కర్నాటకలోని ఉడిపి జిల్లాలో వున్నదీ ఈ "కార్కాల" అనే ఒక చిన్న పట్టణం. అసలీ వూరు పేరు నాకు తెలియడానికి ఒక చిన్న ఉపోధ్ఘతం వున్నది. ఎప్పుడో పదిహేను, ఇరువై సంవత్సరాల క్రితం నేను బెంగళూర్‌లో పార్ట్ టైమ్ జాబ్  చేస్తూ సినిమాటోగ్రఫ్రీ చదువుతున్న కాలంలో..  కార్పోరేషన్ సర్కిల్ నుండి విధాన సౌధకు వెళ్లే దారిని "నృప్తతుంగ" రోడ్ అని అంటారు. ఆ దారిలో కుడి వైపున రిజర్వ్ బ్యాంక్ పక్కనే "యువనిక" అని ఒక పెద్ద కేంద్రం వుంటుంది.  అది కళలకు, క్రీడలకు కేటాయించిన ఒక ప్రభుత్వరంగ సంస్థ. ఆ కేంద్రంలో ఒక పెద్ద ఆడిటోరియం వుంటుంది అందులో సాంస్కృతి కార్యక్రమాలతో పాటు శాస్త్రీయ నృత్యాలు,  సంగీత కచేరీలు జరిగేవి. అలానే క్రీడలకు కూడ అక్కడే ఏర్పాట్లు వుండేవి. ఆ సంస్థకు నేను పర్మనెంట్ పార్ట్ టైమ్ కెమెరామెన్‌ కమ్ ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తుండే వాడిని.



       ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా వీరప్ప మొయిలీ పని చేస్తుండే వారు, ఆయన హయాంలో జరిగే జాతీయ క్రీడలు వారి సొంతూరు "కార్కాల"లోనే నిర్వహించారు ఒక సారి. ఆ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఈ "కార్కాల" వూరి పేరును మొదటి సారిగా విన్నాను.  దాని యెక్క ప్రాచుర్యం కొద్దిగా తెలుసుకొన్నాను. హోటల్ రూమ్ నుండి క్రీడాస్థలానికి అటు ఇటూ తిరుగుతున్న సమయంలో పెద్ద కొండరాయి మీదున్న ఈ భారీ విగ్రహమైన బాహుబలిని వాహనంలో నుండే చూస్తుండే వాడిని. ఓహ్ శ్రావణబెలగళలోనే కాదు మరొకటి వున్నదా ఈ బాహుబలి విగ్రహం అని అనుకొన్నాను. అంతే కాదు అక్కడి ఆహారపు అలవాట్లు కూడ చిత్రంగా తోచేవి.  ఫైనాఫిల్, తెల్లటి ద్రాక్షతో కలిపి చట్నీని అక్కడ భోజనాలలొ నేను తిన్నాను.  నేనెప్పుడు అది ఎరుగలేదనే చెప్పాలి. అలా వూరి పేరు బాగా గుర్తుండిపోయి.  తర్వాతెప్పుడైనా ఇటువైపు వచ్చి ఈ భారీ విగ్రహాన్ని చూడాలని అనుకొన్నాను.




      అలా అనుకొంటూ పదిహేనేళ్లు గడిచిపోయాయి.  ఇదిగో గత సంవత్సరం రోడ్ ట్రిప్‌లో ఉడిపి ఎటు వెళ్తున్నాం కదా అక్కడ నుండి ఎలాగైనా ఏదో మార్గంలో ఈ కార్కాలను చూసి వెళ్లాలని అనుకొన్నాను. అనుకొన్నట్లుగానే ఉడిపి నుండి కూర్గ్ ( మడికెరి) వెళ్లే మార్గ మద్యలో ఈ కార్కాల ను చూసి వెళ్లొచ్చని తెలిసింది. అలా  కార్కాలను మళ్లీ పదిహేను సంవత్సరాల తర్వాత వెళ్లగలిగాను.



   ఈ బాహుబలి చరిత్ర గురించి అక్కడ ఎవరు చెప్పడానికి మనుషులు కనపడలేదు. కారణం మేము వెళ్లిన రోజు వర్షాలు బాగా పడుతున్నాయి. ఆ వర్షంలో ఆ పెద్ద రాతికొండ మీద ఒక బాల పూజారి మాత్రమే వున్నాడు. ఆ బాబుకు చరిత్ర గురించి ఏమి తెలియదని తెలిసింది. తర్వాత అంతర్జాలంలో వెదికాక దొరికిన సమాచారాన్నే నేని ఇక్కడ క్లుప్తంగా ఇస్తున్నాను. 

         జైనులు ఈ ప్రాంతాన్ని దాదాపుగా 300 ఏల్లు పరిపాలించారనే చెప్పాలి. వారి పాలనలో అప్పటికి వున్న పురాతనమైన పేరు "పాండ్య నగరి ".   మొట్టమొదటి పరిపాలుకులు మాత్రం "అలుపాస్" వంశస్థులు పాలించారు. వారి వారుసులైన "భైరరాస వొడియాస్" రాజు ఆ కార్కాల సామ్రాజ్యాన్ని చాలా పెద్దగా విస్తారించరట. ఈయన పరిపాలనలోనే చాకా ఖరీదైన ఆయుధాలతో పెద్ద సైన్యం కూడ వుండేదట.


      ఆ తర్వాత కాలంలో "వీర పాండ్య" అనే జైను రాజు తమ జైన మత గురువు "లలితాకీర్తి " ఆదేశానాల ప్రకారం 13 ఫిబ్రవరి 1432  సంవత్సరంలొ ఈ 42 అడుగుల "బాహుబలి గోమటేశ్వర "విగ్రహాన్ని  పెద్ద కొండలాంటి రాతి మీద ప్రతిష్టించారట.  ఇక ఈ విగ్రహానికి ముందున్న ధ్వజస్థంబం 54 అడుగులు వుంటుంది. 

     ఆ తర్వాతర్వత కాలంలో  "కర్రికల్లు" అనే పేరుతో పిలువబడింది.  కర్రికల్లు అనగా "నల్లటి రాయి" అని అర్థం. ఆ ప్రాంతమంతా నల్లటి గ్రానైట్‌తో నిండి వుంటుంది.  మన తెలుగులో నాలాంటి గ్యారెంటీ కలర్ వున్నోళ్లను "కర్రోడా" అని పిలుస్తుంటారుగా..!! బహుశ ఈ "కర్రి" అనే పదం కన్నడ నుండి అరువు తెచ్చుకొన్న పదమేమో మరి. దీనికి మరోక అర్థం కూడ వున్నది. అది వారి పురాతనమైన బాషలో చూసుకొంటే " Elephant Lake"  అని కూడ మరొక అర్థమున్నది.

  ఆతర్వాత ఈ కర్రి కల్లునే  "కార్కాల"గా ఇప్పుడు పిలువబడుతున్నది.

  ఇక పచ్చని కొబ్బరి చెట్ల మద్య కనపడుతున్న  ఆ రాళ్ల మంటంతో వున్న దేవాలయం కూడ ఆ తర్వాత జైనుల రాజులలో ముఖ్యడైన  "ఇమ్మడి భైరవ -II" అనే రాజు ఈ గోమటేశ్వరుడికి ఎదురుగా వున్న చిన్న రాతికొండ మీద 1586లో నిర్మించాడట.  మేము అక్కడికి వెళ్లితే  అక్కడ మనుషులంటూ ఎవరూ కనపడలేదు.  మేము మెట్లెక్కి వెళ్లటాన్ని ఎవరో దూరం నుండి గమనించిన స్త్రీ  దేవాలయంలోకి వచ్చారు.



  వయసు మల్లిన ఆవిడే అక్కడ పూజారి అట. మొత్తం దేవాలయాన్ని ఆవిడ ఆధ్వర్యంలోనే నడుస్తున్నదట. ప్రభుత్వం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా తనే  అక్కడికి వచ్చే సంధర్శకుల నుండి సేకరించే డబ్బుతోనే నిర్వహిస్తున్నట్లు తెలిపింది. లోపలికి వెళ్లాక నిజమేనని అర్థమయ్యింది.



     లోపలంతా చీకటి. లైట్స్ వున్నా కరెంట్ బిల్లు ఆవిడే భరించాలట.. సంధర్శుకులు వచ్చిన సమయంలో మాత్రమే లైట్స్ వెలిగిస్తున్నది కరెంట్ బిల్లు భరించలేక. ఇక ఆ దేవాలయం చరిత్ర గురించి ఆవిడకు కూడ పెద్దగా తెలీదు కాని.  లోపల వెళ్లి చూడగానే మిగతా దేవాలయాలల్తో పోలిస్తే భిన్నంగా కనపడుతుంది.  ఈ దేవాలయం పేరు "చతుర్ముఖ బైడి" అనగా చతురశ్రాకారంలో నిర్మించబడింది కాబట్టి ఆ పేరు పెట్టారు.



     నాలుగు వైపుల రాతి స్థంబాలతో కూడిన  వరండాలతో నిర్మించి వున్నారు.  నాలుగు వైపుల ప్రధాన ద్వారాలున్నాయి. మొదటి ఎదురుగా గర్భగుడిలో ప్రధాన విగ్రహం తో పాటు మిగతా మూడు వైపుల  కూడ మనిషంత నిలువెత్తు విగ్రహాలున్నాయి. మేము టార్చి లైట్ వేసుకొని చూడాల్సి వొచ్చింది. అన్ని నల్ల రాతి గ్రానైట్ విగ్రహాలే. వేటిని కూడ సరిగ్గా పోల్చుకోలేకపోయాము. వారి మతంలో మొత్తం 24 తీర్థంకురులు వుంటారు. అందులో ముగ్గురు విగ్రహాలే ఇవి. ఈ మొత్తం దేవాలయాన్ని నిర్మించడానికి వారికి 30 ఏళ్లు పట్టిందట. దేవాలయం చుట్టూ మొత్తం 108  స్థంభాలతో నిర్మించబడింది.  



     మన తెలుగు రాష్ట్రాలే అనుకొన్నాను చారిత్రిక ప్రదేశాల పట్ల నిర్లక్ష్యం వహించడం ఇప్పటి వరకు. కాని టూరిజం మీద అధిక శాతం రెవెన్యూ సంపాదిస్తూ, అక్కడీ చారిత్రిక ప్రదేశాల పట్ల ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ వాటికి ఎన్నో వసతులు కల్పిస్తున్న కర్నాటక ప్రభుత్వంలో కూడ ఇలాంటివి ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా వుంటున్న చారిత్రాత్మక ప్రదేశాలున్నాయని అప్పుడు తెలిసింది మాకు.

     అక్కడ నుండి వర్షంలోనే ఆ కార్కాలకు 18 కిలోమీటర్ల దూరంలో వున్న మరొక జైనుల దేవాయలం వున్న "మూడబిదిరి" అనే వూరికి బయలు దేరాం.

   వెయ్యి స్థంభాల గుడి వరంగల్‌లో మాత్రమే వున్నదని అనుకొన్నాను ఇన్నాళ్లు. కాని మరొక వెయ్యి స్థంబాల దేవాలయం జైనులు కూడ నిర్మించారని ఈ "మూడబిద్రి" కి వెళ్లాక తెలిసింది.



  ఈ "మూడబిద్రి"  దక్షణ కాశీగా పిలువబడిందట.  17 వ శతాబ్దంలో చాలా వరకు పరిపాలన చేసిన జైన రాజ వంశీయుల కుటుంబాలు ఈ మూడబిద్రికి వలసొచ్చి స్థిరపడ్డారు. ఈ చిన్నట పట్టణానికి మరో ప్రాముఖ్యత వున్నది.  ఈ పట్టణం చుట్టూ 18 సరస్సులు, 18 జైన బసదీలు,18 జైన దేవాలయాలు, 18 రహదారులు వున్నాయట వాటిని కలుపుతూ మద్యలోఈ వేయి స్థంబాల దేవాలయం  నిర్మితమైందట.



      ఈ దేవాలయన్ని చంద్రనాథ దేవాలయం మరియు వేయి స్థంభాల దేవాలయం, సావిర కంబద బసది, త్రిభువన తిలక చూడామని అని ఇలా రక రకాలైన పేర్లతో పిలువబడుతున్నది. క్రీ.శ 1430 లో అప్పటి విజయనగర పరిపాలుకుడైన  "దేవరాయ వొడియార్" నిర్మించారట.  ప్రధాన గర్భగుడిలొ 8 అడుగుల లార్డ్ చంధ్రనాథ కాంస్య విగ్రహం వున్నది.


      ప్రధాన దేవాలయంలో నల్లటి గ్రానైట్ రాయితో మలిచిన స్థంభాలు. వాటి చుట్టూ శిల్పాలు చాలా వున్నాయి. శిల్ప చాతుర్యం పట్ల మక్కువ వున్నవాళ్లు వీటిని ఇష్టపడవచ్చు. 

      ఈ ప్రాంతం గురించి మీకింకా లొతైనా సమాచారం, చారిత్రిక విశేషాలు తెలుసుకోవాలనుకొంటే ఇంటర్‌నెట్‍లో చాలా వరకు దొరుకుతున్నది. 

     సౌత్ కెనరా ( దక్షిణ కన్నడ ) ని చాలా వరకు "జైనులే పరిపాలించారని" అర్థమవుతున్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో చూడవలసిన చారిత్రిక ప్రాంతాలు ఇంకా చాలా వున్నాయి. మాకు సరైనా సమాచారం లేక వాటిని చూడలేకపోయాము. ఆసక్తి వున్న వాళ్లు అంతర్జాలంలో వెదికితే చాలా కనపడతాయి.  

   వర్షాలు విపరీతంగా పడుతుండటం వలన సరైనా ఫోటొస్ ఎక్కువగా తీయలేకపోయాను..... అది నా డ్రా బ్యాక్.

     మద్యాహ్నం భోజనం చేసి ఇక్కడ నుండి కూర్గ్ ( మడికేరి ) కి బయలు దేరాం. దారి పొడవునా వర్షమే.. చాలా వరకు కొండల మద్యన ఘాట్ రోడ్ మీద ప్రయాణం. చుట్టూ పచ్చదనం కొండలు..ఒక్కో సారి మాతో ప్రాటే ప్రయాణిస్తూ వొస్తున్న చిన్న చిన్న నదులు, కొండల చుట్టూ మలుపులే మలుపులు.. పాములు మెలికిలు తిరుగుతున్నట్లుగా మా  ప్రయాణం.. ఆ వర్షంలో.. అలా మలుపులు తిరుగుతూ నల్లటి మబ్బుల్లో మెలోడి పాటలు వింటూ డ్రైవ్ చేయడమన్నది ఒక మంచి అనుభూతే..  అది ఎంజాయ్ చేసే వారికే అర్థమవుతుందేమో...ఆ అనుభవం.  సాయింత్రానికి కూర్గ్ చేరుకొన్నాం. అక్కడ కూడ నల్లటి మేఘాలు దట్టంగా మొత్తం కూర్గ్ నంతా అలుముకొని వున్నాయి. హోటల్ రూమ్ కిటికిల్లో నుండి ముసుగేసుకొని వాటిని చూస్తూ ఎప్పటికో ఏ అర్థ రాత్రికో నిద్రలోకి జారుకొన్నాం.














      బాదామి నుండి ఉదయం పదుకొండు గంటలకు ప్రయాణం మొదలు పెట్టాం గోవా వైపుకు. నేషనల్ హైవేలొ కొద్ది దూరం వెళ్లగానే రాజకీయ నాయుకులు ఎక్కడో దర్నా చేస్తున్నారనే నెపంతో పోలీసులు మద్యలోనే దారి మళ్లించడంతో కర్నాటక గ్రామాల మీదుగా దాదాపుగా ఓ రెండు గంటల ప్రయాణం సాగింది. దారి పొడవునా కన్నడ ప్రాంత పల్లె అందాలు చూసుకొంటూ దార్వాడ్ చేరుకొన్నాం. 

        అక్కడ నుండి గోవా వైపుకు దారి మళ్లి కర్నాటక సరిహద్దు వద్దకు చేరుకొన్నాం.. రోడ్‌కు కుడివైపున వున్న  "మ్యాంగో మూడ్స్" అనే ఒక రెస్టారెంట్ కనపడింది. చూట్టానికి గమ్మత్తుగా కనపడటంతో కార్ పార్క్ చేసి లోపలికి వెళ్లాం.  అదొక పెద్ద మామిడ తోట. అందులో ఈ రెస్టారెంట్ పెట్టారు. చూట్టానికి చాలా శుభ్రంగా పట్టణ స్థాయ శోభతోనే నిర్మించారు కాని ఏ.సి లేదు అక్కడ. అస్సలు ఆ అవసరమే లేదేమో ..! లోపలంతా చెక్క స్థంభాలతో చుట్టూ గోడలు లేకుండా నిర్మించారు. మాంశాహారం- శాఖాహారం తో రుచిగా వున్నాయి వంటలు కూడ. అన్నిటికన్న ధరలు కూడ మద్యతరగతికి అందుబాటులో వుండటం గమనర్హం. శుభ్రంగా భోజనం చేసి అక్కడ నుండి కర్నాటక సరిహద్దు దాటి గోవా భూభాగంలోకి అడుగు పెట్టాం.




     కొద్ది దూరం వెళ్లగానే మేఘాలు నల్లగా కమ్ముకొన్నాయి. మొత్తం అడవి ప్రాంతం కావడంతో రహదారికి ఇరువైపుల ఎత్తైన చెట్లతో వుండటం మూలాన వెలుతురు తక్కువగా వున్నది. మరి కొద్ది దూరం వెళ్లాక వర్షం ముసురులా పడటం మొదలయ్యింది. కొద్ది సేపటికి చీకటిలా అనిపించడంతో కారు హెడ్‌లైట్స్ ఆన్ చేయాల్సి వొచ్చింది.  అలా కొన్ని కిలోమీటర్ల్ ప్రయాణించాక గాని అర్థం కాలేదు. మేము ఒక కొండ మీద ప్రయాణం చేస్తున్నామనే సంగతి. అంతగా ముసురుకొన్నది మా చుట్టూ వర్షం.  అది వర్షమా లేక మేఘమా అన్నది కూడ గుర్తించనంతగా కమ్ముకొన్నది మమ్మల్ని.


       నిజంగా అలా ఆ వాతావరంలో కారులో ప్రయాణం చేస్తుంటే  ఆ అనుభూతే వేరు.. సరిగ్గా అదే సమయానికి "వయసు ముసురుకొస్తున్నది వాన మబ్బులా" పాట వొస్తున్నది మాతో పాటే కారులో. అలా ఎస్.పి.బి గారి పాత పాటలు కారులో మాతో పాటే ప్రయాణం చేస్తున్నాయి.  మరికొన్ని కిలోమీటర్లు అలా మేఘాలలో ప్రయాణించాక డ్రైవ్ చేయడం కాస్త కష్టంగానే అనిపించింది కారణం.. మా కారుకు ముందు మహా అంటే ఓ పది అడుగులు కన్నా ఎక్కువ దూరం అన్నది కనపడట్లేదు మేఘాల వలన.. ఎంత కారు హెడ్ లైట్స్ వేసినా ఎదురుగా వొస్తున్న వాహనాలు అతి దగ్గరకు వచ్చాక కాని మా కంటికి అగుపించిండం లేదు. ఫ్రెండ్స్ కూడ వొద్దనడంతో ఆ ఘాట్ రోడ్‌లో ఒక చోట కారు ఆపాక అర్థమయ్యింది ... అక్కడ చాలా లారీలు, మాలాంటి కార్లు చాలానే ఆపారు అని.  దిగి చుట్టూ చూస్తే.... వాహ్.  పడిపోయిన పాత భవనాలు ఆకుపచ్చ రంగులో కనపడ్డాయి.  మొత్తం భవనాలు చుట్టూ పాచి పట్టడం.. వాటిలోని చిన్న చిన్న మొక్కలు మొలకెత్తి వున్నాయి.  మొత్తం ఆ ప్రాంతమంతా "ఆకుపచ్చ" మయమే.  కెమెరా తీసి క్లిక్స్‌కు పని పెట్టాను. ఎంతకు దాహం తీరదు ఆ ప్రకృతిని బుల్లి కెమెరా బందించడంలో... ఓ అరగంటకు మేఘాల ప్రయాణాలు ఆగిపోయాయి కొద్దిగా మాత్రమే. అది చాలనుకొని దూదిపింజలాంటి ఆ మేఘాలలోనే అక్కడ నుండి ప్రయాణం ప్రారంభించాం.




    వాస్తవంగా మా ప్రయాణంలో ఇదే దారిలొ ఓ పక్కకు మళ్లితే "దూద్ సాగర్" వాటర్ ఫాల్స్‌కు వెళ్లాలనే ఆలొచన వున్నింది, కాని సమయభావం వలన కుదరక అలానే గోవాకు ప్రయాణం కొనసాగించాం. గూగులయ్య దారి చూపడంతో రాత్రికి ఎనిమిది గంటలకు గోవా చేరుకొన్నాం... అక్కడ నుండి పనాజి చేరి ఒక చిన్న హోటల్లో ఆ రాత్రి మా విడిది. ఆ రాత్రి ఎప్పటిలాగే చుట్టు పక్కల తిరగాల్సిన ప్రదేశాల గురించి ఇంటర్‌నెట్‌లో వెదుకులాట...!

     మరసటి రోజు ఉదయమే మా హోటల్‌కు దగ్గరలో దక్షిణాది టిఫెన్ దొరికే "సితార" హోటల్లో టిఫెన్ ముగించి... అక్కడ నుండి దగ్గరగా వున్న "మపాస బీచ్" కు వెళ్లాలని బయలు దేరాం. ఆకాశమంత నల్లటి మేఘాలతో వున్నది, ఎప్పుడైనా వర్షం రావొచ్చేమో అనిపించింది. ఓ ఐదు నిమిషాలు డ్రైవ్ చేసిన తర్వాత కుడివైపున ఏదో పెద్ద పెంకుటిల్లులా కనపడి దాని ముందు పెద్ద ఖాలీ స్థలం కనపడింది. బహుశ పార్కింగ్ కోసమేమో..! వాటి వెనుక ఎత్తుగా చిన్న గుట్ట మీద పచ్చని చెట్ల మద్యన కనపడీ కనపడనట్లుగా కనపడుతున్న పాత కాలపు భవంతిలా కనపడుతున్నది.  ఎవరిదో పెద్ద బంగ్లా అయ్యుంటుందిలే అనుకొని ముందుకు సాగాం.. కాని ఆ ముందే ఎదురుగా సముద్రం ....అక్కడ కుడివైపుకు వొంపు తిరుగుతూ వున్న నల్లటి రోడ్.. దానికి కుడివైపుకు పెద్ద పెద్ద నల్లరాళ్లతో పచ్చగా పాచి పట్టిన పెద్ద కోట గోడ కనపడ్డది.  వెంటనే బ్రేక్ వేసి.. "ఇక్కడేదో కోట లాంటిది వున్నది వెళ్లి చూద్దామా..?" అడిగాను ఫ్రెండ్స్ ని.. వారు తలలూపడంతో.. వెనక్కు తిప్పి.. ఆ పెద్ద భవనంలాంటి పెంకుటిల్లు ముందు కారాపి లోపలికి వెళ్లాం.


    ఆ పెద్ద పెంకిటిల్లు లోపల గోడలకు ఆ కోట వివరాలు తెలిపే పటాలు తగిలించి వున్నాయి. అప్పుడు అర్థమయ్యింది అదొక కోట అని. పెద్ద హాలు మద్యలొ టేబుల్, కుర్చీలు మీద ఒకరిద్దరు కనపడ్డారు. టూరిస్టుల కోసం కోటను చూట్టానికి యాభై రూపాయిల రుసుముతో అవకాశమున్నదని తెలుపడంతో టికెట్ తీసుకొని ఆ ఇల్లు నుండి కుడివైపు తిరుగుతూ ఏటవాలుగా వున్న గుట్ట మీదకు వెళ్లాం. అదొక ప్రైవేట్ ప్రాపర్టీ ప్రభుత్వానికి ఎలాంటి సంబందం లేదు.


    అక్కడికి చేరుకోగాని మొదట కనపడింది... పాచి పట్టిన పెద్ద ప్రహరి గోడ దానికి చిలుమ్ పట్టిన పెద్ద ఇనుప గేట్.. అది చూడగానే మనకో గత కాలపు ఙ్ఞాపకాలను గుర్తుకు తెస్తూ మనకు తెలీకుండానే టైమ్ మిషన్ ఎక్కి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లు అనిపిస్తుంది. దాని దాటి ముందుకు వెళ్లితే రాళ్లతో నిర్మించిన రహదారి.. వాటి పైన ఏ కళాకారుడో కుంచెతో రంగులద్దినట్లుగా దీర్ఘ చతురస్రాకారంలో మొలిచిన పచ్చని గడ్డితో పాటుగా పాచి కూడ మమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లుగా కనపడింది. కుడి వైపున పెద్ద రాళ్లతో నిర్మించిన పెద్ద గోడ ఆ రహదారికి ఆసరాగా వున్నది.  వాటి మీద నడుచుకొంటూ ఓ రెండొందల అడుగులు దాటి పెద్ద ఆర్చి లాంటి గదిని దాటి లోపలికి వెళ్లగానే మరో కొత్త లోకంలోకి వెళ్లినట్లుగా అనిపించింది మాకు.


     మద్యలో ఎత్తైన ప్రదేశంలో ఒక పెంకిటిల్లు. అందులో ఆ కోట విశేషాలు తెలిపే కొన్ని ఫోటోస్ గోడలకు తగిలించి వున్నాయి.  ఎడమ పక్కన రెండుంతస్తులున్న భవనం ఒకటి వున్నది. పై అంతస్తులోకి మాత్రమే సంధర్శనలకు అనుమతి. కుడి పక్కన ఏటవాలుగా ఒక కట్టడం.. దాని మీద నుండి వెనక్కు వెళ్లడానికి అదొక దారి. అక్కడ ఓ నాలుగు ఫిరంగులు వున్నాయి.  ఇవన్నీ మాటల్లో వర్ణించలేనవి. కొద్దిగా ఈ కోట చరిత్రలోకి తొంగి చూస్తే....


    "రేయిస్" లేక "రైస్ మగోస్" అన్నది ఒక గ్రామం పేరు. ఇది పాత గోవాలోని "బార్డెజ్" అనే పట్టంలో "మండవి" అనే నది పక్కన వున్నది. ఈ గ్రామంలో వున్నందు వలన ఈ కోటకు "Reis Magos fort " పేరు వచ్చింది.


  ఈ పురాతనమైన కోటను బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన "యూసఫ్ ఆదిల్ " అనే రాజు 1493 లో నిర్మించాడు. ఆయన తన కాలంలొ తన సామ్రాజ్యాం మీదకు నౌకా దాడులు జరగకుండా కాపాడుకొవడానికి ఈ "Reis Magos Fort" ను ఒక చిన్న సైనిక స్థావరంగా ఉపయోగించుకొన్నాడు.


    ఆ తర్వాత 16 వ శతాబ్దంలో పోర్చుగీసు రాజైనా "అల్ఫన్సో-డి- అల్బుకరేక్" తన రెండవ ప్రయత్నంలో ఈ "Reis Magos Fort" ను స్వాదినం చేసుకోవడంతో.. రేవు పట్టణమైన గోవా పైన పోర్చు గీసువారు పూర్తి నియంత్రణను సాధించుకొన్నారు. మొత్తం ఆ 16 వ శతాబ్దమంతా పోర్చుగీసు సామ్రాజ్యానికి కంచుకోటలా మారి తదుపరి రెండు శతాబ్దాల పాటు గోవా మీద తమ ఆధిపత్యాన్ని చెలాయించడానికి  ఈ కోట చాలా సహాయ పడింది.

  పద్దినిమిదేవో శతాబ్దంలో పోర్చుగీసు వారు ఈ కోటను ముఖ్య సైనిక స్థావరంగా ఉపయోగించుకొని "మరాట రాజుల" సైన్యాల పైన దాడులు జరిపి వారిని గోవా నుండి తరిమి కొట్టారు.

    ఆ తర్వాత  ఫ్రాన్స్ దాడులను అరికట్టే ఉద్దేశ్యంతో బ్రిటీష్ వారు గోవాను ఆక్రమించి... 1808లో పోర్చుగీసు మరియు బ్రిటీష్ ప్రభుత్వాల మద్యన జరిగిన ఒక ఒప్పందం ప్రకారం బ్రిటీష్ వారు ఈ కోటను తమ సైన్యం ఉండడానికి స్థావరంగా చేసుకొన్నారు.

    19 వ శతాబ్దం చివరికి నౌకా దాడుల ముప్పు సన్నగిల్లడం వలన పోర్చుగీసు వారు తమ ముఖ్య పట్టణాన్ని గోవా నుండి పనాజికి మార్చడం వలన ఈ కోట ప్రాముఖ్యత చాలా వరకు తగ్గిపోయింది.


  ఆ తర్వాత స్వల్ప కాలం పాటు ఖైదీల కారాగారంగా మార్చారు. 1950లో జరిగిన గోవా విముక్తి పోరాట సంధర్భంగా ఆ ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమర యోదులను ఈ జైలులో వుంచారు. ఆ తర్వాత 1993 వరకు ఈ కోటను జైలు కొరకే ఉపయోగించారు.


  2007లో గోవా ప్రభుత్వం INTACH, హిమ్ల్యన్ ట్రస్టుల మద్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ కోటను పునరుద్దరించి సాంస్కృతిక కేంద్రంగా మార్చారు. ప్రస్తుతం 5 జూన్ 2012 నుండి ఈ కోటను ప్రజల సంధర్శన కొరకు తెరిచారు.


  ఇది సంక్షిప్తంగా ఈ కోట యెక్క చరిత్ర. కోటంతా ఎరుపు..నలుపు కలబోసిన రాతితో వున్నా .. ఆ గోడలు మొత్తం పచ్చదనమే పరుచుకొని వున్నది. అందునా సముద్రం పక్కనే వుండటం మూలానా .. సముద్రపు అలల నుండి వచ్చే తెమ్మరలు ఈ కోటను ముంచెత్తుతున్నాయి.  అందువలనే అనుకొంటాను.. మొత్తం పచ్చదనమే వుంటుంది కోట నిండా..!


  కొటలో వుండే అంతుస్తులు అన్నీను సముద్రం వైపుకు వున్నాయి. ఒక్కో అంతస్తులో ఆరుబయట కూర్చోని చూసినా సముద్రం సాంతం చూస్తూ గడపొచ్చు. కడలి శబ్దాలు... ఆ ఘోష..  అలల తాకిడి.. వాటిలో నుండి వచ్చే పిల్ల తెమెరలు..  అప్పట్లో ఆ రాజులు  అక్కడ కూర్చోని.. నిశబ్దపు సముద్రాన్ని, కెరటాల సముద్రాన్ని, ఉదృతమైన అలల తాకిడితో నిండిన సముద్ర సౌంధర్యాన్ని చవి చూసుంటారేమో.. వాటిలో మమైకం అయ్యుంటారేమో అని నాకనిపించింది. ఎంత అదృష్టవంతులు వాళ్లు.... అని అనుకొన్నాను.




    అక్కడ నుండి బయట కొచ్చిన వెంటనే టప టపమంటూ వర్షం మొదలయ్యింది. వెంటనే కారులోకి దూరిపోయాం.. కాని అక్కడ నుండి కదలలేకపోయాం. అలానే ఆ కోటకు సముద్రానికి మద్యలో వున్న రోడ్ మీద నుండే మేము ప్రయాణం సాగించాలి... కాని  అక్కడే రోడ్ మీదనే కుడి పక్కన కోట గోడలను.. ఎడమ వైపు రోడ్‌కు ఆనుకొని వున్న సముద్రాన్ని.. దాని అలల తాకిడిని చూస్తూ అలానే  కూర్చుండిపోయాం. ఆ అలలు ఎంతగా  తాపత్రయ పడుతున్నాయంటే..... సముద్రపు వొడ్డున వున్న కొండ రాళ్లను దాటుకొని రోడ్ మీదకు వొస్తున్నాయి.... దానిని కూడ దాటి కోట గోడను అందుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాయి.


   కాసేపటికి అక్కడ నుండి బయలు దేరి పనాజిలో వుండే లైట్ హౌస్ లా కనపడే Aguda Fort కు వెళ్లాం అలా వర్షంలోనే...!

     చాలా వరకు చాలా మంది గోవాను సూరీడు వున్నప్పుడు చూసుంటారు. కాని వర్షంలో గోవాను చూడటం అన్నది ఎంతమందికి అనుభవం అయ్యిందో నాకు తెలియదు కానీ.. నాకదే ప్రధమం. అదొక కొత్త గోవాలా కనపడింది నాకు. రంగులన్నీను ముదురు రంగుల్లో వున్నట్లుగానూ, ఎక్కడ చూసినా పచ్చదనమే.. ప్రతి ఇంటి ప్రహరి గోడలన్నీనూ పచ్చని పాచితో కప్పబడి వున్నాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే.. అదీను ముదురాకు పచ్చ..! అదే కాదు ఏ రంగు చూసినా ముదురు రంగులో వున్నది.. అందులోని సాంధ్రత.. గాఢత ఎంత దృడంగా వున్నదో.. బీచుల్లో కూర్చోని చూస్తుంటే... అదొక గంభీరమైన వాతావరణమా లేక.. మన ప్రియమైన మనుషులు మనల్ని వదిలి వెళ్లాక అనిపించే ఒక శూన్యమా...? అదేదో వాతావరణం..??  కాని అందులోకి వెళ్లి తీరాలనిపించే తృష్ణ మాత్రం ఆగదు మనలో. 




    ఆకాశమంతా నల్లని మేఘాలతో సుడులు తిరుగుతున్నట్లుగా వుంటే.... సముద్రుడు మాత్రం ఎంతో గాఢమైన రంగుతో ఎగెరెగిరి పడుతున్నాడు శబ్దాలు చేస్తూ... ఇవేవి తనకు పట్టనట్లుగా  సముద్రపు వొడ్డున ఆరంజి రంగులొ వున్న ఇసుక నిశబ్దంగా తనలోని గాఢతను చూసే కళల్లోకి సూటిగా చేరవేరుస్తున్నది.  ఆ వాతావరణపు వర్ణంలో చాలా సేపు అలానే వుండిపోయాం మేము.














About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs