మా కాలనీ నిండా ఎక్కువగా బ్యాచలర్స్ వుండటం మూలాన టిఫెన్ సెంటర్స్, కర్రీపాయింట్స్ పుట్టగొడుగుల్లా వెలిసాయి. అన్ని కర్రీ పాయింట్స్ దగ్గర విపరీతమైన జనాలుంటారు అయితే ఇదే విదంగా అన్ని టిఫెన్ సెంటర్స్‌కు ఉండదు వాటి వాటి రుచులను బట్టి ఒకటి రెండు టిఫెన్ సెంటర్స్‌లలో గుంపు ఎక్కువగా వుంటుంది. చాలా వరకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, సినిమా పరిశ్రమలో పనిచేసే చిన్న చిన్న సాంకేతిక నిపుణులు వుండే ప్రాంతమది. కుల,మత,ప్రాంతీయాలకు అతీతంగా జనాలుంటారు.

    అలాంటిచోట రెండేళ్ళ క్రితం ఒక కుటుంబలోని వయసు మల్లిన భార్య భర్త, వారి కొడుకు కలసి తమ ఇంటి ముందున్న కాలనీ రోడ్ మీదే చిన్న తోపుడు బండితో చిన్న సైజు టిఫెన్ సెంటర్ ప్రారంభించారు. నేను మొదట్లో అంతగా వారి గురించి గమనించలేదుగాని రోజుకు రోజుకు అక్కడ గుంపు పెద్దదవడంతో నాచూపు అటువైపు మళ్లింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒకప్పుడు బాగానే బతికనే కుటుంబమే అయినా కాలగమనంలో చితికిన జీవితాలులాగ కనపడుతున్నారు. ఆ బండి చుట్టూ విపరీతమైన జనాలు, మంది ఎక్కువయితే టిఫిన్ అందడానికి చాలా సమయం పడుతున్నది, ఎంతా ఆలశ్యమైనా ఎదురుచూస్తున్నారేగాని పక్క టిఫెన్ సెంటర్స్ వైపు వెళ్ళట్లేదు దానికి కారణం మనింటిలో చేసినట్లుగా రుచి,శుచి వుండడంతో జనాల తాకడి ఎక్కువగా ఉంది. సహజంగానే నా కాళ్ళు కూడ అటువైపు వెళ్ళడం ప్రారంభించాయి.

    అయితే మనుషుల్లో ఉండే ఈర్ష, పోటీ తత్వంలో ఎక్కడ వెనకపడిపోతామోనన్న భయం మూలాన వారి పక్కనున్న తోటి టిఫెన్‌సెంటర్స్ వారే వీరుండే ఇంటిఓనర్‌తో కుమ్మక్కై అక్కడనుండి ఇల్లు ఖాలీ చేయించారు. విచిత్రమేమిటంటే పక్క టిఫెన్‌సెంటర్ వాళ్ళు కూడ తెలంగాణ ప్రాంతం వాళ్ళే, ఇక్కడ బతుకు భయానికి,ఈర్షకు.. కుల,మత,ప్రాంతీయభేదాలు, తమపర అంటూ తారతమ్యాలుండవు అందరిదీ బతుకు పోరాటమే. బతుకు బండిని నడపక తప్పదు కాబట్టి మరో ఐదారు ఇల్ల పక్కనే మరో ఇంటికి మారి అక్కడ టిఫెన్‌సెంటర్ తిరిగి ప్రారంభించారు. రుచి,శుచి ఎక్కడ వుంటే అక్కడికే జనాలు మూగుతారు అలా వారి కస్టమర్స్ మళ్లీ వారి వద్దకే వచ్చారు.

     నేరు తరచుగా వెళ్తుండడం వలన వారితో చనువు పెరిగింది, నాకే కాదు అక్కడికొచ్చే వారంతా వారితో ఒక కుటుంబ సభ్యుల్లా  మెలిగేవారు్. చతురోక్తులు విసురుతూ వుంటారు, తమాషా మాటలు, నవ్వులు, మరి కొందరి తమ తమ ఇంటి విషయాలుకూడ మాటల సందర్భంలో ప్రస్తావిస్తావుంటారు. అక్కడికొచ్చే బ్యాచలర్స్ అంతా రాష్ట్ర నలమూలలనుండి ఉపాధికోసం నగరానికొచ్చిన వారే, అందులో అన్ని ప్రాంతాల వారు వున్నారు, వారికే బేదాలు లేవు... ప్రాంతీయతత్వం మీద జోకులు కూడ వేస్తూ వుంటారు, " ఆంటీ తెలంగాణ దోశ వేయండి " అని ఒకరు, మరొకరు " ఆంటీ సర్కార్ పూరి వేయండి " ఇలా ఎవరికి తోచినట్లు వారు హాస్యాలాడుతూ వుంటారు. అక్కడ వంట చేసే కార్యక్రమంతా పెద్దావిడది, ఆమె వయసు 55 వుండొచ్చేమో. వచ్చిన కస్టమర్స్‌కి టిపేన్ సప్లై చేయడం, పార్శిల్స్ కట్టడం, మిగతా చురకైన పనులన్ని ఆమె కొడుకిది, ఆ కుర్రాడు డిగ్రీ చదువుతున్నాడు.  తిన్నవారి వద్ద నుండి డబ్బు వసూలు చేసే పని పెద్దావిడ భర్తకు అప్పగించారు. అంతే కాక రోడ్ నిండా టిఫెన్ తింటు నిల్చున్న జనాలని అటు ఇటు తిరిగే వాహనాలకు అడ్డు తొలిగించి పక్కకు జరపే పని కూడ ఆయనదే.

    నేను అక్కడికి వెళ్ళిన సమయంలో ఆ పెద్దావిడతో మాటలు కలిపేవాడిని. ఆవిడ మాటలు బలే చమత్కారంగా వుంటాయి. ఒకరకంగా ఆ చమత్కార మాటల కోసమే వెళ్తున్నానేమో అనిపిస్తింది నాకు. నేను నిక్కర్లు వేసుకొనే వయసులో చూసిన " మంగమ్మ గారి మనవడు " సినిమాలోని భానుమతి గారు గుర్తుకొస్తారు ఈవిడ మాటలు వింటే. ఆమె నోట సామెతలు, ఉపమానాలు చాలా సులభంగా ఆశువుగా వస్తూవుంటాయి. అవి చాలా గమ్మత్తుగా, కొత్తగా ఎప్పుడు విననవి వుంటాయి. ఒకరోజు ఉదయం జనాలు తాకిడి ఎక్కువయింది. అందరికీ టిఫిన్ సప్లై చేయడానికి కావలసిన టిఫిన పధార్థాలు లేవు, వంట తొందరగా కావడంలేదు అలాంటి సమయంలో ఆవిడ కొడుకు వెంటనే వంట చేస్తున్న వాళ్ళమ్మ వద్దకు వెళ్ళి ’నీవు తప్పుకో ’ అంటూ పూరీలు చేసే పని అందుకొన్నాడు. ’రేయ్ నడవరా నీవు, నేను చేస్తాను పదా ’ అని అరిచినా వినట్లేదు ఆమె కొడుకు. ఒకటి రెండు నిమిషాలకు తర్వాత అతను చేస్తున్న పూరీలు చూసి
 " మీ అమ్మగారే బాగా చేస్తున్నారు వంట, నీవు చేసిన పూరీలు చూడు ఎలా మాడిపోయాయి "  అన్నాను నేను
" మరదే... గాజులు లేని చేయి వంట చేస్తే గట్లనే వుంటది "  అందావిడ
చుట్టు వున్న వారు నవ్వేశారు,  బలే వున్నాయే ఆ మాటలు, ఆ భావం అనిపించింది నాకు. ఇంతలో నాపక్కునున్నవాడు అందుకొని
" గాజులే కదా ..? వంట చేస్తున్న మీ అబ్బాయి చేతులకు గాజులు వేస్తే సరిపోతుందిలేండి "  అన్నాడు.
మేమలా నవ్వుకుంటున్న సమయంలోనే.....
 కాలం చెల్లిన, రంగు వెలసిన ఒక చిన్న సైజు ’ఆకురౌడి ’ చిన్న మోటర్ బైకు వేసుకొని టిఫిన్ బండి వద్దకు వచ్చాడు. బహుశ పూర్వాకాలంలో ఒక వెలుగు వెలిగుంటాడేమో మరి..?? బండిని రోడ్డుకు అడ్డంగా పార్క్ చేసి వచ్చాడు. అది చూసిన పెద్దావిడ  
" అన్నా జర లోనకు బండి పెట్టరాదే వీధికడ్డంగా వుంది ఎవరోకరు ఏదో ఒకటి అంటారు "  అన్నది
" అరే.... మన వీధే...మనల్నెవరు అంటారు "  తిరుగు సమాధానం.
వెంటనే ఆవిడ చాలా స్పాంటినియస్‌గా...... " మనింటి దీపమే కదా అని...ముద్దాడితే మూతి కాలిపోదూ ... జరా లోపలకి జరపన్నా.."   అన్నది.
ఆ మాటతో నాలోని మనిషి ఉలిక్కిపడి..భావం అర్థమై..వస్తున్న నవ్వును ఆపుకోలేక పుసుక్కున పకపకా అని బయటకు నవ్వేశాడు. సామెత భలే వుంది నాకయితే " కేక " అనిపించింది.
వెంటనే తల తిప్పి నావైపు ఉరిమి ఉరిమి చూపులుతో చూశాడా ఆకురౌడి.
" ప్చ్..య్యా " అనుకొన్నా. ఆవిడ అంత చెప్పినా వినడే..! బాగా చదువుకున్న వాళ్ళే  ’సివిక్ సెన్స్ ’ అవగాహన వున్నాకూడ నిర్లక్ష్యదోరణి అవలింబిస్తారు..మరి ఒకప్పటి ఆకురౌడి వింటారా చెప్పండి.

4 comments:

''దీపం మనదే కదా అని ముద్దేట్టుకుంటే మూతి కాలుద్దంట'' ఈ సామెత నేను బ్యాచిలర్స్ చేసేప్పుడు విన్నానండి..సందర్బం వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాడుతుంటాను...మొదటిసారి విన్నప్పుడు నాక్కూడా '' కేక '' అనిపించిందండి.

@శరత్'కాలమ్ '
మీ స్మైలీకి థ్యాంక్స్.
@ప్రబంధ
అవునాండి, నేను అదే మొదటి సారిగా ఆ 'సామెత ' వినడం అందుకే వినగానే నవ్వు ఆపుకోలేకపోయాను, మీ కామెంట్‌కు థ్యాంక్స్.
@నేస్తం గారు, హాస్యానికే పట్టపు రాణి మీరు. అలాంటి మీ మొహంలో నవ్వు చిందించిన టిఫెన్ సెంటర్ ఆవిడకు థ్యాంక్స్ నేను చెప్పుకోవాలి. మీకు కూడ థ్యాంక్స్.

:) బావుంది.

> దీపం మనదే కదా అని ముద్దేట్టుకుంటే మూతి కాలుద్దంట
:-)

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs