ఎప్పటినుండో నా బ్లాగ్‌లో రాయాలనుకుంటున్న కొన్ని విషయాలను బద్దకంతో వాయదావేస్తూవస్తున్న నాకు నవతరంగంలో " మహిళాదర్శకులు అయితే మాత్రం..? " వ్యాసంలోని కొన్ని వ్యాక్యానాలు  నేను అనుకున్న విషయానికి కాస్త మోక్షం ఇచ్చినట్లు అయ్యింది. ఆడ, మగ జెండర్ మద్యన దృక్కోణాలు వేరు వేరుగా ఉంటాయన్న అక్కడి వ్యాసానికి చాలా మంది తమ వ్యాక్యానాల ద్వార విబేదించారు...చాలా వరకు జనరల్‌గా ఆడైనా మగైనా తాము తీసే సినిమా జనరంజకంగా తీస్తే బావుంటుందనో..!! లేక వాళ్ళు తీసే సినిమాలలో ఆడవారు తీసారా..? లేక మగవారు తీసారా అన్న విభజనరేఖ చేయడమేంటి..? అన్న ప్రశ్నలు కూడ సందించారు..! మరి కొందరు..ఇంకాస్త ముందుకెళ్ళి కొందరివ్యక్తులమీద ఉన్న ఒక ఫిక్సడ్ అభిప్రాయం వలన వ్యాసంలోని విషయాన్ని లోతుగా చూడలేకపోయారనిపించింది. ఈనా నామాటల్లొ కాన్‌ఫ్లిక్ట్ ఉందనుకోండి. నేను చెప్పిందే వాస్తవం అవాలని రూల్ లేదుకదా..? కాకపోతే విషయాన్ని విషయంగానే చర్చిస్తే కాస్తైనా " సత్యం " చూడవచ్చుననే అనుకుంటున్నా.
       అక్కడ చాలా మంది వ్యక్తపరిచిన అభిప్రాయంలో జనరలజైషన్ ఉన్నది..! జనరల్‌గా నాతో సహా ఎవరికైనా, లేక చాలా వరకు... ఆడ, మగ మద్యన తారతమ్యాలేంటి..! హెచ్చుతగ్గులేంటి..! ఇద్దరు సమానమే అన్న విషయంలో వేరే అభిప్రాయం వుండదనే అనుకుంటున్నా..! జనరల్‌గా ఇలాంటి మాటలు చెప్పుకోడానికి కూడ బానే ఉంటాయి.. కాని ఇక్కడ రెండు విషయాలున్నాయి, అలా ఉండాలి..ఇలా వుండాలి..ఆలా ఉంటేనే సమాజం ముందుకు సాగుతుంది అని చెప్పుకునే మాటలు. అలానే వుండాలి అని అనుకోవడం వేరు..! ఇక రెండవది వాస్తవంగా ఆచరణలో ఆడ, మగ ఈ ఇద్దరూ బయటి ప్రపంచాన్నితమ తమ దృక్కోణంలోనుండి చూస్తున్నది ఏమిటి..? జరుగుతున్నది ఏమిటి ..? అన్నది తరచి చూడాలి ..ఇదివేరు ..! ఈ రెండిటిని కలిపి ఒకే విదానంలో చూస్తున్నారనిపిస్తుంది.  ప్రస్తుతం రెండవ విషయాన్నే నవతరంగంలో ప్రస్తావించారనుకుంటా..??  స్త్రీ తన దృక్పదం నుండి బయటి ప్రపంచాన్ని..చుట్టూ జరుగుతున్న సంఘటనల్ని ఎలా చూస్తన్నది..? ఏమి అనుకుంటున్నది...?? ఇలాంటి విషయాలు స్త్రీ  తను తీసే సినిమాలలో ప్రతిబింబిస్తే అది బయటిప్రపంచానికి మరో విభిన్నత స్పష్టపర్చినట్లవుతుంది..! ఇంకాస్త లోతుగా ఆలోచిస్తే ఇద్దరి మగవాళ్ల మద్యన ఆలోచనావిధానలలోను..అభిప్రాయలలోనూ బేదాలు వుంటాయి..అలాగే ఇద్దరి స్త్రీల ఆలోచనల మద్యన కూడ తేడాలు ఉంటాయి. మరి అలాంటప్పుడు స్త్రీ, పురుషుల ఆలోచనావిదానంలో కూడ తేడా ఉన్నట్లే కదా..? వారి దృక్పదాలు వేరుగా ఉన్నట్లే కదా..? పోనీ మరో విదానం తీసుకుందాము...నవలలు చదివే వారికి యండమూరి నవలలు బాగా పరిచయమే ఉంటుంది. ఆయన కమర్షియల్ నవలలో ఉండే కొన్ని స్త్రీ పాత్రలు..ఎంతో దృడచిత్తంతో, మనోనిబ్బరంతోనూ వ్యవహరిస్తూ..అద్భుతమైన తెలివితేటలతో అన్ని విషయాల్లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరిస్తూ ఉంటాయి...! అలాంటి పాత్రలు నిజజీవితంలో టార్చిలైట్ పెట్టుకొని ఎంత వెదికినా.. ఎక్కడా కనపడవు....!! ఎందుకనీ...??? అందుకు కారణం ఆ పాత్రలన్ని యండమూరి అనబడే ఒక మగ దృక్పోణం నుండి తయారు చేయబడినవి.. ఒక మగ రచయత తను ఎలాంటి స్త్రీని ఇష్టపడతాడో..ఆ స్త్రీ ఎలా ఉండాలనుకుంటాడో దానికి అనుగునంగా ఒక స్త్రీ పాత్రను సృష్టించుకుంటాడు..ఆఫ్‌కోర్స్..తనకు ఎదురైన..లేక తన జీవితానుభవంలో చూసిన కొంతమంది స్త్రీలను తన కోణంనుండి చూసిండవచ్చు..వారినే కాస్త అటో ఇటోమార్పులు చేసి తన నవలలో జొప్పిండవచ్చు.. కాని అది కూడ మగ దృక్పోణమే నుండే కదా..?? అంతెగాని నిజానికి స్త్రీ తనకు తాను ఎలా ఉంటుందో ఆ స్త్రీకి తప్ప పక్కవారికి ఎవరికీ తెలియదు..అంతెందుకు ఆ నవలలు చదివే స్త్రీ పాఠకులు కూడ ఆ నవలలోని స్త్రీ పాత్రలను చాలా అబ్బరంగా చూస్తారు..ఆరాధనగా చూస్తారు..కొందరు ఇష్టపడతారు..కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు. అందుకు కారణం ఆ పాత్రలన్నీ నిజజీవిత స్త్రీల దృక్పదాని ప్రతిబింబించట్లేదు కనుక..!?  ఇలాంటిదే మరో ఉదాహరణ... 1994 లో అనుకుంటాను " ప్రేమ " అనే ఒక కాన్సెప్ట్ మీద ముగ్గురు రచయతల నుండి సీరియల్ రాయించింది ఆంధ్రజ్యోతి వారపత్రిక యజమాన్యం. యండమూరి, యుద్దనపూడి , మూడో రచయత్రి.. ఎప్పుడూ వినని కొత్తపేరు.. వెన్నెలకంటి వసంతసేన... ఈ ముగ్గరి సీరియల్స్ ఒకేసారి ప్రతివారం వారం పక్క పక్కనే ప్రచురితమయ్యాయి. వాటిని గమనిస్తే చాలా వరకు అర్థమవుతుంది. యండమూరి నవల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..యూనివర్సల్‌గా మానసిక విశ్లేషణతో నవల అసాంతం నడిపిస్తారు.. అదీను చదివే పాఠకులను ఆకట్టుకునే విదంగా రాయగల సమర్ధుడాయన.. కాబట్టి ఆయన నవల మీద పెదగా చర్చించినవసరం లేదు. మిగిలింది 23 ఏళ్ళ వెన్నెలకంటి వసంతసేన రాసిన నవల గురించి చాలానే చర్చించవచ్చు అందులో ప్రతి పాత్ర తనవైపునుండి మాట్లాడుతున్నప్పుడూ నిజమే అనిపించేలా చర్చిస్తుంది..! మానవసంబందాల మీద ఒక 23 ఏళ్ళ అమ్మాయి విశ్లేషణాత్మకంగా నవల రాయడం ఆశ్చర్యం కలిగించింది. అప్పట్లో ఈ సీరియల్ మీద ఆంధ్రజ్యోతిలో చాలానే వేడి వేడిగా..వాడి..వాడిగా చర్చలు జరిగాయి. ఇక మిగిలింది యుద్దనపూడి గారు రాసిన నవల..అది అచ్చు ఒక మహిళా దృక్కోణంనుండే వెలవడినట్లు స్పష్టంగా కనపడుతుంది.. అందులోని స్త్రీ పాత్రలన్నింటిలోను ఒక స్త్రీ తన కోణంలో చూసే దృక్పదం ప్రస్పటంగా కనపడుతుంది. మరి వెన్నెలకంటి వసంతసేన కూడ స్త్రీనే కదా..? అని అనుకోవచ్చు..కానీ తీరా చూస్తే ఆ నవల రాసింది తోటకూర రఘు అని ఒక రచయత అమ్మాయి పేరు మీద నవల రాసారట..!!, ఈ విషయం కోందరి నా రచయత మిత్రులద్వార తెలుసుకున్నాను. ఒకే కాన్సెప్ట్‌తో ఉన్న ఈ మూడునవలలను మా అమ్మగారితో సహా కొంతమంది రకరకాల వయసులో ఉన్న స్త్రీల చేత చదివించాను.. విచిత్రమేమంటే..యండమూరి రాసిన నవల విషయంలో పెద్ద మాట్లాడకపోయినా..వెన్నెలకంటి వసంతసేన ( తోటకూర రఘు) రాసిన నవలను విపరీతంగా విమర్శించారు. యూనివర్సల్‌గా స్త్రీలందరికీ యుద్దనపూడి గారి నవల తెగ నచ్చేసింది...! అర్థమైనదనే అనుకుంటున్నాను నేను చెప్పాలనుకున్నదేమిటో...??.

  మరో నా స్వీయ అనుభవం...1994 కాలంలో అనుకుంటాను బెంగళూర్‌లో ఒక ప్రొఫిషినల్ కోర్స్ చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న " యువనిక " అనే  సంస్కృతి, సాహిత్య, స్పోర్ట్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఒక ప్రభుత్వ సంస్థలో నేను పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాను. అప్పటి ముఖ్యమంత్రి వీరప్పమొయిలీ తన స్వంత వూళ్ళో జాతీయ ఆటలపోటీలు నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాలను కవరేజ్ చేయడానికి కొంతమంది పాత్రికేయులు, ఫోటోగ్రాఫర్స్‌‍తో సహా నేను, ఆ సంస్థ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. ఆ గేమ్స్‌లలో పాల్గోనేందుకొస్తున్నా పి.ఆర్.ఓ గారి కూతురు, ఓ ఐదుగురు ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక మిని బస్‌లో ముఖ్యమంత్రిగారి ఊరయిన " కార్కాల " కు బయలుదేరాము. మంగళూర్‌కి వెళ్ళే మార్గమద్యంలో ఒక చోట " సుబ్రమణ్య " అని ఒక పుణ్యక్షేత్రమున్నది. ఇది అచ్చు మన రాష్ట్రంలో ఉన్న శ్రీశైలం లాగ ఉంటుంది చూడడానికి. పాత్రికేయమిత్రులంతా ఒక సారి దేవాలయానికి వెళ్ళి వద్దాం అని అనడంతో..అటువైపుకు వెళ్ళాము. దారి పొడవునా రహదారికిరువైపుల పెద్ద పెద్ద చెట్లతో పచ్చని ప్రకృతి. ఆ దారి మద్యలో ఒక చోట నది ప్రవహిస్తూ ఉండి దానిమీద చెక్కతో చేసిన పెద్ద బ్రిడ్జి మీదుగా వెళ్ళాము..అది చూసిన మేమందరం బస్సుని ఆపి ఆ అమ్మాయిలు తప్ప  డ్రైవర్‌తో సహా అందరం దిగాము. ప్రకృతిని చూసి పరవశించని జీవి అంటూ ప్రపంచంలో ఉండదనే అనుకోవచ్చు. ఆ ప్రకృతిని చూస్తూ మైమరిచిపోతున్నారు అందరూ.. అక్కడున్న నదిలో నీరు చాలా స్వచ్చంగా అడుగుభాగన ఉన్న రాళ్ళతో సహ కనపడుతూ తేటతెల్లగా ఉన్నాయి. అవన్నిమైమరిచి చూస్తున్న పి.ఆర్.ఓ బస్సు‍లోనే ఉన్న తన కూతుర్ని. ఆ అమ్మాయి ఫ్రెండ్స్‌ని పిలిచాడు. వాళ్ళు చెవుల్లో హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని బాలీవుడ్ హీరో షారుఖ్  ఖాన్ " సోకాల్డ్ ప్రేమ "  పాటలు వింటూ " ఊహు " అంటు తల అడ్డంగా ఊపారు రామంటూ..!  చూస్తున్న నాకు కాస్త ఆశ్చర్యమేసింది..!! పూర్వకాలం నుండి మన భావకవులు తమ కవిత్వంలో స్త్రీని ప్రకృతితో పోలుస్తారు కదా..!! మరి వీళ్ళేమిటి...!! ఈ ప్రకృతి వీళ్ళనేమి కదిలించట్లేదా..?. అసలు సినిమాలలో దర్శకులు చూపిస్తున్న హీరోయిన్ ప్రకృతికి ప్రవశించిపోయే దృశ్యాలు మన మెదుల్లో నిక్షిప్తమయ్యాయా..? ఒక సారిగా  మణిరత్నం తీసిన " గీతాంజలి " సినిమా గుర్తొచ్చింది..అందులోని కథానాయకి ప్రకృతివడిలో వర్షంలో తడుస్తూ పాట పాడే దృశ్యం కదలాడింది..! మరి ఈ అమ్మాయిలేంటి..?? సినిమాలోలాగ అమ్మాయిలందరూ ఎగిరి గంతులేస్తూ పాటపాడతారనీ కాదు గాని.., ప్రకృతిని తిలకించడానికి ఆసక్తి చూపట్లేదే..?  అలా అని ఆ ఐదుగురు అమ్మాయిల్లాగే  ప్రపంచంలోని మిగతా స్త్రీలందరూ ఉంటారనుకునే మూర్ఖుడ్ని కాను నేను..ఆ విషయం వేరు..ఇక్కడ అనవసరం కూడాను..కాని ఆ సంఘటన వలన నాకో కొత్త విషయం... కాస్త లోతుగా ఆలోచించడానికి అవకాశమొచ్చింది..కొద్దిగా కొద్దిగా అంతక్షవులు తెరుచుకోవడం మొదలెట్టాయి..! 
      
       గీతాంజలి సినిమాలో మణిరత్నం కోణంలోని హీరోయిన్ అలా గంతులేస్తూ ప్రకృతిని ఆశ్వాదిస్తున్నది..అంటే అదొక మగవాడి దృక్కోణం. మణిరత్నంకి నచ్చేవిదంగా తన దృక్కోణంనుండి సృష్టించబడ్డ స్త్రీ పాత్ర అది..! తన దృష్టిలో స్త్రీ ఎలా ఉంటే బాగుంటుందో..నచ్చుతుందో  అలాంటి స్త్రీని తను సృష్టించుకున్నాడు. అదీ అందరికీ నచ్చేలా కమర్షియల్ యాంగిల్‌లో అవిష్కరించాడు. అంతేకాని నిజజీవితంలోని స్త్రీ అంతరంగం వేరు..అన్నది స్పష్టమవుతూ వచ్చింది  అప్పటినుండే పెణి అనో లేక పెన్వి అనో సరిగ్గ గుర్తులేదుగాని..నటి, దర్శకురాలైనా రేవతి దర్శకత్వం వహించిన ఒక టి.వి సీరియల్‌తో మొదలుపెట్టి మహిళా దర్శకుల సినిమాలు  చూడడం ప్రారంభించాను. వాటిల్లో ఖచ్చితంగా గమనించవచ్చు స్త్రీల దృక్పదం. అలా మీరా నాయర్, అపర్ణాసేన్, గురిందర్ చద్దా, అప్పుడెప్పుడో..సినిమాలు చేసినా పాక్షికంగా స్త్రీల దృక్పదం కనపడే శ్రీమతి భానుమతి రామక్రృష్ణ సినిమాలలో స్త్రీల దృక్కోణం చూడవచ్చేమో..!! ఇక రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావుల సినిమాలలో ఉండే స్త్రీ పాత్రలు వారి వారి కోణమే నుండి వచ్చినవే తప్ప..నిజమైన స్త్రీలు కాదనుకుంటా..! తర్వాత బాలచందర్, భారతీరాజ సినిమాలలోని స్త్రీలు కూడ అంతే..! కాకపోతే ఇక్కడ మహిళా సమస్యలు వేరు..మహిళా దృక్కోణం వేరు ఈ రెండిటిని ఒకే గాటన కట్టి చూడకండి. చాలా మంది అదే చేస్తున్నారు.. బాలచందర్ మహిళా దర్శకులకంటే మహిళా సమస్యలమీద సినిమాలు బాగా తీయగలడు అని అంటున్నారు..అక్కడ దృక్కోణం వేరు..సమస్యలు వేరు..మళ్ళీ ఇక్కడో తిరకాసు ఉన్నది..ఒక మగవాడికి మహిళా సమస్యల పట్ల ఉన్న perspective వేరు..అదే సమస్యల పట్ల స్త్రీలకున్న perspective వేరుగా ఉంటుంది.
        చూట్టూ వున్న సమాజాన్ని, ప్రపంచాన్ని చూసే స్త్రీ దృక్పదం మగాళ్ళకంటే ఖచ్చితంగా బిన్నంగా ఉంటుందన్నది సుస్పష్టం..! అలాగే మగాళ్ళ దృక్పదం కూడా స్త్రీల దృక్పదానికి భిన్నమే..! ఆ విషయాన్నే నవతరంగంలో ప్రస్తావించారనుకుంటున్నాను. దర్శకురాలైనా నందినిగారి ఇంటర్‌వ్యూ నేను చూడలేదు ..చదవలేదు..! వ్యాసంలో చెప్పినట్లుగా మరోకరిలాగ సినిమా తీయను అనో..లేక తీస్తాననో చెప్పడం అన్నదే కాస్త ఆలోచనలో పడేస్తున్నది.. ఒకరిలాగ సినిమా తీయడమేమిటి..? ఉదా: ఒక కొత్త దర్శకుడు/ దర్శకురాలు వచ్చి నేను పలాన దర్శకుడిలా.. ఏ విశ్వనాధో..మణిరత్నంలానో. రామ్‌గోపాల్‍వర్మలానో సినిమా తీస్తాను అని చెబితే..! వారిలాగ తీస్తానన్న కొత్త దర్శకుడితో ఎందుకు సినిమా తీయించాలి..అదేదో...విశ్వనాధగారితోనో ..మణిరత్నం..వర్మ గారితోనే సినిమా మొదలెట్టవచ్చుకదా..? మళ్ళీ కొత్త దర్శకుడితో తీయడమెందుకూ..? ఎవరికి వారికంటూ వారి సొంత ఆలోచనా..కొత్తదనం ఉండాలి గాని..! అలా  స్టేట్‌మెంట్ ఇచ్చేముందు తరచి చూసుకునే ఉండుంటే బాగుండేమో..?. ఎన్నో కష్టాలు పడి..ఎంతోమంది నిర్మాతలను కలిసి వారిని తన కథతో ఒప్పించడానికి నానా యాతలు, తిప్పలు పడివుంటారు..ఎన్నో కష్టాలు ఓర్చింటారు..బహుశ ఆ ప్రస్టేషన్‌లో వచ్చే స్టేట్‌మెంట్ అలా వుంటుందేమో..?? కాకపోతే  ఆవిడ తీసిన ఏ సినిమా రిలీజ్ కాకమునుపే అభిప్రాయాలు..నిర్దశాలు..వ్యక్తపరచడం..అంత సబబు కాదేమో..!!?

                                                                                                        .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.


   డబుల్ మర్డర్ కేసుకు సంబంధించిన కోర్టు తీర్పు వెలువడింది.
  బాలుడు, ఓబుళరెడ్డితోటి మరో ఐదుమంది మీద నేరం నిరూపించబడింది. ముగ్గురికి లైఫ్ జెప్పారు. మిగతా నలుగురికి మూడేళ్ళు జైలు శిక్ష చెప్పారు.
  అందర్నీ రిమాండ్‌కు  తీసుకొన్నారు.
 చెన్నారెడ్డి వచ్చి పలకరించాడు.
  కేసును హైకోర్టుకు అప్పీలు చేద్దామన్నాడు.
  కోర్టు పనుల్ని చూసికొనేందుకు లా చదువుతోన్న రమణారెడ్డి వచ్చాడు విజయవాడనుంచి.
  దుఃఖంతో కుమిలిపోతూవున్న కుటుంబాన్ని ఓదార్చాడు.
  హైకోర్టుకు అప్పీలు చేయించాడు.
 హైకోర్టులో విచారణ ప్రారంభమైంది.
  రమణారెడ్డి మళ్ళీ కాలేజికి వెళ్ళాడు.
  ఈలోపు ముద్దాయిలందర్నీ రాజమండ్రి సెంట్రల్‌జైలుకు తరలించారు.
  శివపురి ఓబుళరెడ్డి కథ తాలుకా అంతటా చర్చనీయాంశమైంది.
  అతని శకం ముగిసినట్లేనని భావించారు చాలామంది.
 ఎమ్మెల్లేకు కుడి భుజం లాంటివాడనీ, అతడులేని లోటును చెన్నారెడ్డి ఎట్లా పూడ్చుకోగలడోననీ లెక్కలు వేయసాగారు కొందరు.
  నెలరోజులు గడిచాయి.
 ఈలోపు ఓబుళరెడ్డికి ఆత్మీయులైన కొందరు రాజమండ్రి వెళ్ళి పరామర్శించి వస్తున్నారు.
  విజయవాడలో వున్న రమణారెడ్డి వారానికొకసారి హైదరాబాద్ వెళ్ళి లాయర్ని  కలిసి కేసు విషయం తెలిసికొని, అట్నించి రాజమండ్రికి కూడా వెళ్ళి చిన్నాన్నకు విషయం చెప్పి వస్తున్నాడు. కోర్ట్ వ్యవహారాల్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాడు.
  తర్వాత కొన్ని రోజులకు -
  విజయవాడలో కాలేజికి వెల్తూవున్న రమణారెడ్డికి హఠాత్తుగా కన్పించాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి.
  " మామా ! బాగుండావా  ?  "  పలకరించాడు
 "  ఓ.. నువ్వంటోయి  !.. ఏంది యిక్కడుండావు..?  "  దగ్గరకు తీసికొని వీపుతడుతూ అడిగాడు చెన్నారెడ్డి.
  " నేనిక్కడ లాజేస్తాండ  మామా ! " 
   "  ఔను గదూ  ! మరిచేపోయా...ఆ ఏంది సంగతి  ? బాగానే సదూతాండావా  ?  మంచి లాయరువుగావాల .. మన కేసులన్నీ నువ్వే వాదించాల  "  నవ్వుతూ చెప్పాడు.
  " యీ మద్య చిన్నాయనోల్లను సూసొస్తివా మామా  ? "
  " ఎందుకు లేదోయ్  ! మొన్ననే గద కడపకు పోయింది.."
  " ఇప్పుడు  కడపలో లేరు..రాజమండ్రి సెంట్రల్ జైలుకు మార్చి చాలా రోజులైంది.."
  గతుక్కుమన్నాడు చెన్నారెడ్డి..అంతలోనే తేరుకొని  " అదేనోయ్  !  మారకముందే సూసొచ్చినా.  మల్లా పోదామంటే  తీరికేదీ.. మొన్న గూడా పోరుమామిల్ల సుబ్బరాయునితో అంటిని - రాజమండ్రి పోదామని...  ఆయప్పా సరేననె.. యాడబోతి ! నన్ను ఎమ్మెల్లేను జేసి జనాలమద్య యిడిసిపాయె మీ చిన్నాయన.  నాకదే జైలయింది. నన్ను నిద్రబోనిస్తా వుండారా ? ఉచ్చకు గూడా ఒక్కన్నీ పోనీయరనుకో. చెవుకాడ గీ పెడతానే వుంటారు... ఇంక యాడిపోతినోయ్  రాజమండ్రికి ? "
     " పోయిరాపో  మామా  ! నువ్వు పోతానంటే నేను తోడొస్తా. చిన్నాయన కూడా నిన్ను చూడాలంటా వుండాడు. నువ్వు కూడా చూసినట్టుంటుంది.. మాట్లడినట్టుంటాది  "  చెప్పాడు రమణారెడ్డి.
  " పోతే బాగానే వుంటదోయ్  ! పోవాల..  వాల్లను సూడకుండా నేనెవుర్ని సూడాల  ?  నా ఖర్మగాలి ఈరోజే జీపు తెచ్చుకోలేదు దొరా !  యింకోకనాడు వస్తా ! ఇద్దరం కలిసే పోదాంలే.. "  చెప్పాడు
  " సరే మామా !  "  అంటూ వెళ్ళిపోయాడు రమణారెడ్డి.
   సాయింత్రంగా ఫ్రెండ్స్‌తో కలిసి ప్రకాశం బ్యారేజి వద్దకెళ్ళి తిరిగి వస్తుంటే ఓ జీపులో ఎమ్మెల్లే చెన్నారెడ్డి కూచుని వున్నట్లుగా అన్పించి ఆశ్చర్యపోతూ అటుకేసి పరిశీలనగా చూశాడు.
  చెన్నారెడ్డే... సందేహం లేదు.
 నంబర్ ప్లేట్ చూశాడు
  జీపు కూడా అతనిదే
  తనతో అబద్దం చెప్పినట్టుంది  ’ జీపు తెచ్చుకోలేదని ’.
 అంటే ..అంటే .. రాజమండ్రి వెళ్ళి చిన్నాన్నను చూసేందుకు యిష్టం లేకనే అబద్దలాడాడేమో !  చిన్నాన్న ఏ జైలులో వుండేది కూడా అతనికి గుర్తులేదంటే తమను ఆయన ఎంతగా మర్చిపోయిందీ అర్థమవుతోంది.
  ఆ భావన భరించలేకపోయాడు రమణారెడ్డి.
  మళ్ళీ రోజే ప్రయాణమై హైదరాబాదు వెళ్ళి కోర్ట్ విషయాలు సేకరించుకొని రాజమండ్రి చేరాడు.
  చిన్నాయనకు విషయమంతా వివరించాడు.
   ఆయన మండి పడ్డాడు.
  చెన్నారెడ్డి ప్రవర్తన పట్ల ఆగ్రహోదగ్రుడయ్యాడు.
  శిక్షపడ్డ నేరస్తుల్ని చూసేందుకు సిగ్గు పడుతున్నాడేమో..!!
  శిక్ష అనుభవించే వాళ్ళ గుండా తనకు లాభంలేదని వదిలేశాడేమో ! ఇంతలోనే చేసిన మేలు మరిచాడంటే - వాడెంతటి నీచుడు !
  బహుశా వాని చర్యల్ని తను విమర్శించడం వల్లనే తమకు దూరంగా జరుగుతున్నాడేమో !
  తాను ఖండించింది  మానవత్వం లేని పనుల్నేగదా !
  తనగుండా ఏలాభం పొందని వాళ్ళు సైతం తన్ను చూడ్డానికొచ్చారు.
  తను ఓట్లు గుద్దిపోస్తే ఎమ్మెల్లే అయిన వ్యక్తి తన్ను తృణీకరించి కనీసం చూసేందుక్కూడ  రాలేదంటే..?
  కష్టాల్లో వున్నప్పుడు పలకరించి హృదయాన్ని తగిలేలా ఆత్మీయ వ్యాకాన్ని పలికేవాడేగదా  మిత్రుడంటే -
  శత్రువుకంటే హీనం.
  తనకిప్పుడు అనుమానమొస్తోంది - పోలీసు సాక్ష్యాన్ని లోబరుచుకొనేందుకు సరైనా ప్రయత్నం చేయలేదేమోననని.
   నమ్మి అతనికి భాద్యత అప్పగించాడు తను.
  కడుపులో పెట్టుకొని చేసినట్టుంది.  అతన్ని బహిరంగంగా వ్యతిరేకించినందుకు లోలోపల ప్రతిచర్య చూపినట్టుంది.
  చెన్నారెడ్డి ప్రవర్తనను భరించలేకపోతున్నాడు ఓబుళరెడ్డి.

                                    ******

    కోర్టు తీర్పు అనుకొన్నంత తొందరగా వెలువడలేదు
  ఎమ్మెల్లే రాజమండ్రికి వెళ్ళి చూసిరాలేదు.
   రోజు రోజుకు అతని మీద వ్యతిరేకత పెరుగుతోంది ఓబుళరెడ్డికి.
  తమను చూడ్డానికొచ్చిన శేయోభిలాషుల ముందు అక్కసంతా వెల్లగక్కుతున్నాడు. చెన్నారెడ్డి కృతఘ్నత గురించి చెబుతున్నాడు.
  అది పామని తెలీక దాని దలమీద కిరీటం పెట్టించి తాలుకా ప్రజలందర్నీ దాని పడగ కిందికి తెచ్చాననీ,  ఆ పాపమే తననీవిదంగా కాల్చుకు తింటోందనీ వాపోయాడు.
  విచారణ అనంతరం ఎట్టకేలకు కోర్టు తీర్పు వచ్చింది.
  బాలునికి ఒక్కనికే లైఫ్ జెప్పారు.
  మిగతా వాళ్ళంతా  ఇళ్ళకొచ్చారు.
  బాలునికి కూడా శిక్ష పడకూడదనీ సుప్రీం కోర్టుకు అప్పీలు చేయాలని అనుకొన్నారు  గాని  సన్నిహితులైన లాయర్లు వద్దని చెప్పటంతో విరమించారు.
  బాలుని గురించి కుటుంబమంతా తల్లడిల్లుతూ వుంది.
  అందరి  బదలూ అతనొక్కడే శిక్ష అనుభవించటం బాధాకరంగా వుంది.
  మరోవైపు చెన్నారెడ్డి ప్రవర్తన రంపం పెట్టి కోస్తూ వుంది.
   తాము ఇంటికొచ్చిన తర్వాత కూడా కలవలేదు అతను. మర్యాదకైనా వచ్చి పలకరించిపోలేదు.
  చెన్నారెడ్డి నిర్లక్షాన్ని ఎట్లా జీర్ణించుకోవాలో అర్థం కావటం లేదు ఓబుళరెడ్డికి. ఒక్కోసారి అన్పిస్తూ వుంటుంది - అతను పూర్తి స్థాయి ఎమ్మెల్లే అయ్యాడని.  తాని ఎమ్మెల్లే తప్ప మామూలు మనిషిని కాదనుకొంటున్నాడేమో  !  చెన్నారెడ్డిగానే వుండుంటే తాము గుర్తుండేవాళ్ళం. తమ స్నేహం గుర్తుండేది.  పాతరోజులు గుర్తొచ్చేవి.... మానసికంగా కూడా అతను పూర్తిగా ఎమ్మెల్లేగా మారిపోయాడు.  తాలుకాలోని అందరి ఓటర్లలో తమనూ ఒకరిని చేశాడు.
  చెన్నారెడ్డి  దూరమవుతున్నాడనే భావన మొలకెత్తి పెరిగి పెద్దదవుతున్నకొద్దీ  అతనిమీద ద్వేషం కూడా సమానస్థాయిలో పెరుగసాగింది. కనిపించిన ప్రతివాడివద్దనల్లా  తన కోపాన్ని వెళ్ళగక్క సాగాడు.  " నేను చేస్తేనే ఎమ్మెల్లే అయినాడు.. వానికింతా పొగురా  ? "  అంటూ వ్యాక్యానించసాగాడు.
  ఓబుళరెడ్డి మాటలు తూ.చ తప్పకుండా చెన్నారెడ్డికి చేరుతున్నాయి. పరిస్థితి ముదరకముందే  సర్ధుబాటు చేసికోవటం విఙ్ఞుల లక్షణమనుకొన్నాడు అతను  ’ ఓబుళరెడ్డిని బద్వేలు రమ్మని మనిషిని పెట్టి మరీ చెప్పి పంపాడు.
  " నేను వానికాడికి రావాలంటనా ? "  మండిపడ్డాడు కబురుతెచ్చిన మనిషివద్దే ఓబుళరెడ్డి.  " ఎమ్మెల్లే కాగానే అంతలావు బలుస్తే మంచిదిగాదు.  ఆ ఎమ్మెల్లే ఎట్లయిండో రోంత (కొద్దిగ) గుర్తుకు తెచ్చుకోమను. మేము జేస్తే ఎమ్మెల్లే అయినాడు - మామీందనే అధికారం చూపిస్తాడా ? "  అంటూ విదిలించి పారేశాడు.
  చెన్నారెడ్డి రోషానికి పోలేదు.
  తనే వస్తున్నాననీ, ఇంటివద్దే వుండమనీ చెప్పి పంపాడు.
  చెన్నారెడ్డి వెళ్ళేసరికి ఓబుళరెడ్డి వూరు వదిలాడు,  అతనికి అందకుండా పోరుమామిళ్ళలో మిత్రుని యింట కూచున్నాడు.
  " ఏంది మామా యిదెంతా  ? నేనేం జేసినానీ  నా మీంద కచ్చెగట్టినారు ? మీకంత ఇష్టం లేకుంటే చెప్పండి యిప్పుడే రాజీనామా గీకేస్తా !  యీ ఎమ్మెల్లే పదవి సరే - ఏంటికె సరే .."  అంటూ పెద్దిరెడ్డి ముందు వాపోయాడు.
  చెన్నారెడ్డి తప్పుల్ని నిర్మోహమాటంగా  ఎత్తిచూపాడు పెద్దిరెడ్డి. చివరగా చెప్పాడు ’ యిద్దరూ ఎదురెదురు కుచుని మనసి విప్పి మాటాడుకొని మనస్పర్థలు తుడిచేసుకోమని.
  " నేనందుకే గద మామా వొచ్చింది .."  తలపట్టుకొన్నాడు.
  " మావోడు రోంత పెంకె. మాటొస్తే పడడు. ఒక్క సిటికె నువ్వే ఓర్పు బట్టాల దొరా ! మీరిద్దరూ కొట్లాడుకోంటే చూసేవాల్లు నవ్వుతారు  "  చెప్పాడు.
  " దానికే గద మామా నేనుబయటపడేది.  అతగాన్ని రమ్మను. తప్పుంటే చొక్కాపట్టుకొని మాట్లాడమను. అంతేగాని దూరదూరంగా వుండొద్దని చెప్పు  "  అంటూ జీపెక్కాడు.
  తర్వాత పదిరోజులకు మరోసారి ప్రయత్నించాడు చెన్నారెడ్డి.
 తనతో కలిసే అవకాశం అతనికి ఏమాత్రమూ యివ్వటంలేదు ఓబుళరెడ్డి.  తన పనిమీద తాను తిరుగుతున్నాడు. బ్రాంది షాపు లైసెన్స్ కోసం అప్లై చేసుకొని వున్నాడు. దాని విషయంగా అధికారుల చుట్టూ తెగ తిరుగుతున్నాడు.
  తనెన్ని ప్రయత్నాల్లో వున్నా చెన్నారెడ్డిని తిట్టటం మాత్రం చాలించలేదు ఓబుళరెడ్డి.  తన ముందు ఎమ్మెల్లే గురించి ఎవరైనా మాట్లాడితే మండిపడతాడు.  " వాని సంగతి నాకాడ ఎత్తగాకండి.. నేను జేస్తే ఎమ్మెల్లే అయినాడు. నాకాడనా వానిగొప్పజెప్పేది ? "  అంటూ విదిలించి పారేస్తున్నాడు.
  ఎమ్మెల్లే మెప్పుకోసం ఆ మాటలన్నీ పొల్లుబోకుండా తీసికెళ్ళి ఆయన చెవినేస్తున్నారు కొందరు.
  ఓబుళరెడ్డి ప్రవర్తన ఎమ్మెల్లేకు కొంత యిబ్బందికరంగా అన్పించింది.  అవమానకరంగా కూడా తోచింది.
  డిగ్రీ అయిపోయి ఇంటివద్దే వున్నాడు ఓబుళరెడ్డి కొడుకు నర్సిరెడ్డి. బ్రాందిషాపు లైసెన్స్ గురించి తను ఇన్‌చార్జి తీసుకొని తిరగటం మొదలెట్టాడు.
  రెండ్రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగే సరికీ అర్థమైంది  దానికి మినిస్టర్ రెకమండేషన్ వుంటేగాని పన్జరగదని.
  ఆఫీసుర్‌తో మాట్లాడుతూ వుంటే ఎమ్మెల్లే చెన్నారెడ్డి వచ్చాడు.
 తన్నితను గుర్తుబట్టి నట్టు లేదు.
  అదే మంచిదని లేచి బైటకొచ్చాడు.
  పదినిమిషాల తర్వాత వాచ్‌మన్ వచ్చి తన పేరుబెట్టి పిల్చేసరికి ఆశ్చర్యపోయాడు నర్శిరెడ్డి.
  " నిన్నే సార్  ! పెద్ద సారు పిలుస్తావుండాడు  "  చెప్పాడు.
  లోపలికి నడిచాడు.
  " ఏం  వోయ్ ! నేనంటే కనుక్కోలేదు నువ్వయినా పలుకరించేది లేదా ?.. రా.. కూచో.."  అన్నాడు చెన్నారెడ్డి.  " షాపు లైసెన్స్ కావాలంటే ఒక్క మాట నాకు చెప్పిపంపుతే నేను తెచ్చివ్వనా ! నేనుండేది ఎందుకోయ్ - మీ పనులగ్గూడా మీరు రావాల్నా ? "  అన్నాడు
 " రేపొద్దున్నే నాతోరా  ! "  చెప్పాడు
  మళ్ళీరోజు  నర్శిరెడ్డిని వెంటబెట్టుకొని హైదరాబాదు వెళ్ళాడు.
 నేరుగా ఎక్సైజ్ మినిస్టర్ చాంబర్‌లోకి తీసికెళ్ళాడు.
  " ఇతను నా అల్లుడు. నాకు ఆత్మీయుడు... నా నియోజకవర్గంలో ఒక మండలమంతా వీళ్ళ చేతికింద వుంది. నేను ఎమ్మెల్లే కావడానికి ప్రధాన కారుకులు వీళ్ళే. నెత్తురు పుసుకొని ఎలక్షన్ చేశారు.  పదివేల ఓట్లు గుద్దిపోసి నన్ను గెలిపించారు.  వీళ్ళకు పన్జేస్తే మీరు నాకు పన్జేసినట్లే .."  అంటూ మినిస్టర్ వద్ద గొప్పగా చెప్పాడు. లైసెన్స్ వచ్చేందుకు లైన్ క్లియర్ చేశాడు.
  బైటకొచ్చిన తర్వాత నర్శిరెడ్డిని పక్కనే కూచోబెట్టుకొని  " చూడోయ్  మినిస్టర్ కాడ కూడా చెప్పినా నేను ఎమ్మెల్లే అయ్యేందుకు కారణం మీరేనని. నేను మీరు చేసిన ఎమ్మెల్లేనని....మీరు చేస్తేనేనోయ్ నేను ఎమ్మెల్లే అయ్యిందీ !  ఆ విషయం  అందరిలో నేను చెప్పుకుంటే మీకు గౌరవం వుంటదిగాని, మీరు చెప్పుకొంటే కాదు దొరా ! రొవ్వంత మీ నాయనకు చెప్పు.. ఎగతాలిగా మాట్లాడొద్దని చెప్పు. నాకు అవమానమైతే మీకు అవమానం గాదా ! "  అంటూ బతిమాలాడు.
  ఆయన మాటల్లో నిజముందనిపించింది నర్శిరెడ్డికి కూడ.
  ఇంటికెళ్ళి పెదనాన్న వద్ద తన మనసు విప్పాడుగాని తండ్రి వద్ద నోరెత్తలేకపోయాడు.  ఎమ్మెల్లే తన్ను ఆదరించిన విషయం, పనిచేయించిన సంగతీ మాత్రం అందరిముందూ ప్రకటించాడు. విననట్టుగా ఎటో చూస్తూ వెళ్ళిపోయాడు ఓబుళరెడ్డి.
  తన ధోరణి మాత్రం మార్చుకోలేదు.
  మరోసారి  నర్శిరెడ్డి వద్ద తన బాధను వెళ్ళబోసుకొన్నాడు ఎమ్మెల్లే.
  అతని మాటలు నమ్మే స్థితిలో లేడు ఒబుళరెడ్డి.  బ్రతిమాలాటాలు, బాధను వ్యక్తపరచటాలూ, ఇవన్నీ పచ్చి నటనలని అతని అభిప్రాయం.  తనవాళ్ళవద్దా, లోకుల వద్దా ’ అయ్యో పాపం ! ’ అనిపించుకోవాటానికి చేస్తున్న చేష్టలు అవి.  ఎమ్మెల్లే అంతటి వాడు బంగపడుతోన్నా ( బతిమాలుతున్నా ) లెఖ్కజేయని తలబిరుసు మనిషి శివపురి ఓబుళరెడ్డి ’ అని నలుగురూ భావించాలని అతని ఆలోచన అని.
  అతను పూర్వపు చెన్నారెడ్డే అయ్యుంటే తనకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చేవాడు కాదు. కూలి తీసికొని మనుషుల్ని చంపించే వాడు కాదు.  సారా వేలం పాటల్ని దౌర్జన్యంగా చేజిక్కించుకొనేవాడు కాదు.  ఇప్పటికే చాలా పల్లెల్లో మద్యం షాపులన్నీ అతని అనుచరులవే. అన్నిట్లో అతనికి భాగముందని వినికిడి. డబ్బు సంపాదన కోసం ఎన్నెన్నో అడ్డదారులు తొక్కుతున్నాడు.
  చెన్నారెడ్డిని తల్చుకొంటే చాలు తను జైల్లో వున్న రోజులే గుర్తొస్తాయి. తన్ను చూసేందుక్కూడ యిష్టపడని అతని చర్య గుర్తుకొస్తుంది. అతనిమీద అంతులేని ఏహ్యభావం కలుగుతుంది. ఎదురుగా ఎవరైనా వుంటే వాళ్ళ ముందే అతన్ని తిడతాడు. ఎవరూ లేకుంటే గోడకేసి తిరిగి అయినా తిట్టుకొంటాడు.
  ఓబుళరెడ్డి తిట్టటం మానుకోకపోయేసరికి క్రమేణా అతనిమీద నమ్మకం నశించింది ఎమ్మెల్లేకు కూడా. రాయబారాలు పంపటం చాలించాడు. రమణారెడ్డి, నర్శిరెడ్డెలు కన్పించినా  ఇదివరకటిలా ఆప్యాయంగా పలుకరించటం మానాడు.
  ఓబుళరెడ్డి, చెన్నారెడ్డి లిద్దరూ ఎక్కడైనా పరస్పరం ఎదురుపడినా పలుకరించుకోవటం లేదు. ఒకరి మొగాలొకరు చూసికోవటం లేదు.
  ఇద్దరి మద్యా అగాథం ఏర్పడింది.
  ఆ విషయంలో తాలుకా అంతటా తెలిసిపోయింది.
  జాతీయపార్టి వాళ్ళకు కొంత ఆశ చిగురించింది.
  చెన్నారెడ్డి వ్యతిరేక వర్గీయులంతా రహస్యంగా సమావేశమయ్యారు. ఓబుళరెడ్డిని  జాతీయపార్టిలోకి లాక్కొంటే ఎలా వుంటుందా..? అని చర్చలు జరిపారు.
  చెన్నారెడ్డిని వ్యతిరేకంచి, ఎదురించే బలమైనా మొరటైన వర్గం ఒకటి వచ్చి కలవటం వలన జాతీయ పార్టి బలపడుతుందని భావించారు.
  శివపురి వాళ్ళను జాతీయపార్టిలోకి లాగాలని తీర్మానించారు.
  కొందరు అనుభవఙ్ఞులు ఆ భారాన్ని తమ భుజానేసుకొన్నారు.

                                                                                                        ........ సశేషం

                                                                                                          .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.                                                                      

      చెన్నారెడ్డి గెలుపు పండుగ నియోజక వర్గమంతా చుట్టివచ్చేసరికి దాదాపు మూడునెలలు పట్టింది. సుమారైనా నాయుకలంతా ఎమ్మెల్లేను తమ వూరికి పిలవటం, పొట్టేళ్ళను కోసి, వచ్చిన వాళ్ళందరికీ విందులివ్వటం, తమ వూరి సమస్యల్ని ఆయన ముందు చిట్టా విప్పటం.
   రాష్ట్రంలో కూడా ప్రాంతీయపార్టి ప్రభుత్వం ఏర్పడటం వలన తాలుకా అభివృద్దికి ఆటంకం వుండబోదని అందరికీ ఆశ.
  చెన్నారెడ్డి వెంట తనూ కొన్ని వూళ్ళకు వెళ్ళాడుగాని, తర్వాత ఎందుకో ఇష్టపడలేదు ఓబుళరెడ్డికి.
  కోర్టు వాయిదాలు వేగమంతమయ్యాయి.
  మీద మీద డేట్లిస్తున్నారు
  సాక్ష్యాల్ని రికార్డు చేస్తున్నారు.
  దగ్గిర దగ్గిర వాయిదాలు వేయటం వలన ఖర్చులు ఎక్కువవుతున్నాయి. అప్పులకోసం చేయి చాచాల్సిన పరిస్థితి వస్తోంది. మొన్న ఎలక్షన్స్‌లో చేతి చమురు చాలా వదిలింది.
  చెన్నారెడ్డి వద్దకెళ్ళి యింత ఖర్చయిందని చెప్పేందుకు అహం అడ్డు.  తనయినా గుర్తెరిగి ఇవ్వాల్సిన భాద్యత వుంది... కానీ జోబులోంచి ఒక్క రూపాయి కూడా బైటకు తీయలేదు.
  ముగ్గుపిండి గనుల మీద కొంత ప్రత్యేక దృష్టి పెట్టాడు ఓబుళరెడ్డి. దిగుబడిని పెంచేందుకు కృషి చేస్తున్నాడు. మద్యదళారీల్ని నమ్ముకోకుండా నేరుగా మద్రాసు ఫ్యాక్టరీలకు తామే తరలించేందుకు నడుం బిగించాడు. ఎమ్మెల్లే సహాయంతో మార్గాన్ని సుగమం చేసుకొన్నాడు.
   కోర్టు కేసు ఓబుళరెడ్డిని మానసికాందోళనకు గురిచేస్తోంది. కేసు పర్యవసానం ఏమవుతోందనని అలజడి. సాక్షల్ని కొంత వరకు లోబరుచుకొన్నారుగాని పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. పోలీసు సాక్ష్యం కొంత ఇబ్బందికరంగా తయారైంది. అతనికి యస్.పి భరోసా ఇచ్చినట్లుంది... లోంగటం లేదు.
   ఇప్పుడు ప్రభుత్వం మారిందిగదా ! మనవాడే ఎమ్మెల్లే అయ్యాడుగదా !  ఎస్పీ మీద వొత్తిడి తెస్తే ఫలితంముంటుందేమో అనే ఆశ. అందుకే రెండు మూడుసార్లు చెన్నారెడ్డి వద్ద ఆ విషయం ప్రస్తావించాడు.
  అతని చుట్టూ  ఒకటే రద్దీ, ఒకటే కోలాహలం... తన మాటలు అతని చెవిదాకా వెళ్ళనీయట్లేదు జనాలు. చివరకు ఎలాగోలా అతని చెవినేస్తే  " యీరోజే మాట్లాడ్తానోయ్ !  ప్రభుత్వం మనది గదా !  మనమాట ఎందుకినడూ  ? "  అన్నాడు.
  తర్వాత మాట్లాడాడో లేదో తెలీదు.
  పోలీసు సాక్ష్యం కూడా రికార్డయ్యింది.
  బాలుని మీద బాగా నేరం మోపినట్లుంది.
   సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్లేగా బాగా నిల్దొక్కున్నాడు చెన్నారెడ్డి.  తన వర్గం వాళ్ళకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేస్తున్నాడు. ముఖ్యంగా గొడవలున్నచోట ఆయుధాల్నించి మనుషులదాక అందిస్తున్నాడు.
  కొన్ని ఏరియాల్లో రాజకీయం చాలా మార్పులకు గురవుతోంది, పల్లెల్లో చెన్నారెడ్డి వర్గీయుల దాడులు అధికమయ్యాయి. ఇంతదాకా తమదే పైచేయిగా ఆధిపత్యం చెలాయిస్తున్న వాళ్ళు కాస్తా ఇప్పుడు ఎదురుదెబ్బలు తినాల్సిన పరిస్థితి వస్తోంది. తనవాళ్ళ పట్ల చెన్నారెడ్డి ప్రత్యేక శ్రద్ద కనబరచటం వలన చెలరేగిపోయి ప్రత్యుర్థల్ని లొంగదీయటంలో సఫలీకృతమవుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకోడానికి బలమైన పునాదులు వేయిస్తున్నాడు ఎమ్మెల్లే.  ఆ క్రమంలో కొన్నిచోట్ల పెద్ద గొడవలయ్యాయి. పోలీసు కేసులయ్యాయి. ఒకటి రెండు ఖూనీలు కూడ పడ్డాయి.
  కేసుల కోసం టౌనుకొచ్చిన ప్రత్యుర్థుల మీద దాడుల చేయించి భయబ్రాంతుల్ని చేసే కొత్తరకపు చర్యలకు కూడా శ్రీకారం చుట్టాడు ఎమ్మెల్లే చెన్నారెడ్డి. టౌన్‌లోనే సంసారం వుండటం వలన మెరికల్లాంటి మనుషుల్ని తయారుచేసి ప్రత్యుర్థలమీద దాడులకు వినియోగిస్తున్నాడు.
   అతని చర్యల్ని అడ్డుకోనేందుకు మొదట నాగిరెడ్డి వర్గం ప్రయత్నించింది గాని అతని మొరటుదనం ముందు నిలబడలేకపోయింది. టౌనులోని తమ ఆస్తుల్ని పరిరక్షించుకోంటే చాలనే స్థితికి చేరారు వాళ్ళు.
             
                                     *******

    దండోరుపల్లెలో మళ్ళీ గొడవలు.
  ఏరుదాటి వచ్చిన సుబ్బారెడ్డివర్గానికి తాము రక్షణ కల్పించక తప్పటంలేదు.  వాళ్ళ కేసులు కూడా తామే చూడాల్సి వస్తోంది ఓబుళరెడ్డికి.  అది తమకు తప్పనిసరి భాద్యత కూడా.
   నరసింహారెడ్డి విజయవాడలో లా చదవడానికి వెళ్ళాడు. మిగతావాళ్ళు కూడా చదువుల్లో బాగానే ఎక్కిపోతున్నారు.
  దండోరు పల్లెలో గొడవలు మరింత పెరిగాయి.
  ఒకనాటి రాత్రి సుబ్బారెడ్డి వర్గమంతా ఏటికడ్డంగా పారిపోయొ వచ్చి ఓబుళరెడ్డిని శరణుపొందారు.
   కొత్త మనుషల్ని తెచ్చి బాంబులేస్తూ తరుముకున్నాడుట రంగారెడ్డి.  దొరికివుంటే చంపేవాళ్ళట.
  తమకు కూడా బాంబులు కావలన్నాడు సుబ్బారెడి. బాంబింగ్ చేసే మనుషులు కూడా కావాలిట.  సప్లై చేయమన్నాడు. ఎంత ఖర్చయినా భరించుకొంటామని చెప్పాడు.
   ఓబుళరెడ్డి వొప్పుకోలేదు.
  ఖూనీలు చేసి తాము పొందే అనుభవమేమితో స్పష్టంగా తెలుస్తూనే వుంది.  దాని లాభమెంతో అర్థమవుతూ వుంది. తమ వెంట చాలా సార్లు లాయర్ల వద్దకూ కోర్టుల వద్దకూ అతను కూడా తిరిగాడు కాబట్టి యీ అగచాట్లు అతనికి కూడా తెలుసు.
  ఏ క్షణం తీర్పు వెలుబడుతుందో తెలీదు.  వాటి స్వరూపం ఎట్లా వుంటుందో కూడా అర్థం కాలేదు.   లైఫ్ చెప్పినా చెప్పొచ్చు.  క్షణం క్షణం కోర్టు తీర్పును వూహిస్తూ మానసికంగా సగం చచ్చిపోవాలి.
   తమని చూసి జాగ్రత్తపడమని సలహాయిచ్చాడు సుబ్బారెడ్డికి.
  తర్వాత  తనమనుషుల్ని దండోరుపల్లెకు పంపి గ్రామపరిస్థితిని తెలుసుకొన్నాడు.
  గ్రామంలో ఆడవాళ్ళు జోలికి రావటం లేదట. వామిదొడ్లను ( గడ్డితో పెద్ద పెద్దగా వాములు చెయటం =గడ్డివాము), పశువుల్ని, పంటల్ని నాశనం చేసే పనులకు వొడికట్టటం లేదుట.
  పూర్వం నించీ సాంప్రాదాయకంగా వస్తోన్న న్యాయమే అది, ఎంతపెద్ద గొడవలైనా, ఎన్ని ఖూనీలు పడినా ఆడవాళ్ళ జోలికి పోయేదిలేదు. చిన్న పిల్లల్ని ఏమనేదిలేదు. పశువుల్ని చంపటమో, పైర్లూ నాశనం చేయటమో జరగదు. గొడవల్లో కూడా ఒక యుద్దనీతి వుంది.  ఆధిపత్యపోరాటాలో, వ్యక్తిగత కక్షలే కాబట్టి గొడవలు కూడా ఆ పరిధిలోనే వుంటాయి.
  దండోరుపల్లెకు  మద్యవర్తుల్ని పంపాడు ఓబుళరెడ్డి. కొత్తవాళ్ళను తెచ్చుకొని దాడులు చేయించటం మంచిపద్దతి కాదనీ, గతంలో ఒకసారి తమవూరికి కొత్త మనుషుల్ని పంపి ఎట్లా భంగపడ్డారో గుర్తు చేసుకొమ్మనీ, పద్దతి మార్చుకోకపోతే తాము కూడా మనుషుల్ని పంపించవలసి వస్తుందనీ ఘాటుగా చెప్పించాడు.
    తర్వాత నాలుగు రోజులకే గొడవ సద్దుమణిగింది గాని పదిరోజుల తర్వాత సుబ్బారెడ్డి మళ్ళీ వచ్చాడు.
   " మామా !  రంగారెడ్డి గాన్ని నమ్మలేకుండాము.  వాడు లోపల్లోపల యేందో సేస్తాండాడు. కొత్తమాసుల అలికిడి తగ్గలేదు.  రాత్రిల్లు  మావోల్లు ఇండ్లల్లోంచి బైటికి రావాలంటే భయపడ్తాండారు.  ఎప్పుడేం జరుగుతదో అంతుబట్టడంలే... యీధిల్లోకి రాడానికిగ్గూడా బయపడ్తాండం.. యీ సావు మేం సావలేం మామా ! యీ బాధ తట్టుకోలేం..  వాన్ని బేసెయ్యకుంటే మాకు నిద్దర్రాదు... "  చెప్పాడు.
    అతనికేసి తదేకంగా చూశాడు ఓబుళరెడ్డి.
  "  ఎమ్మెల్లేతో ఒక్క మాట సెప్పరాదా ! "  అభ్యర్థిస్తున్నట్లుగా అన్నాడు.
  నొసలు ముడేస్తూ  " ఏమని ? " అడిగాడు ఓబుళరెడ్డి.
  " మనుషులను పంపమను వాల్లకు నేనే లెక్కించుకుంటా. రంగారెడ్డిగాన్ని బేసి పోతారు ( వేసేసిపోతారు).... మాకా పీడ తప్పించు మామా  ! "
   ఆశ్చర్యంగా అతని కేసి చూశాడు.
  " ఎమ్మేల్లేకాడ లెక్కల్దీసుకొని  ఖూనీల్జేసే మనుషులుండారా  ? "  అన్నాడు
  ఇప్పుడు ఆశ్చర్యపోవటం  సుబ్బారెడ్డి వంతయింది.
   " ఏమి ఎరగనట్టు మాట్లాడ్తావేంది మామా  !  మెరికల్లాంటి మనుసులుండారు.  ఆయప్ప మాసుల్ని తెచ్చుకుంటే పోలీసు కేసులకు కూడా సాయం జేస్చాడు.. "
  మారు పలకలేదు ఓబుళరెడ్డి.
  అతనికి నోరు పెగల్లేదు.
  చెన్నారెడ్డి తన వర్గీయులకు మాట సాయం, మంది సాయం చేస్తాడని తెలుసుగాని. కిరాయికి ఖూనీలు చేయించే పనిపెట్టుకొన్నాడని వినలేదు.  అట్లాంటి  ఆలొచన చెన్నారెడ్డికి వస్తుందని కూడ వూహించలేదు.
   " నేన్జెప్పింది మర్చిపోగాకు మామా ! "  అంటూ మరోసారి హెచ్చరించి వెళ్ళాడు సుబ్బారెడ్డి.
  అతని అభియోగం నమ్మదగినదిగా అన్పించలేదు ఓబుళరెడ్డికి. కమ్యూనిస్టులతో సంబంధాలున్నవాడు, కమ్యూనిస్టు భావాలు కలిగిన వాడు.. అలాంటి నీచస్థాయికి దిగజారతాడని అతను భావించటం లేదు.
    అందుకే సుబ్బారెడ్డి కోరికను, దాన్ని తీర్చుకొనేందుకు అతను సూచించిన మార్గాన్నీ స్మృతినుంచి తప్పించేశాడు.

                                              *****

       వర్షాకాలం వచ్చింది.
  వానదేవుడు కొంత కరుణించనట్లుంది.
  సగిలేరు పొంగి ప్రవహిస్తోంది
  ఇలాంటి సమయంలోనే దండోరుపల్లెల్లో గొడవలు రాజుకొనేది, బైటి ప్రపంచంతో సంబంధాలు తెగినపుడు రంగారెడ్డి విజృంభిస్తాడు.  అవతలి వర్గం మీద యుద్దం ప్రకటిస్తాడు. ఇరువర్గాలూ మిద్దెల మీద బండ్లకొద్దీ రాళ్ళు పోసుకొంటారు. చేతులు నొప్పి పుట్టేదాక విసురుకొంటారు, అవకాశమొస్తే కర్రలతో తలలు పగులగొట్టుకొంటారు. ఏరు తగ్గేదాక సరైన వైద్య సహాయం కూడా వుండదు.
  రాళ్ళ యుద్దంలో ఆడవాళ్ళు, పిల్లలు కూడా పాలుపంచుకొంటారు.  ఆడవాళ్ళు రాళ్ళు విసరటంలో సాయం చేస్తుంటారు, మగపిల్లలు తమ తండ్రుల తోటి తాము హుషారుగా రాళ్ళు విసురుతారు.
  ఆ నాలుగు రోజులూ మగాళ్ళు గుంపులు గుంపులుగా తిరుగుతారు,  అవతలి వాళ్ళ చేల మద్య తమ చేలున్నపుడు ఇంటి ఇల్లాల్లే కూలీల సాయంతో వ్యవసాయం చేయిస్తుంటారు.
  వ్యవసాయి పనుల్ని ఎవ్వరూ అడ్డుకొనేది లేదు.
  ఏటి చెలిమల్లో నీల్లు కూడా వంతుల వారీగా తెచ్చుకొంటారు.
వారం రోజులైనా ఏటి ఉరవడి తగ్గలేదు
  దండోరుపల్లె వాల్ల ఆచూకి తెలియలేదు.
  మాటల సందర్భంలో వాళ్ళ ప్రస్తావన వచ్చినపుడు ఆందోళన ప్రకటించాడు ఓబుళరెడ్డి.
  క్రమేణా ఏటి ఉరవడి తగ్గింది
  వాటం తెలిసిన మనిషి ఏటిని దాటగలుగుతున్నాడు.
  ఆ తరుణంలోనే ఏటి అవతల్నించి నలుగురు మనుషులు జట్టుగా కూడి వచ్చారు.
  వాళ్ళు అందించిన తొలిసమాచారం ’ సుబ్బారెడ్డిని పోలీసులు తీసుకెళ్ళారట ! ’
  " ఎందుకూ  ? "  పెద్దిరెడ్డి కంఠంలో ఆదుర్దా.
 " మీకింగా తెల్దా ? రంగారెడ్డి ఖూనీ అయ్యిన్లే ! "
 విన్నవాళ్ళంతా నమ్మలేనట్టుగా చూశారు.
  " బద్వేలు పోయిన్నెడంట  ఆడేం జరిగిందో ఏమో ! ..లాడ్జి కాన్నే నరికినారంట.  మీకు తెల్సింటాదనే అనుకున్నెం "
  " ఎప్పుడు రా ? "
  " రేత్రేనంట పెద్దయ్యా ! "
  ఓబుళరెడ్డి ప్రయాణమయ్యాడు
  " మాగ్గూడకా  యీ పొద్దున్నే తెల్సింది పోలీసోల్లొచ్చి సుబ్బారెడ్డి యింటి కాడికి పోయినాంకనే "
  ఓబుళరెడ్డికి నమ్మశక్యం కాలేదు.
  సుబ్బారెడ్డికి తెలీకుండా రంగారెడ్డి ఖూనీగావటం అసంబద్దమైన విషయంగా తోచింది.  కూలికి ఖూనీ చేసే వాళ్ళగురించి  తన్నతను అడిగిన విషయం కూడా గుర్తుకొచ్చింది.
  జనాన్ని వెంటేసుకొని పోరుమామిళ్ళ చేరాడు.  పోలీసు స్టేషన్‌కు వెళ్ళి సుబ్బారెడ్డిని కలిశాడు.
  స్టేషన్‌లో విచారిస్తే అతనిమీద ఇంకా కేసు బుక్ చేయలేదని తెలిసింది. ఎంక్వయిరీ చేస్తున్నారట.
  బద్వేల్ వెళ్ళి లాయర్‌ను కలిశాడు.
  అతనితో చాలా సేపు మాట్లాడి ఎమ్మెల్లేకు ఫోన్ చేయించాడు.  ఊల్లో లేడుట ఎమ్మెల్లే.
 సాయింత్రానికి గాని రాలేదు అతను
  విషయం వినగానే  "  అదెట్లా ? అతనికేం సంబంధముందనీ అరెస్ట్ చేస్తారు..?  ఖూనీ జరిగింది ఎక్కడో  ?  చంపింది ఎవురో ?  ఆ టైంలో అతను ఇంటికాన్నే వున్నేడుగదా..!  పోదాం  పా.. ఆ ఎస్సై సంగతెందో తేలుస్తా.. "  అంటూ జీపును బయటకు తీయించాడు.
  అంతా చూసినట్లు మాట్లాడుతున్నాడు చెన్నారెడ్డి.
  తను అభ్యర్థించకముందే  కేసుపట్ల ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఓబుళరెడ్డికి ఆశ్చర్యంగా వుంది.
   పోరుమామిళ్ళ పోలీసు స్టేషన్లో ఎస్సైని దబాయించాడు చెన్నారెడ్డి. తన ఎమ్మెల్లే ప్రతాపాన్నంతా చూపించాడు. ఇప్పుడే హోం మినిస్టర్‌తో ఫోన్ చేయిస్తానన్నాడు.  సాక్ష్యాలుంటే నిరభ్యంతరంగా అరెస్ట్ చేయమన్నాడు.  టౌన్ వాళ్ళతో ఏవో గొడవలవల్ల రంగారెడ్డి ఖూనీ చేయబడ్డాడేగాని .. సుబ్బారెడ్డికి కేసుకు ఎలాంటి సంబంధం లేదని వాదించాడు.
  డి ఎస్పీ వచ్చి సర్ది చెబితేగాని వినుకోలేదు చెన్నారెడ్డి.
  ఎంక్వయిరీ చేస్తున్నామనీ, సుబ్బారెడ్డి నిర్దోషిగా నిరూపణ అయితే వదిలేస్తామని చెప్పాడు డి ఎస్పీ.
  బైట కొచ్చిన తర్వాత ఓబుళరెడ్డికి చెప్పాడు  "  పోలీసులకు కొంత ఎక్కువ మొత్తమే ముట్టజెప్పమని "
  తర్వాత పోలీసులకు అందవలసిన డబ్బు అందింది.
  సుబ్బారెడ్డి తోటి మరో నలుగురిమీద కేసు రిజస్టరయ్యింది.  బేయిలబుల్ సెక్షన్స్ కాబటి సులభంగానే బైటకొచ్చారు వాళ్ళు.

                                *****

    ఒక రోజు శివపురికి వెళ్ళాడు సుబ్బారెడ్డి. అత్యంత రహస్యంగా ఓబుళరెడ్డి చెవిలో అసలు రహస్యం వూదాడు. చెన్నారెడ్డి మనుషులేనట రంగారెడ్డిని ఖూనీ చేసింది. చింతకుంట గొల్లలు యిలాంటి విషయాల్లో ఆరితేరారుట. వాళ్ళనే పంపాడట.  వారం రోజుల ముందే వాళ్ళకు తను రంగారెడ్డిని చూపించాడుట. ఇరువై ఐదువేల రూపాయల వొప్పందమట.
  మనస్సు వికలమైంది ఓబుళరెడ్డికి
   అన్న వద్దకెళ్ళి సంగతి చెప్పగానే ఆయనకూడా నొచ్చుకున్నాడు. చెన్నారెడ్డి అలాంటి పనులు చేయిస్తున్నాడంటే మనస్సులో ఓ వైపు నమ్మకం కలుగటం లేదుగాని  వాస్తవాన్ని ఎట్లా కాదనగలరు..?
  మరో నెల తర్వాత సుబ్బారెడ్డి వచ్చి కలిశాడు.
  " ఎట్లా జెయ్యాల మామా ? "  అన్నాడు దిగాలుగా
  విషయమేదో చెప్పమన్నట్లుగా అతనికేసి చూశాడు ఓబుళరెడ్డి.  కొంతసేపు తటపటాయించి తర్వాత తలెత్తాడు సుబ్బారెడ్డి. " ఒప్పందం సేసుకొన్నెనా ! ఇరువై ఐదువేలు ఎత్తకపోయి ఎమ్మెల్లేకిచ్చినా  పనేమో జరిగిందిగాని  యవ్వారం రోంత తిరగడ కొచ్చింది "
  ఓబుళరెడ్డి చూస్తూనే వున్నాడు.
  " మొన్న మల్లా వొచ్చినారు చింతకుంట మాసులు.. ఇది నాలుగోసారి రావడం... లెక్కకొచ్చినారు. ఐదువేలు ముట్టిందంట..ఇరువైవేలు బ్యాలెన్స్ రావాలట. ఎమ్మెల్లేకు లెక్కంతా యిచ్చినానని కూడా చెప్పలేదు  ఏమి యిబ్బందోనని నే్నేమో ఎమ్మెల్లేను అడగలేకుండా. పోనీ అడగనీకి దొమ్మల్లేవు..."
  " అయితే నన్నేం జెయ్యమంటావు ? "  అన్నట్లుగా చూశాడు.
  " ఎమ్మెల్లేకు సెప్పి ఆ లెక్క వాల్లకిప్పీ మామా  !  "  బేలమొహంతో అడిగాడు.
   సుబ్బారెడ్డి కేసి ఎగాదిగా చూశాడు ఓబుళరెడ్డి.
   తర్వాత ఓ నిట్టూర్పు నిగిడించి " నేను మద్యవర్తిని కాదు కదా..ఎట్లా చెప్పాల  ? "  అన్నాడు
   " మామా  !... మామా  ! "  ప్రాధేయపడ్డాడు.
   " చూడోయ్  !"  గొంతు గంభీరమైంది ఓబుళరెడ్డికి  " మీ వూరి నీటిబ్బందులుంటే చెప్పు నేనొస్తా ! పోలీసు కేసులుంటే చెప్పి పంపు.. చేసిపెడతా. పూచికత్తు యిచ్చి బెయిలు తెప్పిస్తా... ఖర్చులకు చాలకుందని అడుగు లెక్క తెచ్చిస్తా... మీ గుంపంతా వొచ్చినా మూడోకంటికి తెలీకుండా నెలల గాలాలు సాకుతా... అంతేగాని యిట్లాంటి బ్రోకర్ పనులు నాసేయను నాకు చేతగాదు. నాకు చెప్పగాకు... నువ్వు మాట్లాడుకొనేప్పుడు నేను లేను కదా..? పని చేయించుకొనేప్పుడు లేను.. లెక్కలిచ్చేప్పుడు నేను లేను.. మద్యలో నన్నెందుకు యిరికిస్తావు  ? "  అన్నాడు.
  మరింకేమి మాట్లాడలేదు  సుబారెడ్డి.
   ఓబుళరెడ్డికి తెలీకుండా పనిచేయించటం తప్పే. తెలిస్తే వొప్పుకోడని భయపడ్డాడు తను. గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతుందనుకొన్నాడు.  వ్యవహారం మడత బడింది. మరోసారి డబ్బులివ్వటం తప్ప గత్యంతరం కన్పించటం లేదు.
   ఓబుళరెడ్డి మనసు కలతగా వుంది
  చెన్నారెడ్డి చర్యపట్ల అసహ్యం కలుగుతోంది.
  అతని పట్ల అంతరాంతరాళల్లో ఏదో అపనమ్మకం. మరేదో అవిశ్వాసం.  తన భావాల్ని అన్నతో పంచుకొన్నాడు.
  ఆయన కూడా తనలాగే స్పందించాడు.
   ఎమ్మెల్లే అయింతర్వాత క్రమేనా అతను నైతిక విలువలు కోల్పోతూ వుండటం పట్ల బాధ పడ్డారు ఇద్దరు.
      వారం రోజుల తర్వాత ఓ పెళ్ళిలో చెన్నారెడ్డిని కలవటం తటస్థించింది ఓబుళరెడ్డికి.  అతన్ని పక్కకు పిల్చి తన అసంతృప్తిని వెళ్ళగక్కాడు. ఇలాంటి చర్యలు మంచివి కావంటూ తన అబిప్రాయన్ని నిర్మొహమాటంగా వెలిబుచ్చాడు.
   కొద్ది క్షణాల మౌనం తర్వాత చెన్నారెడ్డి అన్నాడు  "  తప్పదోయి దొరా  ! మనవాళ్ళు దెబ్బతింటావుంటే సూస్తా వూరకుండలేం గదా ! "
  " అభిమానం కొద్దీ సహాయం చేయటం వేరు .."
   ఎంతమంది మీద అభిమానం చూపగలం  ? "
  " ఏమైనా....  నువ్వు చేసేది  తప్పే .."
  " తప్పంటే ఎట్లా ? గతాన్ని గుర్తుజేసుకో... నువ్వు మాత్రం  పిల్చుకోలేదా బాంబులేసే మనుషుల్ని  !  గొడవలు జరిగి బాంబులేసికోనుంటే వాల్లు ఖాయంగా  ఎవురోకర్ని బేసి పోయేవాల్లేగద  !  "
   ఓబుళరెడ్డికి కోపమొచ్చింది.  " వాల్లకు వీల్లకు ఏం సంబంధం..?  వీల్లట్లా వాళ్ళు మాసుల్ను  సంపేందుకు రాలేదు. తోడొచ్చినారు ".
   " అంతా  అదేలే దొరా ! ఎందుకు రట్టు జేస్తావుగానీ. నేనేం జేసినా మనోల్లకే మేలు జేస్చాండగదా  ! నా దారిన నన్ను సాగనీ. గుంపు నిలుపుకోవాలంటే కొన్ని కొన్ని యిష్టం లేని పనులు గూడా చేయక తప్పదు మరి.  శ్రీ క్రిష్ణ భగవానునికే తప్పలేదంట....  రా..రా....రా  "   అంటూ జనంలోకి లాక్కుపోయాడు.
  చెన్నారెడ్డిలో  కొత్త వ్యక్తి  కన్పించసాగడు ఓబుళరెడ్డికి.

                                                                                                  ..............  సశేషం

                                                                                                            .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

      డబుల్ మర్డర్ సంఘటన సంచనలనం సృష్టించింది.
  వంకల్లోనో, డొంకల్లోనో దారికాచి చంపటమో, రాత్రిళ్ళు నిద్రబోయేవాళ్ళను నరకటమో కాకుండా పట్ట పగలు ప్రధాన రహదారి మీద పోలీసు సాక్ష్యంగా యుద్దవాతావరణాన్ని తలపిస్తూ కొట్లాడిన తీరు అంతటా చర్చనీయాంశమైంది.
   ఉన్నట్టుండి శివపురి ఓబుళరెడ్డి వార్తల్లోని వ్యక్తి అయ్యాడు
  టెర్రర్ సృష్టించిన మనిషిగా ముద్రబడిపోయాడు
  డబుల్ మర్డర్ కేసు దాదాపు నలభై ఐదుమంది మీద మోపబడింది.  వాళ్ళందర్నీ వెంటేసుకొని పోలీస్‌స్టేషన్‌కూ, కోర్టులకూ వెళ్ళి వస్తున్నాడు ఓబుళరెడ్డి
  ముందు భాగాన అతను నడుస్తోంటే  వెనక అతని గుంపంతా అనుసరిస్తూ వుండటం చూసే వాళ్ళకు కొంత భయాన్ని కలిగిస్తూవుంది. ఎవరూ చెప్పకుండానే, ఎన్నుకోకుండానే అతనొక ముఠానాయుకునిగా జనాల్లో ముద్రబడిపోయాడు.
  రోజు రోజుకు ఖర్చులు ఎక్కువవుతున్నాయి.
  పోలీసులకూ, కోర్టులకే కాకుండా జనాల ఖర్చు తడిసి మోపెడువుతోంది.  హోటల్ ఖర్చులు, బస్సు చార్జీలు భయపెడుతున్నాయి. కోర్టు వాయిదా వచ్చిందంటే చాలు వెన్నులో చలిపుడుతోంది.
  గ్రామంలో వైరి వర్గం దాదాపు సమిసిపోయింది.
  వ్యతిరేకులంతా వూరు విడిచారు.
  నారమ్మ తన స్థావరాన్ని పూర్తిగా కూతురి యింటికి మార్చింది.
  ఓబుళరెడ్డి పిండిగని నారమ్మ చేలోకి చొచ్చుకుపోయింది,  వాళ్ళిచ్చిన తృణమో ఫణమో తీసుకొని పొలం వాళ్ళకు రాసివ్వటం తప్ప గత్యంతరం లేని స్థితి వచ్చింది ఆమెకు.
  ఊరువదిలి  వెళ్ళిన చాలా మంది పొలాలు తక్కువ రేట్లకే ఓబుళరెడ్డి వర్గానికి దక్కాయి.
  ఓ సంవత్సరం గడిచేసరికి చుట్టుపట్ల పంచాయితీల్లో ఓబుళరెడ్డి మాటకు ఎదురులేకుండా పోయింది.
   కేసు రోజు రోజుకు జటిలమయ్యేకొద్దీ అతని పలుకుబడి పెరగసాగింది
  మరో ఆరునెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.
  ప్రస్తుత ఎమ్మేల్లే మీద జనాల్లో అసంతృప్తివుంది. జమీందారీ వంశానికి చెందిన ఆ వ్యక్తి ప్రజల సమస్యలని పట్టించుకోవటం లేదనీ, ధనవంతుల కొమ్ము కాస్తున్నాడనీ అపవాదు వుంది.
  అలాగని అతనితో పోటీకి దిగే దమ్మున్న మొనగాడు కూడ ఆ  తాలుకాలో కన్పించటం లేదు.
  అలాంటి తరుణంలో ఒకనాటి సాయింత్రం సమితిప్రెసిడెంటు చింతకుంట చెన్నారెడ్డి శివపురికి వచ్చాడు. వెంట టేకూరుకు చెందిన కమ్యూనిస్టు నాయకుడొకరున్నారు.
  రావటం తోటే ఓబుళరెడ్డినీ, పెద్దిరెడ్డినీ పక్కకు పిల్చుకొని మంతనాలాడే పని చేయలేదు. పరుపు పరచిన మంచమ్మీద కాళ్ళు బార్లా చాపి వెల్లకిలా పడుకొన్నాడు.  " సల్లగా వుంది మామా ! కండ్లు మూసుకొంటే చెప్పందే నిద్రబట్టేట్టుంది "  అన్నాడు పక్కనే వున్న పెద్దిరెడ్డితో.
  "  లోపల కలవరం లేకుంటే సల్లదనం సుగించినట్టే వుంటదోయ్ ! రెండు కాల్లు  వొక్కసోట బెట్టి నిలబడేంత కుదురుదనం వుండాల గద ! ఎప్పుడూ కేసులూ.. వాయిదాలూ....  వాయిదా వస్తాందంటే సాలు బయమేస్తాందోయ్ దొరా ! "  చెప్పాడు పెద్దిరెడ్డి.
  " తప్పదే పెద్దమనిసీ !  అవన్నీ భరిస్తేనే గద నాయుకుడయ్యేది,  మొన్న రొవ్వంత ( కొద్దిగా)  పన్జరగబట్టి గాదూ - సుట్టు పక్కల పల్లెలకంతా మొగోల్లయింది మీరు "
  " అది జరక్కున్నే మొగోల్లమేలే.. "  ఇంట్లోంచి వస్తూ అన్నాడు ఓబుళరెడ్డి.
  " సరె...సరేలే... "  అంటూ చెన్నారెడ్డి రాగం తీయటంతో నవ్వుకున్నారు అందరూ.
  అంతలొ కాఫీ వొచ్చింది.
  గ్లాసు అందుకొంటూ  " ఉడుకు నీల్లతోనే సరిపెట్టాలనుకొన్నావాందోయ్ ? "  ఓబుళరెడ్డి కేసి చూస్తూ అన్నాడు చెన్నారెడ్డి
  " ఏం గావాలో సెప్పుమరి... "
   " సెప్పాల్నా మల్లా.... వొచ్చి మంచమ్మీంద పండుకొన్నేమంటే కోల్లు కోయ్యాలనె తెల్దా ? అల్లుండ్లకు యివేనా మర్యాదలు.."  అన్నాడు.
   " నీకింత తీరుబాటొచ్చిందని నాకేం తెలుసు దొరా  "  పెద్దిరెడ్డి అన్నాడు.
  వాల్లు పరాచికాలు ఆడుకొంటూ వుండగానే కోడిపుంజు అరుపులు విన్పించాయి.  చావుకేకలు వేస్తుంది అది.
  అటుకేసి చూసే సరికి తుంటకర్ర విసరి పుంజు కాళ్ళు విరగగొట్టి దాన్ని వొడిసి పట్టుకొని తెస్తున్నాడు బాలుడు.
  "  అదీ.. అల్లుడంటే  అట్లుండాల... "  మెచ్చుకోలుగా చూశాడు.
ఉడికుడుకు అన్నమూ కోడిమాంసముతో రాత్రి భోజనం రుచికరంగా ముగిసింది.
  చెప్పాపెట్టకుండా చెన్నారెడ్డి వూడిపడటం, రాత్రికి తమయింటివద్దే మకాం  చేయటం కొంత అయోమయంగానే వుంది పెద్దిరెడ్డికి.
  భోజనానంతరం తాంబూలాలు నములుతూ అతని అయోమయానికి తెరదీశాడు చెన్నారెడ్డి.
    " తాలుకా రాజకీయం మీకు తెలియందిగాదు. ఇప్పుడుండే ఎమ్మెల్లే నాగిరెడ్డి ఎవ్వరికీ పలకడం లేదు, పల్లెలకేమీ సాయం సెయ్యడం లేదు. ఆయప్ప ఫ్యాక్టరీలూ, గనులూ..బస్సులూ..లారీలూ.. ఆదాయం.. అదితప్ప తాలుకా జనం బాగోగులు పట్టలేదు. ఆయప్పకు ఓట్లు గుద్ది పోసేందుకు మనం మనం పల్లెల్లో కొట్లాడుకొని సస్తాండం. ఆయప్ప మనకేసులు పట్టించుకోవడం లేదు... యీ సంగతి గురించి మాట్లాడ్డానికే వొచ్చినా మామా  ! "  చెప్పాడు.
   తర్వాత కమ్యూనిస్టు నాయకుడు గొంతువిప్పాడు తాలుకా పరిస్థితి గురించి వివరించాడు. పల్లెజనాల అగచాట్లు గురించి ఏకరువు పెట్టాడు. అసమ్మతితో వుండే గ్రామనాయకుల బలాబలాలు బేరీజు వేశాడు. అందరూ కలిసి ప్రజల కష్టాలు తెలిసిన మనిషినొకన్ని అసెంబ్లీకి నిలబెట్టి నాగిరెడ్డి నాయికత్వాన్ని కూలదోయవలసిన అవశ్యకతను నొక్కి చెప్పాడు.
   తమ అభ్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలన్నదే ఇప్పటి ప్రశ్న.
  " మీరు మీరు ఆలోచించండి నాయనా ! "  పెద్దిరెడ్డి అన్నాడు.
  " పరిస్థితి అట్లా లేదయ్యా ! "  చెప్పాడు కమ్యూనిస్టు వ్యక్తి.
  " మీరు ఎవరి పేరు ప్రతిపాదించితే వాళ్ళే అభ్యర్థి  అందులో సందేహమే లేదు...."
  తర్వాత కొంతసేపు తర్జన భర్జన పడ్డారు.
  నిశితంగా చర్చించిన తదుపరి... చెన్నారెడ్డిని అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థిగా  తాను ప్రతిపాదించన్నట్లుగా  "  ఓబుళరెడ్డి ప్రకటించాడు.
  తాలుకా స్థాయి జరిగే సమావేశంలో అదే గొంతుకతో ప్రతిధ్వనించాలని కూడా తీర్మానించుకొన్నారు.
  మరో వారం రొజులకు బద్వేలులో తాలుకా స్థాయి సమావేశం జరిగింది.
  అనుకొన్నట్లే చెన్నారెడ్డి పేరును అసెంబ్లీ అభ్యర్థిగా ఓబుళరెడ్డి ప్రతిపాదించాడు. సభ్యులంతా ఏకగ్రీవంగా అమోదించాదు.
  ఓబుళరెడ్డి భుజస్కంధాలపై అదనపు భారం పడింది.
  గతంలో లాగా ఎలక్షన్లు చేసేదానికి లేదు
  ఈ దఫా సర్వశక్తులూ వినియోగించాలి.
  అవసరమైతే నెత్తురు పూసికొని చేయాల్సివుంటుంది, మొక్కుబడిగా తన వూర్లో తాను ఓటింగు జరిపించటం కాదు - తన బంధువులు, మిత్రులు, తెలిసిన వాళ్ళున్న చోటల్లా పాగావేయాలి, ఏమేరకు అవకాశముందో లెఖ్కగట్టాలి, పూర్తిస్థాయిలో ప్రయత్నించి చెన్నారెడ్డికి ఓట్ల రాసుల్ని పెంచాలి.
  ప్రాంతీయ పార్టీ అధ్యక్షుణ్ని కలిసాడు చెన్నారెడ్డి.
  బలమైనా నేతల చేత కూడా చెప్పించాడుట
  రాష్ట్రంలో స్వాంతంత్ర్యానంతరం నుండి పాతుకుపోయిన జాతీయపార్టీని ఆటకట్టించే దమ్ము ప్రస్తుతం ప్రాంతీయ పార్టీకే వుంది.
   నామినేషన్ల పర్వానికి పదిహేను రోజుల ముందుగానే అభ్యర్థుల పేర్లు ప్రకటించాయి అన్ని పార్టీలు.
  చెన్నారెడ్డికి ప్రాంతీయ పార్టీ టికెట్ రావటం చర్చనీయాంశమైంది తాలుకా ప్రజల్లో.
  నామినేషన్‌రోజు  బద్వేలు టౌనంతటికీ పెద్ద జాతరవాతావరణం కల్పించాడు చెన్నారెడ్డి.
  తాలుకా నలుమూలల్నించి తన అభిమానులు వచ్చేలా ఏర్పాట్లు చేసుకొన్నాడు.
  శివపురి ఓబుళరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన జనమే టౌనంతా ఆక్రమించారు,  అన్ని ప్రాంతాలనించి వచ్చిన వాళ్ళు సగం మందుంటే..ఓబుళరెడ్డి మనుషులు సగం మంది వున్నారు.
  చెన్నారెడ్డి చాలా ఆనందించాడు. ఓబుళరెడ్డి వద్దకెళ్ళి  "  ఓహ్  మామా ! ఎలక్షనంతా నీదేనోయ్ ! నేను గెల్చినా ఓడినా ఆఘనత నీకే..."  అన్నాడు అతని చేతులు పట్టుకొని ఆర్ద్రంగా.
  ఓబుళరెడ్డికి మరింత భారం తలపై పడింది.
  రాత్రనక పగలనక పల్లెలు తిరగసాగాడు. ప్రత్యుర్థులుగా వున్న వాళ్ళను తమవైపుకు మల్లించుకొనేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నాడు,  తన బంధువుల్ని వెంటేసుకొని ప్రత్యర్థి వర్గంలోని తమ వాళ్ళను తన వర్గంలోకి చేర్చుకొనేందుకు సర్వశక్తులు వొడ్డి కృషి చేయసాగాడు.
  ఏవూరికైతే వెళ్ళాలనుకొంటాడో, ఆ వూర్లో ఎవరినైతే తన వైపుకు లాగాలని ప్రయత్నం చేయబోతున్నాడో  అ వ్యక్తి తాలుకా బంధువుల వివరాలు సేకరించటం, వాళ్ళను పిల్చుకొని అందరూ కలిసి ఆ వూరికి వెళ్ళటం,  జారిపోయేందుకు సాద్యం కాని విధంగా వలపన్నటం, ఒకరోజు కాకుంటే వారంరోజులైనా అతని వద్దకు తిరిగి తెల్లార్లూ మేలుకొని పంచకాసి అయినా అతని మనసు కరిగించి పార్టీలోకి రప్పించుకోవటం...డబ్బుకు లొంగే వాళ్ళకు ఏదోక ఆశ చూపటం, కేసులు వగైరాలున్నవాళ్ళను ఆదుకుంటామని నమ్మకంగా వరమివ్వటమో, అంతుచూస్తామని చెదిరించటమో..ఎన్నిరకాల వ్యూహాలున్నాయో అన్నింటిని ప్రయోగించి రాక్షసంగా కృషి చేయసాగాడు.
  ఓబుళరెడ్డి ..చెన్నారెడ్డి ప్రమేయం లేకుండా తన స్వంతంగానే వర్గాన్ని సమీకరించాడు.  తన వూరికి దగ్గరగా ఐదరు వూర్లు ఏకపక్షమయ్యాయి, మిగిలిన పదిహేను వూర్లల్లో మెజారిటి శాతం తమదే ఐంది. తన పరిధిని ఇంకా విసృతం చేసుకొంటున్నాడు అతను.
  ఓబుళరెడ్డి పర్యటించే గ్రామల్లో తను కాలుబెట్టాల్సిన అవసరం లేదనే సంగతి తెలిసిపోయింది చెన్నారెడ్డికి. దాంతో అతను తాలుకాలోని మిగతా ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టేందకు వీలు కలిగింది.  అవతలి వర్గం వాళ్ళను బలహీన పరిచేందుకు నీతి, న్యాయం, ధర్మంలనే పదాలకు అతీతంగా కూడా కృషిచేశాడు.
  ఎలక్షన్ దగ్గరబడింది.
  బలమైన వర్గంతో తను ఢీకొనబోతున్నాడు కాబట్టి అక్రమ మార్గాల్ని అనుసరించటానికి కూడా వెనుదీయలేదు చెన్నారెడ్డి.
  విస్తృతంగా నాటుబాంబులు తయారు చేయించాడు.
  అవసరమైనా చోటల్లా ప్రయోగించమని ప్రోత్సాహించాడు.
  ఓబుళరెడ్డి  వద్దంటోన్నా  వినకుండా  అత్మరక్షణకైనా కావాలిగదా అనే సాకుతో అతని ఏరియాకు కూడా సప్లై చేశాడు.
  ఎలక్షన్ రోజున ఓబుళరెడ్డి విజృంభించాడు.
  తన వాళ్ళను వెంటేసుకొని పల్లె పల్లె తిరిగాడు. అవతలి వర్గంవాళ్ళకు ఏజంట్లు కూడ లేని ఐదుపల్లెల్లో తోంభైశాతం పైగా ఓట్లు గుద్దేశాడు.
  ప్రత్యర్థి ఏజంట్లు వున్న వూర్లల్లో సైతం మద్యాహం నించి హుషారు చేశాడు. నయాన్నో భయాన్నో ఏజంట్లను వొప్పించి మిగిలిన వోట్లన్నీ చెన్నారెడ్డికి వేయించాడు.
  చెన్నారెడ్డి విషయమైతే చెప్పాల్సిన పనిలేదు.
  తెల్లవారు జామునే లేచాడు.
  భార్యచేత  వీరతిలకం దిద్దించుకొని గోచికట్టుకొని జీపులో కూచున్నాడు.
  సాయింత్రం ఏడుగంటల దాక గోచి విప్పలేదు.
  అవకాశమున్న చోటల్లా బూతుల్లో జొరబడి ప్రత్యర్థి ఏజంట్లను బైటకు లాగి రిగ్గింగ్ చేస్తూ పోయాడు.
  నాగిరెడ్డి కూడా తక్కువ తినలేదు.
  చెన్నారెడ్డి రిగ్ చేసిన బూతులన్నిట్లో జొరబడి బ్యాలెట్ బాక్సుల్ని బావుల్లో వేయటమో, ఇంకు, నీళ్ళు పోయటమో చేస్తూపోయాడు. సాయింత్రం దాకా ఒకరి ప్రయత్నాల్ని మరొకరు అడ్డుకోవటం, హుషారు చేసుకోవటం జరిగిపోయింది.
  ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగిన బూతులన్నిట్లో భారీ బందోబస్తు మద్య రీ ఎలక్షన్ జరిగింది.  ఓబుళరెడ్డి ఏరియా తప్ప తాలుకా సాంతం సమస్యాత్మకమే అయ్యింది.
  పోలింగ్, రీపోలింగ్ రెండు సార్లు కూడా భారీగా బాంబులు పగిలాయి. చెన్నారెడ్డి అయితే ఆహారం నీళ్ళు కూడా మరచిపోయి సాయింత్రం దాకా వీర విహారం చేశాడు.
  అతనికి తృప్తిగా వుంది.
  నాగిరెడ్డి అనుభవం ముందు వూడలు దిగిన అతని రాజకీయం ముందు తను సరిజోడిగా నిలిచాడు. ఇక తనకు మిగిలింది ఓబుళరెడ్డి కృషి. అతని ఓట్లతో తను నిస్సందేహంగా గెలువగలడు.
  ఈ  ఎలక్షన్లతో బద్వేలు పేరు రాష్ట్ర ప్రజలందరీ నోట్లో నానింది. పగిలిన బాంబులు, జరిగిన గొడవలు, అత్యధిక సంఖ్యా బూతుల్లో రీపోలింగ్‌తో ప్రత్యేక స్థానం సంపాదించింది.
  చెన్నారెడ్డి, ఓబుళరెడ్డిల చేతి కష్టం వృధాకాలేదు.
  నాగిరెడ్డి పైనా 15 వేల మెజారిటితో గెలుపొందాడు, అందులో దాదాపుగా తొమ్మిదివేల ఓట్లు ఓబుళరెడ్డి గుద్ది పోసినవే.
  పల్లెపల్లెనా సంబరాలు..పండుగ వాతావరణాలు... ఊడలు బాతు అవినీతి రాజకీయానికి సమాధి....కొత్త నాయకత్వం మీద ఎన్నో ఆశలు...  ఒక మామూలు వ్యక్తి ఎమ్మేల్లేగా గెలవటం పట్ల ఎన్నెన్నో ఆశలతో కూడుకొన్న సంబరాలు,  రాక్షస సంహారం జరిగినంత ఆహ్లాదక సంబరాలు.
  తాలూకాలో పాతశకం అంతరించింది.
  కొత్తశకం ప్రారంభమైంది.
  మరోసారి ఓబుళరెడ్డి యింటికెళ్ళాడు చెన్నారెడ్డి.
  ఈ దఫా ఎమ్మెల్లే హోదాతో వెళ్ళాడు.
  తను గెలవటానికి ప్రధాన కారణం అతనేననీ, యీ ఎమ్మేల్లే పదవి అతని కృషి పలితమేననీ మనసారా ప్రకటించాడు.
  చెన్నారెడ్డి తమ వూరికి వచ్చిన సందర్భంగా పొట్టేళ్ళు కోయించి అందరికీ విందు చేశాడు ఓబుళరెడ్డి.

                                                                                                   ...........  సశేషం

                                                            యాగంటి

      కర్నూల్ జిల్లా బనగాన పల్లెకు 15 కి.మీటర్ల దూరంలో యాగంటి గ్రామంవద్ద " యాగంటేశ్వర " అని ప్రసిద్ద శైవపుణ్యక్షేత్రం ఉన్నది. ఈ క్షేత్రమునకు వెనుక భాగామున ఎత్తైన " ఎర్రమల " కొండలు, గుహలు ఉన్నవి. ఇక్కడి ఆలయంలో ఈశ్వరుడు లింగాకారములో గాక విగ్రహరూపంలో వుండడం ఒక ప్రత్యేకత. నందిరూపంలో విగ్రహం భయంకరంగా ఉన్నది,  భూమిని చీల్చుకొని నందీశ్వరుడు వెలికి వచ్చాడని. అచట ఆలయము నిర్మించి పూజలు జరిపారని అక్కడి స్థానికుల కథనం. ఇక్కడి ఈశ్వరుడిని నందీశ్వరుడు అని పిలుస్తున్నారు. ఇక్కడే అగస్త్య మునీశ్వరులు చేసిన తపస్సుకు మెచ్చి మునీశ్వరులు కోరిన విధంగా ఏకశిలలో శ్రీఉమామహేశ్వర్లుగా వెలిసినారని, లింగాకృతిలో కాకుండా శిలాకృతిలో వెలసిన శివక్షేత్రము భారతావనిలో ఎచ్చటా లేదని ప్రతితి.

       ఇక్కడి నిర్మాణల శైలినిబట్టి క్రీ.శ 7.8 శతాబ్దములలో పల్లవులు, చోళులు, చాళుక్యులు,  ఒకరి తర్వాత మరొకరు నిర్మించి, కొన్నినిర్మణాలను అసంపూర్తిగా వదిలివేయగా... వాటిని క్రీ.శ. 13.,14 శతాబ్దాలలో విజయనగర ప్రభువులు పూర్తిగావించారని విశ్లేషుకుల అంచనా. నేనిక్కడికి రావడానికి మరో ముఖ్యమైన కారణం..ఈ ఆలయ ముఖమండపములోని ఈశాన్య భాగములోనున్న నందీశ్వరుడు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాడట. అక్కడున్న పరిస్థితిని చూస్తే నిజమనేనిపిస్తుంది..! నందీశ్వరుడు చుట్టూ వున్న నాలుగుస్థంబాల మంటపం నిండా నందీశ్వర విగ్రహం నిండి ఉన్నది..రెండు స్థంబాలు కొద్దిగా పక్కకు జరుగుతున్నాయి..అవి పడిపోకుండా కొన్ని బండరాళ్ళును ఆసరగా వుంచారక్కడ.

      మీరు ఫోటోలలో చూస్తే అర్థమవుతుంది. సుమారు 90  సంవత్సరాలక్రితం ఆ నాలుగు స్తంబాలలోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షణలు చేసేవారట..!! కాని నేడు మాత్రం అలాంటి అవకాశమేలేకుండా పూర్తిగా మంటపం నిండుగా పెరిగిపోయాడు. భారత పురావస్తుశాఖ వారి లెక్కల ప్రకారం ప్రతి 20 ఏళ్ళకు ఒక అంగుళం పరిమాణంలో పెరుగుతూ వస్తున్నదట ఈ నందీశ్వర విగ్రహం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కాలఙ్ఞానంలో " యాగంటి బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగానంతమున లేచి కాలుదువ్వి రంకె లేసేను " అని వ్రాసారట. కాబట్టి ప్రస్తుత మీడియాలో చూపుతున్న 2012 గోల గురించి జనమంతా మరిచిపోవచ్చు..!!


       ఈ దేవాలయం వాయువ్యదిశకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ సహజంగా వెలసిన అగస్త్య పుష్కరిణి కనపడుతుంది, నేనెల్లిన సమయంలో మన పూర్వీకులు పుష్కరిణిలో జలకాలాడుతున్నారు..  మన పూర్వీకులంటే అర్థం కాలేదా..?  అదేనండి మన వా’నరులు’పుష్కరణీకి రెండు వైపులున్న ప్రాకారముల మీద నుండి డిల్లీలో జరిగిన కామన్‌వెల్త్ ఆటలలో స్విమ్మింగ్ డైవ్ చేసినట్లుగా ఈ వానరలు చేస్తుంటే చూట్టానికి బలే ముచ్చటగా వుంది..ముందే కోతులు..ఇక మనుషులు ఎవ్వరూ లేకపోవడంతో వాటి ఇష్టారాజ్యంలాగ డైవింగ్..స్విమ్మింగ్..యమ ఫాస్ట్‌గా చేస్తున్నాయి.
      ఈ క్షేత్రమునకు 15 కి.మీ దూరములోనున్న " ముచ్చట్ల " క్షేత్రమునుండి పర్వతశ్రేణుల గుండా నీరు ప్రవహించి ఇక్కడి అగస్త్య పుష్కరణిలో కలుస్తాయి. ఈ పుష్కరణీలోను సహజసిద్దమైన నీటి ఊట ఉన్నది స్వచ్చంగా తేట తెల్లగా ఉన్నాయి నీరు. దీనికి ఉత్తరభాగానున్న పర్వతరాయికి దేవనాగరలిపిలో ఆ విశేషాలు చెక్కబడి వున్నాయి. ఇక్కడ నుండి ఆలయానికి ముందుభాగానున్న పెద్దకోనేరుకు చేరుకుంటాయి. అక్కడ నుండి ఆ క్షేత్ర పరిసరప్రాంతంలో నున్న 20 ఎకరాల భూమిలో సాగుకు మాత్రమే పరిమితమై ఇంకిపోతున్నాయి.


      ఈ క్షేత్రమునుకు వెనుకభాగాన ఆలయము చుట్టూ అర్థచంద్రాకరాంలోనున్న " ఎర్రమల " కొండల వద్దకు చేరుకుంటే అక్కడ మూడు గుహలు 50 అడుగుల మద్యదూరంతో పక్కపక్కనే వున్నవి. మొదటిగుహను " రోకళ్ళ గుహ " అని పిలుస్తున్నారు. చాలా పెద్దగుహ లోపలికి వెళ్ళడానికి తాపలు వున్నాయి కాకపోతే ఏటువాలుగా కంటే కాస్త నిటారుగా ఉన్నాయి. అవెక్కి పైకి వెళ్ళాక అక్కడ ఒక శివలింగం కనపడుతుంది. అగస్త్యముని శివలింగప్రతిష్టాపన చేసి అక్కడే  ధ్యాన సాదన చేసారని అక్కడి వారి విశ్వాసం.

      రెండవది వేంకటేశ్వర గుహ. ఇక్కడ వేంకటేశ్వర విగ్రహ ప్రతిష్టాపనలో జరిగిన కొన్ని పొరబాటుల వలన, విగ్రహపతిష్టకు అనర్హముగా భావించి విగ్రహాన్ని ఇక్కడ బద్రపరిచారు. మూడవది శంకర గుహ.. ఇక్కడ ఏంతో మంది మునీశ్వరులు తపస్సు చేసారని చెబుతున్నారు..తర్వాత చాలా మంది ప్రశాంతముగా ధ్యానము  చేసుకొనటకు ఈ గుహను ఉపయోగించారట.


















      ఇక్కడి గుహలలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి తపస్సు చేస్తూ కాలఙ్ఞానము రచించాడనీ.. ఆ సమయములో ఆయన నోట " ఏన్ కంటిని " అన్న మాట వెలుబడనదనీ అప్పటినుండి ఈ ప్రాంతాన్ని " ఏన్ కంటిని " అనిపిలుస్తూ...కాలక్రమేనా " యాగంటి " గా రూపాంతరం చెందిందని అంటున్నారు. ఇక్కడి గుహ లోపలి భాగములో కాలఙ్ఞాన గ్రంథము పూర్తి ప్రతి లభ్యము కావచ్చని కొందరి భావన.




       బనగాన పల్లె నుండి ఈ క్షేత్రానికి వెళ్ళే మార్గమద్యలో 12 వ కి.మీటర్ వద్ద కుడి వైపున చిన్న గుట్టాలంటి ఎత్తైన ప్రదేశంలో  పాతకాలం నాటి ఒక భవంతి కనపడుతుంది. చూడడానికి గంభీరంగా ఉంటుంది. 400 సంవత్సరాల క్రితం బనగానపల్లె నవాబు తన ప్రేయసికోసం నిర్మించిన భవంతి. ప్రస్తుతం అది హైదరాబాద్‌లో ఉన్న నిజాం నవాబుల ఆదీనంలో ఉన్నది. వాళ్ళు ఎవరోగాని ఈ భవంతి ఆలనాపాలనా చూడట్లేదు. వెలుపలి భవనమంతా చూడడానికి చాలా గంభీరంగా ఉంటే..లోపల మాత్రం చాలా ధారుణంగా ఉంది. రాత్రిల్లు అసాంఘీక మనుషులొచ్చి తాగి తందనాలాడి లోపలి గదులన్ని మురకిపట్టించారు.  మొదటి అంతస్తులో వున్న హాలు గదియెక్క  పైకప్పు పడిపోయి ఉన్నది. అక్కడొక మనిషిని వున్నారు కాని..అతనివల్ల ఆ భవనాన్ని ఎటువంటి రక్షణ లేదు. కాని భవనం మొత్తం రాతితో నిర్మించారు.  ఇప్పటికైనా భారత పురావస్తు శాఖ వారు ఈ భవనాన్ని స్వాదీనం చేసుకొని, మరమత్తులు చేసి ఒక యాత్రాస్థలంగా మారుస్తే బాగుంటుంది.

మరి కొన్ని ఫోటోస్ కింద చూడండి.






                                                      
                                                           -  మహానంది  -

      ఈ క్షేత్రం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రాయలసీమప్రాంతంలోనే గాక కన్నడ, తమిళ రాజ్యాలలో కూడ ప్రాచుర్యం పొందింది. నంద్యాల మండలమునకు 12  కి.మీ దూరాన నల్లమల కొండల్లో ప్రకృతిసిద్దమైన సుందరప్రదేశమున అర్థచంద్రాకారముగా నున్న ఒక కొండవొంపులో ఈ క్షేత్రము వున్నది. ఇక్కడకు చుట్టుపక్కల పదహైదు కిలోమీటర్ల పరధిలో ప్రథమనంది, నాగనంది, వినాయక నంది, శివనంది, సూర్యనంది, విష్ణునంది, సోమనంది అని ఎనిమిది నందీశ్వర క్షేత్రాలున్నవి, మహానందితో కలిపి నవనంది క్షేత్రాలు అంటారు. వీటి ప్రాదుర్భవాన్ని గురించి ఎన్నో కథలు ప్రచారంలో వున్నవి. ఈ నవనందీశ్వరాలయములు ప్రాచీన చాళుక్యుల కాలమునాటివని కొందరంటారు.
     మహా నందీశ్వరాలయనికి చుట్టూ " తిరుచుట్టు మాళియ " అనబడే చుట్టు మండపము వున్నది. మద్యలో కళ్యాణమంటపాదులు ఉన్నవి. ఆలయ విమానం అంతస్తులుగా విభజింపబడి నిర్మితమైంది. ప్రతి అంతస్థు అమలక శిలతో శిఖరం వలె వేరు చేయబడింది, అన్ని అంతస్తులు కూడి మహావిమానమేర్పడి వున్నది. ఆలయంలో స్వామివారిని అభిషేకించిన జలము బయటకు రాకుండా లింగం అధోభాగంలో చేరి అచట గల జలఊటలో కలిసిపోతుంది. లింగము కిందనుండి ఎల్లవేళలా బుగ్గవలే నీటి ప్రవాహం వస్తుంటుంది, వాటిని మూడు కుండముల గుండా వెళ్ళే ఏర్పాట్లు చేసారు మనం ప్రదానఆలయ ప్రాంగణములోనికి ప్రవేశించగానే స్వచ్చమైనా నీటితో నిండిన రుద్రకుండము ప్రధాన అలయానికి ముందువైపున  కనపడతుంది. దీని చుట్టూ రాతితో ప్రాకారం కట్టినారు. తూర్పు వైపున అమర్చిన నంది నోటిలోనుంచి నీరు ఈ కుండములోనికి ప్రవహిస్తుంది, వచ్చిన భక్తులు, యాత్రికులు ఇక్కడ జలకాలాటలు అడతారు.
     ఇక్కడనుండి తూములగుండా నీరు బయటకొచ్చి బ్రహ్మ, విష్ణు కుండాలను చేరుకుంటుంది. యాత్రికులు బయటి ఆలయప్రహరి ముఖద్వారం నుండి పెద్ద పెద్ద చెట్లతో వున్న విశాలమైన ఆలయప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఎదురుగా వున్న ఆలయమంటపంకు వెళ్ళే దారికిరువైపుల ఈ  బ్రహ్మ,విష్ణు కుండాలను చూడవచ్చు. ఇక్కడ కూడ భక్తులు స్నానాలు చేస్తారు. చాలా స్వచ్చంగా ఉంటాయి ఇక్కడినీరు, నీటి అడుగున వున్న నేల చాలా స్పష్టంగా కనపడుతుంది..అంత తేటతెల్లగా ఉంటాయి నీరు.. అక్కడ ప్రభుత్వంవారు " స్నాం చేయు భక్తులు దయచేసి సబ్బును ఉపయోగించారాదు, బట్టలు ఉతకరాదు " అని బోర్డు పెట్టినా ’ అబ్బే మనం ఏది చేయవద్దని చెబుతామో అదే చేస్తాము... అదీ మన భారతీయ సంస్కృతి ’  ఆలయసిబ్బంది ఎంతమందికని చెబుతారు..చెప్పి..చెప్పి విసిగి వదిలేసారు..పాపం.!  జనాలు మాత్రం సబ్బును ఉపయోగించడమే..బట్టలు ఉతకడమే..ఇంత చేస్తున్నా కొందరు భక్తులు ఆ నీటిని మ్రోక్కుకొని కాసిన్ని నోటిలో వేసుకొని వెళ్తున్నారు..! అది చూసిన నాకు ఒళ్ళు జలదరించింది...నేను నీటి దగ్గరికి వెళ్ళి చూస్తే.. మనుషులు అంత మలినం చేసినా ఆ నీరు మాత్రం తన స్వచ్చతను కోల్పోలేదు..’ చాలా స్వచ్చంగా అలానే ఉన్నాయి..!

   ఆ నీరు అక్కడ నుండి కాలువల ద్వారా అరటితోటలకు, పంటపొలాలకు ఉపయోగపడుతున్నది. ఈ నీటిద్వార రెండు వేల హెక్టారుల మేరకు పంటభూములు సస్యశ్యామలమవుతున్నది. అది నిజమేననిపిస్తుంది నంద్యాల పట్టణములోకి అడుగుపెట్టగానే ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చుక్కరటిపండ్లు కనపడతాయి. నంద్యాల నుండి మహానందికి వెళ్ళే దారిపొడవునా అరటితోటలు రహదారికి ఇరువైపులా ఉన్నాయి.








      చిన్న సూచన :   పైనున్న ఫోటోస్ వైడ్ స్క్రీన్ వున్న మానిటర్‌లలో హారిజాంటల్‌గా సాగదీసినట్లుగా కనపడతాయి..వారు మాత్రం తమరు చూడాలనుకున్న ఫోటో మీద రైట్ క్లిక్ చేసి మరో విండో ఓపన్ చేసుకుంటే అక్కడ మీ స్క్రీన్‌కి సరిపడా సరైనా ఫోటో వస్తుంది.

                                                                                                             .............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

   ఉదయం ఎనిమిది గంటల్లోపలే సద్దినీల్లు తాగి ప్రయాణమై పెద్దిరెడ్డి యింటిముందు పోగయ్యారు కోర్టు వాయిదాకు వెళ్ళాల్సిన ఇరువైమంది జనం.
  బాలుడు మాత్రం పొద్దున్నే గనివద్దకెళ్ళాడు - తాను అక్కణ్నించే బసెక్కి రాగలననీ - కోర్టు సమయాన్ని అందుకోగలననీ.
    తొమ్మిది గంటలకు బస్సు వూర్లోకొస్తుంది.
  తిరిగి సాయింత్రం మరో ట్రిప్పు. - అంతే -
  ఊర్లోకి, ఒంటికొట్టానికి టికెట్టులో తేడా అర్ధరూపాయి,  ఈ కొద్దిదూరం నడిస్తే పదిరూపాయిలు మిగులుతుందిగదా అని ఓబుళరెడ్డి ఆలోచన.
  " గంట టైముంది రోడ్డుమీదికి పోతే యింగోక బస్సు ఏదైనా దొరుకుద్ది,  బెన్నేపోయి (తొందరగా = బెరీన, బెన్నే)  లాయర్ను కలవొచ్చు "  అంటూ అందర్నీ లేవదీసి దారిబట్టాడు.
  ఒంటికొట్టం స్టేజికి చేరుకోవాలి కాబట్టి వూరుచుట్టి బస్సుదారి వెంట మెల్లిగా నడుస్తున్నారు.
  గ్రామంలోని కొన్ని ఇళ్ళల్లోంచి వాళ్ళ కదలికల్ని  నిశితంగా గమనిస్తున్నాయి చాలా కళ్ళు.
  వాళ్ళు వూరుదాటి  సగం దూరం నడిచేసరికే నారమ్మ వర్గీయుల ఇళ్ళల్లోంచి పుట్టలు పగులగొట్టుకొన్నట్లుగా జనం బైటబడి వీధుల్లోకీ రాసాగారు.
  దాదాపు  అందరూ  కొత్తవాళ్ళే.
  దండోరుపల్లెకు చెందిన వాళ్ళూ, తమ తమ బంధువుల సంబంధీకుల పధకం ప్రకారం రాత్రే వచ్చి ఒక్కో యింటికి ఐదునించి  పది మంది దాక దాక్కుని వున్నారు.
  దాదాపు వందమంది జనం.
  అందరి చేతుల్లో ఈటెలు. గొరకలు, కత్తులులాంటి ఆయుధాలు, మరికొందరి కొందరు ప్రత్యేకమైన వ్యక్తుల వెంట బాంబులు బక్కెటలు.
  పెద్దిరెడ్డి వర్గం బస్సెక్కుతారని వాళ్ళు భావించారు.
  బస్సును ఆపటం సులభం కదా  !.
  పథకం కొంత దారి తప్పింది.
  ఊరుదాటి ఒంటికొట్టం కేసి కదలుతూ వున్నారు వందమంది జనం.
  ఒంటికొట్టం వద్దకెళ్ళిన తర్వాత ఎందుకో వెనక్కి తిరిగి చూసిన పెద్దిరెడ్డి గుంపుకు వెనకనించి వస్తోన్న జనసంఖ్య కన్పించి అదిరిపడ్డారు.
  "  అయ్యా !  ఆనాకొడుకులు మందినేసుకొని మనమీదికి వస్తాన్నెట్టుంది "  ఆదుర్దాగా అన్నాడు వెంకటరెడ్డి.
   "  అంతా కొత్తమాసులే,  రేత్రి వూరునిండా దించినట్టుండాది. అందరిసేతల్లో కొరముట్లుండాయి.  ఇప్పుడెట్టా జెయ్యాల మామా  ? "  మరో వ్యక్తి గొంతునిండా భయం.
  "  జనం జాస్తిగుండారు (ఎక్కువగా)  సేతల్లో ఆయుధాలుండాయి...అవిగో ఆపక్క బక్కెట్లు గూడా పట్టుకొస్తావుండారు.  అంటే బాంబులు గూడా తెస్చాండారు, మనకాడ సేతికట్టెలు కూడా లేవు రెడ్డోరు !.. తప్పించుకొనొపోతే బతుకుతాం..రాండి..పరుగెత్తుదాం రాండి..ఇట్లా గనులకాడికన్నా పోదాం..రాండి.."
   " నోర్ముయ్యిరా  ! "  వెంటనే అడ్డుకొన్నాడు ఓబుళరెడ్డి. అతను కూడా వచ్చే జనాల్ని చూస్తున్నాడు. వాళ్ళ చేతల్లోని ఆయుధాల్ని గమనిస్తున్నాడు. పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రయిత్నిస్తున్నాడు.
   " వాల్లు  మనకోసమే వొచ్చేవాళ్ళే అయినా - యీ బస్సులు తిరిగే దోవలో, యీ వూరినడుమ, జనాల రద్దిముందు మనమీద అటాక్ చేయర్లే ! మీకా భయం పన్లేదు, ఎవ్వరూ పరిగెత్తేపని పెట్టుకోగాకండి " చెప్పాడు.
  పక్కనే వున్న బలరామిరెడ్డి అతని మాటలకు వత్తాసు పలికాడు.
  వాళ్ళ మాటలకు అడ్డుచెప్పలేకపోయారు జనం.  భయం భయంగా గుండెలు బితుకు బితుకు మంటోండగా రోడ్డుమీదే నిల్చుండిపోయారు.
  వెనకవచ్చే గుంపు - వాళ్ళకు వందగజాల దూరానికొచ్చి ఆగింది.
  వాళ్ళక్కూడా అనుమానంగా వుంది - ఇంతమంది జనాన్ని చూసి కూడా పెద్దిరెడ్డి గుంపు పారిపోకుండా నిల్చుందంటే వాళ్ళవద్ద బలమైన ఆయుధాలేమైనా వున్నాయేమోనని.
  ఇక్కడే అటాక్ చేద్దామా ? లేక బద్వేలులో అటాక్ చేద్దామా ?  అని చర్చించుకొంటున్నారు.
  ఇక్కడ దాడిజేస్తే పల్లెజనాల రద్దీలో తప్పించుకు పారిపోతారేమోనని అనుమానం. బద్వేలులో కోర్టు ముందరో, బస్టాండు వద్దో అయితే అందరు దొరికిపోతారు గదా !!
  వాళ్ళు ఎటూ తేల్చుకోలేక, ముందుకు వెళ్ళలేక తర్జనభర్జన పడుతోండే - అక్కడున్న జనం ఆ దృశ్యాన్ని వూపిరి పీల్చడం కూడా మరిచి చూడసాగారు.
  అక్కడ ఏదో జరబోతోందని అందరికీ అర్థమైంది.
  కొందరు దగ్గర్లోని పోలీస్ ఓట్‌పోస్ట్ కేసి చూశారు.
  ఇంకొందరు తార్రోడ్డు మీద సుదూరంగా చూపుల్ని సారిస్తున్నారు - బస్సేదయినా వస్తే సమస్య తీరిపోతుందని.
’ఇక్కడ అటాక్ చేయాలా ?  బద్వేలులోనా ? ’ అనే విషయం తేల్చులేకున్నారు నారమ్మ మనుషులు. కొండారెడ్డి ఏదేదో చెబుతున్నాడు.
  ముందుకు రాకుండా, వెనక్కి పోకుండా..ఏ నిర్ణయమూ తీసికోకుండా అక్కడే నిల్చున్న గుంపులోంచి ఉన్నట్టుండి ఓ కుర్రాడు " కోబలీ ! " అంటూ అరిచాడు - గుండెలు జలదరించేలా.
  వెంటనే మరొకడి గొంతు ఆప్రయత్నంగానే వానికి వంతపాడింది.
  ఇంకొకడు..వేరోకడు.మరొకడు..ఒకరివెంట ఒకరు హిస్టీరియావచ్చిన వాళ్ళలా అరుస్తూ యీటెలు పైకెత్తి, బాంబులు చేతబట్టి  " కోబలీ..కోబలీ..! "  అంటూ  అరుచుకుంటూ పెద్దిరెడ్డి గుంపు పైకి పరుగెత్తారు,  రోడ్డు పట్టక చేలల్లోంచి అడ్డంగా ఉరుకుతున్నారు.
  ఆప్రయత్నంగానే జరిగిపోయింది అంతా.
  వెంటనే ప్రతిస్పందించింది పెద్దిరెడ్డి గుంపు కూడా.
  ఓబుళరెడ్డిని, బలరామిరెడ్డిని బలవంతంగా ఓ యింట్లోకి నెట్టి తలుపేసి తాము మిద్దెలెక్కారు.
  ఒక్కసారిగా ఆగిపోయింది నారమ్మ గుంపు.
  దగ్గరకు వెళితే మెద్దెల మీంచి బాంబులేస్తారేమో ! ఆయుధాల్లేకుండా రారుగదా !
 మరెట్లా వాళ్ళను పడగొట్టాలి  ?
  తమవాళ్ళను కూడా మిద్దెలెక్కేలా పురమాయించాడు కొండారెడ్డి.
  ఓబుళరెడ్డి దాక్కున్న ఇంటికి దగ్గర్లోని మిద్దెలెక్కారు కొత్తజనం.
 అక్కణ్నించి ప్రత్యుర్థుల పైకి బాంబులు విసరసాగారు.
  పెద్దిరెడ్డి మనుషులు మిద్దెమీద పొగగూటి చాటున, గవ్వాజుల ( గవాక్షం) మాటున దాక్కుని ఎదుటి గుంపుమీద రాళ్ళు విసరసాగారు.
  గొడవ తారాస్థాయికి చేరుకొంది.
  బంకుల( టీ కొట్లు.) వద్ద జనమంతా కకావికలయ్యారు.
  యధేచ్చగా  బాంబింగ్ జరుగుతూ వుంది.
  మిద్దె చుంచులు వూడబెరికో, పగిలిన ఇటుకల్ని సేకరించో. కిందనుంచి తమ వాల్లు విసిరిన రాళ్ళు అందుకొనో శత్రువుల మీద ప్రయోగిస్తూ వాళ్ళను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు పెద్దిరెడ్డివర్గం మనుషులు.
  వాళ్ళ వద్ద ఆయుధాలు లేని విషయం అవతలి వాళ్ళకు స్పష్టంగా అర్థమైంది. వాళ్ళల్లో హుషారు పెరిగింది. ధైర్యంగా ప్రత్యర్థుల్ని చుట్టుముట్టేందుకు ప్రయత్నించసాగారు.
  అప్పటికే యీ గొడవంతా శరవేగంతో ముగ్గుపిండి గనివద్దకు పాకింది.
  ఉలిక్కిపడి లేచి కూచున్నాడు బాలుడు.
  అక్కడ పన్జేసే జనాలందరికీ రెండుముక్కల్లో విషయమంతా చెప్పాడు, అందర్నీ తనవెంట రమ్మంటూ దాచిన బాంబుల బక్కెట్లను బైటకు లాగాడు.
 పక్కన్నే వున్న హరిజన వాడకు గూడ పాకింది వార్త.
  వాళ్ళంతా పరుగుల మీద గనివద్దకు వస్తున్నారు.
   బాలుడు బాంబుల బక్కెట పట్టుకొని మందుభాగాన పరుగెడుతోంటే జనమంతా అతని వెంట కదిలారు.
  యాభైమందో, మహా అయితే వందమందో వెంట వస్తారనుకొన్న జనం, నాలుగొందలకు మించేసరికి బాలుని కళ్ళవెంట నీళ్ళు ఉబికాయి.  తమమీద జనాలకు యింతటి అభిమానముందని అతనూహించలేదు.
  ఒక ప్రవాహంలాగా కదిలి ఒంటికొట్టం సమీపించారు వాళ్ళు. దగ్గరగా వెళ్ళకముందే మీంద మీంద (వెనువెంటనే) పది బాంబుల్ని నేలకేసి పగలగొట్టాడు బాలుడు.
  పకడ్భందీగా చుట్టబడిన పవర్‌ఫుల్ బాంబులు అవి. దిక్కులు పిక్కుటిల్లేలా శబ్దం చేశాయి.
  అప్పటికే ఓబుళరెడ్డి దాక్కున్న యింటిని చుట్టుముట్టి వున్నారు నారమ్మ గుంపు,  వాళ్ళను హుషారు జేస్తున్నాడు కొండారెడ్డి.
  తమకేసి వస్తోన్న జనప్రవాహాన్ని చూడగానే గుండెలు జారాయి వాళ్ళకు.  బాంబుల శబ్దం వినగానే వాటి శైలి అర్థమై బెదిరిపోయారు.  మిద్దెల మీదున్న కొత్తమనుషులు చావు భయంతో కొందకు దూకి పరుగెత్తటం మొదలెట్టారు.
  ఆ సరికే శివపురి ఔట్ పోస్ట్‌లోని పోలీసు కానిస్టేబుల్ అక్కడికి చేరుకొని వున్నాడు. తుపాకి చేతబట్టుకొని ఓ చెట్టు వద్ద నిల్చుని జరిగే తతంగాన్నంతా తిలకించసాగాడు.
  ’ బాంబులేసుకొంటూ  దూసుకెల్తున్నాడు బాలుడు ’
  అతనితోటి జనం దొరికిన వాళ్ళను దొరికినట్లు చితకబాదుతున్నారు.
  నారమ్మ జనమంతా చెల్లాచెదరవుతున్నారు.,  ప్రాణాలు అరచేతబట్టుకొని చేలకడ్డంగా పారిపోతున్నారు.
   ఆ ప్రాంతమంతా బాంబుల పొగతో నిండిపోయింది. చాలా మందిని చావుదెబ్బలు కొట్టి వదిలారు. చేతికి చిక్కిన ఇద్దరు కొత్త మనుషుల్ని పట్టుకొని చేతులు విరిచి పట్టి ఒకనికి చేతివేలు నరికారు, మరొకని ఎడమచెవి కోసి వదిలారు.
  బాంబుల పొగతో, హాహాకారాలతో, అట్టహాసాలతో, దరిద్రమైన తిట్లతో నిండిన అక్కడి వాతావరణాన్ని చాటుజేసికొని ఓ యింట్లో దాక్కున్నాడు ఓబులకొండారెడ్డి. తను పొరబాటున పెద్దిరెడ్డి మనుషుల కళ్ళ బడితే కొత్తవాళ్ళకులా చెవి, వేలు నరికి వదలరు... తలతీసేస్తారు.  అవకాశాన్నిబట్టి తను ఎవరికళ్ళబడకుండా అక్కణ్నించి జారుకోవాలి.
    తను దాక్కోన్న యింట్లోంచి బైటకొచ్చాడు పెద్దిరెడ్డి తమ్ముడు ఓబుళరెడ్డి.
   బాలుని కేసి మెచ్చుకోలుగా చూశాడు.
  కొత్తవాళ్ళు ఇళ్ళల్లో దాక్కున్నారేమోనని ఇల్లిల్లు తొంగిచూస్తున్నారు బాలుని మనుషులు.
  కిటికీలోంచి బైట్ విషయాలన్ని గమనిస్తోన్న కొండారెడ్డి కంటబడింది ఆ దృశ్యం. అతనికి ముచ్చమటలు పోశాయి, తనున్న యిల్లు కూడా సోదా చేస్తే జరిగే పరిణామమేమిటొ కళ్ళ ముందు దృశ్యమానమైంది.
  ఎంత త్వరగా అక్కణ్నించి తప్పించుకు పారిపోతే అంత క్షేమంగా భావించాడు.
  అదే సమయంలో తుపాకి చేతబట్టుకొని అవుట్ పోస్ట్‌కేసి పోబోతోన్న పోలీసు కానిస్టేబుల్ అతని కళ్ళబడ్డాడు.
  నడి సముద్రంలో తెప్ప దొరికినట్టుగా అన్పించింది అతనికి, ఇంతకంటే మంచి అవకాశం దొరకదనుకొన్నాడు.
  " ఓ సంజీవరాయుడూ  ! "  అంటూ కేకేశడు.
  పోలీసు తనకేసి చూసే లోపలే తలుపు తెరుచుకొని బైటబడుతూ " ఓ సంజీవరాయుడూ ! నిలబడన్నా ! - నేనొస్తాండ.. నిలబడు.."  అంటూ పోలీసుకేసి పోబోయాడు.
  అతన్ని పోల్చుకొన్నాడు కానిస్టేబుల్ సంజీవరాయుడు.
  తన ఆశ్రయం కోసం వస్తోన్న అతని ప్రమాదకర స్థితిని అంచనా వేశాడు. ఎదుట జనాన్నీ, వాళ్ళ చేతుల్లోని బాంబుల్నీ చూడగానే కొండారెడ్డి తనవద్దకు వస్తే ఏం జరుగుతుందో వెంటనే పసిగట్టాడు.
  అతని కాళ్ళు గజగజ వణికాయి.
   " నాకాడికి రావొద్దు....నాకాడికి రావొద్దు..... "  అంటూ చేయి అడ్డంగా వూపుతూ తుపాకి భుజానేసుకొని కాలికొద్దీ పరుగెత్తాడు.
  నిష్టుడయ్యాడు కొండారెడ్డి
  గవుక్కున వెనుదిరిగి ఇంట్లోకెళ్ళి తలుపేసుకొన్నాడు. జరిగిన విషయమంతా ఎవ్వరూ చూడలేదనే అనుకొన్నాడు..కానీ -  ఆదృశ్యం బాలుని కళ్ళబడనే పడింది.
  జనాన్ని వెంటేసుకొని నేరుగా అక్కడికొచ్చాడు.
   నారమ్మ వర్గనాయుకుడే దొరికాడు,  వీన్ని వేసేస్తే సగం పీడ విరగడైపోయినట్లే.
  కాలెత్తి తలుపును తన్నాడు.  వెంటనే ఆ యింటి యజమాని వచ్చి అడ్డు పడ్డాడు " ఇంట్లో దాక్కున్నె మనిసిని సంపొద్దన్నా !  అది మాకు సెడ్డపేరు. మేము సంపిచ్చినట్టయిద్ది,  ఆయప్పను యిడ్సిపెట్టిపోండి. మీ నాయనోల్ల దాచిపెట్టుకొంటే అవతలోల్లకు చెప్పి పట్టించినామా..? అడ్డగించుకున్నెంగదా ! ఇప్పుడూ అంతే... పోండెన్నా  ! "  అంటూ ప్రాధేయపడ్డాడు.
   ససేమిరా వీల్లేదన్నాడు బాలుడు.
  చంపకుంటే కుదరదన్నాడు.
  యింటి యజమాని ఎంతకూ పక్కకు తప్పకోలేదు. అప్పుడు కోపంగా చూశాడు బాలుడు.
   " ఆ నాకొడుకును సంపకుండా మేమిక్కన్నించి కదిలేదిలేదు. యీరోజు వాని బతుకు సమాప్తం కావల్సిందే, నువ్వడ్డమొస్తే ముందు నిన్నేసి తర్వాత వాన్నీ వేసేస్తాం, వాన్ని మాత్రం వదిలేదిలేదు, ఖచ్చితంగా సంపాల్సిందే..."  అన్నాడు.
   రెండు క్షణాలు బాలుని కళ్ళలోకి తదేకంగా చూశాడు అతను  " సరే ! మీ యిష్టమన్నా  ! "  అంటూ పక్కకు తప్పుకొన్నాడు.
   తలుపులోపల గడియ వేసివుంది.
  తలుపుల్ని పగలదన్నారు.
  కొండారెడ్డిని జుట్టుబట్టి బైటకీడ్చి పిచ్చి కుక్కను కొట్టినట్లు రోడ్డంతా తరిమి తరిమి కొట్టారు.
  ఎటు చూసినా జనం
  తన చుట్టూ కోట కట్టినట్లుగా జనసందోహం.
  మనిషికో దెబ్బ విలువకూడా చేయలేదు కొండారెడ్డి ప్రాణం.
  అతన్ని చంపి రోడ్లో పడేసి వెళ్ళిపోయారు.
  ఈ గొడవంతా దాదాపు మూడు గంటల సేపు జరిగింది.
  మద్యాహ్నం తర్వాత పోలీసులొచ్చి శవాన్ని హ్యాండోవర్ చేసికొని, నేరస్తుల కోసం శివపురిలోకి వెళ్ళేసరికి అక్కడ మరో శవం ఎదురయ్యింది.
  ఒంటికొట్టం వద్ద జరిగిన కొట్లాటలో తలకు బలంగా దెబ్బ తగిలిన పిచ్చన్న - గాయం బిర్రున యింటికెళ్ళి వాయివొచ్చి  చచ్చాడట.... "
  ఖూనీ మీద ఖూనీ.
  డబుల్ మర్డర్ కేసు.
  మళ్ళీ పోలీసులు... అరెస్టులు..కేసులు...బెయిలు.... వాయిదాలూ..... డబ్బు మంచినీళ్ళలా..ఖర్చయి పోవటం...

                                                                                                           ........సశేషం

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs