.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

      డబుల్ మర్డర్ సంఘటన సంచనలనం సృష్టించింది.
  వంకల్లోనో, డొంకల్లోనో దారికాచి చంపటమో, రాత్రిళ్ళు నిద్రబోయేవాళ్ళను నరకటమో కాకుండా పట్ట పగలు ప్రధాన రహదారి మీద పోలీసు సాక్ష్యంగా యుద్దవాతావరణాన్ని తలపిస్తూ కొట్లాడిన తీరు అంతటా చర్చనీయాంశమైంది.
   ఉన్నట్టుండి శివపురి ఓబుళరెడ్డి వార్తల్లోని వ్యక్తి అయ్యాడు
  టెర్రర్ సృష్టించిన మనిషిగా ముద్రబడిపోయాడు
  డబుల్ మర్డర్ కేసు దాదాపు నలభై ఐదుమంది మీద మోపబడింది.  వాళ్ళందర్నీ వెంటేసుకొని పోలీస్‌స్టేషన్‌కూ, కోర్టులకూ వెళ్ళి వస్తున్నాడు ఓబుళరెడ్డి
  ముందు భాగాన అతను నడుస్తోంటే  వెనక అతని గుంపంతా అనుసరిస్తూ వుండటం చూసే వాళ్ళకు కొంత భయాన్ని కలిగిస్తూవుంది. ఎవరూ చెప్పకుండానే, ఎన్నుకోకుండానే అతనొక ముఠానాయుకునిగా జనాల్లో ముద్రబడిపోయాడు.
  రోజు రోజుకు ఖర్చులు ఎక్కువవుతున్నాయి.
  పోలీసులకూ, కోర్టులకే కాకుండా జనాల ఖర్చు తడిసి మోపెడువుతోంది.  హోటల్ ఖర్చులు, బస్సు చార్జీలు భయపెడుతున్నాయి. కోర్టు వాయిదా వచ్చిందంటే చాలు వెన్నులో చలిపుడుతోంది.
  గ్రామంలో వైరి వర్గం దాదాపు సమిసిపోయింది.
  వ్యతిరేకులంతా వూరు విడిచారు.
  నారమ్మ తన స్థావరాన్ని పూర్తిగా కూతురి యింటికి మార్చింది.
  ఓబుళరెడ్డి పిండిగని నారమ్మ చేలోకి చొచ్చుకుపోయింది,  వాళ్ళిచ్చిన తృణమో ఫణమో తీసుకొని పొలం వాళ్ళకు రాసివ్వటం తప్ప గత్యంతరం లేని స్థితి వచ్చింది ఆమెకు.
  ఊరువదిలి  వెళ్ళిన చాలా మంది పొలాలు తక్కువ రేట్లకే ఓబుళరెడ్డి వర్గానికి దక్కాయి.
  ఓ సంవత్సరం గడిచేసరికి చుట్టుపట్ల పంచాయితీల్లో ఓబుళరెడ్డి మాటకు ఎదురులేకుండా పోయింది.
   కేసు రోజు రోజుకు జటిలమయ్యేకొద్దీ అతని పలుకుబడి పెరగసాగింది
  మరో ఆరునెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.
  ప్రస్తుత ఎమ్మేల్లే మీద జనాల్లో అసంతృప్తివుంది. జమీందారీ వంశానికి చెందిన ఆ వ్యక్తి ప్రజల సమస్యలని పట్టించుకోవటం లేదనీ, ధనవంతుల కొమ్ము కాస్తున్నాడనీ అపవాదు వుంది.
  అలాగని అతనితో పోటీకి దిగే దమ్మున్న మొనగాడు కూడ ఆ  తాలుకాలో కన్పించటం లేదు.
  అలాంటి తరుణంలో ఒకనాటి సాయింత్రం సమితిప్రెసిడెంటు చింతకుంట చెన్నారెడ్డి శివపురికి వచ్చాడు. వెంట టేకూరుకు చెందిన కమ్యూనిస్టు నాయకుడొకరున్నారు.
  రావటం తోటే ఓబుళరెడ్డినీ, పెద్దిరెడ్డినీ పక్కకు పిల్చుకొని మంతనాలాడే పని చేయలేదు. పరుపు పరచిన మంచమ్మీద కాళ్ళు బార్లా చాపి వెల్లకిలా పడుకొన్నాడు.  " సల్లగా వుంది మామా ! కండ్లు మూసుకొంటే చెప్పందే నిద్రబట్టేట్టుంది "  అన్నాడు పక్కనే వున్న పెద్దిరెడ్డితో.
  "  లోపల కలవరం లేకుంటే సల్లదనం సుగించినట్టే వుంటదోయ్ ! రెండు కాల్లు  వొక్కసోట బెట్టి నిలబడేంత కుదురుదనం వుండాల గద ! ఎప్పుడూ కేసులూ.. వాయిదాలూ....  వాయిదా వస్తాందంటే సాలు బయమేస్తాందోయ్ దొరా ! "  చెప్పాడు పెద్దిరెడ్డి.
  " తప్పదే పెద్దమనిసీ !  అవన్నీ భరిస్తేనే గద నాయుకుడయ్యేది,  మొన్న రొవ్వంత ( కొద్దిగా)  పన్జరగబట్టి గాదూ - సుట్టు పక్కల పల్లెలకంతా మొగోల్లయింది మీరు "
  " అది జరక్కున్నే మొగోల్లమేలే.. "  ఇంట్లోంచి వస్తూ అన్నాడు ఓబుళరెడ్డి.
  " సరె...సరేలే... "  అంటూ చెన్నారెడ్డి రాగం తీయటంతో నవ్వుకున్నారు అందరూ.
  అంతలొ కాఫీ వొచ్చింది.
  గ్లాసు అందుకొంటూ  " ఉడుకు నీల్లతోనే సరిపెట్టాలనుకొన్నావాందోయ్ ? "  ఓబుళరెడ్డి కేసి చూస్తూ అన్నాడు చెన్నారెడ్డి
  " ఏం గావాలో సెప్పుమరి... "
   " సెప్పాల్నా మల్లా.... వొచ్చి మంచమ్మీంద పండుకొన్నేమంటే కోల్లు కోయ్యాలనె తెల్దా ? అల్లుండ్లకు యివేనా మర్యాదలు.."  అన్నాడు.
   " నీకింత తీరుబాటొచ్చిందని నాకేం తెలుసు దొరా  "  పెద్దిరెడ్డి అన్నాడు.
  వాల్లు పరాచికాలు ఆడుకొంటూ వుండగానే కోడిపుంజు అరుపులు విన్పించాయి.  చావుకేకలు వేస్తుంది అది.
  అటుకేసి చూసే సరికి తుంటకర్ర విసరి పుంజు కాళ్ళు విరగగొట్టి దాన్ని వొడిసి పట్టుకొని తెస్తున్నాడు బాలుడు.
  "  అదీ.. అల్లుడంటే  అట్లుండాల... "  మెచ్చుకోలుగా చూశాడు.
ఉడికుడుకు అన్నమూ కోడిమాంసముతో రాత్రి భోజనం రుచికరంగా ముగిసింది.
  చెప్పాపెట్టకుండా చెన్నారెడ్డి వూడిపడటం, రాత్రికి తమయింటివద్దే మకాం  చేయటం కొంత అయోమయంగానే వుంది పెద్దిరెడ్డికి.
  భోజనానంతరం తాంబూలాలు నములుతూ అతని అయోమయానికి తెరదీశాడు చెన్నారెడ్డి.
    " తాలుకా రాజకీయం మీకు తెలియందిగాదు. ఇప్పుడుండే ఎమ్మెల్లే నాగిరెడ్డి ఎవ్వరికీ పలకడం లేదు, పల్లెలకేమీ సాయం సెయ్యడం లేదు. ఆయప్ప ఫ్యాక్టరీలూ, గనులూ..బస్సులూ..లారీలూ.. ఆదాయం.. అదితప్ప తాలుకా జనం బాగోగులు పట్టలేదు. ఆయప్పకు ఓట్లు గుద్ది పోసేందుకు మనం మనం పల్లెల్లో కొట్లాడుకొని సస్తాండం. ఆయప్ప మనకేసులు పట్టించుకోవడం లేదు... యీ సంగతి గురించి మాట్లాడ్డానికే వొచ్చినా మామా  ! "  చెప్పాడు.
   తర్వాత కమ్యూనిస్టు నాయకుడు గొంతువిప్పాడు తాలుకా పరిస్థితి గురించి వివరించాడు. పల్లెజనాల అగచాట్లు గురించి ఏకరువు పెట్టాడు. అసమ్మతితో వుండే గ్రామనాయకుల బలాబలాలు బేరీజు వేశాడు. అందరూ కలిసి ప్రజల కష్టాలు తెలిసిన మనిషినొకన్ని అసెంబ్లీకి నిలబెట్టి నాగిరెడ్డి నాయికత్వాన్ని కూలదోయవలసిన అవశ్యకతను నొక్కి చెప్పాడు.
   తమ అభ్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలన్నదే ఇప్పటి ప్రశ్న.
  " మీరు మీరు ఆలోచించండి నాయనా ! "  పెద్దిరెడ్డి అన్నాడు.
  " పరిస్థితి అట్లా లేదయ్యా ! "  చెప్పాడు కమ్యూనిస్టు వ్యక్తి.
  " మీరు ఎవరి పేరు ప్రతిపాదించితే వాళ్ళే అభ్యర్థి  అందులో సందేహమే లేదు...."
  తర్వాత కొంతసేపు తర్జన భర్జన పడ్డారు.
  నిశితంగా చర్చించిన తదుపరి... చెన్నారెడ్డిని అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థిగా  తాను ప్రతిపాదించన్నట్లుగా  "  ఓబుళరెడ్డి ప్రకటించాడు.
  తాలుకా స్థాయి జరిగే సమావేశంలో అదే గొంతుకతో ప్రతిధ్వనించాలని కూడా తీర్మానించుకొన్నారు.
  మరో వారం రొజులకు బద్వేలులో తాలుకా స్థాయి సమావేశం జరిగింది.
  అనుకొన్నట్లే చెన్నారెడ్డి పేరును అసెంబ్లీ అభ్యర్థిగా ఓబుళరెడ్డి ప్రతిపాదించాడు. సభ్యులంతా ఏకగ్రీవంగా అమోదించాదు.
  ఓబుళరెడ్డి భుజస్కంధాలపై అదనపు భారం పడింది.
  గతంలో లాగా ఎలక్షన్లు చేసేదానికి లేదు
  ఈ దఫా సర్వశక్తులూ వినియోగించాలి.
  అవసరమైతే నెత్తురు పూసికొని చేయాల్సివుంటుంది, మొక్కుబడిగా తన వూర్లో తాను ఓటింగు జరిపించటం కాదు - తన బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్ళున్న చోటల్లా పాగావేయాలి, ఏమేరకు అవకాశముందో లెఖ్కగట్టాలి, పూర్తిస్థాయిలో ప్రయత్నించి చెన్నారెడ్డికి ఓట్ల రాసుల్ని పెంచాలి.
  ప్రాంతీయ పార్టీ అధ్యక్షుణ్ని కలిసాడు చెన్నారెడ్డి.
  బలమైనా నేతల చేత కూడా చెప్పించాడుట
  రాష్ట్రంలో స్వాంతంత్ర్యానంతరం నుండి పాతుకుపోయిన జాతీయపార్టీని ఆటకట్టించే దమ్ము ప్రస్తుతం ప్రాంతీయ పార్టీకే వుంది.
   నామినేషన్ల పర్వానికి పదిహేను రోజుల ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి అన్ని పార్టీలు.
  చెన్నారెడ్డికి ప్రాంతీయ పార్టీ టికెట్ రావటం చర్చనీయాంశమైంది తాలుకా ప్రజల్లో.
  నామినేషన్‌రోజు  బద్వేలు టౌనంతటికీ పెద్ద జాతరవాతావరణం కల్పించాడు చెన్నారెడ్డి.
  తాలుకా నలుమూలల్నించి తన అభిమానులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకొన్నాడు.
  శివపురి ఓబుళరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన జనమే టౌనంతా ఆక్రమించారు,  అన్ని ప్రాంతాలనించి వచ్చిన వాళ్ళు సగం మందుంటే..ఓబుళరెడ్డి మనుషులు సగం మంది వున్నారు.
  చెన్నారెడ్డి చాలా ఆనందించాడు. ఓబుళరెడ్డి వద్దకెళ్ళి  "  ఓహ్  మామా ! ఎలక్షనంతా నీదేనోయ్ ! నేను గెల్చినా ఓడినా ఆఘనత నీకే..."  అన్నాడు అతని చేతులు పట్టుకొని ఆర్ద్రంగా.
  ఓబుళరెడ్డికి మరింత భారం తలపై పడింది.
  రాత్రనక పగలనక పల్లెలు తిరగసాగాడు. ప్రత్యుర్థులుగా వున్న వాళ్ళను తమవైపుకు మల్లించుకొనేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నాడు,  తన బంధువుల్ని వెంటేసుకొని ప్రత్యర్థి వర్గంలోని తమ వాళ్ళను తన వర్గంలోకి చేర్చుకొనేందుకు సర్వశక్తులు వొడ్డి కృషి చేయసాగాడు.
  ఏవూరికైతే వెళ్ళాలనుకొంటాడో, ఆ వూర్లో ఎవరినైతే తన వైపుకు లాగాలని ప్రయత్నం చేయబోతున్నాడో  అ వ్యక్తి తాలుకా బంధువుల వివరాలు సేకరించటం, వాళ్ళను పిల్చుకొని అందరూ కలిసి ఆ వూరికి వెళ్ళటం,  జారిపోయేందుకు సాద్యం కాని విధంగా వలపన్నటం, ఒకరోజు కాకుంటే వారంరోజులైనా అతని వద్దకు తిరిగి తెల్లార్లూ మేలుకొని పంచకాసి అయినా అతని మనసు కరిగించి పార్టీలోకి రప్పించుకోవటం...డబ్బుకు లొంగే వాళ్ళకు ఏదోక ఆశ చూపటం, కేసులు వగైరాలున్నవాళ్ళను ఆదుకుంటామని నమ్మకంగా వరమివ్వటమో, అంతుచూస్తామని చెదిరించటమో..ఎన్నిరకాల వ్యూహాలున్నాయో అన్నింటిని ప్రయోగించి రాక్షసంగా కృషి చేయసాగాడు.
  ఓబుళరెడ్డి ..చెన్నారెడ్డి ప్రమేయం లేకుండా తన స్వంతంగానే వర్గాన్ని సమీకరించాడు.  తన వూరికి దగ్గరగా ఐదరు వూర్లు ఏకపక్షమయ్యాయి, మిగిలిన పదిహేను వూర్లల్లో మెజారిటి శాతం తమదే ఐంది. తన పరిధిని ఇంకా విసృతం చేసుకొంటున్నాడు అతను.
  ఓబుళరెడ్డి పర్యటించే గ్రామల్లో తను కాలుబెట్టాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిపోయింది చెన్నారెడ్డికి. దాంతో అతను తాలుకాలోని మిగతా ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టేందకు వీలు కలిగింది.  అవతలి వర్గం వాళ్ళను బలహీన పరిచేందుకు నీతి, న్యాయం, ధర్మంలనే పదాలకు అతీతంగా కూడా కృషిచేశాడు.
  ఎలక్షన్ దగ్గరబడింది.
  బలమైన వర్గంతో తను ఢీకొనబోతున్నాడు కాబట్టి అక్రమ మార్గాల్ని అనుసరించటానికి కూడా వెనుదీయలేదు చెన్నారెడ్డి.
  విస్తృతంగా నాటుబాంబులు తయారు చేయించాడు.
  అవసరమైనా చోటల్లా ప్రయోగించమని ప్రోత్సాహించాడు.
  ఓబుళరెడ్డి  వద్దంటోన్నా  వినకుండా  అత్మరక్షణకైనా కావాలిగదా అనే సాకుతో అతని ఏరియాకు కూడా సప్లై చేశాడు.
  ఎలక్షన్ రోజున ఓబుళరెడ్డి విజృంభించాడు.
  తన వాళ్ళను వెంటేసుకొని పల్లె పల్లె తిరిగాడు. అవతలి వర్గంవాళ్ళకు ఏజంట్లు కూడ లేని ఐదుపల్లెల్లో తోంభైశాతం పైగా ఓట్లు గుద్దేశాడు.
  ప్రత్యర్థి ఏజంట్లు వున్న వూర్లల్లో సైతం మద్యాహం నించి హుషారు చేశాడు. నయాన్నో భయాన్నో ఏజంట్లను వొప్పించి మిగిలిన వోట్లన్నీ చెన్నారెడ్డికి వేయించాడు.
  చెన్నారెడ్డి విషయమైతే చెప్పాల్సిన పనిలేదు.
  తెల్లవారు జామునే లేచాడు.
  భార్యచేత  వీరతిలకం దిద్దించుకొని గోచికట్టుకొని జీపులో కూచున్నాడు.
  సాయింత్రం ఏడుగంటల దాక గోచి విప్పలేదు.
  అవకాశమున్న చోటల్లా బూతుల్లో జొరబడి ప్రత్యర్థి ఏజంట్లను బైటకు లాగి రిగ్గింగ్ చేస్తూ పోయాడు.
  నాగిరెడ్డి కూడా తక్కువ తినలేదు.
  చెన్నారెడ్డి రిగ్ చేసిన బూతులన్నిట్లో జొరబడి బ్యాలెట్ బాక్సుల్ని బావుల్లో వేయటమో, ఇంకు, నీళ్ళు పోయటమో చేస్తూపోయాడు. సాయింత్రం దాకా ఒకరి ప్రయత్నాల్ని మరొకరు అడ్డుకోవటం, హుషారు చేసుకోవటం జరిగిపోయింది.
  ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిన బూతులన్నిట్లో భారీ బందోబస్తు మద్య రీ ఎలక్షన్ జరిగింది.  ఓబుళరెడ్డి ఏరియా తప్ప తాలుకా సాంతం సమస్యాత్మకమే అయ్యింది.
  పోలింగ్, రీపోలింగ్ రెండు సార్లు కూడా భారీగా బాంబులు పగిలాయి. చెన్నారెడ్డి అయితే ఆహారం నీళ్ళు కూడా మరచిపోయి సాయింత్రం దాకా వీర విహారం చేశాడు.
  అతనికి తృప్తిగా వుంది.
  నాగిరెడ్డి అనుభవం ముందు వూడలు దిగిన అతని రాజకీయం ముందు తను సరిజోడిగా నిలిచాడు. ఇక తనకు మిగిలింది ఓబుళరెడ్డి కృషి. అతని ఓట్లతో తను నిస్సందేహంగా గెలువగలడు.
  ఈ  ఎలక్షన్లతో బద్వేలు పేరు రాష్ట్ర ప్రజలందరీ నోట్లో నానింది. పగిలిన బాంబులు, జరిగిన గొడవలు, అత్యధిక సంఖ్యా బూతుల్లో రీపోలింగ్‌తో ప్రత్యేక స్థానం సంపాదించింది.
  చెన్నారెడ్డి, ఓబుళరెడ్డిల చేతి కష్టం వృధాకాలేదు.
  నాగిరెడ్డి పైనా 15 వేల మెజారిటితో గెలుపొందాడు, అందులో దాదాపుగా తొమ్మిదివేల ఓట్లు ఓబుళరెడ్డి గుద్ది పోసినవే.
  పల్లెపల్లెనా సంబరాలు..పండుగ వాతావరణాలు... ఊడలు బాతు అవినీతి రాజకీయానికి సమాధి....కొత్త నాయకత్వం మీద ఎన్నో ఆశలు...  ఒక మామూలు వ్యక్తి ఎమ్మేల్లేగా గెలవటం పట్ల ఎన్నెన్నో ఆశలతో కూడుకొన్న సంబరాలు,  రాక్షస సంహారం జరిగినంత ఆహ్లాదక సంబరాలు.
  తాలూకాలో పాతశకం అంతరించింది.
  కొత్తశకం ప్రారంభమైంది.
  మరోసారి ఓబుళరెడ్డి యింటికెళ్ళాడు చెన్నారెడ్డి.
  ఈ దఫా ఎమ్మెల్లే హోదాతో వెళ్ళాడు.
  తను గెలవటానికి ప్రధాన కారణం అతనేననీ, యీ ఎమ్మేల్లే పదవి అతని కృషి పలితమేననీ మనసారా ప్రకటించాడు.
  చెన్నారెడ్డి తమ వూరికి వచ్చిన సందర్భంగా పొట్టేళ్ళు కోయించి అందరికీ విందు చేశాడు ఓబుళరెడ్డి.

                                                                                                   ...........  సశేషం

                                                            యాగంటి

      కర్నూల్ జిల్లా బనగాన పల్లెకు 15 కి.మీటర్ల దూరంలో యాగంటి గ్రామంవద్ద " యాగంటేశ్వర " అని ప్రసిద్ద శైవపుణ్యక్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రమునకు వెనుక భాగామున ఎత్తైన " ఎర్రమల " కొండలు, గుహలు ఉన్నవి. ఇక్కడి ఆలయంలో ఈశ్వరుడు లింగాకారములో గాక విగ్రహరూపంలో వుండడం ఒక ప్రత్యేకత. నందిరూపంలో విగ్రహం భయంకరంగా ఉన్నది,  భూమిని చీల్చుకొని నందీశ్వరుడు వెలికి వచ్చాడని. అచట ఆలయము నిర్మించి పూజలు జరిపారని అక్కడి స్థానికుల కథనం. ఇక్కడి ఈశ్వరుడిని నందీశ్వరుడు అని పిలుస్తున్నారు. ఇక్కడే అగస్త్య మునీశ్వరులు చేసిన తపస్సుకు మెచ్చి మునీశ్వరులు కోరిన విధంగా ఏకశిలలో శ్రీఉమామహేశ్వర్లుగా వెలిసినారని, లింగాకృతిలో కాకుండా శిలాకృతిలో వెలసిన శివక్షేత్రము భారతావనిలో ఎచ్చటా లేదని ప్రతితి.

       ఇక్కడి నిర్మాణల శైలినిబట్టి క్రీ.శ 7.8 శతాబ్దములలో పల్లవులు, చోళులు, చాళుక్యులు,  ఒకరి తర్వాత మరొకరు నిర్మించి, కొన్నినిర్మణాలను అసంపూర్తిగా వదిలివేయగా... వాటిని క్రీ.శ. 13.,14 శతాబ్దాలలో విజయనగర ప్రభువులు పూర్తిగావించారని విశ్లేషుకుల అంచనా. నేనిక్కడికి రావడానికి మరో ముఖ్యమైన కారణం..ఈ ఆలయ ముఖమండపములోని ఈశాన్య భాగములోనున్న నందీశ్వరుడు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాడట. అక్కడున్న పరిస్థితిని చూస్తే నిజమనేనిపిస్తుంది..! నందీశ్వరుడు చుట్టూ వున్న నాలుగుస్థంబాల మంటపం నిండా నందీశ్వర విగ్రహం నిండి ఉన్నది..రెండు స్థంబాలు కొద్దిగా పక్కకు జరుగుతున్నాయి..అవి పడిపోకుండా కొన్ని బండరాళ్ళును ఆసరగా వుంచారక్కడ.

      మీరు ఫోటోలలో చూస్తే అర్థమవుతుంది. సుమారు 90  సంవత్సరాలక్రితం ఆ నాలుగు స్తంబాలలోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షణలు చేసేవారట..!! కాని నేడు మాత్రం అలాంటి అవకాశమేలేకుండా పూర్తిగా మంటపం నిండుగా పెరిగిపోయాడు. భారత పురావస్తుశాఖ వారి లెక్కల ప్రకారం ప్రతి 20 ఏళ్ళకు ఒక అంగుళం పరిమాణంలో పెరుగుతూ వస్తున్నదట ఈ నందీశ్వర విగ్రహం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలఙ్ఞానంలో " యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగానంతమున లేచి కాలుదువ్వి రంకె లేసేను " అని వ్రాసారట. కాబట్టి ప్రస్తుత మీడియాలో చూపుతున్న 2012 గోల గురించి జనమంతా మరిచిపోవచ్చు..!!


       ఈ దేవాలయం వాయువ్యదిశకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ సహజంగా వెలసిన అగస్త్య పుష్కరిణి కనపడుతుంది, నేనెల్లిన సమయంలో మన పూర్వీకులు పుష్కరిణిలో జలకాలాడుతున్నారు..  మన పూర్వీకులంటే అర్థం కాలేదా..?  అదేనండి మన వా’నరులు’పుష్కరణీకి రెండు వైపులున్న ప్రాకారముల మీద నుండి డిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ ఆటలలో స్విమ్మింగ్ డైవ్ చేసినట్లుగా ఈ వానరలు చేస్తుంటే చూట్టానికి బలే ముచ్చటగా వుంది..ముందే కోతులు..ఇక మనుషులు ఎవ్వరూ లేకపోవడంతో వాటి ఇష్టారాజ్యంలాగ డైవింగ్..స్విమ్మింగ్..యమ ఫాస్ట్‌గా చేస్తున్నాయి.
      ఈ క్షేత్రమునకు 15 కి.మీ దూరములోనున్న " ముచ్చట్ల " క్షేత్రమునుండి పర్వతశ్రేణుల గుండా నీరు ప్రవహించి ఇక్కడి అగస్త్య పుష్కరణిలో కలుస్తాయి. ఈ పుష్కరణీలోను సహజసిద్దమైన నీటి ఊట ఉన్నది స్వచ్చంగా తేట తెల్లగా ఉన్నాయి నీరు. దీనికి ఉత్తరభాగానున్న పర్వతరాయికి దేవనాగరలిపిలో ఆ విశేషాలు చెక్కబడి వున్నాయి. ఇక్కడ నుండి ఆలయానికి ముందుభాగానున్న పెద్దకోనేరుకు చేరుకుంటాయి. అక్కడ నుండి ఆ క్షేత్ర పరిసరప్రాంతంలో నున్న 20 ఎకరాల భూమిలో సాగుకు మాత్రమే పరిమితమై ఇంకిపోతున్నాయి.


      ఈ క్షేత్రమునుకు వెనుకభాగాన ఆలయము చుట్టూ అర్థచంద్రాకరాంలోనున్న " ఎర్రమల " కొండల వద్దకు చేరుకుంటే అక్కడ మూడు గుహలు 50 అడుగుల మద్యదూరంతో పక్కపక్కనే వున్నవి. మొదటిగుహను " రోకళ్ళ గుహ " అని పిలుస్తున్నారు. చాలా పెద్దగుహ లోపలికి వెళ్ళడానికి తాపలు వున్నాయి కాకపోతే ఏటువాలుగా కంటే కాస్త నిటారుగా ఉన్నాయి. అవెక్కి పైకి వెళ్ళాక అక్కడ ఒక శివలింగం కనపడుతుంది. అగస్త్యముని శివలింగప్రతిష్టాపన చేసి అక్కడే  ధ్యాన సాదన చేసారని అక్కడి వారి విశ్వాసం.

      రెండవది వేంకటేశ్వర గుహ. ఇక్కడ వేంకటేశ్వర విగ్రహ ప్రతిష్టాపనలో జరిగిన కొన్ని పొరబాటుల వలన, విగ్రహపతిష్టకు అనర్హముగా భావించి విగ్రహాన్ని ఇక్కడ బద్రపరిచారు. మూడవది శంకర గుహ.. ఇక్కడ ఏంతో మంది మునీశ్వరులు తపస్సు చేసారని చెబుతున్నారు..తర్వాత చాలా మంది ప్రశాంతముగా ధ్యానము  చేసుకొనటకు ఈ గుహను ఉపయోగించారట.


















      ఇక్కడి గుహలలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేస్తూ కాలఙ్ఞానము రచించాడనీ.. ఆ సమయములో ఆయన నోట " ఏన్ కంటిని " అన్న మాట వెలుబడనదనీ అప్పటినుండి ఈ ప్రాంతాన్ని " ఏన్ కంటిని " అనిపిలుస్తూ...కాలక్రమేనా " యాగంటి " గా రూపాంతరం చెందిందని అంటున్నారు. ఇక్కడి గుహ లోపలి భాగములో కాలఙ్ఞాన గ్రంథము పూర్తి ప్రతి లభ్యము కావచ్చని కొందరి భావన.




       బనగాన పల్లె నుండి ఈ క్షేత్రానికి వెళ్ళే మార్గమద్యలో 12 వ కి.మీటర్ వద్ద కుడి వైపున చిన్న గుట్టాలంటి ఎత్తైన ప్రదేశంలో  పాతకాలం నాటి ఒక భవంతి కనపడుతుంది. చూడడానికి గంభీరంగా ఉంటుంది. 400 సంవత్సరాల క్రితం బనగానపల్లె నవాబు తన ప్రేయసికోసం నిర్మించిన భవంతి. ప్రస్తుతం అది హైదరాబాద్‌లో ఉన్న నిజాం నవాబుల ఆదీనంలో ఉన్నది. వాళ్ళు ఎవరోగాని ఈ భవంతి ఆలనాపాలనా చూడట్లేదు. వెలుపలి భవనమంతా చూడడానికి చాలా గంభీరంగా ఉంటే..లోపల మాత్రం చాలా ధారుణంగా ఉంది. రాత్రిల్లు అసాంఘీక మనుషులొచ్చి తాగి తందనాలాడి లోపలి గదులన్ని మురకిపట్టించారు.  మొదటి అంతస్తులో వున్న హాలు గదియెక్క  పైకప్పు పడిపోయి ఉన్నది. అక్కడొక మనిషిని వున్నారు కాని..అతనివల్ల ఆ భవనాన్ని ఎటువంటి రక్షణ లేదు. కాని భవనం మొత్తం రాతితో నిర్మించారు.  ఇప్పటికైనా భారత పురావస్తు శాఖ వారు ఈ భవనాన్ని స్వాదీనం చేసుకొని, మరమత్తులు చేసి ఒక యాత్రాస్థలంగా మారుస్తే బాగుంటుంది.

మరి కొన్ని ఫోటోస్ కింద చూడండి.






                                                      
                                                           -  మహానంది  -

      ఈ క్షేత్రం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాయలసీమప్రాంతంలోనే గాక కన్నడ, తమిళ రాజ్యాలలో కూడ ప్రాచుర్యం పొందింది. నంద్యాల మండలమునకు 12  కి.మీ దూరాన నల్లమల కొండల్లో ప్రకృతిసిద్దమైన సుందరప్రదేశమున అర్థచంద్రాకారముగా నున్న ఒక కొండవొంపులో ఈ క్షేత్రము వున్నది. ఇక్కడకు చుట్టుపక్కల పదహైదు కిలోమీటర్ల పరధిలో ప్రథమనంది, నాగనంది, వినాయక నంది, శివనంది, సూర్యనంది, విష్ణునంది, సోమనంది అని ఎనిమిది నందీశ్వర క్షేత్రాలున్నవి, మహానందితో కలిపి నవనంది క్షేత్రాలు అంటారు. వీటి ప్రాదుర్భవాన్ని గురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నవి. ఈ నవనందీశ్వరాలయములు ప్రాచీన చాళుక్యుల కాలమునాటివని కొందరంటారు.
     మహా నందీశ్వరాలయనికి చుట్టూ " తిరుచుట్టు మాళియ " అనబడే చుట్టు మండపము వున్నది. మద్యలో కళ్యాణమంటపాదులు ఉన్నవి. ఆలయ విమానం అంతస్తులుగా విభజింపబడి నిర్మితమైంది. ప్రతి అంతస్థు అమలక శిలతో శిఖరం వలె వేరు చేయబడింది, అన్ని అంతస్తులు కూడి మహావిమానమేర్పడి వున్నది. ఆలయంలో స్వామివారిని అభిషేకించిన జలము బయటకు రాకుండా లింగం అధోభాగంలో చేరి అచట గల జలఊటలో కలిసిపోతుంది. లింగము కిందనుండి ఎల్లవేళలా బుగ్గవలే నీటి ప్రవాహం వస్తుంటుంది, వాటిని మూడు కుండముల గుండా వెళ్ళే ఏర్పాట్లు చేసారు మనం ప్రదానఆలయ ప్రాంగణములోనికి ప్రవేశించగానే స్వచ్చమైనా నీటితో నిండిన రుద్రకుండము ప్రధాన అలయానికి ముందువైపున  కనపడతుంది. దీని చుట్టూ రాతితో ప్రాకారం కట్టినారు. తూర్పు వైపున అమర్చిన నంది నోటిలోనుంచి నీరు ఈ కుండములోనికి ప్రవహిస్తుంది, వచ్చిన భక్తులు, యాత్రికులు ఇక్కడ జలకాలాటలు అడతారు.
     ఇక్కడనుండి తూములగుండా నీరు బయటకొచ్చి బ్రహ్మ, విష్ణు కుండాలను చేరుకుంటుంది. యాత్రికులు బయటి ఆలయప్రహరి ముఖద్వారం నుండి పెద్ద పెద్ద చెట్లతో వున్న విశాలమైన ఆలయప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా వున్న ఆలయమంటపంకు వెళ్ళే దారికిరువైపుల ఈ  బ్రహ్మ,విష్ణు కుండాలను చూడవచ్చు. ఇక్కడ కూడ భక్తులు స్నానాలు చేస్తారు. చాలా స్వచ్చంగా ఉంటాయి ఇక్కడినీరు, నీటి అడుగున వున్న నేల చాలా స్పష్టంగా కనపడుతుంది..అంత తేటతెల్లగా ఉంటాయి నీరు.. అక్కడ ప్రభుత్వంవారు " స్నాం చేయు భక్తులు దయచేసి సబ్బును ఉపయోగించారాదు, బట్టలు ఉతకరాదు " అని బోర్డు పెట్టినా ’ అబ్బే మనం ఏది చేయవద్దని చెబుతామో అదే చేస్తాము... అదీ మన భారతీయ సంస్కృతి ’  ఆలయసిబ్బంది ఎంతమందికని చెబుతారు..చెప్పి..చెప్పి విసిగి వదిలేసారు..పాపం.!  జనాలు మాత్రం సబ్బును ఉపయోగించడమే..బట్టలు ఉతకడమే..ఇంత చేస్తున్నా కొందరు భక్తులు ఆ నీటిని మ్రోక్కుకొని కాసిన్ని నోటిలో వేసుకొని వెళ్తున్నారు..! అది చూసిన నాకు ఒళ్ళు జలదరించింది...నేను నీటి దగ్గరికి వెళ్ళి చూస్తే.. మనుషులు అంత మలినం చేసినా ఆ నీరు మాత్రం తన స్వచ్చతను కోల్పోలేదు..’ చాలా స్వచ్చంగా అలానే ఉన్నాయి..!

   ఆ నీరు అక్కడ నుండి కాలువల ద్వారా అరటితోటలకు, పంటపొలాలకు ఉపయోగపడుతున్నది. ఈ నీటిద్వార రెండు వేల హెక్టారుల మేరకు పంటభూములు సస్యశ్యామలమవుతున్నది. అది నిజమేననిపిస్తుంది నంద్యాల పట్టణములోకి అడుగుపెట్టగానే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చుక్కరటిపండ్లు కనపడతాయి. నంద్యాల నుండి మహానందికి వెళ్ళే దారిపొడవునా అరటితోటలు రహదారికి ఇరువైపులా ఉన్నాయి.








      చిన్న సూచన :   పైనున్న ఫోటోస్ వైడ్ స్క్రీన్ వున్న మానిటర్‌లలో హారిజాంటల్‌గా సాగదీసినట్లుగా కనపడతాయి..వారు మాత్రం తమరు చూడాలనుకున్న ఫోటో మీద రైట్ క్లిక్ చేసి మరో విండో ఓపన్ చేసుకుంటే అక్కడ మీ స్క్రీన్‌కి సరిపడా సరైనా ఫోటో వస్తుంది.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs