండలంలోనే తనకు భారీ మెజార్టీ వచ్చింది. మిగతా అన్ని మండలాల్లో తను వెనకబడి వున్నాడు.
  తాలుకా మొత్తం కలుపుకొంటే తనమండలంలో వచ్చిన ఓట్లు అంతా కరిగిపోయి రెండువేల ఓట్ల కంటే ఎక్కువ మిగల్లేదు.
  అంటే ... రేపు ఎవడైనా బలమైనా వ్యక్తి తనమీద పోటిజేస్తే ఓటమి ఖాయం.
  దిగ్భ్రాంతుడయ్యాడు చెన్నారెడ్డి.
  దీనికంతటికీ కారణం శివపురి ఓబుళరెడ్డి.
  అతనివల్ల తన  రాజకీయ పతనం ఖాయమయ్యే స్థితికి వచ్చింది.
  రాత్రి తన కుటుంబ సభ్యులతో యీ విషయం మీదనే రహస్యంగా మంతనాలు చేశాడు.
  ఓబుళరెడ్డిని లేపేద్దామన్నాడు చిన్నకొడుకు.
  అంతరంగికులు కూడా ఎగదోశారు.
  భార్య రమాదేవి మాత్రం చూస్తూ వూరుకుంది.
  ఓబుళరెడ్డిని చంపటం అనివార్యమని తేలిపోయింది.
  ఆ రాత్రి నుంచే వ్యూహాలు వూపిరిపోసుకోసాగాయి.
 మండల ఎలక్షన్ల తర్వాత తాలుకా రాజకీయాల్లో ఓబుళరెడ్డి పాత్ర విసృతమైంది. పార్టీ అధిస్టానం వద్ద అతనికో ప్రత్యేకగుర్తింపు వచ్చింది. సివిల్ కాంట్రాక్టు వర్కుల కోసం హైదరాబాద్, కర్నూల్, బెంగళూర్ ప్రాంతాలకు తిరుగుతున్నాడు. సరైనా రక్షణ చర్యలు కూడ చేసుకొనటం లేదు. తనమీద దాడులు జరుగుతాయేమోనని అనుమానం వున్నా, చంపేంత పనికి పూనుకొంటారని అతను భావించటం లేదు.
  ఓబుళరెడ్డిని చంపటమే ధ్యేయంగా కొంతమందిని వినియోగించాడు చెన్నారెడ్డి.
  సమయం కలిసి రాలేదు.
  పని తొందరగా జరగలేదు.
  చెన్నారెడ్డి కొంత అసహన పడుతున్నాడు..
  ఒకనాటి రాత్రి రెండు జీపుల్లో హైదరాబాద్‌నించి వస్తున్నాడు చెన్నారెడ్డి.  తన అన్నకొడుకు, కొందరు ఫాలోయిర్స్..ఇంకా తన మెరికల్లాంటి మనుషులతో నిండివున్నాయి జీపులు.
 హైవే మీద జీపుల వేగం బాగా పెరిగింది.
  లారీల్ని, బస్సుల్ని దాటుకొని వెళ్తున్నాయి.
  ఓ లగ్జరీ బస్సును ఓవర్‌టేక్ చేసింతర్వాత ఉన్నట్టుండి వెనుక సీటులోంచి  " అయ్యా ! అయ్యా !  ఆ బస్సులో వాల్లుండారయ్యా ! "  అన్నాడు తన మనిషి.
  "  ఎవర్రా  ?  "
  " వాల్లేయ్యా !  శివపురి ఓబుళరెడ్డి వాల్లు .."
  ఉలిక్కిపడ్డాడు చెన్నారెడ్డి.
  డ్రైవర్‌కు  సైగ చేశాడు.
 జీవు స్లో అయ్యింది.
  బస్సు తన వేగంతో తాను ముందుకు పోతోంది.
  రెండూ పక్క పక్కగా వెల్తూ వుండగా స్పష్టంగా కన్పించారు వాళ్ళు.  హైదరాబాదు బద్వేలు లగ్జరీ బస్సులో కిటికీ వారనే (పక్కనే) కూచుని శివపురీ ఓబుళరెడ్డి అతని పక్కన్నే టేకూరి గుర్విరెడ్డి.
  షాద్ నగర్ దగ్గరవటం వలన లైట్లు వేసి ప్రయాణీకుల్ని ఏదో అడుగుతున్నాడు కండక్టర్.
  "  మనకాడా ఏమేముండాయి ? "   వెనక్కి ప్రశ్నించాడు చెన్నారెడ్డి.
  చెప్పాడు అతను.
   " షాద్ నగర్ బస్టాండులో బస్సాగుతాది.. తెలుసుగదా !.. జీపులు బస్టాండు గేటుకు రవ్వంత ముందుంటాయి.. పనియిపించుకొని రాండి.. "  చెప్పాడు.
   బస్సు షాద్‌నగర్ బస్టాండులోపలికి వెళ్ళింది.
  చెన్నారెడ్డి జీపులు బస్టాండుదాటి కొంత ముందుకెళ్ళి ఆగాయి.
  రెండు జీపుల్లోంచి ఆరుమంది మనుషులు దిగారు.
  నలుగురి చేతుల్లో వేటకొడవళ్ళు వున్నాయి.
  ఇద్దరి చేతల్లో బాంబులున్నాయి.
   బాంబులు పట్టుకొన్న ఇద్దరు, వేటకొడవళ్ళు పట్టుకొన్న మరో ఇద్దరు ఎంట్రెన్స్‌కు అటుఇటూ తచ్చాడుతోంటే మిగిలిన ఇద్దరు నేరుగా బస్సు వద్దకు నడిచారు.
   బస్సులోంచి ప్రయాణికులు ఒక్కోక్కరే దిగుతున్నారు.
  భోజనాలు చేయదల్చుకొన్నవాళ్ళు హోటల్‌కు వెళ్ళుతున్నారు.
  ఓబుళరెడ్డి, గురివిరెడ్డిలు కూడా బస్సు దిగారు.
  జేబులో చేయిదూర్చి తడువుకొంటూ అటు ఇటు చూస్తోన్నంతలోనే శివపురి ఓబుళరెడ్డ్ మీద దాడి జరిగింది.
  వేటకొడవలి మొదటి దెబ్బ ఖచ్చితంగా మెడమీదనే పడింది.
  చావుకేక వేస్తూ రెండు చేతులు అడ్డుపెట్టాడు అతను.
 మరో దెబ్బ చంకల కింద పడింది.
  అకస్మాత్తుగా జరిగిన ఆ సంఘటన అక్కడి ప్రయణికుల్ని భయప్రాంతుల్ని చేసింది.
  గావుకేకలు వేసికొంటూ చెల్లాచెదరయ్యారు.
  మరో రెండు దెబ్బలకే ఓబుళరెడ్డి కుప్పకూలిపోయాడు.
  దిగ్భ్రాంతి నుంచి తేరుకొన్న గురివిరెడ్డి చావుకేకలేసుకొంటూ గేటుకేసి పరుగెత్తాడు.
  అతన్ని వెంబడించారు ఇద్దరు.
  " వొద్దు...నన్ను సంపొద్దు..మీకు దండం బెడ్తా !.. నన్ను సంపొద్దు.. అంటూ  పరుగెడ్తోన్న గురివిరెడ్డికి ఎదురుగా మరో రెండు వేటకొడవళ్ళు అడ్డుగా నిలబడ్డాయి.
  వెనకనించి వచ్చిన వేటకొడవళ్ళు అతన్ని సమీపించాయి.
  తన్ను చంపొద్దని దీనంగా వేడుకోంటోన్న టేకూరు గురివిరెడ్డి మీద వాలాయి ఓబుళరెడ్డిని నరికిన వేటకొడవళ్ళే.
  జనం కూడుకోబోతోంటే  రెండు నాటుబాంబులు కూడా పగిలాయి.
  ఇద్దర్నీ చంపిన తర్వాత వచ్చినంత వేగంగానే వెళ్ళి జీపుల్లో దూరారు ఆరుమంది మాసులు.
  బైటి జనాలకు అక్కడేం జరుగుతుందో తెలిసేలోపలే జీపులు ఆ ప్రాంతాల నించి వేగంగా వెళ్ళిపోయాయి.
  శివపురి ఓబుళరెడ్డి, టేకూరు గురివిరెడ్డిల  ’శవాలు ’ బస్టాండు లోపల ఒకటి, గేటు వద్ద ఒకటి భీభత్సంగా పడివున్నాయి.
  శవాల చుట్టూ క్రమంగా రక్తం మడుగు కడుతూ వుంది.
  చుట్టూ జనాలు మూగుతున్నారు.

           *******

 షాద్‌నగర్ వద్ద జరిగిన జంటహత్యలు తాలుకాను అతలాకుతలం చేశాయి.  జిల్లాను దిగ్భ్రాంతికి గురి చేశాయి.
 చెన్నారెడ్డి మీదా, అతని అన్నకొడుకూ మరికొందరి మీద కేసు రిజిస్టరయ్యింది.
  ఇంజనీరింగ్ ముగించుకొని ఏవో అవకాశాలకోసం చూసుకుంటూ తాలుకా నెత్తుటి రాజకీయాల్ని తలకెక్కించుకోకుండా వున్న చెన్నారెడ్డి అన్నకొడుకు నాగసుబ్బారెడ్డి ఆరోజు చిన్నాయన వెంబడి రావటం వలన కేసులో రెండవ ముద్దాయి  అయ్యాడు.
  అతను ముద్దాయి కాదని జనాల సానుభూతి.
 అతన్ని కేసులో ఇరికించటం జాతీయపార్టి వాళ్ళకు కూడ అంతగా ఇష్టం లేదు, అయినా తప్పని పరిస్థితి. ఎండు కర్రతోటి పచ్చకర్ర కూడా కాలవలసిందే గదా !
  జంటహత్యలతో చెన్నారెడ్డి మరోసారి టెర్రర్ సష్టించాడు. అతని వ్యతిరేకుల్లో గుబులు పుట్టించాడు.
 అతన్ని ఎదిరించి బతకటం కష్టమనిపించింది తాలుకాలోని జాతీయపార్టి నాయుకలందరికీ.
 గుండె ధైర్యమున్న ఓబుళరెడ్డిని నరికాడు.
మంచితనమున్న గురివిరెడ్డిని చంపాడు.
  చెన్నారెడ్డి దృష్టిలో ఎదురు తిరిగిన వాడు ఎవడైనా సరే ! తనమార్గానికి అడ్డొచ్చింది కంపచెట్టయినా, పూలమొక్కయినా తొలగించబడవలిసిందే.
 తాలుకా పరిస్థితి మీద జాతీయపార్టి వాళ్ళంతా కలిసి చర్చించుకొనేందుక్కూడ భయపడుతున్నారు.
మండల ఎలక్షన్లలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు బద్వేలు టౌనుకు వెళ్ళటం చాలించారు.
  శివపురి ఇంకా దుఃఖం నించి కోలుకోలేదు.
 ఇద్దరు తమ్ముళ్ళను కిరాతకంగా పోగొట్టుకొన్న పెద్దిరెడ్డికి ఇప్పుడు వేదాంత ధోరణి అలవడింది.
 బంధువులొస్తున్నారు.. పరామర్శించిపోతున్నారు. జరిగినదంతా ఖర్మగా, విధివ్రాతగా చిత్రీకరించి సానుభూతి పలుకుతున్నారు.
 బాలుడు జైలునించి విడుదల అవటంతో ఏడుమంది అన్నదమ్ములు ఇంటి పట్టున్నే వుండిపోయారు.
 పరామర్శించడానికి వచ్చిన వాళ్ళంతా అక్కడి పరిస్థితుల్ని గమనిస్తున్నారు, పెద్దిరెడ్డి వేదాంతధోరణి, ఏడుమంది అన్నదమ్ముల గమ్యం తెలీని స్థితిని అర్థం చేసుకొన్నారు.  తాలుకా రాజకీయాల్ని దిశా నిర్దేశాలు చేసే పనిలో ఇకపై శివపురికి ఎలాంటి స్థానమూ లేదని వూహిస్తున్నారు.
  "  మేం ముందే చెప్పినాం, చెన్నారెడ్డితో పార్టి జెయ్యడం మంచిది గాదని పార్టీ పెట్టుకున్నెప్పుడే జెప్పినాం, మామాట విన్పించుకోకపోయినారు "  అన్నారు కొందరు.
 నారమ్మ కూడ వచ్చింది శివపురికి.
 పెద్దిరెడ్డి ఇంటివద్దకెళ్ళి నాలుగువైపుల ఎగాదిగా చూసింది.
ఆమె ఎందుకొచ్చిందో అర్థం కాలేదు అక్కడున్నవాళ్ళకు.
 పరామర్శించడానికొచ్చిందో..?
  తన పగవాడి పతనాన్ని కళ్ళారా చూడ్డానికొచ్చిందో..?
 ఎవ్వరితోనూ మాట్లాడలేదు ఆమె.
 నేరుగా రమణారెడ్డి సోదరుల వద్దకెళ్ళింది.
  " ఏమబ్బీ !  నాయన పోయినాడని దిగులు బడ్తాండారా ఏంది ? మొగపిల్లలకు ఏడుపూ, దిగులూ రాగూడదబ్బీ ! మీనాయనొక్కడే ఆ రాకాసోనితో తగూలాడిండే ! ఇంతమంది వుండీ బయపడ్తే ఎట్లా ?  మీ గుంపులో వొకరు పోయి మీ నాయనే వున్నేడనుకో.. ఇట్లా దిగులు మొగాలేసుకొని కూకుండేవాడా ? ... ఏడుమంది ఎద్దులాల వుండారు  ఎద్దులాల... "  అంటూ వెనుదిరిగి రెండడుగులు వేసి ఏదోగుర్తొచ్చిన దానిలా  " నామీదికైతే రాండి...ఆడదాన్ని, ముండమోపిని...  ! "  కసిగా అంటూ ఇక అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయింది.
  ఆమె ఏం మాట్లాడింది చుట్టుపట్ల వాళ్ళకు అర్థం కాలేదు.
 రమణారెడ్డి సోదరుల్ని అడిగితే పెదవి విప్పలేదు.
  ఆమె ఎందుకొచ్చిందీ, ఎందుకట్లా తమను రెచ్చగొట్టిందీ అర్థం చేసుకోలేనంత అమాయుకుడేం కాదు రమణారెడ్డి.
  తాము చేతగాని వాళ్ళలా పడున్నామనీ, ప్రతీకారం తీర్చుకొనే ఆలోచనల్లో లేమనీ తెలిసి ఆరాటపడుతూ వచ్చింది.
 ఆమె ఆరాటం - తామేదో సాధించాలని కాదు...!
  ఆవేశంతో చెన్నారెడ్డిని ఎదుర్కొని మాడి మసైపోవాలని.
 పినతండ్రి చనిపోయినప్పటినుండి తనను అలాంటి అనుమానమే  పట్టి కాల్చుకు తింటోంది.
 తన తమ్ముళ్ళు తొందరపడి ఎక్కడ దెబ్బతింటారోనను భయంగా వుంది. బాలుడు పెట్రేగి పోతున్నాడు.
 జయసింహ చావో రేవో తేల్చుకొందామంటున్నాడు.
 తమ్ముళ్ళంతా అదే కోవలో వున్నారు.
  రెండ్రోజుల క్రితమే తమ్ముళ్ళందర్నీ తండ్రి సమాధి వద్దకు తీసుకెళ్ళి కూచోబెట్టి పరిస్థితుల్ని వివరించాడు.
 తమ తండ్రిని చంపిన వాళ్ళమీద పగతీర్చుకోవటమనేది అనివార్యమైన చర్య. అందులో రాజీపడే అవకాశమే లేదు.
  తమ విరోధి అందరిలాంటివాడు కాదుకాబట్టి ఎంత సమయమైనా తీసుకొని పకడ్బందీ ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. ఇది కేవలం ఆవేశంతో చేసే పని కాదు, ఆలోచన వుండాలి. ఒక రోజు..రెండ్రోజుల్లో పూర్తియేపనికాదు, ఒక్కోసారి జీవితకాలం పట్టొచ్చు.. ఎన్ని రోజులైనా పట్టనీ, ఎన్ని ఏళ్ళయినా పట్టనీ చెన్నారెడ్డి మాత్రం సహజమరణం పొందటానికి వీల్లేదు. పోరాటంలో తామందరూ పోయినా సరే మిగిలిన వాళ్ళే ఆ పని నేరవేర్చాల అవసాన దశలో మంచంమీదున్నపుడయినా సరే గొంతుకోసి చంపాలి తప్ప సహజంగా చచ్చేందుకు అవకాశం ఇవ్వకూడదు.
  పకడ్భందీ ప్రణాళిక ఏర్పాటు చేసుకొంటే తమ లక్ష్యాన్ని తొందరగా చేరుకోవచ్చు.
  వ్యూహాన్ని నిర్మించుకొనేంత దాకా తమ్ముళ్ళను తొందర పడవద్దనె చెప్పాడు రమణారెడ్డి.
  ఈ క్రమంలోనే తమ యింటికి వచ్చిన వాళ్ళందర్నీ జాగ్రత్తగా గమనిస్తున్నాడు,  వాళ్ళ మాటల్ని అధ్యయనం చేస్తున్నాడు.
  బంధువులెవ్వరూ తమను గొడవలకు పురమాయించటం లేదు.
  పైపెచ్చు భయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
   తమ నిర్ణయం బైటపడితే వాళ్ళగుండా నైతిక మద్దదు లభిస్తుందేమోగాని తమ కసిలో పాలు పంచుకొనే వాళ్ళెవరూ దొరక్కపోవచ్చు.  తాము మాత్రమే ఒంటరి పోరాటం చేయక తప్పేట్టు లేదు. తుపాకులు, బాంబులు, జీపులూ, మెరికల్లాంటి మనుషులు వగైరాలతో పరిపుష్టంగా వున్న చెన్నారెడ్డిని ఏ ఆయుధాలూ లేకుండా వుత్త చేతుల్తో,... ఏ వాహనమూ  లేకుండా ఉత్త కాళ్ళతో... ఏ బలగమూ లేకుండా కేవలం గుండే బలంతో..ఎదుర్కోవటం సాధ్యమా..?
   వాస్తవాల్ని కూడా బేరీజు వేసుకోవాలిగదా !
  ఆలోచిస్తూ వున్నాడు రమణారెడ్డి.
 నిద్రహారాలు మాని ఒకటే ఆలోచనలు..
  తమ్ముళ్ళు తొందరపాటు మాత్రం పట్టరాకుండా వుంది.
  జొరబడి నరికి వద్దామంటున్నారు. ’తాము ఏడుమందిమి చచ్చేలోపల వాన్ని నరకలేమా ? ’ అంటున్నారు.
 వాళ్ళ ఆవేశం అట్లా వుంది.
  పూర్వంలా ఎదురెదురు కత్తియుద్దం చేయటం కాదు ఇప్పుడు పార్టీలు ( ఈ " పార్టీ " పదానికే ఫ్యాక్షన్ అని ముద్దు పేరు పెట్టింది మన మీడియా) నడపటమంటే. చాటుమాటుగా ఎదుటి మనిషిని దెబ్బతీయాలి, విజయం సాధించాలి. తమవైపు ప్రాణ నష్టం జరక్కుండా పార్టీలు నడిపినవాడే గొప్పవాడు.  తాము నష్టపోకుండా ఎదుటి వాళ్ళను నష్టపరచాలి. అదే పార్టీ మూలసూత్రం.
  చెన్నారెడ్డి వ్యూహమంతా పై నిబంధనల ప్రకారమే వుంటుంది. ఎదుటివాడు సన్నద్దమయ్యేలోపలే దెబ్బతీస్తాడు.
  అన్ని విషయాలు తమ్ముళ్ళతో చర్చిస్తున్నాడు రమణారెడ్డి. ప్రతిరోజు ముగ్గుపిండి గనులవద్దకెళ్తున్నారు, భవిష్యత్తు కార్యచరణకు వ్యూహాలు పన్నటంలో తలమునకలవుతున్నారు.

                                                                                                     ............ సశేషం.

3 comments:

Exciting. Please continue

Is he bambula siva reddy?

@ థ్యాంక్స్ మిస్టర్ యక్ష.

@ అనానిమస్ గారు..మీరు ఎవరినైనా అనుకోవచ్చు..!!

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followersమాలిక: Telugu Blogs