.............సన్నపురెడ్డి వెంట్రామిరెడ్డి.

        
      క్షణం కూడ ఆలశ్యం చేయకుండా తనవాళ్ళందర్నీ పిలిపించాడు.
 జరిగిన విషయమంతా చేప్పేసరికి ఉగ్రులైపోయారు వాళ్ళు. కట్టెలు, కైపులు తీసుకొని  ’కోబలీ ’ అంటూ వీధెంట అరుచుకుంటూ వూర్లో జొరబడ్డారు.
  గ్రామమంతా ఆశ్చర్య, భయాందోళనలతో అట్టుడికి పోయింది. ఆడవాళ్ళు వాకిళ్ళలోంచి నిలువు గుడ్లేసుకుని చూస్తున్నారు.
  గుంపు నేరుగా నారమ్మ యింటి వద్దకెళ్ళి ఆగింది.  ’కోబలీ ’ అంటూ కేకలు పెట్టింది.
  నారమ్మ యింటికి తాళం కప్ప వేళాడుతూ వుంది. " యాడికి పోయిందీ లం.....? " అంటూ ఇరుగు పొరుగుల్ని విచారించారిస్తే. మద్యాహ్నమే ఆమె వూరు విడిచి వెళ్ళినట్లుగా తెలిసింది.
  " ఎర్రటెండకు ఏట్లో కిందామీందా పడ్తా అడ్డంగా నడ్సిపోయిందెన్నా !  దండోరు పల్లెకు పోయినట్టుంది  "  చెప్పింది  ఓ ఆడమనిషి.
   " తప్పించుకొన్నెది ముండ .."  కసిగా అన్నాడు ఓబుళరెడ్డి.
  " కొండిగాడు వుండాడేమో సూడండి  "  ఎవరో అనటంతో ’కోబలీ ’ అంటూ మరో ఇంటికేసి కదిలింది గుంపు.
  నారమ్మ దాయాది ఓబుళకొండారెడ్డి ఇంటికి కూడా తాళం వేసివుంది..  మరో నాలుగిళ్ళు మీద దాడిజేశారు గాని అన్నిటి పరిస్థితి అంతే.
  తాము మిట్టపల్లె మాదిగల్ని విచారించటం తెలిసిన వెంటనే వూరు దాటినట్టుంది నారమ్మ తన అనుచరగణంతో కలిసి.
  కొంతసేపు వూరంతా కదం తొక్కారు జనం.
  నారమ్మ ఇంతలావు వన్జేసిందంటే నమ్మలేక పోతున్నారు అందరూ. ఆమె తెంపరితనం విని వూరు వూరే నిశ్చేష్టిత అయ్యింది,  ఆమె తప్పించకు పారిపోవటం చూసి నేరం కూడా నిరూపణ అయ్యింది.
  సాయింత్రానికంతా చుట్టుపట్ల పల్లెలకు కూడ తెలిసి ఆశ్చర్యంతో తలమునకలయ్యారు జనమంతా.
 శత్రువు ఆడమనిషి, అందులోనూ యాభైయేళ్ళు దాటిన విధవ, ఒంటరిస్త్రీ.  ఆమె మీద రెడ్డిగారి కుటుంబం ఎట్లా కసిదీర్చుకుంటందా అని చర్చ మొదలైంది రచ్చబండల వద్ద.
   వాస్తవానికి ఆ సమస్య రెడ్డిగారిని కూడా వేధిస్తోంది.

                                            ********

  అప్పటికి నడిరేయి దాటింది.
రెడ్డిగారి యింట్లో సమావేశం పూర్తిగా ఓ కొలిక్కి రాలేదు.
  ఊర్లోని దాయాదుల్ని, శ్రేయేభిలాషుల్ని పిల్చుకొని మంతనాలు చేస్తున్నాడు పెద్దిరెడ్డి.
  పెద్ద కారణం లేకుండానే గ్రామమంతటికీ ఆలయనగా వున్న మనిషిని చంపించిన  నారమ్మ క్షమార్హురాలు కాదు.
  ఆమెను పట్టుకొనిరావాలి
 దారుణంగా శిక్షించాలి.
  ఆమె దాయాదుల్ని వూరు వెళ్ళగొట్టాలి.
  ఇప్పుడామె దండోరుపల్లె లోని పుట్టింట తలదాచుకుంటోంది,  రంగారెడ్డి వర్గపు అండ దండల్లో క్షేమంగా వుంది.  ఆమెను పట్టుకు రావటమంటే రంగారెడ్డి వర్గాన్నింతటినీ కట్టేసుకు రావటమే.
  అతనో మూర్ఖుడు అతన్ని లొంగదీసేసరికి కొన్ని ప్రాణాలు పోకతప్పదు.  దండోరుపల్లె మీద దాడిజేయటం మాదిగిళ్ళపైకి వెళ్ళినంత సులభం కాదు,  ప్రారంభిస్తే అదో యుద్దమే.
  ఆమెను తీసుకు రావటం సంగతి పక్కనుంచితే - యింకో వారానికో, పదిరోజులకో ఆమె దాయాదులు వూర్లోకి రాక తప్పదు.
  వాళ్ళను వూరు విడిపించాలంటే పెద్ద గొడవలకే దిగాలి.  పోలీసుల కేసులవుతాయి,  కోర్టులవుతాయి, జైళ్ళవుతాయి,  జేబుల్లో డబ్బు చాలదు, బ్యాంకుల్లో తెచ్చుకోవలిసిందే.
  ఇప్పుడు మళ్ళీ ఎదుట ప్రధాన సమస్య డబ్బే అయ్యింది.  మామూలు కేసులయితే రెడ్డిగారి కుటుంబం భరించగలదు.
  ’పార్టీల్ని’ మొయ్యాలంటే సాద్యం కానిపని.
  అట్టాగని వూరుకునే దానికిలేదు.
  " ఇప్పుడుగీన మనం సేతగానోల్ల మాదిరి సేతులు ముడుసుకొని కూకుంటే వాల్లకు పట్టపగ్గాలుండవు. ’రెడ్డిని సంపితేనే దిక్కులేనెప్పుడు వూర్లో ఎంతమందిని నరికితే మాత్రం అడ్డమొచ్చే దెవురు  ? ’ అనే కొవ్వు పేరుకొంటది, ఒంటికాలిమీద మనపైకొస్తారు, పొలాలు దున్నుతారు  ఇండ్లల్లో దూరుతారు. మన పెండ్లాల గుడకా పట్టకపోతారు..."  ఆవేశంగా చెప్పాడు రెడ్డిగారి దాయాది వెంకటరెడ్డి అనే యువకుడు.
  చాలా మందికి అదే భావన వుంది.
  అయితే ఏం చేయాలో తోచకుండా వుంది.
  " ఈరోజు రెడ్డిగారు గావొచ్చు.  రేపు మనంగావొచ్చు,  మనమంతా వొకటిగా వుండకుంటే అందరికీ అదేగతి పడ్తది. "  బలరామిరెడ్డి అనే పెద్దాయన అన్నాడు.
  " అయితే మనమిప్పుడు ఏం జెయ్యాల  ?  "  అడిగాడు ఓ మనిషి.
  " పార్టీలు నడపాలంటే ఒక్కరితో అయ్యేపనిగాదు.  అంతలావు బలిసినోల్లు యీ పల్లెల్లో ఎవురూ లేరు.  ఇది వర్గం సమస్య..అందరం తలదూర్చాల్సిందే. ఎకరానికింత చందా రాసుకుందాం, లెక్కంతా ఒకరికాడ నిలవుంచుదాం. ఎవురికేం జరిగినా ఆ లెక్క ఖర్చుపెట్టుదాం. "  చెప్పాడు బలరామిరెడ్డి.
  ఇదేదో సబబుగా వున్నట్లు తోచింది అందరికీ.
  రెతుల్ని పేరుపేరున పిల్చారు.
  ఎకరాల్ని లెక్క గట్టారు.
  పకడ్బందీగా పట్టీ రాశారు.
  ఉదయానికంతా షుమారుగా డబ్బు సమకూరింది.
  పెద్దరెడ్డికి సంతోషంగా వుంది.  దాయాదుల, బంధువుల అభిమానానికి వొళ్ళంతా పులకరించించి.  చందాలివ్వటమంటే ఇచ్చిన వాళ్ళంతా గొడవల్లో తలదూర్చటమే.  తమ బలం పెరిగిపోయినట్టుగా అన్పించింది.  తమ బాధను అందరూ తలకెత్తుకొన్నారు..  తమకు బరువు లేకుండా చేశారు.
  వెంకటరెడ్డిని దగ్గరకు పిల్చాడు పెద్దిరెడ్డి. " ఒరే  ! నువ్వు లెఖ్క జమా చూస్తావుండు  "  చెప్పాడు.
  " అట్లనే పెద్దయ్యా  ! " సమ్మతించాడు వెంకటరెడ్డి.
  వర్గమంతా గట్టిబడింది.
  అవతలి  వర్గంలో ప్రధానమైన వాళ్ళంతా వూరు వొదిలారు గాబట్టి మిగతా వాళ్ళంతా కుక్కిన పేనుల్లా పడివున్నారు.
  రెడ్డోరి అన్నదమ్ములిద్దరూ పార్టీ గొడవల్లో తలమునకలయ్యారు.
ముగ్గు పిండి గని నిర్వహణ అంతా బాలునిపై పడింది.
  అతని మనస్సంతా గ్రామం పైనే వుంది.  అందరితో కలిసి తనూ గొడవల్లో పాలుపంచుకోలేక పోతున్నందుకు చింతగా వుంది.
  ఊరు వదిలిపోయిన నారమ్మ వర్గీయులు తిరిగి వూర్లోకి వచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నారు రెడ్డి గుంపంతా.
   దండోరిపల్లె వైపునించి ఏటికడ్డంగా మనిషి రావటం కన్పిస్తే చాలు ఇవతలి దరిమీద గుమిగుడుతున్నారు.
  తమ యిళ్ళ కోసం, పొలాలకోసం, పైర్లకోసం ఏదొకరోజు దండోరిపల్లె వదిలిరాక తప్పదు.
  అంతదాక తాము ఎదురు చూడాల్సిందే.
  నారమ్మ చిక్కితే ఏం చేయాలనేది ప్రశ్న.
  ఆడది కాబట్టి చంపకూడదని కొందరి పెద్దల సలహ.
  నడుములు విరగ్గొట్టి మంచంలో పడేయాలని మరికొందరి సూచన.
  యాభై ఏళ్ళ వయస్సులో ఆమెకి పాడుబుద్ది ఎందుకు పుట్టిందో ఎవరికీ అర్థం కాలేదు.  కొడుకులు కూడ లేరు ఉన్న ఒక్క కూతుర్ని దండోరుపల్లెలోని చిన్నతమ్మునికిచ్చి పెళ్ళిజేసింది. అప్పుడప్పుడూ కూతురో, మనవళ్ళొ వస్తే తప్ప ఇళ్ళెప్పుడూ వంటరితనంతో మగ్గుతూ వుంటుంది.
   " ఆముండ మొదట్నించీ అంతే.."  చెప్పాడు అరుగుమీద తీరిగ్గా కూచుని బీడిముక్క పీల్చుతూ రామయ్యతాత.  " పుట్టింటి కాడ రొవ్వొంత గోడవయితే సాలు మొగున్ని ఒక్క సిటికంత సేపుగుడకా యింట్లో వుండనీదు. ఏట్లో అడ్డం యీదుకుంటూ అయినా పోవాల్సిందే !  యీ ముండ పోడుబడలేకనే గాదూ - ఎండాకాలం ఏటికికడ్డంగా వొక్కడే దండోరుపల్లెకు పోతాంటే  అవతలి పక్కోల్లు నరికి ఇసుకలో బూడ్సింది.  ఈ దరిద్రపు ముండ మొగునితో పదేండ్లు గుడకా సంసారం జేసిందిలేదు.. మంచి పాయాన్నే ( మంచి ప్రాయంలో,వయసులో)  పోగొట్టుకొన్నెది వాన్ని..  అప్పట్నుంచే పెద్దిరెడ్డోరి కుటుంబమంటే దీనికి సరిపోదు.  "
   " నడమద్య వాల్లేమన్నెరూ  ?  "
  " కేసుల్లో అవతలోల్లకు  సాయం జేస్చాండరనే... దీనిమొగున్ని సంపినోల్లు పోలీసోల్లకు సిక్కగుండా మనూర్లోనే దాపెట్టుకొన్నెరా ! దీని కండ్ల ముందరే తిరుగుతాన్నెరా  ! వాల్లకా  సోటిచ్చింది  పెద్దిరెడ్డోరేగద !  కోపమెందుకు కాదు  ? అయినా అది యీనాటి మాటా ! ఎప్పుడో పాతికేండ్లనాడు జరిగిపోయిన సంగతి . "
  " ఇప్పుడెందుకు మనసల్ను బెట్టి సంపించినట్టూ..? "
  " దేవునికెరుక...."  పైకి చూపిస్తూ అన్నాడు.
  ఎక్కడ నలుగురు మనుషులు కూచున్నా నారమ్మ గురించే చర్చ జరుగుతోంది. ఆమెమీద రెడ్డోరి గుంపు తీసికొనే చర్యగురించే ఊహలు సాగుతున్నాయి.
  ఉదయం ఎనిమిది గంటలు ప్రాంతంలో గొల్లోల్ల  పాములేటి  గొర్లదొడ్డికేసి పోతూ పెద్దరెడ్డి కన్పించేసరికి " రెడ్డి నాయినా  ! " అంటూ దండం పెట్టాడు.
  నాలుగు మాటలు..మాట్లాడిన తర్వాత  " గోడ తకరారు జరిగిన కాన్నించి నారమ్మ అంటా వున్నెదంటనే నాయనా ! ’ రాంరెడ్డి నెత్తుట్లో తనక లాడ్తాంటే సూడాలని వుందెని...మీదాక రాలేదా ఆ మాట ? "  అడిగాడు.
  నొసలు ముడేశాడు పెద్దిరెడ్డి.
  " సెవుల్దెగిన ముండ ఏందేందో కూస్చాంటదని పట్టించుకొన్నెట్టు లేదుకదూ ! "  తనే వివరణ ఇస్తున్నట్లుగా అడిగాడు పాములేటి.
  " గోడ తకరారుకూ మాకూ ఏం సంబంధం రా ? "  పెద్దిరెడ్డి ప్రశ్నించాడు.
  " ఏమో రెడ్డి నాయనా ! ఏందేందో అంటావుంటది ఆతల్లి.  ఆమె దాయాదికి ఎగదోసింది మీరేననీ, మాలోల్లను పంపిచ్చి గోడకట్టిచ్చింది మీరేననీ, ఆమె గోడతావు ( గోడ ఉన్నస్థలం) అవతలొనికి పొయ్యేందుకు సాయం జేసింది మీరేననీ.... ఆ మాటలకేమిలే నాయనా ! బంగారంటి తండ్రిని ఆ ముండ పొట్టన బెట్టుకొనె...."  బాధతో కూడిన గొంతుకతో మెల్లిగా సాగిపోయాడు.
  పెద్దిరెడ్డి ఆలోచనల్లో పడ్డాడు.
  వాస్తవానికి నారమ్మకు సంబంధించిన గోడతకరారులో అవగింజంతయినా ఆసక్తి కనబరచలేదు తాము.
  నారమ్మ యింటికీ ఆమె దాయాది చెంచన్న యింటికీ మద్య నాలుగు బారల ఉమ్మడి ఖాళీస్థలం వుంది.
  లోగడనుంచి ఆ బిడువులో ఇరు కుటుంబాల వాళ్ళు ఎద్దుల్ని, బర్రెల్ని కట్టేసుకొంటూ వుండేవాళ్ళు, నాది నీది అనుకోకుండా అరమరికల్లేని తనంతో ఆ తావును ( స్థలాన్ని) ఉపయేగించుకొనేవారు.
  మగడు పోయింతర్వాత ఎద్దుల్ని అమ్మేసి, సేద్యం ఎగబెట్టి. పొలాన్ని కోరుకో, గుత్తకో ఇచ్చుకొంటోన్నా బర్రెల్ని మాత్రం వుంచుకొంది నారమ్మ.
  నాలుగేళ్ళ క్రితం బర్రెల్ని కాసేందుకు ఏళ్ళ ఏటి జేడెల్లో జారిపడి సడుగు ( కటి ప్రదేశం = నడుము ) నొప్పిపుట్టి నడవలేని పరిస్థితుల్లో బర్రెలతో సహా కూతురు యింటికి చేరింది.  కాలునొప్పి బాగయింతర్వాత ఒక్కటే ఏటికడ్డంగా నడుచుకొంటూ వచ్చిండేగాని తర్వాతెప్పుడూ బర్రెల్ని తోలుకొచ్చేపని చేయలేదు.
  బర్రెలున్నపుడు వాటి పేడ, రొచ్చు ఆమెకేమి అసహ్యాన్ని కలిగించలేదుగానీ, ఇప్పుడు తన దాయాదులు తన స్థలాన్ని కూడ పూర్తిగా ఆక్రమించి రొచ్చు, పేడమయం చేస్తోంటే సహించలేకపోయింది.
  ఒక ఉదయం పూట  బిడువు స్థలానికి మద్యగా గిరిగీసి, గీతకు అవతల కట్టేసుకొమ్మని హుకుం జారీచేసింది.
  ఆమెతో గొడవ పెట్టుకోవటం కంటే ఆమె హుకుం శిరసావహించటమే ఉత్తమమనుకొన్నాడు చెంచన్న.  తనస్థలంలోనే  గూటాలు పాతి పశువుల్ని కట్టేయటం  అలవాటు చేసుకొన్నాడు.
  తమ స్థలంలోనే కట్టేసినప్పటికీ ఇద్దరి మద్యా గొడ లేకపోవటం వలన తలుగు పొడవునా వెనక్కి సర్దుకొన్నపుడు నారమ్మ స్థలంలో రొచ్చు, పేడ వేస్తుండేవి పశువులు.
  తనకు  పశువుల్లేకున్నా యీ అసహ్యం తప్పనందకు మనస్సు నొప్పెట్టుకొంది ఆమె.  అయినప్పటికి  రైతు దనం తెలిసింది కాబట్టి ఓపికబట్టింది.
  అప్పుడప్పుడూ తన స్థలంలో పెట్టిన పేడను చెంచన్న బాధ్యతగా ఎత్తి బాగుచేయటం, మరిచినప్పుడు సాయింత్రం దాక అవి అక్కడే వుండటం. తను అటు ఇటు నడుస్తున్నప్పుడు పొరబాటున తొక్కటం, అసహ్యంగా తిట్టుకొంటూ పేడను ఎత్తి తన దిబ్బలో ( పేడను ఒక చోట పెద్ద గుట్టుగా పేర్చే స్థలాన్ని దిబ్బ అంటారు దానినే ఎరువుగా వాడతారు పొలాల్లో ) వేసికోవటం....... క్రమక్రమంగా తన స్థలంలో పెట్టిన పేడ తనదిగానే భావించే స్థితికి వచ్చి, దిబ్బపెంచుకోవటం అలవాటయ్యింది ఆమెకు.
    బర్రె తన స్థలంలో పేడేస్తే చాలు టక్కున తీసికెళ్ళి దిబ్బలో వేసుకుంటుంది నారమ్మ.  అంతా గమనిస్తూనే వున్నా కొంతకాలం మౌనంగానే వుండిపోయింది చెంచన్న కుటుంబం.
   ఒకరోజు కళ్ళాపి చల్లకొనేందుక్కూడా పేడ లేకపోవటంతో చెంచన్న పెళ్ళాం తిట్లకు తీసుకొంది.
  నారమ్మ ఎదురు తిరిగింది.
  పేడనించి బిడువు స్థలం దాకా తారాస్థాయిలో తిట్లయుద్దం జరిగింది.  చెంచన్న కూడా నోరు చేసుకొన్నాడు.
   మళ్ళీ రోజు సాయింత్రమే దండోరుపల్లెనించి మనుషులొచ్చారు.  చెంచన్నను బెదిరించారు.
  ఇద్దరి మద్య గోడ పెట్టుకొమ్మన్నారు.
  అదిగో...అప్పుడొచ్చింది గోడ తకరారు.
 మూరెడు స్థలం మీద వివాదం రేగింది.
  తన మగడు పెద్దవాడు కాబట్టి ఉన్న స్థలంలో జ్యేష్ట భాగం కింద మూరెడు తావు ( స్థలం ) తమకు ఎక్కువగా పంచారని నారమ్మ అంటుంది.
   సమానమేనంటాడు చెంచన్న.   ఆ లెఖ్క ప్రకారం విభజించి గోడసాలు కూడ తీశాడు, రాళ్ళు మట్టి తోలొపెట్టుకున్నాడు.
  గోడ కట్టటాన్ని అడ్డుకొంది ఆమె
 ఊర్లో వాళ్ళెవరూ జోక్యం చేసుకోవటం లేదు. అది దాయాదుల సమస్య కాబట్టి.  ఇద్దరూ  దండోరుపల్లె వాళ్ళకు సంబంధించినవాళ్ళు కాబట్టి.  పెద్దిరెడ్డి వాళ్ళు కూడ అందులో వేలు పెట్టటం లేదు..ఇద్దరూ తమకు సరిపోనీవాళ్ళే కాబట్టి.
  ఒకసారి పెద్దిరెడ్డి దాయాది వెంకటరెడ్డి గనివద్దనున్న రామిరెడ్డిదగ్గరకొచ్చాడు  "  అన్నా ! వాల్లకు వాల్లకు గొడవబడింది, ఇన్నిరోజులకు మనసేతికి సిక్కినారు మనమిప్పుడు చెంచయ్య కుటుంబానికి ఎగదోస్తే ఎట్లుంటది..? ఇద్దరు కొట్టుకొని సస్తారు కదా !  "  అన్నాడు.
  తల అడ్డంగా వూపాడు రామిరెడ్డి  "  వాల్ల గొడవలు మకెందుకులేరా  ! వాల్లనే తంటాలు పడనీ ! "  అన్నాడు
  " అట్లాగాదన్నా  ! ఇద్దరూ మనము శత్రువులేగదాని "
  " అయినా నేను వాల్ల పంచాయితీలో వేలుబెట్టనురా ! వాల్ల సంగతులు నాకాడ సెప్పగాకు, నా సలహ తీసుకోవాకు. "
ఒక్క నిమిషంసేపు ఆలోచించాడు వెంకటరెడ్డి.  " సరేనా ! మీకెవురికి యిష్టం లేకున్నా నేను మాత్రం యీ అవకాశాన్ని వొదల్ను. చెంచన్నను ఎగదోస్తా ! మీకు నష్టం లేదుగదా ? " అన్నాడు.
  " నీ ఇష్టం ఇందులో మేం వేలు దూర్చం. మాపేరు ఎక్కడా వాడుకొకు. "  చెప్పాడు
  వెంకటరెడ్డి నేరుగా చెంచన్న వద్దకెళ్ళాడు
  తమ వర్గమంతా అతనికి సపోర్ట్ చేస్తుందనీ, గోడపెట్టిస్తామనీ చెప్పాడు.
 చెంచన్నకు ధైర్యమొచ్చింది.
 గోడ పెట్టెందుకు మనుషుల్ని పిల్చుకొన్నాడు.
 వెంకటరెడ్డి ఆలోచించాడు.
  గ్రామంలోని రెడ్లను సపోర్ట్‌గా  పిల్చుకోవటమంటే - పెద్దిరెడ్డిగారే స్వయంగా యీ పని చేయించినట్టు లెఖ్క.
  నేరుగా మాలిండ్లకు వెళ్ళాడు
 ఓ ఇరువైమంది జనాన్ని రమ్మన్నాడు.
  మాల పెద్ద వొప్పుకోలేదు  " మీరు మీరు రెడ్డిగారు, మద్యన మాకు దొబ్బులెస్తాయిలేబ్బా ! ఎందుకొచ్చిన తంటా ? "  అన్నాడు.
  " అన్నావాల్లుండారు కదబ్బీ  ! ఏం ఇబ్బందులొచ్చినా మేమే సూసుకుంటాం గదా ! "   పెద్దిరెడ్డిగారి పేరు వాడుకున్నాడు.
  మాలలంతా కట్టెల కైపుల్తో వచ్చి చెంచన్న యింటి పక్క నిలబడ్డారు
  గోడ కట్టటం మొదలైంది.
 రెడ్డిగారి దాయాదిని, మాలల్ని చూడగానే నారమ్మకు విషయం అర్థమైంది, వెనక పెద్దరెడ్డిగారి వర్గమంతా వుందని తీర్మానించుకొంది.
  రామిరెడ్డి గుంపును ఎదుర్కోవాలంటే సాధ్యమయ్యేపనిగాదు.
 నేరుగా పోలీస్టేషన్‌కు ..వెళ్ళింది.
  వెనకే వెంకటరెడ్డి కూడ వెళ్ళాడు.  రామిరెడ్డి పేరును వాడుకొని సమితి ప్రెసిడెంటు చెన్నారెడ్డి ద్వారా సి.ఐ కి బలంగా చెప్పించాడు.
 ఏవేవో కుంటిసాకులు చెబుతూ బాగా ఆలస్యం చేశాడు సి.ఐ.
  తీరిగా మద్యాహ్నం  రెండుగంటలకు శివపురి చేరుకున్నాడు.
ఆ లోపలే గోడనిర్మాణం పూర్తయి వేట ( పొట్టేలు ని బలి ఇవ్వడం ) కూడా తెగింది.
  పోలీసులు మాంసభోజనం చేసి వెళ్ళారు.
  నారమ్మ ఆక్రోశంతో ఉడికిపోయింది.
  తమపేరు వాడుకొన్న విషయం తర్వాత రామిరెడ్డికి తెలిసి వెంకటరెడ్డిని బాగా మందలించారు.
 ఆ గొడవ అట్లా ముగిసిపోయిందని భావించారుగాని పాములేటి మాటల్ని బట్టి చూస్తే రామిరెడ్డి చావుకు అదే కారణంలా తోస్తోంది.
  దీర్ఘంగా నిట్టూర్చాడు పెద్దిరెడ్డి.
  పావలా విలువ కూడా చేయని పశువుల పేడకోసం, జానెడు కూడా లేని ఖాళీ జాగాకోసం మనుషుల ప్రాణాలు తీసికొనే పరిస్థితి వచ్చింది.
  తమ దాయాది అత్యుత్సాహం వల్లే యీ అరిష్టం.
  ఈ విషయంలో దండోరుపల్లె వాళ్ళ ప్రోత్సాహం ఎక్కువగానే వుండి వుంటుంది.  బహుశ - ముగ్గుపిండి గని వద్దనున్న నారమ్మ పొలాన్ని తాము బేరమాడటం కూడా ఓ కారణమై ఉండొచ్చు.
  గోడ తకరారు వరకు తాము వాళ్ళతో ప్రత్యక్షపోరాటాలేవీ చేయలేదు.  ఆ గొడవలో తాము చెంచన్నకు సపోర్ట్ చేశామనీ, గంటల మీద గోడ పెట్టించామనీ భావించుకొన్న నారమ్మకు గనులవద్దనున్న పోలానికి సంబంధించిన భవిష్యుత్తు కళ్ళముందు కదలాడి వుంటుంది.  ఆ పొలాన్ని తాము చేజిక్కుంచుకొన్నా అడ్డుకొనే శక్తి ఆమెకు లేకపోవటం స్పష్టమయి వుంటుంది.
  ఆ భావనే ఈ కుట్రకు మూలమయి వుంటుంది..
  ఆలోచిస్తూ  వుండిపోయాడు పెద్దిరెడ్డి.
’ ఈ గొడవ మరెక్కడకు దారి తీస్తుందో ? ’

                                                                                            .........సశేషం

1 comments:

ఈ భాగపు కధనంలో కూడా ఏమాత్రం పట్టు తప్పలేదు. మీ బిజీలో మీరుంటారు కాని, మేంమాత్రం మరొక భాగంకోసం ఎదురు చూస్తున్నాం.

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs