రెండు లక్షల జనాభా గల అదొక చిన్న టౌన్,  సమయం రాత్రి  పది కావస్తున్నది, వీధుల్లో జనాలు పలుచగా ఉన్నారు , సెకెండ్‌షో సినిమాకి ఆలశ్యంగా వెళ్తున్నవారు సినిమా థియేటర్స్ గేట్స్ మూసే సమయం కావడంతో పరుగులు తీస్తున్నారు.  మేయిన్ వీధిలో ఉన్న తన ఇంటిముందు నిల్చొని 23 ఏళ్ళ చైతన్య కాలింగ్ బెల్ నొక్కాడు, రెండు నిమిషాలకు చైతన్య తండ్రి రామకృష్ణ బయటకు వచ్చి కటాంజనం ( ఇంటి వసారాకు ఉన్నఇనప గ్రిల్ ) కు ఉన్న తాళం తీస్తూ " తొందరగా ఇంటికి చేరొచ్చు కదా..! బయట తమరు ఇంతవరకు ఏమి రాచకార్యాలు వెలగబెట్టాలో  " కోపం మేళవించిన స్వరంతో నిరసనగా అన్నాడు. ఆ మాటలకు మౌనమే సమాదానంలా తలుపు తీసుకొని ఇంటిలోకి వెళ్ళాడు చైతన్య.  హాల్‌లోకి అడుగుపెట్టగానే చైతన్య అమ్మమ్మ అన్నపూర్ణమ్మ ఎదురయ్యింది " చైతు బాగున్నావా " కుశల ప్రశ్నలు వేసింది.
" అర్రె.. అవ్వ... [ కడప ప్రాంతంలో అమ్మమ్మను అవ్వ అని, నాన్నమ్మను " జేజి " అని పిలుస్తారు ] ఊరునుంచి ఎప్పుడొచ్చావు..? బాగున్నావా ? " ఆనందంగా అడిగాడు
" సాయింత్రం వచ్చాలే "
  వీళ్ళిలా మాట్లాడుకుంటున్న తరుణంలో వంటింటిలో నుండి చైతన్య తల్లి సరస్వతి గొణుగుడులా మాట్లాడుతున్న మాటలు కాస్త పెద్దగానే హాలు దాక వినపడుతున్నాయి. అవి విన్న చైతన్యకి అర్థంకాక ’ ఏంటి సంగతి ’ అన్నట్లు అమ్మమ్మ మొహంలోకి చూసాడు.  ’ ఏమి చెప్తాంలే ’ అన్నభావనతో నుదిటిమీద చేత్తో కొట్టుకొంటూ. " అదేదో మనింట్లోనే కొత్తగా జరుగుతున్నట్లు..లోకంలో ఎక్కడా లేనట్లు బాదపడ్తాందిరా మీ అమ్మ " అన్నది
 " ఏమయ్యింది అవ్వా " విషయం అర్థం కాక అడిగాడు చైతన్య
ఇంతలో వంటింట్లో పనులు అవడంతో తనలో తను మాట్లాడుకుంటున్న మాటలను పెద్దగా బయటకు అనేస్తూ హాలులోకి వచ్చింది. " అదొక్కటే ఆడపిల్లగా పుట్టింది... ఆ పుట్టేదేదో  మగపిల్లాడుగా పుట్టచ్చుగా..? " అంటూ వసారాలో కూర్చుని ఉన్న రామకృష్ణ వద్దకు వెల్లింది సరస్వతి.
" రేపు ఎవరెవరిని పిలవాలో నీవు నిర్ణయించుకో, నన్నేమి అడగొద్దు అట్లాగే రేపు పొద్దున్నే మార్కెట్‌‍కి వెళ్ళి ఫంక్షన్‌కి కావలసిన ఈ సామానులన్నితీసుకురా " అంటూ ఒక పెద్ద కాగితం రామకృష్ణ చేతిలో పెట్టింది. అలాగే అని తలఊపి పేపర్లో ఉన్న సరుకలు చదువుతూ కూర్చున్నాడు. తిరిగి ఇంట్లోకి వెళ్తూ.." చీ చీ రేపందరికీ ఈ విషయం చెప్పాలంటే ఎలాగో ఉంది " పెద్దగానే మాట్లాడుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది సరస్వతి.
 ఇదంతా చూస్తున్న చైతన్యకి ’సునిత గురించేనా అమ్మ మాట్లాడుతున్నది..? ’ అని మనసులో అనుకొన్నాడు. విషయం ఏమిటొ తెలుసుకుందామని వంటింట్లో సరస్వతి దగ్గరకు వెళ్ళాడు.  తనకు భోజనం రెడి చేస్తున్న తల్లిని " విషయం ఏంటి..? ఏమయ్యింది అమ్మా " అడిగాడు.
" ఏమి లేదులే..ముందు నీవు భోజనం చేయి "  అన్నం పెట్టిన ప్లేట్‌ని చైతన్యకి అందించింది.
సరస్వతి అక్కడి నుండి హాలులోకి వస్తూ.." వీధిలో అందరికి ఈ విషయం చెప్పి ఫంక్షన్ పెట్టాలంటేనే నామోషిగా ఉందే అమ్మా " అంటూ అన్నపూర్ణమ్మ పక్కన సోఫాలో కూర్చుంది.
" ఇందులో నామోషి ఏముందే...?  లోకంలో జరిగేదే..నీవు..నేను..అందరం కూడా...! నీవేమికొత్తగా చేయట్లేదు మనింట్లో కొత్తగా జరగట్లేదు " అన్నది అన్నపూర్ణమ్మ.
" లోకంలో జరిగేదే అయినా నా ఇంట్లో ఇలాంటివి ఉండకూడదనుకున్నా, సునిత కూడ చైతన్యలా మగపిల్లాడిగా పుట్టుంటే నాకీ బాదలు ఉండేవి కాదు కదా..? ఏంటొ..ఇలా.."    చేతులు తిప్పుతూ పక్కన అన్నపూర్ణమ్మకు చెబుతున్నట్లు కాక పైకి చూస్తూ అన్నది.
" ఏమిటే నీవు..? లోకంలో ఎవరైనా సరే ఈ విషయం విని అందరు సంతోషపడతారు " అంది అన్నపూర్ణమ్మ.
వీల్లమాటలు వింటూ భోజనం చేస్తున్న చైతన్య.." సునిత పుట్టి 12  ఏళ్ళు అవుతున్నది, ఇప్పుడూ కొత్తగా ఆడపిల్ల మగపిల్లాడు అని అనుకోవడం ఏంటి..? " అని మనసులో అనుకుంటూ..భోజనం ముగించి చేతులు తుడుచుకుంటూ హాలులోకి వచ్చాడు.  అమ్మ పక్కన కూర్చొని " నాకర్థం కావట్లేదు ఏవిషయం మాట్లాడుతున్నారు " అని అడిగాడు.
" మగాళ్ళకు చెప్పే విషయం కాదులే " అంటూ అక్కడ నుండి వంటిట్లోకి వెల్లిపోయింది.
అన్నపూర్ణమ్మ వైపు తిరిగి " ఏమిటన్నట్లు " నొసలు ముడిచాడు చైతన్య.
 రహస్యం చెబుతున్నట్లు చైతన్య దగ్గరగా వచ్చి మెల్లిగా " మన సునీత పెద్ద మనిషి అయ్యిందిరా " గుస గుసలాడింది.
" ఓహో.. అదా సంగతి..! అది ప్రకృతిపరమైనది.. ఎప్పుడైనా జరిగే విషయమే కదా ? అయినా సునీత పుట్టి 12 ఏళ్ళు అయ్యింది ఇప్పుడు ఆడపిల్ల, మగపిల్లాడు అని గుర్తు చేసుకుంటూ బాదపడుతున్నదేంటి అమ్మ..? " అడిగాడు
" అదేరా నాకు అర్థం కావట్లా..? లోకంలో ఏ కుటుంబంలో అయినా ఆడపిల్ల పుష్పవతి అయ్యిందని తెలియగానే సంతోషపడతారు..ఘనంగా వేడుకలు చేస్తారు, దీనికి వ్యతిరేకంగా మీ అమ్మ నామోషి అనుకుంటాంది ఏంటో " అంది అన్నపూర్ణమ్మ.
తలవంచుకుని కాసేపు సుదీర్ఘంగా ఆలోచించి అన్నపూర్ణవైపు తిరిగి " అవునూ సునిత ఎక్కడ...!! కనపడట్లేదు " అడిగాడు
" దాని స్టడీ రూమ్‌లో చాప మీద కూర్చోబెట్టారులే "
" అవునా నేనెల్లి మాట్లాడి వస్తాను  " అంటూ అక్కడ నుంచి లేచి సునిత ఉన్న గదివైపు దారితీసాడు. ఇది గమనించిన సరస్వతి వెళ్తున్న చైతన్య వైపు చూస్తూ " ఒరేయ్ దానిని తాకకూడదు, దూరంగా ఉండాలి. నీ పుస్తకాల పైత్యమంతా దాని తలకు ఎక్కించకు, ఇప్పటికే నీతో వేగలేక చస్తున్నాము, అది కూడ నీలా అవుతే మేము చావాలిక. దాన్ని నీలా తయారు చేయకు " అంటూ గట్టిగా కేకలు వేసింది.  
  తల్లితండ్రులతో  ఏవిషయంలోనైనా వాదనలు చేసే సమయాలలో చాలా బలంగా వాదించేవాడు చైతన్య, అతని వాదనతో తలపడలేక చాలా సార్లు తలపట్టుకునేవారు సరస్వతి, రామకృష్ణలు. అందుకు కారణం రామకృష్ణ సరస్వతిలు అతి సామాన్య మద్యతరగతి మనుషులు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. వారి ఆలోచనా విదానం మద్యతరగతి మనస్తత్వంలానే జీవితం సాఫీగా, బయట సమాజంలో ఒకరి గొడవల్లో తలదూర్చకుండా జీవితం అంటే పిల్లల్ని కనడం, వారికి ఏలోటు రాకుండా పెంచి, విధ్యాబుద్దులు నేర్పించి వారికో ఘనమైన హోదా, పరపతి గల జీవితం ఏర్పాటు చేయడం. అవి చూసి సంఘంలో గర్వంగా తల ఎత్తుకొని జీవించడం. అక్కడివరకే వారి ఆలోచనలు ఉండేవి. వీటికి భిన్నంగా చైతన్య ఆలోచనలు అతని మాటలు సాగేవి. చిన్నప్పటి నుండి పుస్తకాల పురుగు. పుస్తకాలు బాగా చదవడం వలన ఙ్ఞానంలో తల్లితండ్రుల కంటే తాను ఎన్నో మెట్లు ఎత్తులో ఉన్నానని వారికంటే ఆలోచనలలో అధికుడుననే భావన చైతన్య మాట్లాడే మాటల్లో చాలా ప్రస్పటంగా కనపడేది, అతని వాదనలు కూడ అలాగే చాలా బలంగా ఉండేవి. వాదనలలో చైతన్యతో వాదించలేక చాలా సమయాల్లో " నీతో మాట్లాడడం మావల్ల కాదురా..నీవొక వితండవాదివి " అంటూ కొట్టిపడేసి పలాయనవాదం పాటించేవారు  రామకృష్ణ సరస్వతీలు.. ప్రతి తరంలోనూ పెద్దలకు పిల్లలకు మద్యన ఈ మానసిక అగాధం ఉంటుంది, దానికో జనరేషన్ గ్యాప్ అన్న ఒక పేరు పెట్టుకున్నాము. అందులోను చైతన్య వయసు 23 ఏళ్ళే, అ వయసులోనే చాలా పుస్తకాలు చదివి ఉన్నాడు అవే అతన్ని తనో మహామేధావినన్న అభిప్రాయాన్ని కలగజేసాయి. సహజంగా ఆ వయసులో ఉండే ఆవేశం, బయటప్రపంచం మీద అవగాహన రాహిత్యం, కేవలం పుస్తకాలు చదివిన ఙ్ఞాన సంపద అతనిలో అధికుడు అనే భావన బలంగా ముద్రించుకొనేలా చేసింది, అతనింకా తల్లితంద్రుల చాటు కుర్రాడే. మానసికంగా, భౌతికంగా తనకంటూ సొంత జీవితంలోకి అడుపెట్టాక కాని ఆలోచనలకు..ఆచరణకు మద్యన ఎంత వ్యత్యాసం ఉన్నదో అన్నది స్పష్టం అవుతుంది
  గదిలోకి అడుగుపెట్టిన చైతన్యకి ఒక మూలన చాప మీద ఏడ్చి అలసిపోయి కూర్చొని ఉన్న సునీత కనపడంది. తల్లి మాటలతొ తల్లడిల్లిన ఆ చిన్నారి మనసును ఒక గంట క్రితమే అన్నపూర్ణమ్మ తన మాటల్తో ఎంత ఊరడించినా లోపలి గాయం మానలేదు. అసలు తాను చేసిన తప్పేంటి....? అని తనను తాను ప్రశ్నించుకుంటున్నది.   చైతన్య అడుగుల శబ్దానికి తల ఎత్తి చూసిన సునిత " నేను ఆడపిల్లగా పుట్టడం తప్పా..? " ఏడుపుగొంతుతో బేలగా ప్రశ్నించింది. ఆప్రశ్నకు ఏమి సమాదానం చెప్పాలో తెలీక చెల్లెలి బుగ్గలమీద కన్నీళ్ళ మరకలను చూస్తూ నిదానంగా నోరువిప్పాడు  " అయ్యో  నీ తప్పేమిలేదురా , అమ్మ ఊరికే భయపడుతూ అలా మాట్లాడింది అంతే కాని...అమ్మకు నీపైన  కోపమేమిలేదు " తలమీద చేయి వెసి సముదాయించడానికి ప్రయత్నించాడు.
" భయమా.. ఎందుకు ? " అడిగింది
   అలా అమాయకంగా అడుగుతున్న చెల్లెలి మొహంలోకి చూసాడు..  పెద్దమనిషయ్యే వయసొచ్చినా చిన్న పిల్లల పసితనం చెల్లెలి మొహంలో కదలాడుతూ ఉన్నది, ఏమి చెప్పాలో అర్థం కావట్లేదు, తల్లి మనసులో ఉన్న తత్వాన్ని చెప్పి చెల్లెలి పాలమనసు విరగొట్టడం ఇష్టంలేదు, అలా అని ఏ అబద్దం చెబుదామన్నా.. అది చిన్నపిల్ల మనసులో బలంగా ముద్రించుకునిపోతే..? దాని వలన భవిష్యత్తులో మరో తప్పుడు బావానికి దారితీస్తుంది,  సరే ఏదో ఒకవిదంగా  మాటలు చెప్పి సర్దిపుచ్చాలని " అది కాదురా..!! ఇప్పుడు కాదుగాని కొన్నేళ్ళకు నీకు పెళ్ళి చేయాలి కదా  అందుకు ఇప్పటినుండే డబ్బు, బంగారం కూడబెట్టాలి కదా..అవన్ని తలుచుకొని అమ్మ భయపడుతూ అలా మాట్లాడింది " అన్నాడు.
" ఆడపిల్లగా పుట్టడం అంటే డబ్బు, బంగారం ఉండాలా..? అవన్ని నాన్న చూసుకుంటాడు కదా.!! అమ్మకెందుకు బెంగ ? " అడిగింది సునీత .
ఏదో ఒక మాట చెప్పి తనలోపలి బాదను పోగట్టాలని చూసిన చైతన్యకి  అలా సునీత అడిగిన ప్రశ్నకు ఏమి సమాదానం ఇవ్వాలో తెలియట్లేదు " అవునురా నిజమే నాన్నే అన్ని చూసుకుంటాడు కాని అమ్మ సంగతి నీకు తెలుసుగా  అయినదానికి కానదానికి ఊరికే భయపడుతూ ఉంటుంది, అయినా అమ్మకు ఈ విషయం రెపొద్దటికల్లా ఏవి గుర్తు ఉంటాయి చెప్పు...? " అన్నాడు
ఇంతలో  " చాల్లేరా మాట్లాడింది బయటకు రా, సునితను తాకావా..? " గుమ్మం ముందు నించుని అడుగుతున్న సరస్వతి కనపడింది. ఆ మాటతో " వస్తున్నా " అంటూ చెల్లెలి వైపు తిరిగి " బాదపడకురా అమ్మకి నీమీద ఎటువంటి కోపం లేదు, రేపటికల్లా అంత అమ్మే మరిచిపోతుంది. ఏడవకు హాయిగా నిద్రపో " చెప్పి బయటకు నడుస్తూ తన తల్లి మాటలవెనుక భావమేమిటొ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు చైతన్య.
  హాలులోకి వస్తూ " అయినా మనం పెద్దమనిషి అయ్యిందన్న విషయం వీధంతా ఢంకామోగించేలా ఫంక్షన్ చేయాలా..? ఇప్పుడు ఇవన్ని అవసరమా ?  " అడిగాడు సరస్వతిని.
దానికి అన్నపూర్ణమ్మ " వోరి భడవా మీ అమ్మకు నీవు తోడయ్యావా..? అవన్ని మన ఆచారాలు , వీధిలో అందరిని పిలిచి ఘనంగా ఫంక్షన్ చేయాలి, అలా చేయకపోతే వీధిలో అందరు గుసగుసలాడరూ....? ఒక మంచి మర్యాద  లేకుండా పోతుంది. " అంది.
" అదే నా బాధ కూడ..నా కూతురు పెద్దమనిషి అయ్యందని ఊరంతా దండోరా వేయాలా..?  అసలు ఆ ఆలోచనే భరించలేకపోతున్నా " అంది సాలోచనగా.
" ఇంకా అయిపోలేదా మీ చర్చలు..? మాట్లాడింది చాల్లే వెళ్ళి పడుకోండి. పొద్దున్నే లేవాలి " అంటూ వచ్చాడు రామకృష్ణ. ఆ మాటతో పద పదమంటూ అందరూ ఎవరి వారి గదుల్లోకి వెళ్ళిపోయారు.

                                        ********************************

     మంచం మీద పడుకుందేగాని నిద్ర రావాట్లేదు సరస్వతికి.  ’రేపొదయమే ఈ విషయం వీధంతా చెప్పాలా...?  పెద్దమనిషి అయ్యిందన్న విషయం మగపిల్లలకి సైట్ కొట్టడానికి ఒక లైసెన్స్ లాంటిది అని అనుకుంటారు, అయ్యో ఏంటి ఈ తలరాత..? ఇద్దరూ మగపిల్లలే అయుంటే బాగుండేది అప్పుడు నాకీ ఈ అగచాట్లు ఉండేవి కావు.  రెండుమూడేళ్ళలోపల కూతురు ఎదిగిపోతుంది  అప్పుడు బజారులోని మగపిల్లలు కూతురుని చూసి కామెంట్స్ చేయడం, వెకిలి చేష్టలు, ఈవ్ టీజింగ్, ప్రేమంటూ వెంటపడడాలు.. అమ్మో అవన్ని తలుచుకుంటూనే భయంగా ఉంది ’ అలా పరివిదాలుగా సాగుతున్నాయి సరస్వతి ఆలోచనలు.    తాము ఎంత నిష్టగా పెంచినా..! క్రమశిక్షణ నేర్పించినా రేపు భవిష్యుత్తులో కూతురు ఏ మగపిల్లాడి మాయమాటలకు లొంగిపోతుందో..? ఇక్కడ తన కూతురు మీద ఉన్న " నమ్మకం " కన్నా టీనేజ్ వయసు పిల్లల మనస్తత్వం మీదున్న ఒక అవగాహన ఎక్కువగా భయపెడుతున్నది సరస్వతిని. కౌమారదశలో ఉండే ఆకర్షణలు, తల్లితండ్రుల కంటే మిన్నగా తాము ఇష్టపడే మనిషిమీద విపరీతమైన అభిమానం పెంచుకోవడం, అలాంటి సమయాలలోనే పెద్దలంటే లెక్కచేయకపోయే ధోరణలు వస్తాయి. ఎలా వీటి నుండి బయటపడడం...? " అలా ఆలోచనలతో సతమతమవుతూ నిద్రలోకి వొరిగింది సరస్వతి.

           తను స్త్రీ అయుండి కూడ తన ఆలోచనలో తన కూతురు పట్ల అలా ప్రవర్తించడానికి గల కారణం...! అంతర్లీనంగా మదిలో ఎక్కడొ దాగి ఉన్న " భయం ". అసలు సునీత పుట్టినప్పుడు ఆడనా మగనా..! అన్న తారతమ్యం లేనేలేదు, పాప బోసి నవ్వులు, కేరింతలు, బుడిబుడి నడకలు తల్లి మనసును మురిపించేవి. అలానే జీవితం కొనసాగింది కాని ఈ పన్నేండేళ్ళ జీవితానుభవంలో బయట ప్రపంచంలోని స్త్రీపురుషుల మద్యన ఉన్న తేడాలను, సమాజం తయారు చేసిన తారతమ్యాలను  గమనించింది,  ఇప్పుడు సునీత పెద్దమనిషి అయిన సందర్భం వచ్చాక ఆ భేదాలే సరస్వతిని భయపెడుతున్నవి, అవే ఇప్పుడు ఆడ మగ అన్న భావనని కలగజేస్తున్నవి. తను  ఆడదిగా కౌమార దశ, యవ్వన దశలు తర్వాత పెళ్ళి..ఇవన్ని చవిచూసి వచ్చిన మనిషే,  తను కూడ అందరిలాగే అన్ని దశల్లో ఆ కాలాలకు తగ్గట్లు మసలిన మనిషి, కౌమారదశలో టీనేజ్ లవ్ స్టోరీస్ సినిమాల ప్రబావం, వాటిపైన ఎక్కువ మక్కువ ప్రదర్శించడం,  అప్పుడె పైట వేసిన కాలంలో కుర్రాళ్ళు తమ వైపు వేసే కొంటే చూపుల భాణాలు తగులుతుంటే వాటికి పులకించిపోవడం, తర్వాత పెళ్ళి. పిల్లలు. అలా మారే కాలంతో పాటు తాము పోషించే పాత్రలు కూడ మారుతూ వచ్చాయి, ఇప్పుడూ తల్లి పాత్రలోకి వచ్చేసరికి అవన్ని గుర్తుకొస్తున్నాయి, ఇప్పుడున్న కూతురు దశలోఒకప్పుడు తాము ఉన్నప్పుడు  ప్రవర్తించిన దృశ్యాలు గుర్తొచ్చి ఆలోచనలో పడేస్తున్నాయి, తామేమో అవన్ని హాయిగా అనుభవించాము అదే ఇప్పుడు తన కూతురు విషయం వచ్చేసరికి ఆమెలోని " తల్లి " పాత్ర  ఒప్పుకోవట్లేదు, అప్పటి తన కాలంలో వచ్చిన లవ్‌స్టోరీస్ సినిమాలకే ఎక్కువ ఓటేసిన అదే మనిషి ఇప్పుడొస్తున్న లవ్‌స్టోరీస్ సినిమాలను సరస్వతిలోని  " తల్లి " తనం అంగీకరించట్లేదు. అదంతా కాలంతో పాటు మారిన తమ పాత్రల ప్రబావం. అలాగే కాలంతోపాటే  మారిన సినిమా విలువలు.  మార్పులు నిరంతరం జరిగే ఒక ప్రక్రియ అయినా వాటిని అంగీకరించే స్థితిలో లెరు.

                                                        *************

   కొన్ని సంవత్సరాల తర్వాత ఎమ్ సెట్‌లో సునీత మంచి ర్యాంక్ తెచ్చుకుంది,  కేరళలో ఉన్న కాలికట్ రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవాలని సునీత ఆలోచన, అందుకు తగ్గట్లే అక్కడ సీట్ వచ్చింది, కాని సరస్వతి ససేమిరా అంటూ ఒప్పుకోలేదు. ’అక్కడెక్కడో మాకు దూరంగా బాష తెలియని రాష్ట్రంలో ఏమి జరిగినా సమాచారం తెలియని ఊళ్ళొ వద్దనే వద్దు, అసలు కాలికట్ కాదు కదా మాకు దూరంగా ఏ కాలేజీ నేనొప్పుకోను మన ఊరికి దగ్గరలో ఉన్న కాలేజి చాలు ’ అంటూ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడపలోని ఒక ప్రవేట్ ఇంజనీరింగ కాలేజిలో చేర్పించారు. చైతన్య ఎంత నచ్చచెప్పినా వినలేదు సరస్వతి,
" నన్ను ఆ కాలికట్‍లోనే చదివించారు కదా ..! ఇప్పుడూ సునీత విషయంలో ఎందుకు అభ్యంతరం మీకు " అడిగాడు చైతన్య
"నీకు తెలియదులే ఆడవారి కష్టాలు. నీవు నోరుమూసుకో మాకు తెలుసు ఎవరిని ఎట్లా చదివించాలో. నీవంటే మగాడివి ఎట్లా ఉన్నా ఏమికాదు. నీలాగే ఆడపిల్లని అంత దూరంలో ఉంచి చదివిస్తే రేపు జరగరానిది ఏదన్న జరిగితే బయట సమాజంలో మేము తలెత్తుకొని తిరగలేమి, ముందే మీ నాన్న నోట్లో నాలుక లేని మనిషి. " అంటు దులిపేసింది చైతన్యని.
  మద్యతరగతి జీవులకు చాలా సులభంగాను వద్దన్నా వచ్చి చేరే ఆస్థి " పరవు ప్రతిష్టలు ". వాటికోసం పాణాలు వొడ్డి అయినా ప్రాకులాడుతారు, ఆ పరువు ప్రతిష్టలనబడే  " అద్దాల లాంటి మేడలు " నిర్మించుకుంటారు, వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి,  ఏ మూలననుండి ఏ రాయి వచ్చి పడుతుందో...? రేపు జరగరానిది ఏదన్న ప్రేమ వ్యవహారమో లేక అకతాయిల అల్లర్లో జరిగితే..?  అంతే  ఎవరో ఒకరు ఎక్కడ నుంచో ఏ చిన్న రాయి విసిరినా అంతవరకు తాము ఎంతో కష్టపడి నిర్మించుకున్న పరువు ప్రతిష్టలనబడే ఆ " అద్దాల మేడలు " భళ్ళున పగిలి బద్దలయి నేల కూలతాయి, అంతే అప్పటివరకు గుట్టుగా సాగిస్తున్న జీవితం డొల్ల అవుతుంది మొత్తం బట్టపయలు అవుతుంది,  సమాజంలో అందరు తమవైపు వేలెత్తి చూపుతారు. వాటిని భరించగలగే మానసిక స్థైర్యం చాలా కొద్దిమందికే అలవడుతుంది. ఇలాంటి భయాలన్ని అంతర్లీనంగా  సరస్వతి, రామకృష్ణ లాంటి మద్యతరగతి ప్రజల్లో గూడు కట్టుకని ఉన్నాయి.
       రామకృష్ణ కూడ సరస్వతి మాటలకే ఓటు వేయకతప్పలేదు, కూతరంటే ఎంతో గారాభం ఉన్నా భార్యా విదేయుడు కావడం మూలాన గంగిరెద్దులా తలఊపడం తప్ప అతనికి మరే మార్గం లేదు. తల్లి నిర్ణయాన్ని భరించలేకపోతున్నది సునీత, తన చదువు గురించి ఎంతో ఊహించుకుంది, ఎన్నో కలలు కన్నది. చివరకు తల్లి నిర్ణయానికే తలవొగ్గక తప్పలేదు సునీతకు.
   

2 comments:

KAMALANNA MARI INTA PEDDA POSTS EDITE ETTAA OKESARI CHADAVADANIKI KUDARALI KADA. BTW..IPUDE CHUSA..KUSINTA CHADIVA..INTERESTING.. WILL FIND TIME TO READ ON MORE.. :-)

Budugu

హలో కిస్న ఉరుఫ్ బుడుగు.. నానేటి సేసేది సెప్పు, షార్ట్ స్టోరీస్ అవి అలానె పెద్దగా ఉన్నాయి సా.....గుతున్నాయి, కుదించాలనే సూస్తున్నాకాని నేను చేయి మెలికలు తిరిగిన రచయతను కాను కదా..? కుదరట్లేదు అద్గది సంగతి మరి..మీరే కూసింత అడ్జెస్ట్ అయిపోనా బాబు

About this blog

నాకే ఏమి తెలీయదు.

Followers



మాలిక: Telugu Blogs