.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

    బాంబుల గంప రామంతపూర్ ఆఫీస్ రూంలోకి సురక్షితంగా చేరింది.
 పళ్లు తోమి, కడుపునిండా టిఫిన్ మెక్కి చాపల మీద పడుకొని గాఢంగా నిద్రకు ఉపక్రమించారు బాలుడు బృందం.
  పెళ్లి మంటపంలో చెన్నారెడ్డి మీద దాడి జేసేందుకు స్కెచ్ గీస్తున్నాడు జయసింహ.  ఆపరేషన్‌లో పాల్గొనేందుకు ఖచ్చితంగా తొమ్మిది మందిని ఎంపిక చేశాడు.  నిన్నటి దినం రెండు సార్లు వెళ్లి కళ్యాణ మంటపాన్ని క్షుణ్నంగా పరిశీలించి వచ్చాడు.
 రాముల వారి గుడి ఆవరణలో కట్టించిన కళ్యాణ మంటపం అది, కేవలం పిల్లర్స్ మీద లేపి వుంది. వెనక మాత్రమే గోడ కట్టబడి మూడు వైపులా ఓపెన్‌గా వుంది. మంటపం ముందు షామియానాలు కట్టి వున్నారు. వాటినిండా కుర్చీలు.
  బైటకు వచ్చేందుకు రెండు గేట్లు వున్నాయి. ఒకటి దేవాలయానికి ఎదురుగా తూర్పు వైపున, మరొకటి ఉత్తరం దిశన.
  రెండు గేట్ల వద్ద ముగ్గురు ముగ్గురు వంతున మొహరించి వుంటే, లోపల మంటపంలో ఇద్దరు కాపుకాయాలి. అందర్నీ సంధానిస్తూ ఓ మనిషి దేవాలయం బైట ఉత్తరపు గేటుకు ఎదురుగా మూడు ఆటోల్ని సిద్దంగా వుంచుకొని వుండాలి.
  మంటపంలో మోహరించేందుకు నేనంటూ నేనని పోటీ పడసాగారు అందరూ. ఎందుకంటే - వాళ్లకు మాత్రమే చెన్నారెడ్డిని చంపే చాన్సు అధికంగా వుంటుంది కాబట్టి.  తమ చేతులారా అతన్ని చంపి తమ వాళ్ల ఆత్మలకు సంతృప్తి కలిగించాలి. రాక్షసుని లాంటి చెన్నారెడ్డిని చంపి చరిత్రలో మిగిలి పోవాలి.
  అందరి ప్రతిపాదనల్ని నిర్ధ్వంద్వంగా ఖండించాడు జయసింహ. బాలున్ని, మజ్జిగ గోపాల్‌ను అందుకు వినియోగించాడు.
  వాళ్ల ప్రయత్నాలన్నీ రాఘవకు తేలిగ్గానే  కన్పిస్తున్నాయి. తన రాత బావుండక రాత్రి ప్రియురాలు వద్దకు రాలేదు చెన్నారెడ్డి. వచ్చుంటే యీ పాటికి తను హీరో అయ్యుండేవాడు.
  తెల్లార్లూ మేలుకొని కళ్లు చింత నిప్పుల్లా వున్నాయి అతనికి. ఎప్పటికయినా చెన్నారెడ్డిని తను చంపాల్సిందేనని వీళ్లతో ఏమీ కాదనే ధీమాతో వున్నాడు. తనకు తూర్పు వైపు గేటు వద్ద డ్యూటీ యిచ్చినా నోరెత్తకుండా సమ్మతించాడు.
  ఏ గేటు వద్ద ఎవ్వరు వుండాల్సింది నిర్ణయించుకొన్నారు.
 అందర్నీ సంధానించి పనులు అందించే భాద్యత జయసింహ తీసికొన్నాడు.
  ఖచ్చితంగా వికెట్ పడగొట్టి తీరతామనే భావిస్తున్నారు వాళ్లు. ఎందుకంటే తన తాలూకాకూ, తన ప్రత్యర్థులకూ దూరంగా ఉంటున్నాననే భావన అతనిలో సరైన జాగ్రత్తలు తీసికోనివ్వదనీ, నగర వాతావరణంలో పక్కవానికి ఏం జరుగుతోన్నా ఎవరూ పట్టించుకోరనీ, తాము ఖచ్చితమైన ధ్యేయంతో పని చేస్తున్నారు కాబట్టి, తాము విజయం సాధిస్తామనే ధీమా వుంది.
  ఒక్క గంటకూడా నిద్రబోయి వుండదు బాలుడు బృందం.
 జయసింహ లేవగొట్టాడు.
  మొహం మీద నీళ్లు చల్లుకొని వచ్చి కూచున్న తర్వాత తాము రూపొందించిన ప్లాన్ గురించి విశదీకరించాడు.
 ప్లానయితే పకడ్బందీగా వుంది.
 అయినా ఒక లోపం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కన్పిస్తూ వుంది.
" అతని వెంట గన్‌మెన్‌లు వస్తారు. వాళ్లను గురించి ప్లాన్‌లొ ఎక్కడా చర్చించినట్టులేదు "  చెప్పాడు.
 నాలుక కొరుక్కున్నాడు జయసింహ.
 నిజమే.. తను పొరబడ్డాడు.
 అందరూ తూర్పు గేటు గుండా లోపలికెళ్తారు.
 గన్‌మెన్‌లు గేటు వద్ద నించి లోపల మంటపం దాకా వున్న ఆవరణను కవర్ జేస్తూంటారు.
  యాక్షన్ ప్లాన్ కొంత మార్చాల్సి వచ్చింది.
 తూర్పు గేటు వద్ద మనుషులు  గేటుకు కొంత ఎడంగా వీధిలో నిల్చోవాలి. గన్‌మెన్‌ల గుండా ప్రమాదముందనుకొంటే వాళ్లు సిద్దమయ్యేలోపలే వాళ్ల మీద బాంబింగ్ జరపాలి.
 దానికోసం మరో ముగ్గర్ని వాళ్లకు తోడు జేశాడు.
ప్లాన్ అమలు పరిచేందుకు మొత్తం పండ్రెండు మంది అవుతున్నారు.
 బాలున్ని పెళ్లి మంటపం వద్దకు తీసికెళ్లాడు జయసింహ.
 అంతటా పరిశీలించి చూసి సంతృప్తి వ్యక్తపరిచాడు అతను.
 మరో రెండు గంటల్లో పెళ్లి జరగబోతోన్నా కూడా కళ్యాణ మంటపంలో సడీ సందడి లేదు. నగరాల్లో పెళ్లి ఇట్లా వుంటుంది కాబోలు.  మహుర్తానికి అర్థగంట ముందొచ్చినా, అర్థగంట తర్వాతొచ్చినా మంటపంలో పెళ్లికి సంబంధించిన ఆనవాళ్లు ఏవీ కన్పించవుట.
  అదే పల్లెల్లో అయితే-
 వారం ముందునించే పెళ్లి సందడి మొదలవుతుంది.
  చలువ పందిళ్లు, పచ్చతోరణాలు, పెరేని కుండలు, చుట్టాల సందళ్లు....... ఒకటేమిటి.. పెళ్లయిపోయి నెలలు గడిచినా ఆయింట్లో పెళ్లి జరిగిందని చెప్పేందుకు ఎన్నో ఆనవాళ్లు మిగిలి వుంటాయి.
  ఇక్కడ మిగుల్చుకోవటానికి ఏమీ వుండదు - వధూవరులు పరస్పరం ఆలూ మొగుళ్లుగా మిగిలిపోవటం తప్ప.
 ’ఈరోజు ఆలూరి దంపతులు మాత్రం తమ జీవితాంతం వెంటాడే ఒక చేదు స్మృతిని మిగుల్చకొంటారు ’ అనుకొన్నాడు బాలుడు.

                                                  ***********

     పెళ్లికి ఇంకా చాలా సమయముంది.
 సెక్రటేరియట్‌ దాకా వెళ్లొద్దామనుకొన్నాడు చెన్నారెడ్డి.
 సెక్రటేరియట్‌లో అడుగుపెట్టగానే హోమంత్రి ఎదురైతే తలపక్కకు తిప్పుకొని వెళ్లాడు.
  అతని బలంతోనే గదా శివపురి వాళ్లు విర్రవీగేది.
  తనకు జరగకూడనిది ఏదైనా జరిగితే - ఏదైనా ఏమిటి ? శివపురి వాళ్ల చేతుల్లో చస్తే...  దానికి ప్రధాన కారణం అతనే. అతని వల్లనే వాళ్లు ఇంతలావు మొగోల్లయింది.
  తన వాళ్ల పనికోసం సంబంధిత సెక్షనలో చాలా సేపు గడిపాడు. వాచీ చూసుకొనే సరికి పెళ్లి సమయం ఇంకొంత దూరంగానే ఉన్నట్లనిపించింది.
 పెళ్లి చూసుకొని వెంటనే బద్వేలు వెళ్లటమా ?  ఇక్కడే వుండి ఉదయం వెళ్లటమా ?
 ఇక్కడ వుండేందుకే  మనసు మొగ్గు చూపింది.
 బద్వేలు మనసులో మెదిలేసరికి అక్కడి ఆపరేషన్ గుర్తొచ్చింది.
 రమణారెడ్డి ఇంట్లోంచి కదలి టౌనుకు వచ్చాడో లేదో !  వస్తే మాత్రం తను శుభవార్త వింటాడు.
 అక్కడి విషయాలు తెలిసికోవాలనే కుతూహలం కలిగింది.
 నేరుగా తన క్వార్టర్‌కు వెళ్లాడు.
 బద్వేలు ఆఫీసు‌కు ఫోన్ పెట్టాడు.
 కొండన్న ఎత్తాడు.
 శివపురి రమణారెడ్డి ఇంటి వద్దే వున్నాడుట. టౌనుకొచ్చేందుకు ప్రయాణమవుతున్నాడుట. తమ వాళ్లంతా సిద్దమై వున్నారుట.
  ఏదో హుషారు శరీరంలో ప్రవేశించినట్లయింది అతనికి.
 పెళ్లి చూసికొని అట్నించి అటే ప్రేయసి వద్దకు వెళ్లాలనిపించింది. రాత్రంతా డిసప్పాయింట్ అయ్యుంటుంది గదా ! ఆమెకు క్షమాపణలు చెప్పాలి. ఆమె వద్దనించే బద్వేలు సమాచారాలు తెలిసికోవచ్చు.
  గన్‌మెన్‌లు వెంట వస్తే ఆమె వద్దకెళ్లేందుకు ఆటంకం.
 వాళ్లను మరో తమ పార్టీ ఎమ్మెల్లే క్వార్టర్ వద్ద వదిలాడు.
 ఈ రోజు వీళ్లు మారిపోయి రేపు మరో ఆంగరక్షకుల బ్యాచ్ వస్తుంది. ఆ లిస్టుతో సిద్దంగా వుండమని వాళ్లకు చెప్పి తనొక్కడే కారులో బైల్దేరాడు.
  నేరుగా పెళ్లి జరిగే గుడి వద్దకు వెళ్లి ఆగింది కారు.
 వాచ్ చూసికొంటే ఇంకో పదినిమిషాల టైమున్నట్లుంది. మాంగళ్యధారణకు.
 ఇంటికి ఫోన్ చేయాలనిపించింది.
 కారు ముందుక్కదిలింది కొంత దూరం లోని యస్.టి.డి బూత్ వద్ద ఆగింది.
 కారు దిగి బూత్‌లోకి వెళ్లాడు.
 నంబర్ డయల్ చేశాడు.
 భార్య ఫోనెత్తింది.
 తన గొంతు గుర్తబట్టగానే  " ఏమయ్య ! ఇప్పటికి గుర్తొచ్చిందా యిల్లు ? "  అంది.
 " సెక్రటేరియట్‌లో పనులుండాయి లేవే ! "  చెప్పాడు.
 " నీ పనులు నాకు దెల్సుగాని బెరీనా ఇంటికి రాసామీ !  రేత్రినించి హర్ష నిద్దర్లేకుండా వూరకే తిరుగతా వుండాడు. నాకేదో భయంగా వుంది.. ఇప్పుడే బసెక్కిరా.. నువ్వాడ.. మేమీడ.. ఎందుకయ్య యీ అగసాట్లన్నీ ?  రా.. ఎట్టయితే అట్టయితాది.. బయపడి ఎన్రోజులు బతకాల ? సస్తే అందరమూ కలిసే సచ్చిపోదాం రా !... "  ఆమె గొంతు బొంగురుబోయింది.
 హృదయం జలదరించినట్లయింది చెన్నారెడ్డికి.
 చావుకు భయపడే తనిక్కడ దూరదూరంగా తిరుగుతున్నానని పసిగట్టింది ఆమె. కలిసే చద్దామంటూ తనకు ధైర్యం చెబుతోంది.
 " ఎందుకట్లా మాటాడ్తావూ ?  నాకేం కాదులేయే పిచ్చిదానా ! నన్నెవురూ చంపేది ? "  అప్పటికే గొంతు జీరవోయింది అతనికి.
 అతనిలోని మార్పును ఆమె గ్రహించినట్లుంది  " ఇన్నేండ్లు సంసారం జేసినాం. నువ్వేందో నాకు తెల్దా ? నీ కతేందో నాకు ఎరుకలేదా ? - నువ్వే నన్నర్థం చేసుకోలేదుగాని... ఏమయ్యా ! - నీ భయం నాకు సెప్పదానికేమి ?  నేను వినకూడదా ?  నేను భయపడకూడదా ?  పెండ్లానికి తెలుస్తే నామోషా ? ఎన్ని రోజుల్నించి దాచుకొని దాచుకొని కుమిలి పోతాండవయ్యా ! నువ్వింటికిరా సోమీ ! మా కండ్ల ముందుండు... చంపేవాళ్లు అక్కడికి మాత్రం రారా ? ... చావో బతుకో మా కండ్లముందే జరగనీ.."  ఏడుపు తన్నుకురాగా ఆమె గొంతు పూడిపోయింది.
 ఎప్పుడూ ఏడ్చి ఎరుగని ఆడమనిషి.
 ఇప్పుడు తన్ను గురించి ఏడుస్తోంది.
 తను దూరమవుతానేమోనని ఏడుస్తోంది.
 అతనికి కూడా గుండెలు కరిగాయి.
 మాట తడబడింది.
 " పెండ్లి జూసుకొని బైల్దేరుతా... "  పొడిగా చెప్పి ఫోను పెట్టేశాడు.
  భారమైన హృదయంతో కారెక్కాడు.
 దేవాలయం గేటు వద్ద ఆగింది అది.
 కారు దిగి నేరుగా పెండ్లి మంటపం వద్దకు నడిచాడు.
 గన్‌మెన్‌లు లేకుండా అతనొక్కడే దిగిపోవటం రాఘవ వగైరాలకు ఆశ్చర్యం కలిగించింది.
 వెనక వస్తున్నారేమో !
బైటి మనుషుల ద్వారా అప్పటికే ఆయన ఆగమన వార్త లోపలి జనాలకు తెలిసింది.
 బాలుడు, మజ్జిగ గోపాల్‌ మంటపంలోని పెళ్లి జనంతో కలిసి పోయి వున్నారు. ప్యాంటు జేబుల్లోకి చేతులు దూర్చి బాంబులపైన అరచేయి వుండేలా జాగ్రత్త పడుతూ చెన్నారెడ్డి కోసం నిరీక్షిస్తున్నారు. అటు ఇటు చిన్నగా పచార్లు చేస్తున్నారు.
 ఇద్దరూ ఓ మోస్తరు తాగి వున్నారు. వాళ్లే కాదు ఆపరేషన్‌లో పాల్గొన్నవారంతా కొంత నిషామీదనే వున్నారు.
 చెన్నారెడ్డి మంటపంలోకి వచ్చాడనే వార్త ఇద్దరి చెవులకు వచ్చి చేరింది.
 బాలుడు, మజ్జిగ ఒకరి మొగాలొకరు చూసికొన్నారు.
 చెన్నారెడ్డి వచ్చాడుట.  ఏడీ ?  ఎక్కడ ?
 జనమంతా నిలబడి మాట్లాడుకొంటున్నారు.
 మంటపంలో వేసిన కుర్చీల నిండా ఎక్కువ సంఖ్యలో ఆడవాళ్లు కూచుని వున్నారు.
  వాళ్ల వెనగ్గా నిల్చుని వున్న మగ గుంపులో వెదకసాగారు.
 ఆ పని కొంత క్లిష్ట తరంగానే వుంది.
 తాము వెదకుతున్నట్లు ఎవరికీ అనుమానం రాకూడదు.
 చెన్నారెడ్డి మనుషులకు తమ మొహాలు కన్పించుకూడదు.
 తలకెక్కిన నిషాను జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాలి.
 తల నిటారుగా పైకెత్తేదానికి కూడా లేదు.
 ఒక ఇబ్బంది గాదు... సవాలక్ష..
  అతనొచ్చాడని  పక్కా సమాచారం.
 అంత లావు మనిషి ఎక్కడ దాక్కున్నట్లు ?
  మజ్జిగ గోపాల్ కయితే దిక్కుతోచటం లేదు. ’ఇక్కడే వున్నాడంటున్నారు. తాము పసిగట్టలేకపోవటమేమిటి.. ? ’
  తమ వాళ్లేమయినా తప్పుడు సమాచారం అందించారా ?
  ఇలాంటి సమయంలో అలాంటి పొరబాట్లు దొర్లవు.
 " రేయి  మజ్జిగా.. మజ్జిగా .."  లో గొంతుకతో బాలుని పిలుపు.
 తలెత్తి చూశాడు.
 నలుగురు వ్యక్తులు అవతల్నించి బాలుడు.
 తన చూపులు అతన్ని సోకగానే చేతుల్తో సైగ చేశాడు ’తన వెనక చూడ ’మన్నట్టుగా.
 వెనక్కి తిరిగి చూసేసరికి....

                                                                                                       .... సశేషం

0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs