యాగంటి

      కర్నూల్ జిల్లా బనగాన పల్లెకు 15 కి.మీటర్ల దూరంలో యాగంటి గ్రామంవద్ద " యాగంటేశ్వర " అని ప్రసిద్ద శైవపుణ్యక్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రమునకు వెనుక భాగామున ఎత్తైన " ఎర్రమల " కొండలు, గుహలు ఉన్నవి. ఇక్కడి ఆలయంలో ఈశ్వరుడు లింగాకారములో గాక విగ్రహరూపంలో వుండడం ఒక ప్రత్యేకత. నందిరూపంలో విగ్రహం భయంకరంగా ఉన్నది,  భూమిని చీల్చుకొని నందీశ్వరుడు వెలికి వచ్చాడని. అచట ఆలయము నిర్మించి పూజలు జరిపారని అక్కడి స్థానికుల కథనం. ఇక్కడి ఈశ్వరుడిని నందీశ్వరుడు అని పిలుస్తున్నారు. ఇక్కడే అగస్త్య మునీశ్వరులు చేసిన తపస్సుకు మెచ్చి మునీశ్వరులు కోరిన విధంగా ఏకశిలలో శ్రీఉమామహేశ్వర్లుగా వెలిసినారని, లింగాకృతిలో కాకుండా శిలాకృతిలో వెలసిన శివక్షేత్రము భారతావనిలో ఎచ్చటా లేదని ప్రతితి.

       ఇక్కడి నిర్మాణల శైలినిబట్టి క్రీ.శ 7.8 శతాబ్దములలో పల్లవులు, చోళులు, చాళుక్యులు,  ఒకరి తర్వాత మరొకరు నిర్మించి, కొన్నినిర్మణాలను అసంపూర్తిగా వదిలివేయగా... వాటిని క్రీ.శ. 13.,14 శతాబ్దాలలో విజయనగర ప్రభువులు పూర్తిగావించారని విశ్లేషుకుల అంచనా. నేనిక్కడికి రావడానికి మరో ముఖ్యమైన కారణం..ఈ ఆలయ ముఖమండపములోని ఈశాన్య భాగములోనున్న నందీశ్వరుడు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాడట. అక్కడున్న పరిస్థితిని చూస్తే నిజమనేనిపిస్తుంది..! నందీశ్వరుడు చుట్టూ వున్న నాలుగుస్థంబాల మంటపం నిండా నందీశ్వర విగ్రహం నిండి ఉన్నది..రెండు స్థంబాలు కొద్దిగా పక్కకు జరుగుతున్నాయి..అవి పడిపోకుండా కొన్ని బండరాళ్ళును ఆసరగా వుంచారక్కడ.

      మీరు ఫోటోలలో చూస్తే అర్థమవుతుంది. సుమారు 90  సంవత్సరాలక్రితం ఆ నాలుగు స్తంబాలలోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షణలు చేసేవారట..!! కాని నేడు మాత్రం అలాంటి అవకాశమేలేకుండా పూర్తిగా మంటపం నిండుగా పెరిగిపోయాడు. భారత పురావస్తుశాఖ వారి లెక్కల ప్రకారం ప్రతి 20 ఏళ్ళకు ఒక అంగుళం పరిమాణంలో పెరుగుతూ వస్తున్నదట ఈ నందీశ్వర విగ్రహం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలఙ్ఞానంలో " యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగానంతమున లేచి కాలుదువ్వి రంకె లేసేను " అని వ్రాసారట. కాబట్టి ప్రస్తుత మీడియాలో చూపుతున్న 2012 గోల గురించి జనమంతా మరిచిపోవచ్చు..!!


       ఈ దేవాలయం వాయువ్యదిశకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ సహజంగా వెలసిన అగస్త్య పుష్కరిణి కనపడుతుంది, నేనెల్లిన సమయంలో మన పూర్వీకులు పుష్కరిణిలో జలకాలాడుతున్నారు..  మన పూర్వీకులంటే అర్థం కాలేదా..?  అదేనండి మన వా’నరులు’పుష్కరణీకి రెండు వైపులున్న ప్రాకారముల మీద నుండి డిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ ఆటలలో స్విమ్మింగ్ డైవ్ చేసినట్లుగా ఈ వానరలు చేస్తుంటే చూట్టానికి బలే ముచ్చటగా వుంది..ముందే కోతులు..ఇక మనుషులు ఎవ్వరూ లేకపోవడంతో వాటి ఇష్టారాజ్యంలాగ డైవింగ్..స్విమ్మింగ్..యమ ఫాస్ట్‌గా చేస్తున్నాయి.
      ఈ క్షేత్రమునకు 15 కి.మీ దూరములోనున్న " ముచ్చట్ల " క్షేత్రమునుండి పర్వతశ్రేణుల గుండా నీరు ప్రవహించి ఇక్కడి అగస్త్య పుష్కరణిలో కలుస్తాయి. ఈ పుష్కరణీలోను సహజసిద్దమైన నీటి ఊట ఉన్నది స్వచ్చంగా తేట తెల్లగా ఉన్నాయి నీరు. దీనికి ఉత్తరభాగానున్న పర్వతరాయికి దేవనాగరలిపిలో ఆ విశేషాలు చెక్కబడి వున్నాయి. ఇక్కడ నుండి ఆలయానికి ముందుభాగానున్న పెద్దకోనేరుకు చేరుకుంటాయి. అక్కడ నుండి ఆ క్షేత్ర పరిసరప్రాంతంలో నున్న 20 ఎకరాల భూమిలో సాగుకు మాత్రమే పరిమితమై ఇంకిపోతున్నాయి.


      ఈ క్షేత్రమునుకు వెనుకభాగాన ఆలయము చుట్టూ అర్థచంద్రాకరాంలోనున్న " ఎర్రమల " కొండల వద్దకు చేరుకుంటే అక్కడ మూడు గుహలు 50 అడుగుల మద్యదూరంతో పక్కపక్కనే వున్నవి. మొదటిగుహను " రోకళ్ళ గుహ " అని పిలుస్తున్నారు. చాలా పెద్దగుహ లోపలికి వెళ్ళడానికి తాపలు వున్నాయి కాకపోతే ఏటువాలుగా కంటే కాస్త నిటారుగా ఉన్నాయి. అవెక్కి పైకి వెళ్ళాక అక్కడ ఒక శివలింగం కనపడుతుంది. అగస్త్యముని శివలింగప్రతిష్టాపన చేసి అక్కడే  ధ్యాన సాదన చేసారని అక్కడి వారి విశ్వాసం.

      రెండవది వేంకటేశ్వర గుహ. ఇక్కడ వేంకటేశ్వర విగ్రహ ప్రతిష్టాపనలో జరిగిన కొన్ని పొరబాటుల వలన, విగ్రహపతిష్టకు అనర్హముగా భావించి విగ్రహాన్ని ఇక్కడ బద్రపరిచారు. మూడవది శంకర గుహ.. ఇక్కడ ఏంతో మంది మునీశ్వరులు తపస్సు చేసారని చెబుతున్నారు..తర్వాత చాలా మంది ప్రశాంతముగా ధ్యానము  చేసుకొనటకు ఈ గుహను ఉపయోగించారట.


















      ఇక్కడి గుహలలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేస్తూ కాలఙ్ఞానము రచించాడనీ.. ఆ సమయములో ఆయన నోట " ఏన్ కంటిని " అన్న మాట వెలుబడనదనీ అప్పటినుండి ఈ ప్రాంతాన్ని " ఏన్ కంటిని " అనిపిలుస్తూ...కాలక్రమేనా " యాగంటి " గా రూపాంతరం చెందిందని అంటున్నారు. ఇక్కడి గుహ లోపలి భాగములో కాలఙ్ఞాన గ్రంథము పూర్తి ప్రతి లభ్యము కావచ్చని కొందరి భావన.




       బనగాన పల్లె నుండి ఈ క్షేత్రానికి వెళ్ళే మార్గమద్యలో 12 వ కి.మీటర్ వద్ద కుడి వైపున చిన్న గుట్టాలంటి ఎత్తైన ప్రదేశంలో  పాతకాలం నాటి ఒక భవంతి కనపడుతుంది. చూడడానికి గంభీరంగా ఉంటుంది. 400 సంవత్సరాల క్రితం బనగానపల్లె నవాబు తన ప్రేయసికోసం నిర్మించిన భవంతి. ప్రస్తుతం అది హైదరాబాద్‌లో ఉన్న నిజాం నవాబుల ఆదీనంలో ఉన్నది. వాళ్ళు ఎవరోగాని ఈ భవంతి ఆలనాపాలనా చూడట్లేదు. వెలుపలి భవనమంతా చూడడానికి చాలా గంభీరంగా ఉంటే..లోపల మాత్రం చాలా ధారుణంగా ఉంది. రాత్రిల్లు అసాంఘీక మనుషులొచ్చి తాగి తందనాలాడి లోపలి గదులన్ని మురకిపట్టించారు.  మొదటి అంతస్తులో వున్న హాలు గదియెక్క  పైకప్పు పడిపోయి ఉన్నది. అక్కడొక మనిషిని వున్నారు కాని..అతనివల్ల ఆ భవనాన్ని ఎటువంటి రక్షణ లేదు. కాని భవనం మొత్తం రాతితో నిర్మించారు.  ఇప్పటికైనా భారత పురావస్తు శాఖ వారు ఈ భవనాన్ని స్వాదీనం చేసుకొని, మరమత్తులు చేసి ఒక యాత్రాస్థలంగా మారుస్తే బాగుంటుంది.

మరి కొన్ని ఫోటోస్ కింద చూడండి.






                                                      
                                                           -  మహానంది  -

      ఈ క్షేత్రం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాయలసీమప్రాంతంలోనే గాక కన్నడ, తమిళ రాజ్యాలలో కూడ ప్రాచుర్యం పొందింది. నంద్యాల మండలమునకు 12  కి.మీ దూరాన నల్లమల కొండల్లో ప్రకృతిసిద్దమైన సుందరప్రదేశమున అర్థచంద్రాకారముగా నున్న ఒక కొండవొంపులో ఈ క్షేత్రము వున్నది. ఇక్కడకు చుట్టుపక్కల పదహైదు కిలోమీటర్ల పరధిలో ప్రథమనంది, నాగనంది, వినాయక నంది, శివనంది, సూర్యనంది, విష్ణునంది, సోమనంది అని ఎనిమిది నందీశ్వర క్షేత్రాలున్నవి, మహానందితో కలిపి నవనంది క్షేత్రాలు అంటారు. వీటి ప్రాదుర్భవాన్ని గురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నవి. ఈ నవనందీశ్వరాలయములు ప్రాచీన చాళుక్యుల కాలమునాటివని కొందరంటారు.
     మహా నందీశ్వరాలయనికి చుట్టూ " తిరుచుట్టు మాళియ " అనబడే చుట్టు మండపము వున్నది. మద్యలో కళ్యాణమంటపాదులు ఉన్నవి. ఆలయ విమానం అంతస్తులుగా విభజింపబడి నిర్మితమైంది. ప్రతి అంతస్థు అమలక శిలతో శిఖరం వలె వేరు చేయబడింది, అన్ని అంతస్తులు కూడి మహావిమానమేర్పడి వున్నది. ఆలయంలో స్వామివారిని అభిషేకించిన జలము బయటకు రాకుండా లింగం అధోభాగంలో చేరి అచట గల జలఊటలో కలిసిపోతుంది. లింగము కిందనుండి ఎల్లవేళలా బుగ్గవలే నీటి ప్రవాహం వస్తుంటుంది, వాటిని మూడు కుండముల గుండా వెళ్ళే ఏర్పాట్లు చేసారు మనం ప్రదానఆలయ ప్రాంగణములోనికి ప్రవేశించగానే స్వచ్చమైనా నీటితో నిండిన రుద్రకుండము ప్రధాన అలయానికి ముందువైపున  కనపడతుంది. దీని చుట్టూ రాతితో ప్రాకారం కట్టినారు. తూర్పు వైపున అమర్చిన నంది నోటిలోనుంచి నీరు ఈ కుండములోనికి ప్రవహిస్తుంది, వచ్చిన భక్తులు, యాత్రికులు ఇక్కడ జలకాలాటలు అడతారు.
     ఇక్కడనుండి తూములగుండా నీరు బయటకొచ్చి బ్రహ్మ, విష్ణు కుండాలను చేరుకుంటుంది. యాత్రికులు బయటి ఆలయప్రహరి ముఖద్వారం నుండి పెద్ద పెద్ద చెట్లతో వున్న విశాలమైన ఆలయప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా వున్న ఆలయమంటపంకు వెళ్ళే దారికిరువైపుల ఈ  బ్రహ్మ,విష్ణు కుండాలను చూడవచ్చు. ఇక్కడ కూడ భక్తులు స్నానాలు చేస్తారు. చాలా స్వచ్చంగా ఉంటాయి ఇక్కడినీరు, నీటి అడుగున వున్న నేల చాలా స్పష్టంగా కనపడుతుంది..అంత తేటతెల్లగా ఉంటాయి నీరు.. అక్కడ ప్రభుత్వంవారు " స్నాం చేయు భక్తులు దయచేసి సబ్బును ఉపయోగించారాదు, బట్టలు ఉతకరాదు " అని బోర్డు పెట్టినా ’ అబ్బే మనం ఏది చేయవద్దని చెబుతామో అదే చేస్తాము... అదీ మన భారతీయ సంస్కృతి ’  ఆలయసిబ్బంది ఎంతమందికని చెబుతారు..చెప్పి..చెప్పి విసిగి వదిలేసారు..పాపం.!  జనాలు మాత్రం సబ్బును ఉపయోగించడమే..బట్టలు ఉతకడమే..ఇంత చేస్తున్నా కొందరు భక్తులు ఆ నీటిని మ్రోక్కుకొని కాసిన్ని నోటిలో వేసుకొని వెళ్తున్నారు..! అది చూసిన నాకు ఒళ్ళు జలదరించింది...నేను నీటి దగ్గరికి వెళ్ళి చూస్తే.. మనుషులు అంత మలినం చేసినా ఆ నీరు మాత్రం తన స్వచ్చతను కోల్పోలేదు..’ చాలా స్వచ్చంగా అలానే ఉన్నాయి..!

   ఆ నీరు అక్కడ నుండి కాలువల ద్వారా అరటితోటలకు, పంటపొలాలకు ఉపయోగపడుతున్నది. ఈ నీటిద్వార రెండు వేల హెక్టారుల మేరకు పంటభూములు సస్యశ్యామలమవుతున్నది. అది నిజమేననిపిస్తుంది నంద్యాల పట్టణములోకి అడుగుపెట్టగానే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చుక్కరటిపండ్లు కనపడతాయి. నంద్యాల నుండి మహానందికి వెళ్ళే దారిపొడవునా అరటితోటలు రహదారికి ఇరువైపులా ఉన్నాయి.








      చిన్న సూచన :   పైనున్న ఫోటోస్ వైడ్ స్క్రీన్ వున్న మానిటర్‌లలో హారిజాంటల్‌గా సాగదీసినట్లుగా కనపడతాయి..వారు మాత్రం తమరు చూడాలనుకున్న ఫోటో మీద రైట్ క్లిక్ చేసి మరో విండో ఓపన్ చేసుకుంటే అక్కడ మీ స్క్రీన్‌కి సరిపడా సరైనా ఫోటో వస్తుంది.

19 comments:

lord siva will bless u sir

Beautiful.
Thank you for sharing.

Wow..beautiful place.

kallaku kattinattuga....aalaya darsham cheyyinchaaru...rayalaseema lo vunna aalayalo yaaganti...mahanandi ki gala prethekathani chakkaga chooparu....danyavaadamulu.

అందమైన చిత్రాలకు చక్కటి వివరణ మంచి శోభనిచ్చింది,ధన్యవాదాలు.

నేను పెరిగిన ప్రాంతాలివి, ఏ ఆదివారంగాని, సెలవు రొజు గాని బొరనిపించినా స్నేహితులం సైకీలెక్కి మహానందికి జామ్మనిపించేవాళ్ళం, బనగానపల్లె ప్రాంతాలొ వున్న ఆ మేడని అద్దాల మేడ అనేవాళ్ళు, యాగంటి సంగతయితే మరీ.. నిట్టనిలువుగా వున్న కొండలు, లెఖ్క లేనన్ని కొతులు వాటిపిల్లలు , రొజూ పెరుగుతుంటుందట్రా అని అబ్బురంగాచూసే నంది, ఎదుటి కొనేరులొని ఎర్రెర్ర నీళ్ళు, చెరువుకట్ట , మూల మఠం నించే కాకుండా గాజుల పల్లె పచ్చ దనం మధ్యలోంచి మహానంది రోడ్, అదుగులు ఎడం కి తిరక్కుండా స్ట్రెయిట్ గా పడితే తగిలే నల్ల మల్ల అరణ్యం( నా చిన్నప్పుడు మా జేజి పక్కలోం చి ఆవులిస్తూ లేచే నాకు ఎదురుగా గొరి నాని వేప చేట్టు మీంచి నిద్దుర లేచే సూరీడు, ఆ వెనుక ప్రషన్ బ్లూ నల్ల మల కనిపించేది) పచ్చా పచ్చాగా బొగదలొకి ప్రయాణం ... ఘాట్ మధ్యలొ పచ్చర్ల వూరు- నెమలి గుడ్లు,ముల్లపంది ముచ్చటైన ముళ్ళు, పట్టుడు కర్రలు, వెదురు వ్రుక్షాలు ................................ అన్నీ గుర్తుచేసినందుకు :))

@ astrojoyd గారికి,
దన్యవాదాలు, మీకు ఓపిక ఉంటే " యాత్ర ' విభాగంలోనే " అహోబిళం, గండికోట, పుష్పగిరి " గురించి వున్నాయి, వాటినొకసారి చూడండి.

@ కొత్తపాళీ గారికి
@ బాస్కర రామిరెడ్డి గారికి
@ చందు గారికి
@చిలుకూరు విజయమోహన్ గారికి
ఎంతో ఓపిగ్గ చదివి వ్యాక్యానించినందులకు ధన్యవాదాలు.
@ అన్వర్ గారికి
గీతలతోనే జీవిన రేఖలు చిత్రిస్తున్న అన్వర్ గారు.. మీలాంటి కళాకారులు నాబోటి అల్పజీవుల బ్లాగ్ కొచ్చి తమ విలువైన సమయాన్ని కేటాయించి చదివినందుకు చాలా థ్యాంక్స్. మీ బ్లాగ్ చూసాక నా మరో వృత్తిలో కసాలులో పడిపోయి నేనెప్పుడొ వదిలేసిన " కుంచె " ను మళ్ళి పట్టుకోవాలనే సంకల్పం కలుగుతున్నది. మీ వ్యాక్యాలో మీలోని రచయత కనపడుతున్నాడు..! మీరా ప్రాంతం వారే కాబట్టి ఓ సారి మిమ్మల్ని కలవాలి..! మరో మారు చాలా థ్యాంక్స్ సర్.

కమల్ గారు

మీ వలన నాకు చక్కని క్షేత్ర దర్శనాలు జరుగుతున్నాయి. మీరు వ్రాసే తీరు, వివరణ బాగున్నాయి. నల్లమల, రాయలసీమలు పుణ్యభూములు.

శ్రీవాసుకి

కర్నూల్ జిల్లా అందాలతో కనువిందు చేస్తున్నారు. మీరుంచిన ఫోటోలకు కాప్షన్ వుంటే గుర్తుంచుకునేందుకు వీలుగా వుంటుంది. యాగంటి, అహోబిలం, మహానంది నా హిట్ లిస్ట్ లో చూడాల్సిన ప్రదేశాలుగా ఎక్కేశాయి. వీలుచేసుకుని తప్పకుండా చూస్తాను. ఆంధ్రాలోనే మనకు తెలియని చాలా దర్శనీయ స్థలాలున్నాయి. మీ పోస్టుల్లో అక్కడికి చేరుకునే వివరాలు, వసతి లాంటి సమాచారం ఇస్తే చూడాలనుకున్న వారికి వుపయోగకరంగా వుంటుంది.
ఫోటోలు బాగున్నాయ్.

Nice pics and write-up. Thanks for sharing.

మహానందిలో ఒకమారు జరిగిన విరసం సాహిత్య వర్క్ షాపు సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించాము. ఈ యాగంటి గురించి తెలియలేదు. తప్పక చూడాలనిపించేట్టు రాసిన మీ శైలి ఆకట్టుకుంది. ధన్యవాదాలు..

@ వాసుకి..గారికి
చాలా థ్యాంక్స్.
@snkr గారికి
ముందుగా మీ కామెంట్స్ కి చాలా థ్యాంక్స్. ఇక ఫోటోస్‌కి కాప్షన్స్ మొదట్లో పెట్టాను కాని అలా చేయడంవలన ఫోటోస్ హారిజాంటల్‌గా సాగుతున్నాయి... అందువలన కాప్షన్స్ రాయడం ఆపేసాను. అక్కడికి చేరుకునే విషయాలు గురించి ఇప్పుడు నెట్ ఉండడం మూలాన అందరూ గూగుల్ మ్యాప్ ని ఫాలో అవుతున్నారు, ప్రత్యేకంగా నేను వాటిగురించి చెప్పనవసరం లేదనుకొన్నా..! మీరు చెప్పాక ఇక ముందు అలాటి విషయాలు రాస్తాను.
@థ్యాంక్స్ వేణుగారికి..
@దన్యవాదాలు కైక్యూబ్‌గారికి..మిగిలిన యాగంటి, అహోబిళం కూడ చూసేయండి వీలు చూసుకొని.

ఏదొ ప్రాంతీయాభిమానం లాంటి అభిమానం చెలరేగి మీబ్లాగులొ కామెంట్ పెడితే మీరు మళ్ళీ కుంచె చేత బట్టి మా కడుపులు కొడ్డానికి సిద్దపడతరా?? ఇదెక్కడి అన్యాయం సార్!
97-98 ప్రాంతాల్లొననుకుంటా ఆర్టిస్ట్ మొహాన్ గారిని కలవడానికి కడప ప్రాంతాల్నుంచి కమల్ అనే వొ మహా అందంగా వుండే కుర్రాడు వొచ్చేవాడు ఆయన కళ్ళు అచ్చు కలువ మొగ్గల్లాగే వుండేవి. అవి మీవేనా?

@ అన్వర్ గారు.
అయ్య బాబోయి.. మరొకరి కడుపులు కొట్టేంత ప్రతిభ కాని..అసలు నన్ను నేనుమెచ్చుకోవడమే గాని మరొకరి మెచ్చుకొనేంత ప్రతిభ వున్నవాడిని అస్సల్ కాదు. కాబట్టి మీరా విషయంలో దిగులుపడనవసరం లేదు. 97-98 ప్రాంతంలో మోహన్‌గారిని కలిసిన వ్యక్తి నేను కాను..నాకంత సీన్ లేదు అందం విషయంలో. కాకపోతే ఒకటి రెండు సార్లు మరో ఆర్టిస్ట్ అయిన మిత్రునితో ద్వారా మోహన్‌గారిని కలిసాను.

This comment has been removed by the author.

సారీ, ravi.env@gmail.com

మీరు చాలా వివరము గా బాగా రాశారండి .
మేము గుడి మాత్రమే చూశాము . మెట్లెక్కి వెళ్ళే ఓపిక లేక గుహలు , ఆ భవనము చూడలేదండి .
మీ వ్యాసం బాగుంది .

నెల రోజుల కిందటే మా కుటుంబం తో మహానంది , బేలుం గుహలు, యాగంటి , (అరుంధతి బంగ్లా) చూసి రావడం జరిగింది. మీ బ్లాగు వెళ్ళే ముందర చూసి ఉంటె ఇంకా ఎక్కువ వివరాలు తెలిసి ఉండేవి . చాల వివరం గా రాసారు. ధన్యవాదాలు -- సుధాకర్ (www.sudhakar.com)

సుధాకర్ గారు,
చాలా థ్యాంక్సండి..! అలానే మహానందికి కొద్దిదూరంలోనే వున్న " అహోబిలాం " కు కూడ వెళ్ళి రావలసింది..! అది ఇంకా సూపర్..చాలా బాగుంటుంది..!

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs