“పుష్పగిరి “ ఈ పేరు నేను నా చిన్నప్పటి నుండి వింటున్నా ఈ పీఠం యెక్క విశిష్టత మాత్రం నాకు ఓ పదేళ్ళ క్రితం మాత్రమే ఒక సాహితీ మిత్రుడు అయిన ఉమా మహేశ్వర శాస్త్రి ద్వార తెలిసింది. అప్పటి నుండి అనుకుంటూనే ఉన్న కాని వెల్లలేక పోయాను, మొన్నీమధ్యన వెల్లి చూసాక గాని నేను ఇన్నేళ్ళు ఎటువంటి అద్భుత కుడ్యశిలాఖండాలు “ మిస్ “ అయ్యానో అన్నది అర్థమయ్యింది, నిజంగా మన ఊరి పక్కనే ఉన్న విశిష్టత కలిగిన ప్రాంతాలను సందర్శించము, అది చాలా మందికి లాగే ఉన్న ఒక జాడ్యం నాకూ ఉన్నదనిపిస్తుంది. పుష్పగిరి ఒక అద్వైతపీఠము, పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం కడప కర్నూల్ రహదారిలో కడపకు 16 కిలోమీటర్ల వద్ద ఎడమవైపు తిరిగి ఒక 6 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఇది దక్షిణ భారతదేశం లోని మొట్టమొదటి “ శ్రీ ఆదిశంకరాచార్యుల వారి” పీఠం , ప్రస్తుతం వైభవం కోల్పోయింది గాని ఈ ప్రాంతానికి “ పుష్పగిరి” అన్న పేరుకి గల కొన్ని పురాణ గాథలు ఇక్కడ ప్రచారం లో ఉన్నాయి.
తల్లి దాస్య విమోచనకోసం నాగులకోరిక మేరకు స్వర్గలోకం నుండి అమృతం తెస్తున్న గరత్మంతుడిని ఇంద్రుడు ఆ ప్రాంతం లో అడ్డగించాడని, వారిద్దరు పెనుగులాటలో అమృతభాండం తొణికి అందులోని కొన్ని బిందువులు చింది ఇచట గల కొలనులో పడినట్లు, నాటి నుండి ఈ కొలనులో స్నానం చేసిన మానవులు అమరత్వం పొందుతున్నట్లు, ముసలి వారు యవ్వనవంతులుగాను, అనారోగ్యముతో బాదపడుతున్నవారు ఈ కొలనులొ స్నానం ఆచరించాక ఆరోగ్యవంతులుగాను అవుతుండడం తో మనుషుల భారాన్ని మోయలేక భూమాత త్రిమూర్తులతో మొరబెట్టుకోవడం తో ఆ త్రిమూర్తులు వాయుదేవుని ద్వార ఒక పెద్ద కొండను తెప్పించి కొలను కప్పించారని, ఆ కొలనుపై కొండ తేలియాడగా విష్ణువు ఒక పాదం తోనూ, మహేశ్వరుడు మరొక పాదం తోను తొక్కిపట్టారని, కొండ సరస్సుపై పుష్పము వలే తేలియాడినందున ఆ కొండకు పుష్పగిరి పేరు వచ్చినదని స్థానికుల కథనం.
పుష్పగిరి సమీపం లో పెన్న, పాపాఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవీయ నదులు కలుసుకొనుట చేత ఈ ప్రాంతం పంచనది క్షేత్రమని ప్రసిద్దికెక్కింది, క్రీ.శ. 1501 నాటి శాసనం లో అఘోరశివాచార్యులు శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ శిఖరాన్ని నిర్మించట్లు ఉన్నది, రాష్ట్ర కూట రాజు కృష్ణ వల్లభుడు ఇక్కడి వైద్యనాధేశ్వర స్వామికి పూజల నిమిత్తం కొంత భూమి దానమిచ్చినట్లు, పల్లవ చిద్దణ దేవరాజు, వైదంబి సోమదేవ, కేశ మహారాజు యాదవ సింగవ, కాకతీయ సామంతుడు కాయస్థ గంగయ సాహిణి, విజయనగర ప్రభువులు, వారి సామంతులు అనేకులు ఈ క్షేత్రాన్ని సందర్శించి, అనేక దానములు ఇచ్చినట్లు ఇక్కడి శాసనములు తెలుపుచున్నవి. ఇక్కడి వైద్యనాధేశ్వర అలయాన్ని కరికాచోళుడు కట్టించాడని చరిత్ర కారులు చెబుతున్నారు, కాకతీయ ప్రభువు గణపతిదేవులు పుష్పగిరి పీఠాధిపతులైన శ్రీశివయోగింధ్రుల శిష్యులుగా ఉన్నట్లు ఆంధ్రుల చరిత్ర చాటుతున్నది.


పెన్నా నది ( పినాకిని) పుష్పగిరి గ్రామాన్ని చుట్టి తూర్పుకు ఉత్తరముకు ప్రవహిస్తున్నది, సందర్శకులు పుష్పగిరి గ్రామం నుండి పెన్నానదిని దాటి పుష్పగిరి కొండ చేరుకోవాలి, ఇక్కడ ఒక విశిష్టత ఉన్నది, నాకు తెలిసి శివకేశువులు ఒకే ప్రాంగణము ఉన్న ఆలయం లో ఉండడం అన్నది ఈ దేశం చాలా అరదు, ఇక్కడి విశిష్టత అదే…! ఒకే ఆలయ ప్రాంగణం లో శివకేశవులున్నారు పూజలందుకున్నారు కూడ, శైవులు, వైష్ణవులు చే పూజించపడ్డారు, మరో విశేషము ఎక్కడ కనపడనీ బ్రహ్మదేవుని విగ్రహం కూడ ఇక్కడ చూడవచ్చు, ఇంకా సంతాన మల్లేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మీ, సుబ్రమన్యస్వామి, గదాధరుడు, యేగాంజనేయులు దర్శనమిస్తారు. మరో విశేషము ఇక్కడి ఆలయ గర్భగుడి చుట్టూ ఉన్న గోడల మీద ఖాలీ లేకుండా పూర్తిగా శిల్పాకళాకారులు మొలిచిన , కుడ్య శిల్పాలచిత్రాలు ఉన్నాయి, అంత్యంత మనోహరంగా ఉన్నాయి, రామాయణ, మహాభారత , భాగవత ఇతిహాసాల లోని ముఖ్య ఘట్టాలన్ని ఈ గర్భగుడి గోడల చుట్టు చూడచ్చు, అద్భుతం.!.
ఆస్తికుడివా..? లేక నాస్తికుడివా అన్న బావనతో సంబందం లేకుండ ప్రతి ఒక్కరు ఈ కళారూపాలను చూస్తూ..ఆశ్వాదించొచ్చు, శిల్పకళల పట్ల మక్కువ, ఆసక్తి ఉన్న వారికి ఇక్కడికొస్తే పండగే, మనకున్న చారిత్రిక సంపద,ఈ అపురూప కళారూపాలను చూస్తూ మైమరుస్తాము. ఆంధ్ర శిల్పుల నేర్పరితనం అణువణువున కనిపిస్తుంది. శివకేశవాలయముల చుట్టూ ఉన్న కుడ్య శిల్పకళాఖండాలు, అందులో నటరాజనృత్యము,కిరుతార్జనీయగాధ, ఏనుగుల వరుసలు, అశ్వరోహాకులు, వీరుల విన్యాసాలు చూపురలను రంజింపచేస్తాయి.
ఆలయ విమానం నాగర పద్దతి శిఖరము కలిగి ఉన్నది. విమానమునకు నాలుగు దిక్కులు నంది విగ్రహములున్నవి. గజాసుర సంహారమూర్తి, కార్తికేయ, వినాయక, భిక్షాటన మూర్తులు గోడలపై చిత్రములైఉన్నవి. శ్రీచెన్నకేశవస్వామి ఆలయానికి నైరుతి దశలో రుద్రుని పాదము, దానికి రెండుకిలోమీటర్ల దూరములో విష్ణు పాదము కనిపిస్తాయి, శివకేశవు లిరువురు ఇచట పాదము మోపినారనటకు అవి దృష్టాంతారములు. పౌరాణిక సంబంధమైన సర్వదేవత ఆలయములు ఇచట కనిపిస్తాయి, మరో విశేషము.. రతీమన్మధుల రతీ భంగిమల శిల్పాలు నిశితంగా పరశీలిస్తే ఈ గోపరం మీద కనపడతాయి.
ఈ క్షేత్ర చరిత్ర చాలా ప్రాచీన మైనది, శ్రీశైలఖండమందును, స్కంధ పురాణమందును,సత్యనాధుని రసరత్నాకరమందును, పుష్పగిరి క్షేత్రమును గూర్చి విశేషములు ఎన్నో ఉన్నవి, ఇక్ష్వాకులు నాటి శాసనములలో శ్రీశైలమునకు దక్షిణా ద్వారముగా ఈ క్షేత్రము పేర్కనబడింది.
ఎందుకనోగాని మన తెలుగు వారికి ఈ చారిత్రిక కట్టడం మీద కాస్త చిన్న చూపే ఉన్నది. ఇక్కడ సంధర్శకులు చాలా చాలా తక్కువ, బహుశ మొక్కులు, కోర్కెలు తీర్చే దేవుళ్ళకున్నంత ఆదరణ ఈ పురాతన దేవులకు లేదు..బహుశ ఈ దేవుళ్ళు పాతపడడం వలనేమో ..?
కాని శిల్పకళా సంపదను చూడాలనుకున్న వారు మాత్రం తప్పక సందర్శించవలసిన ప్రాంతం ఇది. అనర్వచనీయమైన ఆనందం పొందవచ్చు
మరి కొన్ని ఫోటోస్ కింద స్లైడ్ షో లో చూడవచ్చు.