గత కొన్ని రోజులుగా మా ఊరి నుండి  మాపక్కింటి  మధుసూదన్ ఫోన్ చేస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్ నారాయణ జూనియర్ కాలేజీలో ఉన్న వారి అబ్బాయి అనిల్‌ని ఒక సారి కలిసి క్షేమ సమాచారాలు తెలుసుకొని తమకు చెప్పమని అడుగుతున్నారు. ఆ కాలేజీ నగరానికి ఒక వైపు చివర్లో ఉంటే నేను మరో చివర్లో వుంటున్నాను. అక్కడికి వెళ్ళాలంటే గంటన్నర సమయం పడుతుంది, అంత ఓపిక లేక ఏదో పని ఉందని చెప్పి తప్పించుకుంటున్నా..! . కొన్ని రోజులు తర్వాత ఏదో పని మీద అనిల్ తల్లితండ్రులు హైద్రాబాద్‌కి వచ్చారు. ‍అప్పుడు తప్పలేదు వారితో ఆ రెసిడెన్షియల్ కాలేజి వెళ్ళడం.

        ఒకే కాంపోండ్ లోనే కాలేజీ, హాస్టల్స్ ఉన్నాయి. మేము మధ్యాహ్నం వెళ్ళాం. ఆ సమయంలోనే విజిటర్స్‌ని లోపలకి అనుమతిస్తారు. ఇంటర్ మీడియట్ పిల్లలంతా క్లాస్ రూమ్ లో నుండీ బయటకు వచ్చారు. సందడి సందడిగా ఉంది. మేము నేరుగా హాస్టల్ మూడవ అంతస్తుకు చేరుకున్నాము, మద్యనున్న కారిడార్‌కు అటు ఇటు రెండువైపుల వరసుగా చాలా గదులున్నాయి. కారిడార్ ఒక వైపు చివర ఐరన్ గ్రిల్ ఉంది, అవతల అటుపక్కన నగరంలోమరో పేరుమోసిన ఆంగ్లమాధ్యమం పాఠశాల ఉన్నది రెండిటికిమద్యన చిన్న కాంపౌండ్. కారిడార్‌కి మరో వైపు చివర స్టేయిర్‌కేస్ ఉన్నది. ఐరన్‌గ్రిల్ పక్కనేఉన్న అనిల్ రూమ్‌‍కి వెళ్ళాము. అది ఒక పెద్ద డార్మెటరీ లాగా ఉంది. ఎడమవైపుకు ఓ మూడు రూములున్నాయి. అందులో ఇద్దరు లేక ముగ్గరు ఉంటున్నారు. మద్యన ఉన్న పెద్ద హాలలాంటి డార్మెటరీలో ఓ ఐదుమందికి ఐదు మంచాలున్నాయి. ఆ హాల్‌కి ఎదురుగా ఉన్న మరో రెండుగదులున్నాయి అందులోని ఒక గది లోపలికి వెళ్ళాగానే మధుసూదన్ ఆయన భార్య వారబ్బాయి మీద వాత్సల్యం ఒక్క సారిగా పెళ్ళుభికుంది. నేను ఏమీ మాట్లాడకుండా వారినే గమనిస్తూ ఉన్నాను ..! క్షేమసమాచారాలు అన్ని అయిపోయాయి.. కాస్త నెమ్మదించింది వాత్సల్యం, తర్వాత వాతావరణం చల్లబడింది. మెల్లగా మిగతా సమాచారాలు అడగుతున్నారు అబ్బాయిని, అబ్బాయి ఫ్రెండ్స్ ని. ఇంతలో..

        " అంకుల్ ఒక్క మిస్సెడ్ కాలు ఇస్తారా... ప్లీజ్ "  అంటూ ఒక అబ్బాయి అడిగాడు నన్ను.

        నాకు అర్థం కాక అనిల్ వైపు చూసాను. ఇంతలో మధుసూదన్  " ఇదిగో మా సెల్ ఫోన్ తీసుకో "  అంటూ తన జేబులో నుండి తీసి ఇచ్చారు. నన్నడిగిన ఆ కుర్రాడు ఫోన్ తీసుకొని అందులో నుండి ఒక మిస్సెడ్ కాల్ ఇచ్చాడు. ఒక నిమిషానికే తిరిగి కాల్ వచ్చింది ఆ సెల్ కి.  అది మాట్లాడుతూ అలా పక్కకి వెళ్ళాడు.

        " ఇక్కడ్ సెల్ ఫోన్స్ అలవ్ చేయరు కదా..! మనలా వచ్చిన వారిని అడిగి తీసుకొని వారి పేరెంట్స్ కి ఒక మిస్సెడ్ కాల్ ఇస్తారు , వెంటనే వాళ్ళే తిరిగి చేస్తారు ఆ నంబర్‌కి, ఇది ఇక్కడి కోడ్‌  "  విషయం చెప్పాడు మధుసూదన్.

        నాకు కొత్తగా ఉంది ఆ విషయం. " అంకుల్ " అన్న పిలుపుతో తలెత్తి చూసాను. ఇంకో కుర్రాడు " ఒక్క మిస్సెడ్ కాల్ చేసుకుంటాను ప్లీజ్ " అడిగాడు.
  నాకు వారి పరిస్థితి అర్థం అయ్యి నా సెల్ ఫోన్ ఇచ్చాను. ఆ కుర్రాడు మిస్సెడ్ కాల్ చేసాక తిరిగి కాల్ రాగానే అలా పక్కకి వెళ్ళాడు. ఆ కుర్రాడు మాట్లాడుతుంటే అతని ముఖంలో మారుతున్న కవలికలన్నీ కనపడుతున్నాయి. కాసేపు గారాభం, కాసేపు అలక, కాసేపు అభ్యర్థన అన్ని కలగలిపి ఏదో తెలీయని కొత్త ఎక్స్ ప్రెషన్స్ వొస్తున్నాయి. బహుశా అమ్మతో మాట్లాడుతున్నాడేమో... అన్ని భావాలు ఒకే సారి ఒక్క అమ్మ వద్ద పలుకుతాయేమో... మరి  !

        ఎప్పుడు కాల్ అవుతుందా... అని ఇంకో కుర్రాడు పక్కనే ఎదురుచూస్తున్నాడు. కాల్ అవ్వగానే పక్కనే ఎదురుచూస్తున్న మరో కుర్రాడు తీసుకొని మల్లీ అదే వరస.  కాకపోతే ఒక్క నిమిషానికే కాల్ ముగిసింది..! ఏమిటా అన్నట్లు చూసాను. మళ్ళీ ఇంకో మిస్సెడ్ కాల్ ఇచ్చాడు. నాకు అర్థం కాలేదు. మల్లీ కాల్ రాగానే మాట్లాడుతున్నాడు. అప్పుడర్థమైంది మొదటి కాల్ నాన్న గారిది. ఒక్క నిమిషం లోనే అయిపోయింది... రెండో మిస్సడ్‌ కాల్ అమ్మకు.  ఒక్కో కుర్రాడి ముఖంలో రకారకాల హావభావాలు కనపడుతున్నాయి. కొందరు ఏడుస్తున్నారు, కొందరు వొస్తున్న ఏడుపుని బిగపడుతున్నారు. కొందరు అలిగి కాల్ కట్ చేస్తే, మళ్ళీ రింగ్ అవుతున్నది. వెంటనే కాల్ ఆక్సెప్ట్ చేయట్లేదు. కాసేపు రింగు అవనిచ్చి ఆలశ్యంగా ఆక్సెప్ట్ చేయటం లో తమ నిరశనను తెలుపుతున్నారు, కొందరు నవ్వుతున్నారు. నవరసాలు పలుకుతున్నాయి అక్కడ.

        భోజనం సమయం కావడంతో అందరం కిందకు దిగి డైనింగ్ హాల్లో క్యూలో నించొని భోజనం తెచ్చుకున్నాము. భోజనాలు ముగిసాక హాస్టల్ పక్కన ఉన్న ఖాళీస్థలంలో చెట్ల కింద ఉన్న సీమెంట్ బెంచీల మీద కూర్చున్నాము. మళ్ళీ అదే పిలుపు అదే అభ్యర్థన  " మిస్సెడ్ కాల్ ప్లీజ్ " అంటూ. నా సెల్ ఇచ్చాను. దూరంగా రూపాయి కాయిన్ ఫోన్ బాక్సులు నాలుగు ఉన్నాయి, వాటికి పెద్ద క్యూ ఉంది. అందుకే ఇలా ఎవరన్నా వొస్తె వారిని అడుగుతున్నారు ముక్కు మొహం తెలియకపోయినా ఈ కుర్రాళ్ళు.

        వారి పరిస్థితి అర్థమయ్యింది. ఈ కాలేజి చదువులు వారికో " జైలు అయిపోయింది ".  బయట ప్రపంచం ఎలా ఉందో ఏమి జరుగుతుందో కూడా తెలీదు. ఎప్పుడూ స్టడీ అవర్స్,  క్లాస్ రూమ్స్. ఉదయమే 5:30
కి మొదలై రాత్రి 11 కి ముగుస్తుందట వారి చదువుల దినచర్య. ఒక ఆట లేదు, పాట లేదు, కనీసపు టి.వి కూడా లేదు. నేను ఒక్కసారిగా నా కళ్ళ ముంది రింగులు తిప్పుకుంటూ..నా గతంలో వెళ్ళీపోయాను  !
                                                       *******

        నా కాలేజీ రోజుల్లో ఉదయమే 9:00 కి కాలేజికి వెళ్ళేవాడిని, మళ్ళీ భోజనానికి ఇంటికొచ్చి ఒక అరగంట ఇంట్లో ఉండి మళ్ళీ వెళ్ళడం. సాయింత్రం కాలేజీ అవ్వగానే ప్లే గ్రౌండ్ లో క్రికెట్ లేదా షటిల్ బాడమెంటన్ ఆడటం. ఇవి కాకపోతే అలా కాలేజీ చెట్ల కింద కూర్చొని జనరల్ గా ప్రాపంచిక విషయాల మీద చర్చలు. ఇవన్నీ మాకు శారీరిక దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వత, దృఢత్వం అబ్బేవి అనుకుంటా. కాకపోతే జనరేషన్ మారే కొద్ది జనాల్లో మార్పు ఉన్నట్లే, మనిషి సంపాదించే ఙ్జానసంపదనలోనూ మార్పులొస్తున్నాయి. మేము చదువుకునే సమయంలో కేరీర్ గురించి పెద్దగా ఆలోచన ఉండేది కాదు. అదే కాక, వాటి మీద అవగాహన కూడా తక్కువే. ఇక మార్క్స్ కూడ అప్పట్లో 70 శాతం వొస్తే చాలు, నేను మా వీధిలో రొమ్ము విరుచుకుని తిరిగే వాడిని. ఇప్పుడు అందరికీ 90 శాతం పైనే వొస్తున్నాయి మార్కులు. మనుషుల నడవడికలో అప్పటికి ఇప్పటికి మార్పు ఉంది. ఇప్పుడంతా యమ షార్పు గా ఉంటున్నారు. కాకపోతే, కొన్ని అనారోగ్యమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బహుశా ఇది ఒక నిరంతర ప్రక్రీయ ఏమో..!  రేపు రాబోయే కాలంలో ఈ కుర్రాళ్ళు కూడ పెళ్ళై, పిల్లలు పుట్టాక....తమ పిల్లలను ఇలానే కాలేజీలలో చేర్చినప్పుడు ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నట్లే అనుకుంటారేమో మా " కాలేజీరోజుల్లో ఎంతగా గొప్పగా చాలా స్ట్రిక్ట్ గా చదువుకున్నామో .." అని  గొప్పగా...అనుకొని అప్పటికాలపు విద్యవిదానాన్ని నేను ఇప్పుడు అనుకున్నట్లే అప్పుడు వీళ్ళు కూడా విమర్శనాధోరణిలో మాట్లాడతారు అనుకుంటా..!

                                                                                                      ***

        కాలేజీ గేట్ వద్ద కలకలం వినపడడంతో ఆలోచననుండి బయటకు వచ్చి చూస్తే  అక్కడ తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్‌తోఉన్న ఒక నడి వయుసు వ్యక్తి కాస్త పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కోపంతో హాస్టల్ ఆఫీస్ రూం వైపు వెళ్ళాడు..! ఏమిటా అని అనిల్  వైపు చూసాను..!

        నా భావాన్ని అట్టే పట్టేసిన ఆ అబ్బాయి, " ఆఁ... అది మామూలే అంకుల్ "  అన్నాడు.

        " ఏమిటి " అన్నట్లు తలేగిరేసాను..!

        " అతను మా కాలేజీ పక్కనే ఉన్న స్కూల్ కర్పాండెంట్. మా మీద రిపోర్ట్ ఇవ్వడానికొచ్చాడు "  అని ఒక్క క్షణం ఆగి మళ్ళీ తనే  "  మధ్యాహ్నం భోజన టైమ్ లో మా కారిడార్ చివర్లో ఉన్న ఐరన్ గ్రిల్ పట్టుకొని వాళ్ళ స్కూల్లో ఉన్న పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు మా హాస్టల్ వాళ్ళంతా. అక్కడ టెంత్ క్లాస్ అమ్మాయిలు కూడా ఉన్నారులే " విషయం చెప్పాడు.
   సరే పదా పైకెళ్ళి చూద్దాం అంటూ నేను ఆ అబ్బాయితో పాటు పైకి వెళ్ళాను. వీళ్ళు ఉంటున్న బిల్డింగ్ లో మొత్తం నాలుగు అంతస్తులున్నాయి. ప్రతి అంతస్తుకున్న కారిడార్‌కి ఒక వైపు గోడతో మూసి ఉంటే, మరో వైపు గాలి, వెలుతురు కోసం ఐరన్ గ్రిల్ పెట్టారు. గ్రిల్ ఉన్న వైపున హస్టల్ బిల్దింగ్ చివరిది అటుపక్కన నగరంలో పేరు మోసిన ఒక స్కూల్‌లోని పదవతరగతి అమ్మాయిలు అబ్బాయిలు కొందరు చెట్ల కింద కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు, భోజనం ముగించినవారు ఆడుకుంటూ వుంటారు ఆ సమయంలో ఈ హాస్టల్ కుర్రాళ్ళు వారితో మాటలే వీరికి సరదాలు. కబుర్లు.  అదే వీళ్ళకి రిలీఫ్ రొటిన్ లైఫ్ నుండి. నేను వెళ్ళేటప్పటికి, గ్రిల్ పట్టుకొని నుంచొని ఉన్న హాస్టల్ స్టూడెంట్స్ తో కింద నుండి ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుకుంటున్నారు. హాస్టల్‌కుర్రాళ్ళ పరిస్థితి చూస్తే..జైలుగదుల గ్రిల్లు పట్టుకొన్న నిలబడి ఉన్న ఖైదీల్లా ఉన్నారు. వీళ్ళు అడిగే ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు ఇస్తున్నారు. అందులో కాస్త కొంటెతనం, చిలిపితనం అన్నీ కలగలిపి ఉన్నాయి.

        " రేపు శనివారం మాకు ఆఫ్ డే నే స్కూల్ "  ఒకమ్మాయి కింద నుండి చెబుతున్నది పెద్ద బడాయిగా.

        " అవునా రేపు శనివారమా..? అయ్యో ఎల్లుండీ ఆదివారామా..? "  అంటూ ఆశ్చర్యపోయారు.

        కనీసం ఏమి వారమో కూడా తెలీని పరిస్థితుల్లో ఉన్నారు. కింద ఉన్న అమ్మాయిలు కావాలనే " సెలవు " అన్న పదాన్ని వత్తి చెబుతున్నారు. మీకు స్వేచ్చలేదు, మేము చూడు సెలవలు, పండగలు అంటూ ఎలా ఎంజాయి చేస్తున్నామో అన్న ఉద్దేశం ఆ మాటల్లో ఇండైరెక్ట్ గా కనపడుతున్నది. అదో ఆట ఆ స్కూల్ పిల్లలకి, అలా చెప్పి ఆనందించడం వారికో సరదా. అలా ఆ స్కూల్ పిల్లలు చెబుతేనే రేపు ఏమిటి అన్నది తెలుస్తున్నది.

        " పదరా భోజనానికి టైమ్ అయ్యింది, మళ్ళీ ఐ.ఐ.టి ఎగ్జాం కి ప్రిపేర్ అవ్వాలి "  అంటూ అందరు బిలబిలమంటూ పరిగెత్తారు. చివర్లో ఒకరిద్దరు రూం లో నుండి తమ లంచ్ ప్లేట్స్ తో కారిడార్ లోకి వచ్చి గ్రిల్ వద్ద ప్లేట్స్ తో మెల్లిగ కొడుతూ శబ్ధం చేసారు, ఆ శబ్ధానికి కింద ఉన్న ఒకమ్మాయి రెస్పాండయ్యి చిన్న చిరునవ్వు, అది చూసి ఆ ఇద్దరు కుర్రాల్ల మొహం లో మందహాసం.. అదో చిలిపి తనం, గమ్మత్తుగా ఉంది. వారికదే ఆటవిడుపు. నా పక్కనుండి వెళుతూ నేను చూసానేమో అన్న కాస్త అపరాధబావన తో తల దించుకుంటూ వెళ్తున్నారు. అది ముందే గమినించి నేను చూడనట్లు ఉండిపోయాను.

        అలా రెసిడెన్షియల్ కుర్రాళ్ళకి, స్కూల్ పిల్లలకి అవినాభావసంబంధం ఏర్పడింది. ఇది సహించలేక ఆ స్కూల్ కరెస్పాండెంట్ కోపంతో కాలేజీ కర్రెస్పాండ్ కి రిపోర్ట్ చేయడానికెళ్ళాడు.
" వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం మా కాలేజి వాళ్ళు విని..సరే కంట్రోల్ చేస్తాము. ఇక అలా జరక్కుండా చేస్తాము అని చెప్పడం రోజు అలవాటే,  ఇక్కడ ఎవరూ వారు చెప్పిన మాట వినరు. చెప్పినప్పుడు ఊ అంటూ భయంతో తల ఊపి..వారటు వెళ్ళగానే, మళ్ళీ ఇదే తంతు "  చెప్పాడు ఆ అబ్బాయి.

        విద్యార్థులను ఇలా ఒక నాలుగు గోడలమధ్యన జైలులో పక్షుల్లాగ ఉంచితే వీరి మానసిక పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఏది చేయద్దు అంటారో అదే చేస్తారు. అందుకే యజమాన్యం కూడా ఇలాంటి విషయాల్లో చూసీ చూడనట్లు ప్రవర్తిస్తున్నారు. రోజూ నాలుగు గోడల మద్యన, పుస్తకాల మధ్య గడిపి గడిపి కూసింత కూడా వినోదం లేదు జీవితంలో. రోజువారి ధినపత్రికలు చదవడానికి కూడ అనుమతించరట..! అందుకే వారికి తోచినట్లు ప్రవర్తిస్తున్నారు. పర్సనల్ సెల్ ఫోన్స్ అనుమతించరు హాస్టల్లో. తల్లితండ్రులతో రోజూ మాట్లాడాలి అనిపిస్తుంది... అందుకు దొడ్డిదారి వెతుకున్నారు, ఒక నాలుగించిల మందంతో ఉన్న పుస్తకం లోపల మధ్యలో సెల్ ఫోన్ పట్టేంత స్థలాన్ని బ్లేడ్ తో కోసి ఒక అరలాగ చేసారు. అందులో సెల్ ఫోన్ పెట్టుకున్నారు. హాస్టల్ కేర్ టేకర్ అర్ధరాత్రి కూడా చెకింగ్ కి వస్తారట సెల్ ఫోన్ వాడుతున్నారేమో అని. వారి కంటికి కనపడకుండా అలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి నిర్బంధం వల్ల విద్యార్థులు డొంక దారులు వెతుక్కుంటున్నారు. ఇవే రేపు జీవితంలో అలవాటు అవుతాయి.

        ఆలొచిస్తూ కిందికి వచ్చేసాను. ఎవరో కుర్రాడు నా సెల్ ఫోన్ నాకిచ్చేసి వెళ్ళీపోయాడు. ఏమిటా అని చూస్తే చార్జింగ్ అయిపోయింది నా సెల్ లో. అందుకే ఇచ్చేసి వెళ్ళీపోయారు కుర్రాళ్ళు.

                                                         ******

        మధుసూదన్, ఆయన శ్రీమతి ఇంకా మాట్లడుకుంటూ ఉన్నారు తమ అబ్బాయితో, ఫ్రెండ్స్ తో. నేను దగ్గరికెళ్ళి కూర్చున్నా. నారాకతో ఆ అబ్బాయిలు మెల్లిగా  ఒక గుంపుగా మాట్లాడుకుంటూ పక్కకి వెళ్ళారు. వారటెల్లగానే... మధుసూదన్ నా వైపు తిరిగి, " నిన్ను చాలా శ్రమ పెట్టినట్లున్నాను "  అన్నాడు.

        " పర్వాలేదులేండి, రోజూ రాను కదా, ఏదో మీరోచ్చినప్పుడే కదా..? " అన్నాను. నాలో నేను " కొన్ని కొత్త విషయాలు తెలిసాయి ఇలా రావడం వలన "  అని అనుకున్నా.

        " మా అబ్బాయికి స్టేట్ వైడ్ ఐ.ఐ.టి పరీక్షలో 600 ర్యాంక్ వచ్చింది "  అన్నాడు మధుసూదన్ చాలా సంతోషంగా!

        " ఇంకా ఇంటర్ మొదటి సంవత్సరమే కదా చదువుతున్నది, ర్యాంక్ రావడమేంటి..? "  ప్రశ్నించాను.
 " అదే నారాయణ్ జూనియర్ కాలేజి వారి స్టేట్ వైడ్ ఉన్న అన్ని కాలేజిల్లోను ఒకే సారి ప్రతి నెల ఐ.ఐ.టి మాడల్ టెస్ట్ పెడతారు, అందులో 600 ర్యాంక్ వచ్చింది " వివరించాడు విషయం.

        " ఓహ్..! అలాగా.."  అన్నాను. ఏంటో ఎవరి కాలేజిలో వారు పరీక్ష నిర్వహించి ర్యాంక్ వచ్చిందని ఆనందపడిపోతున్నారేంటి నాలోని ఆలోచన ఇది..!

        మళ్ళీ ఆయనే  " అబ్బాయి సెలవల్లో ఇంటికి వస్తే ఒకటే టి.వి చూడటం, అదీ ఒకటి లేక రెండు చానల్స్ చూస్తాడా అంటే అదీ లేదు, సెకండ్లో మూడు నాలుగు చానల్స్ మారుస్తాడు. ఎందులోనూ పట్టుమని పది సెకండ్లు కూడా ఉండడు. మాకు ఏమి చెప్పాలో తోచట్లేదు. ఒక సారి వాళ్ళమ్మ ఉండపట్టలేక ' ఒరేయ్ ఏదో ఒక చానల్ చూడరా, మమ్మల్ని కూడా ఏదో ఒకటి చూడనివ్వు ' అనంటే  ' నేనుండేది కేవలం వారమో లేక మూడు నాలుగురోజులే కదా ..? ఈ నాలుగు రోజులు నా ఇష్టమొచ్చిన చానల్స్ చూడనివ్వు, తర్వాత మీ ఇష్టం ' అంటూ కోపం. సరే వాడున్న రోజులు మేము ఆ టి.వి వైపే వెళ్ళడంలేదు "  అంటూ పిర్యాదు చేసాడు.

        నేను ఏమీ మాట్లాడాలో తెలీక నవ్వి ఊరుకున్నా. ఇక్కడేమో నాలుగు గోడల మధ్య  " నిర్భంద విద్య" అమలు చేస్తున్నారు. ఏ వారమో తెలీదు, బయట ఏమి జరుగుతుందో తెలీదు, అది పండుగ రోజా లేక సెలవు దినమా అన్న విషయం ఉండదు, ఒక ఆట లేదు వినోదమూ లేదు..! మరి ఒక్క సారిగా అలా కట్టలు తెంచుకున్న వరదలాగ సెలవులు వొస్తే అలాగే ఉంటారు పిల్లలు.

        ఇంత నిర్భంద విధ్య అవసరమా..? ఏమి సాదించాలి..? జీవితమంతా కేరీరేనా..ఇంకేమి లేవా..? విద్యతో పాటు బయట సమాజంలోని విషయాలు ఎలా తెలుస్తాయి..! ఎప్పుడు తెలుసుకుంటారు..? ఇది సరైనా కౌమార దశ. ఈ దశలోనే సమాజంపైనా, రకరకాల వ్యక్తుల పైనా ఒక అవగాహనకు ఆస్కారం ఉంటుంది. ఇలా అవేవి అందుబాటులో లేకుండా, దౌడుతీసే గుఱ్ఱానికి పరుగే ద్యేయంగా వాటి కళ్ళకు చుట్టపక్కలకు చూడకుండా కేవలం ప్రయాణించే రహదారి మాత్రమే కనపడేలా కటర్స్ కడతారు, మరి కొన్ని మాటవినని గుఱ్ఱాలకు ఎదురుగా ఒక కర్రకు గడ్డికట్టి రహదారివైపు వుండేట్టుగా ఉంచుతారు, ఆ గుఱ్ఱం ఆ గడ్డికోసం పరిగెత్తుతూ వుంటుంది అలానే....! అలా ఈ పిల్లలను కూడ పెంచుతున్నారు. ఇలా నాలుగుగోడల మధ్యన బందిస్తే..! ఏమి తెలుసుకుంటారు చుట్టూ వున్న సమాజాన్ని, మనుషులని..!

        ఇవన్నీఈ పెద్దలని అడిగినా..!  వారి నుండి వచ్చే సమాదానం ఒకటే,  " మిగతా జీవితం ఉంది కదా అప్పుడు తెలుసుకుంటారు. అయినా ఇదంతా వాళ్ళు భవిష్యత్తులో సుఖంగా ఉండాలనే మేము చేస్తున్నది "  అంటూ ఒక రెడీమేడ్ సమాధానం.

  నిజంగా ఇదొక్కటేనా..? సమాజంలో తమ పిల్లవాడి గురించి గొప్పగా చెప్పుకోవాలని తపన ఉంది ఇందులో. కానీ, ఆ ముసుగులో ఏమి కోల్పోతున్నారో అర్థమే కావడం లేదు. చివరకు ఒక కర్మాగారం లో యంత్రాలను, రోబోట్స్ ని తయారు చేసినట్లు, వారి పిల్లలను తయారు చేస్తున్నారు. బయట సమాజంలోకి ఒక మంచి పరిపూర్ణమైన యంత్రాన్ని ప్రవేశపెడుతున్నారు. అందులో మహా మేధావితనం, పెద్ద పెద్ద హోదాను, ప్రతిభ ఉంటున్నాయి కాని.... అందులో జీవం లేదు, జీవితం లేదు, సున్నితత్వం ఉండడం లేదు. ఒక రకంగా చూస్తే ఇది అనివార్యం అయ్యింది... తప్పట్లేదు జనాలకి ఎవరో ఒకరు ఇలా ఒక విధానాన్ని మొదలెడతారు, మిగతా వారు వాటిని అనుసరించడమే తరువాయి పని. ఎందుకిలా... అంటూ ఎవరు తమని తమరు ప్రశ్నించుకోరు. ఒక్కసారి కూడా ఆత్మ పరిశీలన చేసుకోరు. తప్పదు..! లోకంతో పాటు మనం అంటూ నడవడమే.

        నేను గతంలో చాలా సార్లు అనుకునేవాడిని, ఇప్పటి జనరేషన్ చూసి ఇప్పటి టెక్నాలజీని చూసి " అర్రె..! అనవసరంగా ఓ పదిహేను సంవత్సరాలు వెనక పుట్టామే.. కాస్త 20 ఏళ్ళు ఆగి పుట్టుంటే బాగుండేది కదా " అని.  ఇప్పుడు ఈ నిర్భంద విద్య చూసాక... అమ్మో ! నేను అప్పటి పూర్వకాలంలోనే పుట్టడం మంచిదైయింది అనిపించింది. ఎందుకంటే  " స్వేచ్చ " కారణం. ఇది లేకుండా బతకలేను. "స్వేచ్చ" లేని అమెరికా అధ్యక్ష పదవి ఇస్తాము అన్నా ఒప్పుకోను. స్వేచ్చలేని  ఏ కేరీర్ నాకొద్దు. ఏ హోదాలు, పదవలు నాకొద్దు..! అన్నీ వదులుకుంటాను నేను నా స్వేచ్చ కోసం....!

        " అంకుల్ " పిలుపుతో నా ఆలోచనల నుండి తల ఎత్తి చూసాను ఆ పిలుపు వచ్చిన వైపు.

        " ఒక మిస్సెడ్ కాల్ ప్లీజ్ "  అడుగుతున్నాడు ఓ కుర్రాడు

        " సెల్ లో చార్జ్ అయిపోయింది "  అన్నాను

        నా మాటతో తల అటూ ఇటూ తిప్పి, దూరంగా రూపాయి కాయిన్ బాక్సులు ఉన్న వైపు చూసాడు. అక్కడున్న నాలుగు కాయిన్ బాక్సులకూ వందడుగుల క్యూ ఉంది. అది చూసి ఆ క్యూ ఇప్పట్లో అవదు అని అనుకొని కాళ్ళీడ్చుకుంటూ క్లాస్ రూం వైపు వెళ్ళాడు ఆ కుర్రాడు

18 comments:

Chala baaga raasaru. Idi mee anubhavam ane kante vastavam ante chala sahajam ga vuntundemo. Nenu karnataka lo vuntunnanu. Ikkada pillalu mana vallato polchukunte ento adrushtavanthulu endukante ikkada manalanti kalushita vatavaram lo chaduvulu levemo anipistundi.Ikkada manalaga private residential colleges concept ekkada kanapadadu.Many be manaku kooda govt vaipu nundi kooda saraina disalo pranalikabaddam ga vidya andinche prayatnam cheyyali.

చాలా బాగా రాశారు.

@ థ్యాంక్స్ రమేష్...

@ కొత్తపాళీ గారికి కృతజ్ఞతలు

God! this is an eye-opener for me!!

మిగతా విషయాలేమో కానీ, ఆ captivated/encapsulated feeling ఒక్క సారి ఊహించుకుంటే వెన్ను ఒకసారి వణికింది. ఇలా ఎన్నిసంవత్సరాలు ఉంటారండీ పిల్లలు అక్కడ? I mean ఏ age నుంచి ఏ age వరకూ?

chala bahda vesindandi chaduvutunte.. nenu akkkade unte roju oka 10 cell phones tisukuvellanipinchenta. kani adi solution kaadu kada..

చాలా బాగా రాసారు, ఆ పిల్లల పరిస్థితి తలుచుకుంటే జాలేసింది.

Excellent Post.

~Sasidhar Sangaraju
www.sasidharsangaraju.blogspot.com

మీరు రాసింది చాలా బాగుంది. ఫోన్లో మాట్లాడుతున్న ఆ పిల్లల నిరసనలూ..., బెట్టుచేయడాలు... picturise చేసుకుంటే మనసంతా ఏదోలా అయిపోయింది. ఆ చిలిపి సరదాలు అవీ... వావ్.. చాలా బాగా రాశారు. కానీ ఇది నిజంగా జరిగిందా/జరుగుతూందా. ఒకవేళ అదే నిజమైతే విద్య పేరుతో ప్రస్తుతం జరుగుతున్నది చాలా దారుణం.

@కుమార్.
మీరు ఎక్కడున్నారో అర్థం కాలేదుగాని..ప్రస్తుతం ఈ పరిస్థితి గత 15, 20 సంవత్సరాలు జరుగుతూనే ఉన్నది మన తెలుగునాడులో. ఇక ఏ వయసు అంటే..? అది ఆయా తల్లితంద్రులనుబట్టి ఉన్నది..6 తరగతినుండి ఇంటర్‌మీడియట్ వరకు ఇలానే ఉన్నది..!

@ జాబిల్లి
అవన్ని నిజాలే..మన రాష్ట్రంలో జరుగుత్న్న వాస్తవాలు.

@వేణు శ్రీకాంత్
..నిజమే జాలి వేస్తుంది...!

@ శశిధర్.
థ్యాంక్స్.

@ ఇండియన్ మినర్వ.
ఇది నిజంగా జరిగినది..ఇంకా జరుగుతున్నదే..నిరుడు సంవత్సరం అక్టొబర్‌లో చూసాను ఆ సంఘటనలన్ని..నా స్వీయానుభవమే.

చేయని నేరానికి శిక్షలా ఉంది అక్కడి చదువు నిబంధనలు. ఇటువంటి పిల్లలు రేపు బయటకు వచ్చాకా ఎవరితో ఎలా ఉండాలో అనే మర్యాదలు, పద్ధతులు తెలుస్తాయో లేదో. చదువు తప్ప వేరే ప్రాపంచిక జ్ఞానం లేకపోతే కష్టమే కదా. అయినా అంత స్వేచ్ఛలేని చదువు దేనికి. పాపం ఆ పిల్లలను తలుచుకొంటే బాధగా ఉంది.

శ్రీవాసుకి

చాలా బాధగా ఉంటుంది ఇలాంటివి విన్నప్పుడు...మేము ఇంటర్ చదివేరోజుల్లో కాస్త బెటర్..పైగా డే-స్కాలర్ చదువు అప్పుడు అంతగా ప్రెజర్ ఉండేదికాదు....ఇప్పుడు మరీ ఘోరంగా తయారైంది పరిస్థితి. మా ఫ్రెండు ఇంటిదగ్గర ఎనిమిదో తరగతి పిల్లాడికి వాళ్ల స్కూళ్ళొ ఐ.ఐ.టి కోచింగ్ అంట...ఓసారి 90% మార్కులు వచ్చాయని నా దగ్గరకు వచ్చి చెప్పాడు...ఐనా ముభావంగా ఉన్నాడు. ఎందుకు అని అడిగితే క్లాసు ఫస్టు రాలేదని ఇంట్లో అన్నారట!!

చాలా బాగా రాసారండీ, ముఖ్యంగా స్వేచ్చ గురించి. ఇప్పుడు అందరినీ కలచివేస్తున్న సమస్యే ఇది. ఎక్కడ మనమూ భవిష్యత్తులో పిల్లలను ఈ పోటీ ప్రపంచపు ఉచ్చులో నెట్టేస్తామో అని భయంగా ఉంటుంది ఇలాంటివి వింటున్నప్పుడల్లా.

@ వాసుకి గారు
@ నాగార్జున గారు
@ సౌమ్య గారు.
మనిషికి యావ.. ఎక్కడ తాము మన పక్కవాడికన్న వెనుకపడిపోతామో అన్న భయం..!చిన్న చిన్నవాటికే మనుగడకు ప్రమాదం అన్నంతగా బెంబేలెత్తిపోతారు. అందుకే ఈ పరుగులు..నా చివరి తమ్ముడు కూడ ఇలాంటి వాటికి బలి అయ్యాడు..ఓ పదేళ్ళ క్రితం.

కమల్ గారూ,

మీరు నాకన్నా వయసురీత్యా పెద్దవారని తెలుస్తోంది. దానికి తగిన పరిపక్వత, నెమ్మది ప్రదర్శించారు. అభినందనలు. నాకు నితిన్ రెడ్డి వార్త చూడగానే మెదట కోపం వచ్చింది. ఆపై టి.వి9 వ్యాఖ్యానం వినగానే కంపరమెత్తింది టి.వి ఛానెళ్ళపై. ఆ మంటమీద రాశానన్నమాట మీరు చదివిన టపా.

@ థ్యాంక్స్ అరుణ్ గారు. మానసిక పరిపక్వతకు.. వయసుతో నిమిత్తం లేదులేండి..! కావలసింది ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తూ అవగాహన చేసుకునే తత్వం మనిషిలో ఉంటే చాలు.

అద్బుతంగా చెప్పారు.

kathora vastavaalu ante ive. pillala paatlu..rank la race lu. hmmm.

సమకాలీన సమస్యపై చాలా వివరంగా టపా వ్రాసారు. నేను వినడమే కాని, ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేదు.
ఆ తల్లిదండ్రులు బహుశా మనసుతో కాకుండా మెదడుతో మాత్రమే ఆలోచిస్తున్నారు.
నేను ఈ విషయంపై చాలా ఏళ్ళ క్రితం ఒక వెబ్ సైటులో ఒక వ్యాసం వ్రాసాను. "IT కంపెనీల కోసం పిల్లలని కనాలా?" అని. దానిపై ఒక కుర్రాడు ఇలా స్పందించాడు. మీరు తప్పుబడుతున్నారు కాని, ఈ విధంగా నా తల్లిదండ్రులు, స్కూలు వాళ్ళు చదివించబట్టే, నేను జీవితంలో పైకి వచ్చాను. లేకపోతే ఎక్కడ ఉండేవాణ్ణో నాకే తెలియదు అని.
ఏది మంచో, ఏది చెడో మనం చెప్పలేము.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs