.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

       ’లా ’ పూర్తిచేసి అప్పటికే ఇంటికి వచ్చివున్నాడు రమణారెడ్డి.
   జయసింహారెడ్డి ఎమ్మెస్సీ పూర్తిజేశాడు
  రామసుబ్బారెడ్డి, నర్శిరెడ్డిలు డిగ్రీలతోనే సరిపెట్టుకొన్నారు.
  చెన్నకేశవరెడ్డి, చంద్రశేఖర్‌లు డిగ్రీ చివరి అంకంలో వున్నారు.
  బాలుడు జైల్లో వున్నాడు.
 తాలుకాలో జాతీయపార్టీని బతికించేందుకు నడుం బిగించిన పెద్దలకు శివపురి వాళ్ళ సంతానం మీద కన్నుబడింది.
  ప్రముఖ జాతీయపార్టి నాయకుడు మున్నెల్లి సిద్దారెడ్డి తరుపున శివపురికి పెళ్ళిపెత్తనం వెళ్ళారు. పెద్దిరెడ్డిని, ఓబుళరెడ్డిని కలిశారు. రమణారెడ్డికి పిల్లనిచ్చి సంబంధం కలుపుకోదలంచినట్లు చెప్పారు.
  తమ్ముని కొడుకును పక్కకు పిల్చాడు పెద్దిరెడ్డి
   " పిల్లను సూడాల్సిన పన్లేదు వొప్పుకొందాం "  చెప్పాడు.  " తొట్టతొలూత(మొట్ట మొదటిసారిగా) యింటిని ఎదుక్కొంటూ వొచ్చిన సంబందాన్ని వొదులుకోగూడదురా ! "  హితువు  చెప్పాడు.
  " సరే సరేలే. మనం కాదంటావుడామా యేంది ? " ఓబుళరెడ్డి చెప్పాడు. ’ తాము కూడ వచ్చి అమ్మాయిని చూసింతర్వాత నిర్ణయం తీసుకొంటామని చెప్పాడు వచ్చిన వాళ్ళకు.
  రాత్రి రమణారెడ్డిని దగ్గరకు పిల్చుకొన్నాడు పెద్దిరెడ్డి. " అబ్బీ ! పెద్దోడా !  కాల్లకాడికొచ్చిన సంబందాన్ని కాలదన్నగాకు నాయనా ! పిల్చి పిల్లనిస్తామంటున్నారు.  గురి యించుమించు సర్దుకుపో. రంభను తెచ్చుకొని దాన్ని అంటిపెట్టుకొని వుండేకన్నా బుద్దిమంతురాల్ని తెచ్చుకుంటే  బాగుబడ్దాది నాయనా ! "  అంటూ హితబోధ చేశాడు.
  పెళ్ళి సంగతులు ఎత్తుకొంటే  తన బ్రహ్మచారి తనం గుర్తుకొస్తాంది ఆయనకు.
  తను వయసులో ఉన్నప్పుడు అందరిలాగే పెళ్ళి చూపులకు వెళ్ళాడు. మొదటిచూపులోనే అమ్మాయి రూపం అతని గుండెల్లో స్థిరపడిపోయింది.  ఆమె మీద అంతులేని వలపు పెంచుకొన్నాడు. పెళ్ళి ఖాయమవుతుందనే ( కుదురుతుంది) భావించారు అందరూ.
  అంతలో ’ నీకు పిల్లనిచ్చేది లేదంటూ అమ్మాయి తండ్రి వద్దనుంచి కబురొచ్చింది. ఆమె మేనమామ అడ్డుపడ్డాడట. అతనితోనే పెళ్ళి చేశారట.
  మనస్సు విరిగిపోయింది పెద్దిరెడ్డికి.
  " చ...నాకు పెళ్ళే వొద్దు.. " అనుకొన్నాడు.
  బ్రహ్మచారిగా వుండిపోయాడు.
  తనలాగా రమణారెడ్డి స్పరద్రూపి కాదు. నల్లగా పొట్టిగా వుంటాడు.  ఆ విషయమే పెద్దిరెడ్డికి కొంత భయాన్ని కలిగిస్తూ వుంది.
  అయితే ఇక్కడ ఆయన భయానికి అర్థం లేదు..ఎందుకంటే అవి రాజకీయపు పెళ్ళి చూపులు కాబట్టి.
  రాజకీయంగా రెండు వర్గాలు ఏకం కావటానికి  నిర్వహించే పెళ్ళితతంగంలో అందానికి, ఐశ్వర్యానికి తావులేదు.  చాలినంత బలగముంటే చాలు చెరోవైపు ఆడపిల్ల, మగపిల్లాడు వుంటే చాలు.
  రమణారెడ్డి పెళ్ళి  ఖాయమైంది.
  అంతలో కలసపాడు నించి మరో జాతీయపార్టి నాయకుని సంబంధం వొకటి నర్శిరెడ్డిని వెదుక్కొంటూ వచ్చింది.
  ఇద్దరి పెళ్ళెళ్ళూ ఆడంబరంగా జరిగాయి.
  అన్ని గమనిస్తూనే వున్నాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
  ఓబుళరెడ్డి  ప్రయాణం ఎటువైపు సాగుతుందో పసిగట్టాడు
  ఆపేందుకు తనచేతిలో ఏమిలేదు - చూస్తూ వుండటం మినహా.
  అతను చూస్తోండగానే జయసింహారెడ్డికి, చెన్నకేశవరెడ్డికి కూడా పెళ్ళిళ్ళయ్యాయి. అందరికీ జాతీయ పార్టీ కుటుంబాల్నించే అమ్మాయిల్ని యిచ్చి..పని చక్కబెట్టారు.
  శివపురి వర్గం దాదాపు కాంగ్రెస్స్ పార్టీలో చేరినట్లేనని అందరి భావం
  వాళ్ల అనుమానాల్ని నిజం చేస్తూ ఓ సుభముహూర్తాన పులివెందుల జాతీయపార్టి రాష్ట్ర నాయుకుడు దేవుడు సమక్షంలో శివపురి వర్గం జాతీయ పార్టీ తీర్థం పుచ్చుకొంది.
  అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ వెలుబడింది.
  ఓబుళరెడ్డి  చేరికతో జాతీయపార్టి బలోపేతమైందని భావించారు టేకూరి గురివిరెడ్డి.  శివపురి ఓబుళరెడ్డి, బద్వేలు జి.పి.ఆర్, అట్లూరి సోమనాథరెడ్డి, బి.కోడూరు రామసుబ్బారెడ్డిల వర్గాలతో కూడుకొన్న జాతీయపార్టి యీ దఫా చెన్నారెడ్డిని వెనక్కి నెట్టుతుందని అనుకొన్నారు.
  అయితే  చెన్నారెడ్డిని ఎదుర్కొని నామినేషన్ వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
  రాష్ట్రంలో ప్రాంతీయపార్టి నాయుకుని ప్రభంజనం బలంగా వుంది.
  అయన్ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పగ్గాలు చేతికి తీసుకొన్న నాదేండ్ల భాస్కర్‌రావు ప్రభుత్వం నెలరోజులకే కుప్పకూలి పోయాక తిరిగి విశ్వనీయతకోసం వచ్చిన మధ్యంతర ఎన్నికలు ఇవి.
   జాతీయపార్టి నాయకురాలు టెర్రరిస్టుల చేతిలో మరణించి దేశమంతటా జాతీయపార్టికి సానుభూతిపవనాలు వీస్తున్నా రాష్ట్రంలో మాత్రం ఎన్టీఆర్ మీద సానుభూతి పవనాలు వీస్తున్నాయి.
  తాలుకాలో కూడా రెండు మండలాల్లో చెన్నారెడ్డికి అడ్డులేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో జాతీయపార్టి పక్షాన నామినేషన్ వేసేందుకు మనిషే దొరకలేదు.
  గత్యంతరం లేని పరిస్థితిల్లో తనకు సన్నిహితుడైన వై.వి.రావు చేత దేవుడు నామినేషన్ వేయించాడు.
  ఎన్టీఆర్ ప్రభంజనం ముందు మహామహులే మట్టిగొట్టుకుపోయారు, ఆయనకు జరిగిన అన్యాయానికి ప్రజలు తీవ్రంగా స్పందించి ప్రాంతీయపార్టీకి బ్రహ్మరథం పట్టారు.  దేశమంతా జాతీయపార్టి విజయఢంకా మోగిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మట్టికరిచింది.
  తాలుకాలో కూడా శివపురి ఏరియా తప్ప మిగిలిన మండలాలన్నీ దాదాపు ఏకపక్షమయ్యాయి.
   చెన్నారెడ్డి అత్యధిక మెజారిటీతో గెల్చాడు.
  అతని మెజార్టీ చూసి ప్రాంతీయపార్టి అధ్యక్షుడు స్వయంగా అభినందించాడు. దాంతో అతనికి గర్వం పెరిగింది.
  బద్వేలు హెడ్ క్వార్టర్‌లో కూచుని అతను చేసే వికటాట్ట హాసాలు తాలుకాలోని అన్ని ప్రాంతాల జాతీయపార్టి వారి గుండెల్లో మార్మోగసాగాయి.
   " ఓబుళరెడ్డి  పోతే నా యింటిక పోయిందా ? జి.పి.ఆర్ పోతే నా ఎంటిక రాలిందా ? టేకూరు గురివిరెడ్డి పోతేనేం ? అట్లూరి సోమనాధ్‌రెడ్డి పోతేనేం.. వీల్లంతా కలిసి నా ఎంటికేమన్న పీక్కున్నెరా ? "  అంటూ ప్రగల్భాలు పలకసాగాడు.
  అతని మాటలు చెవుల బడుతున్నాయి అందరికీ.
  కానీ - ఏమి చేయలేని పరిస్థితి.
  రావుకు తాము సక్రమంగా ఓటు  జరపలేక పోయామేమోనను అనుమానం.  తమ వరకు గట్టిగనే పోరాడారు. అతని అసమర్థతను  తాము సవరించలేము గదా !  చెన్నారెడ్డి ఎదురుగా వస్తున్నాడంటే ఆ దారిన రావటం కూడా చాలించుకుంటాడు అతను.  తన ఏరియాలోనే వూళ్ళకు వూళ్ళు ఆక్రమించుకొని రిగ్గింగ్ చేసికోంటుంటే ఆ ప్రాంతానికేసి తొంగి  కూడా చూడలేదు రావు.
  చెన్నారెడ్డి విర్రవీగాడు.
  ఎలక్షన్లలో తనకు వ్యతిరేకంగా పన్జేసిన వాళ్ళ మీద కక్షగట్టి టౌన కేంద్రంగా పల్లెజనాల మీద తన పంజా గురిపెట్టాడు.
  పెద్ద మనుషుల్ని, మర్యాదస్తుల్ని సైతం తనకు వ్యతిరేకంగా పనిచేశారనే కారణంగా టౌనుకొచ్చినపుడు పట్టి బంధించి, కొట్టి దారుణంగా అవమానించాడు. చెన్నారెడ్డి పేరు బెట్టి అతని మనుషులు కూడా అరాచకాలకు దిగారు.
  ఈ నేపధ్యంలో చెన్నారెడ్డి చిన్నకొడుకు హర్షవర్ధన్ ప్రముఖపాత్ర పోషించసాగాడు.
బాంబుల ప్రయోగాన్ని విసృతపరిచాడు చెన్నారెడ్డి.
 ఊరూరా బాంబుల్ని పుష్కలంగా నిలవుంచాడు.
  దిబ్బల్లో బాంబులే.. వాముల కింద బాంబూలే.. పాడుబావుల్లో బాంబులే.. ఎక్కడ వంగితే అక్కడ బాంబు దొరికేంత అవకాశం కల్పించాడు.
  వంతుల బావికింద నీళ్ళ తకరారు వస్తుందేమో ! -  బావి గుంతపక్కనే కంపపొదల్లో బాంబులుండాలి.
  గెట్ల తకరారు రావొచ్చేమో !  గెనిమల వద్దనే గుర్తుగా బాంబులు పూడ్చి పెట్టి వుండాలి.
  ఇళ్ళవద్ద గోడ తకరారు వస్తుందేమో !
 ఎద్దుల గాడి తకరారు ఎదురవుతుందేమో !
  ఏ వైపునించి ఏ ఆపద మూడుతుందో ? తన వాళ్ళందరికీ అన్ని తావుల్లో చేతికందేలా బాంబులు నిల్వలుంచాలి.
  ఎమ్మెల్లే ఆశీర్వాదంతో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి బాంబులు వేసి వస్తున్నారు అతని అనుయాయులు.
  రాష్ట్రంలో ఆయన పేరు బాంబులకు పర్యాయపదమైంది.  చింతకుంట చెన్నారెడ్డి అనేకన్న బాంబుల చెన్నారెడ్డి అంటేనే ఆయన అందరికీ గుర్తింపుకొస్తున్నాడు.
  ఇన్ని గొడవలు చేస్తున్నప్పటికీ అతను టేకూరు గుర్విరెడ్డి జోలికి గాని, శివపురి వర్గం జోలికి గాని వెళ్ళటం లేదు. వాళ్ళు కూడా అతన్ని సవాల్ చేయటం లేదు.
  అలాగని వాళ్ళను వదిలేశాడని కాదు.
  అన్ని వైపుల్నించి నరుక్కొంటూ వాళ్ళకేసి వస్తున్నాడు.
  ఆ విషయం వాళ్ళక్కూడా అర్థమైంది.
  టేకూరు గురివిరెడ్డి మాత్రం ఓబుళరెడ్డిలాగ తెంపుమనిషి కాదు ( తెంపు = తెగింపు ) గాని అందర్నీ ఆకట్టుకొనే మంచిమనిషి. విస్తృతమైన బంధుబలం వున్న వ్యక్తి. అతనికి దెబ్బతగిలితే ఒక మండలమంతా బాధపడేంత గొప్ప మనిషి.
  బద్వేలు టౌన్లో సంసారముంటోన్న పాత నాయకులందర్నీ సవాల్ చేశాడు చెన్నారెడ్డి.  సోమనాథ్‌రెడ్డిని లెఖ్కలేకుండా తిట్టి చిటికలు వేసి పిలుస్తూ మరీ సవాలు  విసిరాడు. భూస్వాములు, ఫ్యాక్టరీ యజమానులు, కోటీశ్వరులుగా పిలవబడుతోన్న వాళ్లంతా చెన్నారెడ్డికేసి కన్నెత్తి చూడాలన్న వణికి పోయే పరిస్థితి వచ్చింది.
  పోలీసులంతా అతని గులాములయ్యారు. అతనికి వ్యతిరేకంగా కేసులు పెట్టినా రిజిస్టర్ చేసే పరిస్థితిలో లేరు.
  మళ్ళీ ఎలక్షన్లు వచ్చేసరికి బద్వేలు, అట్లూరు, గోపవరం మండలాలు మూడూ అతని చేతికిందికి వచ్చాయి. ఆ మండలంలో జాతీయపార్టికి ఏజంట్లు కూడా కరవయ్యే పరిస్థితి వచ్చింది.
  టేకూరు వాళ్ళు, శివపురి వాళ్ళు మాత్రం తమ ఉనికి చాటుకొంటున్నారు. ఆరెండు మండలాల్లో చెన్నారెడ్డి దౌర్జన్యం యధేచ్చగా సాగటం లేదు.
   పదొమ్మిది వందలఎనబై తొమ్మిదిలో తిరిగి ఎలక్షన్లు వచ్చాయి.
  చెన్నారెడ్డి భారీ మెజారిటీతో తిరిగి గెల్చాడుగాని, రాష్ట్రమంతటా జాతీయపార్టి గాలి వీచటంతో ప్రాంతీయపార్టి మట్టి కొట్టుకపోయింది. రెండు చోట్ల పోటి చేసిన ఆ పార్టి అధ్యక్షుడే   ఒక స్థానంలో ఓడిపోయాడు.
  రాష్ట్రంలో జాతీయపార్టి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో  చెన్నారెడ్డి ప్రత్యుర్థులకు కొంత వూరట కలిగింది. తను ఎమ్మెల్లే అయితే కావొచ్చు తమకు జిల్లా జాతీయపార్టి నాయుకులు వత్తాసు పలుకుతారు గదా! అందులోనూ యీ దఫా జిల్లా మనిషికే హోంమంత్రి పదవి దక్కింది. అతని అండదండలు తమకు దండిగా వుంటాయి. అప్పుడు తమపట్ల పోలీసుల ప్రవర్తన కూడా మారుతుంది కదా !
  వాళ్ళు వూహించినట్లే పోలీసుల్లో కొంత మార్పు వచ్చింది. చెన్నారెడ్డికి యిచ్చిన విలువ జాతీయపార్టి నాయకులకు కూడా యిస్తున్నారు. శివపురి ఓబుళరెడ్డిని సాదరంగా ఆహ్వానించి కుర్చీలు వేసి కూర్చబెడుతున్నారు.
  చెన్నారెడ్డి టెర్రర్ ఇంకా అణగ లేదు.
  ఓ కేసుకు సంబంధించి పోలీసులు తన వాళ్ళను అరెస్ట్ చేస్తే..పోలీసు్స్టేషన్ ముందరే పెద్ద గందరగోళం లేవదీసి, పోలీసుల్ని బెదిరించి మరీ విడిపించుకు పోయాడు. పోలీసుల్లో అతని మీద అంతర్లీనంగా అసమ్మతి వుంది.
  ఈ నేపథ్యంలో చింతకుంట చెన్నారెడ్డి వ్యతిరేకులంతా ఒక చోట సమావేశమయ్యారు. కాంగ్రెస్స్ గవర్నమెంటు హవా నడుస్తున్నా యీ ఐదేళ్ళలో అతని దుడుకుతనాన్ని అణచివేయాలని నడుంబిగించారు. వెంటనే పల్లె పల్లెకు వెళ్ళి తమ కార్యకర్తలని కలిశారు.
  పంచాయితీల వారిగా వాళ్లను కూడేశారు.
  ధైర్యం నూరిపోశారు.
  ఎమ్మెల్లే కూడా అప్పటిలా దుడుకుగా వ్యవహరించటంలేదు. ఏ మాత్రం తేడావస్తే పోలీసుల చేతుల్లో ఇరుక్కోంటామేమోనని అతనికి అనుమానంగా వుంది.
  జాతీయపార్టి కార్యకర్తల్లో మళ్ళీ జవసత్వాలు కూడుకొంటున్నాయి.
  చెన్నారెడ్డి మనుషుల గొడవలు పోలీసు స్టేషన్ వరకైనా తీసుకపోగలుగుతున్నారు.
  ఓబుళరెడ్డి ఇప్పుడు పూర్తిగా కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసే పనిలో వున్నాడు. ఎక్కడ గొడవలు జరిగినా తన జనంతో సహా అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు.
  అతని చర్యలు చెన్నారెడ్డికి కంటగింపుగా మారాయి.
  ఇలానే వదిలేస్తే తన వాళ్ళను బెదిరించే స్థాయికి కూడా రాగలడేమో..!
  పోరుమామిల్లలో ఓ పెళ్ళికి హాజరైన ఓబుళరెడ్డి వద్దకు దురుసుగా దూసుకెళ్ళాడు చెన్నారెడ్డి.
  " ఏం వోయ్ ?  మావాల్ల మీంద నీ బెదిరింపులు జాస్తెయినాయంట..?(ఎక్కువైనాయట ) దేనికోయి ఈ రాజకీయమంతా నీకు ?  ఎమ్మెల్లేకు పోటి జేస్తావా యేంది ! "  అన్నాడు తీక్షణంగా చూస్తూ వ్యంగాన్ని మిళితం చేసి.
   " మేం  ఎవార్నీ బెదిరించేవాల్లం గాదు. అనవసరంగా ఎవరిజోలికి పోము. మాజోలికి వస్తే వొప్పుకోం. దౌర్జన్యాలు సెయ్యడం, బెదిరించడం నీ లక్షణం. మాకవి చేతగాదు  "  అంతకంటే తీక్షణంగా చూస్తూ చెప్పాడు ఓబుళరెడ్డి.
   " సరే..సరే.. నేను తప్పుడు నాకొడుకునే... ఎమ్మెల్లే పదవి నిలబెట్టుకోవాలగాబట్టి నేను దౌర్జన్యాలు జేస్తాండ. నువ్వెందుకోయి మందను ఎంటేసుకొని వూర్లమీద తిరుగుతండావు ? నువ్వేమైనా ఎమ్మెల్లేకు పోటి జేసేదుందా ? "
   " ఎందుకు జేయనూ ? నీకు దొరికినట్టు మా యట్లాంటి ఖర్మనాకొడుకు  మాకు దొరికితే ఎమ్మెల్లేకు పోటిజేయనల్లా వుందా ? "  అన్నాడు ఓబుళరెడ్డి.
  గతుక్కుమన్నాడు చెన్నారెడ్డి... అంతలోనే తేరుకొని  " సరే .. సరే.. రేపు ఎలక్షన్లలో అట్లనే పోటీజేద్దువుగాని..  నావాల్ల జోలికి మాత్రం రావొద్దు.  పాతసావాసంగాబట్టి  నోటితో చెబుతావుండా ! " అన్నాడు తీక్షణంగా చూస్తూ.
  " లేకుంటే ఏం జేస్తావోయ్ ? "  గట్టిగా అరిచాడు ఓబుళరెడ్డి.
 పెళ్ళి జనమంతా అటుకేసి చూపుల్ని తిప్పి దిగ్ర్భాంతికి గురవుతున్నారు.
 ఓబుళరెడ్డి కేసి పైకి కిందకు ఓ సారి ఎగాదిగా చూశాడు చెన్నారెడ్డి. " ఏం జేస్తానా ? " అంటూ పళ్ళు కొరికి  " నేను ఎమ్మెల్లేనయి బజారు మనుసుల్లా మీదబడలేకుండా. మీయట్లా వుత్తమాసినయ్యుంటేనా... మిమ్మల్ని గాదు - మీ వూరిని కూడా ఎత్తక పోయిండేవాన్ని "  అన్నాడు.
  "  పో..  పోవోయ్ ! "  అదే శైలితో ప్రతిస్పందించాడు ఓబుళరెడ్డి.  " ఎమ్మేల్లేవు కాబట్టే మేమూ నీజోలికి రాలేకుండాము. రిజైన్ చేసి ఒక్కసారి తగిలి సూడు - మా సంగతేందో నీకూ తెలుస్తది..."  అంటూ ప్రతి సవాల్ విసిరాడు.
 చుట్టూ వున్న వాళ్ళందరికీ అక్కడేదో అరాచకం జరగబోతోన్న విషయం స్పరించసాగింది.
  ఓబుళరెడ్డి కేసి తదేకంగా కొంతసేపు చూశాడు చెన్నారెడ్డి. అతనికేసి పళ్ళు కొరుకుతూ వెనుదిరిగాడు.
  అక్కడ జరిగిన సంఘటన తాలుకా అంతటా చర్చనీయాంశమైంది.
  జాతీయపార్టీ కార్యకర్తలకు కొంత మనోధైర్యం సమకూరింది.

                                                                                                             ..........సశేషం.

3 comments:

KAMAL,
thank you very much for sharing this novel with us. awaiting for the next episode.

అనానిమస్ గారికి.
థ్యాంక్స్ మీ వ్యాక్యానానికి. ప్రస్తుతం మరో ప్రాజెక్ట్ పనిలో ఉండడం మూలాన తరువాయి భాగం ప్రచురించలేకపోయాను.

Kamal Gaaru,

Excellent ! Very very nice..Seema ni kallaku kattinatlu choopistunnaru.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs