జూన్ 26 & 27  న ముంబయి వడాలలోని   బిగ్ సినిమా " ఐ " మాక్స్  ఆడిటోరియంలో " డిజిటల్ " సినిమా మాధ్యమం మీద సినిమాటోగ్రాఫర్స్ కంబైన్స్, ఇండియన్ సోసైటీ ఆ సినిమాటోగ్రాఫర్స్( ISC ), ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా( PGA ) మరియు   అమెరికన్ సోసైటీ ఆఫ్ సినిమాటోగ్రాఫర్స్( ASC)  సంయుక్త నిర్వహనలో "  TOWARDS A  BETTER  IMAGE "  అని ఒక  సదస్సు నిర్వహించారు.  భారతదేశ నలమూలలనుండి  సినిమాటోగ్రాఫర్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్, దర్శకులు, ఫిల్మ్ ఇన్‌స్టిస్ట్యూట్ స్టూడెంట్స్, కొడాక్ ఫిల్మ్ కంపెనీ, సోనీ కంపెనీ రెప్స్ అందరు కలిపి 500 మంది ఈ సదస్సుకు హాజరు అయ్యారు. 

       మొదటిరోజున జర్మనీ నుండి వచ్చిన  ARRI  కెమెరా సంస్థ మార్కటెంగ్ మేనేజర్, టెక్నికల్ ఇంజనీర్  ఆ సంస్థ కొత్తగా విడుదల చేస్తున్న "ARRI ALEXA "  డిజిటల్ కెమెరా యెక్క సాంకేతికపరిఙ్ఞానం గురించి వివరించారు,  ఈ కెమెరాతో  సినిమా షూట్ చేసి ఆ ఫైల్‌ని డైరెక్ట్‌గా ఎడిటింగ్‌టేబుల్ మీద ఎడిటింగ్ చేసుకోవచ్చు.   పోస్ట్‌ప్రొడక్షన్, అన్ని తుదిమెరుగులు అయ్యాక మనకు ఫిల్మ్‌‍ప్రొజెక్షన్ ఉంటే ఫిల్మ్ మీద ట్రాన్స్‌ఫర్ చేసుకొని థియేటర్స్ ప్రదర్శించుకోవచ్చు, డిజటల్ ట్రాన్స్‌మిషన్ ఉంటే  డైరెక్ట్‌గా ఆ ఫైల్‌ని తీసుకొని ట్రాన్స్‌మిషన్ ద్వార ప్రొజెక్షన్ చేసుకోవచ్చు. మద్యలో ఎక్కడ ఫిల్మ్ అవసరమే ఉండదు.

         మధ్యాహ్నం భోజనం అయ్యాక  సదస్సుకు హాజరైన ప్రొఫిషనల్స్‌తో ప్రశ్నలు-జవాబులు కార్యక్రమం నిర్వహించారు,  చాలా మంది ప్రొఫిషినల్స్ అడిగిన ప్రశ్నలకు  జర్మనీ సాంకేతికనిపుణులు చాలా ఓపిగ్గా సమాదానాలు ఇచ్చారు. మంచి చర్చలు కూడ జరిగాయి...!  ఆ కెమెరాతో చేసిన కొన్ని టెస్ట్ షూట్ ఫిల్మ్స్ ప్రదర్శించారు, కలర్ సాచ్యురేషన్, డెప్త్, డీటేయిల్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే మన ఇండియా సినిమాటోగ్రాఫర్స్ టెస్ట్ షూట్ చేసిన ఫిల్మ్స్ చూస్తె నాకు మతిపోయింది....? ఏంట్రా..అదే కెమెరా కాని ప్యారిస్ కెమెరామెన్స్, ఇంగ్లీష్ కెమెరామెన్స్ ఇచ్చిన క్వాలిటీ మనోళ్ళు ఇవ్వలేకపోయారు...! అదెక్కడ ఫాల్ట్ అన్నది అర్థమేకావడం లేదు.  తర్వాత సోనీ కంపెనీ వారి కొత్త  డిజిటల్ కెమెరా SONY SRW 9000  మోడల్ గురించి సాంకేతిక విషయాలు చర్చలు, తర్వాత ప్రశ్నలు - సమాదానాలు.  మరి డిజిటల్ ఫార్మాట్   వచ్చాక " ఫిల్మ్ " మరుగున పడుతుందా..?  భవిష్యత్తే నిర్ణయించాలి.
అలెక్సాలో టెస్ట్ షూట్ చేసిన కొన్ని డెమో ఫిల్మ్స్ మీకోసం












      సాయింత్రం టీ, స్నాక్స్ అయ్యాక ప్రముఖ దర్శకుడు శ్రీ శ్యామ్‌బెనగల్ దర్శకత్వంలో ప్రముఖ హింది చలనచిత్ర చాయగ్రాహుకుడు శ్రీ అశోక్ మెహతా సినిమాటోగ్రఫీ నిర్వహించిన " త్రికాల్ " సినిమాని ప్రదర్శించారు.  ఈ సినిమా కథ, కథనం గురించి సినిమా లవర్స్‌కి తెలిసే ఉంటుంది, నేను మరీ వివరించనవసరం‌లేదు.  ముఖ్యంగా చెప్పుకోవలసింది అశోక్ గారి పనితనం...సినిమా నజీరుద్దిన్ షా తో ప్రారంభమయినప్పుడూ  నార్మల్ కలర్‌తో మొదలవుతుంది...ఫ్లాష్‌బ్యాక్ మొదలవ్వగానే సినిమా వార్మ్‌టోన్ కి మారుతుంది, కథకాలం దేశానికి అప్పుడే స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజులు, కథాప్రాంతం గోవా...! అప్పటికాలానికి విద్యుత్త్ లేదు ఆప్రాంతంలో, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని  రాత్రి సన్నివేశాలకు చాలా వరకు లైట్స్ ఉపయోగించకుండా కేవలం కొన్ని వందల మైనపుదీపాలు, కిరోసిన్ లాంతర్స్  ఉపయోగించి సన్నివేశాన్ని చిత్రీకరించారు.. ! మనుషుల భావోద్వేగాలు, అప్పటికాలపు అనుబందాలు, ఆ కల్చర్‌ను అంతా తన లైటింగ్‌తో వెలుగు నీడలను సృష్టిస్తూ.. చక్కని ఫ్రేమింగులతో ప్రతిబింబించారు.  వార్మ్‌టోన్‌లో సినిమా చూడడానికి చాలా బాగుంది. సినిమాసాంతం ప్రపంచసినిమా స్థాయి ప్రమాణికంలోనే ఉంది. కాకపోతే మన దౌర్భాగ్యం ఏమిటంటే ఆణిముత్యాలు, కళాఖండాలు అని చెప్పుకోతగ్గ ఆపాత మధురచిత్రాలను " ప్రిజర్వ్ " చేసుకొనే సాంకేతిక పరిఙ్ఞానం మనకు లేకపోవడం దురదృష్టకరం, ఈ విషయంలో బావితరాల వారు ఈ సినిమావారిని క్షమించరు.  "త్రికాల్ " సినిమా అంతా గీతలతోను..మరకలతోను నిండి ఉన్నది.




రెండవరోజు....! "American Society of Cinematography " (ASC), ప్రెసిడెంట్  Mr. Michael Goi,  హాలీవుడ్ కెమెరామెన్ ASC మెంబర్ Mr. David Stump.  Producer's Guild of America కార్యదర్శి .Nick Abdo లతో  డిజిటల్ సినిమా మీద చర్చాగోష్టి,  ప్రశ్నలు -  సమాదానాలు సాయింత్రం వరకు జరిగాయి, ఇందులోభాగంగా  David Stump  ఆద్వర్యంలో యూనివర్సల్ స్టూడియోలో పరీక్ష కోసం ఒకేచోట  8 కెమెరాలు...ARRI D-21, THOMSON Viper,  SONY F23.  SONY F35. Panavision Genesis. Panasonic HVX 3700.  Red ONE. వీటితోపాటు ఫిల్మ్ లోడ్ చేసిన కెమెరా ARRI 434 ఒకే ఫ్రేమ్ కి 8 కెమెరాలను ఫిక్స్ చేసి ఒకే సమయం‌లో ఒకే దృశ్యాన్ని 8 కెమెరాలలో ఒకేసారి చిత్రీకరించారు, వాటిని ల్యాబ్‌లలో కెమికల్ ప్రాసెస్ అయ్యాక కొన్ని, తర్వాత కలర్ గ్రేడింగ్ చేసాక కొన్ని ప్రింట్స్ వేసి వాటిని ఒక దాని పక్కన ఒకటి ఉంచి " కంపారిజన్ " చేసారు. ఏతావాతా చేసిందేమిటంటే... ఆ డిజిటల్ సినిమాలన్నీ కంపేర్ చేసింది " ఫిల్మ్ " మీద చేసిన డెమో ఫిల్మ్‌తో....! వాటిలో చాలా డిజిటల్ కెమెరాలు అన్ని విషయాలలో కాకుండా ఏదో ఒక్క  విషయంలో మాత్రమే " ఫిల్మ్ " డెమో రీల్ తో దాదాపుగా  60% లేక 70% దగ్గరగా రాగలిగాయి. అంటే  డెప్త్ విషయం లో ఒక కెమెరా ఉంటే..మరో కెమెరా కలర్ సాచ్యురేషన్‌లో 60%  దగ్గరగా ఉంటుంది..అలా ఇంకో కెమెరా డీటేయిల్స్, రెజ్యూలేషన్ ...! తీరా చూస్తే  " ఫిల్మ్" లో చేసిన డెమోతోనే కంపారిజన్ చేయాల్సి వస్తుంది...!అంటే ఈ డిజిటల్ ఇంకా తనకంటూ ఒక సొంత ప్రమాణికం తయారు చేసుకోలేదు...! ఇలా అన్ని విషయాల్లో " ఫిల్మ్ " తో సమానంగా 100% దగ్గరకొస్తే గాని  " ఫిల్మ్ పోయే... డిజిటల్ వచ్చే డామ్..డామ్.."  అని పాడుకోలేము..!



     చివర్లో ఇద్దరి ప్రముఖ చాయాచిత్రగ్రాహుకలకు " లైఫ్ అచీవ్‌మెంట్ " అవార్డ్స్ ఇచ్చారు. వారిలో మొదటి వ్యక్తిని చూడగానే నేను షాక్ అయ్యాను.. ఆ వ్యక్తి గురించి ఇక్కడ ఒకటి రెండు వ్యాక్యాలలో రాయడం  ఆ మనిషిని కీంచపరచడమే అవుతుంది..ఆ వ్యక్తికో ప్రత్యేకమైన వ్యాసం వ్రాస్తాను. ఆ వ్యక్తి చేసిన కొన్ని ప్రత్యేకమైన కమర్షియల్స్ భారతావనిలో టి.వి ఉన్న ప్రతి ఇంట్లోనూ..సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడు ఖచ్చితంగా చూసే ఉంటారు..కాదు కాదు చూసే తీరాల్సి వస్తుంది కూడ...! రెండో వ్యక్తి...అశోక్ మెహతా..ఆయన అవార్డ్ పుచ్చుకుంటున్న సమయం‌లో ఆడిటోరియం‌లో కూర్చోని ఉన్న అందరు లేచి తమ కరతాళధ్వనులతో  అభినందించారు. ఈ కార్యక్రమాన్ని సినిమాటోగ్రాఫర్స్ కంబైన్స్ వారి సహాయం‌తో  ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనిల్ మెహతా ( లగాన్, కల్ హొ నా హో, ఫేమ్ సినిమాటోగ్రాఫర్) అన్ని తానై వ్యాక్యానం చేస్తూ నడిపించారు.


      ఈ సదస్సుకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్  రాజీవ్ మీనన్ ( ముంబాయి, గురు లకు సినిమాటోగ్రఫీ. మెరుపుకలలు ( మిన్సార కణువు  తమిళం), ప్రియురాలు పిలిచింది ( కండుకొండెన్..కండుకొండెన్ చిత్రాల దర్శకుడు)).. ఈయన చాలా కమర్షియల్ యాడ్స్ చేసారు. మళయాళ సినిమాటోగ్రాఫర్ "సన్నీ జోసఫ్ ". తమిళ, హింది సినిమాటోగ్రాఫర్స్ హాజరయ్యారు. నిజంగా  అంతమంది ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ ని ఒకే చోట కలవడం వారితో మాట్లాడడం మాటల్లో చెప్పలేని అనుభూతి.

                                                                                                                                                                                                                                                                                                                 













About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs