కొన్ని నెలలుగా నల్లమల అడవులవైపునున్న అహోబిళం దేవాలయంతోబాటు వాటి చుట్టూ వున్న మరికొన్ని ప్రదేశాలను సందర్శించాలన్న ఆలోచనలో వున్న నేను, తోడుగా వచ్చే ఔత్సాహికులైన యువకులకోసం ఎదురుచూస్తున్న సమయంలో అనుకోకుండా నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఒక యువమిత్రుడుని కలిసిన సమయంలో " అన్నా రేపు శనివారం స్వాతి నక్షత్రం.ఆ రోజు పర్వదినంగా బావించి అహోబిళంలో ఉన్న నవ నరసింహస్వాములను  దర్శించడానికి మరో ఇద్దరు ఫ్రెండ్స్‌ కలిసి వెళ్తున్నాము, ఈ సమయంలో అక్కడికి చాలా మంది వస్తారు, మీరు కూడ వస్తారా..? " అని అడిగాడు... నేను దేనికోసం ఎదురుచూస్తున్నానో...!! అదే సమయం నాకు ఎదురుకావడంతో నా సంసిద్దత వ్యక్తం చేసాను. వారిది దైవభక్తి..మరి నాది ప్రకృతి భక్తి.. ఏది ఏమి అయితేనేమి నాకు కావల్సింది అక్కడ తిరగడానికి తోడుగా మనుషులు కావాలి, మామూలు సమయాలలో అక్కడ వంటరిగా తిరగలేము, ఎలుగుబంట్లు, చిరుతపులులు ఎక్కువగా సంచరిస్తూవుంటాయి.

    ఎవరి వారి ఆలోచనలతో మరునాటి తెల్లవారు జామునే 5 గంటలకే నలుగురం రెండు మోటర్‌బైకులలో బయలుదేరాము. మా ఊరినుండి షార్ట్‌కట్‌లో వెళ్తే  80 కిలోమీటర్లు ఉండవచ్చు. దారిపొడవునా తెల్లని పొగమంచులా కమ్ముకొని ఉన్నది, చూడటానికి చలికాలపు తెల్లగా మంచులా ఉన్నా అది మంచు కాదు " మొగలి " అని అంటారు. ఊటిలో ఉన్నట్టుగా ఉన్నది వాతావరణం, తెల్లటిమేఘంలా రహదారిమీద దూదిపింజలా మెల్లిగా ఎగురుతూ పోతున్నది " మొగలి "...!  ఆరోగ్యానికి అంతమంచిది కాకపోయినా మంచులా ఫీల్ అవుతూ దారిపొడవునా " మేఘాలలో తేలిపోతున్నది తుఫానులా సాగిపోతున్నది " అని వెనుక అమ్మాయిలేకున్నా... పాట పాడుకుంటూ ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ చాగలమర్రి వూరు మీదుగా 7:30 నిమిషాలకు అహోబిళం చేరుకున్నాము.
    దిగువ అహోబిళం దర్శించకుండానే కొండమీదున్న ఎగువ అహోబిళం చేరుకొన్నాము. గంభీరమైన రెండు పర్వతశ్రేణుల మద్యన నెలకొనివున్నది ప్రధాన ఎగువ అహోబిళం. అక్కడ కూడ ప్రధాన దేవాలయం దర్శించకుండా.. దేవాలయానికి ఎడుమపక్క నున్న చిన్న చెక్క బ్రిడ్జీమీదుగా వెనుకకు చేరుకున్నాము. అక్కడ నుండి మహావృక్షాలతో నిండి ఉన్న నల్లమల్ల అడవులతో విస్తరించివున్న పర్వతాలను ఎక్కడానికి ముందుకు అడుగేసాము.

     ఓబులం, అహోబిళం, అహాబిలం, అహబిలగిరి, వేదాద్రి, దిగువ తిరుపతి, గరుడాద్రి, వీరక్షేత్రం, అచల చాయమేరు, సింగనేల్ కున్నం, నిధి, నగరి, శేషాద్రి, నరసంహ్మతీర్థం, గరుడాచలం అనే పేర్లతో ఈ క్షేత్రం ప్రసిద్ది చెందింది. ఎగువ అహోబిళానకి 8కి.మీ. దూరంలో వున్న ఉక్కు స్థంభం నుంచి విష్ణుమూర్తి నరసింహుని రూపంలో వచ్చి హిరణ్యకశ్యపుని వధించే సమయంలో ఉగ్ర నరసింహస్వామిని అహోబిలుడిగా దేవతలందరూ స్తుతించటం వలన ఈ క్షేత్రానికి అహోబిళం అని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో 9 ఆలయాలు, 6 కోనేర్లు, 122 మంటపాలు, అనేక చత్రాలు వున్నాయి.
        మా నడక మార్గమద్యన ఒక ప్రదేశంలో కొందరు భక్తులు కాలినడకన నడిచే భక్తులకోసం ఉచితంగా " నాస్టా " ఏర్పాటు చేసారు, ఆగకుండా వెళ్తున్న నన్ను మా ఫ్రెండ్ ఆపాడు.  " ఇక్కడ  టిఫిన్ తినకపోతే మరెక్కడ పైన దొరకదు. మర్యాదగా ఇక్కడ టిఫిన్ చేసి వెల్దాము " అన్నాడు..ఇష్టం లేకపోయినా ఆగక తప్పలేదు నాకు. ఆహోబిళం దగ్గరలో నున్న గ్రామాల నుండి, ఆళ్ళగడ్డ నుండి కొందరు భక్తులు ఉచితంగా భోజనాలు, టిఫిన్స్ ప్రతి ఏడాదీ అక్కడకు వచ్చే భక్తుల కోసం ఏర్పాటు చేస్తారు, వారికి  మొక్కుబడిలో అదొక భాగం. ఎత్తైన చెట్ల కింద గ్యాస్ పొయ్యి. మరో రెండు కట్టెల పొయ్యిలతో అక్కడ వంటలు వండుతున్నారు. మహావృక్షాలమద్యన కాలినడకన అక్కడకు చేరిన భక్తులంతా అరటాకులలో పొంగలి, వేరుశనక్కాయి చెట్నీ కలుపుకొని ఆరగిస్తున్నారు. నేనంతగా పొంగలి ఇష్టపడను.  కాస్త సంకోచిస్తూ ఆరటాకు తీసుకొని టిఫెన్ తెచ్చుకున్నాను. మొదటి ముద్ద నోట్లో పెట్టుకొన్న రెండు క్షణాలకు  పొంగలి రుచి నా జిహ్వకు మహాద్భుతంగా తోచింది.. ఏముందా పొంగలిలో అని చూస్తే..! ఏముంది చాలా సింపుల్..ముంతమామిడి పప్పు ( జీడిపప్పు) తో పొంగలి, అందులోకి చెట్నీ..కాకపోతే చట్నీలో నిమ్మరసం పిండినట్లున్నారు కారకారంగా పుల్లపుల్లగా..! అందులోకి మల్లి టమోటా ఊరగాయి కలుపుకొని తింటుంటే..నాసామిరంగా..!. మావూళ్ళొ చెప్పుకొనే ఉపమానం గుర్తొచ్చింది.. మరదలుపిల్ల మాంచి రొమాంటిక్‌ మూడ్‌లో ఉన్నప్పుడు అదోరకమైన పిలుపుతో ఆ పిల్ల " మావా " అంటుందట..అట్లా ఉన్నదారుచి..ఒక్క రుచే కాదు శుచి కూడ చాలా శుబ్రతగా ఉన్నది. అసలు పొంగలి ఇష్టపడనీ నేను మరోమారు పెట్టించుకొని లాగించేసా, నా తిండిపోతుతనం చూసిన మా ఫ్రెండ్స్ " ఇక చాల్లే ఎక్కువగా తింటే ట్రెక్కింగ్ చేయడం చాలాకష్టం " అని చెప్పగానే..ఆపేసా..కాని నా కడుపులోని ఆత్మారాముడు ఊరుకోవట్లేదు.లొట్టలేసుకుంటూ..గోలపెడుతున్నాడు." నాకింకా కావాలి " అంటూ...! వాడిని ’ మద్యాహ్నం భోజనం ఉండదు ఇలా మారాం చేసావంటే ’ అని బెదిరింపుతో బుజ్జిగించి అక్కడనుండి కదిలాను. మామూలుగా ఒక సామెత ఉంది, " కళ్ళు కావాలంటాయి..కడుపు వద్దంటుందీ " అని..కాని దీనికి రివర్స్ " కడుపు కావాలంటున్నది..కళ్ళు వద్దని వారిస్తున్నట్లుంది నా పరిస్థితి.
        అసలు అక్కడ అలాంటి ప్రకృతిరమణీయ వాతావరణంలో వనభోజనంలా టిఫెన్ ఆరగిస్తుంటే చెప్పలేని అనుభూతే అది...! అంతేనా.. కాలినడకన వస్తున్న భక్తులను ఈ దాతలు ఒకటికి రెండు మూడు సార్లు అడిగి పిలుస్తున్నారు. మొహమాటస్తులను సైతం బతిమాలి టిఫిన్ పెడుతున్నారు. మరి కొన్న చోట్ల ఇడ్లీలు, పూరీలు పెడుతున్నారు. మేము తెచ్చుకున్న కిన్లీ బాటిల్స్‌ని నేను తీస్తుంటే వద్దని మా ఫ్రెండ్స్ వారించారు, " అర్రె కిన్లీ నీళ్ళకన్న మాంచి రుచికరమైన, మినరల్స్ ఉన్న నీళ్ళు ఇక్కడున్నాయి. అవి తాగి మన వద్దనున్న ఖాలీ బాటిల్స్‌లలో ఆ నీళ్ళను పట్టుకొని వెళ్దాం "  అన్నారు. కొండలపైన నుండి చెట్ల వేర్లను తాకుతూ ప్రవహిస్తున్న మంచినీటి ధారలు అక్కడక్కడ చాలా ఉన్నాయి. వాటిని పెద్ద పెద్ద డ్రమ్ములలో పడుతున్నారు. అందులో ఏమాత్రపు నులకలు గాని లేక రంగు గాని లేదు..చాలా స్వచ్చంగా తేటతెల్లంగా వున్నాయి, ఒక్క సారి మన రాష్ట్ర రాజధాని భాగ్యనగర కార్పోరేషన్ రంగుతేలిన నీళ్ళు గుర్తుకొచ్చాయి..! నగరానికి... ప్రకృతివరమైన ఇక్కడ నీళ్ళకు.. ఎంతతేడా..?  అనుకున్నాను.!
      ఎగువ అహోబిల ప్రధాన ఆలయానికి 1కి.మీ దూరంలో నున్న వరాహ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాము. ఎత్తైన మహావృక్షాల కింద ఆలయమంటపము ఉండగా దాని గర్భగుడిమాత్రం కొండకు చివరి అంచునున్న బిళంలో దేవతావిగ్రహాలు ఉన్నవి. వేదాద్రి పర్వతానికి పడమటి భాగాన వరాహ రూపమున భార్య అయిన వసుంధరాదేవితో స్వామి వేంచేసి యున్నారు. అందుకే ఈ స్వామిని వరాహ నరసింహస్వామి అని అంటారట..! మామిత్రుల దర్శనం అయ్యాక అక్కడ నుండి పెద్ద పెద్ద బండరాళ్ళతో ఉన్న సెలయేళ్ళ మద్యన మా నడక ప్రారంభం అయ్యింది
   ఈ తోవలో నడక కాస్త కష్టంగానే ఉంటుంది, ఒకపక్కన పాచిపట్టిన బండరాల్లు, మరోపక్కన నీటి ప్రవాహం చాలా జాగ్రత్తగా నడవాలి. వేలల్లో జనం ఒక ప్రవాహంలా నడుస్తున్నారు, పిల్లలు యువకులు, నడివయస్కులు, వృద్దులు, స్త్రీలు. తమిళనాడునుండి తమిళ కారన్స్, కర్నాటకనుండి కన్నడ కంఠీరవలు ఎక్కువగా కనపడుతున్నారు. నడవలేని వృద్దలను ఒక పెద్దకర్రకు దుప్పటితో జోలకట్టి అందులో తీసుకెల్తున్నారు. మద్యలో ఏటవాలుగా ఉండవలసిన తాపలు కొద్దిగా నిటారుగా ఉండడం మూలాన జాగ్రత్తగా ఎక్కవలసివచ్చింది.
       జ్వాలా నరసింహస్వామి : వేదాచలం అనే పర్వతాల మధ్యన అచల భూమామేరు అనే పర్వతం ప్రాంతమది. ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి 4 కి.మీ దూరంలో ఉన్నది.  చాలా ఇరుకైన కాలిబాట..ఒక పక్కన చాలా లోతైనా లోయ ఉన్నది, వీటిని దాటుకుంటూ ఆలయానికి చేరవగా కొద్దిదూరంలో ఉన్న జలపాతం  కిందనుండి ఆలయానికి చేరుకోవాలి కాని జలపాతానికి మరో పక్కన పెద్ద లోయ ఉన్నది. చాలా జాగ్రత్తగా జలపాతం కిందనుండి తడుస్తూ దాటి ఆలయానికి చేరుకున్నాము. హిరణ్య కశ్యపుని సంహారానంతరం క్రోధాగ్ని జ్వాలతో ఊగిపోవడం వంటి రూపంలో వుండటంతో స్వామిని జ్వాలా నరసింహస్వామి అంటారు. స్వామిని శాంతింపజేసేందుకు ఇంద్రాది దేవతలు చేసిన అభిషేక జలమే భవనాశిని పుణ్యతీర్థంగా అయింది. ఈ ఆలయం ముందు ఒక కొండ గృహ, దాని క్రింద చిన్న గుండం ఎర్రని నీటితో నిండి ఉన్నది. హిరణ్యకశ్యపుని రక్తంలో తడిసిన హస్తాలను స్వామి కడగడం వల్ల నీరు ఎర్రగా మారిందని అక్కడి వారి ఒక విశ్వాసం. ఈ ఆలయంలో అష్టభుజ, చతుర్భుజ నరసింహులు. హిరణ్యకశ్యపుని వెంటాడుతున్న నరసింహుడు మూడువిగ్రహాలు దర్శనమిస్తాయి. అక్కడనుండి తిరిగి వస్తున్న సమయంలో కొందరు జలపాతనీటిని బాటిల్స్‌లలో నింపుకుంటున్నారు...! ఎందుకూ అన్నట్లు మా మిత్రులవైపు చూసాను నేను. " అవి కొన్ని వనమూలికల గుండా ప్రవహిస్తూ వస్తున్న ఔషద నీరు, తాగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారి నమ్మకం "  అన్నారు.

    మాలోల నరసింహస్వామి : అక్కడ నుండి తిరిగి వచ్చినతోవలోనే  వెనకకు ఒక అర కి.మీటర్ వచ్చాక ఒక కొండనుండి మరో కొండకు నిర్మించిన ఇనుప వంతన ద్వార వేదాద్రి శిఖరం మీదకు ఎక్కనారంభించాము, ఇది ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి 2 కి.మీ దూరంలో వున్నది..ఒక కిలో మీటరు శిఖరం ఎక్కిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే పచ్చదనంతో పరిచిన వేదాద్రి శిఖరం, గరుడాచలం, వేదాచలం కొండలు కనపడ్డాయి,  అద్భుతమైన దృశ్యం అది.. ఒక్కసారిగా " పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా "  అన్న సిరివెన్నెల చరణాలు గుర్తొచ్చాయి. వేదాద్రి శిఖరాన ఒక చదునైన ప్రదేశంలో మాలోల నరసింహస్వామి గుడి వున్నది, లక్ష్మీదేవితో కలిసి దర్శనిమిస్తున్నందున మాలోల నరసింహస్వామి అని పిలుస్తున్నారు. మా మిత్రబృందం గుడిలోపలే చాలా సేపు ఉన్నారు..పొర్లుదండాలు పెడుతున్నారు ఇద్దరు. ఎంతకూ బయటకు రావట్లేదు,  సరే వారు వచ్చేసమయంలోపల మరో చోటకు వెళ్ళవచ్చని మరొక మిత్రునితో కలసి గుడివెనుక నుండి కాలిబాట వెంటా అడవిలోనకు నడుచుకుంటూ వెళ్ళాను. ఇరుకుగా ఉన్న ప్రమాదకరమైన దారి అది..కాస్త కాలు జారినా లోతైన లోయలో జారడం ఖాయం. ఒక కిలోమీటర్ దూరం నడిచాక పక్కనే వున్న మరో కొండకు చేరాము అక్కడ దాదాపుగా 100 అడుగుల దీర్ఘచతురస్రాకారంలో ఉన్న పెద్ద బండరాయి ఉన్నది, దానిమీద ఏదో " లిపి " కనపడుతున్నది, అది తెలుగా లేక సంస్కృతమా..లేక మరో ఏదన్న బాషనా..? అర్థమే కావట్లేదు, ఎవరన్న ఆ " లిపి " మీద పరిశోదనలు చేస్తున్నారో లేదో..మరి..!?  చదునైన ఆ పెద్ద రాయి మీద నడుచుకుంటూ ఓ 100 అడుగులు వెళ్ళాక రెండు కొండలమద్యన ఇరుకైన స్థలం లో ప్రహ్లాదుడి " బడి " ఉన్నది. అక్కడే ప్రహ్లాదుడు విద్యనభ్యసించాడని అక్కడివారి నమ్మకం, ఆ చిన్న గుడిలో నరసింహస్వామి, ప్రహ్లాద విగ్రహాలున్నవి. పక్కనే ఏటువాలుగా ఉన్న కొండమీద చిన్న చిన్న జలపాతాలు ఉన్నవి,  చూడచక్కని ప్రకృతి రమణీయ ప్రదేశమది. అక్కడ నుండి తిరిగి వెనకకు బయలదేరాము. 

   ఉదయం టిఫిన్ చేసిన చోటకు చేరుకున్నాము, అక్కడ మరో రకమైన పలహారం పెడుతున్నారు, మరో రౌండ్ వేసారు మా మిత్రబృందం, ఈ సారి టమోటో, జీడిపప్పుతో చేసిన ఉప్మా. మరో రకం " ఉగ్గాని అలియాస్ బొరుగుల ఉప్మా ". !   బొరుగులతో ( మరమరాలు) చేసే ఉపపలహారం అది. చిత్రాన్నం (పులిహోర, యెల్లో రైస్) చేసే విదానంలానే చేస్తారు, కాకపోతే బొరుగులను ముందుగా నీటిలో తడిపి తర్వాత తిరగమాత (పోపు) పెడతారు పులిహోరలాగే బాగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు,పసుపు వేసి మనం ఇంట్లో పోపుకు వాడే అన్నిదినసులతోనే తిరగమాత పెట్టాక చివరన అందులో నిమ్మరసం పిండుతారు. " ఉగ్గాని " తోబాటు దానికి కాంబినేషన్‌గా  " నన్ను కొంచం కొంచం కొరక్కుతినవయ్యా..య్యా..యా " అంటున్న మిరపబజ్జీతో తింటుంటే....." ఆ..టేస్టే..వేరు...ఆ టేస్టే వేరు " అని పాటపాడుకొన్నాము.. ఆ ప్రకృతివడిలో..!

    పావన నరసింహస్వామి : పలహారం ఆరగించిన తర్వాత అక్కడ నుండి మరో దిశకు కొద్దిదూరం నడిచాక ఎడమవైపున ఉన్న మరో కొండను దాదాపుగ 1 కి.మీ ట్రెక్కింగ్ చేసాము. తర్వాత దట్టమైన అడవి గుండా, దారిపొడవునా 100 అడుగల ఎత్తు ఉన్న మహావృక్షాలు ..అడవిని కప్పిన పెద్ద గొడుగులా ఉన్నాయి  వాటి క్రిందన మనిషెత్తు ఉన్న ఆకుపచ్చని గడ్డి మద్యలో కాలిబాట వెంట నడక ప్రారంచించాము.  ఎత్తైన చెట్ల ఆకుల మద్యనుండి దూరి వస్తున్న సన్న సన్నని సూర్యకిరణాలు పచ్చని గడ్డిని తాకి పరావర్తన చెందుతున్న దృశ్యం కన్నుల పండగలాఉంది నాకు.  అప్పటికే దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న కొందరు భక్తులు ఎదురవుతున్నారు. 5 కి.మీ నడిచాక మద్యాహ్నం 12:30 నిమిషాలకు గరుడాచలంకొండ చివర్లో పావనమనే నదీతీరాన ఉన్న పావన నరసింహక్షేత్రం చేరుకున్నాము. ఇక్కడికి కాలనడకన 6 కి.మీ నడవాలి..వాహనాల ద్వారా రావడానికి కూడ సౌకర్యం ఉన్నది ఘాట్‌రోడ్ ద్వారా 14 కి.మీటర్లు ప్రయాణిస్తే అక్కడికి చేరుకోవచ్చు. అక్కడ దర్శనం అయ్యాక మధ్యాహ్నన భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొన్నాక తిరిగి ఎగువ అహోబిళ ప్రధాన ఆలయానికి బయలుదేరాము.


   అహోబిళ నరసింహస్వామి :  ఎగువ అహోబిళంగా పిలిచే ఈ దేవాలయంలో అహోబిళ నరసింహస్వామి వున్నారు. రాజగోపురంద్వార లోనికి వెళ్తే అక్కడ ఒక గుహలో అరుగు మీద దశభుజాలతో హిరణ్యకశిపుని సంహరించే నరసింహావతారంలో స్వామి దర్శనమిస్తాడు. ఆలయానికి ప్రక్కగా అభయ వరదముద్రలతో పై చేతులలో తామర మొగ్గలతో చెంచులక్ష్మి విగ్రహం ఉన్నది. అక్కడ దర్శనం ముగించుకొని బయలదేరాము.
       కారంజ నరసింహస్వామి : తిరుగుప్రయాణంలో ఎగువ అహోబిళానికి 1  కి.మీటర్ల దూరంలో భవనాశి నది ప్రవహిస్తున్న చోట వటవృక్షం నీడలో శంఖుఛక్రధారుడుగా కొలువైయున్నందున కారంజ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. అక్కడ నుండి దిగువ అహోబిళానికి 2 కి.మీటర్ల దూరంలో కొండపైన భార్గవ( పరుశు) రాముడు తపస్సు చేసిన స్థానంలో వెలసినందున భార్గవ నరసింహస్వామి అని పిలుస్తున్నారు. అక్షయ కోనేటి నీరు, చుట్టూపొదలు. పెద్ద వృక్షాలతో అక్కడి ప్రకృతి రమణీయంగా వుంటుంది.
     చత్ర వట నరసింహస్వామి :  భార్గవ క్షేత్రానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పద్మాసీనడై, దక్షణ హస్తం అభయ ముద్రను సూచిస్తూ, గొడుగులాంటి మర్రిచెట్టు నీడలో చత్రవట నరసింహస్వామి వున్నారు.

     యోగానంద నరసింహస్వామి : 2 కి.మీ దూరంలో ప్రహ్లాదునికి యోగాభ్యాసం నేర్పి మూర్తి అయినందున ఇక్కడి స్వామికి యోగానంద స్వామి అని పేరు వచ్చిందట.
     దిగువ అహోబిళ వరద నరసింహస్వామి : ఇక్కడ ప్రహ్లాద వరద నరసింహుడు దర్శనమిస్తారు. ఈ శిలా విగ్రహం ఊర్ధ్వహస్తాలతో, శంఖు చక్రాలను కలిగి వామభాగంలో తొడపై లక్ష్మీదేవిని కూర్చండజేసి అభయ, వరద, ముద్రాన్వింతంగా అందంగా తీర్చి దిద్దబడింది. ఒక పక్కగా పట్టపుదేవేరి అమృతవల్లి తాయారు విగ్రహం ఉన్నది.

      ఈ విగ్రహాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ ఆలయంలోని ప్రధాన ఆలయమంటపంలో శిల్పులు చెక్కిన శిల్పాలు మాత్రం అద్భుతంగా వున్నాయి. రకరకాల నరసింహస్వాముల ప్రతిరూపాలు. కవయిత్రి, రచయత్రి అయిన కథనాయక "మొల్ల "శిల్పం,  శ్రీకృష్ణదేవరాయుల శిల్పాలు ..చాలానే ఉన్నాయి. అక్కడనుండి తిరుగు ప్రయాణం.




     అహోబిళం నుండి ఒక రెండు కి.మీటరు ప్రయాణించిన తర్వాత  బైక్ నడుపుతున్న మిత్రుడికి ఎడమపక్కన పచ్చని పొలంలో ఒక నీళ్ళ బావి కనపడడంతో బండిని ఆపేసాడు. మొహం కడుక్కొని ఫ్రెష్ అవుదాము పదా అని పొలంలోకి దారితీసాడు. తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే అది బావి కాదు..ఒక పురాతన కోనేరు.. కొన్ని సంవత్సరాలుగా ఎటువంటి మరమత్తులకు నోచుకోలేదు అనుకుంటా పాడుబడిపోయింది. లోపలంతా పాచి కట్టి ఉన్నది. అది కాదు గాని విశేషమూ..కోనేరు చూట్టూ ఉన్న రాతిగోడలమీద బాగవత, మహాభారత, రామాయణ శిల్పాలు చెక్కి వున్నారు..!  సురులు, దేవతలు అమృతం చిలుకుతున్న శిల్పాలు .. చాలా బాగున్నాయి. అందులో భాగంగా రతీభంగిమలు కూడ ఉన్నాయి. పురావస్తుశాఖ వారు బహుశ ఆ కోనేరు గుర్తించారో లేక గుర్తించి కూడా నిర్లక్షం వహిస్తున్నారో అర్థం కాలేదు మరి. ఎవరో రైతులు బోర్లు వేసి అందులోనుంచే తమ పంటపొలాలకు నీటిని వాడుకుంటున్నారు. ప్చ్ అనుకుంటూ తిరుగు ప్రయాణం కట్టాము.

    
    మరి కొన్ని నరసింహస్వామి అవతారాల ఫోటోస్ క్రింద ఫ్లాష్‌ప్లేయర్‌లో చూడవచ్చు.


       ఉపసంహారం :  ఇక్కడి దేవుల్లను చూసాక నగరాలలో ఉన్న దేవుళ్ళకు కన్ను కుడుతుందేమో..!! ఇంతటి ప్రశాంత వాతావరణం, ప్రకృతివడిలో వోలలాడుతున్న ఈ దేవుళ్ళను చూస్తే ఈర్షపడతారేమో..మన హైదరాబాద్ నగర దేవుళ్ళు...!! పాపం ప్రతిరోజు నగర వాహనాల రణగొణద్వనులమద్యన, కాలుష్యవాతావరణంలో ఉక్కిబిక్కిరి అవుతూ వుంటారు, అందులోని మన వారి " పోటీ భక్తి " ని తట్టుకోలేక సతమతమవుతూ ఉంటారు..ఇక పండగలు పబ్బాలు వచ్చినప్పుడు " మైకులతో " హోరెత్తిస్తూ ప్రజల చెవుల్లతోబాటు దేవుళ్ళ చెవుల్లకు తూట్లు పొడుస్తూ ఉంటే  అక్కడి నుండి ఎప్పుడొ పారిపోయి ఎక్కడో దాక్కొని ఉంటారు. అలాంటి వారికి ఇక్కడి స్వచ్చమైన గాలిని ఆస్వాదిస్తూ, నిశ్శబ్ధవాతావరణంలో పచ్చని ప్రకృతి మద్యనున్న దేవుళ్ళని చూస్తే ఖచ్చితంగా ఈర్షపుడుతుందేమో...???. కాని ఒక విషయం మాత్రం నిజం, ఏ ఆరునెలలకో లేక సంవత్సరానికో ఒక మారు ఇలాంటి ప్రదేశాలకు వెళ్తే భక్తి, పుణ్యం సంగతేమో గాని..స్వచ్చమైన గాలితోపాటు పచ్చని ప్రకృతితో మైమేకం అవితే చాలు... మిగతా రోజులంతా మన వృత్తిలో పనిచేయడానికి ఉత్తేజం కలుగుతుందనుకుంటా..!!!

      చిన్న సూచన : ఇక్కడ పోస్ట్ చేసిన ఫోటోస్ గురించి తమ సిస్టంలలో సరిగ్గా రావట్లేదు.. అంటే వర్టికల్‌గా క్రష్ అవుతున్నాయి అనగా హారిజాంటల్‌గా సాగదీసినట్లుగా కనపడుతున్నాయి  అని కొంతమంది తమ కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు.  వాస్తవంగా అవి 4:3 ఆస్పెక్ట్ రేషియిలో ( టి.వి ఫార్మాట్ అనగా 35mm సైజ్) ఉన్న మానిటర్‌లలో కరెక్ట్‌గా కనపడతాయి. వైడ్ స్క్రీన్ మానిటర్‌లలో మరియు వైడ్‌స్క్రీన్ ఉన్న లా‌ప్‌టాప్‌లలో హారిజాంటల్‌ సాగదీసినట్లుగా కనపడతాయి. ఆ సమస్య మీద నాకెటువంటి అవగాహన లేదు, కేవలం ఒక చిన్న విషయం చెప్పగలను మీరు ఏదన్న ఫోటోని ప్రత్యేకంగా చూడాలనుకున్నప్పుడు ఫోటో మీద రైట్ క్లిక్ చేసి సపరేట్ గా మరో విండో ఓపన్ చేసుకుంటే మీకు సరైన పరఫెక్ట్ ఫోటోగ్రాఫ్ వస్తుంది.


21 comments:

very well written.

కళ్ళకు కట్టినట్టుగా వర్ణించి మీతో పాటు మమ్మలిని కూడా నడిపించారు. ధన్యవాదాలు.

This comment has been removed by the author.

చాలా బాగా రాసారు. ప్రశాంత వాతావరణంలో వెలసిన అహోబిల నారసింహుని దర్శనం ఆనంద దాయకం , పుణ్యప్రదం.

చాలా బాగా రాసారు. ప్రశాంత వాతావరణంలో వెలసిన అహోబిల నారసింహుని దర్శనం ఆనంద దాయకం , పుణ్యప్రదం.

చాలా బాగా రాసారు. ప్రశాంత వాతావరణంలో వెలసిన అహోబిల నారసింహుని దర్శనం ఆనంద దాయకం , పుణ్యప్రదం.

కళ్ళకు కట్టినట్లుగా చాలా బాగా చెప్పారు, అయితే ఫోటోలు మాత్రం సాగదీశారు.

@శ్రీనివాస్ బాబు .

4:3 నార్మల్ 35 mm మానిటరలలో కరెక్ట్ ఫోటోస్ కనపడుతున్నాయి, కేవలం వైడ్‌స్క్రీన్ ఉన్న మానిటర్ల్‍౬లలోనూ.. లాప్‌టాప్‌లలోను మాత్రమే వర్టికల్ క్రష్ లాగ ..హారిజాంటల్‌గా లాగినట్లు కనపడుతున్నాయి..మరి ఆ సమస్యను ఎలా తొలిగింహ్అాలో నాకు అర్థం కావట్లేదు.

ఫోటోలు అద్భుతంగా ఉన్నాయండీ. మీరు అహోబిళాన్ని వర్ణించిన తీరు బాగుంది. నల్లమల్ల ఒక అద్భుతమైన అటవీ ప్రాతం. ఏనాటికైనా ఆ ప్రాంతాలు చూడాలి. శ్రీశైలం మాత్రమే చూడగలిగాను.

శ్రీవాసుకి

చాలా చాలా బాగుందండీ మీ టపా మరియు మీరు పెట్టిన ఫోటోస్....:) నిజమే, అహోబిళం పోయిన సంవత్సరం నేను చూశాను. నాకు చాలా నచ్చింది..:)

మీ వర్ణన,ఫోటోస్ అధ్భుతం.అలా మీతో పాటు అహోబిలం యాత్ర చేసేసా నేను కూడా.

@కిరణ్..చాలా థ్యాంక్స్..
@ సత్యం గారికి..నాబ్లాగ‌కి వచ్చి చదివినందుకు చాలా థ్యాంక్స్..

@ వింజకుమార్ గారికి ధన్యవాదాలు

@శ్రీనివాస్ బాబు గారికి థ్యాంక్స్..

@వాసుకి గారికి..చాలా థ్యాంక్స్, వీలు చూసుకొని ఒక సారి వెళ్ళి రండి..

@ మనసు పలికే...
బ్లాగ్ కి వచ్చి చదివినందుకు చాలా థ్యాంక్స్..! ఓ మీరు అహోబిళం వెళ్ళారా..!! మొత్తం అన్ని చోట్ల తిరిగారా..?

@ రిషి. ఓహ్..వెళ్ళకుండానే దర్శనం కలిగిందా..!! మీకు అదృష్టవంతులు..తమాషాగా అన్నాను.

కమల్ గారు అన్ని ప్రదేశాలు చూడలేదండీ.. మీరు చెప్పిన వాటిల్లో కొన్నే చూశాను కానీ నాకు అప్పుడు పేర్లు సరిగ్గా తెలియదు.. ఏదో అలా వెళ్లి ఇలా చూసేసి వచ్చేశాము.. ఇప్పుడు మీ టపా చూశాక అర్థం అవుతుంది, ఎంత మిస్ అయ్యానో..

ఫొటోలూ మీ కథనమూ ఒకదాని కొకటి పోటీ పడుతూ ఉన్నాయి.
అదృష్టవంతులు.

Beautiful!
Sharada

@కొత్తపాళి గారికి, మీవంటి నిష్ణాతులు మా బ్లాగ్‌లో వ్యాఖ్య రాయడం చాలా సంతోషంగా ఉన్నది. మీకు కృతజ్ఞతలు.

@ శారద గారికి.
మీవంటి మంచి సంగీతవిద్వాంసులు నాబ్లాగ్‍ చదవడం సంతోషం. చాలా థ్యాంక్సండి

ఇంకా వివరాలు చదవలేదు, ఫొటోలు మాత్రమే చూసాను. మీ ఫొటోలు చాలా బాగుంటాయి. మీ గండికోట ఫొటోలు చూసినప్పటినుండి మీకు పెద్ద ఫ్యాన్ని.

@ చేతన.
చాలా థ్యాంక్స్, మరో ఫోటోగ్రాఫర్ నా ఫోటోలను మెచ్చుకోవడం ఆనందంగా వున్నది. వాస్తవంగా చెప్పాలంటే నా అనుభవానికి ఇంకా చాలా బాగా తీయాలి ఫోటోస్..ఇప్పుడు అక్కడున్న ఫోటోస్ కేవలం సమాచారానికి ఉపయోగపడేవి తప్ప నైపుణ్యానికి కొలమానం కాదనుకుంటా..!! అయ్య బాబోయి నాకో ఫ్యాన్ అయ్యేంత ప్రతిభ నాలో ఉన్నాదా..??

నమస్తే,
నాపేరు లలిత
ఇదే మొదటిసారి మీ బ్లాగ్ చదవడం.
చాలా బాగుంది.
అహొబిలం మేమే వెళ్లి వచ్హి నంతగా వుంది.
ఫొటోలు బాగున్నాయి.
చాలా థాంక్యు.
మీ పేరు తెలీదు.

నమస్తే లలితగారు, నా బ్లాగ్‌కి వచ్చి ఓపిగ్గా చదివినందుకు మరియు మీకు నచ్చిననందుకు చాలా థ్యాంక్స్, నా పేరు పొట్టి అక్షరాలలో కమల్..ప్రతివ్యాసం పైబాగంలోనే నా పేరు ఉన్నదండి.

wow.. photos super unnay andi.. mi photos nenu na blog lo post chesanu.. mi anumati tiskokundane..

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs