.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.


   డబుల్ మర్డర్ కేసుకు సంబంధించిన కోర్టు తీర్పు వెలువడింది.
  బాలుడు, ఓబుళరెడ్డితోటి మరో ఐదుమంది మీద నేరం నిరూపించబడింది. ముగ్గురికి లైఫ్ జెప్పారు. మిగతా నలుగురికి మూడేళ్ళు జైలు శిక్ష చెప్పారు.
  అందర్నీ రిమాండ్‌కు  తీసుకొన్నారు.
 చెన్నారెడ్డి వచ్చి పలకరించాడు.
  కేసును హైకోర్టుకు అప్పీలు చేద్దామన్నాడు.
  కోర్టు పనుల్ని చూసికొనేందుకు లా చదువుతోన్న రమణారెడ్డి వచ్చాడు విజయవాడనుంచి.
  దుఃఖంతో కుమిలిపోతూవున్న కుటుంబాన్ని ఓదార్చాడు.
  హైకోర్టుకు అప్పీలు చేయించాడు.
 హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
  రమణారెడ్డి మళ్ళీ కాలేజికి వెళ్ళాడు.
  ఈలోపు ముద్దాయిలందర్నీ రాజమండ్రి సెంట్రల్‌జైలుకు తరలించారు.
  శివపురి ఓబుళరెడ్డి కథ తాలుకా అంతటా చర్చనీయాంశమైంది.
  అతని శకం ముగిసినట్లేనని భావించారు చాలామంది.
 ఎమ్మెల్లేకు కుడి భుజం లాంటివాడనీ, అతడులేని లోటును చెన్నారెడ్డి ఎట్లా పూడ్చుకోగలడోననీ లెక్కలు వేయసాగారు కొందరు.
  నెలరోజులు గడిచాయి.
 ఈలోపు ఓబుళరెడ్డికి ఆత్మీయులైన కొందరు రాజమండ్రి వెళ్ళి పరామర్శించి వస్తున్నారు.
  విజయవాడలో వున్న రమణారెడ్డి వారానికొకసారి హైదరాబాద్ వెళ్ళి లాయర్ని  కలిసి కేసు విషయం తెలిసికొని, అట్నించి రాజమండ్రికి కూడా వెళ్ళి చిన్నాన్నకు విషయం చెప్పి వస్తున్నాడు. కోర్ట్ వ్యవహారాల్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాడు.
  తర్వాత కొన్ని రోజులకు -
  విజయవాడలో కాలేజికి వెల్తూవున్న రమణారెడ్డికి హఠాత్తుగా కన్పించాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
  " మామా ! బాగుండావా  ?  "  పలకరించాడు
 "  ఓ.. నువ్వంటోయి  !.. ఏంది యిక్కడుండావు..?  "  దగ్గరకు తీసికొని వీపుతడుతూ అడిగాడు చెన్నారెడ్డి.
  " నేనిక్కడ లాజేస్తాండ  మామా ! " 
   "  ఔను గదూ  ! మరిచేపోయా...ఆ ఏంది సంగతి  ? బాగానే సదూతాండావా  ?  మంచి లాయరువుగావాల .. మన కేసులన్నీ నువ్వే వాదించాల  "  నవ్వుతూ చెప్పాడు.
  " యీ మద్య చిన్నాయనోల్లను సూసొస్తివా మామా  ? "
  " ఎందుకు లేదోయ్  ! మొన్ననే గద కడపకు పోయింది.."
  " ఇప్పుడు  కడపలో లేరు..రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చి చాలా రోజులైంది.."
  గతుక్కుమన్నాడు చెన్నారెడ్డి..అంతలోనే తేరుకొని  " అదేనోయ్  !  మారకముందే సూసొచ్చినా.  మల్లా పోదామంటే  తీరికేదీ.. మొన్న గూడా పోరుమామిల్ల సుబ్బరాయునితో అంటిని - రాజమండ్రి పోదామని...  ఆయప్పా సరేననె.. యాడబోతి ! నన్ను ఎమ్మెల్లేను జేసి జనాలమద్య యిడిసిపాయె మీ చిన్నాయన.  నాకదే జైలయింది. నన్ను నిద్రబోనిస్తా వుండారా ? ఉచ్చకు గూడా ఒక్కన్నీ పోనీయరనుకో. చెవుకాడ గీ పెడతానే వుంటారు... ఇంక యాడిపోతినోయ్  రాజమండ్రికి ? "
     " పోయిరాపో  మామా  ! నువ్వు పోతానంటే నేను తోడొస్తా. చిన్నాయన కూడా నిన్ను చూడాలంటా వుండాడు. నువ్వు కూడా చూసినట్టుంటుంది.. మాట్లడినట్టుంటాది  "  చెప్పాడు రమణారెడ్డి.
  " పోతే బాగానే వుంటదోయ్  ! పోవాల..  వాల్లను సూడకుండా నేనెవుర్ని సూడాల  ?  నా ఖర్మగాలి ఈరోజే జీపు తెచ్చుకోలేదు దొరా !  యింకోకనాడు వస్తా ! ఇద్దరం కలిసే పోదాంలే.. "  చెప్పాడు
  " సరే మామా !  "  అంటూ వెళ్ళిపోయాడు రమణారెడ్డి.
   సాయింత్రంగా ఫ్రెండ్స్‌తో కలిసి ప్రకాశం బ్యారేజి వద్దకెళ్ళి తిరిగి వస్తుంటే ఓ జీపులో ఎమ్మెల్లే చెన్నారెడ్డి కూచుని వున్నట్లుగా అన్పించి ఆశ్చర్యపోతూ అటుకేసి పరిశీలనగా చూశాడు.
  చెన్నారెడ్డే... సందేహం లేదు.
 నంబర్ ప్లేట్ చూశాడు
  జీపు కూడా అతనిదే
  తనతో అబద్దం చెప్పినట్టుంది  ’ జీపు తెచ్చుకోలేదని ’.
 అంటే ..అంటే .. రాజమండ్రి వెళ్ళి చిన్నాన్నను చూసేందుకు యిష్టం లేకనే అబద్దలాడాడేమో !  చిన్నాన్న ఏ జైలులో వుండేది కూడా అతనికి గుర్తులేదంటే తమను ఆయన ఎంతగా మర్చిపోయిందీ అర్థమవుతోంది.
  ఆ భావన భరించలేకపోయాడు రమణారెడ్డి.
  మళ్ళీ రోజే ప్రయాణమై హైదరాబాదు వెళ్ళి కోర్ట్ విషయాలు సేకరించుకొని రాజమండ్రి చేరాడు.
  చిన్నాయనకు విషయమంతా వివరించాడు.
   ఆయన మండి పడ్డాడు.
  చెన్నారెడ్డి ప్రవర్తన పట్ల ఆగ్రహోదగ్రుడయ్యాడు.
  శిక్షపడ్డ నేరస్తుల్ని చూసేందుకు సిగ్గు పడుతున్నాడేమో..!!
  శిక్ష అనుభవించే వాళ్ళ గుండా తనకు లాభంలేదని వదిలేశాడేమో ! ఇంతలోనే చేసిన మేలు మరిచాడంటే - వాడెంతటి నీచుడు !
  బహుశా వాని చర్యల్ని తను విమర్శించడం వల్లనే తమకు దూరంగా జరుగుతున్నాడేమో !
  తాను ఖండించింది  మానవత్వం లేని పనుల్నేగదా !
  తనగుండా ఏలాభం పొందని వాళ్ళు సైతం తన్ను చూడ్డానికొచ్చారు.
  తను ఓట్లు గుద్దిపోస్తే ఎమ్మెల్లే అయిన వ్యక్తి తన్ను తృణీకరించి కనీసం చూసేందుక్కూడ  రాలేదంటే..?
  కష్టాల్లో వున్నప్పుడు పలకరించి హృదయాన్ని తగిలేలా ఆత్మీయ వ్యాకాన్ని పలికేవాడేగదా  మిత్రుడంటే -
  శత్రువుకంటే హీనం.
  తనకిప్పుడు అనుమానమొస్తోంది - పోలీసు సాక్ష్యాన్ని లోబరుచుకొనేందుకు సరైనా ప్రయత్నం చేయలేదేమోననని.
   నమ్మి అతనికి భాద్యత అప్పగించాడు తను.
  కడుపులో పెట్టుకొని చేసినట్టుంది.  అతన్ని బహిరంగంగా వ్యతిరేకించినందుకు లోలోపల ప్రతిచర్య చూపినట్టుంది.
  చెన్నారెడ్డి ప్రవర్తనను భరించలేకపోతున్నాడు ఓబుళరెడ్డి.

                                    ******

    కోర్టు తీర్పు అనుకొన్నంత తొందరగా వెలువడలేదు
  ఎమ్మెల్లే రాజమండ్రికి వెళ్ళి చూసిరాలేదు.
   రోజు రోజుకు అతని మీద వ్యతిరేకత పెరుగుతోంది ఓబుళరెడ్డికి.
  తమను చూడ్డానికొచ్చిన శేయోభిలాషుల ముందు అక్కసంతా వెల్లగక్కుతున్నాడు. చెన్నారెడ్డి కృతఘ్నత గురించి చెబుతున్నాడు.
  అది పామని తెలీక దాని దలమీద కిరీటం పెట్టించి తాలుకా ప్రజలందర్నీ దాని పడగ కిందికి తెచ్చాననీ,  ఆ పాపమే తననీవిదంగా కాల్చుకు తింటోందనీ వాపోయాడు.
  విచారణ అనంతరం ఎట్టకేలకు కోర్టు తీర్పు వచ్చింది.
  బాలునికి ఒక్కనికే లైఫ్ జెప్పారు.
  మిగతా వాళ్ళంతా  ఇళ్ళకొచ్చారు.
  బాలునికి కూడా శిక్ష పడకూడదనీ సుప్రీం కోర్టుకు అప్పీలు చేయాలని అనుకొన్నారు  గాని  సన్నిహితులైన లాయర్లు వద్దని చెప్పటంతో విరమించారు.
  బాలుని గురించి కుటుంబమంతా తల్లడిల్లుతూ వుంది.
  అందరి  బదలూ అతనొక్కడే శిక్ష అనుభవించటం బాధాకరంగా వుంది.
  మరోవైపు చెన్నారెడ్డి ప్రవర్తన రంపం పెట్టి కోస్తూ వుంది.
   తాము ఇంటికొచ్చిన తర్వాత కూడా కలవలేదు అతను. మర్యాదకైనా వచ్చి పలకరించిపోలేదు.
  చెన్నారెడ్డి నిర్లక్షాన్ని ఎట్లా జీర్ణించుకోవాలో అర్థం కావటం లేదు ఓబుళరెడ్డికి. ఒక్కోసారి అన్పిస్తూ వుంటుంది - అతను పూర్తి స్థాయి ఎమ్మెల్లే అయ్యాడని.  తాని ఎమ్మెల్లే తప్ప మామూలు మనిషిని కాదనుకొంటున్నాడేమో  !  చెన్నారెడ్డిగానే వుండుంటే తాము గుర్తుండేవాళ్ళం. తమ స్నేహం గుర్తుండేది.  పాతరోజులు గుర్తొచ్చేవి.... మానసికంగా కూడా అతను పూర్తిగా ఎమ్మెల్లేగా మారిపోయాడు.  తాలుకాలోని అందరి ఓటర్లలో తమనూ ఒకరిని చేశాడు.
  చెన్నారెడ్డి  దూరమవుతున్నాడనే భావన మొలకెత్తి పెరిగి పెద్దదవుతున్నకొద్దీ  అతనిమీద ద్వేషం కూడా సమానస్థాయిలో పెరుగసాగింది. కనిపించిన ప్రతివాడివద్దనల్లా  తన కోపాన్ని వెళ్ళగక్క సాగాడు.  " నేను చేస్తేనే ఎమ్మెల్లే అయినాడు.. వానికింతా పొగురా  ? "  అంటూ వ్యాక్యానించసాగాడు.
  ఓబుళరెడ్డి మాటలు తూ.చ తప్పకుండా చెన్నారెడ్డికి చేరుతున్నాయి. పరిస్థితి ముదరకముందే  సర్ధుబాటు చేసికోవటం విఙ్ఞుల లక్షణమనుకొన్నాడు అతను  ’ ఓబుళరెడ్డిని బద్వేలు రమ్మని మనిషిని పెట్టి మరీ చెప్పి పంపాడు.
  " నేను వానికాడికి రావాలంటనా ? "  మండిపడ్డాడు కబురుతెచ్చిన మనిషివద్దే ఓబుళరెడ్డి.  " ఎమ్మెల్లే కాగానే అంతలావు బలుస్తే మంచిదిగాదు.  ఆ ఎమ్మెల్లే ఎట్లయిండో రోంత (కొద్దిగ) గుర్తుకు తెచ్చుకోమను. మేము జేస్తే ఎమ్మెల్లే అయినాడు - మామీందనే అధికారం చూపిస్తాడా ? "  అంటూ విదిలించి పారేశాడు.
  చెన్నారెడ్డి రోషానికి పోలేదు.
  తనే వస్తున్నాననీ, ఇంటివద్దే వుండమనీ చెప్పి పంపాడు.
  చెన్నారెడ్డి వెళ్ళేసరికి ఓబుళరెడ్డి వూరు వదిలాడు,  అతనికి అందకుండా పోరుమామిళ్ళలో మిత్రుని యింట కూచున్నాడు.
  " ఏంది మామా యిదెంతా  ? నేనేం జేసినానీ  నా మీంద కచ్చెగట్టినారు ? మీకంత ఇష్టం లేకుంటే చెప్పండి యిప్పుడే రాజీనామా గీకేస్తా !  యీ ఎమ్మెల్లే పదవి సరే - ఏంటికె సరే .."  అంటూ పెద్దిరెడ్డి ముందు వాపోయాడు.
  చెన్నారెడ్డి తప్పుల్ని నిర్మోహమాటంగా  ఎత్తిచూపాడు పెద్దిరెడ్డి. చివరగా చెప్పాడు ’ యిద్దరూ ఎదురెదురు కుచుని మనసి విప్పి మాటాడుకొని మనస్పర్థలు తుడిచేసుకోమని.
  " నేనందుకే గద మామా వొచ్చింది .."  తలపట్టుకొన్నాడు.
  " మావోడు రోంత పెంకె. మాటొస్తే పడడు. ఒక్క సిటికె నువ్వే ఓర్పు బట్టాల దొరా ! మీరిద్దరూ కొట్లాడుకోంటే చూసేవాల్లు నవ్వుతారు  "  చెప్పాడు.
  " దానికే గద మామా నేనుబయటపడేది.  అతగాన్ని రమ్మను. తప్పుంటే చొక్కాపట్టుకొని మాట్లాడమను. అంతేగాని దూరదూరంగా వుండొద్దని చెప్పు  "  అంటూ జీపెక్కాడు.
  తర్వాత పదిరోజులకు మరోసారి ప్రయత్నించాడు చెన్నారెడ్డి.
 తనతో కలిసే అవకాశం అతనికి ఏమాత్రమూ యివ్వటంలేదు ఓబుళరెడ్డి.  తన పనిమీద తాను తిరుగుతున్నాడు. బ్రాంది షాపు లైసెన్స్ కోసం అప్లై చేసుకొని వున్నాడు. దాని విషయంగా అధికారుల చుట్టూ తెగ తిరుగుతున్నాడు.
  తనెన్ని ప్రయత్నాల్లో వున్నా చెన్నారెడ్డిని తిట్టటం మాత్రం చాలించలేదు ఓబుళరెడ్డి.  తన ముందు ఎమ్మెల్లే గురించి ఎవరైనా మాట్లాడితే మండిపడతాడు.  " వాని సంగతి నాకాడ ఎత్తగాకండి.. నేను జేస్తే ఎమ్మెల్లే అయినాడు. నాకాడనా వానిగొప్పజెప్పేది ? "  అంటూ విదిలించి పారేస్తున్నాడు.
  ఎమ్మెల్లే మెప్పుకోసం ఆ మాటలన్నీ పొల్లుబోకుండా తీసికెళ్ళి ఆయన చెవినేస్తున్నారు కొందరు.
  ఓబుళరెడ్డి ప్రవర్తన ఎమ్మెల్లేకు కొంత యిబ్బందికరంగా అన్పించింది.  అవమానకరంగా కూడా తోచింది.
  డిగ్రీ అయిపోయి ఇంటివద్దే వున్నాడు ఓబుళరెడ్డి కొడుకు నర్సిరెడ్డి. బ్రాందిషాపు లైసెన్స్ గురించి తను ఇన్‌చార్జి తీసుకొని తిరగటం మొదలెట్టాడు.
  రెండ్రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగే సరికీ అర్థమైంది  దానికి మినిస్టర్ రెకమండేషన్ వుంటేగాని పన్జరగదని.
  ఆఫీసుర్‌తో మాట్లాడుతూ వుంటే ఎమ్మెల్లే చెన్నారెడ్డి వచ్చాడు.
 తన్నితను గుర్తుబట్టి నట్టు లేదు.
  అదే మంచిదని లేచి బైటకొచ్చాడు.
  పదినిమిషాల తర్వాత వాచ్‌మన్ వచ్చి తన పేరుబెట్టి పిల్చేసరికి ఆశ్చర్యపోయాడు నర్శిరెడ్డి.
  " నిన్నే సార్  ! పెద్ద సారు పిలుస్తావుండాడు  "  చెప్పాడు.
  లోపలికి నడిచాడు.
  " ఏం  వోయ్ ! నేనంటే కనుక్కోలేదు నువ్వయినా పలుకరించేది లేదా ?.. రా.. కూచో.."  అన్నాడు చెన్నారెడ్డి.  " షాపు లైసెన్స్ కావాలంటే ఒక్క మాట నాకు చెప్పిపంపుతే నేను తెచ్చివ్వనా ! నేనుండేది ఎందుకోయ్ - మీ పనులగ్గూడా మీరు రావాల్నా ? "  అన్నాడు
 " రేపొద్దున్నే నాతోరా  ! "  చెప్పాడు
  మళ్ళీరోజు  నర్శిరెడ్డిని వెంటబెట్టుకొని హైదరాబాదు వెళ్ళాడు.
 నేరుగా ఎక్సైజ్ మినిస్టర్ చాంబర్‌లోకి తీసికెళ్ళాడు.
  " ఇతను నా అల్లుడు. నాకు ఆత్మీయుడు... నా నియోజకవర్గంలో ఒక మండలమంతా వీళ్ళ చేతికింద వుంది. నేను ఎమ్మెల్లే కావడానికి ప్రధాన కారుకులు వీళ్ళే. నెత్తురు పుసుకొని ఎలక్షన్ చేశారు.  పదివేల ఓట్లు గుద్దిపోసి నన్ను గెలిపించారు.  వీళ్ళకు పన్జేస్తే మీరు నాకు పన్జేసినట్లే .."  అంటూ మినిస్టర్ వద్ద గొప్పగా చెప్పాడు. లైసెన్స్ వచ్చేందుకు లైన్ క్లియర్ చేశాడు.
  బైటకొచ్చిన తర్వాత నర్శిరెడ్డిని పక్కనే కూచోబెట్టుకొని  " చూడోయ్  మినిస్టర్ కాడ కూడా చెప్పినా నేను ఎమ్మెల్లే అయ్యేందుకు కారణం మీరేనని. నేను మీరు చేసిన ఎమ్మెల్లేనని....మీరు చేస్తేనేనోయ్ నేను ఎమ్మెల్లే అయ్యిందీ !  ఆ విషయం  అందరిలో నేను చెప్పుకుంటే మీకు గౌరవం వుంటదిగాని, మీరు చెప్పుకొంటే కాదు దొరా ! రొవ్వంత మీ నాయనకు చెప్పు.. ఎగతాలిగా మాట్లాడొద్దని చెప్పు. నాకు అవమానమైతే మీకు అవమానం గాదా ! "  అంటూ బతిమాలాడు.
  ఆయన మాటల్లో నిజముందనిపించింది నర్శిరెడ్డికి కూడ.
  ఇంటికెళ్ళి పెదనాన్న వద్ద తన మనసు విప్పాడుగాని తండ్రి వద్ద నోరెత్తలేకపోయాడు.  ఎమ్మెల్లే తన్ను ఆదరించిన విషయం, పనిచేయించిన సంగతీ మాత్రం అందరిముందూ ప్రకటించాడు. విననట్టుగా ఎటో చూస్తూ వెళ్ళిపోయాడు ఓబుళరెడ్డి.
  తన ధోరణి మాత్రం మార్చుకోలేదు.
  మరోసారి  నర్శిరెడ్డి వద్ద తన బాధను వెళ్ళబోసుకొన్నాడు ఎమ్మెల్లే.
  అతని మాటలు నమ్మే స్థితిలో లేడు ఒబుళరెడ్డి.  బ్రతిమాలాటాలు, బాధను వ్యక్తపరచటాలూ, ఇవన్నీ పచ్చి నటనలని అతని అభిప్రాయం.  తనవాళ్ళవద్దా, లోకుల వద్దా ’ అయ్యో పాపం ! ’ అనిపించుకోవాటానికి చేస్తున్న చేష్టలు అవి.  ఎమ్మెల్లే అంతటి వాడు బంగపడుతోన్నా ( బతిమాలుతున్నా ) లెఖ్కజేయని తలబిరుసు మనిషి శివపురి ఓబుళరెడ్డి ’ అని నలుగురూ భావించాలని అతని ఆలోచన అని.
  అతను పూర్వపు చెన్నారెడ్డే అయ్యుంటే తనకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చేవాడు కాదు. కూలి తీసికొని మనుషుల్ని చంపించే వాడు కాదు.  సారా వేలం పాటల్ని దౌర్జన్యంగా చేజిక్కించుకొనేవాడు కాదు.  ఇప్పటికే చాలా పల్లెల్లో మద్యం షాపులన్నీ అతని అనుచరులవే. అన్నిట్లో అతనికి భాగముందని వినికిడి. డబ్బు సంపాదన కోసం ఎన్నెన్నో అడ్డదారులు తొక్కుతున్నాడు.
  చెన్నారెడ్డిని తల్చుకొంటే చాలు తను జైల్లో వున్న రోజులే గుర్తొస్తాయి. తన్ను చూసేందుక్కూడ యిష్టపడని అతని చర్య గుర్తుకొస్తుంది. అతనిమీద అంతులేని ఏహ్యభావం కలుగుతుంది. ఎదురుగా ఎవరైనా వుంటే వాళ్ళ ముందే అతన్ని తిడతాడు. ఎవరూ లేకుంటే గోడకేసి తిరిగి అయినా తిట్టుకొంటాడు.
  ఓబుళరెడ్డి తిట్టటం మానుకోకపోయేసరికి క్రమేణా అతనిమీద నమ్మకం నశించింది ఎమ్మెల్లేకు కూడా. రాయబారాలు పంపటం చాలించాడు. రమణారెడ్డి, నర్శిరెడ్డెలు కన్పించినా  ఇదివరకటిలా ఆప్యాయంగా పలుకరించటం మానాడు.
  ఓబుళరెడ్డి, చెన్నారెడ్డి లిద్దరూ ఎక్కడైనా పరస్పరం ఎదురుపడినా పలుకరించుకోవటం లేదు. ఒకరి మొగాలొకరు చూసికోవటం లేదు.
  ఇద్దరి మద్యా అగాథం ఏర్పడింది.
  ఆ విషయంలో తాలుకా అంతటా తెలిసిపోయింది.
  జాతీయపార్టి వాళ్ళకు కొంత ఆశ చిగురించింది.
  చెన్నారెడ్డి వ్యతిరేక వర్గీయులంతా రహస్యంగా సమావేశమయ్యారు. ఓబుళరెడ్డిని  జాతీయపార్టిలోకి లాక్కొంటే ఎలా వుంటుందా..? అని చర్చలు జరిపారు.
  చెన్నారెడ్డిని వ్యతిరేకంచి, ఎదురించే బలమైనా మొరటైన వర్గం ఒకటి వచ్చి కలవటం వలన జాతీయ పార్టి బలపడుతుందని భావించారు.
  శివపురి వాళ్ళను జాతీయపార్టిలోకి లాగాలని తీర్మానించారు.
  కొందరు అనుభవఙ్ఞులు ఆ భారాన్ని తమ భుజానేసుకొన్నారు.

                                                                                                        ........ సశేషం

                                                                                                          .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.                                                                      

      చెన్నారెడ్డి గెలుపు పండుగ నియోజక వర్గమంతా చుట్టివచ్చేసరికి దాదాపు మూడునెలలు పట్టింది. సుమారైనా నాయుకలంతా ఎమ్మెల్లేను తమ వూరికి పిలవటం, పొట్టేళ్ళను కోసి, వచ్చిన వాళ్ళందరికీ విందులివ్వటం, తమ వూరి సమస్యల్ని ఆయన ముందు చిట్టా విప్పటం.
   రాష్ట్రంలో కూడా ప్రాంతీయపార్టి ప్రభుత్వం ఏర్పడటం వలన తాలుకా అభివృద్దికి ఆటంకం వుండబోదని అందరికీ ఆశ.
  చెన్నారెడ్డి వెంట తనూ కొన్ని వూళ్ళకు వెళ్ళాడుగాని, తర్వాత ఎందుకో ఇష్టపడలేదు ఓబుళరెడ్డికి.
  కోర్టు వాయిదాలు వేగమంతమయ్యాయి.
  మీద మీద డేట్లిస్తున్నారు
  సాక్ష్యాల్ని రికార్డు చేస్తున్నారు.
  దగ్గిర దగ్గిర వాయిదాలు వేయటం వలన ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అప్పులకోసం చేయి చాచాల్సిన పరిస్థితి వస్తోంది. మొన్న ఎలక్షన్స్‌లో చేతి చమురు చాలా వదిలింది.
  చెన్నారెడ్డి వద్దకెళ్ళి యింత ఖర్చయిందని చెప్పేందుకు అహం అడ్డు.  తనయినా గుర్తెరిగి ఇవ్వాల్సిన భాద్యత వుంది... కానీ జోబులోంచి ఒక్క రూపాయి కూడా బైటకు తీయలేదు.
  ముగ్గుపిండి గనుల మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టాడు ఓబుళరెడ్డి. దిగుబడిని పెంచేందుకు కృషి చేస్తున్నాడు. మద్యదళారీల్ని నమ్ముకోకుండా నేరుగా మద్రాసు ఫ్యాక్టరీలకు తామే తరలించేందుకు నడుం బిగించాడు. ఎమ్మెల్లే సహాయంతో మార్గాన్ని సుగమం చేసుకొన్నాడు.
   కోర్టు కేసు ఓబుళరెడ్డిని మానసికాందోళనకు గురిచేస్తోంది. కేసు పర్యవసానం ఏమవుతోందనని అలజడి. సాక్షల్ని కొంత వరకు లోబరుచుకొన్నారుగాని పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. పోలీసు సాక్ష్యం కొంత ఇబ్బందికరంగా తయారైంది. అతనికి యస్.పి భరోసా ఇచ్చినట్లుంది... లోంగటం లేదు.
   ఇప్పుడు ప్రభుత్వం మారిందిగదా ! మనవాడే ఎమ్మెల్లే అయ్యాడుగదా !  ఎస్పీ మీద వొత్తిడి తెస్తే ఫలితంముంటుందేమో అనే ఆశ. అందుకే రెండు మూడుసార్లు చెన్నారెడ్డి వద్ద ఆ విషయం ప్రస్తావించాడు.
  అతని చుట్టూ  ఒకటే రద్దీ, ఒకటే కోలాహలం... తన మాటలు అతని చెవిదాకా వెళ్ళనీయట్లేదు జనాలు. చివరకు ఎలాగోలా అతని చెవినేస్తే  " యీరోజే మాట్లాడ్తానోయ్ !  ప్రభుత్వం మనది గదా !  మనమాట ఎందుకినడూ  ? "  అన్నాడు.
  తర్వాత మాట్లాడాడో లేదో తెలీదు.
  పోలీసు సాక్ష్యం కూడా రికార్డయ్యింది.
  బాలుని మీద బాగా నేరం మోపినట్లుంది.
   సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్లేగా బాగా నిల్దొక్కున్నాడు చెన్నారెడ్డి.  తన వర్గం వాళ్ళకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నాడు. ముఖ్యంగా గొడవలున్నచోట ఆయుధాల్నించి మనుషులదాక అందిస్తున్నాడు.
  కొన్ని ఏరియాల్లో రాజకీయం చాలా మార్పులకు గురవుతోంది, పల్లెల్లో చెన్నారెడ్డి వర్గీయుల దాడులు అధికమయ్యాయి. ఇంతదాకా తమదే పైచేయిగా ఆధిపత్యం చెలాయిస్తున్న వాళ్ళు కాస్తా ఇప్పుడు ఎదురుదెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తోంది. తనవాళ్ళ పట్ల చెన్నారెడ్డి ప్రత్యేక శ్రద్ద కనబరచటం వలన చెలరేగిపోయి ప్రత్యుర్థల్ని లొంగదీయటంలో సఫలీకృతమవుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోడానికి బలమైన పునాదులు వేయిస్తున్నాడు ఎమ్మెల్లే.  ఆ క్రమంలో కొన్నిచోట్ల పెద్ద గొడవలయ్యాయి. పోలీసు కేసులయ్యాయి. ఒకటి రెండు ఖూనీలు కూడ పడ్డాయి.
  కేసుల కోసం టౌనుకొచ్చిన ప్రత్యుర్థుల మీద దాడుల చేయించి భయబ్రాంతుల్ని చేసే కొత్తరకపు చర్యలకు కూడా శ్రీకారం చుట్టాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి. టౌన్‌లోనే సంసారం వుండటం వలన మెరికల్లాంటి మనుషుల్ని తయారుచేసి ప్రత్యుర్థలమీద దాడులకు వినియోగిస్తున్నాడు.
   అతని చర్యల్ని అడ్డుకోనేందుకు మొదట నాగిరెడ్డి వర్గం ప్రయత్నించింది గాని అతని మొరటుదనం ముందు నిలబడలేకపోయింది. టౌనులోని తమ ఆస్తుల్ని పరిరక్షించుకోంటే చాలనే స్థితికి చేరారు వాళ్ళు.
             
                                     *******

    దండోరుపల్లెలో మళ్ళీ గొడవలు.
  ఏరుదాటి వచ్చిన సుబ్బారెడ్డివర్గానికి తాము రక్షణ కల్పించక తప్పటంలేదు.  వాళ్ళ కేసులు కూడా తామే చూడాల్సి వస్తోంది ఓబుళరెడ్డికి.  అది తమకు తప్పనిసరి భాద్యత కూడా.
   నరసింహారెడ్డి విజయవాడలో లా చదవడానికి వెళ్ళాడు. మిగతావాళ్ళు కూడా చదువుల్లో బాగానే ఎక్కిపోతున్నారు.
  దండోరు పల్లెలో గొడవలు మరింత పెరిగాయి.
  ఒకనాటి రాత్రి సుబ్బారెడ్డి వర్గమంతా ఏటికడ్డంగా పారిపోయొ వచ్చి ఓబుళరెడ్డిని శరణుపొందారు.
   కొత్త మనుషల్ని తెచ్చి బాంబులేస్తూ తరుముకున్నాడుట రంగారెడ్డి.  దొరికివుంటే చంపేవాళ్ళట.
  తమకు కూడా బాంబులు కావలన్నాడు సుబ్బారెడి. బాంబింగ్ చేసే మనుషులు కూడా కావాలిట.  సప్లై చేయమన్నాడు. ఎంత ఖర్చయినా భరించుకొంటామని చెప్పాడు.
   ఓబుళరెడ్డి వొప్పుకోలేదు.
  ఖూనీలు చేసి తాము పొందే అనుభవమేమితో స్పష్టంగా తెలుస్తూనే వుంది.  దాని లాభమెంతో అర్థమవుతూ వుంది. తమ వెంట చాలా సార్లు లాయర్ల వద్దకూ కోర్టుల వద్దకూ అతను కూడా తిరిగాడు కాబట్టి యీ అగచాట్లు అతనికి కూడా తెలుసు.
  ఏ క్షణం తీర్పు వెలుబడుతుందో తెలీదు.  వాటి స్వరూపం ఎట్లా వుంటుందో కూడా అర్థం కాలేదు.   లైఫ్ చెప్పినా చెప్పొచ్చు.  క్షణం క్షణం కోర్టు తీర్పును వూహిస్తూ మానసికంగా సగం చచ్చిపోవాలి.
   తమని చూసి జాగ్రత్తపడమని సలహాయిచ్చాడు సుబ్బారెడ్డికి.
  తర్వాత  తనమనుషుల్ని దండోరుపల్లెకు పంపి గ్రామపరిస్థితిని తెలుసుకొన్నాడు.
  గ్రామంలో ఆడవాళ్ళు జోలికి రావటం లేదట. వామిదొడ్లను ( గడ్డితో పెద్ద పెద్దగా వాములు చెయటం =గడ్డివాము), పశువుల్ని, పంటల్ని నాశనం చేసే పనులకు వొడికట్టటం లేదుట.
  పూర్వం నించీ సాంప్రాదాయకంగా వస్తోన్న న్యాయమే అది, ఎంతపెద్ద గొడవలైనా, ఎన్ని ఖూనీలు పడినా ఆడవాళ్ళ జోలికి పోయేదిలేదు. చిన్న పిల్లల్ని ఏమనేదిలేదు. పశువుల్ని చంపటమో, పైర్లూ నాశనం చేయటమో జరగదు. గొడవల్లో కూడా ఒక యుద్దనీతి వుంది.  ఆధిపత్యపోరాటాలో, వ్యక్తిగత కక్షలే కాబట్టి గొడవలు కూడా ఆ పరిధిలోనే వుంటాయి.
  దండోరుపల్లెకు  మద్యవర్తుల్ని పంపాడు ఓబుళరెడ్డి. కొత్తవాళ్ళను తెచ్చుకొని దాడులు చేయించటం మంచిపద్దతి కాదనీ, గతంలో ఒకసారి తమవూరికి కొత్త మనుషుల్ని పంపి ఎట్లా భంగపడ్డారో గుర్తు చేసుకొమ్మనీ, పద్దతి మార్చుకోకపోతే తాము కూడా మనుషుల్ని పంపించవలసి వస్తుందనీ ఘాటుగా చెప్పించాడు.
    తర్వాత నాలుగు రోజులకే గొడవ సద్దుమణిగింది గాని పదిరోజుల తర్వాత సుబ్బారెడ్డి మళ్ళీ వచ్చాడు.
   " మామా !  రంగారెడ్డి గాన్ని నమ్మలేకుండాము.  వాడు లోపల్లోపల యేందో సేస్తాండాడు. కొత్తమాసుల అలికిడి తగ్గలేదు.  రాత్రిల్లు  మావోల్లు ఇండ్లల్లోంచి బైటికి రావాలంటే భయపడ్తాండారు.  ఎప్పుడేం జరుగుతదో అంతుబట్టడంలే... యీధిల్లోకి రాడానికిగ్గూడా బయపడ్తాండం.. యీ సావు మేం సావలేం మామా ! యీ బాధ తట్టుకోలేం..  వాన్ని బేసెయ్యకుంటే మాకు నిద్దర్రాదు... "  చెప్పాడు.
    అతనికేసి తదేకంగా చూశాడు ఓబుళరెడ్డి.
  "  ఎమ్మెల్లేతో ఒక్క మాట సెప్పరాదా ! "  అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు.
  నొసలు ముడేస్తూ  " ఏమని ? " అడిగాడు ఓబుళరెడ్డి.
  " మనుషులను పంపమను వాల్లకు నేనే లెక్కించుకుంటా. రంగారెడ్డిగాన్ని బేసి పోతారు ( వేసేసిపోతారు).... మాకా పీడ తప్పించు మామా  ! "
   ఆశ్చర్యంగా అతని కేసి చూశాడు.
  " ఎమ్మేల్లేకాడ లెక్కల్దీసుకొని  ఖూనీల్జేసే మనుషులుండారా  ? "  అన్నాడు
  ఇప్పుడు ఆశ్చర్యపోవటం  సుబ్బారెడ్డి వంతయింది.
   " ఏమి ఎరగనట్టు మాట్లాడ్తావేంది మామా  !  మెరికల్లాంటి మనుసులుండారు.  ఆయప్ప మాసుల్ని తెచ్చుకుంటే పోలీసు కేసులకు కూడా సాయం జేస్చాడు.. "
  మారు పలకలేదు ఓబుళరెడ్డి.
  అతనికి నోరు పెగల్లేదు.
  చెన్నారెడ్డి తన వర్గీయులకు మాట సాయం, మంది సాయం చేస్తాడని తెలుసుగాని. కిరాయికి ఖూనీలు చేయించే పనిపెట్టుకొన్నాడని వినలేదు.  అట్లాంటి  ఆలొచన చెన్నారెడ్డికి వస్తుందని కూడ వూహించలేదు.
   " నేన్జెప్పింది మర్చిపోగాకు మామా ! "  అంటూ మరోసారి హెచ్చరించి వెళ్ళాడు సుబ్బారెడ్డి.
  అతని అభియోగం నమ్మదగినదిగా అన్పించలేదు ఓబుళరెడ్డికి. కమ్యూనిస్టులతో సంబంధాలున్నవాడు, కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడు.. అలాంటి నీచస్థాయికి దిగజారతాడని అతను భావించటం లేదు.
    అందుకే సుబ్బారెడ్డి కోరికను, దాన్ని తీర్చుకొనేందుకు అతను సూచించిన మార్గాన్నీ స్మృతినుంచి తప్పించేశాడు.

                                              *****

       వర్షాకాలం వచ్చింది.
  వానదేవుడు కొంత కరుణించనట్లుంది.
  సగిలేరు పొంగి ప్రవహిస్తోంది
  ఇలాంటి సమయంలోనే దండోరుపల్లెల్లో గొడవలు రాజుకొనేది, బైటి ప్రపంచంతో సంబంధాలు తెగినపుడు రంగారెడ్డి విజృంభిస్తాడు.  అవతలి వర్గం మీద యుద్దం ప్రకటిస్తాడు. ఇరువర్గాలూ మిద్దెల మీద బండ్లకొద్దీ రాళ్ళు పోసుకొంటారు. చేతులు నొప్పి పుట్టేదాక విసురుకొంటారు, అవకాశమొస్తే కర్రలతో తలలు పగులగొట్టుకొంటారు. ఏరు తగ్గేదాక సరైన వైద్య సహాయం కూడా వుండదు.
  రాళ్ళ యుద్దంలో ఆడవాళ్ళు, పిల్లలు కూడా పాలుపంచుకొంటారు.  ఆడవాళ్ళు రాళ్ళు విసరటంలో సాయం చేస్తుంటారు, మగపిల్లలు తమ తండ్రుల తోటి తాము హుషారుగా రాళ్ళు విసురుతారు.
  ఆ నాలుగు రోజులూ మగాళ్ళు గుంపులు గుంపులుగా తిరుగుతారు,  అవతలి వాళ్ళ చేల మద్య తమ చేలున్నపుడు ఇంటి ఇల్లాల్లే కూలీల సాయంతో వ్యవసాయం చేయిస్తుంటారు.
  వ్యవసాయి పనుల్ని ఎవ్వరూ అడ్డుకొనేది లేదు.
  ఏటి చెలిమల్లో నీల్లు కూడా వంతుల వారీగా తెచ్చుకొంటారు.
వారం రోజులైనా ఏటి ఉరవడి తగ్గలేదు
  దండోరుపల్లె వాల్ల ఆచూకి తెలియలేదు.
  మాటల సందర్భంలో వాళ్ళ ప్రస్తావన వచ్చినపుడు ఆందోళన ప్రకటించాడు ఓబుళరెడ్డి.
  క్రమేణా ఏటి ఉరవడి తగ్గింది
  వాటం తెలిసిన మనిషి ఏటిని దాటగలుగుతున్నాడు.
  ఆ తరుణంలోనే ఏటి అవతల్నించి నలుగురు మనుషులు జట్టుగా కూడి వచ్చారు.
  వాళ్ళు అందించిన తొలిసమాచారం ’ సుబ్బారెడ్డిని పోలీసులు తీసుకెళ్ళారట ! ’
  " ఎందుకూ  ? "  పెద్దిరెడ్డి కంఠంలో ఆదుర్దా.
 " మీకింగా తెల్దా ? రంగారెడ్డి ఖూనీ అయ్యిన్లే ! "
 విన్నవాళ్ళంతా నమ్మలేనట్టుగా చూశారు.
  " బద్వేలు పోయిన్నెడంట  ఆడేం జరిగిందో ఏమో ! ..లాడ్జి కాన్నే నరికినారంట.  మీకు తెల్సింటాదనే అనుకున్నెం "
  " ఎప్పుడు రా ? "
  " రేత్రేనంట పెద్దయ్యా ! "
  ఓబుళరెడ్డి ప్రయాణమయ్యాడు
  " మాగ్గూడకా  యీ పొద్దున్నే తెల్సింది పోలీసోల్లొచ్చి సుబ్బారెడ్డి యింటి కాడికి పోయినాంకనే "
  ఓబుళరెడ్డికి నమ్మశక్యం కాలేదు.
  సుబ్బారెడ్డికి తెలీకుండా రంగారెడ్డి ఖూనీగావటం అసంబద్దమైన విషయంగా తోచింది.  కూలికి ఖూనీ చేసే వాళ్ళగురించి  తన్నతను అడిగిన విషయం కూడా గుర్తుకొచ్చింది.
  జనాన్ని వెంటేసుకొని పోరుమామిళ్ళ చేరాడు.  పోలీసు స్టేషన్‌కు వెళ్ళి సుబ్బారెడ్డిని కలిశాడు.
  స్టేషన్‌లో విచారిస్తే అతనిమీద ఇంకా కేసు బుక్ చేయలేదని తెలిసింది. ఎంక్వయిరీ చేస్తున్నారట.
  బద్వేల్ వెళ్ళి లాయర్‌ను కలిశాడు.
  అతనితో చాలా సేపు మాట్లాడి ఎమ్మెల్లేకు ఫోన్ చేయించాడు.  ఊల్లో లేడుట ఎమ్మెల్లే.
 సాయింత్రానికి గాని రాలేదు అతను
  విషయం వినగానే  "  అదెట్లా ? అతనికేం సంబంధముందనీ అరెస్ట్ చేస్తారు..?  ఖూనీ జరిగింది ఎక్కడో  ?  చంపింది ఎవురో ?  ఆ టైంలో అతను ఇంటికాన్నే వున్నేడుగదా..!  పోదాం  పా.. ఆ ఎస్సై సంగతెందో తేలుస్తా.. "  అంటూ జీపును బయటకు తీయించాడు.
  అంతా చూసినట్లు మాట్లాడుతున్నాడు చెన్నారెడ్డి.
  తను అభ్యర్థించకముందే  కేసుపట్ల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఓబుళరెడ్డికి ఆశ్చర్యంగా వుంది.
   పోరుమామిళ్ళ పోలీసు స్టేషన్లో ఎస్సైని దబాయించాడు చెన్నారెడ్డి. తన ఎమ్మెల్లే ప్రతాపాన్నంతా చూపించాడు. ఇప్పుడే హోం మినిస్టర్‌తో ఫోన్ చేయిస్తానన్నాడు.  సాక్ష్యాలుంటే నిరభ్యంతరంగా అరెస్ట్ చేయమన్నాడు.  టౌన్ వాళ్ళతో ఏవో గొడవలవల్ల రంగారెడ్డి ఖూనీ చేయబడ్డాడేగాని .. సుబ్బారెడ్డికి కేసుకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు.
  డి ఎస్పీ వచ్చి సర్ది చెబితేగాని వినుకోలేదు చెన్నారెడ్డి.
  ఎంక్వయిరీ చేస్తున్నామనీ, సుబ్బారెడ్డి నిర్దోషిగా నిరూపణ అయితే వదిలేస్తామని చెప్పాడు డి ఎస్పీ.
  బైట కొచ్చిన తర్వాత ఓబుళరెడ్డికి చెప్పాడు  "  పోలీసులకు కొంత ఎక్కువ మొత్తమే ముట్టజెప్పమని "
  తర్వాత పోలీసులకు అందవలసిన డబ్బు అందింది.
  సుబ్బారెడ్డి తోటి మరో నలుగురిమీద కేసు రిజస్టరయ్యింది.  బేయిలబుల్ సెక్షన్స్ కాబటి సులభంగానే బైటకొచ్చారు వాళ్ళు.

                                *****

    ఒక రోజు శివపురికి వెళ్ళాడు సుబ్బారెడ్డి. అత్యంత రహస్యంగా ఓబుళరెడ్డి చెవిలో అసలు రహస్యం వూదాడు. చెన్నారెడ్డి మనుషులేనట రంగారెడ్డిని ఖూనీ చేసింది. చింతకుంట గొల్లలు యిలాంటి విషయాల్లో ఆరితేరారుట. వాళ్ళనే పంపాడట.  వారం రోజుల ముందే వాళ్ళకు తను రంగారెడ్డిని చూపించాడుట. ఇరువై ఐదువేల రూపాయల వొప్పందమట.
  మనస్సు వికలమైంది ఓబుళరెడ్డికి
   అన్న వద్దకెళ్ళి సంగతి చెప్పగానే ఆయనకూడా నొచ్చుకున్నాడు. చెన్నారెడ్డి అలాంటి పనులు చేయిస్తున్నాడంటే మనస్సులో ఓ వైపు నమ్మకం కలుగటం లేదుగాని  వాస్తవాన్ని ఎట్లా కాదనగలరు..?
  మరో నెల తర్వాత సుబ్బారెడ్డి వచ్చి కలిశాడు.
  " ఎట్లా జెయ్యాల మామా ? "  అన్నాడు దిగాలుగా
  విషయమేదో చెప్పమన్నట్లుగా అతనికేసి చూశాడు ఓబుళరెడ్డి.  కొంతసేపు తటపటాయించి తర్వాత తలెత్తాడు సుబ్బారెడ్డి. " ఒప్పందం సేసుకొన్నెనా ! ఇరువై ఐదువేలు ఎత్తకపోయి ఎమ్మెల్లేకిచ్చినా  పనేమో జరిగిందిగాని  యవ్వారం రోంత తిరగడ కొచ్చింది "
  ఓబుళరెడ్డి చూస్తూనే వున్నాడు.
  " మొన్న మల్లా వొచ్చినారు చింతకుంట మాసులు.. ఇది నాలుగోసారి రావడం... లెక్కకొచ్చినారు. ఐదువేలు ముట్టిందంట..ఇరువైవేలు బ్యాలెన్స్ రావాలట. ఎమ్మెల్లేకు లెక్కంతా యిచ్చినానని కూడా చెప్పలేదు  ఏమి యిబ్బందోనని నే్నేమో ఎమ్మెల్లేను అడగలేకుండా. పోనీ అడగనీకి దొమ్మల్లేవు..."
  " అయితే నన్నేం జెయ్యమంటావు ? "  అన్నట్లుగా చూశాడు.
  " ఎమ్మెల్లేకు సెప్పి ఆ లెక్క వాల్లకిప్పీ మామా  !  "  బేలమొహంతో అడిగాడు.
   సుబ్బారెడ్డి కేసి ఎగాదిగా చూశాడు ఓబుళరెడ్డి.
   తర్వాత ఓ నిట్టూర్పు నిగిడించి " నేను మద్యవర్తిని కాదు కదా..ఎట్లా చెప్పాల  ? "  అన్నాడు
   " మామా  !... మామా  ! "  ప్రాధేయపడ్డాడు.
   " చూడోయ్  !"  గొంతు గంభీరమైంది ఓబుళరెడ్డికి  " మీ వూరి నీటిబ్బందులుంటే చెప్పు నేనొస్తా ! పోలీసు కేసులుంటే చెప్పి పంపు.. చేసిపెడతా. పూచికత్తు యిచ్చి బెయిలు తెప్పిస్తా... ఖర్చులకు చాలకుందని అడుగు లెక్క తెచ్చిస్తా... మీ గుంపంతా వొచ్చినా మూడోకంటికి తెలీకుండా నెలల గాలాలు సాకుతా... అంతేగాని యిట్లాంటి బ్రోకర్ పనులు నాసేయను నాకు చేతగాదు. నాకు చెప్పగాకు... నువ్వు మాట్లాడుకొనేప్పుడు నేను లేను కదా..? పని చేయించుకొనేప్పుడు లేను.. లెక్కలిచ్చేప్పుడు నేను లేను.. మద్యలో నన్నెందుకు యిరికిస్తావు  ? "  అన్నాడు.
  మరింకేమి మాట్లాడలేదు  సుబారెడ్డి.
   ఓబుళరెడ్డికి తెలీకుండా పనిచేయించటం తప్పే. తెలిస్తే వొప్పుకోడని భయపడ్డాడు తను. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుందనుకొన్నాడు.  వ్యవహారం మడత బడింది. మరోసారి డబ్బులివ్వటం తప్ప గత్యంతరం కన్పించటం లేదు.
   ఓబుళరెడ్డి మనసు కలతగా వుంది
  చెన్నారెడ్డి చర్యపట్ల అసహ్యం కలుగుతోంది.
  అతని పట్ల అంతరాంతరాళల్లో ఏదో అపనమ్మకం. మరేదో అవిశ్వాసం.  తన భావాల్ని అన్నతో పంచుకొన్నాడు.
  ఆయన కూడా తనలాగే స్పందించాడు.
   ఎమ్మెల్లే అయింతర్వాత క్రమేనా అతను నైతిక విలువలు కోల్పోతూ వుండటం పట్ల బాధ పడ్డారు ఇద్దరు.
      వారం రోజుల తర్వాత ఓ పెళ్ళిలో చెన్నారెడ్డిని కలవటం తటస్థించింది ఓబుళరెడ్డికి.  అతన్ని పక్కకు పిల్చి తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. ఇలాంటి చర్యలు మంచివి కావంటూ తన అబిప్రాయన్ని నిర్మొహమాటంగా వెలిబుచ్చాడు.
   కొద్ది క్షణాల మౌనం తర్వాత చెన్నారెడ్డి అన్నాడు  "  తప్పదోయి దొరా  ! మనవాళ్ళు దెబ్బతింటావుంటే సూస్తా వూరకుండలేం గదా ! "
  " అభిమానం కొద్దీ సహాయం చేయటం వేరు .."
   ఎంతమంది మీద అభిమానం చూపగలం  ? "
  " ఏమైనా....  నువ్వు చేసేది  తప్పే .."
  " తప్పంటే ఎట్లా ? గతాన్ని గుర్తుజేసుకో... నువ్వు మాత్రం  పిల్చుకోలేదా బాంబులేసే మనుషుల్ని  !  గొడవలు జరిగి బాంబులేసికోనుంటే వాల్లు ఖాయంగా  ఎవురోకర్ని బేసి పోయేవాల్లేగద  !  "
   ఓబుళరెడ్డికి కోపమొచ్చింది.  " వాల్లకు వీల్లకు ఏం సంబంధం..?  వీల్లట్లా వాళ్ళు మాసుల్ను  సంపేందుకు రాలేదు. తోడొచ్చినారు ".
   " అంతా  అదేలే దొరా ! ఎందుకు రట్టు జేస్తావుగానీ. నేనేం జేసినా మనోల్లకే మేలు జేస్చాండగదా  ! నా దారిన నన్ను సాగనీ. గుంపు నిలుపుకోవాలంటే కొన్ని కొన్ని యిష్టం లేని పనులు గూడా చేయక తప్పదు మరి.  శ్రీ క్రిష్ణ భగవానునికే తప్పలేదంట....  రా..రా....రా  "   అంటూ జనంలోకి లాక్కుపోయాడు.
  చెన్నారెడ్డిలో  కొత్త వ్యక్తి  కన్పించసాగడు ఓబుళరెడ్డికి.

                                                                                                  ..............  సశేషం

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs