Showing posts with label వ్యవస్థ - అవస్థ. Show all posts
Showing posts with label వ్యవస్థ - అవస్థ. Show all posts

     
          నేను పెరిగిన ప్రాంతంలోనే " గ్రామ కక్షల " అనే ఒక రకపు జాడ్యం ఉందనుకనేవాడిని...! ఎప్పుడైతే ఈ కప్ప తనుండే బావి నుండి పక్కనున్న మరో బావిలోకి ఎగిరి వచ్చిపడిందో అక్కడున్న మరో రకపు జాడ్యాన్ని కొద్దికొద్దిగా గుర్తించసాగింది. అవును మరి..రాయలసీమ ప్రాంతంలో ఉన్న గ్రామకక్షలు  ( ఫ్యాక్షన్ ) ఆధిపత్యం కోసం మూర్ఖత్వంతో కూడిన కారణాలతో అవర్భించాయి.. దానిక్కారణాలు నాకు తెలిసినంత వరకు కొన్ని చెప్పగలను.. నిత్య కరువు వలన గ్రామాలలో చేయడానికి పనుల్లేక నాలుగాళ్ల మండపం వద్ద కూర్చోని పొద్దుపోని మాటల్లోంచి జనించిన పౌరుషాల నుండి కొన్ని రకాల కక్షలు పుట్టుకొస్తే..మరి కొన్ని అడుగు నేల కోసం, ఏ మాత్రం విలువ చేయని పశువులు వేసిన " పేడ " కోసం, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో పుట్టుకొస్తాయి. అవే తరతరాలను నాశనం చేస్తున్నాయి. ఇవి రాయలసీమ ప్రాంతపు జాడ్యం ఒకటైతే.. మరికొన్ని....

      ఓ 20 ఏళ్ళ క్రితం నేనుండే బావినుండి మా పొరుగున వున్న  హైదరాబాద్ అనే మరో బావిలోకి దూకాను. మొదట్లో అందరిలాగే నాకు కాస్త తికమకగా ఉన్నా..తర్వాతర్వాత మెల్లిగా అవగతం అవడం మొదలెట్టింది.  బస్‌స్టాప్‌లో నిలబడి అమాయకంగా నగరాన్ని గమనిస్తున్న యువకల్ని అకస్మాత్‌గా కొందరు జీపుల్లో వచ్చి కిడ్నాప్ చేస్తుండడం నేను నిత్యం కాకపోయినా తరచుగా చూస్తూ వుండే వాడిని.. వాటికి కారణాలు అప్పటికే నాకు పరిచయం అయిన కొంతమంది తెలంగాణ ప్రాంతపు మిత్రుల ద్వారా ( ఈ " ప్రాంతాల " పదం నాకు మొదట్లో వాడుకలో అలవాటు లేదు గాని ప్రస్తుత పరిస్థితుల్లో నాలో వచ్చి చేరిన భావ దారిద్ర్యం ) తెలుసుకున్నప్పుడు విధ్యుత్ఘాతం తగిలినంతగా ఉలిక్కిపడేవాడిని. వారిమాటల్లో వారి వెతలు తెలిసేవి తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ " ఎన్‌కౌంటర్స్" జరిగినా, ఉపాధికోసం వచ్చి నగరంలో ఉన్న తెలంగాణ యువకులకు వారి ఇంటినుండి ఉత్తరాల ద్వారానో లేక చుట్టుపక్కల ఉన్న వారికి ఫోన్ ద్వారా " ఇక్కడ ఎన్‌కౌంటర్స్ జరిగాయి..ఇప్పట్లో మన వూర్లకు రాకండి..అక్కడే ఉండండి పండుగలొచ్చినా సెలవలొచ్చినా అక్కడే ఉండండి " అంటూ సమాచారం అందజేసేవారు. వూర్లకొస్తే ఎత్తుకపోయి " ఎన్‌కౌంటర్ " చేయడానికి చాలావరకు ఆస్కారముంటుంది... అలానే చాలా వరకు జరుగుతూనే వుంటాయి. అదే ఉద్దేశం వారి తల్లితండ్రులది. మా వూరిలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాల మీద అవగాహన లేకపోయినా.. తెలంగాణ ప్రాంతపు నక్సలిజం మీద అవగాహన దినపత్రికల ద్వార తెలియడం వేరు ప్రత్యక్ష్యంగా చూడడం వేరు. నిజాం నుండి సాయుధపోరాటం ద్వారా విముక్తి పొందిన తర్వాత " నల్ల దొరల " విశృంఖల దాస్యంలో, వికృత చేష్టలలో నలుగుతూన్న పరిస్థితుల నుండి ఉద్భవించిన తిరుగుబాటు తనం మీద " నక్సలైట్స్ " అనె ముద్ర పడిందన్న విషయం నేను కొత్తగాచెప్పనవసరంలేదు..తెలుగువారికందరికీ తెలిసిన విషయమే.. ఈ దొరలు తమ నియంతృత్వపు దోరణిలతో అక్కడున్న ప్రజలను హీనాతి హీనంగా హింసిస్తూ చూడటం అదొక జాడ్యం ఆ ప్రాంతానికి. బహుశ ఈ జాడ్యం ఉత్తర భారతదేశం నుండి ప్రాకిన విదానమేమో..? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ ఇలా.. మిగతా ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో పట్వారి, పఠాన్‌ల వర్ణ వ్యవస్థ అనాధిగా అధికారం చెలాయిస్తూ ఉన్నది.
       నేను మీడియాలో పనిచేస్తున్నప్పుడు నాకు చాలా సన్నిహిత మిత్రుడు అయిన తెలంగాణ మీడియాసహచరుడి వూరికి వెళ్లాను, వరంగల్ దగ్గర గూడూరు తాలుకా అనుకుంటాను.. వారింటికి పోయినాక ఒక పదినిమిషాలకు ఆ వూరి దొరనుండి పిలుపొచ్చింది " మీ ఇంటికి ఎవరో కొత్తమనిషి వచ్చిండంట కదా..! తోల్కోని రమ్మని చెప్పిండు దొర " సెలవిచ్చాడు వచ్చిన మనిషి, నన్ను దొర ఇంటికి తీసుకుపోవడం నా మిత్రుడికి ఇష్టం లేదు.. వాళ్ల ఇంట్లో వారు నాకు ఎలా చెప్పాలో అని తర్జన భర్జన పడుతున్నారు..నాకూ వెళ్లడానికి ఇష్టం లేదు..దానికి కారణం నా చెప్పులు నా చేతుల్లో పట్టుకొని దొరముందు నించోవాలట..దొరగడిలో..! చివరకు దొర ఇంటికి వెళ్లకుండానే ఆ వూరినుండి బయలదేరి వచ్చేశాను.  దొరతనం.. ఫ్యూడలిజం..నియంత్రుత్వం అవన్ని ఈ ప్రాంతపు జాడ్యాలు.

  ఇక మూడవ ప్రాంతం..! ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని బయటి ప్రపంచంలో ఒక అన్నపూర్ణగా, నాగరికతకు ఆనవాలుగా కీర్తి తెచ్చిన ప్రాంతం కోస్తా, సర్కారు తీరప్రాంతాలు. మేథావులు, పండితులు పుష్కలంగా ఉన్న ప్రాంతం. నీరు సంవృద్దిగా ఉన్న ప్రాంతాలలో..ఆర్థికాబివృద్ది హెచ్చుస్థాయిలో ఉంటుంది. ధనం ఎక్కడ పుష్కలంగా ఉంటుందో అక్కడ కళలు, కళాకారులు పుట్టుకొస్తారు. ఇదంతా వాస్తవం.నిజం. బయట ప్రపంచంనుండి..ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి వెళ్లి కోస్తా ప్రాంతాలలో తిరిగే వారికి అక్కడి నీరు, ఎటు చూసినా కనుచూపుమేరా కనపడే పచ్చని పంటలు..." పచ్చని చేలా పావడ గట్టి.. కొండమల్లెలే కొప్పునబెట్టి వచ్చే దొరసాని " అన్న వేటూరి వారి పల్లవి గుర్తుకు వస్తుంది...చూసే వారికి ఈర్షపడేంతగా...!! జీవితానికి ఇంతకన్నా ఇంకేమి కావలి.. అనిపిస్తుంది అక్కడి వాతావరణం.. నిజమే బయట నుండి చూస్తే అలానే అనిపిస్తుంది..నేను కూడ అలాగే అనుకున్నాను...కాని..!!  మనుషులకు ఎటువంటి ఘర్షణ లేకుండా జీవితాన్ని సుఖంగా జీవించడం అన్నది  సప్పగా ఉంటుందేమో మరి..! అంతెందుకు.. ముస్లీములు, క్రిస్టెయన్స్ భారతదేశంలో లేనప్పుడు, కేవలం భారతీయులే ఉన్న కాలంలో వైష్ణవులు..శైవులు అంటూ వర్గాలుగా విడిపోయి తన్నుకొన్నారు.. మరీ అంత సుఖంగా జీవించడం మనకు అంత రుచించదు కదా..?  బయట నుండి చూసే వారికి ఇక్కడేమి లేదు..అంతా బాగు..బాగు అనిపిస్తుంది..కాని....!!
   మరి ఈ కప్ప ఎప్పుడైతే కడప బావి నుండి హైదరాబాద్ అనే బావిలోకి వెళ్లిందో..అక్కడే కోస్తా, సర్కారు ప్రాంత బావి జీవితం కనపడసాగింది...! అక్కడి ప్రజలు కులాలవారిగా.. వర్గాలుగా విడిపోయి జీవనం సాగిస్తున్నారులా అనిపిస్తుంది... కాస్త లోతుగా చూస్తేనే ఆ విషయం స్పష్టమవుతుంది. హైదరాబాద్‌లో మీడియాలో చేరిన సమయంలో కొంత మంది కోస్తా ప్రాంతపు మనుషుల పరిచయం సమయంలో కరచాలనం చేస్తూ ఒకరి పేరు ఒకరు చెప్పుకుంటాము కదా...! ఆ సమయం నా పేరు చెప్పగానే..ఎదుటి మనిషి.." ఆహ  మీ పూర్తి పేరు ఏంటి..? " అని అడిగాడు.. నేను " పూర్తి పేరు ..? " అంటూ ప్రశ్నార్థకంగా మొహం పెట్టాను. ." అదే మీ ఇంటి పేరుతో సహా మీ పేరు చివరన కూడ తోక ఉంటుంది కదా అది చెప్పండి " అని అడిగారు..! నాకది కొత్త అనుభవం నా ఊహ తెలిసినప్పటి నుండి మా బావిలోనే ఉండటం మూలాన మాకు ఇంటి పేరు లేకుండా మాకున్న నామదేయం చెప్పడమే అలవాటున్న బావిలోనే పెరిగాము.. సో.. నాకది కొత్తగానే అనిపించింది..కాని వారు అలా అడగడానికి వెనుకున్న కారణం కూడ వెంటనే స్పరించింది...! అది అర్థమై.." నాకు ఇంటి పేరు..వెనకా ముందు తోకలు ఏమి లేవండి "  అని చెప్పాను. నాకు ఇంటి పేరు చెప్పడం ఇష్టం లేదన్న సంగతి అర్థమై ...మౌనం వహించారు.  అలా ఇంటి పేరును బట్టి ఎదుటి వారి కులం ఏమటనేది వెంటనే గుర్తు పట్టి..సదరు వ్యక్తితో స్నేహం చేయవచ్చా లేదా అన్నది నిర్ణయించుకుంటారట..??. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటంటే...రాయలసీమ ప్రాంతంలో ఇంటి పేరును బట్టి కులాన్ని గుర్తించలేరు.. ఒకే రకపు ఇంటి పేర్లు చాలా కులాలకు వుంటాయి.. అదీ కాక రక రకాల ఇంటి పేర్లు వుంటాయి.. అదీను కాక రాయలసీమ ప్రాంతంలో కులాల వారిగా వర్గాలుగా విడిపోయి జీవనం వుండదు. ఇక నాకున్న కోస్తా ప్రాంతపు ఎన్.ఆర్.ఐ మిత్రుల మాటల్లో బోలెడు విషయాలను విన్నాను. అసలు కాలేజి విధ్య అంతా కులాల వారిగానే సాగుతూ వుంటుందట..??! ఒక కులం వారు మరో కులం వారి కాలేజిల్లో చదవరట..చదివినా కులాల వారిగా హాస్టల్స్ ఉంటాయట..! ఒక కులం విధ్యార్థులు మరో కులం విధ్యార్థుల హాస్టల్ ముందు వెళ్తున్న సమయంలో ఎదురెదురు పడినా లేక ఎదురు పడకపోయినా వెళ్లె దారి మద్యలో మరో కులం వారి హాస్టల్ కనపడినా ఊరికూరికనే ఎటువంటి కారణాలు లేకుండా కొట్టుకొంటారట..??! వాళ్లు చెబుతుంటే నాకు వింతగా తోచేది...! మరి  బావి లోని ఈ " కప్ప" జీవితం వేరు కదా..!!
       ఒక సారి మీడియా కోసం ఒక డాక్యుమెంటరీ నిమిత్తిం అమలాపురం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాలు తిరిగాను. ఆ సమయంలో అమలాపురం సమీపంలో ఉన్న కొన్ని లంకల్లో డాక్యుమెంటరీ చిత్రీకరిస్తున్నాము. నేనెక్కడ పనిచేసినా ఆ చుట్టుపక్కల వున్న అక్కడి వారితో మాటలు కలపడం, అక్కడి ఆచారాలు, సంస్కృతి, అక్కడి రైతుల విశేషాలు, ఏమేమి పండిస్తారో..ఎక్కువగా ఏమి పండుతుందో.., అక్కడి మనుషుల ఆలోచనలు తెలుసుకోవడం నాకున్న అలవాటుల్లో ఒకటి. అలానే ఆ లంకల్లో ఒకరిద్దరు బాగా సన్నిహితం అయ్యారు నాకు.. రెండు మూడు రోజులు అయ్యాక వారిలో ఒకతను.." సార్ మీ ఇంటి పేరు ఏటండి " అడిగాడు నన్ను..
 చిన్నగా నవ్వి " ఎందుకు " అని అడిగాను.
" మీ ఇంటి పేరు తెలిస్తే మీరు నాకేమి అవుతారే తెలుత్తాది కదాండి "  అన్నాడు. నేను పెద్దగా నవ్వాను. నా నవ్వు ఆర్థం కాక చూశాడతను.
" అయ్య బాబోయ్ అలా నవేత్తన్నారేటండీ " అడిగాడు
 " నా యింటి పేరు తెలుసుకొని ఏమి చేస్తావు "  అడిగాను
 " ఏముందండీ.. మీ ఇంటి పేరును చూసి మీరు నాకు బామ్మర్ధి వరస అవుతారా..? లేక వరసకు అన్నదమ్ములవతారా ..? అని తెలుత్తాది కదండీ "  అన్నాడు.
ఇంటి పేరును చూసి వీరెలా కులాన్ని, వరసల్ని గుర్తు పడతారో నాకెంత బుర్ర చించుకున్నా అర్థం కాలేదు..!  " తెలుసుకొని ఏమి చేస్తావయ్యా " అని అడిగాను
" మరే బామ్మర్ధి వరసయతే.. తాహతులో మీ అంత వున్నామా లేదా..? పౌరషం విషయంలో ఇక్కడ బావ బామ్మర్ధులకు ఎప్పుడు తగువులాటే.. ఏ విషయంలోనూ ఎవరికి ఎవరు తగ్గరు "  అంటూ ఏవేవో చెప్పుకుంటూ పోతున్నాడు.. చాలా వరకు నాకవేవి అర్థం కాలేదు గాని ఒక విషయం మాత్రం అర్థం అయ్యింది.. అనవసరపు పంతాలు..పట్టింపులు ఎక్కువుగా వున్నాయనే సంగతి అతని మాటల ద్వార అర్థమైంది.. బావా బామ్మర్ధులు ఒకరికొకరు తగువులాటల్లో తలలు పగలు గొట్టుకుంటారట.. అలా ఎన్నో చెబుతున్నాడు అతను. మద్యలో నేను అడ్డుకొని.." అలా తలలు ఊరికే పగలగొట్టుకునే బదులు ఒకే సారి చంపేసుకుంటే ఓ పనిపోతుంది కదా ..? " అని అడిగాను.
" అయ్య బాబోయి..అట్టా ఉత్తి పుణ్యానికే చంపేసుకుంటారాండీ.."  అడిగాడు.
" మరలా రోజూ కొట్టుకొంటూ చచ్చే కన్నా..ఒకే రొజు చంపేసుకుంటే పీడ పోతుంది కదా " అన్నాను. అంతే అతను మౌనం వహించాడు. ఇదొక అనుభవం నాకు.

   ఇలాంటివి చాలానే వున్నాయి అనుభవాలు..! ఇక అంతర్జాలంలో చెప్పనవసరం లేదు..కులాల వారిగా చీలిపోయి ఎంత బూతులు తిట్టుకుంటూ వుంటారో..! ఏదన్న ఒక విషయం మీద వ్యాసం లేక కామెంట్ రాస్తే అంతే అది నచ్చని వారు వ్యాసాన్ని అందులోని విషయాన్ని గ్రహించకుండా ఆ వ్యాసం రాసిన వ్యక్తిని వ్యక్తిగతంగా దూషించడం.. నీవు పలాన కులంవాడివి కావున కులగజ్జి అంటూ తిట్టడం..! మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు..ఎందుకిలా జనాలు ఉన్నారనీ..? తర్వాతర్వాత అర్థమైంది ఏమిటంటే.. కోస్తా,  సర్కారు ప్రాంతంలో చాలా వరకు జనజీవనం కులాల వారిగా విడిపోయి వున్నదనీ..! అలాగే జీవనం సాగిస్తున్నారనీ..పెద్దలను చూసి వారిల్లల్లో వున్న పిల్లలు కూడ వాటికి బాగా అలవాటు పడిపోయి.. ఊహ తెలిసినప్పటి నుండి కులాల విభజన వారి మనస్సులో బాగా నాటుకపోయి అలా పెరిగి పెద్ద అవుతున్నారనే విషయం అవగతమవుతున్నది.  చివరకు కళారంగంలో కూడ ఈ కులబావన పాతుకపోయిందనిపిస్తుంది.. కులాల వారిగా అభిమానులు.. అభిమానాలు తయారయ్యాయి. నిరుడు సంవత్సరం పాటల రచయత వేటూరి గారి మరణం సమయంలో కూడ ఒక మగానుభావుడు ( మహానుభావుడు ) వేటూరి పాటలను కులం కోణం నుండి విశ్లేషించాడు నవతరంగంలో. ఇంతకన్న భావధారిద్ర్యం ఉంటుందా..? ప్రతి విషయాన్ని కులం కోణం నుండే చూస్తున్నారు.. చివరికి తమ చుట్టూ వున్న ప్రపంచాన్ని కూడ.

   మరొక సంఘటన..! అక్కడెక్కడో ఉత్తర భారదేశంలో పుట్టి పెరిగిన ఒక తెలుగమ్మాయి. తన విద్యనంతా ఉత్తర భారదేశంలో అభ్యసించి. తర్వాత పి.జి మాత్రం తన మాతృభాష ప్రాంతంలోనే చేయాలనే తలంపుతో  తన మూలాలను వెదుక్కుంటూ వైజాగ్‌కు వచ్చి ఆంధ్రా యూనవర్శిటీలో చేరితే...! అక్కడి కులాల కుమ్ములాటలు చూసి  షాక్ అయ్యింది. " ఏంటండి.. ఎంతో ఆశతోనూ..తెలుగు బాష మీద మమకారంతోనూ.. నా మూలాలు ఇక్కడే ఉన్నాయనే వస్తే..! ఇక్కడేంటీ...!! నా ఫ్రెండ్స్ నాకో వార్నింగ్ ఇచ్చారు ’కలిస్తే ఏదో ఒక కులం వారితో కలువు అంతే గాని మూడు కులాలవారితో సమానంగా మెలగాలంటే మాత్రం కుదరదు  ’అని అన్నారు.. అదేమి గొడవో నాకు అర్థం కాలేదు.. నాకు అందరితోనూ కలవాలనే ఉంటుంది ఏమి చేయనూ..? ప్చ్..ఇక్కడి కంటే నాకు నార్త్ ఇండియానే బావుంది " అని చెప్పింది. ఆ అమ్మాయి కూడ అగ్రవర్ణ కుల వర్గమే కాని అక్కడున్న మూడు కులాల గ్రూపులో ఈ అమ్మాయి కులం లేదు. అదీ సంగతి.  ఇది ఇక్కడి కుల జాడ్యం.

      నిజానికి కులంగజ్జి, కులాభిమానం... ఇవన్ని నిజాలనుకుంటున్నారా.? అలా అనుకుంటే అంతె.. చారులో లెగ్ ఏసినట్లే..! ఎవరికీ వరి వారి కులం మీద అభిమానం ఉందనుకుంటె అంతె...! అంతకన్న మూర్ఖత్వం ఏది వుండదు...! మనిషికి " తను " అన్నది ముఖ్యం... అంతే కాని కులం, ప్రాంతం, మతం ఇవేమి కావు. " నా, నేను " వీటి తర్వాతే ఏవైనా.. కాకపోతే ఈ " నా, నేను " లు బయటి సమాజంలో చాలానే కోకొల్లలుగా ఉంటాయి..మరి వాటి మద్యలో " నేను " లు తమ మనుగడలు.. ఆస్థిత్వాన్ని కాపాడుకోవడం ఎలా..? అలా వెతుకులాటలో దొరికనవే.. కులాలు, మతాలు, ప్రాంతాలు అనబడే ఆలంబనలు. ఈ " నేను " లు బయట సమాజంలో ఒంటరిగా మనుగడ సాదించడంలో " భయాలు " ఎక్కువ..సో...వాటికో ఆధారం కావాలి..ఆలంబన కావాలి..అంటే ఒక సమూహం..ఉండాలి..! ఈ కులం అనే సమూహం వలన " నేను " అనే ఈ ఆస్థిత్వం తన భయం నుండి బయట పడుతుంది...! అంతే కాని నిజ్జంగా కులతత్వం అన్నది ఒక మిధ్య..నాణ్యానికి మరో కోణం ఉన్నది.. దానికో ప్రత్యేక వ్యాసంలో...

            విచిత్రమేమిటి అంటే ఈ మూడు రకాల జాడ్యాలు కేవలం ఈ మూడు ప్రాంతాలకే పరిమితం కాదు..మిగతా అన్ని ప్రాంతాలలోనూ ఉన్నవే.. గ్రామ కక్షలు ఒక్క రాయలసీమలోనే కాదు భారతదేశమంతా గ్రామాలలో ఉన్నవే.. కాకపోతే  వాటి రూపాలు వేరుగా ఉంటాయి, వాటి తీవ్రతలు మారుతూ వుంటాయి..ఆయా ప్రాంతాలను అనుసరించి.. అలాగే కుల తత్వం ఒక్క సర్కారు, కోస్తా ప్రాంతంలోనే కాదు మిగతా రెండు ప్రాంతాలలోనూ ఉన్నవే కాకపోతే అక్కడున్న ప్రాముఖ్యతలను బట్టి వాటి రూపాలు మరో విదంగా వుంటాయి, వాటి తీవ్రత వేరుగా ఉంటుంది.. అలాగే తెలంగాణ దొరల నియంత తత్వం విషయంలో కూడ అంతే. అన్ని చోట్ల ఫ్యూడలిజం ఉన్నదే..!
  అవన్ని మరచిపోయి.. ఒకరినొకరం మరొకరి గురించి రంద్రాణ్వేషణ చేసుకుంటూ.. ఎవరి వారికున్న రంద్రాలున్న విషయం మరచిపోయి ఒకరినొకర్ని తిట్టుకుంటూ బతుకుతున్నాము. మూడు ప్రాంతాలలో మూడు రకాల రంద్రాలున్నాయి...!  ఎవరివి వారికి అన్నీ బాగా తెలుసు..... తెలిసినా కూడ తెలియనట్లే నటిస్తూ.... తమకున్న రంద్రాలకు " లప్పం " పట్టించుకుంటూ ఎదుటి వారి మీద ద్వేషం కక్కుతున్నారు. హేళన చేస్తున్నారు..! మీకు సభ్యత, సంస్కారం, చదువు, విఙ్ఞానం మేము నేర్పాము అంటూ గొప్పలు చెప్పుకొంటూ ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటున్నారు.

     ఎక్కడైనా మనిషి మనిషే..    మనిషికుండే లక్షణాలు ఎక్కడైనా ఒక్కటే..! అది అమెరికా అయినా..ఐరాపా అయినా.. ఆసియా అయినా.. అవే ఉద్వేగాలు, మానవ సంబందాలు, ఆత్మీయత, అనురాగం, వాత్సల్యం, హింస, అసూయ, అనురాగం, ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ మనిషికి సంబందించినవే..! ప్రాంతాలనసరించి, కులాలననుసరించి మనుషులుండరని మనందరికీ తెలుసు అయినా కూడా వాటినిని పరిగణలోకి తీసుకోకుండా తెలియనట్లే నటిస్తూ..ఎదుటివారిమీద ద్వేషం కక్కుతూ వుంటాము.

        మన పాత సామెత ఒకటి ఉండనే ఉన్నది కదా..!! అదే.. ఒక వ్రేలు ఎదుటి వారి వైపు చూపిస్తే... మిగతా మూడు వ్రేల్లు మన వైపు చూపిస్తాయి అని..! కాబట్టి మన వైపు చూపిస్తున్నా ఆ మూడు వ్రేల్లు గురించి ఆలోచించండి తెలంగాణారాయలసీమకోస్తసర్కారు జనులారా..!!


      ట్యాంక‌బండ మీద మార్చి 10 న జరిగిన సంఘటనలకు కారణం ముమ్మాటికీ మీరే..మీరే..మీరే..! తప్పదు ఆ అపనింద, మీరు మోయాల్సిందే..!! మీరు చేసిన పనివలన  ఇప్పుడు తెలంగాణ పోరాటయోధుల మీద ఎన్ని అభాండాలో.. ఎన్ని అపనిందలో..బయటి ప్రపంచంలో ఎన్ని చీత్కారాలో.. చూశారా..??  మీరు ఎంతో మక్కువతో, ప్రీతితో ప్రతిష్టింప చేసిన విగ్రహాల వలన ఎంత మందికి ఎన్నిరకాల అవమానాలో గమనిస్తున్నారా..? ముఖ్యంగా 600 మంది తెలంగాణ అమరవీరులు ప్రాణత్యాగం చేసిన పోరాట స్పూర్తి  మీద నిన్న జరిగిన ఈ విగ్రహాల దాడి ఎంతటి మాయన మచ్చలా మిగిలిందో..చూడండి..!!

     
        అవును మహానుభావ..!  తమరు ఎంతో మక్కువతో ప్రతిష్టింప చేసిన ఆ విగ్రహాల మూర్తులు " మేము మరణించాక మా శిలావిగ్రహాలను రాష్ట్ర రాజధానిలో ప్రతిష్టించండి "  అని మిమ్మల్ని గాని లేక మరెవరితోనైనా విన్న వించుకున్నారా..?  లేదే..!!  పాపం వారేదో వారి జీవితంలో వారికి తోచినది.. తాము అనుకున్నది పట్టుదలతోనూ..  అకుంఠిత దీక్షతోనూ.. సమాజంలో జరగుతున్న అవతవకల మీద పోరాడి సమాజ శ్రేయస్సుకోసం తమ జీవితాన్ని అంకితం చేశారు.. అది తమ విది అనుకున్నారు.  అంతే గాని.. తమ తదనంతరం తమ రూపాలతో విగ్రహాలు చేయించి..పూజించ బడాలని కోరుకోలేదే..? కనీసం అలాంటి తలంపు కూడ వారి మదిలో మెదిలిండదు..! మరెందుకయ్యా వారి ప్రతిరూపాలని చెక్కించి ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టించి.. చివరికి ఇప్పుడు ఇలా కొంతమంది " పోరాట యోధుల " చేత పెకలింపబడి నడిరోడ్ మీద మెడకు తాళ్లేసి ఈడ్చి హుస్సేన్‌సాగర్‌లో పడేలా చేశారు..??  

    పాపం అన్నమయ్య ! తనకే ప్రాంతీయ, కుల భేదాలు లేని మనిషి. తనేదో భక్తి పారవశ్యంలో కొన్ని వేల పాటలు రాసి వాటికి బాణీలు కట్టి  తెనుగుకే శోభ తెచ్చి తన సాటి తెలుగువారందరికీ ఎన్ని తరాలైన తరగని మరువలేని సంగీత అమృతాన్ని అందించారు. అంతమాత్రాన 600 మంది ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కంటే అన్నమయ్య గొప్పవాడా..?

     ఎర్రాప్రగడ.. పాపం పిచ్చోడు..!  ఆయనెప్పుడు అనుకొని వుండరు.. తను మహాభారతంలో కొన్నిపర్వాలను తెనుగులోకి అనువాదం చేసిన పాపానికి తన ప్రతిమతో ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టింపబడి  కొంత మంది త్యాగధనుల చేత ముక్కలు ముక్కలుగా గావించబడతానని...!!.  ఇక  " తెలుగదేలయన్న దేశంబు తెలుగేను... దేశభాషలందు తెలుగు లెస్స " అని పలికిన పాపానికి పక్క రాష్ట్రం వాడు.. పరాయి భాషకు చెందిన శ్రీకృష్ణదేవరాయలును సైతం వదలలేదు..మన త్యాగమూర్తులు.!  మనల్ని ఎంతోగాను గౌరవించిన మనిషిని మనం గౌరవించిన తీరు..బేష్..చాలా బాగుంది.  ఇలా ఒకరేమిటి.. గుఱ్ఱం జాషువా..బళ్లారి రాఘవ. విప్లవాలకు ఆనవాలైన శ్రీశ్రీ. ఆదికవి నన్నయ భట్టు. త్రిపురనేను రామస్వామి చౌదరి. సమాజంలోని సాంఘీక దురాచాలాను రూపుమాపేందుకు కృషి చేసిన సంఘ సంస్కర్త అయిన కందుకూరి వీరేశలింగం.మువ్వగోపాల పదాలను మురిపెంగా ఆలపించిన క్షేత్రయ్య. ఇలా ఎందరో వైతాళికులకు అవమానం జరగడానికి కారణం మీరు కాదా యన్.టి.ఆర్ గారు..??

     అంతే కాదు  మీరు గాని ఆ విగ్రహాలను ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టింప చేయకుండ వుండుంటే వాటి మీద దాడి చేసే అవసరమే  తెలంగాణ పోరాటయోధులకు వచ్చుండేది కాదు. వారి మీద అన్ని అపనిందలు వచ్చుండేవి కావు..!   ఆ తప్పంతా మీదే..మీదే...యన్.టి.ఆర్ సారూ....!! మీది కాదంటారా..?  కాదంటారా..? కాదేమోనా..!! అదెలా..? లోతుగా ఆలోచించాలా..!!  కూసింత లోతుగా ఆలోచిస్తే ....నిజమే తప్పంతా మీది కాకపోవచ్చు..!  తప్పంతా మీలో ఉన్న సంస్కారానిది, మన తెలుగువాళ్లు అని తలించిన మీ కృతఙ్ఞతది,  అవును మాస్టారూ.. తెలుగుజాతికి స్పూర్తి ప్రధాతలై, పధనిర్దేశుకులై, దృవతారలగ నిలిచి మానవ చరిత్రకు రూపకల్పన చేసిన మహనీయులను స్మరించుకోవడం, గౌరవించుకోవడం మన కర్తవ్యం అనుకొన్న మీ ఔనత్యానిది సర్ తప్పంతా....!  ఒక విషయం గమనించారా..! ఈ సంఘటన జరగకమునుపు వరకు ట్యాంక్‌బండ్ మీద ఉన్న మహనీయ విగ్రహాలు చూసినప్పుడల్లా  " ఆహా యన్.టి.ఆర్ ఎంత మంచి పని చేశారు. తన రాజకీయచరిత్ర ఎలా ఉన్నా "  అని అనుకునేవాడిని, కాని ఇప్పుడూ ఈ సంఘటన జరిగాక మీ మీద నింద మోపాల్సి వస్తున్నది. చూశార..!!  నిన్నటివరకు మంచి అనుకున్నది కాలంతో పాటూ మారుతూ ఈ రోజు చెడు అవుతున్నది..నిన్నటి దినం చెడు అనుకున్నది  ఈ రోజున మంచి అవుతున్నది.  తెలుగు భాష మీద, వైతాళికుల మీద మీకున్నంత  అభిమానం. కృతఙ్ఞత,  అభిలాష సాటి తెలుగువారమైన మాకు లేవు సర్.. మాకు ఏ చరిత్రా అవసరం లేదు..ఏ మహనీయులు అవసరం లేదు...! మా సంకుచిత భావాల ముందు మీ మహనీయుల విలువ ఎంత..? మాకు కావలసింది కేవలం మా వ్యక్తిగత క్షేమమే.. వ్యక్తిగత అభివృద్దే..! మా వ్యక్తిగత ఆకాంక్ష కన్నా ఏ మహనీయులు గొప్పవారు కారు. కావాలనుకొంటే మీరు చెబుతున్న ఆ మహనీయుల్లోని వ్యక్తులను మేము కులాలవారిగా, ప్రాంతాల వారిగా, మతాల వారిగా విడదీసి పంచుకొని గౌరవిస్తాము. కనీసం మీరు ఆ విదంగా సంతృప్తి పడండి మాస్టారు. అంతెందుకు సార్ ఎవరన్న ఒక విశిష్ట వ్యక్తిని తీసుకుందాము, మేము అతనిలో వున్న ప్రతిభనో లేక  వ్యక్తిత్వాన్నో చూసో గౌరవించం, ఆ వ్యక్తి యెక్క కులాన్ని చూసో లేక ప్రాంతాన్ని చూసో ఆ మనిషి యెక్క ప్రతిభను గుర్తించి గౌరవిస్తాము. అది మా తత్వం. ఆ ప్రాతపదికగనే మహనీయులను పంచుకుంటున్నాము కూడా. అంతెందుకు ఇప్పటికీ మిమ్మల్ని కూడ ప్రాంతీయ, కులాల ప్రాతిపదికంగా చూస్తూన్నాము అంతే కాని.... ఒక తెలుగువాడిగా దానికన్నా ముందు కళారంగంలో ప్రతిభావంతుడైన ఒక విశిష్ట వ్యక్తిగా గుర్తించటం లేదు... ఇది ముమ్మాటికి నిజం.
 
     అయినా మీ పిచ్చిగాని మాస్టారు, ప్రస్తుత ప్రపంచీకరణ ఆర్థిక సరళీకృత విధానాలలో కొట్టుకుపోతూ మమ్మల్ని మేమెప్పుడో కోల్పోయి చాలా కాలం అయ్యింది, మాకు మా మూలాలు ఏవీ అవసరము లేదు. దేశంలోనికి, రాష్ట్రంలోకి ఏ కొత్త ప్రక్రియ వచ్చినా పోలోమంటూ ఒక " గొర్రె " దాటులా వెళ్తున్నాము. మెమెప్పుడో పరాయికరణ చెంది వున్నాము మా ప్రస్తానమంతా ఒక వ్యాపారం దిశగా ఒక వ్యక్తిగత లాభాపేక్ష దిశగా సాగుతున్నది.  వీటి మద్యలో మీరింకా మహనీయులు.. మహాత్మలంటూ ప్రాకులాడితే ఎలా మాస్టారూ...?

   ఇంతజరిగినా.. ఇప్పటికి మీరు మహనీయులుగా భావిస్తున్న ఆ విగ్రహాలను  " వట్టి విగ్రహాలు "  గానే చూస్తున్నాము. మరి వట్టి విగ్రహాలు అని తెలిసీ ఎందుకు వాటిని ద్వంసం చేసామో అని మమ్మల్ని మేము ప్రశ్నించుకునే సంస్కారం మాలో కనపడట్లేదు...!  అవి వట్టి విగ్రహాలు కాదని మాకూ తెలుసు ఆ విగ్రహాలు వెనుక కొన్ని భావాలు, ఆరాధనలు వున్నాయని తెలుసు.. ఆ విగ్రహాలు మాటున మీ భావాలను ఆరాధనలు విద్వేషంతో ద్వంసం చేయాలన్న ఉద్దేశంతోనే చేశాము... అయినా మేము వాటిని " వట్టి విగ్రహాలు " అనే బుకాయిస్తాము. విగ్రహాలు కావాలనుకుంటే మళ్లీ పునర్‌నిర్మించుకోవచ్చు అదే 600 మంది ప్రాణాలు తిరిగి తేగలమా ? నిజమే పోయిన ప్రాణాలు తిరిగి తేలేమూ..!! అదే విదంగా విద్వేషంతో విగ్రహాలను ద్వంసం చేసి తిరిగి మళ్లీ పునర్‌నిర్మించుకోగలమూ కాని ఆ ద్వంసరచన చూసి గాయపడి ముక్కలైన కొందరి మనుషుల భావాలను మళ్లీ అతికించుకోగలమా..?  అయినా పోయిన ప్రాణాలకూ ఈ విగ్రహాల విద్వంసానికి లంకె ఏమిటి..?  అది సరే మాస్టారు 600 మంది ఆత్మార్పణం చేసుకొన్న అమరవీరులెక్కడ..! కేవలం పుట్టారు కాబట్టి ఏదో కొన్ని పనులు చేసినందుకే  మహనీయులని ఒక ట్యాగ్ తగిలించిన ఆ పాతకాలపు మనుషుల విలువ ఎక్కడ..? వారికి వీరికి పోలికేంటి..!! వారేమన్న ఆత్మార్పణం చేశారా..? లేక సాధించుకోవడం చేతకానప్పుడు ఎమోషన‌ల్‌గా బెదిరించడానికి ప్రాణత్యాగం చేశారా...చెప్పండి..? మా 600  మంది అమరవీరుల ప్రాణాలు పోయాయి కాబట్టి మేము దానికి బదులుగా ఎన్నో విద్వంసాలు చేస్తాము.. అది మా హక్కు..దాన్ని కాదనడానికి ఎవరికీ ఏ హక్కు లేదు... అర్హతా లేదు.

   అయ్యా యన్.టి.ఆరూ అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వివాదలతో ముగిసింది మీ మరణం..!  దానిగురించి పెద్ద పేచీ లేదు కాని, మీరింకా ఇప్పటి వరకు బ్రతికే ఉండుంటే ఈ సంఘటన చూసి మీ గుండె పగిలి మరిణించేవారు.. దీని కన్నా అప్పటి మరణమే మేలనపిస్తుంది.. ఇలాంటివి చూడకూడదనే మీరు ముందుగానే స్వర్గస్థులైనారు, అంతకన్న అదృష్టం ఎవరికుంటుంది..! శుభం......

     రాష్ట ప్రభుత్వం వారికి నాదో విన్నపం :  అయ్యా ఘనత వహించిన ముఖ్యమంత్రిగారు, ప్రభుత్వ అధికారుల్లారా..! ఇప్పటికైనా మించిపోయినది ఏమి లేదు.. విద్వంసం తర్వాత ఇంకా మిగిలిన కొన్ని విగ్రహాలు ట్యాంక్‌బండ్ మీదనే వున్నాయి.. ఆ మిగిలిన విగ్రహాలను కూడ దయచేసి అక్కడనుండి పెకలించి ఏ గోదాములలోనో లేక మీ ప్రభుత్వ కార్యాలయ స్టోర్ రూములలొనో పడేయండి.. అక్కడన్న మనస్సాంతిగా వుంటాయి. ఆ మహనీయులు తమ తదనంతరం ఏ కీర్తిని కోరుకోలేదు, ఏ విగ్రహాలు తయారు చేయాలని కోరుకోలేదు.. ఏదో తమ వంతు చేయవలసిన కార్యక్రమాలు, సంస్కరణలు, మానవాళికి ఉపయోగేపడే విధానాలు, పనులు నిర్వర్తించి వెళ్లిపోయారు. వారు ఏ పూజలు కోరుకోలేదు, ఏ కీర్తిని ఆశించలేదు. పాపం యన్.టి.ఆర్ గారు తనలోని కళారాధనను సంతృప్తి పరుచుకోవడానికి ఆ మహనీయులు ప్రతిరూపాలను నిర్మించి ట్యాంక్‌బండ్ మీద ప్రతిష్టించారు. ఇప్పుడేమో మనం వర్గాల వారిగా విడిపోయి ఆ మహనీయులను ద్వంసం చేయడానికి పూనుకొన్నాము. వారి ఆత్మ ఘోషిస్తుంది. ఎందుకు వారిని బాదపెట్టడం.. ఎక్కడో ఒక గదిలో ఏదొక మూలన వున్నా పర్లేదు.. ఏగొడవలు, విద్వంసాలు లేకుండా జీవితం ప్రశాంతంగా గడుస్తుంది వారికి. ఇంకా ఆ ట్యాంక్‌బండ్ మీద అలానే వుంచితే మళ్లీ ఏ మార్చో..లేక ఏ గర్జనో..లేక ఏ బాగో కార్యక్రమం లాంటివి తలపెట్టి మిగిలిన ఆ విగ్రహాలను కూడ ద్వంసం చేస్తారు.. అలా జరగకమునుపే మీరు త్వరపడి..వాటిని అక్కడ నుండి తరలించండి. ఆ విగ్రహాలకు మనస్సాంతిని కలిగించండి. త్వరపడండి.. ఈరోజు సంఘటన రేపటికి మరుపుని తెస్తుంది అది అనివార్యం కూడ.. మళ్లీ ఎప్పుడో ఇలాంటివి సంఘటనలు జరిగినప్పుడు మళ్లీ మనస్తాపం..! అలాంటివి మళ్లీ జరగకుండా త్వరపడండి
 

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs