నా రోడ్ ట్రిప్‌లో మొదటి రోజు మద్యాహ్నానికి బాదామి చేరాం. బాదామి గురించి నేను కొత్తగా నెట్‌జనలకు, బ్లాగ్ వారికి చెప్పనవసరం లేదు అనుకొంటాను. అవి వొదిలేస్తే మరసటి రోజు తెల్లారు జామునే సూర్యోదయం కాక మునుపే కొన్ని ఫోటోస్ తీయాలని వెళ్లాను గానీ మనకెప్పుడు దురదృష్టం పట్టుకొని వుంటుంది. ఆకాశమంతా మేఘాలతో కప్పుకొని వుంటే ఇంకెక్కడా సూరిగారొస్తారు. అక్కడ నుండి చారిత్రక ప్రాంతం "పట్టదకల్" వూరికి బయలు దేరి వెళ్లాం. బాదామికి వెళ్లిన వారు ఖచ్చితంగా ఈ పట్టద కల్లు కచ్చితంగా వెళ్తారు. ఇది కూడ అందరికీ తెలిసే వుంటుంది.
బాదామికి 22 కిలోమీటర్ల దూరంలో వున్నది. ఉదయమే అక్కడీకి చేరుకోవడం వలన అక్కడ జన సంచారమే లేదు. ఖాలీగా వున్నది హుర్రే అనుకొని లోపలికి వెళ్లాను, చాలా విశాలమైన స్థలంలో దాదాపుగా పది రకాల దేవాలయాలు వున్నాయి. మొత్తం ఎర్ర రాయితో కనపడుతుంది. చరిత్రలోకి ఒక సారి తొంగి చూస్తే..
మలప్రభ అనే నది వొడ్డున ఈ పట్టదకల్ అనే రాజధానిని బాదామి చాళుక్యులు 7 వ శతాబ్దంలో నిర్మించారు. ఆ తర్వాత దీనిని "రక్తపుర" అని పిలిచే వారట. బాదామి తర్వాత ఇది రెండవ రాజధానిగా చేసుకొన్నారట కానీ ఇది పూర్తిగా వాణిజ్యపరమైన పనుల కోసం మరియు రాజ్య కార్యకలాపాల కోసం ఎక్కువగా వినియోగించే వారట.
రెండవ విక్రమాధిత్య రాజు ( 734 - 745 ) ఈయన గారి పట్టపు మహారాణులైన లోక్మహాదేవి, త్రైలైఖ్య మహాదేవిలకు కళల పట్ల వున్న మక్కువతో కాంచిపురం నుండి శిల్పులను తెప్పించి ఈ దేవాలయాలను నిర్మించారట. ఇవి పూర్తిగా ద్రవిడ శైలి ( దక్షణ భారత శైలి ) నాగర శైలిలో ( ఉత్తర భారతీయ శైలి ) నిర్మించారు. మరి కొన్ని రెండు భిన్నమైన శైలిలో (ఫ్యూజన్), రేఖా, నిర్మించారు. 9 శతాబ్దంలో జైనుల శైలిలో మరొక దేవాలయం నిర్మించారట.
కాని చాలా విశాలమైన మైదాన ప్రాంతంలో అన్ని ఒకే చోట నిర్మించడం చూడటానికి కన్నుల పండుగలాగ వుంటుంది. పచ్చని గడ్డి మద్యలొ ఈ ఎర్రటి నిర్మాణాలు, శిల్పాలు చూట్టానికి భలే వున్నాయి.
బాహుబలి సినిమాలో వున్న రాజభవనాల నమూనాలు, ఆర్కిటెక్చర్ చాలా వరకు ఇక్కడి ఈ దేవాలయాల శైలినే పోలి వున్నట్లుగా నాకు అనిపిస్తున్నది మరి.
ఇక్కడకు చేరుకోవడం చాలా సులభం, కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాలోని "బాదామి" అనగానే ఎక్కడ నుండైనా బస్సులు వుంటాయి.
పొద్దు పొద్దున్నే అక్కడికి వెళ్లడం వలన మనుషుల సందడి లేకపోవడంతో ఎంతో ఆహ్లాదంగా వున్నది అక్కడి వాతావరణం, ఉడతలు నిర్భయంగా సంచరిస్తూ భలే ఆడుకొంటున్నాయి. ఓ పక్కన మన సూరీడేమొ దోబూచులాట ఆడుతున్నాడు. పక్షుల కిల కిల రావాల తప్ప ఏ శబ్దం లేదు అక్కడ. చాలా సేపు ఆ శిల్పాలను. ఒక ప్రత్యేకమైన ఎర్రరంగులో వున్న ఆ రాతిని చూసుకొంటూ.. కొన్ని చోట్ల ఫోటోస్ తీయడమే మరిచిపోయేంత మైమరపులో అక్కడ నుండి బయటకొచ్చాం.
మరి కొన్ని ఫోటోస్.....