ఎప్పుడో 2011లో వెళ్లిన యాత్ర కథ ఇది.. ఇన్నాళ్లకు ఓపిక వచ్చి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఒక రోజు మద్యాహ్నం కాబోయే ఒక దర్శకుడి ఇంట్లో కథా చర్చల్లో వుండగా ఒకప్పటి నా మీడియా ఫ్రెండ్ నుండి ఫోన్ వచ్చింది "కమల్ మౌంట్ ఆబు వెళ్తున్నాం, ఇంటర్‌నేషనల్ మీడియా సదస్సు జరుగుతున్నది నీవు వొస్తావా ఈ రోజు రాత్రే బయలు దేరాలి " అని సారాంశం.....! మౌంట్ ఆబు పేరు వినగానే.. ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది ఇంత వరకు అటు వైపు వెళ్లనే లేదు నేను.. వెంటనే "ఓ..యస్ వొస్తాను" అనేసాను ఫోన్‌లో.. "అయితే నీ పేరుతో ఒక సీట్ కన్‌ఫార్మ్ చేస్తున్నాను, రాత్రి పదిన్నరకు సికింద్రాబాద్ జైసల్మీర్ ఎక్స్‌ప్రెస్స్ ట్రైన్ వున్నది అక్కడికి వచ్చేసేయ్ డైరెక్ట్‌గా, అక్కడే మొత్తం తెలుగు మీడియా వాళ్లంతా అంతా వుంటారు " అని ఫోన్ పెట్టేసాడు.
అంతే ఆ రాత్రికి బ్యాగ్, కెమెరా సర్దేసుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకొన్నాను. అప్పటికే అక్కడంతా ఒకప్పటి నా పాత మీడియా మిత్రులు, మరి కొందరు కొత్త వాళ్లు వున్నారు. కొత్తవారితో పరిచయం చేసుకొని.. అందరం జైసల్మీర్ ఎక్స్‌ప్రెస్స్‌లో మా లగేజ్ అంత సర్దుకొన్నాం. రెండు రోజుల ప్రయాణం.. ఒక పగలు రెండు రాత్రిల్లు అయ్యాక రెండో రోజు తెల్లారు జామున "ఆబు రోడ్" అనే రైల్వేస్టేషన్‌లో దిగాము, వాతావరణమంతా మేఘావృతమై వున్నది. అలా దిగి దిగగానే మెల్లిగా వర్షం ప్రారంభమై.. జోరు అందుకొన్నది, ఆ వర్షంలో ఆ అబు రోడ్ రైల్వే స్టేషన్ చూట్టానికి ఎంత బాగున్నదో.... రాజస్థాన్ అనే పేరు ఎడారులకు పేరు గాంచినది, కాని అబురోడ్ మాత్రం ఆకుపచ్చని రంగుతో మొత్తం పరుచుకొని వున్నది, చూట్టానికి ఎంత హాయిగా వున్నదో ఆ వర్షంలో ఆ రైల్వే ప్రాంతమంతా..!! ఆ వర్షంలోని కొత్తగా పరిచయం అయినా మీడియా మిత్రుల వలన అక్కడ చూడతగ్గ ప్రదేశాలు, వాటి వివరాలు సేకరించాను. నా సేకరణతో వారు కూడ కొద్దిగా సన్నిహితం అయ్యారు, అలా మాటల్లోనే కొందరం జత గూడాం..కాస్త విశ్రాంతి తీసుకొన్న తర్వాత మద్యాహ్నం నుండి ఎక్కడేక్కడ తిరిగిరావాలే అనే ప్రణాళిక వేసుకొని ఒక నిర్ణయానికొచ్చాం. అందులో కొందరం కలిసి తిరగడానికి కొంతమందిని జత చేసుకొన్నాను నేను.
ఈ ఇంటర్‌నేషనల్ మీడియా సదస్సు ప్రతి సంవత్సరం "బ్రహ్మకుమారి సమాజం" వారు నిర్వహిస్తారట..!! వీటికి దేశం నలమూలల నుండి మీడియా వారు హాజరు కావడం ఒక పరిపాటిగా సాగుతున్నది. ఈ సంవత్సరం కూడ వారి ఆద్వర్యంలో ఈ సదస్సు జరుగుతున్నది, ఆ సంస్థ వారి వాహనాలలో ఆ బ్రహ్మకుమారి సమాజపు నగరానికి వెళ్లాం, అక్కడే మాకు వసతి కల్పించారు. వారి సమాజం మొత్తం కొని వందల ఎకరాలలో వున్నది, లోపల చాలా వీధులున్నాయి, ప్రార్థనా మందిరాలు, ఉద్యానవనాలు, దేశం నలమూలల నుండి వచ్చే వారి బ్రహ్మకుమారి సాధువుల కోసం వసతి గృహాలు అదొక ఒక చిన్న పరిమాణంలో వున్న సాట్‌లైట్ సిటీలాగున్నది, అక్కడ తిరిగడానికి సిటీ బస్సులాంటివి నిస్సాన్ మజ్దా వాహనాలు వున్నాయి. లోపల ఎక్కడికి వెళ్లాలన్నా ఆ వాహనాలలో వెళ్లాల్సింది, అంత పెద్ద కాలనీ అది.
మద్యాహ్నం భోజనాల శాలకు వెళ్లాక కాని నాకు అర్థం కాలేదు బ్రహ్మకుమారి సమాజపు ఆహార అలవాట్లు. అన్నీ చప్పడి భోజనాలే.. చూట్టానికి చాలా పుష్టికరమైన ఆహారమే కాని, వేటిలోను ఉప్పు, కారం అస్సల్ వుండవు. గతంలో ఇలాంటి కార్యక్రమాలకు వచ్చిన వారు కొందరు మళ్లీ రావడం వలన వారు ముందు జాగ్రత్తగానే వొస్తూ వొస్తూ ఇంటి నుండి ఆవకాయ, పొళ్లు లాంటివి రకరకాలైన తిండి పదార్థాలు తెచ్చుకొన్నారు. ఆ కారం సహాయంతో భోజనం ముగించేసి...... మెల్లిగా ఆ సమాజం వారే అక్కడికొచ్చే అథిధుల కోసం అక్కడ చూడతగ్గ ప్రదేశాలను తిరిగి రావడానికి కొన్ని లోకల్ వాహనాలను సమకూరుస్తారు, కాకపోతే డబ్బులు ఎవరికి వారే... అన్న మాట.. ! అది చాలు మాకు ఎందుకంటే... ఆ సమాజం పట్ల అక్కడి ప్రాంతాల వారికి కాస్త గౌరవం వున్నది, కాబట్టి దేనికి కూడ కక్కుర్తి పడకుండా సరైనా ధరలకే వాహనదారులు తమ వాహనాలను యాత్రికలకు సమకూరుస్తున్నారు. ఆ ధర కూడ సమాజం వారే నిర్ణయిస్తారు ఎంతివ్వాలన్నది.
మేము అలా సైట్ సీయింగ్‌కు బయలుదేరుతున్నాం అని గుస గుసలు వినగానే కొందరు మాతో పాటే వచ్చిన స్త్రీలు కూడ మాతో రావడానికి బయలు దేరారు. వారికొక వాహనం కేటాయించి... మేము మాత్రం మరో వాహనంలో బయలు దేరాం. ఆబురోడ్ రాజస్థాన్, గుజరాత్‌కు సరిహద్దుల్లో వున్నది, ఓ ముప్పై.. కిలోమీటర్ల్ ప్రయాణించగానే రాజస్థాన్ సరిహద్దు దాటి గుజరాత్ రాష్ట్రంలోకి ప్రవేశించాం. దారిపొడవునా పచ్చని ప్రకృతే.. మేము ప్రయాణిస్తున్నా మా రహదారి పక్కనే మాతో పాటే ఓ నది ప్రయాణం చేస్తూ వొచ్చింది పేరు గుర్తు లేదు కానీ.
దగ్గరలో ప్రఖ్యాతి గాంచిన "అంబాజి దేవాలయం" కు వెళ్లాం, మన తిరుపతిలానే చాలా పెద్ద దేవాలయం, శక్తి పీఠం అని చెబుతారు మొత్తం పాల రాతితో నిర్మించారు, చాలా పరిశుబ్రంగా వున్నది, ఆ దేవాలయంలో ఫోటోస్‌కు అనుమతి లేదు కాబట్టి ఫోటోస్ తీయలేదు నేను. తర్వాత అక్కడికి దగ్గరలోనే రెండు జైనుల దేవాలయాలకు వెళ్లాను, ఎక్కడ చూసినా పాలరాతి శిలా కళా సంపదే.. మొత్తం రెండు దేవాలయాలు పాలరాతి శిల్పాలే..! శిల్పాలే కాక పూలతీగల్లాంటి అల్లికల గల శిలలు మొలిచారు అవి మాటలతో చెప్పతగినవి కావు చూసి తరించాల్సిందే..! ఒక దానిని మించి మరొక శిల్పాలు, అల్లికలతోకూడిన ద్వారాబందాలు, ఒకటనికాదు.... మనల్ని మనం మైమరిచిపోతాం. తిరిగొచ్చేసరికి రాత్రి అయిపోయింది. మరసటి రోజు ఎక్కడికి వెళ్దాం అనే ఆలోచనలు మేము చేస్తుండగానే మా కోర్డినేటర్.. కల్పించుకొని " సమాజం వారు రేపు మనకు ఒక బస్సును సిద్దం చేసారు మౌంట్ ఆబు మొత్తం తిరిగిరావడానికి, ఎల్లుండి నుండి ఇక్కడ మీడియా సదస్సు జరుగుతుంది కాబట్టి రేపటితో మన తిరుగుడు కార్యక్రమాలు ముగించేయాలి" వివరించారు.
నాలాంటి వారు ఇలాంటి మాటలు వింటారా ఏంటి..? ముందే స్వేచ్చా జీవులం, ఎవరి కనుసైగలలో మసలని మనస్థత్వం మనది.. సో ఇలాంటి మాటలు ఎడమ చెవిలో వింటూ కుడి చెవి నుండి బయటకు వదలడమే కాని..మెదుడుకు ఎక్కించేది అస్సల్ వుండదు..!! :-p
మరసటి రోజు బ్రహ్మకుమారి సమాజం వారు సిద్దం చేసిన బస్సులో అక్కడి నుండి మౌంట్ ఆబుకు బయలు దేరాం. మొత్తం ఘాట్‌రోడ్ అది చుట్టు పచ్చని ప్రకృతి పరుచుకొని వున్న పచ్చని కొండలు మంచుతో అక్కడక్కడా కప్పబడి వున్నాయి, ఒక కొండ నుండి మరో కొండకు మారుతూ అలా ఎన్నెన్ని కొండలు మారుతూ మా బస్సు ప్రయాణం సాగింది, దారిపొడవునా పచ్చదనమే.. మొత్తం. మొదటగా ఆ సమాజం వారి కొన్ని ప్రార్థనా మందిరాలు, అక్కడ కొన్ని గ్రామాలను దత్తకు తీసుకొని అక్కడ నిర్వహిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను సందర్శించాము, అలానే ఒకటి రెండు లేక్స్ దారిలొ కనపడ్డాయి. కాని చివరగా... "దిల్‌వార దేవాలయం" అనే జైన దేవాలయం చేరుకొన్నాం.
ఆ దిల్‌వారా దేవాలయంలోకి కెమెరాస్, సెల్ ఫోన్స్ లను అనుమతించట్లేదు చాలా చాలా క్రమశిక్షణతో నిబందనలను పాటిస్తున్నారు అక్కడి వారు. లోపలికి వెళ్లడానికి చాలా పెద్ద క్యూలే వున్నాయి. లోపలికి వెళ్లాక... గాని అర్థం కాలేదు కెమెరాస్, సెల్ ఫోన్స్ కు అనుమతికి నిరకారణ ఎందుకో.....! లోపల ప్రధాన దేవాలయం వసారాలోకి ప్రవేశించగానే ఒక్క సారిగా నేను షాక్ తిన్నాను, మాటలలొ వర్ణించలేను ఆ అనుభూతిని, ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే అక్కడి శిల్ప కళా చాతుర్యానికి.. నాకున్నా "నాలుగు కళ్లు" సరిపొవట్లేదు, వొళ్లంతా కళ్లు చేసుకొని చూసినా కూడ ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. కొన్ని వేల సార్లు "వావ్" లంటు మన నోటి నుండి బయటకు మనకు తెలీకుండానే వెలువడుతూ వుంటాయి అనుకొంటాను, నేనైతే వాటిని లెక్కించలేదు ఎన్ని వేల సార్లు నా నోటి నుండి అలా వచ్చుంటుందో మరి....!
మనకు తెలిసి శిల్ప కళ 2D, or 3D లలో ఎక్కువగా చూసింటాం, కాని 4D లలో వున్న శిల్పాలను చాలా వరకు తక్కువగానే కనపడతాయి మనకు, కాని అక్కడి "దిల్‌వారా" దేవాలయంలో వున్న మొత్తం శిల్పాలన్నీను 4th dimension లో వున్నాయి, అంటే పాలరాతి మీద లోపలి వైపు కూడ తొలిచారు, కేవలం స్తంభాలకు, దేవాలయపు గోడల మీదునే కాదు, దేవాలయంకు వున్న పై కప్పు కూడ మొత్తం శిల్పాలతోనే కప్ప బడి వున్నది. అదీను ఒకే పాలరాతి మీద కొన్ని పదుల సంఖ్యలో శిల్పాలున్నాయి, అవన్నీను ఫొర్ట్ డైమెన్షన్‌లోనే మొలచబడి వున్నాయి, వాటికి మద్యలో కిందకు వేలాడుతూ వున్న షాండ్లియర్ లాంటి డిజైన్‌తో వున్న శిల్పం, ఇవన్నీను ఒకే పాలరాతి మీద చెక్కి పై కప్పుగా వాడారు. శిల్పి ఏ కొద్దిగా తన ఉలితో పరధ్యానంతో మొలిచినా చాలు మొత్తం ఆ పాలరాతికున్న మిగతా శిల్పాలన్ని పగిలి ముక్కలవుతాయి, అంటే ఎంతో ధ్యాసతో పంచేంద్రీయాలన్నిటిని ఒకే దానిమీద కేంద్రీకరిస్తూ ఆ శిల్పాలను మొలచాలి, లేదా మొత్తం పగిలిపోయి ముక్కులుగా నాశనమే అవుతుంది, మళ్లీ కొత్తగా మరో కొత్త పాలరాతి మీద మొదలు పెట్టాలి. ఎంతో ఏకాగ్రత వుంటే కాని, వాటిని అంతటి అధ్భుత శిల్పంగా మలచలేరు. వాటి అందం నేనైతే మాటల్లొ వర్ణించలేను.. చూసి తరించాల్సిందే..! ఇక పాలరాతి తోరణాలు ప్రతి రెండు పాలరాతి స్థంభాల మద్యన మొలిచి వున్నారు, అవన్నీ వేటికవే ప్రత్యేకమైన డిజైన్స్‌తో తయారు చేసారు, ఆ పాలరాతి తోరణాలు చూస్తే చాలు కళాకారుల ప్రతిభని వేన్నోల పొగడడానికి పదాలు దొరకవు నోటికి.
అలా ఒకటా రెండా లేక పదుల సంఖ్యలో వున్నాయని అనుకొందాం అని అనుకొంటే ఆహ కుదరదు. అలాంటి శిల్పాలు కొన్ని వందల్లో వున్నాయి అక్కడ పై కప్పు నిండా, వసారాకున్న స్తంభాలకు, ఇక గర్భ కుడి చుట్టూ ఎన్నెన్ని శిల్పాలన్నాయో.. ! ప్రధాన దేవాలయం గర్భగుడే కాకుండా దేవాయలం చుట్టూ కొన్ని అడుగుల దూరంలో మూడు వైపుల వున్న పెద్ద వసారాలకు కొన్ని వందల స్థంభాలున్నాయి, ఆ స్థంభాలకు, ఆ వసారాలకు వున్న పై కప్పులను కూడ శిల్పాలతోనే మొలిచారు, కొన్ని వందల శిల్పాలున్నాయి వాటికి. ఒకదానిని మించిన మరొకటి వున్నాయి, ఇది బాగున్నది, ఇది బాగోలేదు అని దేనిని మరో దానితో పోల్చలేము. ప్రతి శిల్పం అపురూపమే, ప్రతి శిల్పమూ అద్భుతమే..! మొలవడంలో ఏ కొద్దిగా ఏమారినా మొత్తం శిల్పమే కాదు పై కప్పుతో అన్నీ చెడిపొతాయి, కొత్తగా మరొక పాలరాతి మీద మొలవాల్సి వొస్తుంది. అంత తదేకంగా ద్యాసతో మొలిచారు ఆ శిల్పులు.
ఆ కళాకారులను మనసులో ఎన్ని సార్లు జోహార్లు అర్పించుకొన్నానో నేను, నేనే కాదు అక్కడున్న ప్రతి సందర్శకుడు ఖచ్చితంగా తనను తాను మైమరిచిపోవాల్సింది, చుట్టూ మనుషులను, ఆపోజిట్ సెక్స్‌ని కూడ పట్టించుకొకుండా మొత్తం చుట్టూ వున్న ప్రపంచాన్ని సైతం మరిచిపోయి అభ్భరంగా అక్కడి శిల్ప కళాసంపదను చూస్తూ మరో లోకంలోకి వెళ్లిపోతారు. వాళ్లు కళాకారులా.. మనుషులా..లేక రాక్షసులా ( రాక్షసులా అని పదం వాడటంలో రాక్షసత్వం అనే భావనతో కాదు.. అలాంటి అద్భుతమైన శిల్పాలను మొలచడంలో మనుషులను దాటి ఇంకా పైకి అదేదో మరో మనుషులకు అందని ఉనికిని ఉదహరిస్తూ రాక్షసులా అనే పదం వాడాను ) అని అనిపించింది. వారికి పాదాభి వందనాలు అప్పటికప్పుడు మనసులో అర్పించుకొన్నాను.
ఒక వైపున నా చేతి వేళ్లకు ఒక్కటే దురద పెడుతున్నది.. కెమెరా లేకపోవడం వలన, ఒక్కో సారి మెలికలు తిరిగిపోతున్నాయి వాటంతట అవే..! ఎంతగా అణుచుకొన్నానో నన్ను నేను ఎలా ..ఎలా వీటిని నా కెమెరాలో బందించాలి..? ఎలారా బాబు అని ఒకటే ఆలోచనలు, నా ఆవేశం తీరేది కాదనుకొని వెంటనే కొందరి మీడియా మిత్రుల ద్వార అక్కడ ఎలాగైనా సరే ఫోటోస్ తీసుకోవడానికి అనుమతి పొందాలని తెగ ప్రయత్నించాను. అప్పుడు నా జేబులో ఐదు వేల రూపాయలు మాత్రమే వున్నాయి, పది వేలు రూపాయలు చెల్లించైనా సరే వాటిని ఫోటోస్ తీసుకోవడానికి అనుమతి పొందాలని వాకాబు చేసాను. ప్చ్..ఊహు.. కుదరనే లేదు, డిల్లీలో జైన్ మందిర ప్రధాన కార్యాలం నుండి మరో డిపార్ట్‌మెంట్‌కు వెళ్లి అనుమతి తెచ్చుకోవాలట. అస్సల్ అనుమతి ఇవ్వడమన్నది జరగదు.. కాని మీరు ప్రయత్నించండి అని చెప్పారు అక్కడి అధికారులు. నా శక్తికి మించినది ఈ వ్యవహారం అని అనుకొని నా మనసుకి తాళం వేసాను ఇక నోర్మూసుకో అని. ఒక వేళ అనుమతి తెచ్చుకొన్నా మొత్తం అక్కడున్న ఐదు దేవాలయాల శిల్పాలను ఫోటోస్ తీయాలంటే కనీసం వారం నుండి పది రోజులు సమయం పడుతుందని అనిపించింది నాకు.
కళాకారుడి సృష్టి కొన్ని వందల సంవత్సరాల వరకు, ఈ భూమి మనుగడలో వున్నంత వరకు ఈ ప్రపంచపు మనుసులను మైమరిపిస్తూ రంజింప చేస్తుంది అని అనడానికి ఈ జైనుల దిల్‌వార దేవాలయం ఒక నిదర్శనం.
ఇక చరిత్రలోకి వెళ్తే.... అక్కడున్న గైడ్ మొత్తంలో హిందీలోనే వివరించారు, నాకు హిందీలో పొట్ట పొడిస్తే ఒక్క అక్షరం ముక్క కూడ రాదు గాని.. ఏదో వాడి హావభావలను బట్టి కొద్దిగా అర్థం చేసుకొన్నాను.
మొత్తం జైను మహారాజులు 24 మంది, వీరిని "తీర్థంకరులు" అని పిలుస్తారు, 14 వ తీర్థంకరుడు ఈ దిల్‌వారా దేవాయలాని 11-12 శతాబ్దంలో నిర్మించారని విన్నాను. వీటి నిర్మాణం దాదాపుగా 16 సంవత్సరాల పాటు సమయం పట్టిందట. అప్పట్లో పదో లేక పన్నెండు కోట్ల వ్యయం అయ్యిందని అక్కడి గైడ్ చెప్పారు. నాలుగు దేవాలయాలని మొత్తం పాలరాతితో మొలిస్తే.. ఇంకా సమయం మిగిలి వుండటం మూలానో లేక మరొ రకపు అతి మామూలు కొండ రాయి అక్కడ వుండటంలో ఆ సామాన్య కొండ రాయితో కూడ మరొక ఐదవ దేవాలయాన్ని శిల్పులు మొలిచారు అవి కూడ అధ్బుతమే..!!
ఇక నాలగవ దేవాలయంలో దాదాపుగా నాలుగువందల కేజీల పైన పంచలోహంతో ఒక పదడుగుల మేరకు ఎత్తుతో తీర్థంకురల విగ్రహం వుంచారు.
అక్కడి నుండీ బయటకు వచ్చిక కూడ ఆ శిల్పాలే మదిలొ మెదులుతూ వున్నాయి, ఒకటి..రెండు రోజులు గడిచినా కూడ నా మదిని వీడిపోవట్లేదు..ఆ శిల్ప సౌంధర్యం, ఎలాగైనా సరే వాటిని ఫోటోస్ తీయాలని తెగ ప్రయత్నించాను.. ప్చ్..ఊహు నాకున్న శక్తి సరిపోలేదు ఆ సమయానికి. చాలా చాలా అధ్బుతమైన శిల్పాలు అవి. గూగులమ్మను ఒక నొక్కుడు నొక్కితే చాలు వాటి గురించి మీకు మొత్తం సంపూర్ణ సమాచారం దొరుకుతుంది.
మనం ఒక సినిమాను చూసి..బాగా ఇష్ట పడితేనో...లేక ఏదో ఒక నవలో లేక కథనో మన మనుసలను దోచేస్తే.. ఆ సినిమా గురించి కాని లేక కథ గురించి కాని మన చుట్టూ వున్న స్నేహితులకు చాలా చాలా ఎక్కువగా చెబుతాం ఆ సినిమా/కథ లోని గొప్పతనం గురించి, ఎందుకంటే మన మనసును అంతగా దోచింది కాబట్టి ఎక్కువ చేసి చెబుతాం, విన్న మన స్నేహితులు ఆ సినిమా చూసాకనో/ కథ చదివిన తర్వాతనో మనం చెప్పినంత గొప్పగా వారికి అనిపించదు .. కారణం మనం ఎక్కువ చేసి చెప్పడం వలన విన్న మన స్నేహితులు వాటి గురించి ఎక్కువగా ఊహించుకొని ముందే వారి వారి మెదుడులో ఒక "నిశ్చయ అభిప్రాయం"తో చూస్తారు కాబట్టి వారి ఊహించుకొన్న అభిప్రాయాలకు అది ఎప్పటికీ చేరదు..... కానీ
ఈ శిల్పాల గురించి నేనెంతగా ఎక్కువగా చెప్పినా మీరెంతగా గొప్పగా ఊహించుకొన్నా కూడ మీ ఊహలను దాటి ఈ శిల్పాల సౌందర్యం వుంటుంది. మీ ఊహలకు, నేను ఎక్కువ చేసి చెప్పిన అంచనాలకు కూడ అందనంత గొప్పగా వుంటాయి ఈ శిల్పాలు. ఖచ్చితంగా అటు వైపు వెళ్లిన వారు వీటిని సందర్శించండి.
అయితే ఒక చిన్న సూచన....! శిల్పాల పట్ల మక్కువ లేని వారు మాత్రం వీటి వైపు అస్సల్ తొంగి చూడకండి.. ఎందుకు చెబుతున్నానంటే.. గతంలో ఒక పది పదిహేనళ్ల క్రితం అనుకొంటాను, కొంత మంది మిత్రులతో కలిసి కర్నాటకలోని హోయసల కాలం నాటి శిల్పాలను నేను పట్టి పట్టి వాటి వొంపు సొంపులను, వయ్యారాలను చూస్తున్నప్పుడు నా పక్కనున్న కొందరు స్నేహితులు.. "ఏంట్రా వీడు ఈ రాతి బొమ్మలను అంత వింతగా చూస్తున్నాడు మరీ వెర్రి గాని .. ఏమున్నాయి అందులో రాతి బొమ్మలే కదా.. దానికి అంత తదేకంగా చూడాలా..అంత సమయం తీసుకోవాలా..? తొందరగా రమ్మనండి వెళ్దాం ఇక్కడ నుండి" అని అంటూ తొందర పెట్టేవారు. వారి వారి కోణాలలో వారు సబబే అయ్యుండొచ్చు కాని. శిల్పాల పట్ల మక్కువ లేని వారు, నా వ్యాసంలోని మాటలను విని ఇలాంటి శిల్పా కళా సౌందర్యాన్ని చూట్టానికి వెళ్తే మాత్రం కచ్చితంగా నన్ను తిట్టుకొంటారు, కాబట్టి వాటి పట్ల మక్కువ వున్న వారు మాత్రమే వెళ్లమని నా సూచన.
ఆ రోజు సాయింత్రం తిరిగి మా బస చేరుకొన్న తర్వాత మా మీడియా కోఆర్డినేటర్ "రేపటి నుండి సదస్సులకు హాజరవ్వండి అందరు" అని చెప్పి వెళ్లారు, కాని మనం వింటేనా..? మనమసలే "కమలయ్యలం" సీతయ్యలాగ.. కాబట్టి మరసటి రోజు మాకు దగ్గర్లోనే 150 కిలోమీటర్ల దూరంలో వున్న "ఉదయ్ పూర్" కు వెళ్లాలని ఓ ఐదారుగురం కలిసి సమాచారం సేకరిస్తూ కూర్చున్నాం, అయితే అక్కడి వారు ఈ విషయంలో కొన్ని భయాలు కల్పించారు మాకు, ఉదయ్‌పూర్ వెళ్లే నేషనల్ హైవేలో కొన్ని చోట్ల కొండ ప్రాంతాలున్నాయి అక్కడంతా దారిదోపిడి దొంగలుంటారు కాబట్టి సాయంత్రం చీకటి పడక మునుపే మీరు హైవేలొ దాటి ఇక్కడికి చేరుకోవాలి" అంటూ ఒక భయాన్ని సృష్టించారు. ఇంకా ఈ కాలంలో కూడ అదీను నేషనల్ హైవే లో ఇలాంటి దారిదోపిడీలు జరుగుతున్నాయా అని నా అనుమానానికి.. "వారు గిరిజనలండి..సాయింత్రం హైవే మీదనే పక్కన కూర్చోని ఆల్కాహాల్ తీసుకొంటూ వుంటారు.. కాస్త చీకటి పడగానే హైవేలో వెళ్లే వాహనాల మీద దాడి చేస్తుంటారు ఇదొక ఆనవాయితీ వారికి" అని వివరించారు. సరే చూద్దాం పదా అని అనుకొని మరసటి రోజుకు ముందుగానే ఒక వాహానాన్ని మాట్లాడుకొన్నాం.
మరసటి రోజు తెల్లారు జామున్నే ఇంకా తెలవారకమునుపే ఓ ఏడుమందిమి బయలుదేరాం వాహనంలో..! దారి వెంబడి మంచు.. నేషనల్ హైవేకి ఇరువైపులు చిన్న చిన్న గుట్టాలంటి కొండలు..వాటిమీద పచ్చని తివాచిలా పరుచుకొని వున్న పచ్చని ప్రకృతి.. వాటిని చూసుకొంటూ మత్తుగా మా ప్రయాణం సాగింది. మద్యలో రాణా ప్రతాప్ సింగ్ యుద్దం చేసిన ప్రాంతాలు, యుద్దం సమయాలలో వారు చేసిన విడది ప్రాంతాలను చూసుకొంటూ వెళ్లాం.. అలా మా ప్రయాణం ఓ నాలుగు గంటలు సాగింది.
ఉదయ్‌పూర్‌లొ నాస్టా చేసాక, అక్కడ కూడ మన హైదరాబాద్‌లొని "హుస్సేన్ సాగర్" లాంటి సరస్సు ఉదయ్‌పూర్‌లో కూడ నగరం నడిబొడ్డున "ఫథే సాగర్ లేక్" అని సరస్సు వున్నది, ఆ సరస్సు మద్యలో ఒక చిన్న్న ఉద్యావనం.. అది చూసుకొని.. నగర మద్యలో వున్న "మహారాణా ఉదయ్ సింగ్ సిటీ ప్యాలెస్‌కు" వెళ్లాం. అది పూర్తిగా చూడటానికే చాలా సమయం తీసుకొన్నది. సాయింత్రం సమయం మించిపోవడంతో అక్కడున్న చాలా చారిత్రాత్మక కోటలు, ప్యాలెస్సులు చూడలేకపోయాం..!
ఇక మరసటి రోజు ఎక్కడికి వెళ్లలేకపోయాను.. అటు నుండి అటే "జైసల్మీర్"కు వెళ్దామనుకొన్నాను కాని ఎవరు రావడానికి ఆసక్తి చూపకపోవడంతో.... నేను కూడ వారితో పాటు తిరిగి హైదరాబాద్ ప్రయాణం చేయాల్సి వొచ్చింది.
శిల్ప కళల పట్ల మక్కువ వున్న వారు మాత్రం మౌంట్ ఆబు లోని దిల్‌వారా దేవాలయాన్ని మాత్రం తప్ప కుండా సందర్శించండి.
ఈ కింద ప్రచురించిన ఫోటోస్ అన్నీను నేను తీసినవి కావు, దిల్‌వారా ఆలయంలో ఫోటోస్‌కు అనుమతి లేదు కాబట్టి అంతర్జాలం నుండి సేకరించిన ఫోటోస్‌ని మాత్రం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.........
అలానే కిందనున్న కొన్ని శిల్పాలన్నీను దేవాలయం లోపల వున్న పై కప్పుకు చెక్కిన పాలరాతి శిల్పాలు...!
అలానే కిందనున్న కొన్ని శిల్పాలన్నీను దేవాలయం లోపల వున్న పై కప్పుకు చెక్కిన పాలరాతి శిల్పాలు...!
ఈ కింద ప్రచురించిన ఫోటోస్‌లలోని శీల్పాలన్నీను మామూలుగ దేవాలయం గోడల మీదనూ.. స్థంభాల మీద చెక్కినవి...!!