.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

    చెన్నారెడ్డిని ఎట్లా దొరికించుకోవాలో అర్థం కాలేదు శివపురి సోదరులకు.  ఈ మద్య కాలంలో మరీ జాగ్రత్త పడుతున్నాడు అతను. తన కదలికల్ని అంతుబట్టకుండా చూసుకొంటున్నాడు. ఎక్కువగా రాజధానిలోనే గడుపుతున్నాడు.
  తాలుకాలో తమకు దొరికేట్టు లేడు.
 అతన్ని చంపాలంటే అతనితో బాటు తామూ మకాం మార్చక తప్పదు. తమ వ్యూహాన్ని విసృతం చేసుకోక తప్పదు.
  తమ వాళ్లల్లో అసహనం పెరిగిపోతూ వుంది. చేతులకు పని దొరక్క విలవిల్లాడ్తున్నారు. గతంలో అయితే రోజూ అదేపనిగా తిరుగుతూ వుండేవాళ్లు. వేటాడటాన్ని గురించే ఆలోచిస్తుండే వాళ్లు. అహరహం వ్యూహాల్ని పన్నటం, వాటి అమలుకు కృషి చేయటం చేతినిండా పనుండేది.
  ఇప్పుడు కేవలం తిని తిరగటం వల్ల సోమరితనం పెరుగుతోంది. ఎప్పుడోకసారి చెన్నారెడ్డి రావటం, తామతన్ని గుర్తించి సిద్దమయ్యేలోపలే తిరిగి వెళ్లిపోవటం,  నిరాశా నిస్పృహలతో తమ వాళ్లు మగ్గిపోవటం....
 అతన్ని చంపలేక పోయామనే మనోవేదన కాల్చుతోంది.
  తాము కూడా హైదరాబాద్ వెళితేగాని యీ సమస్యలు తీరవు.
  రాజధాని కేంద్రంగా తమ ప్రయత్నాల్ని విస్తరించాలి.
  వీలైనంత త్వరలో అతని చరిత్రను ముగించాలి.
 ఎంత కాలమైనా పార్టీ జేస్తూ ( ఫ్యాక్షన్ నడుపుతూ ) టెన్షన్ అనుభవించటం తమకు భరించరానిదిగా వుంది.  అతని ఉనికి తమను అనుక్షణం కాల్చుతూ వుంది. చేతగాని వాళ్లను చేస్తోంది.
  రాత్రి చర్చకు పెట్టాడు తన మనసులో భావాన్ని రమణారెడ్డి.
 రాజధాని కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగించటానికి ముక్త కంఠంతో సమ్మతి తెలిపారు అందరూ.
  రమణారెడ్డి తాలుకాలోనే వుండి అన్ని వ్యవహారాలూ నడుపుతూ వుండాలనీ, చెన్నారెడ్డి యిక్కడకు వచ్చినపుడు అవకాశం చూసుకొని పని జరిపేందుకు ప్రయత్నించాలనీ, హైదరాబాదులో జయసింహ ఆధ్వర్యంలో టీం నిర్వహించబడాలనీ తీర్మానం జరిగింది.
 ఇక్కన్నించి వెళ్లే వాళ్లే కాకుండా అక్కడ కూడ కొంత మందిని టీం లోకి తీసుకోవాలని సూచించారు.
  చెన్నారెడ్డి బాధితులు హైదరాబాదులో కూడా వున్నారు. వాళ్ల అడ్రస్‌లు సేకరించి వారి పరిధిలో వీలయ్యే సహాయం వాళ్ల నుంచి అందుకోవాలి.
  పదిమందిని వెంటేసుకొని హైదరాబాదు వెళ్లాడు జయసింహ.
 లాడ్జీలో వుంటూ తమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాడు.
వ్యాపార రిత్యా, ఉద్యోగరిత్యా హైదరాబాదులో వున్న చెన్నారెడ్డి వ్యతిరేకుల్ని కలిశారు.  వాళ్లతో సంప్రదించారు. వాళ్ల సలహాల్ని తీసికొన్నారు. వాళ్ల సహాయాన్ని అర్థించారు.
  అందరూ సానుకూలంగానే స్పందించారు.
 చెన్నారెడ్డిని చంపటమనేది తమ ఆశయంగా కూడా పేర్కొన్నారు.
  వాళ్లు తిరిగేందుకు వాహనాలు కావాలి. జీపుల్లాంటివి కాకుండా టూ-వీలర్స్ అయితేనే బావుంటాయి.
 ఊర్నించి తెచ్చినవే కాకుండా మరికొన్ని కొన్నారు.
 చిన్నవి పెద్దవి అన్నీ కలిపి పద్దెనిమిది అయ్యాయి.
  ఒకరు ఇద్దరు వంతున వాటిల్లో తిరుగుతూ ప్రత్యర్థిని వెంటాడటం మొదలుపెట్టారు. అతని ప్రతి కదలికనూ గమనించ సాగారు. అసెంబ్లీ వద్దా, సెక్రటేరియట్‌లో, అతను పాల్గొనే సభలూ, సమవేశాలూ, విందులూ వినోదాలూ, పెళ్లిళ్లూ.. చావులూ.. ఒకటేమిటి..? - అతని ప్రతి కదలికనూ గమనిస్తున్నారు.
  కొన్ని రోజులకు చెన్నారెడ్డికి కూడా అనుమానమొచ్చింది - సిటీలో కూడా తనను వెంటాడుతున్నారేమోనని.  దానికి సరైన ధృవీకరణ లేదు గాబట్టి అనుమానన్ని పెద్దగా సాగదీయలేదుగాని గతంలో లాగా తనపట్ల తాను సోమరిగా వుండటం లేదు. వీలైనంతగా  జాగ్రత్త పడుతున్నాడు.  దిల్‌షుక్ నగర్ లోని తన ప్రియురాలి వద్దకు గన్‌మెన్‌లు లేకుండా వెళ్లుతున్నాడుగాని... ఇదివరకటిలాగా తన కారులోనే వెళ్లటం లేదు. ఒకేదారిన పోవటం లేదు. అక్కడికి తను చేసే ప్రయాణం తనకే అంతుబట్టని విధంగా వుండేలా రోజూ కొత్తమార్గాన్ని వెదుక్కొని వెళ్లేలా కొత్త కొత్తగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఎన్నెన్నో అవస్థలు పడి ఆమెను చేరుకోవటం ధ్రిల్లింగ్‌గా వుంది. వాటిని గురించి ఇద్దరూ ముచ్చటించుకోవటం ఆహ్లాదంగా వుంది.
  అసెంబ్లీ సమావేశాల్లో కూడా తన భయాన్ని స్పీకర్ ముందుంచాడు. తన మీద జరుగుతోన్న హత్యాయత్నాన్ని గురించి చెప్పాడు. ఇవన్నీ జాతీయ పార్టీ నాయకుల మద్దతుతోనే జరుగుతున్నాయని ఆరోపించాడు.
  బాంబుల సంస్కృతి అతనిదేనని తమ వాళ్లు అట్లాంటి పనులు ఎప్పడూ చేయరని, చెన్నారెడ్డి కోరుకొంటే అదనపు బందోబస్తు కూడా ఇస్తామని హోంమంత్రి ప్రకటించాడు.  సాదారణ స్థాయిలో కాకుండా అతనికి ప్రత్యేక రక్షణ కల్పించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.  పరిశీలిస్తామంటూ హోంమంత్రి సమాధానమిచ్చాడు.
  హైదరాబాదు నగర వీధుల్ని, సందుల్ని, గొందుల్ని అనుభవంలోకి తెచ్చుకొనేసరికి నెలరోజులు చాల్లేదు జయసింహ ముఠాకు. ఎప్పుడూ బైకుల్లో తిరగటమే వాళ్లపని. చెన్నారెడ్డి తరుచుగా సందర్శించే తావులన్నిట్నీ ( స్థలాలన్నిటినీ ) క్షణ్నంగా పరిశీలిస్తున్నారు. అతని మిత్రులెవరో గుర్తిస్తున్నారు.
 కొంత కాలం తర్వాత రామంతపూర్‌లోని ఓ సందులో రూం తీశాడు జయసింహ.  ఫోన్ కూడా బిగించాడు. అక్కణ్నించే తన ముఠానంతా నడిపించ సాగాడు.
  ఎవరెక్కడ వున్నది, ఏం చేస్తున్నది, చేసే పనిలో ప్రోగ్రెస్ గురించి రామంతపూర్‌కు గంటకోసారి ఫోన్ చేసి చెబుతుండాలి. వాటన్నిటినీ విశ్లేషించి ఓ నిర్ణయానికి రావటం జయసింహ భాద్యత.
  కాలం గడిచే కొద్దీ పనిలో బాగా స్థిరపడ్డారు వాళ్లు.
  అలవోకగా తిరుగుతున్నారు.
 అయినప్పటికీ చెన్నారెడ్డి మీద దాడి జరిపే అవకాశం వాళ్లకు ఎదురు కాలేదు.
 ఈ నేపథ్యంలో ఒకనాటి రాత్రి దిల్‌షుక్ నగర్ కేసి వెళుతూ వున్న చెన్నారెడ్డి జీపు రాఘవ కంట బడింది.
  క్షణం కూడా ఆలస్యం చేయకుండా దాన్ని వెంబడించాడు అతను.
  దిల్‌షుక్ నగర్‌లోని ఓ సందులో దూరింతర్వాత అదృశ్యమైంది అది.
 పట్టుదలగా సందులో ముందుకు దూసుకెళ్లాడు.
  అటు ఇటు ఇళ్ల కాంపౌండుల్లోకి పరిశీలనగా చూస్తున్నాడు.
  సందు దాటి మేయిన్ రోడ్ ఎక్కి ఇరువైపుల చూస్తే దగ్గరలోనే చిన్న హోటల్ ముందు ఆగివుంది అదే కారు.
  దగ్గరగా వెళ్లి లోపలికి చూస్తూ ముందుకు సాగాడు.
  కారులో చెన్నారెడ్డి లేడు.
 వెనక్కి తిర్గొచ్చి హోటల్ లోకి తొంగిచూస్తే - డ్రైవర్ ఒక్కడే టీ తాగుతూ కూచుని వున్నాడు.
 కొంత దూరంలోని మరో హోటల్ వద్దకెళ్లి అక్కణ్నించి కారుమీదే చూపులు నిలిపి నిరీక్షించ సాగాడు.
  అతన్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ పదినిమిషాల తర్వాత కారు వెళ్లిపోయింది.
 చెన్నారెడ్డిని ఇక్కడే ఎక్కడో వదలి వెళ్లినట్లుంది.
  జరిగిన విషయమంతా ఎవ్వరితోనూ చెప్పలేదు రాఘవ.
  మళ్లీ రోజు కొంచెం పెందలాడే వచ్చి సందు మొగదల కాపు కాశాడు.  చెన్నారెడ్డి వాహనం కోసం ఎదురుచూడసాగాడు.
 ఏవో ఒకటి రెండు వాహనాలు సందులోకి జొరబడ్డాయి గాని రాత్రంతా నిరీక్షించినా చెన్నారెడ్డి కారు రాలేదు.
  మరో రెండ్రోజులకు అతనికి అర్థమైంది. చెన్నారెడ్డి తన స్వంత కారులోనే కాకుండా రకరకాల వాహనాల్లో వస్తున్నాడనీ. హోటల్ వద్ద కారాపి సిగరెట్ల తాగే డ్రైవర్ని చూస్తే తెలిసింది కార్ల భాగోతం. కార్లను మారుస్తున్నాడేగాని డ్రైవర్లను మార్చటం లేదు అతను.
  మరో వారం రోజులకు గాని చెన్నారెడ్డి దూరే కొంపను కనుక్కో లేక పోయాడు రాఘవ. గన్‌మెన్‌లు లేకుండా ఒంటరిగా ఓ ఆడదాని కోసం వస్తోన్న చెన్నారెడ్డిని చూసి ఆనందంతో పులకరించి పోయాడు అతను. తిమింగలం వొడ్డుకు వచ్చే రహస్య ప్రదేశం తెలిసింది. ఈ విషయం అందరికీ తెలిపి వెంటనే పనయిపించాలి.
  ఫోన్ చేద్దామనుకొని విరమించుకొన్నాడు.
  నేరుగా రామంతపూర్ కేసి దూసుకు పోసాగాడు.
  తమ రూమున్న సందులోకి మలపు తిరగబోతుండగా హఠాత్తుగా అతనికో ఆలోచన వచ్చింది.
  ఇప్పుడు చెన్నారెడ్డిని చంపటం కోణ్ని గొంతుకోసేంత తేలిక.
  అ పనేదో తనొక్కడే చేస్తే..?
   మలపు వద్దే టక్కున ఆగిఫొయాడు.
 కొంతసేపు డోలాయమాన స్థితిలో వూగిపోయాడు.
 తర్వాత స్థిర నిర్ణయానికి వచ్చాడు. తనొక్కడే వాన్ని నరికి చంపాలని, చేతులారా తన కసి దీర్చుకోవాలని.
  అందుకే చెన్నారెడ్డి విషయాన్ని రహస్యంగా వుంచాడు.
 అలాంటి సమయంలోనే ఒకనాటి సాయింత్రం పోరుమామిళ్ల నించి శివపురి వచ్చి ఇంట్లో అడుగుపెడుతూనే టెబుల్ మీద ఓ పెళ్లి పత్రిక కన్పించింది రమణారెడ్డికి.
  కాళ్లు మొగం కడుక్కొని వచ్చి టేబుల్ ముందు కూచుని పత్రికను చేతికి తీసుకొన్నాడు.
 ఆలూరి వాళ్ల పెళ్లి.
తమకు దూరపు చుట్టాలు.
  పిల్లవాడు ఎం.బి.ఏ చేసినట్టుంది హైదరబాదులోనే ఏదో కంపెనీలో మంచి ఉద్యోగమని వినికిడి.
 పెళ్లి కూడా హైదరాబాదులోనే... ఎల్లుండే పెళ్లి.
 " నీ పెండ్లిగ్గూడా వొచ్చినారురా వాల్లు.  దూరపు బంధువులైనా అన్ని సుభకార్యాలకూ వస్తావుండారు. మనమూ పోతావుండాము తప్పకుండా పోవాల.."  పెద్దిరెడ్డి చెప్పాడు.
  అడ్డపంచె పకెగ జెక్కి బైట పచార్లు చేస్తూవున్న బాలుని వద్దకెళ్లాడు రమణారెడ్డి.
 " పత్రిక చూసినావా ? "  అడిగాడు.
 " ఏది ? ఆలూరోల్లదా ! చూసినాలే.. "  చెప్పాడు.
 " పెండ్లికి ఎవురు బోతనారు..? "
 " యీన్నించి ఎందుకూ పోవడం ?  జయసింహ అక్కన్నే వుండాడుగదా ! వాన్నే పొమ్మంటే సరి.. "
 " వానికి తెలిసుండదు. ఫొన్‌జేసి చెప్పు "
 " సరే " నంటూ తలూపాడు బాలుడు.
 లోపలికెళ్లి పత్రికను టేబుల్ మీద విసరేస్తూ ఎందుకో దానికేసి అదేపనిగా చూశాడు రమణారెడ్డి.  తర్వాత తమ్మున్ని కేకేశాడు  " బాలుడూ "  అంటూ
 " ఈయప్ప చెన్నారెడ్డి వర్గం గదరా ? "  అన్నాడు పత్రిక చూపిస్తూ.
 " పక్కాగా .."  చెప్పాడు బాలుడు.
 " మరి.. యీ పెండ్లికి చెన్నారెడ్డి కూడా వస్తాడు గదా ! "  ఉధ్విగ్నంగా అన్నాడు.
 ఒక్కసారిగా మూగవొయాడు బాలుడు.
 అక్కడ కొంతసేపు పిన్‌డ్రాప్ సైలెంట్ అలుముకొంది.
  మరుక్షణమే ఓ పథకానికి రూపకల్పన చేయటం ప్రారంభించారు అన్నదమ్ములిద్దరూ.
  కొంత సమయం గడిచిన తర్వాత హైదరాబాదుకు ఫోన్ పెట్టాడు రమణారెడ్డి.  జయసింహ లైన్లోకి వస్తూనే  " హలో జయ ! నేను రమణారెడ్డిని... ఎల్లుండి ఆలూరి వాళ్ల పెళ్లి... నువ్వు అటెండ్ అవుతావు గదూ ! "  అడిగాడు.
  " ఆ  సరేన్నా ! "
  " చెన్నారెడ్డి ప్రోగ్రామ్ షెడ్యూలేమైనా సేకరించినారా ? "
  " పి.ఏ లొంగటం లేదన్నా ! "
  " ఆలూరి వాళ్లు చెన్నారెడ్డి వర్గీయులే.. అతను తప్పకుండా ఆ పెళ్లికి రాగలడేమో !  ఎంక్వయిరీ చేస్తావా ! .. ఓ అర్ధ గంటలో నాకు ఫోన్ చేసి చెప్పాలి "
  అర్ధగంటకు ఖచ్చితంగా ఫోనొచ్చింది.
 జయసింహ నించే అనుకొన్నారు.
  ఆలూరు వాళ్లనించి - పెళ్లికి తప్పక రమ్మని.
 మరో పదినిమిషాల తర్వాత జయసింహ నించి ఫోన్.  " చెన్నారెడ్డి ఖచ్చితంగా వెల్తున్నాడుట పెళ్లికి "
  " సరే..  రాత్రికి మనవాళ్లు బసెక్కుతారు. తెల్లారే టయానికి అక్కడుంటారు.... అన్ని విషయాలు మీకు చెబుతారు..  నేను తర్వాత ఫోన్ చేస్తాను.. "  చెప్పాడు.
  రాత్రికంతా పకడ్బందీ వ్యూహాన్ని సిద్దం చేసి చెన్నకేశవకు అప్పగించి పదిగంటల బసెక్కించారు మరికొందర్ని తోడిచ్చి.
  మనుషులు సిద్దంగా వున్నారు.
 వాళ్లల్లో కసి దండిగానే వుంది.
 పథకాన్ని అమలు పరిచే శక్తి మెండుగానే వుంది.
 అపజయాలు ఎదుర్కొన్నారు కాబట్టి జయించాలనే తపన అధికంగానే వుంది.
 ప్రస్తుతం అక్కడ లేనిది ఒక్కటే..
  ఆయుధ సంపద.
 వేటకొడవళ్లు, బాకులు తల్వార్ లాంటివి దండిగానే వున్నాయి.
  ఈ పనికి బాంబులు తప్ప మరో ఆయుధాలు అంత అనుకూలంకావు.
 వాటినయితేనే తమ వాళ్లు సమర్థవంతంగా వినియోగించగలరు.
 రేపు రాత్రికి బాంబులు పంపించాలి.

                            ***********

  తన రాజకీయ జీవితంలో దండయాత్రల గుండానే ఎక్కువ విజయాల్ని చవిచూశాడు చెన్నారెడ్డి.  ఎదురు తిరిగిన వాళ్లను క్రూరంగా అణచివేయటం వల్లనే సామ్రాజ్యాన్ని విస్తరింప జేసుకొన్నాడు. ఓవైపు నెత్తురూ, కన్నీరూ పారుతోంటే మరోవైపు గెలుపు సంబరాలు చేసుకొన్నారు. పల్లెలన్నీ పాదాక్రాంతమయ్యేదాకా హింసను కొనసాగించాడు.
  ఇప్పుడు తను సాధించే విజయాలు గత విజయాలకు పూర్తిగా భిన్నమైనవి. జనాల మొహాల్లో తృప్తినీ, సంతోషాన్నీ కలగిస్తూ తను గెల్చుకొంటున్నాడు. పల్లెల్లో సంబరాలు చేయిస్తూ గెలిచి సాధిస్తున్నాడు. నాయుకునిగా తనకిది గొప్ప అనుభూతి. సందేహం లేదు.
  ఈ ప్రక్రియకు బీజాలు ఎప్పుడో పడవలసింది. తన దురదృష్టం కొద్దీ ఇలాంటి విజయాలు కూడా వుంటాయనే స్పృహ తనకు కలిగేసరికి చాలా ఆలస్యమైంది.
  తను చేసిన పాపాలు శివపురి సోదరుల రూపంలో వెంటాడుతున్నాయి.
  నిజంగా తను పాపం చేశాడా..?
  తనెప్పుడూ అట్లా భావించలేదు.
 చరిత్రంతా తిరగేసినా రక్తపాతం లేకుండా ఏరాజు రాజ్యాధికారాన్ని సాధించిన దాఖలాలు లేవు.
 ప్రజాస్వామ్యం కాబట్టి యుద్దాల తీరు మారింది... అంతే.
 దాదాపు మెజారిటీ పక్షం నాయుకలందరిదీ యిదేబాట... కాదంటే తనది వాళ్లకంటే కొంచెం గాఢమైంది...  సందేహం లేదు.
  ఆ గాఢతే తనను రాక్షసునిగా చిత్రించేంత పనిచేసింది.
 ఇప్పటికయినా మించిపోయింది లేదు.
  సాధించిన అధికారాన్ని నిలుపుకొనేందుకూ, దాన్ని అనువంశిక ఆస్తిగా మార్చేందుకూ మంచిదారి మార్చాలి.
  అంతదాకా బతకనిచ్చేట్టుగా లేరు ప్రత్యర్థులు.
  అంటే రాజకీయాల్లో మంచి మార్పును ప్రవేశబెట్టబోతున్న తనకు వాళ్లు అడ్డొస్తున్నట్లే గద !  మార్పు రాకుండా అడ్డుకోంటోన్నట్లేగద !
  ఈ ఒక్కసారి వాళ్ల అడ్డు తొలగించుకోంటే  ఎంతబావుంటుంది !
  మంచి మార్పుకోసం వాళ్లను లేపేసే శక్తిని భగవంతుడు  తనకిస్తే ఎంత గొప్పగా వుంటుందనీ !
గత  కొంతకాలంగా అతని ఆలోచనా తీరు అట్లా కొనసాగుతూ వుంది. శివపురి వాళ్ళ చరిత్ర ముగించి ఆపైన తాలూకాలో హింసా రాజకీయాల్ని పూర్తిగా మాన్పించాలని అతని ఆశ.
  తను ప్రయత్నించినా వాళ్లను చంపలేడేమో..!
  అవకాశం రావాలి.
  తనగుండా తాలుకా రాజకీయాల్ని ప్రక్షాళన చేయించి బాగుపరచాలని భగవంతునికి కోరిక పుడితే వాళ్ల అంతం చూసేది ఎంతసేపు..!!
  ఈ మద్య కొంత ఎక్కువ మోతాదులోనే తన ప్రియురాలి వద్ద గడుపుతున్నాడు అతను.
  ఆమె భర్త రాష్ట స్థాయిలో గుర్తింపు పొందినా ఐ.ఏ.ఎస్ ఆఫీసర్, అతనా స్థితికి చేరుకోవటానికి కారణం చెన్నారెడ్డే.
  అతనెప్పుడూ క్యాంపుల మీదుంటాడు.
 తన భార్య వల్ల చెన్నారెడ్డికి లభించే ఏకాంత సుఖానికి అతని అడ్డంకి వుండే అవకాశం లేదు.
  ఆమె వద్ద వున్నంత సేపూ  అన్ని సమస్యల్ని మరచిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు చెన్నారెడ్డి.
 అద్భుతమైన విషయమేమిటంటే - గేటు వరకు తనను వెంటాడుతోన్న మృత్యుభయాన్ని కూడా మరచిపోగలుగుతున్నాడు.
 ఊరికి వెళ్లబుద్ది కావటం లేదు.
 అలాగని ఎక్కువ రోజులు ఇక్కడే వున్నా యింట్లో సంజాయిషీ యివ్వవలసి వుంటుంది.  మరికొంత ఆలస్యమైతే తనతో పనున్న తన అనుయాయులు నేరుగా యిక్కడికే వచ్చే ప్రమాదముంది.
 రేపు ఆలూరి వాళ్ల పెళ్లి చూసికొని ఎల్లుండయినా ప్రయాణం కావాలి.
 రాత్రి ఇష్టసఖి ఇంటికి వెళ్లాలనుకొన్నాడు.
 ఏడుగంటల ప్రాంతంలో సిద్దమవుతున్నాడు.
  ఈ రోజు భోజనం కూడా అక్కడే చేయాలి.
 రిసీవర్ ఎత్తి నెంబర్ డయల్ చేశాడు.
 అవతల తనే ఎత్తింది. అతని గొంతును పోల్చుకొంది.
 " ఇప్పుడు ఏదారిలో వస్తానో వూహించు చూద్దాం ! "  అన్నాడు.
 చిన్నగా నవ్వింది ఆమె  " ఏ దారిలో వచ్చినా యీ సందులోకి మలుపు తిరగాల్సిందే గదా ! యీ యింట్లోకి రావాల్సుందే గదా ! "  అంది.
  " భోజనం కూడ అక్కడే "  చెప్పాడు  " ఏ హోటల్నించి తెప్పించమంటావో చెప్పు "
 " మగాళ్ల చేతి వంట నీకు రుచించదేమో ! "
 " ఆడవాళ్ల చేతులు అలసిపోతాయేమోననీ ! "
" అలసట నువ్వు తీరుస్తావుగదా ! "
 ఆనందంతో పరవశుడయ్యాడు.
 మరో ఐదు నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేశాడు.
 కోఠి వెళ్లి తనకు కావలసిన వస్తువుల్ని తీసికొని అట్నించి దిల్‌షుక్ నగర్ వెళ్లాలని అతని ఆలోచన.
 మధురమైన ప్రయాణానికి హృదయాన్ని సవరించుకొని బైట పడబోతూ వున్నాడు.
 అంతలో ఫోన్ మోత
 వెనక్కి తిరిగి రిసీవర్ ఎత్తాడు.

                                                                                                           ........ సశేషం

4 comments:

Probably the best narration of faction leader’s thoughts by sannapureddy. Thanks Kamal garu for posting.
-Bharat

థ్యాంక్స్ అపరిచితులు..

Always eagerly looking for the next episode.Just reminds me the old days of 1992-93 when I used to follow the developments in Newspaper..Great narration!

@అపరిచితులకు... థ్యాంక్స్, ఇంకా రెండుమూడు వారాల్లో ఈ కథ ముగింపుకు వస్తుంది. కథనం ప్రతిభ అంతా మా రచయత సన్నపురెడ్డిగారిదే.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs