
పన్నెండ్రుమంది ఆయగాండ్లతోను, ఇరువై ఆరుమంది గురికాండ్రతోను, వెయ్యిమంది గడెకాండ్లతోను, వెయ్యిమంది వడ్లవాండ్లతోను కర్ణాటక దేశమునుండి బయలుదేరి బళ్ళారి, గుత్తి, తాడిపత్రుల మీదుగా ఈ గండి ప్రాంతానికి చేరుకున్నాడు. అది జనవరి నెల కావడంతో విపరీతమైన చలిఉన్నది, ఆ అడవిప్రాంతాన్ని చూసి కాసేపు వేటాడదామని సంకల్పించి, ప్రస్తుతం గండికోట ఉన్న ప్రాంతంలో సంచరిస్తుంటే హఠాత్తుగా ఒక తెల్లని వరాహం (పంది) కనపడినది, వరాహం తెల్లగా ఉండడమేమిటి అని ఆశ్చర్యభరితుడైన కాకరాజు బాణాన్ని ఎక్కుపెట్టి వదిలాడు కాని అలా బాణాన్ని వదలగానే ఆ వరాహం అదృశ్యమయ్యేది..! మల్లి కొద్ది క్షణాలకు కనపడేది..మల్లి బాణాన్ని సంధించడం వరాహం మల్లి మాయం అవ్వడం జరుగుతూ ఉండడంతో కాకరాజు ఒక విషయం స్పరించి చుట్టు చూసాడు, అక్కడ ప్రకృతి సహజంగా ఏర్పడిన పెన్నానది కందకం కనిపించింది, ఇది శత్రుదుర్భేద్యమైన కోట నిర్మించుటకు అనువైన ప్రదేశం అని గుర్తించి క్రీ.శ. 1123 వ సంవత్సరంలో దాదాపుగా చుట్టూ 8 కిలోమీటర్ల పొడవున మట్టితో గండికోటను నిర్మించాడు. వీరి పాలన కింద కడప, కమలాపురం, యర్రగుంట్ల, ముద్దనూరు, వేముల, వేంపల్లి, వీరపునాయునిపల్లి, తొండూరు, సింహాద్రిపురం, పులివేందుల, జమ్మలమడుగు మొదలగు మండలాలు ఉండేవి. ఈ గండీకోట పరిసరప్రాంతాలలోని జానపదులు గండికోట వైభవాన్ని తమ జానపదాలలో ఇలా పాడుకునేవారట..!
తూర్పున వయ్యారి నేర్పుతో గావించి
దక్షిణాదికోట యెక్కరాదు
ఉత్తరాన పెన్న ఊహించి
పారంగ శంకించి ఒక్కడైన చేరరాదు
నాగఝురి బోగఝురి
నడిబావిలోపల రామతీర్థంబులు
రమ్యమగుతు నాల్గు దిడ్డీలు ఎనిమిది
వాకిండ్లు పదహారు స్వర్ణగనులు
ముప్పైమూడు మునగతోటలు

డెబ్బైఏడు దేవస్థలములు
కమలజనకుడు కట్టించిన గండికోట..
కట్టించింది కమలజనకుడు కాదు, కాకరాజు నిర్మించాడు, మరెందుకో కమలజనకుడు అని పాడేవారు.
ఆ తర్వాత క్రీ.శ. 1239 నుండి 1304 వరకు కాయస్థ వంశీయులు దాదాపుగా 65 సంవత్సరాలు గండికోట ప్రాంతాన్ని కాకతీయులు కాలంలో వీరి సామంతులుగా ఐదుగురు రాజులు పాలించారు, ఈ వంశస్థులలో అంబదేవుడు గండికోట ప్రాంత అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చాడు, సామంతునిగా వల్లూరు, గండికోటలను ప్రధాన పట్టణాలుగా చేసి దాదాపు 30 సంవత్సరాలు పాలించాడు. ఆ తర్వాత అంబదేవుని కుమారుడు రెండవ త్రిపురారి దేవుడు కొన్ని సంవత్సరాలు తదనంతరం ప్రతాపరుద్రునికి సామంతుడుగా జుట్టయ లెంక గొంకారెడ్డి గండికోటను రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు.
క్రీ.శ. 1323 లో మహమ్మదీయుల దండయాత్రలతో కాకతీయ సామ్రాజ్యం పతనమగుటచే గండికోట ప్రాంతం మహమ్మద్ బీన్ తుగ్లక్ పాలన కిందకు వచ్చింది, దాదాపు 20 సంవత్సరాల మహమ్మదీయుల పరిపాలనలో గండికోట ఎటువంటి అభివృద్దికి నోచుకోలేదు.
ఆ తర్వాత ఈ కోట క్రీ.శ. 1343 లో విజయనగర సామ్రాజ్యం క్రిందకు వచ్చింది, కాకరాజు కాలంలో ములికినాడుసీమగా పిలవబడిన గండికోట ప్రాంతం, విజయనగర సామ్రాజ్యకాలానికి గండికోట సీమగా మారింది, ప్రౌడదేవరాయులు,హరిహర బుక్క రాయులు, శ్రీకృష్ణదేవరాయులు, సదాశివరాయులు, ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ సామంతులను నియమించి పరిపాలన సాగించారు, అయితే యుద్దవిధ్యలలో ఎవరైతే తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో, రాజుల అభిమానాన్ని పొందుతారో వారికి గండికోట గాని లేక గుత్తికోట గాని బహుమానంగా ఇచ్చి సామంతులుగా నియమించేవారు, అలా అప్పట్లో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రౌఢదేవరాయులకు కలుబరైజ యుద్దంలో అహ్మద్ షా పై విజయానికి సహకరించిన పెమ్మసాని తిమ్మనాయుడికి గుత్తి, గండికోటలను నాయకరంగా క్రీ.శ. 1422 సం!! లో ఇచ్చారు.
పెమ్మసాని నాయక్ లు యుద్దవీరుల వంశానికి చెందినవారు, వీరు మొదట కాకతీయ సామ్రాజ్యంలో సైన్యాధిపతులుగా పనిచేసేవారు. కాకతీయ రాజుల పతనానంతరం వారు క్రీ.శ. 1370 లో విజయనగర సామ్రాజ్యానికి వెలసవెళ్ళారు, ప్రౌఢదేవరాయుల మెప్పుపొందిన పెమ్మనసాని వంశానికి చెందిన వాడే ఈ పెమ్మసాని తిమ్మనాయుడు. ఇతనిపాలనలో గండికోట ప్రధానపట్టణంగా ఉండి, కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేల్, కమలాపురం, పులివేందుల ఏలుబడిలో ఉన్నవి, క్రీ.శ. 1422 లోగండికోట చుట్టూ ఉన్న మట్టిగోడ తొలగించి వాటిస్థానంలో రాతి కోట నిర్మించాడు, ప్రస్తుతం ఫోటోలలో కనపడుతున్న కోటగోడలన్నీ పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళతో కూడిన 101 బురుజులున్న కోట గోడలన్నింటిని శత్రురాజులు చేధించలేని విధంగా తిమ్మరాజు నాయుడు నిర్మించనవే, అప్పటివరకు " ములికినాడుసీమ " గా పిలవబడుతున్న ఈ ప్రాంతాన్ని రాతికోట నిర్మించాక " గండికోటసీమ " గా పేరు మార్చాడు, ఈయన కాలంలోనే మాధవస్వామిదేవాలయం, శివాలయంలతో పాటు మరి కొన్ని దేవాలయాలు, నీటి కొలనులను నిర్మించాడు, విష్ణుదేవాలయాలలో వేదమంత్రాలు మధ్య నిత్యార్చనలు వైభవంగా జరుగుతూఉండేవి, ఇతని కాలంలోనే గండికోట అత్యంత వైభవంగాను విరసిల్లి , ప్రజాదరణకు నోచుకుంది, దక్షిణ భారతావనిలో గండికోట పేరు మారుమ్రోగింది.
తిమ్మనాయుని తరువాత రామలింగ నాయుడు పరిపాలించాడు, ఇతను శ్రీకృష్ణదేవరాయుల కాలంలో గండికోటను 1509 వ సం !! నుండి 1530 సం!! రాల వరకు పాలించాడు, ఇతను కృష్ణదేవరాయులకు కుడిభుజంగా మెలిగాడని, ఇతని వద్ద దాదాపు 80 వేల మంది సైనికులు ఉండేవారు, ఇక్కడ నిరంతరం యుద్ద విధ్యలు, పోరాటాలు, యుద్దతంత్రాలకు శిక్షన ఇచ్చేవారు, దక్షిణాన ఏ యుద్దం జరిగినా ఈయన ప్రముఖపాత్ర వహించి రాజులకు విజయాన్ని చేకూర్చి పెట్టేవాడని.. శ్రీకృష్ణదేవరాయులు తన జైత్రయాత్రలలో భాగంగా చేసిన రాయుచూర్, గుల్భర్గా యుద్దాలలో వేల సంఖ్యల్లో గండికోట దళం పాల్గొంది, దీనితో గండికోట రాజుల పేరు విన్నా..గండీకోట దళం పేరు విన్నా శత్రురాజులు హడలెత్తిపోయేవారు.
![]() |
మాధవస్వామి గర్భగుడి, చుట్టూ మండపము |

తనమీద దాడికి సిద్దపడుతున్నారన్న విషయాన్ని వేగుల ద్వార గ్రహించిన చిన్న తిరుమలరాజు గండికోట దగ్గరకు వచ్చి వారిద్దరిని తనకు అప్పగించాలని అడుగుతాడు, అందుకు గండికోటను పాలిస్తున్న బంగారు తిమ్మనాయుడు అంగీకరించకపోవడంతో యుద్దం అనివార్యమైంది. యుద్దం చేయడానికి తన సకల సైన్యంతో సకలం చిన్న తిరుమల రాజు గండికోట వద్దకు చేరుకున్నాడు, కాని గండికోట యెక్క నైసర్గిక స్వరూపం ఏవిధంగా ఉన్నదంటే..! కోటకు ఒక కిలోమీటర్ దగ్గరకు వస్తేకాని కోటయెక్క స్వరూపం కనపడదు, అంత దగ్గరగా వెల్తే గండికోట సైన్యం వద్ద ఉన్న పిరంగులతో దాడి చేస్తారు..పిరంగుల గుళ్ళకు ఎదురొడ్డడం తేలికైన పని కాదు. పోనీ కాస్త దూరంగా వెల్లి ఫైరింగ్ చేద్దామనుకుంటే కోట కనపడదు తూర్పు వైపున పరిస్థితి ఇది, ఉత్తరాన పెన్నానది దాని కందకం ఉన్నది, చివరకు తాడిపత్రికి 6 కిలోమీటర్ల దూరం వద్దనున్న కోమనూతలపాడు ఊరు సమీపాన ఒక అడవి వద్దకు ఇరువర్గాల సైన్యాలు చేరుకొని అక్కడే యుద్దం ప్రారంభించారు, భీకరయుద్దం జరిగింది, చివరకు బంగారు తిమ్మనాయుడు చేతిలో బహుమనీసుల్తానుల సైన్యం ఘోరపరాజయం పొంది, చావు దెబ్బలు తినలేక పారిపోయారు, పారిపోతున్న సకలం చిన్న తిరుమలరాజుని వదలకుండా బంగారు తిమ్మనాయుడు మరియు రామరాయులు ఇరువురు వేటాడి వెంబడించి ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో ఉన్న ఆదోని వద్ద సకలం చిన్న తిరుమలరాజుని పట్టుకున్నారు, బహుమనీ సుల్తానులతో చేయికలిపి, విజయనగర ప్రజల ధన, మాన ప్రాణాలను సైతం హరించే సాహసానికీ సిద్దపడినందుకు, భవిష్యత్త్ లో మరే రాజు ఇలా హిందూ మత సంస్కృతి నాశనం చేయడానికి సాహసించకుండా ఉండాలన్న తలంపుతో చిన్నతిరుమల రాజు తల నరికి విజయనగర సామ్రాజ్య ప్రజలకు కానుకగా పంపించారు. హంపిలో ఉన్న ప్రజలు ఈ అపూర్వ విజయం సాదించి పెట్టిన గండికోట దళం అదిపతి బంగారు తిమ్మనాయుడికి జేజేలు పలికారట, వీరి శౌర్యానికి ప్రశంషల వర్షం కురిపించారట. తరువాత బంగారు తిమ్మనాయుడు సమక్షంలో సదాశివరాయులు విజయనగర సామ్రాజ్యానికి రాజయ్యాడు. ఇదే కాలానికి చెందిన ప్రముఖ ప్రజాకవి, ఙ్ఞానకవి యోగివేమన బంగారు తిమ్మరాజు శౌర్యం పై పాడినవిగా చెప్పబడే పద్యాలు ఇలా ఉన్నాయి.
గండికోటలోన గస్తూరి మృగముండు
రాజుగాఁడు గొప్ప రౌతగాడు
నెంతవారినైన నెత్తి పడుఁగొట్టు
విశ్వదాభిరామ వినురవేమ
గండికోటలోన కత్తిఁబట్టినయంత
రాజుగాడు దొడ్డ రౌతుగాఁడు
నెంతవారినైన నెత్తి పడఁగొట్టు
విశ్వదాభిరామ వినురవేమ.
తదనంతరం క్రీ.శ.1652 వ సంవత్సరంలో తిమ్మనాయుని సంతితికి చెందిన చిన్న తిమ్మనాయుడు పరిపాలనలో గండీకోట ఉండేది, ఇతని ఆస్థానంలో చిత్రకవి, అనంతకవి అని ఇద్దరు కవులను ఆదరించాడు వీరు విష్ణుచిత్తీయం, హరిశ్చంద్రనోపాఖ్యానములకు వ్యాఖ్యానములు వ్రాశారు, చిన్న తిమ్మనాయుడు గండికోటను పరిపాలించిన చివరి హిందూ రాజుగా నిలిచిపోయాడు. విజయనగర సామ్రాజ్యం బహుమనీ సుల్తానుల హస్తగమైంది. ఆ తరువాత ఇతను గండికోట ను స్వతంత్రుడుగా పాలించడం ఆరంభించాడు, ఆ సమయంలోనే గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్ షా కి మేనల్లుడు మరియు సైన్య, ఆర్థిక వ్యవహారాలను చూస్తున్న మీర్ జుమ్లా కర్నాటకలోని ప్రాంతాలలోని కోటలను వరుసగా జయించుకుంటూ వస్తూ గుత్తిని కూడ జయించి గండికోటకు చేరాడు.

గండికోట దళం చేతిలో ఓటమి తధ్యం అని భావించిన మీర్ జామ్లా మాయోపాయం చేసైనా సరే గండికోటను గెలిచితీరాలని భావించి, గండికోట బలం అంతా తెలివైన మంత్రి అయిన పొదలి లింగన్న చేతిలో వుందని, అతని బలాలు, బలహీనతలు కూడ గూఢాచారుల ద్వార తెలుసుకొ్న్నాడు, ఏ మగవాడికైనా ఉండే బలహీనతలు మందు, మగువ. అవే మంత్రి పొదలి లింగన్నకు ఉన్నాయని తెలుసుకొని..తనవద్ద యుద్దం సమయాలలో అలసిన సైనికల ఆటవిడుపుగా వారిని ఆలరించడానికి తెచ్చుకున్న నర్తకీమణులను వేశ్యలగా మార్చి మంత్రి మీద ప్రయోగించాడు, మందు, మగువకు లొంగిపోయిన మంత్రి లింగన్నకు తనకు సహాయం చేస్తే దానికి ప్రతిఫలంగా గుత్తికోటకు రాజుని చేస్తానని ఆశ చూపి లోబరుచుకున్నాడు. అదును చూసి గండికోట ప్రభువు అయిన చిన్న తిమ్మనాయుని మీద విషప్రయోగం చేసి హతమార్చాడు పొదలి లింగన్న. మంత్రి అసలు రూపం తెలుసుకున్న రాజుకుటంబం, చిన్న తిమ్మనాయుని కుమారుడైన 5 సంవత్సరాల వయసున్న బాలుడిని గండికోటకు పశ్చిమంగా ఉన్న రహస్యమార్గం గుండా తరలించి మైసూర్ ప్రాంతములోని వారి బందువుల దగ్గరికి పంపారు. శత్రుశేషము ఉండకూడదన్న ఉద్దేశంతో ఆ రాజుకుటుంబాన్ని గండికోట జైలులో బందించి యువరాజు ఎక్కడ దాచారో ఆచూకి చెప్పమని చిత్రహింసలకు గురిచేసారు, ఎంతకు చెప్పకపోవడంతో వారికి మరణశిక్షవిదించి చంపాడు మీర్ జుమ్లా.

మూడునెలలపాటు యుద్దం చేయడం వలన తమ వద్ద నున్న ఫిరంగులు పగిలిపోయి సరిగ్గ పనిచేయకపోవడంతో, పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకున్న గండికోటను బయటకు వెల్లిన రాజకుటుంబాలవారు తిరిగి తన మీద దండెత్తి వస్తే తనపరిస్థితి ఏమిటి..? సైనిక బలం ఉన్నా కోటలో ఆయుధసామాగ్రి, ఫిరంగులు లేకపోతే కష్టమని భావించి, తనతో ఉన్న ఫ్రెంచి ఆయుధ నిపుణినితో కోటలోనే ఆయుధాలు తయారు చేయమని కోరాడు,గండికోట అంతటా గాలించిన ఆయుధాల తయారికి కావలిసిన ఇనుప ఖనిజం దొరకకపోవడంతో కోటలో ఉన్న రఘునాధదేవాలయం మరియు మాధవస్వామిదేవాలయం మిగతా చిన్న చిన్నా దేవాలయంలో ఉన్న విగ్రహాలు మీర్ జుమ్లా దృష్టికి రావడం, వెంటనే సైనికలను పిలిపించి కోటలోని అన్ని దేవాలయాలలోని విగ్రహాలను పెకలించి తెమ్మని ఆఙ్ఞాపించాడు, దీనికి ఫ్రెంచ్ ఆయుధనిపుణుడు మెయిలే " హిందు దేవతామూర్తల మీద, విగ్రహాలమీద ఇలాంటి ప్రయోగాలు చేయడం మంచిది కాదు, అది రాజ్యానికి అరిష్టం మీకు ప్రాణనష్టం " అని వారించాడు, అయినా మీర్ జుమ్లా వినలేదు.తన సొంత ముస్లిం సైనికులు, హిందు సైనికులు కూడ " దేవుడు అందరికి సమానమే " అని చెప్పినా వినలేదు,
చివరకు బహుకొద్దిమంది సైనికులతో దేవాలయాలలోని లోహవిగ్రహాలను తెప్పించి ఒక చోట కుప్ప గా వేసి కరిగించడం మొదలెడితే..అందులోని మాధవస్వామి విగ్రహం కరగలేదట, అయినా కూడ తానే స్వయంగా తన కాళ్ళతో మాధవస్వామి విగ్రహాన్ని తొక్కి పెట్టి కరిగేలా చేసాడు, మెయిలే అయిష్టంగానే అన్ని విగ్రహాలను కరిగించి తయారు చేసిన ఫిరంగులను తర్వాత ప్రయోగిస్తే అవి అన్ని చీలిపోయి పనికిరాకుండా పోయాయి, అప్పట్లో ఈ సంఘటనను స్వయంగా చూసిన జీన్ భాప్టిస్టి. టావెర్నియర్ అను ఫ్రెంచు వజ్రాల వ్యాపారి తాను రాసిన ట్రావెల్స్ ఇన్ ఇండియా అను పుస్తకంలో పేర్కున్నాడు.
మీర్ జుమ్లా తను చేసిన దుర్మార్గపు పనికి పశ్చాత్తాపం పొంది కోట అభివృద్దికి కావాలసిన చర్యలు చేపట్టాడు,, జామ్మా మసీదు మరియు ధాన్యాగారాన్ని నిర్మించాడు, ఇంతలో గోల్కొండను షాజాహాన్ కైవసం చేసుకోవడంతో ఆయనకు సామంతునిగా ఉండిపోయాడు. కాని కళావిహీనమైన దేవాలయాలను చూస్తున్నప్పుడల్లా తను చేసిన పని గుర్తుకొచ్చి మనసులో బాదపడే వాడు, నిత్యం వేద మంత్రాలతో కళకళలాడే దేవాలయాల విగ్రహాలు లేకపోవడం, విభిన్న మతాల ప్రజలతో విరసిల్లిన గండికోట తను చేసిన పనికి నిర్మానుష్యం కావడం మీర్ జుమ్లాని బాదపెట్టేది, పోనీ విగ్రహాలని తిరిగి చేయించి ప్రతిష్టించుదామనుకుంటే ఓరంగజేబు అనుమతిలేక, దేవాలయాలను పూర్తిగా ధ్వంసము చేయడానికి మనసు రాక, మతి చెడి ఉత్తర భారతానికి వెల్లిపోయాడు
![]() |
మాధవస్వామి ఆలయ లోపలి ప్రాంగణము |
తర్వాత కడపను పాలించిన మయనా వంశస్తుడైన కడప నవాబు అబ్దుల్ సబాఖాన్ గండికోటను పాలించాడు, వీరి తర్వాత ఆంగ్లేయులు స్వాదీనము చేసుకున్నారు. ఇప్పటికి గండికోటలో ఒక చిన్న గ్రామం ఉన్నది, మూడు వందల ప్రజలు నివాసము ఉంటున్నారు.
ఇక్కడ చూడదగ్గ శిల్పకళాసంపద చాలానే ఉన్నది, మాధవస్వామి దేవాలయం ఎత్తైన గోపురముతో నలువైపులా ధ్వారాలతో తూర్పుముఖమై ఉంటుంది, లోపల నైఋతిమూల ఎత్తైన శిలాస్తంభములతో మధ్య ఉన్నతమైన వేదికతో నున్న కళ్యాణమండపము, ఆగ్నేయ మూల పాకశాల, అలంకారశాల, ఉత్తరమున ఆళ్వారుల ఆలయము, దాని ప్రక్కన మరొక కళ్యాణమండపము ప్రాకారము వెంబడే లోపలవైపుగా 55 స్తంభముల వసారా కలదు ఆలయము గర్భగృహము, మూసిన అర్థమండపము, నాట్యమండపము ఉన్నాయి. ఈ మండపాలలో శిల్పకళ కళ్ళు చెదిరేలా ఉంటుంది, అందుకే ఆ ఫ్రెంచ్ ట్రావెలర్ ఈ గండికోటను రెండవ హంపిగా కొనియాడారు. మాధవస్వామి ఆలయగోపురము నాలుగు అంతస్తుల కలిగి ఉన్నది. ఈ ఆలయాన్ని హరిహర బుక్కరాయులు నిర్మించారు.
రఘునాధా అలయము ధ్యాన్యాగారమునకు ఉత్తరమునున్న ఎత్తైన గుట్టపై ఉన్నది ఈ ఆలయప్రాకారము లోపల కళ్యాణమండపము ఉన్నది ఈ మండపానికి నాలుగు వైపుల నున్న స్తంభాలమీద రతి భంగిమల శిల్పాలు చెక్కి ఉన్నారు, ఇక గర్భగుడి చుట్టూ ఉన్న మండపంలో చూడదగ్గ ఎంతో శిల్పకళాసౌంధర్యమున్నది.
గండికోట లోపల వెలుపల మొత్తం 12 దేవాలయాలు ఉన్నాయి, ఇక కోటలోపల " రాయల చెరువు " ఉన్నది ఇక్కడ నుండే కోటలోపల వ్యవసాయ భూమలకు నీరు, అలాగే ప్రజలందరికీ త్రాగునీరు అందించేవారు. ఇవి కాక పెన్నానది చేసిన గండికోత 5 కిలోమీటర్ల పొడవునా లోతుగా ప్రవాహముంటుంది నిజంగా అది అందరు చూడవలసిన ప్రకృతి తయారు చేసిన సహజ కందకం, దాదాపుగా 1000 అడుగుల వెడల్పుతో 500 అడుగుల లోతుతో ఏర్పడిన ప్రవాహమది. సంక్షిప్తంగా ఇది గండికోట చరిత్ర..
మరి కొన్ని ఫోటోలు క్రింద స్లైడ్ షోలో చూడవచ్చు....!
![]() |
పెన్నానది కోతకోసిన గండికోట చుట్టూ ఉన్న సహజ కందకం |