వంశి, చంద్రహాస్ రెడ్డి  అతని ఫ్రెండ్స్ మరోఆరుగురు కలిసి హరిణి ఉన్న కాలనీలోకి ప్రవేశించారు, రాత్రి 9 గంటలు కావస్తున్నది వీధుల్లో ఒకరిద్దరు బైకులమీద ఇంటికి చేరుకుంటున్నా, భోజనసమయం కావడంతో వీధంతా దాదాపుగా నిర్మానుషంగానే ఉన్నది. చీమ చిటుక్కుమన్న పెద్ద శబ్ధంలా వినిపిస్తుంది.  అప్పుడే శీను, హరిణిబావ మరికొందరు కజిన్స్ హరిణికి వంశి రాసిన లవ్‌లెటర్ విషయం, అంతకమునుపు జరిగిన చర్చలు అన్ని విపులంగా హరిణి తల్లికి వివరించి, ఏమి భయపడనవసరం లేదు మేము చూసుకుంటాము అని హామి ఇచ్చి తమ ఇల్లకు వెల్లడానికి హరిణి ఇంటి నుండి వీధిలోకి అడుగుపెట్టారు. అప్పటికే హరిణి ఇంటి దరిదాపులకొచ్చిన వంశి బ్యాచ్ ఎదురయ్యింది. 
     " అసలేమనుకుంటున్నావ్..నాగురించి...ఇంటి మీదికొస్తావా..? నీకేదైనా  గొడవపడాలనుకుంటే నాతో మాట్లాడు..మనం మనం బయట చూసుకుందాం ఇంట్లోవాళ్ళని బెదిరించడమేంటీ..?"  కోపంగా అరిచాడు వంశీ
  నేరుగా ఇంటి వద్దకే వంశీ వస్తాడని శీను, శీనుకజిన్స్ అస్సలు ఊహించలేదు  నిశబ్దవాతారవణంలో వంశీ మాటలు వీధంతా వినిపిస్తున్నాయి..మెల్లమెల్లిగా వీధిలోని ఇళ్ళల్లోని కిటికీలు..తలుపు తెరుస్తున్నట్లు శబ్దాలు..వినిపిస్తున్నాయి. విషయం అర్థమై శీను కజిన్స్‌లొ ఒకతను అందరికంటే ముందుగా స్పందించి " ఇక్కడ వీధిలో గొడవద్దు ఇంటిలోకి వెళ్ళి మాట్లాడుకుందాము పదా " అన్నాడు.
   హరిణి ఇంట్లోకి వెళ్ళడానికి మనస్కరించలేదు. అది బావ్యం కాదనుకున్నాడు " పర్లేదు ఇక్కడే మాట్లాడుకుందాము " అన్నాడు వంశి.
" ఇలా రాత్రిపూట వీధిలో నుంచొని గట్టిగా మాట్లాడుకుంటే వీధంతా తెలిసిపోతుంది..ప్లీజ్ " ప్రాధేయపడడంతో హరిణి ఇంటిలోనికి దారి తీసారు అందరు.
 వంశి కి అది కొత్తగా ఉన్నది, అదే మొదటిసారి హరిణి ఇంటిలోనికి అడుగిడడం, చిన్న కాంపోండ్ ఉండి తర్వాత ఓపన్‌గా వసారా ఉన్నది. ఒకేసారి అంతమంది జనాన్ని చూసి ఇంటిలోనుండి హరిణి తల్లి వసారాలోకి వచ్చింది ’ ఎవరు వీళ్ళూ ’ అనుకుంటూ.
   " ఏదన్న గొడవ ఉంటే మనం మనం బయట చూసుకోవాలి..అంతేకాని మా ఇంటికొచ్చి నా అమ్మానాన్నను బెదిరిస్తావా..?  కొంతమందిని  పోగుచేయగానే  పెద్ద రౌడీవనుకున్నావా..? " శీనుని గట్టిగా ప్రశ్నించాడు వంశి. రాత్రి కావడం వలన వీదంతా వినపడుతున్నాయి వంశి మాటలు.
  అతని మాటలు బట్టి అతనే వంశి అయుంటాడని అనుకున్న హరిణితల్లి మరింత గొడవ జరక్కుండా " బాబ్బాబు..గొడవచేయకు..ఇది ఆడపిల్లలు ఉన్న ఇళ్ళు.." అన్నది. ఆమాటతో ఆవేశంలో ఉన్న వంశీ కాస్త నిదానంగా
  " చూడండీ మీ వాళ్ళే మాఇంటికొచ్చి మా అమ్మానాన్నని బెదిరించారు ..అందుకే విషయం ఏంటో తెల్సుకొవాలని ఇక్కడికి రావాల్సివచ్చింది.. ఇళ్ళ మీదకు రావడం..గొడవచేయడం నాకు సరదాకాదు.." అనగానే ఈ మాటలు వింటున్న శీను కోపంతో.." నీకు ఇంతకమునుపే విషయం క్లియర్‌గా చెప్పాము..నీవు మళ్ళీ మా చెల్లెలు వెంట పడుతున్నావు....ఈరోజు  మా చెల్లెలు వెళ్లిన సినిమాకి వెళ్ళావంటా...వెనుకనే..! అన్నాడు శీను.
" నేను మీ చెల్లెలు కోసం వెళ్ళడం ఏంటి..!  సినిమాకి వెళ్ళాక తెల్సింది..మీ చెల్లెలు కూడ థియేటర్లో ఉందని." పక్కనున్న చంద్రహాస్‌రెడ్డి వైపు చూపిస్తూ..  " అప్పటికీ మా ఫ్రెండ్స్‌తో అన్నా  ’వెళ్దాం పదరా అని. ..నాకసలు మీ అమ్మాయి ధ్యాసే లేదు  ఒక సారి సమస్య క్లియర్ అయిపోయింది...అంతే..ఆ విషయం ఎప్పుడొ మరిచిపోయా..." అన్నాడు వంశి.  వెంటనే చంద్రహాస్‌రెడ్డి కల్పించుకొని
    " యధాలాపంగానే సినిమాకి వెళ్ళాం..అక్కడ మీ అమ్మాయిని చూసిన వెంటనే  వెళ్దాంపదరా..నేనేదో వాళ్లకోసమే వచ్చారనుకుంటారు..మల్లి పెద్ద గొడవమొదలైపోతుందని వంశీ అప్పుడే అన్నాడు..’  మేమే వీడ్ని వారించి.. "వాళ్లసంగతి మనకు తెలీదు.. మనం మామూలుగా వచ్చాం, సినిమాకి వచ్చినంతామత్రానా వాళ్లకోసమే వచ్చినట్లా..? సినిమాకి అందరువచ్చినట్లే వచ్చాము.. అని నేనే చెప్పి ఆపాను " చెప్పాడు చంద్రహాస్‌రెడ్డి.
    కానీ ఆమాటలు శీను నమ్మట్లేదు..వాళ్ళకి ఒక్కటే ఆలోచన..ఎలాగైనా వంశీని కొట్టాలి..అప్పుడు గాని వారిలో ఉన్న అహం చల్లారదు.. తగినశాస్తి చేస్తే గాని వాళ్ళు సంతృప్తి పడరు...శీను మిగతా కజిన్స్..హరిణి బావ ఒకేసారి.." లేదు లేదు..నీవు కావాలని ..కొని రోజులు ఆగి వేడి సద్దుమణిగాక..మళ్ళీ వెంటపడడం మొదలెట్టావ్...నీ అతి తెలివితేటలు అర్థమవుతున్నాయ..అప్పుడు కూడా..వెదవలాజిక్ చెప్పి తప్పించుకున్నావు " అంటూ వంశీ మీదకు వెల్లారు.
చంద్రహాస్ ఇంకా వారితో వచ్చిన వంశీ ఫ్రెండ్స్ కూడ గొడవకు సంసిద్దం అయ్యారు.. జరుగుతున్న ఈ గొడవకు లోపల ఉన్న హరిణి బయపడి ఏడవడం మొదలు పెట్టింది. అసలు వంశి ఇలా ఇంటి మీదకు వస్తాడని ఊహించనే లేదు, శీను మాటల్లొ విని ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న వంశి ఇలా చేయడం జీర్ణించుకోలేకపోతున్నది. అతనిలో కూడ రౌడి లక్షణాలున్నాయా..? ఆడపిల్లల ఇంటి పరిస్థితులు ఎలాఉంటాయో ఎన్నో పుస్తకాలు చదివిన అతనికి రవ్వంత కూడ అవగాహన లేదా..?.  సమయానికి నాన్న ఇంట్లో లేరు, ఆఫీస్ పని మీద డిస్ట్రిక్ట్ హెడ్‌క్వార్టర్‌కి వెళ్ళారు రేపు ఉదయం వస్తారు, ఈ సమయంలో నాన్న ఉండుంటే కచ్చితంగా మధనపడేవారు, ఆ ఆలోచనతో దుఃఖం ఆగడంలేదు.  హరిణి ఏడుపు చూసిన చెల్లెలు స్వాతి బయటకు పరిగెత్తుకుంటావచ్చి.." అమ్మా అమ్మా..అక్క ఏడుస్తున్నది..! " చెప్పింది..
  ఆమాటతో జరుగుతున్న గొడవ ఒక్కసారిగా ఆగిపోయింది..కొన్ని క్షణాలు  నిశ్శబ్దం ఆవరించింది.  ఒకర్నొకరు చూసుకున్నారు..ఈ వ్యవహారంతో వంశీ బాగా ఎంబ్రాసింగ్‌గా ఫీలయ్యాడు. లోలొన అపరాధభావన..
ఇంతలో హరిణి తల్లి వంశి వైపు తిరిగి రెండు చేతులెత్తి నమస్కరిస్తూ.." బాబూ నీకు చెతులెత్తి నమస్కరిస్తున్నా ఇక్కడ గొడవ చేయొద్దు ఆడపిల్లలున్న ఇల్లుది బయట తలెత్తుకోలేము దయచేసి ఇంతటితో ఆపేయండి.." అన్నది.
   ఆ మాటలు వంశిని తీవ్రంగా బాదించాయి. ’ఇలా ఇంటిమీదకు వచ్చి గొడవచేయడం శీను చేసిన పనినే నేను ఆవేశంలో అదేగొడవ చేస్తున్నా..నా వివేకం ఏమయ్యింది...?’ తనను తానే ప్రశ్నించుకున్నాడు తనలోనే..చివరికీ వాళ్ళ దృష్టిలో తను విలన్ అయిపోయానని మదన పడ్డాడు.
" నాకు నేనుగా గొడవకు రాలేదు..దీనికంతటికి కారణం శీను " అని చెబుతున్న వంశీని మద్యలోనే అడ్డుకొని  " రేయ్ " అంటు ముందుకు రాబోతున్న శీనును హరిణి తల్లి పట్టుకొని ఆపి " రేయ్..చేసింది చాల్లేరా నువ్వేదో మంచి చేసాననుకొంటున్నావు..కానీ అది మనల్నే బయటపడేస్తున్నాదిలా జరిగింది చాలు ఇంతటితో ఆపేయండి" అన్నది.
  వెంటనే వంశీ అందుకొని " చూడండమ్మా...అసలు మీ ఊసే లేదు నాకు, తలుచుకోలేదు....ఆలోచించలేదు..అప్పుడెప్పుడో..మామద్యన కొన్ని చర్చలు జరిగాయి..అంతటితో..అప్పుడే ఆపేసాను..కనీసం స్మ్రతిలో కూడ లేదు..! ఇప్పుడు కూడ నాకు నేనుగా రాలేదు..నాకే ఇంట్రెస్ట్ లేదు..నేనెప్పుడో మరిచిపోయా....! నాదారి నాది మీదారి మీది..! మరోసారి మాఇంటిమీదకు వస్తే నేను మనిషినన్న స్పృహే కోల్పోతాను..అది ఎవరికీ మంచిది కాదు " స్వరం తగ్గించి చాలా కటువుగా చెప్పి తన ఫ్రెండ్స్‌తో ఆ ఇంటినుండి బయటకు వచ్చాడు వంశి మరో మాటకు తావివ్వకుండా.
  అలా మాట్లాడిన వంశి వైపు అదోలా చూస్తూ బయటకు నడిచాడు చంద్రహాస్‌రెడ్డి.

                                       *                                       *                                        *

     వంశి తన ఫ్రెండ్స్‌తో వెళ్ళిపోయాక కాసేపు శ్మశాన నిశబ్ధం  ఆవరించింది హరిణి ఇంటిలో. శీను, హరిణి బావ మిగతా కజిన్స్ అందరు ఆలోచనలో పడ్డారు.
   గొడవసమయంలో   ’మీ ఊసే లేదు..కనీసం స్మ్రుతిలో కూడ లేదు ’ అన్న వంశి మాటలు ఇంటిలోపల ఉన్న హరిణికి శూలాల్లా పొడిచినట్లయింది అంటే తనొక పూచికపుల్లతో సమానమనే భావం స్పరించింది. ఇడెంటిటీ క్రైసస్‌లో ఉన్న హరిణికి ఆమాటలు తన ఉనికినే ప్రశ్నించినట్లయంది. ఆ మాటలు పదే పదే గుర్తొచ్చి హరిణి మనసును తొలుస్తున్నది, ఆ సమయంలో హరిణి తల్లి వచ్చి
 " నిజం చెప్పు..నీకు ఎన్నాళ్ళుగా తెలుసు ఈ వంశి "  హరిణిని అడిగింది. 
ఎన్నో అనుభవాలు గడించిన మనిషి హరిణితల్లి,  యవ్వనదశలో ఉన్న కూతురి మనోభావాలు చాలా సులభంగా గ్రహించకలదు, ఆ వయసులో జరిగే పరిణామాలు  అట్టె పట్టేయగలరు,  యవ్వన దశల్లో మగ ఆడ మద్యన ఉండే పరస్పర ఆకర్షణలన్ని చవిచూసి అవన్ని దాటి వచ్చిన మనిషే, అందుకే ఉపోద్ఘాతం ఏమి లేకుండా నేరుగా విషయం అడిగింది.
 ఆ ప్రశ్నతో ఉలిక్కిపడిన హరిణి కాసేపు చలనం కోల్పోయింది  ’ అమ్మ తనను అలా ప్రశ్నించడం జీర్ణించకోలేకపోతున్నది ’
" ఎన్నాళ్ళుగా తెలుసు వంశి...? నీకు లవ్‌లెటర్ రాసాడంటే చాన్నాళ్ళుగా పరిచయం ఉండే ఉంటుంది " మల్లి అడిగింది హరిణి తల్లి.
  అమ్మ తనను ఒక దోషిలా ప్రశ్నించడంతో నిలువెల్లా కంపించిపోయిన హరిణి  "  అతన్ని బయట రోడ్ మీద, బజార్లోను చూసాను అంతకుమించి  పర్సనల్‌గా పరిచయమేమిలేదు నాకు " అన్నది
ఈ సంబాషణంతా వింటున్న శీను కల్పించుకొని " అయ్యో పిన్ని హరిణికి ఏమి తెలియదు నేను నవలలు కోసం లైబ్రరరీకి వెల్లినప్పుడు పరిచయం అయ్యాడు అలా అతని గురించి నేనే చెప్పాను " చెప్పాడు.
" ఓహో నీ నిర్వాకమా ఇది..బాగుంది, మీ బాబాయికి తెలిస్తే మిమ్మల్ని కాదు..నన్నంటారు, ఇంట్లో ఆడపిల్లలున్నారు ..ఏమి జరుగుతున్నదో తెలుసుకోనక్కర్లేదా అంటూ నన్నుతిడతారు " అన్నది హరిణితల్లి.
మల్లి ఆమె " బయట ఫ్రెండ్స్ గురించి ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు చెప్పడమేంటి, అనవసరంగా వాళ్ళల్లో లేనివి నీవే కల్పించినట్లు అయ్యింది కదా..? " శీనుని ప్రశ్నించింది.
" ఇంతవరకు వస్తుందని నేను ఊహించలేదు పిన్నీ, అయినా ఇప్పుడు వ్యవహారమంతా సద్దుమణిగింది కదా..ప్రాబ్లం ఏమి లేదు, బాబాయికి ఈ విషయాలన్ని తెలియనక్కర్లేదులే, మేము చెప్పం నీవు చెప్పకు  " అన్నాడు శీను, ఆ మాటతో మరింత భయడిన హరిణితల్లి " ఎప్పుడో ఒకసారి ఈ విషయాలన్ని ఎవరో ఒకరిద్వార తెలుస్తాయి, అలా మూడో మనిషిద్వార తెలిసేకన్న నేనే చెబుతాను నాకు కాస్త స్తిమితంగా ఉంటుంది "  అన్నది
తాము చెప్పే మాటలు పిన్ని వినరని తెలిసి శీను, హరిణి బావ మౌనం వహించారు,
   హరిణితల్లి బుర్రలో ఆలోచనలు ఆగట్లేదు, బయట కుర్ర్రాళ్ళు తనకూతురి వెంటపడడం మొదలెట్టారు అంటే పెద్దలుగా తమ జాగ్రత్తలు తాము తీసుకోవాల్సిందే, దీనికి విరుగుడు ఒక్కటె ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒకబ్బాయిని చూసి పెళ్ళి చేయడమే అంతటితో తమకీబాదలు తొలిగిపోతాయి.. అలా సాగుతున్నాయి ఆలోచనలు.
   హరిణితల్లే కాదు..అప్పటి సమాజంలో చాలా మంది తల్లితండ్రులు చేసే పనే అది, అమ్మాయిలకు యుక్తవయసు రాగానే కాలేజిల్లో కుర్రాళ్ళు ప్రేమ దోమా అంటూ వెంటపడతారు, కొన్ని రోజులకు ఆ విషయం అమ్మాయిల ఇంట్లో తెలిస్తుంది, ఎక్కడ తమ పరువు బజారున పడుతుందో అని గాబరాపడతారు అంతె అక్కడికేదో కొంపలుమునిపోయినట్లు వెంట వెంటనే ఆదరాబాదరగా ఎవరినో ఒకరిని చూసేసి అతి చిన్న వయసులోని అమ్మాయికి పెళ్ళి చేసేసి చేతులు దులుపుకుంటారు, హమ్మయ్య అనుకుంటూ ఒక నిట్టూర్పు విడుస్తారు, అలా పెళ్ళైన ఆ అమ్మాయిలు 20 ఏళ్ళకే ఒకరో ఇద్దరో పిల్లల్ని కనేసి చంకనేసుకొని తిరుగుతారు. ఇంటి బాద్యతలు, పిల్లలపెంపకం ఒక్క సారిగా అంత చిన్న వయసులోనే మీద పడడం వలన కొందరికి అసహనం ఏర్పడి జీవితం ఒక విరక్తి కలుగుతుంది, అబ్బాయలు ప్రేమలంటూ వెంటపడడేమో గాని... వాళ్ళు చేసే పనుల వలన చాలా మంది అమ్మాయిలు తమ చదువులను, కౌమారదశను కోల్పోయి చిన్న వయసులోనే తల్లి  పాత్ర వహిస్తున్నారు.
  
                                                            *                                              *                                               *

   హరిణి ఇంటి నుండి బయలుదేరిన వంశి, చంద్రహాస్‌రెడ్డి మిత్రబృందం కాలనీ నుండి మేయిన్‌రోడ్ మీదకు చేరగానే " సరే మీరెళ్ళండి  నేను కాసేపు వంశితో మాట్లాడి వస్తాను " చెప్పి ఫ్రెండ్స్ అందరిని పంపించాడు చంద్రహాస్‌రెడ్డి.
 ఫ్రెండ్స్ వెళ్ళాక వంశి ఇంటి వైపుకు నడుస్తూ ఉన్నారిద్దరు, కాసేపు అక్కడ మౌనం రాజ్యం ఏలింది. చంద్రహాస్‌రెడ్డి ఏమి మాట్లాడకపోవడంతో వంశీనె " ఏంట్రా ఏదో మాట్లాడలన్నావు..మాట్లాడు " అన్నాడు.
" హరిణి ఇంట్లో నీవు మాట్లాడిన మాటలే ఆలోచిస్తున్నాను " దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు చంద్రహాస్
" నా మాటలా " ఏంటన్నట్లు చూసాడు వంశి.
" ఎంతోగాను ప్రేమించిన మనిషిని ఒక్క సారిగా ఏదో వస్తువును వద్దన్నట్లు అంత సడన్‌గా నాలో ఏమి లేదు..ఎప్పుడో మరిచిపోయాను..అస్సలు ఆ ఊసే లేదు అని ఎలా చెప్పగలిగావురా " ప్రశ్నించాడు వంశిని.
" ఇందులో అంత ఆశ్చర్యపడవలసిన విషయమేముంది..? అసలు మా ఇద్దరి మద్యన ఏముందని...? తన గురించి నాకు ఏమి తెలియదు..అలాగే నాగురించి తనకు ఏమి తెలియదనే అనుకుంటున్నా...! మామద్యన మాటలు లేవు కనీసం ఒక్క సారి కూడ కలిసి మాట్లాడుకున్నది లేదు, మరటువంటప్పుడు ఏముందని చెప్పాలి..? అందుకే ఏమి లేదని చెప్పాను. " అన్నాడు
" అదేంట్రా అలా అంటావు..! నీవు ఇష్టపడే కదా  లవ్‌లెటర్ రాసావు...? "
" అదే నేను చేసిన అతి పెద్ద పొరపాటు, తన చూపులకు అర్థమేంటో అని ఆలోచించకుండా  చాలా అపోహపడ్డాను నాలో కూడ ఎక్కడో ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నదేమో...! అదే సమయంలో మన ఫ్రెండ్స్ కూడ తను నన్నే చూస్తున్నట్లు చెప్పడం నాలోని " నా " అన్న గుర్తింపుని ఇంకా పెంచింది ఆ మైకంలో లవ్‌లెటర్ రాసాను, అయినా ఆ అమ్మాయి కూడ తనకు నేను ఇష్టం లేదని చెప్పింది కదా...!! ఇష్టం లేదని చెప్పాక  మనం కూడ తప్పుకోవడం మంచిది, ఆ ఉద్దేశంతోనే అన్నాను నేను " అన్నాడు వంశీ.
"   అదేదో బోర్డ్ మీద ఉన్న రాతలని చేత్తో తుడిస్తే చెరిపినట్లు నీ మనసులో ఉన్న ప్రేమ కూడ‍ అలా ఇష్టం లేదని చెప్పగానే తొలిగిపోతుందా..? " ప్రశ్నించాడు చంద్రహాస్
చిన్నగా నవ్వాడు వంశి  " తనకిష్టం లేనప్పుడు మనం కూడ తప్పుకోవాలి అంతే గాని పట్టుదలకి పోకూడదు..ఆ అమ్మాయి ప్రాణంలేని వస్తువేమి కాదు కదా..! వాళ్ళకు ఆలోచనలుంటాయి, అభిప్రాయాలుంటాయి " అన్నాడు.
" ఇష్టం లేదని చెప్పగానే మంత్రం వేసినట్లు నీలో ఉన్న ప్రేమ తొలిగిపోతుందా..? సరే ఆమెకి ఇష్టం లేదనే చెప్పిందనుకో వెంటనే మరిచిపోతావా..? అదేనా ప్రేమంటే..? అంత సులభంగా మరిచిపోతావా..? ఆమె ప్రేమని పొందాలని... ఎలాగైనా సరే ఆమె మనసులో చోటు సంపాదించాలనే తపన ఉంటుంది.. ఉండాలి.. కూడ...కాని అవేమి లేవే నీలో..!!  అసలు నీలో ఉన్నది నిజమైనా ప్రేమనా..నాకు అనుమానంగా ఉంది " అన్నాడు  చంద్రహాస్.
కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత నోరు విప్పాడు  " అసలు ఆమె ప్రేమని పొందడమనే కాన్సెప్ట్ ఏంటి...? మనసులో చోటు సంపాదించుకోవడమేంటి...? ఆ అమ్మాయికి ప్రత్యేకమైనా " ఒక ప్రేమంటూ " ఏదన్న ఉన్నదా..? చోటు సంపాదించుకోవడం..ప్రేమను పొందడం ..అసలు ఇలాంటి ఆలోచనలు ఎక్కడనుండి వస్తాయి నీకు..? సినిమాల ప్రభావమా లేక  ప్రేమలగురించి మనవాళ్ళు ఒక్కొక్కరు చెప్పే రకరకాల నిర్వచనాలా..? పొనీ ప్రేమంటే అంటే ఏమిటి...? నాకు తెలిసి మనకు ఊహతెలిసినప్పటినుండి మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మనుషులని, ప్రపంచాన్ని, ప్రకృతిని ప్రేమిస్తాము..,  అమ్మాయినో లేక అబ్బాయినో చూడగానే మనం కొత్తగా అదే మొదటిసారి ప్రేమించిడం మొదలెట్టము..!! అలా మొదటిసారిగా ప్రేమిస్తున్నాము అని అనుకుంటే అంతవరకు మనలో ప్రేమ లేనట్లే అవుతుంది.! ఒకరిమీద ఒకరికి ఆసక్తి పెరిగిందంటే దానిని ఇష్టపడడం అని అంటారు.  ప్రేమన్నది సర్వంత్యామి....! అసలు ఆ పదమే అరువు తెచ్చుకున్న పదం. "    మద్యలో చంద్రహాస్‌ కల్పించుకొని    " నీ దృష్టిలో దాన్ని ఇష్టం అంటారు, నా దృష్టిలో ప్రేమ అని అనుకుంటాము " అన్నాడు.
మల్లి చంద్రహాస్ మాట్లాడుతూ  "   ఇంట్లో వారికి భయపడి హరిణి నీవంటే ఇష్టం లెదన్నది చెప్పిందేమో అనుకోవచ్చుకదా..? " అన్నాడు
  " మొదట నీవు ఒక క్లారిటీతో ఉండు, మొదటేమన్నావు..? ఆమెకిష్టం లేదని చెబితే  నీవు మరిచిపోతావా..? ఆమె ప్రేమని గెలవాలి కదా  అదే నిజమైనా ప్రేమని చెప్పావు, మల్లి ఇప్పుడేమో భయపడి చెప్పిండొచ్చు కదా  అని అంటున్నావు..!! " కొన్ని క్షణాలు గ్యాప్ ఇచ్చి మల్లి " అసలు నేను లవ్‌లెటర్ రాయడమే పెద్ద తప్పని ఇప్పటికి మదనపడుతూనే ఉన్నా.తనేంటో కూడ నాకు పూర్తిగా ఇప్పటికీ తెలియదు తెలుసుకోలేదు కూడ, అలా ఒకరికొకరు ఏమి తెలుసుకోకుండా ఇష్టపడడం అన్నది ఎంతవరకు సబబు..? లేక ఇష్టపడ్డాక ఒకరికొకరు తెలుసుకోవాలా..?, ఆ విషయం నాలో ఉన్న భ్రమలు తొలిగాక కాని అర్థం కాలేదు అందుకే ఆ ఆలోచన అదంతట అదే తొలిగిపోయింది.  అదే విషయం అప్పటి నుండి చెబుతూనే ఉన్నా నీతో్  నీవేమో బుర్రలోకి ఎక్కించుకోవట్లేదు, శీను మా ఇంటిమీదకొచ్చి గొడవ చేసాడు అన్న ఆవేశంలో  వాడు చేసిన తప్పే నేను చేసాను, మల్లి అవే తప్పులు చేస్తున్నా, ఇందాక గొడవలో హరిణి అమ్మగారు అంత పెద్దావిడ  చేతులెత్తి నాకు నమస్కరించగానే నేను సిగ్గుతో కుచించుకొని పోయాను, అందుకే నేను నీవనుకుంటున్న ప్రేమలు, గీమలకన్ని పుల్‌స్టాప్ పెట్టాను.  నా సంగతి తెలుసు కదా..!! నా ఉనికి మరొకరికి కష్టం కలిగించినా అయిష్టం కలిగించినా వారికి దూరంగా ఉంటానని,  అదేదైనాగాని  ప్రతి విషయంలో "సత్యాన్ని" చూడాలి, అంతే గాని మొండిగా పట్టుదలకి వెళ్ళకూడదు, నేను జరిగిన విషయంలో సత్యం వెదుకుతున్నాను, నేను కూడ  " అని చెప్పబోతున్నవంశి " నీలాగ "  అని అనవలసిన మాటలని మద్యలోనే ఆపేసాడు. ఎప్పుడో గాయం చేసిన గతాన్ని మరిచిపోతున్న చంద్రహాస్‌రెడ్డికి తవ్వి గుర్తు చేసి  బాదపెట్టడం ఇష్టం లేక విషయాన్ని మరో వైపుకి మల్లిస్తూ " సర్లేరా ఎంత మాట్లాడినా ఈ విషయాలన్ని ఎప్పటికి తెగేవి కావు, ఇప్పటికే  చాలా టైమ్‌  అయిపోయింది  నేను ఇంటికి వెళ్తున్నా బై   " అన్నాడు, ఆ విషయాన్ని మల్లి ప్రస్తావించకుండా అక్కడితోనే తుంచేసాడు వంశి. ఒకరికొకరు ’ బై ’ చెప్పుకొని అక్కడ నుండి నిష్క్రమించారు.

   చంద్రహాస్‌రెడ్డికో ఫ్లాష్‌బ్యాక్ ఉన్నది. తను ఒకరి ప్రేమలో పడ్డాడు  అప్పుడెప్పుడో పదవతరగతి నుండి ఫ్రెండ్స్‌ఇద్దరు, తర్వాతర్వాత ఇంటర్‌మీడియట్‌కి వచ్చాక ఆ ఫ్రెండ్స్‌షిప్ మెల్లిగా ప్రేమగా మారింది చంద్రహాస్‌రెడ్డిలో, ఆ అమ్మాయి పేరు విద్యుల్లత. తండ్రి ఊర్లో పేరు మోసిన డాక్టర్. పేరు కేశవరెడ్డి, అతనికి ఇద్దరు కూతుళ్ళు, ఒక అబ్బాయి. కేశవరెడ్డి చూట్టానికి చాలా అందంగా ఉంటాడు. డాక్టర్ అవ్వడం మూలాన ఎక్కువగా ఆస్పత్రిలోనే ఉండడం వలన అతని చర్మంలో మెరుపు ఇంకా ఎక్కువగా ఉండేది, అవే తండ్రి పోలికలు విద్యుల్లతవి, వంకీల జుత్తు, నీరుటెండ సోకినా కందిపోయేంత గులాభిరంగున్న శరీరం, ఆలుచిప్పలాంటి కళ్ళు, కోటేరు ముక్కు, కోలంమొహం కాదు అలా అని గుండ్రటి మొహం కాకుండా మద్యస్తంగా ఉన్న ముఖానికి వంకీల జుత్తు నుదిటిమీద పడుతుంటే ఆమె సౌంధర్యం చూసేవారికి ముచ్చటేస్తుంది.   అందాన్ని చూడగానే ప్రతి జీవికి ఆ అందాన్ని తమ సొంతం చేసుకోవాలనే కుతూహలం ఉంటుంది, ప్రతి ఒక్కరు ఆమనిషితో జతగట్టాలని, స్నేహం కలుపుకోవాలనె తహతహలాడుతారు,ఆ విషయంలో అవగాహన ఉన్న విద్యుల్లత తనకో రక్షణకవచంలా రిజర్వడ్‌గా ఉండడం అలవాటు చేసుకున్నది. ఎక్కువగా ఎవరితోను మాట్లాడదు, ఫ్రెండ్స్‌తో అవసరమేరకు మాత్రం మాటలు కలిపేది, కాని ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది.

   పదవతరగతి నుండి క్లాస్‌మెట్స్ అవడంమూలాన చంద్రహాస్‌రెడ్డితో స్నేహంగానే ఉంటూవస్తున్నది, ఇంటర్‌మీడియట్‌లో చంద్రహాస్‌రెడ్డి ఎమ్.పి.సి. విద్యుల్లత బై.పి.సి, ఇద్దరి గ్రూప్స్ వేరైనా ఇద్దరిమద్యన మాటలుకొనసాగేవి. మెల్లమెల్లిగా విధ్యల్లత మీద ఆశ మొదలైంది చంద్రహాస్‌‌లో, ఆమె అందానికి దాసోహమయ్యాడు దానికి " ప్రేమ " అని పేరు పెట్టుకున్నాడు. ఆ ప్రేమని విధ్యల్లతతో చెప్పడానికి ధైర్యం చాలక ఎప్పటికప్పుడూ వాయదావేస్తూ వచ్చాడు, అందుకు కారణం తనతో అందరికన్నా కాస్త చనువుగా ఉన్నాకూడ ఆమె రిజర్వడ్ తత్వం అతన్ని భయపెట్టేది. ఇంటర్‌మీడియట్ పరీక్షలు అయ్యాక మెడిసిన్ ప్రవేశపరీక్షల కోచింగు కోసం ఓ మూడు నెలలు నెల్లూరుకి వెళ్ళిపోయింది,  ఆ మూడు నెలలు విరహవేదనను అనుభవించాడు.  విద్యుల్లత స్టేట్ ఎమ్‌సెట్ తో పాటు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ యూనవర్సటీ వారి మెడిసెన్ ప్రవేశ పరీక్షలు వ్రాసి డిల్లీలో సీట్ సంపాదించింది, ఆమె ధ్యేయం కూడ అదె.  ఆ విషయం తెలిసిన చంద్రహాస్‌రెడ్డి ఇక ఆలశ్యం చేస్తే విద్యుల్లత తనకు దక్కదని అర్థమయ్యాక ఎక్కడలేని ధైర్యాన్ని తెచ్చుకొని తన ప్రేమవిషయం చెప్పడానికి సిద్దమయ్యాడు, డిల్లీ వెల్లడానికి సమయం ఉన్నందున ఆ మద్యలో తన ఫ్రెండ్స్‌కలవడానికి చంద్రహాస్ ఇంటిపక్కనే ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెల్లిన విద్యుల్లతని కలిసి తన మనసులోని మాట చెప్పాడు చంద్రహాస్‌రెడ్డి. అతని మాటలు విని... కొద్ది క్షణాలు మౌనంగా ఉండి తర్వాత నోరువిప్పింది " చూడు చంద్ర, నాకు  ఈ ప్రేమలు, ఇష్టపడడాల మీద మొదటినుండి ఆసక్తి లేదు, వాటి మీద దృష్టె లేదు. నీతో నేనెప్పుడు కూడ అలా ప్రవర్తించలేదు, ఇక నా ధ్యాస అంతా నా కేరీర్ మీదే, నా ఆలోచనలన్ని మెడిసెన్ చేసాక మరో  సబ్జెక్ట్ మీద  పి.జి  చేయాడానికి ఫారెన్‌కి వెల్లే ధ్యాసలోనే ఉన్నాయి. నీతో నేను చనువుగా ఉన్నది కేవలం మనం టెన్త్ నుండి ఫ్రెండ్స్ అవడం వలన, అదీ కాక నీవలన నాకే ఇబ్బంది ఉండదు అన్న నా నమ్మకం వలన. దయచేసి ప్రేమ దోమ లాంటి ఆలోచనలు పెట్టుకోకు ఈ మాటలు నిన్ను బాదించేవే కాని అవన్ని నిజాలు " అని చాలా సౌమ్యంగా చెప్పింది.
  అంత విడమరిచి సౌమ్యంగా చెప్పాక ఏమి బదులివ్వాలో తెలీక మౌనంగా వెనుతిరిగాడు చంద్రహాస్‌రెడ్డి.
        విద్యుల్లత మీద ఆమె కుటుంబం ప్రభావం  ఉన్నది,  తన తండ్రి కేశవరెడ్డి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉన్నదనే చెప్పాలి, తన తండ్రే కాకుండా తన బందువర్గాలలో ఒకరిద్దరు ఇంజనీర్స్ ఉన్నా  డాక్టర్స్ ఎక్కువగా ఉండడంమూలాన, బందువర్గం అప్పుడప్పుడు కలిసినప్పుడల్లా వారి మద్యన కనపడే సున్నితమైన గౌరవమర్యాదలు, బయట సమాజంలో కూడ మిగతా ప్రొఫిషన్స్ మీద కన్నా డాక్టర్స్ కిచ్చే ప్రాముఖ్యత గమనించేది,   అలా  చిన్నప్పటి నుండి డాక్టర్ కుటుంబాల మద్యన అవన్ని గమనిస్తూ పెరిగిన నేపధ్యంలో డాక్టర్ ప్రొఫిషన్‌మీద ఎక్కువగా మక్కువ పెంచుకున్నది,  డిల్లీలొని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మెడిసెన్ చేసి స్పెజలైజేషన్ కోసం అబ్రోడ్ వెళ్ళాలని , ఆ తర్వాతే తన జీవితభాగస్వామి గురించి ఆలోచించాలని అదీ కూడ తన ఆస్థి అంతస్తులకు, హోదాకు ఏమాత్రం తగ్గకుండా ఉండాలని, అలా తన భవిష్యత్ మీద కొన్ని నిర్దిష్ట అభిప్రాయాలు ఏర్పర్చుకున్నది .   విద్యుల్లత కుటుంబంతో పోల్చుకుంటే ఆస్తిలోను, అంతస్తులోను, సంఘంలో ఉన్న హోదాలోనూ ఏమాత్రం కూడ సరితూగలేని కుటుంబం చంద్రహాస్‌రెడ్డిది ఈ విషయం విద్యుల్లతకి తెలుసు.   టౌన్‌కి పదికిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరులో ఫ్యాక్షన్ గొడవలకు తలవొగ్గలేక వాటికి దూరంగా బ్రతకాలని గ్రామీన ప్రాంతం నుండి వలస వచ్చి టౌన్‌లో స్థిరపడిన వ్యవసాయాదారిత  మధ్యతరగతి వర్గాని చెందిన ఒక రైతు కుటుంబం చంద్రహాస్‌రెడ్డిది.   తండ్రి 40 ఎకరాల ఆసామి అయినా,  ఇల్లరికం వచ్చిన ఇంటల్లుడిలా సంవత్సరకాలం పొడువునా అంటిపెట్టుకొని ఉండే కరువు వలన సంవత్సరానికి ఒక పంట పండడమే గగనం అయిన రాయలసీమ ప్రాంతంలోని రైతు జీవితం ఆయనది.  అందుకే అక్కడి రైతులు పుడమితల్లి కన్నా చదువుల తల్లి మీదే మమకారం పెంచుకుంటారు, భూములను కుదవకు పెట్టైనా కొడుకులను చదివించుకుంటారు, ఆడ పిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాలలో కొడుకుల చదువుల్లో కోత పెట్టి అమ్మాయిల పెళ్ళిళ్ళు చేస్తారు. అలా కోతపడ్డ వారిలో చంద్రహాస్‌రెడ్డి ఒకడు మామూలు డిగ్రీతో సరిపెట్టుకున్నాడు. వ్యక్తిత్వపరంగా ఎవరినైనా నమ్మితే వారికోసం ప్రాణాలిస్తాడు, ఫ్రెండ్స్ అంటే ప్రాణం చంద్రహాస్‌రెడ్డికి. కాని ఇవొక్కటే సరిపోవు కదా.. మనసులు కలవడానికి...!
          తనది నిజమైన ప్రేమని, తన ప్రేమలో స్వచ్చత ఉందని, నీ గమ్యం చేరే వరకు నేను ఎంతకాలమైనా ఎదురుచూస్తూ ఉంటాను నా ప్రేమను అంగీకరించు అంటూ  విద్యుల్లతని ఒప్పించడానికి శతవిదాల ప్రయత్నించాడు, ’ ససేమిరా...! అసలు నా దృష్టి అటువైపు లేనే లేదు ’ అంటూ తృణీకరించింది విద్యుల్లత. జీవితభాగస్వామి విషయంలో చంద్రహాస్‌రెడ్డి ఆమె కనుచూపు మేరలో ఎక్కడ లేడు..దానికి కారణం అతని ఆర్థికస్థితి, హోదా.  ఇదే విషయాన్ని వంశి తన మాటల్లో విశ్లేసిస్తూ వివరించాడు ’ మీ ఇద్దరి మద్యన అంతస్తుల్లోను, ఆర్థికపరంగాను చాలా తేడా ఉంది  విద్యుల్లత ఆలోచనకూడ అదే,  అంతే కాదు తన  ఎలా ఉండాలనుకున్నదో, ఏమి చేయాలనుకున్నదో  ఆ విషయంలో తనకు  చాలా స్పష్టత ఉన్నది  అటువంటి స్పష్టత లేనిదే నీకే, మీ ఇద్దరి ఆలోచనలు పరస్పర విరుద్దంగా ఉన్నాయి నీవింతటితో నీ ఆలోచనలు ఆపేస్తే నీకే మంచిది, కాస్త ప్రాక్టికల్‌గా ఆలోచించరా..! వాస్తమేంటొ గుర్తించు ’ చెప్పినా వినని చంద్రహాస్‌రెడ్డి  ’ ఎలాగైనా ఆమె మనసులో చోటు సంపాదిస్తా,  నా ప్రేమలో స్వచ్చత ఉందని నిరూపిస్తా, జీవితమంటే కేవలం డబ్బు, హోదాలే కాదు దానికి ప్రేమ అవసరం అని తెలుసుకునేలా చేస్తాను ’అనే మొండి వాదనలో ఉన్నాడు, సినిమాల ప్రబావం చాలానే ఉందనుకొని వంశి  నవ్వి ’ డ్రమటిక్ వేవ్‌లో నుండి బయటపడరా..!  నిజంగా నీ ప్రేమలో స్వచ్చత ఉందా..? నీది నిజమైనా ప్రేమనా..?  మరి మనం ఇంటర్‌మీడియట్ చదువుతున్నప్పుడు మన క్లాస్‌లో కడప రేడియోస్టేషన్‌లో జానపద పాటలు పాడే వసుందర నీమీద చాలా ఆసక్తి చూపించేది..గుర్తుందా..? నీవంటే చాలా ఇష్టముండేది, నీవేమో ఇష్టపడలేదు. మరెందుకు నీవు ఆ అమ్మాయివైపు మొగ్గుచూపలేదు...? ’ అని అడిగాడు, దాని చంద్రహాస్‌రెడ్డి " నాకు ఆ అమ్మాయి పై అటువంటి ఉద్దేశం లేదు " అని జవాబిచ్చాడు,  ’ ఆహ..నిజమా..!! విద్యుల్లతతో పోల్చుకుంటే వసుందర అంత అందమైన అమ్మాయి కాదు అందుకే వసుందర వైపు నీవు కన్నెత్తికూడ చూడలేదు, విద్యుల్లత అందం నిన్ను బాగా ఆకర్షించింది, ఆ అందాన్ని ఎలాగైనా నీసొంతం చేసుకోవాలని నీ ఆశ. అందుకే ఇటువైపు మొగ్గుచూపావు, దానికి స్వచ్చత, నిజాయితి అని అందమైన పేర్లు తగిలిస్తున్నావు, ఎందుకురా హిపోక్రసి..!! ఒక్క సారి నీలో నీవు ఆత్మపరశీలన చేసుకో నీకే అర్థమవుతుంది ’ అని చంద్రహాస్‌రెడ్డిలోని మనసుని బయటపెట్టాడు వంశి. ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి విషయాన్ని దారి మళ్ళిస్తూ ’ సర్లే బయటనుండి ఎన్నైనా చెబుతారు..! నీకు ప్రేమిస్తే తెలుస్తుంది నా బాదేంటో...? ’అన్నాడు,  ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేడని తెలిసి ఆ ప్రసక్తే ఎత్తడం మానేసాడు వంశి.
             మొదటి అకడమిక్ సంవత్సరం మొదలవడంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డిల్లీ యూనవర్శటీలో చేరింది విద్యుల్లత,  ఇక్కడ విద్యుల్లత తిరస్కారాన్ని భరించలేకపోతున్నాడు చంద్రహాస్‌రెడ్డి, శెలవల్లో ఊరికివచ్చినప్పుడల్లా విద్యుల్లత ముందు హాజరయ్యి తన ప్రేమని ఒప్పించాలని చాల ప్రయత్నాలు చేసాడు, చాలా సినిమా టెక్నిక్స్ ప్లే చేసాడు..రోజూ విద్యుల్లత ఇంటిముందు రోడ్ మీద 24 గంటలూ ఎండకు నుంచొనే వాడు వాన వస్తే తడిచేవాడు, తనలోని నిజాయితికి నిరూపించే  మార్గం అదే అనుకున్నాడు. తనను తను హింసించుకునే మార్గాలు తప్ప మిగతా అన్నిరకాల ప్రయత్నాలు చేసాడు. అవన్ని చూసిన విద్యుల్లత ఎమోషనల్ బ్లాక్‌మేయిల్ చేస్తున్నాడని చిరాకేసి సెలవల్లో ఊరికి రావడం కూడ పూర్తిగా మానుకున్నది, అలా తను కనపడకపోతే మెల్లిమెల్లిగా మరిచిపోయే అవకాశమున్నది ఆ అమ్మాయి ఆలోచన. కేశవరెడ్డి దంపతులే కూతురితో గడపడానికి డిల్లీకి వెళ్ళెవారు.  అలా మూడేళ్ళు పాటు విద్యుల్లత కనపడలేదు, మెల్లమెల్లిగా విద్యుల్లత ఆలోచనల నుండి  బయటకొస్తున్నాడు చంద్రహాస్‌రెడ్డి, కాని ఎక్కడో తన మనోంతారల మారుమూలన  విద్యుల్లత రూపం అలాగే ఉన్నది.  తన మిత్ర బృందంలో ఎవరికైన ప్రేమ వ్యవహారాల్లో సహాయం అవసరమైతే వెంటనే స్పందించి మనస్పూర్తిగా సహాయం చేస్తూ ఉంటాడు అలా తనలోని ఆ బావనను సంతృప్తిపరుచుకుంటూ వస్తున్నాడు. అలాంటి సమయంలో వంశి మల్లి తన గతాన్నిగుర్తు చేయబోయి మానుకున్నాడు.

                                                           *                                               *                                              *

     మంచంమీద నిద్రపట్టక అటు ఇటు మసలుతూ ఉన్నది హరిణి,  ఆలోచనా స్రవంతి ఆగట్లేదు, పదే పదే వంశి మాట్లాడిన ’ నేనెప్పుడో మరిచిపోయాను  మీ ఊసే లేదు ’ మాటలు తనలోని ఐడెంటిటీని క్రైసిస్‌ని హేళన చేస్తున్నది,  అంత సులభంగా ఎలా మరిచిపోగలరో అర్థం కావట్లేదు హరిణికి. ఆ ఆలోచన ఒక పక్క పీడిస్తుంటే, మరో పక్కన రేపొద్దున నాన్నతో అమ్మ అన్ని విషయాలు చెప్పాక నాన్న ఎలా ప్రతిస్పందిస్తారో అని భయపడుతున్నది, నాన్నకి తనంటే చాలా గారాభం చిన్నప్పటి నుండి ఒక్క మాట కూడ అనలేదు..మరి ఇలాంటి విషయాల్లో ఆయన స్పందన ఎలా ఉంటుందో అని ఒక్కటే ఆలోచనలు హరిణిలో. ఇలాంటి సంఘటనలు ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోనాలో, ఎలా పరిష్కరించుకోవాలో తెలిపే చిట్కాలు తాను చదివిన నవలలో ఎక్కడా లేవు,  అర్.సంధ్యాదేవి , యుద్దనపూడి లాంటి రచయతల పుస్తకాలు ఎక్కువగా చదివింది. వాటిల్లో ఇటువంటి వాస్తవ సంఘటనలు ఎక్కడా రాయలేదు. కన్నెపిల్లలను ఊహల్లో తేలియాడేలా చేసే కథనాలే,  టీనేజ్‌పిల్లలకు రంగు రంగుల అందమైన ప్రపంచాన్ని చూపే కథలు.   అలాంటి ఊహల్లో ఉన్న హరిణికి ఒక్కసారిగా అసలు ఊహించని ఇలాంటి గొడవ జరగడం ఉక్కిబిక్కిరి చేస్తున్నది.. !  నిద్ర రాక పొర్లి..పొర్లి..ఏ అర్ధరాత్రి దాటకో మెల్లిగా నిద్దరలోకి జారింది..ఇక్కడ హరిణి నిద్రకోసం ఇన్ని కష్టాలు పడుతుంటే  అక్కడ...

          ఇంటికి చేరిన వంశికి గాభారపడుతూ ఎదురుచూస్తున్న తల్లితండ్రులు కనపడ్డారు, వారికి  ’ భయపడాల్సింది ఏమి లేదు అని జరిగిన విషయమంతా ఏది దాచకుండా చెప్పాడు, తను పొరబడిన విషయం, ఆ పొరపాటులో చేసిన తప్పులన్ని వివరించాడు, ఇక ఏ గొడవలు కూడ ఉండవు. ఇప్పుడు తనలో ఏ ఆలోచనలు లేవు కేవలం నా కేరీర్ గురించే ’ అని చెప్పి సమదాయించాడు, వంశి తండ్రికి మాత్రం లోపల భయం తగ్గట్లేదు మల్లి రేపెప్పుడైనా ఇదే విషయం కొనసాగితే పరిస్థితి ఏంటి అని అనుమానం, కాని వంశి తల్లికి మాత్రం వంశి మీద చాల నమ్మకం, చిన్నప్పటి నుండి వంశి ని ప్రతి విషయంలో గమనిస్తూ వస్తూ ఉన్నది, వంశి మనస్తత్వం మీద ఆవిడకు పూర్తిగా అవగాహన ఉన్నది, అందుకే వంశి విషయం అంతా చెప్పాక నిశ్చింతగా ఉంది. వంశికి కూడ తన మనసులో మరే ఆలోచనా లేకపోవడం వలన  తొందరగా నిద్రాదేవి వడిలోకి జారాడు.

                                                          *                                                 *                                                  *
               
                  " బారెడు పొద్దెక్కిన ఇంక లేవట్లేదు చూడు " మాటలు ఏదో నూతిలోనుండి వినపడుతున్నట్లన్పిస్తున్నది..కలా..నిజామా..ఉలిక్కిపడి లేచింది హరిణి, కళ్ళు నులుపుకొని చూస్తే  నిజమే దూరంగా  అమ్మ  పనులు చేసుకుంటూ అంటున్న మాటలు , చూపులు గడియారం వైపు తిప్పింది సమయం 8 గంటలు చూపిస్తున్నది, అమ్మో ఎనిమిదా..అనుకుంటూ ఒక్క ఉదుటున లేచి వంటగదిలోకెళ్ళింది అమ్మకు సహాయంగా ’ ముందు బాత్‌రూమ్‌కి  వెళ్ళి రా..మీ నాన్న వచ్చాడు ’ అన్నది తల్లి.
          స్నానం చేసి ఇంటిముందున్న వరండాలోకి వచ్చింది హరిణి, అక్కడ తండ్రి న్యూస్ పేపర్ చదువుతూ కూర్చొని ఉన్నారు. రాత్రి జరిగిన విషయం చెప్పారో లేదో అనుకుంటూ మెల్లిగా తండ్రి వద్దకు చేరింది, పేపర్ చడువుతున్న ఆయన తల ఎత్తి హరిణిని చూసి ’ ఏరా రాత్రి ఆలశ్యంగా నిద్రపోయావా, ఉదయం అంత లేట్‌గా లేచావు ’ అంటూ మల్లి న్యూస్‌పేపర్లోకి తలదూర్చారు, హమ్మయ్య ఇంకా విషయం ఎవరు చెప్పలేదనుకొని ’ అవును నాన్నా, ఎంతసేపయ్యింది వచ్చి ’ అడిగింది హరిణి.
    ” ఉదయం 6 గంటలకే వచ్చానురా, చూస్తె నీవింకా నిద్రలేవలేదు " పేపర్లో నుండి తలఎత్తకుండానే చెప్పాడు. అక్కడ నుండి వంటిట్లోకి వెళ్ళింది తల్లికి సహాయంగా, చాలా గంభీరంగా ఉన్నది హరిణి తల్లి మొహం, మాటలు ఏమి లేకుండా ఇద్దరు పనులు చేసుకుంటున్నారు. ఉదయమే గొడవ విషయాలు చెప్పడం బాగోదు అనుకొని చెప్పలేదు హరిణి తల్లి. రోజులాగే ఆరోజు కాలేజికి వెళ్ళి సాయింత్రం వచ్చింది హరిణి. రాగానే శీను, హరిణి బావ ఉన్నారు ఇంట్లో. వారిని చూడగానే హరిణిలో భయం మొదలయ్యింది ’ అందరూ ఆ గొడవ సంగతి నాన్నతో ఇప్పుడు ప్రస్తావిస్తారా..? ’ అని లోపల అనుకుంటుండగానే  మెల్లిగా హరిణి తల్లి రాత్రి జరిగిన గొడవ విషయమంతా చెప్పింది భర్తకు. అంతా విన్నాక కొన్ని క్షణాలు మౌనం తర్వాత హరిణి వైపు చూస్తూ " నా చిట్టి తల్లి మన కుటుంబ పరువును బజారున వేసే పని ఎప్పుడు చేయదు, నేను తలదించుకొని బ్రతికే పనులు ఎప్పుడు చేయదు ’ భార్య, శీనుల వైపు తిరిగి మాట్లాడుతూ ’నా పెంపకంలో పెరిగింది తన మీద నాకు పూర్తిగా నమ్మకముంది. ఇక లెటర్ విషయమంటారా...! రోడ్ మీద  అందమైన అమ్మాయిలు పోతుంటే టీనేజ్ కుర్రాళ్ళు వాళ్ళ వెంట పడడం రోజూ మనం చూస్తన్నదే కదా..ఇప్పుడు ఎవడో ఒక ఆకతాయి నా కూతురు వెంటపడ్డాడు గొడవయ్యింది అంతె, ఆ విషయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం అనవసరం, ఇక గొడవంటారా ఆ విషయంలో నాకే భయం లేదు నా జాగ్రత్తలు నాకున్నాయి ’ అంటూ చాలా నెమ్మదిగా చెప్పాడు. హరిణి తల్లి ’ హు ఏం మనిషో..? మరీ అంత నిమ్మకు నీరెత్తినట్లు మాట్లాడితే ఎలా ’ మనసులో అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ మాటలు విన్న హరిణికి మొదట నమ్మకం కలగలేదు, తండ్రి ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకుంటాడని అస్సలు ఊహించలేదు,  గొడవ విషయం తేలిగ్గా తీసుకోవడం కన్నా తండ్రి తన మీద పెట్టుకున్న ’ నమ్మకం ’  హరిణిలో ఒకింత అంతర్మధనానికి దారితీసింది, అంతవరకు ఎక్కడో మూలన వంశి మీదున్న చిన్న ఆలోచనని కూడ శాస్వితంగా స్వస్తి చెప్పడానికి ప్రయత్నంచసాగింది,  తండ్రి తన మీద పెట్టుకున్న ’ నమ్మకం ’ అన్న మాట వెనుక దాగున్న సామాజ కట్టుబాట్ల ఇనుపచట్ర  భావజాలాన్ని భుజానెత్తుకుంది.

                                                         *                                                    *  
                                                 
    వంశి తన కాలేజి ప్రాజెక్ట్‌వర్క్‌లో పూర్తిగా నిమగ్నమైపొయాడు, ఆ సమయంలో అప్పుడప్పుడు కడుపులో నొప్పి  కలుగుతూఉండేది. మూడునెలల్లో ప్రాజెక్ట్‌వర్క్ పూర్తి చేసాడు, తర్వాత పరీక్షలకు బాగానే ప్రిపేర్  అయ్యి పరీక్షలు పూర్తి చేసాడు. అలా ఓ ఆరునెలలు సమయం గడిచింది.  ఒకరోజు అకస్మాత్‌గా వంశికి కడుపులో విపరీతమైన నొప్పి మొదలయ్యింది. ఆస్పత్రికి వెళ్తే అది అపెండిసైటస్ అని తేల్చి వెంటనే ఆపరేషన్ చేసేసారు.   రోజంతా హాస్పెటల్‌లో బెడ్ మీద ఉన్నాడు, ఒక్క రోజుకే బోర్‌కొట్టి మరసటిరోజు చంద్రహాస్‌ని హాస్పెటల్‌కి పిలిపించుకున్నాడు.
   అది సాయింత్రం 5:30 సమయం....హాస్పటల్ ముందున్న అరుగుమీద కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ..వీధిలో వెళ్తున్న వార్ని చూస్తూ కూర్చున్నారు.. ఇంతలో చంద్రహాస్.
" రేయి..వంశీ..మీ..EX.. వస్తుందిరా..!! అన్నాడు..
" ex ఏంట్రా..? " అని చంద్రహాస్ మొహంలోకి చూసాడు..
" అబ్బా..మీ " చెప్పేలోపల దూరంనుండి వస్తున్న హరిణి  వాళ్ళమాటలు వినబడేంత దగ్గరకు వచ్చేసారు..అది చూసి.. ఆపేశాడు..చంద్రహాస్
  హరిణి  చెల్లెలు స్వాతి మరో ఇద్దరమ్మాయిలు కొన్ని అడుగుల దూరంలో కనబడ్డారు వంశీకి.. దూరం నుండే వీళ్ళను గమనించిన హరిణి చెల్లెలు.." అక్కా అక్కా..." అంటూ  తన మోచేత్తొ హరిణిని పొడిచింది..హరిణి అప్పటికే వంశీని గమనించికూడ  చెల్లెలు, ఇద్దరి కజిన్స్ ముందు ఏమి తెలియనట్లె నడుస్తూ ఉన్నది.  చాలా నెలలతర్వాత ఈరోజే వంశిని చూడడం మనసులో  చిన్న అలజడి, ఎక్కడో మారుమూలన ఉన్న ఐడెంటిటీ క్రైసిస్‌ని తిరిగి కదుపుతున్నది, కొన్నాళ్ళుగా ఆ తీపి అనుభవానికి దూరంగా ఉండడం మూలాన ఒకింత స్తబ్తతగా ఉన్నది.   హరిణిని చూసి వంశీ ఎటువంటి భావం లేకుండా చంద్రహాస్‌తో మాట్లాడుతూ కూర్చున్నాడు. చంద్రహాస్ మాత్రం చెవులు వంశీకి అప్పగించి..దృష్టి మాత్రం హరిణి వైపే సారించాడు,  సరిగ్గా వంశీని దాటి ముందుకెళ్ళే లోపల తన పక్కన నడుస్తున్న చెల్లెలి జడవెనుకనుండి  పంటితో కిందపెదవిని  నొక్కిపట్టి ఓరచూపులతో చూస్తూ గమనించంది వంశీని, తనంటే ఇంకా ఆసక్తి చూపుతున్నాడా లేదా అన్న ఉత్సుకత..ఇదంతా ఓ లిప్తకాలంలో  బయట వ్యక్తులు ఎవరూ గుర్తించలేని విదంగా జరిగిపోయింది..కాని చంద్రహాస్‌‌రెడ్డి దృష్టిని దాటిపోలేదు.
" రేయి వంశీ " గట్టిగా అరచి.. " అవే చూపులు...అదే ఆసక్తి.. ఏందిది.. తనకి నీవంటే ఇష్టం లేదని అనుకున్నాము, నీవు అదే అనుకొని నాకో పెద్ద క్లాస్ పీకావు, మరి ఇప్పుడు చూడు.. ఆ చూపులకు అర్థమేంటి..? ఈ ఆడోళ్ళను అర్థం చేసుకోవడం మన వల్ల కానే కాదు..వాడెవడొ రచయత అన్నట్లు..సముద్రం లోతైనా తెలుసుకోవచ్చేమోగానీ.. ఆడదాని మనసు లోతు ఆసలు తెలుసుకోలేం అన్నాడు...ఇప్పుడు జూచ్చాంటే నిజమే అనిపిస్తాంది. " అన్న చంద్రహాస్ మాటలకు ఒక్క సారిగా పకపకా నవ్వాడు వంశీ.. కానీ ఆపరేషన్ చేసిన కుట్ల వద్ద ఇంకా పచ్చిగా ఉండడం మూలానా అక్కడ కలుక్కమనడంతో...వెంటనే ఆపేశాడు.  చంద్రహాస్‌కి ఆ నవ్వు అర్థం కాక  వంశీ వైపు చూసి "ఏంట్రా ఆ నవ్వు " అన్నట్టు చూసాడు. ఓ అరనిమిషం పాటు మౌనంగా ఉండి తర్వాత చెప్పడం మొదలెట్టాడు వంశీ ..
" నీ స్టేట్‌మేంట్ విని నవ్వొచ్చిందిలే. సరే నేను చెప్పేది ఆలకిస్తావా..!!  చిన్నప్పటి నుండి ఆడ, మగలను  వేరు వేరు గా భిన్న దృక్పదాలతో పెంచుతారు పెద్దలు..! మగాడికి చాలా వరకు స్వేచ్చనిచ్చి..ఆడపిల్లల విషయంలో నియంత్రణ, నిబందనలు ఎక్కువ పెడతారు..ఆలా చేయకూడదు..ఇలాఉండకూడదూ అంటూ వాళ్ళలో ఉండే సహజమైన గుణాలను..సహజంగా పెరగనీయకుండా నియంత్రిస్తారు, వీటిమద్యలో వాళ్ళలో ఉత్పన్నమయ్యే సహజ భావాలను ఒక్కోసమయంలో బలవంతంగా అణుచుకుంటూ ఇంట్లో పెద్దలు నిర్ణయించిన కట్టుబాట్లకు..నీతిసూత్రాలకు..విలువలకు అనుగుణంగా మలుచుకుంటారు..! ఈ కట్టుబాట్లు, నీతి సూత్రాలు మనం తయారుచేసుకున్నవి.  మనిషిలో చెలరేగే ఉద్వేగాలు ఆడ, మగల మద్యన జరిగే పరస్పర ఆకర్షణ ఇవన్ని ప్రకృతిపరమైనవి  అయితే మన పెద్దలు వీటిని వేరు వేరుగా చూడకుండా రెండిని కలిపి ఒకే విదంగా చూస్తారు. ఇవి రెండు రైలుపట్టాలు లాంటివి సమాంతరంగా ఉంటాయే కాని ఎప్పుడూ కలవవు,  వివేకం, విచక్షణ దక్షతతో వ్యవహరించాలి అంటారు. కాని వయసు పెరిగే కొద్ది అణిచిపెట్టిన సహజభావాలు ఉదృతంగా బయటకు తన్నుకొని రావడంమొదలెడతాయి...వాటిని అణుచుకోలేక సతమవుతూ..ఎవరైతే వాళ్ళ భావాలని నియంత్రిస్తున్నారో వాళ్ళకు తెలీకుండా బయటకు తెలియజెయాలి అన్న తపనలో ఉంటారు .! మరి కొందరు రెండిటికి మద్యన చాలా బ్యాలెన్సడ్‌గా ఉంటారు. మరికొందరు రెండు భావాలను బ్యాలెన్స్ చేయలేక డోలాయన స్థితిలో ఉంటారు, ఒక్కో సమయం ఒక్కోలా ప్రవర్తిస్తారు, అలాంటి వారిని చూసి  మన మగ రచయతలు, ఊహల్లో తేలియాడే కవులు  ఆడదాని మనసు లోతు..సముద్రం అంటూ..కొన్ని ఫాల్స్ స్టేట్‌మెంట్స్ తయారు చేసారు అంతే. "  మద్యలో కాస్త గ్యాప్ ఇచ్చాడు..
వెంటనే చంద్రహాస్ అందుకొని.. " వంశీ నువ్వేమి చెబుతున్నావో నాకేం అర్థం కాలేదు..అది సరే వదిలేయ్.. నువ్వంటె ఇష్టంలేదని చెప్పింది కదా తను... తరువాత మళ్ళీ ఈ చూపులేంటి..ఆ కవ్వింపులేంటి..!?? ఈ ఆడోళ్ళంతే..మొదట్లో ఇష్టం ..ప్రేమ అంటారు..కొన్నాళ్ళకు ఏమి తెగులొస్తుందో. ఏంటో కాని....ఇష్టం లేదంటారు..మల్లేమొ ఇట్లా చూపుల్తో చంపుతారు..నాకేమి అర్థం కావట్లేదు..దీన్నేమి అంటారు చెప్పు " అడిగాడు.
  వంశీ సుదీర్ఘంగా చుసాడు చంద్రహాస్ వైపు...ఆ చూపుతో అర్థమైపోయింది..ఓ పెద్ద ఉపన్యాసమే తను వినాల్సి వస్తుందని.. అర్థం అయినా కాకపోయినా చచ్చినట్లు వినాల్సిందే తప్పదు మనసులో అనుకొని సిద్దమైపోయాడు .
   " చంద్రా..మగవాళ్ళకు ఎటువంటి..రిస్ట్రిక్షన్స్ లేకపోవడంవలన తనుకున్నది  ఎక్కడైనా..ఏదైనా  ఎక్స్‌ప్రెస్ చేస్తాడు..మరీ పూర్తిగా కాకపోయినా చాల వరకు ఆ స్వేచ్చ మగవాళ్ళకుంది..స్త్రీలకు అలా కాదుకదా..!! బయట సమాజంలోవాళ్ళ భావాలని వ్యక్తీపరచడానికి అవకాశమే ఉండదు ..చుట్టూ సమాజం ఏర్పర్చిన భావాలే వాళ్ళభావాలుగా చెప్పబడుతాయి..ఉదాహరణకి..మా చెల్లెలు అలాంటిది కాదు.. మా ఫ్యామిలి నిప్పు..అని చెప్పడం వలన స్త్రీలలో ఉన్న సహజమైన భావాలు అణుచుకుంటారు, అవి తప్పేమో అనుకుంటారు..వీళ్ళు చెప్పినవే కరెక్ట్ అని అవే ఫాలో కావాలి..సో..అలా పెద్దవాళ్ళు చెప్పిన భావాజాలాన్ని తమదిగా చెప్పుకుంటూ బతుకుతారు, తమకు తెలీకుండానే మెల్లిగా అందులోకి జారిపోతారు.  ఇక నేను లెటర్ ఇచ్చిన సమయంలో ఆ అమ్మాయికి నా విషయంలో ఒక స్పష్టమైనా అభిప్రాయమంటూ ఇంకా ఏదీ ఏర్పడలేదు..అప్పటికే జరగవలసిన డామేజ్ తన చూట్టూ ఉన్నమనుషులద్వార జరిగిపోయింది..వాళ్ళు చెప్పిందే ఈమె అభిప్రాయంలా మారింది...ఆఫ్‌కోర్స్...నాపైనా ఇష్టం ఉండచ్చు..లేకపోవచ్చు..రెండిటికి పెద్ద తేడా లేదాసమయంలో..! ఓ మనిషి తనను ఇష్టపడుతున్నాడూ అంటే వాళ్ళకి లోపల ఒకరకంగా గర్వంగాను..ఆనందగాను ఉంటుంది..ఆది ఆడకైనా మగవారికైనా!  ఒకింత తుల్లింత కలిగేలా చేస్తుంది..దానికి ఇష్టా ఇష్టాలతో సంబందం లేదు....అలాగే ఈ రోజు అలా చూపులతో బయటపడింది హరిణి.   ఓ మనిషిని తను ఇష్టపడకపోయినా..తనను ఇష్టపడే ఆ మనిషి..ఎప్పుడు తననే ఇష్టపడుతూ..తన సర్కిల్‌లోనే ఉండాలని కోరుకుంటారు..తనను ఇష్టపడడం అన్నది చాల మత్తుకలిగిస్తుంది ఏ మనిషికైనా....." కాసేపు ఆపాడు..వంశీ..
  " ఏంటిది..? వింటున్నా కదా  అని చెబుతూనే ఉన్నావు,  ఇలాంటి విషయాలలో నీవనుకునేంత ఉండదులే , చెప్పింది చాల్లే ఇక ఆపు " అన్నాడు చంద్రహాస్..
 " అప్పుడేనా..ఇంకా ఉంది..పూర్తిగా విను " అని కొనసాగించాడు
" రేపు పెళ్ళయ్యాక.  ఓ .మూడు , నాలుగేళ్ళకు ఓ ఇద్దరు పిల్లల్ని చంకనేసుకొని..ఎదురుపడతారు.. మనల్ని చూడగానే పాత విషయాలు గుర్తుకొచ్చి..పిచ్చిగా నవ్వుకుంటూ.." ఏంటో..అప్పడు ఏం తెలియని వయస్సులో ఏమేమో చేసాం..ఎవ్వరిమాట వినం....ఇప్పుడు చూస్తే అదో పిచ్చితనంలా అనిపిస్తుంది." .అని నవ్వుకుంటారు.  అదే మనిషి మరో ఇరవై ఏళ్ళుపోయాక భర్తను తెప్పుతున్న సమయంలోనో..లేక భార్యను భర్త దెప్పుతున్న సమయంలోనో. ."  నేను వయసులో ఉన్నప్పుడు..నా వెనుక అమ్మాయిలు / అబ్బాయిలు..నువ్వంటే ప్రాణం..నువ్వులేక నేను లేను..అని తెగ వెంటపడేవాళ్ళు..! అప్పట్లో వాటి విలువ ఏమిటో తెలిసేది కాదు..ఇప్పుడు తలుచుకుంటే...బాదేస్తుంది .! హు...తర్వాత ఇంట్లో పెళ్ళిసంబందాలు..చూడడాలు,ఒప్పుకోవడాలు..ఖర్మాకాలి ఇలా ఈయన పాలిట/ ఈమెపాలిట పడాల్సి వచ్చింది....హాయిగా అలా వెంటపడ్డ వాళ్ళనే పెళ్ళిచేసుకొని ఉంటే ఎంతహాయిగా ఉండేదో..’ అని చెప్పుకోవడానికి ..ఇలాంటి సంఘటనలన్నీ ఉపయోగపడతాయి " అని ముగించాడు..వంశీ.
    " ఓరినాయనో బుక్కులన్ని చదివింది వందేళ్ళ జీవితాన్ని ఇంత చిన్న వయసులోనే చూట్టానికా..నిన్నెవరు చేసుకుంటారో ..వాళ్ళు చచ్చిపోతారు.." అన్నాడు చంద్రహాస్
 " సర్లే గాని బోర్‌కొడుతున్నది.. సినిమాకి వెళ్దాం పదరా " అన్నాడు..
" సినిమాకా....?  రేయ్..నువ్వు మీ ఇంట్లో లేవురా..హాస్పటల్లో ఉన్నావు..స్పృహలో ఉండు....! చీ..చీ  నీ  తెలుగు నాకంటుకుంది.."
" సర్లె మాటలాపి పదా " అన్న వంశీతో కదిలాడు..చంద్రహాస్ 

                                                                 *                                                     *                                                       *

    ఇంజనీరింగ్‌ 80 శాతంతో పాస్ అయ్యాడు వంశి,  గేట్ రాసి ఫారెన్ కి వెళ్ళమని ఇంట్లో తండ్రి వత్తిడి, గేట్ కి ప్రిపేర్ అవుతూ మరో పక్కన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. రెగ్యులర్‌గా సాయింకాలాలు చైతన్య వద్దకు వెల్తూ ఉన్నాడు. అక్కడ రోజు ఏదో ఒక చర్చ చేయడం పరిపాటి అయ్యింది వంశికి. అలాంటి సమయంలో చైతన్య ఒక ఆధ్మాతిక ప్రవచనాలు చెప్పే స్వామిజి ఆశ్రమానికి వెళ్ళడానికి సంసిద్దుడవుతున్నాడు, ’ నేను వస్తా, నాకు పనికొచ్చే భోదనలుంటే వింటాను, తీసుకుంటాను లేదంటే అక్కడే వదిలేసి వస్తాను ’ అంటూ చైతన్యతో బయలదేరాడు చెన్నై ఆశ్రమానికి వంశి.
           ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతలున్న స్వామీజి ఆయన, వయసు 60  ఏళ్ళు దాటి ఉంటుంది, ఆజానుభాహుడు, స్పరధరూపి, బంగారుఛాయతో మెరుస్తూ ఉంటుంది ఆయన శరీరం,  మంచి ప్రభోధకుడు, అటువంటి వారికి మెస్మరైజ్ పవర్ చాలానే ఉంటుంది. వారు ఏమి చెప్పినా అదే వేదంలా వింటారు. ఆ ఆశ్రమానికి ప్రవేశం ఎవరైనా వెళ్ళవచ్చు, ఉండాల్సిన అర్హత మామూల స్థాయి ఆంగ్లం కంటే ఓ మోస్తారు పై స్థాయిలో ఉన్నవారిని అనుమతినిస్తారు.  మొదట మూడు నెలలు  కోర్స్ ఉంటుంది, నచ్చితే అక్కడె మూడు సంవత్సరాలు కోర్సు చేయవచ్చు.  రోజు ఉదయం, భోజనం తర్వాత మద్యాహ్నం  అధ్వైత సిద్దాంతాలు, ఉపనిషత్తులు మీద ప్రసంగం చేస్తారు. అక్కడ విన్నవిషయాల  మీద ఏరోజుకారోజున సాయింత్రం లేక రాత్రిల్లు తమ కిచ్చిన పుస్తకాలలో తమ తమ అభిప్రాయాలు, చర్చలు, ఏమి తెలుసుకున్నారో వాటిని రాసి ఇస్తే వాటిని చదివి మరసటి రోజున ఉదయం రాసిచ్చిన అభిప్రాయాల మీద ఆయన ప్రసంగం చేస్తారు, కాని  రాసిన అభిప్రాయాలను పలాన వ్యక్తుల చెందినవి అని  చెప్పకుండా జనరల్‌గా చర్చిస్తారు. తర్వాత ప్రతి ఆదివారం ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వ్యక్తిగత ముఖాముఖి ఉంటుంది స్వామీజితో.
         చైతన్య, వంశీలిద్దరు స్వామీజి చెప్పిన కొన్ని విషయాల మీద విభేదిస్తూ కొద్దిరోజులుగా తమకిచ్చిన పుస్తకాలలో తమ అభిప్రాయభేదాలను రాస్తున్నారు, ’ మేము ఏవి అంత సులభంగ నమ్మము, మీరు చెప్పిన అధ్వైత సిద్దాంతాలు నిరూపించబడాలి, అప్పుడు నమ్మడానికి అవకాశముంటుంది  అలా అని మేమేమి నాస్తికులం( atheist ) కాము. మీరేమి చెబుతారు..!  అలౌకిక స్థితికి వెళ్ళాలి అంటే సమాధిస్థితికి వెళ్ళాలి అప్పుడు సాక్షాత్కరిస్తారు దైవం అని చెబుతారు, మీమీద గౌరవం వలనో, సమాజంలో ఉన్న నమ్మకాల వలన అందరు వింటారు, అంగీకరిస్తారు కూడ.  కాని సైన్స్ అలా కాదు కదా..! ప్రత్యక్షంగా నిరూపించబడాలి,  ఉదా: భూమి గుండ్రంగా ఉన్నది అనడానికి చంద్రమండలం మీద నుండి తీసిన ఫోటోస్ ఉన్నాయి, వాటికి ప్రత్యక్ష సాక్షం ఉన్నది, అలా  demonstrate చేసి చూపిస్తుంది సైన్స్, కాని మీరలా చూపించలేరు కదా..! దేవుడిని నేను కనుగొన్నాను..దేవుడిని రియలైజ్ చేసుకున్నాను అని మీరంటారు..మాకు చూపించమంటే మీవల్ల కాదు కదా..! మీరేమంటారు..మమ్మల్ని మీ స్థాయికి( సమాధి) రమ్మంటారు..నిజమే అవి మావల్ల కాదు.. ఆస్థాయికి వచ్చేంతవరకు మేము అర్హులం కాము అని ఓపన్‌గా ఒప్పుకుంటాము, అంతే గాని మీరు చెప్పిన వెంటనే అవే సత్యాలని మేము వెంటనే తీసుకోము, అయితే ఒక చాన్సుంది, దేవుడుండే అవకాశముంది లేదా కర్మసిద్దాంతం ఉండే అవకాశమున్నది ఇంకా ఇన్‌వెస్టిగేషన్ చేస్తాము..లేదా సాధన చేస్తాము అని మునుముందు నిరూపించే అవకాశముండచ్చు..నిరూపించబడవచ్చు.. అని చెప్పండి అప్పుడు ఆక్సెప్ట్ చేస్తాము.." అంటూ వ్రాస్తున్నారు. అందులో మాదంతా సైన్స్‌పిక్ టెంపర్..అయినా ఓపన్ మైండ్‌తో ఉన్నాము అన్న విదంగా అందులో పలికించారు.
    అవి చదువుతున్న స్వామిజికి ఎక్కడో పట్టుతప్పతున్నదనిపించి వాటి మీద ఒక రోజు ఉదయం తన ప్రసంగంలో ప్రతిస్పందిస్తూ
 " మీలో ఒకరిద్దరు ఇలా అంటున్నారు అది బానే ఉంది కాని..అన్నిటికి సైన్స్ కరెక్టు.. సైన్సే నిజాలు చెబుతుంది అంటున్నారు.  మీరు చెప్పే సైన్స్ కి పిజికల్‌గా కావాలి, కాని మేము చెప్పే అధ్వైత సిద్దాంతానికి స్పిర్చువల్ డిసీప్లిన్ కావాలి దానికి యోగా నేర్చుకొని ఎవరికి వాళ్ళుగా సమాధి స్థితికి వెళ్తేనే  ’దేవుడు, శక్తి ’  ఉన్నాయని తెలుస్తుంది,  సైన్స్ నిన్న గాక మొన్నెఎప్పుడో పుట్టింది దానికంటే ముందున్న వేదాలలో అన్ని ఉన్నాయి. సనాతన ధర్మాలలో ఎంతో ఉన్నది.. ఇంకా చెప్పాలంటే  ' We ( vedas) have got answers for which you (science) can not frame question ' " అన్నాడు,
 అంతే ప్రసంగం వింటున్న చాలా మంది శిష్యులు ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు, ’ వాహ్..! భలే చెప్పారు స్వామిజీ  సైన్స్ గురించిన మాట్లాడిన వాళ్ళు ఎవరో గాని చాలా మూర్ఖుల్లా ఉన్నారు ’ అనుకున్నారు
    ఆరొజు సాయింత్రం ప్రసంగాలు ముగిసాక ఆశ్రమంలో శిష్యులంతా ఒక చోట కూర్చొని ఉదయం స్వామిజి చెప్పిన విషయం గురించి పదే పదే చెప్పుకొంటూ ’ వాళ్ళెవరో గాని మాంచి సమాదానమే ఇచ్చారు స్వామిజి వారికి,  సైన్స్‌కి తెలిసింది గోరంత తెలియనది కొండంత ’ అంటూ మురిసిపోతున్నారు.
   అప్పుడు మాట్లాడం మొదలు పెట్టారు చైతన్య " బాగుంది మీ సంతోషం... కాస్త స్వామిజి చెప్పిన విషయం మీద క్షుణ్ణంగా పరిశీలించండి. ఆయన మాట్లాడినదంతా మాటల గారడి, మన మాటల గారడీతో ఏవైనా చెప్పొచ్చు.. వినడానికి బానే ఉంటుంది, కాని సత్యం అన్నది ఒకటుంటుంది దాని మరుగున పరచి మాటల గారడితో మాట్లాడి అందరిని ఒప్పిస్తే ఎలా..? మరి సత్యాన్ని ఎలా చూస్తారు ( దర్శిస్తారు )..?  ఆయన చెప్పిందే ఒకసారి విశ్లేషిద్దాము,
   answers  అంటే definition ఏంటి..? " అడిగాడు.  
   ఏమి చెబుతారా అని అందరిని గమనిస్తూ ఉన్నాడు వంశి,  కొద్ది క్షణాలకు కొందరు తర్జభర్జన పడి చివరకు " ప్రశ్నకు బదులివ్వడమే answer " అన్నారు.
         " కదా...!" అని తలఊపి తిరిగి చైతన్య మాట్లాడడం కొనసాగించాడు "  అసలు answer  కి ఉనికేలేదు,దానికి రూపమేలేదు. ముందు ప్రశ్న ఉద్భవిస్తేనే తర్వాతే జవాబు పుడుతుంది, ఆఫ్‌కోర్స్ మీవద్ద ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగే information, లేదా knowledge ఉండచ్చు అది వేరే సంగతి, కాని దానికన్న ముందు ప్రశ్నకు ఒక shape తయ్యారవ్వాలి, అది express  కాబడాలి, తర్వాత  answer  పుడుతుంది,  even  ప్రశ్నకు కూడ ముందు ఉనికి లేదు, మనకు ముందుగా ఒక enqury mind  ఉండాలి, మనిషికి knowledge  పట్ల ఒక enquiry చేయకలిగే తత్వం ఉండాలి అప్పుడు ప్రశ్న ఉద్భవిస్తుంది ఆతర్వాతే జవాబు పుడుతుంది.  knowledge is ocean  అందులో నుండి ఎంతైనా తోడుకోవచ్చు. మరి ప్రశ్నే లేకుండా ఎలా జవాబులు పుడతాయి చెప్పండి " అడిగాడు చైతన్య. ఆమాటలు విన్న అందరు ఆలోచనలో మునిగారు.
   ఇంతలో వంశి మాట్లాడుతూ.." దైవాన్ని దర్శించాలంటే సమాధిస్థితికి వెళ్తేనే తెలుస్తుందని చెప్పారు స్వామిజీ, నిజమే వాటి వెనుక కొన్ని కారణాలు ఉండే ఉంటాయి, అంత మాత్రాన ఆయన చెప్పినవన్ని ఒప్పుకోలేము, మొదటి పాయింట్ వీళ్ళు చెప్పేవన్ని కూడ సామాన్యుడి అనుభవాలకు అందుబాటులో ఉండవు, రెండవది మేధావుల అంటే నాస్తికమేధావుల యెక్క అందుబాటులో ఉండవు, అలా అని వాళ్ళు చెప్పినవాటిల్లో సత్యం లేదని కొట్టిపారేయలేము..అలాని పూర్తిగా సత్యం ఉందని చెప్పలేము, వీటన్నిటిని  sauspended animation కింద fridge లో పడేయాలి, ఆ సమయం వచ్చినప్పుడు దానిని పరీక్షించి అప్పుడు ఒకే అనాలి.  పోనీ వీళ్ళు చెప్పిందే నిజం అనుకుందాం, సత్యం ఒక్కటే అయినప్పుడు అంతా దేవుడు చెప్పిందే అన్నప్పుడు, సమాధిస్థితిలో తెలుసుకున్నదే అనుకున్నప్పుడు మరెందుకు ఇన్ని మతఘర్షణలు జరుగుతున్నాయి..? హిందూ మతంలోనే  శైవులు, వైష్ణవులంటూ ఎందుకు యుద్దాలు చేసుకున్నారు..?   కాబట్టి ’ సత్యం ’ ఒక్కటే అయినప్పుడు ఈ ఘర్షణలుండవు.  పోనీ  ’ సత్యాన్ని ’ అర్థం చేసుకోవడంలో తేడాలు ఉండిండ వచ్చు లేదా కొన్నే చూసి ఉంటారు, మనం చిన్నప్పుడు కొన్ని కథలు వినే ఉంటాము  ’ నలగురు అంథులు ఒక ఏనుగు కథ..! నలుగురు గుడ్డివారు ఏనుగుని చూసింది వాస్తవమే కాని ఒక్కొక్కరు ఒక్కో విదంగా... ఒకడేమో ఏనుగు చెవులు పట్టుకొని చూసి చాట లాగ ఉందని అన్నాడు, మరొకడు కాళ్ళు పట్టుకొని చూసి స్తంబం లాగుంది అన్నాడు, ఒకడేమో తోక పట్టుకొని చీపురులాగుంది అన్నాడు,  నలుగురు పాక్షికంగా నిజాలే చెప్పారు కాని పూర్తిగా నిజాన్ని చెప్పలేకపోయారు. కాబట్టి ఈ స్వామిజీలు చెప్పేవాటిల్లో కొద్దిగా పాక్షిక సత్యం ఉండొచ్చు. ఎప్పుడైతే పూర్తి ’ సత్యం ’ కనగొనబడతారో అప్పుడు ఈ తికమకలుండవు, అప్పుడు ఎవరు చెప్పినా ఒక్కటే ’సత్యం ’ చెబుతారు.. అంతవరకు ఈ విభేదాలు తప్పవు " ముగించాడు వంశి.
        రెండు రోజుల తర్వాత ఆదివారంరోజున వంశి, చైతన్యలిద్దరిని ఒకే సారి ముఖాముఖికి పిలిచారు స్వామిజీ. అప్పుడు అడిగారు ఇద్దరు " ఏమిటి స్వామిజి రెండు రోజుల క్రితం జవాబు గురించి అలా సెలవిచ్చారు " అంటూ చర్చ లేవదీసారు. వీరి వాదన విన్న తర్వాత తాను చెప్పిన మాటలనుండి పునరాలోచనలో పడ్డారు స్వామిజీ,  చివరికి " నేను అనుకున్నది వాస్తవం కాదన్నది అవగతం అవుతున్నది, మీరు అన్నదే నిజంలాగ కనపడుతున్నది. అయితే మరో విషయంలో మీరు పొరబడుతున్నారు, వేదాల్లో చెప్పినవన్ని అప్పటి మహామునులు దర్శించినారు, వాటిల్లో చెప్పబడిన సత్యాల ను ఒక సమాధిస్థితిలో చూసినారు అంటే కళ్ళతో కాదు మనోనేత్రంతో అనుభవించిన సత్యాలు అవి వాటిని శృతి అంటారు..శృతి అంటే మనిషిచేత చెప్పినది కాదు.. that  which was heard in the heighest stage  అంటే ఒక మనిషి తనను తాను అధిగమించి, నేను అన్నదానిని కూడ దాటి ఒక స్థాయికి చేరుకుంటాడు, ఆ స్థాయిలో వినిపించే సత్యాలే  వేదాలు గా, ఉపనిషత్తులు గా చెప్పబడ్డాయి..వాటినే శృతి అంటారు. అవి మాకు గోచిరించాయి, మేము చూసినాము, అవే నిత్య సత్యాలు, వాటిలోనే అసలు సత్యాలున్నాయి. వాటిని మీరు దర్శించండి, ముందుగా శృతిని చదవాలి వాటిని విశ్లేషించాలి వాటిలో ఏవన్న అనుమానాలు ఉంటే ఒక గురువు ద్వార తెలుసుకోవాలి తర్వాత మీకు మీకుగా ప్రాధమిక నమ్మకం కలిగిన తర్వాత ఈ విషయం మీద ఆలోచించండి, దీని మీద ధ్యానం చేయండి, ఆ ప్రాసస్‌లో ముందుకు వెళ్ళండి " వివరించారు స్వామీజి.
      " అలాంటివి మేము నమ్మము, మీరు మునులుగా చెప్పబడుతున్న వారు కూడ భ్రమపడి ఉండవచ్చు కదా..? భ్రమకు గురి కావడమనేది తప్పేమి కాదు..! self hypnotisam  అయుండచ్చు కదా..? అదొక రకమైనా అవస్థ, అంతే కాని వాళ్ళేమి వాళ్ళ లబ్ధి కోసమేమి చెప్పిండకపోవచ్చు, వాళ్ళేమి అబద్దాలు చెప్పిండకపోవచ్చు, వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పిండవచ్చు, వారికి తోచినంత మాత్రాన అవి కరెక్ట్ అని ఎలా ఒప్పుకుంటాము....? కాకపోతే వారు చెప్పినవి వేరే ఎటువంటి  motivetion లేకుండా మనం అంగీకరించవచ్చు, తీసుకోవచ్చు, మిగతా ఇప్పుడున్న స్వాములంతా తమ స్వార్థం కోసం, తమ ఆశ్రమాలని అభివృద్ది చేసుకోవడం కోసం చెబుతున్నారు. మీరు చెబుతున్నదేంటి....? వేదాల్లో చెప్పింది నమ్మాలి దాన్ని ప్రశ్నించకూడదు అది అంతే అని, దానికో అంతం అదే అని చెబుతున్నారు..సైన్స్ అలా కాదు దేనైనా సరే " ఇది ఇంతే " అని దానికి ఒక అంతం అంటూ ఎప్పుడు చెప్పదు..చాలా ఓపన్ మైండ్ ఉంటుంది...! మేము నాస్తికులం కాదు ..సహేతుకంగా ఉంటేనే నమ్మతాము ( agnostic )  సైన్స్ చెప్పేది వెరిఫైలబుల్, రిపీటబుల్.. మల్లి రిపీట్ చేసి దానిని డెమాన్స్ట్రేషన్ చేసుకోవచ్చు. ఉదా: అతి కష్టతరమైనది  నీళ్ళ నుండి  పెట్రోలు తయారుచేయడం అన్న విదానాన్ని ఒకరు కష్టపడి కనిపెడితే..తర్వాత తర్వాత మిగతా అందరూ అలా చేయడం చాలా సులభం అవుతుంది, మొట్టమొదట కనిపెట్టె వాడే చాలా కష్టపడతారు..తర్వాత చాలా సులభతరం అవుతుంది.  అలాగే మీరంటున్న శృతి అన్నది ఎప్పటికీ ఉంటుంది, అది వాస్తవం, అదొక యధార్థ శృతి, సత్యం అయినప్పుడు మొదట కష్టపడినవారిలాగ మిగతా అందరూ అలానే ఎందుకు కష్టపడాలి....? చాలా సులభం అవుతుంది కదా..?? "  ప్రశ్నించారు.
   స్వామీజి కొద్ది సేపు దీర్ఘాలోచనలో పడ్డారు..కొన్ని నిమిషాలు గడిచాక.." మీరు చెప్పిన వాటిలో నిజం కనపడుతున్నది, మీరడిగే ప్రశ్నలకు నామీద నాకే నమ్మకం పోతున్నది, కొన్నిటికి సందేహాలు వస్తున్నాయి అయితే నేనిప్పటికిప్పుడు మరో జీవిత మార్గాన్ని ఎన్నుకోలేను.." అంటూ నర్మగర్భంగా మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదేమో, నా ఇన్స్‌ట్యూట్‌కే పెద్ద ప్రమాదం ఏర్పడచ్చు అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు.
" స్వామిజీ మిమ్మల్ని మీ సిద్దాంతాల్ని విమర్శించాలనే దృక్పదంతో మేమిక్కడికి రాలేదు, కేవలం ప్రతీది సహేతుకంగా ఉండాలనే అలా నిరూపింపబడాలనే తపనే తప్ప మా చర్చల వెనుక మరో మర్మం లేదు " అని విన్నవించుకున్నారిద్దరు.
"  ఇది ప్రవేట్ గా జరిగిన సంభాషణ కావున మీరు చెప్పిన విషయాలను అంగీకరిస్తున్నా..మీరు గాని ఈ విషయాలని  బయట ప్రపంచంలోకి వెల్లి కోట్ చేస్తే నేను డినే చేస్తాను " సెలవిచ్చారు స్వామీజి.
 అంతే కాదు  అనామకులైనా ఆ ఇద్దరి మాటలను ప్రపంచం పరిగణలోకి తీసుకోదు, స్వామీజికి ఉన్న ప్రాముఖ్యతా, ప్రపంచవ్యాప్తంగా ఆశ్రమాలు, పేరు ప్రఖ్యాతలున్నాయి కాబట్టి ఆయన చెప్పిన మాటలే చెల్లుబాటవుతాయి, ఆ విషయం మీద సరైనా అవగాహనే ఉన్నది చైతన్య, వంశిలిద్దరికీ. ఆ తర్వాత ఆ ఆశ్రమం నుండి నిష్క్రమించారిద్దరు.

                                                               *                                                    *                                                        *

   ఉదయమే చెన్నై నుండి ఇంటికి చేరిన వంశీ కాలకృత్యాలు తీర్చుకొని టిఫెన్ చేసి ప్రయాణ బడలికతో నిద్రలోకి జారిపోయాడు. " వంశీ..వంశీ.." ఎవరో పిలుస్తూ కదుపుతున్నట్లనిపిస్తే గబుక్కన లేచాడు..చూస్తే ఎదురుగా చంద్రహాస్‌రెడ్డి ఉన్నాడు.
   " ఏంట్రా బాబు మాంచి నిద్రలో ఉన్నా లేపావేంటి..?..అంత కొంపలు మునిగే పనేంట్రా...? "  నిద్దరమొహంతో అడిగాడు చంద్రహాస్‌రెడ్డిని.
 " ఓ వారం రోజుల్లో హరిణికి పెళ్ళి తెలుసా " అన్నట్లు అడిగాడు.
" అయితే ఇప్పుడేమిటి..." నిద్రలోకి వొరుగుతూ అన్నాడు.
ఆశ్చర్యపోవడం చంద్రహాస్‌రెడ్డి వంతయ్యింది  " అదేంట్రా ఇసుమంత బాద కూడ లేదా నీలో " నిద్దరోతున్న వంశీని కదుపుతూ అడిగాడు.
 " భాదనా..? ఎందుకు..." అన్నాడు
" హు నీదేమి ప్రేమరా .. చీ చీ ఇంత కఠినాత్మడనుకోలేదు నీవు ’  వంశీ కొద్దిగ కూడ బాద పడట్లేదన్న భాద చంద్రహాస్‌రెడ్డికి ఎక్కువయింది.
"  పొద్దున్నే నీ నస ఆపరా. ! పెళ్ళీడు కొచ్చిన అమ్మాయికి పెళ్ళి చేస్తారు, హరిణికి కూడ అంతే " అన్నాడు వంశీ.
" అది సరె..హరిణిని ఎవరికిస్తున్నారో తెలుసా..? "
" ఎవరైతే నాకెందుకురా "
ఆ మాటతో ఇంకా పుండు మీద కారం చల్లినట్లయింది ...’ ఏంటి వీడు నిజంగా బండరాయా..? లేక అలా బయటకు నటిస్తున్నాడా ’ అర్థం కావట్లేదు చంద్రహాస్‌రెడ్డికి
" ఎవరో స్వామిజీ అంటా, ఎక్కడో ఒక ఫంక్షన్‌లో హరిణిని చూసాడట, మనసుపడి హరిణి అమ్మనాన్నలకు ఇష్టం లేకపోయినా బతిమాలి ఒప్పించి పెళ్ళి చేసుకుంటున్నాడు, అయినా స్వామీజిలకు పెళ్ళేంటి రా..? వాళ్ళు సన్యాసులు కదా..?  భార్య, పిల్లలు..ఉండచ్చా..? " అర్థం కాక అడిగాడు
" సన్యాసి వేరు..స్వామీజి వేరు...ఆధ్యాత్మిక స్వామేమో లేరా.." అన్నాడు వంశీ.
" కనీసం రవ్వంతైనా భాద లెదా నీకు " అడిగాడు
" జీవితంలో వాస్తవం ఏమిటొ..సత్యం ఏమిటో తెలుసుకుంటే..ఏభాదలు..దుఃఖాలు ఉండవు ’ నిద్రలోకి జారుకున్నాడు వంశీ.

                                                                                           -  సమాప్తం -

         
         

ఉపసంహరణ : విద్యుల్లత డిల్లీలో మెడిసెన్ తర్వాత అమెరికా వెళ్ళి న్యూరాలజిలో ఎమ్.డి చేసి..తన ప్రొఫిషన్‌లోనె మరో న్యూరో సర్జన్ డాక్టర్‌ని పెళ్ళి చేసుకొని అమెరికాలో స్థిరపడిపోయింది. స్వామీజిని పెళ్ళి చేసుకోవడం వలన హరిణి  కొన్ని కోట్లకు అధిపతురాలయ్యింది ప్రస్తుతం చెన్నైలో స్థిరపడింది, చంద్రహాస్‌రెడ్డి వ్యవసాయం చేసుకుంటూ సొంతంగా రైస్ మిల్లు నడుపుకుంటూ పెళ్ళి చేసుకుని పల్లెలో స్థిరపడ్డాడు.  త్రిపురనేని గోపిచంద్ గారి నవల ’ అసమర్థుడి జీవయాత్ర " లా  ప్రతీది ఉన్నదానికంటే అనవసరంగా ఎక్కువగా  ఆలోచిస్తూ...జీవనం సాగిస్తున్నాడు వంశీ..

1 comments:

Hi,
Welcome to my blog

gsystime.blogspot.com

For everyone the knowledge is available in this blog

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs