.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

    ఒకనాటి ఉదయం తమ్ముళ్ళతో కలిసి గనివద్దకు వెళుతోంటే కీచుమంటూ వాళ్ళపక్కగా వచ్చి ఆగింది ఓ జీపు.
 ఉలికిపాటునించి తేరుకోబోయేలోపలే జీపులోంచి మనిషి శరీరం ఒకటి వుండలా రోడ్డుమీద దొర్లింది.
అది బతికిందో, ప్రాణం పోయిందో గమనించే లోపలే జీపు స్పీడందుకొంది.  బాలుడు దాన్ని అందుకోవాలని ప్రయత్నించాడు గాని సాధ్యం కాలేదు.
 జీపు నెంబర్ గుర్తుపెట్టుకొని పెన్నుతో అరచేతి మీద రాసుకొన్నాడు రమణారెడ్డి
 నేలమీదున్న శరీరాన్ని పరిశీలించి చూశారు.
  ఊపిరాడుతూ వుంది.
  రేగిన వెంట్రుకలు, పెరిగిన గడ్డం, మాసిన బట్టలతో ఎవరో పాతికేళ్ళ యువకుడు, అతని వొళ్ళంతా కుడుములు కుడుములుగా వాచివుంది. వీపంతా ఎర్రగా వాతలు తేలివున్నాయి. స్పృహ తప్పి పడిపోయేంతగా కొట్టి పడేసి పోయారు.
 అటుగా వెల్తోన్న ఆటోను ఆపి పోరుమామిళ్ళకు తీసుకెళ్ళి హాస్పెటల్‌లో జాయిన్ చేశారు.
 గంటకల్లా స్పృహలోకొచ్చాడు ఆ యువకుడు.
 లేచికూచోని వాళ్ళకేసి ఆశ్చర్యంగా చూశాడు.
 "  ఎట్లా వుంది ఒంట్లో ?  బావుందా ? "  రమణారెడ్డి అడిగాడు.
 సమాధానమివ్వకుండా అతను బెడ్ మీంచి దిగబోతుండగా  " వొద్దొద్దు కూచో "  చేయిపట్టుకొని ఆపబోతే అతను నవ్వాడు.  " నాకేం కాదులే అన్నా ! ఏమయితాదేం యీ దెబ్బల్తో........?  నాకిది మామూలేలే "  అంటూ మంచం దిగాడు.
 " తినడానికేమన్నా వుందేన్నా ? "   అడిగాడు.   " ఆనాకొడుకులు నిన్నట్నుంచి వొల్లంతా దెబ్బల్దినిపిస్తా వుండారేగాని కడుపుకింత తిండి తినిపిస్తామని అనుకోరే..!  "
 ఒక్క నిమిషంలో బైటకు పరుగెత్తాడు జయసింహ.
 ఆపిల్ పళ్ళతో తిరిగొచ్చాడు.
 వాటిని కోయబోతుంటే చొరవగా లాక్కొని నోట కొరికి తినసాగాడు.
 అంతలో డాక్టర్ వచ్చాడు.
  బెడ్ మీద పేషంట్ లేకపోయేసరికి ఉలికిపాటుగా చూశాడు.
 అతని ఆదుర్దా గమనించి వేలెత్తి చూపాడు బాలుడు.
 పేషెంట్ కేసి ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్.
 " ఏంటిది ? ఏంటి... ఏమయ్యా ! పేషంట్ కంటే బుద్ది లేదు. మీకేమయ్య ? ఏ కండీషన్లో అతన్నిక్కడకు తెచ్చారో గర్తు లేదా..?  పడుకోబెట్టండి.... రెండ్రోజుల పాటు బెడ్‌రెస్ట్ ఇస్తేగాని కోలుకోలేడు... ఇప్పుడు అర్జంటుగా సెలైన్ ఎక్కించాలి... "  మొహం చిట్లించి చూస్తూ అన్నాడు.
 డాక్టర్ కేసి అదోలా చూశాడు ఆ యువకుడు  " సార్ ! ఒక్కమాట..."  అన్నాడు. డాక్టర్ అతనికేసి చూడగానే  " వీల్లెవురో నాకు తెల్దు సార్ ! నేనెవురో వాల్లకూ తెల్దు. దెబ్బలుతిని పడుంటే ఎత్తకొచ్చినారు. సెలైన్‌లు ఎక్కిస్తూ రెండ్రోజులు బెడ్ రెస్ట్ యిచ్చినావంటే  నీఫీజ్ ఎట్లా రాబట్టుకొంటావో ఆలోచించుకో. ముందుగా - ఇప్పటికైనా ఫీజు సంగతి చూసుకో "  అన్నాడు.
 మరేమి మాట్లాడలేదు డాక్టర్.
ఐదు నిమిషాల్లో బిల్‌తో సహా వచ్చింది నర్స్.
 "  నాకాడ అర్థరూపాయి కూడా లేదన్నా !  ఆ నాకొడుకులు జోబుల్లో ఏమి లేకుండా సేసినారు "  చెప్పాడు.
రమణారెడ్డి బిల్ చెల్లించాడు.
 హాస్పెటల్ నుండి బయటపడ్డారు అందరూ.
 "  నొప్పులు లేవా ? "  బాలుడు అడిగాడు.
 " నేనేం  దేవున్నా బ్రదరూ.. నొప్పుల్లేకుండేందుకు ? "  నవ్వాడు.
" ఇంతకు నువ్వెవరు తమ్ముడూ ..? "  అడిగాడు రమణారెడ్డి.
 చిన్నాగా నవ్వాడు ఆ యువకుడు.
 "  నాపేరు గోపాల్‌రెడ్డి, ఇంటి పేరు మజ్జిగ.  మాపూర్వీకులెవరికో దండిగా పాడివున్నెట్లుంది. బానలు బానలు ( పెద్ద పెద్ద కడవలు) మజ్జిగ చిలికి పోసే వాళ్ళేమో ! ఇంటి పేరు అదే ఖాయమైంది. "
 అన్ని దెబ్బలు తినికూడా నవ్వగలుగుతున్నందుకు అతనికేసి మెచ్చుకోలుగా చూశాడు రమణారెడ్డి.
 "  నేనీ కథ చెబితే కొందరు వొప్పుకోరు బ్రదరూ !  మాకే మజ్జిగ లేక సెరవ ( పెద్ద సిల్వర్ గిన్నె)  తీసుకొని ఇండ్లిండ్లా అడుక్కొనేదాన్నే మాకీ పేరొచ్చిందంటారు...  ఏమైతేనేం... కమ్మని పేరుగదా !  "
 అతని మాటతీరుకు నవ్వొచ్చింది వాళ్ళకు.
 తనది బద్వేలు మండలమట. వూరిపేరు కూడా చెప్పాడు
 " మీదేవూరో తెలుసుకోవచ్చునా అన్నలూ ? "  అడిగాడు.
 వాళ్ళ చిరునామా తెలీగానే అతని కళ్ళ నిండా ఆశ్చర్యం తొణకిసలాడింది.
 " కాఫీ తాగాలన్నా ! పెదాలు పీకుతండాయి "  చెప్పాడు.
 దగ్గర్లోని హోటల్‌కు వెళ్ళారు అందరూ. ఓ మూలగా వున్న టేబుల్‌ను ఆక్రమించి కాఫీ ఆర్డరిచ్చారు.
 "  మీనాయన గురించే విన్నేనన్నా ! పాలెగాడన్నా  ఆయప్ప....!  మీలాంటివాల్ల కోసమే నేను తిరుగుతాండ ....  తంతే అప్పచ్చుల గంపలో పన్నెట్టు మీకాడనే వొచ్చి పడినా..., మీనాయనట్లా మా నాయనా పాలెగాడు కాదుగాని.. జాతీయపార్టీ అభిమాని.  చెన్నారెడ్డికి ఆపోజిట్‌గా పట్టుదలగా ఎలక్షన్ జరిపించినందుకు మామీద కసిబట్టి మామీద దాడి జేసినాడు, కడాకు ( చివరికి) మా నాయన్ను నట్ట నడిరోడ్డు మీద పడేసి నరికినారన్నా ! "  అతని గొంతు పూడుకుపోయింది.
 "  అప్పట్నించి చెన్నారెడ్డిని సంపాలని తిరుగుతా వుండా.. నాకాడ పౌర్సముంది (పౌరుషము) గాని ఏ బలమూ లేదు. దొరికిన కాడంతా యిదో యిట్లా వొల్లు వాయిగొట్టించుకొంటావుండా... "
  తన అవస్థలన్నీ చెప్పుకు పోతూనే వున్నాడతను
 తను రెండు సార్లు దాడి చేసేసరికి జాగ్రత్త పడ్డాడట చెన్నారెడ్డి.  ప్రైవేటు మనుషుల్ని ఎక్కువ సంఖ్యలో తన చుట్టూ కాపలా పెట్టుకొన్నాడట. అతని రక్షణ వలయాన్ని ఛేదించుకొని పోవటం మాట దేవుడెరుగు - తనుకనిపిస్తే  చాలు వెంటపడి పట్టుకొని చితకబాది విసరేసి పోతున్నారట.
 తనలాగ తండ్రుల్ని, అన్నలను, ఆత్మీయుల్ని, బంధువుల్ని, భర్తల్ని, కొడుకుల్ని పోగొట్టుకొన్న ఎందరో ఎదురు చూస్తున్నారట కసిదీర్చుకొనే అవకాశం కోసం.
 మజ్జిగ గోపాల్‌రెడ్డిని నేరుగా శివపురికి తీసుకెళ్ళారు.
 వారం రోజుల విశ్రాంతి తర్వాత బాగా కోలుకొన్నాడు అతను. ఈలోపు రమణారెడ్డి తలలో ఓ వ్యూహం రూపు దిద్దికోసాగింది.
 మళ్ళీరోజే ఓ జీపును బాడుగకు మాట్లాడుకొన్నారు.
 మజ్జిగ గోపాల్‌ను వెంటేసుకొని ఏడుమంది అన్నదమ్ములు తాలుకా నలుమూలలా తిరిగారు.
 చెన్నారెడ్డి వల్ల పూడ్చుకోలేని గాయాల పాలైన కుటుంబాల్ని కలిశారు. తమను పరిచయం చేసుకొన్నారు.
  అందరి గాయమూ ఒకటే..
  అందరి బాధా ఒకటే...
  అందరి శత్రువు ఒకడే..
 తమ ప్రాణం పోయినా సరే శత్రువును చంపాలనే అంకిత భావం కలిగిన యువకుల్ని గుర్తించారు.
 మజ్జిగ గోపాల్ వాళ్ళ వెంటే శివపురికి వచ్చాడు.
 మానవ శక్తి దండిగా వుంది.
 ఇక ఆర్థిక శక్తి కావాలి.
 బంధువులందర్నీ మరోసారి కలిసారు.
 తాము ఎమ్మెల్లే చెన్నారెడ్డితో  ’పార్టి ’ చేయాలనుకొంటున్నట్లు చెప్పారు. తమ ధ్యేయాన్ని, దాన్ని సాధించాలనే అంకిత భావాన్నీ, చెన్నారెడ్డి చావే జీవితాశయంగా పెట్టుకొని తాలుకా అంతటా తిరిగి సేకరించిన యువశక్తినీ వివరించేసరికి వాళ్ళమీద బంధువుల్లో కొంత నమ్మకం కలిగింది.
 అప్పటిదాకా పార్టీ చేయొద్దనీ, పార్టీలకు దూరంగా వుండమని చెప్పిన వాళ్ళంతా ఇప్పుడు పార్టీ చెయ్యమని ప్రోత్సహించారు. యువకుల హుషారు చూసి మితవాదులనుకొన్న వాళ్ళు కూడా ఎగదోశారు.
   తాము ఏడుమందిమి పోయినా పర్లేదు - చెన్నారెడ్డిని చంపి తీరాలనే కమిట్‌మెంట్‌కు వచ్చారు శివపురి సోదరులు.
 చెన్నారెడ్డితో  పార్టీ జేయాలంటే కేవలం గుండెబలం మాత్రమే సరిపోదు, ఆయుధాలు కావాలీ, వాహనాలు కావాలి. అడుగడునా డబ్బే ప్రధానంగా వుండాలి.
  తమకు గుండెలయితే వున్నాయి డబ్బు ఎక్కణ్నించి తేగలరు..?
 బంధువుల వద్ద తమ ప్రధాన సమస్య గురించి చెప్పారు.
 వాళ్ళంతా సానుకూలంగా స్పందించారు.
  ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భారీగానే చందాలిచ్చారు.
  దాదాపు పండ్రెండు లక్షల దాక జమకూడింది డబ్బు.
 వెంటనే రెండు జీపుల్ని కొన్నారు.
 విషయమంతా జాతీయపార్టి అధిస్టానానికి తెలిసింది.
 తమ ఆశీసుల్ని ’ బలంగా ’ అందజేశారు.
 తర్వాతి కార్యక్రమం తుపాకి లైసెన్స్‌లకు అప్లై చేయటం
 ఏడుమంది అన్నదమ్ములు ధరఖాస్తు చేసుకొన్నారు.
  వాళ్ళ నాన్నగారు ఇద్దరూ మర్డర్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళ ప్రాణాలకు కూడ హాని వుంటుందనే కారణంగా జిల్లా నాయుకులు ఎస్పీకి చెప్పి మనిషికి రెండింటి వంతున ఏడుమందికి పదునాలుగు తుపాకులు మంజూరు చేయించారు. జిల్లా వ్యక్తి హోంమంత్రిగా వుండటం వలన వాళ్ళకాపని సులభమైంది.
 చెన్నారెడ్డి వల్ల జీవితాలు నాశనమైన వాళ్ళు, అతన్ని చంపాలనే పట్టుదల వున్నవాళ్ళను పిలిపించుకొన్నాడు రమణారెడ్డి.
 శివపురి సోదరులు ఏడుమంది తమతో మరో ముప్పైమంది యువకుల్ని వెంటేసుకొని రెండు జీపుల్నిండా వేలాడుతూ ప్రతిరోజూ బద్వేలు, పోరుమామిళ్ళకు తిరగటం మొదలు పెట్టారు.
  తుపాకులు బైటకు కన్పించేలా పట్టుకొని రెండుజీపులూ వేగంగా వెళ్ళి సెంటర్లో ఆగితే జనమంతా బెదిరిపోయి వాళ్ళకేసి చూడవలసిన పరిస్థితి వస్తోంది.
 తామెవరో అందరికీ అర్థమైన తర్వాత చెన్నారెడ్డి ఆధిపత్యాన్ని సవాల్ చేయటం ప్రారంభించారు.
  వాళ్ళందరీ ధ్యేయం ఒక్కటే - చెన్నారెడ్డిని చంపటం.
 ముందుగా అతన్ని మానసికంగా దెబ్బతీయాలి.
 అతనికి భయం పుట్టించాలి.
  వాళ్ళకు మరో పనిలేదు - చావంటే భయం లేదు.
మొదట చెన్నారెడ్డి మనుషులు తిరిగే సెంటర్లమీద దృష్టి కేంద్రీకరించారు. అకస్మాత్‌గా రెండు జీపులూ ఆ సెంటర్లకు పోవటం, కన్పించిన చెన్నారెడ్డి మనుషుల్ని చితకబాదటం, వచ్చినంత వేగంగానే జీపులెక్కి వుడాయించటం.
  ఆఫీసుల మీద కూడా దాడి జేస్తున్నారు.
  తమవాళ్ళకు  పనుల్జేయని ఆఫీసర్లకు వార్నింగ్‌లిస్తున్నారు.
 తమవర్గం వాల్లను ఇబ్బంది పెడుతోన్న పల్లె నాయుకుల్ని టౌన్‌లో దొరకపుచ్చుకొని బెదిరిస్తున్నారు.
 టౌన్‌లోనే నివాసముంటోన్న మాజీ ఎమ్మెల్లే సోమనాధరెడ్డి, పారిశ్రామికవేత్త రామసుబ్బారెడ్డి, సూపర్‌క్లాస్ కాంట్రాక్టర్ జి.పి.ఆర్ వర్గాల ఇళ్ళకు తరుచు వెళ్ళి ధైర్యాన్ని కలిగిస్తున్నారు. చెన్నారెడ్డి దెబ్బకు బెదిరి చాలా యేళ్ళుగా ఇంటికే పరిమితమిన ఆ ప్రముఖులకు ఆత్మస్థైర్యాన్ని కలిగించారు.
  తమకు చెన్నారెడ్డిని ఎదుర్కొనే దమ్ములున్నాయని వాళ్ళకు నమ్మకం కలిగించారు.
  శివపురి సోదరుల చర్యలన్నింటినీ ఒక కంట గమనిస్తూనే వున్నాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
 చాచి కొడితే గిరగిరా తిరిగి పడిపోయేలా లేదు వ్యవహారం.. ఎదురు తిరిగేట్టున్నారు.
 తనవాళ్ళమీద దాడి చేయటం కాదు - వీలైతే తనమీదనే దాడి చేసేందుకు ప్రయత్నించే అవకాశాలున్నాయని కూడా రహస్య సమాచారం.
  చాలా దూకుడుగా వ్యహరిస్తున్నారు శివపురివాళ్ళు.
 తమ వ్యతిరేకులంతా వాళ్ళ వెనక గట్టిగా నిలబడినట్లుంది, వాళ్ళ దూకుడుకు మొదట్లోనే అడ్డుకట్ట వేయకుంటే పరిస్థితి చేయదాటి పోవచ్చు.
  పోలీసుల్ని సంప్రదించాడు.
 డిస్పీ స్థాయి అధికారులతో చర్చించాడు.
  పిల్లనాయాల్లకు తుపాకులిచ్చి అందర్నీ భయప్రాంతుల్ని చేయటం మంచిది కాదనీ, ముందా గన్స్ లైసెన్స్ వెనక్కి లాక్కొమని వొత్తిడి చేసాడు.
 పోలీసులు తమ ఆశక్తతను వ్యక్తపరిచారు.
 తమ తండ్రుల్ని ప్రత్యుర్థులు ధారుణంగా చంపారనీ, తమకు కూడా వాళ్ళచేతిలో ప్రాణహాని  ప్రమాదం వుంది కాబట్టి ఆత్మరక్షణార్థం తుపాకుల లైసెన్స్‌లకు ధరఖాస్తు చేసుకొన్నారట. అట్లాంటి పరిస్థితుల్లో తుపాకులు లైసెన్స్ మంజూరు  చేయటం ప్రభుత్వ పాలసీ కాబట్టి తమ చేతిలో ఏమిలేదని పోలీసులు చెప్పారు.
 శివపురివాళ్ళకు హోంమినిస్టర్ వద్ద ప్రత్యేకమైన గుర్తింపు వుంది కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా తామేమీ చేయలేమనీ, అలాగే స్థానిక ఎమ్మెల్లేగా చెన్నారెడ్డికి కూడా నష్టం కలిగించబోమనీ హామీ యిచ్చారు.
 పోలీసుకులు కూడా తనకు ముఖం చాటేస్తోన్న విషయం చెన్నారెడ్డికి అర్థమవుతోంది. వాళ్ళను తను ఎంతగా డబ్బుతో కొన్నా తనకు హానీ చెయ్యకపోవచ్చుగానీ మేలు మాత్రం చేయరు. తమ పక్క తాలుకా ఎమ్మెల్లే హోంమంత్రిగా వున్నందువల్ల పోలీసులు వాళ్ళకు వత్తాసు పలుకుతున్నారు.
 తను ఏదొకటి చేయాలి
 తన చేయి వంగిపోకుండా చూసుకోవాలి.
 అవసరమైతే మరిన్ని ప్రాణాలు తీసయినా టెర్రర్ సృష్టించాలి.
 వాళ్ళు ప్రాణాలకు తెగించినట్టుంది.
 తనమీద కసిదీర్చుకోవటానికే ప్రయత్నిస్తున్నారు. సందేహంలేదు. తలకు తల అన్నరీతిలో ఆలోచిస్తున్నారు.
 తమ ప్రాణాలకు భయపడుతూ పార్టీ జేసేవాళ్ళు కొన్ని పరిమితులకు లోబడి వుంటారు. అవతల వాళ్ళను చంపాలి తప్ప తాము పొరబాటున కూడా చావకూడదనుకొంటారు. కనీసం గాయపడటం కూడా జరగొద్దని భావిస్తారు. అలాంటి వాళ్ళతో పార్టీ ( ఫ్యాక్షన్) జేయటం నడపటం సులభం.
 తాము చచ్చినా పర్లేదు. అవతలి వాళ్ళను చంపాలనే ధ్యేయంతో పన్జేస్తే... వాళ్ళతో పార్టీజేయటం కష్ట సాధ్యమైన విషయం.
 ముందుగా శివపురి పిల్లకాయలను భయపెట్టాలి.
 వాళ్ళు చేసేది కుప్పిగంతులేనని వాళ్ళకే తెలిసేట్లు చేయాలి.
 వెంటనే ఎనిమిది కమాండర్ జీపులు కొన్నాడు - చెన్నారెడ్డి. వాటినిండా వందమందికి పైగా జనాన్నేసుకొని తిరగటం ప్రారంభించాడు.
 తను గట్టిగా కన్ను దెరిస్తే అవతలి వాళ్ళు మాడిమసై పోరా..! అనే ధీమా వుంది చెన్నారెడ్డికి.
 జనాలకు కూడా అతనిమీద ఆ నమ్మకం వుంది.
 ఎప్పుడేం జరుగుతుందోనని ఉత్కంఠంగా చూస్తున్నారు. శివపురి పిల్లనాయాల్లకు మూడిందనే అనుకొంటున్నారు.
 తమ హంగామాకే అవతలి వాళ్ళు జడిసిపోతారనే భావనలో వున్నాడు చెన్నారెడ్డి. ఇప్పుడు కాకున్నా ఇంకొద్ది రోజులకైనా వాళ్ళు తోక ముడవక తప్పదు. పైసా ఆదాయం లేకుండా అంతమంది జనాల్ని మేపుకొంటూ ఎంతో కాలం తిరగటం సాధ్యమయ్యే విషయం కాదు. తనకు తెలిసి పెద్దగా ఆదాయమొచ్చే వనరులు కూడా వాళ్ళకు లేవు. ముగ్గుపిండి గనితో ప్రస్తుతం పార్టీలు నడిపేంత పరిస్థితి లేదు.
  మారెట్లా రెండు జీపుల్ని పద్నాలుగు తుపాకుల్ని కొని యుద్దానికి సన్నద్దమయ్యారు...?
 బహుశా తన ప్రత్యుర్థులు చందాలిచ్చి వుండొచ్చు...!
  ముఖ్యంగా  జీ.పియ్యార్, సోమనాధరెడ్డి, రామసుబ్బారెడ్డిలాంటి వాళ్ళే సహాయం చేసి వుండొచ్చు.
 ’ అబ్బిళ్ళు కొరుకుతూ మెల్లిగా తలపంకించాడు చెన్నారెడ్డి ’
 శివపురి వాళ్ళను బెదరగొట్టాలి.
 వాళ్ళకు వత్తాసిచ్చే మనుషులకు వాళ్ళెట్లా రక్షణ కల్పించగలరో పరీక్షించాలి. చెన్నారెడ్డితో పెట్టుకొంటే కాపాడేవాడు ఎవడూ లేడనే విషయం మరోసారి జనాలకు తెలిసిరావాలి.
 ఆ దిశగా పావుల్ని కదపటానికి సిద్దమయ్యాడు చెన్నారెడ్డి.
  పార్టీల స్వరూప స్వభావాల్ని పూర్తిగా తెలిసికోకుండానే అందులోకి అడుగుబెట్టిన శివపురి కుంకలు తగిన మూల్యం చెల్లించుకొనేలా చేయాలి.
 తన ముఖ్య అనుచరుల్ని పిల్చి వాళ్ళతో మాట్లాడాడు......

                                                                                    ......................  సశేషం

0 comments:

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs