నేను ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్న రోజులవి,  అనుకోకుండా  మా వూరిలో కొన్ని వ్యక్తిగతమైన సమస్యలు ఎదురవడంతో  వాటి పరిష్కారం కోసం మా వూరికి వెళ్లిపోయాను, ఒక పదిరోజుల్లో  పరిష్కారం అవుతుందనుకుంటే అది కాస్తా, ప్రతి పదిహేను రోజులకొకసారి పొడిగిస్తూ అలా  మూడు నెలలు కొనసాగింది నా సమస్య పరిష్కారం కావడానికి. ప్రతి పదిహేను రోజులకొకసారి నేను పని చేస్తున్న మీడియా యజమాన్యానికి నా పరిస్థితి వివరిస్తూ సెలవలను పొడిగించమని సెలవు చీటి పంపుతూ వుండే వాడిని.

   మూడు నెలల తర్వాత పరిస్థితి ఒక కొలిక్కి రావడంతో హైదరాబాద్ తిరిగి  వచ్చాను మీడియాలో నా ఉద్యోగం కొనసాగిద్దామని!! అయితే ఏ ప్రైవేట్ సంస్థ కూడ అలా మూడు నెలలు పాటు సెలవలు ఇవ్వరు. ఆ  అవగాహన వున్నవాడినే కాబట్టి దానిని యధాతదంగా అంగీకరించడానికి మానసికంగా సిద్దంగా వున్నాను. నాలుగంతస్థుల మా మీడియా ఆఫీస్ సముదాయం గ్రౌండ్ ఫ్లోర్లో వున్న నా డిపార్ట్మెంట్ హెడ్ ని  కలిసి నారాజీనామా విషయం గురించి ప్రస్తావించగానే, ఆయన  " ఆ అవసరం లేదయ్యా..... నీవు రాగానే పైన జనరల్ మేనజర్ని కలవమన్నారు, వెళ్లి ఒక సారి కలువు, నీకు నీవుగా తొందర పడి రాజీనామా చేయకు" అన్నారు.

   జనరల్ మేనజర్ని కలసి  "మిమ్మల్ని కలమన్నారు మా ఇన్ ఛార్జ్"  అని చెప్పి నా సంగతంతా వివరించాను. సావదానంగా అన్ని విని "సరే ఓ రెండు రోజు లాగి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని కల్సి మాట్లాడండి" అని చెప్పారు.  ప్రైవేటు, ప్రభుత్వం రంగ సంస్థలంటూ తేడా లేకుండా ప్రపంచంలో ప్రతి చోట వుండే గ్రూపులు మా కంపెనీలో కూడ వున్నాయి,  కుల, ప్రాంత, తేడాలంటూ వుండవు వీటికి, కేవలం ఏదో ఒక మానసిక వ్యాపకం ఉండాలి మనిషికి.. చేసే పని మీద శ్రద్ద, చిత్త శుద్ధి కన్న వీటి మీదనే ఎక్కువ ఆసక్తి ఈ జనాలకు, అదొక జాడ్యం...! ఇలాంటి గ్రూపులకు దూరంగా వుండే మనుషులు కూడ అక్కడక్కడ వుంటారుగా...  అలాంటి వారిలో నేను ఒకడినే. అలా మా కంపెనీలో కూడ వున్న రెండు గ్రూపులకు చెందని వాడిని నేను కాబట్టి, రెండు గ్రూపులు వారు మాకు సంబంధం  లేదు అంటే..మాకు సంబంధం లేదు ఈ మనిషి అంటూ నన్ను వెలేశారు ఇలాంటి సమయంలో. నాకెలాగు వాటి గురించి పట్టింపు లేదు కాబట్టి ఎటువంటి ఆలోచనలు లేవు.... భ్రమలు లేవు ఈ విషయంలో.

  రెండు రోజుల  తర్వాత అసిస్టెంట్ జనరల్ అండ్ టెక్నికల్ మేనేజర్ని కలవడానికి వెళ్తే..  "మరో రెండు రోజులాగి రండి కలసి మాట్లాడదాం" అన్నారు, అలా రెండు మూడు సార్లు అయ్యాక..చివర్లొ కలిసి చర్చలు జరిగాయి, అవి ఎలాంటివి అంటే..  " మీరు ఏ సమస్య మీద ఇన్ని రోజులు ఇంటి వద్ద వున్నారు..? ఎందుకు..అన్ని రోజులు వుండాల్సి వొచ్చింది" లాంటి ప్రశ్నలు !! అన్నిటికి సమాధానం ఇచ్చాను కాని నా వ్యక్తిగత సమస్య యెక్క కాంటెంట్ ఏమిటన్నది చెప్ప లేదు..నాకిష్టం లేకపోవడంతొ..!  ఆ విషయాన్ని ఆయన పదే పదే గుచ్చి గుచ్చి అడిగే వారు. ఊహూ.....ఎన్ని సార్లు అడిగినా నేను తప్పించేవాడిని తప్ప చెప్పే వాడిని కాదు..అది పుర్తిగా నా వ్యక్తిగతం, అందరికీ తెలియనవసరం లేదనే భావనతో. అలా రెండు మూడు సార్లుగా మా మద్యన చర్చలు జరిగాయి..కాని నేను ఉద్యోగంలో కొనసాగాలా వద్దా అనే విషయం ఒక కొలిక్కి రావట్లేదు....!  ఆ చర్చల్లో  ’ఈ ఉద్యోగం నీకెంత వరకు అవసరం..? ఈ ఉద్యోగం లేకపోతే ఏమి చేయాలనుకొంటున్నావు’ లాంటి విషయాలు కూడ అడగారాయన.....కొద్ది కొద్దిగా నాకు అర్థమయ్యింది..ఇక చాలు ఈ నాన్పుడు ధోరణి అని అనుకొని..ముందునుండే రాజీనామా  ఉత్తరం జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను, ఎప్పుడు అవసరం వచ్చినా  ఇవ్వొచ్చనే ఉద్దేశంతో.

 వెంటనే నేరుగా  జనరల్ మేనేజర్ వున్న చాంబర్లోకి వెళ్లాను, ఆయన నన్ను చూడగానే.. " ఏంటి మీ విషయం ఇంకా అయిపోలేదా,  జాయిన్ కాలేదా ?" అడిగారు.  మా మద్యన జరిగిన చర్చల సారాంశం మొత్తం చెప్పాను, దానికాయన  "మీరు సరిగ్గా  అసిస్టెంట్ జనరల్ మేనేజర్ని  కన్విన్స్ చేయలేకపోతున్నట్లున్నారు"  అన్నారు,  "లేదండి వున్నవిషయాలన్నీ  చెప్పాను,  అంతకన్న నా వద్ద మరేమిలేవు"  నా సమాధానం.  "లేదు..లేదు మీరు సరిగ్గా అయన్ని కన్విన్స్ చేయనట్లున్నారు ..ఒక సారి ఆలొచించడి"  అన్నారు.  నాకు పూర్తిగా విషయం బోధపడింది...  "అంటే ఏ విధంగా   కన్విన్స్ చేయాలీ..?? ఏడ్చి... కన్నీళ్లు పెట్టుకొని... ఆయన కాళ్లు పట్టుకొంటే కానీ..కన్విన్స్ కారా..? అప్పుడూ కాని మీలో ఉన్న ఇగో సంతృప్తి చెందదా..?? సారీ సర్ నేనా పని చేయను" అన్నాను, నా మాటలకు ఆయన మొదట తెల్లబోయినా ఎన్నో ఢక్కా మొక్కీలు తిని ఈ స్థాయికి ఎదిగిన క్రమంలో నాలాంటి వారిని ఎందరినో.. ఎన్నో రకాల మనుషులు చూసి ఉన్న ... ఆ అనుభవంతొ  ఒక్క క్షణంలో వెంటనే సర్దుకొని "ఏం మాట్లాడుతున్నారు మీరు..? ఏమైనా అర్థమున్నదా?"  ప్రశ్నించారు. నేను మౌనంగా నా జేబులొ నుండి రాజీనామ ఉత్తరం తీసి ఆయన అందించాను.  ఆయనది చదవగానే.. "ఓహో..మీకు ఈ ఉద్యొగం అవసరం లేదన్న మాట" అంటు ఏమి మాట్లాడాలొ తెలీక అలా పలాయన వాదపు మాట వాడేసారు. "నా వృత్తే  అది...ఎక్కడైనా నేను చేయాల్సి ఉద్యోగమే అదైనపుడు  అవసరం లేకుండా ఎలా వుంటుంది..? నాకు అవసరం వున్నది కదా అని మీ అహాల్ని సంతృప్తి పరిచేంతగా నేను ఆత్మను చంపుకోలేను .... సారీ సర్"  అంటు మరో మాట మాట్లాడకుండా బయటకొచ్చాను.

  ఈ మేనేజర్స్ తత్వాలు నాకు చర్చల సమయంలో అర్థమయ్యింది, నాకు ఉద్యోగం చాలా అవసరమయి వుండాలి, కాని వారు ఉద్యోగంలో కొనసాగడం కష్టం అని చెప్పగానే నేను కళ్ల నీళ్లు పెట్టుకొని కాళ్లా వేళ్లా పడి బతిమాలాలి, అప్పుడు వారి అహం సంతృప్తి పడుతుంది.....దానితో వారు నా మీద సానుభూతి చూపిస్తూ.... జాలితో ఆ ఉద్యోగంలో కొనసాగించడానికి  అవకాశమిచ్చినట్లు ఇస్తారు.. మరో పక్కన రెండు గ్రూపులున్నాయి  కాబట్టి నేను మేనేజ్మెంట్ వారికి  నమ్మిన బంటుగా డిపార్ట్‌మెం‍ట్‌లో వుంటూ అక్కడ జరిగే విషయాలు చేరేవేయాలి.. ఒకే దెబ్బకు రెండు  పిట్టలు!! ఒకటి....మన పట్ల సానుభూతి చూపి వారి అహాన్ని తృప్తి పరుచుకోవడం, రెండవది నమ్మినబంటుగా పడుంటారుగా కదా..ఇది వారి ఆలొచన.

  ఇలా ఇక్కడే కాదు మనం చాలా చోట్ల ఇలాంటి సంఘటనలే చూడవచ్చు... మనకు ఏదైనా ఒక కావలసిన పని వుండి అది చేయవలసిన చోటకు వెళ్లి ఎన్ని సార్లు విన్నవించినా ’అంత సులభంగా ఆ పని కాదయ్య”  ససేమిరా అంటూ తలుపే మనుషుల వద్ద కాస్త ఏడుపు మొహంతో మాట్లాడివారికి కావలసింది వారికిస్తే గాని..పని అవదు.! తర్వాత తమ తోటి ఉద్యోగస్తులతో మాట్లాడే సంధర్భాలలో మన విషయం ప్రస్తావన రాగానే..  "ఆ...వాడి ఏడుపు చూడ లేక....పాపం పోనీలే అని చేసాను ఆ పని" అంటూ సెలవిస్తారు. అక్కడ ఏడవాలిసిన పని వుండదు..వారు చేయాల్సిన వారి విధి నిర్వహణను పక్కన బెట్టి..ప్రవర్తిస్తారు.కాని వీళ్లేదో జాలి పడి సానుభూతి తో  పని చేసినట్లు బయటకు చెప్పుకోవాలి. అదో తృప్తి కొంత మందికి.   తమ అహాన్ని సంతృప్తి పరుచుకొనే ఇదో రకపు సానుభూతి...!

                                                                 ***********

  మరో రకపు సానుభూతి..కథ....కమర్షియల్ గా ఇదెలా ఉపయోగపడుతుందో చూడండి.... ! కేరీర్ ఎదుగుదలలో సానుభూతి కూడ ఒక ప్రధాన భూమిక  వహిస్తుందేమో..!!?.

దారిద్ర్య రేఖ దిగువన ఉండే  మనుషుల కోసం, అలానే ప్రకృతి పరంగా అధార పడి జీవనం సాగిస్తున్న కొన్ని జాతుల, తెగల మనుగడ కోసం ఐక్యరాజ్య సమితి కొన్ని అంతర్జాతీయ చట్టాలను రూపొందించింది.  ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఆ చట్టాలను గౌరవిస్తూ పాలన సాగించాల్సిందే..ఈ విషయంలో.!  అయితే ఈ తెగలు, జాతుల జీవనపాది మీద సెజ్ ల  పేరుతోనో లేక అభివృద్ది పేరుతోనో .. దెబ్బ తీస్తుంటాయి చాలా దేశాలు..కారణం ఎక్కడో మారుమూలన ఉండే ఈ తెగల, జాతుల గురించి బయట ప్రపంచానికి చాలా వరకు తెలియదు..అలాంటిది ఎక్కడో వున్న ఐక్యరాజ్య సమితికి కూడ వీటి గురించి పెద్దగా  సమాచారం వుండదు. ఇలాంటి విషయాల మీద కొన్ని అంతర్జాతీయ సంస్థలు పని చేస్తూ వుంటాయి, ఎక్కడ ఈ తెగల మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందో గుర్తించి వాటిమీద ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చిత్రీకరించి, జాతీయ, అంతర్జాతీయ టి.వి చానల్లో ప్రసారం చేస్తూ ఐక్యరాజ్య సమితీ దృష్టికి తీసుకెళ్లతారు. ఇవన్ని చాలా స్వచ్చందంగా నిర్వహిస్తూ వుంటాయి కొన్ని సంస్థలు.

  అలాంటి ఒక అంతర్జాతీయ సంస్థ కొరకు డాక్యుమెంటరీ ఫిల్మ్ చిత్రీకరణ కోసం ఐదేళ్ల క్రితం ఆ ప్రాజెక్ట్  డైరెక్టర్ తో  కలసి థాయిలాండ్ వెళ్లాను, బ్యాంకాక్ నుండి అ సంస్థ యెక్క అక్కడి మరో ఇద్దరి కో ఆర్డినేటర్ లతో  కలసి మరో పది గంటల పాటు బస్సులొ ప్రయాణం చేసి మరసటి రోజు ఉదయం "పాంగా" అనే జిల్లా చేరుకొన్నాం. అక్కడి ప్రాంతీయ భాష మాకు తెలీదు కాబట్టి ఆ కో-ఆర్డినేటర్స్ మాకు, అక్కడి మనుషులకు మద్యన వారధులు, అనువాదకులు  కూడాను.

  థాయిలాండ్‌లో 2004 లో వచ్చిన సునామీ  వలన ఒక తెగ చాలా వరకు అంతరించిపోయింది, ఆ తెగ కొన్ని నెలలు పాటు సముద్రంలో చేపల పట్టడంలొ వుండిపోతారు, తర్వాత మరికొన్ని నెలలు మాత్రమే భూమి మీద జీవినం సాగిస్తారట, అలాంటి తెగలొ ఒకే ఒక 20 ఏళ్ల కుర్రాడు సునామీ  వచ్చిన సమయంలో మరో నగరానికి ఏదో  పని మీద వెళ్లడంతో..ఆ సునామి ప్రమాదం నుండి అతనొక్కడే మిగిలిపోయాడు. అంతే గాక అతనికి ఉన్న  కొద్దిపాటి భూములను కూడ అక్కడి ప్రభుత్వం "సెజ్" ల పేరుతొ లాక్కొంటున్నారు,  అతని తెగ పూర్తిగా తుడిచి పెట్టుకపోయింది, మరో పక్క  అతనికి ఉన్న  ఒకే ఒక జీవనాధారాన్ని కూడ అక్కడి ప్రభుత్వం లాక్కుంటోంది . అతనితో పాటు  మరి కొన్ని విషయాల మీద డాక్యుమెంటరీ ఫిల్మ్ చేసి..అంతర్జాతీయ వేదికల మీద పెట్టాలనే ఉద్దేశం ఈ సంస్థది. ఈ సెజ్ ల  గొడవ ఒక్క మన దేశానికే వున్నదని అనుకొన్నాను అప్పటి వరకు!! చుట్టుపక్కల దేశాల మీద కూడ చాలా ప్రభావమే వున్నదని ఈ సంఘటనతో నాకు అర్థమయ్యింది.

 ఇక ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ గురించి కాస్త వివరించాలి, ఈయన ఒక సత్ససాంప్రదాయ  కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన వ్యక్తి అయినా.. ఆయనలో చాలా వరకు కమ్యూనిస్ట్ భావాలు కనపడేవి, ఎన్నో పుస్తకాలు చదవారని, ఎంతో మేథస్సు వున్న మనిషని ఆయన మాటల్లొ అర్థమయ్యింది నాకు, అతనితో మాట్లాడుతుంటే..చాలా విషయాలు తెలియనవి తెలుసుకొంటూ వున్నాను..చాలా వరకు నేను వినడంలోనే వుండిపోయేవాడిని, నాతో మాట్లాడుతున్న కాలమంతా ఆయన చేతిలో సుదీప్ చక్రవర్తి రాసిన  "రెడ్ సన్" పుస్తకం ఉండేది..మద్య మద్యలో చదువుతూ వుండేవారాయన.అయితే అతను ఏ విషయాన్నైనా వివరిస్తున్న సమయంలో మధ్య మధ్యలో ఒక తమాషైనా మాట మాట్లాడే వారు , అతను చెబుతున్నప్పుడు నేను వింటున్న సమయంలో నా మొహంలో ఏ భావాలు కనపడట్లేదో లేక....వెర్రి మొహం వేసుకొని నించున్నట్లు కనపడే వాడినో  ఏమో కాని  "ఆహా..ఏమి లేదు నిన్ను ఎడ్యుకేట్ చేయాలని ఇవన్ని చెబుతున్నాను అంతే, ఏమనుకోవద్దు" అని పదే పదే ఇలా అంటూండే వారు.

  ఓ రెండు రోజుల పాటు అక్కడ వారి జీవన విదానం గురించి, నివాసాల సముదాయాల గురించి, సముద్రంలొ చేపల వేట ఎలా సాగిస్తారో వాటి విషయాల మీద కొన్ని దృశ్యాలను అక్కడక్కడ వున్న కొన్ని దీవుల్లో  చిత్రీకరించాం.  తర్వాత ఆ కుర్రాడి భూముల మద్యన వున్న ఇంటి వద్ద ఇంటర్‌వ్యూ చేయడం మొదలు పెట్టాం, అతని భాష మాకు..మా భాష అతనికి తెలియవు, ఇంగ్లీష్ కూడ రాదు మద్యలోదుబాసీలు గా  వున్న కోఆర్డినేటర్స్ ద్వారా ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబడుతున్నాము.

   అతను తన కుటుంబాన్ని సునామీలో  పోగొట్టుకొన్న వైనాన్ని, తనొక్కడే మిగిలిపోయినా తన భూముల్ని తనే పండించుకొంటు జీవనం సాగిస్తున్న విధానాన్ని వివరంగా చెప్పుకొస్తున్నాడు..భాష తెలియక పోయినా అతని మాటల్లోని భావం మాకు అర్థమవుతున్నది, నిజంగా తన వాళ్లందరినీ పోగొట్టుకొని ప్రపంచంలో ఒంటరిగా వుండటమన్నది, మనకు పెద్దగా అనిపించక పోవచ్చు కానీ  అనుభవిస్తున్న ఆ కుర్రాడికి  తన ఒంటరి తనపు భాద తాలుకా తెలుస్తుంటుంది, అయినా కూడ ఎక్కడా తన బాధను  వ్యక్త పరచట్లేదు, అలానే సెజ్ లో  భాగంగా కోల్పోతున్న తన భూములను తనకే మినహాయించమని కోరుకొంటున్నాడే కాని ఎక్కడా కూడ ఏడుపు రావట్లేదు! కనీసం  ఏడుపు మోహంతో  దైన్యంగా కూడ మాట్లాడటం లేదు.  చూస్తున్న మాకు కాస్త లోపల ఎక్కడో కదిలిస్తున్నది కాని ఆ కుర్రాడిలొ మాత్రం ఎటువంటి దుఃఖం, బాధ  వ్యక్తం కావట్లేదు. అలానే తన మాటల్లో ఎక్కడ కూడాను తమను పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడం చేయట్లేదు. ప్రభుత్వం గురించి చాలా గౌరవంగా మాట్లాడుతూ తన పరిస్థితిని అర్థం చేసుకొని తన భూములను తనకే వదిలేయమని కోరుకొంటున్నాడు. నాకు చాలా గొప్పగా అనిపించింది అతని తత్వం, అదే విషయాన్ని నా వెనుకే కూర్చోని వున్న మా డైరెక్టర్తో  "చాలా బాగా మాట్లాడుతున్నాడు కదా "  అన్నాను

  దానికి ఆయన...."హయ్యో...అంతా బాగానే చెప్పాడు కాని... కొద్దిగా కూడ కన్నీళ్లు రావట్లేదు, కనీసపు ఏడుపు  మొహం కూడ పెట్టట్లేదు ..హ్మ్...ప్చ్..అలా కాదు కాస్త ఏడిస్తేనే చూసే వాళ్లకు బాగా ఎఫెక్టివ్ గా  వుంటుంది, మనకు కూడ గొప్పగా చేసినట్లు పేరు వొస్తుంది, ప్చ్ ఏడ్చి, కన్నీళ్ళు పెట్టుంటే చాలా బాగుండేది....అయ్యో....ఎఫెక్ట్ పోయిందే.."  అంటూ తల అడ్డంగా ఆడిస్తూ బాధ  పడుతున్నాడు. నాకు ఒక్కసారిగా అర్థం కాలేదు..ఏమి కోరుకొంటున్నాడు ఇతను...? తను చేస్తున్న ఫిల్మ్ కి మంచి ప్రశంసలు రావాలంటే మనుషులు ఏడవాలా..? దాని నుండి వచ్చే సానుభూతే ఇతని ప్రతిభకు తార్కాణమా ? మంచి కంటెంట్ వుండి ఒక అసలు సిసలైన  "మనిషి" ని ఇంటర్‌వ్యూ చేస్తున్నాము అని అనిపించింది నాకు, మరి ఇతనేంటి..దీని నుండి ఏమి కోరుకొంటున్నాడూ....? తను చేసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ పది మంది చూసి కంట తడిపెట్టి  "వావ్ చాలా బాగా చేసావయ్యా" అని  సానుభూతి తో  కూడిన ప్రశంసలు, అభినందనలు  వస్తే... అప్పుడు కానీ తనొక గొప్ప ప్రాజెక్ట్ చేసినట్లుగా భావించడా? సానుభూతే ఇతని ప్రతిభకు రుజువా?

 నాకు ఒకే సమయంలో పరస్పర విరుద్ధ  భావాలున్న మనుషుల తత్వం అనుభవం ఎదురైంది అనిపించింది. ఒకరిది ఖేదం..మరొకరిది వ్యాపారం..! వాస్తవంగా తన వాళ్లందరినీ పొగొట్టుకొన్న ఒక కుర్రాడు కంట తడిపెట్ట కుండా మాట్లాడడం అన్నది మనకు అదొక గొప్ప నిబ్బరం కలిగిన మనిషిగానూ..మనోధైర్యం వున్న మనిషిగానో అనిపిస్తుంది. అది మన భారతీయ జీవన విధానంలో పెరిగిన ఒక కోణం నుండి చూస్తే అలానే అనిపిస్తుంది, ఇలాంటివి ఏ కోణమనే రంగుటద్దం లేకుండా  యధాతదంగా ఈ థాయ్ కుర్రాడిని చూస్తే, అది అతి సర్వ సాధారణం  వారికి. వారి జీవన విదానమే అలా వుంటుంది..ఎక్కడ జాలి కోసం ఏడవరు, ప్రతీది ఎదుర్కోవడానికి అలవాటు బడ్డ మనుషులని అర్థమవుతుంది, అక్కడ ఈ మనో నిబ్బరం, మనోధైర్యం లాంటి భావాల గల పద బంధాల  అవసరమే వుండదు. .  కాని మనం మన భారతీయ జీవన విధానం లో పెరిగిన కోణంలో నుండి చూస్తే  "అబ్బా ఎంత నిబ్బరం గల మనిషి ఆహా.." అంటూ గొప్పగానో..  అబ్బుర పడుతూనో  చూస్తాం... అలా అనిపిస్తుంది మనకు.

  మరి ఎంతో మేధస్సు వుండి, ప్రపంచ చరిత్రల మీద, వ్యక్తుల మీద ఎంతో అవగాహన వున్న ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ అయిన ఈ మనిషి యెక్క తత్వం చూడండి ఎలా వున్నదో..?? సానుభూతితో తన ఎదుగుదలకు మెరుగు దిద్దుకోవాలనుకొంటున్నాడు. మేధస్సు వేరు  మనిషి తత్వం వేరు..అన్నది ఇలాంటి అనుభవాల ద్వారా మనకు అవగతమవుతుంది, ఇవెప్పుడు కలవని రెండు రైలు  పట్టాలు లాంటివి, దేని దారి దానిదే అని నిరూపిస్తుంది !  అక్కడేమో ఏమి చదువుకోని, అసలు బయట ప్రాపంచిక ఙ్ఞానమే లేని ఒక కుర్రాడి తత్వం దీనికి పూర్తి భిన్నంగా వున్నది.  పెరిగిన జీవన విధానం  కూడ మనుషుల మీద చాలా ప్రభావం చూపుతుందన్నది సుస్పష్టం.

 అంటే ఈ సానుభూతి వ్యాపార వస్తువుగా ఎంతగా  ఉపయోగ పడుతున్నదో......మనం నిత్యం టి.వి లలో ప్రతిభా పరమైన పోటీలు చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ ప్రోగ్రాములన్నీ  మల్టీ కెమరాస్ సెటప్ తో షూట్ చేస్తుంటారు. ఆ పోటీలలో ఎవరొ ఒకరు ఓడిపొక తప్పదు...అప్పుడు ఓడిపోయిన ఆ సదరు వ్యక్తి/పిల్లలో  ఖచ్చితంగా ఏడుస్తారు, వెంటనే ఈ ఫొగ్రాంని రికార్డ్ చేస్తూ నిర్వహిస్తున్న దర్శకుడు వెంటనే తన పి.సి.ఆర్ అనే రికార్డింగ్ గది నుండి  టాక్ బాక్ తో కెమరా మన్  కిసూచనలు ఇస్తాడు..." హే మ్యాన్  వెంటనే వెళ్లు... ఆ ఏడుస్తున్న మొహాన్ని క్లోజ్ అప్ చూపించు..జూమ్ చేయ్..పాస్ట్ మ్యాన్ ఫాస్ట్....ఏడుపు ఆగిపొతుంది..ఆగిపోయేలోపల జూమ్ వెళ్లూ... పట్టుకొ ఆ ఏడుపుని "  అంటు తొందర పెడుతూ వుంటారు.  ఆ ఏడుపు సీన్ ఎక్కడ మిస్ అవుతామో అనే భయం..! ఆ ఉద్వేగాలను టి.విలలొ చూపి..తమ తమ రేటింగ్స్ పెంచుకొవాలి..అది అలా జరిగితే ఆ ఫోగ్రాం చేస్తున్న డైరెక్టర్ కి ఆ ఫోగ్రాంకు కూడ మంచి ఫేరొస్తుంది.. "చాలా బాగా చేసావయ్యా...గుండెలు పిండేసావు..అందరివీ..! మంచి పేరొచ్చింది"  అనే ప్రశంస కోసం, అభినందన కోసం పడే పాట్లు  అవి ! అక్కడి మనుషుల ఉద్వేగాలతో ఎటువంటి అనుసందానం వుండదు వీరికి..కేవలం  మనుషుల ఉద్వేగాలతో వ్యాపారం చేయడానికి బాగా అలవాటు పడ్డారు. ఎంత ఉద్విగ్నిత వుంటే అంత లాభాసాటి, గొప్పగా చేసావనే మెచ్చుకోలు...మనుషులకు..!  ఒకరి ఏడుపుల సానుభూతితో మరొకరికి ధనలాభం..వ్యాపారం.

  మరొ సానుభూతి కథతో ఈ కథను ముగిస్తాను తొందరలో............

10 comments:

మంచి టపా.

మన భారతీయ పెంపకాలే అలా వున్నాయనుకుంట. వుహ తెలిసిన నాటి నుంచి ఒకరి ఆధీనంలో వుంటూ మెప్పు పొందటానికి అలవాటుపడతాం. వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోవటం, మనో ధైర్యాన్ని పెంచుకోవటం, సమస్యను పరిష్కరించుకునే skills నేర్చుకునే వారు తక్కువే . ఆ ప్రక్రియలో సానుభూతి అలవాటైపోతుంది.

సానుబుతులగురించి చాలా పరిసొదన చేసినట్టు వున్నారు . రొండుటపాలూ, చాలా బాగా చెప్పేరు.

ఏడుపులు,..సానుభూతి,..అవును అదే అలవాటు చేసేస్తున్నాం చిన్నప్పటినుంచి,..ఎడవగానే ఓ చాక్లేటో,బిస్కెటో కోనివ్వడం నుంచి మొదలవుతుందేమో ఇది.

భలే రాస్తున్నారు !
గుండెల్లో , కళ్ళ లో తడి ఉండటం తప్పు లేదు కానీ దాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రదర్శించే వాళ్ళని చూస్తే గా నిజం గా చిరాకు పుడుతుంది .
I completely agree with Praveena gaari comment !

చక్కని అంశంతో గొప్పగా వ్రాస్తున్నారు.

మీ ఆత్మాభిమానం ప్రశంసనీయం.

సానుభూతి, ఇగో, ఆత్మాభిమానంలను కాసేపు అటుంచితే, ఆ జెనరల్ మేనేజర్ స్థానంలో మీరుంటే అలాంటి సమయాల్లో ఏంచేసేవారు? :)

@ప్రవీణ,
మీరు చెప్పిన విషయం చాలా వరకు నిజమేనండి, ఓపిగ్గా చదివి కామెంట్నందుకు థ్యాంక్యూ.

@అపరిచితుల వారికి,
పరిశోదన కాదు నాకు ఎదురైన సంఘటనలవి, థ్యాంక్యూ..

@the tree,

తాయాలాలు ఇవ్వడంతో మొదలవుతుంది అంటారా..హ..హ..హ..హ ! థ్యాంక్యూ

@Sravya Vattikuti గారికి
ఏడుపు ప్రదర్శనలు చాలా వరకు సానుభూతి కొరకే వుంటాయేమో అనిపిస్తుంది నాకూనూ..! థ్యాంక్సండి చదివినందుకు.

@ జ్యోతిర్మయి గారికి
గొప్పగా అని కాదు కాని..నాకు ఎదురైనవి రాస్తున్నను, మీ కామెంట్‌కు చాలా థ్యాంక్సండి.

@SNKR అన్నా..! నా ఆత్మాభిమానం కాసేపు పక్కన పెడదాం. నా వ్యాసం ముఖ్యొద్దేశం..కేవలం ఏడుపులు సానుభూతి ల పైనే.. సరే మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. ఆ మేనేజర్ స్థానంలో నేనుండూంటే..ప్రధానంగా రెండు అంశాల మీదనే అదీను ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూనే పాటిస్తాను

1. కంపెనీ నిబందనలకు అనుగుణంగా స్పందించడం.
2. ఆ ఉద్యోగి మంచి ప్రతిభావంతుడైతే..ఖచ్చితంగా అంతటి ప్రతిభ గల వాడిని ఏ కంపెనీ వదులుకోదు, యజమాన్యంతో మాట్లాడి అయినా సరే అతన్ని ఆ ఉద్యోగంలో కొనసాగించేలా చర్యలకు పూనుకోవడం.

అంతే కాని వృత్తి ధర్మాన్ని కాదని నా "వ్యక్తి వాదాన్ని" అక్కడ అమలు పరచను.

మీ జవాబు నచ్చింది. మీరు సానుభూతికి లోనవ్వలేదు. :)

ఏడ్పులు-సానుభూతి మన మనసును వత్తిడిని తగ్గించి, తృప్తి కలిగిస్తాయని మానసిక వైద్యులు అంటారు. ముక్కుచీదేసే ఆడవాళ్లకన్నా మగవాళ్ళు త్వరగా గుండెపోట్లకు లోనుకావడంలోని రహస్యం ఇదే నట.

వద్దురాబాబో అన్నా, ఏడవకున్నా 'మీ వూరికొస్తా, మీ పేటకొస్తా, మీ నట్టింటికొచ్చి ఓదారుస్తా' అనే వాళ్ళుండగా, మనకేమిటి చెప్పండి. :)

<>
చాలామంచి విశ్లేషణ.

This comment has been removed by a blog administrator.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs